మతము - పథము/కొన్ని వాక్యములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మతమును నిర్వీర్యము చేస్తూ పథమును బలపరుస్తూ మేము వ్రాసిన కొన్ని వాక్యములను క్రింద పొందుపరుస్తున్నాము.

1. మత వైషమ్యాల మాయలోబడ మహోన్నత భావాన్నిమలచుకో! ఆత్మశిఖరాన్నధిరోహించగలవు.

2. దేవుడు మతాలను, కులాలను సృష్ఠించలేదు.

3. మతాలను బట్టి అనేక విధానములుగా, అనేక పేర్లుగా, వేరువేరుగా పిలువబడువాడు ఒక్క దేవుడే.

4. మాయ (సైతాన్‌) లేక సాతాన్‌ మానవున్ని మతాలపేరుతో మభ్యపెట్టుచున్నది.

5. మతము దేవున్ని తెలుపలేదు. జ్ఞానమే దేవున్ని తెలుపును.

6. దైవము ఒకమతమునకు సంబంధించినవాడు కాడు.

7. మతము చాటున దేవున్ని ఊహించుకొని, మతమునకు దేవున్ని పరిమితి చేసి మాట్లాడడము అజ్ఞానమే అగును. అన్నిమతములకు అధిపతి ఒకే దేవుడని తెలియడమే జ్ఞానమగును.

8. పుట్టిన తర్వాత కొంతకాలమునకు తెలియునట్టి కులము, మతము మనుషులు కల్పించుకొన్నవే కాని జన్మతః వచ్చినవి కావు.

9. కులాలు కుచ్చితముతో, మతాలు స్వార్థముతో కూడుకొన్నవి. కులాలకు మతాలకు దేవుడు అతీతముగ ఉన్నాడని తెలిసి నీవు ఆ విధముగ మారినపుడే దేవుడు తెలియును.

10. ఏ మతమునకు చెందిన మనిషిలోనైన ముక్కురంధ్రములలో కదలే శ్వాసలో "ఓమ్‌" శబ్దము ఇమిడి ఉన్నది. 11. "ఓమ్‌" ఒక మతమునకు సంబంధించినది కాదు. మనుషులందరికి, జీవరాసులందరికి సంబంధించినది.

12. నాది అనుకొను నీ మతమేదో నీకు నిజముగ తెలుసునా? మధ్యలో ఏమైనా మారిందేమో?

13. నీకు తెలియకుండానే ఎప్పటికి మారని మతములో, ఎప్పటికి మారని కులములో నీవున్నావు.

14. నీవు ఎప్పటికి మారని జీవకులములో ఉన్నావు. అలాగే ఎప్పటికి మారని దైవమతములో ఉన్నావు.

15. పరమతమును గురించి మాట్లాడాలనుకుంటే ముందు నీ మతమును గురించి నీవు యోచించు. పరమతములోని లోపమేమిటో? నీ మతములోని గొప్పతనమేమిటో? న్యాయముగా, నీతిగా నిర్ణయించుకో.

16. పరమతమును గూర్చి గానీ, నీ మతమును గూర్చి గానీ, స్వార్థబుద్ధితో గానీ, రాజకీయముగా గానీ, సమాజపరముగా గానీ యోచించవద్దు.

17. ఒకవేళ నీ మతము గొప్పగా, పరమతము నీచముగా కనిపిస్తే, మతమును గురించి వదలివేసి, మతము యొక్క ప్రసక్తి లేకుండ కేవలము దేవున్ని గురించే బోధించు, దేవుడు అన్ని మతములకు పెద్ద కావున ఏ మతస్థుడైనా నీ మాట వినగలడు.

18. ఒకవేళ పరమతము గొప్పగా, నీ మతము నీచముగా కనిపిస్తే, నీవు మతమును మాత్రము మారవద్దు. నిన్ను ఈ మతములోనే దేవుడు ఎందుకు పుట్టించాడో యోచించు. అపుడు మత చింతపోయి దైవ చింత కల్గుతుంది.

19. మతము అన్న పేరు ప్రతి వర్గములోను ఉన్నది. నీది ఒక పేరు కల్గిన మతమైతే, మరొకనిది ఇంకొక పేరు కల్గిన మతమై యుండును. మతములో నిన్ను దేవుడే పుట్టించాడు. కానీ నీవు కోరి ఏ మతములో పుట్టలేదు.

