భీమేశ్వరపురాణము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరామాయనమః
శ్రీమహా గణాధిపతయేనమః
శ్రీ మాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః

శ్రీ భీమేశ్వరపురాణము

చతుర్థాశ్వాసము

శ్రీధామ యశేషదిశా
సౌధాగ్రస్ఫటికకుంభసంభారకళా
సాధీయస్స్థితకీర్తిబు
ధాధార యరేటియన్నయామాత్యమణీ.

1


వ.

అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె.

2


గీ.

బాదరాయణునకుఁ గుంభభవుఁడు చెప్పి
నట్టి యాత్రాక్రమం బిది యనఘులార
యమరముని నారదుఁడు మునీంద్రాదులకును
నర్థిఁ జెప్పినపరిపాటి యది వినుండు.

3


వ.

మీర లడిగినయర్థంబుఁ బర్యాయక్రమంబున వినిపించెద.

4


తే.

పోయె వారణాశికి బాదరాయణుండు, శిష్యులును దాను గైవల్యసిద్ధిఁ గోరి
మనము పోదము గాకంచు మనసు వేడ్క,నరిగి రభ్యర్హితులు వసిష్ఠాదిమునులు.

5


క.

యాత్రాజిగీషఁ బుణ్య, క్షేత్రంబులమీఁదఁ దీర్ఘసేవాపరులై
మైత్రావరుణబృహస్ప, త్యత్రిభరద్వాజముఖ్యు లగుమునిఋషభుల్.

6


ఉ.

కాశీకి నేగుదెంచి మణికర్ణికయందుఁ బ్రయాగయందు నా
కాశనదీ ప్రవాహమునఁ గాయము దొప్పగఁ దోఁగి శంభు వి
శ్వేశు శశాంకశేఖరు ననేకవిధంబులఁ గొల్చి సంతత
క్లేశవినాశహేతువునఁ గేవలతానుఖ మిచ్చఁ గోరుచున్.

7


క.

కేవలతాయకరంబును, భావలతావాటిమలయపవనాగమమై
కేవలతాలీలావతి, కే వల తాకాశి మరగు కృతమతి మనసా.

8


వ.

అని కాశీనగరంబునందుఁ గైవల్యాపేక్షఁ బెద్దగాలం బుండ నిశ్చయించి సాత్యవతేయు వెదకి యెచ్చటం గానక.

9

శా.

కాశీస్థాననివాసులన్ యతులభిక్షావృత్తులం గాంచి పా
రాశర్యుం డెటఁ బోయె నంచు నడుగం బ్రహ్మావిహీనాత్మకుం
డాశుంకుం డెటఁబోయెనో యెఱుఁగ మయ్యా మీరు పోపొండు వి
శ్వేశద్రోహి నెఱుంగ నేమిపని వాఁ డెచ్చోటికిం బోయెనో.

10


వ.

అని సత్యవతేయుండు చేసిన యపరాధంబు తేటపడం జెప్పిన.

11


తే.

కూడు పెట్టక యెన్నాళ్లు కుతిలపఱచి, గాసిసేయుట యిది తప్పు గాదె తనకు
నెదురు కదు రేల కోపించె నిందుధరుఁడు , అకట గ్రుడ్డెఱ్ఱ బాదరాయణునిమీఁద.

12


క.

ద్వైపాయనముని వెడలం, ద్రోపించిన కోపగాఁడు ధూర్జటి యీకా
శీపతి మనలను ననుకం, పాపరుఁడై యిచట నేల బ్రతుకఁగ నిచ్చున్.

13


వ.

కృష్ణద్వైపాయనుతోడిద లోకంబు గాక యనుచు నమ్మునిలోకంబు కాశికానగరంబు వెలువడి శాఖోపశాఖల నతని చొప్పుపట్టికొని దక్షారామంబు ప్రవేశించి.

14


తే.

తీర్థయాత్రాక్రమంబులు తెలియలేక, నారదుండు నానాపురాణజ్ఞుఁ డగుట
నతనిఁ బూజించి యందఱు నడిగి రప్పు, డత్రిజమదగ్నిభృగువసిష్ఠాదిమునులు.

15


మత్తకోకిలము.

నీ వెఱుంగనితీర్థముల్ ధరణీతలంబున లేవు స
ద్భావ మొప్పఁగఁ జెప్పు దైవత, తాపసోత్తమ తీర్థయా
త్రావిధానము దక్షవాటికథాక్రమంబును సప్తగో
దావరప్రథిమంబు భీమసదాశివోద్భవు లీలయున్.

16


వ.

అని యడిగిన నారదుం డిట్లనియె.

17


తే.

అఖిలతీర్థోత్తమోత్తమం బనఘులార, పావనం బైనసప్తగోదావరంబు
తనకుఁదాన మహానదీతటమునందు, నెలమినున్నాఁడు భీమేశ్వరేశ్వరుండు.

18


తే.

సప్తగోదావరంబు నిర్ఝరమనంగ భీమనాథేశ్వరస్వామి వేలుపనఁగ
ధర్మపరులార శబ్దభేదంబ గాని, యర్థభేదంబు లేడు పదార్థసరణి.

19


తే.

విమలమతి సప్తగోదావరమునఁ గ్రుంకి, సప్తసప్తిప్రతిష్ఠఁ బ్రసన్నుఁడైన
భీమనాథేశ్వరేశ్వరస్వామిఁ జూచు, మనుజులకుఁ బాయు సప్తజన్మములయఘము.

20


వ.

సప్తగోదావరస్నానమంత్రద్వయశ్లోకములు.

21


శ్లో.

సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమమ్
అత్రసన్నిహితో రుద్రో భీమనాథేశ్వరేశ్వరః.

22


శ్లో.

నమస్తే భీమనాథాయ, సప్తగోదావరాంభసే
పాపేంధనాగ్నయేతుభ్యం, నిమజ్జామి హర త్వయి.

23


ఉ.

ఆతతభక్తిభావమున నాదియుగంబున సప్తసంయము
ల్గౌతమముఖ్యు లైందవకళాధరు భీమయదేవు భక్తివి

స్ఫీతిఁ బ్రతిష్ఠ చేసి యభిషేకజలార్థము తోడితెచ్చి ర
న్వీతసమస్తతీర్థమయి విశ్రుతి కెక్కిన సప్తసింధువున్.

24


మ.

తనతీరంబునఁ బాయకున్న దనపాథ:పూరముల్ గ్రోలినం
దనవీచీతతిఁ దేలినం దనమరుద్వ్రాతంబు సేవించినం
దనుఁగీర్తించిన లోకపావనునిఁగా ధన్యాత్ముఁగాఁ బుణ్యుఁగా
నొనరించున్ నరు సప్తసింధు వది యంహోభంజనప్రౌఢిమన్.

25


క.

చూడుం డాస్వాదింపుం, డాడుఁడు భీమేశ్వరేశ్వరాకృతిఁ దటినీ
చూడారత్నము జడధి, క్రోడాభరణంబు సప్తగోదావరమున్.

26


సీ.

పాతాళశ్రీకాలభైరవస్వామికి, నందికి నభివాదనం బొనర్చి
నాకులేశ్వరదేవునకుఁ దాండవాకార, గణనాయకునకును బ్రణతి చేసి
కొమరసామిని విష్ణుఁ గొల్చి విరూపాక్షు, నాగేంద్రులకు వందనంబు నడిపి
నీహారగిరినందనికి మహాలింగంబు, భీమనాథేశ్వరస్వామి కెరఁగి


తే.

మర్త్యుఁ డేకాదశేంద్రియమదవికార, సంభృతములై యనన్యైకసాధ్యములయి
జన్మజన్మాంతరంబులఁ జాగుచుండు, కల్మషంబులం బాయుఁ దత్క్షణమునంద.

27


శా.

జ్ఞానాజ్ఞానకృతంబు లైన యఘముల్ సర్వంబు నొక్కెత్తున
న్మాను న్మానవకోటి కుద్ధురగతి న్సప్తాపగాతీరసం
స్థానావాసుని రామనాథుని జటాఝూటాటవీవాటికా
స్థానాధిష్ఠితదుర్గకంఠనవముగ్ధస్నిగ్ధకీర్తిద్యుతిన్.

28


తే.

ద్వాదశక్షేత్రశివలింగదర్శనమున, నెట్టిసుకృతంబు సిద్ధించు నట్టిసుకృత
మాక్షణంబున సిద్ధించు దక్షవాటి, రామనాథేశుఁ గన్నులారంగఁ గనిన.

29


తే.

ద్వాదశక్షేత్రతీర్థయాత్రాభివృద్ధి, నిర్జితేంద్రియులై సేయనేర్చిరేని
పాపములు చేసినట్టి నిర్భాగ్యులైన, డాయబోవరుఁ జమునిపట్టనముగవిని.

30


ఉ.

దక్షిణకాశికాతుహినధామకిరీటునిదిక్కు సీమగా
దక్షపురంబునందు బహూధామములన్ శివలింగముల్ సహ
స్రాక్షహుతాశనాదివివిధామరముఖ్యప్రతిష్ఠితంబులై
లక్షలసంఖ్య లున్నవి యలక్ష్యము లయ్యును గానవచ్చియున్.

31


సీ.

వలవ దగ్నిష్టోమవాజపేయాదుల, ధూమపానముఁ జేసి దుఃఖపడఁగఁ
దీర్థసేవార్థమై దేశాంతరంబులు, గాలుచేడ్పడఁ దనకేల తిరుగ
నశ్వగోమహిషరూప్యసువర్ణవస్త్రంబు, లెన్ని వెచ్చించిన నేమిఫలము
సంతతంబును గృఛ్రచాంద్రాయణాదుల, వరటుచునుంట యెవ్వరికి మెచ్చు


తే.

దూరమున నుండి తలఁచిన దురితహరుని, జేరి కొలిచిన సకలార్థసిద్ధికరుని
నంత్యమావస్థమోక్షదీక్షైకగురుని, భీమనాథేశ్వరేశ్వరస్వామిఁ గొలుఁడు.

32

సీ.

నేఁ గొమ్ముటేనుఁగు నే విహగంబను, నే స్తబ్ధరోమంబ నేను గొఱియ
నేను బకంబను నేను గర్కటకంబ, నే నచ్ఛభల్లంబ నేను నక్క
నేను మండూకంబ నేను గించుళికంబ, నేను గీటంబ నే వానరంబ
నే శుకకీటంబ నేఁ బుండరీకంబ, నే ఖంజరీటంబ నేను దోమ


తే.

నేను మానిసి మున్నంచు నేకతమున, నొండొరులతోడు తను జెప్పుకొండు రుబుసుఁ
దారక బ్రహ్మమణిపేటి దక్షవాటి, సంభవించిన ప్రత్యగ్రచంద్రధరులు.

33


తే.

అఖిలతీర్థప్రదేశంబు లడవు లిండ్లు, యజ్ఞవాటిక వల్లకా డనువిభేద
మించుకయు లేదు భీమనాథేశభూమి, జంతువులు శంభులగుదురు చచ్చినపుడు.

34


శా.

సాక్షాద్దక్షిణకాశికానగరి దక్షస్థాన మవ్వీటిలో
మోక్షార్థాక్షరదీక్ష నక్షయసుఖంబుం ప్రాణికిన్ సత్కృపా
వీక్షాసంకలితానురాగుఁ డగుచున్ విశ్వేశుచందంబునం
ద్ర్యక్షుం డీశుఁడు భీమనాథుఁ డొసఁగుం బ్రాణావసానంబునన్.

35


శా.

