భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం షరీఫా హమీద్‌ అలీ

వికీసోర్స్ నుండి

మహిళా చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించి

బేగం షరీఫా హమీద్‌ అలీ

జాతీయోద్యమంలో రాజకీయ -సాంఘిక సంస్కరణలు సమాంతరంగా సాగాయి. ఆనాటి రాజకీయాలలో ప్రత్యక్ష్యంగా పాల్గొనలేక పోయిన ఉద్యామకారులు సామాజిక సంస్కరణల పోరులో భాగస్వాములయ్యారు. ఈ విధగా రాజకీయాద్యమంలో పరోక్షంగా పాల్గొంటూ సంస్కరణోద్యమంలో పత్యక్ష్యంగా కార్యాచరణకు దిగిన యోధులలో బేగం షరీఫా హమీద్‌ అలీ ఒకరు.

ప్రగతిశీల భావాలను స్వాగతించే కుటుంబంలో ఆమె జన్మించారు. ఉర్దూ, గుజరాతీ, ఆంగం, సింధి, మరాఠి, ప్రెంచ్‌ భాషలను నేర్చుకున్నారు. చిత్రకళ, సంగీతంలో మంచి పట్టు సంపాదించారు. ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారి హమీద్‌ అలీని ఆమె వివాహం చేసుకున్నారు.

భర్త హమీద్‌ అలీ ప్రోత్సాహంలో ఆమె భాషాపరమైన సామర్ధ్యాన్ని మరింత పెంచుకుంటూ, సంగీతం, కళా సాంస్కృతిక కార్యక్రమాలలో పూర్తికాలాన్నివ్యయం చేస్తూ ఆయా రంగాల అభివృద్దికి కృషి ఆరంభించారు. 1907లో కలకత్తా నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె భాగస్వాములయ్యారు. ఆనాటి నుండి జాతీయోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్వదేశీ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. మహిళల సంక్షేమం, హరిజనుల అభివృద్ధి తదితర కార్యక్రమాల మీదా షరీఫా హమీద్‌ అలీ దృష్టిసారించి అధిక సమయాన్ని ఆ రంగాలలో వ్యయం చేశారు.

మహిళలలో చైతన్యం కోసం, తల్లీ-బిడ్డలు తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రతల ప్రచారం కోసం పలు కార్యక్రమాలను చేపట్టారు. గ్రామీణ మహిళల సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక సలహాలు- సూచనలిచ్చి సమస్యల పరిష్కారానికి తోడ్పడ్డారు. మహిళలు తమ శక్తిసామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు వీలుగా వారి బిడ్డల బాగోగులు చూడడనికి నర్సరీలను ఏర్పాటు చేశారు. అఖిల భారత మహిళా కాన్పెరెన్స్‌లో సభ్యత్వం స్వీకరించి ఆ కాన్పెరెన్స్‌ శాఖలను పలు ప్రాంతాలలో ఏర్పరచి మహిళలను సంఘటిత పర్చారు. మహిళల వివాహవయస్సుకు సంబంధించి ఉనికిలోకి వచ్చిన శారదా చట్టం ప్రకారంగా మహిళల వివాహ అర్హత వయస్సును పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌కు అనుకూలంగా మహిళల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ముస్లిం మహిళలకు తగిన భద్రత ఇచ్చేలాగు ఆమె ప్రత్యేక నిఖానామా తయారు చేశారు. ఆ నిఖానామా ఈనాటికి పలు ప్రాంతాలలో అమలులో ఉంది.

1933లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హజరైన ముగ్గురు మహిళా ప్రతినిధు ల బృందాలలో సభ్యురాలుగా మహిళల స్థితిగతుల గురించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు ఆమె ఇంగ్లాండ్‌ వెళ్ళారు. పురుషులతోపాటుగా స్త్రీలకు సమాన ఓటింగ్‌ హక్కుల కోసం ఆమె తన వాదనను బలంగా విన్పించారు. 1937లో శాంతి, స్వేఛ్చ ప్రధానాంశాలుగా జెకస్లోవేకియాలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు.

1940లో అఖిల భారత మహిళా కాన్పెరెన్స్‌కు ఉపాధ్యాక్షురాలిగా, ఆ తరువాత అధ్యక్ష్యురాలిగా బాధ్యా తలు నిర్వహించారు. అఖిల భారత మహిళల విద్యాసంఘంగవర్నింగ్‌ బాడీ చైర్మన్‌గా మహిళా విద్యాభివృద్దికోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఆమె సమాజసేవకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితిలోని మహిళలకు సంబంధించిన విభాగంలో భారతదేశ ప్రతినిధిగా నియుక్తురాలయ్యారు. భారతీయ మహిళల సంక్షేమం కోసం మాత్రమే కాకుండ మహిళల హక్కుల పరిరక్షణకు ఆమె ఎంతో కృషి చేశారు