భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - మొదటి ప్రకరణము
భారత అర్థశాస్త్రము
రెండవ భాగము
మొదటి ప్రకరణము
వృత్తుల పరిణామము - గ్రామ్యపద్ధతి
పూర్వమున రాకపోకలు రక్షణమును లేనికాలములో దేశము ఖండ ఖండములుగా తెగినదై, సహజముగ నొండొంటితో నెక్కువ సంబంధములేని గ్రామములుగ విభక్తమయ్యెను. పేరునకు దేశమొక్కటిగ నున్నను నిక్కమునకు బెక్కుతునకలై యుండెను. గ్రామస్థులు త్రిశంకుస్వర్గములోని వారియట్లు ప్రత్యేకించి తమకు వలయువానినెల్ల దామే సేకరించుకొనుచు, మిగిలినదాని నమ్ముటకును, లోపించిన దాని గొనుటకును నవకాశములేనందున సాధ్యమైనంతవఱకు ప్రతిగ్రామమును సర్వవస్తు సమృద్ధముగా నుండునట్లు నిర్మించుకొని, తామొకరినిజూడక, యొకరికి దామగపడక, యంత:పుర కాంతలట్లు తమతమ నెలవులనె కాలుగదల్పక తరతరములుగ నుండినందున, నూతనసంగతుల స్పర్శయైన లేనివారై, నానాటికి జ్ఞానహీనులును సాహసదూరులునైరి. ఏకమార్గమున బోవువారికి నుత్తమ మధ్యమాధమ నిర్ణయశక్తి పూజ్యము. పలుతెఱవుల జాడలెఱింగినంగాని తారతమ్య నిరూపణ మవశ్యకముగదా! విమర్శనజ్ఞానమన్ననో మొదలే సున్న. విమర్శనములేనిది వివేకోదయముండదు. అట్టివివేకహీనులు మూఢులై "తాబట్టి కుందేటికి మూడేకాళ్ళు" అన్నట్లు తమ యాచారములు, వాడుకలు, మతములు, వేషములును ఎంత కష్ట నష్టాపాదకములై రోతను విసుగును బుట్టించునవి యైనను, తదితర సుఖకర మార్గము లున్నవియనియైన దెలియరుగాన, వీనికిం మించిన వేవియులేవని వృథా యహంభావముబొంది, వృద్ధినొందక యధోగతి పాలగుదురు. పాపము! ఇప్పటికిని హిందువులలో బహుళ సంఖ్యాకు లింకను నీగ్రామ్యపద్ధతియందే మునింగియున్నారు. చూడుడు! వచ్చుటకును బోవుటకును సులభముగానున్నచో వాణిజ్యము వఱలును. వాణిజ్యవ్యాప్తిచే దూరస్థలములనుండియైన గోరిన వస్తువుల రప్పించు కొనవచ్చును. అట్లయ్యెనేని ప్రతిగ్రామమందును వడ్రంగి, కమ్మరి, కంసాలి, చాకలి, పురోహితుడు ఉండి తీరవలయునను విధి యక్కఱలేనిదగును. ఈ విధి పూర్వముండెననుట గ్రామనిర్మాణ మెఱిగిన వారికెల్ల దెల్లంబ. కావున దేశము భిన్నమై యరాజకమై అల్ల కల్లోలములుగనుండిన కాలమున మనగ్రామములును, వైవాహికాద్యాచార పద్ధతులును నేర్పడినవని పల్కుటయొప్పుగాని, ఇవిదేవతలు, ఋషులు వీరిచే నుత్కృష్టతమములని నిర్ధరింపబడినవనుట పుక్కిటి పురాణము. ఆకాలమున నింతకన్న మేలైన నిర్మాణ మసాధ్యము. అది నెపముగ నిక నేకాలమునకును నింతకన్న మిన్నయగు నిర్మాణ మసాధ్యమనుట కేవలము మూఢత్వము.
హిందువులలో నీప్రాచీన గ్రామ్యపద్ధతి యింకను యౌవన దశయందే యున్నదిగాన మనకు దాని స్థితిగతుల నెఱుంగుట యావశ్యకము అందునకు దగినంత సుగమమును.
నవనాగరకతావాసన గాలిదాటుననైన నెన్నడును సోకని కుగ్రామము నొకదానిని వర్ణింతము. ఊరివాకిలియొద్ద నడుగువెట్టగానే, మిత్రులకు సంతోషమును, శత్రులకు తస్కరులకు (ముఖ్యముగా వారిపాదములకు) భయము నొసంగునదియై, చూచినవెంటనే మేనుల గ్రుచ్చునో యనునట్లుండు కఱకుముండ్లతోవెలయు నాగదాడికంచె యొకటి మున్ముంద అభేద్యప్రాకారంబై కనులపండువు సేయును. ఊరివారు సోమరిపోతులుగాన ముఖద్వారముగుండ రాకపోకలుచేసిన చుట్టుగదాయని తమతమ యిండ్లసమీపమున వెలుగును బడగొట్టి తప్పుద్రోవలజేసి ప్రాకారముయొక్క ముఖ్యోద్దేశమును పాడుపఱచి తమసహజబుద్ధి కౌశల్యమును వెల్లడిసేయుట యచట గనులార జూడవచ్చును. గ్రామరక్షణకార్య మింతటితో ముగిసెనా పొగాకును వక్కాకును ముద్దగాజేర్చి పెట్టికొనుటచే నుబికిన కపోల ఫలకంబుగలిగి, ఠీవిగా దుడుముదట్టుచు రాత్రులలో దోటివాడొకడు పారాతిరుగును. ఈ యొయ్యారములన్నియు నరాజకము వలన గలిగినవని వేఱ యెత్తిచెప్పనేల?
రక్షణవిషయమున నెట్లు గ్రామస్థులకు రాజ్యముమాని నిలువక ప్రత్యేకముగ గ్రమముల నేర్పఱచుకొను నవస్థయాయెనో, యట్లే యార్థికవిషయములందును. మంచిబాటలు , నమ్మకముతో వర్తించు భటులు, పక్షపాతములేని న్యాయాధికారులు, నిరంతరకలహప్రియులు గాక ప్రజలబీడింపని రాజులునులేని దేశములో వాణిజ్యము లుండవు కాన, ప్రతిగ్రామమునను సామగ్రులన్నిటిని దామే యుత్పత్తి చేసికొనవలసిన వ్యవస్థ తటస్థించె. కావుననే పల్లెలలో మంగలి, చాకలి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, కుమ్మరి, మేదరి మొదలగు వారలు నివసించియుండుటయు, వీరిలో ననేకులకు గ్రామస్థులు మొత్తముగా నందఱుగలిసి యేటేటకు నింతింతయని మాన్యములు నిచ్చుటయు సంభవించినది. కలహముల దీర్చుటకు పంచాయతీదారులు, పూజాపునస్కారములకు మంత్రములు తెలిసి తెలియని పురోహితుడు, లెక్కలను వక్కలుముక్కలుగా వ్రాయుటకు కరణము, తానెన్ని తప్పుల జేయుచున్నను ఇతరులయొద్ద ధర్మమును భద్రముగ నిలుపుటకు రెడ్డియొకడు - ఇట్లు వీరిచే గ్రామములు రాజ్యములట్లు సర్వాంగ బంధురములై పరస్పర భిన్నములై బయటివారితో గలయికలేనివై యేర్పడినవి.
