భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము

ఆధునిక వృత్తినిర్మాణములందలి సామాన్యలక్షణములు - విరర్గళస్పర్ధ

పూర్వకాలమున నాయాజాతివారు కులానుసారములగు పద్ధతుల నిర్వర్తించుచుండిరి. కాన నొకజాతి వారితో దదితరజాతుల వారు జీవనార్థమై స్పర్థించుట లేకుండెను. ఈ యాచారము మనదేశమున నింకను వినాశము నంతగా బొరయక నిలిచియున్నది. దీనిచే గలుగు కష్టనష్టముల నామూలాగ్రముగ బేర్కొన నాదిశేషునకైన వలను గాదు. శ్రీ కందుకూరి వీరేశలింగముగారు వాక్రుచ్చిన ప్రకారము.

"మనదేశమునం దాయావర్ణములవారే యా యా పనులను జేయవలయుననెడు నిర్బంధ ముండుటవలన నొక కుమ్మరి దంతపుపని యందెంత యభిలాషమును నేర్పును గలవాడయినను దానిని మాని కుండలనే చేయుచుండ వలయును, ఒక స్వర్ణ కారుడు వస్త్రములను రత్నకంబళములను నేయుట యందెంత యభిరుచియు బుద్ధియు గలవాడైనను వానిని వదిలి సుత్తితో వెండి బంగారములనే సాగగొట్టుచుండవలెను.............పనివాండ్రు స్వేచ్ఛముగా తమబుద్ధి ప్రవేశించిన పనియందు బ్రవేశించి తమసామర్థ్యమును కౌశలమును గన బఱచుటకు వలనుపడక తమకిష్టములేని పనులయందే విధిలేక యావజ్జీవమును గడుపవలసినవా రగుచున్నారు. అందుచేతనే యీ హిందూ దేశమునందు శిల్పాదివృత్తు లెప్పుడు నుండవలసినంత మంచిస్థితియం దుండకున్నవి."

ఱంపముతో గరగరమని పనిచేయువానిని మంగలకత్తితో సరళముగ గొఱుగుమన్న వెండ్రుకలకు జేటులేదు గాని ముక్కు మొగములకు జేటుదప్పదు ఇంకను విశేషించి ప్రసంగింపనక్కరలేదు.

జాతిభేదమువలని కీడులు

మఱియు బరస్పర మిశ్రములుగాని జాతిలేర్పడినచో వృత్తులన్నియు నుత్తమ మాధ్యమాధమములను రూఢిగాంచి యుత్సాహ భంగముంగావించి పురుషకారోద్రేకం నంత మొందించును. ఎట్లున్నను ఎక్కువ వారమని శ్రేష్ఠాన్వయులును, ఎంత ధనగుణవిభవోపేతుల మైనను తక్కునవారమేయని హీనవంశస్థులును, ఉద్యమములకుం జొరక బీడువడి చెడుదురు. తుట్టతుదకు జగంబెల్ల కర్మనియంత్రితమని మగతనముం గోలుపోదురు. జాతిసంకరము లను గ్రహణీయములని నిర్ణయించి, పరస్పర సంబంధము గలవారై యుండిరేని, ఒకయింటిలోనే భిన్నవృత్తులుగలవా రుందురుగాన నిప్పటియట్లు వ్యత్యాసములం బచరించుట కనువుండదు. వ్యత్యాసములున్నను ఇప్పటివలె ననిర్వాహ్యములై కఠోరములై యుండజాలవు. సాంగత్యమున దేహమానసోల్లాసంబులు వికాసముంబొంది పరిఢవిల్లు. దేశమును ఐకమత్యముంగొని యయోధ్యమైయుండును. వృత్తులలో నిరాబాధముగ గోరినవారికిం బ్రవేశమున్న దరుణముకొలది సంఖ్యలధికములై గంభీర వ్యాపారములలో శ్రమ విభజింపబడుట యెక్కువ సమర్థమై యుండును. సంఖ్యలు మితములు నల్పములునునైన ప్రయాస విశ్లేషణము దుర్ఘటము. విశ్లేషలేనిది సమృద్ధి సర్వమంగళం.

ఆంగ్లోమహాజనుల రాజ్యములో పక్షపాతము ధర్మగుణమని పరిగణింపకబడక, ప్రజలనెల్ల సమదృష్టిం జూచుట న్యాయంబని ఏర్పడియున్నదిగాన, స్వచ్ఛందవృత్తిమై నుండుటకు నవకాశములున్నను, పూర్వవాసనా బంధదోషంబునంజేసి, కాళ్ళుగట్టబడి చాలకాలమున్నవాడు సంకెలల దీసినను లేవలేనియట్టును, అంధకార సంచారులను వెలుతురికిం గొనివచ్చినను గన్నులు విప్పని పగిదిని, మనము బెదురెద్దులమాదిరి దిగ్భ్రమం జెందియున్నాముగాని నూతన సామాసాదితమైన స్వతంత్రతను అలవఱచికొని యనుభవమున నింకను నుపయోగింప నున్ముఖులముగాలేదు. బ్రాహ్మణు లొక్కరు మాత్రము విద్యావంతులు, చతురులు, సాహసవంతులు నగుటంజేసి, కాలదేశముల ననుసరించి పోవుటలో నితరులకన్న ప్రవీణులై పఱగెదరు. ఇట్లనుటచే దేశమున బొత్తిగా మార్పులేలేక యున్నవని వచించుట గాదు. మార్పులున్నవి. మనకాళ్ళు ఎంత పురాతన పద్ధతులలో బూడియున్నను, ఇంకను మనుష్యులమే గావున చలనశక్తి నిర్మూలముగా లేదు. మఱేమన, దాదాపు శతవత్సరము లాంగ్లేయ రక్షణమున విరాజిల్లువారమై యుండియు నింకను బురోహితులను, కులము పెద్దలను, తాతలను, అవ్వలను, బొడగన్నబులు లంగనినమాడ్కి వడవడ వడంకుచున్నారము గాని, తాటాకుల కట్టకన్న మనస్సాక్ష్యము మిన్నయని తఱుచు నడువ నేర్చిన వారము కామైతిమి. లోకమంతయు నీనాడు మాత్సర్యగ్రస్తములై కయ్యమునకు గాలుద్రవ్వుచు నొండొంటి గడవ నుంకించు రాష్ట్రములతో గూడి ప్రతాప ప్రదీప్తమై తేఱిచూడ రాకయున్నది. చొఱవయు, తెగువయు, చలము, బలము, నున్నకాలములో, నూఱేండ్లకొక యడుగు నెంతో బలాత్కారము మీద ముందుబెట్టి "అబ్బా! బహుదూరము వచ్చితిమి. ఇది యమానుష కృత్యంబుగదా! ఇంకేమి? ఇక నూఱేండ్లు సేదదీర్చికొన నిక్కడనె కన్నులు మూసికొని గుఱకలిడుదము" అను నల్పోద్యోగులకు నీపోటాపోటీలలో గతి మోక్షంబులు దక్కవు. కావున నేదోయొకింత సంఘసంస్కారమైనది గదాయని యహంభావముం గొనుట మూఢభావము. వెనుకజిక్కినవారు ముందుపోయిన వారితో గలసికొన వలయునన్న వారికన్న వేగంబునం బోయినంగాని మధ్యనుండు దూరంబు తగ్గువడదు. కావున మునుపటికన్న నొకింత వడిగల వారమైతిమని తుష్టిమై విఱ్ఱవీగుట వెఱ్ఱితనము. యుద్ధమున జయకాంక్ష శత్రుసంత్రాసకరంబైన సైన్యమున్నంగాని ఫలింపనేరదు. పరరాజులు తమ సైన్యములం బదిరెట్టులు వృద్ధిపఱతురేని, తామును నటుసేయక రెండుమూడింతలుమాత్రము ప్రబలపఱచి మునుపటికన్న నుద్దండముగ నున్నాముగదా యనువారి కుద్దండన మనివార్యము. కావున మనతో మనలం బోల్చిచూచి నిన్నటికైన నేడు గొప్పయని యుదాసీనులై యుంట తగదు. మఱేమన నాగరకా గ్రేసరులైన ఇంగ్లాండు, జర్మనీ, రష్యా, అమెరికా, జపాన్, ప్రభృతిదేశస్థుల వృద్ధి వేగమునెఱింగి, వారికి మనకు నుండు భేదము నానాటికి బ్రుంగుడు వడునట్లు, త్వరితగతి సంస్కారము నెఱవేర్చినంగాని క్షాత్రగుణ ప్రథానమైన యీ కాలములో బ్రదుకు, పరువు కృశించి కాందిశీకము లౌట నిక్కువము.

పూర్వకాలమున వర్ణములు, తద్ధర్మములును, కలిసియుండినవి కాబోలు! ప్రకృతమున ధర్మములు కాలధర్మము నొందియు, జీవుడు లేని మొండెములట్లు వర్ణములు నడపీనుగులై యుండియు, పూజా మర్యాదలం బడయుటంజూడ నెంతయు వెఱగయ్యెడి. మఱియు వివేకముచే ఖండింపబడియు గతప్రాణములు గాని జాతిభేదములు గవర్న్మెంటు ఉద్యోగములు పొగబండ్లు, మొదలైన యార్థికస్థితుల ప్రభావముచే మంచువోలె విరియుచున్నవి. సర్వసమత్వము నోటిమాటలచే గాని కృత్యముల నెన్నడును జూపని జాతిశ్రేష్ఠులైన వారును రైలుబండ్లలో తురకలు మాలమాదిగలున్నను, కొసరక, కసరక ప్రక్కన గూర్చుండిపోవుచుండుట యేరికిదెలియదు? వేదాంత ప్రశంసలకన్న నార్థికస్థితులు నడవడి తీర్చుటలో గరీయంబులనుటకు నింకను సందియమేల? మాటలతీరునకు బురాణోపనిషత్తులును, వర్తనల సౌరునకు మూటలును, ఎరువువేసిన పాదులవంటివి.

