భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - నాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాల్గవ ప్రకరణము

ఆధునిక వృత్తినిర్మాణములందలి సామాన్య లక్షణములు

శ్రమ విశ్లేషము - విశ్లేషము సామర్థ్యాతిశయకరము

సంఘము శరీరముం బోలినది. అంగములు ప్రత్యేకకార్యములంజేయు నవియైనను, ఆ సర్వకార్యములును సంశ్లేషింపనిది ప్రాణములకు భద్రముండదు. కార్యములు భేదించినను, ఉద్దేశ్యమొక్కటౌటంబట్టి శరీరమును ప్రధానమనియు నంగము లుపకరణ ప్రాయములైన భాగములనియు వాడుచున్నాము. ఉద్దేశ్యమున యోగమును, తత్సాధన క్రియల వియోగమును, 'ఏల ప్రవర్తిల్లెడును' అని ప్రశ్నింతు రేని, దానికి సమాధానము పూర్వనివేదితంబైన సమర్థతయే. విశ్లేషముచే సామర్థ్యమతిశయించి యుద్దేశ్యము సాధ్యమైనంత సమగ్రముగ సిద్ధికి వచ్చును.

జీవకోటులలోను నీన్యాయ మద్భుతంబుగ నిదర్శింపబడి యున్నది. ఆదిమములు నతితుచ్ఛములునైన జంతువుల నంగవిభేదము లేదు. వానికి దేహమంతయు నోరే, కన్నే, పాదమే! అనగా నన్నిక్రియలను దేహమంతయు జేయును. ఈభూతము లతిసూక్ష్మములును నత్యల్పములునై యున్నవి.

జీవములు వృద్ధినొంది పరిణమింప బరిణమింప నాయాతరగతికి జేరిన పనులకు వేఱువేఱంగము లేర్పడును. అంగములు వేఱుపడినను, ఒండొంటికి ననువుగ వర్తించుటకై మెదడావిర్భవించును. మెదడునుండి బయలుదేఱి కాయమంతయుం బ్రసరించు నరములు పగ్గముల వంటివి. ఒక కాలొకదిక్కునకును, ఇంకొకకాలు వేఱొకదిక్కునకును, ఒకకన్ను తూర్పునకు, నొంకొకకన్ను దక్షిణమునకుం బాఱకుండునట్లు, అంగములన్నియుం బరస్పరానుకూలగతిం జరియించుచు జీవసంరక్షక పరిపాటి ననుకరించి మెలగునట్లుచేయు నాధిపత్యము మెదడునకుం జేరినది. ఏకావయవమే బహుకృత్యభారము వహించినచో, మనవారు పాములంగూర్చి చెప్పునట్లు శ్రవణమున్న దృష్టి, దృష్టియున్న శ్రవణము, లేకుండుట తటస్థించి ప్రాణకంటకం బగును. ఉన్నట్టుండి భయంకరమైన యాకారమెదురదోచిన మనప్రయత్నములేకయ కాళ్ళు వెన్కకుం బోవును. సుందరాకారము దర్శన పధముంజేరిన కనులతో గాళ్ళును, ఎంతబుద్ధి చెప్పిననువినక యావంక గొంతయైన జరుగకపోదు. తటాలున నగ్గిపుల్లగీచి చేతికంటించిన నవధాన మింకొక యెడనున్నను చేయి సరుక్కున వెనుకకు లాగబడును. బాటలో బోవునప్పుడు మనసెక్కడనో చింతగొని యుండినను మనకుం దెలియకయ ముండ్లను నేత్రములు గనుగొనును. పాదములు తప్పించుకొని నడుచును. మస్తిష్కము యొక్క సంశ్లేషణశక్తికీ నిదర్శనములు చాలును.

ఏయర్థనిమిత్తమైన సంఘమైనను సరే, అభిమతమున నేకీభవించి తదనుగుణములైన పనులంబంచి కొనిచేయుట యుక్తము. ఈన్యాయ మార్థికప్రపంచమం దుపగతింజెంది యున్నదనుట గ్రామ్యాది పద్ధతులు దెలిసినవారికెల్ల సులభగ్రాహ్యంబు.

కొన్నియెడల విశ్లేషణయేలేని సంశ్లేషణ ప్రధితంబు. దృష్టాంతము. పెద్దబండ నెత్తవలయునన్న నందఱుం గలిసియే యుద్ధరింప వలయు. ఇట్టిచోటను నొకవిధమైన విశ్లేషము సిద్ధము. ఆ బండను మూల కొక్కరుగాబట్టి యెత్తుదురుగాని యందఱు నేకస్థానమున తలలం జొనుపబోరుగదా!

సృష్ట్యాదినుండి స్త్రీ పురుషుల జాడలు (అనగా నార్థిక తంత్రములు) వేఱు. గృహకృత్యములు స్త్రీలపాలిటివి. బయటిపనులో స్త్రీల నవసరపెట్టుటో పురుషులవిధి. పురాతనములైన యనాగరక జాతులలో భారములైన పనులన్నియు నారీమణుల నెత్తినగట్టి మగవారు వేటాడుట, తలలజెండాడుట, మొదలగు నుద్ధత వ్యవహారముల విహరించెడివారు. ప్రప్రధమంబున దాసత్వసిద్ధినందినవారు కోమలాంగులే. ఆనాటి ప్రచారము లనేకములు పతివ్రతాచారములనుపేర నేటికిని బరుగుచున్నవి. కూలిలేని చాకిరియని యథేష్టముగ దాసీజనమ్ముల బొట్టుగట్టి కట్టకయే మందకు జేర్చుటయు బురాణప్రసిద్ధము. మంగళసూత్రంబు నాబడునది తొలుత వీరింగట్టి గుదించి యుంచుటకై వేయబడిన మంచిమెడత్రాడుగాబోలు! ఒకముడివేసిన విప్పుకొందురోయని మూటికిదక్కువ గాక వేయవలసినదని నియమ ముంటబట్టిచూడ పూర్వికుల పాశుపాల్యాది వ్యవహారనైపుణి మబ్బునుండి వెలువడిన మెఱుంగుదీగవలె సిగ్గువిడిచి యెదుర నిలిచినట్లు కనబడకపోదు.