20. నిన్ను ఒక మతములో పుట్టించి, ఇంకొకనిని మరొక మతములో దేవుడే పుట్టించాడు. అలా నిన్నూ ఇంకొకన్నీ పుట్టించినది ఒకే దేవుడే! నీవు పుట్టిన తర్వాత దేవునికి నీవే పేర్లు పెట్టుచున్నావు. నిజముగా దేవునికి పేరులేదు, ఆకారము అంతకూలేదు.

21. మతాలకు అతీతముగా, పేర్లకు అతీతముగా, రూపములకు అతీతముగా, క్రియలకు అతీతముగా ఎవడైతే ఉన్నాడో వాడే నిజమైన దేవుడు. అతనే నిన్ను ఈ ప్రపంచమును సృష్టించినవాడు.

22. దేవుడు మనిషిని మాయలో పుట్టించి తర్వాత తనవద్దకు వస్తాడో రాడో, తనను గుర్తిస్తాడో లేదో చూడాలనుకొన్నాడు. ఆ ప్రక్రియలో మొదటిదే నిన్ను ఒక మతములో పుట్టించడము. బాగా చూచుకొంటే నీవు ప్రస్తుతము మాయలో ఉన్నావు, దేవుని వైపుపో!

23. నీకు ఒక పేరునూ, నీకు ఒక కులమునూ, అలాగే ఒక మతమునూ ఇతరులే నీకు మొదట కరిపించారు. దేవునికి పేరుందా? కులముందా? మతముందా? అవి ఏవి లేవు. అవి లేని వానిని తెలుసుకోవాలంటే నీవు నీ పేరునూ, కులమునూ, మతమునూ దేవుని విషయములో దూరముగా పెట్టుకో.

24. నీవు ఏ మతాన్ని సమర్థించవద్దు. దేవున్ని, దేవుని జ్ఞానాన్ని మాత్రము సమర్థించు.

25. నీ ఇష్టముతో కూడుకొన్నది మతము. దేవుని ఇష్టముతో కూడుకొన్నది జ్ఞానము.

26. మతమును మనిషి సృష్ఠించాడు. జ్ఞానమును దేవుడు సృష్ఠించాడు.

27. మనిషి సృష్ఠించిన మతము ఇహమునకు సంబంధించినది. దేవుడు సృష్టించిన జ్ఞానము పరమునకు సంబంధించినది.

28. మనిషి సృష్ఠించిన మతమును పట్టుకొని ఇహములో ఉంటావో, దేవుడు సృష్ఠించిన జ్ఞానమును పట్టుకొని పరమునకు పోతావో నీవే నిర్ణయించుకో.

29. మతము మనుషుల గుంపును పెంచుతుంది. జ్ఞానము కేవలము జ్ఞానుల గుంపును పెంచుతుంది.

30. మతాన్ని ఏ మనిషిలోనైనా చూడవచ్చును. జ్ఞానాన్ని కొందరిలోనే చూడవచ్చును.

31. ప్రతి మనిషి మతానికి సంబంధించినవాడే. కానీ ప్రతి మనిషి జ్ఞానానికి సంబంధించి ఉండడు. 32. మతాన్ని బోధించేవారు మతగురువులు ఎందరో! జ్ఞాన్నాన్ని బోధించేవాడు జ్ఞానగురువు ఒక్కడే!!

33. మతము మనిషి పుట్టుకతోనే ఉంటుంది. ఇది నా మతము అని అందరికి తెలుసు. కానీ దైవజ్ఞానము పుట్టుకతో ఉండదు. మధ్యలో జ్ఞానము తెలిసినా అది అందరికి నచ్చదు.

34. మతము అంటే మార్గముకానిదని అనుభవముతోనే తెలుస్తుంది.

35. పథము అంటే మార్గము అయినదని అర్థములోనే తెలుస్తుంది.

36. ఒక మతములోని అజ్ఞాని కూడ ఇది నా మతము అని చెప్పగలుగు చున్నాడు. అందువలన మతములో అందరూ జ్ఞానులుంటారను నమ్మకము లేదు.

37. అజ్ఞానులు సహితమున్న మతముకావాలో కేవలము జ్ఞానులున్న పథముకావాలో నీవే యోచించుకో.

