భీమేశ్వరపురాణము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ రామాయనమః

శ్రీమహా గణాధిపతయేనమః

శ్రీ మాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః

శ్రీ భీమేశ్వరపురాణము

పంచమాశ్వాసము

శ్రీవత్సలాంఛనోపమ
భావభవాకారమంత్రి పరమేశ్వర పా
రావారనిభగభీరా
దేవాధిపసుప్రసన్న దేవయయన్నా.

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె.

2


తే.

ధర్మపారాయణుండు మైత్రావరుణుఁడు, వెండియును నిట్టులని చెప్పె విశదఫణితి
గాఢసమ్మోదభవనేత్రకంకణునకు, మంకణున కాత్మధృతభోగికంకణునకు.

3


వ.

అనంతరం బావివస్వతుం డాత్మప్రతిష్ఠితంబైన యద్దివ్యలింగంబునందు శివసన్నిధానంబు సేయఁదలంచి.

4

సూర్యుండు కైలాసమున కరిగి శివుని దక్షారామమునకుఁ దోడి తెచ్చుట

సీ.

ద్యోస్థలినక్షత్రధూళిపాళీకేళి, చుళికితస్వర్ణదీజలచరములు
వైజయంతీపటవ్యాక్షేపసంభూత, మారుతోద్ధూతేందుమండలములు
సింహికాసుతకంఠసీమాపునర్దండ, చక్రధారావ్యథాప్రక్రమములు
రథరథ్యనిశ్వాసరంహస్సముద్భ్రాంత, గగనగంగాతరంగచ్ఛటములు


తే.

నైన ప్రస్థానవేగంబు లతిశయిల్ల, నభ్రఘంటాపథంబున నరుగువాఁడు
గతికి నొకమూర్తిఁ జాలించి కదలి చనియె, శీఘ్రమున ద్వాదశాత్ముండు శివునిగిరికి.

5


ఉ.

భాసురయక్షనాథదిగుపాంతకలాపవిలాస మైనకై
లాసము చక్కటిం జదల లాఘవ మొప్ప రథంబు డిగ్గి వి
శ్వాసపురస్సరంబుగ దివాకరుఁ డిందుకళాకిరీటునా
వాసముఁ జేరవచ్చి తలవాకిట వారితుఁ డయ్యె నందిచేన్.

6


వ.

ఇట్లు వారింపంబడి.

7

తే.

విపులశాఖాశిఖామంత్రవితతి నినుఁడు, సంస్తుతించెను నందికేశ్వరునిఁ బ్రీతి
బ్రహ్మవిష్ణుపురందరప్రముఖులైన, వేల్పులును నట్ల పొగడ రా వృషభరాజు.

8


వ.ఇట్లు పొగడినఁ బ్రసన్నుండై నందికేశ్వరుండు గొనిపోవం బోయి కోపకుటిలనిటలతటఘటితభీషణభ్రుకుటిభంగాభంగముఖముఖరభయంకరభృంగిభృంగిరిటహుంకృతిభయమానవిబుధసంతానానుసంధానంబు లైనకక్ష్యాంతరంబులు ప్రవేశించి ముంగట వేదవేదాంతవిద్యావందితచరణారవిందుండును జండకిరణశశిమండలప్రభావిభాసమానఫణామణిగణాభిరామకుండలితకుండలిపతికుండలాలంకారమండితగండస్థలుండును బ్రళయకాలదహనదగ్ధభువనభవనభస్మాలేపధవళితదేహుండును నఖండబ్రహ్మాండభాండశతకోటివిలయకాలమృతశతధృతిరుండమాలికాభూషణుండును నైయున్న నప్పు డాప్రదీప్రంబుగాఁ గొన్ని నచరాచరబ్రహ్మపారాయణంబులు పఠియించునవియును గొన్ని ఋగ్వేదంబు గుణియించునవియును గొన్ని యజురామ్నాయం బామ్రేడించునవియును గొన్ని సామవేదంబుఁ జదువునవియును గొన్ని యధర్వణవేదం బాధ్యానం బొనరించునవియును సంస్తుతియించునవియును నట్టహాసంబు సేయునవియును నైన యావిధిశిరంబులచేతం గ్రుచ్చినదండ పుండరీకముకుళమండితడుండుభంబునుంబోలె ప్రకాశింపఁ గంఠకోణంబునఁ గంఠకోపరినీలంబునుంబోని కాలకూటంబున సంఘటిల్లు భ్రాంతి సంతమసంబునకు ఖద్యోతంబులునుంబోలె విద్యోతించు కంకణాశీవిషవిషానలవిస్ఫులింగంబులవలన దుర్నిరీక్ష్యుం డగుచు వికటజటాటవీజూటకుహరవిహరమాణస్నిగ్ధపరిముగ్ధతరలహరిపవనపూరితంబులైన యాపీడవిధిశిరఃకరోటికందరక్రోడంబులఁ బాటిల్లు ఘుమఘుమఘోషంబు భీషణభూషాభుజంగంబుల నిద్రాముద్రాగ్రంథిని గ్రహింపఁ గెంజడముడి బిగించి వెట్టియంబు చుట్టిన జగజెట్టిపావఱేనియౌదలమాణిక్యంబుల తురంగలి మెఱుంగులు వెనువెంట మింటదాఁకను జరిగి ధగద్ధగనిగనిగ వెలుఁగుటం జేసి యప్పుడప్పుడ యనలస్తంభంబున నావిర్భవించినభంగి నంగీకరించుచు నగ్రగరళపరిమళాఘ్రాణంబునం జేసి మూర్ఛిల్లినవిధంబున నిరంతరధ్యానస్తిమితలోచనులై యుభయపార్శ్వంబుల సనకసనందనసనత్సుజాతాదియోగీశ్వరులు పరివేష్టింప శేఖరశశాంకునకు గ్రొత్తగాఁ గాళరాత్రికళత్రంబును గల్పించినట్లు పొలిసిన పచ్చియేనికతోలుపచ్చడంబు జంగాళంబుగా వైచుకొని చరణభూషణశేషాహిశిఖామణి ప్రతిబింబితాంబరుం డగుటం జేసి ఘోరవిషవితరణమహాపరాధక్షమకై పయోధివచ్చి పాదంబులపయింబడినభావంబు భజియింప ధారాజలబిందుదంతురంబునుఁ బోని వారణాసురకుంభకూటవిదారణంబున హత్తిన ముత్తియంబులతోడఁ జాల నాభీలం బగుత్రిశూలంబు కేలం గీలు

కొల్పి కఠినశమనశిరస్ఫాలనంబునం గట్టిన శ్రీపాదారవిందంబునం దాపించిన బిరుదుకటకంబున ఘటియింపఁబడి వెలుంగుయాదఃపతి మేదోమృతంబు జిడ్డున గడ్డుకొనిన పూషాదిత్యుపలువరుసయంతంబున నుప్పతిల్లు త్రుళ్లుమెఱుంగులు పెల్లుగ నుల్లసిల్ల విలసిల్లుచు విశ్వజగదుత్పత్తిగుప్తివిపత్తికారియగు పురారిం గనుంగొని జయజయశబ్దపూర్వకంబుగా సంస్తుతి యొనర్చి ముకుళితకరారవిందుడై. 9


తే.

బ్రహ్మవిష్ణుమహేంద్రాదిపరివృఢునకు, నద్రిరాజన్యకన్యాసమన్వితునకుఁ
బ్రమథగణభూతబేతాళపరివృతునకు, హరున కినుఁడు నమస్కార మాచరించె.

10


వ.

ఇట్లు ప్రణామానంతరంబున భాస్వంతుండు గౌరీకాంతునకు నిజాగమనప్రయోజనం బెఱింగించినం దదనంతరంబ.

11


ఆ.

ఇనునితోడిచెలిమి నిభరాజవదనుండు, విన్నపంబు చేసె విశ్వపతికి
నమృతమథనవేళ నావిర్భవుండైన, భుజగహారుఁ జూడఁబోద మనుచు.

12


సీ.

విఘ్నాధినాథుండు విన్నవించినమీఁదఁ, బర్వతాత్మజ విన్నపంబు చేసెఁ
బర్వతాత్మజ విన్నపం బొనరించిన, వెనుకఁ గ్రౌంచఘ్నుండు విన్నవించె
గ్రౌంచఘ్నుఁ డటు విన్నవించినయత్తఱి, మఱి విన్నవించెను మాతృగణము
బ్రాహ్య్మాదిమాతృవర్గము విన్నవించిన, వెండియు భూతముల్ విన్నవించె


తే.

నిందుధరునకుఁ గైలాసమందిరునకు, నభవ విచ్చేయు రవికిఁ బ్రియంబు గాఁగ
నమృతవారాశి నుదయించి యంధ్రభూమి, దక్షపురి నున్నయాదివ్యతనువుఁ జూడ.

13


వ.

అని యిట్లు విన్నవించిన విఘ్నేశ్వరునిమీఁది యనుగ్రహంబునను భవానిమీఁది కూర్మిని గుమారునిమీఁది ప్రేమానుబంధంబునను బ్రాహ్మ్యాదిమాతృగణంబుమీఁది ప్రీతిని భూతంబులమీఁది యాదరాతిశయంబునను భాస్వంతునిమీఁది సంతోషంబునను మధ్యమలోకగమనోద్యుక్తుండై హరివిరించులం జూచి మహాదేవుం డిట్లనియె.

14

మహాదేవుఁడు ప్రమథగణసమేతుఁడై దక్షారామమునకుఁ బోవుట

మ.

కలవారందఱు దక్షవాటిగమనోత్కంఠాసముత్సాహదో
హలు లైనారు సహస్రభానుఁడును నభ్యర్థించుచున్నాఁడు మం
గళదివ్యామృతలింగదర్శనమునుం గర్తవ్య మంధ్రక్షమా
స్థలికిం బోదమె యూసుపోకకు వినోదంబుల్ పరీక్షింపగన్.

15


తే.

పాయ కొకచోటఁ జదికిలఁబడఁగ నుండ, నైన ఫల మేమి యటు వినోదార్థ మరిగి
సంచరింతముగాక యీ జలజహితుని, ధర్మ మౌర్జిత్యమును బొంద దక్షపురిని.

16


వ.అని యానతిచ్చి యాక్షణంబ. 17

క.

చాటింపఁ బంచెఁ జంద్రకి, రీటుఁడు కైలాసనగపురీవీథుల ఘం
టాటంకృతితో దక్షుని, వాటికిఁ బయనంబు ప్రమథవరులకు ననుచున్.

18


వ.

అప్పుడు భవాని భవుసన్నిధిఁ జేతులు మొగిచి యిట్లని విన్నవించె.

19


తే.

పుట్టినిలు గాన నాకు నెప్పుడును బ్రేమ, దక్షవాటిక మీఁద నెంతయు ఘనంబు
సన్నిధానంబు సేయుమో చంద్రమౌళి, యమ్మహాపురి భీమలింగంబుమీఁద.