మఱియు రాజ్యములట్లు గ్రామములు నొండొంటిపై గాలు ద్రవ్వి కాట్లాడుటయు గలదు. ఒకయూర 'కలరాదేవి' విడిసిన నామెను సాగనంపుట కెత్తబడిన గెరిగెను ఇంకొకయూరి యెల్లలోపల "ఇచటదిగి కడుపాఱ విందు సేయుమమ్మా" అని దింపిరేని, ఇరుపల్లియలవారికిని భారత సంగరమును చీయనిపించునంత వాగ్వాదం రేగి యాకసము బద్దలుసేయును!
మోటుతన మెంత ముదిరినవారికైనను రవంతయేని వర్తకములేని బ్రదుకు మృగములకుంగాని మనుజులకు బ్రాతిగాదుకదా! కావున నిట్టి గ్రామ్యజనులుగూడ పర్వదినంబులను, పండుగపూటలను, ఉత్సవకాలమ్ములను, ఇరుగుపొరుగు జనులు గుమిగూడుదురనియు, అట్లు కూడినను దేవతల కప్రియమాచరించిన తమకు నశుభములు గలుగునను భయంబున, నట్టి తరుణమ్ముల జగడముల కుద్యమింపరనియు, పుణ్యస్థలములలో సంతల నేర్పఱచి తమకు మిగిలిన సరకులనమ్మి కొఱతవడిన వానింగొని సంతుష్టివడయుదురు. భీతిచేత సన్మార్గవర్తులైయుండుట గడుసుజనుల తెఱంగు. అశ్వత్థము పరమపవిత్రమని భావింపబడుటంజేసి యావృక్షము నీడలో గల్లలాడరని యచట విచారణలు జరుపుట ఆచారమయ్యె. జ్ఞానవంతు లీశ్వరుడెల్లప్పుడు నెల్లెడల నున్నాడని యెప్పుడును బొంకరు ధర్మపథాసక్త హృదయులు గాకపోవుటచే మూర్తిమంతములైన బూటకములజూపి మూఢజనుల వెఱపించుట యగత్యమయ్యె. శపధములు, స్వామిపాదములముట్టి ప్రమాణముసేయుట గురుపాదతీర్థమిప్పించుట ఇత్యాది నీచతరక్రియలు వనచరులంబోలిన నరులుండు దేశమ్ములం బ్రవర్తిల్లుట కిదియ నిదానము బుద్ధియు గుణములును వికసిల్లినవారికట్టి యపచారములు దుస్సహములు. అది యట్లుండె
ఇచ్చుట తీయుటయు విశేషించి లేనందున ప్రతికుటుంబము వారును సామగ్రులం దామే యాయతములం జేసికొనవలసిన విధి యేర్పడియె. కాలక్రమమున నీయభ్యాసమువలన, నితరులచే జేయబడువస్తువులువాడుట యాచారములోనికి రామింజేసి, యట్టివి శుచి పదార్థమ లుగావనియు, ఉపయోజ్యములుగావనియు, విధించుకొని, "గోరుచుట్టుమీద రోకటిపోటు" అన్నట్లుఉన్న ప్రాతయిక్కట్టులు చాలవని క్రొత్తవికొన్ని కల్పించుకొని, భగవత్సంకల్పము నిట్టేయని, తమమతమంతయును దాకుట, చూచుట, తినుట, వీనింగూర్చిన వ్యవహారము క్రిందికి దింపిరి. ఈ న్యాయములకు సాక్షులు మనయిండ్లే. నేటికిని పల్లెటూళ్ళలో దీపమువత్తులుచేయుట , సెనగకాయలు, ఇప్పకాయలు, వేపకాయలు, వీనిని ఒలుచుట, వడ్లుదంచుట, రాగులు, నువ్వులు, కందులు, పెసలు ఇత్యాదులను విసరుట, ధాన్యముల నెండబోయుట, వడియములు అప్పడములు పెట్టుట, పొళ్ళుదంచుట. దంచిన వానిని నూరుట ఇత్యాది కృత్యము లనేకములు ఆ యా యింటివారు తమకు దామే చేసికొనుట సుప్రసిద్ధము. ఇంగ్లీషువారికిది యాశ్చర్యకరంబు. "ఈ హిందువులు నివసించునవి కర్మశాలలా యిండ్లా!" యని యబ్బురపడుదురు. మఱియు పశువులనుగూడ ననేకులు గృహములలోనే కట్టుదురుగాన కొట్టములాయని సందేహించినను దప్పులేదు!
ఐరోపియనుల గృహజీవితము
ఇక నిట్లే యాంగ్లేయుల గృహజీవితముల దిలకింపుడు! వారిలో నిఱుపేదలుగ నున్నంగాని జీవనార్థమైన కర్మల నింటిలో జేయరు. జీవనోపాయముల జెల్లించుటకు అంగళ్ళు కర్మశాలలు కచ్చేరీలు నుండగా బవలంతయు నచట బనిసేసి యలసి సొలసి ఇల్లుజేరినతఱి పనిపాటులమఱచి హాయిగ గొంతసేపయిన భార్యాపుత్రులతో సల్లాపముచేయుచు నందఱుగలసి ముచ్చటగా భోజనాదుల దీర్చి విశ్రాంతి ననుభవింప గృహము లేర్పడినవిగాని, రేయింబవలును క్లేశభాజనములైన శ్రమల మెడగట్టికొని మెలంగుటకుగాదని వారి దృఢమైన యభిప్రాయము. అవశ్యక క్రియలలో నొక వంటపనిదప్ప మఱేమియు నింటనుండ నియ్యరు. వంటపని యనగా వంటపనియేకాని యందులకువలయు సంబారములం దయారుచేయుట గాదు. సంబార ముల సర్వవిధముల సిద్ధపఱచి యమ్ముదురు. జాతిమతాది భేదరహిత రమణీయ రాజ్యముగాన యథేచ్ఛముగ వస్తువుల గొనవచ్చును. దానంజేసి వారిగృహములు పరిశుభ్రములై నచ్చు నవయికలులేక హృదయానందకరంబులై సంసారతమంబు నడంపంజాలు తేజస్సులంబోలె దేదీప్యమానంబులై యుండు. ఇట్లయిన గృహస్థులు సోమరులై నిద్రాళువులై యుందురో యను శంక వొడమునేమో? అట్లెంచుటకుశంక. చదువులు, సంగీతములు, బిడ్డలకు విద్యలనేర్పుట, కుట్టుపని, వస్త్రాలంకారరచన ఇత్యాది నాగరక ప్రచారము లు వేనవేలున్నవి. వానినెల్ల బహుశ్రద్ధతోనభ్యసించి జన్మమును సార్థకముగను సముల్లాస శోభితముగను నొనర్చుట లేశ కార్యమా? యోచింపుడు!
