భీమేశ్వరపురాణము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు
శ్రీరామాయనమః
శ్రీమహా గణాధిపతయేనమః
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః

శ్రీ భీమేశ్వరపురాణము

తృతీయాశ్వాసము

శ్రీభీమేశ్వరకరుణా
లాభసముజ్జృంభమాణలక్ష్మీవిభవా
ప్రాభవకశ్యపమునివం
శాభరణా! బెండపూఁడియన్నామాత్యా. 1

వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పందొడంగె. 2

గీ. అవ్విధంబున బాష్పధారాకులాక్షుఁ
డగుచు సత్యవతీసూనుఁ డడలుటయును
నెలఁతయును దాను గన్నుల నీరునించెఁ
గరుణ చిత్తంబులో నుబ్బఁ గలశభవుఁడు. 3

వ. అనంతరంబ యంతరంగంబున సంతాపంబు డిందుపఱచుకొని సత్యవతీనందనుండు కమండలుజలంబులు కన్నులఁ దడుపుకొని నిట్టూర్పు నిగిడించి కాశికావియోగక్లేశంబున సమానవ్యసనుండైన కుంభసంభవున కిట్లనియె. 4

ఉ. ఈవును నేనపోలెను మునీశ్వర భాగ్యము లేమిఁ జేసి ఆ
శీవిరహాగ్నితాపమునఁ జేప్పడినాఁడవు చెప్పవయ్య నా
త్రోవ మహాత్త దక్షపురి ధూర్జటి శంభుఁడు భీమనాథుఁ డా
ర్యావిభుఁ డాశ్రయార్హుడగునా? నను నేలికొనం దలంచునా? 5

మ. జగతీమౌళివతంసభూషణము విశ్వఖ్యాతముం గాశికా
నగరంబు న్బెడఁబాసి నీకును జగన్మాన్యైకచారిత్ర యీ
చిగురుంబోఁడికి నాకునుం గటకటా చేట్పాటు వాటిల్లె నీ
ముగురం గూర్చిన ముండదైవమునకున్ మోమోట లేదో సుమీ? 6

సీ. నిండి పాఱుచు నుండు నే నిదాఘములందుఁ, దళుకొత్తు సప్తగోదావరంబు?
షట్కాలశంభుపూజావిధానములకు, బల్లవప్రసవదర్భలును గలవె?
కాంతాజనంబులు కమియాన నిడుదురే, పురములోఁ దత్కాలపుణ్యభిక్ష?
ఘనతపంబునకు విఘ్నంబు సేయరుగదా, యమరేంద్రుఁ డొసఁగిన యప్సరసలు?
తే. కాలభైరవవిఘ్నేశకార్తికేయ, వీరభద్రాదిపరివారవీరగణము
స్వాగతము సేయునే కార్యసాధకులకు, దక్షవాటికయందు వాతాపిదమన? 7

ఉ. ముక్కు మొగంబు చూడ కొకమోసపుమాటకు విశ్వనాయకుం
డెక్కడికైనఁ బొమ్మనుచు నెఱ్ఱనిచూపులఁ జూచె నల్కతో
ధిక్కరణంబు సేయఁ జనుదంచితిఁ గాశిని నుండి నాకుఁ దా
దిక్కయి భీమనాకుఁడు దీర్చునొకో యవమానదుఃఖముల్. 8

తే. నన్నుఁ గన్నతల్లి యన్నపూర్ణామహా, దేవి విశ్వనాథదేవు తరుణి
గుఱుతు చెప్పి తన్నుఁ గొలువంగఁ బుత్తేర, వచ్చినాఁడ నేలవలదె తనకు? 9

సీ. భీమేశ్వరేశ్వర శ్రీమహాదేవుండు, కరుణించునే నన్ను బరమశైవ?
సప్తగోదావరోత్సంగధాముఁడు నన్ను, నాదరించునె యిల్వలాసురారి?
సప్తపాతాళవిష్కంభమూలస్తంభ, మూరిడించునె నన్ను నుపరతాత్మ?
దక్షిణాంభోరాశితటమేదినీభర్త, రక్షించునే నన్ను • బ్రహ్మవాది?
తే. స్వాగతము సేయునే నాకుఁ జంద్రమౌళి, కాంక్షితంబిచ్చునె నాకుఁ గాళగళుఁడు?
కాశీలోఁ బడ్డ మానభంగంబు వాయఁ, గుస్తరించునె నను శూలి కుంభజన్మ? 10

ఉ. దోసము పెద్ద లేదనక ధూర్జటి నిష్ఠురకంఠహుంక్రియా
భ్యాసముమై నదల్చి యదయస్థితిఁ గాశి వెలార్చె నింక నే
నా సరిసంయమీంద్రుల ననాథత నేమెయిఁ జూతు దక్షవా
టీసదనుండు ప్రేమ ఘటియింపక తాను నుపేక్ష చేసినన్. 11

కలశభవుఁడు పారాశర్యునకు దక్షారామమహిమంబు చెప్పుట

వ. అనినఁ బారాశర్యునకు నత్తపోధనవర్యుం డిట్లనియె. 12

మ.వితతాష్టాదశసంహితాగమకథావీథీసహస్రంబు భా
రతతంత్రం బఖిలంబు నీయది యపారంబైన యౌమ్నాయసం
తతి నీచే వివరింపఁగాఁబడియె విద్యావర్ధనా నీవు నీ
క్షితిలోఁ గానని క్షేత్రముల్ గలవె? యీచింతాభరం బేటికిన్. 13

వ. భీమలింగంబు మాహాత్మ్యంబు నీ వెఱుంగనియదియునుంగలదె? దక్షారామపుణ్యక్షేత్రం బఖిలపురాణప్రసిద్ధంబు కాదే? నీమనోవిషాదంబునం జేసి యెఱుఁగనివాఁడవుంబలె నడిగెదవుగాక, యైన నడిగిన యర్థంబు చెప్పెద నాకర్ణింపుము. 14

ఉ. మోక్షస్థానము భోగభూమియును నై మున్నూఱుక్షేత్రంబులన్
సాక్షాద్బ్రహ్మపదం బనంగ నపరస్వర్గంబునా నొప్పగున్
దక్షారామము భీమనాయకమహాధామంబు లోకత్రయీ
చక్షుః ప్రాహుణకాయమానసుషమాసంపత్సముద్దామమై. 15

తే. రాజవంశజుఁడగు భగీరథునివెనుకఁ, బాఱుతెంచిన చదలేఱు పాటియగునె
సప్తమునిరాట్ప్రతాపసంప్రాప్తమైన, సప్తగోదావరంబుతో సారమహిమ. 16

సీ. దక్షప్రజాధినాథమహాధ్వరక్రియా, దీక్షాధిగమపుణ్యదేశమునకు
బ్రహ్మవిష్ణుపురందరప్రధానసుపర్వ, పరమసంయమిసభాభవనమునకు
దాక్షాయణీయోగదహనార్చిరున్మేష, సామిధేనీమంత్రజాతమునకు
వీరభద్రభుజావిహారహేలాసమా, రంభనాటకనాట్యరంగమునకు
తే. నమృతమయదివ్యతేజస్స్వయంభులింగ, శాంతభీమేశ్వరేశ్వరస్థానమునకు
దక్షవాటంబునకు మోక్షధామమునకు, భోగజన్మస్థలమున కేపురము సరియె? 17

వ. వెండియుఁ చండభానుకృతప్రతిష్ఠుండును, నాఖండలముఖనిఖిలబర్హిర్ముఖశిఖామణిమయూఖకిమ్మీరితచరణారవిందుండును, సప్తపాతాళభువననిష్కంభనిర్భేదసమాసాదితావిర్భావుండును, దివ్యామృతస్వయంభూరుజ్జ్యోతిర్లింగమయమూర్తిధరుండునైన, భీమేశ్వరుండు భోగమోక్షప్రధానదీక్షాధురంధరుండై యందు వసించియుండు నమ్మహాదేవుచేత నప్పుణ్యక్షేత్రం భీమమండలంబనఁ బండ్రెండు యోజనంబులమేర కైవల్యకల్యాణమండపంబును భోగలక్ష్మీవిలాసభవనపుండరీకంబునునై కుండలాముఖసంవేద్యశార్దూలక్షేత్రంబులు మొదలుగాఁ గల శాఖోపశాఖాక్షేత్రంబులం గలిగి దక్షిణజలధివేలావనోపకంఠంబున వేదండవదనశుండాకాండచుళికితోన్ముక్తసప్తగోదావరసలిలధారాఝణత్కారబృంహితబ్రహ్మాండగోళంబును, దుల్యభాగాప్రవాహలహరికాఘోషఘుమఘుమాయమానదిగ్విభాగంబును, నేలానదీమాతృకాయమానకేదారక్షేత్రసంవర్ధితానేకవ్రీహిభేదసంపత్సంపన్నంబును, ఫలభరితనారికేళషండమండితప్రౌఢపీఠాపురోపకంఠసీమాబహిర్భాగంబును, మాతృకాయమానగోదావరీక్షేత్రపుణ్యాగ్రహారపరంపరాభూనిలింపసంపత్సంపాదితాధ్వరక్రియాసమాహూతాదిదేవతాకదంబసంబాధసంచరితంబును, గౌంతేయవాహినీప్రాంతసంతప్యమానమునిమండలంబును సహకారకాంతారఫలరసాస్వాదమోదమానపుంస్కోకిలకుటుంబకంఠనాళకోమలకుహూకారకోలాహలప్రపంచితపంచముంబును, హరివంశంబునుంబోలె బలభద్రప్రద్యుమ్నానిరుధ్ధపురుషోత్తమాధిష్టితంబును నై, మహాక్షేత్రంబన, మహాలింగస్థానంబన, దక్షిణకాశియనఁ, గళ్యాణనిలయంబనఁ, గైలాసప్రతిబింబంబన, ననశ్వరమహైశ్వర్యంబును, నప్రతిమవైభవంబును, నవాఙ్మానసగోచరంబును, ససంఖ్యాతప్రమథగణసమాకీర్ణంబును నై , యశేషకల్యాణనిలయం బై యొప్పు నమ్మహాస్థానంబునందు. 18

సీ. పాటలంబగుజటాజూటంబునడునట్టు, పూపచుక్కలరాజు పొడవు చూపు
వెడఁద యైన లలాటవీథీవిటంకంబు, కట్టెఱ్ఱక్రొవ్వేఁడి కన్నుఁ గూర్చుఁ
గంబుసన్నిభ మైనకంఠప్రదేశంబు, గరళ కూటముఛాయఁ గ్రాఁచి యుమియుఁ
గడుమనోజ్ఞము లైనకర్ణపార్శ్వంబులఁ, బెనుపాఁవపోఁగులు బిత్తరించు
తే. భీమమండలికాపుణ్యభూమియందు, వివిధకైవల్యకళ్యాణవేది ననఁగఁ
గీటపక్షిసరీసృపక్రిమిచరాది, జంతుకోటికిఁ బ్రాణావసానవేళ. 19

సీ. ఒకచోటఁ గోటివల్ల్యుడు రాజకోటీర, విభ్రాజితోత్సంగ వృద్ధగంగ
యొకచోటఁ బీఠాంబికోన్నతస్తనభరా, స్ఫాలజర్జరితకల్లోల యేల
యొకచోటఁ జటులవక్రకుళీరపాఠీన, తోయగర్భాభోగ తుల్యభాగ
యొకచోట నప్పరోనికరసంసేవితాం,తరము శ్రీసప్తగోదావరంబు
తే. నమరు నాగరఖండసిద్ధాంతజాతి, నాగవల్లీసమాక్రాంత పూగఖండ
మండితోద్యానవాటికాఖండవిభవ, పాత్ర మగుభీమమండలీక్షేత్రమునకు. 20

సీ. త్ర్యంబకాచలశిఖాగ్రమునందు నుదయించి, పొదలి యార్యావర్తభూమిఁ దఱిసి
నులఁగి దండకవనీమధ్యభాగమున నా, ప్రప్రవణాచలప్రస్థ మొఱసి
పట్టిసశ్రీవీరభద్రేశు సేవించి, క్షేత్రసోమేశుమందిరము డాసి
యేచియనంతభోగేశ్వరస్థానంబు, రుద్రపాదములపైఁ ద్రోవ గాఁగఁ
తే. గోటిపల్లీశు కోమలాంఘ్రులకు మ్రొక్కి, కుండలాముఖక్షేత్రంబుఁ గుస్తరించి
భీమమండలి డాపలఁ బెట్టుకొనుచు, గౌతమీగంగ లవణాబ్ధి గౌఁగిలించె. 21

తే. నీరుకడఁ గోళ్లఁగూడిమున్నీటిఁగవయు
మొగులుబడి వాహినుల కెట్లు మొరయవచ్చు
వార్ధు లేఁడింటికి వలపువనిత యైన
మంగళోత్సంగగౌతమీగంగయెదుర. 22