20


తే.

ఉత్తరంబునఁ గాశీపురోత్తమంబు, మోక్షలక్ష్మికి నెబ్బంగి మూలమయ్యె
దక్షిణంబున నాభంగి దక్షవాటి, మూలమౌఁగావుతను భోగమోక్షములకు.

21


తే.

కుంటి కుదుపు లశక్తులు కుష్ఠరోగు, బంధులును వృద్ధులును బాలు రాది గాఁగఁ
గాశి కరుగంగ లేనిబికారులెల్ల, మోక్షమును బొందుదురుగాక దక్షవాటి.

22


మ.

కలిదోషంబున నిష్ఠురాత్మకులునున్ గామాంధులుం బాపక
ర్ములు నజ్ఞానదవాగ్నిదగ్ధులును నై ప్రోద్యన్మహారౌరవా
నలిఁ గూలంగల దుష్టమానసులకుం వారాణశీతుల్యమై
కలుగుంగావుత ముక్తి దక్షపురి నీకారుణ్యసంభావనన్.

23


తే.

సర్వలోకంబులకును మోక్షదుండవైన, నీవు సన్నిహితుండవై నిల్చినపుడు
దక్షిణాపథకాశి శ్రీదక్షవాటి, భువనమాన్యంబ కద నాదు పుట్టినిల్లు.

24


వ.

అని విన్నవించిన యనంతరంబ యంబికావల్లభుండు మందరాచలకూటంబనం బొల్చి సంస్మృతిమాత్రంబునం బొడచూసి నిల్చిన వృషభంబు నెక్కి యథోచితంబుగా నమందానందంబున గిరిరాజనందన వెనుకదెస విఱియం గౌఁగిలించుకొనియుండం దమతమవాహనంబుల నారోహణంబు చేసి బ్రహ్మాదులు పరివేష్ఠించి చనుదేర శంసితవ్రతులైన యక్షసురసిద్ధసాధ్యులు ముందటం గెలనబలసి యేతేర హృద్యంబు లగుగద్యపద్యంబులు తుంబురునారదాదులు పఠింప వేదఘోషంబులు జయజయశబ్దంబులు వేణువీణాకాహళాదిపంచమహావాద్యనాదంబులు కుంజరబృంహితంబులు తురంగహేషితంబులు చెలంగ మూషకారూఢుండై వినాయకుండు మున్నాడినడువ సుబ్రహ్మణ్యుండు మయూరవాహనుండై కదిసికొలువ వసురుద్రాదిత్యులు దుర్గావీరభద్రభైరవులు నంతరాంతరంబులఁ జండీశ్వరాద్యసంఖ్యాతప్రమథగణంబులు బలసికొలువ కైలాసభవనంబుననుండి యక్షీణవిభవంబున దక్షారామంబు డాయంజనుదెంచునప్పుడు.

25


తే.

పొగడి రందు నికుంభకుంభోదరులును
బెరసి భద్రమహాకాళిభృంగిరిటులు
పాయు బగళంబు తొలఁగు విచ్చేయుఁడనుచుఁ
బార్శ్వములయందు మిగులనార్భటము సేయ.

26

వ.

అంత నీలకంఠుఁడు పురోపకంఠంబునకు విచ్చేయునప్పుడు.

27


గీ.

విషమకఠిన నిన్ను వీథీవిటంకంబు, నంతరాంతరముల నరసియరసి
యక్షకర్దమమున యక్షేశ్వరాదులు, సవరచేసి రధికసంభ్రమమున.

28


క.

ఘుసృణప్రసూనరసమునఁ, బసపుంజూర్ణమునఁ జంద్రపాంసులముక్తా
విసరముల సుర లొనర్చరి, పసగా శంఖాబ్జముఖ్యబహుచిత్రంబుల్.

29


వ.

వెండియు సువర్ణారవిందసందానితసుందరమందారమాలికాభిరామంబును సంస్తంభితశాతకుంభదండమండితధ్వజోపశోభితంబును నానావిపణిమార్గన్యస్తసంఘటితమాణిక్యమయూఖరేఖాకిమ్మీరితదశదిశాముఖంబును వరివిశేషవిభవలక్ష్మీధామంబును నగుదక్షారామంబుఁ బ్రవేశించునప్పుడు.

30

శివుఁడు దక్షారామంబుఁ ప్రవేశించుట

ఉ.

అక్షతగంధపుష్పఫలహారిహిరణ్మయపాత్రహస్తలై
దక్షాపురీవిలాసినులు తామరనాయతలోచనల్ సహ
స్రాక్షుఁడు భీమలింగమున కర్పణచేసిన యప్సరల్ విరూ
పాక్షు నెదుర్కొ-నం జనిరి యందియ లంఘ్రుల ఘల్లుఘల్లనన్.

31


తే.

భావహావవిలాసవిభ్రమము లమరఁ, జంద్రశేఖరు నగరి యచ్చరలపిండు
తగ సమర్పించె నయ్యాదిదంపతులకు, రత్నదీపాంకురముల నీరాజనములు.

32


ఉ.

శైలతనూజ తోడుగఁ బ్రసాదగుణంబున మాటిమాటికిన్33
మేలములాడుచున్ నిజసమీపమునన్ గుహమాతృభద్రశుం
డాలముఖప్రధానగణనాథులు గొల్వఁగ భారతీశల
క్ష్మీలలనేశ్వరుల్ గదిసి చెప్పెడు విన్నప మాలకించుచున్.


తే.

భూమి దక్షిణపాథోధిపుణ్యసీమఁ, బ్రజలు చేసిన భాగ్యవైభవసమృద్ధి
శ్రీమహాదేవుకరుణానిరీక్షణంబు, గౌరిముఖరాజలక్ష్మియుఁ గానఁబడియె.

34


శా.

సంతోషించిరి దక్షిణాపథజనుల్ సాక్షాాద్విరూపాక్షునిం
గాంతాసంయుతు నందివాహు శశిరేఖాజూటకోటీరు వే
దాంతాభ్యర్చితపాదపంకజుని దక్షారామమధ్యంబునం
దంతన్ సంభృతసౌఖ్యుఁ గంటిమిదె కన్నారంగ నం చెంతయున్.

35


క.

నాగేంద్రకర్ణకుండలు, నాగేంద్రత్వక్కటీరు నగరాజసుతా
సౌగంధ్యలలితదక్షిణ, భాగుం గనుఁగొంటి మిట్టిభాగ్యము గలదే.

36


గీ.

అని సమస్తజనంబులు నభినుతింప, నల్లనల్లన వేంచేసె నంధకారి
దక్షవాటికఘంటాపఠంబునందు, హరిశతానందశక్రాది సురులు గొలువ.

37


వ.

ఇట్లు భీమేశ్వరసదనాంతరంబుం బ్రవేశించి.

38

తే.

గారవించెను విధి శిరఃకంపమునను, నాదరించెఁ బ్రియోక్తుల నబ్జనాభు
మించుమందస్మితమున మన్నించె శక్రు, హరుఁడు గరుణించె సురల గటాక్షదృష్టి.

39


చ.

సకలదిశాముఖంబులఁ బ్రసన్నములయ్యెఁ బ్రదక్షిణార్చియై
యకలుషలీలఁ గైకొనియె హవ్యవహుండు హవిర్విభాగముం
బ్రకటితసౌఖ్యకారి యయి పాయక వీచె సమీరణంబు త్ర్యం
బకుఁ డట భీమనాయకుని మందిరిమధ్యముఁ జొచ్చునత్తఱిన్.

40


సీ.

గంగాజలాపూర్ణగాంగేయణికుంభ, హస్తాబ్జములఁ గొంద ఱప్పరసలు
ఫలపుష్పకిసలయప్రచురపాత్రవిశేష, హస్తాబ్జములఁ గొంద ఱప్పరసలు
నిర్మలానేకమాణిక్యనీరాజన, హస్తాబ్జములఁ గొంద ఱప్పరసలు
లాజాక్షతాదికల్యాణవస్తువ్రాత, హస్తాబ్జములఁ గొంద ఱప్పరసలు


తే.

నాటపాటల మ్రొక్కుల నభినుతులను, నర్థి సేవించి రొకకొంద ఱప్పరసలు
అపుడు రెండవకైలాస మనఁగ నొప్పె, నభవుఁ డేతేర భీమనాయకుని నగరు.

41


వ.

మఱియు ననేకప్రకారంబుల దివ్యాంగనారచితోపచారంబు లంగీరించుచు నాంగీరసదత్తశోభనలగ్నంబున మునుల యాశీర్వాదంబులు చెలంగ నందినాహనంబు డిగ్గి నిజభుజావలంబనావతీర్ణయగు నపర్ణహస్తాబ్జంబు కరపల్లవంబున నవలంబించి ముందట జలధరవాహుఁడు వేత్రహస్తుండై సందడి నెడంగలుగజడియ మార్గశీర్ష శుద్ధచతుర్దశియందు రోహిణీనక్షత్రంబుస సిద్ధయోగంబున యోగీశ్వరేశ్వరుండు.

42


తే.

దాఁటెఁ బ్రాపాదదేహళిదర్పకారి, ధరణిధరరాజపుత్రి కైదండ యొసఁగ
నమ్మహాదేవి కుచమండలమ్ము సోఁకి, యంగకంబుఁల బులకంబు లంకురింప.

43


వ.

అప్పుడు.

44


ఉ.

తా మును చేసినాఁడ నొకతప్పని చిత్తములోఁ దలంచునో
యేమనునో తనుం గనిన నీశ్వరుఁ డంచు భయంబుతోన యా
స్వామికి నర్చనం బొసఁగె శంబరశత్రుఁడు దక్షవాటికా
ధామవిలాసదీర్ఘకలఁ దన్వుగఁబూచిన హల్లకంబులన్.

45


తే.

మును కటాక్షైకవీక్షణాంభోరుహముల, నర్చనము లిచ్చి రఖిలలోకాధిపునకు
శివునిఁ బూజించి రప్సరస్త్రీలు పిదప, హస్తపంకజపుప్పోపహారములను.

46


తే.

కామమును లోభమును ముక్తికాంతయందు
మోహమదములు బాలకముగ్ధలందు
నధికపాపాత్ములం దధర్మాత్ములందుఁ
గ్రోధమాత్సర్యములు జనకోటి కొదవె.

47

వ.

అనంతరం బాశివుం డభ్యంతరమందిరంబునఁ బ్రవేశించి హరివిరించిప్రముఖబృందారకులచేత మధుపర్కాద్యుపచారంబులు గైకొని కక్ష్యాంతరంబులు గడచి గర్భగృహమండపంబునందు నూత్నరత్నస్వరూపంబైన శ్రీభీమనాథ మహాదేవ స్వయంభూజ్యోతిస్సుధామయమహాలింగంబు నాగమోక్తప్రకారంబుల నర్చించి యాపాదమస్తకంబు తద్రూపంబు ముహూర్తమాత్రంబు చింతించి.

