భీమేశ్వరపురాణము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
శ్రీరామాయనమః.
శ్రీమహా గణాధిపతయేనమః.
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరస్వామినేనమః
శ్రీ భీమేశ్వరపురాణము
ప్రథమాశ్వాసము
[1]శ్రీస్తనగంధసార పరిషేకసమంచిత సాయకప్రయో
గాస్తమహాపురత్రయుఁ డహార్యధనుర్ధరుఁ డర్కకోటి దీ
ప్తిస్తవనీయవిగ్రహుఁడు భీమయదేవుఁడు దక్షవాటికా
వాస్తుఁడు ప్రోచుఁగావుత ధ్రువంబుగ దేవయయన్న ధీమణిన్. 1
ఇష్టదేవతాప్రార్థనము
ఉ. ఏనికమోముతా ల్పెలుకనెక్కినరావుతురాజు సౌరసే
సానియనుంగుఁబెద్దన వినాయకదేవుఁడు కర్ణతాళఝం
ఝానిలతాడనంబున నిరంతరమున్ బ్రబ[2]లాంతరాయసం
తానమహాఘనాఘనకదంబములన్ విదళించుఁ గావుతన్. 2
ఉ. [3]బాలిక మోము మత్తవనబర్హికిశోరకలాస్యలీలఁ బై
వాలిచి పచ్చకప్పురపువాసనతోడి ముఖారవిందతాం
బూలపుమోవి మోవిపయి మోపుచు రాధకు నిచ్చు ధూర్తగో
పాలుఁడు ప్రోచుఁగావుత మపారకృపామతి మంత్రియన్ననిన్. 3
సీ. రాజీవభవుని గారాపుఁబట్టపు దేవి, యంచ[4]బాబా నెక్కు నలరుఁబోణి
పసిఁడికిన్నెరవీణెఁ బలికించు నెలనాఁగ, పదునాల్గువిద్యల పట్టుగొమ్మ
[5]యీరేడుభువనంబు లేలుసంపదచేడె, మొలకచందురుఁదాల్చుముద్దరాలు
వెలిచాయకొదమరాచిలుకనెచ్చెలికత్తె, ప్రణవపీఠిక నుండుపద్మగంధి
తే. మందరాచలకందరమథ్యమాన, దుగ్ధపాథోధిలహరికోద్భూతయైన
[6]లలితసాహిత్యసౌహిత్యలక్ష్మి నొసఁగు, వరదయై మాకు [7]వినతగీర్వాణి వాణి. 4
పురాతనకవీంద్రగుణకీర్తనము
శా. శ్లోకంబుల్ శతకోటిఁ గాండములుగా సూత్రించి రామాయణం
బేకైకాక్షర మెల్లపాపముల మాయింపంగి నిర్మించి [8]సు
శ్లోకుండైన పురాణసంయమివరున్ జూతు న్మనోవీథి వా
ల్మీకిన్ బ్రహ్మప[9]దావతీర్ణకవితాలీలావతీవల్లభున్. 5
మ. తలఁతున్ భారతసంహితాధ్యయన విద్యానిర్మితిప్రక్రియా
నలినప్రోద్భవునిన్ [10]గళిందతనయాంతర్వేదిపుణ్యస్థలీ
పులినాభోగకృతావతారు నపరాంభోజాక్షు నక్షీణని
ర్మలసాహిత్యకళాసమృద్ధికయి పారాశర్యమౌనీశ్వరున్. 6
సీ. ప్రణుతింతు రసభావభాననామహనీయ, కవితాసముల్లాసుఁ గాళిదాసు
గణుతింతు నిరవద్యగద్యపద్యనిబంధ, [11]పరితోషితస్థాణు భట్టబాణు
భజియింతు సాహిత్యపదవీమహారాజ్య, భద్రాసనాసీనుఁ బ్రవరసేను
వర్ణింతు నంభోధి[12]వార్వీచిగంభీర, తాసారవాక్సముత్కర్షు హర్షు
తే. భాస శివభద్ర సౌమిల్ల భల్లులకును, మాఘ భారవి బిల్హణ మల్హణులకు
భట్టి చిత్తవకవి దండి పండితులకుఁ, గీలుకొలుపుదు నొసలిపైఁ గేలుదోయి. 7
క. నెట్టుకొని కొలుతు నన్నయ, భట్టోపాధ్యాయసార్వభౌమునిఁ గవితా
పట్టాభిషిక్తు భారత, ఘట్టోల్లంఘనపటిష్ఠగాఢప్రతిభున్. 8
ఉ. పంచమవేదమై పరఁగు భారతసంహిత నాంధ్రభాషఁ గా
వించెఁ బదేను పర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
ర్వంచితకీర్తివైభవవిరాజికిఁ దిక్కన సోమయాజికిన్. 9
మ. కనకక్ష్మాధరధీరు వారిధితటీకాల్పట్టనాధీశ్వరున్
ఘనునిన్ బద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్
[13]వినమత్కాకతి సార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు మా
యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్యచూడామణిన్. 10
మ. [14]హరచూడాహరిణాంకవక్రతయుఁ గాలాంతస్ఫురచ్చండికా
పరుషోద్గాఢపయోధరస్ఫుటతటీపర్యంతకాఠిన్యమున్
సరసత్వంబును సంభవించె ననఁగా సత్కావ్యముల్ దిక్కులం
జిరణాలంబు నటించుచుండుఁ గవిరాజీగేహరంగంబులన్. 11
కుకవి నిరాకరణము
చ. వెస వసుధాస్థలంబునఁ గవీంద్రులు గొందఱు [15]శేముషీమషీ
రసము మనఃకటాహకుహరంబుల నించి కలంచి జిహ్వికా
కిసలయతూలికం గొని లిఖంతురు కబ్బము లెన్నఁగా మహా
న్యసనముతో నిజాననవియత్తల[16]తాళపలాశరేఖలన్. 12
తే. బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు, శాంతి[17]నిప్పచ్చరంబు మచ్చరము ఘనము
కూపమండూకములుఁబోలెఁ గొంచె మెఱిఁగి, [18]పండితంమన్యులైన [19]వైతండికులకు. 13
తే. నికటమున నుండి శ్రుతిపుటనిష్ఠురముగ, నడరికాకులు బిట్టు పెద్దఱచినప్పు
డుడిగి రాయంచ యూరక యుంట లెస్స, సైఁపరాకున్న నెందేనిఁ జనుట యొప్పు. 14
తే. ప్రౌఢిఁ బరికింప సంస్కృతభాష యండ్రు, పలుకు[20]నుడికారమున నాంధ్రభాష యందు
రెవ్వ రేమన్న నండ్రుగాకేలకొఱఁత, నాకవిత్వంబు నిజము కర్ణాటభాష. 15
వ. అని యిష్టదేవతాప్రార్థనంబును బురాతనకవీంద్రగుణకీర్తనంబును గుకవినిరాకరణంబునుం జేసి యాత్మగతంబున. 16
తే. నవమరుత్తుచరిత్రంబు నైషధంబు,
సప్తశతి పండితారాధ్యచరిత మనఁగఁ
గావ్యములు పెక్కు చెప్పియుఁ గాంక్ష చనక
వెండియును గావ్య మొకటిఁ గావింపఁదలఁచి. 17
వ. ఉన్నంత. 18
ఉపోద్ఘాతము
సీ. ఏమంత్రి కులదైవ మిందుశేఖరుఁడు ద, క్షారామ భీమేశుఁ డఖిలకర్త
యేమంత్రి యేలిక యిక్ష్వాకుమాంధాతృ, రామసన్నిభుఁడైన వేమనృపతి
యేమంత్రి సితకీర్తి యేసువారాసుల, కడకొండ యవులచీఁకటికి గొంగ
యేమం శ్రీ సౌభాగ్య మిగురుఁగైదునజోదు, లాలిత్యలీలకు మేలుబంతి
తే. యతఁడు కర్ణాట లాట బోటాంగ వంగ, కురు కుకురు కుంతలావంతి ఘూర్జరాది
నృపసభాస్థానబుధవర్ణనీయసుగుణ, మండనుఁడు బెండపూఁడన్న మంత్రివరుఁడు. 19
వ. ఒక్కనాఁడు. 20
సీ. భాట్టప్రభాకరప్రస్థానసంవేద్యు, లుద్దండపండితు లొక్కవంక
ఫణిపభాషితభాష్యఫక్కికాభావజ్ఞు, లుత్తమప్రాగల్భ్యు లొక్కవంకఁ
గణభుఙ్మతగ్రంథగాఢార్థవిదులు [21]బా, హుశ్రుత్యసంపన్ను లొక్కవంక
వేదాంతవాసనావిశ్రాంతహృదయజ్ఞు, లుపనిషత్తత్త్వజ్ఞు లొక్క నంక
తే. నుభయభాషాకవీశ్వరు లొక్కవంక, వేశ్య లకవంక నొకవంక వీరభటులు
బలసి కొలువంగఁ గొలువుండి పిలువఁబంపె, బండపూఁడన్నమంత్రీశ్వరుండు నన్ను. 21
