భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఏడవ ప్రకరణము

విస్తార వ్యాపారములు

సంశ్లేషముయొక్క ముఖ్యప్రయోజనము వ్యాపారముల విస్తృతములంజేయుట. తన మూలధనముతో మాత్రము వృత్తిని స్థాపింపవలయునన్న గోట్లకొలది జనములు కొన్ని వందలకన్న నెక్కువ ద్రవ్యము వినియోగమునకుం దేజాలరు. ఎవరో కొందఱు కొన్నిలక్షల వేతురేమో! ఇట్లు మూలార్థము మితంబైనచో గళలయందు నమిత వ్యయ సాధ్యములైన యంత్రాదులకు బ్రవేశముండుటయరిది. అట్లగుట నుత్పత్తి ప్రముఖోద్యమంబులు చక్కగా గొనసాగవు. కావున విస్తార వ్యవహారములలోని గుణదోషముల గణించుట యావశ్యకము.

మూలధన సంశ్లేషణ

పూర్వము చిల్లర వ్యాపారములు తఱుచుగానుండు కాలములో ననేకులుగలిసి భాగము లేర్పఱచికొని, సమాజములుగజేరి నడుపు కళలు మిగుల గొద్దిగానుండినవి. ఇప్పుడు నాగరక దేశములలో సమాజో ద్యోగము లపారముగానున్నవి. కారణమేమనగా వ్యవహార చక్ర మఖండముగ వ్యాపించియుండుటయ. ఈ వ్యాప్తిచే నధిక రాశి కళలకు మంచి యనువు కలిగినది. అధికరాశికళల సాధించుటకు జనులు పొత్తుచేరుట యావశ్యకంబు.

ఉత్పత్తికి నాధారములు మూడని యంటిమి. ప్రకృతి, శ్రమకరులు, మూలధనము. ప్రకృతి స్థావరము. కర్మకరులు కదలిక గలవారయ్యును దేశవేషభాషాది తారతమ్యములంబట్టియు నాలుబిడ్డల యందలి యనురాగవిశేషంబునంజేసియు విచ్చలవిడిగ దిరుగజాలరు. మూల ధనము ద్వివిధము. చరము, అచరంబుఅని. అచరములు యంత్రాదులు. ఏకవిధ ప్రయోజనములు. కాని నివియు దిశలం బ్రాక జాలవు. ద్రవ్యరూపమైన మూలధనము చరము. యాత్రలజేయుటలో మనదేశములోని యవ్వలకన్న నెక్కువ సమర్థము. పాదరసమువోలె చంచలంబుగనుంటచే దీనికి "ద్రవమూలధనము" అనియు గీర్తి గలదు. ఇంతేకాదు. ద్రవ్యమును వలసినట్లు పంచి పెట్టవచ్చును. నూరు, ఇన్నూరు, మున్నూరు, వేయి, ఇత్యాదిగ రూపాయల నిచ్చకొలది విభజించి దిక్కుదిక్కులకుం బంపవచ్చును. కర్మకరులనుగాని ప్రకృతిని గాని ఇంత సులభముగ విభజింపలేము. ఈ కారణములచే తొలుదొల్త సంశ్లేషమార్గమును ద్రొక్కినది మూలధనము.

భాగస్థ సమాజములు (అనగా జాయింట్ స్టాక్ కంపెనీలు) పుంఖానుపుంఖములుగ వెడలుటకు హేతువు మూలధనముయొక్క స్వభావము. ఒకకంపెనీలో శక్తిని, ఇచ్చను ననుసరించి నూఱురూపా యలో, లక్షరూపాయలో, మఱి యెంతమాత్రము, అప్రాయము లేని వినియోగమని భావింతుమో యంతమాత్రము పాలుగొనవచ్చును గాన నియ్యది యనేకులకు సాధ్యమైనకృతి.

సంకలిత మూలధన సమాజముల నిర్మాణముం బూర్వమే తెలిపితిమి. దానియంగములు సాధారణ ముగ నాలుగు. నిర్మాత, చోదకమండలి, కార్యదర్శులు, శిల్పులు. నిర్మాత చోదకమండలిలో జేరినవాడైనను నుపద్రష్టవంటివాడగుట ప్రత్యేకముగ గ్రహింపదగినవాడు.

సంభూయ సముత్థానములయొక్క గుణములు

1. చిల్లర చిల్లరగ భాగములుగొని యనేకులు చేరవచ్చునుగాన నెంతద్రవ్యమైనను బ్రోగుచేయవచ్చును. నష్టమువచ్చిన ప్రతి సమాజకునకును బోవునది కొంచమే. నిండుమున్కలు తటస్థించునను భయము లేదు. అయిన నిందొకకీడుగలదు. ఎక్కువనష్టము రాదుగదా యను తెగువచే నుదాసీనులై భాగస్థులు కార్యవిచారణమునం దనాదరబుద్ధిదాల్తురు. అందుచే బేరునకు దామును యజమానులుగా నుండినను మొత్తముమీద చోదకు లడ్డులేని యధికారము గలవారగుదురు.

2. వర్తమానమున గొప్పగానుండు నౌకాయానము, ధూమశకటయాత్రలు మొదలైన గంభీర యత్నములు వీనిసహాయములేనిది రూపుజెందియుండవు.

ఇంక లోపములు

వీనియందు. సంయోగించునది మూలధనముగాని భాగస్థులు గారు. ఎట్లన, మదరాసు బ్యాంకీలో దేశదేశస్థులు భాగములు గొనియున్నారు. తమలోదమకు నేమాత్రమైన బరిచయముండుటయరుదు. ఊరుపేరు తెలియనివారితో నిక్కమైన పొత్తుగలుగుటెట్లు? భాగస్థుల క్షణమిది. వ్యవహారము నెఱుగరు; తమ్ము నెఱుగరు. పేరునకు మాత్రము యజమానులు.

