మణి మాలికలు/లక్ష్మి యలమంచిలి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Manimalikalu.pdf

లక్ష్మి యలమంచిలి
నిజాంపేట్, కూకట్‍పల్లి,
హైదారాబాదు-500090.
వృత్తి: గృహిణి
ఈ-మెయిల్‌: yalamanchili.lakshmi69@gmail.com
మొబైల్‌: 9553309911

స్మృతి'లయ'లు...
1. మది మౌనరాగాలు ఆలపిస్తోంది
   మనోప్రాంగణంలో నీఅలికిడి పసికట్టిందేమో

2. మది అగ్నిగుండమే
   నీ తలపు చితుకులతో దహించుకుపోతూ

3. కరగమంటే కుదరదంటోంది కన్నీటిచుక్క
   మదిభారాన్ని మరింత పెంచుతూ

4. నీ అలక్ష్యం ఖరీదు
   బ్రద్దలైన నా హృదయభాండమే

5. అరిషడ్వర్గాలను జయించుట అత్యాశే
   బాహ్యాన్నే జయించలేని అసహాయను

6. నలుగుతూనే ఉన్నా
   బిగుస్తున్న బంధాలను ఉంచనూలేక తెంచనూలేక

7. నాలోని నిన్ను వేరుచేయమన్నా
   వల్లకాదంటూ చేతులెత్తేసింది రాయంచ

8. అడుగడుగునా ఆవేదనలే
   అంతరాత్మ గొంతు నులమలేని అశక్తితో

9. నిజాలు నిండుగా నవ్వుతున్నాయి
   మాయాలోకపు మర్మాన్ని భేదిస్తూ

10. ఆనందమేగా ఆహ్వానమొస్తే
   అవనమ్మ ఒడిలో అనంత సౌఖ్యాలకై

11. భావాల్ని కుమ్మరిద్దామంటే
   అక్షరాలు అందనంటూ ఒకటే అల్లరి

12. అడుగడుగునా రాజీలే
    అతివ నుదుట వ్రాసిన అజుని అలక్ష్యపు అక్షరాలతో

13. ఆక్షేపణలే జీవితమంతా
    ఆనందాల్ని ఆవిరిచేస్తూ

14. అమాసపున్నములు నామోములోనే
    నీ ఆగ్రహానుగ్రహాలలో

15. వెల కట్టలేని పెన్నిధి కొందరికే
    విలువే లేని ఆడది ఎందరికో

16. అమృతమూ చేదే
    నిను కోల్పోయిన నా జీవితాన

17. వలపులు పండించమంటే
    తలపుల్లో తచ్చాడుతానంటావే

18. శిశిరాన్ని దరి చేరనీయదు
నీ చెలిమి వసంతం

19.

కలను సాకారం చేసుకోగల శక్తే ఉంటే
క్షణాల్లో నీ రూపానికి ఊపిరి పోయనూ

20.

అమ్మకానికి అంగట్లో అందం
అమ్మ కూడ అతివేనని లోకులు మరచిన వైనం

21.

జీవం లేని నా మనికి(మనుగడ)
నీ ఉనికిని శాశ్వతంగా కోల్పోయి

22.

దేవుడు కరుణించి వరమందిస్తే
నిన్నటినీ క్షణాల వద్దే కాలాన్ని స్తంభింపచేయనూ

23.

జీవన వైకుంఠపాళి
అనురాగాల నిచ్చెనలు, తిరస్కరణ సర్పాలతో

24.

కాలానికి ఎప్పుడూ ఓటమే
నిన్ను చేరే పందెంలో నా మనసును గెలవలేక

25.

