మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/కొనసాగించటం

వికీసోర్స్ నుండి

38. కొనసాగించటం.

ఎదురుగుండా ఉన్న సీటులో కూర్చున్నాయన తన్ను తాను పరిచయం చేసుకున్నాడు - ఏవో ప్రశ్నలడగాలనే ఉద్దేశంతో. మరణం గురించీ, మరణం తరువాత రాబోయే దాన్ని గురించీ ప్రతి మంచి పుస్తకాన్నీ - ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకూ వచ్చిన పుస్తకాలన్నిటినీ చదివానని చెప్పారాయన. ఆయన భౌతిక విజ్ఞానశాస్త్ర పరిశోధనా సంఘంలో సభ్యుడుగా ఉండేవాడుట. ఎన్నో ప్రశస్తమైన, ప్రతిష్ఠాకరమైన సమావేశాల్లో పాల్గొన్నాడుట. ఆధ్యాత్మిక ప్రదర్శనలనెన్నిటినో, నిజమైన వాటినే దర్శించాడుట. ఆయన ఈ విషయమై ఎంతో తీవ్రంగా ఆలోచించటం వల్ల అనేక సార్లు స్వయంగా భౌతిక ప్రకృతికి అతీతమైన వాటిని దర్శించగలిగాడుట. అయితే, అవన్నీ తన ఊహా జనితాలు కావచ్చునని ఆయనే అన్నాడు మళ్లీ. కాని, అలాటివై ఉండవని తను అభిప్రాయ పడుతున్నానన్నాడు. ఏమయినప్పటికీ, ఆయన అంత విస్తృతంగా చదివినవాడయినప్పటికీ, ఎంతో తెలిసిన వాళ్లెందరితోనో చర్చించి ఉన్నప్పటికీ, మరణించిన వారి భౌతిక దేహాలను నిస్సంశయంగా చూసి ఉన్నప్పటికీ, అసలు నిజం అర్థమైందనుకుని ఇంతవరకు తృప్తి పడలేకపోతున్నాడుట. నమ్మకం గురించీ, నమ్మకం లేకపోవటం గురించీ ఎంతో గంభీరంగా చర్చించాడు. ఆయన స్నేహితుల్లో - మరణానంతరం ఏదో ఇంకా కొనసాగుతూనే ఉంటుందని నమ్మేవాళ్లు కొందరున్నారుట, మరణంతో ఈ భౌతికదేహంతో బాటు జీవితంకూడా అంతమైపోతుందనీ, ఆ తరవాత ఇంకేమీ ఉండదనీ నమ్మేవాళ్లూ ఉన్నారుట. ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతో జ్ఞానమూ, అనుభవమూ సంపాదించినప్పటికీ ఇంకా మనస్సులో కొంత సందేహం మిగిలిపోయిందిట. వయస్సు పైబడుతున్నందువల్ల నిజం ఏమిటో తెలుసుకోవాలని కోరుతున్నారుట. ఆయనకి మరణం అంటే భయం లేదుట. కాని, దాని గురించి నిజం తెలియాలిట.

రైలు ఆగింది. అప్పుడే రెండు చక్రాల గుర్రపుబండి ఒకటి అటువైపు నుంచి పోతోంది. ఆ బండి మీద ఒక శవం ఉంది. కోరారంగు బట్టలో చుట్టి ఉంది. అప్పుడే కోసిన పచ్చని పొడుగాటి వెదురుబొంగులు రెండింటిపైన వేసి కట్టి ఉంది. ఏదో గ్రామం నుంచి నదికి తీసుకువెడుతున్నారు - దహనం చేయటానికి. ఆ గతుకుల బాట మీద బండిపోతూంటే శవం అదిరి పడుతోంది. బట్ట క్రింద ఉన్న తలకి సహజంగా మరీ ఎక్కువగా తగుల్తోంది కుదుపు. బండితోలే వాడుకాక, ఆ బండిలో మరొక మనిషి ఉన్నాడంతే. ఎవరో దగ్గర బంధువై ఉంటాడు. బాగా ఏడ్చిన మీదట కళ్లు ఎర్రబడ్డాయి. వసంతకాలం ప్రారంభమైంది. ఆకాశం లేత నీలంరంగులో ఉంది. పిల్లలు దారిలో మట్టిలో ఆడుకుంటున్నారు. చావు సామాన్యంగా కనిపించే దృశ్యమేనేమో. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. మరణం గురించి ప్రశ్నిస్తున్నాయన కూడా ఆ బండినీ, అది మోస్తున్న దాన్నీ గమనించలేదు!

