మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/మందకొడితనం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

70. మందకొడితనం

రైలు బయలుదేరేటప్పటికి ఇంకా వెలుగుంది. నీడలు మాత్రం పొడుగవుతున్నాయి. ఊరూ రైలు మార్గాన్ని చుట్టుకుని ఉంది. రైలు వెడుతూంటే చూడటానికి జనం బయటికొచ్చారు. ప్రయాణికులు వాళ్ల స్నేహితులకేసి చేతులూపుతున్నారు. పెద్ద రొద చేస్తూ వంతెనని దాటడం మొదలుపెట్టాం. విశాలంగా వంపుతిరిగిన నదిమీద ఉన్న వంతెన అది. ఆ జాగాలో నది కొన్ని మైళ్ల వెడల్పున ఉంది. అవతలి ఒడ్డు మసక వెలుతురులో కొద్దిగా కనిపిస్తోంది. రైలు వంతెన కున్న కడ్డీలను లెక్క పెడితే యాభైఎనిమిది ఉన్నాయి రెండు తీరాలకీ మధ్య. ఆ నీళ్లు ఎంత అందంగా ఉన్నాయి. నిశ్శబ్దంగా, నిండుగా, లోతుగా ప్రవహిస్తూ! ఇసుక తిప్పలు దూరం నుంచి హాయిగా చల్లగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. పట్టణమూ, దాని చప్పుళ్లూ దుమ్మూ, మురికీ వెనక వదిలేసి, స్వచ్ఛమైన సాయంకాలపు గాలి కిటికీల్లోంచి వస్తోంది. కాని, పొడుగాటి ఆ వంతెన దాటగానే మళ్లీ దుమ్ముంటుంది.

క్రింద పక్కమీద ఉన్నాయన తెగమాట్లాడుతున్నాడు. మేము ఇంకా రాత్రంతా గడపాలి కాబట్టి ప్రశ్నలడిగే హక్కు తనకుందనుకున్నాడు. బాగా ఒడ్డూ పొడుగ్గా ఉన్నాడు. పెద్ద పెద్ద చేతులూ, పాదాలతో. తన గురించీ, తన జీవితం, తన సమస్యలూ, తన పిల్లల గురించీ, మాట్లాడటం మొదలు పెట్టాడు. భారతదేశం కూడా అమెరికాలాగే అభివృద్ధి పొందాలన్నాడు, ఈ జనాభా పెరుగుదలని అదుపులో ఉంచాలన్నాడు; ప్రజలు తమ బాధ్యతను తెలుసుకునేట్లు చెయ్యాలన్నాడు. రాజకీయ పరిస్థితి గురించీ, యుద్ధం గురించీ మాట్లాడి, తను చేసిన ప్రయాణాల గురించి చెప్పటంతో ముగించాడు.

