మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/భద్రత
87. భద్రత
చిన్న కాలవ మెల్లిగా ప్రవహిస్తోంది వరిచేల చుట్టూ ఉన్న దారిపక్క నుంచి. కలువపువ్వులు దాన్నిండా ఉన్నాయి. అవి ముదురు ఊదారంగులో, మధ్యన బంగారపు రంగుతో ఉన్నాయి. నీటికిపైన స్పష్టంగా ఉన్నాయి. వాటి సువాసన వాటి దగ్గర వరకే ఉంది. అవి ఎంతో అందంగా ఉన్నాయి. ఆకాశం మబ్బు కమ్మి ఉంది. జల్లుపడటం మొదలుపెట్టింది. మబ్బుల్లోంచి ఉరుములొస్తున్నాయి. మెరుపు ఇంకా దూరంలో ఉంది. కాని మేము తలదాచుకున్న చెట్టు దగ్గరికి సమీపిస్తోంది. దట్టంగా వాన కురవటం మొదలు పెట్టింది. కలువ ఆకులమీద నీటి చుక్కలు పోగవుతున్నాయి. నీటిచుక్కలు మరీ పెద్దవైనప్పుడు ఆకుల మీంచి క్రిందికి జారి పోతున్నాయి, కాని అంతలోనే మళ్లీ నీటి చుక్కలు పోగవుతున్నాయి. మెరుపు ఇప్పుడు చెట్టుమీదికి వచ్చింది. పశువులు భయపడి తాళ్లు వదిలించుకోవటానికి గింజుకుంటున్నాయి. నల్లని దూడ ఒకటి తడిసిపోయి ఒణుకుతూ హృదయ విదారకంగా అరుస్తోంది. దాని తాడు తెంపేసుకుని దగ్గరలో ఉన్న ఒక గుడిసె వైపుకి పరుగెత్తింది. కలువ పువ్వులు గట్టిగా ముడుచుకుంటున్నాయి ముంచుకొస్తున్న చీకట్లు తమ హృదయాల్లోకి చొరబడకుండా. వాటి బంగారు హృదయాలు కనిపించాలంటే కలువరేకుల్ని చింపాల్సి ఉంటుంది. మళ్లీ సూర్యుడు వచ్చేవరకూ అలాగే గట్టిగా ముడుచుకుని ఉంటాయి. వాటి నిద్రలో కూడా అవి అందంగా ఉన్నాయి. మెరుపు ఊరువైపుకి సాగుతోంది. ఇప్పుడు బాగా చీకటి పడింది. కాలవ గొణుగుడు మాత్రమే వినిపిస్తోంది.
అ దారి గుండా ఊరుదాటితే రోడ్డు వస్తుంది. అక్కణ్ణించి మళ్లీ మేము చప్పుళ్లతో నిండిన పట్నానికి తిరిగి వెళ్లాం.
అతడు యువకుడు. ఇరవై ఏళ్లప్రాంతంలో ఉన్నాడు. బాగా పుష్టిగా ఉన్నాడు. కొంత ప్రయాణాలవీ చేసినవాడు. కాలేజిలో చదువుకున్నాడు. మనస్తిమితం లేకుండా ఉన్నాడు. అతని కన్నుల్లో ఆదుర్దా కనబడుతోంది. అప్పటికే ఆలస్యం అయింది. అయినా మాట్లాడాలనుకుంటున్నాడు. ఎవరైనా అతని మనస్సుని పరిశోధించాలని కోరుతున్నాడు. తన గురించి తాను ఎంతో మామూలుగా ఏవిధమైన సంకోచం, నటనా లేకుండా బయట పెట్టుకున్నాడు. అతని సమస్య స్పష్టమైంది, కాని అతనికి కాదు. అతనింకా తడుముకుంటూ వెతుకుతూనే ఉన్నాడు.