"అవునుగాని సంబారములన్నింటినిం గొనవలయునన్న సెలవెక్కువయగుంగాదె! ఈ దుర్ఘట కార్యమును వారెట్లు సాధింతురు? మాపురుషులు నట్టిసత్త్వసంపన్నులయినచో మాకీ నిరంతర కాయకష్టము లేకపోవునుగదా! అట్టి నాగరకతనునేర్చి వారివలె కళగా నుండునంతటిభాగ్యము మాకీజన్మమున రాజాలునా!" యని స్త్రీలు ముఖమును చిన్నజేసికొని ప్రశ్నింతురుకాబోలు! సమాధాన మిదిగో!:-
మనమే యన్నివస్తువుల రచించుటకన్న శక్తియుక్తులకు దీటగు మాడ్కి నేదైన నొక్కదానిలో కొన్నింటినో యమితముగ బ్రోగు చేసితిమేని మనకైమిగిలిన రాసులనమ్మి ఇతరముల గొనవచ్చుననుట యేమిచోద్యము? ఇంగ్లీషువారి వర్తనలరీతి యిదియే. ఏకవృత్తిలో బ్రవేశించి వాణిజ్యమూలమున సర్వసామగ్రుల బడయుదురు. మనము నమ్మకముచెడినవారి గుంపులోనుండుట, జాతిభేదములు, దూరదృష్టిలేమి ఇత్యాది వ్యసనమ్ములు కతమ్ములుగ భిన్నులమై సమూహములో నుండియు నొంటరులెన యడవిమనుష్యులట్లు వర్తింపవలసినవారమైతిమి. పరివర్తన పారీణతయుండెనేని సంఘమంతయు బ్రతివానికిని వలయు సామగ్రుల నిచ్చునిధియైయుండును. సంఘము వారందఱు నన్యోన్యసహాయులైనమేలా? ప్రత్యేకముగ నాతురతమై యొకరికి సాయముజేయక తానొకరివలనగోరక తనకు గావలసినవన్నియు దానే బడయజూచుటమేలా? తలపోసిచూడుడు. అన్నిటిని జేయజూచిన నేదియు సరిగా గుదురదనుట పరమరహస్యమా? మన మాతురతగొని యొకరినినమ్మక పరులపొత్తునాశింపక యన్నింటిని జేయజూతుము. ఫలమో! పండిపండని పాడుఫలమే! రాకపోకలను వాణిజ్యమును విచ్చలవిడిగబెంచి యొండొరులకు సహాయభూతులై యూరోపియనులు సర్వభోగ సమృద్ధతామహిమచే శోభిల్లెదరు. ఇది విస్మయావహంబుగాదు.
హిందువులలో గ్రామ్యపద్ధతి ప్రముఖంబుగ నుంటకింకను హేతువులెవ్వియనిన?
గృహములను ఫ్యాక్టొరీలుగా జేసియుంచినయెడల కష్టములో బహుళభాగము స్త్రీలనెత్తిమీదబడును. కానధీరోదారభావములేని తుచ్ఛులగు పురుషులకిది యనుకూలించిన యేర్పాటు. మనదేశమున నబల లనబడువారు మగవారికన్న నెన్నియోమడుంగులు ఎక్కువగ పాటువడుటంజూచి పాశ్చాత్యులు మనల నతినీచమానవులని పరిహసించెదరు. బావులు త్రవ్వుట, ఇండ్లుకట్టుట, రోడ్లువేయుట ఇత్యాది యత్నములలో నీళ్ళు రాళ్ళుమోయుట, సున్నమునూరుట, ఇట్టి దుర్భరకార్యము లనేకములు స్త్రీలకేచేరిన వరప్రసాదములు. ఇంగ్లాండులో భారవహనభాగ్యము స్త్రీలకిప్పు డేమాత్రమునులేదు. మోటు వారికిని నాగరకులకును నిదియొక ప్రబలమైన యంతరము. ఎట్లనిన:- ఆఫ్రికాఖండములో మొలగుడ్డదప్ప నింకేమియులేక యడవిమనుష్యుల బోలి సంచరించు కాఫరులను తెగవారిలో పురుషులు బహుభార్యో పేతులైయుండుట సర్వసహజము. ఈ కృష్ణలీలకు కారణము కామము గాదు. మఱికర్మమా? కర్మమునుగాదు. కర్మవిమోచనము! అనగా, పెండ్లాలను బనిచేయుడని యానతిచ్చి తాము చుట్టగాల్చుచు హాయిగాగూర్చుండి తనికీచేయుచు నిష్కర్ములై యుండవలయునను నిచ్చ. అనేక జాయత్వ వ్యాపార ప్రారంభమున కిట్టియోచనలే ప్రధానములు. ఏదేశమున స్త్రీలు బిడ్డలును పశుసమానులుగ బరిగణింపబడుదురో, యచట పశుసంతతి యెంత తఱుచైన నంతమేలు; అను న్యాయప్రకారము, భార్యాసమృద్ధిని, సంతాన సంపదను బడయగాంచుట, అర్థసమృద్ధ్యాది శోభనసహితంబగుట, సదాచారసమత వహించును. ప్రకృతము మనలో నిట్టి దౌర్భాగ్యపు నడవడులు మిక్కిలి కొఱతవడియున్నను, ఇంకను గృహకృత్య సౌలభ్యమునకై ద్వితీయ వివాహములకు సమకట్టువారు తుట్రాగా లేకపోలేదు.