శ్రీభీమేశ్వరపాదపీఠవిలుఠచ్ఛ్రీసప్తగోదావర
వ్యాభుగ్నోర్మిపరంపరాఘుమఘుమప్రారంభకోలాహల
క్షోభోద్వేజితపాతకౌఘము జగచ్చూడావతంసంబు ల
క్ష్మీభద్రాసన మొప్పు దక్షనగరీక్షేత్రంబు ధాత్రీస్థలిన్.

36


వ.

అని నారదుండు చెప్పిన విని తపోధనులు భీమనాథుమాహాత్మ్యంబునకు దక్షారామప్రభావంబునకు సప్తగోదావరమహిమంబునకు విస్మయంబందియు దర్శించియు నమస్కరించియు ధన్యులైన యాత్మారాము లమ్మహారామంబునఁ జరియించువారును నగుచు సత్యవతీసుతుం గాంచి దక్షారామాయణుండైన బాదరాయణువలన నప్పుణ్యస్థానంబున మఱియుం గల యశేషవిశేషంబు లెఱింగి.

37


చ.

అటఁ జని యొక్కచోటఁ గమలాననబంధము పూని వాహినీ
తటమున బిల్వకాననలతాగృహమధ్యమునందు నాసికా
పుటశిఖరాగ్రదృష్టి యగు పుణ్యుని గాంచిరి మౌనిపుంగవుల్
ఘటమున నుద్భవించిన యగస్త్యు యశోనిధి నిల్వలాంతకున్.

38


వ.

తదనంతరంబ యతనితో సల్లాపంబుల నపనయించి తీర్థమాహాత్మ్యం బడిగిన నతం డిట్లనియె.

39

అగస్త్యుఁడు తీర్థమాహాత్మ్యంబుఁ జెప్పుట

సీ.

జహ్నుకన్యాతీరసన్నివేశమునకు, దక్షిణాంభోరాశితటముసాటి
కమనీయమణికర్ణికాప్రవాహమునకు, సప్తగోదావరజలముసాటి

కటకరక్షకుఁ డైన కాలభైరవునకుఁ, బ్రకటపాతాళభైరవుఁడుసాటి
విశ్వాధిపతియైన విశ్వనాయకునకు, భీమనాథేశ్వరస్వామిసాటి


తే.

మోక్షవిభవంబునకు సాటి మోక్షలక్ష్మి
భోగమహిముంబునకు సాటి భోగమహిమ
వారణాశికి శ్రీదక్షవాటమునకు
దారతమ్యంబుఁ జర్చింప ధర్మ మగునె.

40


తే.

తరమె వర్ణింప సప్తగోదావరంబు
సలిలకల్లోలశిఖరహస్తంబు లెత్తి
పాతకంబుల జంకించు బహువిధముల
ఘుమఘుమారంభహుంకారఘోష మెసఁగ.

41


వ.

అని కుంభసంభవుండు చెప్పిన విని యమ్మహాత్ము వీడ్కొని నగరప్రదక్షిణపూర్వకంబుగా భీమేశ్వరు దర్శించి కృతార్థులై యొక్కరమ్యస్థలంబున నమ్మహామునులు గూర్చుండిరి యనంతరంబ.

42


ఉ.

ఆమునిమండలంబునకు నంజలి బంధముతోఁ బ్రదక్షిణ
గ్రామనమస్కృతుల్ గడపి గారవమారఁగ మంకణుండు ఋ
క్సామయజుర్విశారదుఁడు శైవపురాణకథారహస్యగో
ష్ఠీముదితాంతరంగుఁడు ప్రసిద్ధుఁడు భక్తి దలిర్ప ని ట్లనున్.

43


సీ.

పరమపుణ్యుఁడ నైతి భాగ్యవంతుఁడ నైతి, ధన్యుండ నైతి నాతపసు పండెఁ
దీర్ఘంబులన్నియుఁ దిరిగి చూడఁగఁజాల, నొక్కజన్మమున నీయుర్విలోన
దిగ్దేశముల సర్వతీర్ణంబులను నాడి, తీర్థభూతత్వప్రతిష్ఠఁ గన్న
మిమ్మందఱను గంటి మీకృపాబలమున, నేను దీర్థమ నైతి నింతనిజము


తే.

భీమనాథమాహాత్మ్యంబు పెంపువినఁగ, వేడ్క యగుచుండు నాకు నీవేళయందుఁ
బ్రార్థనము చేసి వేఁడెద భవ్యులార, యానతీఁదగు నాకు మీలోన నొకఁడు.

44


వ.

అనిన విని యందఱు వసిష్ఠమహామునిం బ్రార్థించిన సకలమునిజనానుమతంబునఁ గుంభసంభవుని నియోగంబున నప్పుడు మైత్రావరుణుండు మంకణున కిట్లనియె.

45


క.

భీమ మగుగరళకూటము, భూమియు గగనమును దిశలఁ బొడచూపినచో
భీమగతి మ్రింగెఁ గావున, భీమేశ్వరుఁ డయ్యె నితఁడు బిరుదాంకమునన్.

46


క్షీరసాగర మథనకము ప్రారంభము


వ.

అనిన విని మంకణుండు పంకజాసనసంభవునితో మునీంద్రా దక్షవాటికాధీశ్వరుండు కాలకూటంబు నెబ్భంగి నుపసంహరించె నక్కథాక్రమంబు పరిపాటిందేటపడ నా కెఱింగింపవే యనుటయు నతం డిట్లని చెప్పం దొణంగెఁ దొల్లి జలం

ధరాంధకమహిషాసురబిడాలాక్షధూమ్రాక్షగంధసింధురాసురవిద్యున్మాలితారకబలిబాణపౌలోమనివాతకవచకాలకేయాదు లగురాక్షసులును బాకశాసనపావకపరేతరాజపలలాశిప్రాచేతపవననపౌలస్త్యపశుపతిప్రధాను లగువేల్పులునుం దమలోన దాయాదసంబంధంబునం బొడమినవైరానుబంధంబునం బరస్పరవిజిగీషులై రోషంబున నెదురువేలంబులు పెట్టి కట్టుపకాసులై ప్రతిఘటించి బెట్టయి నెట్టుకొని యున్న సమయంబున.

47


సీ.

దివ్యాయుధము లైదు ధృతిచేతనంబులై, శత్రుసంహారంబు సంస్తుతింపఁ
బులుఁగుఱేఁడు కరాబ్జములు రెండు మొగిడించి, భ్రూలతాదేశంబు పొలుపునరయ
సౌఖశాయనికులై సనకాదియోగీంద్రు, లనురాగవీక్షణం బభిలషింప
నూరురంభాస్తంభయుగళంబుపైనుంచి, లక్ష్మి శ్రీపాదపల్లవము లొత్తఁ


తే.

బన్నగాధీశభోగతల్పంబుమీఁదఁ, దత్ఫణారత్నదీప్తి మై తళుకుఁ జూపఁ
బాలమున్నీటిలో నిద్ర మేలుకొన్న, హరికిఁ బొరిచూప నేతెంచె హరిహయుండు.

48


వ.

ఇట్లు చనుదెంచి.

49


తే.

ఒంటి నేతెంచి మంతనంబుండి నిలిచి, చక్రధరుతోడ హితకార్యచర్చ చేసి
యేగె దేవేంద్రుఁ డిరుచెవి నెఱుఁగకుండ, సిద్ధసంకల్పుఁడై యాత్మశిబిరమునకు.

50


వ.

తదనంతరం బాశ్రీమన్నారాయణుండును.

51


క.

ఓవెఱ్ఱులార యేటికి, నీవెడఁగు విచారములు సహింపఁగ రాదా
యేవారి కైన మేలా, చావు లతర్కితము లుగ్రసంగ్రామములన్.

52


తే.

కుడిచి కూర్చుండి మీ రేల కొఱఁతయైన, కుమ్ములాడెద రో యన్నదమ్ములార
గొఱ్ఱె క్రొవ్వియు సెలగట్టెఁ గొఱికినట్లు, కటకటా మీవివేకంబు గాడుపడఁగ.

53


ఉ.

భద్రము మీకుఁ గావలె నపారముగా సురదైత్యులార
విత్రవ ముజ్జగింపుఁడు వివేకము పాకము దప్పకుండఁగా
భద్రసువర్ణపీఠికలపైఁ గొలువుండి త్రిలోకరాజ్య మ
చ్ఛిద్రముగాఁగ నేలుట విశేషమొ చచ్చుట తా విశేషమో.

54


వ.

అది గావున సుధాపానంబున జరామరణంబు లుజ్జగించి సుఖం బనుభవింపుఁడు క్షీరసముద్రమథనంబునం గాని సుధారసంబు సంభవింపదు గావున.

55


శా.

క్షీరాంభోధి మథింపఁ గావలయు నక్షీణప్రతాపప్రభా
వారంభంబున నాదికచ్ఛపము మూలాధారకుండంబుగా
సారోదారము మందరాచలము చంచన్మంథదండంబుగా
గారామార రసాతలాధిపతి దృక్కర్ణుండు సూత్రంబుగన్.

56

గీ.

అనిన శౌరిపల్కు విని సమ్మతించి యా, దేవతలును బూర్వదేవతలును
నమృతమథనమునకు నారంభ మొనరించి, రుల్లమునఁ బ్రమోద ముప్పతిల్ల.

57


శా.

బాహాస్తంభచతుష్టయంబున మురప్రధ్వంసి లంఘించి యు
త్సాహంబొప్పఁగ నెత్తె మందరమహీధ్రంబుధ్ధతిం గూటసం
దోహంబుల్ ద్రుహిణండకర్పరము నుమ్మాలింప దిక్సీమలం
గ్రాహింపం బతయాళునిష్ఠురమహాగండోపలధ్వానముల్.

58


సీ.

కపటకచ్ఛపమైన కైటభాంతకువీఁపు, కొమరు మీఱిన చుట్టకుదురుగాఁగ
నారసాతలమూల మైనమందరమహా, ధరణీధరంబుమంథానకముగ
దండశూకాన్వయధ్యక్షుండు వాసుకి, తతపరిగ్రహణసూత్రంబుగాఁగ
నావహప్రవహాదు లగుమారుతంబులు, తగులఁగట్టిన యాకత్రాళ్లుగాఁగ


తే.

బలిపురోగములగు దైత్యపరివృఢులును, దివిజనాయకుఁ డాదిగా దేవతలును
దరిచి రంభోధి ఘుమఘుమధ్వానరవము, భువనగోళంబు దిక్కులు చెవుడువడఁగ.

60


వ.

