భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండవ ప్రకరణము

వృత్తుల పరిణామము - ఇతర పద్ధతులు - శ్రేణిపద్ధతి

గ్రామపద్ధతి కానంతరికమయ్యు నద్దానితో బిరిగొని భేదమేర్పఱచుటకుం గష్టమైన శ్రేణిపద్ధతి యనునదొకటిగలదు. శ్రేణియనగా నేకవృత్తులయిన శిల్పులు స్వరక్షణ లాభమ్ములకై సమయకల్పనలతో నిర్మించుకొనిన సంఘము ఇట్టివి యూరోపుదేశమందువలె హిందూదేశ మందంత ఖ్యాతికిరాలేదు. ఎందులకన; మనలో కర్మలు జాతులలో నుపగతములై వర్ణములుగ మాఱినవి. మంగలి, చాకలి, కమ్మరి, గొల్లడు, ఇత్యాద్యసంఖ్య కులభేదములు వృత్తి వ్యత్యాసా విర్భూతములనుటకు సందేహము లేదు. కావున శిల్పశ్రేణులకు బ్రత్యేకజీవనము లేకపోయె. శిల్పములు జాతులలో నావేశించినవగుట వ్యవహార కులధర్మములు ఐక్యముంజెందె. ఈ పావనభూమి గాలిసోకినంజాలు. అన్నియు జాతులౌను! వర్తమానమున జాతిభేదము లనుచితములని వాదించు కొందరు నిర్భేదజాతియను నొక నూతనజాతిగా నేర్పడునట్లు తోచుచున్నది! పెక్కుమొగములుగజీలి ప్రవహించు గంగానదిబోలె నామెను గొలుచు మనమును ఖండఖండములుగా వేఱైయుండుట యేమి చోద్యము? మనగతి తెల్లబాఱినది. దానిమాటయేల? యూరోపులో వ్యావహారిక సార్థములు భిన్నజాతులుగాలేదు.

శ్రేణుల ముఖ్యలక్షణములు

కూలివారివలెంగాక శ్రైణికులు ఉపకరణములు, కచ్చా సామగ్రులు మొదలగు సాధనకలాపమునకు దామే సొంతగాండ్రై యుండియు, గ్రామ్యపద్ధతియందుంబలె మితవ్యాపారకాలము గావున నుత్తరువులంబొందియే సరకుల దయారుసేయువారై యుండిరి. కూలివారికిని శిల్పులకును భేదమేమన్న, కూలివారు పొలములో బని చేయువారివలె గొఱముట్లులేనివారు. సన్నాహముల నన్నిటిని యజమానులే చేయవలయు, శిల్పులన్ననో సాలెలు, వడ్రంగులు మొదలైనవారిం బోలెదరు. ఆయుధములు, నూలు, కొయ్య ఇవన్నియు వారికింజేరినవె గిరాకిదారులచే నీబడునవికావు. కంసాలులు ఈరెండు విధములనుజేరక మధ్యమరీతులుగా నున్నారు. పరికరములు వారివే యైనను పక్వపఱుపబడు బంగారు రత్నములు నాజ్ఞాకరులచే నియ్యబడియెడునవియే.

పరులు పోటీకివచ్చిన నుండునదియు బోవునేమో యను భీతిచే తమచక్రమున నితరులురాగూడ దనియు అందులకు బదులు తామొరుల చక్రమున బ్రవేశింపమనియు సమయములంజేసికొని ఆయా చక్రములవారు వారి వారి సీమల నెదురులేనివారై యుండిరి.