48

శ్రీకంఠుఁడు దక్షారామభీమేశుతో నైక్యతం బొరయుట

శా.

కైలాసాచలకేలిమందిరుఁడు శ్రీకంఠుంండు సోత్కంఠుఁడై
ప్రాలేయాచలరాజకన్యకయుఁ దా బ్రహ్మాదిదేవవ్రజం
బాలోకింపఁగ నైక్యతం బొరసె దక్షారామభీమేశుతోఁ
ద్రైలోక్యంబును దివ్యలింగశివతాదాత్మ్యంబు వర్ణింపఁగన్.

49


సీ.

అవ్యయం బనవద్య మాద్య మచ్యుత మజం,బవ్యక్త మప్రమేయం బనంగఁ
బరఁగి కైలాసభూధరసమాగతమైన, తేజంబుతోఁ గూడి తేజరిల్లె
దక్షవాటీపురాధ్యక్ష భీమేశ్వర, శ్రీస్వయంభూదివ్యసిద్ధలింగ
మమృతపాథోధిమధ్యాంతస్సముద్భూత, మమలపరంజ్యోతిరాదికంబు


తే.

భువనబీజంబు కైవల్యభోగదాయి, యఖిలకళ్యాణకారి విశ్వాద్భుతంబు
పూజఁ గొనియెను మురభిదంబుజభవాది, దేవతాకోటిచే సంప్రతిష్ఠఁబొంది.

50


వ.

బ్రాహ్మీప్రధానసప్తమాతృకలను నందీమహాకాళాదిప్రమథగణంబులును హరివిరించిప్రముఖబృందారకులును బురందరాదిలోకపాలకులును వసురుద్రాదిత్యమరుద్విశ్వేదేవాశ్వినీదేవతలును సిద్ధసాధ్యులును విద్యాధరోరగులును గ్రహనక్షత్రతారకంబులును బితృగణంబులును మూర్తంబులును నమూర్తంబులు నగుచరాచరంబులన్నియు నానారత్నగంధపుష్పధూపదీపనైవేద్యాదులు సమర్పించి ప్రదక్షిణంబు లాచరించి నమస్కరించి నుతియించిరి. తదనంతరంబ వెండియు.

51

లక్ష్మ్యాదులు శ్రీభీమేశుని స్తుతించుట

క.

సిరివాణిగౌరిసతియ, ప్సరసలరుంధతియహల్యశచిమొదలగు స
త్పరమపతివ్రత లర్చిం, చిరి దక్షారామనిలయు శ్రీభీమేశున్.

52


వ.

ఇట్లు పూజ చేసి పరమపతివ్రతలు ముకుళితకరాంబుజలై శ్రీదక్షవాటీపురాధ్యక్ష భీమేశ్వర భీమనాథ భీమశంకర భీమలింగ మహాదివ్యలింగ యవాఙ్మానసగోచర సనకసనందనసనత్కుమారసనత్సుజాతాదియోగీంద్రులు నపారంబైన నీమహిమఁ గొనియాడనేర, రటుగావున మిమ్ము స్తోత్రంబు సేయ మాబోంట్లతరంబె? నిర్గుణుండవు సగుణుండవు గుణాతీతుండవు గుణాఢ్యుండవు నీ వొక్కగుణంబున

బ్రహ్మవై సృజియింతు వొక్క గుణంబున విష్ణుండవై పాలింతు వొక్కగుణంబున రుద్రుండవై సంహరింతువు, సర్వభూతాంతరాత్మభావనా, పరమపావనా, నీవు చంద్రసూర్యాత్మదీధితివై యహోరాత్రస్వరూపంబున వర్తింతువు. పృథివ్యాపస్తేజోవాయురాకాశాది పంచభూతాత్మక జీవాత్మక స్వరూపంబున వర్తింతువు. సర్వభూతాత్మప్రవిష్టుండవు. సర్వేంద్రియగుణధారా, సర్వేంద్రియవర్జిత సర్వపర్వాత్మకరూపంబున సర్వంబు ననుభవింతువు. సర్వశక్త్యాత్మక సర్వభూతగుహాశయ యని నమోనమశ్శబ్దంబులతోడ నిన్ను శ్రుతులు సంస్తుతించు శుద్ధుండవు. బుద్ధుండవు. సుఖివి. సదానందుండవు. సదా ముక్తుండవు. మముఁబోటి కామిను లల్పబుద్ధులు మిముఁ బ్రస్తుతింపఁగలవారలా? క్షమియింపు. క్షమియింపుము. రక్షింపు రక్షింపు మగోచరచరిత్ర యగోచరబలాబల మహర్షియోగీంద్రులకు దుర్లభుండవు. సంసారి వసంసారివి. భవుండ వభవుండవు. మంగళుండ వమంగళుండవు. భుజంగభూషణా, నిన్ను నీవ యెఱుంగుదువు. సర్వాతీతుండవు. తాపసప్రియుండవు. తపోభ్యుండవు. నిజకర్మనిష్ఠులైన కర్మఠులు నిన్ను భజియింతురు. నీకుఁ బ్రణామంబులు సేయుదురు. జ్ఞానంబున నొండె నజ్ఞానంబున నొండె. నీ మహిమార్ణవంబున మునింగి దరిచేరం దెరువెఱంగక నీవే తక్క నితఃపరం బెఱుంగక మా యాత్మశుద్దికొఱకుఁ దోచినట్లు వర్ణించెదముగాని శక్తిగలిగి గాదు. దేవదేవ మహాదేవ దేవతాసార్వభౌమా దేవాదిదేవ దేవదేవేశ మహాలింగ తపోవిశేషంబునం బర్వతాత్మజ నీదేహంబున సగపాలుగొనియె. నీ దేవికి నమస్కారంబు. నీకు దండప్రణామంబు. కటాక్షింపుమని ప్రార్థించిరి. తదనంతరంబ యోసర్వమంగళా భువనేశ్వరీ సర్వమంగళదాయినీ నీకు మ్రొక్కెదము. మమ్ము రక్షింపుమని మహాదేవికిం గేలుదోయి నొసలిపయిం గీలించి యోమహాదేవ మహానుభావ శశాంకశేఖర నమస్తే నమస్తే నమః యని యనేకప్రకారంబుల స్తుతియించిన.

53


చ.

వికటజటాకుడుంగమున వెన్నెలఱేని ధరించి వీనులం
బ్రకటితనాగకుండలభరంబులు వ్రేలఁగ సుప్రసన్నుఁడై
వికవికనవ్వుచుం గరము వేడుకతో బొడచూపె భీమనా
యకుఁడు మహాపతివ్రతల కంబికతోఁ గరుణాగుణంబునన్.

54


తే.

ఇట్లు ప్రాదుర్భవించి సర్వేశ్వరుండు, వరము లెన్నేని యాపతివ్రతల కొసఁగి
యంత నంతర్హితుండయ్యె నఖిలసురులు, గానఁ గానంగ భీమలింగంబునందు.

55


వ.

అప్పుడు సమీపవర్తియగు బృహస్పతికి దివస్పతి యిట్లనియె.

56


దివస్పతి బృహస్పతిని దానములఁ గూర్చి యడుగుట

క.

దాతృత్వము దానంబును, దాతవ్యం బనఁగ నెద్ది ధర్మవిధిజ్ఞా
దాతవ్యం బెయ్యది వి, ఖ్యాతము భవ్యానుజన్మ యానతి యీవే.

57

క.

దేవతలకు బ్రాహ్మణులకు, నీవలయు పదార్థ మెద్ది యెఱిఁగింపఁదగుం
జీవా బహుదాతవ్యులు, గావున రాజులకుఁ దెలియఁగాఁ దగవగుఁబో.

58


వ.

అనిన విని వాస్తోస్పతికి గీష్పతి యిట్లనియె.

59


భూదానమహిమ

క.

పురపహూత భూమిదానము, పరమము దానములయందు బహువస్తుతతుల్
ధరిణీతలమునయందును, నిరళంబై యెపుడు నుద్భవించుటకతనన్.

60


క.

సర్వపదార్థాశయముగు, నుర్వి మహీసురుల కిచ్చు నుత్తముల కగున్
సర్వప్రదానఫలమును, గీర్వాణాధీశ యేటికి న్సంశయముల్.

61


చ.

రజతము కాంచనంబు నవరత్నములున్ వనముల్ తటాకముల్
గజతురగాదిజంతువులు గంధము పువ్వులుఁ బండ్లుఁ దేనియల్
ద్విజునకు వేఱువేఱ కడువేడుక నిచ్చుటకంటెఁ బ్రీతిఁ ద
త్ప్రజనన కారణంబగు ధరాస్థల మిచ్చుట యిచ్చు టన్నియున్.

62


తే.

ధరణి సర్వగుణోపేతధాన్యజనని, సస్యశాలిని నెవ్వాఁడు శాంతబుద్ధిఁ
బాత్రమున కిచ్చు నతనికి ధాత్రి యుండు, నంతకాలంబు సకలసౌఖ్యములు గలుగు.

63


సీ.

కృతదక్షిణంబు లగ్నిష్టోమములు వెక్కు, యజనించునట్టి పుణ్యాత్ములకును
జ్ఞానదయాసత్యసంతతవిజితేంద్రి, యత్వముల్ గురుదేవతార్చనములు
మొదలుగాఁగల పుణ్యములు సేయుధన్యుల, కధికుండు భూప్రదుం డండ్రు బుధులు
పరమపాతివ్రత్యపరిపాటి పాటించు, తరుణికంటె మహీప్రదాత పెద్ద


తే.

వాఁ డనూనగోత్రుండును వాఁడు ఘనుఁడు, వాఁడు పుణ్యగరిష్ఠుందు వాఁడు బుధుఁడు
వాఁడు విశ్రాంతిమంతుండు వాఁడు దాత, యెవ్వఁడే వేదవిప్రుని కిచ్చు ధరణి.

64


తే.

కాలమృత్యువు వెసఁదోలి కఱవ వెఱచు, నహిమరోచియు నెండగాయంగ నణఁగు
నగ్ని శంకించు నెరమంట లప్పళింప, భూమిదానం బొనర్చిన పుణ్యతముని.

65


క.

స్వామిహిత మొప్పఁగను సం, గ్రామమునన్ శరపరంపరలు పయిఁ గురియం
గా మృతిఁ బొందిన శూరుఁడు, భూమీదాతకుఁ బ్రభావమునఁ గట్టుపడున్.

66


తే.

అయిదుతరముల పూర్వులనవులమీఁద
నందఱను గాచు నూర్ధ్వలోకాలయములఁ
గమియఁబండిన వివిధసస్యములతోడి
యవనిదానంబు చేయు పుణ్యాత్మకుండు.

67


క.

అనుములు గోధూమంబులు, మినుములు సెనగలును బండు మేదిని భూదే
వున కిచ్చు నెవ్వఁ డతనికి, ననపాయస్వర్గసౌఖ్య మబ్బు మహేంద్రా.

68

ఉ.

