మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/కారణం, ఫలితం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

69. కారణం, ఫలితం

"మీరు ఎందరినో బాగు చేశారని నేనెరుగుదును. నా కొడుకుని కూడా బాగుచేయరా?" అన్నాడాయన. "వాడు దాదాపు గుడ్డివాడు. కొంత మంది డాక్టర్లను సంప్రదించాను. వాళ్లేమీ చెయ్యలేరు. యూరప్ గాని, అమెరికా గాని తీసుకువెళ్లాలని సలహా ఇచ్చారు. నేను డబ్బున్నవాణ్ణి కాదు. నాకంత స్తోమత లేదు. మీరేమైనా చెయ్యరా? వాడు నాకున్న ఒక్కడే కొడుకు. నా భార్య గుండె పగిలిపోతుంది."

ఆయన ఒక చిన్న ఉద్యోగి. బీదవాడేగాని, చదువుకున్నవాడు. ఆయన బోటి వాళ్లలాగే ఆయనక్కూడా సంస్కృతం, సంస్కృత సాహిత్యం తెలుసును. అది ఆ కుర్రవాడి కర్మ, వాళ్ల కర్మ అనీ, దాన్ని అనుభవించి తీరాలి అనీ మధ్య మధ్య అంటూనే ఉన్నాడు. ఈ శిక్ష అనుభవించటానికి తాము ఏం చేశారని? అంత బాధ అనుభవించటానికి ఏం పాపం చేశారు - తమ పూర్వ జన్మలోగాని, ఇంతవరకు ఈ జన్మలోగాని? ఈ ఘోర విపత్తు రావటానికి కారణం పూర్వ కర్మలో ఏదో ఉండే ఉంటుంది.

ఈ గుడ్డితనం రావటానికి ఏదో ముఖ్య కారణం ఉండే ఉంటుంది. డాక్టర్లు ఇంకా తెలుసుకోలేక పోయారు. వారసత్వం నుంచి వచ్చినది కావచ్చు. డాక్టర్లు శారీరక కారణాన్ని కనుక్కోలేక పోయినంత మాత్రాన మీరు ఎప్పుడో గతంలో ఉండి ఉంటుందని ఊహించటానికి ప్రయత్నిస్తారెందుకు?

"కారణం తెలుసుకోవటానికి ప్రయత్నించినట్లయితే ఫలితాన్ని అర్థం చేసుకోవటానికి ఎక్కువ వీలవవచ్చు."

కారణం తెలుసుకున్నంత మాత్రాన దేన్నైనా అర్థం చేసుకుంటారా? ఎందుకు భయపడుతున్నారో తెలుసుకున్నంత మాత్రాన భయం పోతుందా? కారణం తెలిసి ఉండొచ్చు. కాని, అంతమాత్రం చేతనే అవగాహన కలుగుతుందా? కారణం తెలిస్తే ఫలితాన్ని అర్థం చేసుకోగలుగుతానని మీరు అనటంలో అర్థం ఇది దేనివల్ల వచ్చిందో తెలుసుకుని తృప్తిపొందుదామనుకుంటున్నారు, కాదా? "నిశ్చయంగా. అందుకే పూర్వం ఏ కర్మ చేయటం వల్ల ఈ అంధత్వం ప్రాప్తించిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని వల్ల ఎంతో తృప్తి కలుగుతుంది."

అందువల్ల మీకు కావలసినది తృప్తి; అవగాహన కాదు.

"రెండూ ఒకటే కాదా? అర్థం చేసుకోవటమంటే తృప్తి పొందటమే. అవగాహన వల్ల ఉపయోగం ఏముంది అందులో ఆనందం ఏకపోతే?"

