మన్నారుదాసవిలాసము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరాజగోపాలాయ నమః

మన్నారుదాసవిలాసము

(పద్యకావ్యము)

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాస్తుతి


శ్రీరుచిరాంగియై వెలయు చెంగమలాంబిక రూఢి సంతత
శ్రీరమణీయవైభవవిశేషములఁ గను మన్ననారు తా
సారె సుపుత్రపౌత్రులను శాశ్వతలక్ష్ము లొసంగి వేట్క దు
ర్వారభుజాబలున్ విజయరాఘవభూవరు బ్రోచుగావుతన్.

1


శా.

శ్రీవిద్యానిధి కొల్చువారి కెపుడున్ క్షేమాయురారోగ్యల
క్ష్మీవాణీమతికాంతికీర్తిమహిమల్ చేకూర్చు శ్రీవక్షు రీ
జీవాక్షున్ సకలామరేంద్రతిలకున్ శ్రీ రాజగోపాలకున్
సేవింతున్ గృతి మత్పతిప్రబలలక్ష్మీసిద్ధిఁ బ్రార్థింపుచున్.

2


ఉ.

బంగరుతమ్మిదోయి కరపద్మములన్ ధరియించు భామ హే
మాంగవిభాభిరామ కనకాబ్జమునన్ గొలువున్న కొమ్మ మా
చెంగమలమ్మ సత్కరుణచేతను దామరతంపరై [1]మహిన్
రంగలరంగ నీ విజయరాఘవభూవరుఁ బ్రోచుగావుతన్.

3


చ.

ఫణిపతి తా వహించు మహిభారము సర్వము నిర్వహించు నీ
ప్రణుతబలాఢ్యుఁ డంచు నుతి బల్మరు సేయుచు వేమొగంబులన్
గణనకు నెక్క పద్యపదగద్యనిబంధనచారుసూక్తిధో
రణులను సారెకున్ విజయరాఘవశౌరికి నిచ్చుఁగావుతన్.

4


క.

పక్షీంద్రుఁ డధికశీతల
దాక్షిణ్యవిలోకనామృతస్ఫుటధారన్
బక్షంబు మిగుల నెప్పుడు
రక్షింఛుంగాత విజయరాఘవనేతన్.

5

ఉ.

వేత్రముఁ గేలఁబూని యదువీరునికిం దగు సైన్యపాలుఁడై
శాత్రవకోటి నీ టడఁచి చాల జయంబు లొసంగు మేటి యా
సూత్రవతీప్రియుండు బలసూదనముఖ్యుల నేలు నేత స
న్మైత్రి జెలంగ సంతతము మన్నరుదాసునిఁ గాచుగావుతన్.

6


తే.

విజయరాఘవమేదినీవిభునిఁ గన్న
తండ్రి గురువును దైవంబు తానె యగుచుఁ
జెలువుమీరు శతక్రతు శ్రీనివాస
తాతయాచార్యచరణపద్మములుఁ గొలుతు.

7


క.

పన్నగశాయిచరిత్రము
పన్నుగ ద్రవిడప్రబంధఫణితి నుడువు నా
పన్నిద్దరాళువార్లఁ బ్ర
పన్నుల సన్నుతులు సేసి భావింతు మదిన్.

8


తే.

మన్ననారుకరగ్రహమహిమ నహిత
చయములును గెల్చి హితులకు జయము లొసఁగు
శంఖచక్రగదాఖడ్గశార్ఙ్గములకు
వందనంబు లొనర్తు నే వరుసతోడ.

9


సుకవిస్తుతి

క.

కేల్మొగిచెద మృదుసూక్తుల
కల్మికినై నెమ్మనమునఁ గడఁగెడు భక్తిన్
బల్మరు సుజనాదృతికిన్
వాల్మీకివ్యాసముఖ్యవరకవితతికిన్.

10


క.

ఆదిమఫణి యన బుధు ల
త్యాదరమునఁ బాదుకాసహస్రముఖకృతుల్
వేదెఱఁగుల రచియించిన
వేదాంతాచార్యవర్యు వేట్కఁ దలంతున్.

11


ఉ.

ధారుణిపైఁ బరార్థముల దారు హరింపుచు నుండు దుష్కవుల్
ధీరసభాంతరంబులను దీరుపడంగ (మెలంగ నే)ర్తురే
కోరి పరార్థజాలములె కొంకక కైకొనుచుండు చోరకుల్
శారదచంద్రచంద్రికల శంకఁదొరంగి చరింపనేర్తురే.

12

కృత్యవతారిక

విజయరాఘవనాయకుఁడు

(కథానాయకుఁడు)

వ.

అని ఇష్టదేవతావందనంబును సుకవిజనాభినందనంబును కుకవిజన
నిందనంబును గావించి యే (నొక్క)ప్రబంధంబు సరసవచనరచనాచమత్కా
రంబు తోరంబుగా ధీరజనంబుల కింపుమీర రచియింపు తలంపున నుండ
నొక్కశుభదినంబున.

13


సీ.

ఏ రాజచంద్రుండు శ్రీరాజగోపాల
        సేవాధురీణుఁ డై చెలఁగుచుండు
నే రాజతిలకంబు హేమాబ్జనాయికా
        వరతనూభవుఁ డన వన్నె కెక్కు
నే రాజశేఖరుఁ డిలలోనఁ బదియాఱు
        దానంబు లొకముహూర్తమునఁ జేసె
రాజసింహుండు వీరాధివీరుఁ డై
        పరవీరులను గెల్చె బాల్యముననె


తే.

యతఁడు రఘునాథభూపవరాత్మజుండు
మానినీజనమోహనమన్మథుండు
భూరికీర్తిప్రకాశితభువనతలుఁడు
శ్రీల విలసిల్లు తంజాపురీవిభుండు.

14


వ.