పశుపాలన మహాయుగంబునుండి యర్థముతో గోరికలు, కోరికలతో వృత్తులు, వృత్తులతో నర్థములును విలసిల్లగా వ్యవహారచక్రము విన్యస్తమై వెంటనంటి వచ్చుచున్నది. వృత్తులును వేఱువడియె. వృత్తి భేదముతో నైరోపాలో శిల్పశ్రేణులును హిందువులలో వ్యవహారజాతులును వికాసముంజెందె. ఈ విషయము లిప్పటికి మీకు ప్రాత కధలు. కావున గ్రొత్తకట్టల విప్పుదము.

క్రియావిభజనమిపు డత్యద్భుతముగ వ్యాపించియున్నది. మన గ్రామముల వడ్రంగి కొయ్యపనుల నన్నియుంజేయును. వ్యాపార పారీణరాజ్యముల నాయొక్క వృత్తి యెట్లుపరిణమించినదో చూడుడు! బండి చక్రములజేయుట, బల్లలు, కుర్చీలు, సోఫాలు వీనిపని. ఇల్లుకట్టు సామానుల దయారు చేయుట, ఇత్యాది వృత్తులు వెవ్వేఱు.

క్రియా పరిచ్ఛేద మింతటితో సమాప్తమా? కాదుకాదు! ఇయ్యది యుదయకాలము. మధ్యాహ్న మింకను ముందున్నది. ఏకవస్తు నిర్మాణమునం గూడ ప్రత్యేకపఱుపదగిన ప్రతియంశమునకును ప్రత్యేక కర్మాంగము లేర్పఱుపబడియె. ఇది సాధ్యమౌటకు నీప్సితసంఖ్య శిల్పులొక్కయెడంజేరుట ఆవశ్యకముగా న నీపరిణతి యావేశన వృత్తులుద్భవిల్లిన కాలములో మూర్తీభవించెను. దీనింగూర్చి ఆర్థికశాస్త్ర పితామహుండని ప్రఖ్యాతిగన్న 'ఆదాముస్మిత్‌' అను నాంగ్లేయుడు వ్రాసిన ప్రకారము:-

అన్నిపనులను దానేచేసి కార్యంబు పరిసమాప్తి నొందించునేని ఎట్టి కుశలుడైనను దినమునకొక గుండుసూదిని తయారు చేయుట యబ్బురము. ఇప్పటి కాలములో నీరీతిజేయ బిచ్చివాడైన దలంపు గొనడు వర్తమాన వ్యవహారములలో గుండుసూదుల నిర్మాణము, అనేకాంగములుగా విభజింపబడి, ఒక్కొక యంగము నాక్రియయందు మాత్ర మారితేఱినవారగు శిల్పులచే బోషింప బడుచున్నది ఈ విభాగము లెట్లన; ఒకవంక గడ్డీల సాగదీయువారు, ఒకదిక్కు వానిని వంకర లెవ్వియులేక సరళముగా నుండు నట్లీడ్చువారు, ఒకయెడ వానిని సమభాగములుగ గత్తిరించువారు, ఒకవైపున దలల గుదుర్చుటకై కొనలనూరువారు, ఒకదెస దలల దీర్చువారు, ఒకచోట దలల నతికించువారు, ఒకతావున సూదులకు మెఱుగుపెట్టువారు, ఒకస్థలమున వానిని గాగితములలోదూర్చి కట్టువారు, ఇత్యాదులు. మొత్తమునకు పదునెనిమిది యుపకర్మలుగలసిన గుండుసూదులు ప్రవాహముగ బాఱును. శ్రమ విశ్లిష్టమగుకొలది క్రియలును భేధింపబడి, మిశ్రములుగ నుండుటమాని యేదైన నొకతీరగు గమనముచేతనే సాధింప బడునవియగునుగాన, నట్టిచలనముగల యంత్రముల సహాయమును క్రియ లతిసరళములగుడు పడయవచ్చును. మిశ్రగతులు యంత్రములకు నసాధ్యములనియు నొక్కతెఱంగున దిరుగుటయో, మీదికి లేచి వ్రాలుటయో, ముందు వెన్కలకు బోవుటయో, ఇట్టిపనులను పున:పున: చేయుటలో మనుజులకన్న యంత్రము లధిక చతురములనియు జెప్పుట చర్వితచర్వణంబు. యంత్రములును, శ్రమవిశ్లేషమునుజేరిన, పుట్టలోని చెదలకన్న దట్టముగ సూదుల నుత్పత్తిజేయుట యల్పకార్యంబు. పదిమంది పనివారు మాత్రమున్న యొకానొక కర్మ శాలలో, కొంతమంది రెండు మూఁడు క్రియలఁ జేయవలసిన వారయ్యు నొక్కొక్కదినమునకు నాశాలవారు 48,000 సూదులను విరచింపఁ గలిగిరి! అనఁగాఁ జేతులతోనే యన్ని పనులం జేయుఁజూచిన నొక్క సూదియైన ముగింపలేనివాఁడు, ఇతరులతోఁగలసి పనుల భాగించుకొని, ఏకక్రియాశక్తిమై యంత్రశక్తి యలవరింఛి యత్నించిన దినమునకు 4800 సూదులంజేయఁ ప్రవీణుఁడౌననుట! శ్రమ సంశ్లేషణ ప్రభావము నకు నత్యాశ్చర్యకరంబైవ యీ యుపమాన మొక్కటిచాలదా? ఇది నూఱేండ్లక్రింద ఆదాముస్మిత్తుగారు, అనుభవపూర్వకమ్ముగ శోధించి స్థాపించిన న్యాయము. ఇప్పుడు మనకాలములో యంత్రశక్తి యమేయమై వినువారికిం గనువారికిని వెఱగుఁబుట్టించునదియై యున్నది. అప్పుడు 10 మందిచేఁ బరిష్కృతములైన సూదుల సరాసరి పరిమాణము దినమునకు 12 పౌనులు. నేఁడు యంత్రప్రభావముచే దినమునకు 1000 మంది పరిష్కారముచేయు సూదులతూనిక టన్నులు. టన్నులనఁగా 7840 పౌనులు, నూఱేండ్లక్రిందట నప్పుడు హరువుపరువుగలవని పేరువొందిన పద్ధతుల ప్రకారము, ఒకనిచేనైనది పౌను మాత్రమే. ఇప్పుడో సర్వసాధారణముగఁ బ్రతిశిల్పియుఁ జేయఁగలిగిన సూదులకొలఁతయే ఇంచుమించు 8 పౌనులు! సమర్థత యొక్క శతాబ్దములో నేఁడు రెట్టు లధికమయ్యె. ఏమిచెప్పవచ్చు!

