మణి మాలికలు/దేవరాజుల దయానంద్‌ రావ్‌

వికీసోర్స్ నుండి

దేవరాజుల దయానంద్‌ రావ్‌
ఫ్లాటు నెం. 204, సాయినిలయం,
రోడ్డు నెం.9, వేంకటేశ్వరకాలనీ,
సరూర్‌ నగర్‌, హైదారాబాద్‌ - 35
వృత్తి : జూనియర్‌ లెక్చరర్‌
(సాంఫిుక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ)
మొబైల్‌ నెం: 9440819817
ఈ-మెయిల్‌: daya.devarajula@gmail.com

హృ'దయ' రాగాలు...
1) హృదయం ముక్కలయ్యాకే తెలిసింది
    అన్ని ముక్కలు చేయడం నీకు మాత్రమే సాధ్యమని

2) నీతలపులు నాహృదిని మీటేవరకు తెలియదు
    సరిగమల్లో అంతుచిక్కని క్రొంగొత్త రాగాలుంటాయని

3) మాధుర్యమంటే ఎంతిష్టమో నామనసుకి
    నీపలుకుల్నే పోగేసుకుంటూ దాచుకుంటూ

4) నీసౌందర్యాన్ని ఏమని వర్ణించను
    కావ్యయుగంలో పుట్టుంటే అన్ని కావ్యాల్లో నువ్వేగా కథానాయకివి

5) నీపలుకుల మధురిమలను నేర్చుకోవాలని కాబోలు
    కోయిలలన్నీ నీముంగిట బుద్దిగా కూర్చున్నాయి

6) నీజ్ఞాపకాల ఊపిరి నాహృదయంలోకి ఊదినావుగా
    చూడు గుండెసన్నాయి కళ్యాణిరాగాల్నెలా మ్రోగిస్తున్నదో..!

7) అవును నేను అపర గజినీనే
    నువ్వు తప్ప మరేమీ గుర్తుండదుగా

8) నావ్యధ నీమదిలో వెన్నెలసుమమై వికసిస్తే
    నీజ్ఞాపకం నాకనుకొలుకుల్లో అశ్రువై నిలిచింది

9) నీ సౌందర్యంతో నారదుని సోదరివయ్యావుగా
    రెండుకళ్ళా పరస్పరం పోట్లాడుతూ తిలకిస్తున్నాయి

10) వింతగాక మరేమి ?
    ప్రేమ విత్తనాలు చల్లితే విరహం పంటగా చేతికొస్తే!

11) గడిపేక్షణాలకు ఈత రాదుగా
    కాలప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉన్నాయి

12) అయ్యో నేను వికలాంగుడిని కాదంటే నమ్మరేం
    కలలపల్లకీలో చెలిని మోసి తనువిలా తయారైతే

13) నామదికి నిదురేదీ
    నీతలపులు నిరంతరం అలారం మ్రోగిస్తుం టే

14) నిరంతరం నీఆలోచన్లతో జుట్టుపీక్కుంటున్నా
    కత్తిలేకుండానే బోడిగుండు చేసిపెట్టావుగా

15) అంధకార జీవితంలో ఒక్కోక్షణాన్నీ కాల్చేస్తూ చూస్తున్నా
    ఏనాటికైనా వెలుగులు వెదజల్లుతూ నువ్వు వస్తావని

16) మనసు బీడుపై నీచూపుల వర్షాన్ని కురిపించు
    నాలో నవ్వులమొక్కలు మొలకెత్తక చాలా కాలమయ్యింది

17) ఎదుగుతున్న కొమ్మలేగా నీతలపులు
    మదిలో మహావృక్షమైన నాప్రేమకి

18) విశ్వవిజేతనే..!
    నీ శిలాహృదయంలో నాప్రేమవిత్తులు మొలకెత్తించగల్గితే

19) ఒకటే తుమ్ములూ, దగ్గులు
    నీజ్ఞాపకాలు జడివానగ కురుస్తుంటే

20) గజీతగాడినే...ఏంలాభం
    నీ ప్రేమసాగరంలో గజమైనా ఈదలేకపోయా

21) సంధించిన నీశరం లక్ష్యాన్నే తాకింది
    నేను పోగేసుకున్న కలలన్నీ చెల్లాచెదురయ్యాయి

22) నిజమే...మదాంధుడినే..!
    నీజ్ఞాపకాల గర్వంతో నిన్ను గుడ్డిగాప్రేమిస్తూ

23) నాకథ పంచమవేదమే
    నీఅష్టాదశ ప్రణయపర్వాలతో

24) నాకే కాదు
    నిరంతరం వేధించే నాఏకాంతానికీ నిదురలేదు

25) నాది ఊష్ణపు శరీరమే మరి..!
    నీజ్ఞాపకాల కుంపటి గుండెల్లో రగిలించాక

26) విలోమానుపాతమే నాబ్రతుకు
     నేనెంత దగ్గరవ్వాలనుకుంటే.. నువ్వంత దూరంజరుగుతూ..

