మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/అసత్యాన్ని అసత్యమని గ్రహించటం

వికీసోర్స్ నుండి


86. అసత్యాన్ని అసత్యమని గ్రహించటం

ఆ సాయంకాలం రమణీయంగా ఉంది. వరిచేల వెనక జ్వాలారుణ ఆకాశం. పొడుగ్గా సన్నగా ఉన్న కొబ్బరి చెట్లు గాలికి ఊగుతున్నాయి. బస్సు నిండా జనంతో కొండ ఎక్కుతూ ఎంతో చప్పుడు చేస్తోంది. ఆ కొండ చుట్టూ ఉంది నది, సముద్రానికి చేరే దారిలో, పశువులు బలిసి ఉన్నాయి. మొక్కలు దట్టంగా ఉన్నాయి. పువ్వులు లెక్కలేనన్ని ఉన్నాయి. బొద్దుగా ఉన్న చిన్న కుర్రాళ్లు పొలంలో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. దగ్గరలోనే ఒక చిన్నగుడి ఉంది. విగ్రహం ముందు ఎవరో దీపం వెలిగిస్తున్నారు. విడిగా ఉన్న ఒక ఇంట్లో సాయంకాలపు ప్రార్ధనలు జరుగు తున్నాయి. గదిలో దీపం వెలిగించి ఉంది కాని, అంత ప్రకాశవంతంగా లేదు. ఇంటిల్లిపాదీ అక్కడికి చేరారు. అందరూ తమ ప్రార్థనల్లో ఆనందంగా ఉన్నట్లున్నారు. రోడ్డు మధ్యగా ఒక కుక్క గాఢంగా నిద్రపోతోంది. సైకిలు మీద పోతున్న ఒకతను దాన్ని చుట్టివెళ్లాడు. ఇప్పుడు చీకటి పడుతోంది. నిశ్శబ్దంగా నడిచివెళ్లేవాళ్ల ముఖాలమీద మిణుగురు పురుగుల వెలుగుపడుతోంది. ఒకటి ఒకావిడ తల్లో చిక్కుకుని, ఆవిడ తల సన్నగా వెలుగుతోంది.

మనం సహజంగా ఎంత దయగా ఉంటాం, ముఖ్యంగా పట్టణాలకి దూరంగా పొలాల్లోనూ, చిన్న ఊళ్లలోనూ! తక్కువ చదువుకున్న వాళ్ల మధ్య జీవితం ఆత్మీయంగా ఉంటుంది. వృద్ధిలోకి రావాలనే 'వాంఛాజ్వరం' ఇంకా వ్యాపించలేదు. పిల్లవాడు మీకేసి చూసి చిరునవ్వు నవ్వుతాడు. ముసలావిడ తెల్లబోతుంది. మనిషి సందేహిస్తూ పక్కనుంచి వెడతాడు. గుంపుగా ఉన్నవాళ్లు గట్టిగా మాట్లాడుకోవటం ఆపేసి ఆశ్చర్యంతో కూడిన ఆసక్తితో చూడటానికిటు తిరుగుతారు. ఆడమనిషి మీరు దాటి వెళ్లేవరకూ ఆగుతుంది. మనలో ఒకరి గురించి ఒకరికి ఎంత స్వల్పంగా తెలిసి ఉంటుందో మనకి తెలుసు, కాని, మనం అర్థం చేసుకోము. మనకి తెలుసు, కాని ఇంకొకరితో సంపర్కం ఉండదు. మన గురించి మనకే తెలియదు. ఇంక ఇంకొకరు ఎలా తెలుస్తారు? ఇంకొకర్ని ఎన్నటికీ తెలుసుకోలేము. ఇంకొకరితో సంపర్కం మాత్రం పెట్టుకోగలం. చనిపోయిన వారిని గురించి తెలుసుకోగలం. కాని జీవించి ఉన్నవారి గురించి ఎన్నటికీ తెలుసుకోలేం. మనకి తెలిసినది మరణించిన గతం, జీవించి ఉన్నదికాదు. చనిపోయిన వాటిని మనలోనే పాతిపెట్టుకోవాలి. మనకి చెట్లపేర్లూ, పక్షులపేర్లూ, దుకాణాలపేర్లూ తెలుసును. కాని, మన గురించి మనకి ఏమీ తెలియదు - ఏవో కొన్ని మాటలూ, కోరికలూ మినహాయించి. మనదగ్గర వివరాలూ, నిర్ణయాలూ ఉంటాయి. ఎన్నిటి గురించో; కాని ఆనందం ఉండదు. నిర్జీవం కానట్టి శాంతి ఉండదు. మన జీవితాలు మందకొడిగా శూన్యంగా ఉంటాయి, లేదా మనల్ని గుడ్డివాళ్లను చేసేటన్ని మాటలతో, కార్యకలాపాలతో నిండి ఉంటాయి. జ్ఞానం వివేకం కాదు. వివేకం లేనిదే శాంతి ఉండదు, ఆనందం ఉండదు.