2. భాగస్థులు ద్రవ్యము వేయుటతప్ప మఱేమియు జేయక యుండువారు. శిల్పులు కష్టించి క్లేశము లెల్లబడువారు.

3. అట్లయ్యును వచ్చులాభములో భాగస్థులకు బాలుగలదు. కర్మకరులకు నియతమగు కూలియేగాని యెక్కువగిట్టదు. సమష్టివాదులందఱు నిదియెంతయు నన్యాయమనియు ఘోరమనియు గోపింతురు. చూడుడు! గొప్పయాస్థికి బుట్టినవాడు జన్మమంతయు నేపనియుం జేయకయ భాగస్థతం దాల్చుటచేతనే మంచి రాబడిగలవాడు గావచ్చును. కూలివా డెంతపాటుపడిననేమి? నానాటికి భుక్తి సేకరించు కొనుటయే వానికి దుర్భరము. ఆధునికార్థికస్థితియందు 'కష్టీ ఫలీ' యనుట బొంకాయె. పాటులకన్న మూటలే మిన్నలాయె. ఇట్లగుట నిప్పటిస్థితి యధర్మంబు. అధర్మంబగుట శాశ్వతంబు గానేరదు.

4. ఇక భాగస్థులేమి తెలిసి భాగముల గొందురనగా, చోదకమండలియందలి నమ్మకముచేత. ఇది తెలిసి నిర్మాతలు చోదకమండలిలో వన్నెయు వాసియుగల పెద్దమనుష్యుల నెన్నియుపాయములచేనైన జేరునట్లు చేతురు. గొప్పవారు ప్రచురించు ప్రకటనలంజూచి "వీరు తప్పుద్రోవల బోదురా? తెలిసినవారు గదా, వీరియాశ్రయ మెన్నటికిని గీడుగాదు" అనియు "ఎందఱో తమ ధనము వేయుచున్నారు వారికైనగతి మనకు. సాహసము చేయనిది జయము గలుగదు. తప్పక లాభము వచ్చునని నిర్ణ యించుట యసాధ్యము. అయిననేమి? తెంపు చేయనిది కార్యారంభము గలుగునా? ఒకచేయి చూతము" అనియు దలపోసి జను లనేకులు పాళ్ళగొందురు.

5. సంకలిత మూలధన సమాజములు నాణెమాధారముగ నిలుచునవి. చోదకులు దుర్మార్గు లైనచో జనుల వంచించుట దుష్కరముగాదు. అనేకు లాషాడభూతులై ప్రజల బేలుపుచ్చి సాహుకారులగుట యుగలదు. ఇందునకు నిదర్శనమైన చరిత్రాంశ మొండున్నదది వినుడు!

ఎనిమిదేండ్లక్రిందట నే నింగ్ళాండులో నుండినప్పుడు 'విటకర్ రైట్‌' అనునొకని యార్థిక మాయలు బహిరంగపఱుపబడెను. ఇవి కృష్ణమాయలట్లు, ఆశ్చర్యజనకములు, రైట్టు బహుచాతుర్యవంతుడు. తొలుత కొన్ని సత్సమాజములనుస్థాపించి కార్యములం జక్కగా దీర్చినవాడై, ఇంకను నౌన్నత్యముం జెందవలయునను నుత్సాహముతో ననేక సమాజములం బ్రతిష్టించెను. ఇందు గొన్ని నష్టము దెచ్చినవి. ఇంకేమి చేయవచ్చునని క్రొత్తక్రొత్త కంపెనీల లేవదీసి వీనిభాగముల నమ్ముటచే వచ్చిన ధనమును ప్రాతవాని కప్పిచ్చునట్లు వ్రాసి యా భాగస్థుల కప్పుడొకరీతి సమాధానముంజూపి, యిట్లనేక విచిత్ర గతులకుం దొడంగినవాడాయెను. కంపెనీలు వెవ్వేఱు పేరుదాల్చి భిన్నములని బయటివారికి దోచినను నిజము చూడబోయిన నన్నిటికి నాధుడువీడె. ఒకకంపెనీపేరదీసి యింకొక కంపెనీకి ఋణ మిచ్చుట యనగా దనకుదానే యప్పిచ్చుకొన్నట్లు! ఈ యప్పులు దీఱునవి యేనా యోచింపుడు! భాగస్థుల యేడుపెట్లున్న నేమి? తాను ప్రచండుడై వెలసి యద్భుతమైన సౌధమొండునిర్మించి యందు చక్రవర్తిగారినిగూడ విందులచే బూజింజి కీర్తిమంతుడాయెను! తనచే సృజింపబడిన సమాజములయందు జనులకు విశ్వాస ముద్ధురమగుటకై యొకానొకప్పు డిండియాదేశపు గవర్నర్ జనరల్‌గానుండిన డఫరిన్ ప్రభువుగారిని చోదకాధ్యక్షుడుగనుండ బ్రార్థించిన నాయుదారచిత్తు డేకాపట్యము నెఱుంగని వాడగుట నిట్టిచతురుడు చేపట్టిన పనికి విఘాతము లుండునేయని సమ్మతించెను. మాయా వ్యాపార మెన్నాళ్ళని నడువగలదు? తుదకున్నట్టుండి రైట్టుగారి కంపెనీ లనేకములు దివాలెత్తినవి! ఇక్కడ 'అర్బత్ నట్‌' ప్రళయముమాదిరి నక్కడ 'రైట్టు' ప్రళయ మాయె! లక్షలకొలది జనములు సర్వముం బోగొట్టుకొన్నవారై దిక్కులు గంపింప నాక్రోశించిరి. డఫరిన్ ప్రభువుగారు నిర్దోషులయ్యును తమపేరునకు బ్రమాదమువచ్చెగదాయని దు:ఖించి యాదు:ఖముచేతనే పరమపదవింజెందిరి. 'రైట్టు' యెన్నియో జిత్తులు తెలిసిన ప్రాతనక్క యగుటచేత వానిపై గేసుదెచ్చి నను జయమసిద్ధమని గవర్న్మెంటువారు పేక్షించిరి. గవర్న్మెంటు వారి యుపేక్షతో మనకేమని జను లందఱు సంతకములుచేసి ధనముగూర్చి వానిమీద నేరముమోపగా హైకోర్టులో గొప్పకేసునడిచి 5 సంవత్సరములు కఠినశిక్ష విధింపబడెనుగాని 'రైట్టు' మాత్రము తుదకు దప్పించు కొన్నాడు! ఎట్లనగా, ఆక్షణమే విషము దీసికొని చచ్చుటచేత!