గీ. ఇట్లు పిల్పించి సమ్మాన మెసక మెసఁగ, సముచితాసనమున నుంచి చతురలీల
నానతిచ్చెను రాయవేశ్యాభుజంగు, మంత్రి గంభీరధీరసంభాషణముల. 22
సీ. వినిపించినాఁడవు వేమభూపాలున, కఖలపురాణవిద్యాగమములు
కల్పించినాఁడవు గాఢపాకంబైన, హర్షనైషధకావ్య మాంధ్రభాష
భాషించినాఁడవు బహుదేశబుధులతో, విద్యాపరీక్షణవేళలందు
వెదచల్లినాఁడవు విశదకీర్తిస్ఫూర్తి, కర్పూరములు దిశాంగణములందుఁ
తే. బాకనాటింటివాఁడవు బాంధవుఁడవు, కమలనాభుని మనుమఁడ వమలమతివి
నాకుఁ గృప సేయు మొక ప్రబంధంబు నీవు, కలితగుణగణ్య శ్రీనాథకవివరేణ్య. 23
తే. సప్తసంతానములు నాకు సంభవించె, నొకప్రబంధంబు వెలితిగా సుకృతగరిమ
నావెలితి మాన నాపేర నంకితముగ, శివపురాణంబు తెనుఁగుగాఁ జేయు మొకటి. 24
వ. అదియును. 25
క. బంధుర సపాదలక్ష, గ్రంథంబై యైదుపదులు ఖండంబులతో
సంధిల్లును స్కాందం బన, సింధువునకుఁ గొల్వ లమరిచినచందమునన్. 26
మ. అరవిందాప్తకృతప్రతిష్ఠుఁడగు దక్షారామభీమేశ్వరే
శ్వరు మాహాత్మ్యముతోడఁ గూడి భువనశ్లాఘాస్పదంబై యభం
గురమై స్కాందపురాణసారమగు శ్రీగోదావరీఖండమున్
బరిపాటిన్ రచియింపు మంధ్రజగతీభాషాప్రబంధంబుగన్. 27
వ. అని పలికి సబహుమానంబుగాఁ గర్పూరతాంబూలజాంబూనదాంబరాభరణంబు లొసంగి వీడుకొలిపిన. 28
సీ. ధారాసురత్రాణధాటీసమారంభ, గర్వపాథోరాశికలశజులకు
సప్తమాడియరాజఝాడియక్ష్మాపాల, వందితశ్రీపాదశివనరుహులకు
సింహాద్రిపర్యంతసీమాంధ్రమేదినీ, మండలీపాలనాఖండలులకు
హరిదంతదంతిదంతావళీలిఖ్యమా, నానేకజయశాసనాక్షరులకు
తే. వీరభద్రేశ వేమ పృథ్వీధవులకు ననుఁగుమంత్రి మహాప్రధానాగ్రగణ్యు
బెండపూఁడన్న జగనొబ్బగండబిరుద, సచివదేవేంద్రుఁ గృతి కధీశ్వరునిఁ జేసి. 29
వ. సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితంబు లనుపంచలక్షణంబులతోడం గూడి సపాదలక్షగ్రంథసంఖ్యాసమన్వితంబై పంచాశత్ఖండమండితంబై బహుసంహితాసమాకీర్ణంబై యొప్పు శ్రీమహాస్కాందంబను నాదిపురాణంబునందు గోదావరీఖండంబు శ్రీమద్దక్షారామభీమేశ్వరమాహాత్మ్యసంయుతంబగుటం జేసి భీమేశ్వరపురాణం బనంబరఁగు; నది యాంధ్రభాషాప్రబంధంబుగఁ జెప్పందొడంగితి; నమ్మహాప్రారంభంబునకు మంగళాలంకారంబుగా నమ్మహామంత్రీశ్వరునేలిన వీరభద్రేశ్వర వేమభూపాలుర వంశావతారం బభివర్ణించెద. 30
వేమభూపాలుని వంశావతారవర్జనము
ఉ. కైటభదైత్యవైరి పదకంజమునం దుదయంబు నొందె మీ
న్నేటికి భూతధాత్రికిని నెంతయు నచ్చిన తోడఁబుట్టువై
హాటకగర్భముఖ్యనిఖిలామరమౌళి మహామణిప్రభా
పాటలవర్ణమైన యొకపావనపర్ణ ముదీర్ణసంపదన్. 31
వ. అప్పుణ్యవంశంబు కంసాసురధ్వంసిచరణపల్లవంబు దనకుఁ బుట్టినిల్లుగావునఁ గారణ గుణసంక్రమంబునంబోలెఁ జామరతోమరచ్ఛత్రధనుఃఖడ్గాది చిహ్నోపశోభితంబై, చదలేటినీటివలని సోదరీయస్నేహలబ్ధంబులుంబోని పావనత్వ శుచిత్వ గాంభీర్య మాధుర్యంబులు చరితమనస్స్వభావవచనంబుల ధరియించి సైదోడుం బొదివి విశ్వవిశ్వంభరాక్రీడనంబు దనకు విదిర్చిన పరమక్షాంతి యంతరంగంబున సంతరించి నిఖిలప్రపంచంబునకు నాధారంబై ప్రవర్తిల్లె అందుఁ బద్మనాయకులన వెలమలనఁగమ్మలనసరిసర్లననంటర్లన బహుప్రకారశాఖోపశాఖాభిన్నంబులైన మార్గంబులం ద్రిమార్గగంగాప్రవాహంబులుంబోలె గోత్రంబు లెన్నియేనియు జగత్పవిత్రంబులై ప్రవహించుచుండఁ గల్పంబు లతిక్రమించి మన్వంతరంబులు జరిగి యుగంబులు సరికడచి వత్సరంబులు చని కాలచక్రంబు లతిక్రమించుచుండఁ జతుర్థకులమౌళిమండనంబై కీర్తివిహారఘంటాపథంబైన పంటమహాన్వయంబు బాకనాటిదేశంబున భద్రపీఠంబు నధివసించి సింహవిక్రమనగరదువ్వూరు గండవరాది పట్టనంబులు నిజనివాసంబులుగా భ్రూలతాదష్టాష్టాదశద్వీపాంతరాళులగు భూపాల గ్రామణులన్ ద్రిలింగభూమండలాఖండలులను బోలయవే మాన్నపో తాన్నవేమకుమారగిరీశ్వరాదులం బూజ్యసామ్రాజ్యపీఠస్థులంగాంచె. తత్సంబంధబాంధవంబున వసుంధరాభారధౌరంధర్యంబునం గంధసింధురఘటాకూటకపటకిటికచ్ఛపావతారనారాయణ భుజంగ భూధరంబులకుఁ దోడుజోడై రాయగురుపరమేశ్వర సాధుజనవిధేయ ఖోడెరాయ సకలకళాధామాదిబిరుదభాస్వరుండై భీమయగురువరేణ్య పుణ్యకారుణ్యకటాక్షవీక్షాలబ్ధ సుస్థిరెశ్వర్యధుర్యుండై విజయధాటీసమాటీకనంబు దిశలల్లాడ నల్లాడభూవల్లభుండు రాజమహేంద్రంబు రాజధానిగా సింహాద్రిపర్యంతం బుత్కళకళింగయవనకర్ణాటలాటాంతర్దీపంబైన ప్రతాపంబున దిలీప నల నహుష నాభాగ భరత భగీరథ మాంధాతృ ధుంధుమార పూరు పురూరవఃప్రభావుండై విశ్వవిశ్వంభరాభువనమండలంబుఁ బరిపాలించెఁ దదనంతరంబ. 32
గీ. రాజరఘురాము లల్లాడ రమణసుతులు, ధాత్రిఁ బాలింతు రాచంద్రతారకముగ
వేమభూవల్లభుండును వీరవిభుఁడు, నన్నదమ్ములు హరియును హరుఁడుఁబోలె. 33
ఉ. తమ్ముని వీరభద్రవసుధాధిపు విక్రమవీరభద్రుని
న్సమ్మదలీల రాజ్యభరణస్థితిఁ బట్టముఁగట్టి బాహుద
ర్పమున వేమభూవరుఁడు వ్రాసె జగద్విజయప్రశస్తివ
ర్ణమ్ములు దిగ్ధురంధరసురద్విపకుంభవిషాణమండలిన్. 34
సీ. పాతాళభువనాధిపతికి శేషాహికిఁ, బ్రియలతో మసకానఁ బెనఁగఁగలిగె
దిక్సింధురములకు దివ్యవాహినిలోనఁ, దేఁటి రాయిడి మానఁ దేలనొదవె
నుర్వీధరములకు నుదధిలోఁ గాఁపున్న , కొలముసాములయిండ్లఁ గుడువనబ్బెఁ
గుహనాకిటికిలక్ష్మికుచకుంభములమీఁది, కుంకుమంబున నుసుల్ కొనఁగఁగూడె
తే. రాయవేశ్యాభుజంగవీరప్రతాప, భాసి యల్లాడవిభువీరభద్రనృపతి
సర్వసర్వంసహాచక్రసర్వభరము, పృధుభుజాపీఠమున సంభరించుటయును. 35
క. ఏరీ ధరణిపు లల్లయ, వీరక్ష్మాపతికి సాటి వితరణగరిమన్
ధారాధరధారాధర, ధారాధరవాహదానధారానిధికిన్. 36
మహాస్రగ్ధర. ఫణిరాజస్తబ్ధరోమప్రకటకమఠరాట్పర్వతశ్రేణిదిగ్వా
రణదౌరంధర్యధారారభటిసమధికప్రౌఢబాహాప్రతాప