ఉన్నదాన్ని మనం వినం, కనుక్కోం. మన ఊహల్ని ఉద్దేశాల్నీ ఇంకోదానిమీద రుద్దుతాం. ఇంకోదాన్ని మన ఆలోచనా విధానంలోకి ఇరికించటానికి ప్రయత్నిస్తాం. ఉన్నస్థితికంటె మన ఆలోచనలూ, నిర్ణయాలూ మనకి అంత ముఖ్యం. ఉన్నస్థితి ఎప్పుడూ ఎంతో మామూలుగా ఉంటుంది. కాని, మనమే గందరగోళంగా ఉంటాం. మామూలుగా ఉన్నదాన్ని గందరగోళం చేసి అందులోపడి దారి తప్పుతాం. ఎక్కువవుతున్న మన గందరగోళం ధ్వనినే మనం వింటాం. వినటానికి మనం స్వేచ్ఛగా ఉండాలి. ఏవిధమైన పరధ్యానం ఉండకూడదని కాదు. ఆలోచించటమే ఒక విధమైన పరధ్యానం. నిశ్శబ్దంగా ఉండేలా స్వేచ్ఛగా ఉండాలి మనం. అప్పుడే స్వేచ్ఛగా వినటానికి సాధ్యం.
అతనింకా చెబుతున్నాడు - నిద్రపడుతూ ఉండగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. వెర్రిభయంతో. అప్పుడు గది రూపురేఖలు మారిపోతాయిట. గోడలు క్రింద పడి ఉంటాయట. పైన ఇంటికప్పు ఉండదుట. నేల మాయమై పోతుందిట. భయపడిపోతూ చెమటలు కక్కుకుంటాడుట. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచీ జరుగుతోందిట.
దేనికి భయపడుతున్నారు?
"నాకు తెలియదు. కాని భయంతో మెలుకువొచ్చినప్పుడు మా అక్క దగ్గరికో, మానాన్నగారి దగ్గరికో, మా అమ్మదగ్గరికో వెళ్లేవాడిని. వాళ్లతో కాసేపు మాట్లాడేవాడిని స్తిమితపడటానికి. ఆ తరవాత నిద్రపోయేవాడిని. వాళ్లు అర్థం చేసుకుంటారు. కాని నాకు ఇరవై ఏళ్లుదాటాయి. సిగ్గుగా ఉంటోంది."
భవిష్యత్తు గురించి ఆదుర్దాపడుతున్నారా?
"అవును, ఒక విధంగా. మాకు డబ్బున్నప్పటికీ, భవిష్యత్తు గురించి ఆదుర్దాగానే ఉంది."
ఎందుచేత?
"నాకు వివాహం చేసుకుని నాకాబోయే భార్యని సుఖపెట్టాలని ఉంది."
భవిష్యత్తు గురించి ఆదుర్దాపడటం ఎందుకు? మీరు ఇంకా చిన్నవారు. మీరు పనిచేసి ఆమెకి కావలసినవన్నీ సమకూర్చవచ్చు. అదే వ్యాపకం పెట్టుకోవటం దేనికి? సంఘంలో మీ పరపతి పోతుందని భయపడుతున్నారా?
"కొంతవరకు. మాకు కారుంది. కొంత ఆస్తీ, పరపతీ ఉన్నాయి. సహజంగా ఇవన్నీ పోగొట్టుకోవాలని లేదు నాకు. అదే నా భయానికి కారణం కావచ్చు. కాని ఇంతే కాదు. అసలు ఉండనేమోనన్న భయం. భయంతో మెలుకువొచ్చినప్పుడు నేను దిక్కు తెలియనట్లూ, నేనేమీ కానట్లూ, ముక్కలై పోతున్నట్లూ ఉంటుంది."
అయినా, కొత్త ప్రభుత్వం రావచ్చు. మీ ఆస్తి పోగొట్టుకోవచ్చు, మీ కున్నవన్నీ పోగొట్టుకోవచ్చు. మీరింకా బాగా చిన్నవారు. మీరు ఎప్పుడైనా పనిచేసుకోవచ్చు. కోట్లమంది తమకున్న ప్రాపంచిక వస్తువుల్ని పోగొట్టుకుంటున్నారు. మీరు కూడా దాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ప్రపంచంలో ఉన్నవాటిని పంచుకోవాలిగాని ప్రత్యేకంగా సొంతం చేసుకోకూడదు. మీ వయస్సులోనే అంత దాచుకునేలా ఉండటం దేనికి? పోతుందని ఎందుకంత భయం?
