మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఆత్మ త్యాగం

వికీసోర్స్ నుండి

63. ఆత్మ త్యాగం

ఆయన బాగా లావుగా ఉన్నాడు, తన్ను చూసుకుని మురిసి పోతున్నాడు. ఆయన జైలుకి చాలాసార్లు వెళ్లాడుట. పోలీసులచేత దెబ్బలు తిన్నాడుట. ఇప్పుడు బాగా పేరు పొందిన రాజకీయవేత్త; మంత్రి కాబోయే స్థితిలో ఉన్నాడు. ఆయన ఎన్నో సమావేశాలకు వచ్చాడు. ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా అందరితో బాటు కూర్చున్నాడు. కాని, అందరికీ ఆయనెవరో తెలుసును. ఆయన మాట్లాడినప్పుడు వేదిక మీద ఉన్నట్లు అధికారయుతమైన కంఠంతో మాట్లాడాడు. చాలామంది ఆయన వైపు చూశారు. ఆయన గొంతు వాళ్లస్థాయికి దిగిపోయింది. ఆయన వాళ్లతో బాటు కూర్చున్నా, తన్నుతాను ప్రత్యేకించుకున్నాడు. తనుపెద్ద రాజకీయవేత్త. తనగురించి అందరికీ తెలుసును. అంతా గౌరవిస్తారు. కాని, ఆ గౌరవం కొంతవరకే వెళ్లింది. ఆ పైన ఇకలేదు. చర్చ మొదలైన తరవాత ఇదంతా తెలిసింది. శ్రోతల మధ్య బాగా పేరుమోసిన ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఉండే ఒక విచిత్ర వాతావరణం ఉంది. ఆశ్చర్యం, నిరీక్షణ, సాహచర్యం, అనుమానం, ప్రసన్నతతో వేరుగా ఉండటం, సంతోషం - ఇవన్నీ కూడిన వాతావరణం అది.

ఆయన ఒక స్నేహితుడితో కలిసి వచ్చాడు. ఆ స్నేహితుడు వివరించటం మొదలుపెట్టాడు - ఆయనెవరో, ఆయన ఎన్నిసార్లు జైలుకి వెళ్లాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో, దేశస్వాతంత్ర్యం కోసం ఎన్ని అపారమైన త్యాగాలు చేశాడో. ఆయనకి బాగా డబ్బుండేది. పాశ్చాత్య పద్ధతిలో పెరిగాడు - పెద్ద ఇల్లు, తోటలు, బోలెడు కార్లు మొదలైన వాటితో. ఆ స్నేహితుడు ఆ గొప్ప మనిషి ఘనకార్యాల గురించి చెబుతూంటే అతడి గొంతు అంతకంతకు మరింత ప్రశంసాపూర్వకంగా, గౌరవపూర్వకంగా అయింది. కాని, దాని అడుగున మరో భావం కూడా ఉన్నట్లు - "ఆయన ఉండవలసినంత గొప్పవాడుగా ఉండకపోవచ్చు, అయినా ఆయన చేసిన త్యాగాలు చూడండి, అవి మాత్రం తక్కువా" అంటున్నట్లుగా తోచింది. ఆ గొప్పమనిషి కూడా దేశాభివృద్ధి గురించీ, నీటి పారుదల అభివృద్ధి గురించీ, ప్రజలకు భోగభాగ్యాలు కలుగజేయటం గురించీ, కమ్యూనిజం వల్ల రాబోయే ప్రమాదం గురించీ, బృహత్ప్రణాళికల గురించీ మాట్లాడాడు. మనిషిని మరిచిపోవటం అయింది. ప్రణాళికలూ, సిద్ధాంతాలు మిగిలాయి.

