మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/"నా మార్గం, మీ మార్గం"
40. "నా మార్గం, మీ మార్గం"
ఆయన పండితుడు. ఆయనకి ఎన్నో భాషలు మాట్లాడటం వచ్చు. మరొకరు మద్యానికి అలవాటుపడ్డట్లుగా ఆయన జ్ఞానానికి అలవాటుపడ్డాడు. తన అభిప్రాయాలకు ఆధారాలుగా ఎవరెవరో చెప్పిన వాటిని ఎప్పుడూ ఉదాహరిస్తూ ఉంటాడు. ఆయనకి విజ్ఞాన, సాంఘిక, శాస్త్రాల్లో కొంత ప్రవేశం ఉంది. తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు బుర్ర కొంచెం ఊపి, చిరునవ్వు నవ్వుతాడు - అది తన అభిప్రాయం మాత్రమే కాదు, అదే తుది సత్యం అన్నట్లుగా. ఆయన ఉద్దేశంలో ఆయనకున్న అనుభవాలే అధికార పూర్వకమైనవీ, నిశ్చితమైనవీ. "మీ అనుభవాలు మీకుండొచ్చును, కాని మీరు నన్ను ఒప్పించలేరు" అన్నాడు. "మీ మార్గాన్ని మీరు వెళ్లండి. నా మార్గం నాది. సత్యానికి అనేక మార్గాలున్నాయి. ఓ రోజున మనమంతా అక్కడ కలుసుకుందాం" అన్నాడు. ఆయన ఒక విధంగా స్నేహపూర్వకంగానే ఉన్నాడు. కానీ కచ్చితంగా ఉన్నాడు. ఆయన ఉద్దేశంలో దివ్య ప్రభువులు నిజంగా లేకపోయినా, కనిపించే గురువులంతా యథార్థమే. వారికి శిష్యులు అవసరం. ఆయన మరికొందరితో కలిసి ఈ మార్గాన్నీ, వారి ఆధిపత్యాన్నీ స్వీకరించటానికి ఇష్టపడిన కొందరికి శిష్యరికం ప్రసాదించారట. కానీ, మరణించిన వారిలో మార్గదర్శకులైనట్టి వారిని ఆధ్యాత్మిక శక్తితో దర్శించిన వారితో తనకు గాని, తన తోటివారికి గాని సంబంధం లేదన్నాడు. దివ్య ప్రభువులను దర్శించటానికి సేవ చెయ్యాలి, కష్టపడాలి, త్యాగం చెయ్యాలి. చెప్పినదాన్ని అనుసరించాలి. కొన్ని సద్గుణాలను సాధన చెయ్యాలి. నమ్మకం ఉండటం అవసరం.
ఉన్నదాన్ని కనుక్కునేందుకు సాధనంగా, అనుభవం మీద ఆధారపడటం - భ్రమలో చిక్కుకోవటమే. కోరిక, తాపత్రయం అనుభవాన్ని ప్రభావితం చేస్తాయి. సత్యాన్ని అవగాహన చేసుకోవటానికి సాధనంగా, అనుభవం మీద ఆధారపడటం - స్వాతిశయాన్ని పెంపొందించుకునే మార్గాన్ని అవలంభించటమే. అనుభవం వల్ల దుఃఖం నుంచి విముక్తి లభించదు. జీవితాన్ని ఎదుర్కోవటానికి తగిన ప్రక్రియ కాదు అనుభవం. సమస్యని కొత్తగా స్వచ్ఛంగా చూడాలి - సమస్యలెప్పుడూ కొత్తవే కనుక. సమస్యని దానికి తగినట్లుగా చూడాలంటే అనుభవాన్ని పరిమితం చేసే జ్ఞాపకాన్ని అవతలికి తోసెయ్యాలి. సంతోషం, బాధ అనే ప్రతిక్రియలను ప్రగాఢంగా అర్థ చేసుకోవాలి. అనుభవం సత్యానికి అవరోధం. ఎందువల్లనంటే, అనుభవం కాలానికి చెందినది. అంటే, గతం యొక్క ఫలితం. అనుభవంతోనూ, కాలంతోనూ ఏర్పడిన మనస్సు కాలరహితమైన దాన్ని ఎలా అర్థ చేసుకోగలదు? అనుభవం యొక్క నిజం వ్యక్తిగతమైన చాదస్తాలమీదా ఊహలమీదా ఆధారపడి ఉండదు. నిరసన గాని, సమర్ధన గాని, ఏ రకమైన ఐక్యభావం గాని లేకుండా తెలుసుకున్నప్పుడే సత్యం అవగాహన అవుతుంది. అనుభవం సత్యానికి మార్గం కాదు. "మీ అనుభవం" అనీ "నా అనుభవం" అనీ లేదు - సమస్యని వివేకంతో అవగాహన చేసుకోవటం మాత్రమే.
