Jump to content

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/ఆత్మరక్షణ

వికీసోర్స్ నుండి

39. ఆత్మరక్షణ

ఆయన బాగా పేరున్నవాడు. ఇతరులకు హాని కలిగించగల స్థితిలో ఉన్నాడు. అది చెయ్యటానికి ఆయన సందేహించడు. కపటంగా, అల్ప బుద్ధితో ఉంటాడు. ఔదార్యం అనేది లేకుండా, తన బాగుకోసమే కృషిచేస్తాడు. అన్నీ మాట్లాడి తెలుసుకోవాలనే ఉత్సుకతతో రాలేదనీ, పరిస్థితుల ప్రోద్భలం వలన రావలసి వచ్చిందనీ, అందుకే తను ఇక్కడికి వచ్చాననీ చెప్పాడాయన. ఆయన చెప్పిన దాన్నంతటిని బట్టీ, చెప్పని దానిని బట్టీ చూస్తే ఆయన చాలా తీవ్రమైన ఆకాంక్ష కలవాడనీ, తన చుట్టూ ఉన్న వారిని తానే తీర్చిదిద్దుతాడనీ, తనకు లాభం ఉన్నప్పుడు నిర్దయగా వర్తిస్తాడనీ, ఆయనకేదైనా కావలసి వచ్చినప్పుడు సౌమ్యంగా ఉంటాడనీ బాగా స్పష్టమవుతోంది. ఆయనకి తనపైన ఉండే వాళ్లంటే గౌరవం. సాటి వారిని ఓర్పుతో సహిస్తాడు. తన క్రింది వాళ్లని బొత్తిగా లెక్క చెయ్యడు. తన్ను తీసుకు వచ్చిన కారు డ్రైవరుని కన్నెత్తి అయినా చూడడు. ఆయనకున్న స్నేహితులు చాలా కొద్దిమంది. ఆయన పిల్లల గురించి మాట్లాడినప్పుడు వాళ్లు తనకి ఆనందం కలిగించే బొమ్మలు అన్నట్లుగా మాట్లాడాడు. ఆయన ఒంటరిగా ఉండలేనన్నాడు. ఎవరో ఆయనకి హాని కలిగించారు. తిరిగి కక్ష తీర్చుకోవాలంటే అ వ్యక్తి అందుబాటులో లేడు. అందుచేత తనకు అందుబాటులో ఉన్న వారిమీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. తను ఎందుకంత క్రూరంగా ఉంటాడో, తను ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్లకే ఎందుకు హాని కలిగించాలని కోరుతున్నాడో తనే అర్థం చేసుకోలేకపోతున్నానన్నాడు. కొంతసేపు మాట్లాడక క్రమంగా కరిగి, దాదాపు స్నేహపూర్వకంగా అయాడు. అది క్షణం సేపు వెచ్చదనం చేకూర్చి, దాన్నుంచి ఏ మాత్రం ఆశించినా లేదా ఏమాత్రం అడ్డుతగిలినా అంతలోనే మూసుకు పోయే స్నేహశీలత అది. ఆయన్నుంచి ఏమీ అపేక్షించటం జరగలేదు కనుక ఆయన స్వేచ్ఛగా ఉన్నాడు. తాత్కాలికంగా ప్రేమపూర్వకంగా ఉన్నాడు.

ఇంకొకరికి హాని కలిగించాలనీ, గాయం కలిగించాలనీ - మాట ద్వారా గాని, చేష్ట ద్వారా గాని, మరీ గాఢంగా గాని - మనలో చాలమందిలో బలమైన కోరిక ఉంటుంది. అది సర్వసాధారణమైనది. అది కలిగించే ఆనందం భయంకరం. మనం గాయపడకూడదనే కోరికే ఇంకొకరిని గాయపరచేలా చేస్తుంది. ఇతరులకు హాని కలిగించటం ఒక విధమైన ఆత్మరక్షణ. ఆత్మరక్షణ అనేక రూపాలు ధరిస్తుంది - పరిస్థితులను బట్టీ, ప్రవృత్తులను బట్టీ. ఇంకొకరిని గాయపరచటం ఎంత సులభం! గాయపరచకుండా ఉండడానికి ఎంత మృదుత్వం అవసరమవుతుంది! మనం గాయపడ్డాం కాబట్టి ఇతరుల్ని గాయపరుస్తాం. మన సంఘర్షణలవల్ల, దుఃఖాలవల్ల మనం ఎన్నో దెబ్బలు తిని ఉంటాం. అంతర్గతంగా ఎంత చిత్రహింస అనుభవిస్తే బయటికి అంత హింసాత్మకంగా ఉండాలనే తపన ఉంటుంది. అంతరంగిక కల్లోలం బాహ్య రక్షణ కోసం అర్రులు చాచేటట్లు చేస్తుంది. తన్ను తాను రక్షించుకుంటున్న కొద్దీ ఇతరులపైన దాడి ఎక్కువవుతూ ఉంటుంది.

మనం అంత జాగ్రత్తగా దాచుకుని రక్షించుకునేదేమిటి? నిశ్చయంగా అది మన గురించి మనకున్న భావమే - ఏస్థాయిలో నైనా మనం అ భావాన్ని, ఆ కూడబెట్టిన వాటి కేంద్రాన్ని రక్షించకుండా ఉన్నట్లయితే, "నేను" అనేది "నా" అనేది ఉండనే ఉండదు. అప్పుడు మనం మన వ్యక్తిత్వ రీతులకు - వ్యక్తంగా ఉన్నవైనా, అవ్యక్తంగా లోపల దాగి ఉన్నవైనా - వాటికి లొంగిపోయేటంత విపరీతంగా సున్నితంగా అయిపోతాం. కాని మనలో అనేక మంది ఈ "నేను" అనే ప్రక్రియని కనుక్కోవాలని కోరుకోరు. మన గురించి మనకున్న భావంతో, ఎవరినీ కలుగజేసుకోనివ్వం. మన గురించి మనకున్న భావం అంతా పైపైనే. అయితే మనలో చాలా మంది పైపైనే జీవిస్తూ ఉంటారు. భ్రమలతోనే తృప్తి పడుతూ ఉంటారు.