రాకపోకలు లేనికాలములోఁ బ్రతిగ్రామమును సకల సామగ్రీ సంభూతికి నాస్పదమై యుండవలసివచ్చెఁగదా! ప్రయాణసౌకర్యముగల యీ దినంబులలో వాణిజ్యవ్యాప్తిచేఁ గోరినవస్తురాసులఁ దెప్పించు కొనుట యనువుగాన సంపూర్ణ సామగ్రిలేకున్నను వెఱపులేదు. ఇంతే కాదు, మనుష్యులలోఁ బలె నూరులయందును వృత్తిభేదములున్న శ్రమ విశ్లేషణముచేఁ గలుము లఖండములై యలరారును. చెన్నపురి లోని జనులు తాముపెట్టిన పంటతోనే జీవించవలయునన్న అరదినపు భుక్తికైనలేక తపింతురు. పంటలలో తమకు న్యూనతయున్నను వాణి జ్యముచే బయటిజిల్లాలనుండి, వడ్లురాగులు మొదలగునవి తెప్పించుకొని సుఖముగనున్నారు. జిల్లాలవారును మిగిలినవానిని వారికమ్మి కొఱతవడిన వానింగొని పూర్ణ మనోరథులయ్యెదరు. కావున మునుపటియట్లు ప్రతిసీమయు సమగ్రగతిం జెందజూచుట యీ కాలమునకు వ్యతిరేకమైన మతము. దేశమునందు విశ్లేషణయున్న వృద్ధియేగాని క్షయములేదు. గొప్పపణ్యస్థానములైన బొంబాయి, కలకత్తా, మదరాసు, ప్రభృతి పురంబులు, ఆహారపదార్థములకై గ్రామజనపదంబులను నమ్మియున్నవి.

రాకపోకలు, వృత్తివిభేదము, శ్రమవిశ్లేషణము. ఇవన్నియు దేశముననుండు సీమలను, సీమవారిని అన్యోన్యాశ్రయులుగాజేసి జిగిబిగియల్లికగానల్లి ఐకమత్యము వృద్ధిజేయునవి. అనగా వెఱ్ఱిముదిఱి జాతిభేదములను నిరోధకనియమములకు జనులు పాల్పడకుండిన యెడల నను వ్యవస్థగుప్తము. చెన్నపురిలేకున్న తళుకులు, బెళుకులు, విద్దెలు, వితరణలు నశించి నాగరకత చెడినవార మగుదుము. కృషికళాశోభితములగు గ్రామాదులు మాయ మైనచో చెన్నపురి వారికి లంబోదరములు తడవిచూచినను చేజిక్కనంత కృశములౌను.

దేశములోని సీమలయందెట్లో, ప్రపంచములోని దేశదేశములును అట్లే. ఏవైన కొన్ని కెలసములకు మాత్రము పూనుకొని విదేశ వాణిజ్యమే శరణమనియున్న మేలని కొందఱనెదురుగాని యది సర్వ సమ్మతమైన యభిప్రాయంబుగాదు. ఎట్లన చెన్నపురియు రాజధానియు విశ్లేషించినవయ్యును, ఏకదేశభాగంబులగుట నవి యొండొంటిపై సమర సంరంభమునకుం దొడంగుననుట యవివేకపు దలంపు. ఇట్లే బంగాళా, పంజాబు మొదలైన స్థలములవారును మనమును నేకమాత్రు సంతానమట్లు సౌహార్దముతో యావత్కాలమును మెలంగు వారమనుట సత్యవ్యత్యస్తము గాదుకాబోలు. ఇట్లు సహజసంయోగం లేనిచో నార్థిక విశ్లేష మపాయకరంబు. ఎట్లన లోకమున రంగని రాజ్యము చెంగని రాజ్యము రెండుమాత్రమే యున్నవనియు, అందొక్కటి కచ్చావస్తువులను ఇంకొక్కటి పక్కా వస్తువుల సుద్ధపఱచి వ్యాపారముచే గోరికల బూరించుకొనుననియు ననుకొందము. గ్రహములు దారిదప్పి వక్రించినందున వారికేదో కారణముండియో లేకయో యుద్ధము నడిచిన విరచితములు (అనగా వస్త్రాదులు) చాలక అరచితములు (అనగా ధాన్యాదులు) గలరాజ్యమును, అరచితములు చాలక విరచితములుగల రాజ్యమును కత్తులు కటారుల కాంతులు ప్రాకక మున్న దీనతగనును.

దీనికి బదులు గొందఱనున దేమనగా, అట్టిస్థితిలో రంగడు చెంగడును యుద్ధోన్ముఖు లెన్నటికిని గారుకావున భూలోకము రణ తీవ్రతలేక చల్లపడి యెల్లప్పుడును మలయ మారుతములు వీచుచుండు నట్లుండును; కావున దేశములు, ఉత్పత్తివిశ్లేషించి వాణిజ్యముచే సంశ్లేషించెనేని, శాంతి శివలింగమువలె స్థిరముగ నిలుచునుగాన లోకము సర్వ మంగళాకరమై యుండుననుట యంధునకైన విశదంగదా!