వెలలు మొదలైనవి నన్యదేశములలో స్పర్థచే నిర్ధారితములు. ఏవ్యాపారమునందైన వెలలుహెచ్చి లాభము లధికమయ్యెనేని తదర్థ మితరులనేకులా వ్యాపారములం బ్రవేశింతురుగాన నుత్పత్తి విస్తరమునుగాంచి వెలల న్యూనపఱచును. ఏకారణముచేనైన నొక యురువునకు గిరాకిలేకపోయి వెలలు క్రిందికిదిగి నష్టముందెచ్చెనేని, ఆ వ్యవహారులు దానినివదిలి వేఱువృత్తుల నవలంబింతురుగాన నుత్పత్తి క్షయించి వెలల మఱియు వృద్ధికిందార్చును. ఇట్లు క్రయిక విక్రయికుల మాత్సర్యసారంబునంజేసి వృత్తుల స్థితిగతులు క్రమము ననుసరించి యమిత లాభనష్టములకుం బాత్రంబులుగాక వర్తిల్లును. ఈ విషయము నింకను ముందు బ్రకటింతుము స్పర్థకు సందియ్యని జనములలో వృత్తులం బరిపాలించు న్యాయమెయ్యది యనిన శాసనాచారోపదిష్టములైన నియమములు. దృష్టాంతము మనమే. గ్రామములలో వృత్తులు, వర్ణములు నొక్కటే కాన పోటాపోటీ యగ్గలముగాదు కావున శిల్పులిచ్చ వచ్చిన ధరల విధించినయెడల నితరవర్ణస్థులు ప్రవేశించి వెలల గ్రిందుబఱచుట దుర్ఘటము. మఱియు, చర్మకారునికో, స్వర్ణ కారునికో గిరాకిరాకపోయిన నావృత్తులవిడిచి లాతివృత్తుల ప్రాపునరయ వెఱపు లేమిచే వారికిని నార్తి దుస్సహమవును. ఇట్లు ఒకతఱి సంఘమునకును మఱియొకతఱి శిల్పులకును ప్రాణములు తపించి పోవునగాన, నిఱుతెఱంగులకును హితమగునట్లు అనుభవ నియతంబైన పథ్యంబొకండు ప్రచారమునకువచ్చె. అదియేదన, మామూలు ధరలు, మామూలు బత్యములు. పెండ్లి పేరంటములలో నవసర మెంతహెచ్చినను కుమ్మరి, మంగలి, చాకలి, ఇత్యాదు లెక్కువ యడుగ గూడదనియు, నొకవేళ బురుషులందఱును దీక్షవహించుటచే మంగలి యప్రయోజకుడైనను, తక్కువ యియ్యగూడదనియు గాలక్రమేణ, ఆచారమడరి పోట్లాటకాట్లాటలు లేకుండజేసెను. చూడుడు! స్పర్థలేనిచో సంఘమునకును బ్రజలకును స్వతంత్రత యస్తమితమౌట స్వాభావికము, శాస్త్రములు, ఆచారములు, వాడుకలు ఇత్యాదులకు నొకరైనదప్పక యెల్లరు సర్వవిధమ్ముల విధేయులై యుండినంగాని యస్పర్ధస్థితి నివ్వటిల్లదు. పరతంత్ర ప్రవర్తన సాహసవికాసములకు భంగహేతువనియు, వృద్ధికి దుర్నివారమైన యాటంక మనియు, పున:పున: ప్రమాణించి వున్నాముగాన పారంపర్య సమాగతము లప్రశస్తం లనియు స్వేచ్ఛా విహారములు మాత్సర్యము నవశ్యముగ ననుష్ఠేయము లనియు వేఱుగజెప్పనేల? స్వతంత్రతయు స్పర్ధయు నేకవద్భూతములు. ఇవిలేనిచో గొఱ్ఱెలవలె దలవంచుకొని గ్రుడ్డిమార్గములం జనుట విధిలేని శీలము.

స్పర్ధ సర్వవృత్తులనావేశించే దుర్దమమైయుండు సీమలు ఐరోపాదులు, ఆ దేశముల నదిచెల్లు విధానముల వెల్లడింతము.

స్పర్ధయొక్క నిర్చనము

స్పర్ధయననేమి! వైతనికులు యజమానులును కూటములుగా గూడక స్వస్వప్రయోజన తృష్ణచే దమలోదామును, ఒండొరులతోను శాసనాచారాదులచే నాపబడక నిరర్గళము మత్సరించుట. అప్రమేయము ననర్గళంబునైన మాత్సర్య మూహామాత్రమేకాని కాలదేశవర్తమానమ లచే బాధితంబై యఖండముగ నెందునుం జూపట్టదు. స్పర్ధకుంగల నిరోధము లెవ్వియన:-

లాభంబొండుమాత్ర ముద్దేశించి బిడ్డపాపలతో బుట్టిపెఱిగిన యూరులవిడిచి కడుదవ్వుబో నెవ్వరికి నైతిగాదు. వాత్సల్యము, ప్రేమ, కృతజ్ఞత, దయా దాక్షిణ్యములును, కామగ మనంబునకుం బ్రతి బంధకములు. ఎట్లన ఎక్కువజీతమ నిచ్చెదనని పిలిచినను, ఈవఱకుం బోషించిన యజమానుల విడిచి సేవకులు పోవుటయు, తక్కువ కూలికి వచ్చువారున్నను చాలనాళ్ళనుండి తామునాశ్రయించి బ్రతుకు సేవకుల నివర్తింప యజమానులును హృదయముల దిట్టముల జేసికొనుటయు, ప్రకృతి విరోధము. ఇంతేకాదు. తలిదండ్రులయెడ భార్యయందు, బంధుమండలినిగల యనురాగము మొదలగు మృదు స్వభావములును స్పర్ధయొక్క తైక్ష్ణ్యము నుపశమింపజేయునవి యైనందుననే సమర్ధతకుం బ్రతికూలములని యెన్నరాదు. ఏలన నార్థిక ప్రయత్నములకు నాధారము తమకునైనవారికి పోషణము ప్రీతి సమకూర్పవలయునను నభిలాషయేకద! స్పర్ధసంపదలం బొదలజేయునదియైనను, ఆ స్పర్ధకు మితత్వముంగల్పించు వాంఛలును కలుముల నగ్గలముగ జేయునవియే! ఇది చిత్రమైనను సత్యమే. స్పర్ధయనురాగమునకును, అనురాగము స్పర్ధకును మేరలేర్పఱచి శుభసంపాదకములంజేయుట మన భాగ్యమేగాని యన్యముగాదు. సంపూర్ణ స్పర్ధవుండి యనురాగము లల్పములైన ధనము నార్జించి యేమిసుఖము? ఎవరికిచ్చి సంతోషపఱచి మనమును సుఖపడగలము? ఆహా! మనుష్యులకు పరోపకారమువలె నానంద సందాయకము లెవ్వియైనంగలవా? ఇక ననురాగము పిచ్చిముదిఱి రేయనక పగలనక భార్యను బ్రక్కనగూర్చుండ బెట్టుకొని ఱెప్పవేయక కనులవిందు జేయుచుండిన కూడెట్లు గుడ్డలెట్లు? ఈ విందునం దాసక్తి గలిగించు తక్కిన విందులకుం గతియేమి? ఇదియుం జెల్లదు. అనర్గళప్రవాహము లనకట్టుచే నడ్డగింపబడి యుపయోగకరములౌమాడ్కి స్పర్ధానురాగము లితరేతర సహజ నిరోధకములై యుండుట యనుభావ్యములై యున్నవి.

శ్రమకరుల స్పర్ధ

ఆనాటి కంబలియైన నరుదుగనుండెడివారు దొరకినమాత్రము లాభమెనియెంచి పోటీజేయజాలరు. యజమానులకుం గింకరులకు నుండు నమోఘవ్యత్యాసం బియ్యదియ. బేరముంజేయుటలో నధిపతు లిచ్చవచ్చినంతకాలము వేచియుండ శక్తిగలవారు. కావున వారాతుర పడక ముందువెనుకలు విచారించి యెంత తక్కువకూలి యిచ్చినం జాలునో ఆ మాత్రమే యిత్తుమందురు. భృత్యులైనవారు చాలునంత వస్తువుల మిగిలించినవారుగాన కావున నిలిచి నిదానముగ దర్కింపజాలరు. మనదేశములో మాలమాదిగలకు గవర్న్మెంటువారు స్వతంత్రతను ధారాళముగ దక్షిణయిచ్చినను తిండిలేనిది స్వతంత్రత నెట్లు ప్రయోగింపనౌను? స్వతంత్రత యనునది తినువస్తువా? లేక యంగడికి బోయి యమ్మి యుప్పు, బియ్యముకొన ననువైన నాణెమా? స్వతంత్రత యెంతతీపైనను దానిధ్యానించుచు నిరాహారులై ప్రాయోపవేశము జేయువారెవ్వరునులేరు. కావున శాసనప్రాప్తమైన స్వాతం త్ర్యము స్పర్ధాక్రియకుంజాలదు. మఱి నామమాత్రంబ. నామమాత్రంబుం బొనరింప శాస్త్రశక్తికిందోడు అర్థశక్తియు రావలయు, మనపుణ్యభూమిలో బలమున్న స్వచ్ఛందవిహారము లందఱును జేసి కొనవచ్చునని యాంగ్లేయశాసనము లాదేశించియున్నను, అర్థాశక్తి, అనాచారములు, ప్రతిఘాతుకములై యుంటచే స్వతంత్రత పుట్టిపుట్టని స్థితిలోనున్నది. విదేశములస్పర్ధకు నెక్కువ ప్రతికారియై యుండునది బీదతనము. స్వదేశమున బీదతనమునకుదోడు మతాచారములును పిరిగొనియుండుట నీపాశము లేశమున దెగునదికాదు.

మనదేశములో సహజవిరోధములు చాలవని కృత్రిమము లసంఖ్యములు గల్పించియున్నారు. అందు ముఖ్యములు 1. జాతిభేదములు. 2. వివాహములు, పితృతర్పణములు మొదలైన ఋణములం దీర్చుటకై తమ బలగములోనికి వచ్చిచేరవలయుననుట. 3. భూలోక సంచారము నారద మహామునికి దప్ప నితరులకు నిషేధ్యమనుట. 4. ఒడలును దోమని యనేకస్నానములు, ఆవుపేడతో నలుకుట మొదలగు శుభ్రతలేని శుద్ధులు. 5. దేశమున వివిధ వేషభాషాదులుండుట ఇవి మొదలగునవి.

ఏదేశమైన నిదర్శించి చూడుడు. ఆ దేశస్థులు తమలో దాము పోట్లాడు భంగి పరదేశస్థులతో జీవనోపాయములకై పెనంగ శక్యులుగారు. ఎట్లన చలముజూపుట యనగా స్థానభ్రష్టత్వ మొనరింప గడంగుట కర్మకరులు పరదేశములకు బోయి యచ్చటి వైతనికులతో మత్సరించుటకు జాతి వర్ణ వేషభాషా వైషమ్యములు అడ్డములు. ఒకరిస్థానము నింకొక రాక్రమింప వలయునన్న కళానిపుణతయే కాదు. తక్కిన సహకర్ములతో గలసి మెలసి యుండుట కనువైన యంత సాదృశ్య మావశ్యకము. చంద్ర మండలమున నున్నవారితో వైరమెత్తుటకు యానాలాభమును, పారసీకులు, తురుష్కులు, ఆంగ్లేయులు, వీరిపై గూలివిడియుటకు, వారిదేశములలో వారితో జేరి నివసించుటకును వర్ణభాషాది భేదములు భంగకరములు. ఇంగ్లాండు, రష్యా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్‌స్ మొదలైన పశ్చిమ దేశములలో వెవ్వేఱుమతము లింతయెక్కువగలేకున్నను, వారిమతములలో విదేశయాత్ర నిషేధింపబడకున్నను, వెవ్వేఱు భాషలు ప్రవర్తిల్లునుగాన జీవనోపాయార్ధముగ నొకదేశమువా రింకొకదేశమునకు యధేష్టముగ బోవుట దుర్భరము. అట్లనుటచే బొత్తిగ బోరనుటకాదు. స్వదేశము నంబలె సంచారము సులభము గాదనుట.

ఇంగ్లాండులో ప్రతిసంవత్సరము వేనవేలు జనులు ఐరోపా ఖండమునుండి యుదరపోషణంబుకొఱకు వచ్చెదరు. నూతనముగ నైదువందల హాయనంబులకుం బూర్వము కనిపెట్టంబడిన యమెరికా ఖండము ఐరోపానుండి వెల్లివిఱిసివచ్చెడు జనంబులచే నిండింపబడుచున్నదిగాన నచ్చట బాశ్చాత్యభాష లన్నియుం బ్రవర్తిల్లుటంజేసి నేటికిని ఒక్కొక్క యేడునకు సుమారు సరాసరి పది పదునైదు లక్షల శ్వేతముఖు లందుం జేరెదరు. పరదేశీయులస్పర్ధ యమెరికాకుం దగిలినట్లు, ఇక నేదేశమునకుం తగులబోదు ఆచార పిశాచ గ్రస్తులైన మన హిందువులుగూడ నిపుడు కూలికై దేశదేశమ్ములం ద్రిమ్మర నారంభించి, అమెరికా, కనడా, పనామా, సింగపూర్, చీనా, మలాకా, దక్షిణాఫ్రికా ఇత్యాది సీమలలో పనిపాటులకుం గుదిరియున్నారు. పై వివరించిన విషయములన్నియు బీదలను అల్ప విద్యగలవారునైన కూలివాండ్రం గూర్చినవని యెఱుంగునది.