చూడుడు! వర్ణశ్రేణులకుండు సామాన్య ధర్మంబు. వర్ణస్థులు తమలో తమకేకాని, ఇతరులతోగాని, తదితరులచేగాని, స్పర్థలేనివారు. శ్రేణులు నట్లే. ఇక భేదగుణంబు లెవ్వియనిన; శ్రైణికులు తమలోనేకాక యిచ్చవచ్చినచోటుల వివాహ సంబంధముల నేర్పఱచు కొందురు కాన జాతులుగా నేర్పడలేదు. రెండవది - శ్రేణులు స్థానీభావము ననుకరించునవి. గ్రామములట్లు దేశముల నాశ్రయించిన సత్త్వముగలయవి. ఇందునకు దృష్టాంతము. పేరులు ఊరులబట్టి వచ్చును. ఉదా. ఏలూరి కంబళ్ళవారు, విశాఖపట్టణపు దంతవువారు ఇత్యాదులు. కులభేదములు దేశభేదముల నూనినవిగావని మున్నే చెప్పితిమి సాలెనా రెన్నియూళ్ళలో నున్నను వారందఱు నొకతెగవారు. శిల్పసామాజికులు తమలోనేకాని వెలుపల పెండ్లిండ్ల జరుపమని సంకేతించి యుండిరేని యూరోపులోను జాతులు పుంఖాను పుంఖములుగ వెలువడియుండును.

పరతంత్ర పద్ధతులు

పైనుదాహరింపబడిన పద్ధతులన్నియు నొకరీతి జూడబోయిన స్వతంత్రములని చెప్పవచ్చును. ఎట్లన, శిల్పులు తమ సామానులకెల్ల నొడయలై యుండుటయకాక విరచితార్థంబులను నేరుగా వినియోజకుల కమ్ముచుండిరి. ఉత్పత్తికరులకు వినియోగపరులకును నడుమ మధ్యవర్తు లెవ్వరులేక ప్రత్యక్షవ్యాపారములుండెను. కాలక్రమమున, వాణిజ్యచక్రము విరివినొంది నలుదెసలం బ్రసరించుకొలది చేయువారికిని, అనుభవించువారికిని దూరమెక్కువయై యపరోక్షవణిగ్వఠ్తనము పరిహృతంబయ్యె. కర్మకరులయొద్దగొని యుపయోజకుల కమ్ము వాణిజ్యమార్గ ముత్పన్నమై మధ్యమున నిలిచినందున నుత్పాదకులు వర్తకుల నాశ్రయింప వలసివచ్చిరి. మఱియు వాణిజ్యము వ్యాప్తమగుటచే ప్రాచీనపద్ధతిని పరిసరములమాత్ర మెఱింగినవారు దూరపు సమాచారముల నెఱుంగునంత చతురులుగారు గావున మధ్యవర్తులు చెప్పినట్లు వినవలసిన వారైరి. నేరుగజేయు వ్యవహారములుపోయి యితరుల మూలముగ నడుపవలసినవిధుల కధీనులైరి.

వర్తకా ధీవవృత్తులు రెండు తెఱంగులు. నివేశనవృత్తులు, ఆవేశనవృత్తులునని.

నివేశనవృత్తి

నివేశనమనగా నిల్లు. ఇంటివారు తమకుంగాక వర్తకుల ముదల మేరకు నివాసములలో జేయుపనులు నివేశన వృత్తులునాబడు. ఉదా. మునుపు వివరింపబడినట్లు ఉపయోజకులకు నేరుగ సమర్పించుటకుం గాక తమయొద్దగొని యమ్ము వర్తకులకు నిచ్చుటకై తదా దేశ విధేయులై సాలెవారు మొదలగు శిల్పులు తమ నివేశములలోనే నేతపని మొదలగు శిల్పముల జేయుదురేని అది నివేశనవృత్తి.

నివేశనవృత్తులకును గైహిక కళలకును భేదముగలదు. గైహిక కళలనగా గృహస్థులు తమ సంతోష సుఖములకై చేయుకుట్టుపని, అలంకారరచన మొదలగునవి. వృత్తులలో జీవనోపాయసిద్ధి ముఖ్యో ద్దేశ్యము. ఈ ద్వివిధ శిల్పులకు నొకనామముండినను సందర్భాను గుణమై యోచించిచూచిన బొరపాటుల కెడముండదు. నివేశవృత్తి పద్ధతి పూర్వోదిత పద్ధతులకన్న నుత్పత్తి ఎక్కువ గలది. వాణిజ్యవ్యాప్తియు, సరకులకొలది వాణిజ్యము నాతతముచేయ నుత్సహించు వర్తకుల నాయకత్వమును, వృద్ధిబొందించుటయందు నిది యుద్దీపకమై యుండును.

