మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ప్రయోజనం లేని చర్య

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

68. ప్రయోజనం లేని చర్య

ఆయన ఎన్నో వివిధ రకాల సంస్థల్లో ఉన్నాడు. అన్నిటిలోనూ చురుకుగా పనిచేశాడు. ఆయన రచించాడు, ప్రసంగించాడు, డబ్బుపోగు చేశాడు, సంస్థలను నడిపాడు. ఆయన శక్తిమంతంగా, పట్టుదలగా, సమర్ధవంతంగా ఉంటాడు. ఆయన చాలా ఉపయోగకరమైనవాడు. ఆయన అవసరం అందరికీ ఉంటుంది. ఎప్పుడూ దేశంలో ఇటూ అటూ తిరుగుతూ ఉంటాడు. ఆయన రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, జైలుకి వెళ్లాడు, నాయకులను అనుసరించాడు. ఇప్పుడు ఆయన కూడా తనుచేసే పనిలో ముఖ్యమైన వ్యక్తే. గొప్ప ప్రణాళికలను వెంటనే అమలు చెయ్యాలని ఆయనకీ ఉంది. తక్కిన విద్యావంతుల్లాగే ఆయన కూడా వేదాంతం గురించి చదివాడు. ఆయనది ఆచరించాలనే తత్త్వమట - ఆలోచించటం కాదుట. సంస్కృతంలో ఒక వాక్యం చెప్పాడు మొత్తం ఆచరణ తత్త్వాన్ని గురించి తెలియజేయటానికి. తను ఆచరణలొ పెట్టాలనుకునే రకం మనిషిని అని ఉద్ఘాటించటంలో, జీవితానికి అవసరమైన ముఖ్యమైన వాటిల్లో తానొకడినని - వ్యక్తిగతంగా కాకపోయినా, ఆ రకం వాడినని చెప్పినట్లు అర్థం స్ఫురించింది. తన్నుతాను ప్రత్యేకించుకోవటంతో తన్నుతాను అవగాహన చేసుకోకుండా ఆటంకం ఏర్పరచుకున్నాడు.

ఏదో ఒక వర్గానికి చెందినట్లు చీటీ తగిలించుకుంటే తృప్తిగా ఉన్నట్లుంటుంది. మనం చెందుతామనుకున్న వర్గాన్ని స్వీకరించినట్లయితే జీవితానికొక సంతృప్తికరమైన తాత్పర్యం చెప్పినట్లవుతుంది. మనం మాటల్నీ పేరున్న చీటీని ఆరాధిస్తాం. ఆ సంకేతం యొక్క విలువని అర్థం చేసుకోవటానికి సంకేతానికి అతీతంగా ఎప్పుడూ వెళ్లం. మనం ఇదనీ, అదనీ చెప్పుకుంటూ ఇంకే ఇబ్బందీ కలుగకుండా స్థిరపడిపోతాం. ఈ సిద్ధాంతాలూ, మతాలూ ఇచ్చే శాపం ఏమిటంటే సౌఖ్యం, అవి అందించే భయంకరమైన తృప్తీ. మనల్ని అవి నిద్రపుచ్చుతాయి. ఆ నిద్రలో కలగంటాం. ఆ కలయే ఆచరణ అవుతుంది. ఎంత సులభంగా మన దృష్టి మరోవైపుకి మరలి పోతుంది! మనలో చాలామంది కోరేది ఇతర ఆకర్షణల్లో పడాలనే. నిరంతర సంఘర్షణతో అలిసిపోయిన మనకి ఇతర ఆకర్షణలు అవసరమవుతాయి. ఉన్న స్థితి కన్న అవే ముఖ్యమైపోతాయి. ఇతర ఆకర్షణలతో ఆటలాడవచ్చు. ఉన్నస్థితితో కాదు. ఇతర ఆకర్షణలు, భ్రమలు, వాటివల్ల కలిగే ఆనందం వికటమైనది.

"ఆచరణ అంటే ఏమిటి? ఆచరణ క్రమం అంటే ఏమిటి? మనం ఎందుకు ఆచరిస్తాం? కేవలం కార్యకలాపం, కార్యనిర్వహణా కాదు నిశ్చయంగా. ఏదో వ్యాపకంతో ఉండటం ఆచరణ కాదు, అవునా? గృహిణి తీరిక లేకుండా ఉంటుంది. అది ఆచరణేనా?"

