Jump to content

మతము - పథము/మతము-పథము

వికీసోర్స్ నుండి

మతము-పథము

భూమండలములో దేవున్ని విశ్వసించిన మనుషులను మూడు భాగములుగ విభజించవచ్చును. అలాగే దేవున్ని విశ్వసించిన మతములను కూడ మూడుగానే చెప్పుకోవచ్చును. ఆ మూడు మతములలో ప్రాచీనమైనది, అన్నిటికంటే ముందు పుట్టినది హిందూమతము, తర్వాత పుట్టినది క్రైస్తవ మతము, ఆ తర్వాత పుట్టినది ఇస్లామ్‌మతము. ముఖ్యమైన ఈ మూడు మతములలో దేవున్ని గురించి విపులముగా, చాలా దగ్గరగా బోధించినది హిందూమతములోని బోధయేనని చెప్పవచ్చును. తర్వాత బోధలో రెండవ స్థానములో ఉన్నది క్రైస్తవమతము. అలాగే బోధలో మూడవ స్థానమును పొందినది ఇస్లామ్‌మతము.

బోధలలో మూడవస్థానములో ఇస్లామ్‌ ఉన్నప్పటికి దేవుని మార్గములో మొదటిది, దేవున్ని పూర్తి విశ్వసించినది, దేవునికి చాలా దగ్గరగాయున్నది ఇస్లామ్‌మతమేనని చెప్పవచ్చును. అలాగే విశ్వాసములోగానీ, సావిూప్యములోగానీ రెండవస్థానములో ఉన్నది క్రైస్తవమతము. చివరిగా మూడవస్థానములో ఉన్నది హిందూమతమని చెప్పవచ్చును. ఒక లెక్కప్రకారము చెప్పుకొంటే ఇస్లామ్‌మతములో దేవుని విూద విశ్వాసము 90 శాతము ఉండగా, క్రైస్తవమతములో 50 శాతము గలదు. చివరిలోనున్న హిందూమతములో కేవలము 2 శాతముగానీ దానికంటే తక్కువగానీ కలదని చెప్పవచ్చును. ఇక్కడ ఇపుడు విూకొక ప్రశ్నవచ్చి నన్నడుగవచ్చును. ప్రశ్న ఏమనగా! ఇస్లామ్‌ మరియు క్రైస్తవులకంటే పూజలు చేయువారూ, గుడులకు పోవువారూ, యజ్ఞములు చేయువారూ, బోధలు చెప్పు స్వావిూజీలూ, మహత్యములు చూపు బాబాలు ఎందరో ఉండగా హిందూ మతములో ఎంతో హీనముగా కేవలము 2 శాతమే విశ్వాసముంది అంటున్నారేమిటి? అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! మేము చెప్పునది దేవుళ్ళకు కూడ దేవుడైన దేవుని విూద విశ్వాసమును గురించి చెప్పాము. విూరు అడుగునది దేవుడు పుట్టించిన దేవతల భక్తిని గురించి. దేవతల భక్తి హిందూమతములో ఉన్నంతగా ఏ మతములో లేదు. దేవతాభక్తి 99 శాతము హిందూవులలోనే కలదని చెప్పవచ్చును. కానీ దేవుని విూద భక్తి కేవలము 2 శాతము కూడా లేదని చెప్పుచున్నాము. మిగత రెండు మతములలో దేవుని విూద భక్తి తప్ప దేవతల విూద భక్తి లేదనియే చెప్పవచ్చును. దేవుని గురించిన బోధలుగల తలమాణిక్యమైన గ్రంథములు మూడు మతములలో మూడు గలవు. అవి ఇస్లామ్‌మతములో పవిత్ర ఖురాన్‌, క్రైస్తవమతములో పరిశుద్ద బైబిలు, హిందూమతములో భగవద్గీత గలదు. ఇక్కడ గమనించదగిన విషయమేమంటే ఇస్లామ్‌ మతగ్రంథమైన ఖురాన్‌ ముందర పవిత్ర అను బిరుదు గలదు. అలాగే క్రైస్తవములోని బైబిలు ముందర పరిశుద్ద అను బిరుదు గలదు. అయితే ఒక హిందూమతములోని భగవద్గీతముందర ఏ బిరుదు లేదు. వెనుక పుట్టిన బోధలకు పవిత్ర అని, పరిశుద్ద అని బిరుదులు ఉండగా ముందు పుట్టిన భగవద్గీతకు మొదట బిరుదులేదా అని యోచిస్తే, గడచిన కాలములోనికి పోయిచూస్తే భగవద్గీతకు ముందు దాని విలువను తెలుపు బిరుదులుండెడివని తెలియుచున్నది. అంతే కాదు ఇంకా వెనక్కి వెళ్లిచూస్తే నేడు మనకు తెలియని ఎన్నో సత్యములైన రహస్యములు బయటపడుచున్నవి.

ఇప్పుడు ప్రచారములోనున్న భగవద్గీత భగవంతుడైన శ్రీకృష్ణుని చేత అర్జునునికి ద్వాపరయుగములో (ద్వాపరయోగములో) చెప్పబడినప్పటికి దానిని పూర్వమే సృష్ఠి ఆదిలోనే పరమాత్మ సూర్యునికి చెప్పియున్నాడు. దీనినిబట్టి భగవద్గీత సృష్ఠి ఆదిలోనే ఉన్నదని తెలియుచున్నది. సృష్ఠాది నుండి ఉన్న భగవద్గీతలో నేడు క్రైస్తవమతములోను, ఇస్లామ్‌మతములోను చెప్పిన సారాంశము గలదు. అందువలన గీతకు పవిత్ర పరిశుద్ద అను రెండు బిరుదులు గలవు. భగవద్గీత భూమివిూదనున్న ఏ మతము పేరుతోను చెప్పబడియుండలేదు మరియు దైవసంబంధమైన పరమును గురించి మాత్రమే బోధించినది. కావున దానికి పరమ అని బిరుదు మొదటనే కలదు. భగవద్గీత పరమును (దైవమును) చూపునది, జ్ఞానపవిత్రతను కలిగియున్నది మరియు కర్మయను మురికిని తొలగించునదైయున్నది. అందువలన గీతను పరమ పవిత్ర పరిశుద్ద గ్రంథమని ద్వాపరయుగముకంటే ముందే కృతయుగములోనే అనెడివారు. భూమివిూద ఆ కాలములో అందరు జ్ఞానము తెలిసిన వారుండెడివారు. మాయ ప్రభావము చేత కొంత కాలమునకు మనుషులు దైవజ్ఞానమునకు దూరమైపోతూ వచ్చారు. ఆ విధముగా మనుషులు అజ్ఞానమువైపు పోతూ పోతూ భగవద్గీతకు గల బిరుదులను మరిచిపోయారు. అంతేకాక చివరకు భగవద్గీతనే మరచిపోయారు. గీతలోని ధర్మములను పూర్తి మరచిపోయారు. ద్వాపర యోగము (యుగము) చివరలో ధర్మములకు పూర్తి గ్లాని ఏర్పడినది. అటువంటి సందర్భములో దేవుడు మనిషిగా పుట్టి శ్రీకృష్ణునిగా ప్రవర్తించి సమయమును చూచి గీతను తిరిగి చెప్పిపోయాడు. ద్వాపరయోగము చివరిలో చెప్పబడిన భగవద్గీత కలియోగము మొదటికాలమైన ప్రస్తుత కాలములో ఉన్నప్పటికి దానికి బిరుదులు ఏమాత్రము లేకుండా పోయాయి. వెనక కలియోగములో పుట్టిన బైబిలుకు పరిశుద్ద గ్రంథమనీ, దానికంటే ఎంతో వెనుక పుట్టిన ఖురాన్‌ను పవిత్రగ్రంథమని పిలుస్తున్నపుడు, ఎంతో ముందు పుట్టిన భగవద్గీతను ఏ బిరుదుతో పిలువకపోవడము వలన గీతలోని జ్ఞానమునే చిన్నబుచ్చినట్లవుతుంది. బైబిలు, ఖురాన్‌ గ్రంథములకంటే ముందు చెప్పబడిన గీతజ్ఞానము అన్ని రకముల పవిత్రమైనది పరిశుద్దమైనది. దీనికి నిదర్శనముగా గీతలోనే జ్ఞానయోగమను అధ్యాయములో 38వ శ్లోకములో "నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే" అని చెప్పియున్నారు. దాని అర్థమును క్లుప్తముగా చెప్పుకొంటే గీతలో చెప్పిన జ్ఞానమునకు సమానమైనదిగానీ, దానికంటే పవిత్రమైనదికానీ లేదని తెలియుచున్నది. ఇదే జ్ఞానము ఇతర మతగ్రంథములలో ఉన్నది. ఇదే జ్ఞానము కొంత శాతమున్న గ్రంథములకు పవిత్ర అనీ, పరిశుద్ద అని బిరుదులు పెట్టినపుడు, పూర్తి శాతము జ్ఞానమున్న భగవద్గీతను చెప్పునపుడు దాని గొప్పతనమును సూచించకుండ, ఏ బిరుదులు లేకుండ పిలువడము భావ్యముకాదు. కనుక మనము ఇప్పటినుండి భగవద్గీతను నిజమైన భావముతో పరమ, పవిత్ర, పరిశుద్ద భగవద్గీత అని పిలుస్తాము. ఇదే విషయాన్ని అందరికి తెలిపి అందరిచేత భగవద్గీతను పరమ పవిత్ర పరిశుద్ద అను బిరుదులతోనే గౌరవిస్తాము.

