భీమేశ్వరపురాణము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు
శ్రీరామాయనమః
శ్రీమహా గణాధిపతయేనమః.
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః

శ్రీ భీమేశ్వరపురాణము

ద్వితీయాశ్వాసము

శ్రీఖండ ఘుసృణ మకరీ
రేఖాలంకార సుందరీస్తనయుగ పా
ళీ ఖచిత భుజాంతర విభ
వాఖండల! బెండపూడి యన్నామాత్యా! 1

వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పం దొడంగె. 2

తే. మృడునిచే నిట్లు కోపానఁ బడి కలంగి, గంగ దరినుండి నిజశిష్యగణము తోడ
మద్గురుస్వామి సకలధర్మజ్ఞుఁ డపుడు, పృథివిఁ గలతీర్థముల లెక్కవెట్టి చూచి. 3

వ. ఇట్లనియె. 4

తే. అంబపార్వతి నాతోడ నానతిచ్చెఁ, గాశి యెక్కుడు క్షేత్రసంఘములలోనఁ
గాశికన్నను నెక్కుడు గౌరవమున, మోక్షభోగనివాసంబు దక్షవాటి. 5

వ. తొల్లి దక్షప్రజాపతి భూచరఖేచరులగు నఖిలగీర్వాణుల రప్పించి హాటకగర్భకైటభారులఁ బురస్కరించికొని మహాధ్వరంబు సేయం బ్రారంభించి. 6

గీ. అర్థితో నోషధీశ్వరుఁ డాదియైన, [1]పెండ్లికొడుకుల నెల్లను బిలువ నంపె
గబ్బితనమున జగదీశుఁ గాలకంఠుఁ, బిలువఁ బంపకమానె నబ్బిరుదులాఁడు. 7

క. అజ్ఞానంబున హరున క, వజ్ఞదలఁచి యతని నొసలి వ్రాఁతఫలమునన్
యజ్ఞము సేసెను సురలయ, నుజ్ఞం బరోవృద్ధి కప్పనులు సమకొనునే. 8

ఉ. అల్పపుబుద్ధి నీక్రియను హాక్రతుతంత్రముఁ బన్నగాధిపా
కల్పునిఁ బాయఁబెట్టి కనుగానక దక్షుఁడు చేయఁజొచ్చి యా
వేల్పులుఁ దానుదుర్దశల వేఁగె మహాప్రళయాగ్ని రుద్రునిం
బోల్పగ వచ్చునట్టి పటుభూరివిభుండగు వీరభద్రుచేన్. 8

తే. పువ్వుముడిచిన పురవీధి భూమియందుఁ, గట్టె మోవంగవలసిన కారణమున
వీరభద్రునిచే దైన్యవృత్తినొందె, దక్షుఁడట్టి మహాధ్వరస్థానమునను. 10

క. తుదిఁబోయి యమ్మహేశ్వరు, పదపద్మము లాశ్రయించి బ్రతికెం దానుం
ద్రిదశులు బెద్దలువయ్యై, యదనునఁ జూపుదురు నిగ్రహానుగ్రహముల్. 11

సీ. దక్షప్రజాపతి తప్పులోఁగొని యాత్మ, గృపపుట్టి మిగుల రక్షించెఁగాన
హరివిరించిపురందరాది దైవతకోటి, మించి క్రమ్మఱ గారవించెఁగాన
నరిగి యంతర్ధానమందినతనదేవి, నెడమమేనఁ బరిగ్రహించెఁగానఁ
గోపాగ్నిఁ గడుఁబరితాపంబు నొందెడు, రిసులకు సభయంబు లొసఁగెఁగాన
తే. నఱ్ఱు దెగనేసి జున్నపుటిఱ్ఱి శిరము, గరిమచెడకుండ దివివ్రేలఁగట్టెఁగాన
నయముగలవేల్పు శ్రీభీమనాయకుండు, దక్షవాటంబు తీర్థంబుధరణియందు. 12

తే. కాలకూటోపసంహారకారి యతఁడు, త్రిపురదైత్యాధిపతుల మర్దించె నతఁడు
నిగ్రహానుగ్రహప్రౌఢినిపుణుఁ డతఁడు, సంతతము దేవవేశ్యాభుజంగుఁ డతఁడు. 13

తే. ఏమిచిత్రంబు భీమేశ్వరేశ్వరుండు, నిగ్రహానుగ్రహక్రియానిపుణుఁ డగుట
యతని నిశ్వాసముల మాత్ర నౌనొకాదొ, వేదములును జరాచరవిశ్వజగము. 14

వ. బ్రహ్మాదిసంస్తుతుండై నిజార్ధదేహంబుననున్న మాయారూపిణి, మహాదేవిభువనమోహిని, దేవకార్యప్రయోజనంబును, మేనకాదేవిభాగధేయంబును, హిమవంతుని తపోవిశేషంబును, గారణంబుగాఁ దద్దేహంబున జన్మింప నియోగించిన భువనేశ్వరి మహేశ్వరుని దేహంబువలన నిర్ముక్తయయ్యెంగావున దక్షారామంబు ముక్తిక్షేత్రంబు నాఁబరఁగె వెండియు. 15

క. దక్షుని సవనాగారము, దక్షారామంబు శివుఁడు దన్మధ్యమునం
సాక్షాత్కరించియుండుట, మోక్షము భోగంబు బ్రాఁతె ముజ్జగములకున్. 16

తే. ధాత్రివలయంబులో భోగదములు గొన్ని, మోక్షదంబులు గొన్ని పరీక్ష సేయ
భోగమోక్షములకు జన్మభూమియైన, దక్షవాటంబు ఠావు క్షేత్రములకెల్ల. 17

తే. భీమనాథేశ్వరునికన్న పెద్దవేల్పు, దక్షవాటంబుకంటె నుత్తమపదంబు
సప్తగోదావరముకంటె సకలతీర్థ, సారమగుతీర్ధరాజంబు జగతి లేదు. 18

క. అచ్చమగు భోగమోక్షము, లచ్చోటం దొరకుఁ గరతలామలకముగన్
విచ్చలవిడి బ్రతికిననుం, జచ్చినఁగడులెస్స భీమశంకరు నగరిన్. 19

క. దక్షిణవారాణశికిని, మోక్షశ్రీభోగవిభవమూలంబునకున్
దక్షారామంబునకు స,దృక్షంబగునట్టి పుణ్యక్షేత్రము గలదే. 20

సీ. కాలకూటవిషాగ్నికబళహేలాగ్రాస, కల్మాషితాసితకంఠుచేతఁ
గుంభినీధరసుతాకుచకుంభపరిరంభ, సంభావనాకేలిశాలిచేత

గగనకల్లోలినీకల్లోలమాలికా, స్పాలితబాలేందుమౌళిచేత
గుటిలకుండలిరాజడకుండలాలంకార, విలసితగండమండలునిచేత
తే. ద్రుహిణపంచమమస్తకద్రోహిచేత, భీమునాథునిచే జగత్స్వామిచేత
హరునిచేత సనాథయై యతిశయిల్లు, మోక్షభోగనిదానంబు దక్షవాటి. 21

వ. అని దక్షారామమాహాత్మ్యం బభివర్ణించుచు. 22

మ. కినుకంబుట్టినయట్టి మౌనిహృదయక్లేశంబు శాంతంబుగా
మునిశిష్యప్రకరంబుతోడ గమనౌన్ముఖ్యంబునన్ ముచ్చటల్
తనియం జెప్పుచు వేల్పుటేటి నికటస్థానంబునం దుండఁగా
వనజాతాప్తుని మండలంబు దిగియె న్వారాశి దిక్సీమకున్. 23

సూర్యాస్తమయవర్ణనము

తే. అల్లనల్లన గగనమధ్యముననుండి,
వ్రాలె నస్తాద్రి కరుణసారథిరథంబు
పశ్చిమాంభోధిమారుతాస్ఫాలనమునఁ,
గేతనముమీఁదిపసిఁడికింకిణులు మొరయ. 24

క. తారాపథాంచలము డిగి, వారిజహితముండలంబు వ్రాలె నపరది
క్పారావారంబునకై , పారావతపతగపాదపాటల మగుచున్. 25

తే. కూడియొప్పారె నస్తాద్రికూటకోటి, భానుబింబంబు కన్నులపండువుగను
విశ్వనాథుని గుడిమీఁది విమలకాంతి, భాసురంబైన హేమకుంభంబువోలె. 26

క. చరమాచలశిఖరంబునఁ, దిరమై యొక్కింత తడవు దినకరుఁ డొప్పెన్
వరుణుని శుద్దాంతంబున, నువిందాక్షులకు మించుటద్దం బగుచున్. 27