ఒక్కవ్యాపారము నొక కంపెనీపేరజేయుచు దానిలో వినియోగించుటకై ద్రవ్యము నాకర్షింపంగోరి యింకొకపేర బ్యాంకీలు, ఇన్‌ష్యూరెన్సు కంపెనీలు, తేలజేయువారునున్నారు. ఇట్టివన్నియు గృతిమములేకాని సరియైనవిగావు. ఎట్లందురో, నిధులయొక్క ధర్మం, అప్పులగోరివచ్చు నాసాములయుద్యమములు యుక్తములా, అయుక్తములా, యని పరిశీలించుట నిధినిర్మాతయే వ్యవహార సమాజ నిర్మాతగను నుండినయెడ జనులచే నిక్షేపింపబడు విత్తములను ధారాళముగ నేవిమర్శయుజేయక తనసమాజములలో దగులబెట్టును బయటివారికీసమాచారము తెలియకుండునట్లు నామధేయములు చోదకమండలములును భిన్నములుగ నుండు నట్లు నటింతురుగాన నిది ముమ్మాటి కిని మోసము, ముఖ్యముగా నిధీశ్వరులు నిష్పక్ష పాతబుద్ధితో సత్యాసత్య విచారణ సేయువారుగా నుండవలయుననుట యెంతయు నావశ్యకము.

ఇన్ని కుటిలములకు నాస్పదమయ్యు సంకలిత మూలధనసమాజ పంక్తి యేలవర్ధిల్లు చున్నదని చోద్యమందుదురేమో? ఉత్తరము సుగమము. పశ్చిమదేశములో మొత్తము మీద విశ్వాసము నభివృద్ధి చేయునంతటి యార్జవముండుటయే హేతువు. ఆషాఢభూతు లెందఱో యున్నను నక్కడివారి యపార వ్యవహారములతో బోల్చిచూచిన వారిఘోరము లలక్ష్యములుగానున్నవి. అట్లుగాక సౌశీల్యమునకన్న దౌశ్శీల్యమే స్థిరమైయున్నయెడ నాణెము స్థిరవ్యాపియైయుండునా? ఉండదు. నమ్మకము ప్రసరించు చుండుటయ వారియోగ్యతకు నమోఘమైన సాక్ష్యము.

ఇంగ్లాండులో నిట్టిసమాజములు నన్నింటిని రాజ్యాంగమువారిచే నేర్పఱుపబడిన, గణిత శాస్త్రపారీణు లేటేట లెక్కలన్నియువిమర్శించి పరిశీలించి చోదకులుచేయు ప్రకటనలు బూతులా నిజములా యనుట నిర్ణ యించి యెల్లరకుం దెలుపుదురు. ప్రతిసమాజమును గవర్నమెంటువారి విచారణకు నధీనమైయుండినం గాని వ్యవహారములకు జొఱరాదని శాసనము. కన్ను మూసికొనియుండు భాగస్థులకు దొరతనమువారి సంప్రతులేకండ్లు లోకజ్ఞానము కీడు కౌడు లెఱుంగక పేదసాదలు చోదక సభలయొక్క వర్ణనలు కట్టు కథలును విని బేలువోదురను శంకచే ప్రజారక్షణార్థము ప్రభువులు సంప్రతుల నియోగించినను వీరలగూడ కన్నుపుచ్చునంత సమర్థులైన వ్యాపారు లుండకపోలేదు.

