భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - ఆరవ ప్రకరణము
ఆరవ ప్రకరణము
సంశ్లేష విధానములు
సంశ్లేషమనగా కూడిక. ఇది పరిపరివిధమ్ములు. అందొక్కటిమాత్రం పూర్వము వివరింపబడియె. ప్రకృతము సంశ్లేషతత్త్వము నామూలాగ్రముగ బరిశీలింతము. ఈ విధానముల పరంపరయు జరిత్రమును నెయ్యవి యనిన:-
సంఘీభావ తత్త్వము
మనుష్యవర్గము సమూహముగా నేర్పడుటకు వారిస్వభావమే ముఖ్యకారణము. మఱియు, తేనెటీగలు, చీమలు మొదలైన జంతువుల నడవడింబట్టి చూడ సంఘీభావము వానికిని సామాన్యంబనుట విశదమగు. ఈ గుణంబేల యలవడియె?
ఏకాకిగానున్న భూతములకు సహాయంబు చాలమి శత్రువులచే వినాశంబు సిద్ధంబు. మఱియు నొంటరితన మెంతము దిరినను మృగములయందైనను స్త్రీ పురుష సమాగమంబు లేనిది వంశంబు నిలువదు. కావున ప్రాణసంరక్షణమునకు సంశ్రయంబు ప్రధానంబు.
జీవరాసులలో కామంబు సహజగుణంబు. కామముయొక్క ముఖ్యోద్దేశము జాతి ప్రాబల్యము. ఒక్క కామముదప్ప నింకెవ్వియు లేనిచో బిడ్డల గలిగింపగలముగాని కాపాడలేము. కావున కామముతోడ వాత్సల్యమును గలిసియుండును. పక్షులుసైతము పిల్లలు పెరుగుదాక వానిబోషించుటయందు సహజమైన యాదరముం బూనినవిగా నున్నవి. మానవజాతిలో నింకను విశేషించి యీ ప్రేమ కుటుంబము, వంశము, దేశము, ఇత్యాదులయందలి యనురాగముగా బరిణమించియున్నది. ఈ యనురాగము స్థిరమైయుంటకు నది యనవసితమై యుండుట ప్రాణావశ్యకమగుటయే కారణము. ప్రీతి, కామము మొదలైనవి చిత్తగతములు. చిత్తము అతి చంచలము. ఈ చంచలత్వమును నిరోధించునవి, ప్రాణరక్షణమునకు సాధనములైన యార్థిక స్థితిగతులును, శత్రు నిరాసనకారియైన యన్యోన్యతయు, వీనియొక్క నిర్బంధము లేకున్నయెడల నేడు ప్రేమింతుము. ఱేపుగలహింతుము. ఒకప్పుడు కూడుదుము. వేఱొకప్పు డెడబాయుదుము. సంఘీభావము దృఢమై యుండదు. సంఘోద్ధారణ క్రియను భరించునవి ప్రాణరక్షణ క్రియలు.
మఱియు నొక విశేషంబు. ప్రాణము లశాశ్వతముగా నిల్పు చర్యలన్నియు మొత్తముమీద నాహ్లాదకరములు . కామంబు వాత్సల్యంబు నత్యంత సుఖదాయకంబులని వేఱుగ జెప్పవలయునా? ఇవి యెల్లరు గుర్తించునవి. బిడ్డకు పాలిచ్చుటలో బిడ్డకు సుఖమే. తల్లికిని సుఖమే. సంఘపరమైన కార్యజాతంబు లుభయపక్షంబులకు సంతోషమే నొసంగునవి. కావున సుఖములు గర్హ్యములనువారు ప్రాణహింస యను వ్రతము దాల్చినవారు గాని కరుణామయాత్ములు గారనుట సత్యము.
సహజేచ్ఛాప్రధానమైనది దాంపత్యము. దీనిసృష్టికి కాలము మూలమైనను, స్థితికి నార్థికవ్యవహారము లాధారములు. ఎట్లన్న, కామము పలుపోకల బోవునది. ఒకయెడ స్థిమితమై యుండునదిగాదు. ఇట్లు పలుతెఱంగుల సంచరించునదియైన కుటుంబము లేర్పడవు. కుటుంబము లేర్పడవేని కృష్యాదిక్రియలు వెలయవు. కృష్యాదు లసంభవములైన భుక్తికిలేక చత్తురు. కావున కామమునకు నిలుకడ నిచ్చునది జీవనోపాయము. వివాహమాడుటయేల? భార్యాభర్తలు ప్రాణపోషణమున నన్యోన్య సహాయకర్తలగుటకు. ఈ సహాయ మనావశ్యకమైనచో లోకమెల్ల రాసక్రీడయం దభిరుచిగలిగి యేచింతయు లేక మనవచ్చుగదా! రాసక్రీడకు విఘ్నకారి యుదరభారము. కలి కాలములో నమృత మలభ్యమయ్యెనని కొందఱు మొరలిడెదరు. వారు బుద్ధిహీనులు. ఆకలి, తృష్ణ, ఇత్యాది వ్యసనము లస్తమించిన లోకములో పెండ్లాలుండరు. అందఱును భోగపుసానులగుదురు. కావున గృహస్థధర్మములకు దావలములు ఆర్థిక ప్రయాసములు.
