భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/ముహమ్మద్ గౌస్ ఖాతూన్
మాతృదేశ సేవలో సర్వస్వం త్యాగం చేసిన
ముహమ్మద్ గౌస్ ఖాతూన్
(-1990)
స్వాతంత్య్రోద్యమంలో ప్రత్యక్ష, పరోక్ష కార్యాచరణ కలిసికట్టుగా సాగుతుంది. ప్రత్యక్ష కార్యక్రమాలలో ధైర్యసాహసాలు ప్రధానం కాగా, పరోక్ష కార్యకలాపాలకు సమర్పణ, సహనం, ఓర్పు, త్యాగాలు ప్రాణం. పరోక్ష కార్యాచరణలో భాగంగా త్యాగాల బాటలో నడిచిన మహిళ శ్రీమతి ఖాతూన్ బీబీ.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధాుడు ముహమ్మద్ గౌస్ బేగ్ జీవిత సహచరిణి ఖాతూన్ బీబీ. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ప్రత్యేకస్థానం పొందటమేకాక, మహాత్ముని అభినందనలు అందుకున్న చీరాల-పేరాల పోరాటం, పెదానందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యామంలో ముహమ్మద్ గౌస్ బేగ్ పాల్గొన్నారు. ఖాతూన్ బీబీ మాత్రం ప్రత్యకంగా జాతీయోద్యామ కార్యక్రమాలలో పాల్గొనలేదు. పరోక్షంగా జాతీయోద్యమానికి సర్వసం త్యాగం చేశారు. భర్తకు అన్ని విధాల అండదాండలుగా నిలవటమే కాక, జాతీయోద్యమ నేతలు భోగరాజు పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయమ్మ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి ప్రముఖులకు తన ఇంట ఆతిధ్యం కల్పించారు. జాతీయ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పట్ల ఖాతూన్ ఎంతో ఆదరణ, ఆప్యాయతలు చూపారు. ఆమె ఇల్లు ఉద్యామకారులకు స్వంత గృహం లాగుండేది.
225 1921 నాటి సహాయ నిరాకరణ ఉద్యమంలో మహమ్మద్ గౌస్ బేగ్‌నుబ్రిటీష్ ప్రబుత్వం అరెస్టు చేసి ఒక సంవత్సరం జెలు, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా కట్టానికి డబ్బు కావాల్సి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వలేని సమయంలో ఖాతూన్ బంగారాన్ని అమ్మి జరిమానా కట్టారు. ఆ తరువాత మరోసారి గుంటూరు జిల్లా, పెదానందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన గౌస్ బేగను ప్రభుత్వం అరెస్టు చేసి సంవత్సరం జైలు, వెయ్యిరూపాయల జరిమానా విధించింది. ఆ సమయంలో కూడ జరిమానా కట్టేందుకు డబ్బు లేనందున, ఖాతూన్ తన వంటి మీద ఉన్న బంగారాన్ని పూర్తిగా అమ్మగా వచ్చిన సొమ్ముతో జరిమానా కట్టారు. ఆడంబరాలెరుగని ఆ తల్లి అప్పటి నుండి తన జీవితంలో మరెప్పుడూ బంగారం ధరించలేదు.
గౌస్ బేగ్ శాసనోల్లంఘన ఉద్యమంలో గుంటూరు జిల్లా ఉద్యమ బాధ్యతలను నిర్వహించారు. అందుకు ఆగ్రహంచిన ప్రభుత్వం ఆయన చరాస్తిని వేలం వేసి లభించిన నగదును జరిమానా క్రింద జమ చేసుకుంది. ఈ చర్యల పట్ల ఖాతూన్ ఏ మాత్రం చలించకపోగా మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం లభించిందాని సంతోషించారు. బంగారం, నగదు నట్రా, పొలం పుట్రా కర్పూరంలా కరిగిపోతున్నా, పేదరికం చుట్టుముడుతున్నా, బేగ్ దంపతులు బేఖాతర్ అన్నారు. మాతృభూమి కోసం సర్వసం త్యాగం చేయగలిగిన అదృష్టం లభించిందంటూ పొంగి పోయారు.
జాతీయోద్యమంలో పాల్గొంటున్న కార్యకర్తలు, నాయకులు కుటుంబాలను వదలి వచ్చి బ్రిటీష్ ప్రభుత్వపు క్రూరత్వానికి గురవుతున్నప్పుడు, ఆ మాత్రం సేవలందించి మాతృభూమి రుణం తీర్చుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నించిన ఖాతూన్ ఆసిపాస్తులన్నీ హరించుకు పోతున్నా ఏమాత్రం చింతించలేదు. స్వదేశీ వస్త్రధారణకు, స్వదేశీ వస్తు వినియోగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆమె ఖాదీ ప్రచారంలో ఎంతో శ్రద్ధగా పాల్గొన్నారు. జీవితాంతం ఖద్దరు ధరించారు. మహమ్మద్ గౌస్ బేగ్ 1976లో మరణించగా శ్రీమతి ఖాతూన్ 1990 నవంబరు 20న తనువు చాలించారు.
226