హిందూదేశములోని జాయింటు ష్టాకు కంపెనీలు

ఇంగ్లాండునకన్న మనదేశమున సమాజవ్యాపారమునకు ప్రసక్తి తక్కువ. దీనికెన్నియో కారణము లున్నవిగాని యన్నింటింజూప సాధ్యముగాదు. అందులో బ్రబలములైనవానిం గొన్నింటి నిట జాటింతము:- మనదేశములో నరాజకము, జాతి మతాదిభేదములు, వీనిచే నమ్మిక కృశీభూతమైనది ఇప్పుడు సౌరాజ్యము గల్గియున్నను దటుక్కున నమ్మిక చిగిరించి పొదగా బెఱుగుట యసంభవము. ఐనను మునుపటికన్న గొంతమట్టునకు మేల్కని కనువిచ్చునదిగా నున్నది భాగస్థులు నేడు వ్యవహారములలో జేరిన ఱేపు వక్కీళ్ళవద్ద జేరుదురనుట యనుభవవేద్యము. "పరుల పరిపణముతో జేయు వ్యాపారముగదా! నష్టమువచ్చిననాకేమి?" యని కార్యకర్త లుపేక్ష వహించియుంటయు, నంతకుమీఱి మోసపుద్రోవల దామే యంతయు నోటవేసికొని పోవుటయు నిచ్చట నమితముగా నుండుటయకాదు, ఇంగ్లాండులోబలె నట్టివారిని హీనులని భ్రష్టులనియు బెద్దమనుష్యులు దూరస్థులంజేయుటయు లేదు. కావున నిట్టి యనుచితములు మాఱులేక జరుగుచున్నవి. ఆచారములనబడు మూఢక్రమముల మీదనుండు శ్రద్ధాజాడ్యము సత్ప్రవర్తనయందు లేమి యత్యంతము చింతనీయము. గవర్నమెంటు ఉద్యోగస్థులును విశ్వాసయోగ్యులనుట పశ్చిమ రాజ్యములలోబలె నిటజెల్లదు. లంచములు పుచ్చుకొనువారెందఱు? ఇచ్చువారెందఱు? ఆయాసము బక్షపాతముమాని యోచింపుడు! పోనీ, రహస్యముగ దీసికొనుటతో బోవునా? ఈదేశమున "మీకు సంబళమెంత? అదిగాక పైరాబడియెంత?' యని విచారించుట సహజ యోగక్షేమ విచారణలోజేరినది! తప్పులుండుటయకాదు, సిగ్గునుబోయినది. కావున గవర్నమెంటువా రేమిచేతురు? శాసనము లెంత శ్రేష్టములుగనున్నను వాని నిర్వర్తించువారు మానమర్యాదాదూరులై యున్న నేమిచేయనగును? ఈ దౌష్ట్యంబులు వేదాంతములకుం బుట్టినిల్లగు నీరాజ్యంబులో మలమల మాడుచుండుటకుం గతం బేమియనిన, జనుల స్వప్రయోజన పరత్వమును ధర్మవికలతయు నను నవియే. చూడుడు! పెద్దమనుష్యుడని పేరుగన్నవాడు, సెలవు తక్కువగ బ్రయాణముచేయ నిశ్చయించి, మూడవ తరగతి టిక్కట్టు దీసి యా తరగతిబండ్లలో బీద సాదలు సామాన్యముగ నెక్కవత్తురు గాన వారి నాపివేయమని, స్టేషనులోని పోర్టరును నడిగికొని, వాడట్లు పేరాసమైజేయ, రైలుగదలునపుడు వానిచేతిలో గంభీరంగా నఱణాపెట్టి, వానిచేత నాలుగు వషట్కారములం బెట్టించుకొని, సుమంగళముగ బోవుచుండుట యెవ రెఱుంగరు? దీనిచే నేర్పడు జాతిగుణము లెవ్వియనిన:- 1. తనయొక్క హక్కులకన్న నెక్కువగ గ్రసింపగోరుట. మనవారీషణ, ఈషణయనుదానికి నిజమైన యర్ధమియ్యదియ. 2. పరులయొక్క హక్కులను దిరస్కరించుట. 3. ఈ యన్యాయమును నీచమైన పద్ధతులచే నుద్ధరించుట. ఒక్కలంచములకేగాదు. దుష్టకష్ట చరిత్రంబులకు నెల్ల నియ్యవి యాకరంబులు పోలీసు, రెవిన్యూ, ఉద్యోగస్థులయెడ, సాధారణముగనుండు మీమూటికి సహాయముగ జనులు గడగడమనివణకు భీతియు బయలుదేఱి, మనల నెట్టి యకృత్యములకైన విధేయులంజేయుట సుప్రసిద్ధం. 'రైట్టు' ను దండితుంజేయు నుద్యమమున గవర్నమెంటువారు వెను దీసినను ప్రజలేచేరి ద్రవ్యముల జందావేసికొని సేకరించి కేసుచేసి పగదీర్చిరనియంటిమి. అట్టిరాజసము ధర్మసంస్థాపనశక్తియు నీదేశమున నేమాత్రమున్నదో మీకుదెలియదా? తమహక్కులను సర్వభంగుల రక్షింతుమను ధైర్యము, పరులయొక్క హక్కుల నాక్రమింపమను నౌదార్యము, ఈ రెండు గుణములు మొత్తముమీద ప్రాచుర్యమునకు రానిదేశముల యోగ్యతా విశ్వాసములు శుద్ధముగ నుండవనుట నిర్వివాదమైన న్యాయము. యోగ్యతయు విశ్వాసమును బరస్పర శరణ్యములైన గుణములు. వీని కాద్యము ధర్మమునందలి నిష్ఠ. దానికి నిదానములు ధీరధైర్య పద్ధతులు. అనగా బలవంతులజూచి తప్పులేనియప్పుడు భయముంగొనమియు, బలహీనులయెడ ననుచితవృత్తి భయము జూపమియును, రాజసగుణముల విసర్జించి దొంగ వేదాంతములకుదిగిన రాజ్యములలో, పండ్లులేని పులివలె మోసముల నాశ్రయించువా రుందురేకాని, యవక్ర విక్రమాఢ్యులు తరుచుగనుండరు. వీరిమాయలే తుదకు వీరల మాయించును. మనలోపములకుదోడు శాసనలోపము లును జేరియున్నవి. ఇంగ్లాండులోబలె దొరతనము వారిచే జేయబడు సమాజముల లెక్కలపరీక్ష, ఇచ్చట నంతకఠినముగాదు. ఇపు డైదేండ్లలో నెన్నియో కంపెనీలుపుట్టి గిట్టుటంజూచియు, సమాజ నిర్మాతలుసేయు చోరత్వముం బాటించియు, గవర్నమెంటువారు త్వరలో నీలోపమును నివర్తిచేయ నున్నారు. ఇండియా దేశములోని చట్టముల ప్రకారము నిర్మింపబడిన సంఘములు, ఇంగ్లాండులోని చట్టములచే నిబద్ధములైనవాని యంతవిశ్వసనీయములుగావు. ఇండియా గవర్నమెంటువారును, ఈ మాయల మట్టుసేయుమార్గముల రోయు చున్నారు. అనతి కాలమ్ముననే నూతన శాసనములు వెడలుననుటకు నిమిత్తములు కాననయ్యెడిని.*[1]

విస్తార వ్యాపారము

మూలధన సంశ్లేష పద్ధతుల గొన్నింటి వివరించితిమి. ఇక నద్దానికి బ్రయోజనరూపమైన విస్తార వ్యాపారముయొక్క గుణ దోషమ్ములం బ్రకటింతుము:-

విస్తరత ద్వివిధము. 1. వ్యాపారమంతయు వ్యాపించుట. ఉదా. మునుపటికన్న దూదివ్యాపార మిపుడెన్నియో మడుంగుల పొడవుగాంచియున్నది. 2. వ్యాపారము లకుంజేరిన కర్మశాలలు ఘనతర ములగుట. చూడుడు! వ్యాపారము వృద్ధిగన్నను నందులకుజేరిన యంగళ్ళన్నియు వృద్ధియగుననుట యేమినిజము? అంగళ్ళలో పోటీలు హెచ్చిన కొన్ని యాఱడివోవుటయు గొన్ని కఱగుటయు గొన్ని పెఱుగుటయు సంభవించును. మఱియు వ్యాపారము సముత్కటముగ నున్నను నందలి యంగళ్ళన్నియు చిన్నచిన్న విగను హెచ్చిన సంఖ్య గలయవిగను నుండవచ్చును. కావున గర్మశాలా విక్షేపమునకును వ్యవహార విక్షేపమునకును నంతరువు ఉండుట భావించునది.