ఇవ్విధంబున సురాసురప్యూహంబు లుత్సాహంబులు మదంబులు ముదంబులు శౌర్యంబులు ధైర్యంబులు క్రౌర్యంబులు వీర్యంబులు హంకారంబులు హుంకారంబు లుల్లాసంబులు ప్రహాసంబులు బలంబులు చలంబులు జవంబులు రవంబులు నదల్పులు విదల్పులు వీకులు తాఁకులు జూఁకలు కూఁకలు మూఁకలు వీఁకలు తెగింపులు నగింపులు నింపులు సొంపులు పెంపులు గుంపులు పరువులు మురువులు గెఱయ మెఱయ బాహానష్టంభసంరంభవిజృంభణంబునఁ దరతరంబు తరువందరువఁ దరిత్రాడు పాఁపఱేనియొడలి మలకలుపురులు విడి తరులువడి దిర్దిరందిరుగు మందరగిరి కందరాఘాతంబులం గలగుండువడి కరిమకరితిమింగలమత్స్యకచ్ఛపఢులీకుళిరంబులు సవ్యాపసవ్యయాతాయాతపరిభ్రమణంబులచేత విచేశనావస్థఁ బరిభ్రమించి యంతర్మగ్నంబులయిన పక్షక్షోణీధరంబులు ఱెక్కలు ముణుఁచుకొని మ్రంగి యణంగి తరంబుల నొదుగ దుగ్ధార్ణవంబు ఘూర్ణమానం బయ్యె నప్పుడు భుజంగపుంగవవదన నాసానిష్ఠ్యూతనిష్ఠురవిషనిశ్శ్వాసపవనధారాసంధుక్షుణంబున నభిస్యంధజ్వలనంబు ప్రజ్వలించెనో యన భుగభుగధ్వనితోడం గూడి సుడిగొన నెగయుక్రొంబొగల వెంబడి విస్ఫులింగంబు లాస్ఫాటించి దిక్కులంజూఱ పుచ్చంజిచ్చు పెచ్చుపెరిఁగి కోమలతమతమాలపల్లవంబుల యుల్లాసంబు నుల్లాసంబాడు నల్లనినాలుకలు విషం బుమియుచుంగమియుచు భృంగసంకాశంబును నీలజీమూతసన్నిభంబును గల్పాంతసమయవహ్నికల్పంబును గాలమృత్యుప్రతిమంబును యుగాంతాగ్నివర్ణనంబును నై చటచ్ఛటాశబ్దంబులతో నసహ్యవిషజిహ్వకలాపంబులు బ్రహాంతకర్పరంబు నప్పళింప నిప్పులు చెదరి

చదలు దరికొల్పు నుల్కాపాతంబులుం బోలె దిక్కులం జురజుర స్రుక్కి లావెక్క సప్తపాతాళభువనచక్రవాకంబు పురపురం బొక్కవెక్కసంబయి కోలాహలాభీలంబయి హాలాహలం బుద్భవించిన.

60


సీ.

పంకజప్రభవుఁ డబ్రహణ్య మొనరించెఁ, దాలసన్నిభభుజాస్తంభ మెత్తి
తరిత్రాడు విడిచి బ్బందారకాసురకోటి, పంచబంగాళమై పాఱిపోయె
హాహానినాదకోలాహలోత్తాలమై, త్రైలోక్యమును భీతిఁ దల్లడిల్లె
గనకవర్ణుండైన కైటభాసురవైరి, పొగచూరి నల్లనై బొగ్గుపడియెఁ


తే.

బెటిలె బ్రహాండభాండంబు చిటిలె దిక్కు
లురలె పాతాళభువనంబు లుదిలె నభము
మేటి ధాటీజనితకాలకూటవిషము
చిచ్చు విడివడి యంతంత పెచ్చుపెరుఁగ.

61


వ.

అప్పుడు మిసిమంతుఁడునుంగాక పయోధిప్రాంతంబున దక్షవాటంబున హాటకసింహాసనాసీనుండయిన లలాటలోచను భవబంధమోచను సోమశేఖరుని శరణంబు సొచ్చి హరివిరించిపురందరాది బృందారకు లిట్లనిరి.

62


చ.

అభయము పార్వతీశ యభయంబు మహేశ శశాంకశేఖరా
యభయము శూలపాణి యభయంబు మదాంధకృతాంతమర్దనా
యభయము ఫాలనేత్ర యభయంబు కృపామయదివ్యమానసా
యభయము భీమనాథ యభయం బభయం బభయంబు శంకరా.

63


తే.

అని భయభ్రాంతు లగుచు శక్రాదిసురలు, బలిపురోగము లగుదైత్యపరివృఢులును
శరణుచొచ్చిన నభయహస్తం సాఁచి, వెఱవకుండుఁడు మీ రని విశ్వవిభుఁడు.

64

శివుఁడు హాలాహలము మ్రింగుట

మ.

పటుహుంకార మహాట్టహాసకలనం బాతాళభూస్వర్గసం
కటసన్నాహసముద్భవం బయినయాకాకోలకాలాగ్ని ధూ
ర్జటి హస్తాబ్దమునందుఁ గైకొనియె నాజ్వాలాకులక్ష్వేళ మ
ప్పటివేళన్ మదభృంగమయ్యె శశిభృత్పాణ్యబ్జమధ్యంబునన్.

65


క.

కటకమగువిషము విషధర, కటకం బగుకేలఁ బూని కౌతూహలియై
ఘుటికాసంసిద్ధుఁడు రస, ఘుటికయునుంబోలె శివుఁడు గుటుకన మ్రింగెన్.

66


క.

అపుడు హిమాచలకన్యక, యుపగూహన మాచరించు నొఱపునఁ జుట్టెం
ద్రిపురాంతకుకంఠంబునఁ, దపనీయచ్ఛాయ నొప్పు తనదోర్వల్లిన్.

67


ఉ.

చుట్టిబిగించిపట్టి పురసూదన యీ గరళాగ్నిఁ గంధరా
ఘట్టమునందు నిల్పు మదిగాక దిగంబడనిచ్చితేని లో

పట్టుననున్నలోకముల భస్మము సేయు వెలార్చితేని వె
ల్పట్టుననున్నలోకముల భస్మము చేయు నిజంబు చెప్పితిన్.

68


వ.

అనుటయు.

69


శా.

శంభుం డంబికపల్కుఁ గైకొని జగత్సంరక్షణార్థంబు సం
స్తంభించెన్ నిజకంఠగోళమున విశ్వక్షోభసంత్రాసనం
రంభారంభవిజృంభణోద్భటకలారౌద్రంబుఁ గాకోలమున్
జంభారాతి మణిప్రకల్పితవిశేషానిర్విశేషంబుగన్.

70


వ.

అప్పుడు మహాదేవుని దేవత లి ట్లని స్తుతియించిరి.

71

దేవత లీశ్వరుని స్తుతించుట

సీ.

సచరాచరం బైన జగము రక్షించితి, హాలాహలానలం బారగించి
శరణాగతగతత్రాణపరతంత్రభావంబు, నిఖలలోకేశ్వర నీకె యొప్పు
భువనైకరక్షణవ్యవహారచిహ్నకు, గుఱుతయ్యె నీకంఠకోణచిహ్న
త్రైలోక్యభీమంబుఁ గాలకూటము మ్రింగి, కైకొంటి భీమాఖ్యఁ గాలకంఠ


తే.

యఖిలదిక్పాలకులును నీయాజ్ఞవారు, నీదునిశ్వాసపవనంబు నిగమరాశి
యమరకులసార్వభౌమ లోకాభిరామ, దక్షవాటీపురీకేలిధామ భీమ.

72


తే.

దేవదేవ మహాదేవ దివిజవంద్య, సర్వలోకైకరక్షణచతుర శర్వ
హాలహలకూటసంపర్కనీలకంఠ, మ్రొక్కెదము దేవికిని నీకు ముదముతోడ.

73


మ.

బహిరంతస్థ్సితలోకరక్షణకళాపారీణ శైలాత్మజన్
బహిరంతస్థ్సితలోకరక్షణకళాపారీణునిన్ దేవర
న్మహనీయస్థిరసత్కృపాగుణనిధానం బైనదాక్షాయణి
న్మహనీయస్థిరసత్కృపానిధి నిను న్వర్ణింతు మే మీశ్వరా.

74


తే.

సంహరించితి భువనశోషకము విషము, నభయ మిచ్చితి రక్షించి తఖిలజగము
శాంతమయ్యె నరిష్ట మిష్టంబు ప్రబలె, దక్షిణాబ్ధితటావనిధామ భీమ.

75


క.

ధరణియు గగనము దిక్కులు, దరికొని మండెడు విషాగ్నిఁ దత్క్షణమాత్రం
గరమున ధరించి మ్రింగిన, నిరుపమధృతి నీక యొప్పు నీలగ్రీవా.

76


ఉ.

ఆయతసత్కృపామహిమ హాలహలాగ్నిభయంబు నీమహో
పాయముచేతఁ బాపితివి ప్రాల్గలవాఁడవు దక్షవాటికా
నాయక భీమలింగ శమనం బొనరించితి గాక యింతకుం
గోయిలవన్నెఁ జెంది మఱిఁ గొక్కెరవంకర వోవె లోకముల్.

77


క.

లోకత్రయైకసంర, క్షాకల్పన మాచరింప సదృశులు వేల్పుల్
నీ కితరులు లే రధికులు, లేకుండుటఁ జెప్పనేల లేఖాధ్యక్షా.

78

తే.

మమ్ము రక్షించి తని యేల మాటిమాటి, కభినుతింపంగ దక్షవాటాధినాథ
తల్లిదండ్రులు రక్షింపఁ దలఁపకుండ్రె, ప్రజల భీమేశ బహువిధోపద్రవముల.

79


సీ.

శ్రీభీమనాయకా శివ మమ్ము రక్షింపు, విశ్వైకనాథ దేవియును నీవు
శ్రీనీలకంధరా శేషాహిభూషణ, మమ్ము రక్షింపు మమ్మయును నీవు
రక్షింపు మమ్ము శ్రీదక్షవాటికా, వేదాంతవేద్య దేవియును నీవు
దక్షిణాంబుధితటీధామ నిర్జితకామ, మమ్ము రక్షింపు మమ్మయును నీవు


తే.

వేడ్క రక్షింపు దేవ దేవియును నీవు, ప్రతిభ రక్షింపు గిరిశ యంబయును నీవు
దుగ్ధపాథోధభవవినిర్ధూమధామ, కాలకూటాగ్నిసంహారకారి యభవ.

80


క.

శరణము భజింతు మభవుని, శరణము భజియింతు మర్ధచంద్రాభరణున్
శరణము భజింతు మీశుని, శరణము భజయింతు మద్రిజావల్లభునిన్.

81


తే.

సిరియు వాణియు మొదలైన సురపురంధ్రు, లఱ్ఱుగడుపును జల్లఁగా నఖిలషించి
నియమమునఁ గొల్తు రెవ్వని నిత్యకలన, నట్టిభీమేశు నినుఁ గొల్తు మహరహంబు.

82


సీ.

విశ్వంబు సృజియించువిధి మహేంద్రుఁడు గొను, వివిధాధ్వరముల హవిర్విభాగ
మగ్ని యాహుతి మోయు నమరసంఘమునకుఁ, బాపపుణ్యంబు లేర్పఱచు యముఁడు
ప్రత్యవాయములచే బ్రతుకు రాక్షసతతి, వర్షించుఁ బర్జన్య వరుణమూర్తి
గ్రహచక్రవాళంబు గాలి యెప్పుడు మోచుఁ, గొండ్రు సంతృప్తి లగ్గునఁ బితరులు


తే.

నవనిధానములును యక్షనాథుఁ డేలు, నాసదాశివుఁ డీశానుఁడై తనర్చు
బరఁగ నేనాజ్ఞనింద్రియప్రతతి నడుచు, నట్టిభీమేశ్వరుఁడు మాకు నభయ మొసఁగు.

83


సీ.

వరుణుఁ డెవ్వనియాజ్ఞ వారాశిఁ బాలించు, గాలి యెవ్వనియాజ్ఞ గంప మొందు
నవనిధానములు చింతారత్నసురభులు, యక్షరా జెవ్వనియాజ్ఞ నేలు
నెవ్వని యాజ్ఞ నర్కేందుగ్రహంబులు, చదలమార్గంబున సంచరించు
శైలకాననవార్ధిసహితమౌనీధాత్రి, నహినాథుఁ డెవ్వనియాజ్ఞఁ దాల్చు


తే.

నట్టి భీమేశు వేదవేదాంతవేద్యు, సర్పకేయూరు దేవతాసార్వభౌము
సప్తగోదావరోత్సంగసన్నివిష్ణు, నాశ్రయింతుము నిన్నుఁ జంద్రార్ధమౌళి.

84


వ.

దేవదేవ మహాదేవ సదాశివ యాశ యీశాన తత్పురుష యఘోర సద్యోజాత వామదేవాఖ్యాన పంచవదన మూర్తివిశేష ప్రకృతిప్రధానకారణ! మీకు సాష్టాంగనమస్కారంబు.

85


క.

