Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/చర్యలో స్పష్టత

వికీసోర్స్ నుండి

71. చర్యలో స్పష్టత

అ ఉదయం రమణీయంగా ఉంది. వర్షాలు కురిశాక స్వచ్ఛంగా ఉంది. చెట్లు లేత చిగుళ్లు తొడిగాయి. సముద్రపు గాలికి అవి నాట్యం చేస్తున్నాయి. గడ్డి పచ్చగా ఒత్తుగా ఉంది. పశువులు దాన్ని ఆవురావురుమని తింటున్నాయి. కొద్ది నెలలుపోతే నాలుగుపరకల గడ్డి కూడా మిగలదు. తోటలోని పరిమళంతో గది నిండింది. పిల్లలు అరుస్తూ నవ్వుతున్నారు. కొబ్బరి చెట్లని పచ్చని కొబ్బరి కాయలున్నాయి.

పెద్ద పెద్ద అరిటాకులు ఊగుతున్నాయి. ఇంకా గాలికి చిరిగిపోలేదు. భూమి ఎంత అందంగా ఉంది, వర్ణకవితలా ఉంది! ఊరవతల పెద్ద ఇళ్లు, తోటలు. అవి దాటిన తరవాత సముద్రం ఉంది, నిండువెలుగుతో, ఉట్టిపడే కెరటాలతో: దూరాన చిన్న పడవ ఉంది - బల్ల చెక్కలు పేర్చినది. ఒంటరిగా ఒకడు చేపలు పడుతున్నాడు. ఆవిడ బాగా చిన్నది, ఇరవైపైన ఉంటుంది. కొత్తగా వివాహం అయిందిట. కాని వయస్సు మీరుతున్నట్లు ఉంది చూడటానికి. తను మంచి కుటుంబంలోంచి వచ్చానని చెప్పింది - సంస్కారం ఉన్న కుటుంబం, కష్టపడి పనిచేసే కుటుంబం తమది. ఎం. ఎ. చేసిందిట ఆనర్స్‌తో. తెలివైనదీ, చురుకైనదీ అని తెలుస్తూనే ఉంది. ఒకసారి మొదలుపెట్టాక, సునాయాసంగా, ధారాళంగా మాట్లాడింది. కాని, ఉన్నట్లుండి, సిగ్గుపడి మౌనంగా ఉండిపోతుంది. తన భారం తీర్చుకోవాలని ఉందిట. ఎవ్వరితోనూ తన సమస్య గురించి చెప్పలేదుట - తన తల్లితండ్రులకు కూడా చెప్పలేదుట. క్రమక్రమంగా కొద్దికొద్దిగా తన బాధని మాటల్లో పెట్టింది. మాటలు భావాన్ని కొంతవరకే తెలియజేస్తాయి. ఒక విధమైన అపార్థాన్ని కలిగించి, చెప్పదలుచుకున్న దాన్ని పూర్తిగా చెప్పవు. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, మోసం చేస్తాయి. ఆవిడ ఎంతో చెప్పదలుచుకుంది - ఆవిడ మాటలు చెప్పిన దానికన్న. ఆవిడే గెలిచింది. కొన్ని విషయాల గురించి చెప్పలేక పోయింది, ఎంత కష్టపడి ప్రయత్నించినా. కాని, ఆవిడ మౌనమే ఆవిడ బాధల్నీ, కేవలం ఒక బంధనంగా మిగిలిపోయిన ఆ బాంధవ్యంలో ఆవిడ పొందిన అవమానాల్నీ తెలియజేసింది. భర్త ఆవిణ్ణి కొట్టి వదిలేశాడుట. ఉన్న పిల్లలు మరీ చిన్నవాళ్లు - తనకు తోడుగా ఉండాలంటే. తను ఏం చెయ్యాలి? ఇప్పుడు వాళ్లు వేరుగా ఉంటున్నారు. వెనక్కి తిరిగి వెళ్లాలా?