సీ. సిద్ధవాహిని నీటఁ జిఱుబంతి పసుపాడి, శ్రీవిశాలాక్షి గైసేయఁదొడఁగె
మొరసె నంతర్గేహమున విశ్వనాయక, తాండవారంభ మర్దలరవంబు
మందారతరుపుష్ప మధుపానగోష్ఠికిఁ, బ్రారంభ మొనరించె భైరవుండు
కొక్కొరోకో యని కొమరసామి రథంబు, కంఠంబు సాఁచి క్రేంకారమిచ్చె
తే. మొగుడఁబాఱిన యరవిందములను బాసి
గముగములుగ మత్తభృంగములు గూడి
డుంఠివిఘ్నేశు చెక్కు లుత్కంఠఁ జేరె
నభినవంబైన యపరసంధ్యాగమమున. 28

చ. ప్రమదమదాతిరేకమునఁ బాశివిలాసవతీకదంబకం
బుమిసిన తమ్ములంపుఁగఱ యోయన నింగిలికంబు ఛాయచేఁ

గమిసిన దాసనంపుఁబువు కాంతికి డాసిన కూర్మిమట్టమౌ
కొమరున సంజయంబరము కొంగున నూన్చెఁ గుసుంభరాగమున్. 29

తే. సంజుకెంపును దిమిరపుంజంపునలుపు,
గమించి బ్రహ్మాండభాంశంబు గరము మెఱసె
పరమపరిపాకదశవృంతబంధ మెడలి,
పతనమగు తాటిపంటితోఁ బ్రతిఘటించి. 30

తే. కామినీవిప్రయోగదుఃఖమునఁ గుం దెఁ ,
జక్రవాకంబు సురనదీసైకతమునఁ
గాశికావిప్రయోగదుఃఖమునఁ గుందు,
బాదరాయణమునిసార్వభౌముకరణి. 31

శా. ఆకాశాంచలవీధుల న్నిగిడె సంధ్యారాగరేఖావళుల్
పాకోన్ముద్రిత పారిభద్రకళికాపాండిత్యవైతండికో
త్సేకస్ఫూర్జితచండతాండవరయోద్రేకారభట్యుద్భట
శ్రీకంఠస్థిరదీర్ఘపాటలజటాశ్రేణిన్ విడంబించుచున్. 32

వ. అప్పుడు బాదరాయణుండు సంధ్యాసమయంబు నిరూపించి యసురసింధుప్రవాహంబునం గాలోచితక్రియాకలాపంబులు నిర్వర్తించి యొక్క నిర్మలసైకతప్రదేశంబునం గూర్చుండి పార్వతీవల్లభుండు తనకుఁ జేసిన యవమానంబునకు నుల్లంబునం దురపిల్లుచుండె నయ్యవసరంబున. 33

క. వెల్లిగొనె నఖిలదిక్కుల, నల్లనిచీఁకటి నవాంజనప్రతిభటమై
భల్లూకపటావల్లిమ, తల్లీ విభ్రమదమై యదభ్రస్ఫురణన్. 34

సీ. గిరినికుంజములఁ గుంజరపుంజ మనుశంకఁ, గంఠీరవంబు లుత్కంఠ నెగయఁ
బల్వలంబులఁ గిరిప్రకరంబు లనుశంక, నెఱుకురాజులు విండు లెక్కువెట్టఁ
గడలిమధ్యంబునఁ గాకోల మనుశంక , జలదేవతలు భీతి సంభ్రమింప
నదములఁ గువలకాననవాటి యనుశంక , నిందిందిరశ్రేణు లెదురుకొనఁగ
తే. రజతగిరియందుఁ దాండవారంభరభస, భంగిపతితపరశ్వధపాణి వికట
కంధరారుద్ధగజకృత్తి కంథశంక , ప్రమధులకుఁ దోఁప నంధకారంబు ప్రబలె. 35

తే. ప్రబలమై యంధకారంబు బలిసియుండఁ, దారకంబులు కాంతి నెంతయును బెరసె
నీలిపుట్టంబుఁ బఱచి పై నిలిపినట్టి, వలుఁద ముక్తాఫలములతావళము లట్ల. 36

శా. శ్రీవారాణశివిశ్వనాయకగళ, క్ష్వేళామకారక్రియా
హేవాకోద్ధతిఁ జీఁకువాల్ప్రబలఁగా హేలావతీకోటిపైఁ

బూవుందూపులజోదు పుచ్చుకొనియెన్ భూపాల లీలావతీ
భ్రూవల్లీనిభశృంగకంబగు లసత్పుండ్రేక్షుకోదండమున్. 37

వ. అంత. 38
 

చంద్రోదయవర్ణనము

ఉ.ఆతతలీలఁ గోమల నవాంశుకపాళి మహాంధకార సం
ఘాతము మీట నద్భుతముగా శశలాంధనుఁ డభ్రవీధికిన్
శ్వేతవరాహమూర్తి యగు వెన్నుఁడు ప్రన్ననియొంటికోఱ ధా
త్రీతల మెంత యంతయు ధరించిన యట్టి విజృంభణంబునన్. 38

తే. అర్ధమండల ముదయించు నమృతభానుఁ,
డుదయరాగంబుతోఁగూడ నొప్పు మిగిలెఁ
బ్రకటతాంబూలరాగసంరక్తమైన
ప్రాగ్దిశాకాంతబింబాధరంబువోలె. 40

క. సంకలితోదయరక్తి శ,శాంకుఁడు శోభిల్లె గైరికావనిధరవ
ప్రాంకక్రీడాపాటల, సంకరభృతకాలకూటసంకాశుండై. 41

సీ. కాదు కా దుదయాద్రి కనకకూటంబిది, డంబైన పానపట్టంబుగాని
కాదు కా దిది సుధాకరపూర్ణ బింబంబు, కాశ్మీర శంభులింగంబుగాని
కాదు కా దుదయరాగప్రకాశంబిది, ననకుంకుమాలేపనంబుగాని
కాదు కా దిది కళంకచ్ఛటారింఛోళి, పూజ చేసిన కల్వపువ్వుగాని
తే. యనఁగ సప్తార్ణవములు మిన్నందికొనఁగఁ, జంద్రకాంతోపలంబులు జాలువాఱ
నసమశరసార్వభౌము ముత్యాలగొడుగు, విధుఁడు విశ్వంబు వెన్నెల వెల్లిఁ దేల్చె. 42

తే. ఉదయ రాగము నించించు కుజ్జగించి, నిండుచంద్రుండు కన్నులపండువయ్యె
దానరాగాంతరస్నిగ్ధదాక్షిణాత్య, రాజశుద్ధాంతదంతవజ్రములకాంతి. 43

సీ. అభిషేక మొనరించు నమృతధారావృష్టి, మదనాంతకునిముక్తిమంటపికకు
నలవోకగా విశాలాక్షీమహాదేవి, నిద్దంపుఁ జెక్కుల నీడఁ జూచు
నెరియించు మిన్నేటి యిసుకతిన్నెలమీఁదఁ,జక్రవాకాంగనాసముదయంబు
డుంఠి విఘ్నేశునిష్ఠురకంఠవేదిపైఁ, గొదమచుక్కలరాజుఁ గుస్తరించుఁ
తే. గాయు వెన్నెల యానందకాననమునఁ, గాలభైరవు దంష్ట్రకుడాలుకొలుపు
విధుఁడు వారాణశీసోమవీథిచక్కి, నభ్రఘంటాపథంబున నరుగునపుడు. 44

సీ. రోహిణీగాథోపగూహనంబునఁ గన్న, కస్తూరికాస్థానకం బనంగ
రాహుదంష్ట్రాఘాతరంధ్రమార్గంబున, లలిఁదోఁచు నాకాశలప మనంగ

నైర్మల్యమునఁ జేసి నడుమఁ గానఁగవచ్చు, కమిచిమ్రింగిన యంధకార మనఁగ
జన్మవేళను మంథశైలాభిఘట్టన, సంభవించిన కిణస్థాన మనఁగ
తే. విరహపరితాపవేదన వేఁగుచున్న, చక్రవాకాంగనలకటాక్షములయగ్గి
నావహిల్లినకఱదూప మనఁగనొప్పు, నుడుగణాధీశబింబంబు నడిమిమచ్చ. 45

సీ. కాలభైరవుఁడు ఢక్కాడిండిమము మ్రోయ,బహుభూతములుఁ దానుఁ బ్రహరిదిరుగఁ
జంద్రికామధు వాని చాకోరము ల్నిక్కి, దేవతాసౌధవీథికల సొగయ
నానందకాననాభ్యంతరంబులయందు, సిందువారమునఁ బూ శిథిలపడఁగఁ
గడునివాతములైన , కలుమఠంబులయందు, యతులు ప్రాణాయామ మభ్యసింప
తే. దొడ్డవయసున శీతాంశుఁ డొడ్డగిల్లెఁ, దరపి చంద్రాతపము నేల చఱచి కాయ
వంతదురపిల్లి వెన్నెల వగచివగచి, గంధవతిపట్టి యొకభంగిఁ గన్నుమోడ్చె. 46