నీమహిమార్ణవమునకును, సీమాంతము గలదె రాజశేఖర దక్షా
రామపురధామ శంకర, భీమేశ్వర నీలకంఠ పేశలకరుణా.

86


వ.

అని యనేక ప్రకారంబుల బృందారకదైత్యులు తన్నుఁ బ్రస్తుతింపఁ గాలకూటంబు హరించిన పంచాననుం డగుభీమేశ్వరుండు హరివిరించిపురందరాదుల నాలోకించి యిట్లనియె.

87

శివునియాజ్ఞను సురాసురులు విఘ్నేశుని బూజించి
పాల్కడలి తరియించి చంద్రాదులఁ బడయుట

తే.

మనము విఘ్నేశు సేవింప మఱచినార, మతని సేవింపకున్న నేలా ఫలించు
నఖిలకార్యంబులను నవశ్యము ఫలించు, నర్థిఁ గార్యార్థ మిభవక్త్రు ననుసరింప.

88


మ.

అని యంభోధితటోపకంఠమున దక్షారామమధ్యంబునన్
ఘనునిం దాండవవిఘ్ననాయకు మహాకాయున్ సముత్తప్తకాం
చనసంకాశు ననేకరత్నఖచితస్వర్ణాగ్రసింహాసనం
బునఁ గూర్చుండఁగఁ బెట్టి భక్తిపరతం బూజించి రవ్యగ్రులై.

89


సీ.

జలకమార్చె బలారి సప్తగోదావర, సలిలధారాహేమకలశసమితి
గర్పూరకస్తూరికాగంధసారంబు, నలఁదె వైనస్వతుం డంగకములఁ
బ్రన్నఁగాఁ బెనగొన్న బ్రహ్మసూత్రంబులఁ, బసపూన్చి యర్పించెఁ బద్మభవుఁడు
పారిజాతకతరుప్రసవమాల్యంబులు, వక్షస్స్థలంబున వైచె శౌరి


తే.

ధూమకేతుండు మహిసాక్షిధూప మిచ్చెఁ, బూన్చె యక్షాధిపతి మణిభూషణముల
నంధకాసురుఁ డిడియె దూర్వాంకురములు, వీచెఁ బవనుండు కుంచి యవిఘ్నపతికి.

90


వ.

అనంతరం బామోదకాపూపపాయసఘృతమధుక్షీరశర్కరాసూపజంబూకపిత్థచూతఖర్జూరకదళీనారికేళఫలపుండ్రేక్షుసమన్వితంబుగా మహోపహారంబుల గల్పించి వేల్పులుఁ బ్రావేల్పులును ననల్పభావనావిశేషంబుల నశేషవిధంబుల మూషకవాహనునకుఁ బ్రదక్షిణంబులు ప్రణామంబులుం జేసి వలగొని క్రమ్మఱ పయోనిధిమథనంబునకుఁ బ్రారంభించిన.

91


తే.

మందరాచలమంథానమథ్యమాన, దుగ్ధపాథోధిలో సముద్భూతమయ్యె
బాలశశిరేఖ యసురులు వేలుపులును, నిచ్చి రవ్వస్తు వర్థి భీమేశ్వరునకు.

92


వ.

వెండియుఁ దరువందరువఁ గల్పతరువును సప్సరస్సతులును గౌస్తుభమాణిక్యంబును నుచ్చైశ్రవం బనుహయంబును నైరావతం బనుధవళగజంబును నాదిగా సకలకామదంబులు సర్వమంగళాస్పదంబులు నిఖిలభువనమోహనంబులు నైన పదార్థంబు లుద్భవించెఁ దదనంతరంబ.

93


క.

తరతరమ దరువఁదరువం, దరియం దుదయంబు నొందె ధన్వంతరి సా
గరమునఁ గడుగరగరనై, కరమునఁ గరమమరు నమృతకలశముఁ దానున్.

94


సీ.

సంపూర్ణపూర్ణిమాచంద్రబింబంబుతోఁ, బుట్టెఁ దెల్లనితమ్మిపువ్వుమొగ్గ
విరిసె నొయ్యొయ్యన వేలావనీవాటి, పవమానకోమలాస్ఫాలనమున
వాసించె నఖిలదిగ్వలయంబు మధురవి, స్తారకేసరధూళిసౌరభములు
నంభోజమధ్యంబునం దుద్భవం బొందె, మహితకాంతిచ్ఛటామండలంబు

తే.

అందుమణికర్ణికాగ్రసింహాసనమున, లక్ష్మి యుదయించి హస్తపల్లవమునందుఁ
బసిఁడిపూదండఁ బూజించెఁ బద్మనయను, నర్థి వరియించె లీలాస్వయంవరమున.

95

దేవాసురు లమృతమునకై పోరుటయు శ్రీమన్నారాయణుండు దేవారుల వంచించుట

.
ఉ.

ఱంతులు మీఱి మిక్కిలిగ ఱాఁగతనంబున దొమ్మి చేసి దు
ర్దాంతపరాక్రమోన్నతులు దానవదైత్యులు వేల్పువెజ్జు ధ
న్వంతరిచేతి దుగ్ధమయవార్ధిసుధారసపూర్ణకుంభమున్
సంతనకట్టి పుచ్చుకొని చయ్యన నేగిరి నిర్విశంకతన్.

96


వ.

అప్పుడు.

97


క.

నారాయణుండు మాయా, నారీరూపమునఁ గపటనాటకలీలా
పారాయణత హరించెను సు, రారులచే నమృతకలశ మాసమయమునన్.

98


చ.

అమృతముఁ గోలుపోయి విబుధారులు గంధగజాసురాంధక
ప్రముఖులు మోములందు వినఁబాటు దలిర్పఁగఁ గూడియున్నచో
నమరఁగ నారదుండు గగనాగ్రమునం జనుదెంచి వారికిం
బ్రమదముతోడ నిట్లనుచుఁ బల్కెను వాక్పరిపాటి యొప్పఁగన్.

99

నారదోక్తి నసురు లీశ్వరుని బూజించి వరంబులు వడసి లోకముల బాధించుట

శా.

రక్షోనాయకులార నిర్జరవరవ్రాతంబుచేతన్ సుధా
భిక్షాపాత్రము వోయెనంచు మదిలో బెగ్గిల్లఁగా నేటికిన్
రక్షార్థంబు భజింపరాదె యభవుం ద్రైలోక్యకుక్షింభరున్
దక్షారామపురాధినాథుని సుధాధామార్థచూడామణిన్.

100


క.

అని నారదుండు పల్కిన, విని యందఱు భీమనాథు విశ్వేశ్వరునిన్
ఘనభక్తి దక్షమునిరా, డ్వనమధ్యమునందుఁ గొల్చి వర్ధితబలులై.

101


మ.

త్రిపురావాసులతోఁ గూడి కడిమిన్ దేవాహితుల్ లోకముల్
తపియింపంగఁ దపంబు చేసిరి దృఢస్థైర్యంబు పాటించి పా
శుపతాచారనిరూఢి నందఱును సంశుద్ధాంతరంగంబులం
దుపమాతీతుని భీమనాయకుని నాద్యున్ శంభు సేవించుచున్.

102


సీ.

అరుణోదయంబున నాకాశవాహినీ, హేమాంబుజంబుల నిందుధరుని
మిహిరోదయంబున మహిసాక్షిగుగ్గుల, ధూపధూమంబుల దురితహరుని
సంగమంబున గంధసారకుంకుమచంద్ర, జంబాలమునఁ బుష్పచాపమథను
మధ్యాహ్నమునఁ బక్వమధురాన్నపాయసా, పూపాజ్యదధిఫలంబులఁ ద్రినేత్రు

తే.

బరమసంధ్యాగమంబునఁ బటహశంఖ, ఝల్లరీమడ్డుడమరుఝర్ఝరులమ్రోఁత
నర్ధరాత్రంబులందు వీణారవముల, హరుని బూజింతు రతిభక్తి నసురవరులు.

103


శా.

పంచబ్రహ్మషడంగమంత్రములనుం బ్రాసాదపంచాక్షరిం
బంచాస్యున్ బహుబిల్వపత్రముల నభ్యర్చింతు రవ్యగ్రత
న్మంచుఁగొండయనుంగుఁబెండ్లికొడుకు న్వర్ణింతు రేకాగ్రతం
జంచద్వేదపురాణమంత్రముల నిష్ఠాయుక్తి నక్తంచరుల్.

104


వ.

ఇవ్విధంబున నిష్టార్థప్రదుం డైనయమ్మహాదేవు శ్రీభీమనాథు సేవించి యద్దేవుని ప్రసాదంబున ననశ్వరంబును నత్యూర్జితంబును నసాధారణంబును నగునైశ్వర్యంబునుం బొంది.

105


తే.

అపుడు గర్వించి నిర్జించి రఖలజనుల, నిర్జరుల బాధ పెట్టిరి నిరపరాధ
మప్రతీకమహాప్రతాపాతిరేక, నిర్విశంకావలేపులై పూర్వసురులు.

106

బ్రహ్మవిష్ణ్వాదులు శివునికడ కేగి మొఱవెట్టుట

సీ.<poemవజ్రహస్తునిచేతి వజ్రాయుధము జాగ్ర, దుద్దీప్తి పాడరి మొద్దువోయె

నతితీక్ష్ణతరమైన యాశుశుక్షణి తేజ, మింగాలతేజమై యింకిపోయెఁ జండభీషణమైన జముగదాదండంబు, బిఱుసంతయును బాసి బెండుపడియెఁ

బాథోధివల్లభు పాశవల్లిమతల్లి, దర్పంబు దిగద్రావి త్రాడుపడియె></poem>


తే.

గాలి దూలెను ధనపతిఘనత యణఁగె, గ్రహములకు నిగ్రహము పుట్టెఁ గాలవశత
గాలకేయాదిరాక్షసగణములెల్ల, భీమలింగంబుకృపఁ బెచ్చు పెరుఁగునపుడు.

107


వ.

అప్పుడు హరి విరించులు పురందరాదులతోడ నక్తంచరులచేతఁ బంచకరపాట్లు వడి యంతఃకరణంబులఁ జింతించి రాయంచనుం గాంచనవర్ణగరుదంచలం బగుపులుఁగుఱేని నెక్కి దక్షిణజలధిపంచ దక్షారామంబున నధివసించిన మంచుఁగొండయల్లునిఁ బంచబాణవిరోధిని డాయంజనుదెంచి పంచాక్షరీపంచబ్రహ్మమంత్రంబు మంత్రోచ్చారణపూర్వకంబుగా సాష్టాంగదండప్రణామంబు లాచరించి ప్రపంచరక్షణార్థంబుగా నిట్లని స్తుతియించిరి.

108


సీ.

అవధారు దేవ దక్షారామవల్లభ, సప్తగోదావరోత్సంగనిలయ
కాలకూటానలజ్వాలానలముఁ బాపి, మమ్ము రక్షించిన మహితకరుణ
భీమేశ్వరేశ్వరస్వామి మహాదేవ, త్రిపురదైత్యులబాధ దీలుపడితి
మత్యంతదుఃఖము లనుభవించితిమి య, నాథుల మైతి మనాథనాథ


తే.

మొదల దేవారులను గాచి పిదప సురలఁ, గాచి పిమ్మట నసురులఁ గాచినాఁడ
వింక మముఁ గావు వరుస భోగీంద్రకటక, నీ వెఱుంగవె ధర్మంబు నీలకంఠ.

109

తే.

చటులతరకాలకూటాగ్ని సంజహర్ష, పాల్కడలి నట్టనడుమ సంప్రభవమైన
యమృతలింగంబవగునిన్ను నాశ్రయింతు, మభవ భీమేశ దక్షవాటాధినాథ.

110


క.

