మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఆలోచన, చైతన్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

62. ఆలోచన, చైతన్యం

అన్నీ వేటికవి ముడుచుకుపోతున్నాయి. వృక్షాలు తమ్ముతాము ఆవరించుకుంటున్నాయి. పక్షులు ఆనాటి తిరుగుళ్లను గుర్తుతెచ్చుకోవటానికి రెక్కలు ముడుచుకుంటున్నాయి. నది తన మెరుపు పోగొట్టుకుంది. నీళ్లు ఇంక నాట్యం చెయ్యటం లేదు. ప్రశాంతంగా ఆగిపోయి ఉన్నాయి. పర్వతాలు దూరంగా, సమీపించటానికి వీల్లేకుండా ఉన్నాయి. మనిషి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాత్రయింది. ఏకాంతంలో నిశ్చలత ఉంది. ఏవిధమైన సంపర్కం లేదు. దేనికది మూసేసుకుంది. తన్ను తాను వేరు చేసుకుంది. పువ్వు, ధ్వని, సంభాషణ - ఏదీ పైకి తెలియకుండా అభేద్యంగా ఉంది. నవ్వు ఉంది - కాని అదొక్కటే ఎక్కడో దూరంగా ఉంది. సంభాషణ అణచిపెట్టినట్లుగా లోపలగా ఉంది. ఒక్క నక్షత్రాలే ఆహ్వానిస్తున్నాయి - బాహాటంగా తెలియజేస్తూ. కాని అవి కూడా ఎంతో దూరంగా ఉన్నాయి.

ఆలోచన ఎప్పుడూ బాహ్యప్రతిక్రియే. దాని ప్రతిక్రియ ప్రగాఢంగా ఎప్పుడూ ఉండదు. ఆలోచన ఎప్పుడూ పైపైన ఉండేదే. ఆలోచన ఎప్పుడూ ఒక పరిణామమే. పరిణామాలను సర్దుబాటు చేయటమే ఆలోచించటం. ఆలోచన ఎప్పుడూ పైపైదే - వివిధ స్థాయిల్లో తన్ను తాను ఉంచుకున్నప్పటికీ. ఆలోచన ప్రగాఢమైన దానిలోకి, అంతర్గర్భితమైన దానిలోకి చొచ్చుకుని పోలేదెన్నటికీ. ఆలోచన తన్ను తాను దాటిపోలేదు. అందుకోసం ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి నిస్పృహ కలుగుతుంది.

"మీ ఉద్దేశంలో ఆలోచన అంటే ఏమిటి?"

ఆలోచన ఎటువంటి సమస్య ఎదురైనా దానికి ఏర్పడే ప్రతిక్రియ. ఆలోచన చర్యకాదు, చెయ్యటంకాదు. ఆలోచన ఒక పరిణామం, ఫలితం యొక్క ఫలితం. అది జ్ఞాపకం యొక్క ఫలితం. జ్ఞాపకమే ఆలోచన. జ్ఞాపకాన్ని మాటల్లో వ్యక్తం చేయటమే ఆలోచన. జ్ఞాపకం అంటే అనుభవం. ఆలోచించటమనే ప్రక్రియ చైతన్యప్రక్రియ - అవ్యక్తమైనదీ, వ్యక్తమైనదీ కలిపి. ఈ ఆలోచనా ప్రక్రియ అంతా చైతన్యంగా ఉండటమే; మెలుకువగా ఉండటం, నిద్రపోవటం, పై స్థాయి, లోలోపలి స్థాయి అన్నీ జ్ఞాపకం యొక్క, అనుభవం యొక్క భాగాలే. ఆలోచన స్వతంత్రమైనది కాదు. స్వతంత్రంగా ఆలోచించటం అంటూ ఉండదు. "స్వతంత్రంగా ఆలోచించటం" అనే మాటలు పరస్పర విరుద్ధమైనవి. ఆలోచన ఒక ఫలితం కాబట్టి అది వ్యతిరేకిస్తుంది, లేదా ఒప్పుకుంటుంది, పోలుస్తుంది, లేదా సర్దుకుంటుంది, ఖండిస్తుంది, లేదా సమర్థిస్తుంది. అందువల్ల అది ఎన్నటికీ స్వేచ్ఛగా ఉండదు. ఇటూ అటూ తిప్పుతుంది, నేర్పుతో ఉపయోగిస్తుంది, ఇటూ అటూ తిరుగుతుంది, కొంత దూరం పోతుంది. కాని దాని గొలుసుల్లోంచి అదే బయటపడలేదు. ఆలోచన జ్ఞాపకానికి లంగరువేసి ఉంటుంది. ఏ సమస్యలోని నిజాన్నీ కనుక్కోగలిగిన స్వేచ్ఛ దానికుండదు.

"మీ ఉద్దేశంలో ఆలోచనకి ఏవిధమైన విలువా లేదనా?"