"చూడండి, నేను ఒకానొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను. దానికేమి అడ్డురాకూడదని నా ఆందోళన. ఏదీ అడ్డురాక పోవచ్చు. కాని మేమిద్దరం ఒకర్ని విడిచి ఒకరు ఉండలేం. ఇది కూడా నా భయానికి కారణమై ఉండొచ్చు."
అదే మీ భయానికి కారణమా? మీరు ఆమెని వివాహం చేసుకొవటానికి ఏవిధమైన ఆటంకం కలగకపోవచ్చు నంటున్నారు. మరి భయం దేనికి?
"నిజమే, మేము ఎప్పుడనుకుంటే అప్పుడు వివాహం చేసుకోవచ్చు. నా భయానికి అది కారణం అవటానికి వీల్లేదు. అధమం ఇప్పట్లో, నా భయమంతా నేను ఇలా ఉండనేమోననీ, నా వ్యక్తిత్వాన్నీ, నాపేరునీ పోగొట్టు కుంటానేమోననీ నిజంగా భయపడుతున్నానేమో."
మీపేరు గురించీ, ఆస్తీ మొదలైన వాటి గురించీ లెక్కచెయ్యకపోయినా, అప్పటికి భయపడతారా? వ్యక్తిత్వానికి అర్థం ఏమిటి? పేరుతోనూ, ఆస్తితోనూ, ఒక వ్యక్తితోనూ, అభిప్రాయాలతోనూ మమేకమై ఉండటమే. ఏదో ఒక దానితో సంబంధం ఉండి ఉండటం, ఇదనీ, అదనీ గుర్తుపట్టేటట్లుగ ఉండటం, ఒక సంఘం, ఒక దేశం, అలాంటిదేదో ముద్రవేసి ఉండటం. ఆ ముద్ర పోతుందని భయపడుతున్నారు, అంతేనా?
"అవును. లేకపోతే నేనేమిటింక? అవును, అదే."
అందుచేత మీకున్న ఆస్తిపాస్తులే మీరు. మీపేరు, పరపతి, మీ కారు, ఇతర ఆస్తి, మీరు పెళ్లిచేసుకోబోయే అమ్మాయి, మీరు పైకి రావాలని ఉన్న ఆకాంక్షలు - ఇవే మీరు. ఇవీ, ఇంకా కొన్ని లక్షణాలూ, విలువలూ కలిస్తే "నేను" అని మీరు చెప్పుకునేదవుతుంది. అది పోతుందని భయం మీకు అన్నిటితో బాటూ అవీ పోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. యుద్ధం రావచ్చు. విప్లవంగాని, ప్రభుత్వంలో వామపక్షం వైపుకి మార్పుగాని రావచ్చు. ఇవన్నీ మీకులేకుండా పోయేట్లు ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు కాకపోతే రేపు. కాని, భద్రత లేదని భయపడటం దేనికి? భద్రత లేకపోవటమనేది ప్రకృతి సిద్ధం కాదా? రక్షణ లేకుండా ఉండకుండా మీరు గోడల్ని కట్టుకున్నారు మిమ్మల్ని రక్షించుకునేలా. ఈ గోడల్ని పడగొట్టనూ వచ్చు, పడిపోతాయి కూడా. కొంత కాలం వరకూ దాన్ని తప్పించుకోవచ్చు. కాని భద్రత లేకుండా పోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఉన్నస్థితిని తప్పించుకోలేరు. భద్రత లేకపోవటమనేది ఉంది - మీకిష్టం ఉన్నా లేకపోయినా, దాని అర్థం - అందు కోసం అన్నీ వదులుకోవాలని కాదు. దాన్ని అంగీకరించటమో, కాదనటమో కాదు. అయినా మీరు చిన్నవారు. భద్రత లేకపోవటం గురించి భయపడటం ఎందుకు?