దీనికి ప్రత్యాఖ్యానము. ఏకరాజ్యములోని పట్టణ జనమ్ములలొ బలె సంపూర్ణ విశ్లేషము మీయుత్ప్రేక్షలోని రంగచెంగ రాజ్యములలో నున్నదనుకొనినట్లు ఎక్కడను గానిపింపదు. కానిపింపనుబోదు. ఉత్ప్రేక్షలు గట్టివనినమ్మి వాదములకుం జొచ్చుట బుడ్డనునమ్మి ఏటిలో దుమికినట్లు. సంపూర్ణ విశ్లేష యుండుటయేగాదు, వారు మార్చుకొను వస్తువులును, సమానావశ్యకత గలిగినవిగా నుండినం గాని యేల యుద్ధమునకు బోగూడదు? మీయుపమానము సైతము లోపములేనిదిగాదు అరచితములు గలిగినవారు కొన్నినాళ్ళు విరచితములగు వస్త్రభూషణాదులులేకున్న నోర్తునుగాని, విరచిత కళా వ్యాపారులు ధాన్యములులేకున్న నోర్చుటెట్లు? వస్త్రాదులతో గడువును గప్పవచ్చుగాని నించవచ్చునా? కావున వారు నమ్రతతో చేతులు జోడించి రావలసినదేగదా! లోకములో రాజ్యము లుత్పాద నాది క్రియలలో తారతమ్యములు గలవియైనను, ఆవశ్యక వస్తుసంతాన విషయమై. ఇతరులతోడి వాణిజ్యమే తావలముగ నుండునవి లేవు. ఒకవేళనుండెబో! వానికి గాచికోలు కష్టము. ఈవిషయము వినిమయకాండమునకుం జేరినదౌట నిక్కడ నింతచాలు.

దేశములు సమగ్రములుగానుండుట యావశ్యకమా కాదా యను విచార మటుండనిండు. వాణిజ్యవ్యాప్తిచే దేశములు సమగ్రములు గాకపోవు జాడగలవిగా నున్నవి. "ఐరోపావారు పరివర్తన కళాపారీణులుగదా. మనము పంటకాపులము. వారికి పంటలు ప్రియములుగాన నధికముగ వెలనిత్తురు. ఇక పరివర్తన కళలు మనకేల? ధాన్యముల ధరలు నానాటికి మించుచున్నవికదా? ఇందుచే వచ్చిన లాభముచే విరచిత వస్తువులన్నియు గొనవచ్చును. మనమే విరచించుటయేల?" అనియున్న మనకు కృషి వృత్తియే ప్రధానమగును. ఏకవృత్తినుండు రాజ్యమును ఏకపుత్రుడు గలిగిన కుటుంబమును సమానములు. అనగా నమ్మి తృప్తిమై నుండదగినస్థితి నావహించిన యవిగావు.

భూమండలమున నిపుడున్న రాజ్యములలో నింగ్లాం డొక్కటిమాత్రము చూచుటకు నపాయకరమైన ఆర్థికగతిం దాల్చియున్నది. వాణిజ్యము పరివర్తన క్రియలును భావింపరానియంత యుత్కృష్ట స్థితిం జెందినవికాని, ఇండియా, ఈజిప్తు, ఇత్యాదులగు ప్రాతరకపు ప్రదేశములు విధేయములై వానివర్తకమెల్ల తన్నుంజెందుటచేతను, అమెరికా, దక్షిణామెరికా మొదలగు ఖండముల బేహారములలో బహుభాగము దనవశంబగుటచేతను, తమతో రక్తసంబంధమును రాష్ట్రసంబంధమునుగల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కానడా మొదలైన సీమలుండుటచేతను, కచ్చావస్తువులన్నియు దిగుమతి చేయించుకొనిన వ్రయము తక్కువయని ఇంగ్లాండు మహారాజ్యము కృష్యాది పరికర్షణ క్రియల నశ్తద్ధచేసి కడులాఘవం బందజేసినది. మనకు భూవ్యవసాయ మెట్లో, వారికి యంత్రప్రవర్తిత పరివర్తనక్రియలట్లు. శత్రువుల యుద్ధపు నావలు అభేధ్యమైన ముట్టడింబన్నిన పదిదినములలో క్షామపీడనముచే వినయ వినమితులు గావలసివచ్చు ననియు, ఒకటి రెండు వారముల మాత్రమునకన్న నెక్కువ యాహారమయ్యెడ నేక కాలంబుననుండుట లేదనియు, తామే పంటలంబెట్టినను నందఱకుం జాలినంత తేలించుటకుం దరముగాదనియు, కోవిదులు మొగమోటములేక పల్కుచున్నారు "ఇంగ్లాండీరీతిని ఒంటికాలున నిలిచినదే! దాని యైశ్వర్యం శంపాలతం బోలినదిగదా" యని సంశయించిన, అది స్థిరమో యస్థిరమో నిర్ధారణజేయుటకు నేను ఆనిబిసెంటమ్మ గారి శిష్యుడను గాను. ఇంగ్లీషువారు నిర్భయతనుండుటకై యాయత్త పఱచిన సన్నాహము లేవనగా:- 1. అద్వితీయమైన యుద్ధనౌకాశ్రేణి. వీరు ఐరోపాలోని రెండు మూడు రాజ్యములు గలిసివచ్చినను సముద్ర యుద్ధములో ననాయాసముగ నోడించునంత శక్తిగలవారు. వరుణలోక చక్రవర్తు లనందగినంత బలాఢ్యులు ఇంగ్లాండు ద్వీపముగాన నావలచేనేగాని భూచారసైన్యములచే నోడించుటకుగాదు. ప్రకృతం దానిని నావలచే నావరింపజూచుట సింగంబునకు సిళ్ళుజూపినట్లు. 2. ఇండియా మొదలైన తూర్పుదేశములను, తమజాతివారే వలసపోయి వ్యాపించి ప్రసిద్ధికిదెచ్చిన కానడా మొదలగు పుత్రికారాష్ట్రములను, తమ్ము వదలకుండునట్లు భయము నయముం బచరించి బద్ధ సఖ్యములంజేసి వానితోడి వర్తకము ననంతముగజేయుట. ఇందుచే ధాన్యాదులగు పచ్చివస్తువులకుం గొదువలేక యాచంద్రతారార్కముగా నుండవచ్చునని వారి తలపోత. తలవ్రాత యెట్లున్నదో యెవరెఱుంగుదురు?

