భాస్కరరామాయణము/ఆరణ్యకాండము-ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

భాస్కరరామాయణము

ఆరణ్యకాండము - ద్వితీయాశ్వాసము



రామాకుచయుగళీ
[1]హారిద్రోల్లసితవత్సహరిచరణసరో
జారాధ్యుఁడు మారయధర
ణీరమణోత్తముఁడు సాహిణీతిలక మిలన్.

1


వ.

శ్రీరామచంద్రు(౦డు మహామహిమాభిరాముం డాత)నిమాహాత్మ్యంబు చెప్పెద
విను మని మారీచుండు దశకంధరున కి ట్లనియె.

2

రామునిజోలికిఁ బోవల దని మారీచుఁడు రావణునితోఁ జెప్పుట

మ.

సమదాటోపత రాముఁ గైకొనక విశ్వామిత్రుయజ్ఞంబు వి
ఘ్నము సేయంగ ననేకదైత్యతతి రాఁగా నేఁగి యేఁ దొల్లి కం
టి మహానాగములట్లు సింహములమాడ్కిం దీవ్రదంభోళిసం
ఘముచందంబున దైత్యకోటిఁ బొలియంగాఁ జేయ రామాస్త్రముల్.

3


చ.

సమదసహస్రదంతిసమసత్త్వుని న న్నొకయమ్ము దాఁకి శీ
ఘ్రమ శతయోజనంబు లతిగాఢరయంబున నెత్తి తెచ్చి పె
ల్లెముకలు పెల్లగిల్ల వడి నియ్యెడ వైచిన మూర్ఛఁ బొంది భా
గ్యమున సజీవి నైతి దనుజాధిప రామునిసత్త్వ మే మనన్.

4


ఆ.

అతనిపిన్ననాఁటియస్త్రబలం బిది, యిపుడు లావు మెఱసి యేపు మిగిలి
యున్నవాఁడు మునిగణోజ్జ్వలఘనతపో, బలముచేతఁ దనదుబలము దనర.

5


క.

[2]విసువక మఱియుం జని య, వ్వసుధేశుఁడు దండకమున వర్తింపఁగఁ దా
పసహింసాపరు లగురా, క్షసు లిరువురు నేను గూడి కపటాకృతులన్.

6


చ.

ఉరుతరచిత్రగాత్రములు నుజ్జ్వలశాతవిషాణముల్ భయం
కరముఖగహ్వరంబులును గల్గుమృగంబుల మై వధింపఁ బై

[3]నురవడిఁ బాఱ న ట్లతఁడు నుగ్ర, శరంబుల నేయఁ దోడివా
రిరువురుఁ జావఁగాఁ బఱచి యే నిట వచ్చితి నేమి సెప్పుదున్.

7


మత్త.

నాఁటఁగోలెను నామనంబున నాటుకో వెఱ నాకు నిం
కేటిజీవన మంచు నీతప మిట్లు వన్నితిఁ గాక యే
నాఁట నే నియతవ్రతస్థుఁడ న న్నెఱింగియు నిట్టినా
భోఁటిభీతుని నీకుఁ దో డనఁ బోలునే దశకంధరా.

8


క.

ఏదైనఁ జూచిన రఘువరుఁ, డద్దెసఁ బొడసూపినట్టు కలగుఁ దద్భీతిన్
నిద్దుర లే దది కల్గిన, నద్దశరథసుతుని కాంతు నక్కలలందున్.

9


క.

రణరథముఖరేఖాదిక, ఫణితిప్రారంభణములఁ బరహృదయభిదా
చణ మగురామాఖ్యోచ్చా, రణమో యని బెగడు పుట్టుక రావణ నాకున్.

10


వ.

అని వెండియు.

11


క.

ఇచ్ఛానాదము లాడెడు, తుచ్ఛులు పెక్కండ్రు గలరు దుర్ల భుఁడు విభు
స్వచ్ఛందోక్తులకుం జొర, కచ్చలముగఁ బలుకునతఁడు నది వినునతఁడున్.

12


చ.

త్రిదశులు వెట్టిసేయ నిటు దివ్యపరంబుగ లంక నేలుచున్
మదిమది నుండ లేక యొక మానుషసత్త్వముఁగాఁ దలంచి దు
ర్మదమున రాముపై నలిగి మాయల నమ్మహితాత్ముదేవిఁ దె
చ్చెద నని చూచెదే చెడుగుఁజేఁతలకుం జొర రాక్షసేశ్వరా.

13


ఉ.

ఈకొఱగాని కార్య మిటు లెవ్వఁడొకో యనుకూలశత్రుఁ డై
నీకుఁ బ్రియంబుగాఁ బలికె నీవును నిత్తెఱఁ గాచరింపఁగా
రాక తలంచి చూడ నిది రాక్షసవంశవినాశకాలమో
కా కిటుగాను దీకొనునె కాదన కీదృశ మెవ్వఁ డేనియున్.

14


క.

దినకరునిఁ బాపి తత్ప్రభఁ, గొనివచ్చెడు ననునె యెట్టి కుమతియు నారా
మునిశరశిఖిఁ బడ నరిగెడు, పని వలవదు సీత నీకు బయలం గలదే.

15


క.

లోకము రక్షించుటకై, కైకేయివరంబు నెపము గా నప్పుణ్య
శ్లోకుఁడు తండ్రికి ననృతము, రాకుండఁగ వచ్చినాఁ డరణ్యంబునకున్.

16


క.

రక్షోవధ మొనరింపఁగ, నాక్షత్రియవరుఁడు పూను టది వినవొ జగ
ద్భక్షుణు లైనఖరాదుల, శిక్షించుట వినియు వినవు చెప్పిన బుద్ధుల్.

17


క.

కాలము నేరిన రోగికి, మే లగునౌషధము లెందు మెయికొనునె మదిన్
బేల చెడనున్నతఱి వినఁ, బోలునె దగుబుద్ధు లల్పబుద్ధుల కెందున్.

18


క.

మిడుతలు కార్చిచ్చుపయిం, బడఁ బోయినయట్ల చూవె బల్లిదుఁ డగునా
పుడమిపతీమీఁద బల్విడి, నడరఁగ మనతలఁచు టెల్ల ననినం గినుకన్.

19

క.

ఖరుఁ డాదిగఁ గలహితులం, బొరిగొని శూర్పణఖ నట్లు పోఁడిమి చెడ ను
ద్ధదురభంగి భంగపెట్టిన, దురితాత్మునితోడ నెట్లు దొడరక పోదున్.

20


ఉ.

మానము దూల బుద్ది పలుమాఱును జెప్పుట మాను మెట్లు న
మ్మానవుభార్యఁ దెత్తు నవమానము లే దిదె నీవు రాక దు
ర్మానముఁ బొంది యున్న నభిమానముఁ బ్రాణముఁ గొందుఁ జాల స
న్మానము సేసి మెత్తు నవమానము సేయక తోడు వచ్చినన్.

21


క.

అని తెంపు మీఱఁ బల్కిన, దనుజుండు దశాస్యునెదురఁ దాఁ బలుకక చ
య్యనఁ గదలి యతనితోడన, చనియెం బతికినుక కులికి చతురుం డగుచున్.

22


వ.

[4]అమ్మారీచుండు దనమనంబున నిన్నీచుచేతం జచ్చుటకంటె రఘురాముచేతఁ జచ్చి
నం బరమగతి గలదు కావున నిదియ మేలుకార్యం బనిపూని రావణున కనేకమాయో
పాయంబు లుపన్యసించి చూపుచుం జనియె నతండు నీవు నాకుఁ బ్రాణమిత్రుండవు
పూర్వామాత్యుండ విక్కార్యంబు సిద్ధించిన నర్ధరాజ్యం బిత్తు నని యుపచరిం
చుచు (నెడ నెడ గరులు నదులు వనంబులుఁ గనుంగొనుచుఁ బెక్కుదేశంబులు
గడచి దండకారణ్యంబు సొచ్చి నానాతరుశోభితం బగుచున్న పంచవటీతీరంబునం
దేరు డిగ్గి మారీచుం జూచి మనవచ్చిన కార్యం బనుష్ఠింతువు గా కని నియోగిం
చిన వాఁడును.)

23

మారీచుఁడు మాయాకురంగ మై రామాశ్రమమునకు వచ్చుట

సీ.

రుచిరవైదూర్యంబు రూపార నచ్చున, వచ్చినవిధమున వదన మమర
భర్మనిర్మితపద్మపత్రంబు లలవడ, నొత్తిన లయఁ గర్ణయుగము మెఱయ
లలితమాణిక్యశలాకలలాగు మై, కొన నమర్చినభంగిఁ గొమ్ము లొప్ప
నింద్రనీలములబా గేర్పడ ద్రచ్చివై, చినగతి గొరిజలు చెలువు మిగుల
నుదర మిందుబింబద్యుతి నుల్లసిల్లఁ, గనకకేసరాంకురరోమకాంతి నిగుడ
నొకమాయాకురంగ మై యొయ్యనొయ్యఁ, జనియె నిలుచుచు నాపర్ణశాలకడకు.

24


సీ.

నెలలోనియిఱ్ఱికి నీలకంఠునిచేతఁ, బొలుపారులేడికిఁ బుట్టె నొక్కొ
యజుఁ డన్నిరత్నంబులందునుం గలుగుక్రొ, మ్మించుల దీనిఁ గల్పించెనొక్కొ
రోహిణాచలము మేరువుఁ గూడి యురుతర, ప్రభల నీహరిణంబుఁ బడసెనొక్కొ
క్రొక్కారుమెఱుఁగులుఁ జుక్కలయొఱవును, గలసి యీమృగ మయి వెలసెనొక్కొ
దీనిఁ బోలంగ జంతువుల్ త్రిభువనముల, యందు మఱి కలవొకో యని యాత్మ మెచ్చి
ప్రీతి వనదేవతలు సూడ సీతదృష్టి, మార్గమున కల్లఁ జనియె నమ్మాయయిఱ్ఱి.

25

ఉ.

అత్తఱి నెమ్మొగంబుజిగి నచ్చపువెన్నెల గాయ నింపు ద
ళ్కొత్తుసమీపభూజముల నొయ్యనఁ బువ్వులు గోయుచున్న రా
జోత్తముదేవి చూచెఁ జిగు [5]రొత్తెడువేడ్కలు సందడింపఁగన్
గ్రొత్తమెఱుంగు లేణమునకుం దనకున్ నడు మెల్ల నిండఁగన్.

26


మహా.

ధరణీసంజాత ప్రీతిం దనుఁ గనుఁగొన నుద్యద్గతిం బాఱుఁ దాఱుం
బొరి డాయుం బూరి మేయుం బొలుపుగ నిగుడుం బొంగుఁ గ్రుంగుం జెలంగుం
దిరుగు గుప్పించు మించున్ దెసల నెసఁగ వర్తించు వే చౌకళించున్
గర మొప్ప నిల్చుఁ బొల్చుం గనకహరిణ మక్కాననాంతంబులోనన్.

27


క.

(మరగినవిధమునఁ జేరువఁ, దిరుగుఁ బసికొనుచుఁ గలయఁ దృణములు వెదకున్
ఖురపుటమునఁ గడు పొయ్యన, బరికికొనుచుఁ జక్క నిలుచుఁ బలుమఱు నెదురన్).

28


క.

ఈలీలం బొలయఁగ నా, లోలాక్షి విలోల యై వికిలోకించి మహీ
పాలుని లక్ష్మణుఁ బిలిచినఁ, జాలఁగ వెస నేఁగి కనిరి సారంగంబున్.

29


తే.

అపుడు లక్ష్మణుఁ డేర్పడ నామృగంబు, నద్భుతాకారవిలసన మధికసంశ
యాత్ముఁడై చూచి నిజబుద్ధి నసురమాయ, గా నిరూపించి యనియె నగ్రజునితోడ.

30


మనలం బిల్చుట భూమిపుత్రి మది నిమ్మాయామృగంబున్ నిజం
బని భావింపఁగఁబోలు వీఁ డసుర మాయారూపుఁ డెందేని నొ
క్కనెపం బిమ్మెయిఁ జూపి చిక్కు వఱుపంగాఁ జూచె మోహంబునన్
జననాథోత్తమ పట్టఁ జూచెదు సుమీ చర్చింప కుద్యద్గతిన్.

31


క.

అని పలుకఁగ నాలోనన, జనకజ పతి డగ్గఱంగఁ జనుదెంచి కనుం
గొను రాజముఖ్య యొప్పుల, గని యగునీమృగవిలాసకమనీయగతుల్.

32


క.

కరువున గండరువునఁ జి, త్తరువున నినచంద్రరుచులఁ దారలరుచులన్
[6]హరిహరధాత్రాదుల కీ, హరిణము సరిరూపు వడయ నలవియె యెందున్.

33


వ.

అనుచు సాభిలాషంబుగాఁ బెక్కుచందంబులం గొనియాడి.

34


చ.

అలఘు చరిత్ర దీని వెర వారఁగ నెమ్మెయి నైనఁ బట్టి తే
వలయు నరేంద్ర మిమ్ముఁ బనిఁ బంపెడుదాననె దీనిమీఁద మీ
రలరుచుఁ జూచుభంగిఁ గని యాడితిఁ గన్నులపండు వెప్పుడున్
గలుగదె యెల్లనాఁడు నధిరేకంబుగ [7]నీమృగరత్న మబ్బినన్.

35


చ.

అని కడువేడ్కతోఁ బ్రియుని నామృగలోచన వేఁడినన్ మనం
బునఁ గడునుత్సవం బొదవఁ బోయెద నిప్పుడ పట్టి తెచ్చెదం
గనుఁగొను మంచుఁ బూన నిజకాంతునితో ననురాగభావసం
జనితవికాసభాసి యయి జానకి యి ట్లనుఁ గౌతుకంబునన్.

36

తే.

[8]ఎట్లు గ్రుంకులు పెట్టుచు నేచి పట్ట, నీక యెట పాఱెనేనిఁ బో నీక శరము
పాలుపడఁజేసి తెమ్ము భూపాల యొప్పఁ, జారుతర మైనయీమృగచర్మ మైన.

37


వ.

అని పల్కునవసరంబున సౌమిత్రి విన్నఁబోవుచు నింత యెఱుంగమి గలదె య
సురమాయం దగిలి రామచంద్రునకు హరిణరూపం బై నకలంకం బొందె నను
చుఁ దద్విఘ్నవచనంబు లాడ నోడి వెఱచుచు నుండె వెండియు రఘువరుండు.

38


క.

సౌమిత్రిం బిలిచి లక్ష్మణ, యీమృగముం దనకుఁ దెచ్చి యి మ్మనియెడు నన్
భూమిజ విలునమ్ములుఁ దె, మ్మేమఱకుము వచ్చునంత కిట మీవదినెన్.

39


క.

అన విని యతఁ డన్నకు ని, ట్లనుఁ దాపసహింస చేయునలమారీచుం
డనువాఁడు కనకమృగ మై, చనుదెంచెం బొసఁగ విట్టిచందము లెందున్.

40


క.

వసుమతి మన మింతకు మును, వసుధాధిప కంటిమే సువర్ణమృగము రా
క్షసకృత్య మ్మిది వలవదు, మసలుఁడు సతు లతులచపలమతులు దలంపన్.

41

శ్రీరామమూర్తి మాయాకురంగంబుం బట్ట నరుగుట

వ.

అనిన విని కౌసల్యానందనుండు సుమిత్రానందనున కి ట్లనియె.

42


క.

అడిగినవస్తువు లెప్పుడు, నెడపక గలిగించుకతన నీయబల మనం
బొడఁబడి పురి నున్నట్టుల, కడుముదమునఁ బొంది యుండుఁ గాంతారమునన్.

43


తే.

పసిఁడిమృగము నిక్కం బైనఁ బట్టి తెచ్చి, జనకసుతకోర్కి దీర్చెద సమ్మదమున
లేక మాయామృగం బైన లీలఁ ద్రుంచి, హిత మొనర్చెద మునులకు నెట్లు లెస్స.

44


క.

అని పలికి విపులబాణా, సనమును గవదొనలు పూని సౌమిత్రిఁ గనుం
గొని జనకతనయ సుమ్మీ, యని పలుమఱు నప్పగించి యట సన నదియున్.

45


చ.

నిలువక మెల్ల దాఱు నటు నిల్చిన మెల్పు నటించుఁ బట్టఁ జే
యలఁతికిఁ జేరినం జిదిమినట్టులు దూరము దాఁటుఁ గ్రమ్మఱం
గొలఁదికి డాసినం బొదలు గొందులు సొచ్చు నడంగె నన్న న
వ్వలఁ బొడసూపు మాటుకొని వచ్చిన వెండియు నుండు నొండెడన్.

46


వ.

అప్పుడు రఘువరుం డపరభాగనిరూఢశరాసనుండును నాకుంచితాంగుండు నగు
చు నొయ్యన.

47

క.

మునివ్రేళ్లు నేల మోపుచు, వెనుకదెసం జప్డు గాక వెరవునఁ గదియం
దనుఁ జూచియు ఱెప్పలకడ, లును లే కటు నిలుచు నిలిచి లోఁబడుకొలఁదిన్.

48


క.

పిఱిఁదికిఁ బో నిచ్చిన వి, ల్లఱితికి నై యల్లఁ జూఁప నది గనుఁగొని పె
ల్లుఱికి చను లతలు పులువడఁ, జిఱుముం గడు నాస పుట్ట శృంగాగ్రములన్.

49


వ.

ఇవ్విధంబునం బెక్కుదూరం బరిగి యెండమావు లుదకంబు లని తలంచుచుఁ
దృష్ణాతిరేకంబునం దగులుమృగపతియునుంబోలె నారామచంద్రుండు.

50


సీ.

పొదదండగాఁ జేరి యుదరిపాటునఁ బట్టఁ, బొంచెద నంచును బొంచిపొంచి
మొక్కలంబున నున్న ముట్టి పర్వున డయ్యఁ, బాఱి పట్టెద నని పాఱిపాఱి
దొడ్డికట్టై యున్న తోరంపుటీరంబుఁ, జొరఁ జోపి వెనువెంటఁ దిరిగి తిరిగి
పొరకలు మెయినిండఁ బూరించుకొని పచ్చ, చెట్టుచందంబునఁ జేరిచేరి
మడుఁగులకు నల్ల దార్చుచు నడుసు గలుగు, [9]కొలఁదిఁ బట్టంగ నగు నని వెలిచి వెలిచి
యలమృగమువెంట నొయ్య నాసాసఁ దిరిగె, నామృగవ్యాధరుద్రుఁడో యనఁగ విభుఁడు.

51


వ.

[10]మఱియు నందంద తఱుముచుం బ్రిదిలి పోవుచు
తఱుముచుఁ బ్రెదిలి పోవుచు నిత్తెఱంగునం దార్చు సమ
యంబున.

52


సీ.

నీరాక యెఱుఁగుదు నిక్కంబు ననుమాడ్కి, నోరచూపునఁ జేరి యొయ్య గిఱువుఁ
జందురునిఱ్ఱితో సమరంబునకు నేఁగు, పగిదిఁ గుప్పించి యుప్పర మెగయును
సురిఁగిపోయెద నన్నఁ జొరఁ జోటు లే దింక, నీవె ది క్కనుభంగి నెదురువచ్చుఁ
దనయకోర్కికి నుర్వి తనుఁ బట్టు ననుగతి, నవనిపై నిలువ కందంద దాఁటు
మరలిచూచుఁ దిరుగు మఱియు నల్దెసఁ బాఱు, నలసినట్ల నిలుచు నల్ల బెదరు
మెలఁగి దెసలు వెదకు మెడ యెత్తి గాలిది, క్కరయు నక్కురంగ మచటనచట.

53

క.

నిలువక తరుగుల్మాంతర, ములలో వడిఁ బాఱునపుడు మొగుళులు వాఱం
దలతల వెలుఁగుచు నెడనెడఁ, బలుమఱుఁ జందురుఁడుఁ దోఁచుపగిదిం దోఁచున్.

54


వ.

ఇట్లు దోచిన విస్మితుం డగుచు.

55


మ.

కదియం జొప్పడ కంతకంత కట యాకాంతారమధ్యంబునం
దది యెందుం గమియించినం బిదప డయ్యంబాఱుచుం బట్టలే
కిది మాయామృగ మచ్చుగా ననుచు నిం కే దీనిఁ బో నీక చం
పెద దూరం బెలయించె నంచు నలుకం బృథ్వీశుఁ డేతేరఁగన్.

56


క.

మాయాహరిణము మిగులుదు, వాయువు దెగఁబఱతు ధరణివలయము గడతుం
దోయధి దాఁటుదు ననుక్రియఁ, గాయద్యుతు లడర నొక్కగతిఁ దెగి నిగిడెన్.

57

శ్రీరాముఁడు మారీచుని రూపుమాపుట

క.

నిగిడి కడు నలసి యట యొక, మృగయూథముఁ జొరఁగఁ బోవుమెయిఁ దోడనె వెం
దగిలి యగపాటు గని యొఱ, పగువెరవును నిచ్చి రాముఁ డయ్యేణంబున్.

58


శా.

చంచత్కాంచనకంకపత్రము ధనుర్జ్యావల్లి సంధించి ర
త్నాంచత్పుంఖముఁ గర్ణచుంబితముగా నాకృష్టిఁ గావించి క్ర
మ్మించుంగీలలు గ్రమ్మ నేయ నదియున్ మే నుచ్చి హా లక్ష్మణా
యంచుం గూలె నిజాకృతిం బుడమిపై నయ్యస్త్రపాతంబునన్.

59


వ.

అట్లు గూలి గతాసుఁ డగునమ్మారీచుఘోరాకారంబు సూచి విస్మితుం డగుచు
రఘువరుం డంతర్గతంబున.

60


ఉ.

తమ్ముఁడు సెప్పినట్ల బలుదానవుఁ డయ్యెఁ గురంగ మక్కటా
యిమ్మొఱ కమ్మహాత్ముఁడు మహీజయు నెంతఁ దలంకిరో కదే
యిమ్మెయిఁ గీడు సేయువిధి కెవ్వ రసాధ్యులు నేఁడు వారలం
గ్రమ్మఱఁ జూడఁ గందునొకొ కాననొకో ధృతి దూలె నెట్లొకో.

61


క.

నను మాయామృగ మై వడి, దనుజుం డిట దెచ్చె నచటఁ దమ్ముని నెమ్మై
ఘనదైత్యులు పొదివిరొకో, జనకజ యే మయ్యెనొ మది శంకించెఁ గడున్.

62


తే.

అనుచు వేగంబ రఘురాముఁ డచట మాయ, మెగము వధియించి కైకొని వగలు వొదువు

నంతరంగంబుతో నేఁగె నప్పు డచట, నార్తరవ మట్లు మ్రోసిన నాత్మఁ గలఁగి.

63


వ.

[11]ఉల్లంబునం దల్లడం బొదవ ధాత్రీపుత్రి సుమిత్రాపుత్రుం బిలిచి దీనవదన
యగుచు ని ట్లనియె.

64


శా.

వింటే లక్ష్మణ రామునార్తరవ మై వీతెంచె నే నొంటి పొ
మ్మంటిం దమ్ముఁడ యేమి పుట్టెనొ కదే హా లక్ష్మణా యంటగా
వింటిం దాలిమిఁ బట్టఁ జాల నటవీవీథిం గురంగంబువె
న్వెంటం బోక కలంపఁ గీడు సనవే వేగంబ నిన్ వేఁడెదన్.

65


క.

కుడిక న్నడరఁ దొడంగెను, దడయం డొకకీడు లేక ధరణీశుం డె
య్యెడ రైన నిన్నుఁ బిలిచెనొ, వడిఁ జేకొనవయ్య భ్రాతృవత్సల రామున్.

66


చ.

అని పలుమాఱు దైన్యమున నశ్రులు గ్రమ్మఁగఁ బల్కునట్టియ
వ్వనితకు నాతఁ డిట్టు లను వాసవపద్మజరుద్రులైన నా
ఘనున కెదుర్ప నోడుదు రగణ్యపరాగ్రముఁ డమ్మహాత్ముఁ డే
దనుజుల నైనఁ ద్రుంచి వెసఁ దా నిట వచ్చుఁ దలంక నేటికిన్.

67


తే.

మాయరక్క సుఁ డొక్కఁ డీమాడ్కిఁ జీరె
నన్ను నెలుఁగెత్తి యెఱుఁగ నే నాకసంబు
విఱిగి పైఁబడ్డ నాత్మలో వెఱవఁ డెపుడు
నమ్మహాత్ముని నిటు సేయ నవనిఁ గలరె.

68


క.

[12]నిను ని ట్లూఱడిపోయెను, మనుజేంద్రుఁడు నాకుఁ దగునె మానిని యిచ్చో
నిను డించి పోవఁ బోయిన, ననుమానము లే దపాయ మగు నీ కిచటన్.

69


వ.

[13]అని వెండియు.

70


క.

దెప్పర మప్పురుషాగ్రణి, కెప్పాటను గలుగు నేర దెందును నోహో
నిప్పుఁ జెద లంట నేర్చునె, తప్పఁ దలఁచి తీ వి టేల తలఁకెద వకటా.

71


ఉ.

అట్టిద యైన నింతక యహర్పతి తప్పఁ జరించు మేరు వి

ట్టట్టుగ డొల్లు భూవలయ మల్లలనాడు సురాసురాదులం
దొట్టి జయింపఁ జాలు నృపధూర్జటి కెక్కడిచిక్కు గల్గు నీ
వె ట్టని చూచె దా నినద మెట్లును రాక్షసమాయ నావుడున్.

