భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - అధిక ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధిక ప్రకరణము

న్యాయశబ్ద నిర్వచనము

న్యాయంబనుపదము నానార్థములు గలది గావున సంధిగ్ధదోషంబుచే బాధితంబు. ఈయర్థముల గణ్యములు మూడు.

1. ప్రకృతి స్వభావము. 2. శాసనము. 3. నీతిసమ్మతము. అనునవి. దృష్టాంతములు.

1. ప్రకృతి స్వభావమునకు, ఉదా. హీనవృద్ధి న్యాయము. ఎట్లన, ఏకమాత్రశ్రమ మూలధనంబు లకు భూమ్యాదుల యుత్పత్తి సాగను సాగను ఫలము తఱుగుచు వచ్చుననుట స్వభావలక్షణము. దీనింగూర్చి ఇది నీతియగునా, కాదా, ధర్మమా? అధర్మమా? యని ప్రశ్నించుట యసంభావ్యము. మనుష్యులచే విధింపబడనిదికావున మనుష్య యత్నముచే నద్దానిని రద్దు చేయుటకుగాదు. దాని బలమును నితర ప్రకృతుల సహాయముచే నాపవచ్చుననుట నిజమేయైనను దానిని లయింప జేయుట మనకసాధ్యమైనవని. ప్రకృతిన్యాయము లన్నియు నీతరగతికిం జేరినవి.

2. శాసనము.అనగా రాజ్యాంగ శాసనమనుట. పన్నులుగట్టుట న్యాయమా యని యడుగుదురేని నుత్తరమెట్లు? అది సహజగుణంబులలో నొకటిగాదు. మనకు కల్పాది నుండి వెన్నంటివచ్చిన కర్మముగాదు. మఱి పరిపాలకులు విధించినందున న్యాయమై వెలయుకార్యం.

రాజ్యాంగ న్యాయములకు ప్రకృతి న్యాయములకును భేదమేమి? జైల్‌ఖానా జుల్మానా, ఇత్యాదులు రాజశాసనమునకుం బోషకములు. అనగా రాజ్యాంగ న్యాయములకు దండనీతి యూతకోల. ప్రకృతి న్యాయములకు మనుష్యుల కృపలు కత్తులును గావలసినవిగావు. అవి స్వశక్తిచేతనే యన్నిటి యందును జెల్లును. అవి యనివార్యములు. అప్రతిహతములు. రాజశాసనముల దిక్కరింప వచ్చును. తప్పించుక పోవచ్చును. ప్రకృతికి మించినడుచుట యసంభవము. దొంగలించినవాడు పోలీసువారికి లంచములిచ్చి సుఖముగా దప్పించుకొని యుండజూచుట యసాధ్యమునుగాదు. అసాధరణమునుగాదు విషము మిక్కుటముగదిని బ్రతుకు దక్కించుకొనవలయునను నాశతో కాలమునకు యమధర్మరాజునకును లంచము లియ్యనెంచు వారెవరు నుండరు: ఏలన, కాలము, యమధర్మరాజు మొదలగు నధిదేవతలు స్వేచ్ఛా వర్తనములేని ప్రకృతులు.

రాజశాసనములు స్వేచ్ఛావర్తనగలవారిచే నేర్పఱుపబడునవి. ప్రకృతిగతులు వస్తువులయు జీవులయు స్వభావము ననుసరించిపోవును.

అది కావున రాజశాసనములంగూర్చి ధర్మాధర్మ విచారణచేయుట సాధ్యమును, కర్తవ్యమును. చూడుడు! మనవారెల్లరు చట్టము లనేకములు నీతిపథములు గావనివాడుటయే ఇందునకు దార్కాణము. అడవుల బశుసంతానములు విచ్చలవిడి మేయగూడదనియు, దొరతనమువారు వలదన్న సభలజేయుట యక్రమమనియు రాజశాసనములున్నవి. శాసనములు గావున నివియొకతీరున న్యాయములు. అనగా న్యాయస్థానములో వీనియెడ నందరును విధేయత జూపుట ధర్మముగాకున్నను గర్మము. జడ్జీలు విచారణ చేయునపుడు చట్టమెయ్యదియని యొక యంశము యోచింతురుగాని, ఆ చట్టము మంచిదా, చెడ్డదా యను ప్రసంగముల పొంతకుంబోరు.

ఇట్లనుటచే శాసనములన్నియు దుర్మార్గములని యర్థముగాదు. మొత్తముమీద నివి సన్మార్గములే. అయినను శాసనములు తప్పక సత్పధంబులన పోవలయునను విధివానికిలేదు.

శాసనములు నేడు ప్రచురమునకు రావచ్చును. రేపు మార్పబడ వచ్చును. ఎల్లుండి మాయింప బడవచ్చును. అవి మనుష్యులకు వశ్యములు. ప్రకృతిన్యాయములు నిర్వికారములు. అనశ్వరములు, అతీతములు, అనగా భావాతీతములుగావు. పౌరుషాతీతములు.

