భీమేశ్వరపురాణము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ రామాయనమః

శ్రీమహా గణాధిపతయేనమః

శ్రీ మాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః

శ్రీ భీమేశ్వరపురాణము

షష్ఠాశ్వాసము

శ్రీమహిత దక్షవాటీ
భీమేశ్వరపాదపద్మపీఠాతిరసా
సామర్థ్యసుప్రవృద్ధమ
హామహిమా! బెండపూండియన్నామాత్యా.

1


వ.

అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లని చెప్పందొడంగె.

2


సీ.

వినుఁడు సద్యోముక్తివిభవైకకారణం, బామ్నాయవిద్యారహస్యపథము
దక్షవాటిమహాస్థానమాహాత్మ్యంబు, వెండియుఁ బరిపాటి విస్తరింతు
నాదిలోకేశ్వరి యఖాలతత్త్వేశ్వరి, భోగమోక్షఫలానుభూతధాత్రి
సంపూర్ణవిజ్ఞానశాలిని కల్యాణి, శైలేంద్రతనయ హస్తములు మొగిచి


గీ.

పశుపతికి నిట్టులని విన్నపంబు చేసె, దేవదేవ! జగన్నాథ దివిజవంద్య!
దేవతిర్యఙ్మనుష్యాదిదీనసంస్థ, యభవ! కృప నాదు విన్నపం బవధరింపు.

3


వ.

సద్యోముక్తిదం బెయ్యది? పుణ్యస్థానం బెయ్యది? యానతిం డనుటయు జగద్ధితార్థంబుగా నా వృషభధ్వజుండు భవాని నభినందించి యిట్లని యానతిచ్చె.

4


క.

సద్యోముక్తికరంబును, సద్యస్సౌఖ్యప్రదంబు సద్యోదురిత
ప్రోద్యమభంగకరంబును, సద్యస్సకలార్థసిద్ధిసంపాదియునై.

5


సీ.

దర్శనమాత్ర నేదైవతగ్రామణి, జనులకు భోగమోక్షము లొసంగు
నమృతాబ్ధిమధ్యంబునందు నేవేల్పుఱేఁ, డుర్వి లింగాకృతి నుదయమొందె
మార్తాండుచే సప్తమౌనిముఖ్యులచేఁ బ్ర, తిష్ఠఁ గైకొనియె నేదివ్యమూర్తి
యప్సరస్స్త్రీకటాక్షావలోకనకళా, పాథేయ మెవనికిఁ బ్రాహుణికము


గీ.

విశ్వపతి భీమనాథనామేశ్వరుండు, శివుఁ డతండు వసించు నేక్షేత్రసీమ
నట్టి శ్రీదక్షవాటీమహాపురంబు, భుక్తిముక్తికి రెంటికిఁ బుట్టినిల్లు.


వ.

తొల్లి కృతయుగంబున నమ్మహాస్థానంబున సంశ్రితవ్రతులును ద్రికాలవిహితాచరితస్నానులును భస్మోద్ధూళితసర్వాంగులును రుద్రాక్షమాలికాభరణులును జటా

వల్కలధారులను శంభులింగార్చపరాయణులును నగుమహామునులు పెద్దకాలంబు ఘోరతపంబుఁ జేసిన నత్తపోధనుల యుత్తమతపంబునకుఁ జిత్తంబునఁ బ్రసాదంబు వహించి మంకణసంకల్పకల్పవృక్షం బగునయ్యహికంకణుండు ప్రత్యక్షంబైన నద్దక్షవాటికాధ్యక్షుని సాక్షాత్కారంబు వీక్షించి పరమర్షులు హర్షోత్కర్షంబునొంది యందంద దండప్రణామంబు లాచరించి హస్తారవిందంబులు మొగిడ్చి యిట్లనిరి.

7


గీ.

ఓసదాశివ! యోదేవ! యోమహాత్మ!
యోవిరూపాక్ష! యోమహాదేవ! యభవ!
వరముఁ గృపసేయు మీదక్షవాటమునకు
మ్రొక్కదము మేము మీపదాంభోజములకు.

8


క.

సద్యోభోగశ్రీయును, సద్యఃకైవల్యవిభవసౌలభ్యంబు
న్విద్యాసముద్యమంబు న, విద్యానాశంబు దక్షువీటికి వలయున్.

9


చ.

అనఁగఁ బ్రహృష్టచిత్తుఁడయి యర్ధశశాంకకిరీటుఁ డప్పు డి
ట్లను దగనూర్ధ్వరేతసుల కమ్మునిముఖ్యులకు న్విశుద్ధవ
ర్తనులకు నిచ్చితి న్వగము దక్షునివీటికి దక్షవాటికి
న్ననుపమరత్నపేటికి మనఃప్రమదావహవస్తుకోటికిన్.

10


గీ.

ఎల్లకాలంబు నుండెద నిచట నేను, మొదలి మామామయారామపదమునందు
వెండిగుబ్బలిపైవేడ్క వీడుకొల్పి, మేరునగరాజుపైఁ జాలమెచ్చు వదలి.

11


సీ.

అగ్రజుండైనను నంత్యజుండైనను, బూఁబోఁడియైనను బురుషుఁడైనఁ
బరమమూర్ఖుండైనఁ బండితుండైనను, దారిద్ర్యగుండైన ధనికుఁడైన
బలవంతుఁడైనను బలహీనుఁడైనను, బ్రాయంపువాఁడైన బంగువైన
నాస్తికుండైనను ననృతవాదియునైనఁ, బరఁగ గార్దభమైనఁ బందియైనఁ


తే.

గీటకంబైన బకమైనఁ గ్రిమియునైనఁ, బాదపంబైనఁ దృణమైనఁ బ్రాణరహిత
మె రహిని దక్షవనచతుర్ద్వారసీమఁ, బొందుఁ గైవల్యకళ్యాణభోగలక్ష్మి.

12


ఉ.

ప్రాణవియోగవేళ నరపక్షిమృగాళికి దక్షవాటికా
క్షోణినిఁ దారకంబుఁ బురసూదనుఁ డానతి యిచ్చుచుండఁగన్
బాణిబిసప్రసూనములఁ బయ్యద నొయ్యన వీచుచుండు శ
ర్వాణి త్రిలోకమాత బలవన్మరణశ్రమభారశాంతికిన్.

13


తే.

తూర్పుదిశకును లవణపాథోధి సీమ, దక్షిణమునకు వృధ్ధగౌతమియె సీమ
పడమటికి రాజమాహేంద్రపట్టనంబు, ద్యుమ్నపతిదిక్కునకు సీమ తుల్యభాగ.

14


వ.