శ్రమవిశ్లేషమున కనుకూలించు సమయములు

వీనిని బూర్వమే చర్చింతిమి గాన సూచనగా నిట జూపినం జాలుగదా! ఉత్పత్తి వాణిజ్యము ఇవి యితరేతరాధారములు. ఇవి విస్తరత గాంచినంగాని మామిడితోటల సామ్యము చేజూపినట్లు శ్రమవిశ్లేష మిక్కిలిగా గొనసాగనేరదు. కావున వాణిజ్యచక్రము శ్రమ విభజనమును పరస్పరాను కూలములు. మఱియు వృత్తులు భిన్నములు గాక యెల్లరును తమకుం గావలసినవన్నియు దామే యార్జించు చుండిన వర్తకములుండవనియు జెప్పియున్నాము. ఇవి యెట్లు కలసిమెలసి పిరిగొనియున్నవో చూడుడు!

మఱియు నుత్పత్తి యనుకూలించెబో, వస్తువుల గుణంబులు ననుకూలించినంగాని ప్రయాసను పాలుపెట్టుటకుగాదు.

1. రచనక్రియలు వెవ్వేఱుగా జేయుటకు ననువైనివిగా నుండవలయు.

2. కర్మకరులకు నిండినట్లు నియతకాలంబెల్ల వచ్చునంత పనులుండవలయు.

3. కర్మములు పర్యవసితములుగానిభంగి నొకటితో నొకటి యొరసి యేకధారగా నుండవలయు.

ఈ సమయంబులు విరచనక్రియలందంత సాంద్రముగ బంటపనులయందు జెల్లవు.

ఈ విషయములు మఱచియుందురేని నామామిడితోటకు మఱలంబోయి తపసుజేసిన నర్థము ప్రత్యక్షంబగును.

కృషులయందును, ఇంకొకచందాన విశ్లేషణము గలుగవచ్చును. కలుగుచున్నది. అదేదన, వెవ్వేఱు పంటలం నుత్పత్తిచేయుట, ఉద్యానవనకృషిచేయువారును బండ్లతోటలు వేయువారును నేవైన కొన్ని రకములం బోషింపజూతురేకాని కన్నులకు చెవులకు సోకిన ఫలవృక్షంబుల నన్నింటిని గజిబిజిగా గలిపినాటరు.

శ్రమవిశ్లేషము దానికి దోబుట్టువులైన యంత్రములమాడ్కి అధికవృద్ధి న్యాయపాలితంబులైన వ్యవహారములయందుబలె హీన వృద్ధి పాలితంబులగు మార్గంబుల విహరించి నేత్రోత్సవంబుగావింపదు గాన వీని శృంగారము ధనికులకే గాని నిర్ధనులకంత చక్కగా గోచరంబుగాదు.

శ్రమ విశ్లేషమువలని లాభములు

1. క్రియల భాగింప భాగింప బహుసులభముగ యోచనసైతములేకయే చేయబడునంత సరళమైన కార్యసముదాయంబుగ నేర్పడును. వీనిని నేర్చికొనుట యనాయాస కృత్యము. తుదకు నీసాధానమునకు జడములైన యంత్రములైనం జాలును.

2. ఇట్లేర్పడిన భాగములు నైపుణి విషయములైన తారతమ్యములను గలిగియుండుట స్వాభావికమ. ఇందు గొన్ని సుకరములు. కొన్ని దుష్కరములు. ఒకయెడ బుద్ధి బలమెక్కువగను, ఇంకొకయెడ బాహుబల మెక్కువగును గావలసివచ్చును. కావున యజమానులైన వారు ప్రయాస వృధగాకుండు నట్లు ఆ యా క్రియలయందు వానికి దగినవారి నియోగింతురు. ఇందుచే ఫలాభివృద్ధి సిద్ధము.

ఒక్కడే కీడనక మేలనక యన్నిటికిం దొడంగిన నష్టమెట్లు తప్పును? చక్కగా నేయనేర్చిన సాలెవాడు నేతపనిలోనే యుండిన మంచిది. అట్లుగాక కొంతసేపుండి పిదప పోగులు చక్కగా నున్నవా యని చూచుటకువెళ్ళి, తరువాత రంగులు పట్టించు పనులలో కొంతసేపుండి, ఇట్లు నానావిధముల దృష్టి సెదరనిచ్చిన కాలకర్మంబులు రెండును ధ్వంసములౌను. యోచనాపరుడు మానసిక క్రియలందే యవికలస్వాంతుడైవున్న విషయశోధనంబు సుఘటంబు. మన ఇండ్లలో బలె బిడ్డల నోదార్చుట, బిచ్చగాండ్రతో వాదించుట, ఇత్యాది కార్యములగూడ జూచికొనవలయునన్న తలంపులు కొనసాగవు. తపసునందెట్లో వ్యవహారములందునట్లే. అనగా నేకాగ్రత అమోఘం.

కష్టముకొలది పనులను రకములు రకములుగ జేసిపెట్టుటలో నింకను నొకగుణమున్నది. ఏదన దుర్బలులైనవారింగూడ వారి కను గుణములైన వృత్తులలో నియమింపజేయ వచ్చును. కొన్ని యంత్రశాలలలో కుంటివారికి సైతము కూలి దొరకుచున్నది.

కావున శ్రమవిభాగ మిఱుదెఱంగుల శుభావహంబు. బలాఢ్యులు కళాదక్షులు నైనవారిని శ్రేష్ఠతర ప్రయత్నములయందే యస్ఖలిత వృత్తులంజేయుట యొకటి. బలహీనులు మందులు వికలాంగులునైన వారినిగూడ వ్యర్థులం జేయక యుచితగతి సమర్థులం జేయుట రెండు.

           3. "అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
               దినగ దినగ వేము తియ్యనగును"

అన్నట్లు. ఏకక్రియారూఢిగ బనిజేయువారికి దానియందు పాటవము ప్రబలమౌను. మ్రానిపనియే చేయుటంజేసి వడ్రంగి దానియందితరుల కన్న నెక్కువ కుశలుండైన విధంబుననె యావడ్రంగియొక్క క్రియల సైతము విభజించి పంచిపెట్టిన నాప్రత్యేక క్రియలందు నిరంతరాభ్యాసము గలవారు సర్వక్రియా భారము వహించు వడ్రంగికన్న నధికచాతుర్యముగలవా రౌదురనుట సుబోధమేగదా1

శాస్త్ర విచారణయందు నీన్యాయము చూపట్టెడు. అల్పవిద్యావిదు లనేక విద్యల నేర్చినవారుగాను, పాండిత్య గంభీరులు కొన్నింటి మాత్ర మామూలాగ్రముగ జర్చించిన వారుగాను నుండుట మనకెల్లరకు ననుభవవేద్యము. పల్లెటూరి పురోహితుడు రైతుల యెదుర జ్యౌతిషము, వేదాంతము, తర్కము, సాహిత్యము, మొదలగు నన్నియు దెలిసినట్లు నటించును. నిజముం జూడబోయిన వాడు నిరక్షరకుక్షి! విశారదులైనవారొక తర్కమో వేదాంతమో చక్కగా నెఱింగినం జాలునని యావజ్జీవము కృషిసేతురు. దీర్ఘాలోచనాపరులు గావున నవీనశోధనలకు నూతనవృత్తాంతములకును వీరుజన్మ స్థానములు.

4. పనులనుండి వేఱుపనులకు దిగవలయునన్న కాలము నష్టమౌను. ఏక కార్యస్థితులమై యున్న కాలవ్యయంబు గలుగదు. వర్త మానమున కాలమునకు గలుగు విలువ యింకేవస్తువునకును లేదు. ఐరోపా, అమెరికా ఖండములలో కాలరక్షణార్థమై సృజింపబడి యుండు తంత్రములవర్ణింప నేనెంతటివాడను! చూడుడు! నలుబది యేబది యంతస్తుల మేడలున్నవని వచించితింగదా! మీదికిబోవ గోరిన మెట్లెక్కి దీర్ఘనిశ్వాసముల బుచ్చుచు సేదదీర్చుకొనబని లేదు. విద్యుచ్ఛక్తిచేత క్రిందికి మీదికి రాకపోకలు గలిగిన బండ్లున్నవి. ప్రతి అంతస్తు వద్దను నాబండ్లతో సంబంధము గలిగిన బిసలున్నవి. వీనిందాకిన నాయంత్రము నడుపువానికి నెన్నవ మిద్దెవారు పిలుచు చున్నారని యేర్పడి వాడు బండి నటదెచ్చినిలుపును. పిమ్మట బ్రయాణీకులందు బ్రవేశించి పైనికైన గ్రిందికైన బొమ్మన్న నేయంతస్తునకు బోవగోరుదురో యచటకు జేర్చును. ఈ ఉద్వహన యంత్రంబులు రెండు విధములు. అనతివేగములు అతివేగములని. అనతివేగము లనగా బ్రతి అంతస్తువద్దను నిల్చునవి. అయిదై దంతస్తుల కొకతూరి నిలుచుచు తలదిరుగు నట్లు గవియునవి యతివేగములు. చాల పొడుగుభాగములకుం బోగోరువారు వీనిన యధిష్ఠింతురు. ఈశ్రమములన్నియు గాలరక్షణోద్దేశ్యములని వేఱుగ నెత్తిచూప వలయునా? అమెరికాఖండములోని న్యూయార్కు అను పట్టణరాజములో వీధులం బోవు ట్రాంబండ్లు ముత్తెఱంగు, భూచరములు, ఉపరిచరములు, అధశ్చరములు అని.

1. భూచరములు. ఇవి సాధారణముగ చెన్నపురిలోబలె వీధుల మీద వేయబడిన యినుపకమ్ముల మీద బోవునవి.

2. ఉపరిచరములు. వీధుల ప్రక్కలలో పదునైదిరువది యడుగుల పొడవుగల గొప్ప యినుపకంబముల నాటి, వానిపై వంతెనలరీతి గటాంజనంబుల నేర్పఱచి, యినుపదారుల వేసి వానిపై ట్రాంబండ్ల నడిపించు చున్నారు. గుఱ్ఱపుబండ్లు, మనుష్యులు మొదలగున వేమియు నెదురురావు గావున నవి భూచరముల కైన నెక్కువ వేగవంతములు. వీధుల మీద బోవునవి. 3. అధశ్చరములు. ఇండ్లయొక్క యస్తిభారములకు నేమాత్రం నపాయము లేకుండునట్లు మిక్కిలి లోతుగాద్రవ్వి భూమిలో వివరము గావించి, యావివరములో నినుపదారులువేసి వానిమీద నడిపింప బడునవి. అక్కడక్కడ విద్యుచ్ఛక్తి వెలుతురుచే దేదీప్యమానము లైన స్టేషనులుండును. దిగువారు పైనికి బోయి వీధి జేరుటకు ననుకూలములగు నుద్వహనయంత్రము లున్నవి. ఈయంత్రములే పైనుండు వారిని క్రిందికి దింపును.

శీఘ్రగమన యంత్రములే యాశ్చర్యకరములుగానుండ నింకను నాశ్వర్యకరమైన క్రమమొండు గూడగలదు! ఈ రథములన్నియు నుద్వహన యంత్రములట్లు అనతివేగాతి వేగములని రెండువిధములు. మన దేశములో రైలుబండ్లు టపాల్‌ట్రెయిన్ సాధాట్రెయిన్ అని యుండలేదా? ఆ రీతినే యవియునని గ్రహించునది. అతివేగములు కొన్నియెడలమాత్ర మాపబడును. చూడుడు! కాలమునందు పాశ్చాత్యుల కెంతదృష్టియున్నదో! మనదేశపు రివాజువేఱు. రాహు కాలమని, పగలుకాలమని, నక్షత్రము బాగుగ లేదని, వారశూలయని, పిల్లివచ్చెననియు, బల్లిచచ్చె ననియు బుంఖానుపుంఖములైన వ్యాజముల శరణుజొచ్చి సోమరి తనమును సమస్త శుశ్రూషలజేయుచు నుపాసించుటయ పరమధర్మంబని యున్నామే? తమోగుణము మనకు నాస్థానముగదా? దారిద్రదేవతకు దమోగుణము సింహాసనము. మన మాయాసనమును బదిలముగ స్థాపించియున్నాముగాన నాయమ్మ దిట్టముగ గదలనని మనదేశమున గూర్చొనియున్నది!

5. సాధన సమర్థత. ప్రతివాడును నొక సాధనముమాత్ర ముపయోగించిన విరామములేక దానిని వాడవచ్చును గాన దానినుండి యెంత పనిదీయవచ్చునో యంతపనిని బూర్ణముగ దీయగలడు. బహుకార్యపరులమైనచో కార్యముల మార్చువేళల నయ్యైకార్యముల కనుగుణములైన పరికరముల బూనవలసినచ్చుటంజేసి తదితరపరికరము లూరకపడియుండును. ఇందుచేత వ్రయమేగాని యాదాయములేదు. మఱియు నూరక పెట్టియున్న నుపకరణములు త్రుప్పుపట్టి చెడిపోవును.

6. పనులు బహు లఘువులౌటచే త్వరలో నేర్చికొనవచ్చును. శిక్షకు విశేషకాలము పట్టదు. పూర్వము బాల్యమునందే గురువులయొద్దజేరి యెన్నియో సంవత్సరముల వఱకు క్లేశించి పనినేర్చి కొనుట యావశ్యకముగానుండెను. ఇప్పుడీ శిష్యత్వము త్వరలో గురువునకు తిరుమంత్రము జెప్పునంతటి సమర్థమగును.

శ్రమ విశ్లేషమువలని నష్టములు

1. కర్మకరు లేకరీతినే కీలుబొమ్మలమాదిరి చేతులాడించు చుందురుగాన నయ్యది మనశ్శరీరముల వికాసమునకు భంగకరము. జన్మమంతయు గృషిచేసినందుల కేమిఫలమని యొకడడిగెనేని గుండుసూదిలోని యెనిమిదవయంశమని ప్రత్యుత్తర మిచ్చుటలో నేమి ఘనతయున్నది? మనుష్యులు యంత్రాంగము లట్లుండుట హీన వృత్తియేగదా?

దీనికుత్తరము; 1. నిజమేయైనను, శుద్ధముగ నేనుమాత్రము యోచనలేక దేనినైన జేయగల్గితిమేని త్వరలో నాకార్యమును యంత్రాధీనము జేతురుగాన, హస్తకళలుండు పట్లనెల్ల బుద్ధియు వినియోగము నకు వచ్చుననుట నిక్కువము. కావున జడక్రియలబాధ యాధునిక పద్ధతులవల్ల తగ్గుచున్నదేకాని హెచ్చుచున్నదనుట యిమ్ముగాదు. 2. యంత్రములు, శ్రమవిశ్లేషము, ఇత్యాదుల ప్రాపున నుత్పత్తి విలసిల్లుచున్నందున పూర్వమువలె దీర్ఘకాల మొకేపని జేయుచుండుట యనావశ్యకము. అనగా నెక్కువసేపు విరామముగా నుండవచ్చుననుట. ఇట్లు లబ్ధములైన విరామావసరమ్ములను దేహ మన:పరిశ్రమములచే బూరించి పూర్ణసుఖమేల పడయరాదు? ఐరోపాలో బూర్వముకన్న నిపుడు సేవాజీవులైనవారు చదువు సాముల మించినవారైయుండుటకు సామర్థ్యాతిశయిత తంత్రములేకదా కారణములు?

2. శ్రమవిశ్లేషముచే గర్మకరులు బొత్తుగ స్వాతంత్ర్యము లేనివారగుదురు. ఒక చిల్లరపనిమాత్రమునేర్చి జీవించువారి కాపని యయిపోయిన నేమిగతి? వారు యజమానుల దౌర్జన్యము నెట్లెదిరింప జాలుదురు? ఒక్క వస్తువునంతయు దానే పరిష్కరింపజాలునేని "ఈ క్రూరుని దండనుండుటేల? ఇంకొకయెడకరిగి యా వస్తువులం జేసి పొట్టబోసికొందము" అను ధైర్యమున తమయధీశ్వరులనైన గౌరవమునకుమీఱి రాకుండునట్లు చేయజూతురు. మహాయంత్రములో నొకచిన్న చక్రమట్లు తగులుకొన్నవానికి స్వేచ్ఛా వర్తనంబు సాధ్యమా? తిరుగుమన్న దిరుగవలయు, నిలువుమన్న నిలువవలయు!

ఇందునకుం బ్రత్యాఖ్యానము, నిజమేయైనను నొక్కమఱు మాటయున్నది. ఏదన, కర్మకరు లొకడొకడుగ జూచిన దిక్కులేని పక్షులట్టు లుండువారే యైనను వారెల్లరు సమూహముగ గూడి నియమబద్ధులై యేక వాక్యముగ నేకచర్యగ సలిపిన యజమానుల భయకంపితులం జేయుదురనుట మఱువగూడదు. ఏశ్రమ విశ్లేషము వీరిం బరాధీన వృత్తులంజేసెనో యా శ్రమవిశ్లేషమే వీరిం బ్రోగుగాగూర్చి సంఘీభావమునకు దరుణము నలవరించి సుఖయాత్రకు నావవంటిదాయె విషమును నదియ, విఱుగుడు నదియ! మొత్తమునకు దీనిచే మేలేగాని కీడుగాదు.