72


క.

రామునిదెస క ట్లేఁగిన, ప్రేమావేశమున మనసు బెగడి వివేకం
బేమియుఁ దోఁపక తగువును, మోమోటము దక్కి యలుక ముద్దియ పలికెన్.


క.

దిగు లంది యేను బనిచిన, మగుడం జెప్పెదవు గాని మది నించుకయున్
బెగడవు సవతులకొడుకులు, పగవా రని నీతివిదులు పలుకుట బొంకే.

74


తే.

అనుచు సంతాప మందుచు నతనికడఁక, లేమి గనుఁగొని కోపించి లెక్క సేయ
వగ్రజునిచేటు గని ప్రియం బాత్మఁ గదిరి, నట్ల యున్నాఁడ వధికపాపాత్మ నీవు.

75


చ.

అనుజుఁడ నంచు ము న్నొకదురాత్ముఁడు రాజ్యవిభూతి యెల్లఁ జే
కొని యటు సేసె నీవుఁ గడుఁ గ్రూరత రామునిచావు వేచి తే
మనఁ గల దింక నిన్నుఁ గుటికలాత్మక నా కని కాచినాఁడవే
నినుఁ గయికొందునే నిలువు నీ ఱయి కూలుదు గాక దుర్మతీ.

76


క.

[14]అనవుడు నపు డప్పలుకులు, సునిశితవిషలిప్తదీప్తసూచీముఖభే
దనగతిఁ జేయుఁడు శివశివ, యనుచుం గరగుప్తకర్ణుఁ డై కట్టెదురన్.

77


ఆ.

అశ్రుకణము లొలుక నాకంపితాంగుఁడు, నవనతాననుండు నగుచుఁ గొంత
సేవు మనసునందుఁ జింతించి యద్దేవి, తోడ ననియెఁ గేలుదోయి మొగిచి.

78


క.

పరదేవతవును దల్లివి, గురుపత్నివి నీవు నీకుఁ గూడునె న న్నీ
పరుసములు పలుక నింకన్, నరపతిపను పైనఁ దగునె నా కిట నిలువన్.

79


క.

నీకు మహాభూతంబులె, పో కా పిఁక నేను నిదిగొ పోయెద రక్షో
భీకరమృగకులసంకుల, మీకానన మింత నీవ యెఱుఁగుదు తల్లీ.

80

ఆ.

అనుచు నక్కుమారుఁ డవనతుం డై దృష్టి, నిగుడునంతదాఁక మగిడి మగిడి
పర్ణశాలదిక్కు పలుమఱుఁ గనుఁగొంచు, నరిగె నంత నిట దశాననుండు.

81

రావణుఁడు సన్న్యాసివేషంబున సీతకడకు వచ్చుట

సీ.

తుదివ్రేల నెగసనఁ ద్రోచినపుదియబొ, ట్టురుఫాలపట్టిక నుల్లసిల్లఁ
దులసీదళాంకితతుచ్ఛశిఖాపుచ్ఛ, మలవడ నునుఁదల నంద మొందఁ
గావిగోఁచియుఁ గుశగ్రంథులుఁ బెనఁచిన, ముక్కోల వలపలిముష్టి నమర
నిర్మలజలములు నిండ నించిన కమం, డలువు డాకేల బెడంగు మిగుల
నిట్లు భిక్షువేషము ధరియించి కపట, వార్దకంబు నటించుచు వచ్చి పర్ణ
శాలవాకిటఁ బథిపరిశ్రాంతి నొంది, యల్ల మెల్లన హరిహరి యనుచు నిలిచె.

82


వ.

ఇట్లు నిలిచి కెలంకు లరయుచుం దొంగి చూచి పర్ణశాలాభ్యంతరంబున.

83


మ.

హరిణం బిక్కడ కేల వచ్చె విభు నే న ట్లేల పొమ్మంటి నా
ర్తరవం బేటికిఁ బుట్టె నట్టిమఱఁదిం ద ప్పాడి నొప్పించి యీ
దురితం బేటికిఁ గట్టికొంటి ననుచుం దోఁతెంచుకన్నీటితోఁ
గరపద్మంబును నక్కు సేర్చి వగలం గందంగ నయ్యంగనన్.

84


క.

కనుఁగొని యలరుందూపులు, దనచిత్తము దూరఁ గాఁడఁ దాలిమి దూలన్
మనసిజవికృతిం బొందుచు, మునుమిడికొను కపటమంత్రమును వాతప్పన్.

85


సీ.

వలరాజు పాటించుకవాలారుటమ్ములు, గామినీరూపంబుఁ గాంచె నొక్కొ
భర్మనిర్మితసాలకభంజక దియ్యంపుఁ, జెయ్వఱు దగ నభ్యసించె నొక్కొ
మహితసమ్మోహనమంత్రాధిదేవత, సురుచిరాకృతిఁ బొడసూపె నొక్కొ
లసితసరోవరలావణ్యసంపద, సీతాభిధానంబుఁ జెందె నొక్కొ
యనుచు నడరుకోర్కు లను రాగసాగర, వీచు లగుచు ధైర్యవేలఁ గడవ
నుండి యుండి మఱియు నొకమాయఁ బొందె నా, ననిమిషత్వ మొందె నాత్రిదండి.

86


ఉ.

అప్పుడు సీతయుం బొడమునశ్రులు ఱెప్పల నప్పళించుసొం
పొప్పఁ గుచద్వయంబుపయి నుండక జాఱిన నున్నకొంగు చే
నెప్పటియట్ల కాఁ దిగిచి యెవ్వరొ వీ రొకపెద్ద లంచు న

చొప్పున నున్న రావణునిఁ జూచెఁ దృణావృతకూపసన్నిభున్.

87


వ.

చూచి వినయంబుతో నర్ఘ్యపాద్యాదు లిచ్చినం గైకొని యమ్మాయాపరివ్రా
జకుం డి ట్లనియె.

88


శా.

ఇంతీ యెవ్వరిదాన వెం దునికి ము న్నే మండ్రు నీనామ మి
క్కాంతారంబున కేల వచ్చితి జగత్కల్యాణ మీదేహ మ
త్యంతాయాసముఁ బొందఁజేసిననిమిత్తం బేమి నీ వేటికిన్
వంతం బొందినదాన వి ట్లనుడు నవ్వామాక్షి దాని ట్లనున్.

89


క.

చిరపుణ్యుఁడు జనకుం డను, నరపతిసుత సీత యండ్రు నన్ను నయోధ్యా
వరుఁ డగుదశరథధరణీ, శ్వరుకోడల నేను రామచంద్రునిభార్యన్.

90


వ.

అని చెప్పి తమవనవాసవృత్తాంతంబును గనకమృగంబుపిఱుంది రామలక్ష్మణు
లు సన్నతెఱంగు నెఱింగించి.

91


క.

మునినాథ విశ్రమింపుఁడు, జననాథుం డిపుడ వచ్చి సత్కారము మీ
కొనరించు ననిన రావణుఁ డనియెను భూపుత్రిఁ జూచి యధికప్రీతిన్.

92


క.

నీతెఱుఁగుఁ బతితెఱంగును, జేతోముద మొదవ నాకుఁ జెప్పితి వనితా
నాతెఱఁగు నాబలంబును, నీతో నెఱిఁగింతు వినుము నెయ్యం బొదవన్.

93


చ.

కమలభవుండు తాత గుణగణ్యుఁడు విశ్రవసుండు తండ్రి హే
మమయవినూత్నరత్నమయమండిత మాత్మపురంబు లంక వి
క్రమము త్రిలోకభీకర మఖండశుభాకర మైనదైత్యరా
జ్యమునకు నేను భర్తఁ బటుశౌర్యుఁడ రావణనామధేయుఁడన్.

94


సీ.

మృత్యువునైనను మృత్యువుఁ బొందింతు, నగ్నినైనను సమర్షాగ్ని నోర్తు
యమునైన లయకాలయముఁడ నై శాసింతుఁ, దపనునైనను నేఁ బ్రతాపతీవ్ర
తపనుఁడ నై మింతు ధనదుని నైనను, ఘనధనదుండ నై గర్వ మడఁతు
వజ్రి నైనను మహావజ్రినై వధియింతుఁ, బవను నైనను జండపపనుఁ డనఁగ
నెదిరి భంజింతుజగముల నెందుఁ బరఁగు, సుందరులఁ దెచ్చి భోగింతు సుందరాంగి
నీవిలాసంబు విని యాత్మ భావభవుని, చేత నలఁగి వచ్చితి వేయుఁ జెప్ప నేల.

95

వ.

[15]అని వెండియు.

96


చ.

నిన్ను విని కోర్కు లుల్లమున నెక్కొన ధైర్యము నుజ్జగించి యే
వనితలపొందు నొల్ల కిట వచ్చితి నచ్చెరు వారు నీవిలో
కనములు గాముబాణములకంటె మనంబును దూఱఁ జొచ్చె నం
గన ననుఁ దక్క నేలికొనఁ గాదె ముదంబున వేయు నేటికిన్.

97


సీ.

కుసుమితవనలతాకుంజపుంజములను, వరుసఁ జెన్నగు నుపవనములందు
మకరందమత్తాళిమధురగానంబులఁ, గొమరారు నెత్తమ్మికొలఁకులందు
సమయసూచకయంత్రసాలభంజిక లొప్పు, కృత్రిమాచలమహాగృహములందు
రమణీయబహుచిత్రరచనావిశేషంబు, లమరు నుత్తుంగహర్మ్యములయందు
నబల నాతోడ నీ వింక ననుదినంబు, లంక నకలంకలీలల లలితరతులు
సలుప నేతెంతుగా కొక్కచపలుఁ గూడి, ఘోరకాంతారభూములఁ గుంద నేల.

98


క.

అన విని రోషము మనమునఁ, బెనఁగొనఁ గంపంబుతోడఁ బృథ్వీసుత యి
ట్లను నట్టికమలజునకున్, మనుమఁడ వై తగునె యిట్టిమాటలు నీకున్.

99


క.

రామునకు నీకు హస్తికి, దోమకుఁ గలవాసి యతనిదుర్వారశర
స్తోమమునఁ బొలియఁదలఁచితొ, కో మదిమది నుండి యుండి కుత్సితచరితా.

100


మ.

అనుచున్ వెండియు రోషవిస్మయభయవ్యాలోలయై వీతధ
ర్ముని దుష్కర్ముని నిన్ను నే మునియ కా మోసంబునం బూజ సే
సినపాపంబున నిట్టు లాడి తకటా శీఘ్రంబ కాకుత్స్థును
గ్రనిశాతాస్త్రమహాగ్నిలో మిడుత వై కాలం దలం పెత్తెనే.

101


మ.

గరళం బెత్తుక క్రోలఁగాఁ దలఁచితే కష్టాత్మ కందర్పసం
హరుఁ జక్రాయుధుఁ బద్మజుం గడచునుద్యత్తేజు శ్రీరాము నె
వ్వనిఁగాఁ జూచెద వాఖరాంతకునితీవ్రక్రూరబాణాగ్నిచే
ధరణిం గూలెద వేల ప్రేలెదవు బద్ధస్పర్ధ దుర్వాక్యముల్.

102


వ.

[16]అనిన విని సక్రోధంబుగా నవ్వుచు నద్దశాననుం డి ట్లనియె.

103


చ.

పెఱుకుదునే ఫణీంద్రవిషభీకరదంష్ట్రలు నేలఁ గ్రుంగఁ జే

నఱతునె నింగి మ్రింగుదునె చండదిశాగజదండకాండము
ల్విఱుతునె వారధుల్ పుడిసిలింతునే మందర మంగుటంబునం
జిఱుముదునే జగంబు లఱచేతికిఁ దెత్తునె మత్తకాశినీ.

104

రావణుఁడు సీతను దొంగిలికొనిపోవుట

చ.

మదమున నింద్రుఁ డాదిగ సమస్తనిలింపుల వెట్టిగొన్ననా
యెదుర మృగాక్షి నీ వకట హీనపరాక్రము రాము గీముఁ జె
ప్పెద విటు సూడు న న్ననుచు బిట్టునిజాకృతితోడ నిల్చెని
ర్వదిభుజశాఖలుం బదిశిరంబులు నోజ యొనర్పఁ జూడ్కికిన్.

105


వ.

ఇట్లు నిలిచి తనదుభయంకరాకారంబునకు మూర్ఛం బొంది పుడమిం బడి యు
న్నజనకతనయం బొదివి పట్టి రథంబుపయిం బెట్టి లంకాభిముఖుండై గగనగమనం
బునం జన నయ్యింతియుం గొంతతడవునకుఁ దెలిసి దెసలు గలయం గనుగొని.

106


చ.

ననుఁ జెఱగొంచు రావణుఁడు నా నొకరక్కసుఁ డేఁగుచున్న వా
డినకులరాజరత్నమ శుభేక్షణ లక్ష్మణ తేరు వేగమై
చనియెడు రాఁగదే యెఱుక సాలక తమ్ముఁడ నిన్ను నప్పు డే
ననుచితభంగి నిష్ఠురము లాడినపాపఫలంబు గాంచితిన్.

107


ఓనరనాథ యిద్ధగతి నొక్కనిశాచరుఁ డాననంబు లీ
రేను ధరించినాఁడు నను నెక్కటిఁ దోకొనిపోవుచున్నవాఁ
డే నొకదిక్కు లేక యిదె యేడ్చుచుఁ జీరుచు నున్నదాన నీ
లోనన రాఁగదే నిఖిలకలోకశరణ్య మదీయరక్షకున్.

108


శా.

ఓహో నామొఱ యెవ్వరున్ విననియ ట్లున్నా రొకం డైన మీ
బాహాదర్ప మెలర్పఁ దాఁకఁ దగదే బందీవిమోక్షంబు మీ
కాహా పుణ్యము గాదె కీర్తి యరుదే యాలింపరే యోరి వై
దేహిం దెత్తువే యంచు నడ్డపడరే దిక్పాలు రీద్రోహికిన్.

109


ఉ.

వెండియు సీత శోకమున విహ్వలభావము తల్లడంబు నొం
డొండ మనంబునం గదుర నో రఘువల్లభ యో నృపాల యు
ద్దండత నన్ను నొక్కబలుదైత్యుఁడు వే కొని పాఱిఁ జొచ్చెఁ గో
దండభుజుండ వై కదిసి దానవుఁ ద్రుంపఁ గడంగవే వెసన్.

110

శా.

అన్నా లక్ష్మణ నిన్నుఁ బుణ్యనిధి నే నజ్ఞాన నై పల్కితిన్
న న్నాపాపము వచ్చి ముట్టకొనియెన్ నాపాలిదైవంబ వై
యిన్నీచుం బరిమార్ప వేగ పఱతేవే నన్ను రక్షింప మీ
యన్నం గ్రన్ననఁ జీరవే [17]యరుగవే యత్యుగ్ర శీఘ్రంబునన్.

111


ఉ.

(హా యను నో నరేంద్ర యను హా రఘుకుంజర నీవు వేగ రా
వే యను నెంతదూరమున కేఁగితొకో యను నాయెలుంగు విం
టే యను విన్న నీశరము లీతల లింతకుఁ ద్రుంచి వైవకు
న్నే యనుఁ గైకకోర్కి ఫలియించె బళీ యను దైవమా యనున్.

112


ఉ.

రాఘవుదేవిఁ దేరఁ దగురా యన రెవ్వరు నోర నిత్తెఱం
గాఘనబాహువిక్రమున కైనను జెప్పరు దన్నిరంతరా
మోఘశరాళి వీనిశిరముల్ దునుమాడువిధంబు సూడ రో
మేఘములార వేగ చని మీ రయినం బతితోడఁ జెప్పరే.)

113


వ.

అని యనేకవిధశోకాలాపంబులతోడ నందంద యాక్రందనంబు సేయుచు నలు
దిక్కులు సూచి.

114


సీ.

పావనాకార గోదావరీదేవి నీ, వెఱిఁగింపవమ్మ రాజేంద్రుతోడ
నో మాల్యవంత పుణ్యోన్నత గిరినాథ, చెప్పంగదే రాజసింహుతోడ
నో జనస్థానమహీజములార యీ, విధ మెఱిఁగింపరే విభునితోడ
నో దండకాటవి నున్నతాపసులార, నాపాటు చెప్పుఁడీ నాథుతోడ
నేను శ్రీరాముభార్య మీ రెవ్వ రైన, నడ్డపడి తాఁకి విడిపింపరయ్య కావ
రయ్య సురలార మునులార యక్షులార, యఖిలదిక్పతులార పుణ్యాత్ములార.

115


క.

అని ఘనశోకాతుర యై, పనవఁగ నయ్యేడ్సు వినియెఁ బక్షీంద్రుఁడు శా
తనఖాగ్రకులిశధారా, వినిహతభేరుండవిహగవిగ్రహుఁ డంతన్.

116


వ.

[18]విని యోహో వెఱవకు మే నున్నవాఁడ నిన్నీచుం బొరిగొని నిన్ను విడిపింతు
నని పలుకుచుం బెలుచ.

117


సీ.

తనయున్నగిరి బెట్టు తాఁచి బి ట్టెగసిన, నది శేషుపడగలఁ గుదియ నదుమ
జవముమై నెఱకలు జాడించువడిఁ బుట్టు, ధూళి మేఘంబులఁ దూలఁదోల
నిలునిలుమీ దైత్య నిను వ్రత్తునని పేర్చు, నదులుపు బ్రహ్మాండ మద్రువఁ జేయ
విపులకోపోద్రేకకవృత్తము లైననే, త్రములరశ్ములు రవిరశ్మి నెగుప
శరభసింహాదిమృగరక్తరసాంద్రశోణ, ఘోరచంచుప్రభాఘనక్రూరవక్త్ర
నఖరకులిశప్రచయసముకన్నతశరీరుఁ, డగుజటాయువు గదిసె నయ్యసురవీరు.

118

జటాయువు రావణునితోఁ బోరి నేలం గూలుట

చ.

కదిసి దశాస్య యేఁ గలుగఁగా రఘువీరునిదేవి నెట్లు నీ
కదయతఁ గొంచు నేఁగ వశ మంచు రథంబున కడ్డ మేఁగి యో
రి దనుజ సీత డించి సుచరిత్రతఁ బ్రాణముఁ గాచికొమ్ము కా
కది యిది యాడితేని నుఱుమాడుదుఁ గండలు రాల్తు మేదినిన్.

119


క.

ఓరి నిశాచర త్రిభువన, వీరుం డగు రాముదేవి విడువుము దనుజ
శ్రీ రాజిల్లఁగ బ్రదుకుము, కోరుదురే వెడఁగ కాలకూటము గ్రోలన్.

120


చ.

అఱుగునె యుక్కుగుండు కడు సంగద మ్రింగిన నూఁచి చూచినన్
విఱుగునె మేరుభూధరము వెంగలి వై రఘురాముభామినిం
జెఱగొని పోవఁ జూచెదవు చెచ్చెర నిప్పుడ యోరి నీచ నా
కఱపినబుద్ధిఁ గైకొనుము కాచెద జానకి డింపు మిమ్మహిన్.

121


క.

అని పలుదెఱఁగులఁ జెప్పఁగ, దనుజుఁడు గైకొనక యరుగఁ దలఁచి [19]కదలినన్
వినువీథి కెగసి మార్కొని, వెనుఁబడ నందంద బిట్టు వ్రేయుచుఁ గడిమిన్.

123


స్రగ్ధర.

చండాతిక్రోధదృష్టుల్ చదలఁ [20]బొదల భాస్వద్దశాస్యాంగసంధుల్
ఖండించుం జించు నొంచున్ [21]ఖరచరణనఖాగ్రంబులం బోఁజుఁ దే రు
ద్దండాటోపంబునన్ భూస్థలిఁ బడ నడుచున్ దంగడిం ద్రిప్పు నుద్య
త్సండీనోడ్డీనవృత్తిం ద్వరితగతి సముత్సాహసంరంభలీలన్.

124


క.

పెనుగాలిఁ దూలు మేఘం, బునుబోలెను బక్షివిభుని భూరిబలమునం
దన కెట్లు నరుగరా క, ద్దనుజురథము [22]దిరిగె నీఱతాఱల నడలన్.


సీ.

ప్రకటితోద్ధతి డాసి మకుటముల్ విఱిచిన, జల్లున రత్నసంచయము దొరఁగ
బెగడొంద నందంద మొగములు వ్రేసిన, భుగభుగ మని రక్తపూర మొలుక
రథ మాక్రమించి ఘోరంబుగా వీచిన, జిఱజిఱం దిరిగి పె ల్లొఱఁగఁ బడఁగ
సరభసంబుగ సితచ్ఛత్రధ్వజాదులు, విఱిచినఁ బెళపెళ విఱిగి కూలఁ
జాల సుడివడి దనుజుఁ డా[23]భీలరౌద్ర, భంగిఁ బదివిండ్లు నెత్తి యఃప్పక్షివిభుని
సూడుకొనఁజేసి తిరిగి వే ఱొక్క[24]దిక్కు, తెరువుగా సూడఁజూచిన నరుగనీక.

125


చ.

వెనుకొని పాఱుఁ బాఱి నడివీఁపు మహోగ్రతఁ దన్నుఁ దన్ని మా
ర్కొని వడి నొంచు నొంచి యిటకున్ దివికిం జన నిచ్చు నిచ్చి యే
నని వెస నార్చు నార్చి వెగ డందఁగ దందడిఁ జేరి దుర్దశా
వినిహతు నద్దశాసనుని వ్రేయు జటాయువు పేర్చి వెండియున్.

126

చ.

(కడఁగు కడంగు మోరి సురకంటక పోరికి నొండె జానకిన్
విడు విడు ధాత్రిపుత్రి యిదె వీని వధించెద నోడ కోడ కే
పడరఁగ వీఁడు వోవునె జటాయువుముందట నంచు వక్త్రముల్
వెడచఱువం బతత్రముల వేసి బలోద్ధతిఁ బేర్చి వెండియున్.

127


క.

దశముఖుఁడు వివిధముఖముల, విశిఖంబులు వఱవఁ బక్షవిక్షేపములన్
దిశలకు జడియుచు వెస న, ద్దశరథసఖుఁ డసమసమరదక్షత మెఱయన్.

128


శా

దట్టించుం గెరలించు నవ్వు రథ ముద్దండాగ్రతుండంబునం
బట్టుం గ్రిందికి నెత్తు నెత్తి మొగదప్పం ద్రిప్పు దర్పంబునన్
గిట్టుం జుట్టుప లార్చు నార్చు నెగయుం గేడించి పో వచ్చినం
జుట్టుం బాఱుచు వ్రేయుఁ బాయు నొడియుం జూడావళీరత్నముల్.

129


వ.

ఇ ట్లవక్రవిక్రమంబునం బరిభవించిన నన్నిశాచరుండు.

130


క.

నాళీకవిషశిలీముఖ, జాలము పైఁ బఱప నదియుఁ జరణాహితులం
దూలించిన మఱియుం బది, వాలమ్ముల నేసె నేసి వడి నార్చుటయున్.

131


లయవిభాతి.

తూణములు వోఁజదిపి బాణములు సక్కడిచి
                      పాణివలయస్ఫురిత బాణళితశ స్త్ర
శ్రేణి చెదరం జఱిచి వేణు వెడలించియును
                      రేణువులుగా మకుటకోణవిలసత్పా
షాణములు రాచి కవచాణువులు రాలిచి క
                      రేణుకరిభిత్సలలశోణతరతుండ
ద్రోణిఁ గొని దిక్కులకు శోణితముఁ జల్లుచుఁ బ్ర
                      హీణబలుఁ జేసి పటురాణ చెలఁగంగన్).

132


మ.

వడిఁ జుట్టుం జని యార్చుఁ చేర్చుఁ గదియన్ వచ్చున్ వెసన్ వ్రచ్చుఁ జే
డ్పడ నొంచుం గబళించుఁ జించుఁ దొలఁగున్ డాయున్ గదన్ వ్రేయఁ బో
వడి నొత్తున్ దివి కెత్తుఁ గిట్టుఁ గదియం బట్టుం బడంద్రోయు బ
ల్విడిఁ దాఁచున్ రుధిరంబుఁ బీల్చుఁ బెలుచన్ వీక్షించుఁ గ్రోధంబునన్.

133


వ.