ఈ క్రమంబున సీమావిభాగంబు లేర్పడిన భీమమండలంబు భుక్తిముక్తిప్రదంబు. వహ్నిసంయోగంబున శుష్కకాష్ఠంబులు హరణంబైనచందంబున దర్శనమా

త్రంబునం బాపౌఘంబును నదిభస్మీభావంబునుంబొందింపంజాలును. ప్రాణవియోగ కాలంబున జంతుకోటికిం గాలకంధరుండు తారకబ్రహ్మవిద్యారహస్యార్థం బుపదేశించును. కానిమాత్రంబైన ధనంబును బిడికెఁడు ధాన్యం బైన నిచ్చుదాతకు ననంతఫలంబు చెందు. శ్రద్ధాసమన్వితంబుగా శివయోగికిం బెట్టిన భోజనంబును నిచ్చిన వస్త్రంబును భవబంధవిధ్వంసనంబులు. జపహోమదానతపోధ్యానసమాధియోగంబులు గలుగు పుణ్యులకుం గొలఁది లేదు. హిమవత్పర్వతంబునఁ గోటివర్షంబులు తపంబుచేసినఫలంబు ఘటికార్ధోపవాసమాత్రంబునను, వారణాసియందుఁ గోటిబ్రాహ్మణులకు భోజనంబుపెట్టినఫలంబు భిక్షునకు నొక్కభిక్ష యిడినమాత్రంబునను, గురుక్షేత్రంబున సూర్యగ్రహణకాలంబునం దులాపురుషదానంబు చేసినఫలంబు నొక్కభూసురాతి కథితి కభ్యాగతికి శివయోగులకుఁ బెట్టినభోజనమాత్రంబునను, దక్షవాటికాపుణ్యక్షేత్రంబున సంభవించు.

15


తే.

భీమలింగంబు త్రిభువనస్వామి యెపుడు, సన్నిధానంబుఁ గైకొనియున్నకతనఁ
దీర్థములలోన నుత్తమతీర్థ మయ్యె, దక్షిణానందవనవాటి దక్షవాటి.

16


తే.

ఘనత శివగంగయును రుద్రగంగ యనఁగఁ, గూపములు రెండు దక్షవాటీపురమున
మొదలి మది పాపములనెల్ల నుదకఁజాలు,నొకటి పితృదేవతలఁ దృప్తి మనుపనోపు.

17


ఆ.

అని వరంబు లిచ్చి యంతర్హితుం డయ్యె, నిందుమౌళి ఋషుల కెట్టయెదుట
వార లోన్నమశ్శివాయ యంచుఁ బఠించి, రొక్కమొగిని దిశలు పిక్కటిల్ల.

18


సీ.

పంచాక్షరీమంత్రపారాయణంబులు, పఠియించుచును స్పష్టఫణితితోడ
నెచ్చటి కేగితో యెఱుఁగకయున్నార, మెచటికి విచ్చేయ కిచట నుండు
మనుచుఁ బ్రార్థింపంగ నౌఁగాక యనిపల్కి, ఋషులు చూడఁగఁ జూడ నిందుధరుఁడు
భీమనాథేశ్వరు కామితార్థప్రదు, కామితదివ్యలింగంబుఁ జొచ్చె


తే.

మెఱుఁగు మేఱచినపగిదిని మెఱయ దీప్తి, నద్భుతంబును బొందిరి యపుడు వారు
గౌరి! యిది భీమలింగంబు గౌరవంబు, దక్షవాటీపురీమహాస్థానమునను.

19


వ.

అనంతరం బమ్మునీశ్వరులు నియమశ్రద్ధాతాత్పర్యంబు లొప్ప సప్తర్షిసమానీతయగు గోదావరిఁ గనుంగొని పరమానందంబున.

20


శ్లో.

దేవి! శంభోర్జటాజూటనివాసిని! శివప్రియే!
లోకరక్షణ కార్యార్థ, ముద్భూతాయై నమోస్తు తే.

21


శ్లో.

ఏకేనైనస్వరూపేణ, భీమనాథస్యసన్నిధౌ
సదా సన్నిహితా స్యత్ర, గోదావరి! నమోస్తు తే.

22


క.

అని సంస్తుతించి యందఱు, మునిగణములు మంకణముని మునుకొని వికచ
త్కనకారవిందసౌరభ, ఖనన యగునయ్యేటినీటఁ గౌతుక మొప్పన్.

23

వ.

అఘమర్షణస్నానమాడిరి.

24


తే.

అఖిలకాలంబు నొకప్రవాహంబుతోడ, భీమలింగంబు సేవించి బెరసి ప్రేమ
యొరసి మదినుబ్బుపాతాళ మొరసిహారి, సప్తసింధువుమున్నీటి సంక్రమించె.

25


తే.

భీమలింగంబుమ్రోల గాంభీర్యసలిల, పూరమగుచుండు నేకాలమును సమృద్ధి
దనిసి తగఁ బాఱుచుండు నిత్యమ్ము ఘన ము,దారజలనిధి సప్తగోదావరంబు.

26


ఉ.

ఏట మునింగి లేచి పరమేశ్వరుమందిరసౌధవాటికా
హాటకకుంభమున్ గని షడక్షరమంత్రము జిహ్వఁ గూర్చి వా
చాటత సత్యతత్త్వుఁడగు శాంభవయోగివరేణ్యుఁ డేలజం
జాటపుసంసృతిం బొరలి చచ్చుచుఁ బుట్టుచు నుండు బార్వతీ.

27


చ.

కొడుకులు నీవు నేఁ బ్రమథకోటి విరించి సరోజలోచనుం
డుడుగణరాజఖేచరమహోరగకిన్నరసిద్ధసాధ్యు లె
ప్పుడు గొలువంగ వైభవము సొంపిరివోవఁగ దక్షవాటి నుం
డెడు శివు భీమనాయకుఁ దటిన్యవతంసు భజింప మేలగున్.

28


క.

సప్తాశ్వసంప్రతిష్ఠుని, సప్తమునీశ్వరప్రధానసంస్థితు నంత
ర్లుప్తస్వరూపుఁ ద్రిభువన, గోప్తను భీమేశ్వరేశుఁ గొలువుము తరుణీ.

29


వ.

భీమనాథమహాస్థానంబు సర్వకామార్థసాధకంబు; సంవత్సరంబును గొలువ ముక్తిప్రదాయకంబు. సూర్యుండు మేషరాశియందుఁ జిత్రానక్షత్రంబున వసియించి యుండు చైత్రమాసంబున సప్తగోదావరంబునఁ బ్రాతస్స్నానంబుఁ జేసి యథాశక్తి విఫ్రులకుఁ దగినదానంబు లొసఁగి, భీమనాథుండ నగునాకు నమస్కారాభిషేకపూజానైవేద్యంబు లాచరించి నరుండు సక్తభోజి యయ్యును నట్లె భానుఁడు వృషభరాశియందు విశాఖానక్షత్రంబు నాశ్రయించియుండు వైశాఖమాసంబునను, బ్రభాకరుండు మిథునంబునందు జ్యేష్ఠానక్షత్రంబునందు నిలిచియుండు జ్యేష్ఠమాసంబునను, రవి కర్కాటకంబున భగదైవతంబైన నక్షత్రంబున నాషాఢమాసంబునఁ గూడియుండఁగను, శ్రావణమాసంబున శ్రవణనక్షత్రంబున సింహరాశియందు మార్తాండుఁడు నిలిచియుండఁగను, భాద్రపదమాసంబునఁ బూర్వాభాద్రానక్షత్రమునఁ గన్యారాశియందు భానుం డుండఁగను, నాశ్వయుజమాసమున నశ్వినీనక్షత్రంబునందుఁ దులారాశియందుఁ జిత్రభానుండు నిలిచియుండఁగను, గార్తికమాసంబునఁ గృత్తికానక్షత్రంబున వృశ్చికరాశిని సూర్యుం డుండఁగను, మార్గశీర్షమాసంబున ధనూరాశియందు మృగశిరానక్షత్రంబున నభోమణియుండఁగను, బుష్యమాసంబునఁ బుష్యనక్షత్రంబున మకరరాశియందు లోకబాంధవుఁ డుండఁగను, మాఘమాసంబున మఘానక్షతంబునఁ గుంభరాశి