మూలధన స్పర్ధ

కర్మకరులీరీతి సంచార సరళత లేనివారైనను మూలధన మాచందంబునందక విచ్చలవిడి వాయువేగ మనోవేగంబుల భూచక్ర ప్రదక్షిణము జేయుటలో నద్భుత సామర్థ్యముగలది. కోలారులో గనుల దింపుటకుబట్టు ధనరాసులు, ఇంగ్లాండునుండి యొకనిముసమున బ్రవాహముగదిగును. చీనాదేశమున బొగ్గుగనులం బుటభేదన మొనర్చుటకు గావలయు ద్రవ్య సంచయములు తంతిగొట్టి బ్యాంకుల ద్వారా అమెరికావారు పంపుదురు. ధనరూపములైన మొదలు మొత్తమ్ములు పాదరసమువోలె నిలుకడలేక చరించు స్వభావము గలవి. మూలధన స్పర్ధ, శ్రమ స్పర్ధ యట్లు ఏకదేశస్థముగాక నిష్పక్షపాతమైన సర్వవ్యాపిత్వముం బూనియుండు. మనదేశముననుండు రైల్వేలు యంత్రశాలలు మొదలైన మహావ్యవహారముల నుపగతమైన పుంజిపటలము దేశదేశములనుండి తేబడును గనుక, మనమును అధిక త్వరతో ధనప్రయోగమునకుంబూనమేని, ఇతరులా సందుజూచికొని ప్రవేశింతురుగాన, మనధనమ్ములు నిరర్ధకములై మూటలలో బ్రచ్ఛన్నములై యుండవలసివచ్చును. వస్తువులు, సమాచారములు, నేకొఱతయులేక, కాలవ్యయముంగాంచక, తలచినప్పుడు పంపం గలుగు యానశక్తి యుద్ధృతం బౌటంబట్టి, దేశభేదములచే నబాధితమౌ మూలధనమ్మునకు లోకము రాజ్యమట్లును, రాజ్యము లిండ్లయట్లును సులభముగ బొందదగినవయ్యె.

మనశ్శ్రమకరుల స్పర్ధ

మఱియు శిల్పములు జేయుచు గాయకష్టమున శరీరయాత్ర నడుపువారు ప్రవాసమునకుం దగనివారైనను, కార్యవిచారణ, వ్యవహారనిర్మాణదక్షత, మానేజరుపని, ఇత్యాది మనశ్శ్రమలచే నుల్లసిల్లువారు, ఎల్లెడలకు నెక్కువ సుకరణముగ బోవచ్చుగాన నుత్కృష్టోద్యోగములలో దేశదేశములకు స్పర్ధయున్నది. బొంబాయిలోని ప్రత్తిశాలలలో విచారణకర్త లనేకులు యూరోపియనులు. ఏలూరిలో స్థాపింపబడిన జనపనార శాలయందును ఇంగ్లీషువాడొకడు మానేజరుగా గొంతకాల ముండెననియు నాకు వినికిడి. కాఫీ, టీ, రబ్బరు, వీనియుత్పత్తి, వ్యాపారములు ఇంగ్లీషువారే స్వయముగ నిచటకు వచ్చి నెఱవేర్చుచున్నారు. విద్యాధనముల ఖండములుగనుండిన నేదేశమునకైన నిరాబాధముగ బోవచ్చును, రావచ్చును, సన్మానములం బడయవచ్చును. ఐరోపా అమెరికావారు మనతోబలె మనము వారితో మత్సరింపలేము. మన దౌర్భల్యమునకుం గారణములు జాతి మతాది భేదములు, దేశయాత్రా పరాఙ్ముఖతం బుట్టించు నాచారములు, రాజసభావములేక విధేయులమై యుండవలసిన దురదృష్టము, ఇత్యాదులని మున్నే పలుమాఱు వక్కాణించితిమి. చూడుడు! పాశ్వాత్యుల వర్తకులు, శిల్పులు, తూర్పుదేశములం బ్రవేశముంగోరిన, మనవంటివారు నివారించిరేని ఫిరంగులతో వాదించి త్రోవదీతురు. ఆసియా ఖండనివాసులు బలహీనులగుట నీతర్కంబు వాఙ్మనస గోచరంబైనను శక్తి సాధ్యంబుగాదు. దక్షణాఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, కనడా ఈ ప్రాంతములయందు తెల్లమూతిలేనివారు కొన్ని నియమములకు లోబడికాని రాగూడదని శాసించియుండుటం జూడగా, మనదేశమున మనుస్మృతి ప్రభావము హీనమౌచుండుటందలంచి మన ధర్మదేవత దానికిం బాశ్చాత్యుల తిరస్కారముం దోడుచేసి యాచారముల నిలుప బ్రయత్నించు నట్లు తోచెడిని! బలపరాక్రమ సంపన్నులమై దిక్కులెల్లనైన సాధింపజాలినవారమై యున్నతఱి భరత ఖండమే శరణ్యమనియు నితరాశ్రయము లశస్తములనియు నియమము లేర్పఱచికొని, సొంతముగ మనకాళ్ళకు మనమే సంకెలల దొడిగికొని కూరు చుంటిమి. ఇపుడు బయటబోదమను బుద్ధి వచ్చినదిగాని ఇది వచ్చుతఱికి శక్తి వెడలిపోయె! ఇచ్చయున్న శక్తియు, శక్తియున్న నిచ్చయు లేనిబ్రదుకు మనవారు ప్రయత్నించి గుత్తయెత్తిరికాబోలు!

స్పర్ధవలని లాభనష్టములు

ఆర్థికవిషయమైన స్పర్థ యంతటను సమముగ బర్వక కొన్నియెడల మిక్కుటమును గొన్నియెడల లేశమునై వివిధగతుల వెల్గును. ఇక దీనిచేగలుగు లాభనష్టంబుల నిర్దేశింతము:1. స్పర్ధ యుత్పత్తికి నుద్దీపకము. ఒకరికన్న ముందుగ నింకొకరు వ్యాపారచక్ర మాక్రమించుకొను నుత్సాహంబుం గలిగిన వారైన నుత్పత్తి వాణిజ్యములీపోటీచే దఱుచులగును.

ఆక్షేపణ ఇది నిజమేగాని స్పర్ధ యమితమైన నయముగ విక్రయించి వ్యాపార మాకర్షించుటకన్న కర్తవ్యములేదని, ఆసాములు చూచుటకు దళుకుగాను చూడంబోయిన బెఱికిగాను, ఉండునురువుల త్వరత్వరగ దయారుచేసి, యుత్పత్తి రాశిలో నధికమైనను మేల్మిలో బీడువడునట్లు చేయుటచే, సరసమనినమ్మి కొనువారికిం దుదకు విరసత గల్పింతురు. ఇది మోసము. అల్పమూల్యములైన విదేశపు సరకుల (ముఖ్యముగ జర్మనీ సరకుల) గొనువారికిది యనుభవవేద్యము.

అనేకులున్నగదా స్పర్ధ! అనేకులులేక యొక వ్యాపారమునకెల్ల నొకడే యీశ్వరుడై యున్న సరకుల గుణముతో వెలలుతగ్గించి తన యమ్మకముం జెడగొట్టుకొనునక్కఱలేదుగాన నట్టి యద్వితీయ పదార్థముల శ్రేష్ఠతను భద్రముగ గాపాడును. నిర్మాత్సర్య వ్యవహారముల ధరలు సరకులు రెండును గొప్పగనుండును. కావున మొత్తముమీద నిదియే సరసకార్యము.

2. స్పర్ధ వినియోగమునకుం దగినంత యుత్పత్తి నాపాదించి రెంటికిని సామ్యముంగూర్చి వ్యర్థత గలుగకుండునటుల జేయును. ఎట్లన:- ఒకయూరిలో పెండ్లికార్యములు ప్రబలి కుండ లెక్కువ గావలసెననుకొనుడు. కుమ్మరి వృత్తిలో నితరులకుం బ్రవేశమున్న వినియోగవిస్ఫారతకుం దీటుగ భాండ విస్తరమును గల్పించుటకు మఱికొంద ఱుద్యోగింతురు. అదిలేనిచో స్పర్థాతీతుడైన పురాణ కుంభకారు డేమిపెట్టిన నదియే ప్రసాదమని కోరికలు తీరకున్నను తృప్తివహించి యుండవలయుగదా!

ఆక్షేపణ. వినియోగముతో నుత్పత్తియు యధాక్రమముగ వృద్ధినొందిన నందఱకును సుఖమే. కీడెవ్వరికినిలేదు. కాని వినియోగ మునకన్న మితిమీఱి యుత్పత్తి యార్జనకువచ్చిన వస్తువులమ్మ బడక నిలిచి కుళ్ళి కంపెత్తి వ్యర్థములగును. అమితోత్పాదనము స్పర్థచే జనించు కొఱగాములలో ప్రప్రథమము ఏరీతినందురో? ఆయూరిలో కుండలకు గిరాకివచ్చినదని ప్రతివాడును ఆ గిరాకిని దానే పూర్తించి లాభపూర్ణుడు గావలయునని యువ్విళ్ళూరుచు చట్లు తట్టుటకుం బూనిన, గిరాకికిమించిన సరఫరా సిద్ధించు. ఇందుచే వెలలుతగ్గి, యది కారణముగ గిరాకిహెచ్చెనేనియు నాతర్వాతను శేషించిన మృత్పాత్రములు వ్యర్థములనుట కేమిసందేహము? మితిమీఱిన స్పర్ధచే మితిమీఱిన యుత్పత్తికలిగి తద్ద్వారా మూలధనము, శ్రమ ఇత్యాది కర్మసాధనంబులను మోఘంబులంజేసి సంఘంబున కపకృతిం జేయును. ఐరోపా, అమెరికా, ఇత్యాదిదేశములలో నధికకోత్పత్తిచే వెలలు కృశించి నిలుకడలేనివై యపుడపుడు మహోత్పాతములం గల్పించి వ్యవహారములగల గుండువడం జేయుట నికముందు విశదీకరించెదము.

3. స్పర్ధచే వెలలుతఱుగును. వస్తువులు నయములౌను. కావున బీదలకును గర్మకరులకును నత్యంతోపకారి, ఎట్లన; వ్యవహారమంతయు నొకని యధీనమందున్న, వాడు పెట్టినది భిక్షము. అందును ప్రాణాధారవస్తువులైన ధాన్యాదులు మానరక్షకమ్ములగు వస్త్రములకు వలయు ప్రత్తి మొదలైనవాని యుత్పత్తికి కొందఱీశ్వరులై కట్టుగట్టి కొని నిలిచిన, వీనియందలి యాదర మనశ్వరముగాన వస్తువునుజూచి కాక మనశక్తినిజూచి వెలలువిధించినను గూడినంత నిచ్చుట కోర్చుట దప్ప వేఱుదిక్కు వెదకినం దొరకదు. అనేకులీ సరకులకు నాథులై రేని పరస్పర మాత్సర్యంబునంజేసి తమతమకు వాడుక కాండ్రెక్కువ రావలయు ననుకోరిక నొండొరులంగడవ వెలలు సరసములుగ జేతురు గాన బ్రజకు ప్రకృష్టబగుట స్పష్టంబు.

