మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఆలోచన ఆగిపోవటం

వికీసోర్స్ నుండి

66. ఆలోచన ఆగిపోవటం

ఆయన పండితుడు, ప్రాచీన సాహిత్యాన్ని బాగా చదువుకున్నవాడు. తన సొంత ఆలోచనలకు మెరుగులు దిద్దటానికి ప్రాచీనులను ఉదాహరించటం అలవాటు చేసుకున్నాడు. ఆ గ్రంథాల్లోవి కాకుండా ఆయన స్వతంత్ర అభిప్రాయాలంటూ నిజంగా ఉన్నాయా అనిపిస్తుంది. నిజానికి, అసలు స్వతంత్ర ఆలోచన అనేదే లేదు. ఆలోచన అంతా ఆధారపడినదే, ప్రభావితమైనదే. ఆలోచన ఎన్నటికీ స్వేచ్ఛగా ఉండదు. కాని, ఆయన జ్ఞానార్జన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన జ్ఞాన భారంతో ఉన్నాడు. దాన్ని కష్టపడి మోస్తున్నాడు. ఆయన సంస్కృతంలోనే మాట్లాడటం మొదలు పెట్టాడు. సంస్కృతం ఏమీ అర్థం కాలేదని తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. అదిరిపడ్డాడు కూడా. ఆయన నమ్మలేకపోయాడు. "ఎన్నో సమావేశాల్లో మీరు మాట్లాడిన దాన్నిబట్టి మీరు సంస్కృతంలో బాగా చదివి ఉంటారని, లేదా, మహా బోధకుల గురించి అనువాదాల్లోనైనా చదివి ఉంటారని అనిపిస్తుంది" అన్నాడు. అదేమీ కాదనీ, అంతేకాక, ఏ విధమైన మత, వేదాంత, మానసిక సంబంధమైన పుస్తకాలూ చదవలేదనీ తెలుసుకున్నప్పుడు తన అపనమ్మకాన్ని దాచుకోలేక పోయాడు.

ముద్రితమైన మాటకీ, పవిత్ర గ్రంథాలనబడే వాటికీ ఎంత విలువ నిస్తామో చిత్రంగా ఉంటుంది. పండితులుకూడా పామరుల్లాగే గ్రామఫోనులు. పునశ్చరణ చేస్తూనే ఉంటారు, రికార్డులు ఎన్నిమార్చినా. వారికి కావలసిన దల్లా జ్ఞానం. అంతేకాని, అనుభవంకాదు. అనుభవించటానికి జ్ఞానం ప్రతిబంధకం. కాని జ్ఞానం సురక్షితమైన ఆశ్రయం. కొద్దిమంది తెలియని వాళ్లు జ్ఞానానికి ముగ్ధులై, తెలిసిన వారిని గౌరవిస్తారు. సన్మానిస్తారు. జ్ఞానం కూడా ఒక దురలవాటే, తాగుడులాగ. జ్ఞానం వల్ల అవగాహన కలగదు. జ్ఞానాన్ని బోధించవచ్చు, కాని వివేకాన్ని కాదు. వివేకం కలగటానికి జ్ఞానం నుంచి స్వేచ్ఛ పొందాలి. జ్ఞానం నాణెం కాదు వివేకాన్ని కొనుక్కునేందుకు. జ్ఞానంలో ఆశ్రయం పొందినవాడు బయటికి రావటానికి ధైర్యం చేయడు, మాటలే అతని ఆలోచనలకు ఆహారం కనుక. ఆలోచించటంతోనే తృప్తి పొందుతాడు. ఆలోచించటం అనుభవించటానికి ప్రతిబంధకం. అనుభవించటం లేకుండా వివేకం ఉండదు. జ్ఞానం, ఊహ, నమ్మకం అనేవి వివేకం కలగకుండా అడ్డు నిలుస్తాయి.

వ్యాపకంతో ఉన్న మనస్సు స్వేచ్ఛగా అనాలోచితంగా ఉండదు. అనాలోచిత స్థితిలోనే ఏదైనా సాక్షాత్కారం కాగలదు. వ్యాపకంతో ఉన్న మనస్సు తన చుట్టూ మూసేసుకుంటుంది. దాన్ని సమీపించటానికి కుదరదు. అభేద్యంగా ఉంటుంది. అందులోనే దానికి రక్షణ లభిస్తుంది. ఆలోచన స్వతస్సిద్ధంగా తన్నుతాను ప్రత్యేకించుకునేది. దాన్ని భేదించటం సాధ్యం కాదు. ఆలోచన అనాలోచితంగా ఉండజాలదు, అది ఎన్నటికీ స్వేచ్ఛగా ఉండదు. కొనసాగుతున్న గతమే ఆలోచన. కొనసాగుతున్నది స్వచ్ఛగా ఉండలేదు. అంతమైనప్పుడే స్వేచ్ఛ ఉంటుంది.

వ్యాపకంతో ఉండే మనస్సు తను పనిచేస్తున్న దాన్ని తానే సృష్టించుకుంటుంది. ఎద్దుబండినిగాని, జెట్ విమానాన్ని గాని తయారు చేయగలదు. మనం తెలివి తక్కువ వాళ్లం అని అనుకోగలం. మనం తెలివి తక్కువ వాళ్లమే. మనమే దైవం అనుకోగలం. మనం ఊహించినదే మనం. "నేనే అది."

"ప్రాపంచిక విషయాల్లో కన్న దేవుని గురించిన వాటితో వ్యాపకం పెట్టుకోవటం నిశ్చయంగా మంచిది, కాదా?"

