మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/కోరిక, సంఘర్షణ
67. కోరిక, సంఘర్షణ
వాళ్లంతా కలిసి ముచ్చట గొల్పుతున్నారు. అందులో చాలా మంది ఉత్సాహంగా వింటున్నారు. కొంతమంది ఖండించటం కోసమే వింటున్నారు. వినటం అనే కళ అంత సులభంగా రాదు. అందులో అందం ఉంటుంది. గొప్ప అవగాహన ఉంటుంది. మనలోని ఎన్నో లోతుల్లోంచి వింటాం. కాని, మనం వినటం ఎప్పుడూ అంతకు ముందు గ్రహించిన దానితోనూ, లేదా, ఒక ప్రత్యేక దృష్టితోనూ మాత్రమే. ఊరికే వినం. మధ్యలో ఎప్పుడూ మన సొంత ఆలోచనలూ, నిర్ణయాలూ, దురభిప్రాయాలూ తెరలా అడ్డు నిలుస్తాయి. మనం సంతోషంతో గాని, ప్రతిఘటిస్తూగాని, గ్రహిస్తూగాని, తిరస్కరిస్తూగాని వింటాం. కాని, వినటం ఉండదు. వినటానికి అంతరంగంలో నిశ్శబ్దం, సేకరణ భారంలేని స్వేచ్ఛ, విశ్రాంతితో కూడిన ధ్యానం ఉండాలి. ఈ మెలకువగా అనాసక్తంగా ఉండే స్థితిలో మాటల్లో నిర్ణయించటానికతీతమైన దాన్ని వినగలుగుతాం. మాటలు గందరగోళంగా ఉంటాయి. బయటికి తెలియజేయటానికి అదొక్కటే మార్గం. మాటల ధ్వనికి అతీతమైన సంపర్కం కలగటానికి వినటంలో మెలకువగానూ, అనాసక్తంగానూ ఉండాలి. ఇష్టం ఉన్నవాళ్లు వినొచ్చు. కాని, వినేవాళ్లు దొరకటం చాలా అరుదు. మనలో చాలా మంది ఫలితాల వెంట పడతారు; లక్ష్యాలు సాధిస్తూ, నిరంతరం తప్పించుకుంటూ, జయిస్తూ ఉంటారు. అందుకే వినటం ఉండదు. వింటున్నప్పుడే ఎవరికైనా మాటల్లోని పాట వినిపిస్తుంది.
"కోరిక నుంచి విముక్తి పొందటం సాధ్యమేనా? కోరిక లేకుండా జీవితం ఉంటుందా? కోరికే జీవితం కాదా? కోరిక నుంచి విముక్తి పొందాలనుకోవటం మరణాన్ని ఆహ్వానించటమే. కాదా?"
కోరిక అంటే ఏమిటి? దాని గురించి ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనం కోరుతున్నామని ఎప్పుడు అంటాం? కోరిక నిర్గుణంగా ఉండదు. దేనితోనైనా సంబంధం ఉన్నప్పుడే అది ఉంటుంది. సంపర్కంలో సంబంధంలో కోరిక పుడుతుంది. సంపర్కం లేకుండా కోరిక ఉండదు. సంపర్కం ఏ స్థాయిలోనైనా కావచ్చు. కాని, అది లేకుండా అనుభూతీ, ప్రతిక్రియా, కోరికా ఉండవు. కోరిక విధానం మనకి తెలుసు, అది ఎలా పుడుతుందోః గ్రహించటం, సంపర్కం, అనుభూతి, కోరిక. కాని, మనం కోరిక ఉందని ఎలా తెలుసుకుంటాం? నాకు కోరిక ఉంది అని నేనెప్పుడు అంటాను? సుఖంగాని, దుఃఖంగాని ఇబ్బంది కలిగించినప్పుడే. సంఘర్షణ గాని ఇబ్బందిగాని ఉన్నదని తెలుసుకున్నప్పుడే కోరికని గుర్తించటం జరుగుతుంది. సమస్యకి తగిన ప్రతిక్రియ లేకపోవటమే కోరిక. అందమైన కారుని చూడటంతోనే సుఖానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ ఇబ్బందే కోరికని తెలుసుకోవటం. ఇబ్బంది బాధ వల్ల కలిగినా, సుఖం వల్ల కలిగినా, దానిమీదే దృష్టి నిలపటం ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యమే కోరిక. సమస్యకి తగిన ప్రతిక్రియ లేకపోవటం వల్ల ఇబ్బంది కలిగినప్పుడు మనం చైతన్యంగా ఉంటాం. సంఘర్షణ అంటే ఆత్మ చైతన్యం. ఈ ఇబ్బంది నుంచీ, కోరిక యొక్క సంఘర్షణ నుంచీ విముక్తి సాధ్యమా?