బలాత్కార సంశ్లేష
పూర్వకాలమున చిల్లరచిల్లరతెగలు, అమేయములుగ నుండినందున సదా యుద్ధములు నడుచుచు దినదినాచారములలో జేరినవిగా నుండెను. పరాజయము నొందినవారల బానిసలం జేయుటయు బ్రసిద్ధము. భారతములో షోడశరాజుల చరిత్రలు చదివినవారెల్లరు, అప్పటిభూపతులు వేనవేలు స్త్రీ పురుషుల బ్రాహ్మణాదులకు దాసీదాస జనంబులుగా కోళ్ళను గొఱ్ఱెలను మనము బహుమానమిచ్చు నటుల దానముజేయుట దలపోసి, యిట్టి దౌర్భాగ్యకాలములు వర్ణనీయ యుగములాయని యాశ్చర్యపడి యుందురేమో! శత్రువుల యొక్కయు దుదకు ప్రజలయొక్కయు స్వాతంత్ర్యములం గొల్ల గొట్టుట పెద్దలనాటి పరమ ధర్మము. ఈ రీతుల జనులను దమకు లొంగునటులుచేసి వారితో బని జేయించు కొనుటయు నొకవిధమైన యార్థిక సంశ్లేషయ. దీనికి 'నిర్బంధ సంశ్లేష' మనిపేరు. భార్యలును సేవకమండలిలో జేరినవారుగ వగవబడినవారగుటచే వివాహముల యందును బలముం బ్రయోగించుట యపుడాచారముగ నుండెను. ఆనాళ్ళ ప్రభావములింకను నశింపక మనలో నిలిచియున్నవి.
రానురాను బలాత్కార సంయోగములు క్షీణతకు వచ్చినవి. కుల, వర్ణాది బంధనము లింకను వీడకున్నను, పూర్వమట్లు ఇవి నేడభేద్యములుగావు. సంఘము, కులము, వేదములు మొదలైన వానిచే వృత్తులు మునుపటివలె సంపూర్ణముగ నిర్ణీతములౌట వర్తమానమున పొసగని మర్యాద. స్వతంత్ర సంశ్లేష
ఇపుడు జనులిచ్చవచ్చినట్లు వృత్తుల నవలంబింపవచ్చును. శిల్పులును నిచ్చ వచ్చినవారి కొలువులో జేరవచ్చును. పారతంత్ర్యం, అస్తమితముగాకపోయినను పడమటి దిక్కు వ్రాలియున్నది. స్వాతంత్ర్యము, ఉచ్చస్థానమున లేకున్నను, ఉదయాద్రినైన నెక్కినది.
మిక్కిలిగా జ్ఞానము స్వతంత్రతగలిగి మెఱయు దేశముల నార్థిక సంశ్లేషణము మొత్తము మీద నొడంబడికలచే గుదిరెడు. ఇట్లు స్వేచ్ఛమైగలసిన గుమికి నాయకులు మూల ధనము నిర్మాణశక్తియు గలిగిన యజమానులు. ఉద్యమములకు వలయుపాటు నొసంగువారు బేరమాడి కూలి నలవరించుకొని నిలుచు జీతగాండ్రు. స్వతంత్ర వర్తనా పరిశోభితంబు గావుననే యీ కాలమున ననిరుద్ధ స్పర్థ దీపించియుండుట.
స్వతంత్రత నేటికిని బరిపూర్ణస్థితికి వచ్చినదిగాదు. ఎట్లన, బీదలుగ నుండువారల నిర్బంధించి హీనవేతనములకుం బనిచేయు నట్లొనరించుటకు ఋషి ప్రోక్తములు, రాజప్రోక్తములునైన శాసనములు లేకున్నను కడుపాత్రమను క్రూరవిధి యున్నది. ఒక్క కడుపాత్రమేనా? అజ్ఞానమునున్నది. యజమానులతో సరినిలిచి నియమముల సేకరించుకొనవచ్చునను అనుమతియున్నజాలునా? శక్తియు నుండవలదా? స్వాతంత్ర్యము నకు సమత్వము ప్రధానము. సమత్వము లేనిదయ్యెనేని స్వాతంత్ర్యము పేరునకు నిలిచియుండునేగాని యాచరణ పాత్రంబుగాదు. పశ్చిమఖండములలో నీసమత్వము సర్వసాధారణముం జేయుటకై యనేకులు సాహసము గొనియున్నారు. వారిప్రయత్నములు క్రమముగ పండునకు వచ్చుచున్నవి.