ఇబ్భంగిం బొంగి పోనీక పొదివి యదల్చి మరల్చినం బిశాచవదనహయంబులం
గల్గిన యత్తేరు తిరుగుడువడినం బంక్తిముఖుండు తీవ్రనఖుం డగునప్పక్షిపతి నా
క్షేపించుచుఁ గ్రోధంబున బిట్టు దలపడియె నట్లయ్యిరువురు దొడరి చలంబును బ
లంబును గోపంబును నాటోపంబును దీపింపఁ జండగతి నొండొరుల సరకుగొనక
కల్పాంతకాలమేఘంబులవిధంబున గర్జిల్లుచు ఱెక్కలు గలబలుకొండలకైవడి
నొండొరుం జుట్టుకొని తిరుగుచు నత్యుగ్రవిగ్రహగ్రహంబులుంబోలెఁ దారా
పథంబున ఘోరంబుగాఁ బెనంగు నెడఁ బంక్తిముఖుం డాఖగపతిం గ్రూరనారాచం

బులు పదింట నొప్పించినం బ్రచండగతిం గదిసి కోదండంబు తుండంబు చేసి యెగ
యునెడ గదాదండంబు వైచినం దప్పఁ గ్రుంకి లంకేశ్వరునడితలల జొత్తు లెగయ
మొత్తినం జిమ్మ దిరిగి దశశిరుండు రౌద్రం బెసంగం గదిసిన నారాక్షసవీరుతేరిహ
యంబులు రెంటిని బఱియ లై పడం జఱిచి పె ల్లార్చినం గినిసి వింశతిబాహుం డి
రువదితోమరంబులం బఱఁగించి సొలయం జేసినం దూలి వేగంబ తెలిసి పయిం
బడి ముఖంబుల గళంబుల గండంబులఁ గండలు రాల్చుచుం జేరి సారథి జీరినఁ
బదంపడి రయమ్మున నడిదమ్ము బెడిదమ్ముగా విసరినఁ దొలంగ నుఱికి చనువాని
నక్కైదువునన వైచినం బతత్రిపతి తప్పించుకొని తిరిగి నొప్పించి చనునెడ దట్టం
బగునలుక పెలుచ నరదంబు విడిచి బిట్టెగసి కదిసి తలప్రహారంబుల సొమ్మ
వోవ నడిచి మగుడునెడ నంతన తెలిసి శకుంతవరుం డాదశవదను విపుల
పక్షంబు నఖకులిశంబుల భేదించిన నాతురుం డై యతం డరదంబునకు వచ్చి
నం దోడనె వచ్చి రథచక్రంబు భూచక్రంబునఁ బడఁ దన్నినం దూలి పొరలంబ
మనాలోనన హతశేషంబు లగురథఘోటంబులు రెంటినిం బొరిగొనియె నట్లు తే
రు వికలంబై యొఱగునెడ నేమఱక దశకంఠుండు జానకిం జంక నిఱికి సురుఁగం
జూచునాలోనన యతిక్రూరావక్రక్రోధంబున గ్రక్కునం గొని యమ్మేటితనువు
వెన్నునం గ్రొన్నెత్తురు దొరఁగునట్లుగా నూరియు నఖంబులం జీరియుఁ గంఠం
బుల నొగిల్చియు శిరంబులఁ బగిల్చియుఁ బార్శ్వంబులం జెండియు రక్తంబును
మాంసంబును బెల్లు దొరంగించిన రక్కసుం డొక్కెడ నక్కోమలి డించి యాగ్ర
హం బెసంగ డగ్గఱి యలిక నయ్యరుణతనయుం గలపడి యరుణపూరంబులు
నిజకరంబుల శిరంబులఁ జరణంబుల నురంబునం దొరంగం బెరిఁగిన యచ్చలంబు
నం బొలివోనిబలిమి కలిమి నతిఘోరంబుగాఁ బోరునానమయంబున.

134


మహా.

కినుకం బక్షీంద్రుఁ డుగ్రాకృతిఁ గదిసి దశగ్రీవు నందంద వ్రేయన్
ఘనరౌద్రోద్రేకభంగిం గదుము నదుము వేగంబుమైఁ జేరుఁ జీరు
వెనువెంటం బాఱుఁ బాఱు వెస నెడఁగుదియన్ వీచుఁ దాఁచుం గలంచుం
దనుసంధుల్ సించు నొంచుం దలలు నఱచు దుర్దాంతదర్పం బెలర్పన్.

135


క.

ఇత్తెఱఁగునఁ దను నొంపఁగ, నెత్తినకోపమున దానవేంద్రుండు విహం
గోత్తముఁ దలపడి కండలు, నెత్తురు బి ట్టొలుకఁ బోరె నిష్ఠురలీలన్.

136


సీ.

అంతకంతకు నెక్కు నాటోపములు గోప, ములు రౌద్రభావంబుఁ దనరఁ జేయ
బలుగోళ్లఁ బగిలియు బాహుల నొగిలియు, నఖిలాంగకములు వ్రయ్యంగఁ దొరఁగు
శోణితజలమున జొత్తిల్లుమేనులు, జేవురుఁగొండలచెలువు దాల్ప
నొండొరు నొవ్వంగ నుడుగక పెనఁగంగ, నొదవినదప్పుల నుదిలకొనుచుఁ
జలము శోభిల్ల నొండొరు సమయఁజేయ, వేగపడి పెల్లునొంచుచో వ్రేటుఁబోటు
నాటు నగపాటు నొండొరు లోటుపడక, దారుణంబుగఁ బోరి రవ్వీరవరులు.

137

చ.

ఇలకు నభస్థలంబునకు నేపున డిగ్గుచు నెక్కుచున్ వడిం
దలపడి వీఁక నొండొరులఁ దాఁక్రుచుఁ బాయుచుఁ దోర మైనయీఁ
కలుఁ బెనుఁగండలుం దొరఁగఁకగా ఖగదానవవీరు లిట్లు మూ
ర్ఛలఁ బడి సోలుచున్ సరభసంబునఁ దేఱుచుఁ బోరి రుగ్రతన్.

138


చ.

పొలియుదు గాక న న్నరుణపుత్రు జటాయువుఁ దాఁకి చాక పో
నలవియె నీకు నంచుఁ దెగటారుదు గాక దశాస్యుతోడుతన్
నిలిచి పెనంగఁగాఁ బులుఁగ [25]నీకు వశంబె యటంచుఁ బల్కుచున్
బలమున నొప్పఁ బోరి రటు పైకొని యొండొరు మీఱునాసలన్.

139


క.

(మ్రుచ్చిలి రఘునాయకుసతిఁ, దెచ్చినయ ట్లగునె దురము కే ధృతి చెడి పాఱం
జొచ్చితి విస్సీ మగతన, మచ్చుపడియె నిప్పు డంచు నలుకం జులుకన్.)


చ.

తడఁబడ మింటితుట్టతుదదాఁక రయంబునఁ బోవుచున్ మహిం
బడి పొరలాడుచుం గదిసి పాయక లంకియ లై పెనంగుచున్
విడువిడు మంచుఁ దీవ్రగతి [26]వ్రేయుచు నొంచినచోట నొంచుచుం
బడుపడు మంచు భూస్థలి నభస్స్థలిఁ బోరిరి దారుణోద్ధతిన్.

140


వ.

అయ్యవసరంబున.

141


చ.

తనువున నెల్లెడన్ రుధిరధారలు గ్రమ్మఁగ సత్త్వహీనుఁ డై
పెనుదగ యెత్తి యార్తిమెయిఁక బెల్కుఱి చంచువు పెల్లు విచ్చుచుం
గనుఁగవ సోల భూతనయఁ గన్గొనుచున్ వగ మానసంబునం
బెనఁగొనఁ జిక్కి పక్షిపతి పెద్దయుఁ దూలుచు నిల్చె భూస్థలిన్.

142


క.

అజుఁ డిచ్చిన వరబలమున, భుజబలమును నాత్మబలముఁ బొలు పఱక వెసన్
రజనీచరవరుఁ డి ట్లా, ద్విజవరుబల మఱుట సూచి తీవ్రస్ఫురణన్.

143


చ.

అరదము భగ్నమై పడిన యప్పుడు మేదినిఁ బడ్డఖడ్గ ము
ద్ధురగతితోడఁ బుచ్చుకొని తోరపుడప్పి వగర్చుచున్నభూ
ధరసమకాయు నాకసుఖధర్మమహీయు జటాయువున్ భయం
కరగతి డాసి వ్రేసె దశకకంఠుఁ డకుంఠితవిక్రమంబునన్.

144


క.

పఱియ లయి మేను వ్రస్సిన, నొఱగె మహీతలముమీఁద నుక్కఱి రుధిరం
బఱిముఱిఁ బెనుఁగాలువ లై, పఱవఁగ భూపుత్రి డిల్లపడి తల్లడిలన్.

145


వ.

[27]ఇత్తెఱంగునఁ బక్షిపతి భంజించి దశగ్రీవుండు మహానాదం బగుసింహనాదం

బు సేసిన జనకతనయ సంభ్రమంబునం బఱతెంచి య ట్లసిధారాదళితుం డై
ధరణిం బడి నెత్తుటం జొత్తిల్లి కొఱప్రాణంబులతో నున్న జటాయువుం గనుంగొ
ని వీరోత్తమా యింక నేది ది క్కని పెక్కుదెఱంగుల విలపింప నన్నిలింపారాతి
యు మగుడ వచ్చినతన్నుం గని భయంబుం బొంది యద్దేవి హారామ హారామ
యనుచు నొక్కవృక్షం బిరు గేలం బట్టికొని యీడిగిలంబడి యున్న బె ట్టదల్చి
తరువు విడిపించి యెత్తుకొని వియత్తలంబున కెగసి పఱవం దొడంగిన నయ్యింతి
పంక్తికంఠుని నిందించుచుం దిట్టుచు ని ట్లను నోరి పాపాత్మ రాముకోపానలంబున
సబాంధవంబుగాఁ ద్రుంగెదు ఘోరరౌరవంబున బ్రుంగెదు నిర్మూలం బయ్యెదు
వలదు విడిచి చను మని మఱియుం బెక్కువిధంబుల నార్తిమెయిం బలుకుచు
న్న వాఁడును దక్షిణాభిముఖుం డై చనుసమయంబున.

146


ఆ.

సకలమునులు శోకసంతాపములఁ బొంద, నంధకారభరిత మయ్యె జగము
నలువ బుద్ధిఁ జూచి నాకారిచే టింక, నిక్క మయ్యె ననుచు నిశ్చయించె.

147


ఆ.

అంత నఖిలదిశలు హారామ హానాథ, యనునెలుంగు వినుచు నడలఁ దొడఁగె
జనకతనయ నీడజాడ సింహాదిస, త్త్వములగములు వెంటఁ దగులుచుండె.

148


క.

పవనచలితశాఖాప, ల్లవము లభయహాసచేష్టలం బొనరఁ జెలం
గువిహంగంబులు రుతముల, నవనిసుతను వెఱకు వెఱకు మన్న ట్లుండెన్.

149


తే.

ఓలి శృంగంబు లెత్తిన కేలు గాఁగ, నిర్ఝరంబుల పెనుమోఁత నిగిడి బెరయ
గిరులు జనకరాజాత్మజపరిభవంబు, జగము లెఱుఁగ నాక్రోశించుపగిదిఁ దోఁచె.

150


క.

జనకజఁ జెఱగొనిపోవుట, జనులకు వినఁ జాటినట్లు జనితఝణఝణ
ధ్వనిఁ గేళిహంసఖ్యా, పనచణ మగుహంసకంబు పడియె మొరయుచున్.

151


స్మితలక్ష్మ సీతఁ బాసిన, గతిఁ గ్రొవ్వెద విరులు రాలెఁ గఠినకుచతట
చ్యుతహార మభ్రగంగా, వతరణనైపుణము మెఱసి వసుధం బొలిచెన్.

152


క.

నిజభూరితేజమున న, క్కజముగ వెలుఁగొందుజనకకన్య యుదంచ
ద్భుజమున మహోల్కఁబోలెను, రజనీచరుఁ డెత్తికొంచు రయమున నరుగన్.

153


క.

విలసిత మగుసీతాని, ర్మలవదనము నభమునందు రావణునంక
స్థలమున మెఱసెను మేచక, జలదము వెడలి చన వెలుఁగుచంద్రుఁడుఁబోలెన్.

154


క.

వనజదళాభము శుభకర, మును సితరదనాంశులలితమును నగుభూనం
దనముఖ మలరారదు రా, మునిఁ బాసి వినాళపద్మమువిధం బగుచున్.

155


క.

రామునిఁ బాసినకతమున, రామారత్న మగుసీతరమ్యానన ము
ద్దామవికాసశ్రీకిన్, ధామము గా కుండె దినసుధాకరుభంగిన్.

156


క.

సురుచిరపల్లవరుచిసుం, దరతను వగుసీతఁ గదిసి దశముఖుఁ డొప్పెం

బరఁగఁగఁ గాంచనకాంచిన్, నెరవుగఁ దాపించి యున్ననీలముఁబోలెన్.

157


క.

అలఘుశ్యామలవర్ణ ము, గలరావణుతనువుఁ జెంది కనకప్రభ శో
భిలుసీత నీలజలధర, కలితతటిల్లతికభంగిఁ గ్రాలుచు నుండెన్.

158


క.

జనకజభూషణగణని, స్వనముల దశకంధరుండు చాలఁగ మెఱసెన్
ఘనపదమున గురుతరగ, ర్జనములఁ దనరారు నీలజలదముకరణిన్.

159


క.

రమణీయ హేమరుచివి, భ్రమ యగునలసీతచేత రావణుఁ డొప్పెం
గమనీయకనకకక్ష్యం, గొమరారుచు నున్నభూరికుధరముపగిదిన్.

160


క.

అతిరమ్యము లగుధరణీ, సుతకనదతిశుద్ధకనకశుభభూషణముల్
క్షితిపైఁ బడియెను నిజస, ద్గతి చెడి భూమిఁ బడు తారకంబులపగిదిన్.

161


క.

ఖలుచేఁ జెఱఁబడి భీతిం, గలఁగెడుసీతఁ గని దైన్యకలితుఁడు విగతో
జ్జ్వలతేజుఁడు పాండురమం, డలుఁడును నై భానుఁ డుండె నభమునఁ జూడన్.

162


క.

నలినులు భీతిన్ ముకుళాం, చలలును విధ్వస్తవారిజలును నిరుచ్ఛ్వా
సలు నై యెంతయు నడలుచు, జలజాక్షికి శోక మొందుచాడ్పున నుండెన్.

163


క.

జనకజదైన్యము గనుఁగొని, వనదేవత లధికభీతి వడఁకుచు దుఃఖం
బున శోకించిరి గగనం, బున నాక్రోశించె నఖిలభూతావళియున్.

164


క.

క్షోణీసుత యపు డాత్మను, క్షీణవ్రత నైతి శత్రుచేఁ జెఱఁబడితిం
బ్రాణేశుం బాసితి నా, ప్రాణము లేమిటికి నాదుబ్రతు కేమిటికిన్.

165


క.

భూనాథుఁడు సౌమిత్రియు, నే నీగతిఁ జిక్కువడుట నె ట్లెఱిఁగెద రీ
మానసదుఃఖపయోనిధి, నే నెన్నఁడు దాఁటుదాన నెయ్యది గతియో.

166


వ.

అని వెచ్చ నూర్చి రోషావేశంబున రావణుం గనుంగొని.

167


ఉ.

అచ్చుగ మాయ పన్ని పతి నక్కడఁ బాయఁగఁ జేసి వంచనన్
మ్రుచ్చిలి నన్నుఁ దెచ్చుట సమున్నతశౌర్యముచొప్పె బంట వై
చెచ్చెరఁ బేరు సెప్పి యనిఁ జేవ నెదుర్కొనరాదె కొంతప్రొ
ద్దచ్చట నున్ననిన్ను విభుఁ డప్పుడ యమ్ముల గ్రుచ్చి యెత్తఁడే.

168


క.

ఖరదూషణాదిరాత్రిం, చరులం బదునాల్గువేల సంగరభూమిం
బరిమార్చుట యెఱుఁగవె యా, ధరణీశ్వరుఁ గడిమిఁ దొడరఁ దరమే నీకున్.

169


కాలము సేరిన మనుజుఁడు, బాలిశచిత్తంబుతో నపథ్యములఁ గొనం
జాలిఁబడుఁ గాని తనకున్, మే లగుపథ్యములు గొనఁగ మెయికొనఁ డాత్మన్.

170


మ.

జములోకంబున కేఁగుచోఁ గనెదు యుష్మత్కంఠముల్ కాలపా
శములం గట్టి ప్రచండభంగిఁ దిగువన్ క్షారామ్లకల్లోలసం

భ్రమవద్వైతరణీతరంగిణిని దుర్దాంతాసిపత్రాటవీ
సముదగ్రాయసకంటకోగ్రకనకాంచచ్ఛాల్మలీవృక్షమున్.

171


క.

నావిశ్రుతసుకృతము చెడుఁ, గావున నే నిపుడు నిన్నుఁ గనలి శపింపన్
రావణ నన్నుం దగవున, భూవిభుకడ కనిచిపుచ్చు పుచ్చక యున్నన్.

172


శా.

రక్షశ్శిక్షణదక్షరామవిశిఖవ్రాతంబు లోలిన్ భవ
త్పక్షాపేక్షసమక్షరాక్షసబలాధ్యక్షాక్షయక్రవ్యముల్
పక్షిక్షుద్గతరూక్షవక్త్రములకున్ భక్షింప వే పెట్టి నీ
దక్షప్రక్షిపదక్షికుక్షిగళదోర్గర్వంబుఁ జెండాడెడున్.

173


చ.

అని పలుకంగ సీతను దశాస్యుఁడు దోకొని సంతసంబుతో
వనములు భూరిశైలములు వాహినులుం గమలాకరంబులుం
గనుఁగొనుచున్ నరేంద్రుదెసఁ గల్గువెఱన్ దెస లోలిఁ జూచుచున్
ఘనతరచాపముక్తపటుకాండరయంబున నింగి నేగఁగన్.

174


ఉ.

ఆయెడ సీత యొక్కవిపులాచలశృంగమునందు లీలమైఁ
బాయక యున్నవీరకపిపంచకముం గని యుత్తరీయకౌ
శేయము భూషణంబులును జేరఁగ వైచెను మీఁద రామభూ
నాయకుతోడ నాతెఱఁగు నమ్మఁగఁ జెప్పుదు రన్ తలంపునన్.

175


క.

ఆవరభూషణముల సు, గ్రీవుఁడు దాఁపంగఁ బంచెఁ బ్రియమునఁ బంక్తి
గ్రీవుఁడు సీతాసహితుం, డై వారాశి వడిఁ జేరె నాసమయమునన్.

176


క.

జలచరములు తిరుగుడువడ, జలరాశి గలంగ సిద్ధచారణులు నభ
స్తలమున ని ట్లనిరి ఖలుం, డలవఱి యింకన్ గతాసుఁ డయ్యెడు ననుచున్.

177


క.

ధర్మనిధి యైనరాముస, ధర్మిణి నెత్తికొనిపోయె దశముఖుఁ డింకన్
ధర్మంబు మఱి యహింసా, కర్మము నార్జవముఁ దగవుఁ గలవే లంకన్.

178

రావణుఁడు సీతను లంకయం దుంచుట

వ.

అనునంత నారావణుండును దనపాలిమృత్యుదేవతయుంబోలె సీత తోడరా
సముద్రంబు గడచి లంకాపురంబు సొచ్చి వివశురా లయినసీతను డించి త్రిజట
రప్పించి యారక్కసితోడ ని ట్లనియె.

179


చ.

మణిగణకమ్రకాంచనసకమంచితభూషణతారహారముల్
ప్రణుతదుకూలవస్త్రములు భాసురసౌరభపుష్పమాలికా
గణములు చందనాదిబహుగంధములున్ మఱి యెవ్వి గోరు ను
ల్బణమతి వాని నన్నిటిని బైపయి నీసతి కిండు వేడుకన్.

180


క.

తరుణీపురుషులలో నె, వ్వరు విమతులు వారు సూడ వల దీచెలువం

బరుసము లాడకుఁ డెవ్వరు, పరఁగఁగఁ గొలువుండు కదిసి పలుకుఁడు ప్రియముల్.

181


వ.

అని పలుక నాత్రిజటయు సీత నంతఃపురంబులోనికిం గొనిపోయె నప్పుడు రావ
డాత్మం జింతించి యధికవిక్రము లైనయెనమండ్రురాక్షసుల రప్పించి వార
లతోడ.

182


క.

సమరమున సకలరాక్షస, సముదాయముఁ గడిమిఁ ద్రుంచి సర్వజనస్థా
నము నిశ్శేషజనస్థా, నముగం జేసి జయ మంది నరుఁ డొకఁ డరిగెన్.

183


శా.

ఆకూటవ్రతతాపసుం గలనఁ బాయం ద్రుంచునందాఁకఁ జి
త్తైకాధీనత నిద్ర లేక వగతో నే నున్నవాఁడన్ మదిన్
నాకార్యంబు ఫలింప నాచపలుని న్మర్దించి బాహాజయో
త్సేకం బొప్పఁ దదీయమాంసమునఁ బక్షిశ్రేణి రక్షింపుఁడా.

184


వ.

మీ బలంబు లెఱుంగుదు మీ రింక జనస్థానంబున కరిగి నాపగ దీర్చి యచట
నుండుం డనుచుఁ బలుక నారక్కసులు దండప్రణామంబు లాచరించి రావణు
వీడ్కొని దర్పంబు లెసంగ జనస్థానంబున కరిగిరి.

185


క.

అంతం గృతకృత్యుం డై, సంతోషముఁ బొంది రాక్షకసవరేణ్యుఁడు భూ
కాంతునికాంతన్ మనమునఁ, జింతించి మనోజదళితచిత్తుం డగుచున్.

186


ఉ.

మున్ను లతాంగిఁ బెట్టినసమున్నతగేహము సొచ్చి యచ్చటం
గన్నుల బాష్పపూరములు క గాఱఁగ నేడ్చుచు దీనవక్త్ర యై
విన్నఁదనంబుతో వగల వేఁగుచుఁ బల్మఱు వెచ్చ నూర్చుచుం
జెన్నటిపాణిపల్లవము సెక్కిటఁ జేరిచి కుందుసుందరిన్.

187


తే.

భయదరాక్షసభామలు బలసి కొల్వ
వఱలుమృగయూథముఁ దొఱంగి వచ్చి యుగ్ర
శునకసంహతి చేరువఁ జుట్టుముట్టి
యుండుమృగిభంగి నున్నయయ్యువిదఁ జూచి.

188


సీ.

హాటకప్రాసాదహర్మ్యసంకులమును, భామాసహస్రవిభ్రాజితంబు
స్ఫటికవిద్రుమరౌప్యబహువజ్రవైడూర్య, శాతకుంభస్తంభసంభృతంబు
కలధౌతక రిదంతకమ్రగవాక్షంబు, భూరితోరణరత్నభూషితంబు
కమనీయతపనీయఖచితభూతలమును, భర్మవిచిత్రసౌకపానయుతము
వివిధరత్నప్రభాజాలవిభ్రమంబు, చారుదుందుభినిర్ఘోషపూరితంబు
నైనమందిరరాజంబు నడరుకోర్కి, సీతతోఁ గూడఁ జేరి యాసీతఁ జూచి.

189


క.

ఇవె నాదివ్యాంబరతతు, లివె నావరభూషణంబు లివె నారంగ
ద్భవనము లివె నారత్నము, లివె నాధనకనకగృహము లివె నాలక్ష్ముల్.

190

క.

కల విన్నియు నీయవి నా, నెలఁతలు నీదాసు లేను నీదాసుఁడ న
ర్మిలిఁ గవయము నీప్రాణం, బులు నాకును జీవితంబు పూర్ణేందుముఖీ.

191


చ.

కొలఁకుల సైకతస్థలులఁ గోమలచూతపరీతవల్లికా
విలసితకుంజపుంజముల విభ్రమకేళిగుహాగృహంబులన్
సులలితహర్మ్యసౌధముల శోభితపుష్పవనాంతరంబులన్
వలసినచోటులన్ రతులు వారక సల్పుద మిచ్చలారఁగన్.

192


క.

యావన మస్జిర మెంతయుఁ, గావున యౌవనము వేగ గడచనకుండన్
నీవును నేనును నిమ్ముల, భావజరతి సలుపవలయుఁ బరమప్రీతిన్.

193


క.

అనిలముఁ బట్టఁగ నలవియె, కనదనలము మ్రింగఁ దరమె కాలాంతకు గె
ల్వను శక్యమె లావున నె, వ్వనికి లంకాపురంబు వశమే కదియన్.

194


ఆ.

కాన రాముఁ డిటకుఁ గడిమితోఁ జనుదేరఁ, గన్నులారఁ జూతుఁ గాంక్షతోడ
ననువిచార ముడిగి యంగన నాతోడఁ, గాముకేళి సలుపు ప్రేమతోడ.

195


క.

లలన పురాకృతదుష్కృత, ఫలమున వనవాస మొంది బహుతరదుఃఖం
బులు గుడిచి తింక సత్కృత, ఫలమున నీటఁ బొందు సకలభాగ్యశ్రీలన్.

196


చ.

పొలఁతుక పుష్పగంధములు పూని సమంచితరత్నభూషణం
బులు మృదులాంబరంబులును బోఁడిగఁ దాల్చుచుఁ జెన్ను మీఱ నే
బలిమిఁ గుబేరునిన్ గెలిచి బాగుగఁ గొన్న రవిప్రకాశ మై
యలరుచు నున్నపుష్పకమునందు రమింపుము కోర్కు లారఁగన్.

197


క.

తిరముగ నీపదములు నా, శిరములపైఁ బెట్టు వేగ చేకొను న న్నా
దరమున మ్రొక్కెద నీకుం, దరుణీ వశ్యుండ నైతి దాసుఁడ నైతిన్.

198


మ.

సురయక్షాసురపక్షిదానవభటకస్తోమాహిగంధర్వకి
న్నరులం దెవ్వఁడు లేఁడు నాకు సముఁ డెన్నం జేవ నాముందటన్
నరుఁడున్ దీనుఁడు రాజ్యహీనుఁడును క్షీణప్రాణుఁడుం గాననాం
తరవాసుండును నైనరాముఁడఁట యుద్ధక్రీడలన్ వాలెడున్.

199

సీత రావణునిం బదరుట

సీ.