ఉ. ఎక్కడఁ జూచినం సరసి యెక్కడఁ జూచిన దేవమందిరం
బెక్కడఁ జూచినం దటిని యెక్కడఁ జూచినఁ బుష్పవాటికల్
యెక్కడఁ జూచిన న్నది మహీవలయంబున భీమమండలం
బెక్కడ యన్యమండలము లెక్కడ భావన చేసి చూచినన్. 23

తే. బ్రహ్మహత్యాదులగు మహాపాతకములు
ధాత్రిజనులకు నిమిషమాత్రమునఁ బాయు

భీమనాథమహాదేవు పెండ్లినాఁటి
దక్షిణాముఖమండపదర్శనమున. 24

తే. కార్తికీవేళ భీమశంకరునినగరఁ
దూఱు నెవ్వాఁడు చిచ్చఱ తోరణంబు
నతఁడు దూఱఁడు ప్రాణనిర్యాణవేళ
ఘోరయమపట్టనద్వారతోరణంబు. 25

తే. ద్వాదశక్షేత్రపుణ్యక్షేత్రములతోడ, రమ్యమగు సప్తగోదావరంబుతోడ
వరదభీమేశ్వరేశ్వరావాసమైన, దక్షవాటంబు కళ్యాణధామ మమరు. 26

తే. అప్పురంబు ప్రభావంబుఁ జెప్పనేల, తిరిగి పాఱంగ యోజనత్రితయభూమి
వాపికాకూపగర్తపల్వలతటాక, క్షేత్రజలములు భాగీరథీజలములు. 27

సీ. పంచాక్షరీమంత్రపారాయణంబులు, జపియించు శారికాసముదయములు
నీలకంఠస్తోత్రకోలాహలప్రౌఢి, జూపు నున్మత్తపుంస్కోకిలములు
శతరుద్రసచ్ఛృతి స్వాధ్యాయపాఠంబుఁ, బరిఢవించుఁ గిశోరబంభరములు
ప్రణవాక్షరాభ్యాసపరిపాటిఁ బాటించు, నానావిధంబుల నమిలిపిండు
తే. సప్త గోదావరంబు నిరర్ఘసహస్ర, సారణీసేకసాంతత్యసంప్రవృద్ధ
వివిధతరుగుల్మవల్లికావేలమైన, తత్పురోద్యానవీథికాంతంబునందు. 28

సీ. నిఖలపుణ్యక్షేత్రనివహంబునందును, నత్యంతమాశ్రయం బనఁగ నెగడి
యైంద్రసంపద కెల్ల నాధారభూతమై, దక్షునియజ్ఞంబు తానకమయి
ద్వాదశపుణ్యక్షేత్రములతో సంధిల్లి, భోగమోక్షవిహారభూమి యగుచు
నియమయాత్రామాత్రనిశ్శేషదోషాప, హరణం బొనర్ప సమర్థమగుచు
తే. సిద్ధనిర్మలనిరవధి శ్రీస్వయంభు, ధన్యభీమేశ్వరేశ్వరస్థాణులింగ
దైవతస్థితిసంభవస్థానమైన, దక్షవాటంబు వర్ణింపఁ దరమె మనకు. 29

క. దక్షిణకాశీనగరము, దక్షారామంబు భీమధామము ధన్య
త్కుక్షిక్షోణీమండల, రక్షామణి దానిఁ బొగడ బ్రహ్మకు వశమే. 30

సీ. భీమేశ్వరేశ్వర శ్రీమహాదేవుండు, హిమధామమౌళి విశ్వేశ్వరుండు
సప్తగోదావరసలిలప్రవాహంబు, సాక్షాత్కరించిన జహ్నుకన్య
తిరుచుట్టుమాలెలోఁ దిరమైనగణపతి, యేకాంతడుంఠివిఘ్నేశ్వరుండు
దక్షిణంబుననున్న దండపాణీశుఁ డూ, హింపంగ దండపాణీశ్వరుండు
తే. భైరవస్వామి శ్రీకాలభైరవుండు, నంది నందీశ్వరుం డేమి సందియంబు
దక్షవాటంబు కాళికాస్థలముగాదె, తీవ్రకరతేజ సత్యవతీతనూజ. 31

వ. మఱియు భీమేశ్వరమండలమునకు సీమాసంవిభాగంబు. 32

తే. జంభరిపుదిక్కునకు సీమ సలిలరాశి, పశ్చిమమునకు సీమ త్ర్యంబకతనూజ
ద్యుమ్నపతిదిక్కునకు సీమ తుల్యభాగ, దక్షిణమునకు వృద్ధగౌతమియె సీమ. 33

తే. భోగమోక్షమహైశ్వర్యయోగకాంక్ష, భీమమండలిఁ గాపుండఁ బ్రియమువుట్ట
మర్త్యయోని జనింపంగ మదిఁ దలంత్రు, వివిధగంధర్వకిన్నరవిబుధవరులు. 34

తే. భీమమండలికాపుణ్యభూమియందుఁ, దేజరిల్లెడు పండ్రెండుక్షేత్రములకు
జాతరలు సేయు నప్సరస్సతులతోడ, నాకముననుండి యేతెంచి నముచివైరి. 35

సీ. ఏడురసాతలక్రోడంబులును విని, ర్భేదించి వెడలిన పెద్దవేల్పు
మార్తాండుచే నభోమణిచేత రవిచేఁ బ్ర, తిష్ఠఁ బొందిన మహాదివ్యమూర్తి
సప్తర్షు లరుదేర సప్తగోదావరం, బవగాహనము చేసినట్టిప్రోడ
తొలుమామ యగుదక్షు, నెలదోఁటనడుచక్కి,విహరణం బొనరించువేడ్కకాఁడు
తే. విశ్వపతి భీమనాథేశ్వరేశ్వరుండు, కర్తయై యుండి భోగమోక్షముల నిచ్చు
భక్తజనులకు నట్టి వైభవపదంబు, మండనము మేదినికి భీమమండలంబు. 36

సీ, ఎచ్చోటఁ దాఁ బాఱె నిఱ్ఱిరూపముఁ దాల్చి, యతిసాధ్వసంబుతో నధ్వరంబు
పాటిల్లె నెచ్చోట భాషావధూటికి, నతిజుగుప్సితమైన యంగవికృతి
యెచ్చోట ముచ్చిచ్చు నేడేసినాల్కలు, కొండనాల్కల దాఁకఁ గోఁతవడియె
నెచ్చోట నులివేఁడి యెండఁ బండులు రాలి, పూషార్కువదనంబు బోసివడియె
తే. దక్షుఁ డెచ్చోటఁ బొట్టేలితల ధరించెఁ, జిందువందయ్యె నెచ్చోట నిందుఁ డనుచుఁ
జెప్పుదురు వీరభద్రుని జృంభణంబు, భీమమండలి నుండు ప్రాఁబెద్దమునులు. 37

వ. నీవు విశ్వేశ్వరదేవవిరచితావమానమనశ్శల్యంబున డస్సి ఖిన్నుండవై యున్నవాఁడవు; నిన్ను విడిచిపోవుట నాకు నుచితంబు గాదు; నీవు నేనునుంగూడి ద్వాదశపుణ్యక్షేత్రయాత్రాప్రసంగమునఁ గుక్కుటేశ్వరదేవు దర్శింపఁగలవార మీవేళ దక్షారామంబునకు మగిడి పోదము లెమ్మని యతండును దానును లోపాముద్రయును శిక్ష్యమండలంబునుం గదలి యిష్టాలాపంబులం బ్రొద్దుపుచ్చుచుం జనిచని. 38

సీ. తుల్యభాగాతటీద్రుమమండలం బైన, సాంపరాయపురంబు సరణిఁ బట్టి
చూతాటవీవాటి శోభమానం బైన, పులుగుర్తిసోమేశు వలపలించి
యోంకారపురిఁ ద్రికూటోపరిస్థితులైన, హరిహరబ్రహ్మల నభినుతించి
శీలామహాగ్రామసింహాసనస్థున[1], కురగహారున కెదురుండి మ్రొక్కి
తే.యరుగువారు మునుల్ పరాశరసుతునకు
దక్షవాటిఁ బ్రవేశింపఁదగినయట్టి

శుభముహూర్తంబునకుఁ గాలశుద్ధి దెలియఁ
దలఁచి కూర్చుండి రొకవివిక్తస్థలమున. 39

వ. అప్పుడు కాలశుద్ధి విమర్శించి మైత్రావరుణుండు పరాశరసుతున కిట్లనియె. 40

తే. గార్గ్యసిద్ధాంతమత ముషఃకాలకలన, శకున మూనుట యది బృహస్పతిమతంబు
విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము, సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మత మగు. 41

తే. అసురపురములు సాధించె నంధకారి, యమరపాథోధి ముథియించి రమరవరులు
దివ్యసింహాసనం బెక్కె దివిజభర్త, సిద్ధమధ్యాహ్నవే ళాభిజిత్తునందు. 42

వ. ఇంక నొక్కవిచారంబు. 43

తే. నాభిమండల మిచ్చోటునడుము గాన, భీమమండలి కాపుణ్యభూమినెల్ల
నిచ్చటనె యుండి వీక్షింతమే? మునీంద్ర, యాకసం బెక్కి యోగవిద్యాబలమున. 44

క. భద్రగతి నేను లోపా,ముద్రయు నిర్నిద్రయోగముద్రాశక్తిం
రుద్రవిహారాలయము స, ముద్రముతోఁ గూడఁ జూతు మోమునివర్యా. 45

తే. ఇప్పుడు ఘటకాద్వయం బయ్యె నినుఁడు పొడిచి, దవ్వు చాల దిచ్చోటికి దక్షవాటి
కేవలము మంచినడకైనఁ గీసవెల్తి, రెండుజాములు నిట నూరకుండనేల. 46

వ. ఈ యోంకారపురపుణ్యక్షేత్రంబుసం ద్రికూటదివ్యభవననాటంబున మునిసంఘం బుండునది; మనము నభోమండలంబున కెగసి ముహూర్తమాత్రంబునఁ గన్నులపండువులుగా భీమమండలి పుణ్యక్షేత్రంబు గనుఁగొంద మనుటయుఁ బారాశర్యుండు సబహుమానంబుగా సమ్మతించిన. 47

వ్యాసాదు లాకసంబున నుండి భీమమండలంబుఁ గనుఁగొనుట


మ. పరమర్షు ల్భృతరోమహర్షమున లోపాముద్రయుం దారు నం
బరమధ్యంబున నావహం బను జగత్ప్రాణప్రవాహంబుపైఁ
బరిలంఘించిరి భుక్తిముక్తిరమణీప్రత్యగ్రలీలాస్వయం
వరసౌధంబగు భీమమండము సర్వంబున్ విలోకింపఁగన్. 48

వ. ఇవ్విధంబున నావహస్కంధగంధవాహప్రవాహమధ్యంబునఁ దపఃప్రభావావష్టంభంబున నిలిచి కుంభసంభవుండు బాదరాయణున కిట్లనియె. 49

సీ. అంధ్రభూభువనమధ్యము పుండరీకంబు, సప్తగోదావరజలము తేనె
బ్రహసంవేద్యాది బహుతీర్థములు రేకు, లకరులు చారుదివ్యస్థలములు
నాళంబు లవణాబ్ధి వేలావిభాగంబు, కళ్యాణభోగమోక్షములు తావి
దక్షవాటీమహాస్థానంబు కర్ణిక , హంసంబు భీమనాయకుఁడు శివుఁడు

తే. గౌతమీసింధుకౌంతేయకణ్వనదులు, తుల్యభాగయు నేలేఱు దుమ్మికొనలు
భువనసంభావ్యమైన యీపుణ్యభూమి, యనఘ సంసారతాపశాంత్యౌషధంబు. 50

సీ. సర్వంసహకుఁ గాసె సమకట్టుపుట్టంబు, గగనంబునకు నెల్లఁ గలువసెజ్జ
యవటంబు మేఘవాహనుగంధకరటికి, నభ్యవహార మౌర్వాగ్నిశిఖకు
వంటిల్లు యామినీశ్వరకళామౌళికిఁ, దరిచోటు నిఖిలబృందారకులకుఁ
గూటకచ్ఛపనాయకునకు నిశాంతంబు, మరుజనకునికిని మనికిపట్టు
తే. ఘనశరోద్దండపాఠీనకమఠనక్ర, తిమితిమింగిలచక్రవిక్రమవిహార
ఘుమఘుమారంభగంభీరఘోషఘటిత, లటదిశాప్రతిశబ్దోపలబ్ధి యబ్ధి. 51

సీ. జనమేజయారబ్ధ సర్వాధ్వరాహూత, చక్షుశ్శ్రనస్సహస్రములఁ బోలి
బ్రహ్మాండమండలప్రాసాదసంభాగ, హరిమణిస్తంభసంహతు లనంగ
జంభారిదోస్స్తంభదంభోళిఖండితాం, జనశైలశిఖరపుంజములఁ బనఁగి
సంహారసమయఝుంఝామారుతోద్ధూత, కాలాంబువాహసంఘములఁ గెలిచి
తే. యాడుచున్నవి తీండ్రిల్లి యంబరమునఁ, జేయుచున్నవి త్రిభువనాశ్లేషకంబు
నబ్జనాభుని తూఁగుటుయ్యలలు గంటె, వేనవేలు పయోరాశి వీచిఘటలు. 52