వెండియు నఖండనిజవైభవనిర్జితాఖండలుండును, ఖండితప్రతీపభూపాల
మండలుండును, మండలాధిపకిరీటకోటిచిరత్నరత్నరంజితపాదార
విందుండును, అరవిందబంధుబంధురప్రతాపభాసురుండును, సత్ర
పూరితాన్నదానసంతర్పితభూదేవతాలక్షుండును, మన్నారుదాసనా
మాంకిత(విశాలవ)క్షుండును, శారదాధ్వజాంకుండును, సంగరరంగ
నిశ్శంకుండును, కళావత్యంబికా(గర్భ)సుధాంబుధిచంద్రుండును
నగు నవ్విజయరాఘవేంద్రుఁడు నిండువేడుకతో ....బలుగ రాణించు
నాణిము(త్యం)బుల కుచ్చులను మగరాల నిగరాల నీడలు దేరుగోడ
బంగారుమెఱుంగుల రంగారు కంబంబులను, డంబుగల పగడంబుల
బ్రోదిగను (ల) దేలను గుంపులైన కెంపుల పిడిగలుగు కొడిగలును,
గప్పుగల (చొక్కంపు)నీలంబుల జాలఁబులం బ్రకాశించు పద్మ
రాగానుబంధంబుగల ద్వార బంధంబుల(ను, పద్మ)రాగంబుల చెక్కె

డంబుల చొక్కటంబై వాటంబులైన కవాటంబులను, హెచ్చుపచ్చల
తీరునం గనుపట్టు రాకట్టునేలలను, మెండుకొను బొండుమల్లెల నుల్లసం
బాడు తెల్లజల్లులను, శ్రీమద్రామాయణాది కథాసంవిధానంబులం
బ్రకటంబు లగుచిత్రపటంబులను, సరిగకుట్టుపనుల గనుపట్టు హోంబట్టు
మేలుకట్టులను, రాజరాజసభాతులిత[2]విలాసంబగు రాజగోపాలవిలా
సంబున యత్నంబునం బరచిన నూత్నరత్నకంబళంబులమీఁదఁ
దద్దయు నొద్దికయగు రతనంపుగద్దియయందుఁ దీరుగా బేరోల
గంబై యొకపడఁతి యడపంబును, నొకమంజువాణి కాళంజియు,
నొకపువ్వుంబోణి పావడయు, నొకబిత్తరి బెత్తంబు, నొకవాలుగంటి
వాలును, ఒకయండజయాన గిండియునుం బూని పరిసరంబునన్
గొలువుసలుప, వామభాగంబున హేమపీఠంబున శతక్రతు శ్రీనివాస
తాతయాచార్యవర్యుండు శ్రీ మద్రామాయణభాగవతభారతార్థంబు
లుపన్యసింపుచునుండ, నాజయలక్ష్మి యనందగు నాజమ్మయు, సంపదల
సొంపలరు చంపకవల్లెమ్మయు నిరుగడల సరస నొరసుక కూర్చుండ,
ప్రఖ్యాతనయులగు తనయులును, సకలగుణపాత్రు లగు పౌత్రులును,
నెమ్మిగల ముమ్మనములును, అతులితాలాపవిజితశారిక లగు కుమారి
కలును, యథోచితప్రదేశంబుల నిండియుండ; మఱియు నాదండ
నిస్తులగుణప్రశస్త యగు కస్తూరెమ్మయు, నతివిశాలనయనాంబుజ
యగు నంబుజవల్లెమ్మయు, ప్రఖ్యాతికీర్తి గల మోహనమూర్తమ్మ
యు, సరసగుణనిష్ణాత యగు కృష్ణాజమ్మయు,ఇల మేలనందగు నలమే
లమ్మయు, నాట్యచాతుర్యవిఖ్యాత యగు సీతమ్మయు, మహనీయతర
రూపరేఖ యగు మదనరేఖమ్మయు, మొదలుగాఁగల కాంతామణులు
సంతసంబున వసంతకేళిక వినుపింప, ముంగల మఱికొంద ఱంగనామ
ణులు రంగురక్తులు మీర సంగీతమేళంబు గావింప సమ్మదమ్మునం
బొదలుచు మఱియు నందు కొంద ఱిందువదనలు [3]మధురరసముం
జిలుకు మంజరియును, మఘవగురుశ్లాఘనీయం బగు రఘునాథా
భ్యుదయంబును, సంగతులం గనుపట్టు చెంగమలవల్లీపరిణయాది నాట
కంబులును, హృద్యంబు లగు గద్యపద్యంబులును, రువారంబు లగు
కైవారంబులును, దండకంబులు తారావళులు మొదలుగాఁ దాము
రచియించిన రసబంధురంబు లగు ప్రబంధంబులును, మన్ననారున కంకి
తంబుగా నెన్నిక మీర నానాట విన్నవించిన విన్నపంబులును,
దండ నుండి వినికి సేయుచు నుండు నయ్యవసరంబున.

15

తే. గీ.

అతులకవితాప్రసంగసంగతులు వెలయుఁ
బ్రౌఢి నను జూచి యమ్మేటి పసపులేటి
వెంకటేంద్రుని సత్పుత్రి విమలగాత్రి!
కలితసద్గుణరాజి! రంగాజి వినుము.

16


సీ.

కుందముల్ వికసించు నందముల్ మీరంగఁ
        గందముల్ రచియించు కౌశలంబు
ప్రాసముల్ బహుయతిన్యాసముల్ వెలయంగ
        సీసముల్ హవణించు చిత్రమహిమ
జాతు లలంకారరీతులు దనరంగ
        గీతులు రచియించు చాతురియును
పదములు మృదురసాస్పదము లౌర యనంగఁ
        బదములు జెప్పెడు ప్రౌఢిమంబు


తే. గీ.

నుచితవైఖరి ద్విపదలు రచనసేయ
ననిశమును రాయసములు వాయంగఁ జదువ
సమయ (మెఱుఁ)గుచుఁ గార్యభాగములు దెలుప
నిపుణభావంబు జగతిలో నీక చెల్లు.

17


తే. గీ.

అయ్యది(నముల) రామభద్రమ్మ మధుర
వాణికాంబయు సరసగీర్వాణభాష
నిట్టికృతులను రచియించి యిలను గీర్తిఁ
జాల గాంచిరి సుకవులు సన్నుతింప.

18


శా.

శృంగారైకరసంబు(లోఁ) బదములన్ జెల్కొంద మెప్పించి తౌ
సంగీతజ్ఞుల మేలు నా నుభయభాషాచాతురి న్నీ వికన్
రంగత్ప్రౌఢి బ్రబంధ మొక్కటి యొనర్పంగావలె న్మత్కథన్
రంగాజీ! భవదీయవాగమృతధారావైఖరుల్ మీరఁగన్.

19


వ.