సమత్వసిద్ధికై చేయబడిన యుపాయముల జర్చించుటకు నిది సమయము గాకపోయినను సూచనగ గొన్నింటినైన భావవైశద్యమునకై తెలుపుటమంచిది. అవియెవ్వియనిన:- సర్వజనులకు నిర్బంధ పూర్వకముననైన గొంతవఱకును జదువుసెప్పుట, యజమానులు నిర్హేతుకముగ సేవకుల బనినుండి నివర్తించిన వారిచే నష్టమిప్పించుట, యజమానులకును సేవకులకును జీతము కర్మకాలము మొదలైన విషయములంగూర్చిన భేదములుపుట్టిన సర్కారువారు వానిని విచారించి సమాధానముంజేయ బ్రయత్నించుట, కొన్నికళలలో సర్కారువారే కనీసము కూలినివిధించుట, కర్మశాలలం బరీక్షించి దేహారోగ్యకరములైన యేర్పాటుల స్థాపించుట, స్త్రీలు, బాలప్రాయమువారు, మొదలైన హీనబలులను విశేషించి శ్రమింప జేయకుండునటుల యజమానుల నుక్కడంచుట. ఇవన్నియు రాజ్యకృత్యములైన నియమములు. ఇవిగాక కర్మకరులు తమలోదామే యనుష్ఠించు పద్ధతులుం గలవు. అవి యెవ్వి యనిన, శ్రేణులుగట్టి సమూహముగా బేరములాడుట. యజమానులేల, యుత్పత్తి, వర్తకము, ఇవియన్నియు మనమే చేయుదమని నాయకుల నేర్పఱచుకొని కళలనడుపుట. దీనికి నిరీశ్వర వ్యవహారమనియు సముచ్చయ వ్యవహారమనియు నామములు. రాజ్యమును బాలించు నాలోచనా సభలకు దమకుం జేరినవారినే ప్రతినిధులుగా బంపుట ఇత్యాదులు.
ఈ రెండువిధములైన యుపాయములయు సామాన్య లక్షణంబు లెవ్వియన:-
1. రెండును మాత్సర్య నిరోధిమార్గములు. అనిరుద్ధ స్పర్ధ నవరుద్ధము జేయు నుద్యోగము గలయవి.
2. రెంటియందును నాయకత్వము సంఘమున కారోపింప బడియున్నది. చూడుడు! స్పర్ధనాప వలయునన్న నాయకత్వము ప్రధానం. అందఱును స్వేచ్ఛావర్తనులైన దానిచే సిద్ధించునది మహోత్పాత కారియైన యరాజకము. కావున స్పర్ధయు స్వాతంత్ర్యమును నిరర్గళముగ నేడేశములను నేకాలము నను గలిసియుండుట కూడక పోవుటయకాదు, అసంభవమును. అట్లగుట యోచింపవలసిన విషయ మేమనగా, నాయకత్వము తగునా తగదా యనుటగాదు. అది యుండియే తీఱవలయు. మఱి యెవరియెడ నుండవలయుననుట.
దీనింగూర్చిన వాదము లనేకములున్నవి. వానినెల్ల నొక్కయెడ బొందించుట కనువుగాదు. సంగ్రహముగ నొండు రెండుం బేర్కొనెదము.
వ్యక్తివాదము
కొందఱు నాయకత్వము ప్రతివానిం జెందియుండుటయే యుత్తమమని యాదేశించెదరు. ఈ మతమునకు వ్యక్తివాదమనిపేరు. వ్యక్తివాదమునకు నాధారములైన కారణము లెవ్వియన:-
1. ఇండియా, చీనా ఇత్యాది ప్రాగ్దేశములలో ప్రజలకు రాజ్యతంత్రాది విషయములయందు స్వాతంత్ర్యము లేకపోవుటంబట్టి యా దేశము లభివృద్ధినందక నూతనోద్యమములకుంబూనక యెండి మాడి మసియై యుండుట యఖిలజనవేద్యంబ. ఊపిరి యాడకుండునట్లు, ఆచారములచే నావరింపబడినవారి కేగతిగల్గునను విచారమునకు దార్కాణముగ శుష్కశరీరముందాల్చి ప్రాచివారైన ప్రాచీనులు ప్రశాంతులై పరాకు పల్కుచున్నారుగాన, వారిఘోషయైనవిని నేర్చికొనుట కర్తవ్యము.
2. తమతమ శక్తికొలది నార్జన వినియోగములందు ప్రవేశము లేనివారైన నర్థమ్ము లుత్కటములుగ జేయగడగు వారుందురా? నేసంపాదించినదానిని నాయిచ్చవచ్చినట్లు సెలవుజేయు స్వామ్యము నాకుం బాపితిరేని నేనేల యెక్కువ గడింతును? నాకూలివారికి బేరముకొలది సంబళమిత్తును. ఖండితముగా నింత యిచ్చియే తీరవలసినదని శాసించితిరేని నది శాస్త్రరూపమైన కొల్లగాక మఱేమి?
3. ఈ పద్ధతిచే గీడుగలుగుననుటయు నసత్యము. ఎట్లన, యజమానులమైన మేమును నొండొరులతో మత్సరించుటంజేసి వ్యాపారము ననుసరించి కూలిహెచ్చుటయుం గలదు. లాభముగోరిన శిల్పులపాటు గోరవలయు. మావైరులు శిల్పుల నందఱను జీత మెక్కువచేసి తమ యధీనతకు నాకర్షించి కోజూతురు. మేమును నట్లే చేయజూతుము. మాసందడిలో కర్మకరులకు గతులు మోక్షములు తమంతట సిద్ధించును.