ప్రణవోత్తమాంగ ఫణిభూ, షణ గగనమణీందువహ్ని చక్షుస్త్రితయా
ఫణికటక జితమనోభవ, యణిమాదివిశేషదా పరాశ్రయచరణా.

111


ఉత్సాహము.

నీలకంఠ భక్తలోకనిధి భవాబ్ధితారణా
ఫాలభాగమత్కృపీట భవశిఖా హతస్మరా
శూలపాణి మమ్ముఁ గరుణఁ జూడు త్రిపురదానవుల్
జాలిఁ బెట్టుచున్నవా రసహ్యవిక్రమోద్ధతిన్.

112


సీ.

అర్కేందుహవ్యవాహనలోచనత్రయా, త్రిపురదైత్యులబాధ నపనయింపు
మంబికాహృదయంబు జాకరకలహంస, త్రిపురదైత్యులబాధ నపనయింపు
నిత్యనిర్మలశుద్ధ నిరవద్యనిర్ద్వంద్వ, త్రిపురదైత్యులబాధ నపనయింపు
దీప్తదీప్తాయుధస్థిరమహాదోర్దండ, త్రిపురదైత్యులబాధ నపనయింపు


తే.

డమరుపట్టసపరశుఖడ్గత్రిశూల, చాపఖట్వాంగధర నీవె శరణు మాకు
నన్యథా శరణంబు లే దభవ భీమ, యపనయింపుము త్రిపురాసురాదిబాధ.

113


క.

ముక్తవిశుద్ధనిరంజన, ముక్తప్రియ నిత్య యష్టమూర్తి ప్రతాపో
ద్విక్తత్రినగరపరివృఢ, నక్తంచరబాధమాన్పు నాగాభరణా.

114


క.

దగ్ధస్మరాంగశంకర, ముగ్ధేందుకళాకలాప మూర్ధాయన సు
స్నిగ్ధవిధాతృకపాల, స్రగ్ధారి ఘటింపు త్రిపురసంహారంబున్.

115


క.

అద్వయ సత్య క్షరాక్షర, సద్వంద్య యనాదినిధనసర్వేశ్వర కృ
ష్ణద్వైపాయనశుకముఖ, విశ్వన్నుత సంహరింపవే త్రిపురంబుల్.

116


క.

సర్వేశ్వర సర్వాత్మక, [1]శర్వ సదాశివ మహేశ శాశ్వతరుద్రా
సర్వజ్ఞ భీమనాయక, గర్వాంధుల నణఁపు త్రిపురకర్భురపతులన్.

117


సీ.

ప్రణతార్తిహర దేవ పరమేశధక్షవా, టాధీశయభవ మా కభయ మిమ్ము[2]
మంత్రోపనిషదర్థ మన్మథాంతకగంధ, సింధురాసురవైరి సేమ మిమ్ము
భక్తవత్సల శూలపాణి దక్షిణవార్ధి, వేలాతటీవాస విజయ మిమ్ము
సంసారమాయానుషంగశాశ్వతతమ, స్కంధమార్తాండ యైశ్వర్య మిమ్ము

తే.

సద్యరక్షింపువామదేవాద్యప్రోవు,జయజ యాఘోరతత్పురుష జయ మొసఁగు
భద్ర మీశానశేయువు ప్రబలులైన, త్రిపురదైత్యులగర్వంబు ధిక్కరింపు.

118


శా.

త్రైలోక్యంబు భుజాప్రతాపమున నిర్వక్రమంబుగా నేలుచున్
హేలాహుంకృతిఁ గామగత్రినగరీహృద్యప్రచారంబులన్
వాలాయంబును మమ్ము వెట్టిగొనుచున్ వర్తించుచున్నారు మీ
రాలస్యం బొనరంచినన్ బ్రతుక శక్యం బెట్లు మాబోంట్లకున్.

119


క.

లోకంబులు త్రిపురాసురు, లేకచ్ఛత్రంబుగా నేలఁగ నున్నా
రో కాలకంఠ యింకిటు, మా కాపులుగావు ధర్మమార్గము దలఁగెన్.

120


మ.

అభయం బిందుకళాకిరీట శివదాయామ్నాయచూడామణీ
యిభరాట్చర్మపటీరకటీర యభవా యీశాన మొఱ్ఱో గిరి
ప్రభవామానసపద్మ పద్మహిత యబ్రహణ్య మాలింపు మా
కభిమానచ్యుతి పాటిలెం ద్రిపురదైత్యగ్రామణీశ్రేణిచేన్.

121


క.

కరుణింపు దక్షవాటీ, పురనాయక భీమలింగ భోగికులేంద్రా
భరణవిషదహనభయమును, బురదనుజభయంబు సరియ భువనంబులకున్.

122

ఈశ్వరుఁడు త్రిపురాసురుల నిర్జించుట

వ.

అని యీప్రకారంబున బ్రహవిష్ణువులు పురందరపురోగము లగుబృందారకులతోడం గూడి యభినందించినం బరమానందంబునుం బొంది యబ్భువనగోప్తసప్తపాతాళభువనగర్భగోళంబునందుండి యావిర్భవంబునొందిన దివ్యస్వయంభూజ్యోతిర్లింగమూర్తి భీమేశ్వరుండు నిర్వికల్పంబును నిరస్తసమస్తోపాధికంబును నైన నిష్కళంకస్వరూపంబు విడిచి యారకూటపాటలంబై కుసుంభచ్ఛాయనగు జటాపటలంబును, బాండురపుండరీకముకుళడుండుభంబులను శంకనంకురింపం జేయంజాలు బ్రహ్మకపాలమాల్యంబును, జిఱునవ్వుజిగి మెఱుంగిడిన చెక్కుటద్దంబుల నీడ చూచు నిద్దంపునాగకుండలంబులును, గ్రొత్తయఱసంజకెంజాయ రంజిలు కాఱుమొగులుకైవడిఁ జిలుపచిలుపని నెత్తురుల జొత్తిల్లిన పచ్చియేనికతోలుపచ్చడంబును, గంఠోత్కంఠభువనభవనరక్షణదాక్షిణ్యలక్షణకస్తూరికాలేపననైపథ్యంబునుం బోని కాలకూటవిషమషీకంఠంబును, సాయాహ్నసమయసంఫుల్లమల్లికాకుసుమసముల్లాసంబు నుల్లసంబాడు తెల్లనిమేనును, మొఱకుఁదనంబున నేతెంచిన కఱకుచెఱకువిల్తుని జూఱఁబుచ్చినదై చిగురుఱేలన నుప్పతిల్లుచు మినుమినుకు మనునులివేఁడిచూపువలనఁ గోపాటోపావార్యహవ్యవాహనాడంబరం బగులలాటలోచనజ్వలనంబు ప్రజ్వలించి నికటజటాటవీవాటంబు నాస్ఫోటించునోయని యవధ

రించిన చందంబున నందం బగుమందాకినీసలిలపూరసంభరితం బైనశాతకుంభకుంభంబునుఁబోని కిరీటకటాహంబును, జంద్రఖండంబులుమూఁగినభంగి నంగీకరించిన యకించన శశాంకరేఖాలంకారంబును, జెంగలువ ఱెక్కడాలుఁ జక్కనేలిన కేలి యంగుటంబునం జనమత్ఖురపుటంబుల మోపి నింగికి నెగయ నంజచాఁచులీలాకురంగశాబకంబును గనుపట్టు సర్వకళారూపంబు ధరియించి సర్వమంగళాకుచకలశలేపనానైపుణ్య కుంకుమాంగరాగవాసనాసనాథంబును, గరళకూటపావకోత్పత్తినిరస్త మణికులప్రశస్తంబును నైన శ్రీహస్తంబు విస్తరించి యభయంబు ప్రసాదించి సజలజలధరధ్వానగంభీరోదారంబైన కంఠస్వనంబున నిట్లని యానతిచ్చె.

123


మ.

అరవిందాసనతార్క్ష్యవాహనసహస్రాక్షాదిబృందారకుల్
చిరకాలంబును బడ్డపాట్లు మదిలోఁ జింతించుచున్నాఁడ ని
ర్భరదర్పోద్ధతులం బురాసురుల నే భంజించెదన్ మీరునుం
బరిపాటిన్ ననుఁ గొల్చి రండు సమరప్రారంభసన్నద్ధులై.

124


ఆ.

అని ముహూర్తమాత్ర మద్దేవతాచక్ర, వర్తి దక్షువాటివల్లభుండు
మనమునందుఁ దలఁచె మననాంధకారాతి, శత్రునగరవిజయసాధనంబు.

125


వ.

అనంతరంబ తదభిజ్ఞానప్రభామహామహిమంబునఁ దదాజ్ఞాతిశయంబున.

126


సీ.

జలరాశిమేఖలావలయంబు రథ మయ్యె, రవియుఁ జందురుఁడుఁ జక్రంబు లైరి
శారదాజీవితేశ్వరుఁడు సారథి యయ్యె, శ్రుతులు నాలుగును వారువము లయ్యెఁ
బ్రణవమంత్రైకాక్షరము ప్రతోదం బయ్యెఁ, దారకావీధి పతాక మయ్యె
రత్నసానుధరాధరము ధనుర్లత యయ్యె, నాగప్రధానుండు నారి యయ్యె


తే.

గంధవాహంబు లేడును గఱులు గాఁగ, విలయకాలానలజ్వాల ములికి గాఁగ
లచ్చిచనుదోయికుంకుమబచ్చనయుగఁ, బాలమున్నీటియల్లుండు బాణ మయ్యె.

127


వ.

ఇవ్విధంబున సకలసాధనంబులు సన్నిహితంబు లైనక్షణంబ దక్షారామంబున నయనాభిరాముండు భీమేశ్వరుండు త్రిపురవిజయార్థంబు దివ్యస్యందనం బెక్కె నప్పుడు.

128


సీ.

సరిబ్రాహ్మి మొదలైన సప్తమాతృకలు ద, న్గూడ సేసలు చల్లె గోఁగులమ్మ
పసిఁడివేత్రము పట్టి పాతాళభైరవుం, డందంద సందడి నపనయించె
దివ్యదుందుభినాదదీర్ఘగర్జితముతోఁ, గురిసె మిన్నుననుండి కుసుమవృష్టి
జయజయధ్వని దేవ సంయమీశ్వరకోటి,సంఘటించెఁ గరాంబుజంబు నొసలఁ


తే.

ద్రిపురసంహార మొనరింప దీక్ష చేసి, భీమనాథేశ్వరేశ్వరస్వామి శివుఁడు
దక్షవాటీవిభుఁడు మేరుధనువు వట్టి, యేచి పంటవలంతితే రెక్కు నపుడు.

129

సీ.

కమ్మినూకిననూత్నకలధౌతమునుబోలెఁ, జక్కంగ నిక్కి మై సొక్కు మానె
నంతరాంతరములం దస్థిబృందంబులు, పెళపెళమనియెడు గిలకు లెసఁగెఁ
బగిలి బీటలువాఱి శతగడెత్తెఁ గుబుసంబు, తోరంపు వెల్లుల్లితునకలట్ల
మహనీయతరఫణామండలంబులు లేఁత, చిగురుటాకులఛాయ జేగురించె


తే.

హాటకాద్రిధనుర్దండకూటకోటి, వంచి బాహావలేపదుర్వారలీలఁ
గాలకంఠుండు త్రిపురసంక్షయ మొనర్ప, నెక్కువెట్టినయపుడు భోగీశ్వరునకు.

130


క.

ముక్కంటి మేరుచాపం, బక్కిడి నారించెఁ బన్నగేంద్రగుణంబున్
మక్కువ హిమగిరికన్యక, క్రిక్కిఱిసిన కుచము లలము కేలుందమ్మిన్.

131


క.

