Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/పని

వికీసోర్స్ నుండి

88. పని

ఎవ్వరితోనూ కలవకుండా, దేనిలోనూ విశ్వాసం లేనట్లుగా ఉన్న ఆయన ప్రభుత్వ యంత్రాంగంలో ఏదో మంత్రి. ఎవరో తీసుకొస్తే వచ్చాడు. బహుశా స్నేహితుడు ఈడ్చుకొచ్చి ఉంటాడు. తను అక్కడ ఉన్నందుకు తనే ఆశ్చర్యబోతున్నట్లున్నాడు. ఆ స్నేహితుడు ఏదో మాట్లాడటానికి వస్తూ ఆయన్ని తన కూడా తీసుకువచ్చి ఉంటాడని తెలుస్తూనే ఉందీ. తన సమస్య గురించి ఆయన కూడా వినాలని తీసుకొచ్చి ఉంటాడు. మంత్రి కుతూహలంగా, ఉన్నతస్థాయిలో ఉన్నట్లుగా ఉన్నాడు. ఆజానుబాహుడు, చురుకుగా గమనిస్తాడు. ధారళంగా మాట్లాడగలడు. జీవితంలో సాధించవలసింది సాధించాడు. ఇప్పుడు స్తిమితపడుతున్నాడు. ప్రయాణం చెయ్యటం ఒకటి, చేరటం మరొకటి. ప్రయాణం చెయ్యటమంటే నిత్యం చేరుతూ ఉండటం. మళ్లీ ప్రయాణం లేకుండా చేసుకోవటమంటే మరణమే. మనం ఎంత సులభంగా తృప్తిపడిపోతాం, ఎంత త్వరగా అసంతృప్తి తృప్తి పొందుతుంది! మనందరికీ ఏదో విధమైన ఆశ్రయం కావాలి, అన్ని రకాల సంఘర్షణ నుంచీ తప్పించుకునే ఆశ్రయం కావాలి. సాధారణంగా మనకి దొరకుతుంది. గడుసువాళ్లు కూడా తెలివి తక్కువ వాళ్లలాగే తమ ఆశ్రయాన్ని తాము కనుక్కుని, దాంట్లో జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉంటారు.

"ఎన్నో సంవత్సరాల నుంచీ నా సమస్యని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాని ఇంతవరకు దాని అమూలంగా తెలుసుకోలేక పోయాను. నేను చేసే పనిలో ఎప్పుడూ వైరుధ్యాన్ని తెచ్చుకున్నాను. నేను సహాయపడటానికి ప్రయత్నించిన వాళ్లలోనే శత్రుత్వం ఎలాగో తలదూర్చేది. కొందరికి సహాయం చెయ్యటంతోనే మరికొందరి వ్యతిరేకతకి బీజం వేసేవాడిని. ఒక చేత్తో ఇచ్చి మరో దాంతో గాయపరిచినట్లుండేది. ఇలా ఎన్ని సంవత్సరాలుగా జరుగుతోందో నాకు గుర్తు కూడా లేదు. ఇప్పుడు నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుని వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడింది. నాకు ఎవ్వరికీ హాని కలుగజెయ్యాలని లేదు. నాకేం చెయ్యాలో తోచటం లేదు."

ఏది ఎక్కువ ముఖ్యం? హాని కలిగించకుండా ఉండటమా, శత్రుత్వం ఏర్పడకుండా చేయటమా, లేక ఏదో ఒకపని చెయ్యటమా?

"నేను పనిచేసేటప్పుడు కొందరికి హాని కలిగిస్తాను. పనిలో మునిగి పోయేటటువంటి వాళ్లలో నేను ఒకణ్ణి. నేను ఏదైనా చేపడితే అది ముగించి తీరాలనుకుంటాను. నేనెప్పుడూ అంతే. నేను సమర్ధుణ్ణేననుకుంటాను. అసమర్థత చూస్తే నాకసహ్యం. ఎంతైనా, ఏదో ఒకరకమైన సంఘసేవ చెయ్యటానికి పూనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా నెరవేర్చాలి కదా. సమర్థతలేని వాళ్లకీ, బద్ధకస్తులకీ సహజంగా హాని కలిగి, వాళ్లు విరోధులవుతారు. ఇతరులకు సహాయం చేసే పని ముఖ్యం. అవసరమైన వాళ్లకు సహాయపడటంలో దానికడ్డం వచ్చేవాళ్లని గాయపరుస్తాను. కాని ఎవరికీ హాని కలిగించటం నాకిష్టంలేదు. ఈ విషయమై ఏదో చేసితీరాలని గ్రహించాను."