27) నీ తలపులకు ఫెవికాల్‌ అంటించావేమో
     గడిపే ప్రతిక్షణానికీ వదలకుండా అతుక్కున్నాయి

28) నీకంటే మృత్యువే ఎంతోనయం
     వేలసార్లు వేధించి వధించదు

29) చకోరాలన్నీ నాచుట్టే తిరుగుతున్నాయి
     వాటికెలా తెలిసిందో జాబిలివై నాలో నువ్వు దాగున్నావని

30) తరువులకూ నీతలపులు తాకాయేమో
     తమకంతో తలలూపుతూ తూగుతున్నాయి

31) కన్నుగీటి కవ్వించుట నీవంతు
     కాలమెరుగక కుప్పిగంతులేయుట నావంతు

32) నేను ఆడితే అది ఆట
     నువ్వు నన్నాడిస్తే అది జీవితం

33) రక్తహీనత తప్పదేమో
     గాయపడిన గుండె స్రవిస్తున్నంత కాలం

34) జ్ఞాపకాల గునపాన్ని గుండెల్లో గుచ్చకు
     గావుకేక వేయలేని 'గాయ'కుడినే అవుతా

35) నామనసుకి సిగ్గులేదు
     ఎన్నిదెబ్బలు తిన్నా మార్పు రాదుగా

36) నీతలపుల పల్లకీలోనే నాఊరేగింపు
     నేడైనా... అంతిమ ప్రయాణంలోనైనా

37) నీది విశాలహృదయమనే అంటావు
     నాకంటూ ఇరుకుస్థలమైనా లేదే..?

38) నీతలపులు గంధపుచెక్కలే
     ప్రతిక్షణం చస్తున్న నామనసుని కాల్చేస్తూ

39) నేను ఎగరలేని పక్షినే
     నీజ్ఞాపకాల పంజరంలో చిక్కి

40) సర్వకాలాల్లో సమన్యాయమే నీది
     మొన్నల్లో నిన్నల్లో నేడుల్లో రేపుల్లో అంతా నువ్వేనిండి

41) గడిపేక్షణాల ద్విపాత్రాభినయం
     నీసమక్షంలో సంతసిస్తూ..ఎడబాటులో చింతిస్తూ

42) నీకు ఎంత ఋణపడి ఉన్నానో
     ఏకాంతంలోనూ ఒంటరిని చేయని జ్ఞాపకాలిచ్చావుగా

43) నువ్వు నరకానికి వెళ్ళాకే తెలుస్తుందిలే
     నీలోని ప్రేమరాహిత్యం ఎంత పాపమో

44) నాబాధ...నువ్వు గాయపరిచినందుకు కాదు
     దాని మచ్చ ఇంకా మెరుస్తున్నందుకే

45) నామది దానిమ్మపండు కాదుగా
     అడగ్గానే పేర్చుకున్న నీ జ్ఞాపకాలదొంతరలని వలిచి చూపడనికి

46) మధురమైన గేయాలంటే నేనెలా పాడను..?
     గాయపడిన మదికి మౌనగీతాలేగా వచ్చు

47) ఇదీ మనకళ్ళ వరుస
     కన్నీరాపని నాకళ్ళా...నాకై ఒకచుక్కా రాల్చని నీకళ్ళు

48) బలహీనమైనదే నామనసు
     బలమైన నీతలపుల ముందెప్పుడూ తలవంచుకునే

49) ప్రేమ విశ్వమంత విశాలమైనది
     ఇరుకైన మనిషిగుండెలో పట్టడంలేదు

50) ఆశాజీవివే కదూ..!
     నువ్వల్లుకున్న ఆశలగూడు చెదిరినపుడే అనుకున్నా

51) అవిశ్రాంతంగా విహరిస్తూనే ఉన్నా
     గుండెకు మొలచిన నీఆశలరెక్కలతో

52) గుండె బరువెక్కుతూనే ఉంది
     గుట్టలై పేరుతున్న నీజ్ఞాపకాలతో

53) నాగుండెది మూగప్రేమే
     మెత్తగా కోస్తుంటే..మౌనంగా రోదిస్తున్నది

54) జీవిద్దాం ఇలాగే
     మౌనంతో నువ్వు..మతితప్పుతూ నేనూ

55) నిశ్చలమెనౖ సరస్సునే ఒకనాడు
     నీ రాకతో కల్లోల తరంగాల సాగరాన్ని నేడు

56) కీర్తి, సంపద, హోదాలకై ఆరాటమెందుకు..?
     కడకు తెల్లబట్టలో కాలి కనుమరుగయ్యేవేగా

57) గుప్పెడు సంతోషతారల్ని నామదిలో నాటరాదూ
     ఆకాశమంత ప్రేమవెలుగుని నీగుండెలో నింపనూ..

