మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఫలితం యొక్క నిరర్ధకత

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

60. ఫలితం యొక్క నిరర్థకత

వాళ్లు ప్రపంచంలోని వివిధ భాగాలనుంచి వచ్చారు. మనలో చాలా మందికి ఎదురయ్యే సమస్యల గురించి చర్చిస్తున్నారు. మాట్లాడుకోవటానికి బాగానే ఉంటుంది. కేవలం మాటలవల్లా, గడుసు వాదనలవల్లా, విస్తారమైన జ్ఞానం వల్లా బాధాకరమైన సమస్యల నుంచి విముక్తి లభించదు. గడుసు తనం, విజ్ఞానం తమ నిష్పలత్వాన్ని ఋజువు చెయ్యవచ్చు. ఆ నిష్పలత్వాన్ని కనిపెట్టినప్పుడు మనసు నిశ్శబ్దమౌతుంది. నిశ్శబ్దంలో సమస్య అవగాహన అవుతుంది. కాని, ఆ నిశ్శబ్దాన్ని కోరటం మరొక సమస్యనీ, మరొక సంఘర్షణనీ పెంపొందిస్తుంది. విశదీకరించటాలూ, కారణాలు విప్పిచూపటాలూ, సమస్యలు విడదీసి పరీక్షించటాలూ దాన్ని ఏవిధంగానూ పరిష్కరించలేవు. ఎందువల్లనంటే, దాన్ని మానసిక పద్ధతుల్లో పరిష్కరించటానికి సాధ్యమవదు. మనస్సు మరికొన్ని సమస్యల్ని పెంచుతుందంతే. అది సమస్య నుంచి విడిపించుకోలేదు. మనస్సే సమస్యలూ, సంఘర్షణలూ పెరిగి పెంపొందే స్థలం. ఆలోచన తన్నుతాను నిశ్శబ్దంగా ఉంచుకోలేదు. నిశ్శబ్దపు ముసుగును వేసుకోగలదు. అది కేవలం దాపరికం, వేషం మాత్రమే. ఒక నిశ్చిత లక్ష్యం కోసం క్రమశిక్షణతో కూడిన చర్య తీసుకోవటం ద్వారా ఆలోచన తన్ను తాను చంపుకోగలదు. కాని, చావు నిశ్శబ్దం కాదు. బ్రతుకు కన్న చావు మరింత అరిచి పెడబొబ్బలు పెడుతుంది. మనస్సులోని ఏవిధమైన సంచలనమైనా నిశ్శబ్దానికి భంగకరం.

తెరిచి ఉన్న కిటికీల్లోంచి ధ్వనులు గందరగోళంగా వినిపిస్తున్నాయి - ఊరిలో గట్టిగా మాట్లాడుకోవటం, తగువులాడుకోవటం, ఇంజనుకూత పెట్టటం, పిల్లల ఏడుపులూ, కేరింతలూ, వెళ్లేలారీ రొదా, తేనెటీగలు ఝమ్మనటం, కాకులగోలా, ఈ రణగణ ధ్వని మధ్యలో నిశ్శబ్దం గదిలోకి మెల్లిగా పరుచుకుంటోంది కోరకుండానే, పిలవకుండానే. మాటలమధ్య నుంచీ నిశ్శబ్దం రెక్కలు విప్పుకుంటోంది. ఆ నిశ్శబ్దం లక్షణం - చప్పుళ్లూ, కబుర్లూ, మాటలూ ఆగిపోవటం కాదు; నిశ్శబ్దాన్ని ఇముడ్చుకోవటానికి మనస్సు విస్తరించే శక్తిని పోగొట్టుకోవాలి. ఏ బలవంతాలూ, సర్దుకు పోవటాలూ, ప్రయత్నాలూ లేకుండా స్వేచ్ఛగా ఉండే నిశ్శబ్దం అది. అది అనంతమైనది. నిత్య నూతనమైనది. నిత్యనిర్మలమైనది. కాని, ఆ నిశ్శబ్దం మాటకాదు.

మనం ఫలితాలనూ, లక్ష్యాలనూ, ఎందుకు ఆశిస్తాం? మనస్సు ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యాన్ని సాధించటానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? లక్ష్యాన్ని సాధించటానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఇక్కడికి రావడంలో మనం దేన్నో ఏ అనుభవాన్నో, ఏ ఆనందాన్నో కోరటం లేదా? మనం ఆడుకున్న ఎన్నో వాటిపైన విసుగుపుట్టింది. ఇప్పుడు మనకి ఇంకొక కొత్త ఆటవస్తువు కావాలి. మనం ఒకదాని తరవాత మరొక దానివెంట పడతాం - స్త్రీ ఒక్కొక్క కొట్టూ చూసుకుంటూ పోయినట్లు. మనకి పూర్తిగా తృప్తి కలిగించేదేదో దొరికేవరకూ ప్రయత్నిస్తాం. ఆ తరవాత స్థిరపడిపోతారు, ఎదుగూ, బొదుగూ లేకుండా. మనం నిత్యం దేనికో ఒకదానికోసం తాపత్రయపడుతూనే ఉంటాం. చాలావరకు అసంతృప్తికరమైనవాటినెన్నిటినో రుచి చూసి ఉండటం వల్ల ఇప్పుడు మనకి ఆఖరికి అసలైనది కావాలి. దేవుడు, సత్యం, ఏదైనా అనుకోండి. మనకి ఫలితం కావాలి, నూతన అనుభవం, నూతన అనుభూతి, దేనికైనా తట్టుకోగలిగేదీ కావాలి. ఫలితం అనేదాని నిష్ప్రయోజకత్వాన్ని ఎప్పుడూ గ్రహించం - ఏదో ఒక ప్రత్యేక ఫలితాన్నే తప్ప. అందుకనే ఒక ఫలితం నుంచి మరో ఫలితానికి తిరుగాడుతూ ఉంటాం - అన్ని అన్వేషణలనూ అంతం చేయగలది దొరుకుతుందనే ఎప్పుడూ ఆశిస్తూ.