తప్పని తాపత్రయాలు
జీవితం మూన్నాళ్ళ ముచ్చటని తెలిసినా

26.కన్నీరెంత వెచ్చ నో
    నీ వియోగజ్వాలల్లో నుంచి పుట్టుకొస్తున్నందుకేమో

27.కలయికలోని మధురగేయాలే
    మన వియోగంలో మానని గాయాలు

28.ఎందుకు కలిపాడో? ఆ బ్రహ్మ
    నిత్యం తగవుల తెరలే మనమధ్య

29.తెల్లారనంటూ మారాం చేస్తోంది రేయి
    కలగా అయినా నువ్వు కనికరించకుంటే

30.నీ జతలో స్వర్గానికి నిచ్చెనలే ఆనాడు
    నీ నిష్క్రమణతో అంతులేని అగాధాలే ఈనాడు

31.జీవిత నౌక సాగుతూనే ఉంది
    మనుషులు మమతలు శాశ్వతమని భ్రమిస్తూ

32.నీతలపుల పతంగం
    నా మనోవీధిలో యధేచ్చగా విహరిస్తూ

33.మౌనం తప్ప గత్యంతరం లేకుంది
    కలలు కల్లలై ఎదను తడుపుతుంటే

34.అందనంత దూరంలో నీవున్నా
    నేనెప్పుడు నీవెంటే నాఊహలరెక్కలతో

35. నిన్నే స్వప్నిస్తూ బాహ్యాన్ని పూర్తిగా మరిచా
    వాస్తవం వణికిస్తూ కలల్లోనే కాలాన్ని కరిగించమంటుంటే

36. రాతిని నాతిగ మార్చిన కధ ఆనాడు
    నాతిని రాతిగ మార్చే వ్యధలెన్నో ఈనాడు

37.సంగీతానికి శిలలు కరుగుతాయి అంటారు
    వేవేలరాగాలు ఆలపించినా నీహృదయం కరగదే

38.మన బ్రతుకుపుస్తకంలో ప్రతిఅక్షరం మధురం
    మన అనురాగం అన్యస్వరంలేని సుస్వరం

39.నాప్రాప్తమో ప్రారబ్ధమో
    వలదన్నా నీతలపులు నన్నొదలక చుట్టేస్తూ

40.తీరం చేరని నాకలల అలలు
    గుండెనిండ నింపుకున్న వ్యధల బరువుతో

41.హృదయం లేని శిలనైనాను
    నీతోపాటు నామనసుని సమాధిచేసి

42.మువ్వలు పదాలు పాడుతున్నాయి
    నీపాదాన్ని తాకిన పరవశంతో

43.నా నుదిని తాకిపోయే పిల్లతెమ్మెరల అల్లరులు
    గాలితో నువ్వు పంపే గుసగుసల రాయబారాలు