యందు మిహిరుం డుండఁగను, ఫాల్గునమాసంబున నుత్తరానక్షత్రంబున మీనరాశినిం దినకరుం డుండఁగను, బూర్వోక్తప్రకారంబున శైవవ్రతాచారంబులు నడపిన మనుజుండు, పాతకంబులవలన విముక్తుండగును; వెండియు యజ్ఞతీర్థం బను తటాకంబు సకలతీర్థరాజంబు.

30


సీ.

మేషరాశిస్థుఁడై మిహిరుఁ డుండగఁ బర్వ, తిథి స్నాతు డగుచుఁ దత్తీర్థమందుఁ
దనయథాశక్తిఁ గాంచనము విప్రుల కిచ్చి, పాతకంబులఁ బాయుఁ బంచజనుఁడు
వృషభంబునం దట్ల వెండి మార్తాండుండు, మిథునరాశిం దగమెచ్చు మీఱు
స్థితిఁ గర్కటకరాశిఁగృతసప్తగోదావ, రాభిషేకుఁడు దోష మపనయించుఁ


తే.

దప్ప కాషాఢసితచతుర్దశిని సింహ, కన్యలను సూర్యసంగమకాలమునను
జన్మతారయందున సంధులందు, యజ్ఞకుండవయస్స్నాన మఘరహంబు.

31


తే.

భానుమంతుండు తులమీఁదఁ బవ్వళింప, యజ్ఞకుండతటాకంబునందుఁ గ్రుంకి
బ్రహ్మహత్యాదులైన పాపనిచయములఁ, బంచబంగాళముగఁ దోలుఁ బంచజనుఁడు.

32


క.

ఆదిత్యుఁడు వృశ్చికమునఁ, బాదం బిడినట్టివేళఁ బావనతిథి సూ
ర్యోదయమున యజ్ఞతటా, కోదకమునఁ గ్రుంకి మనుజుఁ డొడుచు నఘంబుల్.

33


తే.

ఇనుఁడు కోదండరాశియం దెక్కియుండ, రుద్రనక్షత్రమునను మర్త్యుండు నియతి
యజ్ఞకుండపయస్స్నాన మాచరించి, సృష్టిలోఁ దోలుఁ బాతకశ్రేణి నెల్ల.

34


తే.

మకరరాశిస్థుఁడై భానుమంతుఁ డుండఁ
బుష్యనక్షత్రమునఁ బ్రొద్దుపొడుచునపుడు
భానువాసరమున యజ్ఞభద్రసరసిఁ
గ్రుంకి పాతకచయముల పొంక మణఁచు.

35


క.

మాఘమునఁ గుంభరాశి ని, దాఘద్యుతి యుండ సప్తతాపపవాహి
న్యోఘమున మునుఁగునరుఁ డఖి, లాఘవిఘటితుఁ డగుచుండు హావప్రౌఢిన్.

36


తే.

ఫాల్గునంబున నుత్తరాఫల్గునినిని, మీనరాశిని సూర్యుండు మెలఁగుచుండ
సప్తగోదావరాభిషేచనము సేయఁ, బాతకవ్రాతములనెల్ల భంగపరచు.

37


మ.

ప్రతివేళం దగ మర్త్యుఁ డీక్రియం జరింపంబాడి యంగీకృత
వ్రతుఁడై దక్షిణకాశియందు బహుళస్వర్గాపవర్గార్థమై
శితికంఠప్రియమందిరంబయిన యీక్షేత్రంబునం దెచ్చటన్
మృతుఁడైయున్న నరుండు పొందు గమికర్మీభూతకైవల్యమున్.

38


క.

కనకం బణుమాత్రంబై, నను దక్షారామనగర నైకటికమహా
మునిసింధువుదరి దానం, బొనరించుట మేరుదాన ముర్విం దలఁపన్.

39

తే.

వర్తనం బెల్ల శంభుసేవావ్రతంబు, మాలలెల్లఁ బంచాక్షరీమంత్రరాశి
భోగమోక్షనివాసైకభూమియైన, దక్షపురినున్న జనుల కోతలిరుఁబోణి.

40


వ.

దక్షారామమాహాత్మ్యం బవాఙ్మానసగోచరంబు. భీమనాథ మహాదేవ దివ్యశ్రీపాదపద్మసేవావ్రతంబువలన నెట్టి పాపకర్ముండును భోగమోక్షపదవీసామ్రాజ్యపట్టాభిషేకమహాదివ్యపదవి నొందు. సర్వశాస్త్రసిద్ధాంతమతాంతరంబులకు సమ్మతంబైన యిమ్మహాస్థానం బేకవటీభూతంబు సద్యోముక్తిప్రదంబు సద్యఃపరిజ్ఞానసదనంబు సద్యఃకళాసమృద్ధిప్రదంబై యుండునని దయార్ద్రమానసుండై వృషభధ్వజుం డాదేవి నుద్దేశించి పార్వతీ నీవడిగినయర్థంబు సర్వంబు సమర్థించితి. చిత్తంబున నవధాసంబు సేయుమనినం పతికిఁ గరంబులు మొగిడిచి మ్రొక్కి భవాని హర్షోత్కర్షంబు నొందె. నీరహస్యం బేనును గురుముఖంబున నెఱిఁగి ప్రసంగవశంబునం బ్రహ్మవేదులగు మీకు నుపదేశించితి.

41


శా.

సద్యోముక్తిప్రదంబు దక్షనగరీస్థానంబు విశ్వేశ్వరుం
డాద్యుం డవ్యయుఁ డానతిచ్చె నిది వేదార్థంబు; సద్యోవిము
క్త్యుద్యోగం బనుపేక్షయైన నది నుం డొండొక్కతీర్థంబు పు
ష్పోద్యానం బనఁ గాల మందుఁ గడుపన్ యోగంబు భావింపఁగన్.

42


వ.

మఱియు భీమలింగమాహాత్మ్యంబు భవకలుషనాశనంబు బ్రహ్మవిష్ణుపురందరాదులకుఁ గల్పకోటిశతంబులనైన వచియింపనలవిగాదు. అయినను నా నేర్చువిధంబున నింక వర్ణించెద.

43


తే.