ఈచిత్రమేమనవచ్చును! ప్రకృతి న్యాయంబుంగూర్చి యది సన్మార్గమా, దుర్మార్గమా, యని విచారించుట విపరీత మని యంటిమి. ఇట్టి ద్వంద్వములకు మించినదగుటం బట్టియే యది నిర్వికారి. వికారియనగా మార్పులకుం బాత్రమైనది. ఎద్ది మన ప్రయత్నముచే సంస్కరింప బోలునో యద్దానియెడ మంచిచెడ్డల నారోపింతుము. చెడ్డగనున్న మంచిదానిం జేయజూతుము. మంచిగ నున్న నింకను బాగొనరింపం గోరుదుము. కావున వికారములనగా నభివృద్ధికి ననుకూలించునవియని వ్యాఖ్యానముం జేసిన దప్పులేదు: వికారముల కాస్పదములై యుండుట గౌరవ హీనమా? ఏనాటికిం గాదు. నిర్వికారంబులు జడంబులు. దీనికి హిందువులలో నొక ప్రబలమైన యాక్షేపణ గలదు. ఏదన:- వికారియనగా నభివృద్ధి పాత్రము. అభివృద్ధి యనగా గీడును మేలు సేయుట. మేలును మఱింతమేలు సేయుట ఇత్యాది సంస్కార క్రియాకలాపము. నిజముగాని, సంస్కరింప సంస్కరింప బరిపూర్ణత సిద్ధించుంగదా! పరిపూర్ణత వచ్చినపిమ్మట మరల బరిష్కారమునకు నవకాశమెట్లు? వికార మెయ్యడ నిలువ నేర్చును? కావున నిరంజనత నిర్వికారత, జడత్వమును నిర్వికారత్వమనుట పరిహాసమో పరివాదమోకాని యథార్థతత్త్వంబుగాదు. దీనికై పాశ్చాత్యులు ప్రయోగించు ఖండన మేమనగా:- సరికాని, పైవాదములలో నభివృద్ధికి మేరయేర్పఱుపబడియున్నది. మేరలేకుంటయే యభివృద్ధియొక్క ముఖ్య లక్షణములలో నొకటియని మాయభిప్రాయము. అభివృద్ధియ పారము. చూడుడు! ఉష్ణదేశములలోనుండుమీకు "పనిపాటలెపుడు ముగింపునకువచ్చును? ఎప్పుడు తనివిదీర నిద్రపోదుము!" అను నిరీక్షణములు సహజలక్షణములు. కాబట్టియే మీరు అచలబ్రహ్మ మును - అనగా నిద్రాదేవి - నారాధించుట. చలనము మీకు నాయాసకారణము. వికారము కారముగాన మీరు నిర్వికారస్థితింగోరుదురు. ఇక మాదియన్ననో చలిదేశము. మూల గూలబడి యుండుటలో సుఖములేకపోవుట యొకటియేకాదు. కాలుసేతులు ఘనీభవించి కొయ్యవాఱును. శ్రమించకున్న దేహమున రక్తముపాఱదు. కాబట్టి చలనమెంతయో ప్రకృష్టతమమనుట మాకు సహజమైనమతము. అచలముగా బ్రహ్మముగూర్చున్న నయ్యది పేరులేక పేరిపోవునేమో! కావున మేముపాసించు పరిపూర్ణత నిత్యప్రవృద్ధి యతంబు నమేయంబుగాని స్థిమితంబుగాదు. "నిలుకడ నిలుకడ" యనుట మీతపస్సు. దానియొక్కఫలము ఇంటికడ. మూలకడ. పట్టుపట్టిసాగిన పెఱటింటకడ: కావున నిర్వికారత జడపదార్థముల తక్కువతనముగాని, దైవపురుషులకు నివేదింపదగిన గొప్పతనముగాదు.

మఱియు లోకాచారమెఱుంగరా? ఎట్టిపండితుడైనను బలవంతుడైనను బరిశ్రమ లేకున్న గృశింపక పోవునా! నదు లచలములైన కంపుగుంటలుగావా? అట్లే పరిపూర్ణ భావము ప్రాప్తమైనను బరిశ్ర మములేనిది నిత్యంబగుట దుర్లభము. కావున నిలుకడకును జలనము ప్రధానము! ఈ వింత యెట్లున్నదనగా బొంగరముయొక్క మనోహరమైన యచలస్థితికి గిరగిరమని వేగముగ దిరుగుటయే యాధారమైన మాడ్కి.

శాసనములకు లొంగిపోవుట భయముచేత. ప్రకృతికి లోబడియుండుట విధిలేమిచేత.

మనవారిలో ధర్మశాస్త్రములనబడు వర్ణశాస్త్రములు చట్టములంబోలిన న్యాయములుగాని యుత్కృష్ట మైన తత్త్వమార్గమునకుం జేరినవిగావు. పూర్వకాలమున రాజులచేతను, ఇప్పుడు కులమువారి చేతను బ్రయోగింపబడు శిక్షలును, చిరకాలాభ్యాసము చేత గరుడుగట్టిన వాడుకలును, వీనికి నుద్ధారకములు. ఇంతియేకాని యవి కేవలము సత్యమునకుం జేరిన నీతులుగావు.