మనం ఎంతగా సున్నితత్వం లేకుండా, చురుకుతనం లేకుండా, తగినంత ప్రతిక్రియ లేకుండా ఉంటాం - గమనించటానికి ఎంతగా స్వేచ్ఛ లేకుండా ఉంటాం! సున్నితత్వం లేకుండా మృదుత్వం ఎలా ఉంటుంది. చురుకుగా గ్రహించటం ఎలా ఉంటుంది. గ్రహణ శక్తి ఎలా ఉండగలదు. శ్రమలేని అవగాహన ఎలా సాధ్యం? శ్రమ పడటమే అవగాహన కాకుండా ఆటంకం కలిగిస్తుంది. ఎంతో సున్నితత్వం ఉన్నప్పుడే అవగాహన కలుగుతుంది. కాని, సున్నితత్వం అలవరచుకుంటే వచ్చేది కాదు. అలవరచుకున్నది అసహజ లక్షణమే, కృత్రిమంగా ఉన్న పై మెరుగే. ఈ పైపూత సున్నితత్వం కాదు. సున్నితత్వం సంస్కృతి ఫలితం కాదు. ప్రభావ ఫలితం కాదు. సున్నితంగా. విశాల హృదయంతో ఉండే స్థితి అది. బాహాటంగా ఉన్నదే లోనున్నది, తెలియనిది, అభేద్యమైనది. కాని, మనం సున్నితంగా ఉండకుండా జాగ్రత్త పడతాం. అది ఎంతో బాధాకరంగా, ఖండితంగా ఉంటుంది. నిత్యం సర్దుకు పోవల్సిన అగత్యం - అంటే, గమనించవలసిన అగత్యం ఉంటుంది. గమనించటం అంటే జాగ్రత్తగా వీక్షించటం, ఇందుకు బదులు మనల్ని ఓదార్చాలనీ, నిద్రపుచ్చాలనీ, మందకొడిగా చెయ్యాలనీ అనుకుంటాం. వార్తాపత్రికలూ, సచిత్రపత్రికలూ, పుస్తకాలూ చదవటానికి అలవాటు పడిపోవటంతో, వాటి ప్రభావానికి మందకొడితనం ఏర్పడుతుంది. తాగటం, పూజ చేయటం లాగే చదవటం కూడా తప్పించుకునేందుకొక బ్రహ్మాండమైన మార్గం - జీవితంలోని బాధనుంచి తప్పించుకోవాలనుకుంటాం. దానికి మందకొడితనం బాగా పనిచేసే మార్గం; సమర్ధనల మూలంగా, ఎవరో ఒక నాయకుణ్ణి అనుసరించటం మూలంగా, ఒక ఆదర్శం మూలంగా, ఏదో సాధించిన దానితోగాని, పేరుతోగాని, లక్ష్యంతోగాని ఐక్యం చెందటం మూలాన్ని ఏర్పడిన మందకొడితనం అది. మనలో చాలామంది అలా మందకొడిగా అవాలనే కోరుతారు. అలవాటైనది మనస్సుని నిద్రపుచ్చుతుంది. అలవాటైన క్రమశిక్షణా, సాధనా, ఏదో అవాలని నిలకడగా చేసే ప్రయత్నం - ఇవన్నీ సున్నితత్వాన్ని పోగొట్టే గౌరవనీయమైన మార్గాలు.

"సున్నితంగా ఉంటే జీవితంలో ఏం సాధించగలరు? ముడుచుకు పోయి, వాడిపోతాం. ప్రయోజనకరమైన కార్యమే ఉండదు."

మందకొడిగా, సున్నితత్వం లేకుండా ఉన్నవాళ్లు ప్రపంచానికేం చేస్తున్నారు? వాళ్లు చేసే కార్యం ఏవిధంగా "ప్రయోజనకరం? "యుద్ధాలూ, లోపలా బయటా కూడ గందరగోళం, నిర్దాక్షిణ్యతా, తమకీ ప్రపంచానికీ కూడా అధికమవుతూన్న దుఃఖం. జాగ్రత్తగా వీక్షించకుండా ఉండేవారి చర్య విధ్వంసానికీ, భౌతికరక్షణ లేకపోవటానికీ, వినాశానికీ దారితీయక తప్పదు. కాని, సున్నితత్వం సులభంగా రాదు. సామాన్యమైన దాన్ని అర్థం చేసుకోవటమే సున్నితత్వం. అది చాలా క్లిష్టమైనది. అది వెనక్కి తప్పుకోవటం, ముడుచుకు పోవటం, ప్రత్యేకంగా వేరవటం కాదు. సున్నితత్వంతో ప్రవర్తించడమంటే ప్రవర్తించేవాడి సమస్త ప్రక్రియనీ తెలుసుకుంటూ ఉండటం.

"నా గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. ఈలోగా నా వ్యాపారం సర్వనాశనమవుతుంది. నా కుటుంబం తిండిలేక మాడుతారు."

