మణి మాలికలు/జానకి పాదుక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Manimalikalu.pdf

జానకి పాదుక
ఆర్‌ కె పాలెం, సూళ్ళూరుపేట,
నెల్లూరు జిల్లా - 524121
వృత్తి: గృహిణి
మొబైల్‌ నెం. 9490414291

పారిజాత పరిమళాలు...
1. తడి ఆరని నా కన్నులు
   తరిగిన నీ ప్రేమకు తార్కాణాలు

2. నటనెంత చేసినా బయటపడుతూ కొంత
   నర నారీమణుల నగ్న తత్నాలు

3. కన్నుల మాటునే కాపు కాసా
   కౌగిళ్ళకు నెలవు కలలే అన్నావని

4. బ్రతుకు వర్ణచిత్రం వెలిసిపోయింది
   రంగులద్ద రారాదూ రమణీయంగా

5. హాస్యాస్పదమే
   ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఆత్మతృప్తిని కొనగలమనుకోవడం!

6. ఆన్నివేళలా అభిలషణీయం
    అపరాధభావం అణువంతైనా లేని కర్మలే

7. అన్వేషిస్తున్నా అనుక్షణం
    నిన్ను తలవని క్షణం యేమూలైనా దాగుందేమో అని

8. కనులకూ కోరికే
    కన్నీరుగానైనా నిన్ను తనలో నింపుకోవాలని

9. బదులే లేని ప్రశ్నవు నీవు
    విజయమందుకుని తీరాలనుకునే విద్యార్ధిని నేను

10. అంటే అన్నానంటావ్‌ గానీ
    నీజ్ఞాపకాలకూ నీల్గుడెక్కువే అచ్చంనీలా

11. కన్నీరే తోడిక
    కలవని హృదయాలకు

12. దైవానికి నాపట్ల దాతృత్వము ఎక్కువ
    వద్దన్నకొద్దీ ఇస్తూనే ఉన్నాడు రోజులెన్నింటినో

13. వెర్రిగా వెతుకుతున్నా
    వరముగ నిన్నిచ్చే వేలుపు కోసం

14. సంస్కృతి సంప్రదాయాలు
    భవిష్యత్తవ్వకాల్లో శిధిలాలుగా

15. గతమైనక్షణాలు కొన్ని
    వర్తమానాన్ని వేధిస్తూ..భవిష్యత్తును భయపెడుతూ

16. మధురక్షణాలను నిలవేసే మంత్రమొకటి చెపుతా
    చిట్టిగుండెను వలపు ముడుపుగా చెల్లిస్తే

17. దొర్లిపోతున్నాయి దొంతరలుగా
    క్షణాలన్నీ వీక్షణాలలోనే

18. జీవితమొక బహుమతే
    ఈక్షణం యొక్క అనివార్యతను గుర్తిస్తే

19. బంగారంటూ ఆనాడు
    భారమంటూ ఈనాడు

20. సూరీడుకే వందనాలు అన్నీ
    చందమామతో మాత్రం తందానాలే

21. కాలానికెంత పక్షపాతమో
    నువ్వుంటే ఉరుకులూ పరుగులూ లేకుంటే కదలక మొరాయింపులు

22. వలపువడ్డు చెల్లిస్తా
    అసలుమనసు అప్పిస్తే

23. ముద్దుల ముడుపులు ముట్టాకనే
    కౌగిళ్ళ ఖైదు ఖరారు

24. కోరి వలచిననాడు..అనుకోలేదు
    కొరివితో తల గోక్కుంటానని

25. నీపిలుపే చాలు
    పరవశించి పరువాలు పదిలంగా అప్పచెప్పటానికి

26. తెల్లారింది...తేడా యేంలేదు
    నిన్నటి రోజున నీతో... నేడు నీ తలపులతో

27. బాహ్యనికే అలవాటు పడ్డ కన్ను
    దుర్లభమే దర్శించుట అంతరంగపు తీరుతెన్ను

28. శరీరమంతా హృదయమే
    ఆర్తిగా నువ్వు హత్తుకున్న సమయాన

29. తెల్లారింది షరామామూలే
    నా సణుగుడులు నీ ముక్తాయింపులు

30. ఆశ
    సరసన నువు చేరినపుడు సమయము స్తంభించాలని

31. ఆంక్షల ఆధీనంలో
    అంతరంగం అతలాకుతలం

32. నలుగుతుంటాము నాటకీయంగా
    నకిలీప్రేమలకు నాకు ఎక్కువ మరి

33. ఊ...అంటేనే ఎగిసిన మది సంద్రం
    ఉహూ˙..అంటే పాతాళానికి ఇంకును..ఇదిసత్యం

34. నీవు పలికిన చందానికే
    నా పేరుకింతటి అందం

35. వచ్చివెళ్ళిందే తెలియలేదు
    యవ్వనానికి బహుశా ఆయువు బహుతక్కువ

36. ఐనవారే అందరూ
    అవసరానికే అందరు

37. నిత్యయవ్వనమే ఇక
    నీ మమతల మధువును త్రాగేనుగా

38. జీవనదే...నాహృదయం
    నీకై ప్రేమ సుగంధాలను ప్రవహింపచేస్తూ

39. ఎంత చదివినా కొంత మిగులే
    నీ సొగసుపుస్తక మధుర సమాచారం

40. మార్గమేముంది మౌనాన్ని ఆశ్రయించక
    వ్యర్ధమేతప్ప అర్ధమేకాని అనుబంధాలలో

41. ఆలపించకున్నా అలరిస్తున్నాయి
    మదిమాటున మౌనరాగాలు

42. నిశ్శబ్ధ విస్ఫోటకం
    నీమౌనం... నామదిలో

43. మౌనంగా నిష్క్రమిస్తున్నా
    నీ మాటల కాఠిన్యాన్ని మోయలేక

44. మూలం మౌనమే
    జ్ఞానానికైనా..ధ్యానానికైనా

45. మాటలలోనే మౌనం
    నా మనసున సదా కదనం

46. ఎపుడూ తికమకే
    మన అనురాగానికి సాధికారిక చిరునామా నానువ్వా? నీనేనా?

47. కనికరమేలేదు కదలని కాలానికి
    కలగానైనా కానుకివ్వకుంది నిన్ను

48. ఒద్దికగా నాలో ఒదిగొదిగి పొమ్మంటే.
    నువ్వేకాదు..పొద్దూ నవ్వుతోంది పువ్వులా

49. అతివే కాదు
    అతడూ అంతుబట్టడు...అనుబంధాల అగాధాలలో

50. నా గుండె బరువెక్కింది
    నిష్కర్షపు నీ మాటలమూటలతో

51. మనసు చల్లనే..మాటలే మంటలు
    గుప్పున ఎగసి చప్పున చల్లారుతూ

52. అందగాడివే...
    ఆత్మ సౌందర్యంతో నను అలరిస్తూ ..ఆకర్షిస్తూ

53. గడు సరివే
    కష్టాలన్నీ బదలాయిస్తూ సుఖానికి వాటాకొస్తూ

54. మౌనినే
    నీపేరే జపిస్తూ..నీప్రేమకై తపిస్తూ

55. స్వార్ధం అసత్య పు దుర్వాసనలతో
    భారంగా తల్లిభారతి సంతానం