వ. అంత. 47

సూర్యోదయవర్ణనము

చ. వెలవెలఁబాఱెఁ జంద్రుఁడును విన్నునఁ దారకచక్రవాళముల్
పలపలనయ్యె దీర్ఘికల బద్మవనంబుల షట్పదాంగనా
కలకలముల్ చెలంగె వెడకన్ను మొగిడ్చె లలిం గుముద్వతుల్
తెలతెలవాఱె జంభరిపుదిక్కునఁ దోఁచె ననూరురాగముల్. 48

సీ. ప్రథమసంధ్యాంగనాఫాలభాగంబునఁ, జెలువారు సిందూరతిలక మనఁగఁ
గైసేసి పురుహూతు గారాపుటిల్లాలు, పట్టిన రత్నదర్పణ మనంగ
నుదయాచలేంద్రంబు తుదఁ బల్లవించిన, మంజుకంకేలిని కుంజ మనఁగ
శతమన్యు శుద్ధాంతసౌధకూటముమీఁదఁ, గనుపట్టు కాంచనకలశ మనఁగఁ
తే.గాలమనియెడు సిద్ధుండు గమిచి మ్రింగి
కుతుక మొప్పఁగ నుమిసిన ఘుటిక యనఁగ
గగనమందిరదీపికాకళిక యనఁగ,
భానుఁ డుదయించె దేదీప్యమానుఁ డగుచు. 49

వ్యాసమహర్షి యాత్రకు వెడలుట

వ. ఇట్లు సూర్యోదయంబగుటయు బాదరాయణుండు కాలోచితకృత్యంబులు నిర్వర్తించి గమనోన్ముఖుండై కాశీవియోగజనితవేదనాభరంబు దుస్సహంబై యంతరంగంబుఁ గుందింప నెట్టకేలకు నేటికెదురీఁదువిధంబున శిష్యులుం దానును గనద్ఘనకనకమణిమయసౌధాట్టవిలాసంబైన యప్పట్టనంబునకుఁ బ్రదక్షిణక్రమంబునఁ జనువాఁడై లోలార్కకేశవులకు నభివాదనంబును భాగీరథికి నంజలిబం ధంబును విశ్వనాథునకు వినుతియు విశాలాక్షికిఁ బ్రార్థనంబును మోక్షమంటపంబునకు జయకారంబును నంతర్గేహంబున కామంత్రణంబును గాలభైరవునకు జోహారును డుంఠి వినాయకునకు శరణార్థము దండపాణికి దండప్రణామంబును గుక్కుటచతుష్టయంబునకు మ్రొక్కును సకల దేవతాకోటికి నేటికోళ్ళును జేసి చనునప్పుడు కతిపయదివప్రయాణంబున. 50

సీ. గంగానదీ ప్రవాఃకణము మాధవదేవు, దోరంతరంబు శ్రీతులసిచిగురుఁ
బురుషోత్తమమునందుఁ బుండరీకాక్షుని, దివ్యపాదాంభోజక్షేత్రజలము
శ్రీకూర్మము యందు శేషాహిపర్యంకు, కంఠంబు క్రొత్తచెంగల్వదండ
సింహాద్రియందు లక్ష్మీనృకంఠీరవ, సార్వభౌము ప్రసాదచందనంబుఁ
తే. గాశికావిప్రయోగోరుగాఢతాప, శాంతి కొదవెను శిశిశోపచార మగుచుఁ
జాయ తెరువున శ్రీబాదరాయణునకు, హరిహరధ్యానపూజపరాయణునకు. 51

పీఠికాపురవర్ణనము

సీ. ఏపట్టనముమ్రోల నేలేఱు ప్రవహించు, బృథివికి ముత్యాలపేరువోలె
మున్నూటయఱువది మూర్తిభేదములతో, విహరించు నేవీట వేల్పుపిండు
పీఠాంబచెలి యోగపీఠిహుంకృతిదుర్గ, ననిచికాపుండు నేనగరికెలనఁ
గుంతీమహాదేవి కూర్మిమేనల్లుఁడు, మానవుం డేవీట మరగినాఁడు
తే. పెద్దగవఁకుల నేపుటభేదనమున, నెలమినిలుచుండు వ్రీడావిహివజఘనుఁ
డట్టి పీఠాపురముఁ జేర నరుగుదెంచెఁ, బరమశైవుండు శ్రీపరాశరసుతుండు. 52

తే. నారికేళంపుబుట్ట నెన్నడిమిచాయ, దళములందును బోలె సంతతముఁబాఱు
వేణికాసారణులయందు విస్మయము , జగతి నెక్కడి వేలేటి సాటినదులు. 53

సీ. ఏఁటేఁట విరినీట నిరుగారునుం బండు, బ్రాసంగువరిచేలఁ బసిఁడిచాయఁ
బరిపాకమున వేగుపనసపండుల తావి, యిందిందిరములకు విందు సేయు
వేఁబోఁకఁబొలుపారు వింధ్యాద్రి పవనంబు, సోఁకపువ్వులతావిఁ బుక్కిలించు
వేశ్యవాటికలందు విహరించు వలరాజు, ననయంబుఁ జెఱకువిల్లును ధరించు
తే. నారదంబుల వలపుపొన్నలఁ బెనంగి, విచికిలామోచములతోడ వియ్యమందుఁ
బాటలీపుష్పకేతకీపరిమళములు, పొదల విలసిల్లుఁ బీఠికాపురమునందు. 64

వ. వెండియు ననఖండమండలంబగు మహీమండలంబునకు మకరకుండలాలంకారంబునుం బోలె భీమేశ్వరమండలంబు పొరువునఁ ద్రిలింగోత్కలతలంబులనంది వింధ్యాచలపాదంబునఁ గేదారకుంభకోణార్కస్థానంబుల కుపమానంబనఁజాలి యేలేటిమేటికాలువలవలన నదీమాతృకంబులగు పంటవలంతి సలిలధౌతకలధౌత శలాకాశకలసంకోచంకరణంబులై యుంకురించినవియును, గొదమపసరుఱెక్కలపక్కిఢాలు పుక్కిలించి యుమయంజాలు చాయ లేర్పడం బసరుపాఱునవియును, దక్షారామ రామాజనంబుల చిఱుపిక్కలచక్కఁదనంబుల నెకసక్కెంబాడు బిగువుపొట్టలం గనుపట్టునవియును, బథికనాసాపుటీకుటీరంబులకుఁ గుటుంబకములగు కమ్మదనంబులీని పాలుకుడిచి సుందరీప్రాయంబున సామువలచునవియును, బదియాఱువన్నె కుందనంపుఁదగడుఁ దెగడుచుఁ బండి యుద్ధండకేదారవలయకుముదషండంబు లాఘ్రాణింపనుం బోలెఁ గైవ్రాలునవియు నై కలమశాలిశారదాముఖాదివ్రీహిసస్యంబులవలనను, నిరంతరనారికేళచ్ఛదచ్ఛాయాచ్ఛన్న హరిదంతరంబుల భుజంగవల్లీమతల్లికాలింగిత క్రముకకంఠోపకంఠంబులఁ గ్రీడించు క్రోడదశనదష్ట న్వాదిష్టపనసఫలరససారణీపరంపరా సంపూర్ణచంపకద్రుమాలావాలవలయంబులును, వనదేవతావిలాసతాళవృంతాయమాన రంభాపలాశసంభారంబులఁ, దిలకతిలకితంబులు, విదేశవిచికిలంబులు, గోరకితకురువకంబులు, నిబిడరసకేసరంబులు, నఖిలభుననాభిరామంబులు నైనయారామంబులవలనను గన్నులపండువై కుంతీమాధవదేవునకు విశ్రాంతిప్రదేశంబును, హుంకారిణీ మహాదేవికి విహార సంకేతభవనంబును, బీఠాంబికాలక్ష్మి కాటకూటంబును, హేలాసానికి హాలాపానగోష్ఠీమంటపంబును, ననందగి భూతబేతాళడాకినీ ప్రేతరంక భైరవవ్రాతనిర్మిత ప్రాకారవప్రహట్టకుట్టిమంబగు పీఠాపట్టనంబుఁ బ్రవేశించిరంత. 55

సీ. త్రపుసపుష్పలతామతల్లీపటోలికా, కారవేల్లకుడుంగకములతోడఁ
గూష్మాండవృంతాకకోలకచించికా, కాయమానకదంబకములతోడ
శాకినీమూలకచ్ఛత్రాకసారణీ, ధాన్యాకమేఘనాదములతోడఁ
బిప్పల్యుపోదకీ పీతపలాండుక, వాస్తుశాఖాకోటివాటితోడ
తే. రాజనలతోడ శృంగబేరములతోడఁ, జిఱుగడఁపుఁ బెండలముతోడఁ జేమతోడ
నొప్పునాలుగు పొలములం దుపవనములు, భువనసారము పీఠికాపురవరమున. 56