ప్రణతప్రత్యర్థిపృథ్వీపతిమకుటమణీభాసమానాంఘ్రిపీఠున్
బ్రణుతింతున్ వీరభద్రుం బ్రతిభటధరణీపాలకాలాగ్నిరుద్రున్. 37
సీ. [22]పండువాసురతాణి పావడం బిచ్చిన, భద్రేభములు వీథిఁ బాలె ముండు
నొడ్డె ధాత్రీనాథుఁ [23]డుపద పుత్తెంచిన, బింబారుణోష్ఠి [24]సంబెళవహించుఁ
గర్ణాటభూపతి కానుక యనిచిన, ముక్తాతపత్రంబు మ్రోల మెటియు
యవనాధిపతి [25]యుపాయనముగా నొసఁగిన, పాగాహయంబులు వాగెవచ్చు
తే. దూరమంతంత బారుహ దొంతిమన్నె , సప్తమాడియరాజన్యసమితి మ్రొక్కు
రాయవేశ్యాభుజంగసంగ్రామపార్థ, గాయగోవాళవేమనక్ష్మాధవునకు. 38
శా. దేవబ్రాహణభక్తివర్ధిశధరిత్రాచక్రసామ్రాజ్యల
క్ష్మీవాస్తోష్పతి సంస్తుతింపఁగఁదగున్ శ్రీవేమపృథ్వీశ్వరున్
లావణ్యాపరమత్స్యలాంఛనుని నాలంకాపురీశంకర
గ్రావాభ్యంతరకూలముద్వహయశఃకల్లోలినీవల్లభున్. 39
క. కాంచీ శ్రీగిరి కాశీ, పంచారామాది దేవభవనంబుల వ్రా
యించెను వేమక్ష్మాపతి, యంచితభూదానశాసనాక్షరపంక్తుల్. 40
సీ. ధరియింపనేర్చిరి దర్భ వెట్టెడు వ్రేళ్ల, లీలమాణిక్యాంగుళీయకములు
కల్పింపనేర్చిరి గంగమట్టియమీఁదఁ, గస్తూరికాపుండ్రకములు నొసల
సవరింపనేర్చిరి జన్నిదంబులమ్రోలఁ, దారహారములు ముత్యాలసరులు
చేర్పంగనేర్చిరి శిఖల నెన్నడుములఁ, గమ్మనికొత్తచెంగల్వవిరులు
తే. ధామముల వెండియును బైఁడి దడఁబడంగ, బ్రాహణోత్తములగ్రహారములలోన
వేమభూపాలుఁ డనుజన్మువీరభద్రు, ధాత్రి యేలింప గౌతమీతటమునందు. 41
తే. ధర్మశాసనఘనశిలాస్తంభ మెత్త, శ్రీముకుందోద్భవస్వామి శివునిమ్రోల
వీరభద్రేశుఁ డాచంద్రతారకముగ, నగ్రహారాళి నఖిలమాన్యంబు లొసఁగి. 42
సీ. కమలాచలాగ్రమార్కండేయశివశిర, శ్శశిచంద్రికాధౌతసౌధవీథి
గోదావరీపుణ్యకూలంకషాజల, స్ఫారితశ్రీరుద్రపాదయుగళి
బలవదభ్యున్నతప్రాకాగపరివేశ, గండూషితాజాండమండలంబు
గంధదంతావళగ్రైవేయఘంటికా, ఠంకారముఖరఘంటాపథంబు
తే. రాజబింబాననానూత్నరత్నపేటి, వీరరాహుత్తసుభటకంఠీరవాద్రి
వేమభూపాలరాజ్యాభివృద్ధికరము, సాంద్రవిభవంబు రాజమహేంద్రవరము. 43
తే. వీరభద్రేశ వేమపృథ్వీధవులకు, మంత్రియగు బెండపూఁడన్న మంత్రివరుని
విమలవంశావతారంబు విస్తరింతు, నభ్యుద హేతువుగఁ బ్రబంధాదియందు. 44
కృతినాయక వంశావతారవర్ణనము
సీ. ఆకాశలక్ష్మికి నవతంసకంబైన, మునిమండలములోని మొదలి చుక్క
యఱకాల బ్రహాండ మప్పగించిన యట్టి, చిన్నివేల్పులరాజుఁ గన్నతండ్రి
యాదికల్పంబునాఁ డఖిలప్రపంచంబు, సృజియించు బ్రహ్మకుఁ జేయిదోడు
పరశురామునిచేతఁ బాథోధిమేఖలా, భరము దానముఁ గొన్న బ్రాహ్మణుండు
తే. పేరుదక్షప్రజాపతి పెండ్లికొడుకు
కశ్యపబ్రహ్మ నిజవంశకర్తగాఁగ
వెలసెను భయాన్వయంబులు వృద్ధిఁబొంద
వ్రాలుఁబ్రాలునుగలమంత్రి పోలమంత్రి. 45
క. సాటి చదతేటినీటికి, హాటకగర్భునివధూటి కమరద్రువనీ
వాటికి [26]మధుకైటభరిపు, వీటికి శ్రీపోలమంత్రి విశదయశంబుల్. 46
క. ఆమంత్రికి నుదయించిరి, శ్రీమంతులు కార్యఖడ్గజ్రీతవైరిమహా
సామంతులు శ్రీయల్లా, డామాత్యగ్రామణియును నన్నవిభుండున్. 47
క. అల్లాడవిభుఁడు రిపుహృ, గ్భల్లాడంబరుఁడు నాఁడు భామలమనసుల్
గొల్లాడఁగ మదనుఁడు దిశ, లల్లాడఁగఁ జేయుఁ దద్భుజాటోపంబుల్. 48
సీ. కాకతిక్ష్మాాపాలగంధదంతానళ, ధ్వజినీమహాధురంధరుఁ డనంగ
నవలక్షకోదండనాథరాజ్యాంభోధి, సంపూర్ణపూర్ణిమాచంద్రుఁ డనఁగ
నంధ్రభూమండలాధ్యక్షసింహాసన, సంప్రతిష్టాపనాచార్యుఁ డనఁగ
వీరరుద్రాశేషవిశ్వంభరాధీశ, పృథులదక్షిణభుజాపీఠ మనఁగ
తే. యవనసంహారవిలయకాలాగ్నియనఁగ, ధాటివిఘటితకుమ్మఠోద్యానుఁ డనఁగ
విశ్వలోకప్రశస్తుఁడై వినుతి కెక్కె, నతులబలసీరి పోలయ యన్నశౌరి. 49
చ. కొలనుఁ బ్రతాపరుద్రనృపకుంజరుచేత నరేంద్రసారణీ
సలిలవివర్ధమానబహుసస్యసమాకుల మగ్రహారమై
వెలయ విభాకరగ్రహణవేళఁ దగంగఁ బరిగ్రహించి బం
ధుల భరియించె నన్నవిభుతో సరియెట్లు ప్రధాను లెవ్వరున్. 50
శా. అయ్యన్నయ్యకు యావదర్థపదగర్హానర్హగంభీరవాక్
శయ్య [27]న్గైటభవైరిశయ్యకు ఘనుల్ షాడ్గుణ్యవిద్యానిధుల్
[28]త్రయ్యంతజ్ఞులు దేవధీమణియునున్ దల్లప్రభుండున్ సుతుల్
వియ్యం బందుఁ దదీయకీర్తులు దిశావేదండతుండాళితోన్. 51
శా. లక్ష్మీదేవిఁ బయోరుహేక్షణునిఁ బోల్పం బాత్రులై యొప్పు శ్రీ
లక్ష్మీదేవికి నన్నమంత్రికి సుతుల్ లావణ్యసంపన్నిధుల్
లక్ష్మీవంతులు దేవమంత్రియును దల్లప్పప్రధానుండు స
ర్వక్ష్మాధీశసభాంతరస్తుతనయప్రాగల్భ్యవాచస్పతుల్. 52
క. పన్నీట గంధజలమున, నన్నయతల్లప్రధానుఁ డభిషేకింపన్
గన్నప పుక్కిటినీటను, గన్న యరోచికము వాయుఁ గఱకంఠునకున్. 53
సీ. ముక్కంటిదరహాసమున కనుప్రాసంబు, మిన్నేటినీటికి మిక్కుటంబు
శారచజ్యోత్స్నాప్రసాదంబునకు [29]వీప్స, నలువశుద్ధాంతంబున కనుభాష
కల్పకారామరేఖకుఁ బ్రతిచ్ఛందంబు, [30]త్రిదశేంద్రుకరటి కామ్రేడితంబు
పుండరీకారణ్యమునకు నధ్యాహార, మమృతాంబునిధి కభిధాంతరంబు
తే. గంధసారతుషార[31]పాణింధమంబు, దానవిద్యావిలాస విద్యాధరుండు
మంత్రి యన్నయదేవయ్య మహితయశము, నిఖలదిక్తటమంతయు నిండియుండె. 54
మహాస్రగ్ధర. వియదాశాభూతధాత్రీవిహృతికలననిర్విఘ్నసంభారనిఘ్నా
వ్యయకీర్తిస్ఫూర్తిముద్రాహసితశశికిరీటాట్టహాసస్వయంభూ
దయితామందారచంద్రాతపసురతటినీతారనీహారుతో న
న్నయదేవామాత్యుతోడన్ హరిహర సరియే యన్యభూపాలమంత్రుల్. 55
ఉ. ధీరుఁడు దేవమంత్రి నయధీగుణనిర్జిత దేవమంత్రి శ్రీ
వీరయదేవవల్యధిపవిశ్వవిభుప్రియపుత్రి రామమాం
బారమణీమణిన్ భువనపావనవర్తనఁ బెండ్లియాడె నం
భోరుహనేత్రుఁ డంబునిధిపుత్రికఁ బెండిలి యాడుకైవడిన్. 56
సీ. జగదేకసంస్తుత్యసౌభాగ్యసంపద, రతిదేవిఁ బోలు నీరాజవదన