అని పల్క నిశ్శంక నాసీత తృణ మడ్డ, ముగఁ బెట్టుకొని పంక్తిముఖుని కనియె
దశరథుఁ డనురాజు ధర్మశీలుఁడు సత్య, సంధుఁ డౌనమ్మహీశ్వరునిపుత్రు
డమరేంద్ర సదృశుండు నతిపుణ్యచరితుండు, పితృవాక్యపాలుండు భీమబలుఁడు
నమ్మహాత్మునిపత్ని నతిసాధ్వి నన్నిటు, వంచనఁ గొనివచ్చి వదరె దీవు

లంక వైధవ్యకలిత యై పొంక మడఁగి
నేలపాలుగఁ జేసి నీ వేల త్రుంగె
దనుజుఁడును దాను నారాముఁ డరుగుదెంచి
యఖిలబలములతోడఁ జక్కాడు నిన్ను.

200


మ.

ఉరుగర్వంబున నన్నుఁ బట్టికొని నీ వుద్వృత్తిమై రాఁగ నా
ధరణీనాథుఁడు గన్న నప్పుడ జనస్థానంబునం దుగ్రుఁ డై
ఖరునిం గూల్చినరుక్మపుంఖచయనిర్ఘాతచ్ఛటావిస్ఫుర
చ్ఛరజాలంబుల నీయుదగ్రగళముల్ చక్కాడి తున్మాడఁడే.

201


క.

లీలను రామునిపటుశర, జాలము లోలి భవదీయసన్నాహంబుం
దూలించున్ వడి గంగా, కూలము నురుతరతరంగకులములుఁబోలెన్.

202


క.

దేవాసురాదులయెడం, జావక మనునిన్ను విభుఁడు చంపెడు నింకన్
రావణ చెడ నున్నది నీ, జీవము యూపగతపశువుజీవము భంగిన్.

203


క.

జలజారి నేలఁ గూల్చిన, జలనిధు లింకించినం గృశాను శమింపం
గలిగిన నిన్నున్ రాముఁడు, బలదర్పశ్రీ నడంచి పరిమార్చు వెసన్.

204


క.

ప్రీతిఁ బతి నెపుడుఁ బాయని, సీతకు దైవగతి ఖలునిచేఁ బడవలసెన్
వే తనతమ్ముఁడుఁ దానును, భూతలపతి యిటకు వచ్చి పొడమినకిన్కన్.

205


మ.

కలనన్ నీబలవిక్రమోచ్చయమనోగర్వంబు నింకించి చం
చల మందన్ భవదీయగాత్రముపయిన్ శాతాశుగోదగ్రవృ
ష్టులు చాలం గురియించి నిన్నుఁ బరిమార్చున్ శౌర్య మేపార నీ
ఖలబంధుక్షణదాచరావలులకుం గాలంబు సేరెం జెడన్.

206


సీ.

పాపాత్మ నను నీవు బలవంతముగఁ బట్టి, కొని పోవ నేను నాకులతఁ బొంది
పలుమాఱు నాక్రోశములు సేసి యవశగా, నుండు నామూర్తి నీయొద్ద నెట్లు
ద్విజమంత్రపూతయు వినుతస్రుగ్భాండస, మన్వితయును నైనయజ్ఞవేది
చండాలవాటిక నుండఁగా నర్హంబె, కాన నా కీకష్టకాయ మేల
యింక బహుభాష లాడంగ నేను జాల, వేగ నామేని ప్రాణముల్ విడుచుదాన
ననుచు నాసీత పరుషవాక్యములు పలికి, యూరకున్న నారావణుం డువిదఁ జూచి.

207


క.

ద్వాదశమాసంబులకుఁ ద, లోదరి నన్ను వరింపకుండిన మేనిన్
భేదించి పలలములు క్ర, వ్యాదులకున్ నమల నిత్తు నని మఱి కిన్కన్.

208


క.

బలిమిఁ బడఁదిగిచి యీతొ, య్యలిగాత్రము వ్రచ్చి వేగ నస్రామిషముల్
నలి సేవింపుం డనఁ బ్రాం, జల లై నతి బలసి రాక్షసస్త్రీ లుండన్.

209


చ.

కనలి సమస్తరాక్షసులఁ గన్గొని యాదశకంఠుఁ డి ట్లనున్

జనకజ మీ రశోకవనసద్మమునం దిడికొంచు నింతిఁ ద
ర్జనముల సాధువాక్యములఁ జక్కటి సెప్పి మహీజ నాకు నిం
పెనయఁగ వశ్యఁ జేయుఁ డని యిమ్ముగఁ బల్కిన నన్నిశాచరుల్.

210


క.

భూమిజ నశోకవనికా, భూమికిఁ గొనిపోయి యచటఁ బొలు పగుచోటన్
సేమమునఁ బెట్టికొని వి, శ్రామంబున నుండి రోలి జతనము గాఁగన్.

211


క.

అవనిజ లక్ష్మణుఁ దనప్రియుఁ, డవురామవిభుం దలంచి యాత్మను వంతల్
గవియఁగ నుండెను నచ్చట, నవశగతిన్ క్షుత్తృషాకృశాంగంబులతోన్.

212


వ.

అంత నిక్కడ.

213


శా.

మారీచుం బరిమార్చి వేగమున రామక్షోణినాథుండు రా
మారత్నం బగుసీతఁ జూడఁగఁ బ్రకామప్రీతి నేతేరఁగా
ఫేరుక్రూరదురారవంబు పెలుచన్ భీమంబుగాఁ బర్వఁ ద
ద్భూరిధ్వాన మమంగళం బగుట నాభూనాయకుం డాత్మలోన్.

214


క.

తలఁ కొందుచు ని ట్లను నతి, బలుఁ డగు లక్ష్మణుఁడు లేనిపట్టున సుగుణో
జ్జ్వల యగుసీతకు దుర్దశ, దలకొనియెనొ దుష్టయాతుధానులవలనన్.

215


క.

ఆమారీచునికృత్రిమ, భీమస్వరము విని సీత బెగ్గిలి వింటే
రామునియార్తధ్వానము, నే మయ్యెనొ వేగ మరుగవే విభుకడకున్.

216


క.

అనుచుం గడుదీనతతో, జనకజ పంచిన మదీయసన్నిధికి వెసం
జనుదేరఁగ లక్ష్మణు నా, యనుజునిఁ జంపిరొ మహోగ్రు లైననిశాటుల్.

217


తే.

అశనిసంకాశభీషణం బైననాని, శాతబాణంబు నెఱ నాటి చచ్చునపుడు
నాయెలుంగున హాలక్ష్మణా హతోస్మి, యనుచు మారీచుఁ డనునీచుఁ డవనిఁ ద్రెళ్లి.

218


క.

ఆదుస్సహనాదము విని, యేదుర్దశఁ బొందిరో మహీపుత్రియు నా
సోదరుఁడును వారికిఁ గీ, డాదెసఁ గాకుండుఁ గాక యనుచును వగతోన్.

219


క.

సౌమిత్రికి భూపుత్రికి, సేమంబులు గలుగ నాత్మఁ జింతించుచు ను
ద్దామజవం బెసఁగఁగ నా, రామవిభుం డాశ్రమము సొరం బోయెడిచోన్.

220


క.

తా మప్రదక్షిణంబుగ, భూమీశునిఁ దిరిగి వచ్చి పొరిఁ బక్షిమృగ
స్తోమము లఱవఁగఁ గనుఁగొని, యాముందట ననుజుఁ గాంచె నతిదీనముఖున్.

221


క.

మనమునఁ గుందుచు భిన్నా, ననుఁ డై లక్ష్మణుఁడు గదిసి నన్ వామకరం
బున నల్ల దిగిచి రాముఁడు, దనతమ్మున కిట్లనియె వితర్కము లారన్.

222


ఉ.

పంబినవేడ్కతో మరలి పద్దతి వచ్చుచుఁ బెక్కుదుర్నిమి

త్తంబులు గంటి నన్ను వసుధాసుతతో నెడఁబాపి చాల దూ
రం బెలయించి తెచ్చె మృగరాక్షసుఁ డీవును సీత నుగ్రదా
వంబున డించి నాకడకు వచ్చితి గావున భీతి పుట్టెడున్.

223


క.

పుడమిసుతఁ బాసి లక్ష్మణ, యెడదవ్వుల నీవు వేగ మేతేర నినుం
బొడగాంచినయప్పుడ నా, యెడమదెసభుజమును గన్ను హృదయము నదరెన్.

224

లక్ష్మణుఁడు సీతను విడిచి వచ్చినందులకై రాముఁడు చింతించుట

క.

జగతీసుత యట నీల్గెనొ, ఖగమృగరాక్షసచయంబు గ్రహియించెనొ య
మ్మగువ మనశత్రుఁ డొక్కం, దగణితశక్తిఁ జెఱగొంచు నరిగెనో వత్సా.

225


చ.

ఎన యగు రాజ్యమున్ విడిచి యే నతిదీనుఁడ నై చరింపంగా
వనములఁ దాను నావెనుక నా కతిదుఃఖసహాయ మై ప్రియం
బునఁ జనుదెంచె సాధ్వి నృపపుత్రిక వేగమ డించి వచ్చి తా
జనకజ యెట్టు లున్నది ప్రచండతిరాటవి నాకుఁ జెప్పవే.

226


క.

కమలాక్షి లేని ధరణీ, సముదంచితరాజ్య మేల చనఁగ ధనేశ
త్వము నొందఁగ నేటికి నా, కమరత్వం బేల జీవ మది యేమిటికిన్.

227


క.

అమలగుణ నమరకన్యా, సమ నుర్వీతినయఁ బాసి క్షణ మైనం బ్రా
ణముతో మనఁ దగ సన్న్యా, సము నొందఁగఁ గోరెదను బ్రశస్తము గాఁగన్.

228


క.

ప్రాణములకంటెఁ బ్రియ యగు, ప్రాణిశ్వరి సీతఁ బాసి ప్రాణంబులతో
క్షీణదశ బ్రదుకుకంటెను, బ్రాణంబులు విడుచు టధికభద్రము నాకున్.

229


క.

జనకజయు నేను లేమికి, మనమునఁ గౌసల్య వంది మరణము నొందుం
గని కైక వేగ గ్రమ్మఱఁ, జనురాజ్యము సేయఁ బురికి సమ్మద మారన్.

230


మ.

ఖరు నేఁ జంపినయానిమిత్తమున నుగ్రక్రోధి యై రాక్షసే
శ్వరుఁ డుద్దండనిశాటులం బనిచినన్ వా రుద్దతిన్ వచ్చి నా
వరపత్నిన్ గ్రహియించిరో యడవిలో వైదేహి న న్బాసి యా
తురతం దూలుచు నెంతబెగ్గలముతో దుఃఖంచి శోకించునో.

231


క.

సుదతి నటు గాచుకొని తగఁ, గదలక యుండు మని నిన్నుఁ గావలివెట్టన్
మది వెఱ కుగ్రాటవి మీ, వదినెను ని ట్టేల విడిచి వచ్చితి చెపుమా.

232


వ.

అనిన విని సౌమిత్రి యన్నతో నిట్లనియె.

233

లక్ష్మణుఁ డన్నతోఁ దాను సీతను విడిచివచ్చినందులకుఁ గారణము నెఱిఁగించుట

క.

అలమారీచుఁడు దవ్వుల, బల మఱి నీపలుకు గాఁగఁ బటుమతితోడన్
బలుకఁగ నజ్జనకజ బె, గ్గల మందుచు నిట్టు లనియెఁ గడుదైన్యమునన్.

234


మ.

అలఘుం డారఘురాముఁ డాతురదశన్ హాలక్ష్మణా భ్రాతృవ

త్సల రక్షింపుము వచ్చి న న్ననుచు నత్యార్తశ్రుతిం బల్కె న
వ్వల నే మయ్యెనో రాముఁ డావిభునిఁ గావన్ వేగ నీ వేఁగ వే
కలఁగంబాఱెడుఁ బ్రాణమున్ మనము శంకం బొందెడిం దమ్ముఁడా.

235


వ.

అని సీత పల్కిన నేఁ దలంకక భవత్సామర్థ్యంబు నుద్దేశించి యి ట్లంటి.

236


క.

అనిమిషులకు రక్షకుఁ డగు, మనుజేశ్వరుఁ డేల తనదుమానము సెడి న
న్నును రక్షింపుము లక్ష్మణ, యనునీకష్టంపుమాట లాడును దన్వీ.

237


క.

మూఁడుజగంబులలోపల, వాఁడిమగంటిమిఁ గడంగి వడి నాలమునన్
వేఁడిమితో మార్కొన నె, వ్వాఁ డోపును రామవిభుని వాసవశౌర్యున్.

238


క.

ఇది యొకరాక్షసకృత్యము, మది వెఱవకు మనుచు నెన్నిమాఱులు దర్పం
బొదవఁగఁ దను బోధించిన, హృదయము పదిలింపలేక యెడపనిచింతన్.

239


చ.

కనుఁగవ బాష్పముల్ దొరఁగ గద్గదకంఠముతోడ నేడ్చుచున్
మనమున దుఃఖ మొందుచును మానము దూలఁగ దీనవక్త్ర యై
ననుఁ బలుమాఱు నార్యనుత నావిభుఁ గావఁగఁ బోఁ గదయ్య నీ
వనుచు భయార్తితోఁ బలుక నజ్జనకాత్మజఁ జూచి వెండియున్.

240


క.

కన్నీ రేటికి నించెదు, విన్నఁదనం బేల నీకు వెఱ పేమిటికిన్
నన్నేటికిఁ బొ మ్మనియెదు, మున్నే మాయన్నశౌర్యమును నెఱుఁగ నొకో.

242


వ.

అని పలికిన నుపశమింపక రోపారుణనేత్ర యై నన్ను ని ట్లనియె.

243


తే.

అన్న యాపద నొందంగ నాత్మ నడల
నేను బనిచిన విభువెన్క నేఁగ మొగియ
వధిపునార్తఘోషము విని యటకు నరుగ
వగ్రజుని చేటు గోరి పో వచటి కీవు.

244


క.

పాయక పో నాఁ బోవవు, నాయెడ నేయెగ్గు దలఁచినాఁడవొ యిట భూ
నాయకుఁడు లేనిచోటను, దాయాదులచిత్తవృత్తి తగ వెట్టిదియో.

245


వ.

అని సీత న న్నచట నుండరాకుండ నిష్ఠురోక్తులు పల్కిన సైరింపలేక మిమ్ముం
గాన వచ్చితి ననిన రాముండు రోషించి లక్ష్మణుం గనుంగొని.

246

శ్రీరాముఁడు లక్ష్మణునితో సీత నొంటి విడిచి వచ్చినది త ప్పని చెప్పుట

ఉ.

చారుకులాభిమానమును సన్నుతధర్మము వీటిఁబుత్తురే

యారుచిరాంగి వేగపడి యప్రియవాక్యము లెన్ని యాడినన్
సైరణసేయఁగాఁ దగదె చండమృగోరగరాక్షసోగ్రకాం
తారములోన నయ్యబలఁ దమ్ముఁడ యొక్కత డించి వత్తురే.

246


క.

ఆయింతి నిన్నుఁ బొమ్మన, నాయానతిఁ దప్పి నీమనంబున నతిలో
పాయత్తుఁడ వై నీ విటు, నాయొద్దకు నేల వచ్చినాఁడవు వత్సా.

247


శా.

అన్నా నన్ను బలాఢ్యుఁగా నెఱుఁగు దీ వన్నాతి శోకార్తిమె
నిన్నుం బల్కిన నంతనంత నయినన్ నీ వుండ వై తింతకున్
నన్నున్ నిన్నును నేఁచు దానవులు మానం బూన మై పోవఁగా
నన్నాతిం గొనిపోవకుండుదురె యయ్యబ్జాననం గ్రూరతన్.

248


క.

అని పలికియు మృగరూపం, బున న న్నెలయించుకొనుచుఁ బో దూరము పో
యిన నెఱిఁగి యిద్దురాత్ముఁడు, ఘనవంచనశీలుఁ డంచుఁ గడుఁగోపమునన్.

249


శా.

ఆరాత్రించరు నుగ్రబాణమున నేయం బల్విడిం దాఁకి వి
స్ఫారోరస్స్థలిఁ గాఁడినంత మృగరూపం బేది యస్మద్ధ్వనిన్
ఘోరార్తశ్రుతి దిక్కు లం జెలఁగ నాక్రోశించుచున్ రాక్షసా
కారుం డై ధరఁ గూలి చచ్చె నురురుక్తం బుర్విపైఁ గ్రక్కుచున్.

250


క.

అని పలికి యాత్మలోపల, జనకజఁ దలపోయుచున్ విచారముతోడన్
జనవిభుఁడు జనస్థానము, ననుజుండును దానుఁ జొచ్చి యయ్యెడఁ ద్రోవన్.

251


చ.

ఎడనెడ రామభూవిభుఁ డనేకవిధంబుల దుర్నిమిత్తముల్
పొడగని యాత్మలో భయముఁ బొందుచు లక్ష్మణుఁ జూచి యి ట్లనుం
గడు నశుభప్రకారములు గానఁగ నయ్యెడి నేమి కీడు పొం
దెడునొ కుమార యంచు నతిదీనత నేఁగెను బర్ణశాలకున్.

252

వ.

అ ట్లేఁగి ముందట.

253

రాముఁడు పర్ణ శాలయందు సీతం గానక పలవించుట

సీ.

చంద్రిక లేనినిశాగగనముమాడ్కి, శారిక లేనిపంజరముకరణి
నలినసంతతి లేనికొలనికైవడి రేయి, దీపిక లేనిమందిరముపగిది
నూనైకఫలరాజి లేనియారామంబు, గతి నాస లేనివక్త్రంబుభంగిఁ
జెలఁగుకోయిల లేనియెలమావిచాడ్పున, నినదీప్తి లేనిదుర్దినమునట్లు
చారుమౌర్వి లేనిచాపదండమునోజ, లలితతండ్రి లేనియొళగుఁబోలె
నవనితనయ లేనియావాస మంతయుఁ, బాడువాఱి యుండఁ బార్థివుండు.

254


క.

ఉల్లము జ ల్లన దేహము, దిల్లవడఁగ దృతి దలంక దెప్పర మొందం
దల్లడముతోడ నుటజం, బెల్ల వెదకెఁ బ్రియను గాన కెంతయు భీతిన్.

255


క.

పొలఁతుక మెలఁగెడుచోట్లం, గలయంగా వెదకి యెచటఁ గానక కడువి
హ్వలుఁ డగుచుఁ బర్ణశాలకు, లలిఁ గ్రమ్మఱ వచ్చి చూచి లక్ష్మణుతోడన్.

256


తే.

తిరిగి వచ్చినచోటులు దెలివితోడఁ, గలయ వెదకియు నెచ్చటఁ గానలేక
పర్ణశాలలోపల లేదు బాల యంచుఁ, జెప్పి యధికాతురతభ్రాంతచిత్తుఁ డగుచు.

257


క.

ఏమెయి నడుగులు లేనిది, యేమరుదో పర్ణశాల యిది గాదొకొ మే
రాముఁడఁ గానో రాముఁడు, రామం బెడఁబాసి క్షణము బ్రతుకఁగఁ గలఁడే.

258


వ.

అని పలికి.

259


శా.

ఏమె ట్టీయది మెట్టు గా దిది వనం బే రాకుమారుండనో
సౌమిత్రీ విను నీవు రాముఁడవె వత్సా నిక్క మే రాముఁడన్

భూమీశుండవు రామచంద్రుఁడవు హా భూమిజ చంద్రాననా
యేమే యెక్కడ నున్నదాన విట రావే యుల్ల మల్లాడెడిన్.

260


శా.

ఈతిగ్మాంశుఁడు నేఁపఁ జొచ్చె నను రే యేనాఁట నర్కాస్పదం
బీతం డిందుఁడె యౌనొ లక్ష్మణుఁడ నీ కే మౌదు నేఁ జెప్పుమా
నాతోఁబుట్టువు గావె నాథ మఱి యే నాథుండ నిక్కంబుగా
సీతానాథుఁడ వెందుఁ బోయితివె యో సీతామనోవల్లభా.

261


చ.

తపనుఁడు వేఁపఁ జొచ్చె ననుఁ దమ్ముఁడ వృక్షముక్రిందఁ బెట్టు నాఁ
దపనుఁడు రేయి లేఁడు వసుధావర చంద్రుఁడు గాని చంద్రునిన్
నృపసుత యెఱింగితివి నీవు మృగాంకము చూడ నున్కి హా
చపలమృగాక్షి చంద్రముఖి జానకి యెక్కడ నున్నదానవే.

262


వ.

అని పలికి మఱియు విభుం డి ట్లనియె.

263


చ.

పొలఁతుక నొక్కఁ డెత్తికొని పోయెనొ యొక్కెడ బ్రుంగెనో భయా
నలమునఁ గ్రాఁగెనో తరుణి నాశము నొందెనొ జీవ మూడెనో
యలరులు గోయఁబోయెనొ ఫలావళి కేఁగెనొ యించువాంఛమైఁ
గొలఁకుల కేఁగెనో నదికిఁ గోరికఁ బోయెనొ యెందుఁ బోయెనో.

264

సీ.

తాళంబ కానవే తాళఫలస్తనిఁ, గుందంబ కానవే కుందరదనఁ
దిలకంబ కానవే తిలకరమ్యలలాటఁ, గమలంబ కానవే కమలవదన
హరిణంబ కానవే హరిణబాలేక్షణ, సింహంబ కానవే సింహమధ్యఁ
బికరాజ కానవే పికమంజులస్వనఁ, గీరంబ కానవే కీరవాణి
లలితకలభంబ కానవే కలభగమన, బంధుజీవమ కానవే బంధుజీవ
మైనజనకనందన సీత ననుచు రాముఁ, డచట నచట నీగతి వాని నడిగి యడిగి.

265


క.

నాకాంతఁ బాసి యెంతయు, శోకించుచు నున్నవాఁడ శుభతరకృపతో
శోకాపనుద యశోకమ, శోకము వారింపు న న్నశోకుం గాఁగన్.

266


వ.

మఱియు మనోభ్రమ గప్పి యతండు.

267


మ.

రమణిం దవ్వుల నున్నయట్లు కడుదూరం బార్తితోఁ బాఱి వృ
క్షము లడ్డంబుగ నాకుఁ గానఁబడు కిచ్చన్ డాఁగి నీ వేటికిన్
భ్రమ నొందించుచు దుఃఖ పెట్టుచు ననున్ బాధింపఁ బాలింప వే
గమ రావే పొడసూపవే పలుకవే కామాతురుం గావవే.

268


తే.

ఏను జూడంగ నెంచాఁక నేఁగె దీవు, ప్రేమ నామీఁదఁ గల్గినఁ బ్రియముతోడఁ
దడవు సేయక వచ్చెదఁ దమక మొంది, పీతికౌశేయవాసిని సీత నిలువు.

269


తే.

దీను భగ్నమనోరథుఁ దీవ్రశోక, తప్తు ననుఁ బాసి లక్ష్మణ ధరణిపుత్రి
యెందుఁ జనియె నస్తాద్రిసమేతుఁ డైన, జలజహితునిఁ దత్ప్రభ పాసి చన్నకరణి.

270


చ.

ధరణిజ కుంభికుంభలసితస్తనయుగ్మముఁ దియ్యవాతెఱన్
సరసిజశస్తహస్తములఁ జంద్రనిభాస్యముఁ గంబుకంఠమున్
గరభనిభోరులన్ మృదులగాత్రముఁ జంపకచారునాసికన్
వరసకలాంచితాంగముల వాంఛ గ్రసించిరి మాంసభక్షకుల్.

271


వ.

నావుడు లక్ష్మణుం డేల చింతాశోకంబులం బొందెదు దేవ నీదేవి వెదకం బొదం
డనుచు నచటు వాసి పోవునెడ.

272

క.

పడుచును లేచుచుఁ బాఱుచు, సుడిపడుచును దెసలు గలయఁ జూచుచుఁ బెదవుల్
దడుపుచు ననుజునివెన్నడి, నడలుచు నయ్యైవనంబు లరయుచు వగతోన్.

273


క.

ఘన మగునజ్ఞానాంబుధి, ననుపమవిజ్ఞానభానుఁ డస్తంగతుఁ డై
నను దుర్భ్రాంతితమిస్రము, మనమునఁ బర్విన విభుండు మతి సెడి యడవిన్.

274


సీ.

అదె చలత్తన్వంగి యనుచు నల్లన చేర, నది చూతలత యైన నట్ల నిలుచు
నదె మంజులాలాప యనుచు నల్లన చేర, నది కోకిలం బైన నట్ల నిలుచు
నదె లోలలోచన యనుచు నల్లన చేర, నది కురంగం బైన నట్ల నిలుచు
నదె నీలకుంతల యనుచు నల్లన చేర, నది మయూరం బైన నట్ల నిలుచు
నదె మహీజ నన్ను నచటికై చేసన్న, చేసె ననుచు నల్లఁ జేర నదియు
లలితమలయపవనచలితపల్లవ మైన, నట్ల నిలుచు రాముఁ డచట నచట.

275


ఉ.

హా యను సీత సీత యను నక్కట యెక్కడఁ బోయి తిందు రా
వే యను నిల్వు నిల్వు మను నీగతిఁ జీరెద నాదుపల్కు విం
టే యను వేగ మో యనఁ గదే యను నీశుభదర్శనంబు నీ
వే యను నన్నుఁ బాయఁ జనునే యను నాదటఁ జూడవే యనున్.

276


శా.