అట్టి ప్రబంధంబును శ్రీరాజగోపాలున కంకితంబు గావింపుము.
మఱియు నేతత్ప్రబంధంబునకు నత్యధికమహత్వంబు గలుగ మన వీటం
జెన్నారు మన్నారుల ఫాల్గుణమహోత్సవాది దివ్యవైభవంబులు
వర్ణింపు మని యానతిచ్చి మెచ్చువచ్చు జాంబూనదాంబరతాంబూల
మాల్యంబులు నమూల్యంబు లగు మణిభూషణంబులు నొసంగ
నెంతయు నంతరంగంబున సంతసింపుచు నేఁ దలంచు తలంపునకు

మద్భర్తవు మహీభర్తవు నైన స్వామి సకలవిద్యావిశేషంబుల సవతు
లేని నాసవతు లైన యింద ఱిందుముఖుల ముందఱునుం గటా
క్షించి యింపుమీరఁ గృతి నిర్మింపు మని యానతిచ్చితిరి గనుక ధన్య నై
మాన్య నైతి; నాహృదయసదనంబున ముదంబున నెలకొనియుండు నా
థుండవు గావునఁ గొదవలు దీర్చి నావచనకుసుమార్చనలు గైకొమ్మని
నెమ్మితో మ్రొక్కిన మిక్కిలి నన్ను లాలించి సన్నిధి నున్న శతక్రతు
శ్రీనివాసతాతయాచార్యవర్యులకు - దండ ప్రణామంబు లాచరించి
యమ్మహామహుని యాశీర్వాదంబును ననుమతియును గైకొమ్మని
యెనుం గావున, నా మనంబున జాజులుం బ్రసాదంబు నయ్యె నని
యుప్పొంగుచుఁ జెంగటఁ గనకాసనంబున నున్న యయ్యాచార్య
వర్యు సేవించినఁ జేర రావించి సంభావనమ్ము మీర దీవించి యిట్లనియె.

20


కథానాయకుని వంశాభివర్ణన

క.

చతురాస్యుం డనఁ దగు నీ
పతి యిటు నిను గారవించి బహుమతి మీరన్
గృతి రచియింపు మనన్ భా
రతికిన్ బ్రతివత్తు వమ్మ రంగాజమ్మా!

21


క.

నీవు రచియించు నీకృతి
భూవలయమునం బ్రసిద్ధిబొందఁగఁ జాలన్
దీవించెద మిప్పుడు స
ద్భావముతోఁ బూను మిటు ప్రబంధ మొనర్పన్.

22


వ.

అని యానతిచ్చి మఱియు నేతత్కథాసంవిధానంబునకుఁ బ్రధాన
నాయకుండును నీప్రాణనాయకుండును నగు నివ్విజయరాఘవచంద్రుని
వంశంబుఁ బ్రశంసించెద నని యిట్లనియె.

23


సీ.

మహనీయతర మైన మణికిరీటమువాఁడు
        మకరకుండలకాంతిమహిమవాఁడు
కరముల శంఖచక్రములుఁ దాల్చినవాఁడు
        కౌస్తుభశ్రీ గల్గు గళమువాఁడు
వైజయంతి ధరించి వన్నెకెక్కినవాఁడు
        శ్రీవత్సమున మించి చెలఁగువాఁడు

నీలంపుచాయల నెమ్మేను గలవాఁడు
        కనకాంబరముఁ గటిఁ గల్గువాఁడు


తే. గీ.

సకలకల్యాణగుణముల సాటి లేని
లక్మి నురమున నెలకొల్పు లక్షణాఢ్యుఁ
డఖిలజగములఁ గరుణచే నరయువాఁడు
వేదవేదాంతవేద్యుఁ డై వెలయువాఁడు.

24


వ.

మఱియును.

25


సీ.

నెమ్మొగంబున నవనీసురాన్వయమును
        జెలువొంద నుదయింపఁజేయు ఘనుఁడు
బాహుకాండంబులఁ బార్థివసంతతి
        వినుతికి నెక్కఁగాఁ గనిన మేటి
యూరుయుగంబున నొనర వైశ్యకులంబు
        నవనిపై వెలయించు నమరవిభుఁడు
చరణపద్మంబుల జగతి నాలవజాతిఁ
        బ్రబలఁ జేసిన జగత్సపావనుండు


తే. గీ.

నాభిపంకరుహంబున నలుమొగముల
ఘనత కెక్కిన తనయునిఁ గన్న ప్రోడ
భవ్యగుణహారి రాజగోపాలశౌరి
చెంగమలవల్లితోఁ గూడి చెలఁగుచుండు.

26


వ.

అట్టి మహామహిమంబు గల్గిన.

27


ఉ.

శ్రీలలనామనోజ్ఞు పదసీమ సముద్భవ మంది ధాత్రిపై
జాలఁ బ్రసిద్ధి గాంచి సరసంబుగఁ దన్ గొనియాడువారికిన్
మే లొనగూర్చుచున్ వెలసి మిక్కిలిఁ దన్పుమ జీవనంబులన్
నాలవజాతి యొప్పు సుమనస్తటినీదృశప్రచారమై.

28


క.

ఆజాతి నుద్భవించిరి
భూజనహితచర్యు లార్యపోషణధుర్యుల్
తేజోధను లతులితయశు
లాజిధనంజయు లనేకు లవనీనాథుల్.

29

వ.

అంత.

3O


క.

ఆవంశంబునఁ గృష్ణధ
రావరుఁ డుదయించె నిజకరస్థితచక్ర
శ్రీవత్సశోభితుం డై
తా వెన్నునిరీతి దారితపరాఘుండై.

31


క.

ఆకృష్ణక్ష్మావరునకు
స్వాకృతిమకరాంకుఁ డసమశరదలితపరా
నీకుఁ డగు తిమ్మినాయఁడు
ప్రాకటయశుఁ డుద్భవించెఁ బ్రద్యుమ్నుఁ డనన్.

32


క.

ఆ తిమ్మినృపాలునకున్
ఖ్యాతగుణాలంబ గోపమాంబకుఁ దిమ్మ
క్ష్మాతలపతి యుదయించె ది
[4]శాతతయశుఁ డాహవమున ననిరుద్ధుండై.

33


సీ.