తాటించి నిటలనయనుఁడు, హాటకగిరిచాపవల్లి నహిశింజిని నా
స్ఫోటించెఁ దత్కఠోరమ, హాటంకృతి కమలజాండ మటఁ బగులంగన్.

132


మ.

గిరిశస్థూలభుజాపరీతవిభవక్రీడాసమాస్ఫాలిత
స్థిరబాణాసనగూఢపాద్గుణలతాదీర్ఘోగ్రఘోషంబునన్
ధరణీచక్రము దిద్దిరం దిరిగెఁ బాతాళంబు ఘూర్ణిల్లె నం
బరముం దిక్కులు వ్రయ్యలయ్యెఁ బగిలెన్ బ్రహ్మాండభాండంబులున్.

133


క.

మృడుఁడు కనకాద్రిచాపము, గుడుసువడం దివియ గూడి కుశలప్రశ్నం
బడిగిరి యొండొరులను గని, కడకొమ్ముల నున్నయదితికద్రువతనయుల్.

134


క.

తెగనిండ ఫాలనయనుఁడు, నగచాపము దిగిచినపుడు నాగేంద్రుం డ
బ్బిగువున మొగంబు లదరుటఁ, బొగ లెగయఁగ విషము భుగులుభుగులనఁ గ్రక్కెన్.

135


క.

విషధరపరివృఢనాసా, సుషిరవినిశ్వాసపవనఛూత్కారరవ
ద్విషవహ్నిజ్వాలంబులు, వృషభధ్వజుచేతి కొండవింట జనించెన్.

136


క.

శ్రీకంఠకఠినభుజపరి, ఘాకృష్టసువర్ణగిరిశరాసన మౌర్వీ
కాకోదరముఖసంభవ, కాకోలానలము ముజ్జగము దరికొనియెన్.

137


క.

కటకాముఖహస్తంబున, నిటలాక్షుఁడు కొండవిల్లు నెవ్వడిఁ దివియన్
ఘటియిల్లె నురగరాజ, స్ఫటహాలాహలకృపీటభవకీల లటన్.

138


వ.

ఇవ్విధంబున భీమనాథుండు త్రిపురదమనారంభసంరంభంబున శాతకుంభకుంభినీధరకోదండం బుద్దండభుజాదంచండిమంబునఁ గుడుసుపడం దిగిచినఁ దత్సమాకృష్టభారంబున భుజంగపుంగవుండు వేయుపడగలను విషంబుఁ గ్రక్క దృక్కర్ణవదననాసారంధ్రసముదీర్ణసంభవం బయినయక్కాలకూటవిషంబు కృపీటభవజిహ్వాకలాపంబులు గ్రోయుచుఁ దోయధిమథనంబున సంభవించినహాలాహలంబునుం బోలెఁ బ్రజ్వరిల్లి సముజ్జ్వలజ్వాలాజాలంబుల ద్రైలోక్యంబు నాక్రమింపందొణంగినం దెగ యుడిపి ఖట్వాంగపాణి యుత్తమాంగంబు జాడించి

గంగాంభఃప్రవాహనిర్ఝరవారిపూరంబులు చల్లియు వామలోచనహిచుదామకిరణవ్రాతంబులం బ్రోక్షించియు నమ్మహోపద్రవం బుపశమింపం జేసి దుర్గాసహాయుండును విఘ్నరాజప్రసాదోపలబ్ధసంభావితంతుడు నై విషమలక్ష్యంబులయిన త్రిపురంబులు వీక్షించి వెండియు నాదినారాయణునిం బురాణబురుషునిఁ బురుషోత్తము ననాదినిధనుని బాణంబు చేసి యరింబోసి పాశుపతాస్త్రసమంత్రకంబుగా నభిమంత్రించి నాకర్ణాంతంబుగాఁ దిగిచి లలాటేక్షణజ్యాలాజాలంబు మునుముట్టనిగిడించి బిట్టుహుంకరించి యట్టహాసంబు చేసి యేసిన నమ్మహాస్త్రంబు.

139


సీ.

కరపల్లవంబులు గబళించుఁ గబళించి, ప్రబలనితంబభారముల వ్రాలుఁ
జెక్కుటద్దములపైఁ జెరలాడుఁ జెరలాడి, శ్రవణావతంసమంజరులు ముట్టు
వలిచన్నుఁగవలపైఁ బొలసాడుఁ బొలసాడి, నాభిరంధ్రములపై నటన సేయు
వేణీభరములపై విహరించు విహరించి, బింబాధరములపై బిత్తరించు


తే.

నభవు కరముక్తనారాయణాస్త్రవహ్ని, కాముకునికోమలాంతసంగంబుపగిది
దెగువమీఱంగఁ ద్రిపురదైతేయరాజ, సదనశుద్ధాంతభామినీజనములందు.

140


క.

లోహమయదైత్యనగరీ, గేహంబులు హరశరాగ్నికీలాజ్వాలా
దాహమునఁ గరఁగి మూఁడుస, మూహములై పెద్దపెద్దముద్దలు నయ్యెన్.

141


వ.

అంత.

142


సీ.

భస్మరేణువు లయ్యెఁ బ్రాకారగోపుర, ప్రాసాదకుట్టిమప్రాంగణములు
మసి బూడి దయ్యె నిర్మలకేలిదీర్ఘికా, కమలినీకహ్లారకైరవములు
దగ్ధమయ్యెను సమస్తప్రశస్తమహాస, భాభ్యంతరాంతఃపురాంగణములు
దూళయ్యె మారుతోద్ధూతపుష్పపరాగ, వాసనాదిశలగు వనచయములు


తే.

కాలకంఠభుజాదండగర్భధార, కుండలీకృతమేరుకోదండపరిధి
వలయనిష్ఠ్యూతకైటభధ్వంసిబాణ, దహనసంధానమునఁ బురత్రయమునందు.

143


క.

ఫాలేక్షణాస్త్రవహ్ని, జ్వాలాజాలముల నసురవరనగరంబుల్
కాలిన నప్పుడు కాలక, కాలాంతకలింగ మొకటి కడు నొప్పారెన్.

144


తే.

ఆదిలింగోద్భనమునాఁటి యభవుభంగి, నింగి మోచిన యాశంభులింగమూర్తి
భీమవరవహ్ని పురములఁ బ్రేల్చునపుడు, నగ్నిసెగదాఁక కేమియు నడలకుండె.

145


మ.

అసురాధీశసమర్పితంబులగు లీలారామకల్పద్రుము
ప్రసవంబుల్ కసుగందవయ్యె విలసత్పాటీరగోరోచనా
ఘుసృణాలేపనపంకితాకలనమై గుంపించె నారాయణా
స్త్రసముజ్జృంభణభీమలింగమునకున్, దైతేయరాట్స్వామికిన్.

146

వ.

ఇవ్విధంబుననున్నఁ జూచి భీమేశ్వరుండు ఋక్సామయజురథర్వణవేదపారాయణతురంగకంబును రవిశశాంకరథాంగకంబును గమలభవసారథికంబును నగు విశ్వరథం బెక్కి భుజంగమరాజిశింజినీకం బయిన కాంచనధరాధరధనుర్దండంబును బుండరీకాక్షబాణంబును సంధించి పురత్రయంబుల దహించి విజయలక్ష్మిఁ బరిగ్రహించి విశ్వావసుప్రధాననానాగంధర్వజేగీయమానభుజావధానుండై ప్రమోదాతిశయంబున.

147


శా.

ఆడెం దాండవ మార్భటీపటహలీలాటోపవిస్ఫూర్జిత
క్రీడాడంబర ముల్లసిల్ల గరళగ్రీవుండు జూటాటవీ
క్రోడాఘాతకఠోరకోటకరుటీకోటీలుఠచ్ఛింధువీ
చీడోలాపటలీపరిస్ఫుటతరస్పీతధ్వనిప్రౌఢిమన్.

148


వ.

ఇట్లు త్రిపురవిజయానంతరంబునం గృతాంతగమనుండు వెండియు.

149


చ.

డమరుకడిండిమప్రకటఠంకృతియుం గఠినాట్టహాసవి
భ్రమమును దాండవారభటపాటవముం ఘటియిల్ల మాతృకా
సముదయభూతభైరవపిశాచనిశాచరడాకినీగణ
ప్రమథసమూహముల్ పొగడ భర్గుఁడు సంతస మందె నెంతయున్.

150


వ.

అనంతరం బాయంబికావల్లభుండు జాంబూనదశైలకోదండం బెక్కుడించి యథాస్థానంబున నునిచి నారి యగుపాపఱేనిని విశ్వంభరాభరణంబునకు నియోగించి క్షీరాంభోరాశితూణీరంబున వైకుంఠబాణంబు చేర్చి వేల్పుల వీడ్కొలిపి బ్రహ్మను సత్యలోకంబున కనిచి వేదంబులం దననిట్టూర్పుగాడ్పులలోనం గలిపి చంద్రసూర్యులం గాలంబు గడుప నియోగించి కృతకృత్యుండై త్రిపురదైతేయుల కులదైవతంబైన యద్దివ్యలింగంబును బంచబ్రహ్మపంచాక్షరీపంచతత్వపంచభూతమయం బగుటం జేసి పంచఖండంబులుగా ఖండించి కృష్ణవేణీమహానదీతీరంబున ధరణాలకోటయను గ్రామంబున నమరేశ్వమునిచేతం బ్రతిష్ఠితంబగుటం జేసి యమరలింగంబునాఁ బ్రసిద్ధంబైన యమరారామంబును గౌతమీతీరంబున దక్షిణకూలంబున గుణపూడియను గ్రామంబున సోమునిచేతఁ బ్రతిష్ఠితంబు సేయంబడుటం జేసి సోమలింగంబనఁ బ్రఖ్యాతంబైన సోమారామంబును బాలకోటయను గ్రామంబున శ్రీరామచంద్రునిచేఁ బ్రతిష్ఠితంబగుటం జేసి రామలింగంబునాఁ బ్రసిద్ధం బైన క్షీరారామంబును జాళుక్యవంశరాజధానియగు చాళుక్యభీమవరనామగ్రామంబునఁ గుమారరత్నంబైన కుమారస్వామిచేతం బ్రతిష్ఠితంబగుటం జేసి కుమారభీమలింగంబనఁ బ్రఖ్యాతంబు నొందిన భీమారామంబును మొదలిమామ యగుదక్షప్రజాపతి యునికిపట్టైన యారామంబగుట దక్షారామంబున

శివసన్నిధానంబై దానుండునట్టుగా నీప్రకారంబున భోగమోక్షప్రదంబులైన పంచారామంబులను బ్రతిష్ఠనొందించి తానును దక్షవాటంబున మున్నీటితటంబున విశుద్ధస్ఫటికసంకాశంబును ద్రిదశలోకభామినీవిలోకనచ్ఛాయాగుళుచ్ఛాచ్ఛజ్యోత్స్నాభిషిక్తయుక్తాంగంబగు శ్రీభీమేశ్వరలింగంబునం దధివసించె నిది త్రిపురవిజయోపాఖ్యానంబు దీని వినినను బఠించిన వ్రాసినఁ బ్రశ్నచేసిన బోధించినవారికి సకలపాతకనివర్తనంబై భుక్తిముక్తులు గలుగును సకలకళ్యాణకరం బనిన విని.

151


ఉ.

అప్పుడు సప్తదివ్యమును లంచితభక్తిరసప్రయుక్తులై
చప్పటతాళము ల్మొరయ సంస్తుతిపూర్వముగాఁగ నాడుచున్
ముప్పిరిగొన్న మోదమున మ్రొక్కుచు మైఁ బులకాంకురావళుల్
కుప్పలుగా భజించిరి యకుంఠితభావన భీమలింగమున్.