వ్యాపారము సమష్టిని వ్యాపించుటలో నొక లక్షణము తఱుచు గానంబడియెడి ఎద్దియనగా సజాతీయము లయిన కళలు, ఏకస్థానమున గుంపులుగట్టుట. ఉదా. చెన్నపురి రాజధానిలో రత్నకంబళ్ళకు ఏలూరును, దంతపుబనులకు విశాఖపట్టణము, తిరుచనాపల్లి, మైసూరు, తిరువాన్కూరులును, పుట్టినిండ్లుగానున్నవి. మఱి బజారులలోసైతము మిఠాయి యంగళ్ళన్నియు దీపములతోను, ఈగల తోను దేజరిల్లుచు నొకేచోట బారులుగట్టియుండును. షరాపువర్తకమువారందఱు నొకేదిక్కున గుమిగూడి యుందురు. పుష్పలావికలును గుమిగూడి యొక్క యిక్క ఘమఘుమమని వాసనలు నలుదెసలబాఱ సరససల్లాపము లాడుచుందురు. చిల్లరయంగళ్ళొకప్రక్క మొత్తపుటంగళ్ళొకప్రక్క నీరీతి సాదృశ్యము ననుసరించి కళలు వ్యూహములు గట్టియున్నవి దీనికి స్థానసాంగత్యము, స్థానైక్యము ఇత్యాదులు నామములు.

స్థానసాంగత్యము - స్థానసాంగత్యముం బుట్టించు హేతువు లెవ్వియనిన:

1. ప్రకృతిగుణంబులు. శీతోష్ణాదిస్థితులననుసరించి ఉత్పత్తియు నుత్పత్తిననుసరించి వ్యాపారములును బరిణమించును. బెంగుళూరు మితశీతోష్ణమైన స్థలంబుగావున నచ్చట పట్టు పురుగులు బాగుగా వృద్ధికి వచ్చుటంజేసి వానికిం దగిన క్షేత్రములు తోటలు తత్పరిసరంబుల బ్రతిష్టింపబడుచున్నవి. బొంబాయిలో సుప్రసిద్ధుడగు 'తాతా' యను గొప్ప వ్యవహారి బెంగుళూరి సమీపముననుండు నేలలగొని పట్టు పురుగులకు నాశ్రయమైన కంబళిచెట్టు తోటల నాటించినందులకు నాప్రాంతము యొక్క శీతోష్ణ సౌమ్య స్థితియే కారణము. బొంబాయి రాజధానిలో దూదిపంటకు ననువైన నల్ల రేగడభూమి విస్తారముగ నుంటజేసి యా వ్యాపారమున కాసీమ యాకరమాయెను. 2. రేవులు. ఎగుమతి దిగుమతి వ్యాపారమునకు రేవులు ముఖ్యములు. మంచి రేవు లన్నియు స్వతస్సిద్ధములు. బొంబాయి, కలకత్తా, రంగూను మొదలైన స్థలముల యభివృద్ధికి వాని యునికిపట్టు ప్రబల సహాయకారి. మఱియు రేవులుండు స్థలములకు వస్తువుల దెచ్చుటకును, అచ్చటనుండి వాని గొనిపోవుటకును, ఆస్థానములతో గూడిక గలవిగా రైలుమార్గములు వేయబడును. శ్రేష్ఠములైన రేవులు వర్తకము నాకర్షించుటలో నఖండప్రభావములు.

3. గనులు. ముఖ్యముగా, ఇనుము, బొగ్గు, వీనికి బుట్టినిండ్లగు గనులు. యంత్రరచనాది కళలెల్ల వీనివద్ద బ్రదుకునవి.

4. నీటిశక్తి. యంత్రములంద్రిప్పి పనిచేయించుకొనుటకు శక్తి యావశ్యకము. మనుష్యుల బాహుబలము మహాయంత్రములకుం జాలదు. పూర్వము ప్రవాహధారలచే జక్రముల దిరుగునట్లుచేసి తద్ద్వారా యంత్రముల నడుపుచుండుట పశ్చిమదేశములలో సర్వ సాధారణముగ నుండినందున ననేక వ్యాపారములు నదులయొడ్డున స్థాపనకువచ్చినవి. వర్తమానమున విద్యుచ్ఛక్తి నుత్పాదించు క్రియ మొదలగు కొన్ని కార్యములకుందప్ప ప్రవాహముల నంతగా సేవింప వలసిన విధిలేదు ఏలన, నీటిశక్తికిమాఱుగ నావిరిశక్తి నుపయోగించు చున్నాము. ఆవిరికి నీళ్ళుదొరకినంజాలును. వేగవంతము లైన ప్రవాహము లక్కఱలేదు. మఱియు విద్యుచ్ఛక్తియు యంత్రగమనమునకు నాధారము. అద్దానిని తంతులగుండ మనోవేగమున నెంతదూరమైన దీసికొని సులభముగ పోవచ్చునుగాన నదులు, ఆకాశ గంగలు, వీనియొద్ద నాశక్తిని గలిగించి వలసినచోటుల వినియోగింతురు. కావున కళలు గుమిగూడక చెదరియుండుటకు నీశక్తి ద్వితీయము, నిదానము.