యథార్ధాన్ని అవగాహన చేసుకోవటం వల్ల ఇబ్బంది కలగొచ్చు, ఆనందమే కలగాలని లేదు. మీ అబ్బాయికి రోగం వచ్చిందన్న యథార్థం మీకు బాధ కలిగించింది. మీకు ఓదార్పు కావాలి. ఓదార్పునే మీరు అవగాహన అంటున్నారు. మీరు బయలుదేరింది అవగాహన చేసుకోవటానికి కాదు; ఓదార్పు పొందటానికి. మీ బాధకి ఉపశమనం కలిగించుకోవటమే మీ ఉద్దేశం. దీన్నే మీరు కారణం కోసం అన్వేషించటం అంటున్నారు. మీకు కావలసినదల్లా మిమ్మల్ని నిద్రపుచ్చే మార్గం, మీకు ఇబ్బంది లేకుండా ఉండే మార్గం - దానికోసమే ప్రయత్నిస్తున్నారు. మనల్ని మనం అనేక విధాలుగా నిద్రపుచ్చుకుంటాం - దేవుడనీ, పూజలనీ, ఆదర్శాలనీ, తాగుడు అనీ, ఈ రకంగా. ఇబ్బంది నుంచి తప్పించుకోవాలనుకుంటాం. తప్పించుకునే మార్గాల్లో ఈ కారణం కోసం వెతకటం ఒకటి.

"ఇబ్బంది లేకుండా స్వచ్ఛగా ఉండాలని ఎందుకు ప్రయత్నించకూడదు? బాధని ఎందుకు తప్పించుకోకూడదు?"

తప్పించుకోవటం వల్ల బాధ నుంచి విముక్తి కలుగుతుందా? ఏదో అసహ్యకరమైనదో, ఏ భయంకరమైనదో కనిపించకుండా తలుపు మూసేసుకోవచ్చు. కాని అది తలుపు అవతలే ఉంటుంది, కాదా? అణచివేసిన దాన్నీ, ప్రతిఘటించిన దాన్నీ అర్థం చేసుకోలేము, అవునా? మీ బిడ్డని అణచి ఉంచొచ్చు, క్రమశిక్షణలో పెట్టొచ్చు, కాని, నిజానికి దానివల్ల, మీ బిడ్డని మీరు అర్థం చేసుకోవటం మాత్రం కుదరదు. ఇబ్బంది వల్ల కలిగే బాధని తప్పించుకోవటానికి మీరు కారణాన్ని వెతుకుతున్నారు. ఆ ఉద్దేశంతో వెతికితే మీకు కావలసినదే మీకు దొరకుతుంది. బాధ ఏ విధంగా కలుగుతుందో, అడుగ డుగునా తెలుసుకుని, దాని మొత్తం నిర్మాణక్రమాన్ని గుర్తిస్తే బాధనుంచి విముక్తి పొందటానికి అవకాశం ఉంటుంది. బాధని తప్పించుకోవటం దాన్ని శక్తిమంతం చేయటానికే. కారణాన్ని వివరించటం వల్ల బాధనుంచి విముక్తి లభించదు. బాధ అలాగే ఉంటుంది. మాటలతో, నిర్ణయాలతో - మీవిగాని, ఇతరులవి గాని, దాన్ని కప్పి ఉంచుతారంతే. కారణాలను తెలుసుకోవటం వివేకం పొందటం కాదు. కారణాలు వివరించటం ఆగిపోయినప్పుడే వివేకం కలగటానికి అవకాశం ఉంటుంది. ఎంతో ఆత్రుతతో వెతుకుతున్న కారణాలు మిమ్మల్ని నిద్రపుచ్చేవి మీకు దొరుకుతాయి. కాని, కారణం సత్యంకాదు. ఏ విధమైన నిర్ణయాలూ, కారణాలూ, మాటలూ లేకుండా గమనించినప్పుడు సత్యం తెలుస్తుంది. గమనించేది మాటలతో తయారవుతుంది. కారణాలూ, నిర్ణయాలూ, ఖండనలూ, సమర్థనలూ మొదలైన వాటితో తయారవుతుంది 'నేను'. గమనించేది లేనప్పుడే గమనించబడే దానితో సంపర్కం ఏర్పడుతుంది అప్పుడే అవగాహన కలుగుతుంది. సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

"ఇది గ్రహించాననుకుంటాను. కాని, కర్మ అనేదే లేదంటారా?"

మీరనే అ మాటకి అర్థం ఏమిటి?

"ప్రస్తుత పరిస్థితులు - పూర్వం, అంటే, అంతకుముందే గాని, చాలాకాలం క్రిందటగాని చేసిన కార్యాలకు ఫలితం. ఆ కారణం, ఫలితం అనే ప్రక్రియ ఎన్ని విధాలుగా ఉంటుందో అదే కర్మ అంటే" అని చెప్పాడాయన.