152


సీ

ఆ ఖండపంచకం బాఖండలాదిక, విబుధమండల విషేవితము చంద్ర
మార్తాండశతకోటి మహనీయతేజంబు, మండలిగ్రామణి కుండలంబు
పుండరీకత్వక్ప్రకాండాతిమండిత, కటిమండలంబు శ్రీఖండఘటిత
పాండురబ్రహ్మకపాలసంపుటము బ్ర, హ్మాండకోటిస్ఫుర దమృతపిండ


తే.

మభవ మద్వయ మాద్యంబనాదినిధన, మప్రమేఁయం బజయ్యంబు నప్రధర్ష్య
మఖిలవేదాంతవేద్య మత్యంతభక్తి, భావనాయుక్తి గలవారి పాలిసురభి.

153


శా.

ఎంచన్ బెక్కువిశేషముల్ ధరణిలో నింపాడుచున్నట్టి శ్రీ
పంచారామములందు దక్షిణమహాపాథోధితీరంబునన్
బంచబ్రహ్మమయామృతప్రకటశుంభద్దివ్యలింగాకృతిన్
మంచుంగుబ్బలియల్లుఁ డొప్పెనఁగు భీమస్వామి యుద్దాముఁడై.

154


శ్లో.

కాశీక్షేత్రమృతోజీవి పునర్జన్మశివాకృతిః
చిత్రం దక్షపురీజీవీ సజన్మసశివాకృతిః 1


శ్లో.

మత్తోనాస్త్య పరందైవం నదేవీ గిరిజా సమా
దక్షారామాత్పరంక్షేత్రం నభూతన్నభవిష్యతి. 2


శ్లో.

రత్యంతరేమూత్రపురీషమధ్యే । చండాలవేశ్మన్యధవాశ్మశానే
కృతప్రయత్నోప్యకృతప్రయత్నో । శ్రీదక్షపుర్యద్వపరోసిముక్తః॥ 3


వ.

అట్టి దివ్యక్షేత్రంబునందు.

155


క.

ఆలింగమూర్తి శశ్వ, జ్జ్వాలామాలాకరాళసందీప్తంబై
యాలోకింపంబడినం, దేలిరి యానందజలధి దివ్యమునీంద్రుల్.

156

తే.

సంస్మితం బైనమదనశాసనునిముఖము
చూచి యానందమునఁ బొంది సురలు మునులు
రాక్షసకృతావరోధసంరంభ మింకఁ
దమకు లేదని తెలిసిరి తత్త్వబుద్ధి.

157


శా.

కారాగారనిబద్ధ లైనదివిషత్కాంతాజనుల్ వారికిం
గారా మైనతనూజులున్ బతులు దుఃఖం బాఱ గోదావరీ
వారిం దీర్థములాడి కాంచిరి జగద్వంద్యుం బురారాతి ద
క్షారామాధిపు భీమనాయకుఁ ద్రిలోకాహ్లాదసంధాయకున్.

158


వ.

తదనంతరం బాభరద్వాజాదిమహామునులు శివున కర్ఘ్యపాద్యాచమనీయార్థంబు భీమనాథమహాదేవునిసమీపంబున గోదావరీవాహినిం బ్రవహింపఁజేయువారై ప్రారంభించి.

159


సీ.

పంచభూతముయంబు పరమపంచబ్రహ్మ, తత్త్వతేజస్సముద్భాసితంబు
పంచాక్షరీమహాపరమమంత్రమూలంబు, శాశ్వతం బజరం బనశ్వరంబు
భైమేశ్వరంబు శోభన మాదిమధ్యాంత, శూన్యంబు సకలంబు శుద్ధబుద్ధ
మనవద్య మదచ్ఛ్యే మక్షోభ్య మఖిలది, గ్దేశకాలాపరిక్షీణ మనఘ


తే.

మంబరము మోచి యున్నలింగంబుఁ జూచి, సంప్రతిష్ట యొనర్పంగ సమ్మతించి
కాల మీక్షించి తగినలగ్నంబుఁ జూచి, సకలసంభారనిచయంబు సంగ్రహించి.

160


తే.

గౌతమీగంగఁ బాపి యిక్కడికి నొక్క, సిద్ధవాహినిఁ బ్రవహింపఁజేసి కాని
లింగసంస్థాపనంబుఁ గల్పింపమనుచుఁ, బరమసంయము లేడ్వురుఁ బ్రతినవట్టి.

161


సీ.

ఆలగ్నవేళకు నమృతదివ్యస్వయం, భూమహాలింగైకమూర్తియైన
శ్రీభీమనాథుని శీతాంశుశేఖరు, నభిషేక మొనరింప నభిలషించి
కదలి సప్తర్షులు గౌతమాదులు శిష్య, సహితంబు కడుభక్తిసంభ్రమమున
దక్షవాటీపురస్థానంబునందుండి, యేగి యంతంతఁ గట్టెదురఁ గనిరి


తే.

గౌతమీగంగ నాలోలఘనతరంగఁ, గేలిడోలావిహారసంక్రీడమాన
చక్రవాకబకక్రౌంచసారసాళి, హంసకారంఢవాదిమాద్యద్విహంగ.

162


క.

గౌతమకన్యాతటినిన్, బ్రీతిఁ బయఃపాన మాచరించిన మనుజ
వ్రాత మొనర్పదు మరల, న్మాతృపయోధరపయఃకణాస్వాదనమున్.

163


వ.

అని మునీంద్రులు తమలోన వెండియు నొండొరులం గనుంగొని.

164


తే.

కంటిరే ఘోరపాతకౌఘముల నెల్లఁ, గడిమి జంకించుచున్నది గంగ యిపుడు
వీచికాహస్తవిన్యాసవిభ్రమముల, ఘుమఘుమధ్వానహుంకారఘోష మెసఁగ.

165

తే.

యక్షగంధర్వసిద్ధవిద్యాధరోర, గామరవ్రాతభరితోభయప్రతీర
పృథివియెల్లను రక్షించు పేరఁటాలు, మమ్ము రక్షించు గోదావరమ్మ యెపుడు.

166


తే.

అమృత మైనపయోధార నహరహంబు, సృష్టిఁ గల జంతుకోట్ల రక్షింతు వీవు
జనని వౌటకు నేమి సంశయము చెపుమ, గౌతమీగంగ యాలోలఘనతరంగ.

167


క.

త్రైలోక్యవరదపావన, నాళీకాననకరాబ్జ నవమణికుండీ
కూలంకషసలిలామృత, పాలింపు గిరీశజాయ పర్వతతనయా.

168


క.

గోదావరి గోదావరి, గోదావరి యంచుఁ బల్కు గుణనంతులకున్
గోదావరితల్లీ సం, పాదింతుగదమ్మ నీవు భవ్యశుభంబుల్.

169


క.

కంబుశశిరజతశుక్తివి, డంబసితచ్ఛాయకలిత డంబరములు నీ
యంబువు లమృతోపమరుచు, లంబా మా కొసఁగుఁగాత నభ్యుదయంబుల్.

170


శా.

ఆపాతాళగభీరనీరకసుధాహారామలచ్ఛాయకున్
ద్వీపాలంకృతికి న్మహేంద్రనగరీనిశ్రేణికాయష్టికిం
దాపోపాయవిధావిహర్తికి మహోదన్వాదృఢాలింగన
వ్యాపారప్రతిపన్నసౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్.

171


శా.

రంభోరూకరశాతకుంభఘటధారాపూరణప్రక్రియా
గంభీరత్వణసాంద్రభిన్నకరిరాడ్గండూషనిర్భిన్నకు
న్సంభావించి నమస్కరింతుము త్రిసంధ్యంబున్ ముదంబొప్ప నీ
కంభోజాసనకుండికాంబుజననీహంసాభ గోదావరీ.

172


క.

గౌతమికిన్ బంచమహా, పాతకసటలాంధకారపాటనవిధిరా
డ్గౌతమికి నమస్కారం, బాతతనుతిఁ జేయుదము ప్రయత్నం బెసఁగన్.

173


వ.

అని ప్రార్థించి యిట్లనిరి.

174


సీ.

విచ్చేయవమ్మ శ్రీవృషభవాహనధర, సామజకటమదాసారధార
పయనంబుగావమ్మ భర్గజటాటవీ, కుటజశాఖాశిఖాకోరకంబ
రావమ్మ యాదిమబ్రహ్మదోఃపల్లవ, స్థితకమండలుపుణ్యతీర్థజలమ
లేవమ్మ విశ్వంభరావధూటీకంఠ, తారమౌక్తికహారధామకంబ


తే.

తెరలతో వీచికలతోడఁ దరులతోడ, విమలడిండీరఖండదండకములతోడ
మురువు ఠీవియు నామోదమును జవంబు, వడువు నొప్పంగ గంగమ్మ నడువవమ్మ.

175


మ.

అదె మాస్వామి సుధారసోద్భవుఁడు దక్షారామభీమేశుఁ డ
భ్యుదయంబొంది ప్రతిష్ఠఁ గైకొనెడు నంభోరాశితీరంబునన్
బదమా షట్పదమాలికాపరిలసత్పాథోధునీసంపదా
స్పదనానాసలిలప్రవాహలహరీసంభారగోదావరీ.

176

తే.

సోమశేఖరుండు భీమేశ్వరస్వామి, తివిరినాఁడు సంప్రతిష్టఁ బొంద
వేళదప్పకుండ విచ్చేయఁగారాదె, త్ర్యంబకాద్రిసరసిధామలక్ష్మి.

177


మ.

అని మెప్పించి మహర్షు లేడ్వురును నత్యాశ్చర్య మొప్పన్ బ్రభా
వ నిరూఢిం గొనివచ్చి రంధ్రవసుధావక్షోజహారావళిన్
మును బృందారక సేవ్యమానసలిలన్ గోదావరీవాహినిన్
వెనుక న్ముందఱఁ బార్శ్వదేశముల నావేశించి సేవించుచున్.

178


వ.

అప్పుడు ప్రతిష్ఠావలోకంబునకు లోకపాలకగంధర్వయక్షసిద్ధసాధ్యవిద్యాధరోరగామరసహితుండై దేవేంద్రుం డంబరమార్గంబున ఋషుల ననుసరించి యేతెంచుచుండె నాసమయమ్మున.

179


తే.

ఒక్కనదిపొంత గార్హస్థ్యయుక్తమైన, పుణ్యతప మాచరించుచుఁ బుణ్యజనులు
తారు బంధులుఁ దామరతంపరగుచుఁ, గూడియుండంగ నెంతయుఁ గాడుచేసి.

180


తే.

ఋషులవెంబడి సంరంభ మెసఁగవచ్చు
తటిని నడుత్రోవ వనములోఁ దపము సేయు
దైత్యమునులపుణ్యాశ్రమస్థలము సొచ్చి
వఱదఁ గొనిపోయె నిండు సర్వస్వములను.

181


శా.

ప్రాగ్వంశంబులు స్రుక్స్రువంబులును యూపస్తంభపంక్తుల్ హవి
ర్భుగ్వేదీనిలయంబులున్ వఱదలోఁ బోవంగ దేవార్చనా
స్రగ్వాసోఘటికాకమండలు బ్రుసీసంఘాతముం దేలిపో
వాగ్వాదం బొనరించి రప్పుడు మునివ్రాతంబుతో దానవుల్.

182


క.

ఆకాశదివ్యమునులును, నాకౌకఃప్రత్యనీకనాయకమునులున్
వాకాటులకుం జొచ్చిరి, పాకంబులు దప్పినట్టి పటురోషములన్.

183


తే.

శిఖలు వీడఁగ ముఖములు జేగురింప
గటము లదరంగ నొకవిడిఁ గాటులాడి
యొండొరులమీఁద శాపంబు లుగ్గడింప
హస్తములయందు సలిలంబు లందుకొనిరి.