ఆయన చిన్న వయస్సులోనే ఉన్నాడు. ఏదో ఫ్రొపెసరు. అసంతృప్తిగా ఆందోళనపడుతూ, బాధ్యతల భారంతో ఉన్నాడు. తన సమస్యల గురించి మనిషిని నిస్సత్తువగా చేసే వాటిని గురించి చెప్పటం మొదలుపెట్టాడు. బాగా చదువుకున్నవాడినేనన్నాడు - అంటే, చదవటం ఎలాగో తెలుసుకుని ఉండటం, పుస్తకాల్లోంచి వివరాలు సేకరించటం. ఎన్నో సంవత్సరాల నుంచీ పొగ తాగటం మానెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడుట. కాని, ఎంతకీ పూర్తిగా మానెయ్యలేకపోయాడుట. చాలా ఖరీదు, పైగా తెలివితక్కువది, అందుకని మానెయ్యాలని కోరుతున్నాడుట. మానెయ్యటానికి చెయ్యగలిగిన ప్రతిదీ చేశాడుట, కానీ మళ్లీ మొదలు పెట్టేవాడుట. ఇది ఆయనకున్న సమస్యల్లో ఒకటి. ఆయన తీవ్రంగా, అస్తిమితంగా, బక్కపలచగా ఉన్నాడు.

దేన్నైనా నిందిస్తే దాన్ని అర్థం చేసుకోగలమా? దాన్ని అవతలికి తోసెయ్యటం, దాన్ని, అంగీకరించకపోవటం సులభమే. కాని ఆనందించటమైనా, అంగీకరించటమైనా సమస్యని తప్పించుకోవటమే అవుతుంది. పసిపాపని నిందించి అవతలికి తోసెయ్యటం మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండటానికే. కాని పసిపాప అలాగే ఉంటుంది. నిందించటం అంటే లెక్క చెయ్యకపోవటం, శ్రద్ధ చూపించకపోవటం. నిందించటం వల్ల అవగాహన అవటం కుదరదు.

"పొగ తాగుతున్నందుకు నన్ను నేను ఎన్నోసార్లు నిందించుకున్నాను. నిందించకుండా ఉండటం కష్టం."

అవును నిందించకుండా ఉండటం కష్టమే. మనల్ని ప్రభావితం చేసినది - కాదనటం, సమర్థించటం, పోల్చటం, వదులుకోవటం - వీటిమీద ఆధారపడింది. దీని ప్రభావంతోనే మనం ఏ సమస్యనైనా సమీపిస్తాం. ఈ ప్రభావమే సమస్యనీ, సంఘర్షణనీ పెంపొందిస్తుంది. పొగ తాగటం గురించి సహేతుకంగా ఒక నిర్ణయానికి రావటానికి ప్రయత్నించారు మీరు. దాన్ని తెలివితక్కువది అన్నప్పుడు, దాన్ని గురించి అంతా యోచించి, అది తెలివితక్కువపని అనే నిర్ణయానికి వచ్చారు. కాని, ఆ సహేతుక నిర్ణయం మీరు మానేసేటట్లు చెయ్యలేదు. సమస్యకి కారణం తెలుసుకోగానే దాన్నుంచి విముక్తి పొందాలనుకుంటాం. కాని తెలుసుకోవటం వివరాలను మాత్రమే -మాటల్లోనే నిర్ణయానికి రావటం. ఈ జ్ఞానం సమస్య అవగాహన అవటానికి ఆటంకం కలిగిస్తుంది నిశ్చయంగా. సమస్యకి కారణం తెలుసుకోవటం, సమస్యని అర్థం చేసుకోవటం - రెండూ పూర్తిగా వేరువేరు విషయాలు.

"ఎవరైనా సమస్యని ఏవిధంగా సమీపించగలరు?"

అదే మనం కనుక్కోబోతున్నాం. ఏది అసత్య మార్గమో కనుక్కున్నప్పుడు మనకి తెలిసేది ఒక్కటే అసలైన మార్గం. అసత్యాన్ని అర్థం చేసుకోవటమే సత్యాన్ని కనుగొనటం. అసత్యాన్ని అసత్యంగా గ్రహించటం కఠినం. అసత్యాన్ని పోల్చటం ద్వారా, ఆలోచన యొక్క కొలమానం ద్వారా చూస్తాం. అసత్యాన్ని అసత్యంగా ఆలోచనా ప్రక్రియ ద్వారా చూడటం సాధ్యమేనా? ఆలోచన కూడా ప్రభావితమైనదే కాబట్టి అది కూడా అసత్యమైనదే కాదా?