ఆత్మజ్ఞానం లేనట్లయితే, అనుభవం, భ్రమని పెంపొందిస్తుంది. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఏ సమస్యకైనా ప్రతిక్రియగా ఏర్పడే అనుభవాన్ని పదిలపరుచుకోవటం జరగదు. దాని జ్ఞాపకం మిగలదు. ఆత్మజ్ఞానం అంటే అనుక్షణమూ తన మనసు అవలంబించే మార్గాలనీ, దాని ఉద్దేశాలనీ, ప్రయత్నాలనీ, ఆలోచనలనీ, తృష్ణలనీ కనుక్కోవటమే. "మీ అనుభవం" అనీ, "నా అనుభవం" అనీ ఎన్నటికీ ఉండజాలదు. "నా అనుభవం" అనటంలోనే అజ్ఞానంలో, భ్రమలో ఉన్నట్లు తెలుస్తుంది. కాని, మనలో చాలామంది భ్రమలోనే జీవించటానికి ఇష్టపడతారు - అందులోనే ఎక్కువ సంతృప్తి ఉంటుంది కనుక. మనకి ఉత్తేజాన్ని కలిగించి, మనకొక ఔన్నత్య భావాన్ని కలుగజేసే అంతరంగిక ఆశ్రయం అది. నాకే కనుక సామర్థ్యం, సహజమైన చాకచక్యం, గడుసుతనం ఉన్నట్లయితే, నేను ఆ భ్రమకి నాయకుడిగా గాని మధ్యవర్తిగా గాని, ప్రతినిధిగా గాని అవుతాను. చాలా మందికి ఉన్నదాన్ని తప్పించుకోవటమే ఇష్టం. ఒక సంస్థ ఆస్తులతో, ఆచారాలతో, ప్రమాణాలతో, రహస్య సమావేశాలతో స్థాపితమవుతుంది. భ్రమకి సంప్రదాయం ప్రకారం దుస్తులు వేసి, గౌరవస్థానంలో ఉంచి, ఒక అధికార పరంపర విధానాన్ని ఏర్పరుస్తారు - మనలో అందరూ ఏదో ఒక విధమైన అధికారాన్ని ఆశిస్తూ ఉంటారు కనుక. కొత్తగా చేరినవాడు, ప్రారంభదశలో ఉన్నవాడు, శిష్యుడు, గురువు - అని ఏర్పాటు చేస్తారు. గురువుల్లో కూడా అనేక రకాలైన వారున్నారు - వారి వారి ఆధ్యాత్మిక వికాసాన్ని బట్టి. మనలో అనేక మంది ఇతరులను తమ స్వలాభానికి వుపయోగించుకోవాలన్నా, ఇతరుల లాభానికి తాము ఉపయోగపడాలన్నా ఇష్టపడతారు. ఈ వ్యవస్థ అలాంటి సదుపాయాలను కలగజేస్తుంది - నిగూఢంగానో, ప్రకాశంగానో.