హాటకపీఠికాధవళహర్మ్యమదావళశంఖకాహళీ
ఘోటసితాతపత్రములు క్రొత్తమెఱుంగులు వోనిభామినుల్
మేటిధనంబు వస్త్రములు మేదినియీఁగికి నెంచిచూచినం
సాటికి రావుగాన నిది సత్ఫల మభ్రమునాథవాహనా.

69


తే.

శ్వేతపక్షంబులోపలఁ బెరుఁగు నెట్లు, దినదినంబును నీహారదీప్తి దీప్తి
నవ్విధంబునఁ బెరుఁగు నిత్యాభివృద్ధి, బంటపంటకు భూదానభర్తఫలము.

70


తే.

పాతకము చేసియైనను బరితపించి, ధరణిదానంబు చేసినధన్యుఁ డడఁచు
నయ్యఘముఁ దథ్య మిది నిర్జరాధినాథ, కుబుసమూడ్చెడి మేటినాగువునుబోలె.

71


తే.

ఒకఁడు హయమేధ మొనరించు నొక్కరుండు
భూమిదానం బొనర్చు నీ పురుషులందుఁ
దారతమ్యంబు లేవండ్రు తత్త్వవిదులు
ధర్మములు రెండు నొక్కవిధంబకాన.

72


ఉ.

కాంచనకింకిణీయుతము కామగమంబుసు దేవతాప్సర
శ్చంచలలోచనానికరసంకులముం బ్రమదావహంబుపై
మించిన దివ్యయానమున మీఁదిజగంబులఁ గ్రీడ సల్పు ని
ర్వంచన భూమిదాత యగు వాఁడు పురందర పెక్కువర్షముల్.

73


క.

భూమికి సరియగు వస్తువు, భూమికి సరియైన విధియు భూమీదాన
స్వామికి సరియగు పుణ్యుఁడు, లేమికి సందియ మొకింత లేదు మహేంద్రా.

74


తే.

భూమిదానంబె దాన మంభోదగమన, సూనృతమె సారధర్మంబు సురవరేణ్య
యనృతమె పాతకంబు సహస్రనయన, తెలియఁజెప్పితి నీకు సందియము వలదు.

75

దివస్పతి శ్రీ భీమేశ్వరునకు భీమమండలంబు సమర్పించుట

వ.

అనిన విని దివస్పతి బృహస్పతిం బూజించి యతని యుపదేశంబున భక్తిశ్రద్ధాతాత్పర్యవిశ్వాసంబులు మనంబునం జనంగొన భూమీమండలంబు ససస్యంబును సోద్యానంబును సకూపంబును సతటాకంబును సపద్మాకరంబును సదక్షిణంబును సశాస్త్రోక్తంబును గా ధారాపురస్సరంబుగా శ్రీభీమేశ్వర శ్రీమన్మహాదేవునకు సమర్పించి యామహీసన్నివేశంబునకు భీమమండలంబను నామంబు గల్పించె నది యెట్లనిన.

76


ఉ.

అంబుధి మేర తూర్పునకు నబ్ధియ సీ మటు యామ్యదిగ్విభా
గంబునకుం బ్రతీచికిని గౌతమి సీమ యుదీచికిం బ్రమా
ణంబు త్రియోజనంబు సురనాథుఁడు దక్షిణకాశి భీమలిం
గంబున కేకభోగముగఁ గట్టడ చేసె వసుంధరాస్థలిన్.

77

తే.

తుల్య భాగాతరంగిణి తోడఁగూడఁ, గణ్వవాహినితోఁ గూడఁ గనకరత్న
దివ్యపరిధానసహితంబు దేవభర్త, ధరణి భీమేశ్వరున కిచ్చె ధారపోసి.

78


తే.

దాత త్రైలోక్యభర్త వృద్ధశ్రవుండు, దేయ మంభోధిగౌతమీతీరభూమి
త్రిపురవిధ్వంసనుండు ప్రతిగ్రహీత, యింత యొప్పునె పరికింప నీ సమృద్ధి.

79


వ.

ఇవ్విధంబునఁ బాకశాసనుండు పురశాసనుం డగుశ్రీభీమేశ్వర శ్రీమన్మహాదేవునకు నంగరాగాదిభోగవైభవవినోదార్థంబుగా గజాశ్వదాసదాసీగాణిక్యమాణిక్యగోధేనుసహితంబుగా భీమమండలంబు దక్షారామసమేతంబుగా సమర్పించి చాతుర్వర్ణ్యంబును రప్పించి యిట్లనియె.

80


సీ.

ఓమహాజనులార భీమమండలమహా, గ్రామఖండికభట్టి కాద్రజైక
వాస్తవ్యులార విశ్వాసపూర్వకముగా, సావధానమనస్కులై వినుండు
ప్రాగ్దిశకును యామ్యపశ్చిమంబులకును, నంభోధిగౌతము లవధిచిహ్న
లుత్తరమున మూఁడుయోజనంబుల తుద, పొలిమేర యిది చక్రవలయరేఖ


తే.

యీమహాక్షేత్ర మేను సర్వేశ్వరునకు, నిందుధరునకు దక్షవాటీశ్వరునకు
నిచ్చితిని ధారపోసి భీమేశ్వరునకు, నాసుధాకరతారకాహస్కరముగ.

81


ఆ.

ఏలుకొండ్రు మీర లేపురాంతకునకుఁ, బృథివియీగి బిడ్డ బిడ్డతరము
బ్రతుకుఁ డాశ్రయించి ఫణిరాజకుండలు, భీమనాథదేవు భూమిజనులు.

82


వ.

అని యీప్రకారంబునఁ దెల్పుడు సేయుదు.

83


చ.

సురపతి మార్గశీర్షమున శుద్ధచతుర్ధశినాఁడు రోహిణిం
బొరసిన సిద్ధయోగమున భూతలమిచ్చెఁ బయోధిగౌతముల్
గరుసుగఁ దుల్యభాగయును - గండ్రెడు లోనుగ దక్షవాటికా
వరువకు భీమనాథునకు వారవధూత్రిశతద్వయంబుతోన్.

84


వ.

ఇట్లిచ్చి ధర్మశాసనంబు వ్రాయించె నది యె ట్లనిన.

85


ఉ.

ఇప్పటి భూమిపాలురును నింకిట రాఁగల భూమిపాలురుం
దప్పకుఁడయ్య మత్ప్రవిహితస్థిరభూతలదానధర్మ మె
ల్లప్పుడు మీకు నయ్యెడుఁ జిరాయువు భాగ్యము వైభవంబుచే
నొప్పగు సుప్రతాపము సుఖోన్నతి గంధగజాదిలక్ష్మియున్.

86


వ.

అని వెండియు.

87


సీ.

కట్టించెఁ బట్టనక్ష్మావిభాగము పైఁడిఁ, గల్పించె వప్రంబుఁ గాంచనమున
మలిపించె బంగారముల దేవగృహములు, కూర్పించె నట్టిండ్లు కుందనమున
నిరించే బ్రాసాదనివహంబు గనకానఁ, బాటించె గవఁకులు హాటకమున
రచియించెఁ గార్తస్వరమున గోపురములు, కీలించెఁ గేలిదీర్ఘికలు భూరి

తే.

నాటె మందారతరువులు తోఁటలందు, వలఁతి సురభులఁ గీలారములకు నిచ్చె
బోసె సిద్ధరసంబును బుష్కరిణులఁ, గణఁక నింద్రుండు దక్షిణకాశియందు.

88


తే.

ఏకభోగంబుగాఁగ నేలేఱుగరుసు, గడలిసీమయు గౌతమీగంగమేర
కప్పురపుఁగ్రోవి కాశ్మీరఖండ మవధి, యేలె విశ్వకుటుంబి భీమేశ్వరుండు.

89


మ.

సరిసామంతుఁడు శ్రీకుమారననికాచాళుక్యభీమేశ్వరే
శ్వరదేవుం డుపకంఠబాంధవుఁడు శ్రీసంవేద్యరాడ్భైరవుం
డిరువుంబొర్వును బల్వలేశుఁడు మృకండేశుండుగా నేలె ని
ద్ధరణీమండలి భీమనాథుఁడు నిరాతంకప్రతాపోద్ధతిన్.

90


తే.

కట్టెఁ బట్టంబు యువరాజు గజముఖునికి, రాణివాసంబు తుహినాద్రిరాజతనయ
కూర్మి సైన్యాధినాథుండు గొమరసామి, యిలకుఁ బతి యైన దక్షవాటీశ్వరునకు.

91


శా.

శ్రీకంఠుండు త్రిలింగభూవలయమున్ శ్రీభీమనాథేశ్వరుం
డేకచ్ఛత్రముగా సమస్తభువనాధీశుండు పాలింపఁగాఁ
బాకోన్ముద్రితమాధవీవిచికలప్రత్యగ్రసౌరభ్యల
క్ష్మీకం బైనవసంతకాల ముదయించెన్ సౌఖ్యసంధాయియై.

92


వసంతర్తువర్ణనము

తే.

సకలదైవతమండలసార్వభౌము, దక్షిణాపథకాశికాధవునిఁ గొల్వఁ
గుసుమవిసరంబుఁ గానుకఁ గొంచు వచ్చె, నఖిలఋతుచక్రవర్తి మధ్వాగమంబు.

93


తే.

కమిచె సురపొన్న వనలక్ష్మి కబరిమీఁద, సంతరించినముత్యాలజల్లువోలెఁ
బూచె సంపెంగ లారామభూమియందుఁ, గుసుమనారాచుచిచ్చులకోటవోలె.

94


శా.

హేమంతావధిసంప్రబోధగురువుల్ హృజ్జాతతేజోగ్ని ధా
య్యామంత్రాక్షరముల్ పటీరగిరివన్యామందవాతూలముల్
వేమాఱుం గలశీతనూభవవధూవేణీభరాంతఃప్రసూ
నామోదగ్రహయాళువుల్ పొలసె దక్షారామమమధ్యంబునన్.

95


చ.

దిగదిగఁ జేరవచ్చి రతిదేవి యుపాయముఁ బొందకున్నె కై
తగవున రత్నకుండలకదంబకముం దను వేఁడిపుచ్చుకోఁ
దెగువ మనోభ వుండు తియతియ్యనిసింగిణివింటికొప్పునన్
దగిలిచె దక్షవాటి వనితాచికురంబులఁబోలు శింజినిన్.

96


తే.

పాంథనివహంబుపాలి యుత్పాతకారి, ధూమకేతువుఁబోలి పెన్దోఁటనడుమ
విరిసెఁ గ్రొవ్వారి నాగకేసరపుఁబువ్వు, మీఁదిధూమంబుభంగిఁ దుమ్మెదలు వెడలె.

97


శా.

సందుగ్ధార్ణవచంద్రమండలశిఖిజ్వాలాతటిద్వల్లరీ
కందర్పేక్షుశరాసనాచ్యుతతనూగంధర్వవంశోద్భవల్

హిందోళంబునఁ బాడి రచ్చరలు భీమేశుం ద్రిలోకాధిపున్
మందారద్రుమవాటియందు సుమనోమైరేయముల్ గ్రోలుచున్.