"మీరనేది కోరిక యొక్క సంఘర్షణ నుంచి విముక్తి పొందటమా, లేక కోరిక నుంచేనా?"
సంఘర్షణ, కోరిక - రెండు వేరు వేరు స్థితులా? అయినట్లయితే, మన విచారణ భ్రమకి దారితీయక తప్పదు. సుఖంనుంచి గాని, బాధనుంచి గాని, కావాలనుకోవటంనుంచి గాని, ప్రయత్నించటంనుంచి గాని, నెరవేరటం నుంచి గాని, వ్యక్తంగా కాని, అవ్యక్తంగా కాని ఇబ్బంది లేనట్లయితే కోరిక ఉంటుందా? ఇబ్బంది తొలగించుకోవాలనుకుంటాం, కాదా? దీన్ని అర్థం చేసుకున్నట్లయితే కోరిక అర్ధాన్ని గ్రహించటానికి వీలవవచ్చు. సంఘర్షణ అంటే ఆత్మ చైతన్యం. ఇబ్బంది ద్వారా ధ్యానాన్ని కేంద్రీకరించటం కోరిక. ఇంతకీ మీరు కోరికలోని సంఘర్షణాంశాన్ని వదిలించుకుని సుఖప్రదమైన అంశాన్ని అట్టిపెట్టుకోవాలని అనుకుంటున్నారా? సుఖమూ, సంఘర్షణా, రెండూ ఇబ్బంది కలిగించేవే, కాదా? లేకపోతే, సుఖం ఇబ్బంది పెట్టదనుకుంటున్నారా?
"సుఖం ఇబ్బంది పెట్టదు"
అది నిజమేనా? మీరెప్పుడూ సుఖంలోని బాధని అనుభవించలేదా? సుఖం కావాలనే తపన అంతకంతకు హెచ్చి ఇంకా ఇంకా కావాలని కోరదా? ఇంకా కావలనే తపన కూడా, తప్పించుకోవాలని తొందర పడినట్లుగానే ఇబ్బంది కలిగించేది కాదా? రెండూ సంఘర్షణకి కారణమవుతాయి. మనం సుఖప్రదమైన కోరికని అట్టే పెట్టుకుని బాధాకరమైనదాన్ని తప్పించుకుంటాం. కాని, దగ్గర నుంచి పరీక్షగా చూసినట్లయితే, రెండూ ఇబ్బంది కలిగించేవే. కాని మీరు ఇబ్బంది నుంచి విముక్తి పొందాలనుకుంటారా?
"మనకి కోరికే లేకపోతే చచ్చిపోతం; సంఘర్షణే లేకపోతే నిద్రపోతాం."
మీరు అనుభవంతో మాట్లాడుతున్నారా, లేక కేవలం దాని గురించి ఊహించా? సంఘర్షణ అనేది లేకపోతే ఎలా ఉంటుంది అని మనం ఊహిస్తున్నాం. అందుకని సంఘర్షణ ఆగిపోయాక ఉండే స్థితిని అనుభవించ కుండా అడ్డుకుంటున్నాం. మన సమస్యకీ, సంఘర్షణకీ ఏది కారణం అని కదా? ఏదైనా అందమైన దానివల్లకాని, అనాకారివల్లగాని సంఘర్షణ కలగకుండా చూడలేమా? ఆత్మ చైతన్యం లేకుండా మనం గమనించలేమా, వినలేమా? ఇబ్బంది కలగకుండా జీవించలేమా? కోరిక లేకుండా జీవించలేమా? నిస్సంశయంగా, మనం ఇబ్బందిని అర్థం చేసుకోవాలి - దాన్ని తప్పించుకునేందుకుగాని, ఆకాశానికెత్తడానికి గాని ప్రయత్నించకుండా. సంఘర్షణని అర్థం చేసుకోవాలి, దాన్ని మహోన్నతం చేయటంగాని, అణచిపెట్టటంగాని కూడదు.
