Jump to content

మన్నారుదాసవిలాసము/భూమిక

వికీసోర్స్ నుండి

భూమిక

తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమునుండి ప్రచురింపఁబడుచున్న యాంధ్రగ్రంథములలో నీ మన్నారుదాసవిలాసముకూడ నొకటి యగును. దక్షిణాంధ్రభాషావికాసమునకు సంబంధించినంతవఱకు తంజాపురాంధ్రనాయకరాజయుగము పెద్దగఁ బేరుప్రఖ్యాతుల నార్జించుకొన్నది. ఆంధ్రసారస్వతచరిత్రలోనే తంజాపురాంధ్రవాఙ్మయ మొక ప్రత్యేకవిభాగ మై నాటి సారస్వతోద్యమప్రత్యేకతను దిగంతములకుఁ జాటున దై యుండుట సారస్వతోపాసకు లందఱకును దెలిసిన విషయమే. ప్రబంధములు, ద్విపదలు, యక్షగానములు, పదములు, కీర్తనము లిత్యాది సకలవిభాగములలో నానాఁడు వెల్లివిరిసిన యాంధ్రకవిపండితుల ప్రతిభ తరతరాలకు మార్గదర్శక మైనది. విజయనగరమునఁ గృష్ణదేవరాయలవలె తంజావూరులో రఘునాథనాయకుఁడు (1614-1633) సంస్కృతాంధ్రసారస్వతపోషకుఁడుగాఁ బ్రసిద్ధిఁ గాంచెను. సారస్వతసాధనలోను సారస్వతోపాసకుల గౌరవించుటలోను రఘునాథుఁ డపరభోజుఁ డని విఖ్యాతి నందుకొనెను.

రఘునాథనాయకుని తర్వాత నతని కుమారుం డైన విజయరాఘవనాయకుఁడు (1633-1673) దక్షిణాంధ్రనాయకరాజ్యసింహాసనము నధిష్ఠించి యనుస్యూతముగ సారస్వతోద్యమమును సాగించెను. అతని లేఖినికూడ కొన్ని యపూర్వగ్రంథములను సృజించినది. అవి యన్నియు 17-వ శతాబ్దపు సారస్వతోద్యమచిహ్నములుగా నేటికిని మనముం దున్నవి. కామరుసు వెంకటపతి సోమయాజి, చెంగల్వ కాళకవి మొదలయిన యుద్దండకవిపండితులతో నిండియుండిన దీతని యాస్థానము. ఆనాఁడు తెలుఁగుతల్లి తంజావూరులో నింతింతనరాని గౌరవమును బొందిన దనుట సత్యదూరము కాదు.

రఘునాథవిజయరాఘవనాయకుల యాస్థానములలోని విశేష మేమన వనితారత్నములుగూడ నాస్థానకవయిత్రులుగా నట స్థానమును వహించుటయే. రఘునాథనాయకుని కాలమున రామభద్రాంబ, మధురవాణి మొదలగు స్త్రీరత్నము లాస్థానకవయిత్రులుగా వెలసి రనుట రంగాజమ్మ యొక్క యీ క్రిందిపద్యమువలన స్పష్ట మగుచున్నది.


తే. గీ.

అయ్య(దినముల) రామభద్రమ్మ మధుర
వాణికాంబయు సరసగీర్వాణభాష
నిట్టి కృతులను రచియించి యిలను గీర్తిఁ
జాలఁ గాంచిరి సుకవులు సన్నుతింప.

(మన్నారుదాసవిలాసము ప్ర. ఆ. ప-18.)

రంగాజమ్మ

విజయరాఘవనాయకుని యాస్థానమంటపమునఁ బేర్కొనఁదగిన స్థానము నాక్రమించిన విదుషీమణులలో రంగాజమ్మ చాలముఖ్యురా లని చెప్పవలసియున్నది. తంజావూరులో మొట్టమొదటిసారిగా విజయరాఘవనాయకునిచేతనే కనకాభిషేకముఁ గొన్న యాంధ్రవిదుషీరత్నముగదా! రంగాజమ్మ. బహుభాషాకోవిదయు విదుషీమణియుఁ గవయిత్రియు నగు రంగాజమ్మ, కృతులను గుఱించియు, నాస్థానమున నామె స్థానమును గుఱించియు, విజయరాఘవనాయకునికి నామెకును గల సంబంధమును గుఱించియు విపులముగా [1]“ఉషాపరిణయము" అను గ్రంథము యొక్క యుపోద్ఘాతమునఁ జర్చించఁబడియున్నది. మరల నవి యన్నియు నిట బేర్కొనుట చర్వితచర్వణమే కాఁగలదు.