3. నీతి. దృష్టాంతము: సత్యము చెప్పవలయునను న్యాయము. ఇచట న్యాయంబనిన ప్రకృతి న్యాయంబుగాదు. సత్యముచెప్పుట విధిలేనిక్రియ గాదనుట స్పష్టము. మఱి రాజశాసనముగాదు. కల్లలాడగూడదనియు, నాడినంత దండ్యులౌదురనియు జట్టము లెక్కడను లేవు. న్యాయంబనగా నిట కర్తవ్యమని యర్థము. అనగా జేయదగినది. ప్రకృతి న్యాయంబుల ప్రకారము తప్పక చేయుదుము. రాజన్యాయము లనుసరణకు దగినవి కాకపోవచ్చును. అనగా నీతిబాహ్యములుగా నుండుటయుం గలదు. అయినను భీతిచే వాని ననుసరింతుము. మీతిన్యాయముల కేరీతిని నడుచుకోవలయు ననుటకు బహిర్నిర్బందములెవ్వియులేవు. చూడుడు! ప్రకృతికి విధేయులమైయుండునట్లు మనల నిర్బంధించునది మనుష్యుల సంకల్పమునకుమీఱిన స్వభావము. ఉదా. కాలుజాఱిన గ్రింద బడుదుము. ఇందు మన యిచ్ఛాశక్తికి నధికారములేదు. అనగా మనము పడరాదనుకొన్నను బడుటతప్పదు. ఇక రాజశాసనములకు విధేయులమైయుండునట్లుచేయు బంధనము దండ పారుష్యము. ఇచ్చట ఇచ్ఛాశక్తికి బ్రవేశమున్నది. అనగా బట్టముల నుల్లంఘింతునని ప్రతిజ్ఞ గొన్న నుల్లంఘించుట కష్టముగాదు. కాకపోయినను గష్టనష్టభయములచే మనస్వాతంత్ర్యము నిరోధింతుము. నీతికి విధేయులమైయుంటకు మన మనస్సాక్ష్యమనబడు సత్యవాత్సల్యముదప్ప నితర నిర్బంధకములు గానరావు. ఇది యంతరంగబంధనము. స్వేచ్ఛాశక్తితో సంబంధముగలది. "సత్యమనుష్ఠింపదగినది. కావున నేను అనుష్ఠింతును" అను సంకల్పములేనివాడు నరుండు సత్యగరిష్ఠుండు కాజాలడు. హరిశ్చంద్ర ప్రవర్తనకు మనల బయటినుండి బలాత్కరించు కారణములు లేవు. కావున నీతి మనుష్య స్వాతంత్ర్యము నకు జేరిన వ్యాపారమని కొందఱు తత్త్వవేత్తలు వచించిరి.

ఈ త్రివిధ న్యాయములకు మఱియొక యంతరము

ప్రకృతిన్యాయము లమోఘములు. ఇవి విధించుక్రమంబులకు విఘ్నములును వికారము లునులేవు. ఉదా. భూమ్యాకర్షణశక్తిచేత నూతలేని వస్తువు క్రిందబడును. ఒక ఱాయిని బల్లపైనుంచినచో నది క్రిందబడదుగదా యందురేమో! నిజమేకాని, ఆ ఱాయి బల్లపైనుండువఱకు నాకర్షణశక్తి నిద్రపోవుచున్నదనుట తప్పు. భూమికి నిరంతర మాకర్షించుచు నుండుటయేపని. కావుననే ఱాయి బల్లపైనదిమి భారము గలదియై యుండుట. ఇట్లే సర్వత్ర ప్రకృతిన్యాయముల క్రమముల శాశ్వతములు. ఎన్నివిధముల కృషిచేసినను పలితము బెంపవచ్చుగాని హీనవృద్ధిని జంపగాదు. ఇందులకు సాక్ష్యము భూమిలోఫలితము సమవృద్ధిగా శ్రమాదులతోడ బెఱుగక తక్కువగా బెఱుగుటయ. కావున ప్రకృతి న్యాయముల క్రమము నిత్యము. రాజశాసనములచే విధింపబడు క్రమములు సర్కారువారి బలము జాగ్రత్తకొలది పదిలములుగాని నిర్బేద్యస్థితులుగావు. మఱియు నాక్రమములను బ్రచారమునకుదేగల కారణవస్తువైన గవర్నమెంటను నొకటి యున్నంగాని యవి న్యాయములనుపేర బరగ నేరవు. మీరును మేమును శాసనములం బ్రకటింప బూనితిమేని నవ్వులుతప్ప నింకెవ్వియు బయలువెడలవుగదా! బలముగల పరిపాలకులచే నిర్వర్తింప బడునుగాన నాక్రమములు సంపూర్ణముగ బ్రచారమునకు రాకపోయినను వచ్చుజాడగలవిగానున్నవి. అందఱు బన్నులుగట్టరేమోకాని ముక్కాలు మువ్వీసముమంది కట్టుదురనుట నిజమేకదా! కావున రాజశాసనములయందు గ్రమము బహుళము.

ఇక నీతియందన్ననో చూడుడు! లోకమున నిత్యసత్యులెవరైన నున్నారా? లేరు. నిత్య సత్యులు లేకున్నను "నిత్యసత్య సంధత్వము న్యాయము" అనుమాట యందఱు నంగీకరించునదియ. కావున నిందు గ్రమము లేకయేయున్నను న్యాయముయొక్క స్థిరత కపాయములేదు. క్రమ మసంభవమైనను న్యాయమేమో నిత్యము.

ఈ నిత్యతకు బ్రకృతిన్యాయ నిత్యతకుంగల భేదమేమి? ప్రకృతి న్యాయము లనుభవములో నిత్యములు. వీనింగూర్చి యోగ్యాయోగ్యతా విమర్శచేయుట తప్పు నీతిన్యాయములు యోగ్యతలో నిత్యములు. అనుభవమున నివి సిద్ధికి వచ్చునో రావో? రాకున్నను జేతనైనంత వఱకు వానికి సిద్ధిగల్పించుట కరణీయము.