వైవాహికాద్యాచారముల యుత్పత్తి
వైవాహిక నియమములకు బుట్టినిండ్లు ధర్మశాస్త్రములుగావు. మఱి యార్థిక స్థితిగతులు. దారిద్ర మతిశయించుటచేగాని, ఇరుగు పొరుగు శత్రుజాతులవారిచేనైనగాని, యొకతెగవారి కుత్పాతములు ప్రసన్నములయ్యెనేని, యే ఋషీశ్వరుని ప్రేరేపణమును లేకయ, సుఖ రక్షణముల నపేక్షించి యెట్టిమార్గముననైన గొడుకుల గాంచ నెంచుట స్వాభావికగుణము. మనపూర్వులైన ఆర్యులు, ఈదేశముపై దండెత్తివచ్చిన యాదికాలమున వారిసంఖ్య స్వల్పము. శాత్రవులన్ననో లెక్కకు మీఱియుండిరి. యుద్ధములు ప్రతిదినచర్యలు. అట్లగుట "అపుత్రస్య గతిర్నాస్తి" యని నుడివిరి! అనగా సంఘమునకు శత్రుమోక్షణము సంపాదించుకొఱకేకాని తమయాత్మల నింద్రలోకములోనిలిపి యన్యాయముగ నగ్నిలో నేయివోసి పాడుచేయుటచే తృప్తిజెందించుటకుంగాదు. సంఘముయొక్కయు, తద్వారా ప్రజలయొక్కయు స్థితికై పుత్రులంబడయుట ప్రాణాధార సంస్కారమయ్యె! దానంజేసి మనకిప్పుడు నీతిబాహ్యములు, రోతలుగదోచుమార్గంబుల నైన సంతానప్రాప్తి కారంభించి విచ్చలవిడిగ సంబంధములకుం దొడంగిరి. ఇయ్యవి సర్వసాధారణములైనందున ధర్మంబులని చెప్పబడియె. విధియేమున్నది! అందఱు జేయువానిని అధర్మములన్న భ్రష్టులెవరు? భ్రష్టులం జేయువారెవరు? పూర్వము ధర్మము నాలుగు పాదములతో నడిచెననుట కిదేయేమో యర్థము! అనగా నెట్టిపాపకార్యములుగూడ ధర్మకార్యములని యాదరింపబడిన నిక నధర్మ మెక్కడనుండివచ్చును? చూడుడు! మను బ్రహ్మగారి స్మృతిలో నెన్నివిధముల పుత్రులు పేర్కొనబడియున్నారో!
ఔరసుడు :- | భార్యయందు భర్తకుబుట్టినవాడు. ఇదిసరియే. |
క్షేత్రజుడు :- | చనిపోయినవానియు, బిడ్డలులేనివానియు భార్యయందు నియుక్తప్రకార మింకొకనిచే బుట్టింప బడినవాడు. |
దత్తుడు :- | ఇదియు సరియే. ఇందేమియుదోషముగానరాదు. |
గూఢోత్పన్నుడు :- | భర్తకు దెలియకయే భార్య యతనికి బరుని వలన బ్రసాదింపించిన పుత్రుడు! |
కానీనుడు :- | పెండ్లి కాకమునుపే కన్యచే గన్నకుమారుడు!! |
సహోఢుడు :- | పెండ్లి యపుడే గర్భముతోనున్న స్త్రీకి జనించిన వాడు!!! |
ఇట్లి యనాచారము లనేకములు సదాచారములుగ బూర్వం పాటింప బడినవి. వివాహములు నట్లే బలాత్కారముగ నిష్టములేని వనితను జెఱగొనిపోయి చెఱచిన నదియు నొకవివాహమనుట! ఇక వివాహము కాని దెద్దియో నిరూపింప బ్రహ్మకైన నలవికాదు. కృతయుగరీతి యిట్లుండిన ధర్మదేవతకు కుంటితన మెట్లు సంభవించును? ఎంత లోతులోబడినను గాళ్ళు విఱుగవుగాన ధర్మము విధిలేక నాలుగు పాదములతో వర్తింపవలసినదాయెను! అందఱు గ్రుడ్డివారుగానుండిన రంభలుగాని రమణులుందురె? అంధకారమున నందఱును సుందరులే! ఇది యసంగత ప్రలాపమని యూహింపబోకుడు. మనలోని యాచారము లనేకములు కష్టకాలమున నుద్భవించినవనియు, ఋషిప్రోక్తములుగావనియు నార్థికదశలచే దీర్పబడినవనియు, నట్లగుట గాలదేశానుగుణముగ వీనిని మార్చుటలో దప్పులేకుండుటయకాదు, సర్వవిధముల నొప్పనియు దాత్పర్యము. ధర్మార్థములకుండు నన్యోన్య సంబంధము వివాహములందుబలె నితర ప్రతీతుల యందంత విశదంబుగాదు.
ఇంగ్లాండులో పురుషులకన్న స్త్రీల నెక్కువగ జూతురు. దుర్ఘటములు క్లేశసహితములునైన క్రియలు వారిభాగమునకు రావు. పత్నీశుశ్రూషయే పరమధర్మంబు. మనలో పతివ్రత మనునది యెట్లో వారలలో సతీవ్రత మనునది యట్లు. కావున భార్య లెక్కువయైన భర్తకు భారమెక్కువయగుట సిద్ధము. మఱియు సేవకుల కనేకత్వము చెల్లునుగాని నాయకులకు చెల్లదు. స్త్రీలు నాయికలు యజమానురాండ్రు కావున సపత్నీదోషమున్న సంసారము బహురాజకమగును. బహురాజక మరాజకమునకన్న నతిదుష్టము. కావున నింగ్లాండులో నేకపత్నీవ్రతము చిరస్థాయియయ్యె.
గ్రామ్యపద్ధతి నుద్ధరించు కారణములు
ఈ దేశమున స్త్రీల దాసత్వము, గ్రామపద్ధతియు నన్యోన్య శరణ్యములు గావున నివి యధాక్రమముగ నేకకాలమున నస్తమించుం గాని యొకటిపోయి యొకటి యొంటిగ నిలువనేరదు. గ్రామ్య వ్యవహారము కడుబాలిశమనువారు నారీజనులస్థితి నుత్కృష్టముగ నొనర్ప నుద్యుక్తులుగావలయు. స్త్రీ దాసత్వమీ యార్ధికస్థితికి ప్రధమపాదము.
తక్కినవి యెవ్వియన :-
2. రాకపోకలులేమి:- ఇది వాణిజ్యవ్యాప్తికి ప్రతిఘాతకరము. వాణిజ్యములేనిది సర్వమును దమకుదామ సన్నాహ పఱుపవలయును. 3. దారిద్ర్యము:- మృగయాయుగమ్మున బీదతన మతినిబిడమ్ముగ నుండెననియు, తదితర యుగమ్ముల క్రమేణ తఱుగుచు వచ్చెననియు ముందే మందలించితిమిగదా! దీనికిం గతంబెయ్యది? తమకు వినియోజ్యములగు వానినెల్ల దామే సేకరింపవలయునన్న నెక్కువ ప్రోగుచేయుటకు భీమబలునికైన నలవిగాదు. వస్త్రముల నేయుట, బట్టలుతుకుట, పంటబెట్టుట, వంటచేయుట, ఇల్లుగట్టుట, అందులకు గావలసిన వెదురులు, పూరిమన్ను ఇత్యాదులను దయారుచేయుట వీని నన్నిటి నొకడే ఇతరజన సహాయములేక పరిష్కరింప బూనెనేని కల్పాంతమునకైన బనిముగియదు. ఒకపూటకైన రుచికరమగు భుక్తి లభింపదు. మనుష్యులలో నెల్లరు సుఖముగ నుండవలయునన్న సంఘమున నన్యోన్యత యుండవలయు. భిన్నవృత్తులుగాని ప్రజలున్న నన్యోన్యత యుండదు. కావున వేఱు వేఱు వృత్తుల నేర్పఱచి ఒక్కొక్కరు ఒకటిబూని పరిశ్రమించి, విశేషధనమ్ముల నార్జించి, వాణిజ్యముచే నొండొరుల కొఱతల బూరించిన కార్యసిద్ధి యగునుగాని వృత్తి విశ్లేషణములేనిచోగాదు. సంఘ ముద్ధురమగుట కేమి సాధనంబనిన - వృత్తులు విశ్లేషించి వాణిజ్యముచే సంశ్లేషించుట. ఇది యదార్థ తత్త్వము. ఈ విశ్లేష సంశ్లేషములు పరస్పరాస్పదములు.