ఆక్షేపణ. ఇది కొంతవఱకు నిజమైన న్యాయంబైనను అపవాదములు లేనిదికాదు. సమయాంతరముల ధరలు స్పర్ధచే నున్నతము లౌటయుంగలదు. ఎట్లన; ఒకరిని మీఱవలయునని యొక రుద్రేకించి కృషింజేయుటలో తమతమ సరకులసంగతి మున్మున్న భోక్తలకుం దెలియవలయునని వార్తాపత్రికలలోను ఇతర మార్గంబులలోను బ్రకటింతురు. ఇంగ్లాండులో బండముల వర్ణింపుచు చిత్రపటములచే నేత్రాకర్షణముజేయు ప్రకటనలు తయారు చేయుట ప్రత్యేకవృత్తియైనది. ఈ ప్రకటనలకు రైలుస్టేషనుల గోడలమీద నతికించుటయే గాదు, రైలుదారి పొడుగునను సమీపస్థములైన పొలములలో మేకులదింపి వానిమీద విశాలములైన పలకలునిల్పి, ఆ పలకలమీదను బ్రకటనలు రచించి ప్రయాణికులు చూచునట్లుంతురు. ప్రకటన కరులకుబోవు జీతమేమి? పొలము సొంతగాండ్రంజెందు బాడుగలేమి? ఉత్పత్తి వ్యయ మీక్రియలచే హెచ్చుంగాదె! ఇంకను పోటీదారులసంఖ్య యెదుగుకొలది భోగ్యవస్తు సముదాయ మేకస్థితినున్న ప్రతి వ్యవహారియును దక్కువగా నుత్పత్తి జేయవలసిన వాడగును. భాండ నిర్మాణమున కొకయూరికి నొకరిద్దఱు కుమ్మరులైనజాలు. మఱి పదుండ్రు ప్రారంభించిరేని మొదటి మొత్తములో బదిరెండవ భాగమునకన్న నెక్కువ జేయబూనుటయసిద్ధము. రాశితగ్గిన నేమియేని మందలింతురేమో! పరివర్తన కళలలో రాశి యెక్కువ యగుకొలది వ్యయక్రయంబులు తక్కువలగునను న్యాయంబు మఱచితిరా? కావున రాసు లధికసంఖ్యలైన ఏకరాశిగా నున్నపు డున్నంత సుకరముగ నుత్పాదనము జరుగదు. ఏకతంత్ర వ్యాపారములలో సరకుల ప్రమాణముల కుంఠితమౌటచే వ్రయక్రయములు కుంఠితములగును.

ఇత్యాది కారణమ్ములచే స్పర్ధవలన ధరలు క్రిందగుననుట నిక్కంపు దత్త్వంబుగాదు. మఱి యపవాద భూయిష్టంబు.

వెలలు వ్రాలుట యటుండనిండు. పోటీవ్యాపారములలో వెలలు బహు చంచలములు. పడుట, లేచుట, మాయమౌట, గంతులు వేయుట మొదలగు నింద్రజాలములంజూపి వర్తకులను, ఉత్పాదకులను, భోగులను వెగడుపఱచి వేసరించును. ఎట్లన; స్పర్ధాళువులలో ప్రతివారును పేరాసచే అమ్మకమంతయు దమచేతికేరావలయునని ఎక్కువ సృజించిరేని మితిమీఱిన ఉత్పత్తిజనించి వెలలకు భంగమును ఆసాములకు నష్టమును గలిగించును. ఈ నష్టముచే దివాలెత్తినవారు దివాలెత్తగా, నిలిచినవారును దిగులుచెంది ఇకముందెట్లోయని కడు గొంచెము ప్రోగుచేసి యెదురుచూచుచుండుతఱికి, గిరాకి ఈతబ్బిబ్బులకు నాస్పదముగాదు గాన మునుపంత ముమ్మరికము గలదియగుట వెలలు తటుక్కున విజృంభించు సముద్రములోని తరంగములంబలె ధరలు పెఱుగుచు, తఱుగుచు, లేచుచు, నడంగుచుండుట వ్యవహారములకు శ్రేయంబుగాదు. నేడావశ్యకవస్తువులు సరసములాయెగా యని నమ్మి యితరపదార్థములమీద వెచ్చించువాడు, ఱేపని ప్రియములగుడునప్పులపాలగును. ధరలు, ఆర్థికరథమ్మునకు నశ్వములు. ఎటుబోయినను నపాయములేదుగాని, మెల్లగా క్రమముగ గతి మాంద్యమో వేగమో యాశ్రయింపవలయు ననుట యగత్యము. అట్లుగాక యున్నట్టుండి పఱువువాఱుటో, హథాత్తుగ నిలుచుటయో, తటాలున దిరుగుటయో, యకస్మాత్తుగ ముంగాళ్ళు మీదికెత్తి దుముకుటయో, ఇట్టి వినోదములకుం గడంగిన బండిలోనున్న కుండలేనా తలలుగూడ నెఱ్ఱెలు విడుచును. నిర్మాత్సర్యవ్యవహారముల ధరల గమనము, ఒకపద్ధతి ననుసరించి దేహము లసియాడని విధంబునం బోవును.

4. నిరాతంక స్పర్ధచే వృత్తులు సమాన లాభకరంబులౌను. ఎట్లన నెందేని నమితసంపాదనమున్న నితరులందు బ్రవేశించి యమితమును మితముంజేయుదురు. సంపాదనముతగ్గినచో దానినివిడిచి మేలైన శిల్పములకుంబూని బాగువడుదురు. లాభముతో బోటాపోటీయు హెచ్చి ప్రాప్తింగుదించి సమత్వస్థాపనం బొనరించుటయు, నష్టమున్న బోటి లఘువై ప్రాప్తినెగజనంద్రోయుటయు, నను నీసాధనద్వితయం బునంజేసి వృత్తిసామ్యంబు సేకూర్చు. ఆర్జనమున నెల్లరు దుల్య ప్రాభవులైన మర్యాదా గౌరవములందును దుల్యులౌట, సర్వజనులు నిమ్నోన్నతభావములేక యేకాసనాసీనులట్లుందురు.

ఆక్షేపణ. ఇది కవికల్పనంబోలినదిగాని నిజమేమాత్రము గాదు. చూడుడు! పరస్పరవైరంబున సర్వజనమైత్రి సిద్ధించుననుట విపరీత వాక్యముగాదా? దీనిలో నొకవిధమైన సత్యమున్నదిగాని యది వివరించితిమేని యసహ్యముగ దోపకమానదు. ఆ సత్య మేదన భూలోకములోనివారెల్ల ద్వేషబుద్ధిచే గలహంబులకుంబ్రారంభించి ప్రాణాంతమగువఱకును యుద్ధముంజేసిరేని, వీనిచేవాడు, పెఱవానిచే వీడుగా నందఱునుమడిసిన, చిట్టచివరకొక్కడుమాత్రము మిగులును. నిలిచిన వాడొక్కడేయైన, తనకన్న నెక్కువవారుగాని తక్కువవారుగాని యుండరుగాన వానియాయువు పర్యంతము నిమ్నోన్నతరహిత సమత్వము సిద్ధించుననుట! ఇది తర్కప్రకారసిద్ధమైన యంశమైనను విశ్వసనీయంబుగాదు. మఱివెక్కిఱింతమాట. ప్రజాక్షయ సంజనితంబైన ప్రళయకాల సమవర్తనము మాకెవ్వరికిని వలదు. మీకుం గావలసిన నింకొకలోకమునకు వెడలి గడించుకొనుడు! మాయెదుర నీవిపరీతములు విప్పకుడు!!

స్పర్ధయనగా వైరము. వైరముచే బలవంతులకు బలమును దుర్బలులకు దౌర్బల్యమును మఱింత హెచ్చి యెక్కువ తక్కువ లెక్కువయగుననుట సుప్రసిద్ధన్యాయము. దీనిచే బ్రళయకాలసమత్వం దప్ప ప్రయోజనకరములైన సమత లెవ్వియు బడయబడవు. పూర్వం ఆర్థికవైరము లల్పములుగా నుండినందున గుబేరులుగాని యష్ట దరిద్రులుగాని లేకుండిరి. ఇప్పటికిని స్పర్ధారహితములైన మనగ్రామములలో నాఢ్యాధములకు నాగరిక ప్రదేశములందుండునంత వ్యత్యాసము లేదు. ఐరోపాలో కోటీశ్వరు లొకవంకనున్న గోచికైన లేనివారొకవంకను; లక్షాధికారులకు వ్యతిరిక్తబింబములపగిది భిక్షాధికారులు నసంఖ్యులై యుండుటచే, దేశసౌఖ్యము, అమితమనువ్యాధిచే నపకృష్టమై తపించెడిని సంఘంబనుత్రాసు సరిగా నిలుచునట్లు గానము.

చలములేక యేదేనొకతీరున నితరులకు ధారాళముగ నెడము ప్రోపుల నొసంగిమను మనవారిలో దినదినమును పరమాన్న మారగించువారు లేకపోయినను అంబలియైన లేనివారునులేరు.

5. స్థితిలోనే లయము గుప్తంబై యున్నదను తెఱంగునం స్పర్ధ స్పర్ధచేతనే సమాప్తిం జెందును. ఎట్లన; యుద్ధరంగంబునంబోలె నార్థికరంగంబునను క్షాత్రము శోభిల్లి యొండొరులం బొడిచి యడంచిరేని, ఓడినవారుపోగా జయమండితులైన వారు నిరర్గళ వ్యాపారులగుదురు. ఇయ్యది యనుభవదృష్టము. అమెరికా దేశములో దొలుత సర్వస్వతంత్ర స్పర్ధ విజృంభించి యందుచే ననేకులు కసవుం గఱచిన వారుకాగా నిప్పుడు వ్యవహారచక్రంబులో బహుళ భాగంబండుం గడతేఱిన కొందఱ యధీనముక్రిందికి వచ్చినది. రాష్ట్రములయందెట్లో వ్యాపారముల యందునట్లే. క్రమనియమముల సరకుగొనక రాష్ట్రీయులు గవర్నమెంటే వలదని హద్దుపద్దులేక యమితస్వేచ్ఛులై తిరుగజొచ్చిన బలమఱి శత్రువులపాలై యేస్వేచ్ఛయు లేనివారగుదురు. అమోఘ స్పర్ధయు నాత్మోపహతంబై మోఘంబగును. ఇది విశదమౌటకుం గొన్ని నిదర్శనములు:-