అతులకీర్తివిశాలుఁ డాతిమ్మనరపాలుఁ
        డంగనామణి బయ్యమాంబవలన
నందనులను గాంచె నలువొంద నలువుర
        హరి నలుగే లన నలరువారిఁ
బెదమలభూపాలుఁ బినమల్లనరపతిఁ
        బెదచెవ్వనృపతినిఁ బిన్నచెవ్వ
వసుమతీనాథుని వారిలోపల నల
        చిన్నచెవ్వనృపాలశేఖరుండు


తే. గీ.

శ్రీల విలసిల్లి పట్టాభిషిక్తుఁ డగుచు
భూమిఁ బాలించెఁ బ్రజలకు సేమ మొదవ
రాజగోపాలపదపద్మరాజమాన
[5]మానసాంభోజుఁ డై యసమానమహిమ.

34


క.

అవ్వనజాసను రాణినిఁ
బువ్వులవిలుకానిమామఁ బురహరుగిరి నా
చెవ్వనరపాలుకీర్తులు
నవ్వును నిజధవళిమంబునన్ సంతతమున్.

35

క.

అల చినచెవ్వనృపాలున
కలఘుగుణాలంబ మూర్తిమాంబకు సుతుఁ డై
విలసిల్లె నచ్యుతక్ష్మా
తలనాథుం డచ్యుతుండె తప్ప దనంగన్.

36


క.

కరపద్మశంఖచక్రము
లరు దగు గరుడధ్వజంబు నతులితపీతాం
బరముఖచిన్హము లుండఁగ
ధర నచ్యుతుఁ డనెడు పేరు దగు నాతనికిన్.

37


సీ.

మన్ననారునకును మహనీయగోపుర
        ముఖము లౌ కైంకర్యముల నొనర్చె
రామసేతువునఁ దీర్థము లెల్లఁ బ్రకటించి
        యిల మహాదానంబు లెల్లఁ జేసె
రంగధామున కంతరంగ ముప్పొంగఁగా
        రత్నాంగియుఁ గిరీటరాజ మొసఁగె
శ్రీముష్ణముఖ్యవిశేషస్థలంబుల
        సకలవైభవముల సాఁగఁ జేసె


తే. గీ.

[6]నౌర నాలుగు దిక్కులయందు శౌరి
కతఁడు జేయని కైంకర్య మరయఁ గలదె!
పాండ్యతుండీరముఖ్యభూపతుల గెల్చె
సొరిది నాఘనుఁ డసహాయశూరుఁ డగుచు.

40


క.

ఆయచ్యుతభూవరునకు
నాయతసత్కీర్తి మూర్తిమాంబకు విమతా
జేయుఁడు రఘునాథమహీ
నాయకుఁ డుదయించె సజ్జనస్తుతమతియై.

39


వ.

అమ్మహామహుండు.

40


సీ.

అల రామదేవరాయల విరోధము మానఁ
        జేసి సింహాసనాసీనుఁ జేసెఁ
బంపులఁ దద్వైరిబలముల సాధించి
        నేపాళభూపాలు నిలిపె మగుడ

బలిమిచే నెదురించు పరుల పాళెంబులుఁ
        గొల్లలాడించెను జెల్లుగాఁగ
మేలుమే లన జనుల్ చోళగు సాధించి
        చోళదేశము బ్రోచె శుభము లొదవ


తే. గీ.

స్వామిహితసఖ్యరిపుజయస్వజనరక్ష
ణముల నచ్యుతు శ్రీరఘునాథునకును
సాధుకర్ణాటలక్ష్మీసనాథునకును
సాటివత్తురె నృపతులు జగతిలోన.

41


ఉ.

సౌరభుజాబలంబునను జక్కదనంబున సద్గుణంబులన్
ధీరనుతప్రతాపమున దిక్కులు మిక్కిలి నిండు కీర్తులన్
ధారుణి బ్రోచు నేర్పున నుదారదయన్ గవితాచమత్కృతిన్
శ్రీరఘునాథభూమిపరిణీమణికిన్ సములే నృపాలకుల్.

42


సీ.

దిన మొకలక్ష భూదేవతోత్తములకు
        సత్రంబుఁ బెట్టు టేస్వామివ్రతము
ప్రతివత్సరంబు తప్పకయె షోడశమహా
        దానముల్ సేయు టేధన్యు పూన్కి
యనిశంబు శ్రీవైష్ణవావళికిని నగ్ర
        హారంబు లిచ్చు టేయధిపు మతము
కవుల విద్వాంసులఁ గనకవర్షంబులఁ
        గాచి రక్షించు టేఘనుని రీతి


తే. గీ.

యామహామహుఁ డచ్యుతక్ష్మామహేంద్ర
తనయవర్యుఁడు రఘునాథధరణివిభుఁడు
నవ్యగుణయుక్తి శ్రీరఘునాథుఁ డగుచు
ధాత్రిఁ బాలించె విబుధసంతతులు బొగడ.

43


వ.

అంత.

44


క.

ఆవెంపరాజపుత్రి క
ళావత్యంబికను, చెంజి లక్ష్మమ్మను స
ద్భావముతో రఘునాథ
క్ష్మాపరుఁడు వరించె బంధుజనములు బొగడన్.

45

క.

చంద్రునకు రోహిణి హరి
శ్చంద్రునకుం జంద్రమతియు సతి యగుగతి ని
స్తంద్రయశోనిధి రఘునా
థేంద్రునకుఁ గళావతెమ్మ హితమతి వెలసెన్.

46


వ.

మఱియును.

47


చ.

అతులితవాగ్విలాసమున నంబుజసంభవురాణి, రూపునన్
రతి, పతిభక్తివైభవమునన్ సతి, యోర్పున భూమిదేవి, యీ
యతివ యటంచు నెంచ వినయంబు నయం బమరన్ గళావతీ
సతి రఘునాథశౌరి కనిశంబును సేవలు సేయు భక్తితోన్.

48


ఉ.

అమ్మనుజాధినాథుని ప్రియాంగన లై యలరారు చెంజి ల
క్ష్మమ్మ కళావతీసతియు నాత్మజరత్నముఁ గాంచ నెంచి చెం
గమ్మను రాజగోపహరి నర్థిఁ దలంపుచు జాల నెమ్మదిన్
బమ్మిన వేడ్క సల్పిరి తపంబులు దానములున్ వ్రతంబులున్.