ఉ. హాటకపానపాత్రయును నారఁగఁబండినమాతులుంగముల్
ఖేటము లోహదండము నొగింధరియించి పురోపకంఠశృం
గాటకభూమిభాగమునఁ గాపురముండెడు పీఠికాంబకుం
గైటభదైత్యవైరి ప్రియకాంతకు మ్రొక్కె నతంబు భక్తితోన్. 57

శా, అంతర్వాణి భజించెఁ గుక్కుటపతిన్ హాలాహలగ్రీవునిన్
శాంతస్వాంతుఁడు గొల్చె దానవచమూసంహారిణిన్ హుంకృతిన్
జింతించెన్ మునిసార్వభౌముఁడు పురక్షేత్రాధిదైవంబులం
గుంతీమాధవుఁ బూజ చేసె ఋషివాక్పుష్పోపహారంబులన్. 58

తే. హేల నేలాతరంగిణీకూలనిలయ, బాల బాలారుణాశోకపల్లవోష్ఠి
వేల వేలావనోద్దేశవిహృతిలోల, నేల నేలాయనకపాడె ఋషివరుండు. 59

వ. అనంతరంబ యొక్కింత మార్గాంతరం బతిక్రమించి. 60

కుమారారామవర్ణనము

శా. ఆలోకించె మహామునీంద్రుఁడు గుమారారామమున్ వింధ్యకు
త్కీలోపాంతధరాలలామము బహుక్రీడావనశ్యామమున్
బ్రాలేయాచలకన్యకాథవజటాభారాసనార్ధేందురే
ఖాలానాయితహేమకూటకలధౌతాట్టాలకగ్రామమున్. 61

సీ. కొమరేటి కల్యాణకమలషండంబుల, సౌరభ్యభారంబు సంతరించి
నారికేళాటవీనవపుష్పకుహళికా, వితతికన్నెఱికంబు వీడుకొలిపి
యస్సరఃకాంతావిహారహాటకహర్మ్య, శశికాంతమణిగవాక్షములఁ దూఱి
భీమనాయకదేవు పేరురంబునఁ గ్రాలు, భుజగహారములకు భుక్తి వెట్టి
తే. రాజనారాయణస్వామి రమ్యభవన, తార్క్ష్యకేతనపతికి నర్తనము గఱపి
పొలసె నధ్వపరిశ్రాంతి పొడవడంగ, మౌనివరుపైఁ గుమారవనానిలములు. 62

తే. బాదరాయణుఁ డత్యంతభక్తినియతి, దివ్యవాహినిఁ గొమరేటఁ దీర్ధమాడి
శిష్యవర్గంబుఁ దాను దర్శించి మ్రొక్కి, శాశ్వతునకుఁ జాళుక్యభీమేశ్వరునకు. 63

వ. వెండియుఁ గొంత దవ్వుచని. 64

సర్పపురవర్ణనము

శా. కాంచెన్ సర్పఫురాభిధానముఁ ద్రిలింగక్షోణి వైకుంఠమున్
ముంచెన్ నారదకుండికాజలముల న్మోదంబుతో దేహమున్
జించెన్ గాశివియోగదుఃఖము మహాక్షేత్రంబు వీక్షించి ద
ర్శించెన్ సన్ముని లోచనోత్సవముగా శ్రీభావనారాయణున్. 65

సీ. శ్రీసుదర్శనశంఖచిహ్నాంకితముగాక , యెపుడు మిన్నకయున్న యిల్లు లేదు
బహులోర్ధ్వపుండ్రసంపద లేక వృథయైన, ఫాలరేఖలతోడి ప్రజయు లేదు
వైష్ణవోత్తమభాగవతసాత్త్వికులగోష్ఠి, వెలియైన వాటికావేది లేదు
నలినేక్షణుఁడు భావనారాయణస్వామి, దప్పించి పరదైవతంబు లేదు
తే. పరమగీర్వాణయాగవైభవము నెలవు, నిఖలకల్యాణగుణకేలినిలయ మనఘ
దివ్యములు నూటయెనిమిది తిరుపతులకుఁ, బరమపదమైన శ్రీసర్పపురమునందు. 66

మ. శనివారోత్సవ మాచరించె మునిశిష్యవ్రాతముం దానుఁ గ
మ్మనిపణ్యారముతోడ బూరెగమితో మండెంగ దండంబుతో

ననుగుంబాసెముతోడఁ బొండుకలమాహారంబుతో నేతితో
ఘనరంభాషలఖండశర్కరలతోఁ గారుణ్యపాథోధికిన్. 67

తే. ద్వాదళాక్షరదివ్యమంత్రమునఁ బూన్చెఁ, జెంగలువ పువ్వుదండ లక్ష్మీధవునకు
శ్రీమదష్టాక్షరమున నర్చించెఁ దపసి, భావనారాయణస్వామిఁ బసిఁడివిరుల. 68

వ. అనంతరంబ కతిపయప్రయాణంబులం దుల్యభాగాతీరంబున. 69

శా. చేతోమోద మెలర్పఁ గట్టెదురఁ గాంచెన్ భారతామ్నాయ వి
ద్యాతంత్రగ్రథనాబ్జసంభవుఁడు వేదవ్యాసుఁ డభ్యర్హిత
జ్యోతిర్లింగమయస్వరూపుల జటాజూటావనార్దేందులన్
వాతాపీల్వలవైరి గౌతమనదీవాస్సంగమేశానులన్. 70

తే. వేదశాఖావిభాగసంవేది యతఁడు లలితబిల్వశాఖాపలాశసమితి
సంగమేశఘటోద్భవశంకరులకు, నర్చనము సేయుఁ బ్రణవపంచాక్షరముల. 71

వ. మఱియుఁ దుల్యభాగాతీరంబున సాంపరాయణగ్రామంబుచేరువ బిల్వాటవీ వాటిఁ
గపట భిల్లుండైన చలిగొండ ఱేని యల్లుని ముక్తీశ్వరు దర్శించి. 72

ఉ. వేదవిభాగముం బరిఢవించిన పుణ్యుఁడు వేడ్కఁ బూన్చె బి
ల్వీదళపూజనంబు గడులెస్సఁగఁ గూరిమిశిష్యపంక్తితో
నాదిమభిల్లు నిత్యకరుణామృతపూరముఁ జల్లు పుండరీ
కోదరభల్లు నృత్తకరియూథపుమల్లునిఁ గొండయల్లునిన్. 73

తే. పదియునార్వన్నెబంగారుఁ బరిహసించు, నవనవారగ్వధప్రసూనములు గోసి
సాంపగాయమహాగ్రామసవిధనిలయు, నభవుఁ బూజించెఁ బుండరీకాక్షమూర్తి. 74

క. పంచబ్రహ్మంబుననున్, బంచాక్షరమంత్రమునను బంచాననునిం
బంచమవేదం బభినిర్మించినముని ఫూన్చెఁ బుండరీకకళికలన్. 75

వ. ఇవ్విధంబునఁ గాలకంఠునకుఁ బ్రభాతకాలపూజ నిర్వర్తించి సాత్యవతేయుండు గమనోన్ముఖుండై యున్న సమయంబున. 76

సీ. ఎవ్వాఁడు వింధ్యాద్రి నిఱ్ఱింకులింకించె, గంభీరహుంకారగర్జనమునఁ
బ్రణవపంచాక్షరోపనిషత్ప్రపంచంబు, లెవ్వాఁడు శివునిచే నెఱిఁగికొనియె
గడసిల్లుధరయొడ్డ గెడవైన నెవ్వాఁడు, త్రాసుపైఁ గట్లెచందమున వంచె
నంభోదు లేడింటి నాపోశనం బెత్తి, కలిగించె నెవ్వాఁడు క్రమ్మఱంగ
తే. భీమనాథేశ్వరుఁడు గౌరిఁ బెండ్లియాడి, దక్షిణాముఖకల్యాణదర్శనమున
వత్సరము వత్సరంబు నెవ్వానిఁ జూచు, నతఁడు గగనాగ్రమాణిక్య మరుగుదెంచె. 77

తే. మలయదుర్ధరగిరిగుహామందిరుండు,
తామ్రపర్ణీజలస్నాన ధౌతమలుఁడు

కలుషితాంభఃప్రసాదైకకతకఫలము,
కోమలియుఁ దాను నేతెంచెఁ గుంభభవుఁడు. 78

శా. ద్వీపాంతోద్భవుఁడైన సంయమికులాధీశుండు కాలోచిత
వ్యాపారంబులు దీర్చి రేపకడ దక్షారామయాత్రోద్యమం
బాపాదించుచు నోంక్రియానగరపర్యంతార్ధమార్గంబునన్
లోపాముద్రయుఁ దాను వచ్చు ముని నాలోకించె దౌదవ్వులన్. 79