ఇతరులను స్వలాభానికి ఉపయోగించుకోవడమంటే ఇతరుల స్వలాభానికి ఉపయోగింపబడటమే. ఇతరులను మీ మానసికావసరాలకు వినియోగించుకోవాలని కోరటంపైన ఆధారపడేటట్లు చేస్తుంది. ఆధార పడినప్పుడు పట్టుకోవాలి, సొంతం చేసుకోవాలి, మీరు సొంతం చేసుకున్నది మిమ్మల్నే సొంతం చేసుకుంటుంది. సూక్ష్మంగా గాని, స్థూలంగా గాని ఏ విధంగానూ ఆధారపడకుండా, వస్తువుల్నీ, మనుష్యుల్నీ, భావాల్నీ సొంతం చేసుకోకుండా ఉంటే మీరు శూన్యంగా ఉంటారు - మీరు ఏవిధమైన ప్రాముఖ్యం లేనట్లుగా ఉంటారు. మీరు ఏదో అవాలనుకుంటారు; ఏమీ కాకపోతే ఏమవుతుందోననే ఎముకలు కొరికే భయాన్ని తప్పించుకోవటానికి ఇదో అదో ఏదో ఒక సంస్థకో, ఏదో ఒక సిద్ధాంతానికో, ఈ చర్చికో, ఆ దేవాలయానికో చెందుతారు. ఆ విధంగా ఇతరుల లాభానికి వినియోగింప బడతారు. దాంతో, మీరూ స్వలాభానికీ ఇతరులను వినియోగించుకుంటారు. ఈ అధికార పరంపర నిర్మాణం ఆత్మవిస్తృతికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. మీరు సౌభ్రాతృత్వాన్ని కోరవచ్చు. కాని, సౌభ్రాతృత్వం ఎలా ఉంటుంది - మీరు ఆధ్యాత్మిక వినాశానికి ప్రయత్నిస్తున్నప్పుడు? ప్రాపంచిక పదవుల్ని చూసి మీరు నవ్వొచ్చు. కాని మీరు దివ్య ప్రభువునీ, రక్షకుడినీ, గురువునీ ఆధ్యాత్మిక రంగంలో ఒప్పుకుంటున్నప్పుడు మీరు ప్రాపంచిక ప్రవృత్తిని అందులోకి కూడా తోడ్కొనిపోతున్నట్లు కాదా? ఆధ్యాత్మిక వికాసంలోనూ, సత్యాన్ని అవగాహన చేసుకోవటంలోనూ, దైవాన్ని తెలుసుకోవటంలోనూ అధికార పరంపర విభజనలూ, తరతమ భేదాలూ ఉండగలవా? ప్రేమ విభజనకి తావివ్వదు. ప్రేమిస్తారు, లేకపోతే లేదు, అంతేకాని, ప్రేమ లేకుండా ఉండే సుదీర్ఘ మార్గాన్ని అవలంబిస్తూ ప్రేమ అనే లక్ష్యాన్ని చేరుకోవటం కుదరదు. మీరు ప్రేమించటం లేదని మీకు "తెలిసి"నప్పుడు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆ యథార్థాన్ని తెలుసుకున్నప్పుడు పరివర్తన రావటానికి అవకాశం ఉంటుంది. కాని, గురువుకీ శిష్యుడికీ మధ్య, సిద్ధి పొందిన వారికీ పొందని వారికీ మధ్య, రక్షకుడికీ పాపికీ మధ్య విభేదాన్ని శ్రమపడి అలవరచుకోవడమంటే ప్రేమని వదులుకోవటమే. స్వలాభానికి ఇతరులను వినియోగించుకునేవాడూ, మరోవైపు తాను ఇతరులచే ఉపయోగింపబడేవాడు, ఈ అంధకారంలో, ఈ భ్రమలో ఆనందంగా వేటాడుకోవచ్చు.