49


విజయరాఘవనాయకుని జన్మప్రకారము

సీ.

శ్రీ రఘునాథధాత్రీతలాధీశ్వరుం
        డాసతులనుఁ గూడి యనుదినంబు
సకలధర్మంబులు సలుపుచు నొకనాఁడు
        నామతీర్థంబున నంతరమున
భాసురలీలఁ బద్మాసనాసీనుఁ డై
        హృదయపంకజమున గుదురు గాఁగ
శ్రీరాజగోపాలశౌరిఁ జెంగమలేశు
        వేడ్కతో భావింప వెన్నుఁ డలరి


తే. గీ.

యెదుట సన్నిధి సేసి నీ కిత్తు వరము
వేఁడు మన సంతసంబున విజయమహిమ
నీమహీమండలం బెల్ల నేలఁ జాలు
తనయు మా కిమ్ము దేవకీతనయ! యనిన.

50


క.

మెచ్చితిమి నీదు కోర్కికి
నచ్చుతరఘునాథభూప! యటులనె నీకున్
మచ్చికఁ దనయుఁడ నై ధర

నచ్చుగ నీసాధ్విగర్భమం దుదయింతున్.

51


తే. గీ.

ఠీవి విజయాఢ్యు సుతుని వేఁడితిని గనుక
లీల మము రాఘవునిగఁ గొల్చితివి గనుక
విజయరాఘవనామంబు వెలయఁ దాల్చి
చెలఁగి వెయ్యేండ్లు పుడమి రక్షింపుచుందు.

52


క.

అని యానతిచ్చిన ట్లై
నను గనుగవ విచ్చి చూచి నలుదిక్కులు న
జ్జననాథకులశిఖామణి
మన మపు డానందరసనిమగ్నము గాఁగన్.

53


క.

సంపూర్ణమనోరథుఁ డై
చంపకవననాథునకును సకలసపర్యల్
సొంపునఁ గావింపుచుఁ జలి
యింపని సద్భక్తితోడ నెంతయుఁ బొగడెన్.

54


వ.

ఇవ్విధంబున నవ్వసుంధరాపురందరుండు రక్తారవిందేందిరారాజగోపాలకుల
పూజలు గావించి చెలువు మీరఁ గొలువు సింగారంబై పేరోలగం బుండి
మాయయ్య తాతయాచార్యవర్యుం గనుంగొని యిట్లనియె.

55


సీ.

శ్రీతాతయార్యదేశికవర్య! మేము మీ
        మహితోపదేశక్రమమున నేఁడు
సేమంబు మీరంగ నామతీర్థం బయి
        చెలువమన్నారు నంచితవిహారు
రాజీవదళనేత్రు రమణీయతరగాత్రు
        మంజులలాటు సన్మణికిరీటు
వేత్రహస్తుని సర్వవిబుధప్రశస్తుని
        మదిలోన భావింప నెదుట నతఁడు


తే. గీ.

వెలసి వలసిన వరములు వేఁడు మనిన
పొంగి విజయాఢ్యుఁ డైన సుపుత్రు వేఁడ
మమ్ము రాఘవునిగిఁ గొల్చుమహిమవలన
విజయరాఘవుఁ డన నుద్భవింతు ననియె.

56


వ.

అనిన నయ్యాచార్యవర్యుండు నెయ్యంబుతో నిట్లనియె.

57

తే. గీ.

వినుము రఘునాథజననాథ! విశదముగనె
యరసియున్నార మిట్టి వృత్తాంత మెల్లఁ
గలుగు దనయుండు విజయరాఘవుఁ డతండు
జననవేళనె మీకును జయ మొసంగు.

58


వ.

అని యానతిచ్చు నమ్మహామహునకు నతులమణిభూషణంబులు ననేక
కనకాంబరంబులు రాసులుగా నొసంగి భూసురాశీర్వాదంబులు గైకొని
సుఖంబున నుండునంత.

59


చ.

హితమతి యైన యచ్చుతనరేంద్రుని శ్రీరఘునాథనేత క
య్యతివ కళావతీసతికి నాహవవైరిమదాపహారి యై
సుతుఁ డుదయించె సర్వగుణశోభితుఁ డాశ్రితపారిజాత మ
ప్రతిమబలాఢ్యుఁ డీవిజయరాఘవశౌరి జయానుసారి యై.

60


క.

కురిసెన్ బువ్వులవానలు
మొరసెన్ సురదుందుభులు బ్రమోదంబున న
చ్చరలేమలు నటియించిరి
తరచుగ హర్షించి రఖలధరణీజనముల్.

61


తే. గీ.

అపుడు రఘునాథభూజాని హర్షమునను
తాతయార్యుల యనుమతిఁ దనయునకును
శౌరి యానతియిచ్చినచందముననె
ధ్రువముగ నొనర్చె విజయరాఘవసమాఖ్య.

62


విజయరాఘవవైభవము

వ.

ఇక్కుమారకుండు.

63


సీ.

తొలుఁదొల్తఁ బసిఁడియుయ్యల నూఁగువేళనే
        తోరహత్తుగతులఁ దూఁగ నేర్చె
దాది పల్కులు నేర్పుతఱినె శ్రీరాజగో
        పాలు నామము లెల్లఁ బలుక నేర్చె
నక్షరాభ్యాసంబునపుడె గ్రామములకు
        వేడ్క నొప్పంబులు వెట్ట నేర్చె
గరిడిలోపల సాము దొరకొన్నవేళనే
        తునెలుగా వైరులఁ దునుమ నేర్చె

తే. గీ.

జనకుఁ డీతఁడు సుజ్ఞానజనకుఁ డనుచు
ననుదినముఁ దండ్రి సేవ సేయంగ నేర్చె
మన్న నారులభక్తుఁ డై చిన్ననాఁడె
యితఁడు మన్నారుదాసాఖ్య నెసఁగ నేర్చె.

64


సీ.

శ్రీరాజగోపాలశౌరి కంకితముగా
        మంజరీముఖకృతుల్ మహి నొనర్చె
రాయలు సాహిత్యరాయపెండేరంబు
        శారదాధ్వజము నొసంగ నెగడె
నపరిమితంబుగా నగ్రహారంబులు
        సేసి శ్రీవైష్ణవశ్రేణి కొసఁగె
ద్వారకాపురికన్న దక్షిణద్వారక
        మిగులవైభవముల నెగడఁ జేసె


తే. గీ.

