భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/జైనాబీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రైతాంగపోరాటంలో పోరుబిడ్డలను ఆదుకున్న ధైర్యశాలి

జైనాబీ

బలమైన శత్రువును సాయుధాంగా ఎదుర్కోవడం కష్టతరమైనప్పటికి సాయుధ పోరాట యోధులకు ఆశ్రయమిచ్చి ఆదుకుని కడుపులోపెట్టుకుని కాపాడగల ప్రజల అండదడలు లభించినట్టయితే ఏ పోరాటమైనా ముందుకు సాగుతుంది. శత్రుగూఢచారి డేగకళ్ళనుండి తప్పించుకోని ఆశ్రయమివ్వటం, ఆదుకొనటం సామాన్య ప్రజలకు కష్టతరమైన పని. ఆ కర్తవ్యాన్ని నిర్వహించబూనుకున్న ప్రజలు అత్యంత జాగురూకులై మెలగాల్సి ఉంటుంది. కట్టుతప్పితే, పట్టుజారితే ఆదుకున్న వారి ప్రాణాలకు మాత్రమే కాకుండ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యామకారుల ప్రాణాలకు, ఉద్యమాల మనుగడకు పెనుప్రమాదం దాపురించగలదు. అటువంటి క్లిష్టతరమైన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌లో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సాహసోపేతంగా నిర్వహించిన పలువురు మహిళలున్నారు. ఆనాటి మహిళామతల్లులలో శ్రీమతి జైనాబీ ఒకరు.

అటు నిజాం పాలకులకు చెందిన రజాకారుల, ఇటు భారతీయ సెన్యం కళ్ళుగప్పి తెలంగాణ రైతాంగపోరాట యోధులకు అందండలుగా నిలచిన జైనాబీ రాజారం గ్రామం నివాసి. చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్న ఆమె తన అన్నదమ్ములు, ఒక్కగానొక్క కుమారునితోపాటు రాజరంలో ఉంటున్నారు. అన్నదమ్ములు, కుమారుడు కూలీనాలీ చేసుకుని బ్రతుకు బండిన భారంగా ఈడ్చుతున్న కుటుంబం ఆమెది. భయానక పేదరికం


249 తన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నట్టుగా చుట్టుప్రక్కల ఉన్న ప్రజానీకాన్ని చుట్టుముట్టి ఏ విధంగా సతాయిస్తుందో స్వయం ఆమెది.

ఆనాడు తెలంగాణ ప్రాంతంలో అటు నిజాం నవాబు, ఆ నిజాం నవాబు పేరుతో బ్రతికేస్తున్న భూస్వాములు వందల వేల ఎకరాలను తమ హస్తగతం చేసుకుని రైతులు, ప్రజల మీద పలు దాష్టీకాలకు పాల్పడుతున్నారు. భూమి మీద తిరుగులేని ఆధిపత్యం తెచ్చిపెట్టిన అహంకారంతో రైతాంగం మీదా అంతులేని జులుం ప్రదర్శిస్తున్నారు. ఆనాడు వరంగల్‌ జిల్లా సూర్యాపేట తాలూకా దేశ్‌ముఖ్‌ జానా రెడ్డి ప్రతాప్‌రెడ్ది లక్షా 50వేల ఎకరాలకు, ఖమ్మం జిల్లా మదిర తాలూకా కల్లూరు దేశ్‌ముఖ్‌ లక్ష ఎకరాలకు, నల్గొండ జిల్లా జనగాం తాలూకాకు చెందిన విసున్నూర్‌ దేశ్‌ముఖ్‌ 40వేల ఎకరాలకు, సూర్యాపేట దేశ్‌ముఖ్‌ 20వేల ఎకరాలకు, మిర్యాలగూడ తాలూకా బాబాసాహెబ్‌పేట దేశ్‌ముఖ్‌ 10వేల ఎకరాలకు తిరుగులేని అధిపతులు. ఈ మేరకు 5వేల నుండి 10వేల ఎకరాలు కలిగిన మరెందరో దేశముఖ్‌లు, లక్షల ఎకరాల భూమిని తమ హస్తగతం చేసుకుని రైతాంగం మీద, ఇతర ప్రజల మీద అంతులేని అధిపత్యాన్ని చలాయిసున్నారు.(Telangana peoples Struggle and its lessons, P.Sundaraiah, Foundations Books, New Delhi, Page.9-10)