మర్యాద ఎంత బలంగా నొక్కి పెడుతుంది మనల్ని! అంతా ఏమనుకుంటారు? ఒంటరిగా ఉండటం సాధ్యమేనా. ముఖ్యంగా ఆడది - అందరూ అడ్డమైన మాటలు, అనకుండా? మర్యాద అనేది వంచకులు కప్పుకునే ముసుగు. ఆలోచనలో వీలైన నేరాలన్నీ చేస్తాం. కాని, పైకి వేలెత్తి చూపించటానికేమీ ఉండదు. ఆవిడ మర్యాదగా ఉండాలనుకుంటోంది. గందరగోళంలో పడింది. చిత్రమేమిటంటే, తన లోలోపల స్పష్టంగా ఉన్నప్పుడు ఏం జరిగినా సరియైనదే అనిపిస్తుంది - అంతరంగికంగా ఈ స్పష్టత ఉన్నప్పుడు. తాను కోరినట్లుగా చేసినది కాదు సరియైనది అంటే. ఎలా ఉన్నప్పటికీ ఉన్న స్థితే సరియైనది. ఉన్న స్థితిని అర్థం చేసుకోవటంతో తృప్తి కలుగుతుంది. కాని స్పష్టంగా ఉండటం ఎంత కష్టం! "నేనేం చెయ్యాలో ఎలా స్పష్టంగా తెలుసుకోగలను?"

స్పష్టమైన తరవాత చర్య తీసుకోవటం జరగదు. స్పష్టతే చర్య. మీరేం చెయ్యాలన్న విషయమే ఆలోచిస్తున్నారు గాని, స్పష్టంగా ఉండాలని కాదు. మర్యాద అనే దానికీ, మీరు చెయ్యవలసిన దానికీ మధ్య కొట్టుమిట్టాడుతున్నారు - ఆశకీ, ఉన్నస్థితికీ మధ్య మర్యాద కావాలి, ఒక ఆదర్శ వంతమైన చర్య తీసుకోవాలి అనే రెండు కోరికలుండటం వల్ల సంఘర్షణ, గందరగోళం ఏర్పడతాయి. ఉన్నస్థితిని చూడగలిగినప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. ఉన్నస్థితి ఉండవలసిన స్థితి కాదు. ఉండవలసిన స్థితి ఒక మూసలో పోసిన కోరిక మాత్రమే. ఉన్న స్థితి వాస్తవమైనది, కోరవలసినది కాదు, యథార్థమే. మీరు బహుశా ఈ విధంగా యోచించి ఉండకపోవచ్చు. ఇది మంచిదా, అది మంచిదా అని బేరీజు వేసుకుంటూ, గడుసుగా లెక్కలు వేసుకుంటూ ఆలోచించి, పథకాలూ, మారు పథకాలూ యోచించుకుని ఉంటారు. అందువల్లనే అది మిమ్మల్ని ఈ గందరగోళ స్థితికి లాక్కురావటంతో మీరేం చెయ్యాలి అని అడుగుతున్నారు. గందరగోళ స్థితిలో ఏది ఎంచుకున్నా అది మరింత గందరగోళానికి దారితీస్తుంది. దీన్ని మామూలుగా, సూటిగా చూడండి. అలాచేస్తే, ఉన్నస్థితిని ఏవిధమైన వికృతం లేకుండా గమనించ గలుగుతారు. దానిలోని అర్థమే దాని చర్య. ఉన్న స్థితి స్పష్టంగా ఉన్నట్లయితే, ఇక ఎంచుకునేందుకేమీ ఉండదు, చర్య తప్ప. మీరేం చెయ్యాలి అన్న ప్రశ్నేరాదు. ఎంచుకోవటంలో సందిగ్ధత ఉన్నప్పుడే ఏంచెయ్యాలి అన్న ప్రశ్న వస్తుంది. చర్య ఎంచుకోవలసినది కాదు. ఎంచుకుని చేసే చర్య గందరగోళంలో చేసేది.

"మీరు చెప్పేది తెలుస్తోంది. నాలో నేనే స్పష్టంగా ఉండాలి. మర్యాద అనేదాని ప్రోద్బలం లేకుండా, నాకు ఏది లాభమో అని లెక్కవేసుకోకుండా, బేరం చేసే తత్త్వం లేకుండా ఉండాలి. నాకు స్పష్టంగానే ఉంది. కాని, ఈ స్పష్టతని నిలబెట్టుకోవటం కష్టం కాదా?'