అమెరికాలో "రాకిపెల్ల" రను భూలోక కుబేరుడొక డున్నాడు. అతడాగర్భ శ్రీమంతుడు గాకపోయినను సాహస బుద్ధిబల సంపన్నుడౌట కిరోసెన్ నూనెయొక్క యుత్పత్తి పరివర్తనాది కళలలో నేకచ్ఛత్రాధి పత్యము వహించెను. ఆక్రమబెట్లనిన; నూనెను, ఇనుపకొళాయలగుండ దీసికొనిపోవచ్చుననుట గనిపెట్టి, అయ్యది తానే కల్పించిన తంత్రమౌట నింకెవ్వరును నాపద్ధతి నవలంబింప గూడదని, అమెరికాసర్కారువారి యధికార పత్రికనుబడసి, రైల్వే కంపెనీలవారితో "నాసరకులను తక్కువ వేతనమునకు దీసికొని పోతిరాసరి, లేకున్న గొట్టముల ద్వారా నేను పంపుదును. అట్లైన నాసరకు మీకేమియు దక్కదు. అందుచే నష్టపడువారు మీరో నేనో చూచికొందము!" అనిన రైల్వేకంపెనీలవారు "వీడసాధ్యుడు. చెప్పినదెల్ల జేయు నంతటివాడు. యానవేతనముల దగ్గించకుంటిమా యొక బండినూనెయైన మనమూలకముగ బంపడు. వీనింజూచి ఇతరులును మనల నడ్డజేయక పోయిన జెప్పరాని నష్టమౌవును. సర్కారువారి యాజ్ఞయో పక్షపాతములేక యేకరీతినే కూలి విధించవలసినదని యున్నది. ఏకరీతినూనిన నేరీతియులేకపోవును. ఏమిచేయుదము?" అని తర్కించి విధిలేక రహస్యముగ నొడంబడిరి పిమ్మట 'రాకపెల్లరు' చిల్లర నూనెవర్తకుల జూచి "మీవ్యాపారమంతయు నాయధీనముగ జేయుడు. మీకు మంచి సంబళము లేర్పఱచెదను. ఒకనికిలోనై యుందుమా మేమని గర్వముచే నిరాకరించితిరేని మీయూరులలో చుట్టుప్రక్కల నాయంగడులనిలిపి అతిసరసముగా విక్రయించెదను. నాకు నష్టమనియందురో, ఇట్టి వెన్నికలిగినను, ఏనుగును దోమ గుట్టినట్టు నాకు లక్ష్యములేదు. మీరు నానష్టములో శతాంశమునకైన నోర్వలేక నాశమెత్తుదురు. భద్రము" అని చెప్పి వారిపై దండెత్తిన వారలు పాపమేమిచేతురు? లొంగినవారులొంగిరి. తిరస్కరించినవారాతని స్పర్ధదెబ్బ దగులగనే తోకలుముడిచికొని కాళ్ళు నాకవచ్చిరి. ఇట్లు చిల్లరవ్యాపారమంతయు దనదైనపిదప గొప్ప వ్యవహారికులను నదేరీతి నణగద్రొక్కి ప్రపంచమున నించుమించు నాల్గవపాలు వ్యాపారమునకుం జక్రవర్తియై యెదుటివారులేక పోటీలను భయము కలలోనైనగానక, తనసరకులు బర్మా, ఇండియా, ఇత్యాదులగు తూర్పుదేశములమీదను విజృంభింప నిర్వక్రముగ కిరోసెన్‌నూనె సార్వభౌమత్వము నందియున్నాడు, స్పర్ధ స్పర్ధచే నెగురగొట్టబడినందుల కిట్టితార్కాణము లెన్నేనిగలవు. రాకిపెల్లరు గారింగూర్చి యొక మంచిమాట జెప్పకపోవుట యన్యాయము. ఏదన, ధనలుబ్ధుడై యితడిట్టికార్యము లాచరించెననుట సత్యమునకు జాలదూరము!

మఱెందువలన ననిన; రాజసభావముచే ఈవ్యాపార ప్రపంచమునం దనకు మించినవారును సములును నుండగూడదని వారికి క్షాత్రము. తనప్రసాదంబునంగాని లోకమ్మున జీకటి విఱియ గూడనిదై యుండవలయునను మహాభిమాన శోభితుడు. ఇహలోక చంద్రముడను బిరుదునాసించినాడో, లేక జనులందఱు దన్ను దలంచి సాయంకాలమున "దీపంజ్యోతి: పరంబ్రహ్మ కిరోసెన్‌నూనె మండితమ్" అని యెల్లరు తన్నుద్దేశించి సంధ్యావందనముం జేయవలయునని తాత్పర్యమో! ఏదైననేమి? రాజసలాభముగాని తామస లోభముగాదు. తాను కోట్లకొలంది నార్జించినాడు. అర్జనకు ననుగుణములైన దానధర్మములను పాత్రములనెఱింగి యథేష్టముగ లోకంబు వితాకువడు వడువున జేసినాడు. చేయుచున్నాడు. చేయనున్నాడు. 'చికాగో' మహానగరమున సర్వకళాశాలకు నితడిచ్చినది సుమారు ఏడుకోట్లు! చీనాదేశమున విద్యాభివృద్ధికై యిచ్చినది యఱకోటి. 'నీగ్రోలు' అనబడుచు, మాలమాదిగలట్లు నికృష్టులుగ జూడబడి యమెరికావారిచే హింసింపబడు ననాధుల నుద్ధరించుటకు నిచ్చినది యొకకోటి. ఇట్లు జాతిమతాది భేదములులేక దిక్కులు పిక్కటిల్లజేయు దానకళలచే యశోభరితుడైనవానిని లోభియనుట తక్కువపలుకుగాదా? పూర్వము మనరాజులు దిగ్విజయము జేసినట్లు తానును వ్యవహార విషయమైన దిగ్విజయము నొనరించి పట్టభద్రుడైనాడు!

అమెరికా, జర్మనీ, దేశములలో స్పర్ధ యమితమగుటచే బాధితులైన వ్యవహారకర్తలు పరస్పరం కలసియుండినమేలని యిపుడు మహాసంఘములుగా నేర్పడి వైరము లేనివృత్తుల జరుపుటకు మొదలిడి నారు. కర్మకరులును మేరలేని మాత్సర్యము వినాశహేతువని శ్రేణులుగా గూడుచున్నారు. వర్తమానమున నెల్లెడలజూచినను జనులు తమకుం దాముమాత్రముగ నెల్లరతోనెదిరి యప్పళించుట మాని, సంఘములుగజేరి వ్యూహములు వ్యూహముల, సైన్యములు సైన్యములరీతి ప్రతిఘటించెదరు. ప్రతి వ్యవహారములోను యజమాన సంఘములు భృత్య సంఘములు దినదినమును బయలు దేరుచున్నవి. దేశ దేశములనుండు కర్మకరులు ఒండొరులతోను, యజమానులు తమలో దామును మిత్రత్వము నెఱపుచు నార్థికకలహముల దోడుపడుట యుంగలదు.

పై వాక్యమునకు వ్యాఖ్యానములేనిది యర్థము స్ఫుటంబుగాదు. వృత్తుల పరిణామముంగూర్చి వ్రాయు సమయంబున ఒకవిషయంయొక్క ముఖ్యతను దగినట్లు విశదపఱుపలేదు. ఏదన, గ్రామ్యశ్రేణి పద్ధతులలో కూలివారే యుపకరణములు మొదలుగ మూలధనములను గలవారుగా నుండిరి. అస్వచ్ఛందములైన నివేశనావేశవృత్తులలో దొలుత గూలివారికి మూలధనసంపత్తిలేకయుంట తటస్థించును. వ్యవహారములు నెగడి నివ్వటిల్లంజొచ్చిన యంత్రాదిసాధన నిచయంబులకు మూలార్థ మతిశయముగ వలయుగాన కర్మకరులు యజమానులై సొంతముగ గళల నిర్వర్తింపజూచుట యరిదితలంపు. పూర్వమున, నేడు కూలివాడుగా నున్నవాడు రేపు సొంతగాడు గావచ్చును. ఆధునికమున నియ్యది కష్టతరసాధ్యముగాని యలతులం దీఱునదిగాదు. కావున శ్రమకరులనువారు ప్రత్యేకపు దెగవారై యెంత తపస్సుచేసినను యజమాన పదవినందుట దుర్ఘటంబు గావున వారితో గలయికలేనివారై యుండవలసివచ్చె. ఇందుచే వ్యవహారచక్రమంతయు కర్మ భర్తలు, కర్మకర్తలు నని రెండుతెగలుగ భిన్నమై సంఘముయొక్క యన్యోన్యతకు భంగకరమో యనునట్లున్నది. ఈ యంశమునకే కొందఱు "శ్రమ మూలధనముల వియోగం" బని పేరిడిరి. చూడుడు! శ్రమకు మూలధనమునకుంగల సంబంధములు. రెండునుం గలసినగాని యుత్పత్తియు నార్జనమునులేక రెండును గృశించి కీర్తిశేషములౌను. ఉత్పత్తియం దేకీభవించినను ఫలము విభజించు కార్యమున నివి పరస్పర విరుద్ధములు. శ్రమ కెక్కువభాగము జేరిన మూలధనముకు జేరునది తక్కువ. పుంజీదారు లెక్కువ కొట్టివేసి రేని కర్మకరులకు మిగులునది కొంచెము. నీకువచ్చిన నాకులేదు, నాకువచ్చిన నీకులేదు, అను సమాచారముగానున్నది. ఇట్లు తొలుత వియోగమును, వియోగంబు కానుగాను వైరమును ప్రాప్తించి కర్మభర్తలకు గర్మకర్తలకును బ్రబల కలహములు పుట్టు కారణంబాయె. ఇదియు స్పర్ధచేనైన కొఱగామియే యనుట తేటతెల్లంబు.

ఈ యార్థిక యుద్ధమున దేలినవారు కొందఱు. మునిగినవారు పెక్కుఱు. పుంజీదారులు కొల్ల గొట్టువారు. శ్రమకరులు కొల్లపోవువారు. అధిపతు లాస్తిగలవారుగాన బలాఢ్యులు. రథికులవంటి వారు. భృత్యులు పాదచారులైన కాల్బలములు. ఇదివఱలో రథికుల తీవ్రత యాపరానిదై యుండెను. ఇప్పుడన్ననో కాలము, దైవమును బక్షముల మార్చుచున్నవి కాబోలు! పనివారు దృఢవ్యూహములం బన్నినవారగుట మేలుచేయగా నింకను రాకున్నను సరిసమానముగ నిలిచి వ్యాపారసమరంబున నవికలస్వాంతులై యున్నవారు.

దేశభేదములనైన బాటింపక శ్వేతఖండనివాసులెల్లరు, ఈ సంఘముల స్వస్వలాభముంగోరి చేరియుండు టంబట్టి యొకదేశమున జగడమారంభమైన నది యన్యదేశమునకు వ్యాపించుటయుం గలదు. ఈవిషయము నెదుటవచ్చినిలిచినట్లు విశదంబొనర్ప గతసంవత్సరమున*[1] నడచిన యొకటిరెండు భీకరాఘాతముల వర్ణించెదము వినిడు.