మన్నారుదాసవిలాసము

మన్నారుదాసవిలాస మను మఱియొకగ్రంథముకూడ యక్షగానరూపమున నీరంగాజమ్మచేతనే విరచింపఁబడియున్నది. ఆ గ్రంథము కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తు వారిచే 1927 వ సంవత్సరమునఁ బ్రచురింపఁబడియున్నది. గ్రంథము యొక్క మఱియొకతాళపత్రప్రతియే యిది యగు నను భ్రమతో సవివరణసూచీపత్రమున నీ గ్రంథముకూడ ముద్రితగ్రంథముల కోవలోఁ జేర్చఁబడియున్నది[2]. కాని పరిశీలనానంతర మిది యముద్రిత మని తేలినది. తంజాపురాధీశుఁ డైన విజయరాఘవనాయకునికి మన్నారుదాసుఁ డనియు మఱియొకపేరు ప్రసిద్ధి యైనది. మన్నారుగుడి క్షేత్రమున వెలయు శ్రీ రాజగోపాలస్వామిభక్తుఁ డగుటయు నాతని యనుగ్రహవిశేషబలమున నితఁడు జన్మించుటయు నీ ప్రసిద్ధికి కారణము లైనవి. అతని చరిత్ర యే యిందుఁ బ్రధానకథావస్తు వగుటకతన నిది “మన్నారుదాసవిలాస"మని పేర్కొనఁబడియున్నది.

మాతృకలు

ఈ 'మన్నారుదాసవిలాస' ప్రబంధమునకు తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమున రెండు మాతృకలు గలవు. రెండు మాతృకలును దాటియాకు లలో వ్రాయఁబడినవియే. మొదటిది (D. 213) M. 245 సంఖ్యగల యది గ్రంథలిపిలో వ్రాయఁబడియున్నది. రెండవది (D. 214) M. 246 సంఖ్యగల యది తెలుఁగులిపిలో వ్రాయఁబడియున్నది. మొదటిదానిలో 287 ఆకులును, రెండవదానిలో 128 ఆకులును గలవు. పంచమాశ్వాసపు అసంపూర్ణమైన 118-వ పద్యముతో 248 సంఖ్యగల తెలుఁగులిపి గ్రంథము నిలిచిపోయినది. అద్దానికి దర్వాతిభాగము కొంతవఱకు 245 సంఖ్యగల గ్రంథలిపి గ్రంథమున లభించుచున్నది. కడకు పంచమాశ్వాస మసంపూర్ణముగనే యున్నది. అయినను స్వల్పభాగముమాత్రమే పంచమాశ్వాసమున లోపించినది. ఇంచుమించు గ్రంథభాగ మంతయు నున్నట్లే గ్రంథస్థితిని జూచిన దోఁచగలదు. ఈ రెండుమాతృకలను బరిశీలించి చూడ గ్రంథలిపిని వ్రాయఁబడియున్న మాతృక చాలప్రాచీనమైనదిగను జాలవఱకు శుద్ధమైనదిగను నుండుటచే నీ రెండుమాతృకలలోను గ్రంథలిపి మాతృక మూలగ్రంథ మగు నని చెప్పవచ్చును. రెండుగ్రంథముల పరిశీలనానంతర మే యీ ముద్రణము జరిగినది. గ్రంథలిపిలో వ్రాయఁబడియున్న గ్రంథము “క” గ్రంథముగాఁ బరిగణింపఁబడియున్నది. కొంతవఱకు శుద్ధముగను మంచిస్థితిలోను నున్నందున తెలుఁగులిపి మాతృక యీ ముద్రణమునఁ బ్రధానగ్రంథముగా స్వీకరింపఁబడియున్నది. ప్రధానగ్రంథమందలి పాఠములను దిద్దుపట్ల యథామాతృకాపాఠములు క్రింద (Foot Note) "క" గ్రంథపు పాఠములతోఁగూడ నివ్వబడియున్నవి. దొరకుచున్నట్టి రంగాజమ్మ కృతులలో నీ మన్నారుదాసవిలాసము కట్టకడపట ముద్రింపఁబడున దైనను నామెచే మొట్ట మొదట రచింపఁబడిన దీగ్రంథమే యనుట విజ్ఞలోక మెఱిఁగినదే.