4. మఱియు సమత్వమునకు స్పర్ధ కారణముగాని మీరన్నట్లు స్పర్ధకు సమత్వము కారణముగాదు. హిందూదేశములో స్పర్ధలేదు. సమత్వమున్నదని యెట్టిపిచ్చివాడైన బలుకడు. ఇంగ్లాండులో స్పర్ధ యుండుటచేత నానాటికి సమత్వము హెచ్చుచున్నది. ఎట్లన, ఈ వ్యాపారములో నమితలాభము తటస్థించినదనుకొనుడు. విచ్చలవిడి, వృత్తులకుం గడంగుట మనయాచారముగాన నీలాభముచే బ్రేరితులై యనేకులీదిక్కువత్తురు. దానిచే పోటీహెచ్చి సరకులు బలసి లాభముల బక్కవడజేయును. అట్లగుట సమత్వ మలరారు ననుటగాదే?
5. ఇంకను నొకటి, అనర్గళమును నప్రమేయమును నిర్ణిద్రమునైన స్పర్ధను మే మాసించిన వారము గాము. ఆసించినను నది యలవడునదికాదు. మాసిద్ధాంతమేమనగా స్పర్ధ యెంతయెక్కువగనున్న నంతమంచిది. ఇదియ సమాధానమైన నొంకొకరీతిని విన్న వించెదము. అనివార్యమైనయెడలదప్ప శిక్షవిధించుట న్యాయంబుగాదు, అనగా నవరోధకము లెంతతక్కువగనున్న నంతమేలు.
సమష్టివాదము
సంఘ శ్రేయస్సునకు బాధకంబగుటవలన ననవరోధ స్పర్ధ తగదనియు, నద్దానిని సంఘము, ఆత్మీయక్షేమానుకూలముగ నిరోధించుట యుక్తమనియు, సంఘమునకు నాయకత్వంబిచ్చి పట్టాభిషేకంబు జేయజూచుటకు "సమష్టివాదం" బని పేరు. దీనికి నాసికగానుండు హేతువుల వివరమేమన:1. సంఘము శరీరము. ప్రజలు దానింజెందిన యవయవములు. క్రియలయొక్క ఫలంబులు. ప్రజలతోబోక సంఘము నావేశించుంగాన నాక్రియల నిర్దేశించు నధికారము సంఘమునకుం జెందవలయుననుట ధర్మము.
2. అమితస్పర్ధ యరాజకముతో సమానము. అరాజకమునకన్న మించిన యనర్థము, ఎయ్యదియు గానము.
3. వర్తమానమునందలి యార్థిక ప్రపంచమున బీదలకు బ్రదుకు కష్టము. అనిత్యము. స్పర్ధచే సమత్వము సిద్ధించుననుట బొంకు. బలాఢ్యుల పోటునకు దాళలేక బలహీనులు సమయుదురు. బలములేనివారెల్ల సమసిపిదప బలవంతులలో సమానపదవి పదిలమగునేమో! అట్టి ప్రళయకాలపు టీడుజోడుతనము మాకెవ్వరికిని వలదు!
4. ఇంతియ కాదు. స్పర్ధ తేలువంటిది. తన వినాశ హేతువును దనగర్భమందే ధరించిన వికారి. అయ్యది నైజముగ నేకేశ్వరత్వమున సమాప్తినొందును.
5. మేమును శుద్ధముగ స్వాతంత్ర్యము స్పర్ధయు దగదనువారముగాము. మఱేమన్న సంఘమున కేమాత్రముమేలో యావఱకును దానిని శాంతింబొందజేయుట శుభకరంబనుటయే మామతము.
వ్యక్తి సమష్టివాదులకుండు పరస్పరమైత్రి యేమనగా?
ఇరువురును సంఘము యొక్క మేలు మనమంచికన్న పరమ ప్రయోజనంబను వారే. మఱియు నపారములైన స్వాతంత్ర్య పారతంత్ర్యములు రెండును, అననుష్ఠేయములను వారే.
మఱి వీరికింగల భేదముయొక్కవిధం బెట్టిదన, స్పర్ధను మేమాత్ర మెవరిచే నిరోధింపజేతమను నీతివిషయమ్మున.
వ్యక్తివాదులు స్పర్ధానిరోధ మల్పమాత్రము చాలుననియు, ఆయడ్డగింపు సహజముగ స్పర్ధచేతనే కలుగునుగాన నూతన నాయకులను వెదకి యందు బట్టంబు గట్టుట తెలివిమాలిన తెఱంగనియు నివేదించెదరు. సమష్టివాదుల యభిప్రాయమువేరు. సంఘ నాయకత్వముం, దాల్చి యార్థిక క్రియల నడిపింప వలసినదనియు, మాత్సర్య స్వాతంత్ర్య విహారముల విశేషించి యుపశమనమ్మునకుం దెచ్చుట యిమ్మనియు దృఢనిశ్చయులైయున్నారు.
ప్రస్తాప వశమ్మున బేర్కొనబడిన యిరుపక్షముల యొక్క లక్షణములు సంగ్రహముగ వివరింతము.