ఏలా చిక్కులఁ బెట్టె దియ్యడవిలో నేలే ననుఁ జేర వే
యేలే జానకి పిల్చినం బలుకవే యేలే కృపం జూడ వే
యేలే తాలిమిఁ బట్టఁ జూల సరసం బెందాఁక నీ వాడెదే
యేలే దూరపరిశ్రమాగతుని న న్ని ట్లేల కారించెదే.

277


క.

ప్రీతిగ లక్ష్మణ యెక్కడ, సీతం బొడగంటె నాకుఁ జెప్పుము వేగం
బాతతదుఃఖం బందఁగ, భ్రాతా నాతోడ నేల పలుకవు వత్సా.

278


ఉ.

అంబురుహాస్య నాకడఁ బ్రియంబుగ నుండఁగ నాకు దర్భత
ల్పంబులు హంసతూలికలపానుపు తా ఫలకందమూలభ
క్ష్యంబులు నోలి నా కమృతకల్పము లౌఁ బరఁగంగ నా కర
ణ్యంబులు నౌ నయోధ్య యగు నాకుటజంబులు దివ్యగేహముల్.

279


వ.

అని పలికి పురోభాగంబునం బొలుచు భూమిం గీ లెడలి పడినతొడవులు మొగ్గ
లు మాల్యంబులుం బొడగని రాముండు సౌమిత్రితో ని ట్లనియె.

280


ఉ.

భూమిజతప్తకాంచనవిభూషణబృందములుం బ్రసూనముల్
భూమితలంబునన్ నెరసి పోఁడిగ నున్నవి పోలఁ జూచితే
యామహిపుత్రి నిచ్చట రయంబున దైత్యులు ద్రుంచి వైచి తా

రామిషమున్ గ్రహించి ముద మందుచుఁ బోయినవారు లక్ష్మణా.

281

రాముఁడు సీత నరణ్యంబులందు వెదకుట

వ.

అనుచు ననుజసమేతుం డై క్రోశమాత్రం బాశ్రమంబు గడచి రాముం డగ్రభా
గంబున నత్యద్భుతం బైనవిధ్వస్తధరణిపతితరణోపకరణంబులం బొడగని సౌ
మిత్రిం జూడు మని పలికి.

282


సీ.

కనకభూషితము ముక్తామణిసహితంబు, నగుభగ్నధను విదె యనుజ చూడు
శతశలాకము మాల్యచయశోభితవిభిన్న, దండము నగునెల్లి ధాత్రిఁ జూడు
బాలార్కసదృశంబు బంధురహైమంబు, వైదూర్యగుణరాజి వరుసఁ జూడు
మతివిశీర్ణము ధరాపతితంబు నగుతను, త్రము సూడు నుగ్గెనరథము సూడు
కనకవర్మముల్ ధరియించి ఘనపిశాచ, ముఖములును గల వేనడములు ధరిత్రిఁ
బడినవివె చూడు తపనీయబాణతతులు, నెరసియున్నవి దగఁ జూడు ధరణిఁ గలయ.

283


వ.

అని లక్ష్మణునకుం జూపి యంతరంగంబున.

284


క.

జనకజఁ బాసినదుఃఖం, బున కోర్వఁగఁ జాల కేను బొలిసి దివికి వే
చసిన ననుం గనుఁగొని మ, జ్జనకుఁడు మది రోసి లో నసమ్మతుఁ డగుచున్.

285


మ.

మునివృత్తిం బదునాలుగేం డ్లడవిలో మోదించి వర్తించెదం
జన నే నంచుఁ బ్రతిజ్ఞ నాయెదుర నిచ్చం జేసి యాకాల ము
ర్వి నొగిం బూర్ణముగాఁ జరింప కిటకున్ వీఁ డేటికిన్ వచ్చినాఁ
డని నన్నుం గడుఁ గామచారుఁ డనృతుం డత్యంతదోషుం డనున్.

286


మ.

హరిణాభేక్షణఁ గుంభికుంభకుచఁ బద్మాస్యం బికోదంచిత
స్వర బింబాధరఁ జారునీలకచపాశన్ సీత నీకాన భీ
కరశార్దూలమృగేంద్రకుంజరచరత్కాకోలరాజీశుకో
త్కరకేకివ్రజముల్ బహుక్రమములం గారించు భీతిల్లఁగన్.

287


తే.

అనుచు సీతఁ గానక మది వనటఁ బొందు, నన్నఁ జూచి లక్ష్మణుఁ డాత్మ ఖిన్నుఁ డగుచు
దేవ శోకంబు వలవదు దేవి నెల్ల, యెడల వెదకుద మని పల్కి యిట్టు లనియె.

288


క.

నలినికిఁ బోయెనో కానకు, నలరులు గోయంగ లీల నరిగెనొ వెన శై
వలినికిఁ జనియెనొ మనమన, ములు సూడఁగ డాఁగి యీరమున నున్నదియో.

289


క.

మనలన్ వెఱపింపఁగఁ గా, ననమున నున్నదియొ డాఁగి నవ్వులకై మా
టున నడఁగియుండఁ బోలును, జనకజ వెదకంగ మనము సనవలయు నృపా.

290


వ.

అని పలికి యన్నతోఁగూడ నొక్కకమలాకరంబు సేరి యప్పుడు.

291

క.

చలదంబుజసైకతశై, వలచక్రొత్పలతరంగవరబంధూకం
బుల నడరునలినిఁ బొడగని, కలఁగి నరేంద్రుండు మోహకకలితుం డగుచున్.

292


మ.

అదె వైదేహి ప్రసన్నవక్త్ర మదె రమ్యం బైనవేణీభరం
బదె వృత్త
స్తనయుగ్మ మల్లదె మనోకజ్ఞాకారనేత్రద్వయం
బదె రాజద్వళిపంక్తి సూడు మదె సేవ్యం బైనశ్రోణీభరం
బదె యం దున్నది డాఁగి సీత జలలీలాసక్తిమై నావుడున్.

293


వ.

అతం డచ్చట లేదు సీత యొండెడ నున్నది వెదక నటకు మనము వోవలయు.

294


క.

అనవుడు నగుఁ గా కని తన, యనుజుండును దాను నచటి యగసానుగుహా
వనముల వెదకి మహీనం, దనఁ గానక రాముఁ డనియెఁ దమ్మునితోడన్.

295


క.

చాలఁ బరీక్షించితి మీ, శైలంబున నెచట భూమిజం గాన మయో
లోలాక్షి యేమి యయ్యెనొ, నా లక్ష్మణుఁ డనియె వగచునవ్విభుతోడన్.

296


క.

జననాథ నీవు శోకం, బునఁ దూలకు వేగ సీతఁ బొందెదు నెయ్యం
బున విష్ణుఁడు భుజశౌర్యం, బున బలి బంధించి భూమిఁ బొందినభంగిన్.

297


వ.

అనవుడు రాముండు దుఃఖవాక్యంబుల సౌమిత్రి కి ట్లనియె.

298


చ.

సరసుల సైకతస్థలుల శైలనితంబములన్ గిరీంద్రగ
హ్వరముల సింధుతీరముల నాతతమార్గములన్ వనంబులం
దరువులచల్లనీడల నుదంచితకుంజతలంబులందు ని
ర్ఝరముల భూబిలావలుల సానుసమీపనివాసభూములన్.

299


చ.

వెదకితి మెల్లచోట్లఁ బృథివీసుతఁ గానమ యింక నేమి సే
యుద మని సొమ్మఁబోవు మఱి యొయ్యన దేఱు విషాద మొందు గ
ద్గదనినదంబులోఁ బలుకుఁ గామిని వోయితి వింక నేగతిన్
బ్రదుకుదు నెందుఁ బోదు నినుఁ బాసి శరీరముతోడ మైథిలీ.

300


వ.

అని విచారించి రాముం డంతరంగంబున.

301


సీ.

చపలదృష్టులఁ గని శార్దూలములు సంపు, నధరంబుఁ గని చిల్క లలమి యేఁచుఁ
జారుమధ్యముఁ గని శరభముల్ మననీవు, నెమ్మోముఁ గని యళుల్ నెగులు పెట్టు
ఘనవృతకుచములఁ గని సింహములు నొంచుఁ, గరములు గని కురంగంబు లలఁచు
సురుచిరోరులు గని కరులు బెగ్గిలఁజేయుఁ, గేశపాశముఁ గని కేకు లొడుచుఁ
గోమలశ్రుతి విని కాకకులము లడుచుఁ, గాన కానలో సీతకుఁ గలదె సేమ
మనుచుఁ జింతించు వగఁ దూలు నడలి యడలి, రామ వెదకి కానఁగ లేక రామవిభుఁడు.

302

క.

వనట నిటులు విలపించుచు, ననుజుఁడు బోధింప మాన కాతురపడుచుం
గనుఁగవ నశ్రులు రాలఁగ, ఘనబాహులు మీఁది కెత్తి గగనోన్ముఖుఁ డై.

303


క.

భావజలీలలఁ బ్రియమునఁ, గావించు సుఖోపభోగకాలంబుతఱిన్
నావల్లభ ననుఁ బాసిన, నే వందెదఁ గాఁకఁ ద్రిభువనేశ శచీశా.

304


వ.

అని యా క్రోశించి సౌమిత్రిం గనుంగొని.

305


క.

మందాకిని కేఁగి మహీ, నందన కమలములు గోసి నలువున లీలం
జెందఁగ నున్నది లక్ష్మణ, పొందుగ నీ వచటి కేఁగు భూమిజఁ జూడన్.

306


క.

అని పలికిన సౌమిత్రియు, ఘనవేగమునఁ జని యచటఁ గలయ మహీనం
దనఁ జీరి వెదకి కానక, జనపతితోఁ జెప్ప లేదు జనకజ యంచున్.

307


తే.

అప్పు డఖిలభూతంబులు నాదశాస్యు, చావుకొఱకు మందాకిని నీవు పోయి
రామవిభుతోడఁ జెప్పుము భూమితనయ, వార్త యనవుడు నానది వచ్చి యెలమి.

308


క.

రామునితో దశకంఠుఁడు, భూమిజ నెత్తుకొని వేగ పోయెను లంకా
ధామంబున కని చెప్పుచు, నామందాకిని నిజాలయంబున కరిగెన్.

309


వ.

అంత రాముండు సౌమిత్రితో నిట్లను మందాకినిని జనస్థానంబునం బ్రస్రవణ
గిరులను వెదకితిమి సీత నెక్కడం బొడగాన మనుచు దుఃఖించు చున్న యన్నను
లక్ష్మణుం డూరార్చి యొక్కెడ సీతం బొడగనియెదము గాక యనుచుం బలుక
నప్పుడు రాముఁడు పుష్పదామంబు గని సౌమిత్రి కి ట్లనియె.

310


తే.

భూమిసుతశిరంబున నున్న పుష్పమాల, నేలఁబడియున్నయది దీనిఁ బోలఁ జూడు
మనుజ విరు లివె నెరసిన వవనిపుత్రి, యుండనోపు నీఘన మగుకొండమీఁద.

311


వ.

అని పలికి రోషావేశంబున నన్నగంబు మిడుఁగుఱులు వాఱం జూచి రాముం
డి ట్లనియె.

312


క.

సీతం జూపక యుండిన, నీతరుసానువులు నాదునిష్ఠురబాణ
వ్రాతాగ్నిఁ గాల్చి భస్మీ, భూతంబులు గాఁగఁ జేసి పుచ్చెదఁ గడిమిన్.

313


క.

ఈతటిని నిగురఁజేసెద, శాతోగ్రాస్త్రముల ననుచు జగతీస్థలి న
త్యాతత రావణుపదములు, సీతపదంబులును గాంచి క్షితిపతి యచటన్.

314


క.

పొడగని సౌమిత్రికి న, య్యడుగులు సూప నవి సూచి యాలక్ష్మణుఁ డె
క్కుడు భీతిఁ బొందె రాముఁడుఁ, దడయక వి ల్లెక్కు పెట్టి తమ్ముని కనియెన్.

315


క.

నాకడ జానకి యుండఁగ, నాకాలుఁడు సపరివారుఁ డయ్యును గాంతన్
వే కదియ లేఁడు రక్కసుఁ, డాకసమున కేఁగినాఁడొ యవనిజతోడన్.

316

వ.

ఆకాశం బలక్ష్యం బేరికిం బోరాదని పలికి.

317


క.

వైదేహిఁ గొంచు రక్కసుఁ, డేదిక్కున కరిగినాఁడొ యెంతయు వగతో
నాదిక్కున కేఁగఁగవలె, నేది యుపాయంబు మనకు నింకం జెపుమా.

318


వ.

అనవుడు లక్ష్మణుండు రామునితో ని ట్లనియె.

319


క.

అలఘుఁడు దుఃఖముఁ బొందిన, నలఁగక బుద్ధి ధృతిఁ బెంచునల్పుఁడు దుఃఖం
బలమిన ధృతి సెడి మునుఁగును, జలములలో శిలలు మునుఁగుచాడ్పున నధిపా.

320


క.

శోకముఁ బొందినవానిన్, భీకరరోగములు సెందుఁ బృథులార్థంబుల్
సేకుఱవు నాని కెప్పుడు, శోకము గని విడుచువాఁడు సుజ్ఞాని నృపా.

321


క.

ఓలిం గడు శోకించెద, వేలా యజ్ఞుగతిఁ గార్య మేమఱి యాప
త్కాలంబునఁ గార్యము సెడి, బాలిశుఁ డత్యంతశోకపరుఁడై పొలియున్.

322


వ.

నావుడు రాముండు లక్ష్మణుం గనుంగొని.

323


ఉ.

తమ్ముఁడ నీదువాక్యములు తప్పక సేసెద నంచుఁ బల్కి క్రౌ
ర్యమ్మున శాంతి వోవిడిచి యాగ్రహ మొందుచుఁ జంద్రికన్ వినా
శమ్ముగఁ జేసి మించు రవించందమునన్ వెలుఁ గొంది ఘోరకో
ప మ్మడరంగ రామజనపాలుఁడు లక్ష్మణుతోడ ని ట్లనున్.

324


ఉరుధర్మాన్వితుఁ డైనమజ్జనకునర్థోదారవాక్యమ్మునన్
ధరణీరాజ్యముఁ బాసి దీన యగుమాతన్ డించి యత్యంతభా
స్వరధర్మంబుఁ బురస్కరించుకొని యిచ్చన్ దండకారణ్యముం
బరఁగం జొచ్చియు ధర్మవృత్తిఁ దప మొప్పం బూని యే నుండఁగన్.

325


క.

సీత మృతిఁ బొందఁ జూచుచు, భూతంబు లుపేక్ష సేసె భూమీశులు నా
పూతవ్రతఁ గాచి ననుం, బ్రీతాత్మునిఁ జేయ రైరి పృథ్వీశసుతా.

326


క.

మృదువర్తనుఁ గరుణాన్విత, హృదయుని దాంతియుతు లోకకహితకరు నన్నుం
ద్రిదశేంద్రుఁడుఁ గరుణింపఁడు, మది దుర్బలుఁ డైనహీనమానవుఁ బోలెన్.

327


క.

ఏ ని ట్లాక్రోశింపఁగ, నూనినకృప నన్ను శోక మొందఁగ నేలా
మాను మన రెవ్వరును నా, జానకిఁ జూప రటు గాన సరభస మెసఁగన్.

328


క.

నాలలనఁ జూపకుండిన, నీలోకము లెల్లఁ ద్రుంతు నేకక్షణమున్
లోలాక్షిం బాసి మనం, గాలేను జగత్త్రయంబు గల్గిన నేలా.

329


శా.

అస్మచ్చాపవిముక్తబాణముల నుద్యద్భూతలం బంతయున్
భస్మీభూతము సేసి యిందుభగణప్రద్యోతనాకాశమున్

విస్మిత్యన్వితబాహుశౌర్యమున నుర్విం గూల్చి కల్పాంతకో
గ్రస్మర్తవ్యమహోద్ధతిన్ సకలలోకప్రాణులన్ ద్రుంచెదన్.

330


వ.

అని వెండియు.

331


మ.

ధరణీనందనఁ జూప కుండిన నమర్త్యశ్రేణి బాధించెనన్
వరుసన్ యక్షపిశాచరాక్షసచమూవర్గంబు నుగ్గాడెదం
బొరి గంధర్వుల సంహరించెద మహాభూతంబులం ద్రుంచెదన్
నరులం జంపెదఁ గిన్కఁ గిన్నరులఁ జండక్రీడఁ జెండాడెదన్.

332


చ.

వరుస నజాండభాండములు వ్రయ్యలుగా జలరాసు లింక భూ
ధరములు నుగ్గునూచముగ ధారుణి ధూళిపటంబు గాఁగ నం
బర మినచంద్రతారకసమాజముతో నిలఁ గుప్పఁ గూర ది
క్కరిశిరముల్ దెగంగఁ ద్రిజగంబులు చూర్ణము గాఁగఁ జేసెదన్.

333


ఉ.

అప్పుడు భీతిఁ బొంది కమలాసనముఖ్యులు సీతఁ దెచ్చి
కప్పన సేసి సమ్మదము నందుచు నేఁగెద రింకఁ జీవమైఁ
దప్పక చూడు నాబలము తమ్ముఁడ నీ వని పల్కి కన్నులన్
నిప్పులు రాలఁ గోపమున నిష్ఠుర చాపముఁ గేలఁ బూనినన్.

334


చ.

గగనము మ్రోసి బి ట్టవిసెఁత గన్కని నుల్కలు రాలె నెల్ల చో
దిగిభము లోలి వ్రాలె జగతీతల మల్లలనాడె నేడు పె
న్నగములు సంచలించె సురనాయకుఁ డాకులపాటు నొందె ము
జ్జగములుఁ దల్లడిల్లె రవించంద్రులు దప్పఁ జరించి రయ్యెడన్.

335


వ.

అప్పుడు సీతాహరణదుఃఖితుండును నతితప్తుండును నుష్ణదీర్ఘనిశ్వాసుండును నధి
జ్యశరాసనుండును నై లోకంబులు గాల్చు కాలాగ్నియుంబోలె దక్షాధ్వరధ్వం
సంబు సేయఁ బూనిన రుద్రుండునుంబోలె దుర్నిరీక్ష్యుం డై యున్న యన్నం
జూచి ప్రాంజలి యై వినయవాక్యంబుల సౌమిత్రి యిట్లనియె.

336


క.

లోకైకశరణ్యుండవు, లోకత్రాణుఁడవు సర్వలోకేశుఁడవున్
లోకహితంబుగ రాక్షస, లోకముఁ బరిమార్తు గాక లోకారాధ్యా.

337


క.

వికృతి యొనర్చినఖలుఁ ద, క్కక శిక్షింపంగఁ జంపఁ గర్తవ్యము గా
కొకఁ డపరాధము సేసిన, సకల జగత్త్రయముఁ జంప జనునే దేవా.

338


క.

మును నీవు భూతహితవ, ర్తనమునఁ బెంపొంది యిపుడు తద్దయు రోషం

బునఁ గడఁగి భూతహింసన, మొనరింపఁగ నాగ్రహించె దుచితమె నీకున్.

339


క.

తరణికిఁ దేజంబు సుధా, కరునికిఁ గళ పవనునికిని గమనంబు వసుం
ధరకు ధృతి నైజ మనుగతి, నరనాయక నీకు దమము నైజగుణ మిలన్.

340


క.

సురగంధర్వప్రభృతులు, ధరణీశైలాపగాబ్ధిధాత్రీజాదుల్
నరవర నీ కేయపకృతి, యరయఁగ గావించె జగములం దెవ్వాఁడున్.

341


వ.

జనవర నీకు నప్రియంబు సేయంగలవాఁడు లేఁ డేనును నీవునుఁ గూడి యధిక
ప్రయత్నంబున గిరుల నదుల వనంబుల బిలంబులం గమలాకరంబుల సముద్రం
బుల దేవగంధర్వకిన్నరగరుడోరగామరలోకంబుల సర్వదిగంతంబుల వెదకి సీతా
పహరునిం గానకున్న మనకు దేవతలు వాని నప్పగింపకున్న మీఁద సచరాచ
రంబు లైనలోకంబుల నిర్ఘాతసంకాశబాణంబుల నిరవశేషంబుగాఁ జేయుదము
మొదట యుక్తక్రమంబున ధర్మంబు నడపి యటమీఁద రాజు నర్హదండక్ర
మంబున వర్తించు టొప్పు నని పలికి లక్ష్మణుండు మఱియు నిట్లనియె.

342


క.

ఆపద సమస్తలోకులఁ, బ్రాపించుఁ దొలంగు నపుడు పవనముభంగిం
బై పడునాపద సైఁచిన, భూపాలా క్షణములోనఁ బొందు శుభంబుల్.

343


వ.

రఘువరా యల్పతేజుం డైనసామాన్యుండు దుఃఖంబు సహింపనోపునె యార్తుం
డైననరునికి విజ్ఞానం బేల కలుగు నెవ్వం డాపన్నుండు గానివాఁడు గలండు న
హుషం డింద్రసాలోక్యంబు సెడి యధఃపతితుండు గాఁడె మహర్షిశ్రేష్ఠుం డైన
వసిష్ఠునికిఁ బుత్రశతంబు విశ్వామిత్రుచేత హతిం బొందదె లోకనేత్రంబు లైన
చంద్రమార్యులు రాహుగ్రస్తులు గారె సర్వభూతంబులు దేవాసురులు వినాశ
గతులు గారె కాన నినుబోఁటితత్త్వదర్శులు త త్త్వంబు బుద్ధిం దలపోసి ప్రా
జ్ఞు లై శుభాశుభంబు లొందినఁ బొంగక తలంకక సంతసింపక దుఃఖింపక ధీరు
లై యుండుదురు నీవు బృహస్పతిసమానబుద్ధిమంతుండపు నీయట్టియధికబలప
రాక్రమవిజ్ఞానగరిష్ఠుండు సీతానిమి త్తంబున నజ్ఞునిగతి నుండి దుఃఖించు టుచి
తం బగునే మన మెవ్విధంబున నేని సీతాపహరునిం బరిమార్చి పుణ్యసమేత యైన
సీత సాధించి తెత్త మనిన రాముం డనుజువాక్యంబులకు సంతసించి లోకంబుల
సంహరింప నెత్తిన కోపం బుడిపి యతని కి ట్లనియె.

344


క.

ఎక్కడ నున్నది జానకి, యెక్కడఁ బో నగును వెదక నేది యుపాయం
బక్కామినిఁ గన నెయ్యది, దక్కక సేయుదము సెపుమ తమ్ముఁడ నెమ్మిన్.

345

వ.

అనిన సౌమిత్రి యన్నతో నిట్లను నీజనస్థానంబునం గలగిరిదుర్గవనబిలంబులు
నదులుం గిన్నరగంధర్వనిలయంబులుం ద్వరితగతి వెదకుదము నీయట్టి బుద్ధిసం
పన్ను లైననరో త్తము లాపదలకుం గంపింపరు వాయువేగంబునకుం జలియింపని
శైలంబులుంబోలె నని పలికిన లక్ష్మణసహితుం డై రాముం డాజనస్థానంబునం
గలయన్నిచోట్ల వెదకి సీతం గానక పాటోపంబునఁ జాపంబు గ్రహించుచు
నగ్రభాగంబున.

346

జటాయువు సీతావృత్తాంతము రాఘవులకుఁ జెప్పుట

క.

పక్షంబులు దెగి ఘోరా, జి క్షితిఁ బడి యున్నరక్తశసిక్తాంగు నుద
గ్రక్షోణిధరాకారునిఁ, బక్షీంద్రు జటాయువును నృపాలుఁడు గనియెన్.

347


వ.

కని రాముఁడు లక్ష్మణునితోడ.

348


ఉ.

వీఁ డొకరక్కసుం డెడరు వేచి మహీసుత మ్రింగి యిచ్చటన్
వాఁడిమి వాలుచున్ మనము వచ్చు టెఱింగి విహంగవేషి యై
పోఁడిగ నున్నవాఁ డనుజ భూరిపరాక్రమ మొప్ప వీనిఁ గ్రొ
వ్వాఁడిశరంబులం దునిమివైచెద నంచు మహోగ్రబాణమున్.

349


క.

వడిఁ గొని యేయం బూనినఁ, గడుభయమున రుధిరధార గ్రక్కుచు విభు న
ప్పుడు గని జటాయు వనుఁ గృప, యడరఁగ నోరామ రామ యార్తశరణ్యా.

350


క.

ఏను జటాయువ దశరథ, భూనాయకుసఖుఁడ రామభూవర మీరల్
లేనియెడ సీతఁ గొంచు ద, శాననుఁ డరుగంగ వాని నాఁగి కడంకన్.

361


ఉ.

ఏపున వానిఛత్రము మహీస్థలిఁ గూలిచి జోడు సించియుం
జాపము ద్రుంచివైచి బహుసాయకముల్ విదళించి వాజుల
న్రూ పడఁగించి తద్రథము నుగ్గుగ మోఁది నఖాళిఁ జంచుని

క్షేపములన్ గళద్రుధిరసిక్తశరీరునిఁ జేయఁ జెచ్చెరన్.

352


వ.

అలుకు గొని యన్నిశాచరుండు.

353


మ.

విరథుం డై సతి డించి బెగ్గలమునన్ వేగంబుతోఁ బాఱఁగా
బిరుదారన్ వెనువెంటఁ బాఱి కడు దప్పిం బొంది యే నుండ భీ
కరఖడ్గంబునఁ బక్షముల్ దెగి పడంగా చేసి యాపంక్తికం
ధరుఁ డుర్వీసుత నెత్తికొంచుఁ జనియెన్ దర్పాతిరేకంబునన్.