ఈ భూస్వాములు ప్రజలను గడ్డిపోచల్లా పరిగణిస్తూ, గ్రామాలలో వివిధ వృత్తులతో సేవలందిస్తున్న ప్రజలను తమ ఆజన్మాంత సేవకుల్లా లెక్కిస్తూ భయంకర వెట్టీచాకిరి చేయించుకుంటున్న దారుణపరిస్థితి తెలంగాణలో తాండవిస్తుంది. సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు, పైగార్లులు, జాగీద్దారులు, బంజార్దారులు, ఇజ్జద్దారులు, మక్తాద్దారులు, దేశ్‌ ముఖ్‌లు, అగ్రహరీకులు తదితర పేరతో ఈ భూస్వామ్య శక్తులన్నీ భూమిని, సంపదను తమ చెప్పుచేతుల్లో తాము అడింది ఆట పాడిండి పాటగా సాగించుకుంటున్నారు.

భూస్వామి ఆధిపత్యాన్ని ప్రశ్నించినా, అభిష్టానికి కించిత్తు నిరసన వ్యకం చేసినా ఆత్మగౌరవం గల వ్యకికి ఇక నూకలుచెల్లినట్లే. ఈ మేరకు విస్నూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం దిశగా సాగిన రైతాంగ యోధులు బందాగీ భూస్వాముల కుట్రలకు, కరకు కత్తులకు బలయ్యాలు.ఆయన సాగించిన వీరోచిత న్యాయపోరాటం నేపధ్యంగా రూపొందించిన మా భూమి నాటకం అనాడురైతాంగ పోరాటాలకు ఎంతో స్పూర్తినిచ్చింది.


250 భూస్వాముల అక్రమాలను, ఆధిపత్యాన్ని, అహంకారాన్ని ప్రశ్నించే సాహసాన్నిరైతు జనావళిలో రగిలించింది.

ఈ మేరకు సాగుతున్న భూస్వాముల దోపిడిని అరికట్టేందుకు, ఆరాచకాలను చరమగీతం పాడేందుకు ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ముందుకు కదిలారు. ఏమిటీ జులుం ఇంకానా? ఇకపై సాగదు అంటూ తిరగబడ్డారు. ఆ కదలిక చరిత్ర సృషించిన తెలంగాణ రైతాంగపోరాటానికి ఆయువుపట్టయ్యింది. ఈ పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూస్వాములకు అండగా వచ్చిన శక్తులను ప్రజలు స్రీపురుషుల తేడలేకుండ ఎంతో సాహసంతో ఎదుర్కొన్నారు. అందిన ఆయుధాన్ని, వ్యవసాయ పనిముట్టును తీసుకుని పురుషులు ఎగబడగా, మహిళలు రోకలిబండ, కారం సంచుల తోపాటుగా, వడిసెల పట్టి ముందుకు వచ్చారు. ఈ విధంగా ప్రత్యక్ష్యంగా శత్రువుతో తలపడిన వారు కొందరైతే, పరోక్ష్యంగా పోరుబాటన నడుస్తున్న యోధులకు, దళాలకు ఆశ్రయం కల్పించటం, ఆతిధ్య మివ్వటం, ఆయుధాలను అందివ్వటం, శత్రువు రాకపోకల సమాచారాన్నిచేరవేయటం, పార్టీ నుండి అందిన ఆదేశాలను, రహాస్య సమాచారాన్ని పోరాట వీరులకు అందచేయ డం లాంటి వ్యవహారాలను మహిళలు చాలా సమర్ధవంతంగా నిర్వహించారు.

ఆ క్రమంలో రాజారం నివాసి జైనాబీ కూడ ఇతర మహిళా యోధురాళ్ళతో సమానంగా అత్యంత ప్రధానమైన రహాస్య కార్యకలాపాలను ఎంతో సమర్ధతతో నిర్వహించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె ప్రత్యక్ష్యంగా పాల్గొనకపోయినా, పోరాటయోధులకు అన్నపానీయాలు అందిస్తూ సహాయపడ్డారు. ప్రధాన దళం నుండి తప్పిపోయిన యోధులను క్షేమంగా దళంలో చేర్చటంలో ఎంతో సాహసోపేతంగా ప్రవర్తించారు. దండు రహాస్యాలు చెప్పమని వేదించిన మిలటరీ హింసాకాండను తట్టుకు ని నిలబడ్డారు . భయానక చిత్రహంసలు, వేదింపులకు గురవుతూ కూడ అత్యంత రహాస్యంగా అతి చాకచక్యంతో శత్రువు గూఢచారుల కళ్ళుగప్పి దళసభ్యులకు జైనాబీ సహాయ సహకారాలు అందించి, ప్రజలు ప్రధానంగా రైతులు సాగిస్తున్న సాయుధా పోరాటం ఉజ్వలంగా సాగడనికి జైనాబీ తొడ్పడ్డారు.