ఫలితం కోసం, విజయం కోసం చేసే ప్రయత్నం బంధించేదిగా, పరిమితం చేసేదిగా ఉంటుంది. ఎప్పుడూ ఆఖరవుతూనే ఉంటుంది. సాధించటంలోనే అంతమవటం ఉంటుంది. చేరుకోవటమే మరణించటం. అయినా, మనం కోరుతున్నది అదే, కాదా? మనం మరణాన్ని కోరుతున్నాం. దాన్ని అనటం మాత్రం ఫలితం అనీ, గమ్యం అనీ, లక్ష్యం అనీ అంటున్నాం. మనం గమ్యం చేరుకోవాలనుకుంటాం. ఈ అనంతమైన పోరాటంతో అలిసిపోయాం. అక్కడికి చేరుకోవాలి అనుకుంటున్నాం - "అక్కడికి" అనేది ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు. వృథా అయిన ఈ పోరాటం యొక్క వినాశకత్వాన్ని గ్రహించకుండా ఒక ఫలితం సాధించటం ద్వారా దాన్నుంచి విముక్తి పొందాలని వాంఛిస్తాం. ఈ పోరాటంలోని, ఈ సంఘర్షణ లోని సత్యాన్ని గ్రహించం. అందువల్ల దాన్నొక సాధనంగా ఉపయోగించాలనుకుంటాం - అత్యంత సంతృప్తికరమైనది సాధించటం కోసం. ఏది అత్యంత సంతృప్తి నిస్తుందో అది మనకున్న అసంతృప్తి యొక్క ప్రగాఢతను బట్టి నిర్ణయమవుతుంది. ఫలితం ఆశించే కోరిక ఎప్పుడూ నెరవేరుతుంది. కాని, మనకి ఎప్పటికీ అంతంగాని ఫలితం కావాలి. అంచేత మన సమస్య ఏమిటి? ఫలితాలకోసం తాపత్రయ పడకుండా స్వేచ్ఛగా ఎలా ఉండాలన్నది కాదా? "అదే అనుకుంటాను. స్వేచ్ఛగా ఉండాలనే కోరిక కూడా ఒక ఫలితాన్ని ఆశించేదే, కాదా?"

మనం అ మార్గంలో పడిపోతే పూర్తిగా చిక్కుకుపోతాం. ఫలితం యొక్క నిష్ప్రయోజకత్వాన్ని చూడటం మనకి సాధ్యం కాదా - దాన్ని ఏ స్థాయిలో ఉంచినప్పటికీ? అదేనా మన సమస్య? మన సమస్యని స్పష్టంగా చూద్దాం. అప్పుడు దాన్ని అర్థం చేసుకోవటానికి వీలవచ్చు. ఏదో ఒక ఫలితం యొక్క నిష్ప్రయోజకత్వాన్ని చూచిన మీదట ఫలితాలను ఆశించే కోరికలన్నిటినీ వదులుకోవటమా? తప్పించుకునే మార్గం ఒకటి నిరుపయోగం అని గ్రహించినట్లయితే తప్పించుకునే మార్గాలన్నీ వృథాయే. మన సమస్య అదా? నిశ్చయంగా అది కాదు కదా? దాన్ని మరో విధంగా చూడొచ్చునేమో.

అనుభవం కూడా ఒక ఫలితం కాదా? మనం ఫలితాలనుంచి విముక్తి పొందాలంటే అనుభవం నుంచి కూడా విముక్తి పొందవద్దా? అనుభవం కూడా ఒక ఫలితం, ఒక అంతం కాదా?

"దేనికి అంతం?"

అనుభవం పొందుతూ ఉండటానికి అంతం.

అనుభవం పొందిన దాని జ్ఞాపకమే అనుభవం కాదా? అనుభవం పొందుతూ ఉండటం అంతమైపోయినప్పుడు అనుభవం ఉంటుంది. అదే ఫలితం. అనుభవం పొందుతూ ఉన్నప్పుడు అనుభవం అనేది లేదు. అనుభవం పొందిన దాని జ్ఞాపకమే అనుభవం. అనుభవం పొందిన స్థితి మరువగానే అనుభవం మొదలవుతుంది. అనుభవం ఎప్పుడూ అనుభవం పొందటానికీ, జీవించటానికీ ప్రతిబంధకమవుతుంది. ఫలితాలూ, అనుభవాలూ అంతమై పోతాయి. కాని అనుభవం పొందటం అనంతమైనది. అనంతమైన దానికి జ్ఞాపకం వల్ల ఆటంకం కలిగినప్పుడు ఫలితాల కోసం ప్రయత్నం ప్రారంభ మవుతుంది. మనస్సు - ఫలితం ఎప్పుడూ ఒక గమ్యాన్నీ, ఒక లక్ష్యాన్నీ ఆశిస్తూనే ఉంటుంది. అదే మరణం. అనుభవించేవాడు లేనప్పుడు మరణం లేదు. అప్పుడే అనంతమైనది ఉంటుంది.