5. పూర్వకాలమున పుణ్యక్షేత్రములు, రాజనివాస స్థానములు వర్తకమునకు శరణ్యములై యుండినవి. ఏలనగా వీనినాశ్రయించు టకు జనసమూహమ్ము లేతెంచునుగాన. ఇప్పటికిని వీనిప్రాముఖ్యము మొదలంట బోయినదిగాదు. కలకత్తానుండి డిల్లీకి గవర్నమెంటువారు వలసపోవలయునని చక్రవర్తిగా రాజ్ఞాపించినందున కలకత్తాలోని వర్తకులు తమయభ్యుదయమునకు విఘ్నము గల్పింప బడెనని యాక్రోశించుచున్నారు. హిందూ దేశములో పుణ్యక్షేత్రముల కుండునంత గౌరవ మితరరాజ్యములలో గానరాదు. కావుననే తిరుపతి, శ్రీరంగం, రామేశ్వరము మొదలగు పరమపవిత్ర పట్టణమ్ములు పూజాద్రవ్యములైన టెంకాయలు, పువ్వులు, అరటిపండ్లు, కర్పూరము, తిరుమణి, తిరుచూర్ణము, నూనె, నేయి మొదలగువానితో నింపబడి యుండుట. యాత్రాస్థలములన్నియు ముక్తికేగాక భుక్తికిని ననువైన సంతలు. కాల క్రమమున నీపాడుకలిమాహాత్మ్యంబు వర్ధిల్లుటంజేసి దేవతల యొక్కయు రాజ్యాంగము వారియొక్కయు ముఖ్యపట్టణ ములకు ననుగ్రహశక్తియు సంగ్రహశక్తియు లాఘవంబు నొందుచున్నవి.

ప్రకృతి గుణంబు లనుగుణంబులయ్యు పౌరుషంబు సాలదేని నుపయోగమునకురావు నదులు గనులు నెన్నియున్ననేమి? ఆవిరి యెంతయబ్బిననేమి? వానియం దంతర్భవించుయుండు ప్రయోజనంబు లెఱింగి యుచితవృత్తుల నధీనములంజేయు ప్రయత్నము నేరనివాని కవి యుండియు లేనట్టే. నిరుత్సాహ రాజ్యంబుల నదులచే సముద్రమును, ఆవిరిచే నాకాశమును బుష్కలత్వంబుం జెందుగాని ప్రజకుం బ్రతిపత్తి సంకలితంబుగాదు. కావున నెన్నిభంగుల జూచినను, అర్థానర్థములకు మనుష్యులే యుత్తరవాదులు.

స్థానసాంగత్యమువలని గుణము లెవ్వియనిన

యంత్రములయు తదితర రచనాసాధనములయు మేలుకీడులు సమీపస్థులైన యనేకులు పరీక్షింతురు గాన ద్వరలో గనుగొననగును. అట్ల గనుగొన్న విశేషములన్నియు నియ్యైవృత్తుల వారికెల్ల బోధపడుట సుగమము. ఏకవిధమైన శిల్పము నభ్యసించు వారెల్లరు నొక సమూహముగ నుండుటంజేసి పారంపర్య ప్రభావంబున వారిసంతతికిని, అందలి కుశలత సులభముగ నలవడును. చిన్ననాటి నుండియు నొక్కకళకు చేరిన మాటలవినుచు జర్యలజూచుచు నదేచింతగా నుందురుగాన బ్రావీణ్యము తమకుం దెలియక తమ్మా వేశించును.

ప్రత్తివ్యాపార మేకస్థలగతంబైనదానిచే విసర్జింపబడిన గింజలన్నియు గొప్పరాసులుగా లభ్యములౌటచే గింజలనుండి నూనె దీయుట. గానుగపిండి తయారుచేయుట యను నుపకళలకు గావలసినంత సామగ్రులు గల్గును. ముఖ్యకళలకు ననుబంధములైన కళల కుపకళలనిపేరు. ప్రత్తియంత్రశాలలు దిక్కున కొకటిగానున్న బ్రతియంత్రమునుండియు రాల్పబడుగింజ లల్పములౌట బ్రత్యేక వృత్తికిం జాలకపోవును స్థానైక్య ముపకళలకుం బ్రకాశకము. ఉపకళలు రెండు విధములు. 1. ముఖ్యకళలందు వర్జింపబడు వస్తువుల రచనకు దెచ్చునవి. 2. ముఖ్యకళలకును నుపకళలకును నావశ్యకములైన పరికరముల మరామత్తు చేయునవి. పది యంత్రశాల లొకటిగానున్న వానిలో వాడబడు చీలలు గొట్టములు మొదలగునవి కల్పించుటకు వేఱొకశాలయేర్పడ వీలుండును. శాలలు దూరస్థములైన నొకొక్క దానికి గొన్ని సాధనములుమాత్రమే సేకురినం జాలుంగాన నీకొంచెపాటి క్రియకు బ్రత్యేక శాలలు స్థాపనకురావు. సంస్కార క్రియలయందు నట్లే. బహుశాలా సంభరిత ప్రదేశముల సంస్కార శాలలకు దరుణముండును. తదితరస్థానముల వారివారి సంస్కారములను వారే చిల్లరచిల్లరగా జేసికొనుట యగత్యము. ముఖ్యకళలలోని యావేశనములు చిన్నవిగనున్నను వానికెల్ల సామాన్యములైన యుపకళాశాలలు పెద్దవిగ నుండకమానవు. ఇట్లు విస్తార వ్యవహారధురీణములైన యంత్రరాజముల నిర్మించి పనిజేయుట లాభకార్యంబగును. విస్తరతకొలది యంత్రములకు నింపు సొంపు నుండుననుట సుప్రసిద్ధము. ఏదైన నొకకళకు ముఖ్యాశ్రయమనిపేరుగన్న యెడకు దద్వృత్తికరులైన శిల్పులు "ఇందఱకు శరణ్యమైన చోట మనకు బని దొరకక పోవునా" యను ధైర్యంబునవత్తురు. కావున శిల్పులకు నట్టిపట్టణములు ప్రకృష్ట శరణ్యములు.

