మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఆనందాన్ని కోరటం

వికీసోర్స్ నుండి

61. ఆనందాన్ని కోరటం

ఆ విశాలమైన పచ్చని మైదానంలో ఉన్న ఆ ఒక్క చెట్టూ అ చిన్న ప్రపంచానికీ, అందులో ఉండే అడవులూ, ఇల్లూ, చిన్న సరస్సూ - వీటన్నిటికీ కేంద్రం. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశమంతా ఎత్తుగా విశాలంగా ఉన్న ఆ చెట్టువైపుకి ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది. అది చాలా పురాతనమైనదై ఉంటుంది. కాని, దానిలో ఏదో స్వచ్ఛత ఉంది, అప్పుడే పుట్టిందా అన్నట్లు. దానికి ఎండుకొమ్మలు ఎప్పుడూ ఉండవు. దాని ఆకులు ఎక్కడా మచ్చ లేకుండా పొద్దుట ఎండలో మెరుస్తూ ఉంటాయి. అది ఒంటరిగా ఉండబట్టి అన్నీ దానివైపుకి వస్తున్నట్లుగా కనబడుతుంది. లేళ్లూ, పులులూ, కుందేళ్లూ, ఆవులూ, మేకలూ మొదలైన మృగాలూ దాని నీడ క్రింద గుమిగూడుతాయి. ముఖ్యంగా మధ్యాహ్న వేళ. అందంగా తీర్చిదిద్దినట్లున్న ఆ చెట్టు ఆకాశానికి రూపుదిద్దింది. ఆ ఉదయపు కాంతిలో ఆ చెట్టు ఒక్కటే సజీవమైన దానిలా కనిపించింది. అడవుల్లోంచి చెట్టు చాలా దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాని, ఆ చెట్టు దగ్గర్నుంచి అడవులూ, ఇల్లూ, ఆకాశమూ కూడా ఎంతో దగ్గరగా ఉన్నట్లనిపిస్తుంది. కదిలిపోయే మేఘాలను స్పృశించవచ్చుననిపిస్తుంది చూచినప్పుడల్లా.

ఆ చెట్టుక్రింద అప్పటికే చాలా సేపటినుంచి కూర్చున్నాం. ఆయన కూడా వచ్చి మాతో చేరాడు. ఆయనకి ధ్యానం చెయ్యటంలో తీవ్రమైన ఆసక్తి ఉంది అన్నాడు. చాలా ఏళ్లు సాధన చేశాడుట. ఓ ప్రత్యేకమైన సిద్ధాంతానికి చెందిన వాడు కాడుట. ఎందరో క్రిస్టియన్ తాత్త్వికుల గురించి చదివాడుట గాని, హిందూ, బౌద్ధమహాత్ములు బోధించిన ధ్యానం, క్రమశిక్షణా తన్ను ఎక్కువగా ఆకర్షించాయన్నాడు. సన్యసించటంలోనూ, పరిత్యాగశక్తిని అలవరచుకోవటంలోనూ ఉన్న విచిత్రమైన ఆకర్షణ ఎంత అపరిపక్వమైనదీ చిన్నప్పుడే గ్రహించాడుట. ఆయన మొదటినుంచీ మితిమీరిన వాటన్నిటికీ దూరంగా ఉన్నాడుట. అయితే, ఆయన క్రమశిక్షణా, హెచ్చుతగ్గులు లేని ఆత్మనిగ్రహం పాటించాడుట. ధ్యానాన్నీ, దానికి అతీతమైన దాన్నీ తెలుసుకోవాలని పట్టుదలతో ఉన్నాడుట. దీక్షగా నీతివంతమైన జీవితాన్ని గడిపాడుట. కాని, అది చాలా స్వల్పవిషయం అన్నాడు. ప్రాపంచిక విషయాల పట్ల కూడా ఆయన ఆకర్షితుడు కాలేదుట. ఒకప్పుడు ప్రాపంచికమైన వాటితో ఆటలాడాడుట. కాని, ఆ ఆట కొన్నేళ్ల క్రిందటే ముగిసిపోయిందిట. ఏదో ఉద్యోగం లాంటిది ఉందిట. అది కూడా యథాలాపంగానేనట.

ధ్యానం యొక్క ఫలితం ధ్యానమే. ధ్యానం ద్వారా గాని, దానికింకా పైనగాని ఏదైనా ప్రయత్నించటం లక్ష్య సాధన అవుతుంది. సాధించినది మళ్లీ పోతుంది. ఫలితాన్ని ఆశించటం స్వయంకల్పనని కొనసాగించుకోవటమే. ఫలితం ఎంత ఉన్నతమైనదైనా, అది వాంఛారూపమే, ధ్యానం దేన్నో చేరటానికో, సాధించటానికో, సాక్షాత్కరింప చేసుకోవటానికో అయితే. అది ధ్యానం చేసేవానికి శక్తినిస్తుందంతే. ధ్యానం చేసేవాడే ధ్యానం. ధ్యానం చేసే వానిని అవగాహన చేసుకోవటమే ధ్యానం.