38. ఏ మతములోని అజ్ఞానమునైనా ఖండించు, ఏ మతములోని జ్ఞానమునైనా స్వీకరించు.

39. నీవు నాది హిందూమతమని అనుకుంటే ఇతరమతములోని జ్ఞానాన్ని కూడ ద్వేషిస్తావు. నాది ఇందూపథమని అనుకుంటే ఇతరమతము లోని అజ్ఞానాన్ని మాత్రమే ద్వేషించి జ్ఞానాన్ని ప్రశంసిస్తావు.

40. హిందూమతము పేరుతో రాజకీయమును చేయువారికి దూరముగా ఉండు. ఇందూపథము పేరుతో రాజయోగము చెప్పువారికి దగ్గరగా ఉండు. 41. మనిషిని ద్వేషించవచ్చు, మతాన్ని ద్వేషించవచ్చు, దానివలన వచ్చే పాపము క్షమించబడుతుంది.

42. దేవున్నికానీ, దేవుని పథమునుగానీ ద్వేషిస్తే దానివలన వచ్చే పాపము యుగ యుగముల పర్యంతము క్షమించబడదు.

43. నీవు జడ్జివైతే నీకు చట్టము తెలుసు, కావున ప్రపంచ విషయములకు శిక్ష చెప్పవచ్చును. దేవుని విషయములకు శిక్షచెప్పవద్దు. ఎందుకనగా దేవుని చట్టము నీకు తెలియదు.

44. నీవు న్యాయ నిర్ణేతవైన జడ్జివైతే ప్రపంచ విషయములలో ఇది ఫలనా నేరమని గుర్తించగలవు. కానీ దేవుని విషయములలో ఇది ఫలనా నేరమని గుర్తించలేవు.

45. నీవు న్యాయ నిర్ణేతవైతే న్యాయాన్యాయములను మాత్రమే గుర్తించగలవు. కానీ ధర్మాధర్మములను గుర్తించలేవు.

46. నీవు జడ్జివైతే కేవలము న్యాయాధికారివే, కానీ ధర్మాధికారివి కాదని గుర్తుంచుకో!

47. నీవు జడ్జివైతే ఇహలోక సంబంధ న్యాయమును మాత్రము గుర్తించ గలవు. కానీ పరలోక సంబంధ ధర్మమును గుర్తించలేవు.

48. న్యాయశాస్త్రమును చదివితే నీవు జడ్జి కావచ్చును. కానీ యోగ శాస్త్రమును చదవనిదే ఎవరూ యోగి కాలేడు.

49. న్యాయాధిపతి అయిన జడ్జి మనుషులకు మాత్రము శిక్ష చెప్పగలడు. కానీ ధర్మాధిపతి అయిన దేవుడు న్యాయాధిపతులకు కూడ శిక్ష చెప్పగలడు. 50. స్వచ్ఛమైన తెల్లనిది జ్ఞానము. చిక్కనైన నల్లనిది అజ్ఞానము. తెల్లని దుస్తుల విూద పూర్తిగా నల్లని కోటును ధరించిన జడ్జి నేను జ్ఞానానికి జడ్జిని కాదు, అజ్ఞానానికి మాత్రమే అన్నట్లున్నది.

51. తెల్లని దుస్తులవిూద నల్లని చిన్న కోటును ధరించిన న్యాయవాదులైన లాయర్లుకానీ, నల్లని పెద్దకోటు ధరించిన న్యాయనిర్ణేతలైన జడ్జీలు కానీ, చట్టములో జ్ఞానమును, అజ్ఞానము కప్పియున్నదని ఇతరులకు తెలియునట్లు, ఆ విధముగా తెలుపు విూద నలుపును ధరించారను కొంటాము.

52. మాయకు రెండు బలమైన వలలు కలవు. ఆ వలలలో చేపలు పడవు మనుషులు మాత్రము పడుతారు. ఆ వలల పేర్లు ఒకటి మతము. రెండు కులము. మతము కల్గినవాడు, కులము కల్గినవాడు మాయ వలలోనివారే. మతాతీతుడు, కులాతీతుడు దేవుని వలయములోని వారే.

53. మతములేనివాడు దేవుని పథములోని వాడే! కులములేనివాడు జ్ఞానపథములోని వాడే!


అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,

సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.