నమ్మకం అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. అటుపైన అనుభవం నమ్మకాని బలపరుస్తుంది. మీరు నమ్మిన దాన్నే మీరు అనుభవం పొందుతారు. ఏం చెయ్యాలో మనస్సు శాసిస్తుంది. అనుభవాన్ని అనువదించి చెబుతుంది. దాన్ని ఆహ్వానిస్తుంది, లేదా, తిరస్కరిస్తుంది. మనస్సే అనుభవం యొక్క పర్యవసానం. మనస్సు దానికి పరిచయమైన దాన్నీ, తెలిసిన దాన్నే గుర్తు పడుతుంది, లేదా, అనుభవం పొందుతుంది - ఏస్థాయి లోనైనా సరే. అంతవరకు తెలియని దాన్ని అనుభవం పొందలేదు మనస్సు. అనుభవం కన్న మనస్సూ, దాని ప్రతిక్రియా ఎక్కువ అర్థవంతమైనవి. సత్యాన్ని అర్థం చేసుకోవటానికి అనుభవం మీద ఆధారపడటం అజ్ఞానానికీ, భ్రమకీ లోను కావటమే. సత్యాన్ని అనుభవం పొందాలని కోరటం సత్యాన్ని కాదనటమే - ఎందువల్లనంటే, కోరిక ప్రభావితం చేస్తుంది కనుక. నమ్మకం అనేది కోరిక కప్పుకునే మరోవస్త్రం మాత్రమే.

జ్ఞానం, నమ్మకం, సహేతుకంగా నమ్మటం, నిశ్చయానికి రావాటం, అనుభవం - ఇవన్నీ సత్యానికి ప్రతిబంధకాలు. అవన్నీ కలిసి తయారైనదే ఆత్మ. మొత్తం అనుభవాల ఫలితం లేనట్లయితే ఆత్మ ఉండనే ఉండదు. ఉండటం, అనుభవించటం ఆఖరైపోతుందన్న భయమే మరణభయం. ఉంటుందనీ, అనుభవం పొందుతూ, ఉండటం నిశ్చయమనీ నమ్మకంగా తెలిసినప్పుడు భయం ఉండదు. తెలిసినదానికీ, తెలియనిదానికీ మధ్యనున్న సంబంధంలోనే భయం ఉంటుంది. తెలిసినది తెలియనిదాన్ని లోబరచు కోవాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. తెలిసినది తెలియనదాన్ని అనుభవం పొందటం అసాధ్యం. తెలియనిది ఉండాలంటే తెలిసినది అంతమొందాలి.

సత్యాన్ని అనుభవం పొందాలనే కోరికని వెతికి పట్టుకుని దాన్ని అర్థం చేసుకోవాలి. కాని అన్వేషణలో ఒక ఉద్దేశం ఇమిడి ఉంటే సత్యం ఆవిర్భవించదు. వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని, ఏ ఉద్దేశమూ లేకుండా అన్వేషణ జరగగలదా? ఉద్దేశం ఉన్నప్పుడు అది అన్వేషణ అవుతుందా? మీకు కావలసినది మీకు ముందే తెలిసినప్పుడు, మీ లక్ష్యాన్ని ముందే రూపొందించుకున్నప్పుడు కేవలం ఆ లక్ష్యసాధనమే మీ అన్వేషణ - అది స్వయం కల్పితం. అలా అయితే, అన్వేషణ సంతృప్తి కోసమే కాని సత్యం కోసం కాదు. ఏ విధంగా సంతృప్తి లభిస్తుందో, అందుకు తగిన సాధనాన్నే ఎంచుకోవటం జరుగుతుంది. ఉన్నదాన్ని అర్థం చేసుకోవటానికొక ఉద్దేశం అవసరం ఉండదు. ఉద్దేశం, సాధనం అవగాహన కాకుండా అడ్డుపడతాయి. అన్వేషణ అంటే ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెలుసుకోవటం - ఏదో ఫలానా దాని కోసం అని కాదు. ఒక లక్ష్యం కోసం దాని సాధన కోసం పడే తాపత్రయం గురించి తెలుసుకోవటమే అన్వేషణ. ఇలా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెలుసుకున్నందువల్ల 'ఉన్నది' అవగాహన అవుతుంది.