శా. కాశిం జచ్చిన యంతఁ గాని పడయంగారాని కైవల్య మ
క్లేశం బౌనటు వేద్యనాయకునిచే లీలాగతిం జేరు రా
రో శీఘ్రంబున మర్త్యులార యను నారూపంబునన్ మోయు నా
కాశాస్ఫాలనగౌతమీజలధిసంగస్థానకల్లోలముల్. 53

మ. అది సంవేద్యము; కోటిపల్లి యదె; దక్షారామమన్ పట్టనం
బదె; యభ్రంకషసౌధకూటఘనహేలావాసముచ్ఛ్రాయసం
పద సొంపారెడు భీమలింగము మహాప్రాసాదభూమీధరం
బిదె; సప్తర్షనదీప్రవాహ మిదె; సంవీక్షింపు మేకాగ్రతన్. 54

సీ. అదె పట్టిసస్థానమందుండు వీరభ, ద్రేశ్వరస్వామి యర్ధేందుమౌళి
యదె పుండరీకాద్రి యచట మార్కండేయు నిలువేల్పు ముక్కంటి వెలసెఁ దొల్లి
యదె కుమారారామ మాహర్మ్యరేఖయ, చాళుక్యభీమేశు సదనవాటి
యదె కుక్కుటేశ్వరం బయ్యుపాంతము మేడ, హుంకారిణీదేవి యోలగంబు
తే. వాఁడె మాయింటివేల్పు పల్వలపురమున
నుండులింగంబు ఫణిరాజకుండలుండు
సప్తమునిసింధుసంగమేశ్వరుఁడు వాఁడె
కుండలాముఖ మదె మౌనికులవరేణ్య. 55

క. అని చూపి చెప్పి కుంభజుఁ , డినుఁ గనుఁగొని శుభముహూర్త మిదె యేతెంచెన్
మనము దిగవలయు ననుచును, మునిమండలి మ్రోల దిగిరి ముగురుం ధరకున్. 56

వ. అనంతరంబ కుంభపులినసంభవులు సంబవులు దొడిగికొని కదలి, కదళికారామంబుల రామణీయకంబును, నుల్లసిత బిల్వచిరిబిల్వవిటపంబుల పొల్పును, ద్రాక్షారుద్రాక్షఖర్జూరకేసరసరళపున్నాగనారంగంబులరంగంబును, లవంగలుంగలవలీమల్లీవల్లీమతల్లి వేల్లనంబుల యుల్లాసంబును, ఘోంటాకురంటక ఝంటికాకంటకఫలకపిత్థ లోధ్రజంబూజంబీరపారిభద్రభద్రదారుశాల్మలీగుల్మ లీలాహేవాకంబు నుద్రేకంబును, గోమలతరతమాలమాలాకారశాకోటవిటపిషండంబులమెండును, జఱకుముఱకంబును, బ్రాసంగుమిసిమియుఁ, జెంగల్వతావిఠేవయుఁ, గుసుమవాటియెసకంబును, నుభయపార్శ్వంబులం గల ఘంటామార్గంబునుగా నెడనెడం గుసుమభారారంభసంభారకుసుమగుచ్ఛచ్ఛాయావిభాసితసంధ్యారాగసరభసంబును, గందియందంబును, బెసరసిరియును, మినుమునలువును, గోధూమ శ్యామాకవరగయును, మాషతోరసమున్మేషంబును, నేసియేపును, ననంతివనకేతనంబును, నువ్వుమవ్వంబును, గుళుత్థశుద్ధార్థమానవృద్ధియు, బ్రత్తిసంపత్తియు, బొబ్బరయుబ్బరంబును, నందసందర్భంబును, యవయావనాళ ప్రియంగుగుళుజతిలపరిస్ఫూర్తియు, దవ్విందలసందడియు, గంటెకొఱ్ఱతఱచును, గసగసలినయును, జెంగలించు జాంగలిక్షేత్రంబున నేత్రంబులకు నింపుసొంపుసంసాదింప ననంతాంతరాంతరంబులు, తరతరంబు తరళ తరతరంగరించోళికాంచలంబులం జెంగులం దువాళించుచు నతిశిశిరసలిలశీకరనికర నిరతకరణపరిణతింగొల్పి పోఁకమోఁకల పూవుఁబాలల నెత్తావికిం దావలంబులై కేవలంబుపొలయు సప్తగోదావరసమీకణంబులు నాసికాపుటకుటీరంబులకుఁ గుటుంబకంబుగా మందమందగమనంబున నహిమకరబింబం బంబరవీథిసౌధకూటంబున హాటకకలశభంగి నంగీకరించుకొలఁది నభిజిద్వేళ వేలావనోపకంఠకంఠాలంకారహారధామంబైన దక్షారామంబుఁ బ్రవేశించి రంత. 57

వ్యాసాదులు దక్షారామంబుఁ బ్రవేశించుట


క. ఇటు కృష్ణద్వైపాయన, ఘటజన్ములు భీమనాయకస్వామి మహా
కటకము ముక్తి ధూటీ, కటకాభరణంబుఁ జొచ్చి కడు వేడుకతోన్. 58

తే. కర్ణికారాంబికామహాకాళిగుడికి, నందముగ నూలుపట్టిన యట్టిచాయ
సూర్యవీథికిఁ జనిరి సంశుద్ధమతులఁ, బశ్చిమద్వారమునకు నై పరమమునులు. 59

వ. అప్పుడు ఘటోద్భవుం డమ్మహాస్థానంబు సత్యవతీసూనునకుఁ జూపి వెండియు నిట్లనియె. 60

సీ. లీలావిలాసలాలితలోకహర్షంబు, గోమేధికాకౢప్తగోపురంబు
గోపురస్థితశాతకుంభకుంభశతంబు, దివ్యరత్ననిబద్ధదేవగృహము
దేవగేహాకీర్ణదివిజాప్సరశ్శ్రేణి, యఖలవస్తుప్రపూర్ణాపణంబు
వివిధాపణస్వర్ణవేదికాధ్యాసిత, యక్షగంధర్వవిద్యాధరంబు
తే. శంఖభేరీమృదంగనిస్సాణపటహ, ఝల్లరీవేణువీణాదిశబ్దనిహ
కలకలోద్వేజితాశేషకల్మషంబు, నయనభాగ్యంబు దక్షిణానందవనము. 61

సీ. ఘల్లుఘల్లని రత్నకంకణంబులు మ్రోయ, గంధవాహునియాలు కసవునూడ్చు
లక్ష్మికెంగేలిలీలారవిందమ్మునఁ, గలయంపి చిలికించుఁ గమ్మఁదేనెఁ
దామ్రపర్ణియుఁ దాను తారకాపథగంగ, నలిముత్యముల రంగవల్లిఁ దీర్చు
నధివాసమును జేయు యమునిశుద్ధాంతంబు, ధూపార్తిమహినాక్షి ధూమఘుటిక
తే. సప్తపాతాళనాగేంద్రచంద్రముఖులు, ఫణమణిజ్యోత్స్నదివియగంబము లగుదురు
సోమమకుటుని గారాబుబజోటియైన, దక్షవాటికిఁ బ్రతిమహోత్సవమునందు. 62

మ. ధనకోటీవినిబద్ధకేశవశతద్రాఘిష్ఠవైశ్యాలయం
బనువేలధ్వనితార్థదాననిధిఘంటారావవేశ్యాగృహం
బనిమేషాక్షినిరీక్షితేశ్వరమహేడ్యక్షోణి బృందారకం
బనుసంధ్యాగతలోకపాలకము దక్షారామ మభ్యున్నతిన్. 63

తే. మొగులుముట్టిన సురపద్మమూర్ధవీధిఁ, గోటిపడగలఁ బొలుపారుఁ గూటకోటి
పట్టణమ్ము నిజాంగుళీపల్లవముల, నెట్టుకొని పాపములఁ బాయఁ దట్టుకరణి. 64

సీ. ఎచ్చోట క్షేత్రంబు లేఁకారుజనుల కి, చ్ఛామాత్రభోగమోక్షప్రదములు
కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు, గాంధర్వమున యక్షగానసరణి
జంకించు నెద్దాని శబలసౌధోపరి, ధ్వజపటంబులు దేవతాగృహముల
వసియింతు రెద్దాన వాలఖిల్యాదులు, తపసు లష్టాశీతిదశశతములు
తే. నెద్ది యమరేంద్రుపురలక్ష్మి కింతపెద్ద, యట్టి శ్రీదక్షవాటీమహాపురంబు
నద్భుతంబంది చూచిరి యాదిమునులు, సత్యవతినందనుఁడు గుంభసంభవుండు. 65

సీ. దక్షాధ్వరానలత్రయతీర్థ యొక్కటి, యోగాగ్ని నెందేని నురిసె గౌరి
యఖిలేష్టసంసిద్ధియందు రెండవతీర్థ, మెందేని నుమ గాంచె నిష్టసిద్ధి
సోమేశ్వరం బండ్రు సొరిది మూఁడవతీర్థ, మెందేని నఘము లిఱ్ఱింకులింకు
హైమవతం బందు రది నాలుగవతీర్థ, మెందేని హిమవంతుఁ + డొందె వరము
తే. సప్తగోదావరంబు పంచమసుతీర్థ, మఖిలశుభములు నెందేని నావహిల్లుఁ
బంచతీర్థంబు లివి యాడి పంచజనుఁడు , పాయుఁ బంచేంద్రియోద్భవపాతకములు. 66

గీ. శిష్టమునిలోకవిబుధాభిసేవ్యమైన, యిమ్మహాతీర్థము శక్తి నేమి చెప్ప
వానిపైఁ బాఱివెడలెడు వాయువేనిఁ, జీమకైనను గైవల్యసీమ నొసఁగు. 67

వ. అని దక్షారామమాహాత్మ్యంబు వర్ణించుచుఁ బ్రదక్షిఁణక్రమంబున భీమేశ్వరుదివ్యమందిరంబు వలపలించి సప్తగోదావరంబునకు డిగ్గి కృతస్నానులై రప్పుడు సాత్యవతేయుండు కుంభసంభవు కిట్లనియె. 68

తే. ద్వాదశక్షేత్రశివలింగదర్శనంబు, మొదలఁ జేయంగవలయుట ముఖ్యపక్ష
మానతీఁదగు నాకు నీవానుపూర్వి, శంభులింగంబు లవి యెవ్వి కుంభజన్మ. 69

క. ఇటమున్న దక్షవాటీ, కటకంబునయందు బెద్దకాలంబు వసిం
చుటఁ దీర్థంబులు నీకున్, ఘటసంభవ యాడినవియె కావె తలంపన్. 70

వ. అసిన వీని యగస్త్యుండు సాత్యవతేయున కిట్లనియె. 71

తే. పూర్వజన్మకృతంబైన పుణ్యరాశి, పాకదశఁ బొందు నెప్పు డప్పాటఁగాని
సకలసంసారదురితనిస్తారమైన, శివకథాగోష్ఠి చెవులకుఁ జెలువుగాదు. 72

వ. అని పలికి సత్యవతీసూనునకుఁ గుమారవక్త్రంబునఁ దాను విన్నప్రకారంబున మైత్రావరుణుండు ద్వాదశతీర్థమాహాత్మ్యంబు నిట్లని చెప్పందొడంగె. 73

సీ. ఇంద్రేశతీర్థంబు ఋషిసమాకీర్ణంబు, సిద్ధేశ్వరము సర్వసిద్ధికరము
యోగీశతీర్థంబు యోగలక్ష్మీదాయి, కాలేశ్వరము భక్తకల్పతరువు
శమనేశతీర్థంబు శాంతిదాంతవిధాయి, వీరభద్రేశంబు విశ్వనుతము
బ్రహ్మేశతీర్థంబు బ్రహ్మర్షిసేవ్య మ, ష్టైశ్వర్యము కపాలేశ్వరంబు
తే. కుక్కుటేశంబు కాశికిఁ గొంతవెలితి, సోమనాథేశ్వరము ముక్తిసూచకంబు
శ్రీమహేశ్వరుతీర్థంబు శివుని మెచ్చు, త్రిభువనాభ్యర్చితము రామతీర్థ మనఘ. 74

క. గూఢములు నిగూఢంబులు, గూఢాగూఢములు నగుచుఁ గోటుల సంఖ్యల్
గాఢమహేశ్వరభక్తిని, రూఢిం దీర్థములు గలవు రుద్రునివాటిన్. 75

తే. గరుడగంధర్వయక్షకిన్నరులచేత, దివిజఖేచరదైత్యదానవులచేత
ద్వాదశక్షేత్రతీర్థమధ్యంబునందు, భక్తి శివలింగకోటి నిల్పంగఁబడియె. 76