ఈ మూడు న్యాయములకుంగల మఱియొక భేదము

రాజశాసనములరీతిం బ్రవర్తింపమేని శాసనముల రద్దుచేయరు. మఱి మనల దండించి శాసనముల ననువర్తింప జేయుదురు. నీతిన్యాయములయందు నిట్లే. జనులలో సత్యములేదని సత్యము న్యాయముగాదని మందలింపము. మఱి సత్యముతో మనము గలసియుండునట్లు వర్తించుట తప్పక యాచరణకు దేవలసిన క్రియయని యాదేశింతుము. అనగా న్యాయమునకు గ్రమమునకును భిన్నత గలిగినయెడల గ్రమము దుష్టమని మార్పజూతుము.

ప్రకృతి న్యాయములరీతివేఱు "ఉష్ణముచేత వస్తువులు విస్తృతములౌను" అను నొక న్యాయము గలదు. ఇందునకు నీళ్ళు పాలు పొంగుట. చీలలు మరలు. ఇట్టివి యెండ కాలమున బిగువు గాంచుట యిత్యాదులు నిదర్శనములు. ఒకవేళ వేడిమిచే విరివిగాంచని కొన్నివస్తువులుండెబో. అట్టివస్తువులును గలవు. పచ్చికొయ్యలకుకాక దాకించిన నవి శుష్కించి సన్నగిల్లును. పై న్యాయమునకు విధేయములుగావని యా పచ్చికొయ్యలను మనం దిట్టము. కొట్టము. చర్యల మార్పవలయునని గురూపదేశము చేయము! మఱి న్యాయములనే మార్తుము. ఎట్లన, ఉష్ణముచే గొన్నివస్తువులు విస్తృతమలౌను. కొన్నికావు. అగువాని గుణంబు లియ్యవి, కానివాని గుణంబులియ్యవి, అని నిర్ణయింతుము. ప్రకృతి న్యాయము లమోఘంబు లనుట కిదియ యర్థము. అనగా న్యాయమెక్కడచెల్లదో యక్కడ చెల్లుట కనువైన తీరున న్యాయములనే దిద్దుదుము. ప్రకృతియొక్క స్వభావములను వర్తనములను దెలుపు న్యాయములు మనుష్యులచే గనుగొనబడినవి మనము సర్వజ్ఞులము గాము కావున నందు బొరపాటు లెన్నియో కలుగకపోవు. అట్లగుట మనచే నిర్దిష్టములైన న్యాయములకు బ్రకృతికిని భేదము గల్గెనేని ప్రకృతిని మార్పజూడము. ఏలన నది మనకు తరముగానిపని. మార్చుటకుగాదు కావుననే దానియెడ నింద నారోపింపము. అపరాధము విధింపము. మఱి యీ భిన్నత మనయజ్ఞానముచే వచ్చినదని యింకను జక్కగ బరీక్షించి న్యాయమునే సంస్కరింతుము. అట్లయిన ప్రకృతి న్యాయము లమోఘములెట్లు? నిర్వికారములెట్లు? అనగా నిట్లు. ప్రకృతి నిర్వికారము. నిరర్గళగమనముగలది. కాని దానిస్వభావము మనకు సంపూర్ణముగ గోచరించునో లేదో! అట్లగుట మనచే నిర్ణయింపబడిన న్యాయములు శాశ్వతములని దృఢముగ జెప్పగాదు. మఱి మనతర్కమేమనగా, ప్రకృతియొక్క నిజస్థితి నెఱింగితిమేని, తద్వర్తనములదెలుపు న్యాయములు ప్రకృతియట్లు శాశ్వతములు నఖర్వములునై వెలయుననుట.

కావుననే రాజశాసన నీతిశాసనములు, అతిక్రమమునకుం బాత్రములు. ప్రకృతియం దతిక్రమం బఘటమానంబు దేశకాలాదులను సరకుగొనక దైవమానుషముల నడ్డసేయక, శుభాశుభముల లెక్కపెట్టక, ఏకక్రమమున నిర్వికారతం బోవునది ప్రకృతి. చూచితిరా! నిర్వికారమన నచలంబుగా దనుట కొంకొక ప్రమాణము.

"ఈతర్కంబుతో భారత నర్థశాస్త్రంబున కేమిపని? ఎంతపని?" అని యందురేమో! ఎంతోపని! ఈ శాస్త్రమున న్యాయము లనబడునవి యేతరగతికింజేరిన న్యాయములని నిర్ధారణచేయుట మాన నగునా? కాదు.

కొన్నిన్యాయంబులు ప్రకృతి న్యాయంబులతో దుల్యంబులు. ఉదా. హీనవృద్ద్యాదులు. వీనికి విఱుగుపాటు, అలయుపాటు, మొదలగు పాటులెవ్వియులేవు.

మఱికొన్ని శాసన సమంబులు. ఉదా. 1. పన్నులుగట్టవలయుట. 2. రాజ్యాంగమువారు కర్మశాలలంగూర్చి విధించిన చట్టములు. 3. సమష్టివాదుల మతము ప్రకారము కనీస జీతముల నాదేశింపజూచుట. 4. స్వామ్యముంగూర్చిన చట్టదిట్టములు. 5. దాయబాగాది నిర్ణయము, ఇత్యాదులు. వీనిచే నార్జనవిభజనాదులు మార్పులంజెందుట సిద్ధముగాన నివన్నియు భారత నర్థశాస్త్రమునకూం జేరినవియ.