భువనములమూఁటియందును బొబ్బవిడుచు, నంతదాఁకనె యితరతీర్థాదులెల్ల
నపుడు భేదంబు లేదని రవనిమీఁద, దక్షవాటీపురీభీమధామమహిమ.

44


సీ.

దక్షుండు పొట్టేలితల ధరించినయప్డు, భారతి ముక్కు గోల్పడినయపుడు
పూషార్కువదనంబు బోసివోయినయప్డు, విష్ణునిచక్రంబు విఱిగినపుడు
అగ్నినాలుక లేడు నౌడుమాసినయప్పు, డుడురాజు పొట్టిగు జ్జుఱికినపుడు
జన్నంపుటిఱ్ఱిమస్తకము ద్రెళ్ళినయప్డు, వడిదక్షుతల చిచ్చువడినఁయపుడు


తే.

ప్రాణభయమున ముక్తిసంభ్రమము మెఱయ
నమ్మహోత్పాతకాలంబునందు మునులు
దైవగంధర్వసిద్ధవిద్యాధరులును
నేమమున గొల్తు రెవ్వాని నెమ్మనమున.

45


సీ.

దుగ్ధాబ్ధిమంథనోద్భూతహాలాహల, జ్వలనమేచకకంఠ శరణు శరణు
గిరిచాపనిష్ఠ్యూతహరిశిలీముఖదగ్ధ, పురగోపురాట్టాల శరణు శరణు
సింధురాంధజలంధరాంధకవ్యాఘ్రాది, సురకంటకధ్వంస శరణు శరణు
విలయసంధ్యాకాలవికటతాండవకేళి, జర్జర బ్రహ్మాండ శరణు శరణు

తే.

శరణు ఖేచరదేవతాసార్వభౌమ, శరణు త్రైలోక్యసతతరక్షాధురీణ
శరణు దక్షిణకాశికాస్థాననిలయ, శరణు భీమేశశంకర శరణు శరణు.

46


క.

హర! సర్గస్థితినాశన, కర! సంసారాబ్ధితరణఘనతరచరణాం
బురుహప్లవ! రక్షింపుము, శరణాగతులైనమమ్ముఁ జంద్రాభరణా.

47


క.

అపరాధశతము లోఁగొను, మపరిమితకృపావిధేయ యార్తశరణ్యా
త్రపుసీకుసుమాభరణా, కపర్ది! జటాజూటకోటిఘటితశశాంకా.

48


తే.

సుప్రకాశుండవగు మునిశ్వప్రకాశ, శర్వ! సర్వేశ! త్రిపురభంజన! గిరీశ!
యనుచు నందంద నందఱు నభినుతింప, నచట భీమేశ్వరేశ్వరుం డభవుఁ డపుడు.

49


ఉ.

సన్నిధిచేసి వారలకు శాక్కరకేతుఁడు సుప్రసన్నుఁడై
యెన్నిక కెక్కఁగా వరము లిచ్చె ననేకము లింతనుండి నా
మన్నన దక్షవాటిక సమస్తమహీవలయంబులోన నా
పన్నుగఁదీర్థరాజపదభాజన మయ్యెడు నెల్లకాలమున్.

50


క.

ఈ దక్షారామమునకు, మేదినిఁగల తీర్థకోటి మిగులకయుండున్
మేదురకరుణాగరిమను, సాదరముగ ఖచరసిద్ధజనహితబుద్ధిన్.

51


తే.

దక్షుఁ గీర్తించి యాచంద్రతారకంబు, దక్షవాటిక సకలతీర్థంబులందు
నుత్తమంబుగ వరి మిచ్చి యుందు మిచట, నేర్పుగను నేరికినిముందు నేను నుమయు.

52


సీ.

యజ్ఞకుండంబునయందుఁ దీర్థంబాడుఁ, బాయ కెవ్వండు నా భక్తుఁ డతఁడు
గ్రుంకు ఱేపులు సప్తగోదావరంబునఁ, బాయ కెవ్వండు నా భక్తుఁ డతఁడు
ద్వాదశక్షేత్రయాత్రావిధాన మొనర్చుఁ, బాయ కెవ్వండు నా భక్తుఁ డతఁడు
దక్షవాటీమహాస్థానంబునం దుండు, బాయ కెవ్వండు నా భక్తుఁ డతఁడు


తే.

తెరువునడిచెడువారికి నిరవు చేసి, ధాన్యములు నెయ్యి నూనె వస్త్రములు లవణ
మాదిగాఁగల యాత్రాపదార్థసమితిఁ, బాయ కెవ్వండు పెట్టు నా భక్తుఁ డతఁడు.

53


క.

మాటలు వేయియు నేటికిఁ, జాటించెన్ శివుఁడు వేడ్క జగములలో ము
న్నీటి దరి దక్షవాటికి, సాటిగఁ దీర్థములు లేవు సత్యము సుండీ.

54


తే.

బ్రహ్మవిద్వాంసులకుఁ బాశుపతియతులకుఁ, బెట్టు ధనధాన్యవస్త్రాన్నభిక్ష మెవ్వఁ
డక్షయగుణంబుగాఁగ నీదక్షవాటి, వాని కలవడు నిజము కైవల్యపదవి.

55


తే.

చప్పరంబొండె గుడియొండె జవికయొండెఁ
గలుమఠం బొండె నిల్లొండెఁ గట్టి పెట్టి
బ్రహ్మయోగీశ్వరుని నుంచు భక్తి నెవ్వఁ
డతఁడు మాన్యుండు పూజ్యుండు నతులితముగ.

56

వ.

తొల్లి జలంధరగంధగజపుండరీకాంధకాసురాదు లగుమహాదెత్యులు భువనత్రయం బాక్రమించిన శక్రుండు భయభ్రాంతుండై దేవగణదేవమునిసిద్ధసాధ్యవిద్యాధరోరగగరుడగంధర్వకిన్నరకింపురుషాదులం గూర్చుకొని బ్రహ్మకు విన్నవించిన విరించియు వారిం దోడ్కొని పాలమున్నీటిలో ఫణిరాజతల్పంబుపైఁ బవ్వళించిన పాంచజన్యధరునకు విన్నపంబు చేసి సంస్తుతించినఁ గైటభారి హాటకగర్భుని విన్నపం బవధరించి చింతాభరంబున నొక్కింతదడ వూరకుండి పుండరీకాసనుం జూచి యిట్లనియె.

57


తే.

వీరభద్రుండు చక్రంబు విఱిచి దక్ష
యాగమున నాఁడు భక్షించె నాగ్రహమునఁ
జెఱకు శర్కరపాకంబు చేసినట్టి
చక్కిలముఁబోలె ఛటఛటా శబ్ద మొప్ప.

58


ఉ.

కోపము చిచ్చునం బడిన కూరిమితల్లి ఋణంబు దీఱ ను
ద్దీపతరాగ్రహంబునను దేవతలం గడుభంగ పెట్టఁగా
నేపున నేను మార్కొని పయిం బఱతెంచిన మంతమాత్రలో
జాపరమేశ్వరా యనుచుఁ జక్రము మ్రింగిన నోహటించితిన్.