క. ద్వాదశతీర్థకపరివే, షోదరమున భీమునాథుఁ డుజ్జ్వలతేజః
ప్రాదుర్భావుం డొప్పగు, నాదిత్యుఁడు పరిధినడుమ నమరెడుభంగిన్. 77

తే. ద్వాదశక్షేత్రవికచపత్రములతోడి, దక్షవాటిక యనెడి కెందమ్మివిరికి
సప్తగోదావరంబు నిర్ఝరము తేనె, నడుమ రాయంచ శ్రీభీమనాయకుండు. 78

తే. భైమమీశానలింగం బపారతేజ, మక్షయం బప్రధృష్యం బనాదినిధన
మమ్మహాజ్యోతిరత్నదీపాంకురంబు, కనకగర్భాండభవనవిష్కంభమునకు. 79

చ. అమృతపయోనిధానమున యందుదయించెఁ గళాసమృద్ధిఁ ద
న్పమరసుధాకరుండు నిజమారఁగఁ జూచిన దక్షవాటికా
రమణుఁడు భీమనాయకుఁడు రాజశిఖాభరణుండు గానినాఁ
డమరమునీంద్రసంఘముకరాంబుజముల్ మొగుడంగ నేర్చునే. 80

తే. విమలపాథోధిఁ బుట్టిన యమృతమూర్తి, భీమనాథుఁడు మాస్వామి కేమిచోద్య
మహరహంబును బాదసేవానురక్త, భక్తిజనలోకభవరోగభంజనంబు. 81

తే. భీమనాథునిఁ ద్రిభువనస్వామినాథుఁ, బార్వతీనాథుఁ శశ్వత్కృపాసనాథు
దక్షవాటాధినాథు వేదత్రయైక, నాథు నానాధుఁ గొలుతు శ్రీనాథునాథు. 82

సీ. భవు భవానీభర్త భావసంభవవైరి, భవరోగభంజను భాలనయను
భోగప్రదుని భోగిరాజవిభూషు, భూనభోభివ్యాప్తు భువనవంద్యు
భగవంతు భర్గుని భసితాంగరాగుని, భానుకోటిప్రభాభాసమాను
భాగీరథీమౌళి భగదృగ్విపాటను, భూరథాంగుని భధ్రభూతిధరుని
తే. భామినీసువిలాసార్ధవామభాగు, భక్తితోడ భజింపరో భవ్యమతులు
భావనాభాజుల కతండు ఫలము లొసఁగు, భాగ్యసౌభాగ్యవైభవప్రాభవములు. 83

క. తేజితవిష్ణుశిలీముఖుఁ, దేజఁప్రదు దక్షవాటి తీర్ధైకమహా
రాజాధిరాజరాజును, రాజకళాధరు భజింప రారో విబుధుల్. 84

క. రారో ప్రియశుద్ధాంతవ, రారోహాసహులు విబుధు లంబుజహంస
క్షీరామలదేహుని ద, క్షారామపురీనివాసు నభవునిఁ గొలువన్. 85

ఉ. నందివినాయకాదిగణనాథులు గూడి ధృతాస్త్రశస్త్రులై
యెందఱు పాలెముందురు మహీధరకన్యకు సావధానులై
నందివినాయనాదిగణనాథులు గూడి ధృతాస్త్రశస్త్రులై
యందఱు పాలెముందురు మహాప్రభువీటికి దక్షవాటికిన్. 86

సీ. భానుమండలములు పండ్రెండు నుదయించి, కరపాళి బిఱ్ఱెండ గాయకుండ
సంరంభమున నేడు ఝంఝానిలంబులు, నెగ్గలం బగు మ్రోత విసరకుండఁ
బుష్కలావర్తకంబులు లోనుగాఁగల, క్రొమ్మేఘములు వృష్టి గురియకుండఁ
బరపి లంఘించి సప్తమహార్ణవంబులు, విన్నంది పెనువెల్లి విరియకుండ
తే. నాజ్ఞవెట్టించుఁ బ్రమథనాయకులచేత, విశ్వపతి యైన భీమేశ్వరేశ్వరుండు
దక్షవాటికి నాత్మశుద్ధాంతమునకు, నవహితస్వాంతుఁ డగుచుఁ గాలాంతవేళ. 87

తే. భైరవుం డర్ధరాత్రంబు ప్రహరిఁ దిరుగుఁ
బాయకుండును నడురేయి బ్రమథగణము

గవనికాపులవారు దిక్పాలవరులు
దక్షవాటికి భీమేశుధామమునకు. 88

వ. అని ప్రసంగించి శివలింగార్చనాపరాయణుండైన మైత్రావరుణుండు త్రిలింగవిషయమంగళాలంకారంబగు భీమేశ్వరమండలంబునఁ బండ్రెండుశివలింగస్థానంబులు వివరించువాఁడై యిట్లనియె. 89

తే. ఉత్సవం బుత్సవము దప్పకుండ సురలు, వత్తు రౌత్సుక్యమున దక్షవాటమునకు
శాంభవీశక్తి మర్త్యవేషంబు దాల్చి, భీమలింగంబుఁ ద్రిభువనస్వామిఁ గొలువ. 90

క. తాండవమాడుఁ గుమారశి, ఖండి మహోత్సవమువేళ గంభీరములై
డిండిమనిర్ఘోషంబులు, పండువుపండువున నుఱుముభంగి వహింపన్. 91

తే. మర్త్యభామలు విబుధభామలును గలసి
యుత్సవములందు వర్తించుచున్నయపుడు
దక్షవాటంబు వీట భదంబు దెలియు
దృఙ్నిమేషానిమేషప్రదీప్తివలన. 92

శా. అర్కేందూవలరత్ననిర్మితమహాహర్మ్యాగ్రభాగంబులం
దార్కొన్ తారకమండలంబు గని ముగ్ధస్త్రీలు రే లప్పురిం
గర్కంధూఫలసన్నిభంబయిన ముక్తాజాలమన్ చింతచేఁ
దర్కింపం దిలకించి నవ్వుదురు గంధర్వాంగనాపల్లవుల్. 93

తే. దక్షమునిరాజు వంతరుద్యానవనము, దక్షవాటంబు శివుని యుత్తమపురంబు
బహుళకైవల్యఫలధర్మపాదపంబు, దీనిఁ గాతురు చుట్టును దిరిగి సురలు. 94

తే. గౌరి యొక్కతె యాకాశగంగ యొకతె
కాశి యొక్కతె దక్షిణకాశి యొకతె
నలుగురును శంభునకు లోకనాయకునకు
రాణివాసంబు లనురాగరసము పేర్మి. 95

వ. ఒక్క సమయమ్మున దక్షారామమున కేతెంచి భీమమండలంబునందు. 96

క. శోభనముహూర్తమున భుజ, గాభరణుఁ బ్రతిష్ఠ చేసి యర్చించి మహా
వైభవ మొనర్చి పొందె మ, నోభిమతము విబుధనాథుఁ డధికస్ఫురణన్. 97

తే. దేవతాభర్త శంభుప్రతిష్ఠ చేసి, సురగణంబుల లోకపాలురను జూచి
యనియె మీరును భీమనాయకుని వీట, సిద్ధశివలింగములఁ బ్రతిష్ఠింపవలయు. 98

ఇంద్రుఁడు దేవతలకు శివలింగమాహాత్మ్యంబుఁ జెప్పుట


సీ. శ్రీకంధరుని బ్రతిష్ఠించు నెవ్వఁడు వాఁడు, పాపియైనను శంభుపదముఁ గాంచు
శివలింగపదయాత్ర శివలింగసంవీక్ష, శివలింగసంస్పృష్టి శివసమర్చ

నాకలోకాధిరాజ్యైకకారణములౌ, నయమార సాధారణస్థలములఁ
గళ్యాణభోగమోక్షనివాసమైన యీ, దక్షవాటిపురస్థానభూమిఁ
తే. జెప్పనేటికి సకలసంసిద్ధిఁ గోరి, దక్షిణాంభోనిధానంబు తటమునందు
సంప్రతిష్ఠింపుఁ డీశానుఁ జంద్రమౌళి, విశ్వలోకాధినాథు నో విబుధులార. 99

క. సిద్ధించు మీ కభీష్టము, సిద్ధ మిది యమర్త్యులార శీఘ్రమున జటా
రుద్ధశశి మహోపనిష, త్సిద్ధాంతరహస్యమును బ్రతిష్ఠింపుఁ డికన్. 100

తే. దర్శనముకంటె మేలు సంస్పర్శనంబు, సంస్పృశించుటకంటె నర్చనము లెస్స
యర్చనము సేయుకంటె ననంతఫలద, మసితగళుని బ్రతిష్ఠించు టమరులార. 101

సీ. సకలలోకప్రపంచమును లింగమయంబు, త్రిజగంబు లింగప్రతిష్ఠితంబు
సంభవస్థితిలయస్థానంబు లింగంబు, లీనార్థగమకంబు లింగ మనఁగ
లింగప్రసాదంబు లేక సిద్ధింపవు, భోగమోక్షంబు లేయోగములను
లింగాజ్ఞవెలిగాఁగ లేశమాత్రంబును, సంచలింపదుపో తృణాచలంబు
తే. మంటినైనను లింగంబు మలిచి కొలుఁడు, ఇసుకనైనను లింగంబు నేర్చి కొలుఁడు
పేఁడనైనను లింగంబుఁ బెట్టి కొలుఁడు, నీటనైనను లింగంబు నిలిపి కొలుఁడు. 102

వ. అని యుపన్యసించి యింద్రుండు తానును లోకపాలకులును దివిజులునుం దమతమపేర శివలింగంబులఁ బ్రతిష్టించిరి. 103

మ. హిమధామార్ధటాజటాకిరీటుఁ డభవుం డింద్రేశ్వరు డింద్రుచే
నమరవ్రాతముతోడఁ గూడగఁ బ్రతిష్ఠాంతంబునం భక్తిసం
భ్రమతాత్పర్యసమగ్రుచేఁ గయికొనెన్ బాథోధివధ్వాపగా
విమలస్వర్ణసరోజపూజ హృదయావిర్భూతసంతుష్టుఁడై. 104

ఉ. ఆగమమంత్రతంత్రములు సాంగములై నడువంగ సర్వవి
ద్యాగురుఁడైన ప్రెగ్గడ బృహస్పతి తోడుగ వీతిహోత్రది
గ్భాగమునం బురందరుఁడు భక్తిఘటించిన వాసవేశ్వరున్
భోగివిభూషణుం గొలుచుపుణ్యుల కబ్బును భోగమోక్షముల్. 105

తే. ఇంద్రుఁ డేఁటేఁట జాతర కేగుదెంచి, సప్తగోదావరమున సుస్నాతుఁ డగుచు
భుజగభూషణు నింద్రేశుఁ బూజసేయు, ధవళమందారతరుపుష్పదామములను. 106

క. ఇంద్రప్రతిష్ఠితుం డగు, నింద్రేశ్వరుఁ గొలువ నెవ్వఁ డేకాగ్రతమై
రుంద్రమతిసప్తసింధునువు, నం ద్రిషవణమాడునతఁడు నాకం బెక్కున్. 107

క. సకృదాలోకనమున మఱి, సకృదర్చన సకృదుపాస సకృదానతులన్
సకృదాలయప్రదక్షిణ, సకృజ్జపంబుల మహేంద్రశంభుఁడు మెచ్చున్. 108

తే. ఐంద్రపదభోగ మెవ్వఁడే నభిలషించు, నతఁ డింద్రేశ్వరేశ్వరునాలయమునఁ బ్రణవపంచాక్షరీమంత్రపాఠనియతి, నమ్మహాఫల మొందుఁ దత్త్వార్థ మిదియు. 109

తే. స్నానదానాగ్నిహోత్రదీక్షావిధాన, మంత్రవాదము లైనకర్మంబులొకటి
కోటిగుణితంబు శ్రీదక్షవాటియందు, సప్తగోదావరేంద్రేశ సవిధభూమి. 110

వ. అటమీఁద సిద్ధేశ్వరస్థానంబు సిద్ధలింగాధిష్ఠితంబు ధర్మార్థకామమోక్షపురుషార్థసంసిద్ధికై యాసిద్ధలింగంబు సిద్ధులచేతఁ బ్రష్ఠింపంబడి సిధ్ధసాధ్యగంధర్వగీర్వాణవిద్యాధరారాధ్యంబై యుండు నా స్థానంబు దక్షయజ్ఞప్రాగ్వంశక్షేత్రంబు. 111

క. జపహోమదానయజ్ఞము, లుపవాసాదివ్రతంబు లొక్కొక్కటి కో
టిపరిమితంబులు సిద్ధే, శపదంబున సాధకులకు సత్యం బరయన్. 112

వ. మఱి యోగీశ్వరంబను స్థానంబునందు యోగేశ్వరేశ్వరుండు సనకసనందనాదియోగీశ్వరులచేతఁ బ్రతిష్టితుండని చెప్పంబడును. 113