ఓడల కంపెనీలవారికిని, సామానులనెత్తుట, దింపుట, ఇత్యాది కర్మలనుజేయు సేవకులకును జీతముం గుఱించిన రాయబారములు జఱిగి, యవి తుదదాకనందున గర్మకరులు పనికిరామని సమయముజేసి నిలిచిపోయిరి. అందుచే నోడల ప్రయాణము క్రమముదప్పినందున సొంతగాండ్రకు నగణ్యమైన నష్టమువచ్చినది. పనివాండ్రకును గూలి రాదయ్యె. ఇట్లిరుపక్షములవారును గష్టములకుం బాత్రులయ్యును బంతము వదలుటెట్లని సమాధానము నాశ్రయింప నెవరునురారైరి. సేవకుల కండక్రొవ్వు నీఱుచేయవలయునని యజమానులు విశేషించి భరణమిచ్చెదమని యాశజూపి యీ పనులకు నితరుల నాశాపాశముచే నీడ్వసాగిరి. బీద లసంఖ్యులుగాన నందఱనొక కట్టుగా గుంపుజేర్చుట కెవరికి శక్యము? నౌకలందుండు నౌకరుల బృందమ్ములం గూడని పెఱనౌకరులు వీరికి స్థానభ్రష్టత్వ మాపాదించి సంపాదింతమను తమకమ్మున తండోప తండమ్ములుగ రాదొడంగుడు, గుంపుగా నవఘళించియుండిన ప్రాతసేవకులు వారిపై దండెత్తి ఱాలురువ్వి బాహియుద్ధముం జేయ జొరబడు తఱికి పోలీసువారు మధ్యస్థులుగ రావలసివచ్చెను. న్యాయాన్యాయము లెట్లున్నను దొమ్మిరేగి జను లొకరొకరిపై కయ్యమునకు నాయితంబైన గలబ లేకుండజేసి రక్షణకార్యంబు నెఱవేర్చుట రాజ్యాంగమువారి ముఖ్యకర్తవ్యముగదా! ఇట్లెన్ని యడ్డంకులు వచ్చినను వెనుదీయక యా కర్మకరులు జర్మనీ, హాలెండు, ఫ్రాన్‌స్ దేశములలోని సహకర్మకరులం దమకు సహాయము గావలసినదనికోరగా వారు తమతమదేశములలో దామును బనులకు బోవుట జాలించిరి. ఓడలకు నింగ్లాండులోనేకాదు, ఇతరదేశములందును బ్రయాణసన్నాహము కష్టసాధ్యమగుడు, యజమానులు కొంతవఱకుం బరిశ్రాంతక్షాత్రులైరి. పనివారును సంధికి సిద్ధముగా నున్నందున నెవరికిని ముఖము చిన్నపోగూడదని గవర్నమెంటువారు తామే మధ్యస్థులుగనిలిచి తీర్పుచేసెదమనిరాగా వారి పంచాయతీ తనమునకు నిరుదిక్కులవారు నంగీకరించిరి. మొత్తముమీద జయ మేరికన్న శిల్పిసంఘమునకే. సంబళము హెచ్చింపబడెను. భృత్యులు మఱల బనులం బ్రవేశించి మునుపటియట్ల జాగరూకతతో మెలంగుచున్నారు. ఐరోపీయనులలోనుండు నొకదివ్యగుణ మిందు సువ్యక్తం బయ్యె. ఎంతపోరినను పోరుచాలించినతోడనే కల్మషములేని హృదయముతో నొడంబడిక ప్రకారము త్రికరణశుద్ధిగ వర్తింతురు! "పని యీనాడు వదలుదుము" అని కొన్నిరోజులకుమున్నే యజమానులకు విన్నవించి యానాటివఱకును సేయసమ్మతమును లేనియట్లు మెలకువతోవర్తించి సమయమాగతమగుడు విసర్జించి వెడలుదురు. యజమానులును పనివా రిట్లనిరేయని నీచపుం బగదాల్పక వేతనములు, కాలము మొదలగునవి చల్లని మనసులతో నిర్భేదముగ విధింతురు. పెనకువలన్నియు దీఱిన పదంబడి ప్రణయ కలహానంతరం నాయికానాయకు లట్లు పరస్పరానురాగపూరితులై పొత్తుదాల్తురు. "నాలుకబెల్లము, ఎడదకత్తెర" యను కపటము, కుటిలస్వభావం, వీనిపొంతకు రాజసగుణులెన్నంటికింబోరు. నక్కవినయములుచూపుచు స్తోత్రములు పఠింపుచు సత్త్వగుణగరిష్ఠులమని చరింపుచున్నవారిలో నుండునంత గూఢభావము, కౌటిల్యము, మ్రుచ్చుందనము, నమ్మిక ద్రోహము, ఇత్యాది దుర్గుణములు క్షత్రియ తేజంబుండు వారియెడ ద్రవ్విచూచినను దొరకదు. మనదేశమున రజోగుణము ద్వితీయ మన్నందుననే మోసములు మెండయ్యె. అయ్యది యద్వితీయమును, అత్యంతసేవ్యమును, అనుట చరిత్రశోధనముం జేసిన వారికెల్లరకుం దెల్లంబ. అది యట్లుండె.

ఇంగ్లాడులో రైల్వేనౌకరులందఱు జీతములు జాస్తి చేయవలయునని ప్రార్థించి, తమప్రార్థనకు సరియైన యుత్తరముం బడయనివారై, కొన్నినెలలక్రిందట*[2] పనిచాలించిరి. ఇట్లు పనిచాలించుటకు, కర్మోపసంహారమనిపేరు. అపారమైన వాణిజ్యమె బ్రతుకుగాగల రాజ్యములలో రాకపోకలు నిలిచిన గతియెట్లు? కొన్నిపట్టణములలో నొకవారమునకన్న నెక్కువ భుక్తిపదార్థము లుండుట యసంభవము. సెలవగుకొలది వారు వస్తువుల రప్పించుకొనువారు. ఇట్టివారికి రైలుబండ్ల పోకలు నిలిచిన నాహారమెట్లు? పొగబండ్లు నిలుచుట, యవిరళములైన సేనావళులచే ముట్టడివేయబడుట, ఇవి రెండును సమానోత్పాతములు. ఏమిచెప్ప వచ్చును? దేశమంతయు ఱిచ్చవడి కంపిత హృదయమై దిక్కు దెలియనిదయ్యె! రైల్వేకంపెనీవారికి గంటగంటకు లక్షలకొలది నష్టము! పనివాండ్రకు గడుపాత్రము సాగకుండుట. ఇట్లు మహాక్షోభంబై యిరుదిక్కుల గ్రుక్కదిరుగనంత యిక్కట్టులైనను వెన్నిచ్చి పాఱుటకన్న చచ్చుటమేలని పట్టుగ నిలిచియుండిరి. అంత నితరులచే బండ్లదోలింప జూచిన వీరికిని పూర్వభృత్యులకును ఘోరమైన పోరుజరిగినందున రక్షకభటసైన్య మడ్డుపడవలసె. "పొట్టేళ్ళ యుద్ధములో నక్కతగులుకొని చచ్చినట్లు" ప్రజకు సరఫరాలు రానందున బహుప్రయాసయాయె. అట్టి యుపద్రవము మాన్పజూడక రాజ్యాంగమువా రూరకుండుట తగునా? గవర్నమెంటువారు ప్రజాసంరక్షణ పోషణమ్ము లనివార్యధర్మంబులని సైనికులంబంపి బండ్లసాగజేయగా పనివారు పూర్వమట్లు రవడించి దురమ్మునకు వచ్చినందున సైనికులు తుపాకులంగాల్చి యనేకులకు గాయములను మరణములను సమకూర్చిరి, మఱియు మడియు కర్మకరులును తమవారేగాన, గవర్నమెంటువారిట్టి ఘోరకార్యమ్ములు దేశమునకే విపత్తుదెచ్చునని దయార్ద్రహృదయులై యిరుకక్షులు నొప్పుకొనదగిన మధ్యస్థసంఘము నిర్మించి, యప్పటికి భండనము చాలించునట్లు చేసి బద్ధసఖ్యత యొడగూర్చు వెరపుల నరయుడని పంచాయతీ దార్ల నియోగించి యప్పటికి శాంతినుద్ధరించిరి. ఈ పంచాయతీలోని సభ్యులెవరనగా గవర్నమెంటు తరపువారు కొందఱు, రైల్వేకంపెనీపక్షము వాడొక్కడు, సేవకుల ప్రతినిధియొక్కడు. చూచితిరా సేవకులు యజమానులతో నుద్దియై చెలంగిరనుటకు నిదర్శనములు! పిమ్మట గతిపయవాసరమ్ములలోన రైల్వేకంపెనీ వారు తమ యావద్భృత్య మండలమునకు నూటికింతయని వేతనముల నధికముచేసి, వారి సమ్మతితో ప్రయాణశుల్కముల (అనగా టిక్కట్ల వెలలను) నెక్కువచేసి నష్టముం బూరించుకొనిరి. వారికేమో సంధియు సుఖము నబ్బెగాని యా సెలవంతయు బ్రయాణికుల తలమీదబడి జనసామాన్యముచే శ్రమ మూలధనముల పరిణయమున కియ్యబడు శుల్కమో యనునట్టిదాయె!

విభజనార్థమైన జగడములు, వానిని నివారించుటకై సృజింపబడిన మధ్యస్థసభలు, వీనింగూర్చి చర్చుంచుటకిది తావుగాదు. విభజన కాండమందునకుదగినది. ప్రకృతమున. కారయితృ, కర్తృ, భోక్తృ, సంఘమ్ములకు ఫలవిభాగంబున శత్రుత్వముండుట స్పష్టము. వీరికి శ్వాశ్వతసంశ్రయం బుత్పాదింప నెట్టినియమముల నెవ్వరాదేశింప వలయుననుట యీకాలమ్మున నుద్దండమైనప్రశ్న. ఇయ్యది యనుభవముచే గాలక్రమమ్మున గోచరించు నర్థమ్ముగాని యోగదృష్టి మొదలగు టక్కులకు గ్రాహ్యంబుగాదు.

ఇవన్నియుజూచి కొందఱు జనసామాన్యమునం దనుకంపా సహితులై మాత్సర్యపద్ధతి క్రూరంబని గర్హించెదరు. వీరిమాట నిజమని నమ్మితిమేని, స్పర్ధయన వేఱేమియుగాదు, ముక్కాలు మువ్వీసముమంది నోరుగొట్టి వీసముమందికివేయు నాచారమునకు మర్యాదకునై యీబడిన నామధేయము.

స్పర్ధ తగదనుటతో గొందఱు తృప్తింజెందుదురు. మఱికొందఱంతటబోక, స్పర్ధనురద్దుజేసి యనిరుద్ధరీతి వ్యవహారముల బాలించుట మేలనియు ముట్టనాడెదరు. వీరివాదముల మున్నే వెల్లడించియైనది. ఇందుల కుత్తరపక్షము లేకపోలేదు. అయ్యది విస్తార సముచ్చయ*[3] వ్యవహార ప్రకరణములకుం జేరినదిగాన నిట బొందింప నవకాశము లేకున్నను, ఒక్కమాటైన జెప్పక విడువరాదు.

ఏకతంత్ర్య వ్యవహార ప్రవర్తన ప్రయోజనములెవ్వి:- సమాత్సర్యంబునకన్న నయమైనట్టివియు స్థిరమై నట్టివియు నగు వెలల నిలుకడ జేయంగల సమర్థత మొదలగునవి. ఈ సమర్థత యున్నదనుట నిజమేగాని యధిపులైన వారాసమర్థత ప్రకారము వర్తింతురనుట యేమినిజము? పోటీలవలని భయములేదు గాన నిచ్చవచ్చిన వెలల నేల నిలువబెట్టి తీయగూడదు? ఉత్పత్తివ్యయము తఱుగుననిరి కదా! ఒప్పుకొంటిమి. వ్యయము తేలికయైన క్రయమును దేలిక కావచ్చును. అవునుగాని "కావచ్చును" అను సంభావనమునకు "అగును" అని స్థిరీకరణ మర్థమని యేమూఢుడు సేయగలడు? ఆవశ్యకవస్తువు లెంత వెలపొడుగైనను మానముపోయిన బోనిమ్మని జనులు బడయం జూచుట స్వాభావికము. ఇట్టివానికెల్ల నెవరికైన నొకరిని సర్వాధి కారింజేసితిమేని, ఉత్పత్తి యెంత విరివిగ సరసముగ జరిగెనేనియు ప్రజకు సుభిక్షము గలుగునని యభయ హస్తమియ్య నెట్లుసాధ్యము? ఒకవేళ 'రాకిపెల్లరు', 'కార్నెగీ', 'మార్గన్‌' మొదలగు వర్తమాన ధనేశులంబోలి యౌదార్యబుద్ధి గలవాడై యుండెబో, భోజనం మిగుల పసందుగా జరిగినను, అయ్యది భిక్షాన్నప్రాయమేగదా! మనకు సర్వవిధముల నతీతుడైనవాని నాశ్రయించి జీవించుటకన్న మరణము మేలు. ఇంచుమించు సరిసములై వారికి మనము, మనకు వారును నూతగానున్న నది జీవనముగాని తక్కినది దాసత్వము. మేతకై యెవడైన మేకవలె వెంబడించియుండుట కొడంబడునా? కావున రాజ్యాంగవిషయములందుంబలె వ్యాపారములందును అనర్గళ ప్రభుత్వం ప్రాణమానంబులకు భయావహము.