పరమ పవిత్ర పరిశుద్ద గ్రంథమైన భగవద్గీత కేవలము దేవుని జ్ఞానాన్ని మాత్రము తెలుపుచున్నది. గీత ఏ ఒక్క మతమునకు సంబంధించినది కాదు. ఇపుడు మనుషుల మధ్యలోనున్న అన్ని మతముల సారాంశము భగవద్గీతలో కలదు. గీత సమస్త మానవులకు దైవసందేశముగా ఉన్నది. గీతలో చెప్పిన జ్ఞానము ఇటు బైబిలులోను అటు ఖురాన్‌లోను కనిపిస్తున్నది. దేవుని చేత రెండుమార్లు చెప్పబడినది భగవద్గీత ఒక్కటి మాత్రమే. భగవద్గీతలో ఎంత వెదకినా జ్ఞానమే కనిపిస్తుంది. కానీ మతము ఏమాత్రము కనిపించదు. అందువలన గీతను మతాలకు అతీతమైనదని చెప్పవచ్చును. ముఖ్యముగా చెప్పుకుంటే సృష్ఠి ఆదిలో సూర్యుడు భగవద్గీతను విన్నపుడు భూమివిూద మతము పేరే లేకుండెడిది. తర్వాత కొంత కాలమునకు మాయ యొక్క ప్రభావముచేత మతము అనునది మానవుల మధ్యలోనికి వచ్చి చేరిపోయినది. దేవుని జ్ఞానమునకు వ్యతిరేకముగా మాయ తన జ్ఞానమును దేవుని జ్ఞానమువలె ప్రచారము చేసి ఏది దేవుని జ్ఞానమో, ఏది మాయ జ్ఞానమో అర్థము కాకుండ చేయును. అలాంటి పరిస్థితులలో దైవజ్ఞానము విూద ఆసక్తి కలవారందరు దేవుని జ్ఞానము మాదిరియున్న మాయ జ్ఞానమును దైవజ్ఞానముగా లెక్కించి దానినే తెలుసుకొను అవకాశము గలదు. మానవులను దేవుని వైపు పోకుండ చేయుటకు, తనవైపుకు వచ్చుటకు మాయ ఎంతోమంది స్వామిజీల చేత తన జ్ఞానమును చెప్పించుచున్నది. మాయ తనయొక్క జ్ఞానమును ప్రచారము చేయువారికి పెద్ద పెద్ద బిరుదులను అంటకట్టి వారినే ప్రజలు నమ్మునట్లు చేయుచున్నది. దేవుడు తన జ్ఞానమును తెలుపుటకు కొన్ని వేల సంవత్సరము లకు ఒకమారు భూమివిూదకు భగవంతుని రూపములో వచ్చుచున్నాడు. భగవంతుడు ఒక్కడే భూమివిూద జ్ఞానమును చెప్పితే మనుషులు దానినే వినే అవకాశముండుట వలన అట్లుకాకుండ మాయ భూమివిూద తన జ్ఞానమును చెప్పు మనుషులకు అనేకమందికి భగవాన్‌ అని వారి పేరు చివర అంటించినది. అందువలన భూమివిూద ఎల్లకాలము ఎందరో భగవాన్‌లు తమ తమ మాయబోధలను చెప్పుచునే ఉందురు. ఎల్లపుడు భగవాన్‌ అనుపేరు కలవారు భూమివిూద ఉండగా వేల సంవత్సరములకు ఒకమారు వచ్చు భగవంతున్ని ఎవరు గుర్తించలేరు, అంతేకాక ఆయన జ్ఞానమును కూడ ప్రత్యేకముగా గుర్తించలేరు. అందువలన భూమివిూద ప్రస్తుతమున్న జ్ఞానములలో, ఏది నిజమైన దైవజ్ఞానమో గుర్తించలేని పరిస్థితులలో మానవులున్నారు. ఈ విధముగా మాయ తన జ్ఞాన విధానమును మనుషుల మధ్యలో ఎందరో మనుషులనే గురువులుగా చలామణి చేస్తూ వారిద్వారా ప్రచారము చేయిస్తున్నది. మాయ తన జ్ఞానము మానవుల మధ్యలోనికి పంపి దేవుని జ్ఞానమును మరిచిపోవునట్లు చేయుటకు మొట్టమొదటి ఆయుధముగా మతము అను దానిని ప్రవేశపెట్టినది. మాయ మొదట మతమును ఏ విధముగా, ఎంత చాకచక్యముగా భూమివిూద ప్రవేశపెట్టినదో వివరించుకొని చూస్తాము. దేవుడు సృష్ఠి ఆదిలోనే తన జ్ఞానమును సూర్యుని ద్వారా మనుషుల మధ్యలోనికి ప్రవేశపెట్టాడు. ఏ మనిషి అయిన లేక ఏ జీవుడైన మోక్షము అను గమ్యమును చేరుటకు నేను చెప్పిన మార్గము తప్ప వేరు మార్గము లేదని తెలియజేశాడు. గమ్యమున్నదంటే దానికొక మార్గముండాలి కదా! దేవున్ని చేరుటకు, లేక మోక్షమును చేరుటకు దేవుని చేత నిర్ణయింపబడిన మార్గమే జ్ఞానమార్గము అని అంటాము. జ్ఞానమార్గమును జ్ఞానపథము అనికూడ అంటాము. పథము అనగా మార్గమనియే అర్థము. పూర్వము జ్ఞానపథము అనే మాటనే ప్రజలు ఎక్కువగా అనుకొనెడివారు. ఎవడైతే దైవజ్ఞానమును సాధించుచున్నాడో వానిని జ్ఞానపథములో ఉన్నాడని ఇతరులు చెప్పెడివారు. ఇతర మత గ్రంథములలో కూడ జ్ఞానమార్గము చాలా ఇరుకైనదనీ, మాయమార్గము చాలా విశాలమైనదని కూడ చెప్పారు. గీతలో కూడ రాజవిద్యా రాజగుహ్య యోగమను అధ్యాయములో 23వ శ్లోకమున ఇతర దేవతలను పూజించువారు దారితప్పి నడచినవారగుదురని కూడ చెప్పాడు. దేవుడు జీవునికి గమ్యమైనపుడు ఆ గమ్యమును చేరుటకు తప్పనిసరిగ మార్గము కావాలి. ఆ మార్గమునే జ్ఞానపథము అని అనెడివారు. జ్ఞానము అను పథమును గురించి చెప్పుకొంటే జ్ఞానము రెండు రకములుగా ఉన్నది. ఒకటి దేవుని జ్ఞానము, రెండవది ప్రపంచజ్ఞానము కలవు. మార్గము లేక పథము అనునవి ఒకే అర్థము నిచ్చినప్పటికి జ్ఞానము రెండు రకములుగా ఉన్నది కావున దైవజ్ఞానమును, ప్రపంచజ్ఞానమును వేరువేరుగా గుర్తించుటకు దైవజ్ఞానమునకు "ఇందు" అను పదమును వాడెడివారు. ఇందు అనగా చంద్రుడని అర్థము. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము చంద్రగ్రహము దైవజ్ఞానమునకు అధిపతి, గురుగ్రహము ప్రపంచ జ్ఞానమునకు అధిపతి. కావున ఇక్కడ దైవజ్ఞానమును ప్రత్యేకముగా గుర్తించుటకు దైవజ్ఞానమునకు అధిపతియైన చంద్రుని పేరును జ్ఞానము ముందర పెట్టారు. చంద్రున్ని ఇందు అనెడివారన్నాము కదా! జ్ఞానపథము (జ్ఞానమార్గము) లోనున్న వారిని ఇందూపథములో ఉన్నారని చెప్పెడివారు. పూర్వము ఇందూపథము అను మాటయే వాడుకలో ఉండెడిది. ఆనాటి దైవ జ్ఞానులందరిని కలిపి ఇందూపథములోని వారని అనెడివారు.

దేవుని చేతనే సృష్ఠింపబడి, దేవుని చేతనే శక్తిని పొంది, దేవుని ఆజ్ఞప్రకారము నడుచుకొను మాయకు ఇక్కడే పెద్ద ఆయుధము దొరికినది. పథము అనుమాటను మతము అనుమాటగా మార్చివేసినది. మనుషుల తలలలో తిష్టవేసిన మాయ మనుషులచేత పథమును మతముగా పలికించను మొదలుపెట్టినది. ఈ విధముగా మొదట తయారైన మతము అందరిలో వ్యాపించిపోయి ఆనాడు ఇందూపథములోని వారందరిని ఇందూమతములోని వారిగా చెప్పుకొన్నట్లు చేసినది. ఆనాడు భారతదేశమంతా దైవజ్ఞానులే ఉండెడివారు, కనుక భారతదేశమునకు ఇందూదేశమని పేరు వచ్చినది. అప్పటికాలములో ఇందూదేశములోని వారంతా ఇందూమతము వారేనని చెప్పుకొనెడివారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రపంచములో మొదటి ఇందూదేశముకానీ చివరి ఇందూదేశముగాని భారతదేశమేనని చెప్పవచ్చును. మాయకు కూడ ఇందూదేశము విూదనే ఎక్కువగా కన్నుకలదు. కావున మొదట ఇందూదేశములోనే మతము అనే ఆయుధమును ప్రయోగించినది. ఆ ఆయుధము బ్రహ్మాస్త్రమువలె పనిచేసి ఎంతటి దైవజ్ఞాని చేతనైనా మతము పేరునే చెప్పించుచున్నది. ఎంతో చాకచక్యముగా పథమును మతముగా మార్చిన మాయ అంతటితో ఆగక మరియొక ఆయుధమును కూడ ప్రయోగించినది. అది ఏమనగా!