ఒక లక్ష్యాన్ని, సాధించటం కోసం పరిత్యాగం చేస్తే అది వస్తువుల మార్పిడి వ్యాపారమే. అందులో త్యాగం చేసేదేమీ ఉండదు. ఒకదానికొకటి మార్చితీసుకోవటమే. ఆత్మత్యాగం ఆత్మని విస్తృతం చేసుకోవటమే. ఆత్మని త్యాగం చేసుకోవటం అంటే ఆత్మకి మెరుగు పెట్టటమే. ఆత్మ తన్నుతాను ఎంత సూక్ష్మంగా చేసుకున్నప్పటికీ, అది ఇంకా మూసుకుపోయి, అల్పంగా పరిమితంగా ఉంటుంది. ఒక ప్రయోజనం కోసం త్యాగం చేస్తే, అది ఎంత గొప్పదైనా, ఎంత అపారమైనదనా, ప్రధానమైనదైనా అ ప్రయోజనాన్ని ఆత్మకి ప్రత్యామ్నాయంగా చేయటమే అవుతుంది. ఆ ప్రయోజనమో, ఊహో "ఆత్మ", "నేను", "నా" అనేది అవుతుంది. తెలిసి త్యాగం చేయటం ఆత్మవిస్తరణమే. మళ్లీ సంపాదించుకోవటం కోసం వదిలివేయటమే. తెలిసి త్యాగం చేయటం ఆత్మని అవ్యక్తంగా బలపరచటమే. వదిలివేయటం మరోరకమైన సంపాదన. దాన్ని పొందటం కోసం దీన్ని వదులుకుంటారు. దీన్ని నీచస్థాయిలో ఉంచి, దాన్ని ఉన్నంత స్థాయిలో ఉంచుతారు. ఉన్నత స్థాయిని పొందటానికి నీచస్థాయిని "వదులుకుంటారు". ఈ ప్రక్రియలో వదులుకోవటం అనేది ఉండదు. మరింత ఎక్కువ సంతృప్తిని పొందటానికి ప్రయత్నించటంలో త్యాగం అనేది ఉండదు. అందరూ మనసుపడి చేసే సంతృప్తికరమైన కార్యకలాపానికి అంత ధర్మప్రవర్తన ధ్వనించే పదాన్ని వాడటం ఎందుకు? మీ సాంఘిక పదవిని మీరు "వదులుకోవటం" మరోరకమైన పదవిని పొందటానికే. బహుశా, మీకది ఇప్పుడు ఉండే ఉండవచ్చు. అందుచేత మీ త్యాగం మీరు కోరిన ప్రతిఫలాన్నే ఇచ్చింది. కొంతమంది తమ ప్రతిఫలాన్ని స్వర్గంలో కోరుకుంటారు. తక్కినవాళ్లు ఇక్కడే ఇప్పుడే కావాలనుకుంటారు. "ఈ ప్రతిఫలం పరిస్థితులతో బాటు వచ్చింది. అంతేకాని, నేను కావాలని తెలిసి ప్రతిఫలాన్ని కోరలేదు, నేను మొదట ఉద్యమంలో చేరినప్పుడు."

ప్రజాప్రియమైనది గాని, అప్రియమైనది గాని, ఒక ఉద్యమంలో చేరటం వల్లనే దాని ప్రతిఫలం దానికుంటుంది, కాదా? తెలిసి చేరకపోవచ్చు. కాని చేరమని బలవంతం చేయించే అంతరంగిక ప్రేరేపణలు కలగా పులగంగా ఉంటాయి. వాటిని అర్ధం చేసుకోకుండా ప్రతిఫలాన్ని కోరలేదని చెప్పటానికి వీల్లేదు. అసలు పరిత్యజించాలనీ, త్యాగం చెయ్యాలనీ పడే ఈ తపనని అర్థం చేసుకోవటం ముఖ్యమనేది నిస్సంశయం, కాదా? మనం ఎందుకు వదులుకోవాలనుకుంటాం? దానికి సమాధానం ఇవ్వటానికి ముందు, మనం ఎందుకు బంధనాలను పెంచుకుంటాం? మనకు మమకార బంధనాలు ఉన్నప్పుడే బంధనాలను వదిలించుకోవాలని అంటాం. అసలు బంధమే లేకపోతే వదిలించుకోవటానికి పోరాటమే ఉండదు. సొంతం చేసుకుని ఉండనట్లయితే, పరిత్యాగమే ఉండదు. ముందు సొంతం చేసుకుంటాం, తరవాత పరిత్యజిస్తాం - ఇంకేదో సొంతం చేసుకోవటానికి. ఈవిధంగా క్రమక్రమంగా అధికంగా పరిత్యజించటం మహనీయంగా, ఆధ్యాత్మిక ఔన్నత్యంగా పరిగణింప బడుతుంది.

"అవును, అది నిజమే. సొంతమనుకున్నదే లేకపోతే, పరిత్యజించ వలసిన అగత్యమే ఉండదు."