చూడుడు! దుష్పరిపాలనము ముత్తెఱంగు, బహు రాజకము, అరాజకము, ఏకరాజకము అని. అరాజకమనగా నేలిక యెవ్వడును లేకపోవుట. అయ్యది యెంతచెడ్డదని మనవారి కనుభవవేద్యము గాకున్నను, మనపూర్వులు గుడిచిన గోడుగాన నందఱుకును విశ్రుతముగానున్నది. నేటికిని బట్టణములకు గడు దవ్వులనుండు పల్లెలలో దుర్జనులు స్వేచ్ఛగా బీదవారల బీడించుచుంటంజూడ బ్రిటిష్‌వారికి బూర్వము వీరెంత కావరించియుందురో యని యూహింపకుండుటకు గాదు. అరాజకమును బహురాజకమును నన్నదమ్ములవంటివి. ప్రాయశ:తుల్యములే. ఎట్లన; ప్రభుత్వములేనిచో నెల్లరు ప్రభువులేగదా! బహురాజకమునకు దృష్టాంతము పురాణ హిందూదేశము. జమీన్‌దార్లు, పాళెగాండ్రు చాలరని పట్టభద్రులయిన మహారాజులు వందలకొలది బయలుదేఱి గోగ్రహణము, (పశువుల దొంగలించుట) ఇత్యాది దౌర్జన్యములు వీరకర్మములని యెంచునంతహీనులై ధర్మదేవతను దిక్కులుతెలియక సొమ్మసిల్లునట్లు తఱిమి దీనంగావించిరి. ఏకరాజక మనగా నడ్డములేని ప్రభుత్వము. ప్రజలచేతను నితరవిధంబులను మేర మితము, అనుమాటలులేక సర్వస్వతంత్రముగా బరిపాలించుట. ఇందునకు దృష్టాంతములు పూర్వమందేగాదు, ఇప్పుడును నీదేశమునేలు ఘనులు. హైదరాబాద్, మైసూరు, బరోడా, ఇత్యాది సంస్థానాధి పతులును బ్రతిష్ గవర్న్మెంటువారును. ఈ దేశములలోని ప్రజలకేమాత్రము నుత్తరవాదులు కారు. వారిదయచే మనకు గతిగాని మనశక్తి జమాఖర్చులేనియంకె. అనగా నిండుసున్నయనుట! ఈ పరిపాలనము సత్ఫలాతిశయ ప్రతిపాదకమే. శ్రేయోదాయకమే. అయినను, ఏకతంత్రతకన్న జనులకు స్వతంత్రతయుండి, ప్రభువులు ప్రజాప్రతినిధులును సమాధికార సంపన్నులై, పరస్పర సమ్మతిమై బరిపాలనకార్యము నిర్వర్తింతురయేని యంతకన్న మించిన భాగ్యము వేఱొండుగలదా! భూలోకమున మితములేనిది మంచియు జెడ్డ యగును. వానమంచిది. అతివృష్టి యీతిబాధ, నదీప్రవాహమున కొడ్డులులేకున్న వెల్లువలుపాఱి పంటలం బెంటల జేయును, సముద్రం నపారంబౌటగాదె మనము సజీవులమైయుండుట? కావున ననర్గళములన్నియు నవిశ్వసనీయములు. మేరలేని స్పర్ధ అడ్డులేని యాధిపత్యము, రెండును క్షయకారకములే. ఆరీతినే ఆధిపత్యమును, స్పర్ధయును, ఏమాత్రమును గురిగింజయంతయైనలేకున్న క్షేమంబనుటయు దెలివికి దక్కువయైన మాట. విందులో రసములట్లు క్రమమువిడువని మిశ్రత నీరెంటికిం గలుగ జేయజూచుట సర్వజనాధర ణీయము.

కొంద ఱేకచ్ఛత్రత యుత్పత్తికిని, వైరప్రభావంబు విభజనమునకు ననుకూలించు నవియని సెలవిచ్చిరి. ఇదియు దప్పే. స్పర్ధచిక్కి బిక్కరించెడు నీదేశమున దారిద్రవిభజనమున్న దేకాని యర్ధవిభజనము మఱుంగు జేరినది. స్పర్ధలేనిది, ఉత్పత్తియు క్షీణించు ననుటకు మనమే సనాతన నిదర్శనము. మనదేశములో నాచారములకు జెల్లినట్లు ఏప్రభుత్వమునకు నధికారము చెల్లబోదు. దానిచే మనము గట్టికొన్న మూటలెవ్వి, మూర్ఖతదప్ప? మఱియు నిర్మాత్సర్యమున నుత్పత్తి మేలుగా వచ్చుననుట తగునైనను మేలగుననుట యసంబద్ధ నిర్ధారణము. ఎట్లన; పోటీకివచ్చువారు లేరుగదాయని కొన్నాళ్ళకు వస్తువులగుణమును, రాశిని, పాడేలచేయగూడదు? నష్టము వచ్చునను భీతిలేనిచో గష్టమెవ్వడుపడును? మనదేశములో లాభమును నష్టమును తఱుచులేని పద్ధతియుండుటచేత నిద్రాదేవి యిది యనుకూల దేశమని యెన్నడో వచ్చిచేరినది. ఇక నష్టము లేమియుగాదు, ఖండితముగా లాభము వచ్చునను నిర్ధారణము కుదిరిన నశ్రద్ధకు నంతముండునా! నిర్వైరత నిర్వీర్యత. ఈ విషయములు ప్రకరణాంతరములకుం జెందినవయ్యు గ్రిందజూపబోవు సంగతులు చక్కగా స్ఫురించుటకై తెలుపవలసెను.

పై చర్చలవలన దేలినసంగతియేమి? స్పర్ధకు మితమేర్పఱచుట యత్యావశ్యకమనుట. ఆర్థికస్వతంత్రతకు - అనగా బ్రతివాడును దానుగోరిన ట్లుపార్జినాది కృత్యంబులకుం బరసహాయములేక తొడంగుట - నెల్ల లేర్పఱిచినంగాని దానిచే సమగ్ర సమర్థత సిద్ధింపదు. మనవారు కొందఱీమాట వినినదే నవ్వునాపలేక "అయ్యో! నవనాగరకుడా! మనదేశములో నార్థికస్వతంత్రత - ఇది యొక్కటేనా? ఏ స్వతంత్రతయు లేక క్రమము దప్పకున్నాము. మమ్ము జడులని దూషించితివి. పశ్చిమదేశమువారెంతో స్వేచ్ఛగా స్పర్ధింతురు. అదియు గూడదంటివి. ఒక్కకూడదను మాటయేనా! ఏదైన నొకరీతి బంధనము లేర్పఱచ వలెనంటివి! కాలక్రమేణ అనుభవ నిర్మితములైన బంధనములు ప్రచారమునకు దేబడుననియు జెప్పితివి! దీని కేమియర్థము? ఐరోపావారును మనవలె నస్వాతంత్ర్యము నారాధింప బ్రారంభించిరనుటగాదా? కావుననే హిందూపద్ధతు లెంత ముదుసలితనము వహించినవో యంతసుందరములని నీనోటనుండియే వచ్చెగదా! మనవి యపౌరుషేయ శాస్త్రములనుటకు వేఱుప్రమాణములేల? నీపౌరుషము తెల్లవాఱినది, తెలిసినా!" అని మందలింపవచ్చునుగాన వారికి వినయముతో సమాధానము నివేదించెదము.

చెట్టు పోతరించి పెఱిగి యాకులు పూవులుమాత్రము బయట బెట్టుచు గాపునియ్యదేని దానిక్రొవ్వు నడంచుటకు వేరులు కత్తిరించుటయను దోహదముం జేతురనుట ప్రసిద్ధమేగదా! అదిగాంచి "యెంతమంచి రెడ్డియైనను ఉస్తికాయంత వెఱ్ఱి లేకపోదు" అను సామెతను నిలుపబుట్టిన వాడొకడు తనతోటలో జిగిరించుటకుం జాలక కృశీభూతమైన చెట్టునుజూచి ఆదోహదమిందునుం బ్రవర్తించునని వేరులు గోసివేసిన నాచెట్టు మఱునాడేయెండి వంటకట్టెలకుం బనికివచ్చును. అట్లే, అమితస్పర్ధచే నాక్రోశించువారు మాకు క్రమములు వలయునన్న, అమితక్రమములచే నాక్రోశించువారు - ఆక్రోశించువారా! ఆక్రోశించుటకుం దెలియనిమూఢులు - మాకు స్వతంత్రతాస్పర్ధలు వలదనుట జ్ఞానబాహిరము.

మఱియు గ్రమము లనుటచేతనే అన్నిక్రమములును నేక మగునా? ఐరోపావా రాచారబద్ధులుగానుండుట మేలనియెదరని వినం బడినతోడనే మనుస్మృతి నెగుమతిజేయుటయేల? వారాసించు నిబంధనలకు మన పురాకృత సమయాచారములకును 'అమృతము', 'విషము' అను పదంబులు రెండును నీటిని బోధించినను నయ్యవి యెట్లు సమములుగావో, అట్లే వాసి యిసుమంతయులేదు. ఎట్లన:-

పాశ్చాత్యుల ప్రయత్నము హిందువుల దుస్థ్సితి
1. ఉద్దేశము. సంఘముయొక్క ప్రతియంగం యొక్కయు సుఖమును దేజంబును. అనగా జనసామాన్యముయొక్క యభ్యుదయము. 1. హిందువుల యపౌరుషేయాచారములు "కాకులనుగొట్టి గ్రద్దలకువేసె" నన్నట్లు ప్రజలందఱం బీడించి యల్పసంఖ్యులైన శ్రేష్ఠకులులకు ననువుగా సర్వంసేకూర్చుట. కొన్ని యంగములకై శరీరమును బాడుజేసినట్లు.
2. ఉద్దేశము నెఱవేర్చు మార్గము. కర్తృకరణ సంఘంబులు ప్రజాప్రతినిధులు గలిసి యోచించి వ్యవస్థల విధించుట. అనగా సమష్టి రాజకముద్వారా యనిభావము. సమష్టి రాజకమన సర్వజనులు గలిసి ప్రతినిధులచే నడుపు పాలనము. కాలానుగుణముగ మార్పులం జెంద జేయుట. 2. చెదలుతిని మిగిలిన తాటాకులకట్టలతో నెత్తిమీద మోదుట. అనగా ప్రాచీనుల వాక్యములని యెన్నబడువానిలో నాచారములకు నాభారముగా వ్యాఖ్యానముచేయ శక్యమైనవానిని మాత్రము ప్రమాణములని యాదరించుట. ఈ రాజకమున కేమి పేరు పెట్టుదుము: పితృరాజక మనియా? తాటాకుల రాజకమనియా? భూతరాజకమనియా? సనాతనములని శాశ్వత ధర్మంబులని మార్పులేలేక నిలుపజూచుట.
3. స్వతంత్రత. స్వతంత్రతలోని యమితమునుమాత్ర మాపజూతురుగాని బొత్తిగా దీసివేయ గంకణము గట్టుకొన్నవా రెవరునులేరు. 3. స్వతంత్రత.ఏకతంత్రత ఇత్యాదులగు నేవర్తమాన తంత్రంబులును వీరికి సరిపడవు. వీరిమతము భూత తంత్రము. అనగా గతకాలముచే బొమ్మలవలె నాడింపబడుట.