మనం ఏది ఆలోచిస్తామో అదే మనం. ఆలోచనా ప్రక్రియని అర్థం చేసుకోవటం ముఖ్యం, అంతేకాని, మనందేన్ని గురించి ఆలోచిస్తున్నామో అది కాదు. భగవంతుడి గురించి ఆలోచిస్తున్నామా లేదా ఒక పానీయం గురించి ఆలోచిస్తున్నామా అన్నది ముఖ్యం కాదు; ప్రతిదానికి ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది. కాని, రెండింటిలోనూ స్వయం కల్పితమైన దాని గురించే ఆలోచనకి వ్యాపకం. ఊహలూ, ఆదర్శాలూ, లక్ష్యాలూ, మొదలైనవన్నీ ఆలోచన కల్పించినవే - విస్తరించిన ఆలోచనలే. ఏ స్థాయిలోనైనా సరే. స్వయం కల్పితమైన వాటి గురించి వ్యాపకం పెట్టుకోవటం 'నేను'ని ఆరాధించటమే. 'నేను' అనేది కూడా ఆలోచన రూపకల్పనే. ఆలోచన దేనితో వ్యాపకం పెట్టుకుంటే అదే అది. అది ఆలోచన తప్ప మరొకటి కానే కాదు. అందుచేత ఆలోచనా ప్రక్రియని అవగాహన చేసుకోవటం ముఖ్యం.

ఆలోచన సమస్యకి ప్రతిక్రియ, కాదా? సమస్య లేకుంటే ఆలోచన ఉండదు. సమస్య, ప్రతిక్రియ - వీటి ప్రక్రియే అనుభవం. అనుభవాన్ని మాటలలో రూపొందించటమే ఆలోచన. అనుభవం ఎప్పుడూ గతించినదే, కాని ప్రస్తుతంతో కలిసిన గతం. అది వ్యక్తంగానూ ఉంటుంది, నిగూఢంగానూ ఉంటుంది. ఈ అనుభవ శేషమే జ్ఞాపకం, ప్రభావం జ్ఞాపకం యొక్క, గతం యొక్క ప్రతిక్రియే ఆలోచన.

"ఆలోచన అంటే అంతేనా? జ్ఞాపకానికి ప్రతిక్రియగానే కాక ఆలోచనలో అంతకన్న ఎక్కువ ప్రగాఢమైనవి లేవా?"

ఆలోచన తన్నుతాను వివిధ స్థాయిల్లో పెట్టుకోగలదు, పెట్టుకుంటుంది - తెలివి తక్కువ అనీ, ప్రగాఢం అనీ, ఉన్నతమనీ, నీచమనీ. అయినా, అదంతా ఆలోచనే, కాదా? దేవుడి గురించి ఆలోచన మనస్సులోనిదే, మాటల్లోనిదే. దేవుడి గురించి ఆలోచన దేవుడు కాదు. అది జ్ఞాపకం యొక్క ప్రతిక్రియ మాత్రమే. జ్ఞాపకం చాలా కాలంపాటు ఉంటుంది. అందువల్ల అది ప్రగాఢమైనది అనిపించవచ్చు. కాని, స్వతస్సిద్ధంగా అది లోతైనది ఎన్నటికీ కాలేదు. జ్ఞాపకం దాగి ఉండవచ్చు, పైకి వెంటనే కనిపించకుండా. అంత మాత్రం చేత అది ప్రగాఢం కాదు. ఆలోచన ఎన్నటికీ ప్రగాఢం కాలేదు. అది ఉన్న దాని కన్న ఎక్కువ ఏమీ కాలేదు. ఆలోచన తనకు తాను ఎంతో విలువనిచ్చుకోవచ్చును, కాని అది ఆలోచనే. స్వయంకల్పితమైన దానితో మనస్సు వ్యాపకంపెట్టుకోవటం ఆలోచనకతీతంగా పోవటం కాదు. ఒక కొత్త పాత్ర వహిస్తుందంతే - ఒక కొత్తవేషం. వేషంలో ఉన్నది ఆలోచనే.

"అయితే, ఆలోచనకి ఎవరైనా అతీతంగా పోవటం ఎలా?"

అది కాదు ఆసలు విషయం. అవునా? ఆలోచనకి అతీతంగా ఎవరూ పోలేరు. ఆ "ఎవరు" అనే "ప్రయత్నం చేసేవాడు" ఆలోచన ఫలితమే. ఆలోచనా ప్రక్రియని అర్థం చేసుకోవటంతో, అంటే ఆత్మ జ్ఞానం ఉండటంతో ఉన్నస్థితి అనే సత్యం ఆలోచనా ప్రక్రియని అంతం చేస్తుంది. ఉన్నస్థితి అనే సత్యం ఏ పుస్తకాల్లోనూ ప్రాచీనమైనవిగాని, ఆధునికమైనవిగాని - వేటిలోనూ దొరకదు."

"అయితే సత్యాన్ని ఎలా కనుక్కోవటం?"

ఎవరూ కనుక్కోలేరు. సత్యాన్ని కనుక్కునేందుకు చేసే ప్రయత్నం స్వయం కల్పిత లక్ష్యాన్ని తెస్తుంది. ఫలితం విస్తృతమైన, కల్పితమైన ఆలోచన కొనసాగటమే. ఆలోచన అంతమైనప్పుడే సత్యం ఉంటుంది. బలవంతం మీదా, క్రమశిక్షణవల్లా, ఏవిధమైన ప్రతిఘటనవల్లా ఆలోచన అంతం కాదు. ఉన్నస్థితి చెప్పే కథని వింటూంటే దానంతట అదే విముక్తి పొందుతుంది. సత్యమే విముక్తి కలిగిస్తుంది - స్వేచ్ఛగా ఉండాలని చేసే ప్రయత్నం కాదు.