వాణిజ్యోత్పత్తు లితరేతరాశ్రయములు
వాణిజ్యములేనిచో విశ్లేషము దుర్ఘటము. సాలెవాడు తన బట్టలకుమాఱు బియ్యమును గొనవచ్చునను నిశ్చయముండబట్టికాదె బట్టలనేయను! లేనిచో పంటలను బెట్టవలసినవాడగును. ఇక విశ్లేషణలేనిది సంశ్లేషణ యంతకుమున్నే మొనయదు. విశ్లేషణము ఉత్పత్త్యతిశయమునకు మూలము. ఉత్పత్త్యతి శయముచే గావలసిన దానికన్న నెక్కువ కర్తలకు నమరును. ఈ యధికములగు బండములే వాణిజ్యపు సరకులు. వృత్తులు విశ్లేషింపవేని యుత్పాదకశక్తి లఘువగుననియు, ఈ విశ్లేషణము, నిరాతంక వాణిజ్య సంశ్లేషణము, నితరేతర పోషణములనియు జక్కగా గ్రహింపవలసిన విషయము. వాణిజ్యము పెఱుగు కొలది నుత్పత్తి యధికము గావలసివచ్చును ఉత్పత్తి యనర్గళము గావలయునన్న శ్రమవిశ్లేషణము, నధికముగనుంట యావశ్యక కృత్యం. శ్రమ విశ్లేషణము విషయమై ఇక ముందింకను వ్రాయబడును.
గ్రామ్యవ్యవహారమువలన గలుగు కీడులు
1. ఆచారాద్యఖిల పాశబద్ధులౌట.
2. రాకపోక లల్పములగుట.
3. వాణిజ్యహాని.
విలుచుట కనువులేనిచో నెక్కువగ నుత్పత్తిచేయ నెవరు పూనుదురు? ఎక్కువగా నుత్పత్తిలేనినాడు వృత్తులు విశ్లేషించుట కవకాశము తక్కువ కావుననే మనయిండ్లు సర్వకర్మములకు నాకరములై శిల్పశాలలట్లుండుట! మఱియు గొన్నికార్యములకుం బూనక యన్నింటికిం దొడరిన నార్జన మచ్చికవడు, నను న్యాయము ప్రకారము విశ్లేషణములేనిది దారిద్ర్యము తుదముట్టదు.
కావున మనగతి ఎట్టిదనిన:- దారిద్ర్యముచే విశ్లేషణ వ్యాపింపకున్నది. విశ్లేషణ తఱుచు లేమి దారిద్ర్యము వదలకున్నది. ఇవి యన్యోన్యాశ్రయములు గాన, నశించిన రెండు నొకటిగా నశించును. అనగా ఆఢ్యత, వాణిజ్యము వలయునేని చిల్లర మల్లరలెల్ల నాశ్రయించుటమాని యేదైన నొకవృత్తి నవలంబించి తద్ద్వారా ఇప్పటికన్న నెక్కువగ సంపాదించి జనులు సుఖభాక్కులు గావచ్చును.
భిన్నవృత్తులు
మనలో జనుల కేకవృత్తిప్రాప్తి యింకను లేకపోయినను గొంతవఱకు వృత్తులు విభక్తములయినవనుట నిక్కము. మృగయా యుగమునందును స్త్రీ పురుషులు భిన్నప్రవృత్తులయియే యుండిరి. వంటపని స్త్రీలయది. వేట పురుష సామ్రాజ్యము. పశుపాలనా యుగమునందు భిన్నత యింకను బ్రబలమాయె. యజమానులు, పనివాండ్రు, చర్మకారులు, కంబళ్ళునేయువారు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, వీనిచే గాలము నడుపువారు. ఇట్లు జనులు బహుమార్గగతులయిరి. వ్యవసాయ యుగమునందు ఆర్థికకర్మమను మహానది చీలినదై యనేక సంఖ్యాముఖమ్ములతో బ్రవహించి లోకోపకారిణియాయెను. అప్పుడు పుట్టిన శిల్పులు వడ్రంగి, కుమ్మరి ఇత్యాదులు. మఱియు జనులు నారదునట్లు సంచార పరాయణులై యుండుటమాని స్థిరనివాసాసక్తచిత్తులై యున్నందున పల్లెలు, నగరములు నేర్పడియె. సంఘములుగ జేరి యొకరితో నొకరు కలసిమెలసి మాటల జర్చల బరస్పరాభివృద్ధివడసి నందువలననే యభివృద్ధికి నాగరకతయను పేరుగలిగె. నగరములలో నవతారమెత్తిన నవవిలాసిని నాగరకత. ఇట్లు వ్యవసాయ యుగము తత్పూర్వస్థితులకన్నమించి మెఱుగెక్కినదగుట, అలంకారక్రియ లుత్పన్నములై కంసాలి, చిత్రకారులు మొదలయిన వారికి నాలవాలమయ్యెను. హిందువులు మొత్తముమీద నీస్థితిలో నిప్పటికి నున్నారు.
క్రియాపరిచ్ఛేదము
ఇంకను ఘనతగాంచిన పాశ్చాత్యులలో వృత్తులు వేఱుపడుటయకాదు. ప్రతివృత్తికిం జేరిన భిన్న భిన్న క్రియలును ప్రత్యేక వృత్తులం బోలియున్నవి. దృష్టాంతము:- పొలముకాపు, పంటపండిన తోడనే, గింజలనురాల్చి యమ్మివేయును. తనకు ధాన్యముతో నెక్కువజోలిలేదు. వానినెండబెట్టి, యంత్రములచే బొట్టు దీసికొన్న వారు పిండిచేయువారి కమ్ముదురు. వీరు పిండిసేసి రొట్టెలవానికి విలుతురు. పొలముకాపు వానియొద్దనుండి రొట్టెలగొని కుటుంబభరణ కార్యము నెరవేర్చును. ఈ దేశములో నీక్రియలన్నియు నింటిపనులు. కావుననె వారికి మనకుంగల తారతమ్య మత్యధికము. మనము వారలట్లుండుటకు నిది తరుణముగాదు. తాదృశ మార్గావలంబనకు దారిద్ర్యమొక నిరోధకముగా నుండును. మఱియు, ధాన్యమునమ్మి మనము కాలమును మిగిల్చితిమేని ఈకాలమును వ్యర్థపుచ్చక వినియోగించుటకు వారలయందుబలె మనలో శక్తియు, రక్తియు, యుక్తియు నవకాశమునులేవు.