ఇంకొకరికి హాని కలిగించాలనే ప్రవృత్తి గాఢమైనది. మనస్సులో కూడ బెట్టిన ఉక్రోషం ఒక విధమైన జీవశక్తిని, ఒక క్రియానుభూతిని, జీవితానుభూతినీ ఇస్తుంది. కూడబెట్టినది ఖర్చవుతుంది - కోపం ద్వారా, అవమానం, నింద, పట్టుదల, వాటికి వ్యతిరేకమైన వాటి ద్వారా. ఈ ఉక్రోషాన్ని కూడబెట్టనందువల్లనే క్షమాగుణం అవసరమవుతుంది. మానసిక గాయాన్ని పదిలపరచకుండా ఉన్నప్పుడు అది అనవసరమే అవుతుంది.

పొగడ్తని, అవమానాన్నీ, మానసిక గాయాన్నీ, అనురాగాన్నీ ఎందుకు పదిలపరుస్తూ ఉంటాం? ఈ అనుభవాలనూ, ఈ ప్రక్రియలనూ కూడబెట్టటమే లేకుంటే మనమే ఉండం. మనకి పేరు, మమకారం, నమ్మకం లేనట్లయితే మనం ఏమీ కాము. ఏమీ కాకుండా ఉంటామనే భయమే కూడబెట్టేటట్లు తొందరపెడుతుంది.

ఈ భయమే - వ్యక్తమైనది గాని, అవ్యక్తమయినది గాని - మనకి ఎన్ని కూడబెట్టే కార్యకలాపాలున్నా, మన విచ్ఛిన్నతకీ, వినాశానికీ కారకమవుతుంది. ఈ భయం యొక్క సత్యాన్ని మనం గ్రహించగలిగినప్పుడు మనల్ని స్వేచ్ఛగా ఉండనిస్తుంది సత్యం - అంతేకాని, స్వేచ్ఛగా ఉండాలని నిర్ణయం తీసుకున్నందువల్ల కాదు.

మీరు ఏమీ కాదు. మీకు పేరు, బిరుదు ఉండొచ్చును. ఆస్తి, బ్యాంకులో డబ్బూ ఉండొచ్చును. మీకు అధికారం ఉండి, పేరు పొందిన వారు కావచ్చు. ఈ రక్షణలన్నీ ఉన్నప్పటికీ, మీరు ఏమీ కానట్లుగానే ఉంటారు. ఏమీ కాకపోవటమనే దాన్ని గురించీ, ఈ శూన్యత గురించీ, మీరు బొత్తిగా తెలుసుకోకుండా ఉండి ఉండొచ్చు. లేదా, తెలుసుకోవాలన్న కోరిక లేకపోవచ్చు. కాని, అది అలాగే ఉంటుంది - దాన్ని తప్పించుకోవటానికి మీ ఇష్టం వచ్చినట్లు ఏంచేసినా సరే. పక్కతోవల్నుంచి దాన్ని తప్పించుకోవచ్చు. వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని హింస, ఆరాధన, జ్ఞానం, వినోదం - ఏవిధంగానైనా, మీరు నిద్రిస్తున్నా, మేల్కొని ఉన్నా, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈ ఏమీ కాకపోవటమనే దానితోనూ, దానివల్ల కలిగే భయంతోనూ మీకు సంబంధం ఏర్పడటమన్నది మీరు దాన్ని తప్పించుకునే మార్గాలన్నిటినీ మీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మీకు దానితో ఒక ప్రత్యేక వ్యక్తిగా సంబంధం లేదు. గమనించేవాడుగా వాటిని గమనించడం లేదు. ఆలోచించేవాడుగా గమనించేవాడుగా మీరు లేనప్పుడు అదీ ఉండదు. మీరూ, ఏమీ కాకపోవటమనేదీ ఒక్కటే. మీరూ, ఏమీకాక పోవటమనేదీ ఒక సమైక్యస్థితి - రెండూ వేరు వేరు ప్రక్రియలు కావు. మీరు ఆలోచించేవాడిగా దాన్ని గురించి భయపడితే, అది మీకు వ్యతిరేకమయినదనీ, విరుద్ధమైనదనీ అనుకుని దాన్ని సమీపించబోతే, దానిపట్ల మీరుఏ చర్య తీసుకున్నా అది భ్రమకి దారి తీస్తుంది. ఆ ఏమీ కాకపోవటమనేది మీరేనని కనుక్కుంటున్నప్పుడు, అనుభవం పొందుతున్నప్పుడు భయం పూర్తిగా అడుగంటుతుంది. ఎందువల్లనంటే ఆ భయం అనేది - ఆలోచించేవాడు తను వేరు, తన ఆలోచనలు వేరు అనుకొని, వాటితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొంటున్నప్పుడే ఉంటుంది కనుక. ఆ భయం పూర్తిగా అంతమై పోయినప్పుడే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఇటువంటి ప్రశాంతతలో సత్యం ఆవిర్భవిస్తుంది.