గీ. అది భవాబ్ధితరణి యది సాధకవ్రాత, కల్పవృక్ష మది జగత్ప్రసిద్ధ
మది యుపాసకులకు నణిమాదికైశ్వర్య, లాభమునకుఁ గరతలంబున పసిఁడి. 114

సీ. మంకణుం డను మహామౌనియోగీశ్వర, శ్రీమహాదేవుని శివు భజించి
బ్రహ్మసాక్షాత్కారపర్యంతమైన ప్ర, బోధసంపదముక్తిపొలము గాంచె
నొకమాఱు సప్తసింధూదకంబులఁ గ్రుంకి, నరుఁడు యోగీశ్వరేశ్వరుని గాంచ
నణిమాదికాష్టవిధైశ్వర్యసంసిద్ధిఁ, బొందు యోగీశు నర్ధేందుధరుని
తే. సప్తగోదావరమునీట జలక మార్చి, పుష్పగంధాక్షతంబులఁ బూజ చేసి
కలిభవంబైన కలుషంబు గ్రాఁచిపుచ్చి, మర్త్యుఁ డొందును వేగం బమర్త్యపదవి. 115

వ. మఱియు యమేశ్వరలింగంబు యమప్రతిష్ఠితంబు సకృద్దర్శనమాత్రంబున మర్త్యుండు యమభయంబునం బాయు వెండియు. 116

సీ. యజ్ఞతటాకంబునందుఁ గ్రుంకులు వెట్టి, బ్రహర్షిపితృతృప్తి బ్రస్తరించి
యమలింగసన్నిధి నష్టోత్తరసహస్ర, సంఖ్య మృత్యుంజయజపముఁ జేసి
జపవిధానమునందు సరవిమృత్యుంజయు, నపమృత్యుభయశాంతి నర్థి నడుగ
నపమృత్యుదేవతాహంకారభవమైన, సంత్రాస మొందఁడు సాధకుండు
తే. శ్రాద్ధపిండోదకాదివిశ్రాణనముల, శ్రీయమేశ్వరతీర్థానఁ జేసి మనుజుఁ
డుద్ధరించును నరకకూపోదరముల, బెగ్గడిలు నేడుతరముల పితృగణముల. 117

క. శ్రీకాళేశ్వరుసన్నిధి, నేకాంతము జపము వ్రేల్మి యీగియు శ్రాద్ధం
బేకైకము కోటిగుణం, బై కలిగించును సమగ్ర మైనఫలంబుల్. 118

తే. వీరభద్రాదిదేవతావీరగణము, శంభులింగంబు నిలిపెఁ బ్రశస్తవేళ
దక్షవాటిఁదదాఖ్యసంస్థాపనమున, వీరభద్రేశుఁ డయ్యె నవ్వేల్పుఱేఁడు. 119

క. శ్రీవీరభద్రలింగము, సేవించిన మానవుండు చిరకాలమునం
గేవలగాణాపత్యమ, హావిభవము నొందు శివుని యాస్థానమునన్. 120

తే. వీరభద్రేశదేవతావిభునియాజ్ఞ, గలుగు ధర్మార్థకామమోక్షములు జనుల
కక్షయంబైన దక్షవాటాభిధాన, భోగమోక్షర మాజన్మభూమియందు. 121

తే. అగ్నిహోత్రంబు దాన మధ్యయనజపము, లాది యగునిత్యనైమిత్తికాదివిధులు
బహుఫలంబుల నొసఁగు సద్భక్తియుక్తి, దక్షవాటిక వీరభద్రస్థలమున. 122

ఉ. యాగతటాకతీర్థమునయందును నంబుధిసార్వభౌమది
గ్భాగవిభూషణం బయిన పద్మినియందును దీర్థమాడి ని
ష్ఠాగరిమంబునం ద్రిపురశాసను దక్షపురోపకంఠధా
త్రీగృహమేధిఁ గొల్వుఁడు ప్రతిష్ఠితభర్గుని వీరభద్రునిన్. 123

వ. తొల్లి బ్రహ్మాదు లగుదేవతలు సురేంద్రవిహితవిభవుండైన భీమనాథేశ్వరు దర్శించు వేడుకం జేసి బ్రహ్మలోకంబుననుండి భోగమోక్షక్షేత్రం బైనదక్షారామంబునకు వచ్చి సప్తగోదావపంబునఁ బంచతీర్థంబులాడి పండ్రెండు దివ్యలింగస్థానంబులు దర్శించి యమృతమయస్వయంభూజ్యోతిర్లింగమూర్తి నిఖిలదేవతాచక్రవర్తి యగు భీమేశ్వరేశ్వరు దర్శించి పరమానందకందళితస్వాంతులై యిట్లనిరి. 124

బ్రహ్లాదులు భీమేశ్వరు వర్ణించుట


శా. ఆహా! యింత మనోహరం బగునె దక్షారామ మివ్వీటిలో
నీహారాంశుకళాకిరీటుండు భవానీభర్త దివ్యాప్సరో
వ్యూహంబుల్ ప్రతిసంధ్యముం గొలువఁగా నున్నాడు గోదావరీ
వాహిన్యబ్ధిసమీరపానకలనావర్ధిష్ణుకేయూరుఁడై. 125

క. ముంగిటను సప్తసింధువు, చెంగటఁ గ్రతుసరసి నడుమ శ్రీభీమమహా
లింగము దక్షారామము, సంగతి నెన్నంగఁ బురము జగతిం గలదే. 126

తే. శివశివా యెంత భాగ్యంబు చేసినారొ, దక్షవాటీపురీమహాస్థానజనులు
కన్నులారంగ వీక్షించుచున్నవారు, భీమనాథేశ్వరేశ్వరస్వామిమూర్తి. 127

చ. అహహ! దయారసానుగతమైన మనంబున దక్షవాటికా
గృహపతి భీమనాయకుఁడు కీటపతంగసరీసృపాళికిన్
సహజగళత్సమీరమగు సంకటకాలము వీనులం దను
గ్రహ మొనరించునట్టె మధురంబగు తారకమంత్రరాజమున్. 128

సీ. భీమనాథేశ్వర శ్రీమన్మహాలింగ, భాస్వత్పరబ్రహ్మభవనమునకుఁ
గల్పాంతసమయభీకరసాగరౌద్ధత్య, భీతత్రిలోకమహాతరికిని
ద్వాదశక్షేత్రతీర్థపలాశమండల, వ్యాకోచనవపుండరీకమునకు
జంబూతరుద్వీప సర్వసర్వంసహా, పాటీరలేపనైపథ్యమునకు
గీ. శివకళత్రమునకు శివక్షేత్రమునకు, శివునిమూర్తికి శ్రీసదాశివునికీర్తి
కితరతీర్థంబు సరిపోల్ప నెట్లు వచ్చు, దక్షవాటంబునకు మహాస్థానమునకు. 129

క. మంకణమహామునీశ్వర, సంకల్పవితీర్ణకల్పశాఖికి భువనా
లంకృతికి దక్షవాటికి, శంకరనటనటననాట్యశాలను జేజే. 130

క. కాశీప్రతిబింబమునకుఁ, గాశీప్రతినిధికిఁ గాశికాప్రకృతికినిం
గాశీప్రతిమకు దక్షిణ, కాశికి శ్రీదక్షవాటికటకంబునకున్. 131

క. మోక్షస్థానంబునకున్, దక్షారామముస కమృతధామంబునకున్
దక్షాధ్వరక్రియోచిత, దీక్షాక్షేత్రమున కభవుదేవికి జేజే. 132

వ. అని నమస్కరించి శతానందుండు. 133

మ. శివలింగంబుఁ బ్రతిష్ఠ చేసి కణఁకన్ శ్రీసప్తగోదావరాం
బువులం జేసెను మంత్రపూర్వకముగాఁ బుణ్యాభిషేకంబు వై
భవముల్ పెక్కువిధంబులం జరపె శ్రీబ్రహ్మేశ్వరుం డంబుజో
ద్భవవంద్యుం డది యాదిగాఁ గరుణమైఁ బాలించు భక్తావళిన్. 134

వ. అంత దేవసిద్ధసాధ్యవిధ్యాధరగంధర్వోరగాదులును దమతమ నామధేయంబుల లింగంబులం ప్రతిష్టించిరి తదనంతరంబ. 135

సీ. బ్రహ్మప్రతిష్ఠితు బాలేందుశేఖరుఁ, బురుహూతుఁ డతిభక్తిఁ బూజ చేసె
నలువ యర్చించె నానాప్రకారంబుల, హరిహయస్థాపితుం డగుమహేశు
దక్షవాటికఁ జూచి దక్షప్రజాపతిఁ, బొగడె నల్మోర్ల నంభోజభవుఁడు
ప్రణమిల్లె దక్షుఁడు భారతీభర్తకు, నాత్మప్రశంసకు నణఁగి మదిని
తే. వేల్పులందఱు దానును నిల్పినట్టి, శంభులింగంబులకు మ్రొక్కి చనిరి దివికి
సరసిజాననుచే ననుజ్ఞాతుఁ డగుచు, సత్యలోకంబునకు నర్థి జనియె విధియు. 136

క. బ్రహ్మప్రతిష్ఠితుండగు, బ్రహ్మేశ్వరదేవుఁ గొలుచు భాగ్యాఢ్యులకుం
బ్రహ్మక్షత్రాదులకును, బ్రహ్మాచ్యుతశంభుభవనపదవులు గలుగున్. 137

క. అధ్యయనశ్రుతదానత, పోధ్యానసమాధిమంత్రపూజాదిమహా
విధ్యనుసంధానమున న, సాధ్యంబులు లేవు బ్రహ్మశంకరుపదవిన్. 138

వ. మఱియుఁ గపాలేశ్వరస్థానంబు. 139

ఉ. చిక్కఱి కాలభైరవుని చేతివిధాతృకపాలపాత్ర యే
చక్కటియందు జాఱిపడె సప్తనదీతటభీమభూమియం
దక్కడ నుద్భవించిన శశాంకకిరీటుఁ గపాలి శంభు స
మ్యక్కృతి గొల్చు మానవుల మానుగఁ జేరవు పాతకౌఘముల్. 140

తే. ఆకపాలమోచనాభిధానం బైన, పుణ్యతీర్థరాజమునను జలుపఁ
గడిఁదిఁ గోటిఫలముఁ గాంచునొక్కొక్కటి, దానహోమయజ్ఞతంత్రవిధులు. 141

చ. అట వరుణేశ్వరం బన ననాదిఁ బ్రచేతసుచేత వాహినీ
తటమునఁ దొంటి నిల్పఁబడి దక్షమహేశకరారవిందసం
పుటమునకున్ నరాటకము వోలె వెలింగెడు బాలతారకా
విటమకుటావతంసునకు విశ్రమకారణ మై తపోనిధీ. 142

తే. వరుణలింగంబునకుఁ దీర్ఘవారిధార, వేయిఘటముల నభిషేకవిధి యొనర్ప
వఱపుదోసంబు వాయంగ వానగురియుఁ, గొండ్రలంబండు నారబకోటులెల్ల. 143

ఉ. కుక్కుటపక్షిసంఘము లకుంఠితభక్తిఁ బ్రదక్షిణంబు స
మ్యక్కృతిఁ జేసి యెవ్వని కృపాతిశయంబున మోక్షసత్పదం
బెక్కె సమస్తలోకముల కెల్లఁ బ్రియుం డరుణేందుశేఖరుం
గుక్కుటనాథదేవు ఫణికుండలునిం గొలువుండు మానవుల్. 144

తే. ఒక్క పక్షంబులెంతయు నుర్విమోవ
గుడిఁ బ్రదక్షిణ మొనరించు కుక్కుటముల
కక్షయంబగు మోక్ష మేయయ్య యొసఁగె
నట్టిశివుఁ గుక్కుటేశ్వరు నాశ్రయింతు. 145

కం. చరణాయుధేశ్వరేశ్వరు, శరణాగతకల్పతరువు సంపూర్ణమహా
కరుణావరుణాలయునిం, గరుణామృతకిరణధరుని దర్శింపననా. 146

క. కోణార్కక్షేత్రము వా, రాణశి కేదారతీర్థరాజము కుంభీ
కోణంబు కుక్కుటేశ, స్థాణుస్థానంబు మోక్షధామము లెందున్. 147

తే. అచట దానంబు హోమ మధ్యయనవిధులు
శ్రాద్దమును దేవతాసమర్చనము వ్రతము
లొక్కటొక్కటి కోటిగుణోపలబ్ధి
సంభవించును సతతంబు సాధకులకు. 148

వ. మఱియు సోమేశ్వరతీర్థంబు సర్వదేవతానమస్కృతంబు. 149

క. అమృతమయుఁ డైనసోముఁడు, సమయంబున నే మహేశు సంస్థాపించెన్
విమలసుధాజ్యోతిర్లిం, గము సోమేశ్వరుని గరళకంఠు భజింతున్. 150