ప్రతిపాద్యము

ప్రబంధ రూపమునఁ దన చరిత్రమును వర్ణింపుచు శ్రీ రాజగోపాలస్వామియొక్క ఫాల్గుణోత్సవమును గూడ నందు వర్ణింపు మను విజయరాఘవనాయకుని కోర్కెయే రంగాజమ్మయొక్క యీ కృతికి మూలము. తంజాపురాంధ్రనాయకరాజుల పరంపరలో వచ్చిన విజయరాఘవనాయకుఁడు సకల రాజ్యభోగములతో విలసిల్లుచు నిలవేల్పును జంపకవననేతయు నగు శ్రీరాజగోపాలస్వామికి ఫాల్గుణోత్సవమును జేయ సంకల్పించుట ప్రథమాశ్వాసమునఁ బ్రతిపాద్యము.

శ్రీరాజగోపాలస్వామియొక్క ఫాల్గుణోత్సవనిర్వహణార్థము విజయరాఘవనాయకుఁడు బయలుదేరుట, వసంతాగమనము, ఫాల్గుణోత్సవవర్ణనము, తదవసరమున రాజచంద్రుని పుత్రిక యగు కాంతిమతి సౌధాగ్రసీమనుండి శ్రీరాజగోపాలుని సేవించి చక్కనిపతిని గోరుట, కాంతిమతి విజయరాఘవుని చక్కదనమును జూచి మోహించుట, విజయరాఘవుఁడు పరివారముతో నిజనివాసమునకు మరలుట, కాంతిమతి స్వప్నమున విజయరాఘవునితోఁ గలిసి మేల్కని మోహపరవశయై పరితపించుట, చెలులు కాంతిమతికి శైత్యోపచారములఁ జేయుట, వనకేళి, జలకేళి, మన్మథారాధనాదులు ద్వితీయాశ్వాసమునఁ బ్రతిపాద్యములు.

కాంతిమతియొక్క మాన్మథప్రలాపములు, విలాసవతియను చెలి కాంతిమతియొక్క స్థితిని గని కారణం బడుగుట, విలాసవతి విషయముల నన్నియు నెఱింగి విజయరాఘవుఁ గూర్ప సమ్మతించుట, విజయరాఘవునొద్దకు విలాసవతి బయలుదేరి యతనికిఁ గాంతిమతీసౌందర్యాతిశయచాతుర్యాదులఁ దెలియఁజేసి యామెను బెండ్లియాడుటకు నాతని సమ్మతింపఁ జేసి మరలివచ్చి కాంతిమతికి జరిగిన వృత్తాంతముల నెల్ల నెఱింగించుట, కాంతిమతి యామె సామర్థ్యమునకు మెచ్చుకొనుట, ఇత్యాదులు తృతీయాశ్వాసప్రతిపాద్యములు.

విజయరాఘవుఁడు మన్మథబాణవిద్ధుఁ డై పరితపించుట, యతని కాంతలు కలవరపడుట, విషయము నెఱింగిన శ్రీనివాసతాతయాచార్యులు విజయరాఘవుని సమాశ్వాసపరచి, వివాహనిశ్చయార్థము రాజచంద్రుని గాంచి వివాహము నిశ్చయించుట, యావార్తను విజయరాఘవున కెరుకసేయ నతఁ డానందించుట యిత్యాదులు చతుర్థాశ్వాసమునఁ బ్రతిపాదితములు.

పంచమాశ్వాసమునఁ గాంతిమతీవిజయరాఘవుల వైవాహిక వైభవము, సంయోగవియోగశృంగారవర్ణనయు, కాతిమతితోఁ గూడి విజయరాఘవుఁడు తంజాపురమున కేతెంచి సుఖంబున నుండుట మొదలగునవి వర్ణితములు.

విచిత్ర కథ

[3]మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున “అల్లాడ విజయభూపతి సింహవిలాసము" అను నొక ప్రబంధ మున్నది. అయ్యది రాచవీటి నరపతి పుత్రిక యగు సౌందరీదేవిచే రచింపఁబడియున్నది. తల్లి పేరు మౌక్తికాంబ. సౌందరీ దేవి తనభర్త యగు అల్లాడ విజయభూపతిసింహుని శృంగారచరిత్రమును వర్ణింపుచు వ్రాసిన ప్రబంధ మిది. కాని విజయరాఘవుని చరిత్రను వర్ణింపుచు రంగాజమ్మచే వ్రాయఁబడిన యీ మన్నారుదాసవిలాసప్రబంధమునే కర్త పేరు కృతినాయకుని పేరు మొదలగు వానిని మాత్రము మార్చివేసి మిగిలిన భాగముల నటులనే యుంచఁగా సిద్ధించిన గ్రంథ మిది. ఇది బాహాటముగా జరిగిన గ్రంథచౌర్యముతక్క వేరు కాదు. అదియునుగాక సౌందరీదేవియొక్క యునికియే సందేహాస్పద మౌటను జరిత్ర రుజువుచేయుటయు వింతలో వింత. పై “యల్లాడ విజయభూపతిసింహవిలాస" మతిస్వల్ప మగు మార్పులతో నీ రంగాజమ్మకృతి యగు మన్నారుదాసవిలాసమే గాని వేరు కాదనుట స్పష్టము. నాయకనామాదుల మార్పుల కాస్కారము లేని చోట్ల మన్నారుదాసవిలాసములోని పద్యముల నటులనే యాగ్రంథమునందుఁ జూడఁగలుగుటయు నీ యభిప్రాయమును మఱింత బలపరచుచున్నది. చూడుడు:-