పరమపాతివ్రత్యభాగ్యగౌరవమున, భూపుత్రిఁ బోలు నీపువ్వుఁబోణి
యక్షీణమహిమఁగల్యాణవైభవమునఁ, బార్వతిఁ బోలు నీపద్మగంధి
మృదుగభీరప్రౌఢమితభాషణంబుల, భారతిఁ బోలు నీపరమసాధ్వి
తే. యనుచు బంధులు వినుతింప నవని మించె, నధికశుభగాత్రి విశ్వనాయకుని పుత్రి
యన్నవిభుదేవమంత్రి యర్ధాంగలక్ష్మి రమ్యసద్గుణనికురుబ రామమాంబ. 57
తే. సింధుకరికాళ భల్లాణసేనయాది, పరమమాహేశ్వరాచారపరులసరణి
నన్నవిభుదేవయామాత్యు నెన్నవచ్చుఁ, బార్వతీవల్లభునిమీఁది భక్తిగరిమ. 58
శా. ఆరామాంబకు దేవమంత్రికిని దక్షారామభీమేశ్వర
స్ఫారాపారకృపాగుణోదయమునం జన్మించి రాత్మోద్భవుల్
ధీరోదాత్తుఁడు లింగమంత్రివిభుఁడున్ ధీశాలి తల్లన్నయున్
బారావారగభీముఁ డన్నధరణీపాలుండు లక్ష్మీనిధుల్. 59
ఉ. సంగరసవ్యసాచికిఁ బ్రశస్తవితీర్ణిదధీచికి న్మహా
మంగళచారుమూర్తికి సమంచితనిర్మలధర్మమూర్తికిన్
లింగనమంత్రికిన్ విశదనీతిధురావిబుధేంద్రమంత్రి కు
త్తుంగతరప్రతాపగుణధూర్జటి కెవ్వరుసాటి ధారణిన్. 60
సీ. ఖండశర్కర జున్ను కండచక్కెరలు దో, సెలు వడ ల్సేవెపాసెములతోడఁ
గమ్మఁగాఁ గాఁచిన కఱియాలనేతితోఁ, గమనీయపంచభక్ష్యములతోడ
సంబారములతోడి శాకపాకముతోడఁ, బక్వమైన పెసరపప్పుతోడఁ
దేనియధారతోఁ బానకంబులతోడ, [32]శిఖరషాడబరసశ్రేణితోడ
తే. నచ్ఛలవణాాదికముతోడ నమృతఖండ, పాండరంబైన దధితోడ బ్రాహ్మణులకు
భోజనము వెట్టు ద్వాదశీపుణ్యవేళ , లింగమంత్రి నవీనరుక్మాంగదుండు. 61
క. ప్రతిఘటియింపఁగవచ్చునె, ప్రతిభటులకు నసమసమరఫల్గునుతోడన్
శతకోటిదృఢకఠార, క్షతశాత్రవుతోడ లింగసచివునితోడన్. 62
సీ. ఝాడేశవనసప్తమాడెబారుహదొంతి, వంతునాదిక్షితీశ్వరుల గెలిచి
యొడ్డాదిమత్స్యవంశోదయార్జునుచేతఁ, బల్లవాధిపుచేతఁ [33]బలచమంది
దండకారుణ్యమధ్యపుళిందరాజరం, భాహివంశజులకు నభయ మొసఁగి
భానుమత్కులవీరభద్రాన్నదేవేంద్ర, గర్వసంరంభంబుఁ గట్టిపెట్టి
తే. యవనకర్ణాటకటకభూధవులతోడ, బలిమి వాటించి యేలించెఁ దెలుఁగుభూమిఁ
దననిజస్వామి నల్లాడధరణినాధు, బళిరె యరియేటిలింగన ప్రభువరుండు. 63
క. దేవబ్రాహ్మణభూములు, భూవరునకుఁ జెప్పి ధారవోయించె భళీ
దేనయలింగన ప్రియసం, భావననిరుపాధి సర్వమాన్యంబులుగన్. 64
చ. అవుర! ప్రతాపవేమ వసుధాధిపుచే నృపపట్టభద్రుచే
భువనమనోహరంబయిన బోడసకుర్తి మహాస్థలంబునన్
దివిరి పరిగ్రహించె మన దేవయలింగయమంత్రియన్న చో
డవరమహాగ్రహారముఁ గడంకఁ గవిద్విజబంధురక్షకై. 65
సీ. [34]వాహ్యాళిభూమి వేవంతనైషధు లట్లు, హయరత్నముల నెక్కి యాడనేర్చుఁ
గవిబుధశ్రేణికిఁ జెవులు పండువులుగా, నాస్థానమున మాటలాడనేర్చు
శక్తిత్రయంబునఁ జతురుపాయంబుల, షాడ్గుణ్యముల బుద్ధి జరువనేర్చుఁ
గైసేసి ప్రత్యక్షకందర్పమూర్తియై, నిర్వికారంబున నిలువనేర్చు
తే. నిష్ఠురాటోపవిస్ఫూర్తినృహరి కరణి, నతికఠోరకుఠారధారాంచలమున
వైరివక్షస్థలము వ్రచ్చి వైవనేర్చు సంగరార్జునుఁ డరియేటి లింగవిభుఁడు. 66
ఆ. లింగమంత్రిభామ గంగాంబికాదేవి, గనియె సుతుల నర్థికల్పతరుల
భవ్యరూపపంచబాణావతారుల, మంత్రిమంత్రి దేవమంత్రివరుల. 67
తే. కశ్యపాన్వయపాథోధికల్పశాఖి, సర్వగుణరత్నరోహణక్ష్మాధరేంద్ర
మభ్యుదయమందుమంత్రిలింగయ్యసుతుఁడు, మదనగోపాలసన్నిభమంత్రిమూర్తి. 68
ఉ. చంచలలోచనాకుసుమచాపుఁడు దానకళాదధీచి యా
శాంచలవారణేంద్రదశనాంకురన్మిలకీర్తివైభవా
భ్యంచితసర్వలోకుఁ డనపాయరమానిభవప్రపంచరా
త్రించరశాత్రవుండు మనదేవయతల్లన మంత్రిమాత్రుఁడే. 69
క. వసుధామండలమున, నేవారును సరియె రూపహేలానుకృత
శ్రీవత్సలాంఛనునకును, దేవయతల్లనికి మంత్రి దేవేంద్రునకున్. 70
క. [35]నాళీకభవవధూస్తన, పాళీకహ్లారరమ్యపరిమళలహరీ
శాలీనతావిధాయివ, చోలీలలు తల్లనార్థిసురభికి నమరున్. 71
తే. తదనుసంభవుఁ డఖిలవిద్యావిరించి, యర్థిజనకామధుగ్ధేను వన్నమంత్రి
క్రీడ సల్పును వాని సత్కీర్తికాంత, సప్తలోకమహోత్సవసౌధవీధి. 72
మ. అరబీభాష తురుష్కభాష గజకర్ణాటాంధ్రగాంధారఘూ
ర్జరభాషల్ మళయాళభాష శకభాషా సింధుసౌవీరబ
ర్బగభాషల్ కరహాటభాష మఱియుం భాషానిశేషంబు ల
చ్చెరువై వచ్చు నరేటియన్ననికి గోష్ఠీసంప్రయోగంబులన్. 73
ఉ. అన్నయమంత్రి శేఖరుఁ డహమ్మదుసేనువదాన్యభూమిభృ
త్సన్నిధికి న్మది న్సముచితంబుగ వేమ మహీసురేంద్రరా
జ్యోన్నతి సంతతాభ్యుదయ, మొందఁగఁ బారసిభాష వ్రాసినం
గన్నులపండువై యమరుఁ గాకితమందలి వర్ణపద్ధతుల్. 74
సీ. రాజమహేంద్ర దుర్గమునఁ గావించె శ్రీ, వీరభద్రునకుఁ బ్రాకారరేఖ
నిలిపె మార్కండేయనీలకంఠునిమ్రోల, రామేశుఁ దమతల్లినామకముగ
సంగమేశ్వరదివ్యశంభులింగమునకుఁ, గల్పించెఁ గళ్యాణగర్భగృహము
దక్షవాటికయందుఁ దరుణేందుమౌళికి, మొగలివాకిటధామమును రచించెఁ
తే. బ్రాగ్దిశావప్రగోపురప్రాంగణమున, సప్తమునిసింధుసోపానసరణికెలనఁ
దీర్చె భవనంబు భీమయదేవునగర, మంత్రి దేవయ యన్నయామాత్యవరుఁడు. 75
ఉ. భావన సంతసిల్లంగ బ్రవిభావనజాఫుని విద్విషత్పరీ
భావనవీనశౌరిఁ బ్రవిభావనుని న్నిఖిలక్షమాజనుల్
దీనన లిచ్చి యెప్పుడు సుధీవనరాశి నుతింతు రుత్తముల్
దేవనమంత్రియన్న విభు[36]దేవనదీవనపావనాన్వయున్. 76
క. సిరియేలికయగువరకే, సరి యేమో కాని గర్వసంరంభము మై
సరి యేపొనరఁగ వితరులు, సరియే యరియేటియన్న సచివాగ్రణికిన్. 77
శా. కాంచీకంకణతారహారకటకగ్రైవేయభూషావళుల్
లంచంబిత్తురు దూతికాతతికి లీలన్ బెండపూడన్ననిన్
బంచాస్త్రోపముఁ దారతార కవయన్ బ్రార్థించి లోలోపలన్
బంచారామములందుఁ బల్లెలఁ బురిం బ్రౌఢేందుబింబాననల్. 78
తే. తారగిరిమందరముల బృందారకాది, తారకారాజవదనలు తారుతార