శాశ్వతత్వం కోసం, కొనసాగింపు కోసం మనం తాపత్రయ పడటం చిత్రంగా ఉంటుంది. ఈ కోరిక ఎన్నో రూపాల్లో ఉంటుంది. మోటుగా ఉండేది మొదలుకొని అత్యంత సూక్ష్మరూపం వరకూ స్పష్టమైన రూపాలు మనకి పరిచితమైనవే; పేరు, ఆకారం, లక్షణం మొదలైనవి. పైకి కనిపించని తాపత్రయాన్ని కనిపెట్టటం, అర్థం చేసుకోవటం అంతకన్న చాలా కష్టం. ఒక ఊహ గాని, ఉండటం గాని, జ్ఞానం గాని, అవటం గాని - ఏ స్థాయిలో ఉన్నా ఆ ప్రత్యేక రూపాన్ని తెలుసుకోవటం, వెలికి తీసుకురావటం కష్టం. కొనసాగుతూ ఉండడం గురించి మాత్రమే మనకు తెలుసును. కొనసాగుతూ ఉండని స్థితి ఎటువంటిదో మనకి తెలియదు. దాన్ని మనం మరణం అనీ, ఎవరికీ తెలియనిది అనీ, మాయ అనీ అనేక రకాలుగా పిలుస్తాం. దానికి ఆ విధంగా పేర్లు పెట్టి, దాన్ని ఏదో విధంగా పట్టుకోవాలని చూస్తాం - మళ్లీ అది కొనసాగుతూ ఉండాలనే కోరికే.

ఆత్మచైతన్యం అంటే - అనుభవం, అనుభవానికి నామకరణం చేయటం, దాన్ని పదిలపరచుకోవటం. ఈ ప్రక్రియ మనస్సులో వివిధ అంతస్తుల్లో జరుగుతూ ఉంటుంది. ఈ ఆత్మచైతన్య ప్రక్రియని పట్టుకు వ్రేలాడతాం - దానివల్ల కలిగే ఆనందం క్షణికమే అయినప్పటికీ, సంఘర్షణ, గందరగోళం, దుఃఖం అనంతమైనప్పటికీ. మనకి తెలిసినది అంతే. అదే మన బ్రతుకు - మన జీవం, భావం, స్మృతి, శబ్దం - అన్నీ కొనసాగుతూ ఉండటమే. భావం కొనసాగుతుంది - మొత్తంగానో, దానిలో ఒక భాగంగానో, "నేను"గా రూపొందిన భావం అది. కాని, ఈ కొనసాగింపువల్ల స్వేచ్ఛ ప్రాప్తిస్తుందా? స్వేచ్ఛలోనే కదా ఆవిష్కారం, పునఃసృష్టీ ఉన్నవి. కొనసాగేది, ఉన్నదే గాని మరొకటి కాజాలదు, ఉన్నదానిలోనే కొద్ది మార్పులు ఉంటాయి. కాని ఈ మార్పులు దానికి కొత్తదనాన్నివ్వలేవు. వేరే వేషం వేసుకోవచ్చు, వేరే రంగు పూసుకోవచ్చు, అయినా, అది అప్పటికీ భావమే, జ్ఞాపకమే, మాట మాత్రమే. ఈ కొనసాగింపుకి ముఖ్యకేంద్రం ఆధ్యాత్మిక సారం కాదు. ఎందువల్లనంటే, అది అప్పటికీ ఆలోచనా రంగానికీ, జ్ఞాపకానికీ చెందినది కావడంతో కాలానికి కూడా చెందినదవుతుంది. తాను కల్పించిన దాన్నే అది అనుభవం పొందగలదు. ఆ స్వయంకల్పిత అనుభవాన్ని మరికొంత పొడిగింపు చేస్తుంది. ఆ విధంగా అది ఉన్నంతకాలం దాన్ని మించి దేన్నీ అనుభవం పొందలేదు. అది గతించాలి. భావం ద్వారా, జ్ఞాపకం ద్వారా, శబ్దం ద్వారా కొనసాగటం జరగకుండా అది అంతమొందాలి. ఆ కేంద్రం అంతం కావటంతోనే పునరావిర్భవించటం జరుగుతుంది. ఆ పునఃసృష్టి, కొనసాగింపు కాదు. మరణం కూడా జీవితం లాగే పునరావిర్భవిస్తుంది. ఈ పునరావిర్భావమే సృష్టి.