98


మ.

అళికోలాహలసంభ్రమంబును శుకవ్యాజృంభమున్ శారికా
కులసల్లాపములున్ విహారవిపినక్షోణీవిభాగంబునం
గల పుంస్కోకిలకంఠకోమలకుహూకారప్రపంచంబుతోఁ
దలఁపించె రతీకాంతమూలరథినీధాటీసమారంభమున్.

99


వ.

మఱియును దత్సమయంబున భువనోత్సంగమంగళాలంకారంబైన దక్షారామంబునఁ బరిసరారామంబులయందుఁ బగమపరిపాకభిదుర ఫలాపీడదాడిమీక్రోడ నీడాక్రీడచ్చిక్రోడయూధంబును, బరినమ్రతామ్రచూడ చూడాతామ్రాకిసలయామ్రేడితమదనసామ్రాజ్యపూజ్యంబును, నవకుసుమమధుపానహర్షితపుష్పతరుపుష్పితలావణ్యవిశేషంబును, వనదేవతాతాళవృంతాయమానదళనిచయరోచనామేచక మోచారణ్యంబును, బరిసరావనిరుహనినహవకులపనసనిస్రంస్యమాణశీధురసధునీజంబాలజాలవనవిభాగంబును, మదచపలచంచరీకచక్రచరణతాడనచంచలచంపకదాడిమీప్రసవమంజరీరజఃపుంజసముత్పుంజనికుంజంబును, గంధసారగిరి గంధవాహప్రవాహలహరికావిహారబహుళితభూతనూతనక్రముకకుహళీగర్భనిర్భరామోదమేదురంను నగుచు జగదాహ్లాదంబు సంపాదించుచు విజృంభించిన.

100


సీ.

కర్పూరకస్తూరికలఁ గోట నిర్మించి, కుంకుమద్రవమునఁ గొమ్మఁ దీర్చి
యగురుజంబాలంబునందు బెందడి చేసి, పన్నీటివెల్లువఁ బరిఖఁ దాల్చి
పవడంపుఁ జివుకుల గవఁకు లుత్పాదించి, తమ్మిరేకుల బోరుతలుపు లెత్తి
రత్నాంకురంబుల రంగవల్లి రచించి, పట్టుపుట్టంబులఁ బడగ లెత్తి


తే.

లలితశృంగారరచన నలంకరించి, విబుధగంధర్వు లామనివేళలందు
భీమనాథునినగరియారామరేఖఁ, బూజ చేసిరి సహకారభూరుహముల.

101


క.

కిసలయరసజిగ్రహిషా, వ్యసనాకులపికకుహూభవత్పంచమమై
కుసుమసమయావతారము, రసముంచెను జగము లంగరాగాంబునిధిన్.

102


ఉ.

జాదురజాదురంబు మృడుచర్చరిగీతులు వారుణీరపా
స్వాదమదాతిరేకములఁ జంద్రిక కాయఁగ దక్షవాటికా
వేదులమీఁదటన్ గనకవీణలు మీటుచుఁ బాడి రచ్చరల్
మోద మెలర్పఁగా భువనమోహనవిగ్రహు భీమనాథునిన్.

103


చ.

అనువగు కౌనుదీఁగె లసియాడఁ బయోధరముల్ వణంకఁగాఁ
గనకమరాళకీరకలకంఠమయూరగణాధిరూఢలై

వనితలు భీమనాయకుని వారక యేసిరి కమ్మఁదేనియల్
చినుకు పసిండిలేఁజెఱకుసింగిణివిండ్లను బుష్పబాణముల్.

104


వ.

తదనంతరంబ.

105


ఉ.

చంచలనేత్ర హేమరథసౌధశిరోగృహకూటకోటిపైఁ
గాంచనపత్రపద్మమునఁ గర్ణికమధ్యమునందు నిల్వ ని
ర్వంచన నేసె నంతఁ బరివర్తనచిత్రవిలాసలీల న
ర్తించుచుఁ బుష్పబాణముల దేవశిఖామణి భీమనాథునిన్.

106


తే.

ఆజ్ఞ వాటించెఁ గేలీవిహారములకు, భీమనాథుండు దేవతాగ్రామిణులకు
గంధకర్పూరకస్తూరికాప్రశస్తవస్తుకోటులు నొసఁగె నవారితముగ.

107


వ.

అప్పు డప్పురంబున నంగనాజనంబులు.

108


మ.

జిలుగులజెంద్రికవన్నెచేలలును గాశ్మీరాంగరాగంబులున్
వలిముత్యంబులభూషణంబులును భాస్వత్కేతకీపత్రికా
విలసద్వేణులుఁ జొక్కమై మెఱయఁగా వేల్పుంజకోరేక్షణల్
లలి భీమేశ్వరు రాజశేఖరునిఁ గొల్వ న్వచ్చి రొక్కుమ్మడిన్.

109


శా.

బీజాపూరఫలేక్షుచారుమణికుం భీమేచకేందీవరాం
భోజంబుల్ సమయాచితంబులుగ శంభుం జేరి కుంభస్థలీ
రాజార్ధాభరణంబు దక్షనగరీరామాసముత్తుంగవ
క్షోజద్వంద్వశిఖాంకురస్ఫురణఁ గైకొ న్విఘ్నరా జర్మిలిన్.

110


తే.

సానికూఁతుల పల్లవోష్ఠములఁబోలు, దాసనపుఁబువ్వుదండఁ గంధర ధరించి
పసిఁడిబుఱ్ఱటకొమ్ము చేపట్టి వచ్చె, భవునిఁ గొలువంగఁ బాతాళభైరవుండు.

111


చ.

మగఁటిమిఁ జెంద్రగుజ్జురసమంటినవామపదాంబుజంబుపై
నిగళము నాసురాసురవినిర్జితమౌ బిరుదందె ఘల్లనం
బొగడలు బొండుమల్లియలు పొన్నలు పావడచొళ్ళియంబునన్
నిగిడిచి వీరభద్రుడు చనెన్ శశిమౌళిసమీపభూమికిన్.

112


వ.

అప్పుడు బ్రహ్మాదిదేవతలును నింద్రాద్యష్టదిక్పాలకులును నందిభృంగిరిటికుంభనికుంభకుంభోదరచండీశ్వరమహాకాళప్రముఖు లగునసంఖ్యాతప్రమథులును సురగరుడోరగకిన్నరగంధర్వసిద్ధసాధ్యవిద్యాధరరాక్షసులును భూతబేతాళశాకినీడాకినీగణంబులును సమయోచితాలంకారంబులఁ గైసేసి వృషకేతునిం గొలిచియుండి రంత.

113


శా.

ప్రీత్యత్ఫుల్లనఫాలనేత్రుఁడగు శ్రీభీమేశ్వరస్వామి ని
ష్ప్రత్యూహం బగుసౌహృదంబున హరిబ్రహ్మాదులన్ భ్రూలతా

ప్రత్యుద్బోధనసంజ్ఞ చేసి కనుగిర్పం జాగె గంగోదకా
హత్యాక్షేపహృతి ప్రపంచములు దక్షారామమధ్యంబునన్.

114


సీ.

హేరాళముగఁ జల్లె నెలనాఁగ యొక్కర్తు, కుంభోదరునిమీఁదఁ గుసుమరజముఁ
గుటిలకుంతల భృంగిరిటిమోమునం దోర్తు, తాఁకించె నొసల గంధంబుఁబసుపు
పక్షంబు లక్షంచి వైచె గంధపుటుండ, వీరభద్రుని నొక్కనీరజాక్షి
చెవిలోనఁ బాఱంగఁ జిమ్మె గొజ్జఁగనీటఁ, గాలభైరవు నొక్కకలువకంటి


తే.

కొమ్మ యొక్కతె యందందఁ గొమరసామి
యౌదలలముందు జవ్వాది యసలు గలిపెఁ
బునుఁగు మణికుంభమున నించి పోసె
నొక్కపొలఁతీ విఘ్నేశ్వరుని కుండబొజ్జమీఁద.

115


ఉ.

నేతులు నూనెలం బసుపునీరునఁ గుంకుమచెందిరంబులన్
నూతనగంధసారములను న్నొనరించిరి కేలితంత్రముల్
కౌతుక మొప్ప దక్షువనికాపురవీథుల భూతకోటితో
మాతృకగోఁగు నూకసతి నుండమదేవియు ఘట్టతల్లియున్.

116


వ.

అంత.

117


తే.

మాళవీదేవి శ్రీభద్రకాళిమీఁద, బరిమళముతోడి చిఱుబంతి పసుపుఁ జల్లె
గాజుకుప్పెలఁ గస్తూరికాజలంబు, కర్ణికారాంబపై నించెఁ గర్ణమోటి.

118


ఉ.

ఘట్టతరూద్ధతిం గరిముఖంబున బీలిచి గౌతమినదిం
బుట్టిన సత్ప్రవాసహజలపూరముఁ ద్రుస్సన నూఁదుచుం బురీ
హట్టమున న్మధూత్సవవిహారము సల్పెను గౌరిదేవితో
ల్పట్టి గణేశ్వరుండు సురభామిను లోలమునం దొదుంగఁగన్.

119


మ.

ప్రమదం బింపెసలార మేనకయు రంభామంజుఘోషాతిలో
త్తమలున్ వెండియుఁ గల్గునప్సరసలుం దారాధిషోత్తంసునిన్
బ్రమయం జల్లిరి గంధసారముననుం బన్నీటఁ గాశ్మీరపం
కమునన్ సంకుమదంబునం బునుఁగునం గర్పూరఖండంబులన్.

120


తే.

అచ్యుతునిమీఁదఁ జల్లె దుగ్ధాబ్ధికన్య, భారతీదేవి పద్మజుపైన చల్లె
శచి మహేంద్రునిఁ జల్లె వసంతకేలి, గంధకర్పూరకస్తురికాజలంబు.

121


మ.

అగురుం గుంకుమధూళియుం దిమిరసంధ్యారాగసంస్పర్శముం
గగనాభోగము సంధ్యకాలముననాఁ గాన్పింప నాభంగికిం
దగియెం జుక్కలువోలెఁ దాండవగణాధ్యక్షుండు తుండంబున
న్నెగయంజల్లిన సప్తసింధుజలవేణీబిందుసందోహముల్.

122

వ.