ఇందు అనగా చంద్రుడనీ, చంద్రుడనగానే దైవజ్ఞానమనీ తెలిసి పోతుందని, అలా దైవజ్ఞానము పేరు మతము అను పేరుకు ముందుంటే ఎప్పటికైన మతమును పథముగా ఎవరైనా మార్చినా ఇందూపథము అని తిరిగి మొదటి పేరే వస్తుంది కదా యని యోచించిన మాయ మతము ముందర ఇందూ అను పదమును తీసివేయాలనుకొన్నది. పథమును సులభముగా మతముగా మార్చిన మాయ, ఇందు అను పదము సులభముగానే హిందు అను పదముగా మార్చివేసినది. దానితో ఇందూపథము పూర్తి హిందూమతముగా మారిపోయినది. ఇందూ అనునది హిందుగా, పథము అనునది మతముగా మారిపోవడము వలన అందరూ హిందూమతమనే అనుకొంటున్నారు. ఇందూపథమునుండి హిందూ మతములోనికి మనుషులను మార్చిన మాయ, మనుషులలో దైవజ్ఞానమును లేకుండ చేసి తన జ్ఞానమును దైవజ్ఞానమువలె తలచునట్లు చేసినది. అందువలన నేడు ప్రజలలో భక్తి జ్ఞానము ఉంది అంటే అది ఎక్కువ శాతము మాయకు సంబంధించినదే అయి ఉంటుంది. హిందూమతము 98 శాతము మాయజ్ఞానములో కూరుకపోయినదని చెప్పవచ్చును. కొన్ని ఇతర మతములలో కొంతమేరకు అసలైన దైవజ్ఞానముండినప్పటికి మాయ అక్కడవారిని కూడ తనవైపు తిప్పుకొనుటకు చూస్తున్నది. అయినప్పటికి హిందూమతముకంటే ఇతర మతములే కొంత సక్రమమార్గములో ఉన్నవని చెప్పుకొనవచ్చును. ఎందుకనగా ప్రస్తుత హిందూమతము దేవుని విషయములో చాలా దిగజారిపోయినదని చెప్పుటకు ఎన్నో తార్కాణములు గలవు. ముఖ్యముగ ఉన్న హిందు, ఇస్లామ్‌, క్రైస్తవ అను మూడు పథములు వాటివాటి పేర్లతోకాక మతముల పేర్లతోనే కలవు. మూడు మతములలోను అసలైన ఒకే దేవుని జ్ఞానమే ఉన్నప్పటికి మాయయొక్క మత ప్రభావము వలన అన్ని మతములలోను ఒకే దేవున్ని గురించి చెప్పారని మనుషులకు తెలియకుండపోయినది. క్రైస్తవులు మా దేవుడు "యెహోవా" అని అంటారు. ముస్లీమ్‌లు మా దేవుడు "అల్లా" అంటారు. హిందువుల విషయానికివస్తే వాళ్ళ దేవుడు ఎవరో కూడా వారికే తెలియని స్థితిలో ఉన్నారు. మతము అను మాయ అందరికి ఒకే దేవుడనీ, అందరిని సృష్ఠించినవాడొకడేననీ, సృష్ఠి మొదటినుండి చివరి వరకు జగతికంతా ఒకరే అధిపతియనీ, అతనే దేవుడని తెలియకుండ చేసినది. మా దేవుడు వారి దేవునికంటే గొప్ప అను భావమును అన్ని మతములలోను మాయ చొప్పించి పెట్టినది. అట్లు అనుకోవడమే పెద్దమాయ అని ఎవరు అనుకోవడములేదు. అంతేకాక మాయ మరొక భావమును కూడ మనుషులలో ఉండునట్లు చేసినది. అది ఏమనగా! మేము క్రైస్తవులము అనువారు బైబిలును గురించి మాట్లాడినా, ప్రభువును గురించి మాట్లాడినా సంతోషముగా వింటారు. అదే హిందూ మతములోని భగవద్గీతను గురించి మాట్లాడినా, శ్రీకృష్ణున్ని గురించి మాట్లాడినా విసుగుకొని వినరు. వినకపోవడమే కాకుండ శ్రీకృష్ణున్ని గురించి, భగవద్గీతను గురించి వ్యతిరేఖముగా మాట్లాడుదురు. అలావారు ప్రవర్తించుటకు ముఖ్యమైన కారణము ఏమంటే, మాయ మతమను ముసుగును వారికి తగిలించి దేవున్ని, దేవుని జ్ఞానమును పరిమితి చేసి చూపిస్తున్నది. కావున దేవుడు పూర్వమునుండి ఉన్నాడనీ, ఆయన కలియుగములో ప్రభువురూపములో వచ్చినట్లు ఇతర యుగములలో, ఇతర రూపములలో వచ్చియుండుననీ, బైబిలులో దేవుడు ప్రభువు రూపములో చెప్పినట్లు గీతలో కూడ దేవుడు చెప్పియుండు నేమోనని యోచించకుండ చేయుచున్నది. తాను నిర్మించిన మతమను పరిధిని దాటిపోయి విశాలముగా ఉన్న దేవున్ని మానవులు తెలుసు కొంటారేమోనని మాయకు దిగులు. అందువలన మాయ ప్రభావమున్నవారు మేము ఇతర మతముల పుస్తకములు చదవము, ఇతర బోధలు వినము అంటుంటారు. నిజముగా భర్తను ప్రేమించు భార్య బయట ఇతర పురుషున్ని చూచినా భర్తను వదిలి వాని వెంటపోదుకదా! అలాంటపుడు ఏ మతములోని వారైనా వారి మతములోని దేవున్ని పూర్తిగా విశ్వసించియుంటే ఇతర మతముల పుస్తకములు చదివినా, బోధలు వినినా వారి దేవున్ని వదలి పెట్టరు కదా! తన భర్త విూద నమ్మకములేని భార్య ఇతర పురుషున్ని చూస్తే తానెక్కడ తనభర్తను వదలిపోతానో అను భయమున్నపుడు ఇతరులను చూడకుండ జాగ్రత్తపడును. అలాగే తన దేవుని విూద విశ్వాసములేని మనిషి ఇతర మతముల పుస్తకములు చదివినా, బోధలు వినినా తన దేవున్ని, తన మతమును వదలిపోతానేమోనను భయముండును. అందువలన అటువంటివారు ఇతర మతగ్రంథములను ఇతర బోధలను వినరు, చదువరు.

ఇక హిందూమతములోని వారిని చూస్తే వారు ఒక దేవున్నికాక ఎందరో దేవుడు కాని దేవుళ్ళను వారే సృష్ఠించుకొని ఇష్టదేవుడు, ఇంటిదేవుడు, కులదేవుడని రకరకముల దేవుళ్ళను ఆరాధిస్తున్నారు. ఒక్క దేవున్నికాక ఎందరో దేవుళ్ళకు అలవాటుపడిన వారు కనుక ఇతర మతములోని దేవుని విూద కూడ వీరికి పెద్ద అసూయా భావముండదు. అందువలన క్రైస్తవులు పుస్తకములు ఇచ్చినా వాటిని చదువగలుగుచున్నారు. వారి బోధలు చెప్పినా వినగలుగుచున్నారు. ఎందరో హిందూమతమును వదిలి క్రైస్తవమతములోనికి పోయిన వారు కూడ ఉన్నారు. ఇదంతయు గమనిస్తున్న హిందూమత గురువులు, స్వాములు, పీఠాధిపతులు తాము చెప్పిన బోధలే వినాలి, తాము వ్రాసిన గ్రంథములే చదవాలి అని తమ వర్గమువారికి బోధించను మొదలుపెట్టారు. హిందూమతములో అద్వైతము, విశిష్ఠాద్వైతము, ద్వైతము అను చీలికలుండడమేకాక అచల సమాజమనీ, బ్రహ్మకుమారి సమాజమనీ, సిద్దయోగ సమాజమనీ, పిరమిడ్‌ సమాజమనీ చాలా రకముల చీలికలు గలవు. హిందూమతములో వారివారి సమాజమును బలపరచుకొనేదానికి, వారి సమాజములోనివారు ఇతర సమాజములోనికి పోతారేమోనని భయముతో ఇందూమతములోనే ఇతరులు వ్రాసిన పుస్తకములు చదువకూడదని తాము వ్రాసిన పుస్తకములు మాత్రమే చదువవలెనని ఆంక్షలు పెట్టియుందురు. ఇదెలా ఉందంటే తాను అందవిహీనుడైయున్నవాడు తన భార్య తనకంటే అందముగా ఉన్నవాడిని చూస్తే తనను ఎక్కడ వదిలిపెట్టిపోతుందోనను భయముతో నీవు ఇతరుల వైపు చూడద్దు అని తన భార్యను ఆజ్ఞాపించినట్లు కొందరు గురువులు, స్వాములు తమ భక్తులకు, శిష్యులకు ఇతర పుస్తకములు చదవద్దనీ, ఇతర బోధలు వినవద్దని ఆజ్ఞాపించుచున్నారు. ఇలాంటి నా మతము అను సంకుచిత భావములు, నా జ్ఞానము అను స్వార్థభావములు మతములలోను, భక్త సమాజములలోను పెరిగిపోయాయి. క్రైస్తవులు ఇచ్చిన పుస్తకములను హిందువులు నిరాటంకముగా తీసుకొంటున్నారు. విూరిచ్చిన పుస్తకములు మేము తీసుకోమనీ, మేము చదువమని హిందూవులు అనడములేదు. కానీ ఒక హిందువు హిందూమతానికి సంబంధించిన పుస్తకమును క్రైస్తవులకు ఇస్తే క్రైస్తవులు "విూరిచ్చిన పుస్తకమును మేము చదువము మాకు వద్దని" నిరాకరిస్తు ముఖాన్నే చెప్పుచున్నారు. ఇదంతా మాయయొక్క మత ప్రభావము కాదా?

విశ్వమంతటిని సృష్ఠించిన దేవుడు, విశ్వమునంతటిని అంతము చేయగల దేవుడు, విశ్వములోని మానవులందరికి అధిపతియైన దేవుడు, అన్ని మతములలోను నాయకుడైయున్న దేవుడు సృష్ఠించినవే మతగ్రంథము (పథగ్రంథము) లైన భగవద్గీత, బైబిలు, ఖురాన్‌లు. దేవుడు తెలియజేసిన జ్ఞానసమాచారము ఆ మూడు గ్రంథములలో కలదు. కానీ దేవుడు తెలియజేసిన జ్ఞానమును కూడ మనుషులకు అర్థము కాకుండ చేయడమే మాయయొక్క పని తనము. గ్రంథములలో కూడ తన ఛాయను చూపుకోవడము మాయ యొక్క చాకచక్యము. ఉదాహరణకు భగవద్గీతను తీసుకొంటే దేవుడు చెప్పిన చాలా శ్లోకములను మాయ మనుషులకు అర్థము కాకుండ చేసినది. సంస్కృత శ్లోకములకు వివరము చెప్పిన స్వాముల చేతనే తప్పుడు వివరమును వ్రాయించింది. ఎక్కడాలేని స్వర్గ, నరక లోకములు ప్రత్యేకముగా ఉన్నవని నమ్మించింది. మొత్తము విూద దేవుడు చెప్పిన భావమును కేవలము ఐదు శాతము కూడ అర్థము కాకుండ చేసినది. చాలా చోట్ల భగవద్గీతలో దేవుడు చెప్పిన ఉద్దేశ్యమునకు వ్యతిరేఖ భావములను దేవుడే చెప్పినట్లు నమ్మించినది. అందువలన హిందూ మతములో భగవద్గీత ఇప్పటికి పూర్తి భావసహితముగా లేకుండ భావరహితముగా ఉన్నదనియే చెప్పవచ్చును.