"కాదు, నిశ్చయంగా కాదు. ఆమె దైనందిన కార్యక్రమం గురించే ఆలోచిస్తుంది. అవి చిన్న గొడవలు. కార్యనిర్వహణ చేసే మనిషికి పెద్ద సమస్యలతో, బాధ్యతలతో వ్యాపకం ఉంటుంది. పెద్ద సమస్యలతో, లోతైన సమస్యలతో వ్యవహరించటాన్ని కార్యనిర్వహణ, ఆచరణ అనొచ్చు - రాజకీయాల్లోనే గాక ఆధ్యాత్మికంగా కూడా. దానికి స్తోమతా, సమర్థతా, సక్రమ కృషీ, దీక్షతో ఒక లక్ష్యం కోసం పని చెయ్యటం అవసరం. అటువంటి మనిషి చింతనాపరుడూ, ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడూ, యోగీ కాడు, అతడు కార్యాచరణ పరుడు."

పెద్ద పెద్ద సమస్యలతో వ్యాపకం ఉండటం కార్యాచరణ అంటారు మీరు. పెద్ద సమస్యలు అంటే ఏమిటి? దైనందిన జీవితం కాక వేరేగా ఉన్నాయా అవి? మొత్తం జీవిత ప్రక్రియతో సంబంధించకుండా కార్యాచరణ వేరుగా ఉంటుందా? అనేక అంతస్తుల్లో ఉన్న జీవితాన్ని సమైక్యం చేయకుండా కార్యాచరణ అవుతుందా? అవగాహన చేసుకోకుండా, సమస్త జీవన ప్రక్రియనీ సమైక్యం చేయకుండా జరిగే కార్యాచరణ కేవలం వినాశకరమైన కార్యకలాపం అవదూ? మనిషి సమగ్ర ప్రక్రియ. ఈ సమగ్రతలోనుంచే చర్య జరగాలి.

"అయితే దాని అర్థం చర్య తీసుకోకపోవటమే - ఎప్పుడో చెయ్యవచ్చు లెమ్మని ఊరుకోవటమే. చర్య తీసుకోవటం అత్యవసరం. దాని గురించి వేదాంతం చెబితే ప్రయోజనం లేదు."

మనం వేదాంతం చెబుతున్నామా? మీరు కార్యాచరణ అనుకుంటున్నది చెప్పలేనంత హాని కలిగించటం లేదా అనుకుంటున్నాం అంతే. పరివర్తన చేసినదాన్ని మళ్లీ ఎప్పుడూ పరివర్తన చెయ్యవలసి వస్తుంది. కొంత వరకు చర్య తీసుకోవటం సంపూర్ణ చర్యకాదు. అది వినాశానికే హేతువవుతుంది. మీకు ఓపిక ఉన్నట్లయితే, ఇప్పుడే, ముందెప్పుడోకాదు, సమగ్రమైన, సమైక్యమైన చర్య ఏమిటో గ్రహించవచ్చు.

ఒక ఉద్దేశంతో చేసేపని చర్య అవగలదా? ఒక ఉద్దేశం, ఒక ఆదర్శం ఉండటం, దాని కోసం పని చెయ్యటం చర్య అవుతుందా? చర్య ఒక ఫలితం కోసం చేస్తే అది చర్య అవుతుందా?
"మరి ఏ విధంగా చర్య తీసుకుంటారు?"

ఒక ఫలితం ఉన్నదాన్ని, ఒక లక్ష్యంతో ఉన్న దాన్ని మీరు చర్య అంటున్నారు, కాదా? లక్ష్యాన్ని గురించి ముందుగానే ఆలోచించుకుంటారు. మీకో ఊహ, ఒక నమ్మకం ఉంటుంది. దానికోసం పనిచేస్తారు. యథార్ధమైనది గాని, మానసికమైనది గాని, ఒక వస్తువు కోసం, ఒక గమ్యం కోసం, ఒక లక్ష్యం కోసం పని చేయటాన్ని చర్య అంటారు సాధారణంగా. భౌతికంగా వాస్తవమైనదాన్ని, ఒక వంతెన కట్టడం లాంటి దాని సందర్భంలో ఈ పద్ధతిని అర్థం చేసుకోవచ్చు. కాని, మానసిక ప్రయోజనాల సందర్భంలో ఇది సులభంగా అర్థం అవుతుందా? మనం మాట్లాడేది మానసిక ప్రయోజనం, సిద్ధాంతం, ఆదర్శం, లేదా నమ్మకం - వీటి కోసం పని చెయ్యటం గురించి. ఈ మానసిక ప్రయోజనం కోసం పనిచెయ్యటాన్ని కూడా చర్య అనే అంటారా?

"ప్రయోజనం లేని చర్య చర్యేకాదు. అది మరణం. జడత్వం, మరణం."