ఇది వివరణ మాత్రమే. ఈ మాటలన్నీ దాటి వెడదాం. ఒక నిర్ణీత ఫలితానికి ఒక నిర్ణీత కారణం ఉంటుందా? కారణం, ఫలితం నిశ్చితమైతే అది మరణం కాదా? స్థిరంగా, కదల్చటానికి వీల్లేకుండా, విశిష్టంగా ఉన్నది. మరణించి తీరుతుంది. విశిష్ట జంతువులు త్వరలోనే అంతమొందుతాయి. కాదా? మనిషి విశిష్టత లేనివాడు. అందుచేత అతడి జీవనం కొనసాగే అవకాశం ఉంది. ఎలా పడితే అలా మలచటానికి వీలయేది చాలా కాలం ఉంటుంది. మెత్తగా లేనిది విరిగిపోతుంది. సింధూరం నుంచి సింధూర వృక్షం కాక మరొకటి రాలేదు. కారణం, ఫలితం సింధూరమే. కాని, మనిషి అంతగా పూర్తిగా అన్ని వైపులా మూసుకుని, ప్రత్యేక విశిష్టతతో ఉండడు. అందువల్ల తన్ను తాను అనేక విధాల నాశనం చేసుకోకుండా ఉంటే అతడు జీవించి ఉంటాడు. కారణం, ఫలితం నిశ్చితమైనవీ, స్థిరమైనవీనా? కారణం, ఫలితం - అని విడిగా అనటం రెండూ స్థిరంగా ఉండేవనా? కారణం ఎప్పుడైనా స్థిరంగా ఉంటుందా? ఫలితం మార్చటానికి వీల్లేనట్లుగా ఉంటుందా? కారణం, ఫలితం, నిజానికి ఒకటి తరవాత ఒకటి సాగుతూ ఉండే ప్రక్రియ కాదా? ఈ రోజు నిన్నటి ఫలితం. రేపు ఈనాటి ఫలితం. ఇది వరకు కారణంగా ఉన్నది ఫలితం అవుతుంది. ఫలితంగా ఉన్నది కారణం అవుతుంది ఇది గొలుసులా జరిగే ప్రక్రియ కాదా? ఒకటి ఇంకో దానిలోకి ప్రవహిస్తుంది. ఎక్కడా ఆగదు. అదొక నిత్యచలనం - స్థిరపడటం అనేది లేకుండా, కారణం - ఫలితం - కారణం అనే చలనానికి అనేక అంశాలు చేస్తాయి.

వివరణలూ, నిర్ణయాలూ స్థిరమైనవి - అవి దక్షిణ పక్షానివైనా, వామ పక్షానివైనా, మతం అనబడే వ్యవస్థగా మారిన నమ్మకమైనా. సజీవంగా ఉన్నదాన్ని కారణాలతో మీరు కప్పిపెట్టటానికి ప్రయత్నిస్తే సజీవమైనది మరణిస్తుంది. మనం చాలా మటుకు కోరేది అదే. మాటలతో, ఊహలతో, ఆలోచనతో మనల్ని నిద్రపుచ్చుకోవాలనుకుంటాం. సహేతుకంగా సమర్థించటం, ఇబ్బందిగా ఉన్న స్థితిని శాంతపరిచేందుకు మరోమార్గం మాత్రమే. నిద్రవచ్చేట్టు చెయ్యాలనీ, కారణాన్ని వెతకాలనీ, నిర్ణయాల కోసం ప్రయత్నించాలనీ కోరటం వల్ల మళ్లీ ఇబ్బంది కలుగుతుంది. దాంతో ఆలోచన తాను అల్లుకున్న వలలోతానే చిక్కుకుంటుంది. తన్ను తాను స్వేచ్ఛగా చేసుకోలేదు. ఆలోచన అనుభవ ఫలితం. అనుభవం ఎప్పుడూ ప్రభావం కలిగించేదే. అనుభవం సత్యానికి కొలమానం కాదు. అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవటమే సత్యంలో ఉండే స్వేచ్ఛ.