ఇక బైబిలు విషయానికి వస్తే అందులో మాయ, దేవుని మాటలను మనుషుల మాటలను కలిపివేసినది. దేవుని మాటను మనుషుల మాటలను సమానముగా లెక్కించుకొనునట్లు చేసినది. ఇది ప్రత్యేకమైన దేవుని మాట కదాయని గుర్తించనట్లు మనుషుల మాటలను చొప్పించినది. బైబిలులోని అన్ని వాక్యములు ముఖ్యమేనన్నట్లు దానిలోని ఒక పొల్లు కూడ తీసి వేయకూడదని మనుషులను శాసించినది. అందువలన క్రైస్తవులు బైబిలులోని దేవుని వాక్యములను మాత్రము గుర్తించక ప్రతివాక్యము ముఖ్యమేనను కొంటున్నారు. తమకు తెలియకనే దేవుని వాక్యమునకు వ్యతిరేఖమైన భావములను తమలో పెట్టుకొనుచున్నారు. దైవము చెప్పిన భావమునకు కొందరు ఏ విధముగా వ్యతిరేఖముగా ఉన్నారో రెండు ఉదాహరణలను తీసుకొని చూస్తాము. బైబిలును చదివిన క్రైస్తవులు మనిషికి ఒకే జన్మకలదు, చచ్చిన తర్వాత ఎవడూ పుట్టడని, పునర్జన్మలేదని అంటున్నారు. అది నిజమేనని చాలామంది నమ్ముచున్నారు. ఈ మాట దేవుని మాటకు వ్యతిరేఖమైనదని ఎవరు యోచించలేదు. దేవునికి వ్యతిరేఖమైన ఆ విషయమును వివరించు కొందాము. బైబిలు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 12వ అధ్యాయమందు 32వ వాక్యములో ఈ విధముగా ఉన్నది. "మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదుగానీ, పరిశుద్దాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈయుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు." ఈ వాక్యమును విడదీసి చూస్తే ఒకరు దేవుని కుమారుడు, మరియొకరు పరిశుద్దాత్మ, మూడవవాడు విరోధముగా మాటలాడువాడు. ఈ ముగ్గురిలో ఎల్లపుడు సర్వము అణువణువున వ్యాపించి, అందరికి సాక్షిగాయున్న పరమాత్మయే పరిశుద్దాత్మ లేక దేవుడు. దేవునికి అపరిశుద్దమైన పాపము అంటదు కావున ఆయనను పరిశుద్దాత్మ అంటున్నాము. పరిశుద్దాత్మకు ఆకారములేదు, ఆకారము లేనివానికి పేరు కూడయుండదు. అందువలన ఆయనను రూప నామములు లేనివాడని కూడ అనుచుందుము. రూపము, పేరులేని దేవుడు, అంతటా వ్యాపించియున్న దేవుడు, తన విషయమును ప్రజలకు చెప్పుటకు తన వ్యాపకమునుండి ఒక భాగమును మనిషిగా పుట్టింపజేసి మనుషులతో మాట్లాడును. దేవుడే స్వయముగా తన కోట్లాది అంశలలో ఒక అంశతో పుట్టుచున్నాడు కావున ఆయనను మనుష్య కుమారుడు అని బైబిలులో, భగవంతుడని భగవద్గీతలో అంటున్నారు. దేవుని ఒక భాగమును దేవుని కుమారుడనీ, కోట్లాది భాగములను పరిశుద్దాత్మ అని అంటున్నాము. పరిశుద్దాత్మ ఎల్లవేళల విశ్వమంతా వ్యాపించియుండగా, దేవుని కుమారుడు మాత్రము భూమివిూద కొన్ని వేల సంవత్సరముకొక మారు పుట్టుచుండును. మాయప్రభావము వలన భూమివిూద అధర్మములు ఎక్కువైనపుడు దేవుని ధర్మము తెలియకుండ పోయినపుడు దేవుని సంకల్పముతో దేవుని అంశ భూమివిూద పుట్టును. అలా పుట్టినవాడు కూడ బయటికి మనిషిగానే ఉండును. ఇక మూడవవాడైన మనిషి సృష్ఠాదిలోనే పుట్టియున్నాడు. మాయమార్గములో నడుచు మనిషి భూమివిూద నివసించు స్థలమును, బంధువర్గమును కొన్ని సంవత్సరముల కొకమారు మరణము అను దానితో విడిపోతూ, పుట్టుక అనుదానితో క్రొత్త నివాసస్థలమును, క్రొత్తబంధువర్గమును పొందుచుండును. ఇదంతయు ఒక ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌ (బదిలి) అయి మరొక ఊరిలో ఉద్యోగము చేసినట్లు, ఒక జీవుడు ఒక శరీరమును వదిలి వేరొక శరీరమును పొంది అక్కడ క్రొత్త జీవితమును సాగించుచుండును. దీనినిబట్టి ఎల్లపుడు భూమివిూద ఉండువాడు మూడవవాడైన జీవుడు (మనిషి). మొదటివాడైన పరిశుద్దాత్మ అసలు పుట్టడు. రెండవవాడైన దేవుని కుమారుడు (భగవంతుడు) అవసరమొచ్చినపుడు కొన్ని వేలసంవత్సరములకొకసారి పుట్టుచుండునని తెలియుచున్నది. రెండవవాడైన భగవంతుడు లేక దేవుని కుమారుడు మనిషికి కర్మలు (పాపపుణ్యములు) అంటకుండుటకు మనిషి కర్మల నుండి బయటపడుటకు అవసరమైన దేవుని జ్ఞానమును తెలుపుటకు పుట్టుచుండగా, మనిషి మాత్రము పాపమును అనుభవించుటకు పుట్టుచుండును. కర్మను అనుభవించుచు క్రొత్తకర్మను మనిషి సంపాదించుకొనుచు, క్రొత్తదానిని అనుభవించుటకు, క్రొత్త జాగా, క్రొత్త బంధువులను, క్రొత్త శరీరముతో చేరుచున్నాడు. పాతకర్మను అనుభవిస్తూ క్రొత్తకర్మను ప్రపంచకార్యములలో ప్రపంచ సంబంధముగ సంపాదించు కొనుచున్నాడు. ప్రపంచ సంబంధముగ సంపాదించుకొన్న కర్మను అనుభవిస్తే అయిపోతుంది. ఎందుకనగా ప్రపంచ సంబంధకర్మ పరిమితమైనది, దానిని పరిమిత కాలములో అనుభవిస్తే అయిపోతుంది. కానీ దేవుడు అపరిమిత మైనవాడు కావున దైవసంబంధముగ చేసుకొన్న కర్మ అపరిమితమైనది. మరియు దాని అనుభవము కూడ అపరిమిత కాలముండును. అందువలన పరిశుద్దాత్మను నిందించితే ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదన్నారు. దేవుని నిందించినవాడు యుగయుగముల పర్యంతము పాపము అనుభవిస్తూనే ఉండవలయునని అర్థము కాదా! దేవున్ని దూషించిన మనిషి ఈ యుగమంతయు మరియు రాబోవు యుగములంతయు ఉండుననియేగా అర్థము. ఆ విధముగ ఎవడైన ఉన్నాడా? అని చూస్తే ఒకే మనిషి అనగా దేవున్ని దూషించినవాడు ఎవడూ నూరు సంవత్సరములకంటే ఎక్కువకాలము బ్రతుకలేదు. కానీ అక్కడ యుగ పర్యంతముండునను దేవుని మాట వ్యర్థము కాదుకదా! అంటే దేవుని వాక్కు ప్రకారము యుగయుగముల వరకు వాడుండుట సత్యమే. అది ఎలా అంటే నిందించినవాడు చస్తూ పుట్టుచు, జన్మలు పొందుచు, శరీరములు మారుచు దేవున్ని దూషించిన పాపమును అనుభవించుచుండును. ఇక్కడ మనిషికి జన్మలున్నాయంటేనే దేవుని మాట నెరవేరుతుంది. మనిషికి జన్మలులేవంటే దేవుని మాట అసత్యమౌతుంది. దేవుని మాటకు వ్యతిరేఖముగా మాయ మనిషికి జన్మలు లేవని మనుషుల చేతనే చెప్పిస్తుంది. అయినా జ్ఞానము ప్రకారము అది నిలువదు. జ్ఞానము ప్రకారము దేవున్ని దూషించిన మనిషి చిరకాలము భూమివిూద పాపమును అనుభవిస్తూనే ఉండుట సత్యము.

సాతాన్‌ మరియు సైతాన్‌ అను పేర్లతో చలామణి అగు మాయ చాలా గొప్పది. దానిని జయించుట దుస్సాధ్యమని స్వయముగ భగవంతుడే "మమమాయ దురత్యయా" అని భగవద్గీతలో చెప్పాడు. అందువలన మాయ దేవుని మార్గములో ప్రయాణించువారిని దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖముగా తయారుచేసి తన జ్ఞానమార్గములో ప్రయాణించునట్లు చేయును. అదియు ఎంత గొప్ప మేధావిగా చేయుచున్నదనగా! ప్రతి ఒక్కన్ని దేవుని మార్గములోనే ఉన్నట్లు భ్రమింపజేసి తన మార్గములో నడుపుకొనుచున్నది. ప్రత్యేకించి దేవుని జ్ఞానమును బోధించువారినే అలా చేయుచున్నది. మాయ అలా చేయడము వలన వారి బోధలను వినువారుగానీ, వారిని అనుసరించువారు గానీ, దేవుని మార్గములోనే ఉన్నామనుకొనుచూనే మాయమార్గములో ఉండి పోగలరు. మాయ మార్గమునే దేవుని మార్గముగా నమ్మియుండగలరు. ఈ విధముగా మాయ ఎక్కడ కూడ తన పేరును పైకి కనిపించకుండ చేసి తన దారిలోనే అందరిని నడుచునట్లు చేయుచున్నది. క్రైస్తవమతములో జ్ఞానులమనుకొన్న వారిని సహితము మాయ దేవుని మాటకు వ్యతిరేఖముగా తనకు అనుకూలముగా ఎలా నడుపుచున్నదో తెలియుటకు మరియొక ఉదాహరణను చూచెదము.

మత్తయి సువార్త 23వ అధ్యాయములో 9వ వచనములో ఈ విధముగ గలదు. "భూమివిూద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే విూతండ్రి, ఆయన పరలోకమందున్నాడు." ఈ మాట స్వచ్ఛముగా దేవుని కుమారుడైన ఏసుప్రభువు చెప్పిన మాట. పైకి కనిపించు ప్రభువు చెప్పినప్పటికి దానిని పూర్తి దేవుని మాటగానే లెక్కించాలి. ఎందుకనగా చెప్పినది దేవుని అంశయే కావున ఆ మాట నిజముగా దేవుని మాటయే. దేవుని విూద విశ్వాసమున్న వారు దేవుని మాటను తప్పనిసరిగా వినాలికదా! కానీ మాయ దేవుని విూద విశ్వాసమున్న వారినే ఆ మాట వినకుండ చేసినది. అదియూ మేము బోధకులము, దేవుని జ్ఞానాన్ని గురించి వివరముగా చెప్పగలము అనువారివిూదనే మాయ పట్టు సాధించి, వారిని దేవుని మార్గములోనే ఉన్నట్లు నమ్మించి, దేవుని బోధనే బోధించునట్లు భ్రమింపచేసి, చివరకు దేవుని మాటకు వ్యతిరేఖముగా వారి నోటనే తన మాటను పలికించుచున్నది. దేవుని జ్ఞానమును బోధించు బోధకులైన కొందరిని మాయ తండ్రి అని పేరు పెట్టి పిలుచునట్లు చేసినది. బోధకుల చేతనే నేను ఫాదర్‌(తండ్రి)ని అని చెప్పించుచున్నది. కొందరి బోధకులకు హోదాగా ఫాదర్‌ (తండ్రి) అను పేరును కల్గించి సమాజములో గౌరవ మర్యాదలు కలుగజేయుచున్నది.