59


తే.

తెగువ దక్షునికంఠంబు ద్రెవ్వనేసి, వ్రేల్చెఁ దల వధ్వరాగ్నిని వీరభద్రుఁ
డాప్రజాపతి మెడమీఁద నక్షణంబ, నగుచుఁ బొట్టేలితలఁ దెచ్చి నాటుకొలిపె.

60


వ.

అప్పు డవ్వీరభద్రుని తేజోవిశేషంబును గనుఁగొనఁ గన్నులు మిఱుమిట్లు గొన వెఱచఱచి యెలుంగు డించి తొలంగితి నాఁటనుండియు.

61


శా.

పట్టంగైదువులేక విన్న నయి నా బాహార్గళుల్ చూడుఁడా
యిట్టుంగాక సురేంద్ర! బాధపడి మీ రిబ్భంగి దుఃఖింపఁగాఁ
గట్టాపో యిటు మిన్నకుండుదునె శీఘ్రంబిప్డు భీమేశ్వరున్
ముట్టంగొల్చెదఁ జక్రలాభమునకై ముగ్ధేందుచూడామణిన్.

62


వ.

అని పలికి నలినసంభవేంద్రాదు లగునిర్జరులం గూడి సరోరుహాక్షుండు దక్షారామంబునకు వచ్చి శివగంగాకూపంబునఁ ద్రిషవణస్నానంబు చేసి భస్మోద్ధూతగాత్రుండును, ద్రిపుండ్రాంకితమస్తకుండును, రుద్రాక్షమాలికాధరుండును, జటావల్కలసంయుతుండునునై నిత్యంబును సహస్రపద్మంబులఁ బూజఁ గావించుచు భీమనాథేశ్వరేశ్వరు సేవించుచుండె నంతఁ గొంతకాలంబునకు.

63


క.

ఈభంగి వేయుదమ్ముల, నాభుజగాభరణు నెప్పు డర్చన సేయన్
శ్రీభీమేశుండు కమల, నాభుని మనమరయ నొక్కనలినము దాఁచెన్.

64

తే.

తొంబనూరును దొంబదితొమ్మిదియును
జలజములు పూజ చేసెను శార్ఙ్గపాణి
వేయిఁటికి నొక్కపద్మంబు వెలితియైన
నహహ నియమంబునకు భంగమయ్యె ననుచు.

65


చ.

కటకకలాపసంఘటితకమ్రమణిద్యుతిపాటవంబునం
జిటికినవ్రేలిగోరఁగొని చిఱ్ఱునఁ దీసెను లోచనంబుఁ బ్ర
స్ఫుటకమలంబు వేగహరి పూన్చెఁ దటుక్కున దక్షవాటికా
కటకవిలాసినీవిటశిఖామణికిన్ హరిణాంకమౌళికిన్.

66


క.

కైటభవిరోధిభక్తిర, సాటోపం బెసఁగ వనరుహాలోకన ము
ద్ఘాటించి భీమనాథుని, హాటకపదపీఠి లోచనాబ్జముఁ బెట్టన్.

67


మ.

నిడువాలుం గుడికన్ను పాదములపై నేమంబుతోఁ బెట్ట న
ప్పుడు ప్రత్యక్షము బొంది నీలగళుఁ డంభోజాక్షునిం జూచి నేఁ
గడుహర్షించితి నిచ్చెద న్వరము వేకైకొమ్ము నా నమ్రుఁడై
యడిగెన్ శౌరి జగత్రయోద్ధరణలీలావక్రమునన్ జక్రమున్.

68


తే.

భీమనాథుఁడు త్రిభువనస్వామి యిచ్చె, నస్త్రకులదైవమననొప్పు నాయుధంబు
హరికి నటమున్న యిచ్చెఁ జంద్రార్ధమౌళి, వికచపద్మోపమం బైనవెడఁదకన్ను.

69


వ.

ఇవ్విధంబుస శ్రీభీమనాధ మహాదేవునివలనం జగద్విజయం బగుచక్రాయుధంబు వడసి కోటిసహస్రమార్తాండమండలతేజఃప్రభాప్రభావభాసమానం బైన యారథాంగంబున మున్ను చెప్పంబడ్డ విబుధవిరోధుల ఖండించి యింద్రాదిప్రముఖనిఖలబర్హిర్ముఖవ్రాతంబునకుఁ జేతఃప్రమోదం బాపాదించె నిది యమ్మహాదేవుని మహిమంబు.

70


క.

శివగంగాజలముల నా, ప్లవనం బొనరించినట్టి పరమాత్ములు త
ద్దివసమున భీమనాథుని, నవలోకింపంగఁ గలుగు నభిమతసిద్ధుల్.

71


తే.

మదనవిధ్వంసితిరిచుట్టుమాలెయందు, దక్షిణపుదిక్కునందు మాధవునిఁ గాంచి
రహిని వేడుక విఘ్నాదిరాజుఁ జూచి, మనుజుఁ డిష్టార్థసిద్ధిసంపదల నొందు.

72


తే.

అష్టమీభానువాసరంబందు నొండె, నొండెనేని చతుర్దశి నిండుభక్తి
బూజఁ గావించి యెవ్వఁ డేభూమి నున్న, దుర్గ సేవింప దురితంబు దొలఁగునండ్రు.

73


క.

తాండవభవువీక్షణమున, ఖండేందుశిఖావతంసు కట్టెదురుగఁ దా
నుండెడు గౌరిని మంచుం, గొండసుతం బూజసేయఁ గోర్కులు నిండున్.

74


సీ.

భూర్భువస్వర్లోకములు మూఁడు భేదించి, బ్రహ్మాండభాండకర్పరము దాఁకఁ
బెరిగి దిక్చక్రంబు పిక్కటిల్లఁగఁ బట్టి, బలిసి కుప్పుసముతోఁ బామువోలె

నిరవకాశంబుగా నిత్యసన్నిహితంబు, నుడులింగమూర్తితో నుబ్బియుబ్బి
భీమనాథుఁడు మహాభీమాద్భుతప్రౌఢి, బహువిరాడ్రూపవిభ్రాజి యయిన


తే.

భయమునుం బొంది దేవతల్ ప్రస్తుతించి, యయ్య నీరూప మింతింత యనఁగ రాదు
యేది మొద లేది కడపట యేది మధ్య, మెట్టు నినుఁ బూజ సేయుదు మిందఱమును.

75


వ.