"ఇప్పుడు మీరీవిధంగా చెబుతూంటే, భద్రత లేకపోవటం గురించి నాకు భయమనిపించటంలేదు. నిజానికి, పనిచెయ్యటానికి నాకభ్యంతరం లేదు. నా ఉద్యోగంలో నేను రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తాను. అది నాకు ప్రత్యేకం ఇష్టం లేకపోయినా, ఎలాగో గడుపుగోగలను. ఆస్తీ, కారూ మొదలైనవి పోతాయనే భయం లేదు నాకు. ఎప్పుడు కావాలనుకుంటే నేనూ నా స్నేహితురాలూ పెళ్లి చేసుకోగలం. నాకు భయంకలిగించేది ఏదీ కాదని గ్రహించానిప్పుడు. అయితే మరింకేమిటి?"
కనుక్కుందాం. నేను చెప్పగలనేమో. కాని అది మీరు కనుక్కున్నట్లవదు. అది కేవలం మాటలస్థాయిలోనే ఉంటుంది. అది ఉత్తి నిరుపయోగం. మీరు కనుక్కుంటే అది మీరు అనుభవం పొందినట్లవుతుంది. అదే ముఖ్యం. ఇద్దరం కలిసి కనుక్కుందాం. మీరు పోగొట్టుకుంటారని భయపడేవి ఇవేమీ కానట్లయితేనూ, బాహ్యంగా భద్రత లేకపోవటం గురించి మీరు భయపడటం లేదన్నట్లయితేనూ, మరి దేన్ని గురించి ఆదుర్దాపడుతున్నారు? వెంటనే సమాధానం చెప్పెయ్యకండి. ఊరికే వినండి. కనుక్కోవటానికి జాగ్రత్తగా గమనించండి. భౌతిక భద్రత లేకపోవటం వల్ల భయపడటం లేదని మీకు నిశ్చయంగా తెలుసునా? అలాంటి విషయమై నిశ్చయంగా తెలుసుకోగలిగినంతవరకూ మీరు భయపడటం లేదని చెబుతున్నారు. ఇది మాటల్లో నొక్కి చెప్పటమే కానట్లయితే, మరి దేన్ని గురించి భయపడుతున్నారు?
"భౌతికంగా భద్రత ఉండదని నేను భయపడటం లేదని నిశ్చయంగా తెలుసును నాకు. మేము వివాహం చేసుకుని ఏది కావాలంటే అది పొందగలం. కేవలం వస్తువులు పోవటం గురించే కాక వేరే దేన్ని గురించో భయపడుతున్నాను. అదేమిటి?"
"తెలుసుకుందాం. కాని మెల్లిగా విచారిద్దాం. మీరు నిజంగా తెలుసు కోవాలనుకుంటున్నారా, లేదా?"
"నిజంగానే. అనుకుంటున్నాను, ముఖ్యంగా ఇంతవరకూ మనం వచ్చినమీదట. నేను భయపడుతున్నది దేని గురించి?
దాన్ని కనుక్కోవాలంటే మనం నిశ్శబ్దంగా జాగ్రత్తగా గమనించాలి తొందర పడకుండా. భౌతికంగా భద్రత లేకపోవటం గురించి మీరు భయపడటం లేదనట్లయితే, అంతరంగిక భద్రత ఉండదని భయపడుతున్నారా? మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించలేమోనని భయపడుతున్నారా? జవాబు చెప్పొద్దు, ఊరికే వినండి. గొప్పవాడిగా అవలేకపోతేనేమోనని భయపడుతున్నారా? మీకేదైనా మత సంబంధమైన ఆదర్శం ఉండి ఉండొచ్చు. దాని ప్రకారం జీవించలేకపోతారేమోననీ, దాన్ని సాధించలేకపోతారేమోననీ అనిపిస్తోందా? ఆ విషయంలో ఒక విధమైన నిరాశ, తప్పుచేస్తున్నాననే భావం, నిస్పృహా కలుగుతున్నాయా?