జడత్వం చర్య తీసుకోవటానికి వ్యతిరేకమైనది కాదు. అది వేరే స్థితి. ఈ క్షణానికి అది అప్రస్తుతం. దాన్ని గురించి మనం తరవాత చర్చించుకోవచ్చు. అసలు సంగతికి వద్దాం. ఒక లక్ష్యం కోసం, ఒక ఆదర్శం కోసం పనిచేయటాన్ని చర్య అంటున్నారు సాధారణంగా, కాదా? ఆ ఆదర్శం ఎలా వస్తోంది? ఉన్నస్థితి వేరు, అది పూర్తిగా వేరునా? సిద్ధాంతం వేరు, దాని మీమాంస పూర్తిగా వేరునా? హింస వేరు, అహింస పూర్తిగా వేరూనా? ఆదర్శం స్వయంకల్పితం కాదా? స్వయంగా సృష్టించుకున్నది కాదా? ఒక ప్రయోజనం కోసం, ఆదర్శం కోసం చర్య తీసుకోవటంతో స్వయం కల్పితమైన దాని కోసం మీరు ప్రయత్నిస్తున్నారు, కాదా?

"ఆదర్శం స్వయం కల్పితమా?"

మీరు దీనిలా ఉన్నారు, మీరు దానిలా అవాలనుకుంటారు. దానిలా అనేది మీ ఆలోచనా ఫలితమే కదా. అది మీ సొంత ఆలోచన నుంచి రాకపోవచ్చు. కాని ఆలోచన నుంచి వచ్చినదే కదా. ఆలోచన ఆదర్శానికి రూపకల్పన చేస్తుంది. ఆదర్శం ఆలోచనలో భాగమే. ఆదర్శం ఆలోచన కతీతమైనది కాదు. అది ఆలోచనే.

"ఆలోచించటంలో దోషం ఏముంది? ఆలోచన ఆదర్శాన్ని ఎందుకు సృష్టించకూడదు?"

మీరు దీనిలా ఉన్నారు. అది మీకు సంతృప్తినివ్వటం లేదు. అందుచేత మీరు దానిలా ఉండాలనుకుంటారు. ఇలా ఉన్నదాన్ని అర్థం చేసుకున్నట్లయితే అలా అనేది ఉద్భవిస్తుందా? మీరు దీన్ని అర్థం చేసుకోరు, అందుచేత దాన్ని సృష్టించారు - దాని ద్వారా దీన్ని అర్థం చేసుకోవటానికి గాని, దీన్ని తప్పించుకోవటానికి గాని. ఆలోచన ఆదర్శాన్ని, సమస్యనీ కూడా సృష్టిస్తుంది. ఆదర్శం స్వయం కల్పితం. ఆ స్వయం కల్పితమైన దాని కోసం పని చెయ్యటాన్ని చర్య అంటున్నారు - ఒక ప్రయోజనం ఉన్న చర్య. అందువల్ల మీ చర్య మీరు కల్పించిన దాని హద్దులోనే ఉంటుంది - అది దేవుడైనా, ప్రభుత్వమైనా. మీ హద్దులోనే మీరు కదుల్తూ ఉంటే కార్యకలాపం కుక్క తన తోకని తరిమినట్లుంటుంది. అది చర్యేనా?

"కాని, ప్రయోజనం లేకుండా చర్య తీసుకోవటం సాధ్యమేనా?"

నిశ్చయంగా. ప్రయోజనంతో చేసే చర్యలోని నిజాన్ని మీరు గ్రహించినట్లయితే చర్య మాత్రమే జరుగుతుంది. అటువంటి చర్యే కార్య సాధకమైన చర్య. అదొక్కటే మూల పరివర్తన.

"అంటే మీరనేది ఆత్మకు వర్తించని చర్య, కాదా?"

అవును, భావం లేని చర్య. భావమే ఆత్మ - అది భగవంతుడితో ఐక్యం అయినా, ప్రభుత్వంతో ఐక్యం అయినా. ఆ విధంగా ఐక్యం చేసుకున్న చర్య మరింత సంఘర్షణనీ, గందర గోళాన్నీ, దుఃఖాన్నీ కలిగిస్తుందంతే. కాని కార్యాచరణపరుడు అనుకునే మనిషికి భావాన్ని తొలగించటం కష్టం. ఏదో సిద్ధాంతం లేకపోతే తప్పిపోయినట్లు భావిస్తాడు. తప్పిపోతాడు. అందుచేత అతడు కార్యాచరణ పరుడు కాడు - తన గొప్పలు ప్రదర్శించే, కార్యకలాపాల్లో చిక్కుకున్న మనిషి అతడు. అతని కార్యకలాపాలు విభేదానికీ, వినాశానికీ, దోహదం చేస్తాయి.

"అయితే, ఎవరైనా ఏం చెయ్యాలి?"

మీ కార్యకలాపం ఏమిటో అర్థం చేసుకోండి. అప్పుడే కార్యాచరణ జరుగుతుంది.