ఇంకను బేహారములు పెచ్చుపెఱిగిన నుత్పత్తియు విపులత బూనవలయును. ఐన నట్టిమహోత్పత్తికి నివేశనవృత్తులు నిదానములు గావు. మఱి యావేశనవృత్తు లందుకు ప్రధాన కారణములు.

ఆవేశనవృత్తి

ఆవేశనమనగా కర్మశాల. కర్మకరులెల్లరు గుమిగూడి కష్టించు ఫ్యాక్టొరీలు.

నివేశనావేశనవృత్తులుకుంగల తారతమ్యములు:-

1. వారివారి యింటనేయుండి పనులం గావింతురేని కాలము వ్యర్థపుచ్చక చక్కగా శ్రమపడుచున్నారా లేదా యని విచారించుటకు వీలుండదు. కర్మశాలలలో భృత్యులను పరిశోధించుట సులభము గాన కార్యము లతిత్వరితముగ నడుచును.

2. ప్రత్యేక గైహికకళలున్నచో నెక్కువ మూలధనమును వేసి గంభీరములైన యంత్రములతో సరకుల దయారుచేయగాదు. గుడిసె గుడిసెకు నొక దూదియంత్రమును ప్రతిష్టింపజూచుట వ్యాపారమా, హాస్యమా?

3. అల్పోత్పత్తికిమాత్రమునకు పనుల భిన్నములంజేసిన నవి త్వరలో ముగియుటకు వచ్చుంగాన కాలమెల్ల వినియోగింపబడక మిగులుటచే నష్టము దెచ్చును. ఉదా. మామిడితోట చిన్నదిగానున్న గాయలగోయుట కొకనిని, కోసినవానినేర్పఱచి గంపలలో నింపుట కొక్కని, గంపలగట్టుట కొక్కని, ఆగంపలను రైలునకు దోలుకొని పోవుట కొక్కనిని, ఇట్లు నలుగురిని నియమించిన ప్రతివాడును బంట యలతిగాన పనినొక యరగంటలోముగించి చేతు లారవేసికొని కూర్చుండును. ఒక్కనిమాత్రము నియమించిన నరదినము పనియైన జేయును. మైళ్ళకొలది వ్యాపించిన తోటగల సాహుకారి యొకరిద్ధఱినిమాత్ర మన్నికార్యములం గొనసాగింపుడని పలికిన పని యేనాటికిని ముగింపునకురాక వెనుకబడుటయేకాదు. కోసినకాయలు వాడువాఱి చెడును. కోయుట, దింపుట, నింపుట, కుట్టుట, కట్టుట, బండ్లకెత్తుట, తోలుట మొదలగు పనులకు మేరకొలది వేఱు కూలివాండ్ర నియోగించిన కాలమునకును బంటకును దేనికిని జేటురాదు గాన, విభజనము ననుసరించి పనియుండుట నిజమేయైనను, పని ననుసరించి విభజనము నేర్పఱచుటయు గర్తవ్యమె.

శ్రమ విశ్లేషణము, తత్పరిమితియు

ఉత్పత్తి వాణిజ్య దేశాభివృద్ధ్యాదు లుద్ధరములౌటకు మూలమయ్యును, ఫ్యాక్టొరీల ప్రగల్భత శిల్పుల స్వతంత్రత యను లతకు గొడ్డలివంటిది. ఉండిన స్వేచ్ఛయుబోవును. సాధనసామగ్రులు, ఆయుధములు సర్వమును యజమానులకే చేరినదిగాని తమకు జీతమునందక్క నింకెందును సత్త్వము పరిహృతము. ఏవస్తువుల నెవరికై యెంతమాత్రము రచింపవలయునను మొదలైన చింతలు విచారణయు యజమానులకేకాని తమకుంగాదు. యంత్రములలో జంగమ యంత్రములట్లు "ఏమి? ఏల" యని యడుగక మూగలట్లుచెప్పినది చేసి యూరకుండుటయె తమధర్మమగును.