గ్రామ్యపద్ధతి స్వాతంత్ర్యార్గళము
ఇంకను గ్రామ్యవ్యవహారలక్షణముల వెల్లడిసేతము. కులము, గ్రామము మొదలగు చిల్లరసమూహములే శరణమని యుండువారికి స్వతంత్రత సంపూర్ణముగ సున్న. ఎట్లనిన:-
ఎప్పు డెవరేరీతి నెత్తివత్తురోయను భయమున వడవడ వడకు చుండు పల్లెటూళ్ళలో సైన్యమునందుబలె ప్రతివాడును నియత పద్ధతులం బూనవలయుగాని స్వేచ్ఛావిహారుడౌట వొసగదు. "త్రిమూర్తులకన్న నల్పదేవతల యధికారము జాస్తి" యన్నట్లు సమూహమెంత చిన్నదియో దానిచే చెలాయింపబడు తనికీ యంత మిక్కుటము.
"గంగ పాఱుచుండు గదలని గతితోడ, ముఱికి కాల్వపాఱు మ్రోతతోడ" నని వేమన యానతిచ్చినట్లు ప్రధానమంత్రులకన్న గ్రామపంచాయతీదారులధాటి కడుదట్టము. కలకత్తాలోని గవర్నర్ జనరల్‌గారికి మన మేపోకలబోయిననేమి? మఱి మనచర్య లిటువంటివనియైన నెఱుగుదురా? ఎవరైన జెప్పవచ్చిన నాలకించుట కవకాశముగాని యభిలాషముగాని యుండునా? రాజశాసిత విధుల దీర్చినచో, దదితతముల నేమిచేసిన జేయకున్న వారికేమిచింత? ఊరి పెద్దలు కులపుబెద్దలును "పిట్టచిన్నదియైనను కూతపెద్దది" అన్నట్లు ప్రతివారి యంతరంగముల సైతము త్రవ్విత్రవ్విచూడ యత్నింతురు. సమీపస్థులును ఊరిలో బెద్దలును గావున కనులెంతదూరముపాఱునో నోరంతదూరమువాగును. వీరికి వీరిమాటయే శాస్త్రము. వాదమే వేదము. కావున నిది పదిమందికి జెందినది చెందనిది యను విచారము లేక సమస్తవిషయములం గూర్చియు గాలక్షేపార్థము సగమును తమ యాడంబరములం బ్రకటించుటకును బొట్టవోసి కొనుటకును సగమునుగా గుజగుజలువోయి యావజ్జీవము జనులకు గజిబిజి సేతురు. మనుజుడు సమూహవాసిగావున న్యాయమునకుంగాకున్న భయమునకైనను విధేయతను జూపుటయో నటించుటయో యాచరించును. "మనజనులది సంఘముగాదు మంద" యని కొందఱు వాదించిరి. మందయొక్క తీరెట్టిది? గొఱ్ఱెలు ప్రక్కనప్రక్కన మేయును. విచ్చలవిడిగ దవ్వుల బోవలయునన్న ధైర్యము చాలదు. నూతన మార్గములన్న బూతములట్లు! ఒండొంటి నొఱయునవియైనను నన్నియు నచ్చుకొట్టినట్లొకేమాదిరి నుండునవి గావున నితరేతర సంబంధములకు నెడములేదు. కావున దేహముల పొత్తేకాని మనసుల కలయిక మృగ్యము. మనసులా? మనకు మన మనసులున్నగదా! మనకున్నవన్నియు పూర్వికుల మనసులే. ఎట్లన మనకు స్వబుద్ధి నుపయోగించి యోచించి తత్త్వనిర్ధారణసేయుట మహాపాపముగదా! పితృపితా మహాప్రపితామహాదు లాదేశించిన విధమ్మున రెండవమాటలేక కన్నెత్తియైనజూడక ఎన్నడో త్రిప్పి పెట్టబడిన గడియారములట్లు పోవుజడులుగాన వీరికిమనసులు లేవనియు వీరిదేహములలో తాతముత్తాతలు పిశాచములై యావేశించియుందురనియు జెప్పిన నతిశయోక్తికాదు. చిల్లరగుంపులలో జేరినవారికి స్వచ్ఛందవృత్తి కలలోనైన గనబడని భాగ్యము. మఱియు పారతంత్ర్య మలవాటగుటచేసి, దేశము వైరుల పాలైనను, స్వాతంత్ర్యముయొక్క సౌందర్యసంపదలను, గాంభీర్య గౌరవముల నెంతవర్ణించినను, హృదయ ప్రతిబింబితములు గాజాలనంత పందలు గావున, నిట్టివారికి విషాదరోషమ్ములును గలుగవు. అభిమన్యులై దేశసేవా విజృంభణ నియుక్తులు గావలయునన్న, చిల్లర సమూహములయందలి మూఢానురాగ భక్తులను బ్రొయ్యినిడి బొగ్గులుగగాల్చుట మొదటిపని! గ్రామ్యపద్ధతి స్వాతంత్ర్యమునకు విరోధి. స్వతంత్రతాబుద్ధి రాదేని గ్రామ్యపద్ధతి యనశ్వరము. కావున దేశలాభానుగుణమైన స్వతంత్రత సర్వజన సేవ్యంబు.