"ఆలోచన ద్వారా కాకుండా అసత్యం అసత్యమని ఎలా తెలుసుకోగలం?"

ఇదే మనకున్న చిక్కంతా, కాదా? సమస్యని పరిష్కరించటానికి ఆలోచనని ఉపయోగిస్తే దానికి తగినసాధానాన్ని వినియోగించటం లేదు నిశ్చయంగా. ఆలోచన అనేదే గతం నుంచీ, అనుభవం నుంచీ తయారైనది. అనుభవం ఎప్పుడూ గతానికి చెందినదే. అసత్యాన్ని అసత్యంగా గ్రహించటానికి ఆలోచన ఒక గతించిన ప్రక్రియ అని తెలుసుకోవాలి. ఆలోచన ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండదు. దేన్నైనా కనుక్కోవటానికి స్వేచ్ఛ ఉండాలి, ఆలోచన నుంచి విముక్తి కలగాలి.

"మీరనేది, నాకు సరిగ్గా అర్థం కాలేదు."

మీ సమస్యల్లో ఒకటి పొగతాగటం. దాన్ని నిందిస్తూ దాన్ని గురించి సహేతుకంగా నిర్ణయానికొచ్చారు. ఈ పద్ధతి అసత్యమైనది. ఇది అసత్యమైనదని ఎలా కనుక్కుంటారు? నిజంగా ఆలోచన ద్వారా కాదు, అ సమస్యని మీరు ఎలా సమీపిస్తున్నారనే దాన్ని అనాసక్తంగా, జాగ్రత్తగా గమనించాలి. అనాసక్తంగా, జాగ్రత్తగా గమనించటానికి ఆలోచనతో అవసరం ఉండదు. అంతేకాక, ఆలోచన పనిచేస్తున్నట్లయితే, అనాసక్తత ఉండటమే కుదరదు. ఆలోచన పని చేసేది నిందించటానికి గాని, సమర్థించటానికి గాని పోల్చటానికి గాని, అంగీకరించటానికి గాని మాత్రమే. ఈ ప్రక్రియని అనాసక్తంగా, జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ఉన్నస్థితిని గ్రహించటం జరుగుతుంది.

"అవును, గ్రహించాను. కాని, ఇది పొగతాగటానికి ఎలా వర్తిస్తుంది?"

ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం కనుక్కోవటానికి - ఈ పొగ తాగటం అనే సమస్యని నిందించటం, పోల్చటం మొదలైనవి చెయ్యకుండా పరిశీలించ గలమేమో. సమస్యని మళ్లీ కొత్తగా పరిశీలించగలమా - గతం నీడ దానిపైన పడకుండా? ఏవిధమైన ప్రతిక్రియా లేకుండా చూడటం అత్యంత కష్టం, కాదా? దాన్ని అనాసక్తంగా తెలుసుకోలేకపోతున్నట్లుగా ఉంది, ఎప్పుడూ గతం నుంచి ఏదో ఒక ప్రతిక్రియ ఉంటోంది. సమస్య కొత్తదన్నట్లుగా గమనించటం మనకెంత అసాధ్యమో చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. మనతో బాటు మన గత ప్రయత్నాలనూ, నిర్ణయాలనూ, ఉద్దేశాలనూ మోసుకువెడతాం. ఈ తెరల్లోంచి తప్ప మనం సమస్యని చూడలేము.

ఏ సమస్య అయినా ఎప్పుడూ పాతది కాదు. కాని దాన్ని మనం పాత సూత్రాలతో సమీపిస్తాం. అదే సమస్య మనకి అవగాహన కాకుండా ప్రతిబంధకమవుతుంది. ఈ ప్రతిక్రియలను అనాసక్తంగా అవలోకించండి. ఊరికే అనాసక్తంగా వాటిని తెలుసుకుని ఉండండి. అవి సమస్యని పరిష్కరించలేవని గ్రహించండి. సమస్య నిజమైనది. అది వాస్తవమైనది. కాని, దాన్ని సమీపించే పద్ధతి తగినట్లు ఉండదు. ఉన్నదానికి తగిన ప్రతిక్రియ లేకపోతే సంఘర్షణ బయలుదేరుతుంది. సంఘర్షణే సమస్య. ఈ మొత్తం ప్రక్రియ అవగాహన అయితే, మీ పొగ తాగటం గురించి మీరు తగిన చర్య తీసుకుంటారని మీరే తెలుసుకుంటారు.