మీకు ఏది ముఖ్యం: పనిచెయ్యటమా, లేక ఇతరులకు హాని కలిగించటమా?

"అంత బాధని చూసినప్పుడు పరివర్తన తీసుకురావటానికి ఉద్యమిస్తాం. ఆ పనిచేసేటప్పుడు కొందరికి హాని చెయ్యటం జరుగుతుంది - ఎంతో అయిష్టంగానే అయినా."

కొంతమందిని రక్షించటంలో, మరి కొంతమంది నాశనమవుతారు. ఒకదేశం మరోదేశాన్ని నష్టపరచి తాను నిలబడుతుంది. ఆధ్యాత్మికులమని చెప్పుకునే వారు పరివర్తన తీసుకురావాలనే ఆత్రుతతో కొందర్ని రక్షించి మరికొందర్ని నాశనం చేస్తారు. వారు ఆశీర్వచనాలూ ఇస్తారు. శాపాలూ ఇస్తారు. మనం ఎప్పుడూ కొందరి మీద దయ చూపించి మరి కొందరితో నిర్దయగా ఉంటాం. ఎందువల్ల?

మీకు ఏది ముఖ్యం : పనిచెయ్యటమా, ఇతరులకు హాని కలిగించకుండా ఉండటమా?

"ఎంతైన, కొంతమందికి హాని కలిగించాలి - బద్దకస్తులకీ, అసమర్థులకీ, స్వార్థపరులకీ. ఇది తప్పనిసరి అనిపిస్తుంది. మీ ప్రసంగాలతో మీరు గాయపరచారా? ఒక ధనవంతుణ్ణి నేనెరుగుదును. మీరు ధనవంతుల గురించి అన్నదానికి ఆయన చాలా బాధపడ్డాడు."

నేను ఎవరినీ గాయపరచాలని అనుకోను. ఒక పనిచేస్తున్నప్పుడు ఎవరైనా గాయపడితే, నా ప్రకారం ఆ పని మానెయ్యాలి. నాకే పనీ లేదు. పరివర్తన తీసుకొచ్చేందుకుగాని, విప్లవం తీసుకొచ్చేందుకుగాని ఏవిధమైన పథకాలూ లేవు. నాకు పని కాదు మొదట, ఇతరులకు హాని కలిగించకూడదన్నదే. అన్నదానివల్ల ఆ ధనవంతుడు గాయపడి ఉంటే, ఆయన నా వల్ల గాయపడలేదు. ఉన్నస్థితిలోని సత్యం మూలాన్ని. అది ఆయనకు నచ్చదు. ఆయన బయట పడిపోవటం ఆయన కిష్టంలేదు. ఒకరిని బయట పెట్టటం నా ఉద్దేశం కాదు. ఉన్నదానిలోని సత్యం మూలాన్ని ఎవరైనా తాత్కాలికంగా బయటపడిపోయి, తాను చూచిన దానికి కోపం తెచ్చుకుని, దానికి ఇతరులను నిందిస్తారు. కాని అది యథార్థం నుంచి పారిపోవటం మాత్రమే. యథార్థం చూసి కోపగించుకోవటం తెలివితక్కువతనం. కోపంతో యథార్ధాన్ని తప్పించుకోవటం సాధారణంగా ఆలోచించకుండా చూపే ప్రతిక్రియ.

కాని, మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఏది ముఖ్యం - పని చెయ్యటమా, ఇతరులకు హాని కలిగించకుండా ఉండటమా?

"పని జరిగి తీరాలి. మీరలా అనుకోరా?" అని మంత్రిగారు మధ్యలో అన్నారు.

ఎందుకు జరిగితీరాలి? కొంతమందికి లాభం కలిగించటంలో మరికొందరిని నాశనం చేస్తే దానికి విలువ ఏముంది? మీ దేశాన్ని మీరు రక్షించుకోవచ్చు, కాని ఇంకొకదాన్ని మీస్వలాభానికి ఉపయోగించుకోవచ్చు. మీ దేశం గురించీ, మీపార్టీ గురించీ, మీ సిద్ధాంతం గురించీ మీకెందుకంత విచారం? మీ పనితో మీరు ఎందుకు ఐక్యం అవుతారు? పనికి ఎందుకంత ప్రాముఖ్యం?

"మనం పని చెయ్యాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. లేదా, చనిపోవటమే నయం. ఇల్లు కాలిపోతుంటే మౌలిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉండలేం."

కేవలం ఏదో ఒక పని చేస్తూ ఉండటానికి మౌలిక విషయాలు సమస్య కావు. వారికి కావలసినదల్లా పైపైకి లాభదాయకంగా ఉండి, తీవ్రమైన హాని కలిగించే కార్యకలాపం మాత్రమే. కాని మీ స్నేహితుణ్ణి ఒకటి అడగనిస్తారా? ఒక రకమైన పని మీకెందుకంత ముఖ్యం? దానిమీద అంత మమకారం దేనికి?