వృత్తులు విశ్లేషించుటమేలనియు, శ్రమవిశ్లేషణ మంతకన్న సమర్ధమనియు సూచింపబడియె. శ్రమవిశ్లేషణ కధికసంఖ్య లావశ్యకములు. సేవకుడొకడుమాత్రమున్న నన్నిపనులను వాడే చేయవలసి వచ్చునుగాన, పూనికల వేఱుపఱచుట యసంగతము. గిరాకి యపారమైనచో వస్తు సృష్టికిం గావలసిన ప్రతిక్రియను వెవ్వేఱుజనులచే జేయింపవచ్చును. ప్రయాస వ్యవచ్ఛేదమునకు పరిమితిని గల్పించు తత్త్వములు మూడు. అవియేవన:1. శిల్పులసంఖ్య. ప్రతిక్రియను ఎక్కువగా జరుపవలయునన్న ఎక్కువ పనివాండ్రుండ వలయుననుట విశదము.

2. సరకు లుత్కటములగుటయె యీ విభజనముయొక్క సంకల్పము. గిరాకిలేనిది యురువుల మూర్కొనంజేయుటలో లాభము లేదుగాన గిరాకి రెండవది.

3. వృత్తుల స్వభావము.

మొదటిది:- వస్తురచనలో బ్రత్యేకపఱుపదగిన క్రియ లెన్ని యున్నవో యంతకన్న నతిశయముగ శ్రమ విశ్లేషణ మొనర్చుట తరముగాదు. ఉదా. మామిడితోటల విషయమై క్రియల భిన్నతకుం బాత్రముల నివేదించితిమి. సహజభిన్నములైన క్రియలంగాక సంకలిత క్రియలనుసైతము వికల్పింపజూచిన వ్యవహారములకు వైకల్యము సిద్ధము. ఎట్లన గంపలనించుటలో నొక్కొక్కకాయ నెత్తియిడుట కొక్కడని, కుట్టుటలో ప్రతికుట్టువేయుటకు నొక్కొక్కడని, ఇట్టి నియమముల జేసినదానిపేరు శ్రమవికల్పముగాదు. బుద్ధి వికల్పము.

రెండవది:- ప్రత్యేక క్రియలున్నను వానియం దొక్కొక్కటియు కాలపూరణము చేయదగినంత విపులతలేనివైన బ్రత్యేక కళలుగజేయుట హానికరము. దృష్టాంతము. ప్రత్తియంత్రశాలలో నుద్యోగ విభజనము సమగ్రమైయున్నది. సేద్యములో నంతపరిపూర్ణత యే దేశములయందును వహింపలేదు. దీనికిం గారణంబు లరసిన నీన్యాయంబు వ్యక్తపడును.