నేడు క్రైస్తవమతములో బోధకులైన ఫాదర్‌లు ఎందరో గలరు. వారు బైబిలులోని విషయములనే చెప్పుచున్నప్పటికి తాము మత్తయి 23, 9వ వచనములోనున్న దేవుని వాక్కుకు వ్యతిరేఖముగా ఫాదర్‌ అని ఇతరుల చేత పిలిపించుకొంటున్నాము కదా! అను ధ్యాస వారిలో ఏమాత్రము లేదు. ఫాదర్‌ పేరుతో బోధకులకు కొంత హోదాను కల్పించిన మాయ మేము దేవుని సేవకులమని భ్రమింపచేసి, ఆ భ్రమలో తాము దేవుని మాటకు వ్యతిరేఖముగా ఉన్నాము కదా అను జ్ఞప్తిని లేకుండ చేసినది. చూచారా మాయ ఎంత బలమైనదో! దేవుని విూద దాదాపు యాబైశాతము విశ్వాసమున్న క్రైస్తవులలోనే మాయ ఇంత బలముగా ఉంటే, కేవలము రెండు శాతము విశ్వాసమున్న హిందువులలో మాయ ఎంత భయంకరముగా ఉండునో ఊహించుకోండి. మాయకు ఎక్కువ పట్టువున్న మతము హిందూమతమే. ఎందుకనగా హిందూమతములో దేవుని విూద విశ్వాసము రెండు శాతమే ఉన్నది, కనుక మిగత 98 శాతము మాయకు బలముగా ఉన్నది. సగటు హిందూమతము విూద చెప్పునది 98 శాతమని తెలియవలెను. విడదీసి చెప్పుకొంటే ఒక మనిషిలో 90 శాతము దేవుని విూద విశ్వాసముండవచ్చును. అపుడు వానిలో మాయ కేవలము 10 శాతము మాత్రము పని చేయుచున్నదని చెప్పవచ్చును. అలాగే ఒకనిలో 100 శాతము దేవుని విూద విశ్వాసము లేకుండవచ్చును. అటువంటి వానిలో 100 శాతము మాయ పని చేయుచున్నదని తెలియుచున్నది. ఈ విధముగా లెక్కించి చూస్తే హిందూమతములో కూడ కొందరు అక్కడక్కడ బహు అరుదుగా దేవునివిూద విశ్వాసమున్న వారు ఉండవచ్చును. ప్రస్తుతము హిందూమతములోనున్న పరిస్థితిని బట్టి, జ్ఞానులను అజ్ఞానులను అందరిని దృష్ఠిలో పెట్టుకొని సగటుకు మాయ ఎక్కువ 98 శాతము హిందూమతములో బలము కలిగియున్నదని చెప్పవచ్చును. అన్నిటికంటే వెనుక దాదాపు 1400 సంవత్సరముల క్రితము పుట్టిన ఇస్లామ్‌మతములో మాయ కేవలము 10 శాతము బలము కలిగియుండగా, దానికంటే 600 సంవత్సరముల ముందు పుట్టిన క్రైస్తవమతములో 50 శాతము బలము కలిగియున్నది. మాయ 98 శాతము హిందూమతములో ఉన్నదను మా మాట హిందువులైన కొందరికి మ్రింగుడుపడని విషయము. కానీ ఈ గ్రంథమును చివరివరకు చదివితే నేను చెప్పిన మాటను విూరు కూడ చెప్పగలరు.

ఇంతవరకు మనుషులలోగల మతములందు గల మాయను విశ్లేషించి చెప్పుకొన్నాము. ఇపుడు చెప్పునదేమంటే హిందూ మతగ్రంథమైన భగవద్గీతలో జ్ఞానము ఎంతమేరకున్నది అను విషయమును గురించి చెప్పుకొందాము. భగవద్గీత 700 శ్లోకముల గ్రంథము. అందులో 54 శ్లోకములు మాయకు సంబంధించిన కల్పిత శ్లోకములు గలవు. దీనినిబట్టి దాదాపు 93 శాతము దైవజ్ఞానము, 7 శాతము మాయజ్ఞానము భగవద్గీతలో కలదని చెప్పవచ్చును. అన్ని మతగ్రంథములకంటే ఎక్కువ శాతము దైవజ్ఞానమున్న గ్రంథము భగవద్గీత. భగవద్గీత హిందూమతగ్రంథముగా ప్రచారము చేయబడినది. కానీ వాస్తవానికి భగవద్గీత హిందూమతగ్రంథము కాదు. ఇంకా వివరించి చెప్పితే అది ఒక మతగ్రంథమేకాదు. అన్ని మతములలోని సర్వమానవులకు సంబంధించిన జ్ఞానము భగద్గీతలో కలదు. కావున గీతను మతగ్రంథమనుట పొరపాటనియే చెప్పవచ్చును. భగవద్గీతలో 93 శాతము దైవజ్ఞానము ఇమిడియుండగా హిందువులుగా ఉన్నవారు సగటుకు గీతలోని జ్ఞానమును కేవలము 3 శాతము కూడ తెలుసుకోలేదు. భగవద్గీత మా మతగ్రంథమని చెప్పుకొను హిందువులకే దానిలో భావము 3 శాతము కూడ అర్థము కానపుడు, దానిని ఏమాత్రము చదవని ఇతర మతములవారికి దానిలోని జ్ఞానము ఎలా తెలియును? దాదాపు 5200 సంవత్సరములనుండి ఉన్న భగవద్గీత హిందువులకు ఇంతవరకు అర్థము కాలేదని చెప్పవచ్చును. ఇక్కడ కొందరికొక ప్రశ్నవచ్చి భగవద్గీత భావము సామాన్య మనుషులకు తెలియకుండ పోయియుండవచ్చును. కానీ స్వావిూజీలకు పీఠాధిపతులకు కూడ తెలియదంటారా? అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! స్వావిూజీలు వ్రాసిన గీత వివరమునే కదా సామాన్య మనుషులు చదువుతున్నది. దేవుడు చెప్పినదొకటైతే వ్రాసినవారు చెప్పిన భావమొకటున్నపుడు, వ్రాసినవారికి అర్థముకాకనే అలా వ్రాశారని చెప్పాలి. స్వావిూజీలకే అర్థముకానపుడు సామాన్యులకు ఎలా అర్థమవుతుంది? అందువలన గీతలో 93 శాతము జ్ఞానమున్నా దానిని మనుషులు గ్రహించినది 3 శాతమేనని అంటున్నాము. ఇపుడు అనుమానము వచ్చి ఎవరికి తెలియనిది నీకెలా తెలుసు? ఇంతవరకు చెప్పిన వారికంటే నీవు బాగా తెలిసినవాడివా? అని కూడ కొందరు నన్ను ప్రశ్నించవచ్చును. దానికి జవాబుగా చెప్పునదేమంటే నేను అందరికంటే తక్కువ తెలిసినవాడినేనని ఒప్పుకుంటున్నాను. ఒక మనిషిగా ఈ వ్రాతకు నాకు ఎటువంటి సంబంధములేదు. నేను కేవలము కలములాంటివాడినే. ఈ వ్రాతను వ్రాయించినవాడు, ఉన్న సత్యమును చెప్పువాడు నా ప్రక్కనున్నవాడు (ఆత్మ) అని చెప్పుచున్నాను. ఆనాడు గీతను చెప్పినవాడు ఆత్మే కావున గీతలోని సత్యమేమో ఆయనకే తెలుసు. కావున ఆయనే హిందువులలో ఎంత జ్ఞానమున్నది చెప్పాడు.

ఇంకా మేము చెప్పునదేమనగా, 93 శాతము దైవజ్ఞానమున్న భగవద్గీతను 3 శాతము అర్థము చేసుకొన్న మనుషులు దానిని ఎంతవరకు గౌరవిస్తున్నారు అని చూచుకొందాము. ఇతర మతములతో పోల్చి చూస్తే ఇస్లామ్‌మతములో ఖురాన్‌ ఎంతో గౌరవించబడుతూ ఉన్నది. దేవునితో సమాన విలువనిస్తూ దానిని ఎంతో పవిత్రముగ చూచుకొంటుంటారు. దానిని క్రింద పెట్టుటకు కూడ వారి మనస్సు ఒప్పదు. దానికి ఉన్నత స్థానమును కల్పించియుందురు. ఇస్లామ్‌మతములో ఐదు సంవత్సరముల వయస్సున్న పిల్లవానికి కూడ ఖురాన్‌ అంటే ఏమిటో తెలుసు. ముస్లీమ్‌లు ఐదు సంవత్సరముల పిల్లవాడిని కూడ దైవప్రార్థన కొరకు మసీద్‌కు తీసుకపోయి ఖురాన్‌ను గురించి అవగాహన కొచ్చునట్లు చేయుచుందురు. యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి కాకముందే ఖురాన్‌ను చదవడము నేర్పించి ప్రతిదినము ఖురాన్‌ను చదివేటట్లు అలవాటు చేయుచున్నారు. ముఖ్యముగ చెప్పాలంటే ఇస్లామ్‌ మతములో ఉన్నవారు ఎక్కువ శాతము ఖురాన్‌ను తమ ప్రాణముకంటే ఎక్కువగా చూచుకొంటున్నారు. వారిలో ఎంత పెద్ద ఉద్యోగి అయినా, దేశానికి రాజయినా వారి గ్రంథమును, వారి దేవుని జ్ఞానమును అనుసరించే నడుచుకొనుచుందురు. ఇస్లామ్‌దేశములలో దేవునికి వ్యతిరేఖమైన చట్టముగానీ, రాజ్యాంగముగానీ ఉండదు.

ఇక హిందూదేశములోనున్న హిందువులలో దేవుడూ, దేవుడు చెప్పిన భగవద్గీత యొక్క విలువ ఎట్లున్నదో వివరించుకొందాము. హిందూ దేశములోని హిందువులకు నూటికి ఎనభైమందికి భగవద్గీత అంటే ఏమిటో తెలియదు. భగవద్గీతను గురించి విని కూడ దానిని చూడనివారు 10 శాతము గలరు. భగవద్గీతను చదవకుండ చూచినవారు నూటికి 5 మంది గలరు. గీతను పూర్తి చదివినవారు నూటికి 5 మందే గలరు.

భగవద్గీతను ఏమాత్రము తెలియనివారు నూటికి 80 మంది హిందువులు గలరు.