నీతిన్యాయములసంఖ్య యెంతయు దక్కువయయినను వీనియొక్క ప్రభావమెక్కువ. ఉదా. దేశాభిమానము. దీనికన్నమించిన నీతి యరుదు. దానియొక్క యొకానొక ప్రభావ మేమనగా, రాజ్యరక్షణమునకువలయు సామగ్రులన్నియు స్వదేశముననే యుత్పత్తి చేయవలయుననుట. పరరాష్ట్రములనుండి యిట్టి సరకుల దక్కువవెలకు దిగుమతిచేయ వీలుండి నను నట్లుచేయుట తగనికార్యము. మఱియు నాధునిక స్పర్ధలు సంఘములకు కీడు సేయునని నమ్మినవారు స్పర్ధల నిరోధించు నన్యోన్యత, సంఘపరిపాలన, ఇత్యాదిపద్ధతుల నాశ్రయింపం బూను దురు. దీనిచే నార్థికలోకమున నూతనసృష్టు లెన్నియో కలుగ నున్నవనుట స్పష్టము. కావున మానవులకు నీతియందుండు నాదరమును నార్ధిక భావములకు మూలము నిష్పక్షపాతమును, బీదసాదల కనుకూలించునదియునగు మృదుమార్గము నవలంబింపవలయునను స్వేచ్ఛాపూర్వక సంకల్పముగలవారివలనే సమష్టిపద్ధతులు. ఇకమీద వివరింపబడు నన్యోన్యతా పద్ధతులు నాచార ములోనికి దేబడుచున్నవి.

అయిన నొక ప్రశ్న - ఏమీ? ఆధునికస్థితి స్వేచ్ఛాపూర్వకముగ మనుష్యులు కల్పించు కొన్నదికాదా? మఱి వాన, యెండ మొదలగు నైసర్గిక ద్రవ్యములరీతిని బ్రకృతి న్యాయములచే సిద్ధించునదా? మనుష్యులు నేటివఱకు బొమ్మలవలె నాడింపబడు చుండిరా? కొంచెము యోచింతము.

ఇంగ్లీషువారు హిందూదేశము నాక్రమించుకొని పాలించుచుండుట మీకెల్లరకుం దెలియుగాదె! 200 సంవత్సరములపుడు వారు వ్యాపారార్ధ మీదిక్కు వచ్చినపుడు రాజ్యస్థాపనంగూర్చి చింతించిరా? లేదు. ఇది యపుడు వారి యుద్దేశ్యము గాకుండెను. ఉద్దేశ్యమునలేనిది సిద్ధికెట్లువచ్చెనందురో! సహజక్రమములచేత. ఎట్లన, వ్యాపారార్దము ఫ్యాక్టొరుల గట్టిరి. మనరాజులాకాలమున నొండొరులతో గుక్కలరీతి గాట్లాడుచుండుటచే దొంగతనము, బందిపోటులు మితిమీఱియున్నందున ఫ్యాక్టొరీల రక్షించుకొనుకొఱకు సొంతముగ సైన్యముల నాయత్తపఱచిరి. వీరి యాశ్రయమున బ్రతుకు బాగుగ నున్నందున శిల్పులు, వర్తకులు తండోపతండమ్ములుగ వచ్చుటయు దన్మూలమున బల్లెలు పట్టణ ములగుటయు సంభవించె. అరీతి పాలనకార్య మంకురించెను. అంకురించినదింక పెఱుగక యుండు నా? రాజులలో దామును రాజులై నిల్చినపిమ్మట సంధి విగ్రహాది తంత్రములకుం బూనకుండుట యిట్టి యరాజకదేశములో నసాధ్యము. తంత్రములకు ఫలముగ జయము, జయమునకు ఫలముగ రాజ్యవైశాల్యమును వెన్వెంట వృద్ధినొందగా నీరీతి బేరసారములకై వచ్చినవారు సార్వభౌమపదవిం జెందువఱకును విడువక రాజసవృత్తితో బ్రబలిరి. మనుష్యజీవితమందు సైతము కార్యకారణములు ప్రకృతి న్యాయములట్ల మనకుమించి మనల నీడ్చుకొనుపోవు స్వభావముగలవిగానున్నవి. ఇందునకు నితర దృష్టాంతములు వలయునా? హిందువులమగు మనజీవితమున స్వతంత్రత యేమాత్రమున్నది? కర్మముచేత బుట్టుకయేర్పడుట నిజమో దబ్బఱయోకాని పుట్టుకచేత గర్మమేర్పడుట పండిత పామర వేద్యము. ప్రతివానియు స్వేచ్ఛయే బక్కపడి యుండగా సంఘము మొత్తముయొక్క స్వేచ్ఛ యింకను బలమఱియుండు ననుట కేమిసందేహము? అదెట్లన, చేరబిలిచి బోధచేసి యెవనినైన నొకని మూఢభక్తి వదలునట్లు చేయుట కష్టమైనను నసాధ్యముగాదు. అట్లే సంఘమునంతయు మార్ప వలయునన్న మనతరమా? నేను విదేశయాత్రచేసి నవనాగరకుడ నైనందున మావారికి బ్రాచీనగంధ మేమాత్రమైన బలుచనౌనా? పారంపర్యముగవచ్చు సాంద్రతను నాగంధమేల వదలును? కావున స్వాతంత్ర్యము ప్రతివానియందును ననేకభంగుల నడ్డగింపబడి వుండును. ఇక సంఘమునకన్ననో దాని స్వాతంత్ర్యము సహజముగ మఱియు దక్కువ. అట్లగుట మనచర్యలు ప్రకృతి చర్యలతో నించుమించు సమానములు. సంఘమింకను బ్రకృతిం బోలినదియైయుండును. కావున దానియందు బ్రవర్తిల్లు న్యాయములు ప్రకృతి న్యాయములట్లు కొంతకుగొంత యనివార్యములు ను స్వచ్ఛందములును.