నూలువడకు యంత్రశాలలోని యంగభాగముల వివరము:- మధ్యభాగమున నన్నిచక్రములకు బిసలకు గమనశక్తి నొసంగు నావిరియంత్ర మొకటియుండును. దీనిలో నుద్భవించుశక్తిని రాట్నములద్వారా ప్రత్యంగమునకును వ్యాపింపజేయుదురు. ఇక నీశక్తిచే సాధింపబడు కార్యజాతముల వివరము:- ప్రప్రథమము గింజలును బ్రత్తిని వేఱుసేయుట. బోనువంటి నోరు దెఱచికొనియుండు గొట్టములో పొలములనుండి తెప్పింపబడిన దూదిని వేయ నది యంత్రజనిత మహావాయువుచే నతివేగముగ గొట్టుకొనిపోబడి చిన్నరంధ్రముల గల యొక యినుపపలకకుం దగులును. ఆ యాఘాత జృంభణమ్మున ప్రత్తిమాత్ర మాపలకలోని రంధ్రములలో దూరిపోవునుగాని బీజముల కన్న బెజ్జములు చిన్నవగుట గింజలు వెనుక నిలుచును. దినమంతయు నీగొట్టములో ప్రత్తినిదూర్చుచు నొకడుండును. అనగా నొక్కకూలివాని సంపూర్ణ ప్రయాసమునకు దగినంతదూది బండ్లలోవచ్చి దిగుచుండుననుట. అంతదూదిరానిచో వీరికి కూలితోడ రజా యియ్యబడినట్లు విరామముగా నుండును. గింజలులేని ప్రత్తిని మఱికొన్ని యంత్రములు లాగుకొనిపోయి ముఱికి, మన్ను మొదలగు నశుద్ధములం బోగొట్టి, పరిశుభ్రముగా జేయును. శుభ్రమైన దూదిని నలిపి, పిసికి, బాగుగాగలిపి, చిక్కపఱచు నంగములుకొన్ని, దట్టమై బిగువెక్కిన పిమ్మట నొక యంగుళము వెడల్పుగల పోగులుగాదీయు నవయవములుకొన్ని, చక్రాకారముగా దిరుగుచు నాపోగుల పలురకముల సన్నని తిన్నని కనుపులులేని దారములుగా విడదీయు నంగములు కొన్ని, వడికి నూలునదిమి బస్తాలుగాగట్టు నంగములుకొన్ని, ఇట్లు భిన్నవ్యాపార సాధనము లనేకములున్నవి ఈయంగములన్నియు నిలువక పనిచేయునంత సరకులు వచ్చుచుండునుగాన నీవిశ్లేషణము లాభకరము. సరకులుచాలకపోయిన నప్పుడప్పుడు పనినినిలుపుట తటస్థించును. కాలము తఱుచు మిగిలెనేని ఒకయంగముచేతనే యనేక కార్యము లొకదానివెనుక నొకటిగ జేయవచ్చును గాన శ్రమవిభజన మనావశ్యకము. వ్యవసాయమున నిరంతర కృషి లేదుగాన నీపద్ధతి యందు జెల్లదు. ఈ వీలులేమికిం గారణంబేమి? వ్యవసాయ స్వభావంబె. వానలు, కారులు వీనిని వేచిచేయబడునదిగాన అవ్యవహిత యత్నమున కాధారములేదు. మఱియు దున్నినవెంటనే చల్లుటతగదు. చల్లిన వెంటనే కోయుటకుగాదు. ఇట్లు క్రియలు సంయుక్తములుగాక భిన్నకాలములై యుండుట యనర్గళ వ్యాపారమునకు నర్గళము. అట్లగుట శ్రమవిశ్లేషణ మప్రధానంబు. ఎట్లనిన:- దుక్కిచేసినవాడే విత్తుట, కోయుట, కలుపుదీయుట మొదలగు క్రియల జేయవచ్చును. అని కాలాంతరకృత్యములు యంత్రశాలలో నేకకాలక్రియలు సంభవిల్లుం గాన విభజనములేనిది వేయిచేతుల కార్తవీర్యుండైన కరణీయంబు లెల్లం దీర్పజాలడు.

మఱియు విభజనగుణమ్ముల కళలలోనే యంత్రములకు ప్రవేశమధికము. ఎట్లన:- విభజన మెక్కువయగుకొలది ప్రతికార్యము నేకవిధమైన చలనశక్తిచే సరళముగా జేయబడునదియవును. దూది శాలలో ప్రతియంగమును నియతమైన యొక్కతీరునం దిరిగినజాలు. మనచేతులట్లు వంకర, నేరు, వర్తులము ఇట్లనేకములైనగతుల మిశ్రపఱచుట వానిశక్తికిమించినపని. సాధారణముగ మనుష్యులు సేయు క్రియలెల్ల నానావిధక్రియలచే బరిష్కృతములు విభజనమనగా నొక్కరే యనేకవిధక్రియలజేయక, యేకవిధముగ నాచరించుట. ఏకగతిచే సాధ్యములైనయవిచేయ బుద్ధిబల మగత్యముగాదు. ఇట్టి పనులకు యంత్రములేచాలును. ఘటికాయంత్రము (అనగా కపెలను) అందఱును జూచియున్నారు గదా! అందు బ్రతిభాగము నేకవిధమైన సంచారముగలయదికాని మనయట్లు పలుపోకల బోవునది గాదు. కావున విశ్లేషణయంత్రశక్తు లన్యోన్యానుగతంబులు.