"మీరు సరిగ్గా చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రిందట, నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు మీ ప్రసంగం విన్నప్పటినుంచీ, నిజం చెప్పాలంటే, మీలా ఉండాలనే నా ఆదర్శం. ధార్మికంగా ఉండటం మా రక్తంలో ఉంది. నేను కూడా అలా ఉండగలననుకున్నాను. కాని దాని దరిదాపులకి కూడా చేరలేమోనని లోలోపల ఎప్పుడూ భయం ఉండేది."
మెల్లిగా పరిశీలిద్దాం. బాహ్యంగా భద్రత ఉండదని మీరు భయపడక పోతున్నప్పటికీ, అంతరంగికంగా భద్రత ఉండదేమోనని మీ భయం. ఇంకో మనిషి బాహ్యంగా పేరు ప్రఖ్యాతులతో, డబ్బూ మొదలైన వాటితో సురక్షితంగా ఉండేటట్లు చేసుకుంటాడు. మీరు ఒక ఆదర్శం ద్వారా అంతర్గతంగా భద్రత కోరుతున్నారు. ఆ ఆదర్శం ప్రకారం మీరు అవలేనమోననుకుంటున్నారు. ఒక ఆదర్శం ప్రకారం అవాలనిగాని, ఆదర్శాన్ని సాధించాలనిగాని ఎందుకు కోరుకుంటున్నారు? సురక్షితంగా ఉండటానికీ, క్షేమంగా ఉన్నట్లు అనుకోవటానికీ మాత్రమేనా? ఈ ఆశయాన్ని మీరు ఆదర్శం అంటున్నారు. మీరు క్షేమంగా ఉండాలనుకుంటున్నారు. మీకు భద్రత కావాలి, అంతేనా?
"మీరిప్పుడు సూచించినట్లు, సరిగ్గా అదే."
దీన్ని మీరిప్పుడు కనుక్కున్నారు. కనుక్కోలేదూ? అయితే, ఇంకా ముందుకి సాగుదాం. బాహ్యరక్షణలోని వెలితిని స్పష్టంగా గ్రహించారు మీరు, కాని ఒక ఆదర్శం ద్వారా అంతర్గత రక్షణకోసం అన్వేషించటంలోని అసత్యాన్ని కూడా గ్రహిస్తున్నారా? ఆదర్శమే ఆశ్రయం - డబ్బుకి బదులుగా. దీన్ని నిజంగా గ్రహిస్తున్నారా?
"అవును, నిజంగానే గ్రహించాను."
అయితే మీరు ఉన్నట్లుగానే ఉండండి. ఆదర్శం యొక్క అసత్యాన్ని గ్రహించినప్పుడు దానంతటదే పడిపోతుంది. ఉన్నది ఉన్నట్లుగానే ఉంటారు మీరు. అక్కణ్ణించి ఉన్న స్థితిని అర్థం చేసుకోవటం మొదలుపెట్టండి - కాని ఒక ప్రత్యేక లక్ష్యం వైపుకి కాదు, ఎందుకంటే, లక్ష్యం ఎప్పుడూ ఉన్నస్థితి నుంచి దూరంగానే ఉంటుంది. ఉన్నస్థితి మీరే, ఒక ప్రత్యేక సమయంలో గాని, ఒక మానసిక స్థితిలో గాని కాదు. మీరు క్షణక్షణానికీ ఉన్నట్లుగానే. మిమ్మల్ని మీరు నిందించుకోకండి, మీరు చూసిన దానితో ఆశ వదులుకునేట్లుగా అవకండి. ఉన్నదాని గతిని వ్యాఖ్యానించకుండా జాగ్రత్తగా గమనించండి. ఇది శ్రమదాయకమైనది. కాని అందులో ఆనందం ఉంటుంది, స్వేచ్ఛగా ఉన్నవారికే ఆనందం ఉంటుంది. ఉన్నస్థితి అనే సత్యంతోబాటే స్వేచ్ఛ ఉంటుంది.