కానే కాదు. నిలబెట్టుకోవటమంటే ప్రతిఘటన. స్పష్టతని నిలబెట్టుకుంటున్నారంటే గందరగోళాన్ని వ్యతిరేకించటం. గందరగోళాన్ని అనుభవిస్తున్నారు. ఆ స్థితిలో ఏ చర్య తీసుకున్నా గందరగోళానికే దారి తీస్తుంది. ఇదంతా మీరు అనుభవించినప్పుడు, ఎవరో చెప్పారని కాకుండా మీ అంతట మీరే సూటిగా గ్రహించినట్లయితే ఉన్న స్థితి స్పష్టంగా తెలుస్తుంది. స్పష్టతని నిలబెట్టుకోనక్కరలేదు. అది ఉంటుందంతే.

"మీరు చెప్పింది గ్రహించాను. అవును, నాకు స్పష్టంగా ఉంది. అది బాగానే ఉంది. కాని ప్రేమ మాటేమిటి? మేము ప్రేమంటే ఎరగం. నేను ప్రేమించాననుకున్నాను. కాని లేదని తెలుసును."

మీరు నాకు చెప్పినదాన్ని బట్టి మీరు ఒంటరితనం అంటే భయంతోనూ, శారీరక వాంఛలు, అవసరాల కోసమూ వివాహం చేసుకున్నారు. అదంతా ప్రేమ కాదని తెలుసుకున్నారు. మర్యాదకోసం దాన్ని ప్రేమ అని ఉండవచ్చు. కాని, నిజానికి అది "ప్రేమ" అనే మాట - అవసరానికి తొడిగిన ముసుగు. చాలామందికి అదే ప్రేమ - గందరగోళం అనే పొగతో నిండినది. రక్షణ లేకపోవటంవల్ల, ఒంటరితనంవల్ల, నిస్పృహవల్ల, వృద్ధాప్యంలో జరిగే ఉపేక్ష, మొదలైన వాటివల్ల భయమే ఆ గందరగోళం. కాని ఇదంతా ఆలోచనా ప్రక్రియే - ప్రేమకాదు నిశ్చయంగా. ఆలోచన పదేపదే మళ్లీ చేయిస్తుంది. పదేపదే మళ్లీ చేసేది బాంధవ్యాన్ని పాతబడి పోయేటట్లు చేస్తుంది. ఆలోచన నిరర్థక ప్రక్రియ. అది వినూత్నం చేసుకోదు. కొనసాగుతూ ఉండగలదంతే. కొనసాగుతున్నది కొత్తదీ, స్వచ్ఛమైనదీ కాలేదు. ఆలోచన అనుభూతి. ఆలోచన వాంఛ. ఆలోచన సృజనాత్మకం కావటానికి తన్ను తాను అంతం చేసుకోలేదు. ఆలోచన, అనుభూతి మినహా మరొకటి అవలేదు. ఆలోచన ఎప్పుడూ వాడిపోయినదే, గతించినదే, పాతదే. ఆలోచన ఎప్పటికీ కొత్తది కాలేదు. మీరు గ్రహించినట్లు, ప్రేమ ఆలోచన కాదు. ఆలోచించేది లేనప్పుడు ప్రేమ ఉంటుంది. ఆలోచించేది వేరూ, ఆలోచన వేరూ కాదు. ఆలోచనా, ఆలోచించేదీ ఒకటే. ఆలోచించేదే ఆలోచన.

ప్రేమ అనుభూతి కాదు. అది పొగలేని జ్వాల. మీరు ఆలోచించే దానిగా ఉండనప్పుడు ప్రేమని తెలుసుకుంటారు. ప్రేమకోసం మిమ్మల్ని మీరు, ఆలోచించే దాన్ని త్యాగం చెయ్యలేరు. ప్రేమకోసం కావాలని చర్యతీసుకోలేరు - ప్రేమ మనస్సుకి చెందినది కాదు కనుక. క్రమశిక్షణ, ప్రేమించాలనే ఇచ్ఛా ప్రేమించాలనే ఆలోచన మాత్రమే. ప్రేమ గురించిన ఆలోచన అనుభూతి మాత్రమే. ఆలోచన ప్రేమ గురించి ఆలోచించలేదు - ప్రేమ మనస్సుకి అందుబాటులో ఉండదు కనుక. ఆలోచన కొనసాగుతూ ఉంటుంది. ప్రేమ తరగనిది, అనంతమైనది, ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. కొనసాగుతున్న దానికి ఎప్పుడూ ఆగిపోతుందన్న భయం ఉంటుంది. అంతమొందేదానికి ప్రేమ అనంతంగా ఆరంభం కావటం తెలుస్తుంది.