తారధారాశ్రుతిస్వరోదారలీలఁ, బాడుదురు బెండపూఁడన్న భవ్యకీర్తి. 79
సీ. కలకంఠములఛాయఁ గల కంఠకోణంబు, నాగకుండలముల నాగరికతఁ
[37]జూడఁజూడఁగ నొప్పు సురసరిత్పూరంబు, గాలఁగాలవిభాళ కటకముద్ర
మేన మేనాత్మజామానినీరత్నంబుఁ గేలికురంగంబుఁ గేలి వ్రేల
భస్మోపవాహంబుఁ బాండుదేహంబునఁ, గటిని బుట్టంబైన కరటితోలు
తే. వికటశృంగారమున నొప్పు వేల్పు ఱేని, నాగమోపనిషన్మనోహరుని హరుని
కర్చనము సేయు సంధ్యాత్రయంబులందు, బెండపూఁడన్న కన్నులపండువుగను. 80
సీ. అఖిలదిగ్దంతిదంతార్గళంబు వ్రాయు, నధిపుదిగ్జయశాసనాక్షరములఁ
గువలయాక్షుల మించుగుబ్బచన్నుల వ్రాయుఁ, గుంకుమపత్రభంగాంకురముల
గర్వితారాతివక్షస్స్థలంబుల వ్రాయు, [38]నయకార్యసరణికిణాంకములను
నర్థిసందోహఫాలాంచలంబుల వ్రాయు, లక్ష్మీప్రదములైన లక్షణములఁ
తే. బసిఁడిగంటాస భూపాలుపార్శ్వసీమ, వ్రాయు నయకావ్యసరణి కేవలమకాదు
వేమధాత్రీకళత్రు గారాము మంత్రి, యతులగుణహారి బెండపూఁడన్నశౌరి. 81
షష్ఠ్యంతములు
క. ఇట్టి మహిమంబు గలు జగ, జెట్టికి నర్థార్థిలోకచింతామణికా
రట్టహయధట్టసేనా, ఘట్టితరిప్పుపట్టనోప కంఠక్షితికిన్. 82
క. కంఠీరవవిక్రమునక, కుంఠప్రతిభునకు దానగుణసురభికి శ్రీ
కంఠాంఘ్రి కమలనయనో, త్కంఠావైకుంకునకు నఖండితధృతికిన్. 83
క. దుగ్ధపయోధిసుధారస, ముగ్ధేందుధరాట్టహాస మురహరశయ్యా
దిగ్ధూర్ధర [39]కరటిఘటా, స్నిగ్ధయశోదిగ్ధరోదసీకుహరునకున్. 84
క. చెంచుమలచూఱకారున, కంచితబాహాపరాక్రమాధారునకున్
పంచారామవధూటీ, పంచాస్త్రవిహారకేలిపాంచాలునన్. 85
క. శ్రీవీరభద్రవేమ, క్ష్మావరరాజ్యాభివృద్ధి కారణమునకున్
లావణ్యరూపసంపదఁ, బూవిలుకానికిని బెండపూఁడన్ననికిన్. 86
వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన యిమ్మహాప్రబంధంబునకుఁ గథానాయకుండైన భీమేశ్వరమహాదేవునకుఁ బ్రియధామంబైన దక్షారామపురవరం బెట్టిదనిన. 87
దక్షారామపురవర్ణనము
సీ. పర్యంతమందారపారిజాతకవనీ, రమమాణనిర్జరీసముదయంబు
సరిసరసాసిద్ధవరనారిసంపూర్ణ, గంభీతరపరిఖాపయోధి
ప్రబలచింతారత్న పాషాణసంఘాత, వప్రరేఖాచక్రనలయితంబుఁ
గామధేనుసహస్రకఠినరింఖాటంక, దళసదంతురితరథ్యాముఖంబు
తే. భద్రపాతాళభైరవపాలితంబు, గుహవినాయకరక్షణాకుంఠితంబు
సప్తమాతృకపరివారసంకులంబు, వసుమతీనూపురము దక్షవాటిపురము. 88
సీ. కాంతిసంపద నేల కైవార మొనరింప, విధుబింబమున నుద్భవించిరనిన
మాధుర్యగుణ మేల మాటిమాటికిఁ జెప్ప, నమృతాబ్ధి నవతారమందిరనినఁ
దేజోవిశేషంబు తెఱఁగు పల్కఁగ నేల, విద్యుల్లతలలోన వెడలిరనిన
మోహనాకృతి యేల మునుమాడి కొనియాడఁ, బుష్పచాపునివింటఁ బుట్టిరనిన
తే. సంభవించిరి గంధర్వజాతి ననినఁ, గలితనం బేల పెన్నాటకంబు సేయ
ననఁగ భీమేశ్వరునిఁ గొల్తు రప్పురమున, సానులనుపేరి యప్సరశ్చంద్రముఖులు. 89
మ. మొరయింపన్ మర్తుఁ డిక్షుచాప మనిశంబుం దక్షవాటీమహా
పురమధ్యంబున ముజ్జగంబు గెలువన్ బుత్తెంచులీలం బురం
దరవిశ్రాణితదేవతాభుననగంధర్వాస్సరోభామినీ
చరణాంభోరుహనూపురస్వనములన్ జంకించు ఝంకారముల్. 90
శా. గంధర్వోపనిషద్రహస్యములు వక్కాణింతు రాలాపనం
బంధప్రస్ఫుటఝంటుఝంటుపదగుంభస్థాపవర్గావళీ
సంధానక్రమదివ్యమంత్రకములన్ సాయాహ్నకాలంబులన్
గంధర్వాప్సరసల్ పురోపవనికాకల్పద్రుమచ్ఛాయలన్. 91
సీ. చరణద్వయీభూరిసౌభాగ్యసంపదఁ, బరిభవింతురు హేమపద్మవనము
ఘనవితంబస్థలీగౌరవాభ్యున్నతి, సంప్రతింతురు నదీసైకతములు
గంభీరతరనాభిగర్తవిభ్రమముల, వ్రక్కలింతురు జలానర్తశోభ
గురుపయోధరభారపరిణాహవిస్ఫూర్తి గుద్దలింతురు హేమకుంభగరిమ
తే. గారవింతురు కంఠోపకంఠకాంతిఁ
గంబుమణికాంతి బిబ్బోకడంబరంబు
మచ్చరింతురు ముఖచంద్రమండలములఁ
బూర్ణశశిమండలముతోడఁ బురముసతులు. 92
శా. దక్షారామవిలాసినీతతుల సౌందర్యంబు వర్ణింపఁగాఁ
జక్షుశ్శోత్రకులాధినాయకునకున్ శక్యంబె? తచ్చారుఫా
లక్షేత్రంబును బోలలేక మునిఁగెం లజ్జాభరక్రాంతుఁడై
నక్షత్రేశుఁడు శంభుశేఖరసుధాంధస్సింధుపూరంబులన్. 93
సీ. అంబుధరశ్రేణి హరిణలాంఛనరేఖ, కమ్రకార్ముకవల్లి కామతల్లి
జలచరద్వంద్వంబు చంపకప్రసనంబు, బింబంబు దాడిమబీజరాజి
శష్కులీయుగళంబు చారుదర్పణములు, శంఖంబు బిసములు జలరుహములు
పసిఁడికుంభంబులు బయలంబువీచులు, పుష్కరావర్తంబు పులినతలము
తే. కదళికాహేమకాహళకచ్ఛపములు, మణులబంతులు తారకామండలములు
సంఘటించి పురంబు వేశ్యల సృజించె, జాణదేవరశ్రీపంచశరవిరించి. 94
సీ. ముడువంగ నేర్తురు మూలఁగమ్మనితావి, గలుగు క్రొవ్విరులు లోఁ గందకుండ
మురియంగ నేర్తురు మోహనాస్పదమైన, మొగలివాకిటిచాయ నరగవీథి
వలపింప నేర్తురు నలరాజు గెలిచిన, పెద్దగాలమువేల్పు భీమనాథుఁ
బలుకంగ నేర్తురు పాటలాధరముల, మొల్కలేనగవులు ముద్దుగురియఁ
తే. జందురునితోడఁ గల్పవృక్షములతోడఁ, దారతో లక్ష్మితో నమృతంబుతోడఁ
గౌస్తుభముతోడ మున్నీఁటఁ గలిగినారు, విబుధగంధర్వజాతు లవ్వీటిసతులు. 95
క. పూఁబోణులకును విటులకు, [40]వేఁబోకలఁదలరుసొంపు వీడ్కొలుపుఁ బురిన్
[41]లేఁబోకఁబోఁకతోఁటల, [42]పూఁబాళలకమ్మతావిఁ బొదలినగాడ్పుల్. 96
ఉ. వీటికి నాల్గువంకలను వెన్నెలతేటలఁబోలు నీళ్ళతో
హాటకపద్మమండితములైన కొలంకులు చూడనొప్పగున్
జీటికిమాటికిన్ హరుఁడు జృంభితలీల నటింప మౌళిమి
న్నేటికృపీటనిర్ఝరము లింతట నంతటఁ జిందెనోయనన్. 97
సీ. తిలకంబు బలుతేని యలఁబోఁకమోకల, పువ్వుఁబాళలతావిఁ బుక్కిలించి
కలమగోపికల చక్కనిచన్నుఁగవలపై , వటపల్లవంబులు వాయఁదట్టి
సప్తగోదావరజలతరంగారోహా, కేలీసుఖంబు లంగీకరించి
దేవగంధర్వలీలావతీహాటక, ప్రాసాదవనలభిగర్భములు దూఱి
తే. ప్రతిదినము దక్షవాటీపురంబునందు, మలయవేలావనీమందమారుతంబు