తే. ద్వాదశక్షేత్రయాత్రావిధాననియతి, భీమమండలిఁ జరియింపఁ బృథులభక్తిఁ
గుక్కుటేశ్వరు దర్శింపఁ గోర్కి పుట్టి, యట్టి పీఠాపురంబున కరుగువాని. 80

ఉ. ఱేపులు భీములింగము గుఱించి జపం బొనరించి నిచ్చలున్
మాపటిదాఁకఁ దీర్థముల మజ్జనమాడుచు నుండు వానిఁ బీ
ఠాపురి కుక్కుటేశ్వరుని డాయఁగఁ బోయెడువానిఁ దుల్యభా
గాపగ చెంత శంకరగృహాంగణ బిల్వవనాంతరంబునన్. 81

వ. అప్పరమమాహేశ్వరుం గనుంగొని సాత్యవతేయుండు ప్రత్యుత్థానంబు చేసి యెదుర్కొనియె నతండును. 82

సీ. భస్మత్రిపుండ్రాంకఫాలప్రదేశుని, రుద్రాక్షమాలికారూఢవక్షు
నుపవీతకృష్ణాజినోత్తరాంగునిఁ బల్ల, వారుణాంచితజటాపటలధారు
దామ్రపాత్రాంగుళీదర్భమూలపవిత్రుఁ దరుణకింశుకలతాదండధారుఁ
బ్రావృషేణ్యవినీలపాథోధరశ్యాము, సాలవృక్షప్రాంశుఁజారుదేహుఁ
తే. బరమభాగవతోత్తమప్రథమగణ్యు, విమలమాహేశ్వరాచారవీథిపథకు
నఖిలనీవారముష్టింపచాగ్రవరునిఁ, బులినసంభవుఁ బొడగాంచెఁ గలశజుండు. 83

ఉ. యోజనగంధినందనుఁడు నూర్వశిపట్టియు నిర్ణి రోధని
ర్వ్యాజనిరంకుశప్రణయవైభవసంపద సొంపు మానసాం
భోజములం దలిర్ప మునిపుంగవు లొండొరుఁ గౌఁగిలించి వి
భ్రాజితలీలఁ జల్పిరి పరస్పరముం గుశలప్రసంగముల్. 84

క. వినయము భక్తియు సంభ్రమ, మును సౌహార్దంబు హృదయముల మొలతేరన్
వినుతి యొనర్చి రగస్త్యున, కును వైశంపాయనాదికులు మునిశిష్యుల్. 85

వ. అనంతరం బాతుల్యభాగాతీరబిల్వతరువనాంతరంబున శశికాంతశీతలశిలాతలప్రదేశంబున నాసీనులై యిల్వలాసురదమనుండును బరాశరనందనుండును గొంతతడ విష్టకథావినోదంబులఁ బ్రొద్దువుచ్చి రప్పు డగస్త్యుండు సాత్యవతేయున కిట్టు లనియె. 86

అగస్త్యుఁడు వ్యాసమహర్షి గాశిఁ బాసి వచ్చుటకుఁ గారణం బడుగుట

తే. ఆననమునందు వైవర్ణ్య మగ్గలించెఁ, గన్నుఁగవయందు దైన్యంబు గానఁబడియె
నార్తి నేదేనియొకటి నీయంతరంగ, మూనియున్నది యిది యెట్టులొక్కొ యనఘ. 87

సీ. లోలార్కునకు నీకు లోలోన నేమేనిఁ, బోటిపుట్టదు గదా మాటమాట
వెనకయ్య శ్రీడుంఠివిఘ్నేశ్వరస్వామి, ధిక్కరింపఁడు గదా తెగువ నిన్ను
నాఁకొన్న నిన్ను మధ్యాహ్నకాలంబున, నరయకుండదు గదా యన్నపూర్ణ
నెప మేమియును లేక నీయెడాటమ్మునఁ, బాటిఁదప్పఁడు గదా భైరవుండు
తే. ఎట్టు పాసితి మిన్నేటి యిసుకతిప్ప, లెట్టు పాసితి వాస్థలం బేరుకోసు
లెట్టు పాసితి వవిముక్తహట్టభూమి, యెట్టు పాసితి విశ్వేశు నిందుధరుని. 88

క. కాళీనందన కంఠీ, కాలుర శిరములకు విరులు కల్పించునొకో
లీలావనాంతరమునను, మాలోపాముద్ర యిడిన మల్లీవల్లుల్. 89

శా. ఆమందాకిని యాత్రి ణి వలనం బాబాహ్యకక్ష్యాస్థలం
బామధ్యాంతరకక్ష్య లావిమలదివ్యజ్యోతిరుజ్జృంభణ
శ్రీమద్విశ్వపతీశలింగము మదిం జింతింపఁ గాశీమహా
గ్రామం బిప్పుడు నాకనుంగవకు సాక్షాత్కారముం గైకొనున్. 90

శా. ఆనందంబున నర్ధరాత్రములఁ జంద్రాలోకముల్ కాయఁగా
నానాసైకతవేదికాస్థలములన్ నట్దిక్కులన్ శంభుఁ గా
శీనాథున్ దరుణేందుశేఖరు శివున్ శ్రీకంఠునిన్ బొాడుచు
న్మేనెల్లం బులకాంకురప్రకరముల్ నిండార మిన్నేటిలోన్. 91

క. గంగాయమునాతీరో, త్సంగమునఁ బ్రయాగను న్సదాశివు విశ్వే
శుం గూర్చి తపము చేసితి, నంగుష్టము ధరణి మోపి యతిఘోరముగన్. 92

తే. విస్మయము నాకు మదిలోన విస్తరిల్లెఁ, బరమధర్మజ్ఞ కాశికాపట్టనమున
సుండు మూఢాత్ముఁడైనను నొండుకడకుఁ, బోవఁ దలఁపఁడు నీ కెట్లు బుద్ధి పుట్టె? 93

వ. అనినఁ బారాశర్యుండు వాతాపిదమనున కిట్లనియె. 94

వ్యాసులు తాను గాశిఁ బాసిన కారణంబుఁ జెప్పుట

చ. సమధికసత్కవీశ్వరులు జైమినిపైలసుమంతు లాదిగా
శమదమసద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడఁ గూడిరాఁ
గ్రమమునఁ క్షేత్రయాత్రకు ధరాతలమం దఖిలంబు ద్రొక్కి భా
వము భవభక్తియుక్తముగ వచ్చితిఁ గాశికిఁ బుణ్యరాశికిన్. 95

క. ఏమిశకునమునఁ జొచ్చితి, మో మన్మథదమనువీ డహోరాత్రంబుల్
మే మేడునాళ్ళదనుకను, స్వామీ! యుపవాసముండి జడిసితిమి మదిన్. 96

క. గేహముల కేగి భిక్షాం, దేహియన న్వీట నొకపతివ్రత యైనన్
సౌహార్దంబునఁ దెడ్డెం, డాహారము పెట్టదయ్యె నా దినములలోన్. 97

శా. శ్రీవిశ్వేశ్వరదేవదేవుని కృపాశ్రీచే దివోదాసు బా
హావిశ్రాంతబలంబుచేత ధవళన్యాయప్రజావృద్ధి నొ
ప్పై విశ్రామము గల్గి సుస్థిరతిరంబై యుండి భాసిల్లఁగా
నీ వారాణశిలోన భిక్ష కఱవయ్యెం జూడుమీ కుంభజా. 98

శా. వైశంపాయనుఁ డెంతయు సుడివడె న్వాడె న్సుమంతుం డతి
క్లేశం బందిరి పైలజైమినులు దుఃఖించెన్ మదీన్ దేవలుం
డాశాంతంబులు చూచె దాల్భ్యుఁ డుదరోదగ్రక్షుధాక్షోభచేఁ
గాశీపట్టనవిప్రవాటికల భిక్షాలబ్ధి లేకుండుటన్. 99

తే. అక్కటా యేమి చెప్ప వింధ్యాద్రిదమన, కాశీలో నేడు నాళ్లు నిష్కారణంబ
శిష్యులును నేను నిట్రుపాసెంబు నడితి, మమరగంగానదీసైకతములయందు. 100