దీనికి నింకను నొకప్రమాణము. ప్రకృతియందు స్వేచ్ఛావర్తనము బొత్తిగాలేదు. గాన నికముందు సంభవించువాని మున్నుగా నెఱుంగవచ్చును. తుపాకిలో గుండుపెట్టి కాల్చితిమేని, అది యేదిక్కున కైన నెగిరిపోవునని యెవడును శంకమానడు మఱి గుఱికొలది సూటిగా బోవుననుట నిశ్చయము. ఈ రీతిని బ్రతిమనుష్యుని జాడలును నెఱుంగబోలదు. అయినను సంఘముయొక్కజాడల ముందుగా నిర్ణయింపనంత దుర్దమముగాదు. వేయిమంది వేయికూతలు గూసిరిపో బాల్యవివాహ ములు త్వరలో నంతమొందునా? ఒందవు. కావున నిప్పటి యార్థికస్థితులు మనుష్యు లుద్దేశ్యపూ ర్వకముగ దెచ్చుకొన్నవికావని కొందఱి యభిప్రాయం. మఱి యెట్లేర్పడినవనగా బాశ్చాత్త్యుల ఖండములలో సహజస్పర్ధచేతను, మనలో సహజ ప్రాచీనాచార పారాయణత్వము, గ్రీకులు తురుష్కులు మొదలగు విదేశీయుల దండయాత్రలు మున్నగువానిచేతను నేర్పడినవి.

పాశ్చాత్త్యులు స్పర్ధమంచిదనియు, దానిచే నిపుడు వ్యాప్తిలోనుండుస్థితులు పుట్టువనియు మున్ముంద యెఱింగి వర్తించిరా? లేదు. ఇంతటి జ్యౌతిషము మ్లేచ్ఛులకు దెలియునా? తాత్కాలిక ఫలముల నాశించియో, సహజమగు క్షాత్రబుద్ధినో, స్పర్ధకుంజొచ్చిరి. కార్యకారణ సంకలనంబునం జేసి యీ సిద్ధులన్నియు జేకూరినవి.

ఇక మనజనులన్ననో, ఏపాపమునెఱుగని పశువులు. పగ్గములచే తమవారు బెఱవారు నీడ్వనీడ్వ గాలక్రమేణ తుదకీగతికివచ్చిరి. కావున నిప్పటిస్థితి మొత్తముమీద సహజ క్రమములచేవచ్చిన స్వయంభువు.

ఇకముందు గలుగబోవు పరిణామము సయిత మీరీతినే స్వభావసిద్ధమై తనంతట రానీయని మనమూరకుందుమా? లేక పూర్వికులకన్న మనము లౌకిక జ్ఞానమునందును ననుభవము నందును బ్రౌఢులముగాన ముందు జాగ్రత్తమై నీ యీ తెఱంగులనున్న మంచిదని యోచనతో నిర్ణయించి తగవైన శాసనముల విధించి భవిష్యత్తును బ్రతిమను దీర్చినట్లు తీర్ప బూనుదమా? సామాన్య సమష్టివాదులకును బ్రభుమార్గ సమష్టివాదులకునుగల భేద మీప్రశ్నలకు వారిచ్చు నుత్తరములచే విశదంభగును.

సామాన్య సమష్టివాదుల యుత్తరము

సంఘస్థితి మనుజులమూలమున బనిచేసెడు శక్తులచే నుత్పాదితము. మనుష్య కృతంబుగాదు. రాజశాసనములు, వర్ణధర్మములు ఇత్యాదు లనేక చలనముల గలిగించునవి యైనను మొత్తము మీద వాని ప్రభావ మంతఘనముగాదు. ఘనము లెవ్వియనిన స్వచ్ఛందములైన స్పర్ధాదులు. నీతి విన్యాసములంగోరు నుద్దేశ్యముల గుణము విస్తారమా? చూడుడు! సంఘసంస్కారవిషయమై హిందూ దేశములో చర్చలెన్నియోజరిగినను వర్ణసాంగత్యము, రైల్వేలవల్ల, కచ్చేరీలవల్ల, కలిగినంతమాత్రము సకారణములైన యుపదేశములవల్ల గలుగ లేదనుట వేఱుగ నెత్తిచూపవలయునా? మనుష్యులను వశవర్తులంజేసి వెలుంగు యంత్రము వివేకముగాదు. అట్లదియే యనుపక్షమున మూఢభక్తి యింకను 'కనకపు సింహాసనమున శునకము' వలె నీరాజ్యము నేల యధిష్టించియున్నది? సరికాదని నిరూపించిన మాత్రమున విధవలకు వికార వేషముగట్టు ననాచారము వదలు వారున్నారా? కావున వివేకమునకన్న విమూఢత్వము విశేష శక్తియుతము. అట్లగుట యోచనతో భావికాలమున దీర్పజూచుట తెలివితక్కువ తలపోత. మఱి మనుష్య సంఘముల నుండు ప్రకృతి శక్తులంబోలిన స్పర్ధాదులకు విరోధముల గల్పింప జూచుటయు బిచ్చితనము. ఎట్లన, నీయందు నాయందును స్వేచ్ఛకు దారియున్నదిగాన సంఘమం దంతగాలేదు. ఏవిషయముం గూర్చియైననుసరే సమ్మతి నడిగితిమేని కొందఱౌనందురు కొందఱు కాదందురు. సమ్మతులు పరస్పర విరుద్ధం గావున మొత్తముమీద సంఘములో దేలు సంకల్పము సున్న కావున బ్రభుమార్గమున సమష్టిపద్ధతి నుద్ధరింపంజూచుట పొసగదు.