భగవద్గీతను గురించి వినికూడ దానిని చూడనివారు నూటికి 10 మంది హిందువులు గలరు.

భగవద్గీతను చూచి కూడ దానిని చదవనివారు నూటికి 5 మంది హిందువులు కలరు.

భగవద్గీతను చూచి దానిని శ్రద్ధగ చదివినవారు నూటికి 5 మంది హిందువులు కలరు.

హిందూమతములో తప్ప ఏ మతములోని వారికైన వారి మత గ్రంథమును గురించి పూర్తి తెలిసియుండును. మతగ్రంథమును చూడనివారు ఎవరూ ఉండరు. చదువురాని వారు చదవలేక పోవచ్చును. కానీ పవిత్రముగ చూచుచుందురు. కేవలము ఒక్క హిందూమతములోనే భగవద్గీతను తెలియనివారు, చూడనివారు, చదువువచ్చి చదవనివారు కలరు. కొన్ని పల్లెలలోనికి పోయి చూస్తే ఊరు మొత్తము భగవద్గీత అంటే ఏమిటో తెలియనివారు కూడ కలరు. మండల స్థాయిలో, జిల్లాస్థాయిలో మరియు పట్టణములో మాత్రము గీతను గురించి తెలిసినవారు కొందరు కలరు. ఇపుడు ప్రస్తుతకాలములో యువతీయువకులుగానున్న వారిని చూస్తే కొంతకాలము చదువులు తర్వాత ఉద్యోగములు తప్ప గీతను గురించి ఏమాత్రము తెలియని స్థితిలో ఉన్నారు. యాబైయేళ్ళు వయస్సున్నవారిని కదిలించి భగవద్గీతను గురించి చెప్పితే మాకు ఈ వయస్సులో ఎందుకు? పూర్తి ముసలివాళ్ళమై ఏ పని చేయలేనపుడు తీరిగ్గా చదువుకోవచ్చును, ఇపుడు దానితో ఏమి పనియుంది అంటున్నారు. ఎవరైన చిన్న వయస్సులోని వారు 15 నుండి 20 సంవత్సరముల వయస్సున్నవారు గీతను గురించి, అందులోని జ్ఞానమును గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంటిలోని తల్లిదండ్రులు వ్యతిరేకమైపోయి జ్ఞానము తెలుసుకోవాలనుకుంటే ఇంటిలోనికి రావద్దు. మాతో సంబంధము పెట్టుకోవద్దు అనే వాళ్ళుకూడ కలరు. భార్య దైవజ్ఞానము తెలుసుకొంటే సరిపోని భర్తలున్నారు. అంతేకాదు భర్త జ్ఞానము తెలుసుకొనుటకు ప్రయత్నిస్తే విడాకులిస్తామనే భార్యలున్నారు. కొడుకు భగవద్గీతను దాచిపెట్టుకొని దొంగగా చదువుతూవుంటే చూచిన తండ్రి భగవద్గీతను అగ్గిపుల్లతో అంటించి కాల్చివేశాడు. ఇదీ హిందూ మతములో భగవద్గీతకూ అందులోని జ్ఞానమునకూ ఉన్నవిలువ!

హిందూమతములోని పరిస్థితిని ప్రక్కనుండి గమనిస్తున్న క్రైస్తవులు వారి మతప్రచారమే ముఖ్యమైన ఘట్టముగా పెట్టుకొన్నవారై జ్ఞానము తెలియని హిందువులను మాటలగారడీతో వారి మతములోనికి సులభముగా చేర్చుకొంటున్నారు. హిందూమతములో ఏమాత్రము జ్ఞానము తెలియనివారు, భగవద్గీత పేరు కూడ విననివారు, తాము ఏ మతములో ఉన్నామోనని కూడ తెలియనివారు, క్రైస్తవమతములోనికి సులభముగా చేరిపోయి మేము క్రైస్తవులము అంటున్నారు. అంతవరకు తాము హిందువులమని కూడ వారికి తెలియదు కావున క్రైస్తవులమని చెప్పుకొవడముతో ఏదో డిగ్రీ పొందినంత సంతోషము పొందుచున్నారు. ఈ విధముగా హిందూ మతములోని వారు క్రైస్తవమతములోనికి చేరిపోతూవుంటే, కొందరు హిందూమతాభిమానులు మా మతము పతనమైపోతున్నది, క్రైస్తవమతము అభివృద్ది అగుచున్నదని బాధ పడుచున్నారు. అలా వాపోవువారందరు కొన్ని గుంపులుగా తయారై హిందూమత రక్షణ సమితియనీ, హిందూ మత ఉద్ధరణకమిటియనీ, హిందూపరిషత్‌యనీ అనేకరక సంస్థలుగా ఏర్పడి మతమార్పిడి జరగకుండా చూచుకోవాలనుకొన్నారు. సమస్య జ్ఞానము వలన పరిష్కారమవుతుందని తెలియక పోవడము వలన, ఈ గుంపులలో జ్ఞానము తెలిసినవారు లేకపోవడము వలన క్రైస్తవబోధకులకు వారి మతమును గురించి హిందువులలో ప్రచారము చేయకూడదని చెప్పారు. క్రైస్తవబోధకుల ముఖ్యమైన పని మత ప్రచారమే కావున వారు, వీరి మాటను ఖాతరు చేయకుండ బోధలు చెప్పడము, వీరు వారి విూద భౌతికముగా దాడి చేయడము జరుగుచున్నది. అయినా ప్రయోజనములేదు. వారు ఎలాగో ఒకలాగున బోధలు చెప్పుచూనే ఉన్నారు. ఈ మధ్యన హిందువులలో ఎన్ని పరిషత్‌లు ఏర్పడినా క్రైస్తవులు ప్రత్యేక టీ.వి ఛానళ్ళు పెట్టి వారి బోధలను ప్రచారము చేస్తూనేయున్నారు.

ఇల్లు అంటుకొన్నపుడు దానిని ఆర్పేదానికి నీరును ఉపయోగించాలి. అట్లుకాక నీటివలెనున్న నూనెను నీరేలేనని ఉపయోగిస్తే మంట మరింత మండుతుంది, కానీ నూనె వలన ఆరిపోదు. అదే విధముగా మత మార్పిడి సమస్యను అధిగమించడానికి జ్ఞానాన్ని ఉపయోగిస్తే సమస్య తీరిపోతుంది, కానీ బలమునుపయోగిస్తే సమస్య అణిగిపోదు, మరింత జటిలమౌతుంది. మతమార్పిడి సమస్య పరిష్కారము కావడానికి భౌతిక దాడులు పనికిరావు. అభౌతికమును తెలుపు జ్ఞానము కావాలి. అటువంటి జ్ఞానము హిందువులలో కనిపించడములేదు. దైవజ్ఞానముగానీ, ఆత్మజ్ఞానము గానీ ఆవగింజంత కూడలేని హిందువులగుంపుల వలన హిందూమతమునకే నష్టము ఏర్పడుచున్నది. గ్రుడ్డివాడు దొంగను కొట్టాలని కట్టెను తీసుకొని తన ఇంటిలోని కుండలనే పగులకొట్టుకున్నట్లు, అజ్ఞాన గ్రుడ్డితనముగల హిందూసంస్థలు తమ మతాన్ని ఉద్ధరించేది పోయి, తమ మతాన్ని తామే దిగజారిపోవునట్లు చేయుచున్నవి. ఈ మాటను మేమంటే కొందరికి కోపమొచ్చునేమో కానీ మేము చెప్పబోవు యదార్థ సంఘటనను చదివిన తర్వాత విూలో ఏమనిపిస్తుందో విూరే చూచుకోండి! జరిగిన ఈ సంఘటన వలన హిందూమతమునకు ఇతర మతముల ముందర తల ఎత్తుకోవలసి వస్తుందో, తలదించుకోవలసి వస్తుందో విూరే యోచించుకోండి!

ఇంతవరకు ఇదంతయు వ్రాసిన మేము అందరు అనుకొన్నట్లు హిందూమతమునకు సంబంధించినవారమే. పైకి మేము హిందూమతములో ఉన్నప్పటికి లోపలికి ఇందూపథములో ఉన్నవారమే. మాకు తెలిసినట్లు మాది ఇందూపథమే అయినా మీకు తెలిసినట్లు మాది హిందూమతమేనని చెప్పవచ్చును. ఎవరేమనుకొనినా మాకు మతము ముఖ్యముకాదు పథమే ముఖ్యమైనది. అందువలన ఏ మతములోని జ్ఞానమునైన ఒప్పుకొంటాము, కానీ ఏ మతములోని కొద్ది అజ్ఞానమును కూడ ఒప్పుకోము. దేవుడు సర్వమానవులకు సంబంధించినవాడు. అట్లే దేవుని జ్ఞానము అందరికి సంబంధించినది. అందరికి సంబంధించిన జ్ఞానము ఏ మతములో ఉన్నా అది నీకు నాకు కూడ సంబంధించినదే అగును. అందువలన దైవజ్ఞానమును ఏ మతమునుండైన గ్రహించవచ్చును. అదే విధముగా దైవజ్ఞానమను పేరుతో మాయజ్ఞానము ఏ మతములో ఉన్నా దానిని పూర్తిగా ఖండించ వచ్చును. అజ్ఞానమును ఖండించవలసిన బాధ్యత అందరికి ఉన్నది. ఈ సూత్రము ప్రకారము దైవజ్ఞానము ఇటు హిందూమతములో ఉండినా, అటు క్రైస్తవమతములో ఉండినా నేను దానిని తప్పక ప్రశంసిస్తాను. అట్లే దైవజ్ఞానమునకు వ్యతిరేకమైన మాయజ్ఞానము ఇటు హిందూమతములో ఉండినా, అటు క్రైస్తవమతములో ఉండినా నేను దానిని తప్పక ఖండిస్తాను. ఇది మానైజము.