వ. అష్టమదివసంబునం దరుణోదయకాలంబున గంగాపులినోత్సంగంబులం గుశశయనంబున మేలుకాంచి యభ్యుదితంబైన మార్తాండమండలం బాఖండలదిశావేదండకంఠ గ్రైవేయకనకఘంటికాఠంకారంబునుం బోలె నుదయగిరిశిఖరతటసవిధంబునం గుంకుమరజస్త్రసరేణువిసరంబునుం బోని నిగనిగ నునుజిగి గీలుకొని కోమల జిలుఁగుజిగికొనలు గగనతల మలమికొనుకొలఁది మణికర్ణికాంభఃప్రవాహంబున నఘమర్షణస్నానం బాచరించి యత్తీరవాసిజనవిరచితవాలుకాలింగంబులకుఁ బీఠార్చనాశంభులింగంబులకును ముంత్రాక్షతపుష్పకపూర్వకంబుగా నభివాదనంబుఁ జేసి పంచబ్రహ్మపంచాక్షరీమంత్రప్రధానంబులు జపియించి సిద్ధమునిపరంపరాసంకులంబైన ఘంటాపథంబునం గంగాబహిర్గేహదేహళీవిభాగంబును నంతర్గేహసౌధవీథికాట్టకుట్టిమప్రఘణంబులును గడిచి లోలార్కకాలభైరవ డుంఠివినాయక విశాలాక్షీ ప్రముఖపరివారదేవతాకోటికి నేటికోళ్లు సమర్పించి విశ్వేశ్వరు విరూపాక్షు నక్షీణమోక్షలక్ష్మీసామ్రాజ్యసింహాసనారూఢుం దారకోపదేశదేశికు దాక్షిణ్యపుణ్యకరుణాకటాక్షవీక్షాపేక్షునిఁ బ్రదక్షిణక్రమదండప్రణామపురస్సరంబుగా సేవించి ముక్తిమంటపంబునఁ గొంతతడవుండి మధ్యాహ్నకాలం బగుట నిరూపించి భిక్షాపాత్రంబులఁ గేలఁ బూని యతికఠోరజఠరక్షుధాగ్నితాపంబునకుఁ దోడగు తపనమయప్రచండకిరణకాండప్రకాండంబులు నెత్తి మండింప లేదు నడువుండు పొండుకూడ దను నిషేధవాక్యంబులు చెవులు నిండికొన

విప్రవాటంబులఁ బ్రతిగేహంబును బరిభ్రమించి విసికి విసిమాలి వేసరి యలసి యారటఁబొంది సొలసి జూఁకించి తూలి దూఁపటిలి యుల్లంబునఁ గ్రోధం బుద్భవించిన. 101

శా. కుక్షిప్రోద్భవనిష్ఠురక్షుధితదుష్క్రోధాంధకారంబునం
జక్షుల్ రెండును జిమ్మచీఁకటులుగా సంరంభశుంభద్గతం
బ్రేక్షచ్చాత్రులు భీతిఁబొందఁ గడునుద్రేకించి హట్టంబునన్
బిక్షాపాత్రము రాతిమీఁద శతధాభిన్నంబుగా వైచితిన్. 102

క. అటు పౌరవీధి చక్కటిఁ, బటుకునఁ బడవైచి క్రోధపరిపాటిమెయిం
గటము లదరంగ భ్రూకుటి, నిటలములను జెమటనీరు నిండ ఘటిల్లన్. 103

క. ఏమి యని చెప్పుదును లో, పాముద్రాప్రాణనాథ ప్రజ్ఞావిభవం
బేమోయయి చెడిపోవఁగ, నామది నెన్నండు లేని నైచ్యము పొడమెన్. 104

సీ. ఏలా విచారింప నిందురేఖామౌళి, వివిధమౌక్తికధాతు • విశ్వనాథు
నేలా వితర్కింప హిమశైలశేఖరో, ష్ణీయకౌశేయంబు సిద్ధతటిని
నేలా పరీక్షింప నిభరాజవదనుని, డుంఠి విఘ్నేశు మండూకజఠరు
నేలా విలోకింప వ్రీళాకళాశూన్య , కటిఁ గాలభైరవు వటుకనాథు
తే. నిధకిలకైవల్యకల్యాణనిలయమైన, కాశిపైఁ గూడు లేకుండుకారణమున
నలిగి శపియింపఁగాఁ బూని యందుకొంటి, ధృతకమండలు భాగీరథీజలంబు. 105

ఉ. కోపము సంహరింపు మునికుంజరయంచు లలాటదేశసం
స్థాపితపాణిపద్మయుగసంఘటితాంజలిబంధులై మహా
తాపసశిష్యబృందముల్ ధర్మపథంబును దెల్పి చెప్పఁగా
శాపజలంబు పూనితిఁ బ్రశాంతివిహీనత నేమి చెప్పుదున్. 106

వ. ఇవ్విధంబున సప్తవాసరోపరవాసాయాససంభూతప్రభూతరోషావేశంబున నంగుళీపవిత్రసనాథంబైన హస్తంబున మణికర్ణికాజలంబులు ధరియించి యిట్లని శపియింప నుద్యోగించితి. 107

వ్యాసులు కాశిని శపింపఁబూనుట

శ్లో. మాభూత్త్రైపూరుషీ విద్యా, మాభూత్త్రైపూరుషం ధనమ్
మాభూత్త్రైపూరుషీ భక్తిః, కాశ్యాం నివసతాం సదా. 108

తే. అని శపింపఁగఁ బూను నయ్యవసరమున
నేమి చెప్పుదు నోసంయమీంద్రవంద్య
యుదిలగొని కంపమందుచునుండెఁ గాని
శాపజల మందుకోఁ గేలు సాఁగదయ్యె. 109

వ. ఆసమయంబునఁ గాశికానగరసోమవీథికాభవనవాటికామధ్యంబున నొక్కయింటి మచ్చకంటి పంచాశద్వర్షదేశీయపలితసారంబైన వేణిభారంబు గైవడ ముదుసలిచక్రవాకంబులతో నెకసక్కెంబాడు వీఁగుచన్నుల వ్రేగుఁదనంబునఁ దనతనూవల్లి జలదరింపఁ గంకణఝణఝణత్కారంబు దోరంబుగాఁ గ్రక్కున గోపురద్వారంబు బోరుతలుపు వాయందట్టి యందియలరవళితోడం గూడి మట్టియలమ్రోత త్రిభువనంబులు నురుజగొనం దేరుగడుపయోలం జరణపల్లవంబుఁ జాఁచి యనంగధ్వజపటకఠోరపాఠీనచ్చాయాదాయాయంబులైన వెణఁదకన్నులు తలచుట్టునుంబలిసి పొలయ కలమధురవీణాక్వాణపాణింధమంబైన యెలుంగు నెత్తి యో బ్రాహ్మణోత్తమా! శాప ముపసంహరించి యిటు రమ్మని నన్ను జేరం బిలిచిన. 110

ఉ. సంతసమంది యే నపుడు శాపజలంబులు పాఱఁజల్లి వే
దాంతవచోమహోపనిషదర్థమయిన్ శుభరూపవృద్ధసీ
మంతినిఁ గాశికానగరమధ్యనివాసిని విశ్వనాథుశు
ద్దాంతము డాయఁబోయితిఁ బ్రియంబును భక్తియునుం దలిర్పగన్. 111

ఆ. డాయఁబోయి యప్పు డాయమ్మ యెవ్వరె, యేకులబునదియొ యెఱుఁగకయును
నే జోహారునిడితి (హృదయంబ నేరుచు, నెదురు ప్రాభవంబు నేర్పరింప.) 112

వ. అంత నన్నుం జేరఁబిలిచి యక్కాంత యిట్లనియె. 113

తే. భిక్ష లేదని యింత కోపింతురయ్య? కాశికాపట్టనముమీఁదఁ గానినేయ
నీమనశ్శుద్ధిఁ దెలియంగ నీలకంఠుఁ, డింత చేసెను గాక కూ డేమి బ్రాఁతి. 114

తే. శ్రీవిశాలాక్షి బంగారుతెడ్డునందు, నమృతపాయస మొసఁగు నభ్యాగతులకుఁ
గాశికాపురి మధ్యాహ్నకాల మనఁగ, వినియు నెఱుంగవే యాతిథ్యవేళలందు. 115

ఉ. ఏడు దినంబు లన్నమున కెడ్డము పుట్టిన యంతమాత్రలో
నేడుచుచున్నవాఁడవు మునీశ్వర నేఁడును నీదు ధీరతల్
పాడఱిపోయెనే శివునిభార్యకుఁ గాశికిఁ బుణ్యరాశికిం
గాడు నొనర్పఁ జూచెదవు • కంఠపుఁగ్రోధము పెచ్చులెచ్చఁగన్. 116

ఉ. క్రొన్నెలపువ్వుదాల్పునకుఁ గూరిమిభోగపురంధ్రి కక్కటా
యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టికోప మే
లన్న! ఘటించె దో మునికులాగ్రణి నిక్కమువో బుభుక్షితః
కిన్నకరోతి పాపమను కేవలనీతిఁ దలంచి చూడఁగన్. 117

తే. కాశిపైఁ గోపగింపఁగఁ గాదు నీకు, నెంత కోపించునో యింత కిందుమౌళి
విప్రుఁడవు గాన నేరము వెదకఁ దగదు, భిక్షఁ గొనరమ్ము మాటలు పెక్కు లేల. 118