354


వ.

అని పలుకుజటాయువుం బట్టి కౌఁగిలించుకొని సౌమిత్రిసమేతుం డై రాముండు
మహారోదనంబు సేసి యతిదుఃఖంబున.

355


సీ.

రామభూవిభుఁ డఫ్డు సౌమిత్రి కి ట్లను, రాజ్యంబు తొలఁగు టరణ్యవాస
మును దండ్రిచావును జనకజ వోవుట, మొదలుగ శోకాబ్ధి మునిఁగియుండ
నాపక్షమున వచ్చి యీపక్షినాథుఁ డా, తతవజ్రవాగురఁ దగులుపడియెఁ
బున్నమ నుప్పొంగుపూర్ణాబ్ధి శోషించె, నక్కట నాయభాగ్యంబుకతన
ఘనుఁడు మజ్జనకుసఖుఁడు ఖగకులేంద్రుఁ, డగుజటాయువు ఱెక్కలు దెగి మహాహ
వోర్వి రక్తసిక్తాంగుఁ డై యున్నవాఁడు, పొగులుచును నాదుపుణ్యంబు పొలిసెఁ గాన.

356


క.

అని వగచి జటాయువుతో, జనకజ నాప్రాణదయిత సద్వ్రత యేది
క్కున కరిగె ననుచు రాముఁడు, ధనువును బాణములు విడిచి ధరణిం బడియెన్.

357


వ.

పడి యాఖగపతిచేత సీతవృత్తాంతంబు విస్పష్టంబుగా విని రాముం డనుజసమే
తుం డై యిరువురు నెలుం గెత్తి వాపోవుచు నేలం బడి పొరలుచు మూర్ఛిల్లి
నిశ్చేష్టితు లై యుండి రంతఁ గొంతదడవునకు సౌమిత్రి దేఱి యన్నచరణంబు
లొత్తుచు నారాము బోధించి యోరామ దశరథుండు నీగుణంబులం గట్టువడి
భవద్వియోగంబు సైరింపఁజాలక తపోయోగమార్గంబునం బ్రాణంబులు విడి
చి నాకగతుఁ డయ్యె నని భరతుండు సెప్ప నీవు చరితవర్తనుండ వై సీతతోఁ
గూడ మరలి పురంబున కేతేర నిన్నుం గన్నులం జూచుజను లతిపుణ్యులు
నధికధన్యులు నతిసుముఖులునుంగాఁ బురాభిముఖుండ వై యరుగునిన్నుం
జూచి కౌసల్య పరమానందంబునం బొందు.

358

మ.

జనకుం డమ్మెయి సంతసింపఁగఁ దగన్ సత్యప్రతిజ్ఞుండ వై
వనవాసవ్రతశేషమున్ నడపి నవ్యప్రీతితోడం బురం
బున కేతేరఁగ నిన్నుఁ జూచినజనుల్ పుణ్యాత్ము లయ్యున్ మనం
బున నీరాకకు నుత్సహింత్రు వెస నుబ్బుం దల్లి కౌసల్యయున్.

359


క.

అతిపుణ్య యదితి త్రిజగ, న్నుత యింద్రునిఁ గన్నపగిది నోములు పెక్కుల్
వ్రతనిష్ఠ నోమి సుగుణా, న్విత యగుకౌసల్య గనియె నిన్ను నరేంద్రా.

360


క.

కథితాఖిలదానంబులుఁ, బ్రథితాశేషసుకృతములు బహుయజ్ఞములుం
బృథులమతిఁ జేసి యిల దశ, రథభూపతి నిన్నుఁ బడసె రామమహీశా.

361


వ.

అని లక్ష్మణుండు పెక్కుదెఱంగుల బోధింపం దెలివొంది రామచంద్రుండు జటా
యువుం గనుంగొని.

362


చ.

జనకజ నన్ను నే మనియె జానకి రక్కసుఁ డెందుఁ గొంచు వే
చనియెఁ గడంక వానిబలసంపద యెట్టిది యద్దురాత్ముఁ డె
వ్వనిసుతుఁ డెట్టివాఁడు తగ వాఁ డెట యుండుఁ దదీయనామ మే
మనఁబడుఁ బక్షినాయక సమస్తము నా కేఱిఁగింపు నావుడున్.

363


జనవర రావణుం డనునిశాచరవీరుఁడు భూరిశక్తి దు
ర్వినయత మాయఁ గైకొని పరిశ్రమ మొందిననన్నుఁ జూచి యు
క్కున ఘనపక్షముల్ విఱుగఁ గ్రూరతఁ ద్రుంచి మహీజఁ గొంచుఁ జ
య్యన దివి దక్షిణాభిముఖుఁడై చనియెన్ బలదర మొప్పఁగన్.

364


క.

భూవర సంగ్రామంబున, రావణుఁ బరిమార్చి నీవు రమణీయజయ
శ్రీ వెలయ సీతఁ బొందెదు, వావిరి నాదేవి కాత్మ వగవకు మంచున్.

365


క.

ఇర వఱి ప్రాణంబులు వే, దిరుగుడువడఁ జొచ్చె నాదుదేహంబు గడుం
బరవశ మయ్యెడు భ్రాంతిం, బొరసెడుఁ జిత్తంబు మూర్ఛ పొదివెడు నంచున్.

366


క.

ధర శిరము వైచి పొరలుచుఁ, జరణంబులు గుదిచికొంచుఁ జంచలమున నె
త్తురుఁ గండలుఁ గ్రక్కుచుఁ బొరి, పొరి నాతురపడి విహంగపుంగవుఁ డీల్గెన్.

367


వ.

ఇట్లు గతాసుం డై శైలంబువోలెం గూలి యున్నజటాయువుం గనుంగొని
రాముం డనుజుండునుఁ దానును బహువిధంబుల శోకించి లక్ష్మణుం జూచి యక్కట

పక్షీంద్రుండు రావణు మార్కొని బహుప్రకారంబుల యుద్ధంబు సేసి బలవిక్ర
మంబులు నెఱపి నాకొఱకు రావణుచేత మృతిఁ బొందె నట్లు గాన జటాయువు
నకు స్వర్గం బవశ్యంబునుం గలుగు నీజటాయువు మన కిట్టి పురుషార్థంబు సేయు
టరయఁ దిర్యగ్జాతులయందు నార్యులు శూరులు శరణ్యులు ధర్మచరితులుఁ గల
రని పలికి.

368

శ్రీరాముఁడు మృతుండైనజటాయువున కగ్నిసంస్కారాదు లొనర్చుట

క.

పితృపైతమహ మగుసం, తతరాజ్యము పుత్రమిత్రదారామాత్య
ప్రతతిం బాసి ఖగేంద్రుఁడు, హతుఁ డయ్యెను నాకుఁ బూని యకట మహాజిన్.

369


క.

ఆలితనంబునఁ బెక్కుల్, వేలేఁడులు బ్రతికి యధికవిక్రమయుతుఁ డై
యాలమునఁ బొలిసె నితఁడుం, గాలము నెవ్వండు గడిమిఁ గడవఁగనోపున్.

370


వ.

సౌమిత్రీ మనకు నిప్పక్షీంద్రుం డుపకారంబు సేయవచ్చి మృతిం బొందినఁ జూచి
సీత వోవుటకంటె దుఃఖం బొడవెడు మనకు నిప్పక్షీంద్రుండు దశరథునియట్ల
పూజ్యుండును మాననీయుండునుం గాన యగ్ని మథించి కాష్ఠభారంబులు దెమ్ము
చితిమీఁద జటాయువుం బెట్టి దహించెద నని పలికి.

371


చ.

అనుజ మహీవదాన్యులకు హాటకదానుల కాహనానివ
ర్తనులకు నాహితాగ్నులకు ధర్మసమగ్రుల కాపదర్థస
జ్జనశరణార్థిపాలురకు జానుగఁ గల్గెడుపుణ్యలోకముల్
ఘనుఁ డగునీఖగేంద్రునకుఁ గావుత నాదుపరిగ్రహంబునన్.

372


వ.

అని పలికి చితి పేర్చి యాచితిమీఁద జటాయువుం బెట్టి నాచేత సత్కృతుం
డయిన పక్షీంద్రుం డితండు నాయనుజ్ఞను తమలోకంబులఁ బొందు ననుచుఁ బలికి
జటాయువును దహించి లక్ష్మణసమేతుండై వనంబున నొక్కహరిణిం జంపి తదీయ
మాంసంబునం బచ్చనికడిమిడిపట్టునం జటాయువుం దలంచి దర్భపూతంబుగాఁ
బిండంబు పెట్టి విధ్యుక్తక్రమంబునఁ బ్రతత్వనిర్గమనంబుఁ గలుగం జేసి మఱి
గోదావరి కేఁగి కృతస్నానుం డై యాపుణ్యనదీజలంబుల ధర్మోదకం బిచ్చిన

మహాపుణ్యుం డైన రామునిచేత సంస్కృతుం డగుటను రణనిహతుం డగు
టను జటాయు వత్యంతపుణ్యలోకంబున కరిగె రామలక్ష్మణులు శోకవ్యాకుల
చిత్తు లగుచు.

373


చ.

అరుణుఁడు గ్రుంక నప్పుడు నిజాశ్రమవాసములోని కేఁగి య
య్యిరువురు నిద్ర లే కచట నెంతయు వందుచు నుండి యవ్విభా
వరిఁ దరియించి శూన్య మగువాసముఁ బాసి మహీజ యున్నచో
టరయఁగఁ బశ్చిమాభిముఖు లై చని రాతతవేగ మారఁగన్.

374


వ.

చని శరచాపహస్తు లయి ముందట నప్రతిహతమార్గంబున నడచి కిసలయకుసు
మఫలలతాపరివృతంబును సింహవ్యాఘ్రాదిసత్త్వభీమంబును నతిదుర్గమంబును
నైనమహారణ్యంబు గడచి జనస్థానంబునకుఁ ద్రిక్రోశమాత్రంబున నున్న
క్రౌంచవతిఁ బ్రవేశించి వరపక్షిగణాన్వితంబును నానావర్ణపుష్పఫలశోభితంబును
బహుపర్వతదుర్గమంబును నగునొక్కవనంబు గని యవ్వనంబున సీత నన్వేషిం
చుచుఁ దమసానదిం గని.

375


తే.

తత్సమిపావనీస్థలి దాశరథులు, ఘనులు గాంచి రయోముఖి యనునిశాటి
నూర్ధ్వకేశి లంబస్తని నుగ్రగంధిఁ, గుండకుక్షి ఘూకస్వర ఘోర నెదుర.

376


క.

అగ్గలిక నానిశాచరి, దగ్గఱఁ జనుదెంచి రాముతమ్మునికరమున్
దిగ్గనఁ బట్టి మనంబున, బెగ్గడిలక వికటదంష్ట్రభీకర యగుచున్.

377


వ.

సౌమిత్రి కి ట్లనియె.

378

ఆ.

అర్థి నిన్నుఁ జూచినప్పుడు వలచితి, భార్యగా వరింపు పరమపురుష
నీదురతికిఁ గోరు నాదుపే రడిగెదే, విను మయోముఖి యని వీరవర్య.

379


క.

అనుటయు నతఁ డవ్వికృతా, ననఁ బాయంద్రోచి కదిసి నాసాకర్ణ
స్తనఖండన మొనరించెను, సునిశితకరవాలధారఁ జులుకన నలుకన్.

380


తే.

ఇట్లు వికృతాంగి గావించి యిట్టు లనియె, నోనిశాటి యీయొప్పుతో నున్న నిన్నుఁ
గన్ననార్తిని దూలరే కాముచేత, బేల నీ కింతవలవని జాలి యేల.

381


క.

ఈలీల సుమిత్రాసుతుఁ, డాలి గొనఁగ నెత్తు రొడల నంతటఁ గాఱం
దూలుచు సోలుచు వ్రాలుచు, తోలుచుఁ బాఱి వనరుచును ఱువ్వునఁ గూలెన్.

382


వ.

తదనంతరంబ యాకాశపథం బెల్లం బగిలించునొక్కమహాశబ్దంబు విని యాశ
బ్దంబు చక్కటివనంబున కేతెంచి యమ్ముందట.

383

రామలక్ష్మణులు కబంధునిం గాంచుట

మ.

కని రారాజతనూజు లుక్షసముదగ్రగ్రీవు నాభీలసం
హననుం దుంగమహీధరోన్నతు సముద్యద్భాహువక్షస్స్థలున్
ఘసభూరిస్వను నీలమేఘసదృశుం గాలాంతకక్రూరు యో
జనదీర్ఘాయతబాహుయుగ్మకలితుం జండోరగాభస్థితున్.

384


మహా.

సతతాసృక్పానశీలుం జటులకఠినదంష్ట్రాచయాభీలు నానా

గతసత్వవ్రాతమాంసగ్రసనవివృతవక్త్రప్రచండప్రచారుం
దతఘోరస్కంధు భూతత్రసనకరబలోద్యన్మదాంధుం దరక్షూ
ద్ధతదంతివ్యాఘ్రసింహాహరణనిపుణబాహాతిబంధుం గబంధున్.

385


వ.

అంత నారాఘవులు జంఘారహితకబంధుం డగునాకబంధుండు యోజనదీర్ఘంబు
లగుతనబాహువుల నిరువురం బొదివి సూర్యగ్రహణకరుం డగుగ్రహణగ్రహం
బునుంబోలె నాగ్రహం బొదవ నదల్చి వారి కి ట్లనియె.

386


సీ

అమ్ములు విండులు నడిదమ్ములును దాల్చి, యెటు వోయెదరు మీర లిపుడు నాదు
ఘనదీర్ఘతరభుజార్గళయుగ్మమునఁ జిక్కి, పొలిసితి రిం కెందుఁ బోవవచ్చు
నని యంటఁ బట్టిన నారామచంద్రుండు, ధైర్యధుర్యుఁడు గాన దలఁకకుండె
నప్పుడు లక్ష్మణుం డతిదుఃఖితాత్ముఁ డై, యవనీశ చిక్కితి మసురచేత
వీని కొకభంగి నను బలిగా నొనర్చి, నిన్ను విడుచు తెఱఁగు గోరి నిశ్చయింపు
మర్థి నిట్టైన బ్రదుకు దీ వైన నదియ, యనువు దలఁప మహాపద యైనయెడల.

387


మ.

అనినం దమ్మునిమాట దన్ను ఘనదుఃఖక్రాంతుఁగాఁ జేయ న
జ్జననాథుండు మహార్తిఁ బొందుచు ననున్ సౌమిత్రి యిబ్భంగి న
న్నును నిన్నున్ దనుజాధముం డొకఁ డదీనుం డై నిరోధించె నె
వ్వని నెబ్భంగుల నెట్లు సేయ దిల దైవం బెప్పు డేపట్టునన్.

388


సీ.

అనుచు శోకింపంగ నసుర వారిఁ దిగిచి, ఘనతరనిజవక్త్రగహ్వరంబు
చేరంగఁ దెచ్చుచో నారామచంద్రునిఁ, దప్పక కనుఁగొని తదనుజన్ముఁ
డి ట్లను నోరాఘవేశ్వర వీఁడు ని, రాయుధుఁ డని యవధ్యత్వబుద్ధిఁ
దెగ కున్కి నీయందుఁ దెల్ల మై తోఁచె నా, కతిపాపకర్ముఁ డీయధముఁ డేల
యీవిచారంబు వధియింపు మిపుడ యనుడుఁ, దెలిసి ఖడ్గంబు వెఱికి దైతేయుదీర్ఘ
కఠినభుజదండ ముగ్రవేగమున నఱకె, ననుజుఁ డట్టుల చేసెఁ దక్కినభుజంబు.

389

ఉ.

ఇమ్మెయి బాహువుల్ దునిసి యే పఱి రక్తజలంబు పై పయిం
గ్రమ్మఁగఁ గూలె రోఁజుచును మ్రాఁకులునుం బొదలుం బ్రపాతవే
గమ్మునఁ జాపకట్టువడఁగాఁ గులిశక్షతపక్షశైలరూ
ప మ్మనఁగా వసుంధరఁ గబంధుకబంధము ఘోరభంగిగన్.

390


వ.

[28]ఇట్లు కూలి దైత్యుం డొక్కింతవడికిఁ దెలివొంది మీ రెవ్వ రలఘుశౌర్యు
లార యన సుమిత్రాసుతుం డి ట్లని చెప్పె.

391


క.

కాకుత్స్థరాముఁ డీతఁడు, నా కగ్రజుఁ డేను లక్ష్మణాఖ్యాకుఁడ మున్
భూకాంతునిసతి జనశూ, న్యైకాటవి రాక్షసాపహృత యై పోవన్.

392


ఉ.

ఆరమణీలలామ నిట నారయ వచ్చితి మీవు నిచ్చటం
బేరుర మాస్య మై వికృతకభీషణభంగి వెలుంగ భగ్నజం
ఘోరుముఖుండ వై వికృతి నొంది కబంధమువోలెఁ గుత్సితా
కారత నున్నవాఁడ వధికప్రభ నెవ్వఁడ వీవు సెప్పుమా.

393


చ.

అనవుడు నాతఁ డాత్మ ముద మందుచు రాఘవులార మిమ్ము న
త్యనఘులఁ గంటి భాగ్యమున ధన్యుడ నైతి మదీయశాపముం
జనియెడు మీప్రసాదమున సమ్మతిఁ జూడుఁడు హేయ మైనయి
చ్చెనఁటిశరీరమున్ విడిచి చెన్నగుమూర్తి వరింతు నాకమున్.

394


వ.

అస్మద్విధంబు చెప్పెద వినుండు.

395


సీ.

దను వనియెడునామjమునఁ బ్రవర్తిల్లుదుఁ, గాంతిఁ జంద్రునిఁ బ్రభాకరునిఁ దేజ
మునయందుఁ బాకశాసను భోగమునఁ బోలు, నితఁ డనుకీర్తి వహింతు నజునిఁ
[29]దపమున మెప్పించి ధరఁ జిరజీవిత, త్వము కామరూపంబు వరము గాంచి
క్రౌర్యపరుండ నై కడఁగి హింసారతి, నెలమితోడుత మించి యెపుడు సమద
లీలఁ దిరుగుచు నుండుదు స్థూలశిరుఁ డ, నంగ నొక్కఁడు దపము సేయంగ నచటి
కిట్టివికృతాకృతిని దాల్చి యేఁగి యతని, యెదురఁ దిరుగ నాసంయమి యెఱిఁగి యలిగి.

396


క.

ఈరూపము కడుఁ బ్రియపడి, గారవమునఁ దాల్చి వేడ్కఁ గ్రాలెద విదె నీ

కోరిక సఫలతఁ బొందఁగ, నోరి దనుజ యింక నిట్ల యుండు మనుటయున్.

397


తే.

తల్లడిల్లి యే ముందటితనువుఁ దాల్చి, యర్థి మొక్కి ప్రార్థించిన నత్తపస్వి
కరుణ ని ట్లనె రామలక్ష్మణులు నీదు, కరయుగము ద్రుంపఁ దీఱు నీకకల్మషంబు.

398


క.

మఱి యారఘువీరులు నీ, ముఱు మొండెము వేగ దగ్ధముగఁ జేయఁగఁ జే
కుఱుఁ బూర్వాకారము నీ, కుఱవుగ శాపమున కవధియును నప్పు డగున్.

399


సీ.

అని యానతిచ్చె నమ్ముని యంత నీరూప, సహితుండ నై వేగ సమదవృత్తి
జని యింద్రు సంగరమునకుఁ బిల్చిన వీఁకఁ, జనుదెంచి యతఁడు వజ్రమున వ్రేసెఁ
గంఠంబు శిరమును గాళ్లును బొట్టలో, పలఁ జొర న ట్లేసి బలవిరోధి
మతిఁ గాంచి దీర్ఘజీవితుఁడుగా మును వరం, బబ్జగర్భుం డిచ్చె నట్లు గాన
బ్రదుక వెర వొనర్చెద నొకభంగి ననుచుఁ, గడుపునందు వక్త్రంబు వక్షమునఁ గన్ను
నొసఁగి యోజనబాహువు లెసఁగ నిచ్చె, నాఁటఁగోలెను నిక్కాననమున నుండి.

400


క.

ఆమడలోపల మెలఁగిన, సామజభల్లూకసింహసైరిభహరిణా
ద్యామిషమృగముల మనుజ, స్తోమంబులఁ బెనఁచి తినుచు దుర్దాంతగతిన్.

401


తే.

ఎంతయునుగాల మి ట్లుండ నిపుడు మీప్ర, సాదమున శాపమోక్షంబు సంభవించె
ననుచుఁ జెప్పిన రాముఁ డిట్లను దశాస్యు, నెఱుఁగకుండెడినే యీతఁ డెఱుక ననుచు.

402


సీ.

అనుజన్ముఁడును నేను నజ్జనస్థానంబుఁ, బాసి పోయినచోటఁ బంక్తిముఖుఁడు
మద్భార్య సద్గుణ మహిజ వంచనఁ గొని, పోయె వాఁ డట వానిపోక దక్క
నెక్కడ నునికియు నెఱుఁగము మీబోఁటి, వా రెల్ల నెఱుఁగరే వానివిధము
నెచ్చోట వసియించు నెమ్మెయిఁ జరియించు, నెట్లుండు నేభంగి నేము గందు
మఖిలమును జెప్పి మత్సంశయంబు వగయుఁ, జింతయుం బాపవే యార్తిఁ జెంది పొగులు
చున్నవారము దగుచుట్ట మొకఁడు లేమి, ననిన దనువు రాఘవున కి ట్లనియెఁ బ్రీతి.

403


వ.

స్థూలశిరునిశాపంబునం జేసి నాకుఁ దెలివియుం దొలంగినయది యీదుర్దేహం
బుం గాల్ప నొండుశరీరంబున నెఱుకయు నగు నప్పుడు హితంబు సెప్ప నగు
సూర్యాస్తమయంబునకు మున్న క్రన్నన నిమ్మేను దహింపుం డనిన నయ్యిన
వంశవర్యుం డనుజుండునుం దానును దెచ్చినదారుఖండంబుల నాతుండంబులం
బొదిగ వైచి తరుమథనానలంబు దరికొల్పిన దగ్ధుం డై యప్పుడు దివ్యవస్త్రమా
ల్యాభరణభూషితంబు లైనసర్వాంగంబులు శోభిల్ల నాకాశంబున దివ్యవిమా
నారూఢుం డై తనదివ్యతేజంబున దశదిశలు వెలింగించుచు దివ్యుం డైనకబం
ధుండు రామచంద్రున కి ట్లనియె.

404

చ.

శతమఖవైరి రావణుఁడు చండమదంబున మీరు లేనిచో
క్షితిసుత లీల నెత్తుకొని చెచ్చెర లంకకు నేఁగె నింక మీ
రతిబలుఁ డైనశూరుని సహాయునిఁగాఁ గొని కాని వాని ను
ద్ధతిఁ బరిమార్పలేరు వసుధావర మీకు హితంబుఁ జెప్పెదన్.

405


క.

లలి వాలి వెడల నడిచిన, నలువురుమంత్రులును దాను నలినాప్తసుతుం
డలవడ నున్నాఁడు విని, శ్చలమతితో ఋశ్యమూకశైలాగ్రమునన్.

406


ఉ.

ఆకపినాథుతోడఁ బ్రియ మారఁగ సఖ్యము సేయు మాతఁ డ
స్తోకబలుండు విక్రమయుతుండు కృతజ్ఞుఁడుఁ గామరూపియున్
నీకు సహాయుఁ డై హితము నేర్పునఁ జేయఁగలండు వానరా
నీకము లోలిఁ బెక్కులు గణింపఁగ నాతని కొప్పు భూవరా.

407


వ.

ఆసుగ్రీవుండు దేశకాలజ్ఞుండు వాలివలనిభీతిం బోయి సకలదేశంబులుం జూచి
నాఁడు గాన మహావీరు లైనవానరుల నెల్లదిక్కులకుం బనిచి యెక్కడ
నున్నను రావణుని సాధించి సీతను దెచ్చి నీకు సమర్పింపఁగలం డని పలికి
వెండియు.

408


శా.

సుగ్రీవుండు ప్లవంగసైన్యములతో సొంపార నేతేరఁగా
నుగ్రోదగ్రత లంకపై నడచి వీరోత్సాహ మేపారఁ బం
క్తిగ్రీవుం బరిమార్చి రామనృప ధాత్రీపుత్రిఁ దోకొంచు నీ
వగ్రీయప్రియ మార నేఁగెద వయోధ్యారాజ్యముం జేయఁగన్.

409


వ.