గ్రామ్యపద్ధతిలో జనులకు స్వతంత్రత లేదనుటకు నిదర్శనములు
1. ఐరోపాలో గృహనిర్మాణ విషయములో ముఖ్యముగా గణింపబడునవి గదులు. ప్రతివారును బ్రత్యేకముగ చదువు సాముల నెఱవేర్చికొనుటకు ఒక్కొక్కరికి నొక్కొక గదినిచ్చుట వారిలో నాచారము. మనలో పూజా పునస్కారములదక్క తక్కిన కార్యములకు అరలు దుర్లభములు. ధనికుల యిండ్ల సయిత మివి గానరావు. అందఱును మందరీతిని గుమిగూడి రేయుంబవలునుండుట పెద్దల తరముల నుండియువచ్చిన యాచారము. మనలో నంతరంగములను నవిలేవు. అన్నియు బహిరంగములే! పల్లుతోముట, మొగముగడుగుట, స్నానముచేయుట, వస్త్రములధరించుట ఇవి యింగ్లాండులో పరమరహస్యకార్యములు. మనవారిలో నన్న లక్కలు సరస విరసముల విరచించుచు కాంగ్రెస్‌మహాసభగా జేయు నుల్లాసకార్యములు. ఒకవేళ ఈ హేయంపు బ్రదుకు దరిద్రత, తస్కర భయము, పిఱికితనము వీనిచే నిలుపబడినదేమో. ఎట్లును సహకుటుంబములే దీనికి గారణములు. ఇంతయేకాక నాకు వేదాంతుల తత్త్వముల మీదను ననుమానము గల్గుచున్నది. ఎందులకందురో. వేదాంతులు నిరహంకారత్వ నిర్మోహత్వములం జాటెదరుగదా! ఈ గుణములు పట్టువడుటకు బన్నిన యుపాయములో మనయిండ్లు? ఎట్లన మఱుగు మానమునులేనిది మోహములు నివ్వటిల్లవు. సర్వమును బట్టబయలుగనున్న నింతేనాయని తూలనాడి తొలగుదుము. కావున విరక్తి జనించుటకై మనకు కొట్టము లమర్పబడియెగాబోలు! ఈ యపహాసములతో బ్రయోజనములేదు. ముఖ్యన్యాయము లివి. మఱుగు మానము లొండొంటి నవలంబించి యుండును. ఒకటి లేనిచో నింకొకటి బ్రతుక జాలదు. మృగంబుల కివిరెండును లేకుంటయె యిందులకు దార్కాణము. జనులలోగూడ మొలబట్టలుసైతము సరిగా ధరింప సమర్థులుగాని యంత్య కులజులు దూషణ భూషణ తిరస్కారంబులకు నెడమై జడులై వుంటం జూడ మనసులు కరగకున్నె? "ఇది నాది. ఈ హక్కులు నాయవి. వీని నెవరు నుల్లఘించి రాగూడదు" అను నాత్మాభిమానము లేనివారికి గరువతనము గాంభీర్యము నగోచరములు. ఈ ధర్మక్షేత్రములో తుదకు మనశరీరములైన మనవిగా జూచుకొనుటయు సఘటితంబుగ నున్నది. ఇట్టివారికి పోడిమి సాహసమును దీపింప జాలునా? కావుననే సన్యాసివేషము ప్రశస్తమని పేరుగనియె. ఈ రీతుల నవులం ద్రోచిన నహంకారము పుట్టునుగదాయని కొందఱాక్షేపింపవచ్చును. నిజమే. అహంకారమున్న నెవరికేమినష్టము? అహంకారము(అనగా గర్వం గాదు, నేను, నాపనులు, నాదేశము, అను బుద్ధి) లేమి మృగప్రాయతయేకదా! అహంకారములేనివారు స్వర్గస్థులగుదురన్న పశుపక్షి మృగాదులుసైతము తప్పక స్వర్గము బొందవలసి వచ్చుగదా! మనం నరత్వచ్యుతులమై కిన్నరులమో యశ్వశీర్షులమై గంధర్వులమో కావలసివచ్చును. అట్టి గతికైన నరకముమేలు. అహంకారము, స్వపర బుద్ధి, యివి తమంతట హానిదములుగావు. సమూహమునకు బ్రతికూలించిన నౌను. అనుకూలించినవైనచో పౌరుష ప్రధానంబులు గాన నమేయ శోభావహంబులవును. నిరహంకారులగు సన్యాసుల కుండునంత యహంకారము సంసారుల కెన్నటికినుండదు. చూడుడు! సన్న్యాసియొక్క మతమేమి? "ఎవరే కడగండ్ల గాంచిన నాకేమి? నేమాత్రము దివ్యపదవియందున్న జాలును" అని చింతించుటగదా! దీనికి నెనయైన యహంభావము త్రిలోకముల గాలించిచూచినను దొరకదు. అది యట్లుండె, దిగంబరత మేలనుటచే దిక్కులేమి సంభవించె. ఇక నిరహంకారత్వమట! నిర్మోహత్వమట! నిత్య దౌర్భాగ్య మనుటకు ఇవి వేదాంతుల తర్జుమా కాబోలు! చూడుడు! ఈ దేశముయొక్క నిరుత్సాహస్థితి వేదాంత తత్త్వములవలన గలిగినదికాదు. ఆర్థిక స్థితిగతు లాచారములకు మూలములు. ఆచారములు వర్ధిల్లిన పదంపడి ఆకంపు నింపుచేయుటకై కల్పింపబడిన వ్యాఖ్యానములు తత్త్వములు. ఇట్టి నీరసతత్త్వములను నిస్సారులు గానివారెవ్వరును బాటింపరు.
మామూలు జీతములు విధులు నేర్పడియుండుట
గ్రామములో సర్వమును మామూలుచే నిర్దిష్టము. కూలి మామూలుకూలి. మేరలు మామూలు మేరలు. దానికి దగినట్లు పనియు మామూలునిద్రతో జేయుపనియే. స్పర్ధ, మాత్సర్యము నను నవీనగుణమ్ములు పారంపర్యమను ప్రాకారమునుదాటి రానేరకున్నవి. కూలివాంద్రు మెండైన జీతములు తగ్గవు. అరుదైన హెచ్చవు. బ్రిటిష్ గవర్నమెంటువారిచే నూతనోద్భూతములైన బాట, రైలువంతెనలు ఇత్యాది కార్యములలో జీతములు పురాతన వేతనములకన్న నధికములుగ జేయబడినను, తన్మూలమున గ్రామములోని కర్మకరుల భరణ మంతగా నుత్కటముగా లేదు. స్పర్ధలేమియు, నాచార గ్రస్తతయు గారణములు, అయిన నిందొక మంచిలక్షణము. వృద్ధి లేకపోయినను హీనతలేదు. స్పర్ధాపూరితములైన దేశములలో శక్తిగలవారు తేలుదురు. లేనివారు మునుగుదురు. మనలో రెండును మితిమించిపోవు. ఎంతదక్షులైనను కుమ్మరి, కమ్మరి మొదలైనవారు ధనికులౌట యప్రసిద్ధము. ఎంత యపకృష్టులైనను, ఏమియు గడింపక పోవరనుటయు సిద్ధమ. జరాభారముచే క్రుంగి యేమియు జేయలేక