మఱియు నీప్రభుమార్గ మసాధ్యమగుటయకాదు. అనావశ్యకమును. ఎట్లన రాజ శాసనముల సహాయములేకయ సమష్టి స్వతసిద్ధముగ దిగ్విజయయాత్ర కారంభించినది. యజమాన సంఘ ములు, శ్రమకర సంఘములు, ట్రస్టులనబడు ధర్మనంధులు, విస్తార వ్యాపారములు, యాన సౌలభ్యము, అన్యోన్య తాసరణులు ఇవన్నియునేమి? ఆధునిక లోక పరబ్రహ్మయగు నాసమష్టియొక్క మూర్తులేకదా! మఱియు శ్రమకర సంఘాదులు కూడవని రాజశాసనములు వాని శిక్షింపజొచ్చినను నవి యాపబడినవా? లేదు. ఆపుటకే బలములేనిది ప్రోచుటకు బలమెక్కడనుండి బిచ్చమెత్తి తేగలదు? కావున సమష్టికి నాయకత్వముం గోరుదమేని వర్తమానస్థితిలో సంగతములైయుండుశక్తుల సహజ క్రమమునం బోవనిచ్చిన జాలును. అవే సమష్టిని నపౌరుషముగ దమంతట పరిణతికి దెచ్చును. వీరి మంత్రమునకు నాధారమైన యూహయేదనగా. ఆర్థికన్యాయములలో వర్జనీయంబు లైనవి ప్రకృతి న్యాయంబులంబోలిన స్వశక్తియుతంబులైనవనుట.

ప్రభుమార్గ సమష్టివాదుల యుత్తరము

ఆదిని మనుష్యులు మృగంబుల బోలినవారు. స్వాతంత్ర్యమును దీర్ఘ దర్శనమును దొలుత మొలచిమొలవనిస్థితిలోనుండినవి. ఇపుడన్ననో యివిరెండును నానాటికి వృద్ధిని వీర్యమును బడయుచున్నవి కావున ముందువోలె గ్రుడ్డియెద్దు చేనిలోబడినట్లు పోవలసిన విధిలేదు. కావున నిచ్ఛాశక్తులుగల మనము బుద్ధిని బ్రయోగించి భావికాలము నేల వంగదీయరాదు?

మఱియు శాసనము లుపయోగములేనివికావనుట మాప్రతివాదులు నొప్పుకొనెదరు. అట్లగుట శాసనములను పగ్గములతో నార్థికశక్తుల నేలనడిపింప గడగరాదు?

సమష్టీశక్తి సహజముగ బ్రత్యక్షమౌననియంటిరి. అట్లగుటలో మాకేమియు దు:ఖం లేదు. కాని, మనమును గొన్ని క్రియలజేసి యారాధించిన మఱింత త్వరలో బ్రసన్నమగునుగదా! సహజవృద్ధిని నిరీక్షించువారిలో నొక గొప్ప లోపమున్నది. సహజవృద్ధి పరిఢవిల్లు రీతి యెయ్యది? ఇప్పుడు కొన్నికష్టములువచ్చిన వానిని సంస్కరించుట. మఱియు గొఱతలు గానవచ్చిన వానిని జక్కజేయుట ఇత్యాది యత్నములచేతగదా! ఈ సహజయత్నముల కొకలక్షణము సామాన్యము. ఏదన, మేలును బుట్టించుటకు దత్పూర్వముండుకీడు కారణం. కాబట్టి సహజవృద్ధిలో గీళ్ళు చిరంజీవులు! మనమే భావికాల జ్ఞానముతో సన్నాహములం జేసితిమేని, ఈకీడులు రాకయుండు నట్టి యేర్పాటులు చేయ వచ్చును గదా! అనుభవముమీద గీళ్ళదొలంగించుట బుద్ధిశాలులతనమే. నిజము. ఆ కీళ్ళ నవతారమే యెత్తనీక మూలోచ్ఛేదం సేయుట యింకను విశేషించిన బుద్ధిమత్త్వ మనుటలో నేమిసందియము? ప్రాప్తకాలజ్ఞుని కన్న దీర్ఘదర్శి శ్రేష్టుడుకాడా?

మఱియు, మనమూరకయున్న నభివృద్ధి తనంతటవచ్చి నోటిలోబడునా? పౌరుష మప్రధానమని యెంచిన హిందువులగతి లోకులు కాంక్షింపగూడినదా? హిందువు లెన్నియో యిడుమల గుడిచిరి కాని యా యిడుముల నివారింతమను నుత్సాహము గొనరైరి. కావున మన పరాక్రమములేకయ సహజశక్తులచేత గీడులు దొలంగింప బడుననుట యప్రశస్తము.

మఱియు మీరు నమ్మిన శిల్పసంఘము లాదియగు నిర్మాణములును పౌరుషోద్భూతములే. ఇంక పూర్వోద్దేశ్యము కూడదంటిరే! ఉద్దేశ్యము లేకుండవలయున నుటయు, స్వభావసిద్ధశక్తులకు యథేచ్ఛా విహారముల నొసంగవలయుననుటయు నుద్దేశ్యములుగావా?