వ. అనిన నవ్వాలుఁగంటికి నిట్లంటి. 119

శా. తల్లీ! యిన్ని దినాల కేనియు సుధాధారారసస్యందియై
యుల్లంబున్ సుఖయింపఁజేయు పలు కెట్లో వింటి నివ్వీటిలో
బెల్లాఁకొన్నతవాన నే నొకఁడనే భిక్షానకున్ వత్తునో
యెల్లన్ శిష్యులఁ గొంచు వత్తునొ నిజం బేర్పాటుగాఁ జెప్పుమా. 120

తే. ఈవు పెట్టిన భిక్ష మే మిందఱమును
బంచుకొని చేయువారము ప్రాణరక్ష
నాతి యందఱవియును బ్రాణములు కావె?
నాయదియె ప్రాణమని వత్తునా! భుజింప. 121

వ. అనిన మందస్మితవదనారవిందయై యయ్యిందుబింబానన యిట్లనియె. 122

శా. అంతేవాసులు నీవుఁ గూడుకొని మధ్యాహ్నాభిషేకక్రియల్
శాంతస్వాంతతజాహ్నవిం జలిపి పెల్చన్ రండు నే నింతలో
నంతర్గేహమునన్ సమగ్రముగ మీ కాహారము ల్వేగఁ గ
ల్పింతున్ భోజనమిష్ట మిందఱకు దృప్తిన్ బొందఁగాఁ బెట్టెదన్. 123

క. ఆఁకొంటి రిన్నిదినములు, పోఁకంతయు భిక్ష వీటఁ బుట్టక యునికిన్
ఆఁకట దూఁకట నలిగితి, రేఁకట వాయంగ భిక్ష లిడియెద రండీ. 124

వ. అనిన నేమును వియల్లోకల్లోలినికిం జని యాప్లవనం బాచరించి యుభయపవిత్రంబులు ధరియించి వేదంబులు పఠించుచు వచ్చి యమ్మచ్చకంటి యింటి మొగసాల గూర్చింటిమి. 125

క. మున్నూరు శిష్యులను నే, నన్నెలఁతుకతోడ మాటలాడిన యయ్య
భ్యున్నతసౌధముమీఁదను, సున్నమునిగిడించినట్టి జోడరఁగులపై. 126

వ. ఉండి యాసారప్రసారంబులు చేయు శంభళీజనంబుచేతను మారాక యెఱింగించిన నబ్బోటి హాటకమయంబైన గొడుగుపావలు గిలుకలు గులుకరింపఁ గుసుమకోదండసమ్మొహనకాండంబునుఁ బోని యొక్క రెండవవయసుతాంబూలకరండవాహినిం గైదండపట్టుకొని యేతెంచి రండు విచ్చేయుండని సబహుమానంబుగాఁ దోడ్కొనిపోయి చంద్రికాసంకాశకౌశేయశతసహస్రసందానితవితానోపశోభితంబును, గాలాగురుధూపధూమవాసనాసనాథంబును, గర్పూరరచితంరంగవల్లీవేల్లితంబును, గస్తూరికాలేపనసురభిశశికాంతమణిశిలాకుట్టిమంబును నగు చతుశ్శాలాభోజనమందిరంబున వృద్ధానుపూర్వకంబుగ నుచితాసనంబులం గూర్చుండ నియమించిన. 127

క. మొగి విరిసి కఱకుగూడక, పగులక వెడలుపును నిడుపుఁ బసిమియుఁ గల లేఁ
జిగురరఁటాకులు పెట్టిరి, దిగదిగ నద్దేవియాజ్ఞ దివ్యపురంధ్రుల్.128

వ. అనంతరంబ. 129

తే. అర్చనలు చేసి గంధపుష్పాక్షతముల, ధూపమిచ్చెఁ గాలాగురుధూమరేఖఁ
గప్పురంబు నివాళించెఁ గమలనేత్ర, పంక్తిపంక్తికి నేతెంచి బ్రాహ్మణులకు. 130

ఉ. ఇందఱుఁ గూడి శాంతి పనియింపుఁడు మజ్జనమాచరింపుఁ డ
ర్ధేందుకళాకిరీటునకు నీ యమృతాన్నము లీ పదార్థముల్
మందగతిం భుజింపుఁడు సమస్తజగత్పతి కాశికాపురీ
మందిరవిశ్వనాయకుఁ డుమాపతి ప్రీతి వహించుఁ గావుతన్. 131

వ. అని పంక్తిపంక్తి నడుమ నిలుచుచుఁ నయ్యింతి భక్తిశ్రద్ధాతాత్పర్యవిశ్వాసపూర్వకంబుగా నుర్వీగీర్వాణవర్గంబులఁ బ్రార్థించుచు నాపోశనంబులు వోయింపనుండె నప్పు డేను బైలసుమంతుజైమినివైశంపాయనాదిశిష్యప్రకరంబు నెమ్మనంబుల నిట్లని వితర్కించుచుంటిమి. 132

ఉ. వండినచొప్పునుం బొగపువాసనయుం బొగపారుచందమున్
భాండసమృద్ధి సంపదయుఁ బాసవిభూతియు సర్వమంగళం
బండజయాన రిత్తప్రియ మాడెడు నేఁడును భోజనంబు లే
కుండుట గాననయ్యె నసితోత్పలగంధియు నేమి మాయయో. 133

ఉ. చల్లనిసౌమ్యదృష్టియుఁ బ్రసాదము మాధురియు న్వివేకము
న్వెల్లఁదనంబు మౌగ్ధ్యమును నిర్మలినత్వముఁ జూడవచ్చినం
గల్ల యొకింతయేనిఁ బొడగానఁగరా దరఁటాకుఁ జూచినన్
ఝల్లనె గుండె యోగిరము శాకములుం బొడగానరామికిన్. 134

తే. పాత్రసంశుద్ధి కాజ్యంబు పస్తరించి, యూరకుండిరి యిది యేమియొక్కొ వీరు
కానరావిప్డు శాకపాకములు నెదుర, మనకు నిజమయ్యె నలచందమామఘుటిక. 135

మ. అవుగా కేమి నిజంబు తేటపడఁగా నర్చించె గంధాక్షతా
దివిశేషంబుల శాంతిపాఠమును సందీపించె విశ్వేశ్వరున్
శివు నుద్దేశము చేసి మ్రొక్కి వివిధాశీర్వాదముల్ గైకొనెం
ధవళాంభోరుహనేత్ర యింతయును మిధ్యాదృష్టి గానేర్చునే. 136

క. కానీ యీదివసంబును, నే నిన్నఁటి యట్లకాక యేమనఁగ నపో
సానంబులు వడ్డించిరి, మానవతీజనులు లీల మహిదివిజులకున్. 137

తే. పోసి రాయెల్లవారి కాపోశనములు, నారగింపుఁడు లెండు మీ కమృతమస్తు
ప్రొద్దుపోయెనుజుండని బుజ్జగించి, మ్రొక్కి యంజలియెత్తె నమ్ముదుకపణఁతి. 138

శా. ఆముతైదువ యాజ్ఞ విప్రనికరం బాపోశనం బెత్తినన్
సామర్థ్యం బది యెట్టిదో నిఖిలమున్ సంపూర్ణమై పత్రపా
త్రీమధ్యంబునఁ బిండివంటకములుం దివ్యాన్నముల్ షడ్రసీ
సామగ్రీరుచిమత్పదార్థచయము ల్సంధిల్లె నొక్కుమ్మడిన్. 139

ఉ. పప్పును బిండివంటలును బాయసముల్ ఘృతముల్ గుండంబులుం
గుప్పలుగాఁగఁ జుట్టునను గూర్పఁగఁ గూడిన యేరుఁబ్రాలతె
ల్గప్పురభోగివంటకము గమ్మని తాలిపు సొజ్జెపిండితో
నొప్పులుగా భుజించిరి బుధోత్తము లాఁకటిచిచ్చుపెచ్చునన్. 140

క. తరుణి యిది యన్నపూర్ణా, పరమేశ్వరి గాని యితరభామిని గాదం
చరవాయి గొనక మెసఁగిరి, పరమమునీశ్వరులు పంచభక్ష్యాన్నంబుల్. 141

శా. ద్రాక్షాపానకఖండశర్కరలలో రంభాఫలశ్రేణితో
గోక్షీరంబులతోడ మండెఁగలతో గ్రొన్నేతితోఁ బప్పుతోఁ
నక్షయ్యంబగు నేరుఁబ్రాలకలమాహారంబు నిశ్శంకతం
గుక్షుల్ నిండఁగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్. 142

ఆ. ఎవ్వఁ డేపదార్థ మెంతేనిఁ జింతించు, నతని కాపదార్థ మంత గలిగి
యరఁటియాకుమీఁద నవతారమై యుండు, నిట్టిమహిమ చూడ మెన్నఁడేని. 143