"నేను అంతిమ సత్యాన్ని కనుక్కోవటానికి, లేదా, ఆ సత్యం సాక్షాత్కారం కావటానికి ధ్యానం చేస్తున్నాను. నేను ఆశిస్తున్నది ఒక ఫలితం కాదు. సరిగ్గా చెప్పాలంటే - అదొక ఆనందం - అప్పుడప్పుడు అనుభూతి పొందేది. అది ఉంది. దాహం వేస్తున్నవాడు నీటికోసం తప్పించిపోయినట్లు ఆ అవ్యక్తమైన ఆనందాన్ని కోరుతున్నాను. అన్నిరకాల సంతోషం కన్న ఎన్నో రెట్లు గొప్పది ఆ ఆనందం. నా కత్యంత ప్రియమైన కోరిక తీర్చుకోవటం కోసమే ప్రయత్నిస్తున్నాను."

అంటే, మీరు కోరుతున్నదాన్ని పొందటానికి మీరు ధ్యానం చేస్తున్నారు. మీరు కోరిన దాన్ని పొందటానికి మిమ్మల్ని మీరు తీవ్రమైన క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కొన్ని నియమాలూ, నిష్ఠలూ పాటిస్తారు. ఒక మార్గాన్ని తయారుచేసి, దాన్ని అనుసరిస్తారు, గమ్యాన్ని చేరుకోవటానికి, కొన్ని ఫలితాలనూ, కొన్ని నిర్ణీత అవస్థలనూ పొందగలరని ఆశిస్తారు. మీ కృషిలో చూపించే పట్టుదలను బట్టి క్రమక్రమంగా అధికమైన ఆనందాన్నీ, అంతకన్న అధికమైన ఆనందాన్నీ పొందుతారు. బాగా వేసుకున్న ఈ మార్గం మీకు అంతిమ ఫలితం లభిస్తుందని హామీ ఇస్తుంది. అందువల్ల మీ ధ్యానం చాలా ఆలోచించుకుని నడుపుతున్న వ్యవహారం కాదా?

"మీరలా అంటూంటే అవుననిపిస్తోంది పైకి - చాలా అర్ధహీనమైన దానిలా. కాని, గాఢంగా చూస్తే, అందులో దోషం ఏముంది? ఆ ఆనందాన్ని కోరటంలో ప్రధానంగా దోషం ఏముంది? నేను చేసిన ప్రయత్నాలన్నింటికీ ఫలితం కోరుతున్నాననుకోండి. అయితే, అలా ఎందుకు అనుకోకూడదు?"

ఆనందాన్ని ఆవిధంగా కోరటంలో ఆ ఆనందమే ఆఖరిదైనట్లు, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుందన్నట్లూ సూచిస్తుంది. తక్కిన ఫలితాలన్నీ అసంతృప్తికరమైనవే. ప్ర్రాపంచిక లక్ష్యాలను సాధించటానికి తీవ్రంగా ప్రయత్నించారు. వాటి క్షణికత్వాన్ని కూడా చూశారు. ఇప్పుడు ఒక అనంతమైన స్థితిని కోరుకుంటున్నారు. అంతంలేని గమ్యాన్ని కోరుతున్నారు. మనస్సు ఆఖరి అవినాశకరమైన ఆశ్రయాన్ని కోరుతోంది. అందుకోసం తన్నుతాను క్రమశిక్షణలో పెట్టుకుంటుంది. శిక్షణ నిచ్చుకుంటుంది. తను కోరినదాన్నీ పొందటానికి కొన్ని సద్గుణాలను సాధన చేస్తుంది. అది ఒకసారి ఆ ఆనందాన్ని అనుభవించి ఉండవచ్చు. ఇప్పుడు దానికోసం ఒగురుస్తూ వెంటబడుతోంది. వేరే ఫలితాలకోసం ప్రయత్నించే ఇతరులలాగే మీరూ దానికోసం ప్రయత్నిస్తున్నారు. మీరు దాన్ని మరొక స్థాయిలో ఉంచారు. దాన్ని మీరు ఉన్నతం అనొచ్చు. కాని అది అప్రస్తుతం. ఫలితం అంటే అంతమవటం. చేరుకోవటంలో ఇంకేదో అవటానికి ప్రయత్నం ఉంటుంది. మనస్సు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదు. ఎప్పుడూ దేనికోసమో కష్టపడుతూనే ఉంటుంది. ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ లాభం పొందుతూనే ఉంటుంది, ఓడిపోతానని నిత్యం భయపడుతూనే ననుకోండి. ఈ ప్రక్రియనే ధ్యానం అంటున్నారు. అనంతంగా ఏదో అవుతూ ఉండటంలో చిక్కుకున్న మనస్సు ఆనందాన్ని తెలుసుకుంటుందా? మనస్సు తనపై తాను విధించుకున్న క్రమశిక్షణ నుంచి ఎప్పటికైనా స్వేచ్ఛను పొందగలదా అ ఆనందాన్ని గ్రహించటానికి? ప్రయత్నం, పోరాటం ద్వారా, ప్రతిఘటన, పరిత్యాగాల ద్వారా మనస్సు తనలో సున్నితత్వం లేకుండా చేసుకుంటుంది. అటువంటి మనస్సు తెరుచుకుని తట్టుకోగలుగుతుందా? ఆ ఆనందాన్ని కోరటం ద్వారా ఊహాతీతమైనదీ, అపరిచితమైనదీ - ఏదీ లోనికి చొచ్చుకోకుండా మీ చుట్టూ మీరు గోడకట్టుకోలేదా? కొత్తదేదీ ప్రవేశించకుండా మిమ్మల్ని మీరు అన్నివిధాలా బంధించుకోలేదా? పాతదానిలో నుంచే కొత్తదానికి బాటవేసుకున్నారు. పాత దాంట్లో కొత్తది ఇముడుతుందా?