మఱియు నావృత్తిలో జీతములచట నేమాత్రముండుననుటయు సులభవేద్యమగాన గర్మకరులను మోసగించుటకుగాదు. కర్మకారులు శ్రేణు లేర్పఱచి సమూహముగా బేరమాడుటకును నుపాయము సిద్ధించును.

ఇక దోషములు:-

సజాతీయ కళాకీర్ణములైన స్థలంబులలో దదుచిత నైపుణీ సమేతులకుంగాని, ఇతరులకు గూలిదొరకుట కష్టము. దృష్టాంతము. బంగాళాలో మహాఘనమైన యయశ్శాల నేర్పఱచి యా శాలకుంజేరిన వారినే చుట్టుప్రక్కల నివసింపజేసి యయ:కర్మపురి నొండు నిర్మించు చున్నారనియంటిమి. అట్టిచోటుల కుటుంబభారముదాల్చు భంగు లెయ్యవి? ఇనుపపనికి బలాఢ్యులెకాని తక్కొరులు నిష్ప్రయోజకులు. కుటుంబమున బలవంతులైనవారెవరు? పదునెనిమిదిమొదలు నలువది సంవత్సరములలోనుండు మగవారుమాత్రమేకదా! ఇంటి లోని స్త్రీలకు బాలికా బాలకులకు వేఱువృత్తులులేకున్న గడవ యసాధ్యము. కావున గుటుంబముయొక్క యాదాయమంతయు గొందఱచే గూడబెట్టవలసినదగును. సరాసరి యాదాయము కొఱతవడని దానిం జేయుదురయేని, అట్టిచోటుల జీతములు మిక్కిలి ఎక్కువగా నుండినం గానికాదు. కావున స్థలముల కళలసంఖ్య లల్పములౌకొలది జీతము లధికముగావలయును. కానిచో గుటుంబముయొక్క మొత్తపు వచ్చుబడి యనేక కళలగలిగి యందఱకు బనులగూర్చు స్థలములయందంత పూర్ణత వహింపదు. ఈదోషమునకుం బ్రతిక్రియ యేదనగా నుపకళలు మఱియు విజాతీయములైన ఇతరకళలును బ్రతిష్ఠితములౌట. ఒకటి ముఖ్యముగానున్నను దానిం బరివేష్టించి గ్రహములువోలె మఱికొన్నియున్నను నింకను మంచిది.

ప్రకృతము కళాగంభీరములైన పట్టణము లతిశీఘ్రముగ బశ్చిమ రాజ్యములలో వ్యాపించుచున్నవి. లండను మహాపట్టణము యొక్క జనసంఖ్యయు వైశాల్యమును గంతులువేయుచు మీఱుచుండుట దీనికొక దృష్టాంతము. ఒక లండను పట్టణముయొక్క జనసంఖ్య యెంతని భావించెదరు? మైసూరి సీమయందలి దానికన్న రెండింతలు! ప్రత్తిశాలలచే బరిశోభితంబైన 'మాన్ చెస్టరు' అను నగరమునిట్లే. ప్రతిదినము నెల్లల దాటుచున్నది. మనదేశములో గ్రామముల పొలిమేరలవద్ద సరిహద్దుల రక్షించుకొఱకు నెల్లమ్మ యను దేవతను నిల్పుచున్నారుగదా! మనగ్రామములు నిలుకడ గలిగిన పరిమాణములు గలవిగాన ఎల్లమ్మ, కదలక మెదలక పెట్టిన తావుననె గూటముమాదిరి నుండవచ్చును. ఒకవేళ నింగ్లాండులో నెల్లమ్మలను నిల్పితిమేని యీ యెల్లమ్మలు దినదినము ముందునకు బోరేని, ఎల్లల గోచర దూరస్థములౌను. ఈ వ్యాప్తికి గారణం బేమియనిన; ఆ పట్టణములలో ననేకవిధములైన కళలు నుపకళలు నున్నంబట్టి యాబాలగోపాల మెల్లరకుం బనిదొరకుట యతిసుకరముగావున దండోపతండము లుగ జనులు వానిపై దుముకుదురు. జనస్తోమ మెక్కువయైన నింటిబాడుగ లతిశయించును. అందుచే నీనష్టమేలయని జనులు దూరముగనుండు నూతనభూములలో నివాసము లేర్పఱచుకొనుటచేత బురములు విరివిగాంచును. దూరముగబోయిన గర్మశాలలలో బనికిదిగుట యాలస్యము గదాయని శంకింతురేమో! ట్రామ్‌బండ్లు పొగబండ్లును గంటకు బదివంతున బోవుచుచుండగా నాలస్య మేలకలుగును? పట్టణములు ప్రసరించురీతి యిట్టిది. ఏకకళాస్పదమైన జాలదు. అనేక కళలకు నాస్పదమైయుండిన నింకను నుత్తమము.

యానసౌకర్యములే స్థానైక్య మిరుదెఱంగుల విరుద్ధమార్గముల నీడ్వబడుచున్నది. ఎట్లన, 1. క్రయ విక్రయస్థితుల నెఱుంగుట, దూరమ్ముననుండియైనంగొనుట, ఇవి సులభపధంబులగుగాన గళ లెయ్యెడనైన నొండెడ నుండినను గష్టములేదు. ఇందుచే స్థాన సాంగత్యము దృఢతరంబగును. 2. అయినను బ్రయాణ సౌలభ్యముచే గొనువారుండు చోటుల శ్రమకరులునుజేరి యచ్చటనే వస్తురచనలకుం దొడంగుటయు జులకన యగుంగాన గళలు మూలకొక్కటిగా బోవుటయు ననుకూలమ. ఇపుడిపుడు కొందఱు యానవేతనమ్ముల మిగిలించు నభిలాషయు, పట్టణంబుల శుభ్రమైనగాలియు నాఖేటకమునకు దగిన బయళ్ళును లేమియు దమ్ము బ్రేరేప నినుపదారుల పొంత నుండు గ్రామములలో నావేశముల గట్టుచున్నారు. ఉత్పత్తి కళలు చెదిరినను వర్తకుల యాపణము లంతగా జెదరుటగానము ధూమ నౌకాశకటంబులం జేసియకాదె యూరోపియనులు మనదేశమున దామే ప్రత్యక్షించి యార్థిక తంత్రంబులు నడుపుటాయె.