సీ. సోమతీర్థమునందు సుస్నాన మొనరించి, శ్రీసోమశంబు భజించు ధన్యుఁ
డిహజన్మమునయందు నేపాప మొనరించెఁ, బాప మెద్ది యొనర్చెఁ బ్రాగ్భవమున
నదియశేషంబును నాక్షణంబునఁ బాసి, దేహాంతమునఁ గూడుఁ ద్రిపురహరుని
ద్యాగంబు భోగంబు దానంబు సత్యంబు, భాగ్యంబు కీర్తి సౌభాగ్యలక్ష్మి
తే. బుద్ధి తత్సేన నత్యంతవృద్ధిఁ బొందు, నతతధర్మంబు నిచ్చు నక్షయఫలంబుఁ
దతఫలంబులు పిత్రౌర్ధ్వదైహికములు, సత్య మిది సోమనాథప్రసాదమహిమ. 151

క. సురలును విద్యాధరులును, గరుడోరగకిన్నరులును గంధర్వులు కిం
పురుషులు యక్షులు సోమే, శ్వరదేవునిఁ గొల్తు రధికవరభక్తిమెయిన్. 152

వ. మఱియు మాహేశ్వరతీర్థంబు సర్వదేవనమస్కృతంబు మునిసిధ్ధచారణవిద్యాధరులచేతఁ ప్రతిష్ఠితం బైనయది పితృపిండదానం బేకవింశతికులంబునకుఁ దృప్తికరంబు. 153

తే. సప్తగోదావరంబు సారతీర్థ, ముత్తమోత్తమ మందు మర్త్యుండు చేయు
శ్రాద్ధతిలతర్పణాదు లయక్షఫలములు, తత్సదాసేనవనము శివస్థానదంబు. 154

తే. దత్తమిష్టంబు హుతమధీతంబు నరుల, కచట నక్షయఫలముఁ జేయంగఁజాలు
శ్రాద్ధపిండప్రదానాది సకలవిధులు, నందు ఫలియించు నగ్గయయందుఁబోలె. 155

క. మఱి రామేశ్వరతీర్థము, కఱకంఠున కాటపట్టు కామితఫలముల్
తఱుఁగనిధాన్యము లగుచును, నెఱయంగ ఫలించు నందు నిష్ఠయుఁ గలుగున్. 156

క. శ్రీరుద్రపాదయుగళీ, శ్రీరామేశ్వరసమీపసీమం బితృయ
జ్ఞారంభం బొనరింప న, పారఫలప్రాప్తి చెందుఁ బంచజనులకున్. 157

తే. ప్రథిత మగు సప్తగోదావరంబునకును, నభవునకు భీమనాథున కంతరమున
నేమి సుకృతంబు చేసిన నేకతంబ, వేయు విధముల ఫలియించు వేయునేల. 158

సి. వినుము పారాశర్య వేవేలమాటలఁ, బనియేమి తీర్థముల్ పదియు రెండు
నని చెప్పనేల దక్షారామమండలిఁ, దీర్థంబుగాని ప్రదేశ మెద్ది
సప్తగోదావరోత్సంగస్థలమునకుఁ, గాశి కేదార మక్షయవటంబు
తరముగా కితరతీర్థమ్ములు సాటియె, భోగమోక్షములకుఁ బుట్టినిల్లు
తే. రుద్రవాటిక భీమేశ్వరునినివాస, మందు రామేశ్వరస్థాన మభ్యధికము
రామతీర్ధంబునందు సారంబుసాటి, ధర్మ మర్మంబు రుద్రపాదస్థలంబు. 159

అగస్త్యుండు వ్యాసునకుఁ బంచతీర్థంబుల వివరించుట


వ. మఱియుఁ బంచతీర్థంబులు వివరించిన నవహితుండవై యాకర్ణింపుము. 160

చ. అహిపతికంకణుండు తన యల్లుఁడుగా మదిఁ గోరి నిష్ఠతో
దుహినధరాధరేంద్రుఁడు చతుర్దశదివ్యమహాబ్దముల్ సుదు

స్సహముగఁ జేసే నయ్యె బ్రచండతనం బచటన్ శివుం డను
గ్రహమున నుగ్భవించె నని క్రచ్చఱఁ బల్కుఁ బురాణసంహితల్. 161

క. అది యాదిగఁ దీర్థంబులు, పదియును రెండయినఁ దీర్థపాలీజాతం
బదియ కడునెక్కు వై యు, న్నది సప్తతటంబునందున న్మునివర్యా. 162

క. లంకించి యరుంధతిపతి, మంకణునకుఁ జెప్పె ననుఁగుమామకు గిరికిన్
సంకల్పసిద్ధిదుండగు, శంకరుఁ డఖిలార్థిఫారిజాతం బనుచున్. 163

క. గిరిసార్వభౌమకన్యా, కరగ్రహణసుమంగళైకకౌతుకసంప
త్పరిపూర్ణహృతయు శంకరుఁ, గరుణాకింకరుని నురగకంకణుఁ గొలుతున్. 164

క. నీహారభూధరేశ్వరు, నీహారమణీయమూర్తి నిందుకరహిమా
నీహారహీరకుముదసు, ధాహారసమానకాంతి నభివర్ణింతున్. 165

సీ. భూధరేశ్వరతీర్థమునఁ గృతస్నానుఁడై , భూధరేశ్వరుఁ గొల్చు బోధఘనుఁడు
నిత్యమంగళుఁడు నిర్నిద్రభద్రుండును, లక్ష్మీవిలాసైకలక్ష్మయుతుఁడు
నగుఁ దీర్థములలోన నత్యుత్తమంబైన, తీర్థంబు భక్తిముక్తిప్రదంబు
మంగళమంగళాత్మకము కళ్యాణక, ళ్యాణస్వరూప మీయాస్పదంబు
తే. ధరణిధరనాయకునకుఁ బ్రత్యక్షమైన, యవ్విరూపాక్షునగరమధ్యాహ్నవేళ
భోగఘంటాస్వనము విన్న భూజనులకు, నవల వినవచ్చు ముక్తికళ్యాణఘంట. 166

మ. హిమవధ్భూధరసార్వభౌమవరవిశ్వేశోపహారక్రియా
క్రమసంతాడితఘంటికాఘణఘణత్కారంబు విన్నట్టి యు
త్తమపుణ్యుండు వినండు ప్రాణపవనోత్క్రాంతివ్యథావేళ దు
ర్దమవైవస్వతవాహ్యఘోరమహిషగ్రైవేయఘంటాధ్వనుల్. 167

తే. శ్రాద్ధపిండప్రదానాదిసకల విధులు, నొక్కటొక్కటి కోటిగుణోదయమునఁ
దృప్తిఁ గల్పించు దివిపితృదేవతలకు, ధరణిధరరాజశంభుతీర్థంబునందు. 168

తే. సప్తగోదావరముఁ దెచ్చి సప్తమునులు, సప్తసస్తేందుశిఖివిలోచనుని నిలిపి
రమ్మహాశంభులింగ మభ్యర్చితులకుఁ, గామితార్థప్రదానైకకల్పకంబు. 169

క. ఒకమాటు జలకమార్చిన, నొకమాటొకపువ్వుమౌళి నునిచిన నొకమా
టకుటిలమతి గుడిఁ దిరిగిన, సకలేప్సితముల నతండు సంపాదించున్. 170

తే. భీమనాథేశ్వరునిపార్శ్వభూమియందుఁ, బంచశివలింగములకు నాస్పదములైన
పంచతీర్థంబులును నాడుపంచజనులు, పాయుదురు పంచవిధమహాపాతకముల. 171

తే. అందు వాపితటాకకుల్యాదులందుఁ, దీర్థమాడ వివేకి బుద్ధిం దలంపఁ
బంచతీర్థంబు లందిచ్చుఁ బంచజనుల, కాత్మసలిలావగాహపుణ్యాతిశయము. 172

వ. అగస్త్యేశ్వర, రామేశ్వర, నాకులేశ్వర, గణేశ్వర, పాతాళభైరవేశ్వరలను దేవతాపంచకంబుఁ బంచతీర్ణంబులను దర్శించి మానవుఁడు పండ్రెండు పుణ్యతీర్థంబులు దర్శించిన ఫలంబులందు మూలస్థానేశ్వరలింగం బాదిమూలం బద్దివ్యలింగంబు దర్శించి భీమమండలంబునందు శివలింగస్థానంబు లెన్నిగల వన్నియు దర్శించిన ఫలంబు గైకొను వెండియు. 173

తే. సప్తగోదావరము భీమశంకరునిని, నాకులేశస్వయంభుఁ బినాకపాణి
రుద్రపాదంబులును సమారూఢభక్తిఁ, దలఁతు రెవ్వారు వారపో ధన్యమతులు. 174

వ. అని దక్షారామమాహాత్మ్యంబును భీమలింగమహిమంబును సప్తగోదావరప్రశస్తియు ద్వాదశతీర్థప్రభావంబును బంచతీర్థప్రయోజనంబును వినిపించి కుంభసంభవుండు. 175

తే. భీమనాథునిఁ ద్రిభువనస్వామిఁ గొలువ
బోదమే యిప్టు మధ్యాహ్నభోగవేళ
నదె విజృంభించె నాట్యసౌధాంతరమున
నృత్యజగఝంకృతమృదంగనిస్వనంబు. 176

వ. అని పలికి యనంతరం బయ్యిరువురు రాజమార్గంబున. 177

అగస్త్యవ్యాసులు భీమేశ్వరాలయంబుఁ బ్రవేశించుట


సీ. త్రిపురసంహారంబు దివిజనాయకభుజా, స్తంభదంభోళిసంస్తంభనంబు
గరళకూటమహాగ్ని కబళనాటోపంబు, దక్షాధ్వరక్రియాధ్వంసనంబు
మత్స్యలాంచనదర్ప మథనసంరంభంబు, దేవదారువనప్రదేశవిహృతి
నురులింగమూర్తి విస్ఫురణవిలాసంబుఁ, గాత్యాయనీకరగ్రహణకేలి
తే. గండవేదండదానవఖండనంబు, దండపాణిజలంధరాంధకవధంబుఁ
బాడు గంధర్వపతులచే భరితమైన, మొగలివాకిలి సొచ్చి రమ్మునిఋషభులు. 178

సీ. పంచాంగశుద్ధిగాఁ బరిఢవించుచు భృంగి, మతినాడు నెందేని ప్రతిదినంబు
త్రిదశవర్గంబు ముప్పదిమూఁడుకోట్లును, నేకదేశమున నెందేని యుండుఁ
బలుకుపూఁబోణి యర్వదినాల్గుకళలతో, విహరించు చెందేని విద్య చూపు
సాని యీశానియై సవరించు నెందేని, మహితపింఛాలీల మరులు వీట
తే. నెద్ది కైలాసశిఖరికిఁ బెద్దయుద్ధి, పాలమున్నీటి కెయ్యది ప్రసవభూమి
చంద్రలోకంబునకు నెద్ది సాటి యట్టి, భవునికళ్యాణమండపంబుఁ గనిరి. 179

ఉ. దానికిఁ దూర్పుదిక్కున సుధాకరబింబసహస్రకోటిశో
భానిభకాంతితో గగనభాగము రాయుచు భీమనాయకే

శానమహాట్టహాసరుచి సంపద సొంపు వహించి నట్టి శ్రీ
భానుజవైరిమండపము భవ్యమునీంద్రులు గాంచి రయ్యెడన్. 180

వ. అనంతరం బా బహిర్గేహప్రదేశంబున. 181

తే. నిఖిలపరివారదేవతానివహమునకు, వందన మొనర్చి రుత్తరద్వారభూమి
శశికళామండనునకును శంకరునకుఁ, జేసి రభివాదనంబులు సిద్ధమునులు. 181

ఉ. తండుభుజార్గళాకలితతప్తమహాకలధౌతఘంటికా
మండితవేత్రదండపరిమర్దనభీతివశాత్పలాయితా
ఖండలముఖ్యదైవతనికాయము సంయమిభాగధేయముం
ఖండకుఠారుమోసలసుఖంబునఁ జొచ్చిరి శైవపుంగవుల్. 182

వ. ప్రవేశించి భక్తిశ్రద్ధానుపూర్వంబుగా నంతర్భవనప్రదక్షిణంబు చేయునప్పుడు తిరుచుట్టు మాలికయందు. 183

సీ. వణఁకుగుబ్బలిరాచవారికూరిమికన్య, భీమయ్య శుద్ధాంతభామఁ గొలిచి
కంధరంబుననుండి గంధసింధురమైన, గుజ్జువేల్పుఁ గుమారగురుని గొలిచి
కైవల్యనిధికి దుర్గామహాదేవికి, సర్వమంగళకు నంజలి ఘటించి
యాశాతటీపటలీశాటికాకటు, వటుకభైరవు నిష్టవరదుఁ జూచి
తే. నలువ సేవించి యిందిరానాథుఁ గాంచి, యితరపరివారదేవతావితతి కెల్ల
నేటికోళ్ళిచ్చి యెక్కి రమ్మేటిమునులు, మృడునిహాటకశైలంబు మీఁదినిలుపు. 184