మనస్సు ఎన్నటికీ కొత్తదాన్ని సృష్టించలేదు. మనస్సే ఒక ఫలితం. అన్ని ఫలితాలూ పాతవాటి నుంచి వచ్చినవే. ఫలితాలు ఎన్నటికీ కొత్తవి కాలేవు. ఫలితం కోసం ప్రయత్నించటం అనాలోచితంగా ఎన్నటికీ జరగదు. స్వేచ్ఛగా ఉన్నది ఒక లక్ష్యం కోసం ప్రయత్నించలేదు. లక్ష్యం, ఆదర్శం ఎప్పటికీ మనస్సు రూపొందించినదే. నిజానికి, అది ధ్యానం కాదు. ధ్యానం అనేది ధ్యానం చేసేవానికి స్వేచ్ఛ కలిగించటమే. స్వేచ్ఛగా ఉన్నప్పుడే సాక్షాత్కరింపజేసుకోవటం, గ్రహించే సున్నితత్వం ఉంటుంది. స్వేచ్ఛ లేనిదే ఆనందం లేదు. కాని, స్వేచ్ఛ క్రమశిక్షణ ద్వారా రాదు. క్రమశిక్షణ స్వేచ్ఛాపథకాన్ని తయారు చేస్తుంది. కాని, పథకం స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ ఉండాలంటే పథకాన్ని ముక్కలు చెయ్యాలి. పథకపు అచ్చుని ముక్కలు ముక్కలుగా చేయటమే ధ్యానం. కాని ఈ అచ్చుని ముక్కలు చేయటం ఒక లక్ష్యం, ఒక ఆదర్శం కాదు. ఈ అచ్చుని క్షణక్షణమూ ముక్కలు చేస్తూనే ఉండాలి. ముక్కలైన క్షణం మరచిపోయిన క్షణం. జ్ఞాపకమున్న క్షణమే అచ్చుని రూపొందిస్తుంది. అప్పుడే అచ్చుని తయారుచేసేదీ, ఉద్భవిస్తుంది - అన్ని సమస్యలకూ, సంఘర్షణలకూ దుఃఖాలకూ మూలకారకమవుతుంది.

ధ్యానం అంటే మనస్సుని దాని ఆలోచనల నుంచి, అన్నిస్థాయిల్లోని ఆలోచనల నుంచీ విముక్తి చేయటమే. ఆలోచించేది వేరూ, ఆలోచన వేరూకాదు. అవి ఒకే ప్రక్రియ. రెండూ వేరువేరు ప్రక్రియలు కాదు. వేరువేరు ప్రక్రియలు అజ్ఞానానికీ భ్రమకీ మాత్రమే దారితీస్తాయి. ధ్యానం చేసేది ధ్యానం. అప్పుడు మనస్సు ఏకాంతంగా ఉంటుంది. నిశ్శబ్దంగా చేయబడి ఉండటం కాదు. ఏకాంతంగా ఉన్నదాని వద్దకే కారణరహితమైనది వస్తుంది. ఏకాంతంగా ఉన్నదానికే ఆనందం ఉంటుంది.