ఈ విధంగా తెలంగాణ సాయుధాపోరాటంలో తనదైన భాగస్వామ్యాన్ని నిర్వర్తించిన జెనాబీ గురించి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు శ్రీ పుచ్చలపల్లి సుందారయ్య విరచిత 1972లో ప్రచురితవున Telangana Peoples Struggle and its Lessons


251 (Page. 251- 252) లో ప్రస్తావించారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న మహిళల గురించి ఆయన తన గ్రంథంలో పేర్కొన్న వివరాలు-విశేషాలను 1999లో ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ' తెలంగాణా పోరాటంలో స్త్రీల వీరోచిత పాత్ర ' అను పేరుతో తెలుగులో ప్రచురించిన చిన్న పుస్తకంలో (పేజి. 8-9) జైనాబీ విశేషాలను ఈ క్రింది విధంగా ఉటంకించారు.

జైనాబీ : రాజారం గ్రామంలో ఒక పేదాకుటుంబీకురాలు. చిన్నతనానే భర్త పోయాడు. ఒక్క కొడుకు, తమ్ముడు, తానూ కూలికిపోయి దాని మీద బ్రతికేవారు. చల్లా సీతారామిరెడ్డి - ఆదిరెడ్డి దళం ఆ దగ్గర గుట్టలనే కేంద్రంగా చేసు కుని పనిచేస్తుండేది. ఆ దళానికి ఆహారం అందించి వస్తుండేది జైనాబీ. భారత సైన్యాలు వచ్చిన తర్వాత పార్టీకి బాగా పలుకుబడిగల గ్రామాలన్నింటా పెట్టినట్టే రాజారంలోనూ ఒక మిలటరీ క్యాంపు పెట్టారు . దానికి భయ పడకుండ, అదివరకు కన్న ఎక్కువ జాగ్రతలు తీసుకుంటూ, మరింత ధైర్యంగా దళాలకు ఆహారం చేరవేసే కార్యక్రమాన్ని సాగించింది. ముగ్గురు గెరిల్లా దళసభ్యులు పొరపాటున దారి తప్పి కల్సుకోలేకపోతే, వారికి రక్షణ ఇచ్చి మెల్లగా దళకేంద్రానికి పంపివేయగలిగింది.

ఒక రోజున మిలటరీ ఆమె ఇంటిపై దాడిచేసి, ఆమెను బాది సీతారామిరెడ్డి ఎక్కడున్నాడో చెప్పు-నిన్ను వదిలేస్తాం అంటూ హింసించారు. నాకు తెలియదు అన్నదే ఆమె జవాబు. జమేదారు అమెను బూటుకాళ్ళతో తొక్కాడు. వారి హింసాకాండకు తట్టుకుని నిలచి, మళ్ళీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంది. పేదరికం జెనాబీకి అనుభవమే! అందుకే ఆమెకు పార్టీ అంటే అంత ప్రేమ, విశ్వాసమూ.

ఈ విధగా తెలంగాణా పోరాట మహోన్నత దినాలలో ముస్లిం స్రీలు, పురుషులు ఇతర సోదర జనసముదాయాలతో కలసి ప్రజల బాగు కోసం ఎంతి సాహసోపేత కార్యక్రమాలయినా, తమ ప్రాణాలనుసైతం లెక్క చేయ కుండ నిర్వహించేందుకు ముందుకు వచ్చి తమ భాగస్వామ్యాన్ని అందించారు. పరాయిపాలకులు బానిసబంధానాల నుండి విముక్తికోసం గాని, భూమికోసం-భూస్వాముల నుండి విముక్తి కోసంగాని ప్రజలు సాగించిన అహింసాయుత -సాయుధపోరాట కార్యక్రమాలలో ఇతర జనసముదాయాలతో కలసి ముస్లిం మహిళలు ఉద్యమించి చరిత్రను సృష్టించారు.

252