మన్నారుదాసవిలాసము - ద్వితీయాశ్వాసము ప. -3

ఉ. ఎంతయు వేడ్కగాంచ నవనీశు మహోత్సముం గనుంగొనన్
    గాంతలు తాము లోకమునఁ గల్గు బుధోత్తము లేఁగుదేర న
    త్యంతమనోహరాకృతిని దానును వచ్చె వసంత మంత నే
    కాంతసుగంధవాసితదిశాంతలతాంతము సంతసంబునన్.

అల్లాడ విజయభూపతిసింహవిలాసము - ద్వితీయాశ్వాసము

ఉ. ఎంతటి వేడ్కగాంచె నవనీశుమహోత్సవముం గనుంగొనన్
    కాంతలు దాము లోకమునఁ గల్గు బుధోత్తము లేఁగుదేర న
    త్యంతమనోహరాకృతిని దానును వచ్చె వసంత మంత నే
    కాంతసుగంధవాసితదిశాంతలతాంతము సంతసంబునన్.

ద్వితీయాశ్వాసముఅల్లాడ

మన్నారుదాసవిలాసమువిజయభూపతిసింహవిలాసము

మొదటి పద్యము

క. శ్రీ విజయ రాఘవాధిప క. శ్రీ విజయము పతినృప భూవలఁగు ప్రాజ్య రాజ్యపోషణద దా! భూవలయ ప్రాజ్య రాజ్యపోషణద కా! శ్రీవత్సక లితవజా! శ్రీవత్సక లితవనా! శ్రీ విజితఘవప్రకాళ! చెంగమలేశా! శ్రీవకమ హేద్రపురీశ! శ్రీలక్ష్మీశా! అదియునుంగాక యీ క్రింది పద్యములను బరిశీలించిన నా మె చేసిన గ్రంథ చౌర్యము జట్టబయలు కాఁగలదు. కడపటి చరణమున యతిస్థానమునకు సరివచ్చు

. పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/7 పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/8 పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/9 పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/10 పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/11

మన్నారుగుడి, శ్రీ రాజగోపాలస్వామివారి దేవాలయపు ప్రధానగోపురము

శ్రీ రాజగోపాలస్వామి దేవాలయ దృశ్యము, మన్నారుగుడి.

మన్నారుగుడి, శ్రీ రాజగోపాలస్వామి రథోత్సవము

మన్నారుగుడియందలి పవిత్ర తీర్థము, హరిద్రానది.

విజయరాఘవనాయకుఁడు భార్యాసహితుఁడై శ్రీ రాజగోపాలుని కొలుచుట

పత్నీసహితుఁడైన విజయరాఘవనాయకుఁడు శ్రీ రాజగోపాలుని సేవించుట

సపత్నీకుఁడై విజయరాఘవనాయకుఁడు శ్రీ రాజగోపాలునికి దండప్రణామము చేయు భంగిమమున నున్న శిలావిగ్రహములు

.

  1. రంగాజమ్మకృతి యైన యీయుషాపరిణయప్రబంధము తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమువారిచే 1965-వ సంవత్సరమునఁ బ్రచురించఁబడియున్నది. పరిష్కర్త - శ్రీ విఠలదేవుని సుందరశర్మ.
  2. See the Descriptive catalogue of the Telugu. Manuscripts in the T. M. S. S. M. Library, Tanjore. Vol. 1. No. 213 and 214; Published by Andhra University in the year 1938.
  3. See the Descriptive catalogue of the Telugu Manuscripts in the Govt. Oriental Mss. Library, Madras, Vol. I. Prabandhas — Srngaraprabandbas (Part II) Page No. 1040 Ms. No. 786. It is understood that the above Ms. was transfered to the Sri Venkateswara University Oriental institute, Tirupathi.