1. సమష్టియనగా మనమెద్దాని యంశభూతులమై యున్నామో యాసమూహము. సమూహములు బహువిధములు. కుటుంబము వర్ణము, రాజ్యము ఇత్యాదులు. ఇందు సర్వసమూహములకును రాజ్యమునకును బ్రకటమైన వ్యత్యాసమొండుగలదు. కుటుంబమున బెద్దలు చెప్పినట్లు వినకపోయిన గలహములు మెండగును. మనస్తాపములు పుట్టును. రాజ్యాంగమువారు శాసించునట్లుండక మీఱి వర్తింతుమేని నొక్క మనస్తాపముతో ముక్తిదొరకదు. అపరాధములు, కారాగార ప్రవాసము ఇత్యాది శరీర తాపములును వదలక వచ్చి చుట్టుముట్టును. ఈ వ్యత్యాసముయొక్క స్వభావము నిర్వచించురీతి యేదన, రాజ్యాంగమువారి యధికారములకు దండనీతి నిదానము, తక్కుంగల సమూహములు దండనీతిం బ్రయోగింప సమర్థములుగావు. మఱి సామాది యితరోపాయములు వారికి నిదానములు . దృష్టాంతము. తండ్రియొక్క వచనంబుల నుల్లంఘించితిమేని నాతడు మొగము చేవురించుకొని, నాడు భోజనము చేయకుండుట, భార్యను గద్దించుట. మనతో మాటాడకుండుట ఇత్యాది దారుణ కార్యమ్ములతో దృప్తిజెందును. పన్నుల జెల్లింప కుందుమేని ప్రభువులు మనసొత్తుల జప్తిచేసి లాగికొని పోదురు. క్షాత్రవిధులచే నుజ్జ్వలములు గావుననే రాజశాసనముల యందు మనకు భక్తియెక్కువ. పూర్వము వర్ణ ధర్మములు సైతము రాజ ధర్మములుగా నుండినందున వానిని విధిలేక భయముచే బాటించిన వారమైతిమి. ఇపుడు బ్రిటిష్‌వా రీయాచారములు రాజరక్షకు ననర్హములని దండనీతి బాహ్యములం జేసినందున వానియందలి యాదరము చదువులు కలుములు వెలయు పట్టణ వాసంబులలో పంచ బంగాళమై పాఱిపోవుచున్నది.
అట్లగుట, సమష్టి ప్రచారముల నేరీతి స్థాపింపనగును? రాజ్యాంగ మూలముగనా, సామాన్య సమూహముల చేతనా? యను ప్రశ్నకు గొందఱు ప్రభుమార్గము నవనియు గొందఱు ప్రజామార్గమున ననియు నుత్తర మిచ్చెదరు.
ప్రభుమార్గ సమష్టివాదులు, ప్రజామార్గ సమష్టి వాదులు, అని సమష్టి ప్రచారము లుత్తమము లనెడవారు విభాగింపబడియున్నారు. క్షాత్రవిధిని సామాన్యరీతిని జేయబడిన సంస్కారముల నిదివఱకే వినిపించితిమి. వీనియొక్క యంతరువుల నిర్ణయించుట కిదిగాదుతఱి. అయిన నొక్క విన్నపము. వర్తమానమున సమష్టి ప్రచారము రెండు తెఱగులను నడువ నారంభించినది. ఈ మార్గములు పరస్పర విరుద్ధములు గాకపోవుటచే నట్లు సాగుచున్నది. మఱియు బశ్చిమదేశము లలో బ్రజాప్రతినిధులే పరిపాలకులు గావున బ్రజాప్రభుమార్గము లేకీభావమునకువచ్చు జాడగలవియై యున్నవి. ఈ కారణములచే నవిభిన్నములయ్యు నన్యోన్యమైత్రి గలవియ యని యెఱుంగునది.
ఎట్లును, ఇంతదూరము చెప్పితిమిగాన సమష్టివాదులం గూర్చి యింకను నొక్కింత వక్కాణించి విరమింతము.
ఆధునిక సంఘస్థితిని ఖండించుటలో వీరెల్లరు నేకవాక్యముగా నున్నారు. వీరి మతప్రకార మైరోపాలోని ముఖ్యదోషము లెవ్వియనిన:-
అమితస్పర్ధ - అనిరోధస్వామ్యము
స్వామ్యంబనగా దనసొత్తులయందు దనకుగల సొంతము. ఇయ్యది యాధునికమున నిరాఘాటముగ నున్నదని చెప్పవచ్చును. పరిపూర్ణమైన స్వామ్యము దుర్లభము. ఎట్లనగా, మనయొక్క హక్కులెంత దుర్భేదము లైనను సర్కారువారి కొకభాగము నరికట్ట వలయుననుట యనివార్యమైన కార్యము. ఈ పన్నులు కట్టుటయేల? పన్నులు గట్టకున్న రాజులకు నాదాయము లేకపోవును. అట్లైన సైన్యము మొదలగు ప్రకృతుల నుద్ధరించుటకుగాదు. రక్షణక్రియ వెలయదు. రక్షణము లేనిచో సంఘమును దుదకు సాంఘికులును క్షీణతకువత్తురు. సంఘంనకు దండంను దండంనకు ద్రవ్యమును శరణ్యములు. ఈతత్త్వం యొక్క ముఖ్యార్థ మేమనగా దనకు నధీనములైన వస్తురాసుల యందును రాజునకు, అనగా సంఘమునకు హక్కులేక పోలేదనుట. కాననేగదా నిరాఘాట స్వామ్యంబు మృగ్యంబని యంటిమి. అట్లుండినను మొత్తముమీద నాది నీదియను కర్తృత్వము నిరవధికమై ప్రకృత మున్నదనుటకు సందియంబేల?