అనినం గరుణాసామ్రాజ్యపట్టాభిషిక్తుం డగు నాజగజట్టివేల్పు బ్రహ్మాండగోళంబునకు మిక్కుటంబుగాఁ బెరిఁగిన దేహంబు బొట్టి చేసి తీరుచుట్టుమాలికలోన గౌరీ, జనార్దన, రుద్ర, కేశవ, వినాయక, దుర్గాతాండవేశ్వర, నృత్యభైరవులను దేవతాసప్తకంబు పరివేష్టింప, సకలలోకానందకరపరదారగమనపాపహరేశ్వరులు నైఋతిభాగంబున నధివసింప, నంతర్గర్భగృహంబులోపల మాణిక్యాదేవిసహితుండై సలిలనిధివృద్ధగంగాకౌంతేయసరిత్తుల్యభాగాహేలానదీసప్తగోదావరమాతృకాపరివృతమండలంబున మధ్యమలోకభాగధేయంబును, విబుధగంధర్వపతాకావేదియుఁ, బరిసరోద్యానవాటికాసరసకాసారకఠోరకుహళీపాళికాకుసుమధూళీమధూళికాసౌరభాసారసంవాసిత దశదిశాముఖంబును, మఖకుండితటాకసముద్ధండపుండరీకషండమకరందబిందుగండూషావ్యగ్రసముసముదగ్రమధుపమండవాహంకారఝంకారకోలాహల కరంబితమకరధ్వజభుజాదండమండలీకృత కుసుమకోదండశింజనీఠంకారంబును, నాఖండలాదిదిక్పాలకభరితకలితగోపురప్రాంగణంబును, బాదుకాఖడ్గఘుటికారసరసాయనిమూలికాంజనాకర్షణాదృశ్యాది విద్యాసిద్ధిక్షేత్రంబును, నత్ర్యాత్రేయాగస్త్యహరితాంబరీషాసితభార్గవ పరాశర పారాశర్య మాండవ్య మార్కండేయ మౌద్గల్య మంకణ శౌనక శాండిల్య మందపాల వత్స వసిష్ఠ వాధూలసవాలఖిల్య కౌండిన్య కాశ్యపకణ్య గాలవ గాధి గార్గ్య ప్రముఖ వాలఖిల్యాద్యష్టాశీతిసహస్రసంయమసమాకీర్ణంబును, గర్ణికారాంబికాకరకమలపుటఘటితకనత్కనకమణిమయడమరుఢమఢమధ్వానపర్జన్యసముజ్జృంభిత గుహశిఖండితాండవంబును మార్కండేశ్వరకుండలాముఖసంవేద్యాంతర్వేదిచాళుక్య భీమేశ్వరప్రధాననానావిధశాఖోపశాఖాతీర్థసంబాధసంభరితంబును నై యఖిలభువనభవనాభిరామంబైన దక్షారామంబును గైలాసమేరుమందరంబులకంటెను, గాంచీ చిదంబర కాళహస్తి కాశి శ్రీశైలాది మహాస్థానంబులకంటెను, సేతు కేదారంబులకంటెను, నతిశయంబుగాఁ జేసి నాక్షేత్రంబునుమరగి గరళకూటకృపీటభవజ్వాలానష్టంభంబు సంస్తంభించి, త్రిపురదైతేయమదవతిగండభాగమకరికాపత్రభంగంబులు దొలంగించి భీమలింగంబు సర్వమంగళాదేవియుం దానును లోకరక్షణార్థంబుగా నధిష్ఠించియుండును.

76

తే.

దేవదర్శనమాత్ర సంధిల్లు భుక్తి, కొందఱకు దక్షవాటికాక్షోణియందు
దేవదర్శనమాత్ర సంధిల్లు ముక్తి, కొందఱకు దక్షవాటికాక్షోణియందు.

77


తే.

గీతవాదిత్రనృత్యంబు కేవలంబు, శంభునకు సార్వకాలంబు సంభ్రమింప
నప్సరస్స్త్రీల నర్పించె నాఱుమాఱు, బాలలను యువతులను జంభభంజనుండు.

78


శా.

ఆవంశంబున సానికూఁతులయి దివ్యస్త్రీలు దుగ్ధాబ్ధిమ
ధ్యావిర్భూతలు మీనకేతనుని పుష్పాస్త్రంబు లెక్కాలమున్
సేవాదక్షతఁ గొల్తు రిందుధరునిన్ శ్రీదక్షవాటీశ్వరుం
గైవల్యాధిపు భీమనాథుని లసత్కారుణ్యపాథోనిధిన్.

79


వ.

మఱియు మహనీయ దేవగంధర్వాస్సరవేశ్యాజాతిసంజాతకాంతాచికురతిమిరాంగసుమంగళ విభావరీలలాటశశికళావిలాసద్వితీయభ్రూలతాలాసికాలాస్యలలితరంగభూమియు, నయనశంబరానుబంధనవకందర్పపతాకయు, నధరబంధూకకుసుమయు, వికాసవిభ్రమశరద్వేళాకంబుకమనీయకంఠయు, బిబ్బోకసరిదంబుధరవేణియుఁ, బృథులతాచక్రవాకయుఁ, గరపల్లవస్ఫురణపర్యాయవల్లీమతల్లీపన్నగపరిషత్తునుం బోలెఁ బ్రకటితవిలాసమన్మథలీలయుంబోలె, రతిసుఖసంపత్సంపాదనలంపటకుముదినియుంబోలె, రాజానుకూలదర్శన కేశభరంబునఁ గృష్ణవదన, వచోమనోహరవశంబున మంజుఘోష, మధ్యంబున మండోదరి, యూరుయుగళంబున రంభ, కనకభూషణధారణంబున రుక్మిణి, సురతకళాకౌశలంబున దక్షిణ, తనువున భద్ర, పుష్పాస్త్రద్వితీయజన్మభూమి కారుణ్యవతి, తారుణ్యవతి, కాంతిమతి, కమనీయవతి, వినయవతి, విభ్రమవతి, విజ్ఞానవతి, వితీర్ణవతి, త్రపావతి, భూషణవతి, భూషణమరీచిజాలాకారవిగ్రహ యగుట విద్యుద్దండంబువలనను బ్రసవపరిమళహారిణి యగుటం బారిజాతకోరకంబులవలనను, నిశ్వాసామోదకారిణి యగుట
మలయమారుతంబువలనను, నిఖిలేంద్రియామోదకారిణి యగుట నటనామృతంబువలనను, మాధుర్యజన్మభూమి యగుట నిక్షుకాండంబువలనను, బ్రభవించెనో యనఁ బ్రశంసాస్పదంబైయుండు నవ్వంశంబునం దిందుముఖుల యాననచంద్రమండలంబులయం దభ్యర్ణరోహిణీపాశశృంఖళోద్వృత్తినింబోలె లాంఛనహరిణంబు ప్రవేశింపవెఱచు; నాచంచలాక్షుల దృగంచలస్ఫురణంబు లించువిలుకానికిం బంచబాణంబులు పువ్వులగుట నవ్వుటాలమాట; యప్పణంతుల లలాటకర్పూరతిలకంబు దర్పకునకు ధవళాతపత్రంబు శశాంకబింబం బనుట బొంకు. ఆ పువ్వుఁబోణుల కఱివంకకనుబొమ్మలె యంగజునకు సింగిణివిండ్లల్లచెఱకువి ల్లనుట కల్ల; యత్తొయ్యలుల నెత్తావి యూర్పుగాడ్పులె ఫుష్పబాణునకుఁ బ్రాణసఖులు చందనాచలసమీరణంబు సఖుం డనుట యకారణచిత్రప్రత్యావహంబు.

అది గావున నుత్తమనాయికా నాయక గర్భజనిత లైన యాసానులు సానురాగంబున నీశానుని, భీమేశ్వరుని ఘుసృణముకుళితాపాంగంబులు కుంచితాకుంచితభూతంబులు విస్మయోత్పాదనతావకంబులు, ప్రసన్నంబులు, ప్రేమరసపూర్ణత్రపావృతారంభంబులు, నవలలితంబులు, పులకావళికారణంబులు, భావజగర్భితంబులు, విస్మృతనిమేషంబులు నైన వీక్షణంబులఁ దదీయలావణ్యపూరం బాస్వాదించువిధంబు నభిలషించుట దెల్పుచందంబున హృదయంబు నాకర్షించుచాడ్పునఁ జాఘరవ్యజనవీటికాకరండపాదుకాముకురదీపికాసంగీతనాట్యాద్యుపచారసేవావిశేషంబులఁ బ్రతిసంధ్యంబును బాల్యంకికాసేవాబహిర్విజయాది భోగావసరసమయంబున సేవించుచుండుదురు.

80


తే.

దక్షవాటీపురీచతుర్ద్వారములను, భీమమండలికాపుణ్యభూమియందు
శంభులింగప్రతిష్ఠలు సంఘటించి, యెల్ల వేల్పులు ప్రార్థించి రిందుధరుని.

81


వ.

ప్రార్థించి శ్రీ భీమేశ్వరమహాదేవునివలన నాత్మప్రతిష్ఠితశంభులింగంబులకును వరం బడిగిన నవ్విరూపాక్షుండు వారుకోరినట్ల భుక్తిముక్తిప్రదానసామర్థ్యంబులు, స్వలింగంబులకుఁ గలుగ ననుగ్రహించె.

82


తే.

సప్తసింధువునకు భీమశంకరునకు, నడుమ నింద్రేశ్వరము పాపనాశనంబు
దృష్టిమాత్రన భుక్తిముక్తిప్రదంబు, దేవలోకాధిపతిసంప్రతిష్టితంబు.

83


క.

భీమయదేవుని దక్షిణ, భూమీభాగమున యజ్ఞపురుషేశ్వరది
వ్యామృతలింగము భోగ, శ్రీముక్తివిభూతిదాయి సేవకతతికిన్.

84


ఆ.

అగ్నికుండ మనఁగ నచ్చోట నున్నది, ధాత్రిభుక్తిముక్తిధాతునీవి
దానఁ దీర్థమాడి తర్పణ మొనరింప, బితరు లూర్ధ్వలోకగతులు గండ్రు.

85


తే.

కృత్తికాతారకంబులఁ గీలుకొన్న, దినమునం దగ్నికుండికాతీర్థ మాడి
శంభునగ్నీశ్వరునిఁ జూచు సజ్జనులకు, లలితకరతలధాత్రీఫలంబు ముక్తి.

86


సీ.

అగ్నీశ్వరునిమ్రోల నగ్నికుండికకూప, తటదేశమున నుండు దక్షకుండి
యది సర్వపాపౌఘ ముదిరఝంఝానిలం, బాకూపమునకు యామ్యంబునందు
దాక్షాయణీదేవి త్రైలోక్యజనయిత్రి, చలిగొండరాచూలి వెలసియుండు
దక్షగుండమునఁ దీర్థం బాడి యర్థితో, దాక్షాయణీదేవి దక్షపుత్రి


తే.

నసితపక్షాష్టమీతిథియందు నొండె, మఱి చతుర్దశియం దొండె మహితబుద్ధిఁ
జేసి దండప్రణామంబు సేయునపుడు, కాంచు మోక్షంబుఁ బ్రాణనిర్గతమునందు.

87


వ.

ఆయుత్తరంబున వీరభద్రప్రతిష్ఠితంబు చెంగట నిఋతిలింగంబు భీమనాథేశ్వరునికిఁ బడమట వరుణప్రతిష్టితం బగు వరుణలింగంబు వరుణకుండంబునఁ దీర్థంబాడి వరుణనక్షత్రంబున వరుణేశ్వరదేవుని దర్శించిననరుండు భవబంధనంబులం

బాయును; భీమేశ్వరు వాయువ్యదిగ్భాగంబున వాయుప్రతిష్ఠితం బగు వాయులింగం బుండు వాయుకుండంబున దీర్థంబాడి వాయులింగంబును సందర్శించిన నరుండు మోక్షలక్ష్మిం గూడు; సోమేశ్వరలింగంబు సోమప్రతిష్ఠితంబు, సోమనక్షత్రంబున సోమకుండంబునఁ దీర్థంబాడి సోమేశ్వరదేవుని దర్శించిన నరుండు భుక్తిముక్తిసంసిద్ధిం బొందు.

88


తే.

బాదరాయణుఁ డత్యంతపరమనిష్ఠ, సప్తసింధుసమీపదేశంబునందుఁ
దపముఁ గావించి శంభుసంస్థాపనంబు, జేసె నత్యంతభక్తివిశేష మమర.

89


క.

పంచాక్షరమంత్రమును జ, పించుచు సత్యవతిసుతుఁడు పెద్దయుఁగాలం
బంచిత యోగసమాధి భ, జించెన్ దా సంప్రతిష్ఠ జేసినశంభున్.

90


వ.

ఒక్కనాఁ డమ్మహాదేవుండు త్రిగుణమూర్తులగు బ్రహ్మవిష్ణుమహేశానులచే సముపాస్యుం డగుచు బాదరాయణునకుఁ బ్రత్యక్షం బగుటయు.

91


మ.

కురిసెం బువ్వులవాన మత్తమధులిట్కోలాహలాన్వీతమై
విరిసెం దిక్కులు మందమందగతలన్ వీచె న్నభస్వంతుఁడున్
మొరసెం దుందుభు లొక్కయుమ్మడి నభోమూర్ధావకాశంబునన్
బొరసెన్ సమ్మద మెల్లలోకముల కప్పుణ్యాహకాలంబునన్.

92


క.

ఆడిరి యచ్చరలేమలు, పాడిరి గంధర్వపతులు పరమమునీంద్రుల్
గూడిరి బహువిధంబులఁ గొని, యాడిరి యందంద నద్భుతావహభంగిన్.

93


క.

కొందఱు తాండవమాడిరి, కొందఱు పరిహాసకేలి గొఱలిరి మఱియుం
గొందఱు బాహాయుద్ధం, బందంద ఘటించి రమ్మహాసంఘమునన్.

94


వ.

వ్యాసర్షి కనుగ్రహం బొసఁగి యప్పరమేశ్వరుండు కూడినయశేషమునులను సర్వయోగీశ్వరులను సకలదేవతల నుద్దేశించి యిట్లని యానతిచ్చె.

95


క.

ఈ యున్నవారలందఱు, నాయానతి వినుఁడు నెమ్మనంబులలోనం
బాయం బెట్టుఁడు సంశయ, మీయర్థము వేదములకు నెక్కుడు సుండీ.