"ఓ, నాకే తెలియదు. కాని దానివల్ల నాకు ఎంతో ఆనందం కలుగుతుంది."

అందుచేత మీరు నిజంగా ఆసక్తి చూపిస్తున్నది అ పనిలో కాదు, దానివల్ల మీకు లాభించేదానిలోనే. దాని వల్ల మీరు డబ్బు చేసుకోలేక పోవచ్చు. కాని దానివల్ల ఆనందం పొందుతారు. తన పార్టీని గాని దేశాన్నిగాని రక్షించటంలో మరొకరు అధికారాన్నీ పదవినీ, పరపతినీ పొందినట్లే మీ పనిలో మీరు సంతోషాన్ని పొందుతారు. మరొకరు తన రక్షకుడికీ, గురువుకీ తన ప్రభువుకీ సేవచేసి ఎంతో తృప్తిని పొంది దాన్ని వరం అన్నట్లు గానే మీరు చేసే సేవ అనే దాంట్లో తృప్తిని పొందుతున్నారు. మీ సొంత ఆనందమే అన్నిటికన్నా ముఖ్యం. మీరుచేసే ఆ పనివల్ల మీరు కోరిన దాన్ని పొందుతున్నారు. మీకు నిజంగా మీరు సహాయపడే మనుషులమీద ఆసక్తి లేదు. వాళ్లు మీ ఆనందాని కొక సాధనం మాత్రమే. సహజంగా అసమర్ధులైన వాళ్లూ, మీ దారికి అడ్డు నిలిచిన వాళ్లూ గాయపడతారు. ఎందువల్లనంటే, పని ముఖ్యం. ఆ పనిలోనే మీ ఆనందం ఉంది. ఇది నిర్దాక్షిణ్యమైన యథార్థం. కాని, దాన్ని మనం గడుసుగా సేవ, దేశం, శాంతి, దైవం, అలాంటి ఉన్నత పదాలతో కప్పి పుచ్చుతాం.

అందుచేత, చెప్పాలంటే, మీకు నిజంగా అభ్యంతరం లేదు వాళ్లకి హాని కలిగించటం - మీకు ఆనందాన్నిచ్చే పని సమర్దవంతంగా జరగకుండా అడ్డుపడే వారికి. ఒక పనిలో మీకు ఆనందం దొరకుతుంది. ఆ పని ఏదైనా, మీరే అది. ఆనందం పొందటంలోనే మీకు ఆసక్తి, ఆపని మీకు సాధనంగా అవుతుంది. అందువల్ల ఆ పని చాలా ముఖ్యమవుతుంది. అదికాక, మీరు ఎంతో సమర్థులు, దయాదాక్షిణ్యాలు లేనివారు, మీకు ఆనందాన్నిచ్చే దానికోసం అధికారం చెలాయిస్తారు. అందువల్ల హాని కలిగించటానికీ, శత్రుత్వం పెంపొదించుకోవటానికి, మీకభ్యంతరం లేదు.

"నేను ఆవిధంగా ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. కాని, అది పరిపూర్ణ సత్యం. కాని దాని గురించి నేనేం చెయ్యాలి?"

ఇంత సాధారణమైన సత్యాన్ని గ్రహించటానికి మీకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో చూడటం కూడా ముఖ్యం కాదా?

"మీరన్నట్లు, నా పని అయే దాకా నేను ఎవరికి హాని కలిగించినా లెక్క చెయ్యలేదు. నిజంగా, సాధారణంగా నేను అనుకున్న ప్రకారం సాధిస్తాను. నేను ఎప్పుడూ సమర్థవంతంగా, సూటిగా ఉంటాను కాబట్టి - దాన్నే మీరు దయాదాక్షిణ్యాలు లేకపోవటం అంటున్నారు. మీరన్నది పూర్తిగ నిజం. కాని ఇప్పుడు నేనేం చెయ్యాలి?"