స్వామ్యము స్పర్ధకు నుద్ధారకము. ఎట్లన నాసంపాదితార్థము నూరివారి కెల్లరకు బంచిపెట్టవలసినదని వ్యవస్థ నేర్పఱచిన నేనేల త్రికరణశుద్ధిగ నుల్లాసముతో బనిజేతును? తనదని మనియుండ వెరవుంటం జేసికాదె కూడబెట్టుటకు నరుండు గడంగుట? అటుకాని యెడ, మొగము వ్రేలవేసికొని వేదాంతములకు దిగడా! కావున నర్థార్జనోత్సాహమునకు స్వామ్యము భద్రమైన మూలము. ఈ ఉత్సాహముయొక్క మూర్తులలో మాత్సర్యమనునది యొకటి. స్వామ్యము వలన బ్రోగుచేసి రాసులు గట్టుటలో ఫలమున్నది. ఈ ఫలంబుండుట చేత నాసలు స్పర్ధలు జ్వలించుచున్నవి.
కావున నిర్వక్రవైరము సమంజసము గాదనువారు, అఖండ స్వామ్యము ఖండితముగా గూడదని వాదింతురు. ఇయ్యది సహజమ కదా! ఈ వాదమునకు బ్రత్యాఖ్యాన మెద్దియనిన:-
స్వత్వముచే స్పర్ధ యుత్కటమౌట నిజమ. ఇందుచే గొందఱమితముగ సంగ్రహింతురు. కొందఱకు వస్తువులు చాలకపోవును. అత్యార్జనము, అనార్జనము నను బాధలకు నియ్యది యాకరము. ఉండనిండు! ఐనను తనదియను నిశ్చయములేకున్న నెవ్వడును బాటుపడడుగదా! పాటు పూజ్యమైన ఫలము పూర్ణానుస్వారమగును. ఇపుడు గొందఱకైన సుభిక్షసిద్ధియున్నది. స్వామ్య విరహిత స్థితియందో దుర్భిక్ష మెల్లరకు సామాన్య మగును. ఈ క్షామ సమత్వము శ్మశాన సమత్వము.
మఱియు స్పర్ధలేనిది వృద్ధి యుండదు. స్పర్ధచే ముప్పులు గలుగక నానవు. నిరంజనత భూలోక వాసులకు నలభ్యము. మీరుగోరు పరిపూర్ణ సుఖసంకీర్ణమైన స్థితి యసాధ్యము. మించిన దానికై వగచుట పామరగుణము. బుద్ధిమంతులు నైజములు ననివార్యములునైన స్థితిగతుల ననుసరించి కూడినంత సౌఖ్యముంగొని యంతటితో దృప్తివహింతురు. లేనిదానిని దెచ్చిపెట్టుమని యేడ్చువారు బాలిశులు. చూడుడు! బలపరాక్రమములు గణ్యములందురు. దీనివలని ప్రయోజనంబేమి? శత్రు భంజనము. "అయ్యో! వారు చచ్చుచున్నారే! వారిభార్య లెట్లలమట బడుదురో" యను పరితాపంబునంజేసి పరమశాంతిపరులమైయున్న నీసుగుణములు ముందునకు రావు. శత్రువులును మనయట్లే యహీన మార్దనపరులైనసరే. లేకున్న మనకుం బ్రాణమానంబులు దక్కవు. అందుచే నాత్మహింసయు సంఘహింసయు జేసినవారమగుదుము. కావున నేమాలిన్యమునులేని మంచిగతులు కావలయుననుట మనసు మెత్తందనముం జూపునదియైనను జ్ఞానశూన్యతయు జూపునదియ. నీడలేని వస్తువులులేనట్లు లోపములులేని పరిపూర్ణత లెట్టిపట్టుబట్టి వెదకినను దొరకవు. దీనికి సమష్టివాదు లిచ్చెడు ప్రత్యుత్తర మేమనగా:-
మనుష్యుడు తనమేలే చూచుకొను కూళమృగముగాదు. పరులయెడ పశ్చాత్తాపము నుపకార ప్రసక్తి యనునివియు వానికి సహజముల, కావున దనకైమాత్రము పాటుపడుననుట తప్పు. ఫలము లితరులం జెందినను పాటుపడగలడు. ఎన్నియో దోషములపాలైన యీ కాలమందును నాలుబిడ్డలు, స్వజాతి, స్వదేశము మొదలగు వానియందలి గాఢానురాగంబు కతన బ్రాణములనైన విడువ సిద్ధముగ నెందఱుండలేదు? ఇట్టి సాహసములచే వీరేమి వారు కొనెదరు? కావున నర్థార్జనమునకు బరోపకార బుద్ధియే చాలును. స్వామ్యమనావశ్యకము. అట్లుండియు వర్తమానమున నెందుల కయ్యది తఱుచు వాడుకలోనికి రాకయున్నదనగా సమంచితమైన విద్యయు శిక్షయులేమింజేసి, మనుష్యులు పరిపూర్ణ జ్ఞానులైనచో సంఘ ప్రయోజనమందు దవిలిన మనసులుగలవారై సహజానురాగ భరితులౌదురు. చూడుడు! తేనెటీగలు, అవి సంఘ క్షేమమునకై పాటుపడుచుండుట సర్వజనవేద్యం గాదా? చీమలును నట్టివికదా? ఇట్టివి పరోపకార వ్యాపార పారీణములైయుండగా మనుష్యు లారీతినుండువారేల కాగూడదు? మఱియు బురోవృద్ధియందొక లక్షణముగలదు. అదేదన, కాలక్రమేణ మనుజుల యనురాగములు విస్తరత వహించుచున్నవి. ఆదిని కుటుంబము మీది కలవరమేగాని వేఱొండుగానము. తరువాత వంశములని వర్ణములని యింకను దూరస్థము లైన సమూహముల పర్యంతము యోచనలు వ్యాపించినవి. ఇప్పుడన్ననో వంశమేల, వర్ణ మేల, నేనేల, నీవేల? దేశము ప్రదీప్తముగ నుండినం జాలునను మహామమత యనేకుల నావేశించియుండుట తెల్లమేగద! మఱికొందఱు జాతి మత దేశాది విభేదములం బాటించుటయు బూర్ణుల బుద్ధిగాదనియు సర్వజనులయందును నిశ్చలంబైన ప్రేమజూపుట సనాతనంబైన ధర్మంబనియు, లోకమునంతయు నక్కచెల్లెండ్రుగా గాకున్నను నన్నదమ్ములుగా జూడ వలయునని యొకరాద్ధాంతము హృదయముల గాకున్నను గొననాలుకలమీదనైనను నాట్యమాడించు చున్నారు. ఎట్లును ముఖ్యవిషయ మియ్యది. కాలక్రమేణ, లోకము పక్వమగుచు రాను రాను, ఉపకారబుద్ధి అహమున నాటియుండునదియైనను తీగవలె దూర దూరమ్మున వ్యాపించి యన్నిటియందును బ్రాకుస్వభావము గలదిగా నున్నది. స్వోపకారబుద్ధి క్షయమును, పరోపకార బుద్ధి వృద్ధిని గనుచున్నవిగాన సంఘపరానురాగం బొకానొకప్పుడు వెన్నతోడ వచ్చిన గుణంబౌట సిద్ధము. పూర్వమట్లు తెగినవారుగాక యానసౌకర్యాది సాధనముల యనుకూలతం జేసి సాంఘికులందఱు కరుడుగట్టిన ట్లేకవస్తు భావముం దాల్చియున్నారు. కావున బ్రత్యేకముగ ఫలము లనుభవింపంగోరుట నానాటికి గృశించు హీనగుణము. దీనికి బ్రత్యామ్నాయ మేమనిన:-
నిశ్చయమే. పరోపకార బుద్ధియు స్వతస్సిద్ధమైయున్నది. అది వికసించి ఎల్లెడల దానయైయుండిన మీప్రసంగములు లేకయె మేమును తేనెటీగలౌదుము. కావున మీబోధ యపకృతము. ఆనాటిమాట యానాటికి. నేటికేల? కాశిలో దొంగిలింప వలయునన్న రామేశ్వరము వద్దనుండి వంగుకొని పోవలయునా? ఈ వాదము లిప్పటికింత చాలును.
సమష్టికి నాయకత్వంబు గుదుర్పవలయు ననువారల వర్గంబు లెవ్వియన?
1. కొందఱు సొత్తులయం దెవ్వరికిని బ్రత్యేకాధికారము లేకుండ సర్వజనసామాన్యముంజేయ నుప దేశింతురు. వీరిమతమేమనగా, సర్వానర్థములకును స్వామ్యమాలవాలము. కావున సంఘమును వేఱులతో బెఱకి మేము కాంక్షించు తీరున నుండు స్థితిలోనాటిన నేయవస్థకుం బాత్రంబుగాక పెఱిగి యయ్యది పుష్పఫలోపేతంబై నిఖిల ప్రజానంద కారియగును. స్వామ్యమును గత్తరింపక యెన్నిదోహదము చేసినను, అంటులు గట్టినను, నిర్దుష్టములైన సుఖంబులు చేకూరవు. సంఘసామాన్యములై యర్థంబులుండెనేని పరోపకారబుద్ధితో మాత్రమందరు బాటువడుదురు. మఱియు దొంగతనము మొదలగు దురుద్యమంబుల కెవ్వండునుబోడు. ప్రత్యేకముగ నాస్తులు పాస్తులుంటచే దురాశలు దౌష్ట్యములు నావిర్భవించినవి. ఇదిలేనిచో సైన్యములేల, పోలీసువా రేల, వక్కీళ్ళేల? రాజులకు రక్షణక్రియ ముఖ్యధర్మమట! ఈ రక్షణక్రియ యనవసరంబగును. వీరికి సమూల సంస్కారులని పేరు.