రామచంద్రా యీత్రోవం బశ్చిమదేశంబున బిల్వతాళప్రియాళురసాలప్లక్ష
న్యగ్రోధకింశుకాశ్వత్థకర్ణికారమధూకమంజులరోహితకకుభాదితరువులు విలసిల్లు
నందు వలసినవృక్షంబు లెక్కి ఫలంబులు రాల్చి యమృతకల్పంబు లైనయాఫలం
బులు భక్షించి యరిగి ముందట నున్న విపినంబుల దేశంబులఁ జూచుచుం జారు
కమలోత్పలంబుల మెఱసి విలసిల్లుచు హంసక్రౌంచసారసంబులు పలుకుస్వనం
బుల నొప్పారు పంపాసరోవరంబున కరిగి యట విశ్రమించి సుగ్రీవునితోడ సఖ్యం
బు సేయుండు కార్యసిద్ధి యయ్యెడు నేఁగుం డనుచుం బలికి రామునిచేత నను
జ్ఞాతుం డై తనదివ్యరూపంబుతోడ రెండవసూర్యుండునుంబో వెలుంగుచుం
గబంధుండు నాకలోకంబున కరిగె నప్పుడు రామలక్ష్మణులు వెఱఁగందుచుం గ
బంధుండు చెప్పినజాడం బూర్వదిశాభిముఖులై యరుగుచు నక్షుద్రకల్పఫలవృ
క్షంబులు గలయొక్కశైలంబు గని యాశైలంబువెనుక రాత్రి వసియించి మఱు
నాఁడు దూరమార్గం బేఁగి విచిత్రవనశోభితం బగుపంపాతీరపశ్చిమదేశంబు సేరి
నిల్చి బహుకుసుమఫలభరితతరువిలసితం బగుశబరియాశ్రమంబు గని యయ్యా
శ్రమంబు సొచ్చి యేతేర నారామలక్ష్మణుల కెదురుగాఁ గృతాంజలి యై శబరి
వచ్చి వినయంబు సేయునప్పుడు శబరిం జూచి రాముం డి ట్లనియె.

410

శ్రీరాముఁడు శబరిం గరుణించుట

చ.

ఉరుతరవిఘ్నముల్ దొడర కున్నతి నొందఁ దపంబు సేయుదే
గురువుల భక్తితోఁ గొలుతె కోపము మోహము లేక యుండుదే
యిరవుగ సంయమంబు విజితేంద్రియవృత్తియుఁ గల్గి సౌఖ్యముం
బొరయుదె పుణ్యసంయములు పోఁడిగ నీకడ కేఁగుదెంతురే.

411


క.

అనవుడు సర్వము భద్రం, బని యాసతి నృపతితోడ ననియెన్ రఘునం
దన నీశుభదర్శనమునఁ, దనరఁ దపస్సిద్ధిఁ గంటి ధన్యత నుంటిన్.

412


చ.

జనవర చిత్రకూటమున సమ్మతి మీరు వసించియుండఁగా
దినపసదృగ్విమానములఁ దేజము లార మహాత్ము లైనస
న్మును లిట కిచ్చ వచ్చినఁ బ్రమోదము లారఁగ నర్చ లిచ్చినన్
మనముల సంతసించి మఱి మచ్చిక ని ట్లని రాతపోధనుల్.

413


చ.

ఘను లగురామలక్ష్మణులు గార్యముమై యిట కేఁగుదెంతు రే
పునఁ జన నానృపాలురకుఁ బూజ లొనర్చి సమగ్రపుణ్య వై
యనిమిషలోక మేఁగె దని యాదర మారఁగ నాకుఁ జెప్పి యిం
పెనయఁగ వారు నాకమున కేఁగిరి రామనృపాలశేఖరా.

414


చ.

వివిధము లైనవన్యములు వేడుక నే నొనఁగూర్చి మిమ్ముఁ బ్రా
భవమునఁ బూజసేయఁగను బ్రార్థన సేసెద మీకు దీని గా
రవమున స్వీకరింపుఁ డన రాఘవుఁ డారమణీయవన్యముల్
ప్రవిమలబుద్ధిఁ జేకొని తపస్విని కారఘురాముఁ డి ట్లనున్.

415


క.

దనుసుతుఁడు నీప్రభావము, మును నాకుం జెప్పె నిపుడు మోదముతోడం
గనుఁగొంటి ననుడు నాసతి, మన మలరఁగ విభునితోడ మఱి యి ట్లనియెన్.

416


వ.

అనఘ యివ్వనంబు మతంగవనం బనంబడు నీపుణ్యస్థానంబునం బులులు మృగం
బులుం గలసియుండు నేప్రాణులకు నైన నన్యోన్యవైరంబులు లే వమ్మునులసా
మర్థ్యంబున నీయాశ్రమంబున దేవతావిరచితవేది యున్నది యావేది నొక్కగృ
హంబు నిర్మించుకొని కడుఁబురాతనకాలంబున.

417


క.

ఎలమి మును హోమవేళం, బొలుపుగ మద్గురులు మంత్రపూతంబులుగా
జ్వలనుని నర్చించినవు, వ్వులు వాడవు దర్భ లెండవుం దగ నుండున్.

418


మ.

జననాథాగ్రణి యామహాత్ము లుపవాసశ్రాంతి మైఁ దీర్థముల్
సన లే కేడుపయోధులం దలఁప నాసప్తాబ్ధులుం జేరఁ జ
య్యన నేతెంచినఁ దారు గ్రుంకు లిడి యుద్యద్వల్కలంబుల్ దివం
బునకుం బోవుచుఁ బెట్టి పోయి రిలపైఁ బొల్పారెడుం జూడవే.

419


వ.

అని మఱియుం దమగురువుల సామర్థ్యంబులు పెక్కులు సెప్పి యే నమ్మునీశ్వరుల
పరిచారిణిం గాన వారికి శుశ్రూష సేయ వార లున్నపుణ్యస్థానంబున నీకళేబ

రంబు విడిచి పోవం గోరెద ననుజ్ఞ యిం డని యారామలక్ష్మణులచేత ననుజ్ఞాత
యై తన్ను నగ్నిదేవునికి నాహుతి సేసి దివ్యమూర్తి వెలుంగుచుఁ దమగురువు
లున్న స్వర్గలోకంబునకు నాశబరి సనిన రామలక్ష్మణు లాశ్చర్యంబుఁ బొంది యా
శబరిస్థానంబును గడచి పంపాభిముఖు లై యేఁగుచు నాతపస్వులసామర్థ్యంబు ద
లంచి రాముండు లక్ష్మణునితోడ ని ట్లనియె నియ్యాశ్రమంబునకు సప్తసముద్ర
తీర్థంబులం దెచ్చి యధికతపంబులు సలిపి రమ్మహామును లిట్టిపుణ్యస్థానంబు సేరి
పితృసంతర్పణంబులు సేసి కృతార్థుల మైతిమి వర్షశతంబు లైన నుండ నర్హం
బైనపుణ్యస్థానం బిది యైన మనము గార్యాసక్తులము గాన ఋశ్యమూకాచలం
బున కేఁగి రవిసుతునకు హితం బాచరించి సీత వెదకంగఁ బోవలయు ననుచు
నయ్యాశ్రమంబు గడచి యేతెంచి ముందట.

420

పంపాసరోవరవర్ణనము

సీ.

కూలచంపకనారికేలసాలరసాల, తాలహింతాలతక్కోలతరులు
తీరభూజారూఢహారీతటిట్టిభ, కీరకోకిలకాకకేకికులము
సారసకలహంసచక్రబకక్రౌంచ, కారండవాలాపకలకలంబు
కైరవేందీవరకల్హారకువలయ, పుండరీకాంభోజపుష్పతతులు
నింగి కుప్పొంగురంగత్తరంగసంచ, యములు నిందిందిరలసితవిమలవారి
మత్స్యకచ్ఛపోరగశింశుమారచటులు, జలచరమ్ముల కలఁకువల్ గలుగుదాని.

421


మ.

ప్రవిలాసాంచితసద్గభీరవిమలాంభఃపూరసంసేవ్యమార
సవిహంగోత్కరసమ్మదావహమహాశుక్రశ్రితాభ్యంతర
సవిశేషోర్మితరంగసంకులజనశ్లాఘ్యప్రభావన్ సరః
ప్రవరంబుం గని రానృపాత్మజులు పంపం బెంపు సొంపారఁగన్.

422


వ.

కని యచ్చెరు వందుచుం జేర నరుగునప్పుడు.

423

పంపాతీరంబున రాముండు విరహవేదనచే విలపించుట

క.

[30]సరసిజకువలయపరికర, పరిమళపరిమిళితశిశిరపావనరంగ
త్తరళతరంగాంబుకణో, త్కరధరమలయానిలంబు దనపైఁ బొలయన్.

424


సీ.

సౌమిత్రి నామీఁద సారెసారెకు నవ్య, కుసుమముల్ గురిసెడుఁ గుజము లోలి
నవచూతవల్లిక న న్నదె సన్నలు, సేయుచున్నది లీలఁ జిగురుఁగేల
మధురస్వరంబుల మదకోకిలంబులు, సేరెడుఁ బలుమాఱుఁ జెలఁగి చెలఁగి
కరి కరేణువుఁ జేరి కరమునఁ బుడికెడు, హరిణంబు సనియెడు హరిణివెంట

నల్లవలిగాలి యుల్లంబు దల్లడిల్ల, బహువనప్రసవోదితపరిమళంబు
లలమి తెచ్చి పైఁ బొలసెడునళులు గలయ, మధురగీతము వాడెడు మనము గలఁగ.

425


ఘనతరశైలసానువులఁ గాంతయుఁ దానును గూడి వేడ్కతోఁ
జన రతిలీలఁ బొందుచు వెసం బురి విచ్చి మయూర మోలి న
ర్తన మొనరించుచున్నది ముదంబున నావరపత్నికైవడిం
దనప్రియఁ గొంచు రక్కసుఁ డుదగ్రతఁ బోవక యుండఁగాఁ జుమీ.

426


క.

సౌమిత్రీ కనుఁగొంటివె, ప్రేమంబున నలినిఁ గూడి పెంపొంది సుఖో
ద్దామత నున్నది మధుపము, గామిని వెసఁ గవసి యున్న కాముకుభంగిన్.

427


క.

వినుతింప సుఖులలోపల, ఘనతరసుఖి చక్రవాకఖగ మొక్కెడ వే
చనఁ దొడఁగె నీడకైవడిఁ, జనఁ బ్రియ వెనువెంటఁ దాను సమ్మతి గనుటన్.

428


క.

భూనాథపుత్ర పర్వత, సానువులం బ్రియలతోడిసంగతి మృగముల్
మానసము లలర నున్నవి, యేనైన మహీజఁ బాసి యి ట్లున్నాఁడన్.

429


ఉ.

ప్రేయసిఁ బాసి యేగతిఁ జరింతు సరిద్వనభూమిఁ దెమ్మెరల్
డాయఁగ వేఁడివెన్నెలలు డంబుగఁ గాయఁగఁ దావితూపులం
గాయజుఁ డేయఁగా నళులు గన్కని మ్రోయఁగ గండుఁగోయిలల్
గూయఁగఁ బుష్పవార మతిఘోరత మానము నీఱుసేయఁగన్.

430


వ.

అని పలికి తమకం బెసంగ.

431


క.

మంగళపవనమ నాదుప్రి, యాంగనపైఁ బొలసి పొలయు మాదట నాపై
నంగం బలఁపక పంపా, సంగతరంగత్తరంగశైత్యము లొలయన్.

432


వ.

అని సీతావియోగభరంబునఁ దాపంబు దీపింపఁ బెక్కుదెఱంగులం బ్రలాపించు
చున్న రామచంద్రు నూరార్చి మనము సుగ్రీవుతోడం జెలిమి సేయవలయు ఋ
శ్యమూకంబునకుఁ బొదం డని లక్ష్మణుండు పలికిన నగుం గాక యనుచు ననుజస
మేతుం డై పంపానది యుత్తరించి యవ్వలికూలంబున నిల్చి యగ్రభాగంబున.

433


ఉ.

రాకొమరుల్ గనుంగొనిరి రమ్యగుహాగతకిన్నరీకమున్
స్వీకృతనాకసింధుజలసేకము సంకులదంతిదంతిభి
ద్భీకరపుండరీకమును దీపితసంయమివేదనాదజ
ల్పాకము సిద్ధసేవితతపఃపరిపాకము ఋశ్యమూకమున్.

434


వ.

ఇట్లు కనుంగొని యన్నరవరోత్తములు సంతోషితస్వాంతులై విశ్రమించియుండి
రంత.

435


శా

వైరిక్ష్మాతలనాథపర్వతమహావజ్రాయుధున్ ఘోరదు
ర్వారాంహఃప్రథితారిదుస్సహతమిస్రప్రస్ఫురద్భాను గం

భీరాంభోనిధి ధీరతానిమిషభూభృన్నాథు నత్యంతవి
స్తారోదారగుణప్రసిద్ధినవరాధాపుత్రు సన్మిత్రునిన్.

436


క.

లలనాజనవరభద్రుని, బలవద్రణరౌద్రవీఠభద్రుని నుద్య
త్సులభతరగుణోన్నిద్రుని, బలవిలసితవినుతరామభద్రునిఁ బ్రీతిన్.

437


మాలి.

విభవజితసురేంద్రున్ విస్ఫురత్కాంతిచంద్రున్
శుభతరవరగాత్రున్ సూరిసంస్తోత్రపాత్రున్
బ్రభుజననివహాద్యుం బ్రాజ్ఞవిద్యానవద్యున్
సభయరిపుశరణ్యున్ సంభృతాగణ్యపుణ్యున్.

438


గద్యము.

ఇది సకలసుకవిజనవినుత యశస్కర భాస్కరప్రణీతం బైనశ్రీరామాయ
ణంబునం దారణ్యకాండంబు సర్వంబును ద్వితీయాశ్వాసము.