శా. సందర్శించిరి భీమనాథుఁ ద్రిజగత్సమ్మోహానాకారు న
ర్ధేందూత్తంసుని దక్షిణాబ్ధిలహరీహేలావిహారక్రమా
స్పందాయాగతగంధవాహపరిషత్పానాతిరేకస్ఫుర
త్తుందిస్వాంగకదందశూకకటకాస్తోకేష్టబాహార్గళున్. 186

క. దృష్టించి భక్తిపరతను, సాష్టాంగం బెరఁగి యమ్మహాదేవుని నా
శిష్టమునుల్ పూజించిరి, యష్టాపదనిర్మితంబు లగుకుసుమములన్. 187

ఉ. కేవలభక్తిసంపదలు గీలుకొనన్ హృదయాంబుజంబులన్
దేవరకుం గృపానిధికి దేవశిఖామణి కర్థిసప్తగో
దావరవాహినీకనకతామరసంబులఁ బూజ చేసె మై
త్రావరుణుండు దానును బరాశరిసూనుఁడు గూడి వేడుకన్. 188

వ. అప్పుడు పారాశర్యుండు పెన్నిధానంబుఁగన్న పేదయుం బోలెఁ బరమానందంబునుం బొంది కుంభసంభవుం జూచి మునీంద్రా, నీప్రసాదంబున భీమమండలం బవలోకించితి, ద్వాదశక్షేత్రతీర్థంబులు చూచితిఁ, బంచతీర్థంబు లాడితి, దక్షారామంబుఁ గంటి, భీమేశ్వరు దర్శించితి, ధన్యుఁడ నైతిఁ, గృతార్థుండ నైతి, నింక నీవు పత్నీసహితంబుగా నేవలనైన నుండి తపంబు సేయుము. నేనును విశ్వనాథవిరచితావమానభేదంబు వాయ నీస్వామిని సేవించెద నని పలికి సముచితప్రకారంబున నమ్మహాత్ముని వీడు కొలిపి యనంతరంబ శిష్యులుం దానును. 189

వ్యాసుఁడు భీమేశ్వరార్చనంబు సలుపుట

సీ. పంచతీర్థము లాడి భవలింగసన్నిధిఁ, బ్రాసాదపంచాక్షరము జపించి
సొరిది నల్ దిక్కుల సోమేశ్వరములందు, భక్తిఁ బ్రదక్షిణం బాచరించి
కుక్కుటేశ్వరుకేళకూళి నుద్భవమైన, మణికర్ణిక నొనర్చి మజ్జనంబు
నోంకారపురత్రికూటోదరస్థితులైన, హరిహరబ్రహ్మల నభినుతించి
తే. తుల్యగోదావరీనదిఁ దోయనిధిని, సప్తగోదావరంబున స్నానమాడి
యాచరించు శివార్చనం బనుదినంబు, దక్షవాటిక నుండి సత్యవతిసుతుఁడు. 190

క. భీమేశ్వరమహిమంబున, నామోదము నోలలాడుచు నుండున్
భీమేశ్వరచరణారుణ, తామరసంబులకు సంతతముఁ బ్రణమిల్లున్. 191

సీ. మాతృగర్భాకారజాతఖేదము వాయ, హరునిగర్భాగార మాశ్రయించుఁ
బరమేశ్వరార్చనాపరత నించుక తన్ను, నత్యంతధన్యుఁగా నాత్మఁదలఁచు
హర్షించి హరశివత్ర్యంబకాచలగర్భ, భవయంచు రోమాంచపటలిఁ దాల్చుఁ
గరతాళకలన శంకరగీతములు నాడు, లజ్జాభిమానంబు లుజ్జగించి
తే. భీమభీమేశ్వరేశ్వర భీమనాథ, దక్షవాటిపురాధ్యక్షు దర్పకారి
సప్తగోదావరోత్సంగ జయమహేశ, నన్ను రక్షింపు మనుచు విన్నపము సేయు. 192

క. బాలోన్మత్తపిశాచద, శాలంబనమునఁ జరించు నంగడివీథిన్
వ్రీళాశూన్యతఁ గంఠే, కాలునిపాదములమీఁదఁ గలుగువిరాళిన్. 193

సీ. పరిరంభ మొనరించు బాహాద్వయంబున, దేవదేవుని సుధాదివ్యమూర్తి
దాఁకించుకొను జటాస్తబకంబు విరియంగఁ, బానవట్టముతోడ ఫాలతలము
గురుదక్షపురితోడఁ గూడఁ బట్టనమున, కంగప్రదక్షిణం బాచరించుఁ
బాతాళభైరవప్రముఖనానాదిశా, పరివారదేవతాప్రతతిఁ దెలుచుఁ
తే. గాశికాపట్టనద్రోహిఁ గావు మభవ, విశ్వపతిదూషితుని బ్రోవు విశ్వనాథ
కల్ల చేసితి రక్షింపు కాలకంఠ, యనుచుఁ బ్రార్థించు భీమనాయకునిఁ దపసి. 194

సీ. అఘముల కొండుప్రాయశ్చిత్తములు లేవు, నిన్ను జూచుటకంటె నీలకంఠ
నీమండలంబున నిఖిల జంతువులకుఁ, దారకం బల భ్రాంతి దశను దోఁచుఁ
గలియుగంబునయందుఁ గడుదుర్లభంబులు, భవదీయదర్శనస్పర్శనములు
నీదక్షవాటికానిలయంబునం దుండు, జనుకు భోగమోక్షములు వలఁతి

తే. శిష్యులును నేను మిముఁ గొల్చెదము భక్తి, విశ్వపతికోపమునఁ గాశి వెడలివచ్చి
తరసి రక్షింపు మము దయార్ద్రహృదయ, శాంతభీమేశ్వరేశ్వరస్వామినాథ. 195

వ. అని మఱియుఁ గృష్ణద్వైపాయనుండు భక్తితృష్ణాతిశయంబున. 196

వ్యాసు లీశ్వరు నుతించుట


సీ. దేవదేవునకు నాదికి నాదియగువాని, కంబికాబతికి దక్షాధ్వరారి
కహితపురత్రయాధ్యక్షసంహరునకు, హరిలోచనాంబుజాభ్యర్చితునకు
బ్రహ్లాదిదేవతోపాస్యనన్మూర్తికి, నమృతమూర్తికిని స్వయంభువునకు
నిగమార్థవిద్యోపనిషదంగనామౌళి, చుంబితశ్రీచరణాంబుజునకు
తే. భోగమోక్షంబు లతిపాపబుద్ధులకును, గరుణ నొసఁగెడు ప్రత్యక్షకల్పశాఖ
కఖిలగంధర్వయక్షసిద్ధాదిదివ్య, వంద్యునకు మ్రొక్కెదను భక్త వత్సలునకు. 197

సీ. శ్రీ భీమనాయక శివనామధేయంబుఁ, జింతింప నేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటిపురాధ్యక్షు మోహనమూర్తి, జూడంగ నేర్చిన చూపు చూపు
దక్షిణాంబుధితటస్థాయిపావనకీర్తి, చే నింప నేర్చిన చెవులు చెవులు
తారకబ్రహ్మవిద్యాదాతయౌదల, విరులు పూన్పఁగ నేర్చు కరము కరము
తే. ధవళకరశేఖరునకుఁ బ్రదక్షిణంబు, నర్థిఁ దిరుగంగ నేర్చిన యడుగు అడుగు
లంబికానాయకధ్యానహర్షజలధి, మధ్యమునఁ దేలియాడెడు మనసు మనను. 198

ఉ. మాటలు పెక్కు లేటికిని మందరభూధరమంథనక్రియా
పాటలఘూర్ణమానజలభారమహోవధికాలకూటసం
ఘాటకృపీటసంభవశిఖావికటస్ఫుటవిస్ఫులింగవి
స్ఫోటపవిత్రసద్భువనభూతభయావహు నాశ్రయించెదన్. 199

స్రగ్ధర. కౌక్షింభర్యంబు దీర్పం గడుపున కిడుదుం గాలసంప్రాప్తభిక్ష
న్వీక్షింతుం బోధశక్తి న్విషయముల మదిన్ నిస్పృహత్వంబు దాల్తున్
దక్షారామాధినాథున్ ధవళవరకరోత్తంసజూటీవిటంకు
న్వీక్షింతున్ భీమనాథుం ద్రిభువననమితున్ నేత్రముల్ తృప్తి పొందన్. 200

శా.అష్టాశీతిసహస్రసంయమిజనవ్యాకీర్ణతీరద్వయీ
జుష్టోదంచితసప్తసింధుసలిలస్రోతోవగాహక్రియా
తుష్టస్వాంతుఁడనై భజింతుఁ గరుణాదుగ్ధాభిభీమేశ్వరున్
దృష్టాదృష్టఫలప్రదానవిభవాధిష్ఠానచేతస్కునిన్. 201

ఉత్సాహము. యక్షసిద్ధసాధ్యఖేవిహార గరుడకిన్న రా
ధ్యక్షమణికిరీటకోటి తరుణికిరణమంజరీ

ప్రేక్షణీయచరణకమలు భీమనాధదేవునిన్
దక్షవాటికాపురైకధాము నాశ్రయించెదన్. 202

ఉత్సాహము. నిష్ఠతో భజింతు భీమునిం భుజంగహారునిన్
దిష్ఠునిన్ రవీష్టసంప్రతిష్ఠునిం గరిష్ఠు భూ
యిష్ఠు దక్షవాటి కాస్థలీశు దేవతాకుల
జ్యేష్ఠునిం వసిష్ఠముఖ్యశిష్టమునిజనార్చితున్. 203

లయగ్రాహి. నీమమున మ్రొక్కెదను హేమగిరిచాపునకు సామజజలంధరముఖామరవిరోధి
గ్రామమదహారి కభిరామశుభనిర్మలసుధామయశరీరునకుఁ గామితవీతీర్ణ
శ్రీమహిమశాలికి జరామరణదోషపరి, శామకనిజాంఘ్రియుగళీమృతికి దక్షా
రామపురధామునకుఁ గోమలజటామకుటధామహేమధామునకు భీమునకు భక్తిన్. 204

సీ. కొలుతు సద్యోజాతుఁ గోమలైందవతనుఁ, బెద్దగుబ్బలిరాజు బెండ్లికొడుకు
సేవింతు శ్రీవామదేవు మహాదేవు, నేడులోకంబులు నేలుఱేనిఁ
దెలుతుఁ దత్పురుషు నిందీవరవరనీల, చారుకంధరుని బశ్యల్లలాటు
బ్రణుతింతు నీశాను ఫాలనేత్రానల, జ్వాలాసమాలీఢ శంబరారి
తే. సర్గసంసారశూన్యుని సంస్తుతింతు, సర్గసంసారహేతువు సంస్మరింతు
సర్గసంసారరూపిని సంశ్రయింతు, నభవు భీమేశ్వరేశ్వరు నభిలషింతు. 205

సీ. ఎవ్వనియాజ్ఞ నీరేడులోకంబులు, నర్తించు నట్టిదేవరకుఁ గాక
గ్రహతారకములు నిక్కముగ నెవ్వని యాజ్ఞ, వర్తిల్లు నట్టిదేవరకుఁ గాక
మనువులు పదునాల్గురును యదాజ్ఞాయుక్తి, నర్తింతు రట్టిదేవరకుఁ గాక
భువనపాలకులు యద్భ్రూతాజ్ఞాయుక్తి, నర్తింతు రట్టిదేవరకుఁ గాక
తే. ధూర్జటికిఁ గాక భీమనాథునకుఁ గాక, నిఖిలకారుణ్యకల్యాణనిధికిఁ గాక
యన్యదైవంబులకు నేల యధికభక్తి, సంఘటింతుఁ గరాంబుజాంజలిపుటంబు. 206

క. క్షమియింపు భీమనాయక, కమలభవాద్యమరరాజ కాంచనమకుటీ
సముదయమణిఘృణిరేఖా, కమనీయపదాంబుజోపకంఠోద్దేశా. 207

క. కావుము దక్షారామపు, రీవల్లభ భీమనాధ త్రిజగదధీశా
కైవల్యభోగలక్ష్మి, ప్రావీణ్యప్రదకటాక్ష భక్తాధీనా. 208

క. కృపగల్గి భీమనాయక, యపరాధము సైఁపు తండ్రి వౌదువొ కావో
కృపగల్గి సుతుఁడు చేసిన, యపరాధము తండ్రి సైఁచు టర్హంబె కదా. 209

వ. అని ప్రార్థించి భక్త్యావేశంబున గద్గదస్వరకంఠుండును బాష్పాకులలోచనుండును రోమాంచపటలకంచుకితనిఖిలావయవుండును నై వెండియును. 210