ప్రజలు స్వయముగ సంఘముల నిర్మించుటకై చేసికొను సమయములు కూడునను వారు రాజ శాసనముల నేల తిరస్కరించుట? రాజ్యము, సంఘము, ఈ ద్వివిధ సమూహములకుం జేరినవారు శాసనములను సమయములను నతిక్రమింపక యుండుటకు సభిక బాహుళ్యముయొక్క దండన శక్తియేకదా కారణము! ఇంతేకాదు. రాజులు అడ్డులేక పాలించుకాల మెన్నడో యస్తమించినది. నాగరకతంగల దేశములలో బ్రజాప్రతినిధులే పాలకులు. అట్లగుట ప్రజలు సంఘములుగాజేరి తమకుందామ యాదేశించుకొను సంకేతములకును, ప్రతినిధులద్వారా, ఆజ్ఞాపించు చట్టములకును వ్యత్యాసము కొంచెమేకదా! చూడుడు! రెంటికిని గర్తలు ప్రజలే. ఒకదానియెడ రాజ్యాంగ మూర్తిని, ఇంకొక దానియెడ సంఘావతారముందాల్చిన ప్రజాబాహుళ్యమే యన్నిటికీం గారకము. కావున సమయములు యుక్తములు. శాసనములు అయుక్తములు. అనుట లేనిపోని భేదము గల్పించి నట్లు.

రాజ్యాంగ నిర్మాణములు పరిపూర్ణత వహింప వహింప బ్రజలే ప్రభువులౌదురుగాన బ్రజాప్రభు మార్గములు రెండును సంగమించును. అట్లగుట శాసనముల నాశ్రయించుట దోషొంబుగాదు. నిష్ఫలంబుంగాదు.

నిజము జూడబోయిన బ్రభుమార్గ సమష్టివాదులయెడ నొక కపటమంత్రము గలదు. అదియేదన, రాజ్యాంగమువారే కర్మకరులకు శాసనములచే మంచిజీతములు. విరామకాలములును నేర్పఱించి సుఖులుగనుండునట్లు చేసినవారుగలిసి యజమానులపై నెత్తివచ్చి వారిపదవి నాక్రమించుకొనరు గదాయను తంత్రాలోచన. శ్రమకరులును బ్రకృతము ప్రభుమార్గమే శరణ్యమని యుండు నట్లుగాన్పించెడి. ఏలన, రాజ్యాధికారము లేని సంఘముల సమయముల సభ్యులెవరైన నిరాకరించినవారిని గఠిన శిక్షలకుం బాల్పఱుచుట యశక్యము. ప్రభువుల యాజ్ఞల నిలుపుటకు సైన్యము, పోలీసుధళము న్యాయాధికారి మండలములు నున్నవి. కావున బ్రభుమార్గమున గార్యము సుఖతరముగ నెఱవేరగలదు. నిరాకరించువారిసంఖ్య యల్పమైనచో వారు దిక్కులేక వినయ వినమితు లౌదురు. ఈ సంవత్సరము, ఇంగ్లాండులో గనులలో బనిచేయువారికి, అధమపక్షవేతనములు పార్లమెంటు చట్టములచే నాజ్ఞాపించి యా శిల్పుల కృతజ్ఞత నందినది.

ధర్మము నీతి యనుపదములు సందిగ్ధములు. ప్రశస్తమైన యర్థమేదనగా. నిష్పక్ష పాతముగ నెల్లరును సములనియెంచి, మనుజులమైనందులకు మనకు సర్వోత్కృష్ట పురుషార్థమ్ము, ఎయ్యదియని విచారించి, దానింగడింప ననువగు మార్గముల నిరూపించితి మేని వానికి ధర్మము నీతులు నను నామములు చెల్లును. మనవారిలో నిట్టితత్త్వవిచారణలేకపోలేదు. కాని యది యతులకుందక్క లౌకికులకుంజెల్లదని తత్త్వాభాసము నొండు గల్పించుకొనినందునను, మఱి సంసారులకు రాజులు మతాచార్యులు మొదలగువారిచే దండబలంబున బోషింపబడు వర్ణాచారములు పరమకర్తవ్యములను సిద్ధాంతమొండు యెల్లర నావేశించినందునను, ధర్మము నీతి యనగా రాజశాసనప్రాయములైన యాచారములయని హీనార్ధముగలిగినది. మఱియు నీతి యనగా రాజతంత్రమనియు నొక భావము! లౌకికమున బెద్దలచే ధర్మము నీతి యనంబడునవి చట్టములయట్లు నిజమైన ధర్మమునకు నీతికిని విరుద్ధములై యుండవచ్చును. ఉండవచ్చునననేల? స్పష్టముగ విరుద్ధములై యన్నయవి. మన ధర్మశాస్త్రముల నొకసారి నిద్రకండ్లతో జూచిననుజాలు. ఈ యాభాసము విశదమగును. చూడుడు! ధర్మములు నీతులు! బ్రాహ్మణు డేతప్పుచేసినను దండ్యుడుగాడట! శూద్రులకు విద్దెలుచెప్పిన బాపమట! ఇయ్యవి మనువువంటి బ్రహ్మలకు మంచివని తోచునేమో! మనుష్యమాత్రులమైన మనకు భాగ్యవశంబున నట్టి దివ్యదృష్టి లేకున్నయది! వర్ణాచారములన్నియు చట్టములతో సమంబులు. ధర్మములని పేరున్నందున నామసామ్యముంబట్టి యదార్థ ధర్మములని భ్రమించి వానిని నిత్యసేవ్యము లనుట యెట్లున్నదనగా, హరియనుపదము కోతియందును బ్రయుక్తంబుగాన విష్ణువునుమఱచి కోతిని గొలిచినట్లు!