సంఘర్షణకి కారకమయేదేమిటి? సమస్యకి ప్రతిక్రియ తగినట్లు లేకపోతే సంఘర్షణ జనిస్తుంది. ఈ సంఘర్షణే ఆత్మ అనే చైతన్యం కేంద్రీకృతం కావటం. సంఘర్షణ ద్వారా ఆత్మ అనే చైతన్యం కేంద్రీకృతం కావటమే అనుభవం. సమస్యకిగాని, ప్రేరేపణకిగాని ఏర్పడే ప్రతిక్రియే అనుభవం. మాటల్లోపెట్టని, పేరు పెట్టని అనుభవం ఉండదు. పేరు పెట్టటం, జ్ఞాపకం అనే సామానుగది లోంచి - ఈ పేరు పెట్టటం అంటే - మాటల్లో రూపొందించే పద్ధతి. సంకేతాలు చెయ్యటం, ఊహా చిత్రాలు, మాటలు - వీటితో జ్ఞాపకాన్ని శక్తి సంపన్నం చేయటం. చైతన్యం, సంఘర్షణ ద్వారా ఆత్మని కేంద్రీకరించటం - ఇదే అనుభవం, పేరుపెట్టటం, పదిలపరచటం కలిసిన పూర్తి ప్రక్రియ.
"ఈ ప్రక్రియలో సంఘర్షణని రేపేదేమిటి? సంఘర్షణ నుంచి విముక్తి కాగలమా? సంఘర్షణకు ఆవల ఉన్నదేమిటి?"
పేరుపెట్టటమే సంఘర్షణకు దారితీస్తుంది. కాదా? ఏ సమస్యనైనా, ఏ స్థాయిలోనైనా, దాన్ని మీరు ఒక గతానుభూతితో ఒక ఊహతో ఒక నిర్ణయంతో, ఒక దురభిప్రాయంతో సమీపిస్తారు. అంటే, అ అనుభవానికి ఒక పేరు పెడుతున్నారు. ఈ పేరు పెట్టటం అనుభవానికి ఒక లక్షణాన్ని ఇస్తుంది. పేరు పెట్టటంలోంచే లక్షణం వస్తుంది. పేరు పెట్టటం అంటే జ్ఞాపకంగా దాచుకోవటం. గతం కొత్తదాన్ని కలుసుకుంటుంది. సమస్యని జ్ఞాపకం, అంటే గతం కలుస్తుంది. గతం యొక్క ప్రతిక్రియ సజీవమైన కొత్త సమస్యని అర్థం చేసుకోలేదు. గతం యొక్క ప్రతిక్రియలు సరిపోవు. దీంతో సంఘర్షణ ఉద్భవిస్తుంది. అదే ఆత్మ చైతన్యం. పేరు పెట్టటం అనేది లేనప్పుడు సంఘర్షణ ఆగిపోతుంది. ప్రతిక్రియతో బాటు పేరు పెట్టటం ఒకేసారి మీలో ఎలా జరుగుతుందో మిమ్మల్ని మీరు పరీక్షగా గమనించుకోండి. ప్రతిక్రియకీ, పేరు పెట్టటానికీ మధ్యనుండే విరామమే అనుభవించటం. అనుభవించేది గాని, అనుభవంగాని లేకుండా అనుభవించటం సంఘర్షణకి అతీతమైనది. సంఘర్షణ అంటే ఆత్మ కేంద్రీకరణం. సంఘర్షణ ఆగిపోవటంతో ఆలోచనలన్నీ అంతమవుతాయి. అనంతమైనది ఆరంభమవుతుంది.