సీ. గరళకూటనీలకంఠాయశంభవే, మదనాంతకాయోన్నమశ్శివాయ
కాద్రివేయాధిపగ్రైయభూషాయ, మధుభిత్సఖాయోన్నమశ్శివాయ
కుంభినీధరసుతాకుచకుంభపరిరంభ, మహలోలుపాయోన్నమశ్శివాయ
వేదాదినిశ్శేషవిద్యావధూమౌళి, మణికపలాయోన్నమశ్శివాయ
తే. గంధదంతావళజరలరాంధకారి, విబుధపరిపంథావాహినీనిబిడవర్గ
బంధఘోరాంధకారసంభారకిరణ, మాలినేశాశ్వతాయోన్నమశ్శివాయ. 211

వ. ఓం జయజయ దేవదేవ గంధర్వసిద్ధవిద్యాధరిచారణకిన్నరకి పురుషు లహంపూర్వికాసంఫుల్లపుటంబు లగుచేతస్సంపుటంబులం బుటబుట నగుభక్తివిశేషంబులు శేషాహికటకభూషావిశేషాభిరామంబు లగుమీ కోమలశ్రీపాదకిసలయంబుల ఘసృణమణికోటీర కోటీవిటంక సందానితమందారమాలికామకరందబిందుధారాధోరణీ ప్రవాహంబుల నహరహంబును నభిషేకింతురు; కంఠేకాలా! మీకంఠమూలంబునం గలువదండకైవడిం గనుపట్టు కరాళకాలకూటవిషమషీకళంకపంగచ్ఛాయుచ్ఛటాగుళుచ్ఛంబుల వలన నిఖలలోకసంరక్షణంబు నిగమవ్యాఖ్యాతంబు; మహానటా! మీజటాజూటపటలంబున డిగిన వియద్గంగానిర్ఝరస్తోత్రశ్శలాకానికాయంబులఁ ద్రిలోకీకంఠోపకంఠంబులు తారహారావల్లీమతల్లిభంగి నంగీకరించు; శంకరా! నీవు సంకర్షణరుద్రావతారంబునఁ బాతాళగోళంబు వెడలి విషదహనవిస్ఫులింగవికటదంష్ట్రాటంకకిటకిటత్కారఘోరంబును జిహ్మలంబును నగువదనగహ్వరంబునఁ బుండరీకభవాంకపిండంబు లొండొండనణంగఁ గవిసి మ్రింగుదు; ధూర్జటీ! విలయపర్జన్యగర్జాడంబరంబున విడంబించు కహకహాట్టహాసంబునన్ బిట్టుధట్టించి యవష్టంభభారదుర్వారగర్వారంభసముజ్జృంభితుం డగుజంభారిభుజార్గళవిజృభణంబు హస్తధృతదంభోళితోడ నస్తంభించితి; దనదనఖా! నిఖిలకకుభవధిపరిధివలయంబులఁ గలయఁ గనత్కనకనఖశలాకానికాయచ్ఛాయాదాయాదంబు లగుసముజ్జ్వలజ్వలాజాలంబులు విజృంభింప ననలస్తంభదివ్యలింగాకారంబున నావిర్భవించి నిలువుభూభువన చక్రవాళపర్యంతం బాక్రమించి పెరిఁగినప్పుడు విరించి రాయంచయుఁ గైటభారి కిటియును నై యెగసి యుడిగియును దుద మొదలు దెలియరైరి; రుద్రా! నీవు భద్రదేవద్రుమాటవీవాటియందు దిసమొలదూఁబఱదిండిమిండజంగంబవై ఋషులపుణ్యాంగనల యీలువు లపాంగరంగస్థలీలాస్యలంపటంబు లగుకటాక్షవీక్షణంబుల హరించుచు భిక్షాటనక్రీడను నటించితి; చండీశ్వరా! నీవు మేరుకోదండంబునఁ బుండరీకాక్షకాండంబు దొడిగి కుండలిజ్వాలావల్లరీఝల్లరీఝంకారంబునఁ బంకరువాభవాండంబు బీఁటగిల్ల నిశాటపుట భేదనంబు లొక్కయేటున ఛటచ్చట నేసితివి; నీల లోహితా! యహరహోవధిసంధ్యాసమయారంభంబుల నుద్దేశదినావసానంబుల నానందంబుగాఁ బరిఢవించు జగఝంకారంబైన యారభటితాండవసముద్దండపాదభ్రమణవిభ్రముంబునఁ ద్రిభువనభయంకరంబు గావించితి; సర్వజా! నిర్వికల్పంబు నిరస్తసమస్తోపాధికంబును సత్యజ్ఞానానందంబునకు నికేతనంబును నగు నిష్కళంకస్వరూపం బగువేదానువచనశాంతదాంతిక్షాంతిశ్రవణనిధిధ్యాసనాదు లగుసాధనంబుల నిర్ణిరోధనిరవగాఢనిరవబోధకక్ష్యావిభాగంబునం దక్షీభవించి ముముక్షులు లాభలక్ష్యంబును నభీక్షణంబును నభీప్సితంబును ననుభవింతురు; భర్గా! భార్గవభృంగ్వంగీరసప్రధాననానామునిసమూహవిహితచరితాఘమర్షణస్నానాహ్నికౌఘయు నిజజలావగాహాపహనిఖిలాఘయు జాహ్నవీసపత్నియు నగుగోదావరీమహానది నీకుం గేలీవిహారం బగుకేళాకూళి; నిటలనయనా! గిటగిటని నడుగునడుగు నడుఁకునడుములు, వెణఁద లగుతెలికన్నులును నెఱికురులును, వలుదకుచములును గలిగి ననవిల్తునకుఁ బసగలపసిండి మెఱుంగు ములుకులనం గలికిచిలుకలకొలుకులగుబిసరుహదళనయనలు ముసురుకుని బలిసి నిలిచి కొలువఁ బ్రతిసంక్రమణవారోత్సవాదులయందుఁ బేరోలగం బవధరింతువు; శర్వా! నీవు శర్వరీసార్వభౌము నొక్కహజ్జున గుజ్జురూపంబున మట్టితివి; సుమశరమథనా! బిసరుహభవుని కిసలయోష్ఠి నాసికాతిలప్రమానంబు నఖశిఖరాగ్రంబున మొదలంటం జిదిమితి; వృషభధ్వజా! నీవు పూషుండనుపేరి రవిపండ్లు రాల గుద్దితి; యీశ్వరా! నీవు వైశ్వానరుని సప్తజిహ్వాపల్లసంబులు పెల్లగిల గిల్లితి; విరూపాక్షా! నీవు దక్షప్రజాపతికంఠంబున మేషంబుతల నిల్పితివి; మృగవ్యాధా! నీ వధ్వరమృగంబు మస్తకంబు నభస్తలంబున వ్రేలంగట్టితి; ముక్కంటీ! నీకు మ్రొక్కెదను; శివా! నీకు నవాంజలి; భవా! నీకు నభివాదంబు; పాండురంగా! నీకు దండంబు; రాజశేఖరా! నీకు జేజే; హరా! నీకు జోహారు; గిరీశా! నీకు వరవస్య; యష్టమూర్తీ! నీకుఁ బ్రతిష్ఠ; యీశానా! నీకు దాస్యంబు; త్రిపురహరా! నీ కుపాసన; మృడా! నీకు శరణు; మృత్యుంజయా! నీకుఁ బ్రపత్తి; ప్రమథాధిపా! నీకు నారాధనంబు; పినాకీ! నీకు నమస్కారంబు; కైలాసనిలయా! నీకుఁ గోపులు; పశ్యల్లలాటా! నీకు నేటికోళ్ళు; గౌరీమనోహరా! నీకు సమస్కారంబు; జయజయ జలంధరాంతకా! గంధసింధురాదిదనుజకంధరాపీఠధమనీగళితరక్తధారాభిషిక్తప్రచండఖండపరశుభిండివాలశూలప్రముఖబహువిధప్రహరణపరంపరాభీలమహాకారా! జయజయ జగత్సంభారకుంభకల్పనాకుంభకారా! కుంభీనసభూషణభీషణభూతప్రేతపిశాచశాకినీఢాకినీప్రౌఢపరీవారా! జయజయ వియద్వాయుధరణీతరణిశీతభానుబృహద్భానుసలిలయజమానమూర్తికల్పితాష్టభేదప్రపంచిత విశ్వప్రపంచపంచవదనపంచాక్షరీ మూలమంత్రకారణపాంచభూతికవ్యవహారా! నిర్మల జ్యోతిర్లింగమయమంగళాకారా! జయజయ సప్తపాతాళభువనవిష్కంభనిర్భేధనసమాసాదితావిర్భావభావజసంహారా! సర్వమంగళాకుచకలశపాళికేళీతూలికాకారమకరికాముద్రికాభీమముద్రితోరః ప్రదేశమహేశ! జయజయ భక్తభావనాసులభస్వభాననాతీతపావనాకారదావళ్యవిగ్రహా! శ్రీమన్మహాదేవ! దేవదేవతారాధ్య! దక్షవాటీపురాధ్యక్షా! ఆపద్ధ్వాంతదివాకరా! పరమదయాకరా! జయజుయ శ్రీభీమేశ్వరా! నమస్తే నమస్తే నమః. 212

మ. అనుచుం దాండవ మాడుచుండి శివభక్త్యావేశలీలార్భటి
న్మునిశార్దూలము దక్షవాటినడుమన్లోలజ్జాభాగుఁడై
వినిపించెన్ నశరీరభారతి నభోవీథీవిటంకంబునన్
నిను రక్షించెను భీమనాయకుఁడు కానీనా! సుఖం బుండుమీ. 213

తే. కాచె నీతప్పుకల్మషకంధరుండు, శిశిరకరిశేఖరుండు రక్షించె నిన్ను
భీమనాథుని ద్రిభువనస్వామిఁ గొలుము, కార్యసంసిద్ధి, బొందెదు కానినేయ. 214

వ. అని యివ్విధంబున నశరీరవాణి పలికిన విని యయ్యంతర్వాణి శర్వాణీవల్లభుం దలంచి పునఃపునః ప్రణామంబులు చేసి నితాంతసంతోషతరంగితాంతరంగుండై. 215

సీ. పైల! దక్షారామపతి భీమనాథుండు, మనపాలి కల్పకక్ష్మాజ మయ్యె
నో సుమంతుఁడ! దక్షిణోద్యానవాటికా, నిలయుండు మన పాలి ఫలము సువ్వె
జైమినీ! దేవతాసార్వభౌముఁడు విరూ, పాక్షుండు ప్రత్యక్షమయ్యెఁ జువ్వె
దేవల! సప్తగోదావరితీరైక, వాసుండు మనవంక వ్రాలెఁ జువ్వె
తే. భారతాదిబహుగ్రంధపారవశ్య, యోయిజనమేజయుండ! యీయుక్షగమనుఁ
డంబికాభర్త యఖిలకళ్యాణములును, మనకుఁ గృపసేయగలఁడు సమ్మదముతోడ. 216

వ. ఇంకఁ గృతార్థుల మైతి మని శిష్యవర్గంబునుం దానును దక్షారామంబున నభిరామం బైన పరమజ్ఞానానందసుఖం బనుభవించుచుండె. 217

క. శ్రీరామాయణమును ద, క్షారామాయణముఁ గలిమిలాపహములు స
త్సారమతులు వాల్మీకికిఁ, బారాశర్యునకు వినుతిపాత్రము లయ్యెన్. 218

వ. అని చెప్పిన విని యభినందించుటయు భీమేశ్వరమాహాత్మ్యంబు వినువేడుకం బరమేశ్వరుం డుద్భవించిన విధంబును సప్తఋషులు సప్తగోదావరంబుఁ దెచ్చిన విధంబును నాస్వామిని బ్రతిష్ఠ చేసిన భంగియు, నెఱింగించవే యని ప్రార్థించిన. 219

శా. గాంధర్వోపనిషన్మతంగ రసవత్కావ్యానుసారానుధౌ
రంధర్యాపరభోజరాజ రమణీ ప్రద్యుమ్న దోర్వీర్యగ
ర్వాంధారాతివరూధినీపరివృఢ ప్రాణానిలాహారవా
తాంధక్రూరకృపాణ రాజహితకార్యారంభపారంగతా. 220

క. దక్షారామవధూటీ, నక్షోరుహమృగమదాదివాంఛితవిలస
ద్వక్షఃకవాటబాంథవ, రక్షావిథివజ్రపంజర కృపాజలధీ. 221

పంచచామరము. అభంగవీరవిక్రమార్క యాజిగాండివాయుధా
ప్రభాతకాలభానుసన్నిభప్రభావిభాస్వరా
యిభద్విడుగ్రవిక్రమా; సమిద్ధనర్తనభ్రమ
న్నభస్సరిత్పయఃపృషద్గణాచ్ఛవిస్ఫురద్యశా. 222

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీనాథనామధేయప్రణీతంబైన భీమేశ్వరపురాణం బనుమహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. అశ్లీలము ప్రమాదపతితము. ప్రమదోధీమతామపి.