అట్టియెడ మున్ను కిన్నరులు చల్లినఁ బెల్లు నెఱసిన ఘుసృణకుసుమకేసరధూళీపాళియు, విద్యాధరసందోహంబులు ఱువ్వినం జిందిన మన్వంపుఁ జెందిరంబును మచ్చరించి విచ్చలవిడి హెచ్చుగా నచ్చరలు చిమ్మినఁ గ్రమ్ము కుసుంభాంభఃపూరంబును, నంగనాజనంబులపై సుడిసి తడిసి యార్ద్రాంగరాగశీకరాసారవాహిని యగుగంధవాహప్రవాహంబును, ధారాళకరాళరక్తచందనాంబు సంసిక్త వసుంధరాభాగంబును, గలయం గెంపుపెంపు సంపాదింప నకాండసంధ్య నావహించిన నందుచితవ్యవహారయోగ్యంబులై పొడసూపిన యంధకారంబునుం బోలె గంధర్వకరవికీర్యమాణకస్తూరికారేణువిసరంబులవలనను, గుసుమకస్తూరికాసాంధ్యరాగాంధకారంబులకుఁ దోడై పొడచూప నేతెంచు చుక్కలచక్కదనంబునకుం దోఁబుట్టైన హయలపనాపాణిపల్లవవిక్షిప్తంబులైన పచ్చకప్పురంబు పలుకులును జెదర లంబోదరకపోలావలంబులవలన రోలంబనికురుంబంబులు నెగయుటయును బరస్పరసంవర్గార్థవశంబున వశంబులు సముధ్ధతినిగుడించు పసిండితమ్మిమొగడలు మెండునుండుటయునుఁగా మూర్తంబగు మకరకేతనభుజప్రతాపదావానలంబు ఛటచ్ఛటాశబ్దంబుల చాడ్పునఁ జెలంగుచున్న యక్షకర్దమప్రక్షిప్తలాక్షాకరండసంఘట్టనస్వనంబులవలనను, దొట్టితొట్టి యెడనెడ మడువులు గట్టిన సజ్జకపు గొజ్జంగనీరునందుఁ బ్రతిబింబించు నప్సరఃకాంతల వదనారవిందంబులలోపలం బడి తేలియాడు వాడని చేమంతిబంతులవడువునై కొలంకులు చందంబు నొందం బువ్వాని కరిగెడి కొదువతుమ్మెదకదుపులను గదిరి తొరఁగు గుహ్యకమండలీకృతపుండ్రేక్షుకోదండపృష్ణనిష్ఠ్యూతనూతనకువలయాస్త్రంబులవలనను, నిశాటకరహాటముఖనఖసముఝ్ఝితంబైన సంకుమదపంకంబువలనను, నలుదెసల నంతంత జాఱిపడియున్న కమలమృణాలకాండంబువలనను, వరంబును బదిలంబుగా నమర్చిన కేదారంబు తెఱంగుఁ దోఁచుటకు నీడైై చతురహలికుండు జల్లు పరువపు మరువంపు మొలకల చెలువునం బెల్లుడులు ప్రమథగణవిభ్రష్టవిమలహారయష్టిముక్తాఫలంబులవలనను వసంతర్త్వారంభంబు త్రిభువనదృక్ప్రియతమం బయ్యె. నయ్యవసరంబున.

123


తే.

బహుళకస్తూరికామేఘపటలమునకు, శీకరాసారమయ్యె గొజ్జెంగనీరు
వలుద వడగండ్లునయ్యె నవ్వర్షమునకుఁ, గామినులు చల్లు కర్పూరఖండవితతి.

124


వ.

ఇవ్విధంబున వసంతోత్సవం బవధరించి భీమేశ్వరుండు హరిబ్రహ్మాదిదేవతలకు నింద్రాద్యష్టదిక్పాలకులకు నరకిన్నరకింపురుషసిద్ధసాధ్యగంధర్వయక్షరాక్షసగణంబులకు భృంగిరిటికుంభనికుంభకుంభోదరవీరభద్రకుమారవిఘ్నేశ్వరనందిమహాకాళపాతాళభైరవకాళభైరవాది ప్రఖ్యాతప్రమధులకు బ్రాహ్మ్యాది మాతృవర్గంబు

లకు శక్తిచతుష్టయంబునకు శ్రీమహాలక్ష్మీసరస్వతీశచీదేవీప్రభృతి పరమపతివ్రతాతిలకంబులకు నప్సరస్త్రీలకు సముచితప్రకారంబులం గట్నంబు లిప్పించి దివ్యశ్రీ స్వయంభూత జ్యోతిర్లింగమూర్తి శక్తిసహితంబు పరమానందంబునం బొందె. ననంతరంబు సప్తర్షులు గంగాజలసప్తగోదావరీజలంబుల నభిషేకించి పూజించి భీమలింగంబు నిట్లని ప్రత్యేకంబు ప్రత్యేకంబు స్తుతియించిరి.

125


సప్తముని స్తోత్రము

తే.

వేయుముఖములుగల కాద్రవేయవిభుఁడు
నెఱయశక్తుండు గాఁడఁట నిన్నుఁ బొగడ
నేకముఖమునఁ బొగడంగ నెట్లు నేర్తు
నిన్ను శ్రీదక్షవాటికా నీలకంఠ.

126


క.

మిహిరలవంబులఁ దారా, గ్రహనక్షత్రముల వచ్చు గణుతింప భవ
న్మహిమార్ణవగుణరత్నము, లహికంకణ యెవరికైన నలవియె పొగడన్.

127


తే.

అధికమైన తపంబు మూల్యంబుగాఁగ, నర్ధదేహంబు గౌరికి నలముకొన్న
జాణ దేవర నిను నాత్మ సంస్తుతింతు, దక్షిణాపథకాశికాధామ భీమ.

128


క.

ఎవ్వని కిరీటమునకుం, బువ్వై కడు నొప్పు నన్నభోవాహిని లే
జవ్వనపుఁదుహినరుచితో, నవ్వేలుపు భీమనాథు నభివర్ణింతున్.

129


క.

అర్ధకపాలము కేలను, నర్ధనిశాసార్వభౌముఁ డౌదల నెడమన్
అర్ధాంగలక్ష్మి గౌరియు, వర్ధిల్లఁగ నొప్పు భక్తవత్సలుఁ గొలుతున్.

130


క.

సాధారణమతి సహజత, పోధనుఁగాఁ దలఁచి రతివిభుం డెవ్వనిదృ
క్క్రోధాగ్నికి నింధనమగు, నాధూర్జటి నహరహంబు నభివర్ణింతున్.

131


క.

అస్తంగమితసురద్విష, హస్తన్యస్తత్రిశూలు నంతర్విధి సం
విస్తృతవిజ్ఞానోదయుఁ, గస్తూరీసదృశనీలకంఠుని దలఁతున్.

132


తే.

విశ్వునకు శాశ్వతునకు విశ్వేశ్వరునకు, విశ్వరూపాత్మకునకు మహేశ్వరునకు
శ్రీస్వయంభూమహాసుధాసిద్ధలింగ, భీమనాథేశ్వరునకు నర్పింతు మనసు.

133


తే.

భీమ భీమేశ్వరేశ్వర భీమనాథ, భవ భవారణ్యపావక భవ్యమూర్తి
భర్గ ఫాలాక్షు భసితాంగ ఫణివిభూష, శిఖిశిఖాభాసమాన భజింతు నిన్ను.

134


తే.

శర్వు సర్వేశ్వరేశ్వరు సర్వవంద్యు, శర్వు సర్వప్రదాయకు సర్వధాత
శర్వు సర్వంసహామహీచక్రధరుని, శర్వు వర్ణింతు దేవతాసార్వభౌము.

135


శా.

వేదాతీతుని వేదవేద్యుని శివున్ వేదాంతవేద్యున్ భవున్
వేదాంతోపనిషద్రహస్యముఁ జతుర్వేదీవిహారాలయున్

వేదాంగాదిపురాణముఖ్యవిలసతిద్వేద్యాగమప్రక్రియా
వేది న్నిన్ను భజంతు నెమ్మనమునన్ విశ్వేశ భీమేశ్వరా.

136


క.

కామేశ్వరు నీశ్వరునిం, గామితఫలదానకల్పకముఁ గామరిపున్
గామాతీతుని దేవ, గ్రామణి నిను నాశ్రయింతు గౌరీరమణా.

137


క.

ఆనందజ్యోతినిఁ బర, మానందానందమూర్తి నవ్యయునిఁ ద్రిలో
కానందామృతదాయి మ,హానందుని వృషభవాహు నభివర్ణింతున్.

138


సీ.

ఓమహాలింగ యో మహాదేవుండ, యోమహాత్ముండ దేవ యోమహేశ
యోమహాసంపత్ప్రయోగదీక్షాదక్ష, యోమహాపాపేంధ నౌఘదహన
నీమూర్తిసంస్మృతి నీనామసంస్మృతి, నీకధాశ్రవణంబు నిఖిలదురిత
యూథాంధకారసూర్యోదయం బఖిలక, ల్యాణనికాయసంప్రాప్తిహేతు


తే.

వంబికాకుచకుంభద్వయాంగరాగ, పరిమళాసారవాసిత బాహుమధ్య
దక్షిణాపథకాశకాంతర్విహార, గిరిశ శ్రీభీమనాథ రక్షింపు మమ్ము.

139


వ.

అని సప్తఋషులు సంస్తుతించిరి. తదనంతరంబ యరుంధతీదేవియు హంసవాహనపశుసఖిచండికాపరిచారికాసముదయంబును ననేకప్రకారంబుల బ్రశంసించి యథాశక్తిం బూజించిరి.

140


క.

ఈ సప్తమునిస్తోత్రము, వ్రాసినఁ జదివినను వినిన వర్ణించినఁ గై
లాసపతి దక్షవాటిని, వాసుఁడు జనులకు నభీష్టవరము లొసంగున్.

141


వ.

అనిన విని మంకణుండు మునీంద్రా సదాశివభక్తిమాహాత్మ్యం బింకను నా కెఱింగిం
పవే యని యడుగుటయు వసిష్ఠమునీంద్రుం డిట్లనియె.

142


గీ.

కల్పవృక్షం బదేటికిఁ గామధేను, సముదయం బేల యిష్టార్థసంపదలకు
నిశ్చయంబుగ మనసులో నిల్చెనేని, చాలదా మర్త్యు రక్షింప శంభుభక్తి.

143


గీ.

శంభుపదభక్తులకు వినాశంబు లేదు, కదియ వీశానుభక్తుల గల్మషములు
నాదియందుఁ బ్రతిజ్ఞగా నానతిచ్చెఁ, జంద్రచూడుండు నిజభక్తజనముఁగూర్చి.

144


సీ.

భోగీంద్రభూషణు భూతిదిగ్ధాంగుని, నాభీలశూలాయుధాగ్రహస్తుఁ
గాకోలవిషనీలకంధరాభాగుని, గజచర్మపరిధానకటివిభాగుఁ
దాండవాడంబరోద్దండదివ్యాకారు, నజవిష్ణువిబుధాధిపాభివంద్యు
గంగాతరంగసంకలితోత్తమాంగునిఁ, ద్రైలోక్యరక్షాప్రతిదానదక్షు


తే.

నీకు నాకారునొండె నొం డేవిభూతి, పతినిరాకారుఁగాఁ జూచి బహువిధములఁ
బూజ సేయంగ నేర్చిన పుణ్యమతులు, వారు శివభక్తులందు రివ్వసుధలోన.