2. మఱికొందఱు మీదివాదముల నింకను పొడుగుచేసి రాజ్యాంగమునకు కురిత్రాడుగా జేతురు. ఎట్లన, సంఘసామాన్య స్వామ్యముమాత్రము పదిలపడెనేని రాజ్యాంగమువా రనావశ్యకమని యంటిరిగదా! కావున సర్కారును నిర్మూలముజేయుదము. మఱియు బ్రజాపీడకములైన స్థితులన్నియు దొరతనము వారు, మతగురువులు, ఇత్యాద్యధికారులచే వచ్చినవిగాని స్వతస్సిద్ధములుగావు. ఆచార్యులైనవారు తమకు ననువైన యానాచారముల నెల్ల సదాచారములని ప్రజల మోసపుచ్చుట నెవరెఱుంగరు? దొరలునట్లే. కావున నాయకత్వమె తగదు. పశుపక్ష లేలికలులేక స్వభావముగ వర్తించుచు సుఖంబుగ నుంటజూడమా! కావున సంఘమునకు మఱి యెద్దానికిని నధికారమిచ్చుట మన తలమీద మనమే దుమ్ముకొట్టుకొన్నట్టు. అందఱును నిర్ణిద్ర స్వాతంత్ర్యులమై మెలంగుటయ కర్జంబు. ఇట్లు వాదించువారి కరాజకవాదులని పేరు. చూడంబోయిన వీరివాదము వ్యక్తివాదముతో నేకీభవించునది.
3. మఱియు గొందఱు, ఉన్నదానిని సవరించుట నీతిగాని, మేఘముల నీళ్ళనునమ్మి దొన్నెలోని నీళ్ళు పాఱబోయుట నీతిగాదు. మఱియు నిప్పటి యార్థికస్థితియందే కర్తలు కార్మికులు శ్రేణులు గట్టుచున్నారు. ఇట్లే శ్రేణులు ఘనతరములై విస్తరించుచుబోయిన నొకానొకప్పటికి సంఘమెల్ల నేకశ్రేణి యగును. గవర్నమెంటువారనేక వృత్తులను సర్కారుద్యోగముల మాడ్కి దామే నడిపించుటయు నిప్పుడు గలదు. హిందూదేశమున రైల్వేవ్యాపారం, ఉప్పువ్యాపారము సర్కారువారి యధీనమైనవి. ఈ రీతినే యన్నియు నేల కాగూడదు? అట్లైన ప్రజలందఱు నుద్యోగస్థులౌదురు. సంఘముచే రాజ్యాంగముద్వారా ప్రచోదితములైనక్రియల నాచరించి నియమిత వేతనములతో దృప్తిజెంది యేస్పర్ధయు లేక యమందా నందులౌదురు. కావున రాజ్యతంత్ర ములను విస్తరింపజేసి సర్వము నాక్రమించునదిగా నొనర్చుటయే మంచినీతి. దానిని గృశింపజేయుట మొదటికే మోసము; అని వాదింతురు. వీరికి సామాన్య సమష్టి వాదులనిపేరు. ఆధునికస్థితి తనంతట సహజముగజెందు పరిణామమే మంచి చికిత్సయనువారు. వీరి మతప్రకారము గవర్న్మెంటువారికి బ్రధానలక్షణము దండనీతి కాదు. మఱేమన్న, వర్తక సంఘములలోని చోదక మండలియట్లు వ్యాపార పారీణులైయుండుట.
ప్రజలే విజృంభించి ఈ సంస్కారముల నెఱవేర్ప వలయుననుట యీ మూడు వర్గముల వారియు సామాన్యమతము. ఇది కొందఱకు నసమ్మతము.
4. ఎట్లన, జనులెల్ల రేగిరేని సంఘమరాజకమై చిందర వందరలౌనని యనేకులు భయపడి "రాజ్యాంగమువారే సాధ్యమైనంత వఱకుం గృతప్రారంభులై యాధునిక స్థితిలోని యకృత్యములమార్చి, చట్టదిట్టములచే నడలుల నుడిపించిరేని, నరులు కష్టదారిద్ర విముక్తులై, యిట్టియాలోచనల పొంతబోక శాంతింతురుగదా! కోపతాపములకు దీనతయే కారణము. దీనత బాయజేసితిమేని నీయుడుకులన్నియు నుపశమించును. చూడుడు! ధనికులైనవారు సంస్కరణంబులేలయని యూరకుందురు. కావున నెల్లరకును భుక్తి బాగుగా జరుగునట్లు పద్ధతులు ప్రకటించిన దొరతనమువారిమీద బ్రజలేల పగగొని దండెత్తుదురు?" అని చెప్పుదురు. ఇట్టివ్యాఖ్యానములం జేయువారిపేరు రాజ్యాంగ సమష్టివాదులు. వీరి ముఖ్యోద్దేశ్య మేమనగా సంతోషమునాపాదించి జనుల కోపాటోపముల సంహరింపం జూచుట. జర్మనీ మొదలగు దేశములలో వీరు కొంతవఱకుం బ్రబలినవారై గణనీయములైన శాసనముల స్థాపించి యున్నారు.
ఈ తెగలయొక్క సిద్ధాంతములను జయసిద్ధులును బ్రస్తావవశమ్మున నచ్చటచ్చట జర్చింపబడును.
సంస్కారచింతల నింతటితోనిలిపి ప్రకృతి మభ్యాసములోనుండు సంశ్లేషముల సవిస్తరముగ వర్ణింప జూతము.