పరిణామాలను సర్దుబాటు చేయటంలో దానికి విలువ ఉంది. కాని, చర్య తీసుకునేందుకు సాధనంగా మాత్రం దానంతట దానికి విలువలేదు. చర్య అంటే పరివర్తన, అంతేకాని, పరిణామాలను సర్దుబాటు చేయటం కాదు..ఆలోచనలతో, ఊహతో, నమ్మకంతో సంబంధం లేని చర్య ఒక మూసలో పోసినట్లుగా ఎన్నటికీ ఉండదు. ఒక పథకం ప్రకారం కార్యకలాపం ఉండొచ్చు. ఆ కార్యకలాపం హింసాత్మకం, రక్తమయం అయినా కావచ్చు, లేదా దానికి వ్యతిరేకం కావచ్చు. కాని, అది చర్య మాత్రం కాదు. వ్యతిరేకమైనది చర్యకాదు, కార్యక్రమాన్ని కొద్ది మార్పులు చేసి కొనసాగించటం. వ్యతిరేకమైనది కూడా ఫలితంలోని భాగమే. వ్యతిరేకమైన దాన్ని ప్రయత్నిస్తూ ఆలోచన తన ప్రతిక్రియల వలలో తానే చిక్కుకుంటుంది. చర్య ఆలోచన ఫలితం కాదు. చర్యకీ ఆలోచనకీ సంబంధం లేదు. ఆలోచన ఫలితం కాబట్టి కొత్తదాన్ని ఎన్నటికీ సృష్టించలేదు. కొత్తది క్షణక్షణానికీ పుడుతుంది. ఆలోచన ఎప్పుడూ పాతది, గతించినది, ప్రభావితమైనది. దానికి విలువ ఉంది, కాని స్వేచ్ఛ లేదు. విలువంతా పరిమితమే. అది బంధిస్తుంది. ఆలోచన బందనంలో ఉంచుతుంది, అది విలువైనది కాబట్టి.

"చైతన్యంగా ఉండటానికీ ఆలోచనకీ సంబంధం ఏమిటి?"

అవి రెండూ ఒకటే కాదా? ఆలోచించటానికీ, చైతన్యంగా ఉండటానికీ ఏదన్న తేడా ఉందా? ఆలోచించటం ఒక ప్రతిక్రియ. చైతన్యంగా ఉండటం కూడా ప్రతిక్రియేకాదా? ఆ కుర్చీ గురించి తెలిసి ఉండటం ఏదో ప్రేరేపిస్తే కలిగిన ప్రతిక్రియ. దేన్నైనా ఎదుర్కొన్నప్పుడు జ్ఞాపకం వల్ల కలిగిన ప్రతిక్రియ కాదా ఆలోచన? ఈ ప్రతిక్రియనే అనుభవం అంటున్నాం. అనుభవం. పొందటం అంటే దేన్నైనా ఎదుర్కోవటం, దానికి ప్రతిక్రియ కలగటం. ఈ అనుభవించటం, దానితో బాటు దానికొక పేరు పెట్టటం, దాన్ని పదిలపరచటం - ఈ మొత్తం ప్రక్రియ వివిధ స్థాయిల్లో జరగటమే చైతన్యంగా ఉండటం, కాదా? అనుభవం ఒక ఫలితం, అనుభవం పొందటం యొక్క ఫలితం. ఆ ఫలితానికొక మాట నిర్ణయించబడుతుంది. ఆ మాటే నిర్ణయం. అటువంటి నిర్ణయాలెన్నో కలిసి జ్ఞాపకంగా అవుతుంది. ఈ నిర్ణయించే ప్రక్రియే చైతన్యంగా ఉండటం. నిర్ణయం, ఫలితం స్వీయ చైతన్యం. 'నేను' అనేది జ్ఞాపకం, ఎన్నో నిర్ణయాలూ. ఆలోచన జ్ఞాపకం యొక్క ప్రతిక్రియ. ఆలోచన ఎప్పుడూ నిర్ణయమే. ఆలోచించటం అంటే నిర్ణయానికి రావటం. అందువల్ల అది ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండదు.

ఆలోచన ఎప్పుడూ పైపైదే, నిర్ణయమే. చైతన్యంగా ఉండటం అంటే పైపైదాన్ని పదిలపరచటం. పైపైన ఉన్నది తన్నుతాను విభజించుకుంటుంది. పైది అనీ, లోపలిది అనీ, కాని, ఈ విభజన ఆలోచనను పైపైది కాకుండా ఉండేట్లుగా ఎంత మాత్రం చేయలేదు.

"కాని ఆలోచన కతీతమైనదీ, కాలానికి అతీతమైనదీ. మనస్సు సృష్టించవిదీ వేరే ఏమీలేదా?"

అట్టి స్థితి గురించి మీకెవరైనా చెబితే విని ఉంటారు. లేదా దాని గురించి చదివి ఉంటారు. లేదా దాన్ని అనుభవించటం జరిగి ఉంటుంది. దాన్ని అనుభవం పొందటం అనుభవం కాదు, ఫలితం కాదు. దాన్ని గురించి ఆలోచించటం సాధ్యం కాదు. సాధ్యమయితే అది జ్ఞాపకమే గాని అనుభవించటం కాదు. మీరు చదివిన దాన్ని గాని, విన్నదాన్నిగాని పునశ్చరణ చేయ వచ్చు. కాని మాట అసలైనది కాదు. మాట, పునశ్చరణ - అనుభవించ కుండా అడ్డుకుంటుంది. ఆలోచన ఉన్నంతవరకూ అనుభవించేస్థితి ఉండటం సాధ్యం కాదు. ఫలితం, పరిణామం ఎన్నటికీ అనుభవించే స్థితిని తెలుసుకోలేవు.

"అయితే, ఆలోచన ఎలా అంతమవుతుంది?"

ఆలోచన తెలిసిన దాని ఫలితం కాబట్టి అనుభవించే స్థితిలో ఎన్నటికీ ఉండలేదన్న సత్యాన్ని గ్రహించండి. అనుభవించటం ఎప్పుడూ కొత్తదాన్నే ఆలోచన ఎప్పుడూ పాత దాన్నుంచే. ఈ నిజాన్ని గ్రహించండి. నిజం ఎప్పుడూ స్వేచ్ఛను కలుగజేస్తుంది - ఆలోచన నుంచీ, ఫలితాన్నుంచీ స్వేచ్ఛను కలుగజేస్తుంది. అప్పుడు చైతన్యావస్థకి అతీతమైనది - అది నిద్రపోవటం కాదు, మెలుకువగా ఉండటం కాదు, దానికి పేరు లేదు. అది ఉంటుంది.