44.నిరంతరం గమనంలోనే
    నీకై అన్వేషిస్తూ నాప్రతి అడుగు

45.మండుతున్న వెన్నెల
    మరుగుతున్న నా మనసును తలపిస్తూ

46.సాగరం లోతుల్లో ముత్యాల నిధులు
    నాగుండె లోతుల్లో నీజ్ఞాపకాల నిధులు

47.విశ్వవిజేతనైనట్టే
    నీమదిలో నాస్థానం సుస్థిరమైతే

48.అసంకల్పితచర్యలా
    కన్నుమూస్తే చాలు కలల్లో చొరబడతావ్‌

49.నడిరేయైనా కునుకేరాదు
    సుతిమెత్తని నీహృది తలగడ లేనిదే

50.మంచుబొమ్మనే
    క్షణక్షణం కన్నీళ్ళలో ఘనీభవిస్తూ

51.మనసు ముంగిట నీజ్ఞాపకం
    కడలిపై తేలియాడే కార్తీకదీపంలా

52.మదిలో మెదిలే నీ జ్ఞాపకం
    ఒక్కోసారి బాధిస్తూ అంతలోనే ఊరడిస్తూ

53.అందరు హరిశ్చంద్రులే
    సందర్భం వస్తేనే నిజాయితీ నిగ్గుతేలేది

54.తారల్లో చేరిపోయావ్‌
    ఇక్కడ నాఉనికిని ప్రశ్నార్ధకం చేస్తూ

55.నీవు లేక మోడైన నా మది
    కొత్త చిగుర్లు వేస్తోంది నీ ఆగమనంతో

56. కన్నీటిసేద్యం చేస్తున్నా
    నీ జ్ఞాపకాల పంట పండించాలని

57. కన్నీటిచుక్కవై జారుతూ
    ప్రతిక్షణం నన్ను ముద్దాడుతూనే ఉన్నావు

58. నీస్మృతుల చమురు నింపుతున్నా
    నా ప్రాణదీపం కొడిగట్టకుండా

59. నిన్న జననం రేపు మరణం
    నడుమ ఎన్ని ఆరాలు? ఎన్నిపోరాటాలు?

60. నిలువెల్లా నేను తడుస్తున్నా
    వర్షించేది కన్నో..మిన్నో..?

61. నిశీధి నీడలలో ఒంటిగా
    గగనాన్ని వీడివస్తావని ఆశగాచూస్తూ

62. నిను కోల్పోయాననుకున్నా
    నా ప్రతికదలికలోను నువ్వున్నావని తెలుసుకోలేక

63. హాయిగా నిదురిస్తా
    రెప్పలమాటున ఊహవై నువ్వొదిగి ఉంటే

64. నీ జ్ఞాపకాలే మరువలేకున్నా
    పంచిన నిన్ను మరిచేదెలా

65. నువ్వొచ్చివెళ్లావుగా
    మదిలో ప్రకృతిలో పులకరింతల్లా

66. గుండెనిండ గుప్తనిధులే
    ఎంత తవ్వినా తరగని మధురజ్ఞాపకాలు

67. మౌనరాగాల వీణియనే
    నీవు మదితంత్రులు మీటే వేళ

68. నా జీవితం ఒక మధురకావ్యం
    ప్రతిపేజీ నీ ప్రేమాక్షరాలతో నిండి

69. అందకుండా ఊరిస్తూ చందురుడు
    అందుకోవాలనే ఆరాటంలో సముద్రుడు

70. జీవితం రంగులమయం నీ జతలో
    మిగిలింది నలుపే నీ వియోగంలో

71. క్షణాలకెప్పుడూ తొందరే
    మది వేదన పట్టనట్టే కరిగిపోతుంటాయి

72. అంతం లేని ఎదురీత
    పోటెత్తుతున్న నీతలపుల వరదలో

73. అర్ధంలేని నీ అహంకారం
    ఆవేదనతో నామతి గతితప్పుతూ

74. మాయదారి కాలం
    ఆనందంలో పరిగెడుతూ వేదనలో నత్త నడకలు నడుస్తూ

75. బ్రతుకు పూదోటకు మాలివని ఆశపడ్డా
    కలుపుమొక్కై కన్నీళ్ళ గాయాల్ని మిగిల్చావు

76. అంతరాల ఆభిజాత్యం
    మానవత్వానికి సమాధికడుతూ

77. వ్యర్థమే అపూర్వ మేధస్సు
    మనిషిలోని స్వార్ధాన్ని చంపకుంటే

78. అహాన్ని చంపకుంటే
    అనుబంధాలకు తిలోదకాలే

79. మదిలో తీయని అలజడి
    నీజ్ఞాపకం మెత్తగా తాకినందుకేమో

80. బంధమై అల్లుకోమంటే బ్రతుకే భారం చేసావు
    మోదమై మురిపించమంటే ఖేదమే కానుక ఇచ్చావు