ధరణిసురులకు ననివారితముగ నన్న
దాన మొనరించువ్రతమె నిత్యముగ బూనె
నితరమతముల నిరసించి యిలను వెలయ
వైష్ణవమతంబె నిలిపె శాశ్వతము గాఁగ.

35


సీ.

జగతిఁ దులాపురుషహిరణ్యగర్భముల్
        బ్రహ్మాండఘటకల్పపాదపములు
రహి కెక్కు గోసహస్రహిరణ్యకామధే
        నువులు హిరణ్యాశ్వ మవల గలుగు
హేమాశ్వరథమును హేమహస్తిరథంబు
        పంచలాంగలధరల్ పరఁగు విశ్వ
చక్రకల్పకలతాసప్తసాగరరత్న
        కామధేనువులు నాక్రమముతోడఁ


తే. గీ.

గలుగునట్టి మహాభూతఘటము మఱియు
నొనర తిథివారనక్షత్రయోగకరణ
దానము లుభయతోముఖిదానములు
వేయు వరసల గొవించు విభుఁ డితండు.

66


సీ.

వరకుమారుం డయి యరుణాబ్ధనాయికా
        స్తన్యంబు గ్రోలిన ధన్యుఁ డితఁడు
శ్రీరాజగోపాలశౌరిని వెయ్యేండ్లు

        పూజ సేయుచు నుండు పుణ్యుఁ డితఁడు
పుత్రులఁ బౌత్రులఁ బుత్రికామణుల ము
        మ్మనుమలఁ గనునట్టి ఘనుఁ డితండు
క్రమమున రామాయణము వేయు మారులు
        పారాయణము సేయు ప్రభు వితండు


తే. గీ.

మహిమ మీరంగ మాచేత మఘశతములు
నవని సేయించునట్టి మహాత్ముఁ డితఁడు
మనుజసూత్రుఁడె! రఘునాథమండలేంద్ర
ఘనసుకృతపేటి విజయరాఘవకిరీటి.

67


క.

ఇతని గుణంబులుఁ బొగడఁగఁ
జతురాస్యున కైన యట్టి శారద కైనన్
జతురత లేదన మఱి యిక
నితరులు వర్ణింప ధాత్రి నెంతటివారల్.

68


క.

ఈ విజయరాఘవేంద్రుఁడె
ప్రావీణ్యము మీర నినుఁ బ్రబంధ మొనర్పం
గా వరియించెం గావున
శ్రీవెలయఁగ నట్టి మహిమ చేకురు నీకున్.

69


వ.

అని యానతిచ్చి సారసారస్వతంబుఁ గరుణించి, యల్ల చెంగమలవల్లీ
రాజగోపాలకృపాకటాక్షంబులు నాపయిం జాల నభివృద్ధిం బొంద
బ్రార్థించెం గావున.

70


షష్ఠ్యంతాలు

క.

శ్రీరాజగోపహరికిని
వీరాసురమత్తదంతివిదళనహరికిన్
నారదగానాధృతికిన్
నీరజభవముఖ్యవినుతనిస్తులధృతికిన్.

71


క.

కరధృతమణివేత్రునకున్
హరిమణినిభగాత్రునకును నరిజేత్రునకున్

సురరచితస్తోత్రునకున్
సరసిజదళనేత్రునకును సన్మిత్రునకున్.

72


క.

కౌస్తుభమణివక్షునకున్
నిస్తులకరుణాభిరామనిజవీక్షునకున్
నిస్తంద్రయశోనిధికిన్
బ్రస్తుతగుణదివ్యరత్నభరణాంబుధికిన్.

73


క.

దారితదానవతతికిన్
హారిహరిద్రాసరిద్వరాప్తవిహృతికిన్
సారగుణస్తోమునకున్
వారిధికన్యామనోజ్ఞవరధామునకున్.

74


క.

శ్రీ విజయరాఘవక్షితి
పావనశీలునకు సద్గుణావాలునకున్
పావనశుభనామునకున్
గోవిదజనవర్ణనీయగుణధామునకున్.

75


వ.

అంకితంబుగా నే నొనర్పం బూను మన్నారుదాసవిలాసం బను
మహాప్రబంధంబునకుం గథాసంవిధానం బెట్టి దనిన.

76


కథాప్రారంభము — తంజాపురవర్ణన

క.

కంజాతబంధురథహయ
సంజాతశ్రమవినోదిసౌధపతాకా
మంజుళమృదుపవనముఁ గల
తంజాపుర మొప్పుచుండు ధారుణిలోనన్.

77


చ.

కువలయమిత్రుఁ డౌచుఁ దనకుం దనయుం డగు చంద్రు మార్గమున్
నవముగ నడ్డగించు టిది నాయమె నీ కని వీటి సాలమున్
జవమునఁ గౌఁగిలింపుచును సారెకు వేఁడు సముద్రమో యనా
నవిరళకూర్మనక్రమకరాదుల నొప్పు నగడ్త లప్పురిన్.

78


క.

హరిహయుఁడు మున్ను నఱికిన
గురుతరపక్షంబులన్ మగుడఁ గాంచిన యా

గిరినివహం బనఁ బరఁగెడు
వరకేతనసౌధరాజి వరలు న్వీటన్.

79


చ.

సతతముఁ దత్పురిన్ ద్విజులు సల్పెడు యజ్ఞములన్ భుజింపుచున్
గుతుకము మీర నం దిరవుకొన్న సుపర్వులఁ గూడు వేడ్కచే
నతులవిమానసంగతుల నచ్చటికిం జనుదెంచునట్టి త
త్సతు లన సాలభంజికలు సౌధములన్ విలసిల్లుఁ జారుతన్.

80


చ.

ఒఱపగు యాగధూమముల యున్నతి రాహువురీతి మించఁగా
సరసిజమిత్రుఁ డప్పురముచాయకునై చననీక తేరుఁ దా
నిరుగడలన్ గడున్ భయపరీతమతిన్ నడపించఁ గాంచి యం
దరు నదియాదిగాగ నయనద్వయ మాతని కందు రెందులన్.

81


చ.