జాగ్రత్త:- యూరోపియను లీక్రమము స్థాపించుమార్గము నింకను నన్వేషించుచున్నారు. మన నియమములట్లు వారిలో నది యాగతమైన విశేషంబు గాదు ఉద్దేశమున్నది గాని విధానములు పరిశోధన పాత్రములు. స్థిరీకృతములుగావు.

కావున మనుస్మృతికై యూరోపియనులు వాసిపోవుచున్నారనుట మూఢభావమే గాని ప్రౌఢభావముగాదు. నామసాదృశ్యముచే వస్తుసాదృశ్యము ననుమానించుట వివేకదూరము. సబాధ నిర్బాధ స్పర్ధలు మిళితములై యుండుట యసాధ్యము గాదనుట కొకనిదర్శనము. వైరముండుటచే నొకరిని మీఱవలయునని యొకరు నూతన పరిశోధనలంజేసి నవీన యంత్రసృష్టిజేయ నుద్యమింతురు. యంత్రసృష్టికిని గాలముగావలయు. సెలవు జేయవలయు. ఎన్నియో పరీక్షలం జేయవలయు. వీనిలో ననేకములు కాయలుగా వచ్చును. పండౌనది యొక్కటి మాత్రము. ఇట్లు బహుశ్రమవ్యయములతో గనిపెట్టబడిన యంత్రమును, ఇతరులును స్థాపించు హక్కుగలవారై యున్నయెడల నిర్మాణకారునకు లాభము లేకపోవును. వైరులును తుల్యసామర్థ్యులై పోటీచేతురు. కావున గవర్నమెంటు వారొక శాసనము జేసియున్నారు. ఏదన, ముందెవ్వరు నెఱుంగని యంత్రముల నెవడైన గ్రొత్తగగల్పించిన, ఇరువదియో ముప్పదియో నియమిత సంవత్సరములు వాడుదక్క నితరులు దానిని పరిగ్రహించి యుపయోగింపగూడదని. అట్లుపయోగింపగోరిన, వానికి బాడుగనిచ్చి యజమానత బడయవచ్చును. కొన్నివత్సరములకేయని పరిమితి బెట్టినందులకు గారణమేమన; ఒకటి, తనవెనుక వచ్చువారికి దాని సొంతము నేల యియ్యవలయును? తండ్రి దక్షతజూపిన బుత్రుల కది సమర్పింప నేల? కావున నొక జీవితకాల మంతయు సర్వాధికార వర మొసంగినంజాలు. రెండవది. సమాయా నంతరమున హక్కులు వికలము లౌననిన నంతలోన నింకను విశేషించిన గురునిర్మాణములం బొందింప జూతురు. అందుచే దేశమునకు వృద్ధి యతిశయిల్లును. మూడవది. ప్రజల శక్తియుక్తులపై సంఘమునకు బాధ్యతలేదా? మన ఉద్యోగములన్నియు తుదకు దేశసంఘముంజేరిన నెల్లరకు శుభమె. చూడుడు! మాత్సర్యము, నిర్మాత్సర్యముగ ఫలము ననుభవించుట, ఈరెంటిని బదిలపఱిచినం గాని నూతనసృష్టులకుం బ్రోత్సాహముండదు. సాహసం, రక్షణము, ఇవిరెండును ఉత్పత్తికి మూలములు. గడించినవి తన్నే చెందునని నిశ్చయము లేకున్న వస్తుసంపాదనముతో బనియేమి? ఇక సాహసము సున్నయైన సంపాదన ముండదుగాన రక్షణమెందుకొఱకు? ఈ గుణములకుండు పోలిక కంటికి దీపమునకు నుండునట్టిది. గ్రుడ్డివానికి దీపమనావశ్యకము. దీపములేకున్న కండ్లుండియు జూపువుండదు.

నూతన కల్పనలయందలి బాధ్యతకు 'పేటెంటు' హక్కులని పేరు. పేటెంటులంగూర్చిన చట్టదిట్టములు మనదేశములో దగినవిగా నుండనందున నవ్యపరిశోధనలకుం బరీక్షలకుం బాధకములు. సాహసం, ఉత్పత్తియు బేదవడియుండుట కిదియు నొక కారణము. త్వరలోనే సర్కారువారు వీనిని సంస్కరించి సర్వసమ్మతముం జేయజూతురనుటకు సూచనలు లేకపోలేదు.

పూర్వము చెప్పినమాట మీకు జ్ఞప్తికివచ్చినదో లేదోకాని యెత్తిచెప్పెద గమనింపుడు! ఆధునికమున నైరోపాది నాగరిక ఖండములలోనుండు నార్థికయుగంబు నిరామయంబుగాదనియు పరిశీర్ణక హేతు గర్భితమనియు వక్కాణించియుంటిమిగదా! ఆవిషయ మిపుడు విశదంబాయెగాబోలు! అనిరుద్ధ స్పర్ధ నవరుద్ధగజేయు కార్యము మనకన్నులయెదురనే కొనసాగింపబడుచున్నది. స్పర్ధ యమితమౌటచే పరిమితంబగుటకు దానే సాధనంబగుటయు, శిల్పశ్రేణులు, యజమానసమాజంబులు, సర్కారువారి యాజ్ఞ, ఇత్యాదులచే గ్రమక్రమంబుగ బద్ధంబగుటయు జూచుచున్నాము. ఆర్థిక వారిధి, స్థిరసౌఖ్య సమృద్ధులను అభిలాషలు తృప్తములౌటకై, కర్తృ కరణ సంఘంబులచే మధింపబడుచున్నది. ఇందు వేతనస్థితి వాసుకి, కూర్మము రాజ్యాంగము. మందరము కొండంతకోరిక. ఎయ్యైవిధానములు పుట్టనున్నవో తెలియ నెవరితరము? అమృతముమాత్రము పుట్టునో! ఒకవేళ విషముదప్ప నింకెవ్వియు వెలువడవో? సవిస్తరముగ విశదీకరింప నసాధ్యమైనను మొత్తంపుటర్థముగ గొన్నింటి నుడువనౌను. అవేవన, వర్తమానస్థితికి నిలుకడలేదు. అదిమాఱును. ఈ మార్పు మిక్కిలి మెల్లగా దిన్నగా వచ్చునుగాన చుఱుకు చూపులుగల శాస్త్రవేత్తలకుగాని యితరులకు గోచరంబగుట యపూర్వమ, చివరకు శుద్ధామృత విషంబులు రెండునురావు. మఱి సుఖదు:ఖములట్లు సమ్మిళితములై సంభవిల్లును. వీనిలో సుఖము ఘనతరముగ నుండుననుట సంభావ్యము. ఎంత సుఖసమృద్ధులున్నను మలినము పూర్ణముగ బరిహారంబుగాదు. కాకుండుటయు మంచిదే? ఏలన, ఈ మలినమును సదమలము జేయజూచుటయే వృద్ధికి నుద్దీపకము. పరిశుద్ధము, అనశ్వరము, అఖండమునగు సౌఖ్యము అవతరించెనేని పౌరుష మస్తమించి యంతమొందును. అట్టిస్థితి సోమరిపోతులకుం గాని యితరులకు నింపుకాదు.

పశ్చిమ ఖండములలో స్పర్ధ పరిణమించిన క్రమము

1. తొలుత సామాన్యబలులైవా రొండొరులతో వైరమెత్తుట.

2. తరువాత, నావైరంబుచే హీనబలులు స్వతంత్రతం గోలుపోగా మహాబలులైనవారు కొందఱు దినదిన ప్రవర్థమానతేజస్కులై నిర్వైరంబుగ వ్యవహారంబుల జరుపుట.

3. తదనంతరము, మహాబలులు సయితము సంఘీభవన మనర్గళ బలప్రదాయకంబని యొండొరులతో గలిసి, వ్యవస్థలేర్పఱచి యేకచ్ఛత్రంబుగ బరిపాలింపజూచుట. ఈ సంఘములకు 'ట్రస్టులు' అని హూణభాషలోబేరు.

4. యజమానులతోను, యజమాన సంఘములతోను బ్రతిఘటించుకొఱకు శిల్పులు శ్రేణులు వన్నుట.

5. ఈ యార్థికవైరములలో జనులకు ననర్థములగునని సర్కారు వారు, ఇరుపరమ్ముల వారిని తమపై విచారణ నిబంధనములకుం బాత్రులంజేయ శాసించుట.

6. "సర్కారువారేల? మనమె మైత్రినెఱపి క్రమముల దీర్చికొన్న నింకను గౌరవముగదా" యని వియోగమువీడి,

  • [4] సంయుక్తోత్పత్తి పరివర్తనాది క్రియాసమాజంబుల స్థాపించుట. దీనికి యన్యోన్యతాపద్ధతి యనిపేరు. అన్యోన్యసంఘంబు లనేక విధంబులు. కర్తృకారయితృ సంయోగ సమాజములు, భోక్తౄత్పాదక సంయోగ సమాజములు, ఇత్యాదులు. వీనియుద్దేశమేమన, సర్కారువారి యధీనముగానుండక స్వేచ్ఛమై, నమితస్పర్ధవలని నష్టముల బాఱదోలుట. పైవిమర్శలోని 3, 4, 5, 6 అంకెలుగల విషయములు సమకాలికములును పరస్పర కార్యకారణ భూతములునై యున్నవి. మున్ముందు వీనింగూర్చిన వివరములు ప్రకటింపబడును.

స్పర్ధను సంక్షేపించవలసిన భారము పాశ్చాత్యులది. విక్షేపించవలసిన భారము మనది. మితమును మించిపోవుటచే వారును, మితము భావగోచరముగానియంత వెనుకబడుటచే మనమును కష్టములం జిక్కితిమి. అత్యధికముచే గలుగుబాధల నివారించుట సులభమైన కార్యముగాన పాశ్చాత్యుల కేమికొదువ? లేమిడిని పోగొట్టి పూర్ణులమౌట దుర్ఘటముగావున సాహసమే మనకు ననుష్ఠింపవలయు ధర్మము. సాహసములోను కీడులున్నవిగదాయని యత్నము లేక యుండుట రోజాపువ్వునుజూచి ముండ్లున్నవిగాయని మొగము ద్రిప్పుకొన్నట్లు. మఱియు దాటాకులదెబ్బచే మోకాలువిఱిగి కూలబడిన వారు వాయువేగంబునంబోయిన గన్నులు దిరుగునను సాకుచే కాలునకు బలములేకుంటయేమేలని సిద్ధాంతముం జేయుదురయేని, అంతకు మించిన విదూషకత్వము సృజింప గాళిదాసునకైనగాదు! స్పర్ధను సంగ్రహించు కార్యముల చింతమనకేల? అనుగ్రహించుటకుం దొడంగుదముగాక!

  1. * అనగా 1911 వ సంవత్సరమున ననుట:
  2. * 1912 వ సంవత్సర ప్రారంభమున.
  3. * సముచ్చయ = పరస్పరపద్ధతి నవలంబించిన.
  4. * సంయుక్త = అన్యోన్యపద్ధతులరీతిని పొత్తికగల.