మీ కుటుంబ తిండిలేక మాడదు. మీరు తగినంత డబ్బు కూడబెట్టక పోయినా వారికి తిండి పెట్టే ఏర్పాటు చేయటం ఎప్పుడూ సాధ్యమవుతుంది. మీ వ్యాపారం నిస్సంశయంగా నష్టపోతుంది. కాని బ్రతుకులోని ఇతర స్థాయిల్లో కూడా విధ్వంసం జరుగుతుంది ఇప్పటికే. మీరు ఈ విధ్వంసం గురించే విచారిస్తున్నారు. మీలో ఏమవుతుందో మీరు చూడదలుచుకోలేదు. మీరు లోపలిదాన్ని లెక్కచెయ్యకుండా పై దాన్నే నిర్మించాలనుకుంటున్నారు. కాని, లోపలిదే ఎప్పుడూ పైదాన్ని అధిగమిస్తుంది. లోపలిది సంపూర్ణంగా లేకుండా పైది ఎంతోకాలం నిలవదు. కాని, లోపలిదాని సంపూర్ణత మతవ్యవస్థలోని అనుభూతిని పదేపదే పొందటం ద్వారానూ, జ్ఞానం అనే యథార్థవివరాల సమీకరణ ద్వారానూ ఏర్పడేది కాదు. బాహ్యమైనవన్నీ నిలవాలన్నా, ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, ఈ అంతరంగిక ప్రయత్నాలు జరిగే పద్ధతులన్నింటినీ అవగాహన చేసుకోవాలి. మీకు తీరిక లేదని చెప్పకండి. మీకు బోలెడు తీరిక ఉంది. ఇది తీరిక లేకపోవటం అన్న విషయం కాదు, లెక్క చెయ్యకపోవటమూ, ఇష్టంలేక పోవటమూను. మీకు అంతరంగిక సంపన్నత లేదు. బాహ్య సంపన్నత వల్ల తృప్తి పొందినట్లుగానే అంతరంగిక సంపన్నత వల్ల కూడా తృప్తి పొందాలనుకుంటున్నారు. కాబట్టి మీ కుటుంబాన్ని పోషించేందుకు అవసరమైన డబ్బు కోసం మాత్రమే ప్రయత్నించటం లేదు మీరు. సొంతం చేసుకోవటంలోని తృప్తిని పొందటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఆస్తిని గాని, జ్ఞానాన్ని గాని సొంతం చేసుకున్న వాడికి సున్నితత్వం ఉండదు. సుకుమారంగా, విశాల హృదయంతో ఉండడు. సొంతం చేసుకోవటం అంటే మందకొడిగా అవటం - ఆ సొంతం చేసుకున్నది సద్గుణం అయినా, డబ్బులైనా. ఒక వ్యక్తిని సొంతం చేసుకోవటం అంటే, ఆ వ్యక్తిని అర్థం చేసుకోలేకపోవటమే. నిజాన్ని అభిలషించి సొంతం చేసుకోవటం అంటే దాన్ని వదులుకోవటమే. సద్గుణంతో ఉండాలని ప్రయత్నించినప్పుడు మీకింక ఆ సద్గుణం ఉండదు. సద్గుణాన్ని కోరటం మరొక స్థాయిలో సంతృప్తిని పొందాలనుకోవటమే. సంతృప్తి పొందటం సద్గుణం కాదు. సద్గుణం అంటే స్వేచ్ఛ. మందకొడిగా, గౌరవనీయంగా, సద్గుణం లేకుండా ఉన్నవాళ్లు స్వేచ్ఛగా ఉండగలరా? ఏకాంతంలో ఉండే స్వేచ్ఛ అంటే తన చుట్టూ మూసుకుని ప్రత్యేకంగా వేరుగా ఉండటంకాదు. ధనంతో గాని, దారిద్ర్యంతో గాని, జ్ఞానంతోగాని విజయంతోగాని, భావంతోగాని, సద్గుణంతో గాని ప్రత్యేకంగా వేరుగా ఉండటం అంటే మందకొడిగా, సున్నితత్వం లేకుండా ఉండటమే. మందకొడిగా, గౌరవనీయంగా ఉండేవారు సంపర్కం కలిగించుకోలేరు. ఒకవేళ కలిగించుకుంటే, అది వారి స్వయంకల్పనలతోనే. సంపర్కం కలగటానికి సున్నితత్వం, సుకుమారత్వం, ఏదో అవాలనుకోవటంనుంచి - అంటే, భయంనుంచి స్వేచ్ఛా ఉండాలి. ప్రేమ అంటే ఏదో అవటం, "నేను అవాలి" అనుకోవటం కాదు. అవుతూ ఉండేది సంపర్కం కలిగించుకోలేదు - అది ఎప్పుడూ తన్న తాను ప్రత్యేకపరుచుకుంటుంది కనుక.

ప్రేమ సుకుమారమైనది. ప్రేమ విశాలమైనది. అభేద్యమైనది, అపరిచితమైనది.