145


క.

శివధనము మ్రుచ్చిలించిన, శివధన మన్యాయవృత్తిఁ జెడిపోవంగాఁ
దవులక యుపేక్ష చేసిన, శివభక్తి ద్రోహమండ్రు శివభక్తివిదుల్.

146

గీ.

శివునికై భిక్ష చేసి యార్జించినట్టి, ద్రవ్య మావంతయేనియుఁ దా స్పృశింప
కభవునకు నెవ్వఁ డొనరించు నర్పణంబు, వాఁడు శివభక్తముఖ్యుండు వసుధలోన.

147


క.

మాటలు వేయును నేటికి, హాటకధాన్యాదిశివపదార్థములయెడం
జేటున కోర్వమి తుదిఁ బరి, పాటించిన శంభుభక్తిపథము మునీంద్రా.

148


సీ.

మహనీయసంప్రీతి మద్భక్తజనముల, నాదరించుచునుండు నతఁ డొకండు
ఫలములుఁ బక్వాన్నములు మాకు నర్పింప, కనుభవింపయుండు నతఁ డొకండు
పంచాక్షరీమంత్రపాఠంబు నిత్యంబు, నాచరించుచునుండు నతఁ డొకండు
ననుఁ బ్రస్తుతించు నానాపురాణంబులు, సతత మావర్తించు నతఁ డొకండు


తే.

శిలలఁ గాష్ఠంబులను మృత్తికలను నిసుక
లింగముల లెస్సగాఁగఁ గల్పించి భక్తి
నర్చనము సేయు నతఁ డొకం డనుచుఁ జెప్పు
శివుఁడు భక్తవిమర్శను చేయునపుడు.

149


వ.

అదియునుంగాక రాగద్వేషఝషసంకులంబును గామక్రోధలోభమోహమదమాత్సర్యమహాగ్రాహాకులంబును బుణ్యపాపతోయమహాప్రవాహంబును నైన యీసంసారమహాంభోరాశియందుఁ గర్మచోదితము లైనజంతువులు మునుంగుచుఁ దేలుచుం గొంతతడవు సుఖంబును గొంతతడవు దుఃఖంబును ననుభవించుచునుండును. కలియుగంబున శివభక్తి యుత్సన్నంబై యుండు.

150


గీ.

అతివిశుద్ధాత్మ! చతురంఘ్రి గృతయుగమునఁ
ద్రేతఁ బాదత్రయమున వర్తించుచుండి
ద్వాపరంబునయందుఁ బాదములు రెంట
నెలయు శివభక్తి యొకకాలఁ గలియుగమున.

151


గీ.

కలియుగంబున ధర్మంబు కఱవుగాన, నందు ధర్మంబుఁ జేసిన యతఁడు ఘనుఁడు
నిండువేసవి మరుభూమి నిర్మలముగఁ, బేర్మి సలిలాన్నసత్రంబుఁ బెట్టినట్లు.

152


వ.

అని మఱియు నొకప్రశ్నంబు చెప్పెదఁ బూర్వకాలంబున.

153


గీ.

అభవు నొకనాఁడు ప్రార్థించి యడిగె గౌరి, కలియుగంబున శివభక్తి గ్రాఁగిపోవు
నఖిలలోకహితంబుగా నానతిమ్ము, భక్తివిజ్ఞానయోగంబు ఫాలనయన.

154


వ.

అని భవాని విన్నవించిన మహేశ్వరుండు.

155


గౌరికి మహేశ్వరుండు భక్తివిజ్ఞానయోగంబుఁ జెప్పుట

గీ.

అడుగవలసినయర్థంబ యడిగి తీవు, క్రాఁగియుండెడు శివభక్తి కలియుగమునఁ
బాపకర్ముఁడకాని యెప్పాట లేఁడు, పుణ్యకర్ముఁడు వికసితాంభోజనయన.

156

సీ.

ఎప్పుడు కలియుగం బేతెంచుఁ గ్రమవృత్తిఁ, బాపంబు లన్నియుఁ బ్రబలుచుండుఁ
బాపంబు లొకభంగి బ్రక్షయంబొందిన, నామీఁద దృఢభక్తి నాటుకొనును
నామీద దృఢభక్తి నాటుకొన్నప్పుడు, ధర్మంబు వర్తించుఁ దరతరంబు
ధర్మంబు వృద్ధిఁబొందఁగఁ జిత్తమునఁ బట్టు, లింగార్చనావిధి మంగళంబు


గీ.

అంతట విభూతి యలఁదంగ నాసపుట్టు, నంతమీఁదటఁ గల్గు రుద్రాక్షకలన
పాశుపత మటమీఁదను బదిలపడును, ముక్తిలతికకు నదిగదా మూలదుంప.

157


వ.

మఱియు నొక్కటి చెప్పెద సదాచారనిరతు లైనబ్రహ్మక్షత్రియవైశ్యులును ద్రైవర్ణ్యశుశ్రూషాపరులై సత్యవాదు లైనశూద్రులును బతివ్రత లైనపుణ్యస్త్రీలును నాత్మదర్శనంబునకు నధికారులు విశేషించి.

158


గీ.

రాగవైషమ్యములు లేక ప్రజ్ఞ గలిగి, మనములోన విరక్తి యెవ్వనికిఁ గలుగు
వాఁడె యధికారి బ్రహ్మకైవల్యమునకు, వీడువాఁ డని కులశుద్ధి వెదుకవలదు.

159


సీ.

బహుజన్మసంశుద్ధి భాగ్యసంపదఁగాని, యోగవిద్యాశక్తి నూన దాత్మ
యోగసామగ్రికి నుచితసాధనములు, వాయుమార్గవిశుద్ధవర్తనములు
నాడిపరంపరాక్రోడవాయుజయంబు, బలము చేతస్స్థితి భాగ్యమునకుఁ
జిత్తంబు తనయాజ్ఞ చేసి వర్తించెనే, నిట్ట ట్టనఁగఁజాల వింద్రియములు


గీ.

యమనియమములు నాసనప్రాణనియతి
ధ్యానమును ధారణంబుఁ బ్రత్యాహృతంబు
ననసమాధియునాఁగ నష్టాంగకలన
బ్రహ్మయోగంబు విలసిల్లుఁ బద్మనేత్ర.

160


గీ.

దేవి! సద్గురునాథోపదిష్టసరణి, మనుజుఁ డష్టాంగయోగంబు ననువుపఱిచి
యంత నద్వైతభక్తిఁ గృతార్థుఁ డగుచు, నన్నుఁ గని ఘోరభవబంధనంబుఁ బాయు.

161


వ.

రజ్జుజ్ఞానంబున సర్పభ్రాంతి నివృత్తి యగుచందంబున యోగంబున నన్ను నాత్మం గనుకారణంబున నవిద్యానివృత్తి యగు ననినఁ గృతాంజలియై త్రిపురహర! యోగం బెయ్యది? బ్రహ్మజ్ఞానం బెయ్యుది? యానతీవే యనుటయు.

162


గీ.

శమము దమము తపంబును శ్రద్ధ తాల్మి
మఱి సమాధాన మనఁగ నిర్మలవివేక
సాధనము లాఱుదెరువులు సంఘటిల్లు
మోక్షమున కండ్రు నిగమార్థమూలవిదులు.

163


గీ.

బలిమి నింద్రియంబులఁ బట్టి తెచ్చు, నది సుమీ యిందువదన ప్రత్యాహరణము
సర్వసంసారదుఃఖప్రశాంతిహేతు, వేకచిత్తప్రకారంబు నిదియ సూవె.

164


వ.

ధ్యానంబు సాకారనిరాకారంబులు సూవె.

165

గీ.

నిర్గుణుని నిత్యశుద్ధుని నిర్వికారు, నాత్మఁ గనుట నిరాకార మనఁగఁ బరఁగు
శేషనదిచంద్రరేఖాదిచిహ్నధారి, ననుఁ దలంచుట సాకార మనఁగ వెలయు.

166


క.

గురుఁడే యభవుఁ డభవుఁడే, గురుఁడని యభవునకు గురునకును భేద మెదం
బరికింపని శిష్యున కే, గురుఁడ నభవుఁడనయి వానికోర్కులు దీర్తున్.

167


గీ.

రాజసము మాని శిష్యుండు ప్రకటభక్తి
గురునిఁ గొలువంగఁ దగు రాజుఁ గొలిచినట్లు
వినయ మొప్పంగ నిశ్శోకవృత్తి సౌఖ్య
నిభృతుఁ డందుఁ ద్రివర్గంబు నీరజాక్షి.

168


గీ.

సర్వభూతములందును సమతఁ బూని, సత్త్వవిదుఁడయి యెవ్వాఁడు సంచరించు
నతఁడు శివభక్తుఁ డాతని నాదరింతు, నెట్టివేళలయందుఁ బూర్ణేందువదన.

169


సీ.

పాపంబు పుణ్యంబు పాథఃప్రపూరంబు, దుర్వారమైనట్టి దుఃఖ మడుసు
కాంతాదిసుఖము సైకతవేదికాస్థలి, కందర్పవికృతులు కరడములును
బ్రాణభయంబు నక్రకుళీరనివహముల్, చేతోవికారముల్ క్షితిధరములు
బహుళదారిద్ర్యంబు బడబాగ్నిపిండంబు, విషయాభిలాషంబు విషముగాఁగ


గీ.

సమధికం బైనసంసారజలధియందు, మునుఁగుచును దేలుచును గడముట్టఁబడని
జనుల కెల్లను మత్పాదసరసిజములు, తెప్పయై యుద్ధరించు నిందీవరాణి.

170


క.

కామక్రోధావేశ, వ్యామోహాదుల నిజాన్వయాచారంబుల్
వైముఖ్యము నొందించుచుఁ, బామరసంసారజలధిఁ బడుదురు కుమతుల్.

171


క.

సుఖములు దుఃఖంబులుగా, సుఖములుగా దుఃఖములను జూతురు కుమతుల్
సుఖదుఃఖసమతఁ జూచిన , నఖిలభవాంభోధిఁ గడుతు రంబుజవదనా.

172


సీ.

మనసుఁ గామక్రోధమదలోభముల కిచ్చి, సడలింరు రన్వయాచారసరణి
నన్వయాచారంబు లట్లు మాసి చనంగ, వర్తింతు రన్యాయవర్తనమున
నన్యాయవర్తనం బది కారణముగాఁగఁ, బడిమునుంగుదు రుగ్రభవపయోధి
భవపయోనిధిలోనఁ బడియుండి కాంతురు, నరకకూపమున నున్మజ్జనంబు


గీ.

నిరయమునఁ బెద్దకాలంబు నికృతిఁ బొంది, యిలకు వచ్చి జనింతురు హీనజాతి
హీనజాతి జనించి పాపానువృత్తి, బాపు లగుచుండు రట నధఃపాతమునను.

173


గీ.