గంధసారలతాకుడుంగముల మెలఁగు, చిలువలేమలు సేవింప వెలితిపడుచు. 98
తే. దక్షవాటికఁ బశ్చిమద్వారభూమిఁ, బ్రతివసించును సర్వాంగరమ్య యగుచు
సేవకులపాలి సురశాఖి పూవుఁగొమ్మ, కోమలార్ధేందుధరుకొమ్మ గోఁగులమ్మ. 99
తే. దక్షపురమున నుత్తరద్వారమందు, నూగ్జితంబుగ నుండు మహోజ్జ్వలాంగి
కామితార్ధైకసంకల్పకల్పవల్లి, సహితసుగుణమతల్లి శ్రీమండతల్లి. 100
క. సారమతి దక్షవాటిక, తూరుపుగవనిన్ బ్రసిద్ధితో వసియించున్
హేరాళక్రీడాసం, చారిణి నూకాంబ భక్తజనరక్షుకునై. 101
క. మట్టయినయట్టి దక్షుని, పట్టనమున దక్షిణంబు పార్శ్వపుగననిన్
నెట్టుకొని నెలసి నిలిచిన, ఘట్టాంబికఁ గొల్వఁ గలుగుఁ గామితఫలముల్. 102
తే. పృథివిఁ బదునెనిమిది యోగపీకశక్తి, గణములం దెంచ సర్వశృంగార యగుచు
భీమనాథుని సన్నిధిఁ బ్రేమ వెలయు, మాణికాదేవి సకలకల్యాణమూర్తి. 103
ఉ. ఏదెసఁ జూచినన్ విబుధు లేదెసఁ జూచిన మౌనిమండలం
బేదెసఁ జూచినన్ హరి దధీశ్వరవర్గము వాసవాది యం
దేదెసఁ జూచిన న్నవమహేశ్వరమూర్తులు శ్రీనికుంభకుం
భోదరతండు భృంగిరిటి హూహుకహాహులు దక్షవాటికన్. 104
సీ. విరులదండలతోడి వేణికాభారంబు, పొంకంబు పిఱుఁదులఁ బొరలియాడ
మణితులాకోటికోమలఝణత్కారంబు, రవలిమట్టెలమ్రోత యవఘళింపఁ
గుదురునిండినచిన్నిగుబ్బచన్నులమీఁద, ముత్యాలత్రిసరంబు మురువుఁ జూప
వలమానతాటంకవజ్రాంకురచ్ఛాయ, లేఁతవెన్నెలఁ బుక్కిలించి యుమియ
తే. సాని యీశానియై మహోత్సవమునందుఁ, గేల నవచంద్రకాంతపు • గిన్నె పూని
వీథిభిక్షాటన మొనర్చువేళఁ జేయు, మరులనృత్యంబు జగముల మరులుకొలుపు. 105
సీ. వేదండవదనశుండాదండచుళికిత, ప్రోజ్ఝితాంభశ్చటాప్లుతనభంబు
దేవగంధర్వాప్సరోవధూటీస్తన, స్థాపకశ్రీగంధధవళితంబుఁ
గనకసౌగంధికగంధోత్తమాగంధ, సారనిష్పంద పుష్పంధయంబుఁ
జటువీచీఘటాఝాటుడోలారూఢ, హంససంసన్నినాదాలసంబు
తే. భూరితీరావనీఘనీభూతచూత, జాతివకుళవనీసమాచ్ఛాద్యమాన
బహుళ సింధుధునీవనబకమరాళి, దక్షపురియొద్ద సప్తగోదావరంబు. 106
సీ. సరివచ్చు ననవచ్చు శతమన్యువీటికి, వివిధదేవాగారవిభ్రమమునఁ
బ్రతివచ్చు ననవచ్చు బాలమున్నటికి, నక్షయం బగు జీవనాభివృద్ధి
నెనవచ్చు ననవచ్చు నిందుబింబమునకు, సకలకళావిలాస ప్రవృద్ధి
దొరవచ్చు ననవచ్చుఁ దోయజాక్షునిమూర్తి, కభిరామలక్ష్మీసమగ్రమహిమఁ
తే. బెప్పనొప్పదె యప్సరస్స్త్రీసహస్ర, ధనళతరదీర్ఘదృక్పుటధాళధళ్య
సమ్మిళద్భీమునాథ భూషాశశాంక, తరళదీధితిపరిపాటి దక్షవాటి. 107
క. రోధించు నభముఁ బటికపు, సౌధంబులు నీట భీమశంకరహర్షో
త్సేధాట్టహాసరేఖా, దీధితిమైత్రీత్రిధావిధేయము లగుచున్. 108
చ. ప్రహరిచరింతు రెప్పుడును భైరవు లర్ధనిశాగమంబులన్
గహకహనిష్ఠురాట్టహసగర్వితకంఠకఠోరహుంకృతుల్
బహులభుజాడమడ్డమరుభాంకృతినాదము మేళగించి ది
క్కుహరము లోర్చు హాటకపుఁగోటలమీఁదట దక్షవాటికన్. 109
వ. మఱియు నప్పురంబు దళితసమదకరిసహస్రంబు లగు సుభటసహస్రంబులవలన సింహసంహతియు, సమధికవితరణశాఖానిరాఘాటకీర్తిస్ఫూర్తులగు వదాన్యులవలనఁ బారిజాతోద్యానంబును, ననేకశతసవనసమజ్యోతిరార్హియుగు సుమనోవర్గంబువలన సుధర్మాస్థానంబును, నభిరామరామణీయక సౌభాగ్యరేఖావిలాసపక్ష్మాంతలక్ష్మీవిరాజమానంబగు రాజకుమారలోకంబులవలన గంధర్వలోకంబును, మకరకచ్ఛపముకుందనిధిసనాథులగు వైశ్యులవలన వైశ్రవణస్థానంబు ననం దగి, సకలభువనప్రశస్తంబై; భారతవర్షంబునకు ఫలసంపదయునుంబోలె శాఖానగరసహస్రసంబాధపరిసరంబై ; సకలజగన్నిర్మాణమాతృకయగు కృతయుగంబునకుం గారణంబనఁ గనకగిరివప్రదీప్రప్రాకారబహుప్రకారప్రప్రకరపరివేషవలయవలయితంబై; సలీలసంక్రాంత కనకావరణమండల ప్రతిబింబంబగుటం జేసి కులిశపతనభయానగాహహాటకక్షితిధరంబగు నపరాంబురాశియుంబోని పరిఖాచక్రంబుచేతను, గ్రీడాగజమదజలపంకిలప్రాంగణంబులగు భృంగిరిటినికుంభకుంభోదరప్రధాన ప్రమథగణమణిభవనసౌధంబులచేతను, నాసన్న దీర్ఘకావీచీపవనవికీర్యమాణ వికస్వరజలజనిష్యందమధుబిందువర్షాంబు దూరీకృతశంభళీకపోలకస్తూరికాపత్రభంగంబులగు నప్పరోంగనావాటంబులచేతను, గుట్టిమఖచితమణికిరణవిసరణజనితాకాండప్రసారితకదళీపలాశసంగతిసంశోభితకక్ష్యావిభాగంబులగు యక్షగంధర్వకిన్నరకింపురుషసిద్ధవిద్యాధరస్థానంబులచేతను, గారుత్మతరత్నాంశుపటలఘటితపటయామినీతారకాయమానస్థల ఖచితస్థూలముక్తాఫలశలాకానికాయంబులగు భైరవాయతనంబులచేతను, బ్రస్నిగ్థశ్యామలశిలోత్కీర్లరమ్యోపనాహ్యశాక్కరంబులగు శంకరాగారద్వారంబులచేతను, దులసీదళశీతలామోదముషితకిల్బిషంబులగు విష్వక్సేనధామంబులచేతను, నిరంతరసంఫుల్లమల్లీవల్లికాతల్లజపుష్పనిష్యందమానమధుమత్తపుష్పంథయవిరుతీపునీతహరిదుపఘ్నంబులగు విఘ్నేశ్వరావాసలలితోద్యానంబులచేతను, బృథులవారిశీకరపటలపానదరవికటకరటిముఖవికలితవరాటకోశవ్యాకోచహాటకకుశేశయంబులగు సప్తగోదావరప్రవాహసలిలంబులచేతను, గోమలకింజల్కాగ్రగ్రసనజాగ్రచ్చక్రవాక చరణనఖశిఖరసముల్లిఖితకమలకువలయకుముదషండంబులగు తీర్ఘకుండంబులచేతను, గోదానరీతుల్యభాగాకౌంతేయాకణ్వాపగానదీమాతృకాయమానంబై యిరుగారును బంటపొసంగుపంటవలంతి కేదారక్షేత్రంబులచేతను, నఖండితాంభస్సమృద్ధి విజృంభించి విశ్వంభరాభ్రూలతాకారిసేతురేఖాంకారంబులై తటతరుకుసుమాంతరక్షరదమందమకరంద సందోహస్యందనకల్లోలంబులై సలిలకేలీలోలకలహంసకామినీకోలాహలానుకృత జలదేవతాచరణమణినూపుర ఝణఝణత్కారంబులై కారండవపక్షవిక్షేపపరిచరిత పంకజపరాగపాళీవిరచితాళీకసంధ్యానుబంధచరితచక్రవాకమిథునంబులై పయోధిగన్నబిడ్డలుంబోని యొడ్డుచెఱువులచేతను, సరససహకారశాఖాశిఖాధిరూఢకోకిలకుటుంబషేకంఠసాళ కోమలకుహూకారకోలాహలకలిత విరహిణీహృదయహాలాహలక్షేపంబులుసు