184


వ.

ఇట్లందుకొని దానవులు సప్తర్షిసమానీతయైనయవ్వాహిని శుష్కతోయ యయ్యెడుమనియును, మునులు దానవులకు సమాశ్రయంబైయప్పుణ్యవాహిని యపూజ్యయై యస్పృశ్య యయ్యెడు మనియును, శపియించి రప్పుడు.

185

తుల్యభాగ యుత్పత్తిక్రమము

తే.

అమరులకు నాశ్రయంబైన యాస్రవంతి, తుల్యభాగాహ్వయుండు దైత్యుండు దేరఁ
బూర్వమున గౌతమీగంగఁ బుట్టివచ్చె, నందు రితిహాసతత్త్వజ్ఞు లైనబుధులు.

186


వ.

తుల్యభాగుం డనుదైత్యుండు పరమార్థతత్త్వజ్ఞుండై పక్షపాతంబు లేక సురాసురులకు మాధ్యస్థ్యంబున వివాదంబులు తీర్చుచుండుటకు సమర్థుం డగుట నద్దానవుండు తుల్యభాగాహ్వయుఁ డనంబరఁగుట నన్వర్థనామధేయుండు.

187


క.

ఆతుల్యభాగుపేరను, నాతటికినిఁ దుల్యభాగ యనునామము ప్ర
ఖ్యాతివడసె నవ్వాహిని, గౌతమకన్యకునుఁ గూర్మి కన్యక మొదలన్.

188


సీ.

ఆతుల్యభాగమహామునీంద్రుఁడు ప్రీతి, మునిదానవశ్రేణి మ్రోల నిలిచి
వరుసతో వాదించి యిరుదెఱంగులవారి, వారించి కోపంబు వలదు మీకు
శపియింపఁ దగునయ్య సర్వసర్వంసహా, భువనపావనలైన పుణ్యనదులఁ
గ్రమ్మఱింపుఁడు శాపగరళాక్షరంబులు, క్రోధంబు లేల తపోధనులకు


తే.

ననుటయును వార లామాట లాదరించి
క్రమ్మఱువరాదు పలు కమోఘమ్ము మాకు
నీవు నిప్పుడు చెప్పిన హితవు నూది
వేఱు చందాన మేలు గావింతు మింక.

189


వ.

అని రాక్షసులు సప్తమునిసింధువునకు నంతఃప్రవాహంబును మునులు తుల్యభాగకు నుత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంబులను సూర్యచంద్రగ్రహణంబులను బ్రతిభానువారంబునను దర్శ పౌర్ణమాసీ ప్రభృతిమహాపర్వకాలంబులను సంక్రమణంబులు మొదలైనవిశేషకాలంబులను స్నానదానజపదపోహోమశ్రాద్ధదేవార్చనావిధానంబు లక్షయఫలంబు లగునట్టుగాను బతిసమేతంబుగా సతికి రజస్వలాత్వాద్యంతరాయంబు లేక యధశ్శయనబ్రహ్మచర్యోపవాసనియమంబులతో భానువారచతుష్టయంబు స్నానంబు సిద్ధించిన సంతానప్రాప్తి యౌనట్టుగాను వరంబు ప్రసాదించిరి తదనంతరంబ.

190


మ.

కెలనన్ ముందర సిద్ధకింపురుషులుం గీర్వాణులు న్నాగసా
ధ్యులు విద్యాధరకిన్నరేంద్రులు సమద్భూషింప దివ్యాప్సరో
లలనాబృందము లాడ దానవులు పిల్లంగ్రోళ్ళు పట్టంగ బొ
బ్బలు నార్పుల్ పటుసింహనాదములు నుత్పాదిల్ల ధాత్రీస్థలిన్.

191


చ.

మలఁగి మలంగి భీమపతిమందిరమండలసిద్ధభూమికిన్
దొలఁగి తొలంగి యుచ్చలితతోయతరంగపరంపరోద్ధతిన్
జెలఁగి చెలంగి యారభటి శీర్ణదరాధరధాతురేణులం
గలఁగి కలంగి పాఱె వడి గౌతమకన్యక దక్షవాటికన్.

192


తే.

దేవదుందుభు లుడువీథి దీటుకొలుప, నమరు లందంద పుష్పవర్షములు గురియ
మునిజనంబులు జయజయధ్వను లొనర్ప, దక్షవాటంబు చొచ్చె గౌతమతనూజ.

193


వ.

ఇవ్విధంబున గోదావరీపుణ్యవాహినిం గొనివచ్చి సప్తర్షులు పరమహర్షోత్కర్షంబున.

194

శ్రీ భీమనాథేశ్వరుఁడు దనకుఁదాన ప్రతిష్టితుండగుట

తే.

తారు దలఁచిన శుభవేళ దప్పకుండ, సంప్రతిష్ఠుఁడై సమర్చనము గొన్న
యమృతలింగంబు భీమనాయకునిఁ జూచి, చాల విస్మయ మందిరి సప్తమునులు.

195


వ.

ఆశ్చర్యంబునుం బొంది.

196


ఉ.

తారు వినిశ్చయించిన ప్రధానముహూర్తము దప్పకుండఁగా
మారి ప్రతిష్టఁ బొందుటకు నాత్మల సంతసముల్ వహించి యె
వ్వారొకొ మమ్ముఁ గైకొనక వారక మే మొనరింపనున్న సం
స్కారము తార చేసి రెడసందున నంచుఁ గలంగి యెంతయున్.

197


తే.

రోషసంరంభములును సంతోషములును
హృదయములఁ బిక్కటిలనున్న ఋషులకడకు
నంతరిక్షంబు నందుండి యతిరయమున
భానుమంతుండు భక్తి సంభ్రమము లెసఁగ.

198


వ.

వచ్చి యభివాదనంబు చేసి ముకుళితకరకమలుండై కమలమిత్రుం డమ్మహామునుల కిట్లనియె.

199


చ.

పరమమునీంద్రులార మిముఁ ప్రార్థన సేయుచు విన్నవించెదన్
గరుణ దలిర్ప మీచనవుఁ గైకొని నన్ను ననుగ్రహింపుఁ డీ
తెరువున మీకు నంకిలులు దీర్పఁగఁ గాలవిలంబమైన
హరుఁడు ప్రతిష్టితుండు నగు నప్పుడు నే నటు పూజ చేసితిన్.

200


క.

మీ రొనరించు ప్రతిష్టా, ప్రారంభము నాకుఁ జేయ నలవియె శ్రీద
క్షారామవిభుఁడు జగదా, ధారుఁడు గైకొనియెఁ దనకుఁదాన ప్రతిష్ఠన్.

201


క.

మేలెట్టి దట్టి శోభన, కాలము సరిగడచెనేని కాదని కంఠే
గాలుఁడు కారుణ్యసము, న్మీలితమతిఁ దనకుఁదాన నిలువంబడియెన్.

202


చ.

తనకుందాన ప్రతిష్ఠతుండయిన యీ దక్షాధ్వరధ్వంసి నే
మును పూజించితిఁ బిమ్మటన్ హరియు నంభోజాతగర్భుండునుం
గని కైసేసిరి యంతమీఁద సురలున్ గంధర్వులుం జేరి య
ర్చనముల్ చేసిరి మీరుఁ జేయుఁడు తగన్ సమ్యుక్సమారాధనల్.

203


తే.

అనిన సంయములును గాలయాపనమునఁ , జంద్రశేఖరు సంప్రతిష్టాపనంబు
తమకు సిద్ధింపకునికి సంతాపమొంద, బలికె నాకాశవాణి విస్పష్టఫణితి.

204


ఉ.

ఓ పరమర్షులార కరుణోదధి యిందువతంసుఁ డాత్మసం
స్థాపితుఁ డయ్యు మీ దెసఁ బ్రసాదముపేర్మి భవత్ప్రయత్నసం
స్థాపితుఁ డైనవాఁడ యిది సత్యము మీరు మనంబులోన సం
తాపముఁ బొందకుండుఁడు ప్రధానము భక్తియె కాదె యిమ్మహిన్.

205

తే.

అల్పమే మీరు చేసినయట్టి భక్తి, యభవమూర్ధాభిషేకార్థ మధికభక్తి
దెచ్చితిరి గౌతమీమహాదివ్యతటినిఁ, బాదపీఠోపకంఠభూభాగమునకు.

206


మ.

అభిమానించిన మీర లేడ్వురు బ్రతిష్ఠారంభకాలంబునం
దభిషేకించిన తిగ్మభానుఁడును నేకార్థక్రియ న్మించువాం
డ్రు భవార్చారతి నెంచ మీర లెనమండ్రుం నిల్పినా రంబికా
విభునిన్ సత్యమ నేను చెప్పితి నభోవీథీవిటంకంబునన్.

207


తే.

మీర లెనమండ్రు భుజగేంద్రహారునొద్ద, భక్తిఁ బూజింపఁ బెట్టుఁడు పాశుపతుల
వారిపే రష్టమూర్తులు గారవమున, వారుదాఁకఁగ నర్హు లెవ్వారలైన.

208


తే.

అష్టమూర్తి విశిష్టాన్వయప్రసూతుఁ, డర్హుఁ డేపాటివాఁడైన నభపు నంట
వేదశాస్త్రపురాణసంవేదియైన, నితరుఁ డర్హుండు గాండు భీమేశు నంట.

209


వ.

అని యాకాశవాణి మీరలును సూర్యుండును సములని యుద్దేశించి పల్కిన విని హర్షంబు నొంది మహర్షులు నభోమణి నభినందించి యతండును దామును హేమకుంభంబుల సప్తగోదావరప్రవాహాంబుపూరంబులు దెచ్చి యయ్యభవు నభిషేకించి పూజించిరి; సప్తర్షిసమానీత గావున నమ్మహానదికి సప్తగోదావరాహ్వయంబు సంభవించెనని చెప్పుటయు శ్రీభీమేశ్వరమహాదేవుమాహాత్మ్యంబు విన వేడుక యయ్యెడు నయ్యీశానుపుణ్యకథావిధానంబు వినిపింపవే యనుటయు.

210


మ.

అవనీభారధురీణ రీణరిపుసైన్యాధీశ ధీశక్తివై
భవలీలాజితకావ్య కావ్యరచనాపారీణతావాస వా
సవభోగప్రతిమాన మానవినయాచారార్థసంభార భా
రవిసంకాశమహాకవీంద్రపరిషత్ప్రస్తూయమానోదయా.

211


క.

కాశ్యపగోత్రపవిత్ర య, వశ్యా యధరాధరోద్భవాధిపభక్తా
వేశ్యాకటాక్షదీక్షా, వశ్యవిహారాపహసిత వాసవతనయా.

212


మాలిని.

కమలభవవధూటీ కంఠకహ్లారమాలా
సముదితమధుహారా సౌరభాసారలక్ష్మీ
సమధికరుచిసంపత్సార సారస్వత శ్రీ
హిమితసుకవిరోధీడ్ఢృత్సరోజాతజాతా.

213


గద్య.

ఇది శ్రీకమలనాభపౌత్ర మారయామాత్యసుపుత్ర సుకవిజనవిధేయ సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయ ప్రణీతం బైనశ్రీభీమేశ్వరపురాణం బనుమహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. శర్వభవానీ శరణు జగదాధారా
    సర్వంబుఁ దామె యనుచును, గర్వించిరి యసురు లెల్ల గౌరీరమణా. పా.
  2. దానవసంఘమే తత్క్షణంబునం ద్రుంతు, ననుచును మా కిప్పు డభయ మిమ్ము
    మమ్ములఁ గృపఁజూడు మన్మథాంతకగంధ, సింధురాసురవైరి సేమ మిమ్ము. పా.