చూడుడు హీనవృద్ధి న్యాయబాధితములైన యుద్యోగముల యందు యంత్రసహాయమల్పమని పూర్వమే స్ఫుటపఱచితిమి. "తగిలిన కాలే తగులును" అన్నట్లు శ్రమవిశ్లేషణ సహాయమును ఇందు ఘనము గాదు. అధికవృద్ధి కాశ్రయములైన వ్యాపారములందు యంత్రములు, ప్రయాసవిశ్లేషణమువలని సమర్థతయు నరనారాయణులబలె నేకీభవించి తోడుపడును. ప్రస్తావవశమ్మున ననుకొన్నంతకన్న నెక్కువచెప్పితిమి. ఇక ముందీవిషయము మఱల నందు కొందుము.

ఆవేశనవృత్తియం దెటుతిరిగినను కర్మకరులు యజమాన ప్రభావముచే నావృతులై యుందురు. "ముల్లును దీయవలయునన్న ముల్లేకావలయు" నన్నట్లు ఈకీడున కావేశనవృత్తియే చికిత్స. ఎట్లన;

1. పరాధీనులైన శిల్పకారులకు నాథవంతులుగనుండని యప్పటికన్న నిప్పుడు భరణము రూఢియు నాఢ్యమైనదిగాన మొత్తం మీద క్లేశభాజనమైన దారిద్ర్యతాప ముపశమించును. దారిద్ర్యతాప మారెనేని ఉత్సాహాభిమానములును, వన్నెయు వాసియుం గనవలయునను శౌర్యము మొలకలెత్తి పురణించును.

2. మఱియు సేవకులైనవారు దినదినమును గలసి మెలసి మెలంగువారుగాన, ననతికాలమ్మున దామేకీభవించి సంఘములుగా సమయబంధ ప్రవర్తకులై నిలిచినచో, యజమానులతో సమానులై బేరమాడి జీతము మొదలయిన కర్మనిధుల ననుకూలములుగ జేయ వచ్చునను నుపాయము గుఱ్తెఱుంగుదురు. ప్రతివాడును యజమానుల యెడ పుల్లవలె నిస్సారుడైనను అందఱుం బ్రోగుగాజేరిన గట్టెల మోపురీతిని విఱుచుటకు నసాధ్యులౌదురు. వర్తమానమున నాగర కాగ్రేసరములైన ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్‌స్ దేశముల శిల్పశ్రేణులు బలాఢ్యములై యనర్గళ ప్రచారములై జనబాహుళ్య నిశ్రేయసోదాత్తములై యున్నవి. ఇట్టివమెరికాలోనున్నవి గాని యింకను బ్రౌఢములుగాలేవు. కారణమేమనగా - ఆదేశము బహువిస్తారమును, అమిత ఫలవంతమును కాన బీదతనము ప్రజలయెడ నింకను జుట్టుముట్టనందున తన్నివారణ మనావశ్యకమాయె. ఈ కారణము మనయిండియాలో వ్యతిరిక్తమయినను యీ శ్రేణు లింకను నిచట సృష్టికిరాలేదు. ఎట్లన:- జాతిభేదములచే నైకమత్యము, నిఱుపేదతనముచే యజమానుల నెదిర్చి నిలుతమను ధైర్యము, శక్తియు నిచట పేరునకైన లేకున్న యవి. యజమానులు కూలివారికై పరస్పరము స్పర్థించుటచే గాక ప్రజల స్వప్రయత్నముచే వేతనము లుత్కటములగుట యిచట నిప్పటి కసంభావ్యమే.

అనాగరకదశల వసితంబులైన కాలంబుల విపులంబులై యుండి కాలక్రమమున వినష్టములై, తదనంతరము మఱియుం గాలంబు పరిణమించి మార్పులం బొందించుతఱికి శిల్పశ్రేణులెట్లు పునరవతార మహిమందాల్చి యాశ్చర్యావహ దీప్తిమంతంబులై యున్నవో యీ యద్భుతముం గమనించితిరా! ఐకమత్యం బనర్గళంబగునేని పౌరుషం బెన్నిభంగుల నెన్నిరూపులందాల్చి వికసింపదు? ఐకమత్యం రాష్ట్రమునకు వేఱువంటిది. అదితెగక పదిలంబుగనుండిన కాలవశమున నాకులు కొమ్మలునెండి క్రిందబడినను క్రొత్తక్రొత్త చిగురులు, శాఖలు, పొడమి నేత్రహృదయానందంబుగా నుండునుగాదె! ఐక్యమత్యములేనిచో మంత్ర తంత్రంబులు, వరుణజపంబులు. పౌరాణిక దోహదములు, నిరర్ఠకములును బరిహాస పాత్రములును నగును.