ఇంత మామూలు సత్యాన్ని గ్రహించటానికి అన్ని సంవత్సరాలు తీసుకున్నారు - మీరింతవరకూ దాన్ని గ్రహించటానికి ఇష్టపడలేదు కనుక. దాన్ని గ్రహించటంలో మీరు ఉన్న పునాదినే ఎదుర్కొంటున్నారు. మీరు ఆనందం కోసం ప్రయత్నించి, పొందారు. కాని దానివల్ల ఎప్పుడూ సంఘర్షణా, వైరుధ్యం కలిగాయి. ఇప్పుడు బహుశా మొదటిసారి మీ గురించిన యథార్ధాలను మీ ఎదురుగా చూస్తున్నారు. మీరేం చెయ్యాలి? పనిచెయ్యటానికి మరో విధానం లేదా? ఆనందంగా ఉండి పనిచెయ్యటానికి వీల్లేదా - పనిలో ఆనందాన్ని వెతుక్కునే బదులు? పనిని గాని, ప్రజల్ని గాని ఒక లక్ష్యానికి సాధనంగా ఉపయోగించుకుంటున్నప్పుడు, నిజానికి మనకి అనుబంధం ఏర్పడదు - పనితో గాని, ప్రజలతో గాని సంపర్కం ఉండదు. అప్పుడు మనకి ప్రేమించటం చేతకాదు. ప్రేమ ఒక లక్ష్యానికి సాధనం కాదు. అదే అనంతమైనది. నేను మిమ్మల్ని ఉపయోగించుకుని, మీరు నన్ను ఉపయోగించుకుని, దాన్ని సంబంధం అంటాం సాధారణంగా. మనం ఒకరికొకరం మరోదానికి సాధనంగా మాత్రమే ముఖ్యమవుతాం. అందుచేత మనం ఒకరికొకరం ముఖ్యం కానేకాదు. ఈ పరస్పరం వినియోగించుకోవటం నుంచే సంఘర్షణా, వైరుధ్యం బయలుదేరుతున్నాయి. అందుచేత మీరు ఏం చెయ్యాలి? సమాధానాన్ని ఇంకొకరి నుంచి ఆశించేందుకు బదులు మనిద్దరం కలిసే కనుక్కుందాం. దాన్ని మీరే పరిశీలించి కనుకున్నట్లయితే అది మీరు అనుభవం పొందినట్లవుతుంది. అప్పుడది నిజమైనదవుతుంది, కేవలం నిశ్చయమో, నిర్ణయమో, మాటల్లో చెప్పిన సమాధానమో కాదు.

"అయితే నా సమస్య ఏమిటి?"

ఈ విధంగా అనలేమా? ప్రశ్నకి తక్షణం అనాలోచితంగా మీ మొట్టమొదటి ప్రతిక్రియ ఏమిటి? పని ముందొస్తుందా? అది కాకపోతే మరేది?

"మీరేం చెప్పబోతున్నారో గ్రహించటం మొదలు పెట్టాను. నా మొట్టమొదటి స్పందన విభ్రాంతి చెందటం. ఇన్ని సంవత్సరాలుగా నేను చేసే పని ఎలా చేస్తున్నానో గ్రహించి నిర్ఘాంతపోయాను. మీరన్నట్లు ఉన్నదాన్ని ఎదురుగా చూడటం ఇదే మొదటిసారి. అది చాలా సంతోషకరంగా లేదని మాత్రం గట్టిగా చెప్పగలను. ఇంకా ముందుకు పోగలిగితే బహుశా ఏది ముఖ్యమో గ్రహించగలుగుతానేమో. అప్పుడు సహజంగా తరవాత పని జరుగుతుంది. కాని పని ముఖ్యమా, ఇంకోటేదైనా ముఖ్యమా అన్నది మాత్రం నాకింకా స్పష్టం కావటం లేదు."

ఎందుకు స్పష్టం కావటం లేదు? స్పష్టం కావటానికి సహాయం కావాలా, లేక గ్రహించటానికి ఇష్టపడటం కావాలా? గ్రహించకుండా ఉండాలనే కోరిక క్రమంగా కొంతకాలానికి మాయమై పోతుందా? మీకు స్పష్టం కాకపోవటానికి కారణం మీరు యథార్ధాన్ని గ్రహించటానికి ఇష్టపడటం లేదన్నది ప్రాథమిక సత్యం కాదా? స్పష్టం కావటం మీకు ఎందుకు ఇష్టం లేదంటే, అది మీ దైనందిన జీవనవిధానాన్నే తలక్రిందులు చేస్తుందని. మీరు ఇచ్ఛా పూర్వకంగానే ముందుకి నెట్టుతున్నారని తెలుసుకుంటే మీకు వెంటనే స్పష్టం అవదూ? ఇలా తప్పించుకోవటం వల్లనే గందరగోళం ఏర్పడుతుంది.

"ఇప్పుడంతా స్పష్టమవుతోంది నాకు. నేనేం చెయ్యాలన్నది అప్రస్తుతం. బహుశా నేను చేసే పనినే ఇంకా చెయ్యవచ్చు. కాని పూర్తిగా వేరే దృష్టితో చూద్దాం."

* * *