ఎట్టిహీనాత్మునకునైన నేన శరణ, మెట్టిపుణ్యాత్మునకునైన నేన దిక్కు
నన్ను వర్ణింపమేలు మానవుల కెందు, సత్య మిది నమ్ము హిమధామచారువదన.

174


వ.

అనిన విని భవాని యెద్దాని నెఱింగి భవార్ణవంబువలన నిర్ముక్తులై పురాతనయోగీంద్రులు సనకసనందనసనత్కుమారసనత్సుజాతాదులు నిశ్శ్రేయసంబు నొంది రమ్మహాజ్ఞానంబు సవిస్తరంబుగా నానతిమ్మనిన నమ్మహాదేవుం డిట్లనియె.

175

మాలిని.

శమదపరినిష్ణా, సర్వభూతానుకంపా
సమనిగమనివృత్తి జ్ఞానవృత్తిప్రశాంతుల్
కమలదళనిభాక్షీ కల్గినన్ గల్గు గట్టి నయ్యు
త్తమునకుఁ జిరకాలస్థాయికైవల్యముల్.

176


గీ.

చిత్తమునఁ దుష్టియును నతుష్టియును లేక
యొడలిలో నన్యుగృహమందు నున్నభంగి
నిస్పృహుండయి యుండంగ నేర్చెనేని
యతఁడు ముక్తుండు పద్మపత్రాయతాక్షి.

177


గీ.

అవనిగగనాగ్నివాయుజలాదులైన
ప్రకృతిసంభూతముల వికారములఁ బాసి
యున్న నామూర్తి బొడఁగాన నొప్పునేని
కతఁడు ముక్తుండు సుమ్ము హైమాద్రితనయ.

178


వ.

నిత్యానిత్యవివేకుండును నీషణత్రయవిరహితుండును సమాధిషట్కసంపన్నుండును నంతంరిషడ్వర్గవివర్జితుండును నగువాఁడు ముముక్షుండు.

179


గీ.

తత్పదార్థంబు పరమాత్మ తలిరుఁబోణి, త్వంపదార్థంబు జీవుండు తలఁచిచూడఁ
దత్త్వమారయ వేదసూత్రంబులోని, యర్థ మది చిత్తమందు నీ వలవరింపు.

180


గీ.

ప్రత్యభిజ్ఞాన మనియెడి ప్రత్యయమున, విశ్రుతంబైన యాత్మ భావింపవలయుఁ
బెద్దకాలంబునకు గన్న ప్రియవయస్యు, నానవాల్పట్టి తెలిసిన యట్లవోలె.

181


గీ.

త్రాడుఁ జూచి భ్రాంతి దందశూకంబని, యాత్మవలనఁ దలఁచి నట్లవోలె
వేదశాస్త్రజనితవిజ్ఞానబలమున, దెలివి వడసి యాత్మఁ దెలియవలయు.

182


వ.

నిత్యంబు సర్వగతంబు కూటస్థం బేకంబు దోషవర్జితంబు భ్రాంతివశంబున భిన్నంబై తోఁచు, ఘటాకాశంబు మహాకాశంబు భిన్నంబుగా నేర్చునే? జీవేశ్వరులకు భేదం బెక్కడిది? పృథివ్యాపస్తేజోవాయురాకాశంబులు శబ్దస్పర్శరూపరసగంధంబులు మాయాసంసారప్రపంచంబు లేను సదా సాక్షిస్వరూపకుండనైన జీవుండనని సమాధినిష్ఠు లైనపెద్దలు తెలిసికొని పరమనిర్వృతి ననుభవింతురు.

183


సీ.

ప్రణవాత్మవర్ణరూపస్పర్శనామూర్తి, ప్రణవంబు మూఁడక్షరములు గలది
యది పరబ్రహ్మ మేకాక్షరంబున నొప్పు, నది ఋగ్యజుస్సామమందు నిలిచె
ననులోమకము లుదాత్తాదిస్వరములు కా, లంబులు వర్ణత్రయంబు లవియు
వర్ణత్రయంబు సర్వంబు నంతర్భావ, మొందుట యది యేమి సందియంబు


గీ.

గతినకార ముకార మకారములను, నాత్మమాయను జీవాత్మ నాటుకొల్పి
జీవు నీశ్వరబుద్ధి భజింపవలయు, ధృతి దఱుఁగనీక యెప్పుడు మతివివేక.

184

సీ.

చైతన్య మెప్పుడు సర్వంబుఁ దానయై, విలసిల్లుచుండు నవ్వేళఁ గాని
విశ్వభూతములను వీక్షించుఁ దనయందుఁ, బరిపాటి నెప్పుడప్పాటఁ గాని
సకలభూతములకు సంతసంబునుఁ బొంది, యెపుడు నర్తించుఁ దా నపుడు గాని
యఖిలలోకములకు నధ్యక్షుఁ డైనను, నధ్యక్షుఁ డెప్పుడయ్యదనఁ గాని


గీ.

తన్నుఁ గేవలమాత్మగాఁ దలఁచి యిష్ట, మతిశయము దృఢముగఁ జూచునపుడు గాని
జన్మదుఃఖజరావ్యాధిశాంతికరము, బ్రహ్మవిజ్ఞాన మూరక పట్టువడదు.

185


గీ.

జ్ఞానసంపదఁగాని మోక్షంబు లేదు, కర్మశతమున నేని యో నిర్మలాత్మ!
జ్ఞానమనఁగ వేదాంతవిజ్ఞాన మబల!, యితరవిజ్ఞాన మజ్ఞాన మెంచి చూడ.

186


క.

జ్ఞానాభ్యాసం బల్పంబైన మహాపాతకముల హరియించును గం
జానన! దీపంబించుక, యైనను హరియించుఁ గాదె యంధతమంబుల్.

187


గీ.

వహ్ని సందీప్తమై మహాననమునందు సరసనీరసతరుల భస్మంబు సేయు
బ్రహ్మవిజ్ఞానమును నట్ల ప్రజ్వరిల్లి, శుభము నశుభము నొకటిగా సుడిసికాల్చు.

188


గీ.

జలజపత్రంబు తనమీఁదఁ జల్లియున్న, యుదకబిందులతోఁ గూడకున్నయట్లు
బ్రహ్మవిజ్ఞాని తనమీఁదఁ బడినయట్టి, విషయమలమునఁ బడకుండు విమలచరిత.

189


గీ.

భక్షితం బైనవిష మెల్లఁ గుక్షి నఱుగు, విమలమణిమూలమంత్రౌషధములచేత
ననుభవించినవిషయంబు లట్లయఱుగు, బ్రహ్మవిజ్ఞానమునఁ జేసి పరవ మునికి.

190


శా.

పూవుంబోణి! విశాలలక్ష్మి గనుచుం బుష్పంబు మూర్కొంచు వీ
ణావాద్యంబులు వించు నిష్టమధురాన్నం బర్థి సేవించుచు
న్వేవేభంగుల నిల్చుచు న్నడచుచు న్నిద్రించుచో యీశ్వరా!
నీవే కర్తవు సు మ్మటన్న పురుషు న్వేధింప వేదోషముల్.

191


గీ.

జ్ఞానవైరాగ్యసంపన్నుఁ డయిన పెద్ద, నెఱుఁగలేక యపహసించు నెవ్వఁడేని
వాఁడు గాల్పంగఁబడుఁ దీవ్రవహ్నిశిఖల, రౌరవాదికఘోరనారకములందు.

192


సీ.

సజ్జనుండైన దుర్జనుఁడైన మూర్ఖైనఁ, బండితుఁడైన నాతండె ఘనుఁడు
నిరపేక్షుఁ డాతండు నిర్వైరు డాతండు, సమదృష్టి యాతండు శాంతుఁ డతఁడు
రా జిలజనులచేఁ బూజఁ గైకొనుమాడ్కి, నతఁడు దేవతలచే నర్చఁ గాంచు
నతని పాదాబ్జంబు లంటిన భూభాగ, మఖలతీర్థములకు నభ్యధికము


గీ.

వానిజన్మంబు జన్మ మవ్వాఁడు సుకృతి, వాఁడు ద్రొక్కినయి ల్లిల్లు వాఁడు దైవ
మేకొఱంతయు లేకుండు నింతి! యెఱుఁగు, బ్రహ్మవిజ్ఞానమయశీలి భాగ్యశాలి.

193


గీ.

ఎవ్వనింటికి బ్రహ్మజ్ఞుఁ డేగుదెంచు , బ్రియముఁ గారుణ్యమును గల్గి భిక్షగొనఁగ
వానిఁ బితృదేవతలు హర్షవైభవమునఁ, బొగడుదురు కేలివర్తనాభోగకముగ.

194

క.

అనుభవపర్యంతం బె,వ్వనిచిత్తము తత్త్వవీథి నర్తించు మహా
త్ముని నాతనిఁ బొడఁగను స, జ్జనులకు నాక్షణమ కిల్బిషంబు లడంగున్.

195


గీ.

అన్వయము పావనంబు కృతార్థుఁడతఁడు, పుణ్యవతి వార్ధి వేష్టితభూతధాత్రి
జెలఁగియోలాడు నెవ్వనిచిత్తవృత్తి, సచ్చిదానందమయసుధాసాగరమున.

196


గీ.

శ్రద్ధ గురుభక్తి విశ్వాససౌష్ఠవంబు, జరిగెనేఁ గల్గు వేదాంతసంగ్రహంబు
జరగదా లేదుసత్యంబు సత్య మిదియు, బహువిధోక్తులపనయింపు బ్రహ్మమిదియు.

197


వ.

ఈ యర్థంబులు దేవతాగురువిశ్వాసంబులు గలవారికిఁగాని ప్రకాశింపవని భవానికి భవుఁ డుపదేశించె నని మంకణునకు వసిష్టుండు చెప్పెనని శౌనకాది మహామునులకు సూతుండు వివరించె.

198


శా.

ఆకల్పస్థిరధర్మవైభవ! దిశాహర్మ్యాగ్రసంస్థాపితా
స్తోకస్ఫాటికకుంభవిభ్రమధురాశుంభద్యశోమండలా!
రాకాచంద్రమసోవిరాజ నవభద్రా! వీరభద్రేశ్వర
క్ష్మాకాంతాగ్రజ వేమభూధవకృపాసంవర్ధితప్రాభవా.

199


క.

లింగనమంత్రి సహోదర, గంగాధరదివ్యచరణకమలనివాసా
భంగాపరతంత్ర! సము, ద్రంగార్జున! యిందుధరధరాధరధీరా.

200


మాలిని.

రవినిభశుభతేజా రామమాంబాతనూజా
దివిజగురుచరిత్రా దేవయామాత్యపుత్రా
భువనభవనకీర్తీ పుష్పకోదండమూర్తీ
ప్రవిమలగుణసంగా రాయవేశ్యాభుజంగా.

201


గద్య.

ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయప్రణీతం బైనశ్రీభీమేశ్వరపురాణం బనుమహాప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము.