Jump to content

భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఐదవ ప్రకరణము

వ్యవహార నిర్మాతలు

ఆదిని శ్రమనుగూర్చి వ్రాయుచో దేశమన శ్శ్రమంబులని, యది రెండు తెఱంగులని, యంటిరిగాని యా మనశ్శ్రమ యేమూలడాగెనో యెక్కడకేగెనో మాకంట బడలేదని చదువరులు హాస్యమునకుం బూనుదు రేమో? ప్రస్తావవశంబున నక్కడక్కడ వెదజల్లినట్లు, ఈవిషయమునకు సంబంధించిన చర్చల బొందించి తిమిగాని కలిసినట్లు వ్రాయ వీలుదొరక దయ్యె. ఈ కొఱంత నిటగొంత నివారింతము:-

వ్యవహారముల విస్తరించుట

వ్యాపారము లల్పములై యిరుగుపొరుగు సీమలమాత్ర మాశ్రయించి యల్లుకొని యుండిన కాలములో దీర్ఘాలోచనకు నెడమెక్కడిది? ఇంత గిరాకియ వచ్చునని శిల్పులకెల్ల మున్ముందుగనే తెలియును. ఏ యే వస్తువులలో నెవరికెంత మాత్ర మాదరమున్నదో యది తూచినట్లందఱకును విశదము. ప్రాచీనాచార పద్ధతులే పరమపదవులని యుండు వారుగాన నడుగువారు కోరునవియు, నిచ్చువారు చేయునవియు నన్నియు బ్రాతలే. తాతగోరినదే మనుమడును గోరును. తాతచేసినదే మనుమడును జేయును! గిరాకిదారులకును సరఫరాదారులకును బొత్తు సంపూర్ణముగా గుదిరి యుంటబట్టి వ్యవహారముల నభావితము లెవ్వియు బుట్టవయ్యె. మఱియు నాచారబద్ధులౌటంజేసి ప్రాతవి మఱుపునకురావు. క్రొత్తవి మనసునకురావు. లాభనష్టములు రెండును లఘువులై జీవనోపాయము లొకటేరీతి వర్తించుచుండెను. ఉండునవిగిట్టవు. లేనివిపుట్టవు. ఇట్టివ్యవస్థలో యోచనాశక్తికేమిపని? కావున జడులరీతిని జనులు ప్రవర్తించుచుండిరి. శిరస్సులు చూపునకే గాని విచారణలకు గానివయ్యె. తఱువాత ముఖ్యముగా బశ్చిమ ఖండమువారు కాలక్రమమ్మున నభివృద్ధినొందుడు, ఉత్పత్తి వినిమయములు రెండును వెలయందొడంగె. రక్షకసంపద, రాకపోకలు, చదువులు, నతిశయించు కొలది జనులు మూఢభక్తి వదల్చుకొన్నవారై దూరపు వ్యవహారముల కారంభించి ప్రత్యక్షమైన గిరాకినే గాక, పరోక్షంబు నాశించియు వస్తువుల రచియింపంబూని, తద్రచనా సామర్థ్యంబు సమగ్రత నొందుటకై యంత్రస్థాపనలు, శ్రమవిశ్లేషము, రొక్కమునకుం గాక నాణెము మీదనిచ్చితీయుట, ఇత్యాది ఘనతర తంత్రంబులకుందొడంగి సామాన్య జనులకు నివ్వెఱపాటు గలుగుమాడ్కి ఆర్థిక చక్రంబు విన్యసించి తిరుగు నట్లొనరించి కృతార్థులు నుజ్వలులునునైరి.

ఈ వ్యాప్తిచేనైన మాఱుపాటు లెవ్వియనిన?

1. పూర్వము వివరింపబడినట్లు, ఉత్పత్తిపరులకును వినియోగ పరులకును మధ్యవర్తులైన వర్తకు లేర్పడుట.

2. తొలుత నీవర్తకులే మూలధనముగల వారుగాన యజమానులట్లు శిల్పులకు నుత్తరువులిచ్చి వలయు వస్తువుల నుత్పత్తి చేయించుకొనుచుండిరి. కాని వ్యాప్తి యింకను నెగయుడు నీయుత్పత్తియు వ్యాపారమును వేఱుపడి ప్రత్యేక కర్తల యధీనముంజెందె.

3. ఈ ప్రత్యేక కర్తలెల్లరు మూలధనో పేతులగుట మూలధన ముండువారెల్ల యజమానులై యుండుట సహజకృత్యమో యనునట్లు శాస్త్రజ్ఞులకు సైతము దోచెగాని, యాధునిక వృత్తాంతము లంబట్టి చూడ యజమానతకు మూలధనం బావశ్యకంబనుట యప్రతిహత న్యాయముగాదు. ఎట్లన;

4. ఇంగ్లాండు, అమెరికా, ఇత్యాది దేశముల వ్యవహార పారీణతం జూడుడు. వారి వాణిజ్యము లోకమంతట నిండియున్నది. దీనికి దీటైన యుత్పత్తియు నున్నదనుట చెప్పకయ గ్రహించు కొనదగిన సంగతి. మఱియు, ఫ్యాక్టరీలు మన జిల్లాలలోని కస్పాపట్టణములంత పెద్దగ నున్నవనియు, కొందఱది కారణమ్ముగ వేఱుపట్టనముల గట్టించియున్నారనియు నంటిమిగదా! యజమానుడైన వాడీసేవక మండలినంతయుసాధించి సక్రమవర్తులం జేయజాలినంత ప్రభావోపేతుడై యున్నంగాని యొక్కనాటిలో సర్వము ధ్వంసంబగును. ధనమున్న మాత్రమున నీతేజంబు గలుగునా? బహుశ: కలుగదు. దేశ దేశములు వ్యవహార విషయమున మిళితములై యున్నవిగాన, నొక్కెడ నుత్పాతములు పుట్టిన దాని దెబ్బ యన్నిచోట్లకుందగులును. ఇందునకు దృష్టాంతములు:-

ఇంగ్లాండులో 'మాన్‌చెష్టర్‌' అను వణ్యపట్టణము వారు కోట్లకొలది రూపాయలు విలువగల వస్త్రముల ననువయించి మనకంపుట తెలిసిన విషయమ, మనకీమాత్రము సెలవు కావలసియుండునని మదింపు వేసి యా మదింపుననుసరించి వస్తువుల రచన కుపక్రమింప వలయుననుట సర్వవ్యావహారికులును బాటింపవలసినపద్ధతి. ఈమదింపువేయుట సామాన్యమగుపనియా యోచింపుడు! 1. వానలు తేలిపోయి పంటలు పాడువడిన దేశములోని ప్రజలకు భోజనపు సెలవులు, అధికములుగాన నట్టి క్షామకాలమున వస్త్రములకు గిరాకిమట్టు. 2. "స్వదేశవస్తువులనే కొనవలయు, విదేశవస్తువులు భ్రష్టములు, ముట్టరానివి" యని కంకణము గట్టుకొనియున్నవారిసంఖ్య యేమాత్ర మనియు, వారి మాటలరీతినే చేతులున్నవాయనియు యోచింపవలయు. మఱియు, స్వదేశప్రతిజ్ఞ లెన్నియున్ననేమి? ఇచటవారే పరదేశపు సరకులగొని స్వదేశపుపేర ముద్రలువేసి మోసగించి యమ్మువారుండక పోయెదరా? ఇట్టివారెవ్వరు? ఎంతమంది? యనియు గనుగొనవలయు. 3. మనదేశమునకు జర్మనీవారు, జపాన్‌వారును, సరకుల నెగుమతి సేతురుగాన నాదేశములలో నా యా సంవత్సరములలో వెలయబోవు వెలలు, రాసులు, సరకుల గుణములు నరసి, వారితో పోటీచేసి యమ్మకము సంపాదింప వలయునన్న నెట్టిపదార్థముల నేరీతుల నేధరలలోపల సిద్ధ పఱుపవలయునో యనుట నిర్ధారణం జేయవలయు. ఇవి యల్పులచే బరిష్కరింపబడు యత్నములా? దీర్ఘాలోచన, యగోచరార్థ విజ్ఞానము, భవిష్యద్వర్తమాన పరిశోధన, ఇవి పంచాంగముల కట్టలచేగాని బల్లిపలుకులలోగాని తేలవు. మఱి వ్యవహార నిర్మాతలయందు ప్రతివాసరానుభవ సంప్రజ్ఞాతములైన విద్యలుగానున్నవి. మాన్‌చెస్టరులోని కార్యచోదకులు, ఇక్కడివానల సంగతి, పంటలతెఱంగు, మొదలగువానిని గవర్నమెంటువారి ప్రకటనలు, తమనౌకరులు, ప్రతినిధులునుబంపు వివరణపత్రికలు, వీనిచే నెఱింగి తమఫ్యాక్టరీలలో జేయింపవలయు వస్తువుల పరిమాణము తీర్మానింతురు. ఇదియే ఘనమైన కార్యంబనగా దీనికి మించిన ఘనతర కార్యంబొండుగలదు! అదియేదనగా, పూర్వం గిరాకి నెఱింగియో యుత్తరువుల బొందియో యుత్పత్తి చేయుచుండిరి. ఇప్పుడు గిరాకి లేకున్నను, రుచిచూపిన నాశలు తమంతట బుట్టునను నూహచే, వస్తువులను గొంతమాత్రము తయారుచేసి జనులు వీనిం గొందురా లేదా, యని పరీక్షించుటయు గలదు. ఈ సాహసము నేమనవచ్చును? ఉపయోజకుల మనసులో నాసబుట్టింప నేరనివైన, విక్రయములేక, వేసిన మూలధనంబంతయు నష్టమగును. ఒకవేళ జనుల మనసుల నాకర్షించెబో నవీనమును ననన్యరచితంబును నగుటజేసియు, నరుదు గావునను గిరాకికొలంది వెలలవిధించి యమితలాభంబు వడయవచ్చు. రుచుల సృజింపజూచు వ్యాపారలక్షణ మేమనగా, మొదటికే మోసం వచ్చినను వచ్చును. లేదా సర్వసంపదలైనను గుదురును. ఊర్ధ్వ గతియో యథోగతియో ఈరెంట నొకటి తప్పదు. కొన్ని సమయములలో తలచినంత శీఘ్రముగ వస్తువులపై నామోదంబు గలుగకున్నను, ధైర్యము వదలక వేచి మంచికాలము నిరీక్షించి తుదకు లబ్ధప్రాభవులైన వారెందఱో యున్నారు. భావికాలము నాశ్రయించిన యుద్యమములు జయప్రదములుగా జరుగవలయునన్న భావనాశక్తియు ధైర్య సాహసములును సమగ్రముగా జెందివుండవలయుననట స్పష్టం. ధనమున్నమాత్ర నీగుణములుండుననుట యబద్ధము. కావున ధనశక్తికన్న ధీశక్తి యీనాట బ్రధానము. పశ్చిమఖండీయులెల్లరు జడపదార్థలోలురని కువాదముజేయువారీసంగతి మఱువగూడదు. జడపదార్థలోలురనుట గర్హ్యవాక్యము. అపారమైన మనోవ్యాపారమే యపారమైన వస్తు వ్యాపారమునకు మూలమును నాధారమును. జడములయందు మాత్ర మాసక్తిగొన్నవారు జడులగుటయకాక, జడులెల్లరు జడమ్ములందక్క నింకెద్దాని నాసింప రనుటయు నిశ్చయము. పాశ్చాత్యులు జడు లేనాటికింగారు.

అభిరుచిలేనిచోట్లను దానింగలిగింతురనుటకు నిదర్శనము. మనదేశములో పది పదునైదేడులక్రింద కాఫీ, తేయాకునీళ్ళు శాస్త్ర విరుద్ధములనియు ననారోగ్యకరములనియు ననేకులు నిరసించుచుండుట నేనే చూచియున్నాను. ఇప్పటికిని కుగ్రామములోని పెద్దలు "ఇవి యింగ్లీషువారి దేహములకు మంచివేయైనను మననల్ల యొడలులకు సరిపడవ"ని గట్టిగా వాదించెదరుగదా? ఆదిని ఈ వస్తు వ్యాపారమునకుం బూనినవారు కాలక్రమమునగాని శీఘ్రముగా లాభము రాదను మాట యెఱుగక పోలేదు. అయినను తాత్కాలిక నష్టమునకోర్చి, మనయెదుర నాలుకలలో నీళ్ళూరునట్లు, అన్ని సంవత్సరములుంచి నేడు దానిఫలము ననుభవించుచున్నారు. ఇప్పుడు, ఏటేటకు నీవస్తువులయం దభిమానము పెఱుగుచుండుటచే నెక్కువరాసు లుత్పత్తిచేయబడు చున్నవి. కూటినీళ్ళతో, దృప్తింజెందు నమ్మలు సైతము, ఉదయాన కాఫీలేనిది తలతిరుగుచున్నదని మొఱలిడుట యీ వ్యాపారులకు వీనుల విందుగాదే! ప్రారంభముననే లాభము రాలేదని విసుగుజెంది, "ఈ హిందువులు, అశాస్త్రీయములైన ద్రవములను బహిరంగముగ ద్రాగుదురా" యను శంకచే వెనుకదీసి యుండిరేని మొత్తముమీద కొఱతవడినవారై యుందురు. హిందూదేశమున నిప్పుడు ప్రబలముగా నుండు చక్కెర, బూట్సు, సరాయి, కోట్లు, కాలరులు, తోలుమొలపట్టెలు మొదలైన వస్తువుల బేహార మంతయు నీరీతిని బట్టు వడినదేకాని, మనమై ప్రాచీనవిధమనిగాని, స్వతస్సిద్ధ పరమార్థమని కాని యవలంబించినది కాదు. రుచిచూపి మఱపించుట యాధునిక వ్యవహారములలో మిక్కిలియు గణ్యమైన కార్యము.

ఈన్యాయము సుగమమవుటకై యొక నిదర్శనముం జూపెదను. పూర్వము ఋషులు జితేంద్రియ తందాల్చి తపములోనుండగా సర్వధర్మ సంరక్షకుడైన దేవేంద్రుడు తనపదవి కూనమౌనో యను సహజ చాపల్యముచే వారి మనస్సులను తపములను నీఱుగాజేయ నప్సరసలబంపుట సనాతన మర్యాదగదా? దీనివలన దేవేంద్రునకు స్థానభ్రంశమో స్థైర్యమో రెంట నొకటియగుట మీకెల్లరకు విదితమ. సాహస వ్యాపారములన్నింట నిట్లే. పడుటయో లేచుటయో యనివార్యము. అట్లని యూరక కూర్చుంట మాత్రము పొసగదు.

గిరాకి యేకరీతి నుండునదిగాదు. కాలదేశవర్తమానాను గుణముగ క్షయవృద్ధులం గాంచును. అది నదులవంటిది. ఒకప్పుడు దరుల గ్రిక్కిఱిసిపాఱును. వేఱొకప్పుడు శుష్కించి ఇసుక దప్ప మఱేమియు గానరాకుండును. ఉత్పాదకులు గిరాకియొక్క గతుల గమనించు చుండవలయు. లేనిచో తక్కువో యెక్కువో వస్తువులం బుట్టించి తక్కువ చేసినప్పు డల్పలాభమును నెక్కువ చేసినప్పు డమిత నష్టమును గాంతురు.

ప్రపంచమంతయు నేకవ్యవహార చక్రముగ నున్నందున నీగణన లన్నియు నసాధారణ జ్ఞానశోభితులకుం గాని లాతులకు వలనుగాదనుట విశ్రుతము. ఇట్లు గిరాకి యొక్కయు నుత్పత్తి యొక్కయు స్థితిగతులను మాఱుపాటులను విచారించి గ్రహించి సమయానుగుణముగ వ్యవహారములమార్చుచు నూతనోద్యమములం బ్రారంభించుచు వ్యాపార పారీన భావముందాల్చిన కోవిదులు వ్యవహార నిర్మాత లనబడుదురు. వీరు ఆర్థిక ప్రపంచమునకు బ్రహ్మలు, విశ్వకర్మలువంటివారు. సృష్టిస్థితి వ్యానృతుల కాధారభూతులు. వ్యవహారాండ పోషకులు.

"అవునుగాని, యెట్టి చతురుడైననేమి ? తానై పరిపణము ప్రయోగింపజాలడేని వ్యవహారముల స్థాపించుటెట్లు? బుద్ధికుశలతచే యంత్రముల జాడలెఱుంగనగుగాని యంత్రనిర్మాణ మొనర్చుటెట్లు? మనశ్శక్తియనునది యినుమా, ఉక్కా, కొయ్యా, చీలయా?" యను ప్రశ్నకు సమాధాన మేమన్ననో, ఐరోపాలో ధనరాసులు మితిమీఱి, యుపయోగమున కెవరైన దెచ్చువారు గలరాయని తహతహపడు చున్నవి. ప్రోగుచేసి పాతిపెట్టుటయో నగల జేయించుటయో యాచారముగలేని దేశములలో నీపరిపణ మంతయు బ్యాంకీలలో నుంతురు. బ్యాంకీల యజమానులు నూటికి రెండుమూడు వంతున వడ్డీ యియ్యవలసినవారు గావున, నీధనమెల్ల నూరక భద్రము జేసియుంచిన వారికి నష్టమింతంత యని చెప్పితీఱదు. కావున వారు దీని వినియోగించువారెవరైన నీదారి వత్తురాయని యెదురు చూచు చుందురు. అట్టి సమయములో బుద్ధిబలమున నూతనోద్యమముల గల్పించుటయో యున్నదాని విస్తరింపజేయుటయో యుద్దేశ్యముగా గలవాడు వారియొద్దకుం బోయి తన సంగతులన్నియు సవిస్తరముగ దెల్పి, ప్రారంభము ఫలవంత మగునని వారు నమ్మునట్లుచేసిన, వారు "వీడు శక్తిమంతుడు. యోగ్యుడు" అని నిశ్చయించిరేని బ్యాంకీల యినుపపెట్టెలలో గృశించి కుళ్ళుచుండెడు ధనము నప్పుగా నేలనియ్యరు?

నాణెము

యోగ్యత కుశలత సంయోగించిన నాణెమేర్పడును. నాణెము గలవానికి నిధు లుల్లసిల్లు నీదినంబులలో మూలధనము లభించుట దుర్ఘటంబుగాదు. సొమ్ము నమ్మదగిన వారికియ్యక సంచులలో గట్టియుంచుట కెవ్వడును సమ్మతింపడు. కావున వ్యవహార నిర్మాతలకు ముఖ్యముగా నుండవలసిన లక్షణములు రెండ. బుద్ధికౌశల్యము, సుశీలము, ఈ రెండు సంపదలున్న దక్కినవి యనాయాసముగ వచ్చి చేరురు. బ్యాంకు మేనేజరులు వ్యవహారసమర్ధులుగాన వారినివంచించుట దుష్కరము. వారినామోదింప జేయు చాతుర్యమున్న మూలధనప్రాప్తికి గొదువరాదు.

చూచితిరా యీ విశేషము? నాణ్యము, విశ్వాసము, నడవడి, యొప్పిదము, భావ గాంభీర్యము ఇత్యాది సుగుణము లర్థవిన్యాసమునకుం బ్రధాన నిదానములు. ఇక "నర్థోపార్జనము దుశ్చరిత్రముల కెల్ల బుట్టినిల్లు" అనువారి బుద్ధివైశద్యము నేమని వర్ణింతము?

ఏవ్యవహారమైనను ముందు వెన్కలుచూచి స్థాపించి కొన్నిదినములు తామే నడిపించి యదియొక క్రమమునకు వచ్చినతోడనే నిపుణులైనవారలం గార్యదర్శులుగ నియమించి యా నిర్మాతలు పైవిచారణమాత్రము చూచుకొనుచుందురు. అమెరికాలో 'పియర్ పాంట్ మార్గన్‌' అను కోటీశ్వరు డొకడున్నాడు. వీడు వందల కొలది వ్యాపారముల సృష్టిజేసి వానికెల్ల చోదకుడై యుండెడిని. ఇట్లుండియు నా యా శాలలకు దాను తఱుచు పోవుటలేదు. ఆవేశనములనుండి పనిదీయించుట వానిముక్త్యారులపని. ఇక దానేమి చేయుననగా తనకచ్చేరీగదిలోగూర్చుండి లోకములోని యావద్వర్త మానములను తంతి, తపాల్, పత్రికలు, తననౌకరులుపంపిన పత్రములు, వీనిమూలకముగనారసి యెయ్యైవిధంబుల నాజ్ఞలియ్య వలయునో యని యోచించి సర్వమునకు సూత్రధారుడై యుండును. ఏవైనదేశములు యుద్ధసన్నద్ధము లగునని సూచనయుండెబో, అప్పుడే యా మర్మముల నెట్లైన గనిపెట్టి "యుద్ధము ప్రారంభించిన నెగుమతులెట్లుమాఱును దిగుమతు లెట్లుమాఱును" అని యోచించి "యీవస్తువుల సేకరింపుడు, వీని నిలువబెట్టుడు" అని యాదేశించుటలో మార్గన్ అనన్యతుల్యుడని ప్రసిద్ధి. రష్యా వారికిని జపాన్‌వారికిని ఘోరమైన రణమైనప్పుడు "సైన్యములెన్ని ముందునకుం బోవును, వాని భుక్తికి నేయేవస్తువు లేయేమాత్రము పట్టును. యుద్ధోపకరణముల కెంత గిరాకియుండును" అని ముందే యోచించి జాగ్రత్తజేసినవారు, ఒక్కదాటున లక్షాధికారులైరి.

సంభూయ సముత్ధానములు

గొప్ప గొప్ప వ్యాపారము లొక్కనిచే నిర్వాహ్యములుగావు. పలువురుగలిసి భాగము లేర్పఱచికొని యుద్ధరించినంగాని కార్యంబు తుదముట్టదు. అత్యంత చతురుడొక్కడు, అపాయములేని యుపాయ మని యొక వ్యవహారముం దలపోసి దాని స్థితిగతుల వివరించి కొందఱకు నమ్మికగలుగజేసి చేర్చుకొని యొకకంపెనీగగుదిర్చి, భాగములుగొనువారున్న నీతేదిలోపున దరఖాస్తులు పంపవలసినదని ప్రకటనలం బంపును. ఇట్లు పంపుటకుం బూర్వమే బ్యాంకీదారుల సమ్మతియు బడసియుండును. అనేకులా సంఘములో భాగస్థులుగా జేరుదురు. పిమ్మట నందఱును పెద్దతనమునకుంబూనిన నేపనియుజెడును గాన డైరెక్టర్లు, అనబడు కార్యచోదకుల సభనొండు నియమింతురు. ప్రతిభాగస్థుడును తన యామోదము రీతిని చోదకుల వరించు హక్కు గలవాడైనను, తనకు నాకార్య విషయమంతగా దెలియదుగావున, తొలుత స్థాపించినవారెవరిని - గోరుకొనిరో వారినే యుండనిచ్చుట మేలని తలయూచి యూరకుండుట స్వాభావికమేకదా? కావున చోదకులు భాగస్థులచే నియమింపబడెదరనుట పేరుమాత్రము. యాధార్థ్య మును బరిశీలించిన నిర్మాతలచే జోదకులు నియమింప బడుదురనుట నిజము.

ఈ చోదక సభలలో నిర్మాతలకు తప్పక స్థానముండును. సృష్టించిన వారుగాన వీరికి దెలియని మర్మము లింకెవ్వరికిని దెలియవు. వీరులేకున్న రక్షణము పదిలమా? కాదు. కావున వీరందుండియే తీఱవలయును.

నిర్మాతలు స్థిరముగ నుండువారు. తక్కిన చోదకులు మార్పబడకున్నను మార్పునకుం బాత్రులు. ఎట్లన సాంవత్సరిక భాగస్థసభలలో చోదకులెల్లరు సభ్యుల సమ్మతిమీద నియుక్తు లౌదురు. ఎట్లును నిర్మాతలం గోరికొనవలయుట పాలివారికివిధి. తదితరులను మొత్తము మీద నామోదించుటయే సాధారణమైనను, నిర్మాతలకు వారికిని సరిపడకపోయిన నొకవేళ వారిని నిరసించినను నిరసింతురు. అట్లగుట జోదకులు నిర్మాతలు చెప్పినట్టు వినుటయు బహుళము.

భాగస్థులందఱును యజమానులు. అనగా గార్యనిర్వహణమునకు వలయుధనమును వేసినవారగుట సొంతగాండ్రు. సొంతమున్నను పైవిచారణకన్న నెక్కువగా నందు వీరికిం బ్రవేశములేదు. ఎట్లన; తమకు విషయములందు బరిచయముచాలదు. రెండవది. సమష్టిగా నెల్లరుగూడు సభలదక్క ప్రత్యేకముగా నిచ్చవచ్చినప్పుడు కార్య విచారణచేయు నధికారంలేదు. ఇట్టిసభలు సంవత్సరంన నొండు రెండు కన్న నెక్కువగాగూడవు. కాబట్టి యజమానులైన భాగస్థుల ధర్మమేమనగా, కార్యము సరళముగా జరుగుచుండెనేని చోదకులనమ్మి యూరకుండుట, భంగమైన గూతలిడుట. ఇంతకన్న నెక్కువ జోలి యుంచుకొన్న నుండునదియు బోవును. కావున వ్యవహార సంఘముల నిర్మాణ మెట్టిదనగా:

సంభూయ సముత్ధాన నిర్మాణము

1. మూలధనము సన్నధముచేయు యజమానులు, అనగా భాగస్థులు, సర్వమును వీరి సమ్మతుల ననుసరించి నడుపబడుననుట యొకవిధముగా నిజమేయైనను మొత్తము మీద నిది పైమాట.

2. భాగస్థుల సమాజముచే నియమితులైన చోదకుల సభ. వ్యవహారము ఏత్రోవల బోవలయునని నిర్ణయించు నధికారము వీరిది. వీరు భాగస్థుల కుత్తరవాదులు. చోదకులలో జేరినవారలై నిర్మాత లుందురు. ఈ నిర్మాతలు పేరునకు సభ్యులలో సభ్యులుగానున్నను పరీక్షించిచూచిన చోదకమండలికి గురుప్రాయులు. వీరి యుపదేశము వేదవాక్యముగా భజించుట తగినదో తగనిదోకాని తప్పనిది. చోదకులకు భాగస్థులతోపాటు లాభములలోని పాలుగాక ప్రత్యేక వేతనములు నియతములు.

3. చోదకమండలిచే నియమింపబడిన కార్యదర్శులు (మేనేజరులు) గొప్ప వ్యవహారశాలల నుందురు. వీరు నౌకరులేగాని స్వతంత్రాధిపత్య సంపన్నులు గారు. ఏలికల యుత్తరువుల నెరవేర్చుట, ఆదాయ వ్యయముల లెక్కలను దీరుగానుంచుట, శిల్పులకెల్ల నధ్యక్షులై పనులుతీయుట, ఇత్యాదులు వీరికిం జేరిన కృత్యములు.

4. శిల్పులు, పరిచారకులు, దినదిన వేతనములకో, పనికొలది నియ్యబడు కర్మవేతనములకోనిలిచి యధ్యక్షుల మనసు ప్రకారము క్లప్తముగ గష్టించువారు.

ఇందు మొదటి రెండుతరగతులవారుమాత్రమే నాధులయ్యును మూడవ తరగతివారును శిల్పులపై బెల్లుగ నధికారముచేయువార కాన కర్తృకారయితల పరస్పరవైరచర్చలో కారయితృ లోకమునకుం జేరినవారుగా బరిగణింపబడుదురు. వీరెల్లరు నధ్యక్షులు. నాయకులు. నాల్గవ తరగతివారు నియోజ్యులు. అనగా నధీనులై పాటుపడవలసినవారు, సనాథులు.

నిర్మాతల సత్త్వంబు విశదంబుచేయ స్వదేశనిదర్శనంబులు గలవు. చూడుడు! కావేరీ, గోదావరీ, కృష్ణాతీరముల వరిధాన్యపు యంత్రములు స్థాపింపబడుచున్నవిగదా! ఈ విధానముల లాభకరములుగా జేయ వలయునన్న నెంతయోచనతో బ్రారంభింప వలయునో యా నిర్మాతలకేగాని మనకెట్లు తెలియగలదు? "వరియొక్క యుత్పత్తియెంత? మనశాలకు నేమాత్రము సరకువచ్చును? దంచి సిద్ధపఱచిన బియ్యము నేయేస్థలముల నమ్మవచ్చును? వెలల విధము లెట్లు? బర్మాబియ్యమువచ్చి మనబియ్యమును మాయము చేయునా? అట్లుచేసెబో, బర్మావా రిదివఱకు జేరనట్టి సీమలున్నవా? అక్కడి క్రయవిక్రయ ముల స్థితులెట్లు? మనము లాభము చెందుచుంటంజూచి గొఱ్ఱెలమాదిరి మనవారెల్ల నీయంత్రస్థాపనకే గుమిగట్టివత్తురా? రైలులో నొకబండి వాకిలిదెరువగానే యందఱును బెదరిన మెకము లట్లు దానిలో నొక్కుమ్మడిం బ్రవేశింప బ్రయత్నించి తలలు బ్రద్దలుగ జేసికొండ్రుగాదే? అట్లే వారితలలతో మాతలలను బ్రద్దలు సేతురేమో? ఒకవేళ స్పర్ధ యమితమైనది. అపుడీయంత్రముల నమ్మియో మార్చియో మూలధనము మిక్కిలిగా జెడకుండ రక్షించి వేఱువృత్తుల కారంభింపవచ్చునా? మఱియు నమ్మకముతో బనిచేయు గుమాస్తాలు దొరుకుదురా? తప్పులెక్కలుచూపి వృత్రాసురు డింద్రుని మ్రింగవచ్చినట్లు యజమానులచే గ్రుక్కగొనజూతురా! ఇట్లనేకవిధముల వరివ్యాపారమంతయు త్రిప్పించి మళ్ళించిచూచి మఱి పూనినంగాని యపకారము రాకపోదు.

వ్యవహారచక్రము నడిపించువా రెవరనగా బుద్ధిబలముగల నిర్మాతలనుట స్పష్టము. ఆర్థిక ప్రపంచము నంతయు బొమ్మలవలె నాడించు సూత్రధారులు వార. మ్యానేజరులు సయితము వ్యవహార కళాకుశలులుగ నుండుట యుక్తము.

'కార్నెగీ' యను కోటీశ్వరుడు నొక్కి వక్కాణించినట్లు "ప్రజ్ఞావంతులకు వెలయేలేదు. సంబళమెంత యిచ్చినను వారిచే నధికోత్పత్తి సిద్ధించుంకావున సరాసరికి నయమేకాని వ్యయముగాదు. మందుడైనవా డుచితముగ వచ్చెదనన్నను దానిచే నష్టము తప్పదు. కావున కూలితక్కువగదాయని నిష్ప్రయోజకుల నియోగించుటకన్న నెక్కువ కూలియిచ్చి చతురుల జేర్చుకొనుటయ మేలు." ఇందునకు దృష్టాంత ముగా, 'కార్నెగీ' గారే లండనులో తమకు బ్రతినిధియైనవానికి, ఏటకు 75000 రూపాయలిచ్చెదరు! 75000 రూపాయలనగా నీ బ్రిటీష్ రాజ్యతంత్రమంతయు నడుపు ప్రధానమంత్రి కేర్పడియుండు జీత మంత! బొంబాయిలో ప్రత్తిశాలవారు కొందఱు తమ మ్యానేజరులకు నెలకు రెండువేల రూపాయలిచ్చె దరు. 'రాకి పెల్లరు', 'మార్గన్‌' మొదలైన యపారవ్యాపారుల మంత్రులకు మన జమీన్‌దారుల కన్న నెక్కువ యాదాయమున్నది. ఇట్లిచ్చుట దుర్వ్యయమా? కాదు. ఏలన, కూలికి మించిన పనితేలెనేని కూలి యధికమని యెట్లు చెప్పవచ్చును! మంచివస్తువు గావలయునన్న మంచివెల యీయ వలయును. అట్లుగాక దానధర్మముగావచ్చి నావద్ద పాటు పడుడీయని బ్రతిమాలుట పేడిమాటగాని మగతనపు లక్షణముగాదు. దానధర్మముల నాశించి బ్రతుకువానికి నికృష్టములేకాని యుత్కృష్టములు దక్కవు. అట్టి యెంగిలి బ్రతుకునకన్న చావు మంచిది!