ఆ నేపధ్యములోనున్న మాకు క్రైస్తవమతములో దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖమైన మాయజ్ఞానము కనిపించినది. అప్పుడు నా బాధ్యత ప్రకారము నేను మాయజ్ఞానమును ఖండించి, దేవుని జ్ఞానమును వివరముగా చెప్పవలసి వచ్చినది. నేను ఒక దినము హైదరాబాద్‌ పట్టణములో ప్రయాణించుచున్నపుడు కారు అద్దమును దించేదానికి ప్రక్కకు చూచాము. అపుడు అక్కడ ఒక కాంపౌండు గోడవిూద పెద్ద పెద్ద అక్షరములతో వ్రాసియున్నది కనిపించినది. అక్కడ ఏమి వ్రాసియున్నదనగా! సృష్ఠికర్త కోడ్‌ 666 అని వ్రాసియున్నది. దానిని చూచిన మేము వెంటనే మా ప్రక్కనున్న వ్యక్తితో "ఎవరో ఇది తప్పుగా వ్రాసియున్నారు. దేవుని కోడ్‌ 963 అని ఉండవలయును. వారు వ్రాసినది మాయ నంబరు. మాయనంబరును దేవుని నంబరుగా వ్రాయడము తప్పు" అన్నాము. మరికొంత దూరము వెళ్ళిన తర్వాత ఒకవాల్‌పోస్టర్‌ కనిపించినది. దానివిూద కూడ సృష్ఠికర్తకోడ్‌ 666 అని వ్రాసియుండి దాని ప్రక్కన యోహన్‌ ప్రకటనల గ్రంథము 13-18 అని బ్రాకెట్‌లో వ్రాయబడియున్నది. అప్పుడు తెలిసినది ఇది బైబిలులోని వాక్యమని! తర్వాత ఇంటికివచ్చి బైబిలు తీసి యోహన్‌ ప్రకటనలను భాగములో 13వ అధ్యాయమున 18వ వాక్యమును చదివాము. అక్కడ కూడ అది దేవుని నంబరుగా లేదు. వెంటనే యోహన్‌ ప్రకటనల భాగములోని 22 అధ్యాయములన్నిటిని చదివాము అపుడది సాతాన్‌ (మాయ) నంబరు అని స్పష్టముగా అర్థమైనది. దానితో వారు గోడలవిూద వ్రాసినది పూర్తి తప్పు అని తెలిసిపోయినది. బైబిలులో ప్రకటనల గ్రంథము 13వ అధ్యాయము 18వ వాక్యము ఇలా కలదు. "బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అదియొక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య ఆరువందల ఆరువది యారు, ఇందులో జ్ఞానము కలదు." ఈ వాక్యము ప్రకారము అది దేవుని సంఖ్యకాదు అని తెలిసిపోతుంది. కానీ మాయ నంబరుగా చెప్పిన ఆరువందల అరువది యారు ఏ విధానముతో ఆ సంఖ్యను చెప్పారనునది అక్కడగానీ, మొత్తము అన్ని అధ్యాయములు చదివినా కాని ఎక్కడా వివరములేదు. అపుడు ఆరువందల అరువదియారును దేవుని సంఖ్యగా ప్రకటించిన వారిని కలిస్తే ఆ సంఖ్య వివరమేమైనా తెలుస్తుందేమోనని అనుకొన్నాము. తర్వాత వారిని కూడ కలిసి మాట్లాడము జరిగినది. వారిని కలిసి మాట్లాడిన వివరమంతా మేము వ్రాసిన "సృష్ఠికర్త కోడ్‌ 963, మాయ కోడ్‌ 666" అను గ్రంథములో పొందుపరిచాము. అక్కడ వారివద్ద సరియైన సమాధానము లేదని తెలిసిపోయినది. వారు 666 ను మాయ (సాతాన్‌) నంబరు అని ఒప్పుకుంటూనే దానిని దేవుని నంబరుగా చెప్పాలని ప్రయత్నించారు.

అపుడు ఆరువందల అరువది యారు మాయ నంబరని, అది దేవుని నంబరుకాదని వివరముగా చెప్పదలచిన మేము ప్రత్యేకమైన గ్రంథము వ్రాయవలసి వచ్చినది. ఆ గ్రంథములో దేవుని కోడ్‌ పలానా అని కూడ వివరించవలసి వచ్చినది. అ సందర్భములో మాయ మతగ్రంథములలో ఎలా చోటు చేసుకొన్నదో వివరించడములో బైబిలులోని ఒక ఘట్టమును తీసుకొని ఇది దేవుడు చెప్పినది కాదని చెప్పవలసివచ్చినది. బైబిలులోని ఆదికాండములోని మొదటి ఆధ్యాయము మొత్తము శాస్త్రబద్దముకాదని, కల్పించి మనుషులు చెప్పినది తప్ప దేవుడు చెప్పినది కాదని చెప్పడమైనది. బైబిలు ఆదికాండములోని సృష్ఠి విధానమును మేము ఖండించడము వలన కొంతమంది క్రైస్తవ సోదరులకు కొంత బాధకల్గినా విజ్ఞానముకల్గిన క్రైస్తవులంతా మా మాటను సమర్థించారు. అక్కడ మా మాటను కాదనుటకు ఏ దారిలేదు, కావున ఆ విషయమును గురించి క్రైస్తవ సోదరులు ఏమి మాట్లాడలేదు. మేము దేవుని జ్ఞానమును సమర్థిస్తూ, మాయ జ్ఞానమును విమర్శిస్తూ, గ్రంథము వ్రాసి దాదాపు పదివేల గ్రంథములను ఉచితముగా పంచాము. ఇది మాయ జ్ఞానము, ఇది దేవుని జ్ఞానము అని తెలియుటకు 20వేల వాల్‌పోస్టర్స్‌ను రాష్ట్రమంతటా అంటించడము జరిగినది. అంతేకాక రాష్ట్రవ్యాప్తముగా గోడలవిూద సృష్ఠికర్తకోడ్‌ 963, మాయకోడ్‌ 666 అని వ్రాయించాము. క్రైస్తవులు వ్రాసిన సృష్ఠికర్తకోడ్‌ 666 ప్రక్కనే సృష్ఠికర్తకోడ్‌ 963 అని హైదరాబాద్‌లో అనేక చోట్ల వ్రాయించాము. అలా వ్రాయుట వలన అందరి దృష్ఠి దానివిూద పడి దాని వివరము తెలుసుకొనే ప్రయత్నము చేస్తారని అనుకొన్నాము. మేము గోడలకు అతికించిన పేపర్లవిూద దీని వివరముగల గ్రంథము పలానా చోట దొరుకునని అడ్రసు వ్రాయడము జరిగినది. సృష్ఠికర్త కోడ్‌ 963 అని వ్రాసిన చోట ఇది భగవద్గీతలోని జ్ఞానమని తెలియునట్లు భగవద్గీత అ.15, శ్లోకము 16,17 అని మాయకోడ్‌ 666 వ్రాసిన చోట క్రిందనే భగవద్గీత అ.16, శ్లోకము14 అని కూడ వ్రాశాము. దానిని చూచిన వారికి ఇది భగవద్గీతలోని విషయమని సులభముగా అర్థముకాగలదు.

భగవద్గీతలో ఇంతగొప్ప రహస్యమున్నదని బయటికి ఏ హిందువు గానీ, ఏ హిందూసంస్థగానీ ప్రచారము చేయకున్నను మేము మొట్టమొదటి సారిగా రాష్ట్రవ్యాప్తముగా భగవద్గీత పేరును ప్రచారము చేశాము. అలా చేయుటకు మాకు దాదాపు ఐదులక్షల రూపాయలు అయిపోయినవి. దానికి హిందువులు ఎంతో సంతోషపడాలి. ఒకవేళ బాధకలిగితే క్రైస్తవులకు కలగాలి. అయినా ఇక్కడ మేమనుకున్నాదానికి తలక్రిందులుగా జరిగినది. ఒక విధముగా క్రైస్తవులే సంతోషించారు. ఈయనెవరో ధైర్యముగా సత్యమునే చెప్పాడని ఒప్పుకొన్నారు. బైబిలు ప్రకారము కూడ 666 మాయ నంబరేనని ఈ విషయము భగవద్గీతలో ముందేయుండడము సత్యమునకు బలము చేకూరినట్లేని అనుకొన్నారు. కానీ హిందువులు మేము చేసినపనిని చూచి చాలా బాధపడిపోయారు. గోడలవిూద వ్రాతలలో భగవద్గీత అని ఉన్నా, అధ్యాయముల సంఖ్య మరియు శ్లోకముల సంఖ్యయున్నా, అది గొప్పగా కనిపించక నీచముగా కనిపించింది. కర్నూలు జిల్లా మహానంది దగ్గర అతికించిన పోస్టర్స్‌ను గురించి అసభ్యకరమైన పోస్టర్లు అని సంబోధిస్తూ వార్తపత్రికలలో న్యూస్‌ వ్రాయడము జరిగినది. ఆ పని చేసినది ఎవరోకాదు హిందూమతమును రక్షిస్తామని పరిషత్‌లుగా, సంఘములుగా ఏర్పడినవారే అలా చేశారు. అదే పరిషత్‌ వ్యక్తులు కొందరు మేము ఇచ్చిన అడ్రసును పట్టుకొని మా విూద పోలిస్‌స్టేషన్‌లో కేసు కూడ పెట్టడము జరిగినది. హంపిదగ్గరున్న అనేక దేవాలయములలో ఏదో ఒక ఆలయము యొక్క ప్రహరి (కాంపౌండు) గోడవిూద వ్రాశారని వారి ఆరోపణ. ఇది ఏమి పెద్దతప్పుకాదని పోలీసులు చెప్పినప్పటికి, పోలీసులే ఆ వ్రాతను తుడిచివేసినప్పటికి వారి మాటను కూడ వినకుండ పట్టుపట్టి కేసు పెట్టించారు. ఆ విషయమును పోలీసులు మాకు తెలిపితే, మా వారు ఇద్దరు వ్యక్తులు బాగా జ్ఞానము తెలిసినవారు పోయి కోర్టుకు హజరై, వారు అడిగితే వివరము చెప్పాలను కున్నారు. కానీ అక్కడి న్యాయాధిపతి వివరము ఏమి అడగకుండానే ఇరవైరోజులు జైలుశిక్ష చెప్పాడు. దేవుని విషయములో ప్రాణమునైనా సులభముగా ఇవ్వడానికి సంసిద్ధముగా ఉన్న మావారు దేవుని విషయములో ఇది మాయ కలుగజేయు ఆటంకమని, మాకు ఏ బాధలేదని సంతోషముగా జైలుకు పోయారు. మేము వ్రాసిన వ్రాతకు భగవద్గీత అని పేరు పెట్టడము వలన క్రైస్తవులకు బాధకల్గి అసూయతో మావిూద కేసులు పెట్టారంటే వారు మతద్వేషముతో పెట్టారులే అని మనమనుకోవచ్చును. అలా కాకుండా భగవద్గీత అని పేరున్న వ్రాతను చూచి హిందువులే హిందువుల విూద కేసు పెట్టడము పెద్దవింతే అవుతుంది. అదియూ హిందూమతమును ఉద్దరించాలనుకొన్నవారే ఆ విధముగా చేయడము మరీ పెద్దవింతే అవుతుంది. ఇదంతయు చూచిన మేము ఈ వింతను గురించి మరియొక ప్రత్యేకమైన గ్రంథమును వ్రాయాలనుకొన్నాము. ఆ గ్రంథమే ఇపుడు విూరు చదువుచున్న ఈ గ్రంథము. క్రైస్తవులలోని అజ్ఞానమును ఖండించుటకు మేము కొన్ని లక్షలరూపాయలు ఖర్చుపెట్టి రాష్ట్రమంతా వ్రాయించడము, పేపర్లు అతికించడము చేసి "సృష్టికర్త కోడ్‌ 963" అను గ్రంథమునే విడుదల చేశాము. మేము చేసిన పనికి హిందువులు అజ్ఞానముగా ప్రవర్తించడమును చూచి వారిలోని అజ్ఞానము పోవుటకు, వారికి జ్ఞానము కల్గుటకు విూరు చదువుచున్న "మతము-పథము" అను గ్రంథమును వ్రాయవలసి వచ్చినది.