అందువల్ల పరిత్యజించటం, ఆత్మత్యాగం గొప్పతనానికి లక్షణం కాదు - దాన్ని కీర్తించటానికి గాని, అనుకరించటానికి గాని, మనం ఎందుకు సొంతం చేసుకుంటామంటే సొంతమనేది లేకపోతే మనం ఉండం. సొంతం చేసుకునేవి అనేకం, రకరకాలుగా. ప్రాపంచికమైనవి సొంతంగా లేని వారు జ్ఞానానికీ, ఊహలకీ మమకార బంధితులై ఉండొచ్చు. మరికొందరు సద్గుణానికీ, మరొకరు అనుభవానికీ, ఇంకొకరు పేరు ప్రతిష్ఠలకీ, ఆ రకంగా బంధితులు కావచ్చు. సొంతమైనవి లేకుండా "నేను" అనేది ఉండదు. "నా" అంటేనే సొంత ఆస్తి, సామాను, సద్గుణం, పేరు; ఏదున్నా ఏమీ కాకుండా ఉంటాననే భయంతో మనస్సు పేరుకీ, సామానుకీ, విలువకీ మమకార బంధం ఏర్పరచుకుంటుంది. తరవాత వీటిని వదులుకుంటుంది, అంతకన్న ఉన్నత స్థాయిలో ఉండటానికి - ఉన్నతస్థాయి ఎక్కువ సంతృప్తి నిచ్చేదీ, ఎక్కువ శాశ్వతమైనదీ కనుక. సందిగ్ధతవల్ల కలిగే భయం, ఏమీ కానేమోననే భయం, మమకారబంధం పెంచుకునేట్లూ, సొంతం చేసుకునేట్లూ చేస్తుంది. సొంతం చేసుకున్నది అసంతృప్రికరంగా గాని, బాధాకరంగాగాని ఉంటే దాన్ని పరిత్యజిస్తాం - మరింత సంతోషకరమైన బంధంకోసం. అన్నిటికన్నా సంతృప్తికరమైనదీ, ఆఖరున సొంతం చేసుకోవాలనుకునేదీ దైవం అనే పదం, లేదా, దాని స్థానంలో మరోటి - ప్రభుత్వం అనేది.

"కాని, ఏమీ కాకుండా ఉండటం గురించి భయపడటం సహజం. ఏమీ కాకుండా ఉండటానికే ఇష్టపడాలని మీ ఉద్దేశం అనుకుంటాను."

ఏదో అవాలని మీరు ప్రయత్నిస్తున్నంతవరకూ ఏదో మిమ్మల్ని ఆక్రమించినంతవరకూ, సంఘర్షణ, గందరగోళం, దుఃఖం అధికం కావటం తప్పదు. మీ మటుకు మీరు మీ సాధించిన గొప్పతనం, విజయం మూలాన్ని ఈ అధిగమిస్తున్న విధ్వంసంలో చిక్కుకోరనే అనుకుంటూండవచ్చు. కాని, మీరు దాన్ని తప్పించుకోలేరు - మీరూ అందులోని వారే కాబట్టి. మీ కార్యకలాపాలూ, మీ ఆలోచనలూ, మీ జీవన నిర్మాణం కూడా సంఘర్షణ పైనా, గందరగోళం పైనా ఆధారపడి ఉన్నాయి. ఏమీ కాకుండా ఉండటానికి ఇష్టం లేనంత కాలం మీరు దుఃఖాన్నీ, వైరుధ్యాన్నీ పెంపొందించుకోవటం తప్పదు. ఏమీ కాకుండా ఉండాలని సంసిద్ధం కావటం పరిత్యజించటమూ కాదు, అంతరంగికంగా గాని, బాహ్యంగా గాని బలవంతం చెయ్యటమూ కాదు. అది ఉన్న స్థితిలోని యథార్థాన్నీ గ్రహించటమే. ఉన్నదానిలోని యథార్థాన్ని గ్రహించటంతో, రక్షణలేకపోవటం వల్ల ఏర్పడిన భయం నుంచి విముక్తి కలుగుతుంది. బంధాన్నీ పెంపొందించి, బంధం తెంచుకోవటం, పరిత్యజించటం - అనే భ్రమకి దారితీసి భయం నుంచి విముక్తి కలుగుతుంది ఉన్నస్థితిని ప్రేమించటమే వివేకానికి ఆరంభం. ప్రేమ ఒక్కటే పంచుకుంటుంది. అదొక్కటే సంపర్కం కలిగించుకోగలదు. కాని, పరిత్యజించటం, పరిత్యాగం చేయటం ఒంటరితనానికీ, భ్రమకీ మార్గాలూ.