58) చంద్రుడూ నాలాగే..
     గాయపు మచ్చ చెరగకుండనే జీవిస్తూ!

59) గడ్డకట్టకుండ గుండెను రగిలించుకుంటూనే ఉన్నా
     నిరంతరం మదిలో మండే నీజ్ఞాపకాలతో

60) నామది సముద్రమే
     పాయలుపాయలుగా చేరిన నీ జ్ఞాపకలతో

61) నువ్వు ఆనందాన్ని పంచినా అదేమిటో
     చెక్కిళ్ళు కన్నీళ్ళతో తడిసి పోతున్నాయి

62) ప్రొద్దున్నే లేచినప్పుడల్లా నాకు సందేహమే
     కనపడేది నీమోమా వేకువ వెలుగాయని

63) ఏకైక శ్రోతనే
     నాహృదయపు ఆర్తనాదాల్ని ఆర్తిగా వింటూ

64) కంటివైద్యుడే కలవరపడ్డాడు
     కంటిపాపల్లో పువ్వులా నిన్ను చూసి

65) నీలా నాకసాధ్యం
     మాయలతో కాకుండ.. మనసుతో పెరిగా


66) పరిమళం పరిచయమయ్యింది
     నీజ్ఞాపకాల గుబాళింపుతో

67) ప్రతిరాత్రీ అందమైనదే
     నిదురలేమితో నీ తలపుల్లో కరిగినదల్లా

68) వారిది పొలాల్లో పనిచేసిన అనుభవమేమో
     మానవత్వాన్ని కొడవళ్ళతో పరపరా కోస్తున్నారు

69) కలుపు బాగా పెరిగింది
     మనుషుల్లోనూ..వారి మనసుల్లోనూ

70) తుడిపేయడానికవి వాకిట ముగ్గులు కావు
     చెరిపేయలేని నామది గాయపు మచ్చలు

71) కనురెప్పల్ని మోయడం కష్టమయ్యింది
     కన్నీటితో తడిచితడిచి భారమయ్యాయిగా

72) మరుజన్మలో తోడవుతానంటే
     క్షణం చాలదూ...ఈజన్మ వదిలించుకోడానికి

73) నాకళ్ళ పుస్తకంలో
     కన్నీటిసిరాతో కనురెప్పలు రాసిన కథలెన్నో

74) నామనసు అనంతశూన్యాన్ని నీముందు ఉంచింది
     చకచకా నింపడం నీతలపులకే సాధ్యమని

75) కన్నీళ్ళకి కరు వొచ్చింది
     మనసుల మధ్య ఆర్ధ్రత కరువయ్యిందిగా

76) తిరగబడలేని బానిసే నామనసు
     నియంతలా నీ జ్ఞాపకాలతో నిరంతరం దాడులు చేస్తున్నా

77) మన తలలు నిటారైన ధ్వజస్తంబాలే కదూ
     సిగ్గులేని పనులు చేసినా దిగవూ...వంగవు

78) మనుషుల కంటే రాబందులెంతో నయం
     చచ్చిన శవాల్ని మాత్రమే పీక్కుతింటాయి

79) కుక్కలు నిత్యం మొరుగుతూనే ఉన్నాయ్‌
     విశ్వాసం లేని మనుషుల్ని చూసి

80) నిన్ను జాబిలితో పోల్చుటంలో అతిశయోక్తి లేదులే
     చూడగానే నాముఖం కలువలా వికసిస్తున్నది మరి

81) కాలానికెంత దాహమో..?
     కన్నీటిప్రవాహాల్ని ఎంత తాగినా నిరంతరం దోసిళ్ళు పడుతూ

82) నిజమే..నీరు పల్లమే ఎరుగును
     అశ్రుప్రవాహమంతా సరాసరి గుండెలోకే చేరుతున్నదిగా

83) ఇన్నాళ్ళ నీచెలిమి వింతగా తెలిపింది
     పగళ్ళన్నీ వేదనలనీ..రాత్రులన్నీ కన్నీళ్ళని

84) నీలో అనంతప్రేమ ఉందని మిడిసిపాటు ఎందుకు
     నాకు పంచని ప్రేమ అడవిగాచిన వెన్నెలేగా

85) నువ్వు చేసిన గాయాలు ఎంత భయపెట్టాయో
     హత్తుకున్న పెదవులు మౌనముద్రను విడవడం లేదు


86)గాయపడిన పక్షి రామాయణాన్ని రాయిస్తే..
     గాయపడిన నాగుండె ప్రేమాయణాన్ని రాయిస్తున్నది..