3. ఉండనిండు! దేశములోని జనులు వృత్తులచే వేఱుపడుట తగునా! ఒక్కొకరొక్కొకపని మాత్రము సేయువారైరేని, ఎక్కువ తక్కువలు నిత్యములౌను. దానిచే సంయోగము నశించును. ఆర్థిక వర్గములలో నొండొంటికి భేదము లుప్పతిల్లి కలహములకు గారణములై యనర్థకములుగ బరిణ మించును. కావున నొక్కొక్కరు నానావిధ వృత్తులకుం జేరినవారుగా నుండిన నైకమత్యంబారును, తేఱును, అంతటను వ్యాపించును. పై వాదము శుద్ధముగ ననాదరణీయము. కారణములు. 1. అందఱు నచ్చుకొట్టినట్టు లేకరీతిగ నున్న సంయోగ మసంభవమగును. భిన్నతయే కూడికకుమూలము. స్త్రీలు స్త్రీలుగను బురుషులు పురుషులుగను నుండబట్టియే కదా అన్నియోగములును వద్దనినను వచ్చిపట్టుకొనుచుండుట! 2. విశ్లేషముచే నొకరికొక రాధారముగా నుండుట తటస్థించును. అందుచే సంఘము ధృఢమైన ఐక్యభావముం గాంచును. వృత్త్యాది విభజనము లేనివారు పిరులులేని త్రాళ్ళువలె నిస్సారులగుదురు. 3. ఇక గలహముల కెడమున్నదనుట యొప్పుకోవలసిన విషయమ. జీవమున్న బోటియుండక మానదు. పోటియొక్క జోలియే వలదనువారు ముక్కుమొగము మూసికొని చావవలసినదే. అట్టివారికింకొక బ్రహ్మదేవుని నగ్నిగుండమునుండిలేపి, ఇంకొక ప్రపంచమును సృష్టించుకొని యక్కడకుంబోయి యేమాత్సర్యమునులేక విజృంభించక సుఖముగా నిద్రపోవచ్చును! ఇందును నొక విశేషము. కారయితృ కార్మికులకు వైరమున్నదంటిమి. ఎందున? ఫలవిభాగమున మాత్రము. ఫలోత్పాదనమున మూలధనము వారు సేవకులును బొత్తుగొని యుండవలసిన వార. అట్లుగానిచో జగడమాడుటకు ఫలమే యుండదు. ఫలము పంచుకొనుటలో విరోధ ముండవచ్చుగాని యా విరోధము సార్వకాలికమును ననివార్యమునని యెంచుట తప్పు. మితికిలొంగిన భేదమేగాని యిది మితిలేని భేదముగాదు. ఎంత పోరాటమున్నను, నారాటము మానునట్లు, ఉపార్జనక్రియల నుమ్మడిగలవారై యుండ వలయుననుట సహేతుకము. మఱియు నప్పటికెన్ని కోపతాపములున్నను సర్వసంగ పరిత్యాగ బుద్ధితో నొకరిమొగము నొకరెన్నడును జూడమని గంటువెట్టుకొనిన నిరుకక్షులవారును నశింతుడు. కాన చిరవైరము వొసగదు. తాత్కాలికముగ జూచిన వియోగమున్నను, దీర్ఘకాలము తీరును గమనించిచూచిన సంయోగమే దృఢతరము. పుంజీదారులయు వేతనజీవులయు బ్రతుకు భార్యాభర్తల బ్రదుకట్లు. దంపతులకుం బ్రణయ కలహము లెంత కఠినముగా ముదిరి దేహమునకు మనస్సునకు గాయములు గలుగజేయున ట్లప్పుడప్పుడు గలుగుచున్నను నాయలలచేత బొంగి ప్రళయమాపాదింపక సంసార సముద్రము మొత్తముమీద శాంతముగా నుండును గదా? వ్యవహార సముద్రము నిట్టిద.

"అట్లేని జాతిభేదముల నేల ఖండింప వలయు? హిందువుల వర్ణధర్మంబులు దేశంబున కహితంబులన నేల?" యని యేపూరిపుడకయైన నానికగగుదురు నాయని పెదవు లెండరోయువారు కొందఱు ప్రశ్నింతు రేమో! దీనికి వేయివాదములేల? రెండుచాలును. 1. శ్రమవిశ్లేషమునకును దీనికిని దారతమ్య మధికము. చూడుడు! మన సర్వకళాశాలలో విద్యార్థులకు విడుదు లేర్పఱుప వలయునన్న నొక్కొక్క తెగకు నొకమండపమును వంటశాలయు నిర్మించుట విధిలేని క్రియ. దీనిచే మనకందు మర్యాద భాగహారముగాదు. గుణకారము. అనగా శ్రమవ్యయములు గుణీకృతము లగుచున్నవిగాని విభక్తములు గావనుట స్పష్టము. 2. "ఎట్లుండిననేమి? దూర దూరముగనుండి మీపోకల మీరును మాపోకల మేమును బోవుచున్నను దేశీయ విషయముల మాత్రము కలసిమెలసి యేలయుండరాదు?" అని తలపోయు ప్రాజ్ఞులీ కురుక్షేత్రమున నున్నారు. మనసులేని పెండిలి మహాచారమను వారికి నిక్కమైన కలయికకు సమయము లెవ్వియను విషయమై యేమి తెలియును. తెలియబోలును? మఱియు నేలకాగూడదను సంభావన వమ్మగు వచనము. అనుభవమున నున్నదా లేదా యను విచారణ ముఖ్యమైన యంశముగాని "పూర్వముండెనుగదా! మంత్రతంత్రములచే మన పూర్వులమాడ్కి మఱల సృజింతము" అనునూహలు పిచ్చితలంపులేకావు, దుర్మార్గపు యోచనలునుగా నున్నవి. 1832 వ సంవత్సరము వఱకు నింగ్లాండులో రాజ్యతంత్రమంతయు బ్రభువుల యధీనమై యుండెను. ఆ సంవత్సరమున వర్తకులు మొదలగువారు తమకును నధికారము గావలయుననికోరి, ప్రభులందులకుం దగిన చట్టములను సెలవియ్య మన్నందుచే గోపోద్దీపితులై వేఱుపడెదమని భయము జూపిరి. అప్పుడు ప్రభువులు వారింజూచి "మీతండ్రులు తాతలు మాకు విధేయులుగ నుండలేదా? మీరును నాతీరుననే కలకాల మేలయుండరు? పితృలకన్న మిన్నలైయుండ జూచుట మహాపాతకముగదా!" యని బూతువేదాంతముల నుపదేశించుట కుం బూనక "ఇంకను నెదిరించిన నేకదేశస్థు లొండొరులతో బ్రాణాంతముగబోరుట సంభవించును. అందుచే రాజ్యక్షయమును, తద్ద్వారా వీరు వారనక యెల్లరు ప్రాభవహీనులగుటయు దప్పదు" అని తలపోసి తమకు పదవి పోవుననుట నిస్సంశయమైన యుత్పాతమైనను, కొదువలేదని ప్రజల మతమునకు నంగీకరించి స్థానచ్యుతులైనను గీర్తిచ్యుతులుగాక మనిరి. కావున "ఇట్లుండరాదా? అట్లుండ రాదా" యను నవ్వుల కధలతో మనకేల? వర్తమాన భవిష్యత్తుల స్థితిగతుల మేరకు సర్వము చక్కబెట్టు కోవలయునే కాని భూత గ్రస్థులైయుండుట బుద్ధిలేని మతము.