మధుకరనికరగుంజాయమానమాధవీనికుంజకుంజన్నిహితకిరణపుంజంబును సముద్భిన్నపున్నాగకుసుమపరిమళోద్గారనీహారంబులును సముల్లసితచంపకకళికాకలాపకల్పితకందర్పపావకాస్త్రపరిత్రప్తపథికలోకంబులును, బాకపరిస్ఫుటితపుండ్రేక్షుపర్వముఖోద్గీర్ణముక్తామణిదర్శితాకారరాకానిశాకరప్రకాశంబులును గోరకప్రకరతారతారకితకురువకానోకహంబులును వనితావదనాసవసనాథవకుళవనంబులును మహోరుకుచకలశకాంతిచోరఫలకలితలికుచనిచయంబులును మాతులుంగామోదహృదయంగమంబులును నవనాగరంగసంగసుఖతసారంగమంగళగానసరససంగీతప్రసంగంబులును భుజంగలతాపరిష్వంగధన్యతరుణపూగద్రుమంబులును, లలితలవలీలతాలింగితలవంగంబులును నగు శృంగారారామంబులచేతను, నధిగామంబై; కలితచాతుర్వర్ణ్యస్థితియగుటం ద్రైలోక్యతిలకంబును, సముద్భాసితాసం ఖ్యదేవాలయంబగుట శతమఖనగరంబును, నక్షయజీవనధృతియగుట ధర్మపాలమండలంబును, ననధిగతకంటకరుచిరంబగుటం బ్రజాభాగ్యఘంటాపథంబును, బ్రచురసన్మణివాసంబగుట వసుంధరాధిపస్థానంబునునై; గుహ్యకనగరంబునుంబోలె వివిధమనుష్యధర్మచరితపవిత్రంబును లంకానగరంబునుంబోలెఁ బుణ్యజనాధ్యుషితసన్నివేశంబును గార్తవీర్యార్జునమూర్తియునుంబోలె నవిరళకరభూషితంబును నృసింహలీలాడంబరంబునుంబోలెఁ బ్రథితహిరణ్యకశిపుక్షయంబును శరత్కాలంబునుంబోలె విలసత్ప్రకాశంబును బ్రాహణజాతిధర్మంబునుంబోలె నిగమశాలియునునై; మహాభూషాన్వితంబయ్యను నిరాక్రోశంబును బ్రకటభుజంగప్రచారంబయ్యును సదాహితాభయంబును బలిరాజనిలయభూతంబయ్యును గంధర్వభూమియునై; వర్ణసాంకర్యంబు వాసవకోదండంబునంద, యహిభయంబు వల్మీకంబులయంద, జీవనసంశయంబు వారిదంబులయంద, వృషాతిక్రమంబు గృహంబులయంద, పరదర్శనంబు యతులయంద, దోషోల్లాసంబు కువలఁయంబులయంద, కౌరవపదానుసరణంబు కిరాతులయంద, తరళత్వంబు కరికరసంతానంబులయంద, విపక్షక్షోభంబు కొలంకులయంద, యాత్తగంధత్వంబు చందనంబులయంద, కానితనయందుఁ బొందనీక విభవంబునకుఁ బ్రభవంబును విలాసంబునకు నివాపంబును సపర్గంబునకు సర్గంబును ధర్మంబునకు మరంబును దానంబునకు నిధానంబును సానందంబునకు మూలకందంబును విద్యకు నిషద్యయు విశ్రామంబునకు ధామంబును నై యొప్పు నప్పట్టనంబున కధీశ్వరుండు. 110
సీ. హాలాహలంబను నల్లొనేరెడుపండు, మిసిమింతుఁడునుగాక మ్రింగినాఁడు
పెనువ్రేలికొనగోర బిసరుహాసనుమోముఁ, గెందమ్మివిరివోలె గిల్లినాఁడు
పంచవన్నియతోడఁ బ్రసవనారాచుని, నెఱ్ఱచిచ్చఱకంట జుఱ్ఱినాఁడు
మెఱఁగుఁగోఱలు డుల్ల మృత్యుదేవతనోరు, ధట్టించి యఱికాలఁ దన్నినాఁడు
తే. త్రిపురదైతావరోధనారీవిలాస, దంతతాటంకముల కెగ్గు దలఁచినాఁడు
దక్షపురిసానికూఁతుల దవిలినాఁడు, విశ్వలోకకుటుంబి భీమేశ్వరుండు. 111
మ. ఎనయంగల్గినకూర్మి భృంగిరిటిఁగానీ తండుఁగానీ నికుం
భునిఁగానీ కయిదండ పట్టుకొని సంభోగేచ్ఛ నంతఃపురాం
గనలం గన్నుమొఱంగి యప్పురమునం గన్నేఱు[43]కాఁదారి ప్రొ
ద్దున భీమేశుఁడు సానివాడ కరుగున్ ధూర్తప్రకారంబునన్. 112
క. పదునాల్గు మహాయుగముల, ముదుకగు భీమేశ్వరునకు మొగచాటైయుం
డదు సానిపెండ్లి యెప్పుడు, నది దక్షారామమహిమ మగునో కాదో? 113
సీ. [44]నేదిష్ఠమున సప్తగోదావరంబున, నఘముర్షణస్నాన మాచరించి
త్ర్యాయుతమంత్రాక్షతాభిమంత్రితమైన, విమలభూతి త్రిపుండ్రము ధరించి
మొగలివాకిలిఁ దూఱి దిగువ శాక్వరరాజు, నగరిపై వెన్నుని ననువుఁ జూచి
మణిశిలాసోపానమధ్యమార్గంబుగా, నభ్రంకషంబైన హర్మ్య మెక్కి
తే. సప్తపాతాళభువనవిష్కంభములను, దెఱచి వెడలినజ్యోతిఃప్రదీప్తమూర్తి
శంభుభీమేశ్వరేశ్వరస్వామిఁ గొలుచు, పరమమాహేశ్వరున కేమి బ్రాఁతిముక్తి. 114
క. పరమాశించును భీమే, శ్వరు ననుమతిఁ జేసి చోడవంశాభరణుం
డరికాలుఁడు కరికాలుఁడు, ధరణీధరపత్ని మనసు దైన్యము ముంచెన్. 115
సీ. గజచర్మ మెన్నఁడోకాని నిచ్చలుగట్టు, పసిఁడికమ్ములపట్టుపచ్చడంబుఁ
భసిత మెన్నఁడొకాని ప్రతిదినంబునలందు, మలయజంబు కురంగమదము గూర్చి
నిడుదపాములరాజుతొడవు లెన్నఁడొకాని, తారహారములు నిత్యము ధరించు
నృకరంకరుండమాలిక లెన్నఁడోకాని, ధరియించు కహ్లారదామ మెపుడు
తే. కాటనడుచక్కి నెన్నఁడో కానియుండు, దక్షవాటిసువర్ణసౌధములమీఁద
నెన్నఁడొ పిశాచులనుగాని యిందుముఖుల, నెల్లకాలంబుఁ దలఁచు భీమేశ్వరుండు. 116
సీ. ఒకవేళ ధరియించు యవనాశ్వుఁ డిచ్చిన, కట్టాణిముత్యాలకంఠమాల
మాంధాతృఁ డిచ్చిన మాణిక్యఖచితకే, యూరంబు ధరియించు నొక్కవేళ
నిక్ష్వాకుఁ డిచ్చిన హీరాంకురంబుల, యుంగరంబు ధరించు నొక్కవేళ
ఘనచక్రవర్తి యిచ్చిన ప్రవాళంబుల, యొడ్డాణము ధరించు నొక్కవేళ
తే. వేడ్క ధరియించు నొక్కొక్కవేళయందు, భరతదుష్యంతరంతినాభాగనహుష
నలభగీరథనృగమహీ, నాథదత్త హేమమణిభూషణములు భీమేశ్వరుండు. 117
వ. వెండియు భీమేశ్వరుండు పండువుపండువు నఖండవిభవంబున నాఖండలాదివిబుధమండలంబు పరివేష్టింప చలిగొండరాచూలియుం దానును మార్తాండచంద్రమండలంబువలనను బాలసముద్రంబువలనను మధుకైటభారియూరుకాండంబువలనను గృపీటభవజ్వాలాజాలంబువలనను గంధర్వసార్వభౌమువలనను బ్రభవించి కంతుకుంతంబులనఁ గాముతోమరంబులన మదనుముద్గరంబులన శంబరారికఠారంబులన నంగభవుకొంగవాలులన సిరిపట్టిసెలకట్టియలనవలరాజుభిండివాలంబులనఁ, దళతళంబొలయు తొలకరిమెఱుంగుమొలకలఁ గలకలనగు కలికి తెలిగన్నుఁగవయును, జక్కవకవలఁ దక్కువపఱచుచుఁ గ్రిక్కిఱిసిన మెఱుంగునిబ్బరంబుగుబ్బచన్నులును, మిలమిలని జిలుఁగువలిపెంపువలువల తెరలయెడల వెలువడి కేలిగడలుకొను పసిమిగలపసిండితగటునుం దెగడు నునుదొడలజిగియును, బగడంపుఁ జిగురుటధరములతుదల నిగురుచుఁ జిఱుతనగవులుబిగియనగినం దెగిపడి యెడుననువడువున నడుగడుగునకు వడవడవడంకుచుం బిడికిటనడంగు నడుముల బెడంగునుంగలిగి, భుగభుగం