ఉ. వేలుపుగిడ్డియుం బరుసవేదియుఁ గల్పకుజంబుఁ దోడ రా
లాలితపాదనూపురఝుళంఝళనాదము లుల్లసిల్లఁ బైఁ
జేలచెఱంగు దూలఁగ విశృంఖలవృత్తి జరించుచుండె నీ
లాలక యన్నపూర్ణ యమృతాన్నముఁ బెట్టుచు నన్నిపంక్తులన్. 144

వ. ఇవ్విధంబున నాజ్యధారాప్రవాహంబును,శర్కరాక్షోదసికతాంచితంబును, బాయసాపూపసంపన్నంబగు కలమాన్నపూర్ణంబును, ద్రాక్షాగోక్షీరక్షౌద్రపుండ్రేక్షుఖండమండితంబును, రంభానారికేళఫలపాకశాకసాకల్యకల్యంబును, షాడబరసావళీపానకప్రచురంబును, శరచ్చంద్రచంద్రికాధవళదధిసమృద్ధంబును నైన
భోజనోత్సవంబు వైశంపాయసవమనః ప్రమోదసంపత్సంపాదనలంపటంబును, సుమంతుసంతోషకారణంబును, బైలరసనాతపఃఫలంబును, జైమినికామనాకామధేనువును, దేవలముదావహంబును, రోమహర్షణహర్షోత్కర్షావహంబును, సూతకౌతూహలహేతుభూతంబును, నస్మన్మనోరథవిహారఘంటాపథంబునునై ప్రవర్తిల్లెఁ దదనంతరంబ. 145

ఆ. హస్తములను గడిగి యాచమనక్రియా, వ్యాప్తి దీర్చి దేవి యాజ్ఞ మేము
విమలసౌధమధ్యవేదికాస్థలమున, విశ్రమించియున్నవేళయందు. 146

వ. అభ్యంతరభవనంబునందుండి. 147

విశ్వనాథుఁడు పార్వతితోడ వ్యాసాదులుండిన వేదికకడకు విజయము చేయుట

సీ. చంద్రబింబానన చంద్రరేఖామౌళి, నీలకుంతలభార నీలగళుఁడు
ధవళాయతేక్షణ ధవళాఖిలాంగుండు, మదనసంజీవని మదనహరుఁడు
నాగేంద్రనిభయాన నాగకుండలధారి, భువనమోహనగాత్ర భువనకర్త
గిరిరాజకన్యక గిరిరాజనిలయుండు, సర్వాంగసుందరి సర్వగురుఁడు
తే. గౌరి శ్రీవిశ్వనాథుండు కనకరత్న, పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు
నేగుదెంచిరి యొయ్యార మెసక మెసఁగ, విహరణక్రీడ మా యున్న వేది కపుడు. 148

తే. జయయు విజయయు నొకవంక సరస రారు
నందికేశుండు ముందర నడచి రాఁడు
ప్రథమదంపతు లేమి సంభ్రమము లేక
యరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు. 149

శా. గౌరిం జూచినయప్పు డంచితమహాకారుణ్యసంసత్తియుం
దారాసాయకమౌళిఁ జూచినపు డుద్యత్క్రోధసంరంభముం
దోరంబై యపు డంతరంగముల సంతోషంబు సంత్రాసముం
బూరించె న్విను మేమి చెప్పుదు మహాపుణ్యాత్మ కుంభోద్భవా. 150

తే. కాశీ శివునకు శుద్దాంతకాంతగాన
దానిపై నల్గి కోపపాత్రంబ నైతిఁ
గాశి గారికి సవతియౌఁ గాన నేను
దానిపై నల్గి ప్రేమపాత్రంబ నైతి. 151

వ. అనంతరంబ యేము ప్రత్యుత్థానంబు చేసి యాపురాణదంపతులకుఁ బ్రణామంబు లాచరించి మడిసందులం జేతులిడి యొక్కకెలన నిలిచి యుండితిమి. పార్వతీపరమేశ్వరులు వేదికాస్థలంబున విజయం చేసి కూర్చుండి రప్పుడు శంభుండు కోపసంరంభంబున నాదిక్కు చూచి ధిక్కరించి యిట్లనియె. 152

శంభుండు వ్యాసుని శిష్యులతోడఁ గాశి వెడలిపొమ్మనుట

సీ. ఓరి దురాత్మ! నీవారముష్టింపచా, భాస! యోజనగంధ ప్రథమపుత్ర!
దేవరన్యాయదుర్భావనాపరతంత్ర! బహుసంహితావృథాపాఠపఠన!
భారతగ్రంథగుంభనపండితంమన్య! నీవా మదీయపత్నికి నశేష
కైవల్యకల్యాణఘంటాపథమునకుఁ, గాశికాపురికి నిష్కారణంబ
తే. శాప మిచ్చెద నని యనాచారసరణి
నడుగుపెట్టినవాఁడ వహంకరించి

పొమ్ము నిర్భాగ్య మాయూరిపొలము వెడలి
యెచటికేన్ శిష్యులును నీవు నీక్షణంబ. 153

క. పోక నడగొట్టితేనియు, రాకింతుఁ జుమీ మొగంబు రాచట్టుపయిం
శ్రీకాశిక నిందించిన, నీకింతట నేలపోవు నీచచరిత్రా. 154

క. వడి విడువక యివ్వడువున , నుడుపతిమకుటుండు చెవుల కొనరని నుడుగుల్
నొడివిన నే నయ్యిరువుర, యడుగులఁ బడి కాశి వెడలి యరిగెడువేళన్. 155

చ. వెఱవకు మోకుమార! పదివేలవిధంబులనైన నిన్ను నే
మఱవ మఱేడకుం జనుట మాని సుఖంబున దక్షవాటికన్
దుఱఁగలి గొన్న సమ్మదముతో గమనింపుము భీమనాయకుం
డఱగొఱలేనివేల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యెడున్. 156

వ. అనిన నంబవచనంబులు విని విశ్వేశ్వరదేవరచితవ్యక్కారమహోపద్రవసంభూతవేవనాదూయమానమానసుండ నయ్యును భవానీకృపాపాంగవీక్షావిక్షేపదాక్షిణ్యంబున నొక్కింత యంకిలి దెలిసి శిష్యసహితుండనై యెన్నఁడెన్నఁడు భీమేశ్యరుఁ దర్శింతునో యని యువ్విళ్ళూరి యేతెంచుచున్నవాఁడఁ బరమమాహేశ్వరుండ వైన నినుం గనుంగొంటి నింక నామనోరథం బవ్యాహతగతిం బ్రవర్తింపఁ గలయది. 157

తే. అనవధానత నావగింజంతసూవె, పర్వతంబంత యపరాధభరము కొలిపి
కాశి వెడలంగ మొత్తినఁ గాసిబొంది, తిరుగుచున్నాఁడ నిదె యేను దిక్కుమాలి. 158

తే. కడుదయాళురు దేవతాగణములెల్లఁ, గాలభైరవుచిత్తంబు కఠినపాక
మీరసము పెద్ద డుంఠివిఘ్నేశ్వరునకుఁ, గాశి మనబోంట్ల కెల్లను గాని బ్రతుకు. 159

క. అని కుంభసంభవునకును, దన వృత్తాంతంబు చెప్పి దైన్యము నొందెన్
గనుఁగవ నశ్రులు దొరుఁగఁగ, ననఘుఁడు సత్యవతిసూనుఁడని చెప్పుటయున్. 160

వ. అటమీఁది వృత్తాంతం బెయ్యది యని యడిగిన. 161

ము. స్మరజిద్భూధరదిక్కరిద్రుహిణయోషాచంద్రికాభ్రాపగా
శరదభ్రాభ్రమువల్లభప్రతిభటస్ఫాయస్ఫురత్కీర్తిని
ర్భరగర్భోదయభూర్భువస్స్వరఖిలబ్రహ్మాండభాండోదరా!
యరివేదండఘటావిఘట్టనకఠోరాటోపకంఠీరవా!

క. అసమసమవిషమసమర, ప్రసృమరరిపు సుభటనిటల పట్టవిఘట్ట
వ్యసనదృఢదోఃకఠారా, కుసుమశరాసనసమాన కోమలమూర్తీ. 163

స్రగ్విణి. రామమాంబాసుతా రాజవిద్యాధరా
కామితార్థైకసంకల్పకల్పద్రుమా
వేమనక్షోణిభృద్వీరభద్రేశ్వరా
స్వామికార్యాభిరక్షాక్రియాదక్షిణా. 164

గద్య. ఇది శ్రీకమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీనాథనామధేయ ప్రణీతంబైన భీమేశ్వరపురాణం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

  1. పెండ్లికొడుకు = అల్లుఁడు