పురిదెస త్రోవగా నడచిపోవుతఱిన్ నవరత్నపూర్ణగో
పురముల దివ్యదీధితులు పొల్పగు మేనను బర్వ భానువుల్
కర మరుదారఁ జిత్రములుగాఁ గనుపట్టఁగ నాటనుండి భా
స్కరునకుఁ జిత్రభానుఁ డనఁ గల్లెను బేరు జగత్ప్రసిద్ధిగన్.

82


ఉ.

నూత్నగృహాగ్రసీమను మనోహర యౌ పురలక్ష్మి చాలుగా
రత్నపుదీవియల్ వెలయ రా జెదుటన్ నటనం బొనర్పుచో
యత్నముతోడఁ జూచు విబుధావళి పూవులవానఁ దద్వధూ
రత్నముమీఁద నించె నన రాజిలుఁ జుక్కలు దానిపైఁబయిన్.

83


ఉ.

అప్పురితుంగశృంగసముదంచితకాంచనసౌధలక్ష్మి తా
డెప్పర మైన వేడుక నటించును యంత్రపయఃకణంబులన్
విప్పగునట్టి క్రొంజెమట వేమరు సౌరగృహావళీసఖుల్
చొప్పడ డాలు పావడల సూరెల నొత్తగ సారెసారెకున్.

84


ఉ.

మాపులు వెన్నెలం గరఁగు మానితతత్పురసాంద్రచంద్రకాం
తోపలసౌధపఙ్క్తుల పయోఝరులన్ వినువాఁక యుబ్బఁగా
నాపరమేష్టి స్వర్గతల మంతయు వెల్లువబోవు నంచు నో
యేపునఁ దీర్చెఁ గాల్వలు మహీస్థలికిన్ బలిసద్మసీమకున్.

85


క.

అప్పురిని రేలు నెలరా
యుప్పరిగెల దొరగు జలము లొప్పున్ ధరపై

విప్పుగ నెలపొడువునఁ దా
నప్పతిఁ గూడంగ గంగ యట వచ్చె ననన్.

86


వారస్త్రీవర్ణన

చ.

మనసిజధన్వి జీర్ణకుసుమస్వశరాసనబాణముల్ రయం
బునఁ బడవైచి, యన్నగరిప్రోడమిటారుల తీరు [7]మీరు నా
కనుబొమవిండ్లుఁ జూపులను గట్టి లకోరులు బట్టి లోకముల్
మునుకొనిఁ గెల్చి యెంతయును మోదముతో విలసిల్లు నచ్చటన్.

87


చ.

అల పురిలోపలం బరఁగు నంబురుహాక్షుల యొప్పుమీరు నా
గళముల నాభిజంఘలను గన్బొమలన్ మెరుఁగారు నారులన్
గెలువఁ దలంచి శౌరికిని నిత్యము సేవ నొనర్పుచున్న దౌ
[8]జలజము చక్రమున్ గదయు శార్ఙ్గము నందకముం దలంపఁగన్.

88


ఉ.

ఈ పదునాల్గులోకముల నెన్నిక కెక్క జయింపఁజాలు బా
హాపటిమాఢ్యుఁ డౌ మరున కా శరపంచక మంచు నెంచి తా
నేపున లోకకర్త సృజియించిన బాణకదంబకం బనా
నాపురి వారకాంతల కటాక్షపరంపర నింపు నింపులన్.

89


ఉ.

కన్నులు గండుమీలు తొలుకారుమెఱుంగులు మేను లెయ్యెడం
గన్నవి గావు కౌను లలకంబులు చొక్కపు టింద్రనీలమున్
చన్నులు కుంభికుంభములు [9]సారసముల్ పదముల్ దలంపఁగా
నన్నగరంబు కామినుల కన్యవధూటులు సాటి వత్తురే.

90


చ.

అగణితధాన్యరాసులను నద్రిశతంబుల రత్నకోటులన్
నెగడెడు రాజవీథులను నీరధులం గనుపట్టు దట్టమౌ
పగడపుతీవచా లనఁగ భాసిలు నెప్పుడు నప్పురంబునన్
మిగులఁ జెలంగు వారతరుణీపదయావకరాగచిహ్నముల్.

91


చ.

చవిఁ గనినారుగా యమృతసారము [10]నిర్జరులార! మీర లా
దివి నికఁ జూడుఁ డీయెడ మదీయనవామృత మంచు నెత్తు న
య్యవనికరాగ్రసీమ దగునట్టి ఘనామృతకుంభరాజినా
నవిరళనారికేళనివహంబుల బొండ్లము లొప్పు నప్పురిన్.

92

చాతుర్వర్ణ్యవర్ణన

ఉ.

అంబుజసంభవుండు వినుఁ డాదియుగంబున యత్న మొప్ప య
జ్ఞం బొక టాచరించి యల శౌరినిఁ దన్పుట యేమి చిత్ర మం
చుం బురిలోని బ్రాహ్మణులు జూడఁ బ్రదక్షిణరీతి మీర య
జ్ఞంబులు [11]సేయుచున్ దినము శౌరికి మోద మొనర్తు రెంతయున్.

93


ఆ.

అప్పురంబునందు నతివిచిత్రం బిది
క్రతువులందు ద్రవ్యరాసు లొసఁగి
యుత్తరాయణంబు నొగి దక్షిణాయనం
బుగ నొనర్తు రరయ భూమిసురలు.

94


క.

[12]శ్రీ గలిగి చదువుసాముల
భోగంబుల త్యాగములను భుజశౌర్యములన్
బాగగు రాజకుమారకు
లేగతి నల పరశురాము నెంచరు వీటన్.

95


క.

నూటికి నొక్కొక్కటిగా
మాటికి నభివృద్ధి గను సమగ్రధనములన్
గోటికిని పడగ లెత్తిన
మేటి కిరాటవ్రజంబు మించు న్వీటన్.

96


క.

బలియును మున్నొక రెండడు
గుల నేల నొసంగలేక [13]కొదవపడె నెటం
చల పురి శూద్రులు శౌరికి
వలసిన గ్రామంబు లొసఁగి వరలుదు రెపుడున్.

97


గజతురగపదాతివర్ణన

చ.

ధరఁ దమవంశమందు నొకదంతిపతిం దగఁ గాచినట్టి శ్రీ
హరిపద మౌ గదా యిది యటంచు ఘనంబున నెంచి యేమొ య
ప్పురిఁ జరియించు మత్తగజముల్ ప్రజ లెల్లను మెచ్చి చూడఁగాఁ
గరములు సాంచి యాకసముఁ గౌతుక మొప్పఁగ నంటు సారెకున్.