ఈ గ్రంథము ద్వారా హిందువులను మేము ప్రశ్నించునదేమంటే! భగవద్గీత అని పేరుపెట్టి వ్రాసిన వ్రాతలు అసభ్యకరముగా ఎలా కనిపించాయి? ఒకవేళ విూకు వాటిలో ఏదైనా లోపము కనిపించియుంటే అక్కడే మేమిచ్చిన అడ్రసులో మాతో సంప్రదించి తెలుసుకోవచ్చు కదా! అట్లుకాకుండ వార్తాపత్రికలలో దానిని వార్తగా అసభ్యమను పదమును ఉపయోగించి వ్రాయడము వలన భగవద్గీతను విూరు గౌరవించినట్లగునా? ఇది ప్రత్యేకించి మహానంది దగ్గరున్న వారినడిగే ప్రశ్నలనుకోండి. ఇక పోలీసుస్టేషన్‌లో కేసుపెట్టి శిక్షవేయించిన హంపి వారినడిగేదేమంటే. దేవాలయ కాంపౌండు గోడకు వ్రాయడము చట్టరీత్యా నేరమను ఉద్దేశ్యముతో విూరు కేసు పెట్టారు. ఇపుడు మేము చేసినది తప్పెలా అవుతుందని ప్రశ్నించవలసివచ్చినది. మేము దేవుని గుడి కాంపౌండు గోడవిూద సిగరెట్ల ప్రచారము వ్రాసియుంటేనో లేక వ్యాపారప్రకటనలు వ్రాసియుంటేనో తప్పగును. కానీ దేవుని గుడివిూద భగవద్గీత వాక్యము వ్రాయడము తప్పా అని ప్రశ్నిస్తున్నాను. అది కూడ అక్కడున్న నియమములు తెలియక వ్రాయడము జరిగినదేకాని తెలిసి బలవంతముగా వ్రాయలేదు. అక్కడ చేసినది సమాజమునకు మంచిని చేకూర్చునదా, చెడును చేకూర్చునదా అని యోచించకనే దానిని తప్పుగా ఎలా భావించారు? ఒకవేళ చట్టరీత్యా ఇది తప్పేనని న్యాయస్థానము నిర్ణయిస్తే, దానికి వందో రెండువందలో జరిమానా విధించవచ్చును కానీ అదేదో పెద్దనేరమైనట్లు నాలుగువేల రూపాయలను జరిమానా విధించడము, డబ్బును కట్టలేకపోతే 20 రోజులు జైలుశిక్ష వేయడము సబబేనా అని ప్రశ్నించు చున్నాము. అదే నేరమైతే అది అంత పెద్ద శిక్షార్హమైతే క్రైస్తవుల చర్చీల ప్రహారీ గోడల చుట్టూ ప్రభువే నిజమైన దేవుడని, ప్రభువు పాపులను రక్షించునని అనేకమైన బైబిలు వాక్యములు వ్రాసియుంటారే అది కూడ చట్టము ప్రకారము తప్పేకదా! ఒకవేళ క్రైస్తవుడే న్యాయాధిపతిగాయుండి దానిని తప్పని వ్రాసిన క్రైస్తవులకు జైలుశిక్ష విధిస్తే క్రైస్తవులు ఆ న్యాయాధిపతిని వారి మతమునుండే వెలివేస్తారు. గతకాలములో బర్నాలా అను సిక్కు ముఖ్యమంత్రిగాయున్నపుడు చట్టమని సిక్కులకు వ్యతిరేఖమైన పని చేస్తే సిక్కు గురువులు ముఖ్యమంత్రిగా యున్న బర్నాలాకు శిక్షవేసి వారి స్వర్ణదేవాలయము ముందర వచ్చిపోయే భక్తుల యొక్క చెప్పులకున్న దుమ్ముతుడిచేటట్లు చేశారు. ఇతర మతములలో పెద్ద జ్ఞానములేకున్నా వారు ఎంతో క్రమశిక్షణతో దేవుని ఎడల ప్రవర్తిస్తుంటే హిందువులెందుకు ఇలా దిగజారిపోతున్నారు? ఎలక్షన్‌ సమయములో కనపడిన గోడల విూదంతటా వ్రాసే నాయకుల విూద కేసులు పెట్టలేని విూరు భగవద్గీత వాక్యమును తప్పుగా భావించి కేసులు పెట్టడము, ఆ వ్రాతను అసభ్యకరమైనవని న్యూస్‌పేపర్లకు ఎక్కించడము మంచిదేనా? హిందూమతమును రక్షించే మీరే యోచించుకోండి.

మేము చేసిన ప్రచారము హిందువులు చెడుగా గుర్తించారని, శిక్షలు వేయించారని తెలుసుకొన్న ఇతర మతములలో ఒక మతమువారు మావద్దకు వచ్చి "విూ మతములో జ్ఞానములేదని ఇప్పటికైనా ఒప్పుకుంటారా" అని మమ్ములను అడుగుచున్నారు. ఎంతో జ్ఞానమున్న విూరు మా మతములోనికి రండి మిమ్ములను మేము ఎంతో గౌరవిస్తాము. విూ మాటవినేవారు విూ సంఘములోని వారు దాదాపు పదివేలమందియున్నారు కదా! విూరందరు మా మతములోనికి వస్తే మిమ్ములను చాలాగొప్పగ పెట్టుకొంటాము. విూ మతములోలేని గౌరవము గుర్తింపు మేము మా మతములో ఇస్తామంటున్నారు. మరియొక మతము వారు వచ్చి మా మతములో దేవునికిగానీ దేవుడు చెప్పిన మాటలనుగానీ ఎవరైనా అగౌరవముగా మాట్లాడితే వాడు ప్రధానమంత్రి అయిన వదలక చంపి తీరుతామనీ, దేవునికి వ్యతిరేఖమైన చిన్న సమస్యకు కూడ మా మతములోని వారంత ఏకతాటి విూదకు వస్తారనీ, దేవుని విూద ఎక్కువ విశ్వాసమున్న మా మతములో మీరు చేరండని పిలుస్తున్నారు.

వారు మా విూద అభిమానముతో అలా పిలువడము సంతోషమే. కానీ మాకు మతము ముఖ్యముకాదు. పథము ముఖ్యము కావున ఎవరి మాటను నేను వినదలచుకోలేదు. మతము మధ్యలో వచ్చినదని దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకవేళ హిందువులు మాపట్ల వ్యవహరించిన తీరుకు, మేము ఇతర మతములో చేరుటకు అంగీకరించియుంటే నాతోపాటు పదివేలమంది నన్ను అనుసరించి ఇతర మతములోనికి వచ్చేవారుకదా! అపుడు హిందూమతము హిందూరక్షణ సంస్థలచేత రక్షించబడినదా? భక్షించబడినదా? చదువుచున్న మీరే యోచించి చెప్పండి. హిందువులు మా మతము క్షీణించిపోతున్నది, దానిని రక్షించుకోవాలని గుంపులుగా సంస్థలుగా ఏర్పడడము మంచిదేకానీ వారిలో దైవజ్ఞానము లేకపోవడము వలన దేనినైతే రక్షించాలనుకొన్నారో దానినే భక్షించినట్లయినది. దేవుని గుడి విూద దేవుని వాక్యముండడము మంచిదేనని హిందూపరిషత్‌ వారు అనుకోకుండ పోవడము మతభక్షణ కాక, మత రక్షణ ఎలా అవుతుంది? ముద్దాయిలు దొరకలేదని ఎన్నో కేసులను పెండింగులో పెట్టు పోలీసులు మావారిని కోర్టుకు తీసుకపోవడము వలన ఇది మా మతమని మేము చెప్పుకోవడానికి కూడ మాకు సిగ్గుగాయున్నది. ఒక కేసును ఎంతో విచారణ జరిపి తొమ్మిదిమంది సాక్షులు సాక్షము చెప్పినప్పటికీ పదవసాక్షి కొంత సరిగా చెప్పలేదను చిన్నసాకుతో, కేసును కొట్టివేయు న్యాయాధిపతులు విచారణ జరుపకుండ, ముద్దాయిలుగా నిలబెట్టిన వారి సమాధానమేమో చూడకుండ, పెద్దకేసుకు శిక్ష చెప్పినట్లు చెప్పడము ఇతర మతముల ముందర హిందూమతము తలదించుకొనే పనికాదా! దీనినంతటిని చూస్తే హిందూమతము క్షీణించిపోక అభివృద్ధి ఎలా అవుతుంది?

ఏ మతములోనైన దేవునిజ్ఞానము, దేవుని విూద విశ్వాసము లేకపోతే అది క్షీణించక అభివృద్ధి కాదు. నేడు దేవుని జ్ఞానముగానీ, దేవుని విూద విశ్వాసముగానీ హిందూమతములో లేకుండ పోయినది. అందువలన హిందూమతము క్షీణదశలో ఉండి క్రైస్తవ, ఇస్లామ్‌ మతములు అభివృద్ధి చెందుచున్నవి. హిందూమతము అభివృద్ధి చెందాలంటే మా సలహా ఏమనగా! మతము అను పదము పథము అను పదముగా మార్చుకోవాలి. అట్లే హిందూ అను పదమును ఇందూ అను పదముగా మార్చుకోవాలి. దేవునికి దగ్గరగా పోవాలంటే ఏ మతమైనా మతము అను మాటను వదిలి పథము అను మాటగా మార్చుకోవాలి. అపుడు మాయలేని స్వచ్ఛమైన జ్ఞానము అందరిలోను నిలువగలదు. మేము చెప్పునది దేవుని జ్ఞానమార్గము కావున అసూయలేకుండ స్వాములు సహితము ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటారని తలచుచున్నాము. మేము మతములో లేము పథములో ఉన్నామని అందరు పథమును అనుసరించాలి.