దైవానికీ, లేదా సత్యానికీ మీకూ మధ్య ఎడం మీరు తెచ్చుకున్నదే అంటే, తెలిసిన దాన్నీ, నిశ్చయమైన దాన్నీ, రక్షణనీ పట్టుకు వ్రేలాడే మనస్సు తెచ్చినదే. ఈ ఎడానికి వంతెన వేయలేము. దాన్ని దాటించేందుకు ఏ విధమైన పూజాలేదు, క్రమశిక్షణ లేదు, త్యాగం లేదు. నిజమైన దాని వద్దకు మిమ్మల్ని తీసుకుపోవటం కాని, ఆ అంతరాన్ని లేకుండా చేయటం గాని ఏ రక్షకుడికీ, ఏ దివ్యజ్ఞాన సంపన్నుడికీ, ఏ గురువుకీ సాధ్యం కాదు. విభజన ఏర్పడినది నిజానికీ, మీకూ మధ్య కాదు. మీలో మీకే - పరస్పర విరుద్ధమైన కోరికల మధ్య. కోరిక దానికి వ్యతిరేకమైన దాన్ని సృష్టిస్తుంది. పరివర్తన అంటే ఒకే కోరికపైన కేంద్రీకృతం కావటం కాదు - తాపత్రయం తెచ్చే సంఘర్షణ నుంచి విముక్తి పొందటమే. మనిషిలో ఏ స్థాయిలో తాపత్రయం ఉన్నప్పటికీ అది సంఘర్షణని పెంపొదించుతుంది. దాన్నుంచి తప్పించుకోవటానికి వీలైన ప్రతి మార్గాన్నీ ప్రయత్నిస్తాం. దానివల్ల లోపలా బయటా కూడా సంఘర్షణ ఎక్కువవుతుంది, అంతే. ఈ సంఘర్షణని రూపు మాపడం ఇంకొకరి వల్ల జరిగేది కాదు - వారెంత గొప్పవారైనా. మాయవల్లనో, పూజవల్లనో జరిగేది కూడా కాదు. ఇవి మిమ్మల్ని హాయిగా నిద్రపుచ్చవచ్చు. కాని, మేలుకోగానే ఆ సమస్య ఇంకా అక్కడే ఉంటుంది. కాని, మనలో చాలా మంది మేలుకోవాలని కోరుకోరు. అందువల్ల మనం భ్రమలోనే బ్రతుకుతాం, సంఘర్షణ రూపుమాసి పోయినప్పుడు ప్రశాంతత ఉంటుంది. అటువంటప్పుడే వాస్తవమైనది ఉద్భవిస్తుంది. దివ్యప్రభువులూ, రక్షకులూ, గురువులూ ముఖ్యం కాదు. అవసరమైనదేమిటంటే, కోరికల వలన పెరిగే సంఘర్షణని అవగాహన చేసుకోవటం. ఈ అవగాహన ఆత్మజ్ఞానం వల్లా, మనసు యొక్క సంచలనాలను నిత్యం తెలుసుకుంటూ ఉండటం వల్లా కలుగుతుంది.
తన్ను తాను తెలుసుకుంటూ ఉండటం ప్రయాసకరం. మనలో చాలామంది సులభమైన ఊహామార్గాన్ని ఇష్టపడతారు కాబట్టి మన జీవితానికొక ఆకారాన్నీ, పద్ధతినీ సమకూర్చే అధికారిని ప్రవేశపెడతారు. ఈ అధికారి ప్రభుత్వంలా సామూహికమైనది కావచ్చు, దివ్య ప్రభువు, రక్షకుడు, గురువు వంటి వ్యక్తి కావచ్చు. అధికారం ఎటువంటిదైనా అంధకార బంధురమే. ఆలోచనారాహిత్యాన్ని పెంచుతుంది. మనలో చాలా మంది ఆలోచిస్తే బాధ కలుగుతుంది అనుకుంటారు కాబట్టి అధికారికి తమ్ము తాము అర్పించుకుంటారు.