గురంగనాభిసౌరభసారంబులతోడంగూడి సంకుమదపంకపరిమళంబుల ఝంకించు కర్పూరవాసనాసముల్లాసంబును, గర్పూరవాసనాసముల్లాసంబు నుల్లసంబాడు కాలాగురుకర్దమామోదంబుననుంబునుం గుపసం బిసాళించు గొజ్జంగినీటినెత్తావియును, గొజ్జంగినీటినెత్తావి బిత్తరించు గంధపొడిపొలుపును, గంధపొడి పొలుపునుం గుమ్మరించు ధమ్మిల్లమల్లికాహలకవకుళవాసంతికాజాతికేతకీకుందకుసుమగంధంబులును నిఖలదిక్సంధిబంధంబుతో బాంధవం బనుసంధింప, నిలింపగంధర్వాప్సరోజాతులగు సానికూఁతులు గొలువ, జగనొబ్బగండ జగదగోపాల పల్లవాదిత్య పల్లవత్రినేత్ర కేళాదిరాయ రాయవేశ్యాభుజంగ బిరుదాభిరామాల్లయ వేమభూపాల రాజ్యభారధురంధరుండై, బెండపూఁ డన్నయమాత్యుఁడు గట్టించిన మొగసాలవాకిటి మహోత్సవమండపంబునందుఁ, బేరోలగంబుండి, కుండలీదండలాపకప్రేరణీప్రేంఖణసింధుకందుకధమాళిచేలమతల్లీహల్లీపకాదినృత్యంబు లవలోకించుచుఁ, బంతంబు లపధరించుచు, మేలంబు లాలకించుచుఁ, జంపూచాటునాటకోదాహారణజయఘోషచక్రవాళచతుర్భద్రచతురాతిప్రబంధంబు లాకర్ణించుచు, వేణువీణామృదంగకాంస్యకాహళపటహఢక్కాహుడుక్కానకఝల్లరీహృద్యవాద్యానుషంగంబు లాదరించుచు, సంగీతభంగీతరంగంబు లంగీకరించుచు, నిగమంబులు గ్రహించుచుఁ, బురాణంబులు వినుచు, నితిహాసంబు లిచ్చగించుచుఁ, దర్కంబులు వితర్కించుచు, నాగమంబులు పరీక్షించుచు, నిఖిలలోకరక్షణార్థంబుగా వివిధవిద్యాకలాపంబులు వినోదించుచుండు. 118
క. ఏతాదృశప్రభావో, పేతుండగు దక్షవాటి భీమేశ్వరువి
ఖ్యాతకథ చెప్పెదను శుక, తాతకృతపురాణసరణి తప్పక యుండన్. 119
కథాప్రారంభము
వ. ఇమ్మహాపురాణంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన:— నైమిశారణ్యపుణ్యక్షేత్రంబున ద్వాదశవార్షికంబైన దీర్ఘసత్రంబు ప్రవర్తిల్లుచుండఁ గులపతిశౌనకుండను పరమఋషి మొదలుగాఁగల సంయమీశ్వరులు యదృచ్ఛాసమాగతుఁడైన రోమహర్షణపుత్రుఁ బాదరాయణప్రియశిష్యుం బౌరాణికు సూత్యాహసంభవు సూతు నర్చించి యతనివలనను బంచాశత్ఖండమండితంబును, బహుసంహితాసమాకీర్ణం బును, సపాదలక్షగ్రంథసంఖ్యాసమన్వితంబును, నైనస్కాందపురాణంబు వినువారును నందుఁ బూర్వఖండంబునం బారాశర్యుండు నిజాపరాధంబు గారణంబుగా విశ్వనాధుచేత నధిక్షేపింపంబడి వారణాశి వెల్వడియె ననివిన్నవారగుటం జేసి యటమీఁదివృత్తాంతంబు వినువేడుక నమ్మునీంద్రు నభినందించి యిట్లనిరి. 120
తే. కాశి వెలువడివచ్చి పరాశరాత్మ, జుండు ఖేదంబు నొంది శిష్యులును దాను
నెచట వసియించె నెచ్చోట నేమి చేసె, ననఘ యేతీర్థమాడె మా కానతిమ్ము. 121
వ. అని యడిగిన. 122
మ. సరసీజాననవంశమౌక్తిక కళాసర్వజ్ఞ విజ్ఞానశం
కరినాథాంఘ్రిసరోజషట్పద సమిద్గాండీవకోదండ భూ
భరణప్రౌఢభుజాభుజంగ మహిళాపాంచాల వేమక్షమా
వరసామ్రాజ్యరమాధురంధర జగద్వ్యాప్తప్రతాపోదయా. 123
క. శ్రీవీరభద్రభూపతి, నేపాహేలాకటాక్షసిద్ధసమృద్ధ
శ్రీవిభవపాకశాసన, భావభవారాతిభక్తి పరతంత్రనిధీ. 124
మాలిని. అకుటిలనయమార్గాయాశ్రితార్థి ప్రవర్గా
సుకృతిసరణిపాంథా శుద్ధకీర్తిప్రబంధా
సకలజనవిధేయా శారదాభాగధేయా
ప్రకటసుగుణసంగా రాయవేశ్యాభుజంగా. 125
గద్య. ఇది శ్రీకమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీనాథ నామధేయప్రణీతంబైన శ్రీ భీమేశ్వరపురాణంబను మహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.
- ↑ శ్రీస్తన…త్రయుఁడు = విష్ణువునే బాణముగాఁ బ్రయోగించి త్రిపురంబుల నాశనము చేసినవాఁడు; ఆహార్యము=పర్వతము (ఇచట మేరువు)
- ↑ అంతరాయసంతానము=విఘ్నపరంపర; ఘనాఘనము=మేఘము
- ↑ బాలిక=కన్యక, ఇచట రాధ
- ↑ బాబా = గుఱ్ఱము
- ↑ ఈరేడు = పదునాలుగు
- ↑ లలితసాహిత్యసాహిత్యలక్ష్మి = మనోజ్ఞమైన సాహిత్యము యొక్క సంపూర్ణసంపద
- ↑ వినతగీర్వాణి = మొక్కుచున్న దేవతా స్త్రీలుగలది
- ↑ సుశ్లోకుండు = మంచికీర్తిగలవాఁడు
- ↑ అవతీర్ణ = దిగిన; కవితాలీలావతీ = కవితయనియెడు స్త్రీ
- ↑ కళిందతనయ = యమునానది
- ↑ పరితోషిత స్థాణు = శివుఁడు ఎవనిచే సంతోషింపఁజేయఁబడినవాఁడు
- ↑ వార్వీచి = నీటియలలు
- ↑ వివమజ్జ్యాంతరసౌర్వభౌము, అనిపాఠ. వినమత్ = నమ్రుఁడైన
- ↑ హర…వక్రత = శివుని జటాజూటమందుండు చంద్రునివలె వక్రముగలట్టియును, అనఁగాఁ గేవల ప్రౌఢకవీశ్వరాంగీకృతమయి సామాన్యకవిజనానవబోధమగు రహస్యములని యర్థము
- ↑ మషీ = మసి (సిరా)
- ↑ తాళపలాశ = తాటియాకు
- ↑ నిప్పచ్చరము = లేమిడి
- ↑ పండితంమన్యులు = పండితులుగా కుండినను దాము పండితులనుని గర్వపడువారు
- ↑ వైతండికులు = వితండావాదము చేయువారు
- ↑ నుడికారము = మాటల చమత్కారము
- ↑ బహుశ్రుతభావము బాహుశ్రుత్యము
- ↑ పండువాసురతాణి = పండువాదేశపురాజు; పావడము = కానుక
- ↑ ఉపద = కానుక
- ↑ సంబెళ = వక్కలాకులతిత్తి
- ↑ ఉపాయనము = కానుక
- ↑ మధుకైటభరిపువీడు = విష్ణుని వాసస్థానమగు శ్వేతద్వీపము
- ↑ కైటభవైరిశయ్య = శేషుఁడు
- ↑ త్రయ్యంతము = వేదాంతము
- ↑ వీప్స = పరంపరగా వ్యాపింప నిచ్ఛ
- ↑ త్రిదశకేంద్రుకరటి = ఐరావతము
- ↑ పాణింధమంబు = కొలిమితిత్తి
- ↑ శిఖర = పండిన దానిమ్మగింజల; షాడబ = మధురమైన; రస = సారము
- ↑ పలచము = కప్పము
- ↑ వాహ్యాళి = స్వారి
- ↑ నాళీకభవవధూ = సరస్వతి
- ↑ దేవనదీ = గంగ; వనము = జలము
- ↑ చూడన్ = శిరస్సునందు
- ↑ నయకార్యసరణికిణాంకములు = నీతికార్యమార్గరూపము లగు కాయల చిన్నెలు
- ↑ కరటిఘటా = దిగ్గజములన్నియుఁ దెలుపను ప్రయోగాంతరములు మృగ్యములు
- ↑ వేఁబోకల = ఉదయకాలములందు
- ↑ లేఁబోఁక = తిన్ననినడక
- ↑ పూఁబాళ = పుష్పగుచ్ఛము
- ↑ కాదారి = నడురేయి
- ↑ నేదిష్టము = మిక్కిలి సమీపము