96


తే.

అర్కుఁ డెబ్భంగి నభమున కాభరణము, భువనముల కెల్ల నాభంగి భూషణంబు
దక్షవాటీపురము భోగమోక్షవిభవ, పావనం బందు విశ్వాసపరులు గండ్రు.

97


క.

త్రిభువనములయందును మా, కభిమతములు పెక్కులైన నారామము లం
దభిమానమింత సేయము, విభవాస్పద మైనదక్షువీటింబోలెన్.

98


తే.

వినుఁడు సత్యంబు సత్యంబు వెండిసత్య, మాత్మలోన విచారించి యానతిత్తు
దక్షవాటంబుకంటెఁ దీర్థంబుననిఖిల, మేదినీమండలంబున లేదు లేదు.

99


గీ.

వాఁడిగోర్గొండిఁ గన్నులు దోఁడియైన, నడుగు లడిదంబుచేతఁ జక్కడచియైన
నొండుకడకేగుటలు మాని యుండవలయు, డక్కుమాటలు దక్షవాటంబునందు.

100

క.

తిష్ఠన్మాత్రునకైన వ, సిష్టప్రతిమానుఁడైన శిష్ఠునకైనన్
నిష్ఠాత్మ గలిగెనేనియు, నిష్ఠాకాలంబుముక్తినియతం బచటన్.

101


ఆ.

బ్రహ్మహత్యమద్యపానంబు గురుతల్ప, గమన మాదిగాఁగఁ గలుగునట్టి
పాతకంబు లపుడె పాయు మానవులకు, దక్షవాటిభీమదర్శనమున.

102


వ.

అని యి ట్లర్ధేందుమౌళి యానతిచ్చి యంతర్ధానంబు చేసెఁ దదనంతరం బాహరివిరించిబురందరాదులగు బృందారకులును సనకసనందనసనత్కుమారసనత్సుజాతు లగు బ్రహ్మయోగీశ్వరులును, మార్కండేయ మందపాల మౌద్గల్యమాండవ్యమంకణాదు లగుమహామునులును, బాదరాయణు నభినందించుచు, నిజస్థానంబులకుం జనిరి.

103


సీ.

సప్తగోదావరరస్నానంబు రామనా, థావలోకనము పిత్రార్చనంబు
రామగయాపితృశ్రాద్ధంబు గౌరీజ, నార్దనరుద్రసన్నామజపము
పరగ మహాదివ్యభావనానార్చనా, భవనప్రదక్షిణప్రక్రమంబు
పంచాక్షరీమంత్రపారాయణజపంబు, పాశుపతాచాపరమనియతి


తే.

సమయ మిది సర్వదేవతాసార్వభౌము, భుక్తిముక్తి ప్రదాయకు భువనభర్త
భీమనాథేశ్వరేశ్వరుస్వామిఁ గొలుచు, భక్తులకు నెల్ల నాగమపద్ధతి యిది.

104


మ.

పరదారేశ్వరకుంభసంభవవిభుల్ ప్రాగ్దిగ్విభాగంబులన్
బరవిధ్వంసికి దూరదేశమునం దాభోగంబునన్ శశ్వదా
వరణద్వారమునన్ మహామహిమచే వాయువ్యదిక్సీమ ను
ద్ధరతన్ వాయుశివుండు నుండ్రు మిగులం దాత్పర్యశ్రద్ధారతిన్.

105


సీ.

దక్షవాటీమహాస్థానంబులో లేని, యమరు లేస్థానంబునందు లేరు
దక్షవాటీమహాస్థానంబులో లేని, యర్థ మేస్థానంబునందు లేదు
దక్షవాటీమహాస్థానంబులో లేని, యమృత మేస్థానంబునందు లేదు
దక్షవాటీమహాస్థానంబులో లేని, యజ్ఞ మేస్థానంబునందు లేదు


తే.

దక్షవాటిక సకలతీర్థముల కిరవు, దక్షవాటిక సకలవిద్యలకు గరిడి
దక్షవాటిక విభవంబు తానకంబు, దక్షవాటిక శివుని యంతఃపురంబు.

106


వ.

ఇట్టిమహామహిమంబుగల దక్షారామంబుస నభివసింపుదము, భీమమండలంబు దర్శింపుదము, సప్తగోదావరమ్మున నాడుదము, వృద్ధగంగాజలంబులఁ దేలుదము, తుల్యభాగాతోయంబుల మునుఁగుదము, కణ్వనాహిని నవగాహింతము, కౌంతేయంబున నోలలాడుదము, లవణపయోనిధి గంగాసంగమంబుల నభిషేకింతము, రండని హర్షోత్కర్షంబున రోమహర్షణతనయుండు సూత్యాహసంభవుండు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుం డైన సూతుండు పల్కిన విని నెమిశారణ్యపుణ్య

క్షేత్రంబున ద్వాదశవార్షికపరిమితం బైన సత్రయాగంబునఁ గూడినశౌనకాది మహామునులు, యజ్ఞావసానసమయంబున శ్రీమన్మహాదేవుని సందర్శింపం జనిరి. ఇది పంచాశత్ఖండమండితంబును, సనత్కుమారసంహితాది బహుసంహితాసంధానంబును నైన స్కాందపురాణంబునందు గోదావరీఖండంబునందుఁ జెప్పంబడిన భీమఖండంబు, భీమేశ్వరమాహాత్మ్యంబును, భీమేశ్వరపురాణం బనంబరఁగు నిమ్మహాప్రబంధంబు వ్రాసిన, బఠించిన, వినినఁ, బుస్తకం బర్చన చేసిన, నారాధించిన, శ్రీభీమనాథేశ్వరుం డాయురారోగ్యైశ్వర్యంబులు, శాశ్వతమోక్షపదంబును గృప సేయు.

107



ఉ.

వైభవపాకశాసన! సుపర్వమహీధర ధైర్యవర్తి! గే
యోభయవంశదీపక! సముద్ధితవీరవిరోధిమండల
క్షోభకరప్రతాప! ఫణికుండలభక్తనిధీ! దిగంతగం
ధేభకటద్వయద్వయసహృద్యయశఃపరిరంభ నిర్ఝరా.

108


క.

రామాంబానందన! సం, గ్రామజితధనంజయా! పరాక్రమరామా
స్వామిద్రోహరగండ! మ, హామాత్యకిరీటశేఖరామాత్యమణీ.

109


భుజంగప్రయాతము.

ప్రధూత్కార్యసామంతరక్షాధురీణా
విధూత్తంససేవాప్రవృత్తాంతరంగా
మధూళీమదాసారమాధుర్యవాక్యా
బుధారాధనాసార, భోజావతారా.

110


గద్య.

ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయప్రణీతం బైనశ్రీభీమేశ్వరపురాణం బనుమహాప్రబంధంబునందుఁ సర్వంబును షష్ఠాశ్వాసము.

శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరార్పణమస్తు.
శ్రీరామార్పణమస్తు.