87) నీఆలోచనలకి దొంగతనం నేర్పావేమో..!
     నా కంటినిద్రనంతా దోచుకెళ్తున్నాయి

88) అందమైన నీకళ్ళల్లో నన్ను నింపుకోరాదూ
     నిరంతరం నీఆనందాభాష్పాలై కరుగుతూ ఉండనూ

89) కనపడని జ్వాలలేగా...అంతరంగ బడబాగ్నివి
     వినపడని రోదనలేగా...మూగబోయిన మనసువి

90) నాతనువు ఎటుతిరిగితేనేం..!
     మనసు మాత్రం నిరంతరం నీచుట్టేగా..

91) నువ్వునాపై కోపగించుకున్నా సంతోషమే
     అలకల మబ్బులతో ముసుగేసుకున్న శశివేగా

92) కణకణంలో నువ్వునిండాకే తెలిసింది
     విషమేకాదు అమృతమూ నిలువెల్లా పాకుతుందని

93) చివరికి చితిమంటల్లో కాలడమెలాగూ తప్పదుగా
     ఇప్పుడెందుకు అసూయమంటల్లో కాలుతూనే ఉండడం

94) కనురెప్పలుండడం శాపమయ్యింది
     తదేకంగా నిన్ను చూస్తూంటే మధ్యమధ్య ఆటంకం కలిగిస్తూ

95) పెట్టిన పరీక్షలో కాలం ఓడిపోయింది
     చెరగని నీ జ్ఞాపకాన్ని కడగలేక

96) నీ మౌనం ఏంభయం పెట్టిందో..?
     నా మనసు చీకటివెనుకే దాక్కుంటున్నది

97) కన్నీటితో ఎంత తడిపినా ఏంలాభం..?
     గుండెలో చెలరేగే దావాగ్ని చల్లారునా..!

98) నానుండి బయటపడి ఎటెళ్ళాలని నీఆరాటం..?
     నా మనసుని విశ్వమంతా పరిచానుగా

99) చేతకానివాళ్ళమేగా మనం
     మంచీచెడూ తెలిసి ఎవరికీ చెప్పలేక

100) గణితశాస్త్రజ్ఞుడికీ అసాధ్యమే
     నీపై నాకున్న ప్రేమను లెక్కించడం

101) మబ్బులు తొలగిన నెలవంక
     పైట పక్కకు తప్పుకున్న నీ నడుము వంపులా

102) నీ మనసుకెంత మోమాటం
     కలలోకూడ నామనసుని హత్తుకోవాలంటే

103) నీసౌందర్యం మందుపాతరే
     చూసిన కళ్ళనన్నింటినీ ఆశ్చర్యాలతో పేల్చేయదూ

104) ఎప్పటికీ మనమింతేనేమో
     సుదూరంలో కలిసినట్టున్న భూమ్యాకాశాల భ్రమతో

105) నాప్రేమను తెలపడానికి స్వరభాషెందుకు..?
     నిను చూడగానే విప్పారే నాకనుల భాష చాలదూ..!

106) షరామమూలే నాప్రేమలో
     వెక్కి రింతలతో నువ్వు...వెక్కిళ్ళతో నాహృదయం

107) నేనేమైనా ఎడారిమొక్కనా
     నీపలకరింపుల చినుకుల్లేక ఎలా జీవించనూ

108) నినువిడిచి జీవిస్తుంటే తెలుస్తున్నది
     మరణమంటే కేవలం ప్రాణం పోవడం మాత్రమే కాదని

109) అపార్థాల పరదాలు తొలిగిస్తావా
     నన్నర్థంచేసుకున్న నీహృదాయాన్ని చూడాలి

110) ఒంటరిగా పోయాడనే అపఖ్యాతి రావద్దనే
     నిరంతరం నీతలపుల్ని తోడుగా పెట్టుకుంటున్నా

111) అదేమిటో.. ప్రతీది రెండుగా కనిపిస్తున్నాయ్‌
     నాలో నిండిన నీకళ్ళతోపాటూ చూస్తున్నందుకేమో..!

112) నావ్యధ చూడలేకేమో సూర్యుడు వడిగా వెళ్ళిపోతున్నాడు
     పిచ్చివాడు..మరింత పెంచడానికి చంద్రుడొస్తాడని తెలియక

113) వికృతమైన మనుషులు
     పైపైకి హుందాతనాలు.. లోలోన దిగజారుడుతనాలు

114) గుండెపొరలపై ఎరుపెలా పండిందో చూడు
     వలపు గోరింటను మురిపెంగా అద్దావుగా..!

115) నాలో నువ్వు ఛిద్రం కావద్దనే
     నా మనసుని ముక్కలవ్వకుండ చూసుకుంటున్నా