యున్నను కరుణాత్ము లిరుగుపొరుగువారు వారిం గూడు జీరనిచ్చి యుద్ధరింతురు. ఇదెంతయు నానందకరంబైన యాచారము! పూర్వ నివేదితములైన గ్రామములు ప్రత్యేక రాజ్యముల వంటివను న్యాయమున కిదియొక నిదర్శనము. ఏకరాష్ట్రీయు లెట్లు పరస్పరోద్ధరణ క్రియా పరాయణులై యుందురో, ఆరీతినె గ్రామ్యజనులు దమయూరివారియెడ వర్తింతురు. ఆహా! గ్రామ్యధర్మమునం దుపగతమైనబుద్ధి దేశ్య ధర్మము నవలంబించి ప్రసరించెనేని ఎంత తేజోవంతముగా నుండును! ఇట్లు ప్రసరింపక పోవుటకు గ్రామ్యబుద్ధితో నెట్లో సంకలితమై దానిని గుదింపంజేసిన కులబుద్ధియే నిందాపాత్రము. ఇవి రెంటికింగల పరువేదియనిన గ్రామభక్తి దేశభక్తివలె స్థానము ననుకరించ యుండును. జాతులెట్లుండినను ఏకగ్రామనివాసులు స్థానబాంధవ్యముచే మనవారిని తెలిసికొందురు కావున నిది యేకీభావమును జనింపజేయు గుణము. మఱి యెంతయు బ్రశంసనీయము. కులభక్తి యిట్టిదిగాదు. పరస్థలముల నివసించుచు ముక్కు మొగముల నెన్నడెఱుంగని వారును సంతతి ననుసరించి యన్యోన్యముగా బరిగణింపబడుటయు, ఇరుగు పొరుగు వారలయ్యు జాతిసామ్యములేనిచో పరులని వెలితిగ జూడబడుటయు దీని మాహాత్యము. కావున నిది దేశదారిద్ర్యమునకును, ఐకమత్యా భావనమునకును ముఖ్యకారణము. ఉత్పాతబీజము స్థానాను గతములైన భావములు సముచ్చాయక శక్తులు, తదితరములు విచ్ఛిద్రశక్తులు. మనదేశములో జాతి, మత, వేష, భాషాదులు విచ్ఛిద్రశక్తులనుటకు గొంకనేల? సముచ్చాయకశక్తియైన దేశానురాగము మాటల దలంపుల గోరికలం బొడసూపెడుంగాని మనదేశమున నింకను గొందఱి యందుదక్క చదువుకొన్నవారియందైన ననుష్ఠానముగ సామాన్యముగ నుదయించినదిగాదు.
గ్రామ్యకులపద్ధతులు మన సుఖదు:ఖముల కన్నిటికి నుత్పత్తి స్థానములు, నెల్లలును గావున విపులముగ జర్చింపవలసివచ్చె. అయ్యవి యీ దేశమునకు దలవ్రాత వంటివి. దేశపద్ధతి యిప్పుడిప్పు డక్కడక్కడ మొలకెత్తుచున్నది. ఇది విజృంభించి వైరి పద్ధతులం గీటడంచి వ్యాపించినం గాని దేశమున మనమానప్రాణంబులు రక్షితంబులుగావు.
3. ఉత్తరువుల మేరకు శిల్పులుత్పత్తి సేతురుగాని యిప్పటి యట్ల గిరాకి నెదురుసూచి సరకుల దయారుచేయరు. కారణము స్పష్టము. సమగ్ర వాణిజ్యముగల దేశములో నెవరైన, తుదకు పరదేశములవారైన గొందురను నాశమై వర్తకులు వస్తువుల దయారుచేసి గ్రాహకులకై నిరీక్షించు చుందురు. వర్తకులకు బేరసారములు పొటకరిల్లి యుండుటంజేసి సాధారణముగ నష్టమురాదు. గ్రామములు చిన్నవియు క్రయవిక్రయము లంతగా లేనివియు నౌటంజేసి నిరీక్షింపబడని వారెవరైనవచ్చి కొందురనుట యబద్ధము. కావున కుమ్మరి కమ్మరి ఇత్యాదులు అర్థులను నిరీక్షించి కుండలు కొడవండ్లు ప్రోగుచేసిన నాస్తి చేరుటయేమోకాని యార్తియగుట తప్పదు. ఇపుడు నగరములలో గిరాకిదారులు వినిశ్చితులు గాకున్నను విపుల వ్యాపార ప్రదేశములు గావున లాభాపేక్షచే సాహసించి యంగళ్ళలో నన్నివస్తువులను నింపెదరు. ఈ సాహసమున కాశ్రయమేదనగా; రామస్వామి, అయ్యాసామి, వీరు, వారు అను నికరమైన పుణ్యాత్ములు రాకయున్నను, సరాసరికి ఇందఱు జను లేయనామధేయులోవచ్చి పదార్థముల గొందురను నమ్మిక. పల్లెటూళ్ళలో గొనువారు ప్రముఖులు గొందఱె. వీరు కొనరేని సరకులు కుళ్ళవలసినదే. బేరసారము లత్యల్పములుగాన సరాసరుల గొలుచుట పిచ్చితలంపు గావున దొలుత నుత్తరువుల జెందనది వస్తురచన కెవ్వడు దొడంగడు వాణిజ్యము కృషి శిల్పాది కళలును, అర్థమను మహారథమునకు చక్రములవంటివి. రెండును సమముగ బోవునవికాని యొకటి కాశివద్ద దిరుగుచున్న నింకొకటి రామేశ్వరమునొద్ద మసలుట ప్రకృతవిరోధం. వాణిజ్యము విస్తృతమైన గళాచక్రము యథాక్రమముగ విరివిగాంచును. గ్రామపద్ధతియందు రెండును హస్వములును నలక్ష్యములు నై యున్నవి.
4. పై వానిలోనెల్ల గలిసిన యంశమింకొండుగలదు. అదేదన, ఇట్టి స్థితిచే జనులేకరీతిని పురాణ సరణి నుందురేకాని నూతనములైన యూహలు, కోరికలు, ఉద్యమములునుం గలలోనైన గాననేరరు. గ్రామ్యపద్ధతి జడపద్ధతి. వికాస విన్యాసములకు వీలులేదు. ఎట్లన; నవీన కాంక్షలుండెబో, తత్పరిహారకములగు వస్తుపుంజంబులుండుట దుర్లభము. దుర్లభములును నదృష్టములు నగోచరములు నైన వానియెడ మరులుగొని పలవరించి ప్రయత్నించుట మనుష్యులకు నసహజం. మఱియు వాంఛ లుత్కటములుగావేని ఉద్యోగములు విజృంభింపవు. ఈ కారణములచే వస్తువులు లేమి వాంఛలు, వాంఛలు లేమి నుపార్జనములును సన్నబడి జనుల నభివృద్ధి నందనీక నికృష్టస్థితి పాత్రులం జేయును. విధిలేక మితమనోరధులై యుండువారికి వేదాంతము బయలుదేరి "మితస్పృహులై యుండుడీ" యని యప్రయోజ కోపన్యాసముం జేయుటజూడ నెవ్వరికి నవ్వురాదు? తిండిలేక చచ్చు వారికి, ఉపవాసవ్రత మాదేశించినట్లు.