439
  1. "హారిద్రోల్లసితవక్షహరి" అనియే వ్రా. ప్ర.
  2. 6 మొదలుకొని 18 వఱకుఁ గలపాఠము.
    క. ఈనడుమ రామచంద్రుని, నేను దొరలు మువుర ముగ్రనియతిఁ బులులమై
        పూని వధింపఁగఁ జని చని, యాపరపతి నింతనంత నట చేరుటయున్.
  3. క. శరములు మూఁ డొకముష్టిం, దిరముగఁ దొడి యేయ వారు ద్రెళ్లిరి వెస నే
         సురిఁగి యిట వచ్చి ఘనభయ, పరవశగతి నున్నవాఁడఁ బటుశౌర్యనిధీ.
  4. 23 మొదలుగా 25 వఱకుఁ గల పాఠమునకు మాఱుగా
    తే. ఇవ్విధంబున నరిగి రాజేంద్రచంద్రుఁ, డున్నకడలివనంబున కొయ్యఁ జేరి
         యచట రావణు నిలిపి మాయాకురంగ, మయ్యె మారీచుఁ డురుదీప్తు లతిశయిల్ల.
  5. రొత్తెడునంఘ్రులు.......మెఱుంగు లామృగముకుం దనకున్
  6. 'హరిహరవేధాదుల' అనియే వ్రా. ప్ర.
  7. నీమృగచర్మ మబ్బినన్
  8. 37 మొదలుగా 50 వఱకుఁ గలవ్రాఁతప్రతుల పాఠము,
    క. కనకపుమేనును రత్నపుఁ, దనురుచులును గలుగుమృగము ధరణిం గలదే
        జనవర యిది మాయామృగ, మని యెఱుఁగఁగ రాదె మీకు ననురులమతముల్.
    చ. అని విని యల్ల నవ్వుచు ధరాధిపుఁ డెంతయుఁ బ్రీతిఁ దమ్మునిం
        గనుఁగొని యామృగంబుపయిఁ గౌతుక మెక్కుడు పట్టి తేరఁగాఁ
        జన కిట యూరకున్న మది జానకి యెంతయుఁ జిన్నఁబోదె చ
        య్యనఁ గొని యేఁగుదెంచెద గుణాకర యేమఱకుండు మియ్యెడన్.
    క. ఇది దనుజమాయ యని మీ, మది సంశయ మేల మాయ మాయించి శిర
         ప్రదరంబులఁ దునిమెద నని, కదలెం బతి ఖడ్గతూణకార్ముకధరుఁ డై.
    చ. కదలి రఘూద్వహుండు చనఁగా నది ముందటఁ గొంతచేరువన్
         మెదలుచు డాసినన్ బెదరి మీఁదికి న ట్లది చాఁటుచున్ మృగం
         బదె యిదె నాఁగఁ బెంపొదల నవ్వలఁ దోఁచుచుఁ బాయుచున్ రయం
         బొదరఁగ డాయడాయఁ గొనిపోయె మహాగహనంబులోనికిన్.
  9. పొలఁతిపట్టుగ నని వెల్చి నిలిచినిలిచి
    యామృగము నేయకయె పట్టు నాసఁ దిరిగె,
  10. 52 మొదలుగా 60 వఱకుఁ గలవ్రాఁతప్రతుల పాఠము,
    క. తిరిగి తిరిగి కడుఁదడవున, కరయఁగ నిది దనుజమాయ యగు నని కోపో
         ద్ధరుఁడై యమోఘశరమున, ధరణీశ్వరుఁ డేసె శీఘ్రదారుణభంగిన్.
    చ. అది మును మాయ మ్రింగి దనుజాంగము సొచ్చి పగుల్ప వాఁడు బె
         ట్టిదుఁ డయి మీఁదికిన్ నెగసి డెప్పర మై యిలఁ గూలి వ్రాలెఁ బె
         ల్లదరుచు లక్ష్మణా యనుచు హా యని రామునెలుంగుభంగి యై
         యద్రువఁగ నన్నిదిక్కులు మహాధ్వని సీత గలంగునట్లుగన్.
    క. అని ఘోరంబుగ నఱచుచు, దనుజుఁడు పుడమి నిజరూపధరుఁ డై పడియెం
          బెనుమేనితోన రాముఁడు, గమఁగొని విభ్రాంతి సాలఁ గదిరెడుమదితోన్.
  11. 64 మొదలుగా 66 వఱకుఁ గలవ్రాఁతప్రతులపాఠము.
    ఉ. భూపతి యార్తిఁ బొందె నని భూమిజ దల్లడి మొంది లక్ష్మణా
         పాపము వొందె లెమ్ము వెసఁ బాఱుము రాక్షసబాధఁ బొందఁగా
         నోపు రఘూద్వహుండు నిను నొత్తిలి చీరె నిశాటకోటిచే
         నే పఱఁ బోలుఁ బోయి వెస నేఁగు జవంబునఁ బొమ్ము క్రమ్మనన్.
  12. నను నిల్లూ రిడి పోయెను; నిను నిల్లడ యిడి పోయెను
  13. 70 మొదలుకొని 74 వఱకుఁ గలవ్రాఁతప్రతులపాఠము,
    క. అనవుడుఁ బేర్చినశోకం, బునఁ బె ల్లేడ్చుచు మహాత్ముఁ బుణ్యచరిత్రున్
         మనుజేంద్రుఁ గావఁ దగవే, చనునే రామునకుఁ దోడు చనవు రయమునన్.
  14. 77 మొదలుగా 91 వఱకుఁ గలపాఠము.
    వ. అనిన నమ్మాటలకుఁ దప్తలోహంబు చెవులం బోసిన ట్లయినం దల్లడిల్లి వివశుం డై సౌమిత్రి
         ధాత్రి నొరిగె నదియు వైశికంబుగాఁ గైకొని మఱియుం బరుషంబులు పలుకుచు నంతం బోక శో
         కాకుల యై.
    తే. అకట నామాట విన వని యౌవనంబు, వ్రేసికొనుచు మహాభయవివశ యగుచు
         నేడ్చుసతిఁ గని తల్లడం బెడఁదఁ కలిగి, కదలి సౌమిత్రి యక్కాంత కెదురు నిలిచి.
    క. ఎల్ల దెఱంగుల నిన్నుం, దల్లింగాఁ జూతు నిట్లు తగునే యిమ్మై
         నుల్లంబు గాలఁ బలికెదు, తెల్లము నాపోక కీడు దేవీ నీకున్.
    చ. అనుచుఁ బ్రదక్షిణించి ఘనుఁ డాసతియంఘ్రులు చూచి మ్రొక్కుచుం
         జనుచు సమస్తభూతములు సాక్షిగ నాదెసఁ బాపబుద్ధి లే
         దని పలుమాఱుఁ బల్కుచు నిజాగ్రజుపోయినవంకఁ బోయినం
         దనమదిఁ బొంగి రావణుఁడు తాపసవేషముతోడఁ జెచ్చెరన్.
    ఉ. మానిత మైనదండముఁ గమండలువున్ ధరియించి రక్తకా
         పీనము నొప్పఁ దాల్చి జరఁ బెద్దయు వ్రాలినమేనితోడ న
         చ్చో నటు నిల్చి యుల్లసిలుచున్ హరినామము లుగ్గడించుచున్
         జానకి యున్నమందిరము చక్కటిఁ జే యెలయించి పట్టుచున్.
    తే. అరిగి నారాయణా యంచు నల్ల పర్ణ, శాలలోపలఁ జొచ్చిన జనకతనయ
          యతివరుండు మహావృద్ధుఁ డనుచు దర్భ, పీఠ మిడి యర్ఘ్యపాద్యముల్ ప్రియముతోడ.
    చ. గురుమతి నిచ్చినం బ్రియము గూరఁగఁ గైకొని యింత యొప్పునే
         హరిహరి యీనివాస మని యల్లన నాసతియొప్పు సూచుచున్
         మరుఁడు గలంచినం దరుణిమాటలు కొన్ని వినంగఁ గోరి నీ
         చరితము నూరుఁ బేరుఁ బతిచందము చెప్పుము నాకు నావుడున్.
    వ. ఇమ్మహాత్మునికిం జెప్పిన నేమి కొఱంత యని యమ్ముగ్ధ మొదలుకొని సవిస్తరంబుగా.
    క. జనకునిమహిమయు దశరథు, పెనుపును దత్సుతులవిధముఁ బ్రీతి యెసంగన్
         వనమునకు రామచంద్రుఁడు, చనుదెంచిన తెఱుఁగుఁ జెప్పె సముచితభంగిన్.
    వ. చెప్పిన విని రావణుం డిట్లనియె.
  15. 96 మొదలుకొని 101 వఱకుఁ గలవ్రాఁతప్రతులపాఠము .
    తే. ఏను మన్నించు సుందరుఁల్ వేన వేలు, నిన్నుఁ గొలువంగ ధన్య వై నన్నుఁ జెంది
         మనెదు గా కింక నీపేదమనుజుతోడి, మనువు నీ కేల చనుదెమ్ము వనజవదన.
    మ. అనినన్ భూనుత రోషసంభ్రమభయవ్యాలోల యై
          ... ... ... ... ... ... .... .... .... .... .... .... ... ...
  16. 103 మొదలుగా 109 వఱకుఁ గలపాఠము.
         అనిన నన్నేమిగాఁ జూచి యాడి తనుచు, వసుర వింశతిబాహులు నతిశయోగ్ర
         వదనదశకంబు మెఱయంగ వామనయన, యెదుర నిలిచినఁ గంపించి యుదిలకొనుచు.
    క. తిరుగుడు పడి వెనువెనుకకు, నరుగఁగ వడిఁ బొదివిపట్టి యరదము పైఁ జె
         చ్చెర నిడి యంబరపథమున, నరిగె దశాననుఁడు వికసితాననుఁ డగుచున్.
    ఉ. అత్తఱి సీత దల్లడిలి హా రఘునాయక హా నరేంద్ర న
         న్నిత్తఱిఁ గావ ర మ్మనుచు నెత్తిలి యేడ్వఁగఁ బంక్తికంధరుం
         డత్తరుణిన్ నయం బఱి భయంపడునట్లుగ బి ట్టదల్చుచుం
         దత్తఱపాటుతో నిజరథంబు నభంబునఁ దోలె నుద్ధతిన్.
  17. మగుడవే
  18. ఇందులకు 'విని యోహో వెఱవకు వెఱ, వను నీ కే వెనుక నున్నవాఁ
    డవ యి న్నీ, చునిఁ బో నీ కిపుడు వధిం, చి నినున్ విడిపింతు ననుచుఁ జెచ్చెరఁ బెలుచన్' అని
    వ్రాఁతప్రతులం బద్య మున్నది.
  19. 'కడఁగినన్, ఘన మైన కోపవహ్నియు, వెనుఁబడ' అ. ప్ర.
  20. 'బొదలఁగా స్వాంసంధుల్ దెగంగా' అ. ప్ర.
  21. 'ఖరనఖరములన్ గాత్రముం జోన్సు దేరు' అ. ప్ర.
  22. విఱిగె వీటతాటన మగుచున్.
  23. భీలభంగిఁ, బదికరంబుల విం డ్లెత్తి పక్షివిభుని
  24. 'జాడ, నరుగఁ జూచిన రాక్షసు నరుగ నీక' వ్రా. ప్ర.
  25. "నీవశ మే యనుచున్ బలంబున, చ్చలము దలిర్ప సీత మది సంతసమున్ వగపుం బెనంగొనన్" వ్రా. ప్ర.
  26. "వ్రేసినచోటన వ్రేసి నొంచుచుం” వ్రా. ప్ర.
  27. ఇది మొదలు “అమ్ముల విండు” లను 386-వ పద్యమువఱకుఁ గల వ్రాఁతప్రతులపాఠము.
    వ. ఇత్తెఱంగునఁ బక్షిపతిని భంజించి దశముఖుండు జటాయువు పడుటకు శోకాకులితచిత్త యై
         తన్నుఁ దాన నిందించుకొనుచు నాక్రందనంబు సేయుచున్న భూపుత్రిం బట్టం జనిన నాదేవి
         తల్లడించి హారామ హారామ యనుచు నొక్కవృక్షం బిరుగేలం బట్టుకొని యీడిగిలఁబడియు
         న్న బి ట్టదల్చి చేతులపట్టు వదల్చి తరువు విడిపించి యెత్తి రథంబునం దిడుకొని వియత్తలంబున
         కెగసి గగనమార్గంబునం బఱవం దొడంగె వప్పుడాయింతి పంక్తికంఠునిం దిట్టుచు ని ట్లనియె నోరిపా
         పాత్మ రామునికోపానలంబున నీవు సబాంధవంబుగాఁ ద్రుంగెదు ఘోరరౌరవాదినరకంబులం గూలెదు
         నిర్మూలం బయ్యెదు చలంబు వలదు నన్ను విడిచి మిన్నక చను మని మఱియుఁ బెక్కుభంగుల నార్తి
         మెయిం బలుకుచు నలుదిక్కులు సూచి యొక్కగిరిశృంగంబున నున్నకపుల నేవురం గాంచి తనక
         ట్టినపుట్టంబుకొంగు నించి దానం దనభూషణసంచయంబు మడించి వారలనడుమఁ బడవైచి చని
         యె నివ్విధంబున వియద్గమనంబున నతిత్వరితగతిని రావణుం డనేకగిరిసరిదరణ్యంబులు గడచి చని
         సముద్రము దాఁటి లంకాపురంబుఁ బ్రవేశించి జానకి నశోకవనంబున డించి యనేకదనుజాంగనలఁ
         గావలియుంచి బహువిధంబులగు మారవికారచేష్టల నాజగత్కల్యాణికి మిగుల శోకం బాపాదించుచు
         నమ్మహాపతివ్రత తన్ను నిరాకరించి పలుకుపలుకులకు మదనునివూములుకులకు నెరియుచుండె నంత
         నిక్కడ.
    తే. అన్ని కెదురేఁగుతమ్ముని కచట నుండి, వచ్చురఘురామునకు బలవంత మైన
         తలఁకుఁ గలఁకయు మనమునఁ దలకొనంగఁ, దొడఁగె దుశ్శకునంబులు వొడమె నంత.
    ఉ. చింతఁ దలంకువానిఁ గడుఁజింతఁ దలంకెడువాఁడు తద్దయున్
        వంత దొలంకువాని బలవంతపువంత దొలంకువాఁడు దా
        నెంతయు నార్తు నార్తిఁ గని యెంతయుఁ దూలెడువాఁడు దుర్దశా
        క్రాంతుని దుర్దశామయుఁడు గాంచె వరానుజుఁ డగ్రసంభవున్.
    క. కనుఁగొని మ్రొక్కిన రాముఁడు, మనమునఁ దలరుచును బుద్ధిమంతుఁడ వయ్యున్
        వనమున జానికి నేమఱఁ, జనునే చనుదేర నేల చనుదెంచి తనా.
    మ. అనినం గన్నుల బాష్పము ల్దొరఁగ నయ్యబ్జాస్య త న్నట్టు లొ
        ప్పనివాక్యంబుల నొవ్వఁ బల్కుటఁ బ్రకంపం బైన దేహంబుతో
        ననుజుం డల్లనఁ జెప్పెఁ జెప్పుటయు దుఃఖావేశ మంతంతకుం
        దనుకం బాపఁ దలంచి తాఁ గలఁచెనే దైవంబు సీతం గటా.
    క. ఏ నసురచేతఁ జిక్కుట, గా నాత్మఁ దలంచి నిన్నుఁ గరకరిమాటల్
        మానిని యాడినయంతన, దీనికి నిటు రాఁగఁదగునె ధీరవిచారా.
    శా. అన్నా నన్ను బలాఢ్యుఁగా నెఱుఁగు దీ వన్నాతి శోకార్తిమై
         నిన్నుం బల్కిన నింతనంతి నయినన్ నీ వుండవై తింతకున్
         నన్నున్ నిన్నును వేఁచుదానవులు మానం బూన మై పోవఁగా
         నన్నాతిం గొనిపోవకుండుదురె హా యయ్యో కడుం గ్రూరతన్.
    చ. దనుజులచేత జానకి విధాతృవశంబునఁ బోవు నేనియున్
        మనమునఁ గ్రందుశోకమున మ్రందుకు నే నట మున్న చత్తు నీ
        ననయము దుఃఖవార్ధి మనయమ్మల కెంతయుఁ జాల నెక్కు డై
        తనరదె కైకగర్వము సుధాకరుఁ డై మును పొంగఁజేయఁగన్.
    ఆ. అనుచుఁ బెక్కుదలఁపు లాత్మలోఁ దలకొనఁ, దల్లడిలుచుఁ జాలఁ దెల్లనగుచు
        నతఁడు నతఁడు వేగ మరిగియుఁ దమపర్ణ, శాలకడకు రామచంద్రుఁ డంత.
    సీ. అల్లంత నెదురుగా నబ్జాస్య ప్రియముతో, నేతేరకుండుట యెట్టులొక్కొ
        ముంగిట నాన నాముగ్ధ మెలంగుట, యెఱుఁగంగరాదయ్యె నెట్టులొక్కొ
         యదె మందిరద్వార మాలోని బయలఁ గ, ట్టెదుటను గనఁదోఁప దెట్టులొక్కొ
         యాలోను సూడంగ నాలుగుమూలల, నింతి లేకుండిన పెట్టులోకొ
         యనుచుఁ బెదపులు దడుపుచు నాననంబు, డిల్ల పడఁగను గుండెలు జ ల్లనంగ
         నమ్మహారాజు పర్ణగృహంబు సొచ్చి, చూచి మూర్ఛిల్లె దుఃఖాబ్ధి వీచులడర.
    మ. పతి మూర్ఛిల్లిన లక్ష్మణుండును భయభ్రాంతాత్ముఁ డై మెల్పుతో
         నతనిం దెల్పుచు నర్ధి దేవ మన మీయారణ్యదేశంబులన్
         సతి నన్వేషణ మాచరింపక మరిన్ సంతాప మి ట్లేల భూ
         సుత యిచ్చేరువ నుండఁబోలు నిట వచ్చుం జీరెదం జూచెదన్.
    మ. అనుచుం బెల్లుగ బాష్పముల్ దొరఁగఁగా నన్నం గనుంగొంచు గ్ర
         క్కున నల్దిక్కులు నేఁగి చూచుచును నగ్ఘోరాటవీవీథులన్
         జని యోజానకి యోమహీతనయ రాజస్వామి యేతెంచె ర
         మ్మనుచుం బల్మఱుఁ జీరుచున్ భరితశోకాక్రాంతుం డై తూలుచున్.
    వ. సముద్భ్రమితుం డయి భ్రమియింప నిట రామభూకాంతుం డత్యంతమూర్ఛాపరవశుం డై వెడ
         వెడ దెలిసియుండ నమ్ముందట వైదేహి వచ్చి నిలిచిన ట్లయిన దిగ్గున లేచి.
    ఉ. కన్నులు విచ్చి సీతఁ బొడగానక కానన మెల్లఁ గ్రుమ్మరున్
         గన్నులు మూసినప్డు పొడ గానఁగ వచ్చిన సంతసిల్లుఁ దాఁ
         గన్నులు విప్పవోడుఁ బొడ గాననొకో యని విహ్వలించు ని
         ట్లెన్నివిధంబులం దలఁపు లేఁపఁగ రాముఁడు దూలు నెవ్వగన్.
    వ. ఇవ్విధంబున.
    క. అనుజుండును ఘనశోకం, బునఁ దూలుచు నధికశీఘ్రమున నయ్యెడకుం
         జనుదెంచి యచ్చ టెల్లను, మునుకొని తడవంగ నుల్లమునఁ దలఁచి వెసన్.
    వ. అగ్రజున కత్తెఱంగు తగుభంగులం జెప్పి.
    మ. వెదకం జొచ్చిరి రామలక్ష్మణులు పృథ్వీజాత గర్తంబులం
         బొదలం బుట్టల భూగృహంబుల లతాపుంజప్రదేశంబులన్
         నదులం గొండల నీరపుంగుహలలోనన్ లోయలన్ సానుదే
         శదృషత్సంధులఁ గ్రంతలం బడుకులన్ శాఖిప్రతానంబులన్.
    క. అప్పుడు రాముఁడు శోకం, బుప్పొంగఁగఁ దల్లడిల్లి యుల్లము వగలం
         ద్రిప్పుకొనఁ బర్ణశాలకు, నెప్పటి చనుదెంచె నలఁత యెక్కుడు గదురన్.
    వ. తత్సమీపతరుజాలంబులఁ గలయం బరికించి పరిభ్రమించుచు.
    సీ. సహకారతరువ మత్సహచరి నతిముక్త, కంబ యనతిముక్తఁ గాంచనంబ
         కాంచనవరవర్ణఁ గర్ణి కౌరంబ యా, కర్ణాంతలోచనఁ గ్రముకతరువ
         వరసవక్రముకకంధరఁ దిలకంబ స, త్కులతిలకంబు బంధూకకుజను
         బంధూకకుసుమవిభ్రాజితాధరఁ బీన, సరకుచలికుచంబ చంపకంబ
         చంపక ప్రసవన సమజారుతమశి, రీషవృక్షంబ నవ్యశిరీషపుష్ప
         సదృశకోమల భూమిజ జనకతనయఁ, గానరే యంచు రాముఁ డక్కాననమున.
    క. వెదకుచుఁ బ్రేమం దిరుగఁగ, నుదిలకొనుచు లక్ష్మణుండు నురుతరశోకా
         స్పదచిత్తుఁ డగుచు వెడవెడ, గదిసి తిరిగి తిరిగి నెడలఁ గ్రమ్మఱఁ దిరుగున్.
    క. పలుమాఱుం గ్రమ్మఱుటకుఁ, గలఁగంబడ కడవిలోనఁ గలమృగములు ని
         శ్చలగతిఁ దము నాలించుచుఁ, బొరి మేయఁగ వాని నడుగఁ బోవుచు మఱియున్.
    ఉ. గంధగజంబ గంధగజగామిని సింహమ సింహమధ్యఁ బు
         ష్పంధయ పుష్పరంజితవిభాసిలతానివహంబ చారుపు
         ష్పందయపుంజరంజితవిభాసిలతానిభకుంతలాంగి నో
         బంధురచక్ర చక్రకుచఁ బద్మమ పద్మనిభాస్యఁ గానరే.
    తే. అనుచు నేమిటి నైనను నడిగి యడిగి, యెక్కడికి పైనఁ జని చని యెందు నైన
         మెలఁగి మెలఁగి యెచ్చట నైన నిలిచి నిలిచి, యెంతయును దిమ్మదిరిగె రాజేంద్రసుతుఁడు.
    సీ. ఇబ్భంగి దిరుగంగ నబ్భూమిపాలుని, ముందటఁ బిఱుఁదను గ్రందువొలసి
         జానకి పెంచిన చారుకురంగశా, బకములబడి వానిభావ మరసి
         యవి చొప్పుచూపెడు నవియునుబోలె నై, యరిగెడు నని వానియరుగుజాడఁ
         దిరుగంగ దక్షిణదిశకునై యవి చేరఁ, దోడన నృపుఁ డేఁగఁ దోఁచె నెదుర
         సీతతలపువ్వులును నవ్విశేషవినుత, తారహారంబు విలసితచారుపాద
         కటకమును నంతనంత నక్కానలోన, వానిఁ గనుఁగొని రామభూవరుఁడు దలరి.
    ఉ. అక్కట సీత నొక్కఁడు మహాదనుజుండు భయంకరంబుగా
         నిక్కడ దింపఁగా దొరఁగి యిమ్మెయి రాలినభూషణంబు లీ
         చక్కటిఁ జల్లి యద్దనుజుఁ జక్కడువం దఱి గాన నైతి నిం
         కెక్కడిపౌరుషం బనుచు నెంతయు మూర్ఛను వ్రాలె భూస్థలిన్.
    క. అనుజుఁడు ఘనశోకంబున, మునుఁగుచు రఘునాథుఁ దేర్చి ముద్దియ నీచొ
         ప్పున నరయుద మని చెప్పఁగ, వినుచుం బతి మఱియు శోకవిహ్వలుఁ డగుచున్.
    ఉ. ఏ నిలఁ బాపకర్ముఁడఁగ నిమ్మెయి నాసతిఁ గ్రూరకర్ముఁ డై
         దానవుఁ డొక్కరుండు ధృతిఁ దాఁ జెఱపట్టఁగ నూరకుండిరే
         భానుఁడుఁ బంచభూతములుఁ బాపవిచారులు వీరిఁ ద్రుంచినం
         గాని మనంబు సెన్వగలు గ్రాఁగవు నా కని యుగ్రమూర్తి యై.
    వ. సముద్దండం బగుకోదండంబు గైకొని రోషభీషణంబుగా గుణనినాదంబు సేయుచు.
    మ. అతిరూక్షేక్షణుఁ డై రఘూద్వహుఁడు బ్రహ్మాస్త్రంబు సంధింపఁగాఁ
         గుతలం బల్లలనాడెఁ జుక్క లురిలెన్ గొండల్ వణంకెన్ భయా
         హతి సప్తాశ్వునియశ్వసప్తకము మోహభ్రాంతిఁ దూలెన్ దిశా
         పతు లెల్లం గఱఁగంగఁ బాఱిరి సముద్ర్భాంతాత్మచేతస్కు లై.
    వ. ఇట్లు ప్రళయకాలసముద్దీప్తరౌద్రుం డయినరుద్రుండునుంబోలె నున్నయా రామభద్రునితోడ
         జగన్మైత్రీకరణచరిత్రుం డగుసుమిత్రాపుత్రుం డిట్లనియె.
    సీ. మును శాంతమతిఁ గృపాముగ్ధుండు నా నుండు, నీకు నీ విధమున శోకమోహ
         మునఁ జేసి బుద్ధి మాలి నిజస్వభావవి, కల్పనం బొనరింపఁ గణఁగ నగునె
         కుటిలమానముఁ డొక్కఁ డిటు లెవ్వఁడే నకృ, త్యము సేయ నింతకు నలుగ ధర్మ
         మే లోకమున నెల్ల నెలసి తడవ మన, యాయాస మెఱిఁగియు నవనితనయ
         నపుడు చూప నెఱిఁగి యాద్రోహిఁ గని పట్టి, పేర్చి యాప్తమిత్రభృత్యపుత్ర
         యుతముగా వధించి యుర్వీజఁ దెత్తము, గాక లోకభయముఁ గాతు గాక.
    క. అని పల్కినతమ్మునివా, క్యనిరూఢి మనంబులోనఁ గైకొని రోషం
         బు నడఁచి ధరణితలమ్మున, ధను వల్లన యూఁది శాంతి తనమదిఁ గదురన్.
    వ. కౌసల్యానందనుండు సుమిత్రానందనుం గనుంగొని యింక మనకుఁ జేయవలయుపని యెయ్యది
         యని యడిగిన నతం డిట్లనియె.
    సీ. ఈభూషణము లున్న యీజాడ విడువక, పోవఁ బోవ నెఱుంగఁ బోలు మనకు
         నెల్లఁ దెల్లంబుగా నిది నిశ్చయం బన్న, నట గొంతద వ్వేఁగి యచట వజ్ర
         పటుపాతనక్షతపక్షశైలోత్తుంగ, ఘోరాంగుఁ డై ధాత్రిఁ గూలి యున్న
         వాని నీరంధ్రనిశ్వాసధూసరుని వి, హంగపుంగవుని నల్లంత నంతఁ
         గాంచి రఘుపతి లక్ష్మణ కంటె వీఁడు, జనకజను మ్రింగి గ్రద్దరూ పొనరఁ దాల్చి
         కార్యమున నున్నవాఁ డుగ్రసాయకమున, వీనిఁ బొలియింతు నన్న మద్వినుతశక్తి.
    మ. అనుచుం గ్రూరశరంబు వే తొడువఁగా నాలించి హీనస్వరం
         బునఁ బక్షీంద్రుఁడు రామచంద్రు నను నో భూనాథ సీతాసతిం
         గొనిపోవన్ దశకంఠుఁ డాదనుజునిం గ్రూరోద్ధతిం దాఁకి నే
         నని ని ట్లైతి జటాయు వండ్రు ననుఁ దథ్యం బింతయుం జెప్పితిన్.
    క. అనునప్పలుకులకుఁ గృపా, జవితుం డై యేయు టుడిగి సౌమిత్రియుఁ దా
         నునుఁ జేర నరిగి ఖగపతిఁ, గనుఁగొని తదవస్థదు చూచి కడు దుఃఖితుఁ డై.
    వ. మహాత్మా దశకంఠుం డెట్టివాఁడు వాఁ డేల నాతోడ విరోధంబుఁ బూనె వాఁడు మహీతనయ
         నట్లు గొనిపోవునెడ నాసాధ్వి యేమని విలపించె నీ వెచటనుండి వచ్చి యి ట్లయితి వింతయుం
         జెప్పనోపుదేనిఁ జెప్పవే యనుటయు నతం డెట్టకేలకు నొక్కింత యెలుంగు దెచ్చుకొని యిట్లనియె.
    శా. ఈవుం దమ్ముఁడు దవ్వుగాఁ జనుడుఁ దా నేతెంచి సీతన్ దశ
         గ్రీవుం డుద్ధతిఁ గొంచు నేఁగుపెడ ధాత్రీపుత్రి
         రావం బెల్లెడఁ బె ల్లొనర్ప విని దుర్వారోద్ధతిం దాఁకి య
         ద్దేవారాతి నెదుర్ప నే నడచి యుద్దీప్తస్ఫురచ్ఛక్తిమై.
    తే. రణ మొనర్చితి నాదుపరాక్రమమున, దానవుని రథరథ్యకేతనశకలము
         లవనిఁ జేడ్పడి తొఱఁగి యున్నవి నరేంద్ర, యవధరించెద వవియెల్ల నచటనచట.
    సీ. తడవుగా పనిచేసి తలగిన నన్ను నా, రాక్షసుం డసిధారఁ బక్షయుగముఁ
         గడువడి ఖండించి పడఁద్రోచి కొనిపోయె, భూమిజ నది బిందునామధేయ
         మగుముహూర్తము గాన యావేళఁ జే దప్పి, పోయిన సొమ్ములు పోవు పాసి
         తత్కర్తఁ జేరు నింతయు నిక్కువము నీవు, శోకింపకుము సీత నీకుఁ జేరు
         వాఁడు విశ్రవఃపుత్రుఁడు వైశ్రవణుని, యనుజుఁ డని చెప్పి మఱి చెప్ప నవశుఁ డగుచుఁ
         బక్షివల్లభుఁ డుత్క్రాంతపవనుఁ డయిన, మనుజపతి శోకదందహ్యమానుఁ డగుచు.
    క. మిత్రో త్తముఁ డీపుణ్యచ, రిత్రుండు పతత్రిపతి ధరిత్రిజ కై మ
         చ్ఛత్రుం దొడరి సుమిత్రా, పుత్ర వినుము దివికి నరుణపుత్రుం డరిగెన్.
    వ. ఇంక నేమి సేయువార మనుచు శోకాక్రాంతుం డయి పెక్కువిధంబులం బలవించి యమ్మహీ
         కాంతుండు సౌమిత్రిం గనుంగొని.
    క. మనజనకుం డాదశరథ, జననాథన కెట్టు లట్ల సద్విధి బక్షీం
         ద్రునకుఁ బితృమేధకార్యం, బొనరింపఁగ వలయు ననుచు నుల్లము దనరన్.
    తే. అచ్చటను గాష్ఠసంచయ మనుజుఁ డొయ్యఁ, జేర్ప నన్నిటిఁ జితిగా నొనర్పఁ బనిచి
         యందుఁ బ్రజ్వలితాగ్ని విహంగనాథు, వినుతదేహంబు సంస్కారవిధి యునర్చి.
    చ. ఆనవరతాత్మపుణ్యులకు నార్తశరణ్యులకుం బ్రశాంతవా
         క్యనిరతభవ్యచిత్తులకు నాప్తసువృత్తుల కెట్టిభంగిఁ బూ
         జ్యనియతభోగముల్ గలుగు నట్టి పదంబులు సౌఖ్యసిద్ధి యి
         య్యనఘునకున్ జటాయువున కయ్యెడు మంచు మదిం దలంచుచున్.
    వ. గౌతమీగంగకు నరిగి యం దుదకకర్మం బాచరించి కృతకృత్యు లై తదనంతరంబ.
    ఉ. భానుకులావతంసములు పశ్చిమ మై యట యేఁగి యజ్జన
         స్థాన మతిక్రమించి మఱి దక్షిణమార్గము కొంతదవ్వు వోఁ
         గా నెదురన్ ధనుర్ధరులు గాంచిరి సింహతరక్షుసైరిభా
         ఖ్యానమృగోగ్రసంగ్రహముఁ గ్రౌంచమహాగవనంబు ముందటన్.
    క. ఆవనమధ్యంబునయం, దావీరులు తటమహోర్మిహస్తను సంస్తు
         త్యావర్తనాభి ఫేనా, లీవిలసనఁ గనిరి నుతసలిలఁ దమసనదిన్.
    తే. తదుపరోధవనీస్థలి దాశరథులు, ఘనులు గాంచి రయోముఖి యనునిశాటి
         నూర్ధ్వకేశి లంబస్తని నుష్ట్రకంఠి, కుండకుక్షి ఘూకస్వన ఘోర నెదుర.
    క. అగ్గలిక నానిశాచరి, దగ్గఱఁ జనుదెంచి రాముతమ్ముకరమ్మున్
         దిగ్గనను బట్టి కటికిన, వుగ్గడువుగ వికటదంష్ట్ర లొగి మెఱవంగన్.
    తే. అన్నిశాటి సౌమిత్రి కి ట్లనియె నర్థి, నిన్నుఁ జూచి నే వలచితి నన్ను భార్య
         గాఁ దలంపుము రతికేలిఁ గావు నాదు, పే రడిగితే నయోముఖి వీరవర్య.
    క. అని పలికిన నవ్వికృతా, ననఁ బాయఁగఁ ద్రోచి కినిసి నాసాకర్ణ
         స్తనఖండన మొనరించెను, సునిశితకరవాలధారఁ జూలుక న్నలుకన్.
    తే. ఇట్లు వికృతిగా నొనరించి యిట్టు లనియె, నోనిశాటి నీయొప్పున నున్న నిన్నుఁ
         గన్నవా రార్తిఁ దూలరె కాముచేత, బేల నీ కింత వలవని జాలి యేల.
    క. ఈలీల సుమిత్రాసుతుఁ, డాలిగొనఁగ నెత్తు రొడల నంతటఁ గాఱన్
         దూలుచు నంతన సోలుచు, వ్రాలుచు జోలుచును బాఱె వడి నాసురియున్.
    క. ఆనృపసూనులు తమసను, స్నానం బొనరించి ప్రీతిఁ జనుదెంచిరి శా
         ఖానూనతరువ్రజముల, చే నుగ్రాతపముఁ దమ్ముఁ జేరమిని నటన్.
    క. మును భయముఁ బిదప విజయం, బును నగుశకునములు గాంచి భూపాలకులుల్
         వన మెల్లఁ గదలుఘనని, స్వన మాలించి యిది యేరవంబొకొ యనుచున్.
    వ. చని ముందట.
    శా. శిరముం గంఠము లేక వక్షమునఁ బ్రస్ఫీతాంబకంబున్ నిజో
         దరదేశంబున వక్త్రముం గలుగు నద్దైత్యాధమున్ శత్రుభీ
         కరసారోగ్రు నుదగ్రవిగ్రహరయద్గర్వగ్రహగ్రస్తు ను
         ద్ధురమోహాంధునిఁ గ్రౌర్యబంధునిఁ గబంధుం గాంచి రారాఘవుల్.
    వ. అట్టియెడ శిరోవిరహితమహితకబంధుం డగునాకబంధుండు యోజనదీర్ఘంబు లగుతనబాహుల
         నమ్మహానుభావుల నిరువురం బొదివి సూర్యగ్రహనిగ్రహకరం బగు గ్రహణగ్రహంబుమంబోలె నదల్చి
         వారి కి ట్లనియె.
  28. తే. ఇట్లు కూలినదైత్యుఁ డొక్కింతవడికిఁ, దెలివి నొంది మీ రెవ్వ రత్యలఘుశౌర్యు
         లార యనఁ దమకథల నల్లనను దెలియ, నంతయును జెప్పి నాసుమిత్రాత్మజుండు.
    క. విని రామలక్ష్మణులఁ గని, జనవంద్యులు మీరు మీప్రసాదంబున మ
         ద్ఘనదుఃఖ మెల్లఁ బాసెను, వినుఁ డస్మద్విధముఁ దెలియ వినిపింతుఁ దగన్.
  29. తపమున మెప్పించి తత్కృపఁ జిరజీవి, కతయును బీరంబుఁ గామరూప
    కత్వము నేఁ గాంచి క్రౌర్యపరుండ నై, హింస కాస్పదుఁడ నై యెపుడు సమద
    లీలఁ దిరుగుచు నొక్కచో స్థూలశిరుఁ డ, నంగ నొకముని తపము సేయంగ నచటి
  30. సీ. ఆసరోవరమునం దానృపాలాత్మజు, లతిశయస్నానపానాదివిధులు
         ప్రియమునఁ జలిపి సంప్రీతాంతరంగు లై, తత్సమీపోన్నతతరుచయంబు
         శీతలచ్చాయ నాసీనులై కొండొక, యలసట దీఱంగ నచట నిలిచి
         సౌఖ్యంబు నొందిరి సత్సేవ్య మైనయీ, యారణ్యకాండంబు నర్థితోడ
         వినినఁ జదివిన వ్రాసిన విస్తరించి, చెప్పినను వారలకు సౌఖ్యసిద్ధి యగును
         సంపదాయురారోగ్యముల్ సంభవించు, నఖిలపుణ్యంబు లెప్పుడు ననుభవింత్రు.