అధికారి అధికారాన్ని పెంపొందించుకుంటాడు. అధికారం ఎప్పుడూ కేంద్రీకృతం అవుతుంది. అందువల్ల పూర్తిగా అనర్థమవుతుంది. అధికారాన్ని చెలాయించేవాడినే కాకుండా అతన్ని అనుసరించేవాడిని కూడా చెడగొడుతుంది. జ్ఞానంతోనూ, అనుభంతోనూ వచ్చే అధికారం వక్రగతికి తెస్తుంది - అది దివ్యప్రభువులో ఉన్నా, ఆయన ప్రతినిధిలో ఉన్నా, మత ప్రవక్తలో ఉన్నా. మీ సొంత జీవితమూ, ఈ అనంతమనిపించే సంఘర్షణే ముఖ్యం కాని ఒక పద్ధతో, ఒక నాయకుడో కాదు. దివ్య ప్రభువు యొక్క అధికారం గాని, మత ప్రవక్త అధికారం గాని మిమ్మల్ని ముఖ్య సమస్య నుంచి - అంటే మీ అంతస్సంఘర్షణ నుంచి దూరం చేస్తుంది. జీవనవిధానాన్ని అన్వేషించటం ద్వారా దుఃఖాన్ని అర్థం చేసుకోవటంగాని, రూపుమాపటం గాని సాధ్యం కాదు - అటువంటి అన్వేషణ దుఃఖాన్ని తప్పించుకోవటానికి మాత్రమే. ఒక పద్ధతిని తమపైన విధించుకోవటం తప్పించుకునే మార్గమే. తప్పించుకున్నది ప్రకోపించి మరింత విపత్తునీ బాధనీ తెస్తుందంతే. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవటం ఎంత బాధాకరమైనా, లేదా తాత్కాలికంగా ఆనందదాయకమైనా, దానితో వివేకం ఆరంభమవుతుంది.
వివేకానికి మార్గంలేదు. మార్గం ఉన్నట్లయితే అది రూపొందింపబడినదీ, అప్పుడే ఊహింపబడినదీ, తెలిసిపోయినదీ అయి ఉంటుంది. వివేకం తెలుసుకోగలిగేదా, అలవరచుకోగలిగేదా? అది నేర్చుకునే విషయమా? పోగుచేసుకునేదా? అలాగే అయితే, అప్పుడది జ్ఞానం మాత్రమే అవుతుంది - అనుభవం వల్ల కలిగినది కావచ్చు, పుస్తకాల్లో ఉన్నది కావచ్చు. అనుభవం, జ్ఞానం గొలుసులా సాగే ప్రతిక్రియలు. అందువల్ల అవి కొత్తదాన్నీ, తాజాగా ఉన్నదాన్నీ, సృష్టింపబడని దాన్నీ ఎన్నటికీ తెలుసుకోలేవు. అనుభవం, జ్ఞానం కొనసాగుతూ ఉండేవి కాబట్టి తమ స్వయంకల్పిత రూపాలకు మార్గాన్నేర్పరచుకుంటున్నాయి. అందువల్ల అవి అనువిత్యం బంధనంగా ఉంటాయి. ఉన్న స్థితిని క్షణక్షణమూ అనుభవాన్నీ, జ్ఞానాన్నీ కూడబెట్టకుండా అవగాహన చేసుకోవటం వివేకం. కూడబెట్టినది స్వేచ్ఛగా అవగాహన చేసుకోనివ్వదు. స్వేచ్ఛ లేనిదే సాక్షాత్కారం కాదు. ఈ అనంతమైన సాక్షాత్కారంలోనే వివేకం ఉంది. వివేకం ఎప్పుడూ క్రొత్తగా స్వచ్ఛంగా ఉంటుంది. దాన్ని పోగుచేసే సాధనం లేదు. సాధనం స్వచ్ఛతనీ, క్రొత్తదనాన్నీ, అప్రయత్న సాక్షాత్కారాన్ని ధ్వంసం చేస్తుంది.