81. మనస్తాపాలే నీజతలో
    మాటలముళ్ళు గుచ్చుతూ ఆనందాల్ని ఆవిరిచేస్తూ

82. అతిశయమే నా మదికి
    తనలో నిన్ను నింపేసుకుందిగా

83. పేరుకి పెద్ద మనుషులే
    మనసులు మాత్రం మరుగుజ్జులు

84. ప్రేమకు తావేది?
    పైకం పెత్తనంచెలాయిస్తుంటే

85.అనురాగాల కొమ్మ, ఆకలి తీర్చే అన్నపూర్ణ
    ఆగ్రహించిందా అంతు చూసే అపర కాళిక

86. నిర్మల అంతరంగం నీ అందం
    అంతెరగని మమకారం నీ చందం

87. భామలందరూ బంగారాలే
    భార్య తప్ప... కొందరు ఘనులకి

88. మదిలో పదిలమే
    చెరగని చెదరని నీఊసుల మధురిమ

89. అరణ్య రోదనలే ఈ జనారణ్యంలో
    అబలల ఆక్రందనలు, అన్నార్తుల ఆకలికేకలు

90. మదనుడు వదిలిన విరిశరానివే
    మౌనపు పరదాలు తొలగిస్తూ మదిలో మోహాలు రేపుతూ

91. నీకై అలుపెరుగని అన్వేషణ
    దిగంతాల అంచులదాకా పయనిస్తూ

92. చుక్కలతో చంద్రయ్య దోబూచులాట
    వెండి మబ్బుల చాటుగా వెన్నెల విహారం చేస్తూ

93. నీరాక నామదికి ఆనందాలమహోత్సవం
    కనులకు సహస్రచంద్ర దర్శనం

94. జీవచ్ఛవాన్నే
    నీప్రేమ సంజీవనితో ఊపిరి పోయరాదా

95. విధి చేసిన ఆకస్మికదాడి
    ఫలితం నీ తస్కరణ

96. ఎప్పుడు కలల విందులేనా
    ఎదుటికొచ్చి కనులవిందు చేసేదెప్పుడో?

97. రాయివనుకున్నా
    చేజారాకే తెలుసుకున్నా వజ్రానివని

98. ఎదలో నీ తలపుల రొద
    ఝుమ్మని మూగే తుమ్మెద ఝుంకారాల్లా

99. అలిగావంటే
    ఎదలో అణువిస్ఫోటనాలే

100. మది కల్లోల సాగరమే
    నిమిషం నీవు కానరాకున్నా

101. సుడిగుండాల సంద్రంలో నేను
    చుక్కానిలేని నావలా దిక్కుతోచక

102. నీ తలపులు తెచ్చెను తంటా
    నా ఎదలో చేలరేగెను సన్ననిమంట

103. నిన్ను చూసే మధుర క్షణాన
    కన్నుల్లో గంగపొంగుతో అస్పష్టంగా నీరూపం

104. మైనంతో చేసాడఏం? ఆబ్రహ్మ
    నాచూపులవేడి సోకితేనే కరిగిపోతున్నావు

105. ఘనంగా పేరెంట్స్ డే
    వృద్ధాశ్రమంలో అమ్మకు నాన్నకు నమస్కరిస్తూ

106. మది సంబరాల అంబరమే
    నీవలపు తలపుల ముచ్చట్లలో

107. కన్నీరై కరిగిపోతా
    నులి వెచ్చని ఓదార్పు నీవైతే

108. మనసుకు వేరే పని లేదు
    ఎప్పుడు నీ జ్ఞాపకాల వీక్షణలోనే

109. నీ కనుపాపల్లో చోిటిస్తావా?
    మధురస్వప్నమై ఒదిగి ఉంటా

110. నువ్వొచ్చివెళ్లావుగా
    మదిలో ప్రకృతిలో పులకరింతల్లా

111. మనసింకా కాలుతూనే ఉంది
    నీ జ్ఞాపకాల చితిలో

112. నాలోనీవు నాతోనీవు
    శోధిస్తున్నా నేనేమయ్యానని

113. వెచ్చగా తాకే వేకువ నీవు
    వేకువ వాకిట ముగ్గును నేను

114. నిర్దయడనే
    నా కలల్ని సైతం కబళిస్తూ

115. నాలో నన్నే మాయం చేసావే
    నిలువు దోపిడీ అంటే ఇదేనేమో