98

క.

రయముల మారుతమానస
జయముల మును గనిన వగుట స్వామికి వనిలో
[14]జయముల నొసఁగఁగఁజాలెడు
హయము లనేకములు జెలఁగు నప్పురిలోనన్.

99


క.

బాహుబలయుతులు నిజస
న్నాహంబులఁ జెలఁగు సింహనాదంబులచే
నాహవముల వైరిగజ
వ్యూహముల నడంచి వీట నొప్పుదురు భటుల్.

100


సీ.

గజతురంగమధేనుకల్పనగంబులు
        విద్రుమముక్తాదివీథిశతము
సహ్యజ మొదలైన సకలమహానదుల్
        మానితద్విజరాజమండలంబు
దీవులకై వచ్చి తిరిగిపోవుచు నుండు
        వణిజు లాదిగ గల్గు వర్తకులును
అచ్చరలే వీర లనఁదగు నతులిత
        సౌందర్యనిధు లైన జలజముఖులు


తే.

దినదినంబును నభివృద్ధి గను విధంబు
నమితబుధతృప్తిఁ గలిగించు నమృతమహిమఁ
జెంగమలవల్లి మన్నారు చెలఁగుచున్కి
పాలసంద్రంబె యౌర యప్పట్టణంబు.

101


విజయరాఘవుఁడు రాజగోపాలస్వామికి ఫాల్గుణోత్సవముఁ జేయ సంకల్పించుట

వ.

అప్పురంబున కధీశ్వరుండు.

102


సీ.

తన చక్కదనము కందర్పచంద్రులకును
        దేహాభిమానవృత్తిని హరింపఁ
దన దానమహిమ సంతానాభ్రములకును
        బాటి దప్పిన వెల్లఁబా టొనర్ప

తన యశోగరిమంబు దశదిశాంగనలకుఁ
        గొమ రైన వెలిబట్టుకోక లొసఁగఁ
దన ప్రతాపభరంబు దర్పితాహితులను
        నగపంక్తులకు దవానలము గాఁగ


తే.

శేషకూర్మవరాహేభశిఖరివరులు
గోపురము మోచు ప్రతిమల రూపుఁ దాల్ప
నిజభుజదండమున ధాత్రి [15]నిల్పుచుండు
విజయరాఘవమేదినీవిభువరుండు.

103


వ.

మఱియు నీమహామహుండు.

104


సీ.

తడలేవి నిత్యసత్రము బెట్ట క్షామంబు
        కాంతల మధ్యభాగంబుఁ జేరెఁ
జల్లఁగాఁ బాలింప జగతి తాపం బెల్ల
        నహితబృందంబుల నాశ్రయించె
బ్రజల నిజాచార[16]పదవి వర్తిలఁ జేయ
        దండంబు లాతపత్రముల నిల్చె
జగడంబులను గెల్వ శాత్రవాళిమదంబు
        భద్రేభములయందుఁ బాదుకొనియె


తే.

గాని యొండెడ నిజపదం బూనదయ్యె
మహితనిజభక్తి కలరుచు మన్ననారు
చెంగమలవల్లియును దాను జెలఁగ వీట
ధాత్రి వర్ధిల్లు మన్నారుదాసుఁ డితఁడు.

105


వ.

అష్టైశ్వర్యసంపన్నుండై యిప్టోపభోగంబు లనుభవింపుచుఁ బారంపర్యంబు
గా సంపదలు గలిగించు చంపకవననేతకు మహోత్సవపరంపరలు వెలయింపు
తలంపున నుండు నయ్యవసరంబున.

106


క.

మనసిజకోటివిలాసా!
కనకవనీనిత్యవాస! కాంచనవాసా!

అనుపమితమందహాసా!
జననుతనిజదాస! వైరిసంఘనిరాసా!

107


క.

చెంగమలాహృదయాంబుజ
సంగతపరభృంగలీల! సన్నుతశీలా!
రంగత్కరుణాసింధుత
రంగాయితనిజకటాక్ష! రాజీవాక్షా!

108


చ.

పరమదయాగుణాభరణ! భాసురభక్తజనార్తివారణా!
వరమునిసంఘనిత్యనత! వాసవముఖ్యసురేంద్రవందితా!
శరనిధికన్యకారమణ! చంద్రదినేశ్వర చారువీక్షణా!
గురుతనయప్రదాననుత! గోపవధూకుచకుంకుమాంకితా!

109


గద్య.

ఇది శ్రీమద్రాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమానసారసార
స్వతధురీణయు, విచిత్రతరపత్రికాశతలిఖితవాచికార్థావగాహనప్రవీణయు,
తత్ప్రతిపత్రికాశతస్వహస్తలేఖనప్రశస్తకీర్తియు, శృంగారరసతరంగితపద
కవిత్వమహనీయమతిస్ఫూర్తియు, అతులితాష్టభాషాకవితాసర్వంకష
మనీషావిశేషశారదయు, రాజనీతివిద్యావిశారదయు, విజయరాఘవమహీ
పాలనిత్యసంభావితయు, విద్వత్కవిస్తుతగుణసేవితయు, పసపులేటివెంక
టాద్రిబహుజన్మతపఃఫలంబును, మంగమాంబాగర్భశుక్తిముక్తాఫలంబును,
రంగద్గుణకదంబయు నగు రంగాజమ్మవచనరచనాచమత్కృతిం జెన్ను
మీరు మన్నారుదాసవిలాసం బను మహాప్రబంధంబునందు ప్రథమా
శ్వాసము.

[17]శ్రీరామచంద్రాయ నమః

  1. మభిన్
  2. క. విలాసంబులగు
  3. మధురసమంజిమంజిలుకు
  4. శారతయశుఁ డాహవమున
  5. మానితాంభోజుఁడై
  6. అవుర
  7. మీర
  8. జలము
  9. సారసములౌ పదముల్
  10. నిర్ఝరులార
  11. సేయుచుండినను
  12. శ్రీ గలిగి సదువుసాలముల
  13. కొదవపడ నెటం
  14. జయము లొసంగఁగ జాలెడు
  15. నిల్చుచుండు
  16. పదవర్తిలఁజేయ
  17. క. శ్రీరాజగోపాలాయ నమః