సత్యానికి అనేక మార్గాలుంటాయనేది మనస్సు అసహనంతో కనిపెట్టిన విషయం. అవి మనస్సు అలవరచుకున్న సహనం ఫలితంగా వచ్చినవి. " నేను నా మార్గాన్ని అనుసరిస్తాను, మీరు మీ దాన్ని అనుసరించండి. కాని మనం స్నేహితులుగా ఉందాం. ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుందాం" అంటారు. మీరు ఉత్తరానికీ, నేను దక్షిణానికీ వెడుతూంటే మనం కలుసుకుంటామా? మీకు కొన్ని నమ్మకాలుండి, నాకు వేరే కొన్ని ఉంటే మనం స్నేహంగా ఉండగలమా? నేను సామూహిక హంతకుణ్ణి, మీరు శాంతి యుతమైనవారూ అయితే? స్నేహంగా ఉండటం అంటే పనిలోనూ, ఆలోచనలోనూ సంబంధం ఉండటం. అయితే, ద్వేషించే మనిషికి, ప్రేమించే మనిషికీ మధ్యా, భ్రమలో ఉన్న మనిషికీ, స్వేచ్ఛగా ఉన్నవానికీ మధ్యా ఏదైనా సంబంధం ఉంటుందా? స్వేచ్ఛగా ఉన్న మనిషి బంధనంలో ఉన్నవానితో ఏదో విధమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు; కాని భ్రమలో ఉన్న మనిషి స్వేచ్ఛగా ఉన్న మనిషితో సంబంధం పెట్టుకోనేలేడు.
విడిగా ఉన్నవాళ్లు వారి వారి ప్రత్యేకతల్ని పట్టుకుని వదలక తమలాగే స్వార్థపరులైన మరికొందరితో సంబంధం పెట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. కాని అటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సంఘర్షణకీ బాధకీ దారితీస్తాయి. ఈ బాధని తప్పించుకోవటానికి గడుసుతనం ఉన్నవాళ్లు సహనాన్ని కనిపెడతారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ కట్టుకున్న అడ్డుగోడ మీంచి చూస్తూ దయ, ఔదార్యం చూపించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సహనం మానసికమైనది - హృదయానికి సంబంధించినది కాదు. ప్రేమిస్తున్నప్పుడు సహనం గురించి మాట్లాడతారా? హృదయం ఖాళీగా ఉన్నప్పుడు మనస్సు దాన్ని కపట సాధానాలతో, భయాలతో నింపుతుంది. సహనం ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఉండదు.
సత్యానికి మార్గం లేదు. సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి. ఆ సాక్షాత్కారానికొక సూత్రం లేదు. సూత్రీకరించినది సత్యం కాదు. అపరిచిత సముద్రం మీద వెళ్లటానికి సిద్ధపడాలి. ఆ అపరిచిత సముద్రం మీరే. మిమ్మల్ని మీరే తెలుసుకోవటానికి సిద్ధపడాలి కాని, ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కాదు - అలాంటప్పుడు తెలుసుకోవటం కుదరదు కనుక. తెలుసుకోవడం అనేదానివలన ఆనందం కలుగుతుంది - స్మృతిని మననం చేసుకున్నప్పుడూ, పోల్చిచూచినప్పుడూ కలిగే ఆనందం కాదది. ఇది నిత్య నూతనమైన ఆనందం ఆత్మజ్ఞానంతో వివేకం ఆరంభమవుతుంది. దాని ప్రశాంతతలో, నీరవతలో అప్రమేయమైనది, అంటే కొలతలకు అందనిది ఉంటుంది.