మఱియు నొకవింత, కర్మశాలలో పనిచేయువారికి నారోగ్య ప్రాణరక్షణార్థమై గవర్నమెంటువారు ప్రతిశాలను మంచిగాలి మొదలగునవి విశేషించి వచ్చునట్లు కట్టింపవలయుననియు, లేబ్రాయము వారిని, తరుణవయస్కులను, ఇన్నిగంటలకంటె నెక్కువ పనిచేయించ గూడదనియు, దిన మధ్యమున భోజనవిరామములకై యొకగంట సెలవియ్యవలయుననియు నిట్లనేకవిధంబుల నియమముల విధించివున్నారు గాన, ఈ నిబంధనలనన్నియు ననుసరించిన సెలవులు పెఱిగి యచ్చికములు తఱుగునను తలంపుచే, నీచులైన యజమానులు, దారిద్ర్య పీడితులై యెట్టికఠిన కార్యములకును మాఱు పల్కలేని కొందఱ నిఱుపేదలను తక్కువకూలికి వారివారి యిండ్లనే పనులజేసి తెచ్చి యియ్య వలయునని నిర్బంధించుటంజేసి, ఈ నికృష్టమార్గమ్మున నివేశవృత్తులు పునరావిర్భూతములయ్యె! ఈవృత్తులవలె నిర్దయాత్మకములును దు:ఖ సంకీర్ణములునైనవి యెవ్వియు లేవు. పాపము! ఆకట మలమల మాడువారు క్రౌర్యములకు విధేయులై తీరవలయు. స్వగృహముల గష్టించు వారుగాన, రాజ్యాంగ విచారణకర్తలు వచ్చిచూచి, స్థితిగతుల నరసి, కఠిన హృదయులైన యజమానులం దండించి, వారిని రక్షించుటకు నవకాశములేదు. అయిన నొక్కటి. ఈ పద్ధతి చిల్లర కళలయందేకాని గంభీరమైన వానియం దలము కొననేరదు. కావున దీనిచే బాధితులగు వారిసంఖ్య యధికముగాదు. ఇది, చింపిరి బట్టలు, ఉడుపులు, పాదరక్షలు, ఇట్టివి సంస్కారంబు గావించుటయు, ప్రాత వస్తువుల నప్పటికి దళుకుగ నుండు నట్లుచేయు పురస్కార కళలలోమాత్రము గాననయ్యెడిని ఎట్లయినను ఇది దిక్కులేని వారిని మాత్రము పట్టి బాధించునది యనుటకు వేఱు ప్రమాణములేల?

వృత్తులు పరిణమించిన వనుటకు నర్థమేమనగా:- సమర్థత విషయమున నొక పద్ధతికన్న నింకొకటి వికాస గరిష్టమనియు, నట్లగుట నసమర్థోపాయముల నడంగించి చిరతరముగ నిలుచు ప్రభావ సమన్వితం బనియు భావముగాని, పూవులు కాయలట్లు వెనుకటిది పుట్టుటచే ముందటి వన్నియు విరిసి నశించున నుటగాదు. ఈ పద్ధతు లన్నియు సమకాలికములయ్యు నుండవచ్చును. ఉండవచ్చునని సందేహముగ జెప్పనేల? మనదేశములో బ్రకృత మన్నిరకముల పద్ధతులు నమరి యుండుటయ కాదు, గ్రామ్య పద్ధతియు నింకను గణ్యమైయున్నది. ఆద్యంత భేదములు గొంతవఱకుం గాలానుగుణములైనను విశేషించి ప్రాముఖ్యము ననుసరించి యుండును. వర్తమానమున నుజ్జ్వలంబైన యంత్రశాలాపద్ధతియు గొఱతలేనిది గాదు. ఈ కొఱతలే దీనిని దక్కువ పఱచి యింకను బరిశుద్ధమైన యార్థికస్థితి యావిర్భ వించుటకు నిమిత్తమాత్రమౌనేమో! ఇకముందు చర్చింతము.