విస్తార శాలలు

ఇక నావేశన విస్తరతంగూర్చిన మంచి చెడుగుల విచారింతము. పరికర్షణ క్రియలైన కృష్యాదులు ప్రకృతి బద్ధంబులుగాన బరివర్తన క్రియ లీన్యాయపరీక్షకు విస్పష్టములైన నిదర్శనంబులు. వస్తురచనా కళలు విరివింగాంచినందుచే గలుగు లాభంబు లెవ్వియనిన:-

1. తమకు సామగ్రులైన యసంస్కృత పదార్థముల గొప్ప గొప్ప మొత్తములుగా గొన వచ్చుంగాన నవి చిల్లరబేరములకన్న నయముగ బ్రాప్తించుటంజేసి వ్యయము తఱుగును.

2. సంక్షిప్త వ్యవహారముల విసర్జితములైన బండములు ప్రత్యేకవృత్తికిం జాలకపోవుటచే వ్యర్థములుగా బోవును. విక్షిప్త వ్యవహారముల నివియు వినియోజ్యములగును. 3. యంత్రముల ప్రవేశములకు విస్తార వ్యవహారముల యందు బలె నల్పవ్యవహారముల వీలులేదు. యంత్రములును శీఘ్రంబున బలమఱి మార్పబడునవిగాన నీవ్యయముభరింప సంకుచిత వ్యాపారులకు వలనుగాదు.

4. నూతనవిధములం బరీక్షించుటకు నాఢ్యులకేగాని యల్పుల కసాధ్యము.

5. గంభీర వ్యవహారులు ఖర్చులు గణింపక దేశదేశమ్ముల దమవస్తువులం బ్రకటించి వానియందు జనుల కాసక్తిని రక్తిని సృష్టింతురు. చిల్లరవారు వాడుకకాండ్రకేగాని పరిచయములేనివారికై వస్తువుల సిద్ధపఱచుశక్తికి దూరులు.

6. మొత్తముగాగొనుట. మొత్తముగా విక్రయించుట, అయ్యై చక్రంబుల దమయుద్యోగస్థుల నిల్పి వారిచే వర్తమానముల నెఱుంగుట, సుప్రసిద్ధమైన పేరుగాంచి తమయందెల్లరకు విశ్వాసముండునట్లు చేయుట, తుట్టతుదకు వైరుల నిర్జించి యేకచక్రంబుగా గార్యంబుల నడుపుట, ఇత్యాది ప్రచారములు బలవంతుల కుం జెల్లుగాని దుర్బలులకుం జెల్లవు. కావుననే యాధునిక సమయమున నెక్కడ జూచినను చిల్లర వ్యవహారములు సూర్యోదయంబున నక్షత్రముల మాడ్కి మఱుంగువడి మందభాగ్యము లౌచుండుట. మఱియు వృద్ధి వృద్ధికి గారణంబుగాన నెక్కువయౌకొలది నింకను నెక్కువగ బోవుట సుఘటము.

7. కర్మకరుల సంఖ్యయు నాతతముగ నుండుగాన శ్రమను లాభాపాదన పర్యంతము విభజించి ప్రతిక్రియకును నిపుణులైనవారి నియోగించుటయు విస్తార కళాశాలలవారికి లఘుతంత్రంబ.

8. వ్యవహారమండలియందలి స్థితిగతుల నరయుటకు ఘనులకు బోలినట్లు లాతివారలకుం బోలదు. నవీనవిచారణల కుద్యమించి యాను కూల్య ప్రాతికూల్యముల నిర్ణయించి త్రోవజూపువారు ఘనులు. వారిననుసరించిపోవువారు చిన్నలు.

అయినను బరిమిత వ్యాపారుల పరంబులైన యానుకూల్యములును గొన్నిగలవు. అవి యెవ్వియనిన:-

1. తామే స్వయముగ నన్నింటిని విచారించుకొనుట సులభకార్యము. మధ్యవర్తులైన విచారణకర్తల నమ్మియుండవలసిన విధిలేదు.

2. బంగారు, వెండి, రత్నములు ఇత్యాది పరమమూల్యములైన వస్తువుల రచనయందు యజమానుల కంటికిదూరములైన క్రియలున్న నష్టముతప్పదు. ఈ వ్యాపారమందలి మళిగెలు మిక్కిలియునల్ల నేరవు.

3. వర్తమానమున సీమసీమల వృత్తాంతములును వార్తాపత్రికలు దొరతనమువారి ప్రకటనలు వీనిచే నెఱుంగుట సాధ్యంబుగాన నార్థికస్థితిగతుల గుఱించిన జ్ఞానము గొప్పవారితో నించుమించు సరిసమముగ దమకు నలవడుటయుం గలదు.

4. యంత్రాదులయందలి వృద్ధికరములైన సంస్కారములను బ్రకృతి శాస్త్రజ్ఞులు గనిపెట్టునట్లు వ్యాపారులు గనుగొనుట యసంభవము. శాస్త్రజ్ఞులు విద్యాదాన మెల్లరకు సమాదరముతో జేతురు గాన సంస్కరణ జ్ఞానము దుష్ప్రాపంబుగాదు.

5. వాడుకకాండ్ర గుర్తెఱిగి వారిమనసులకుం బ్రియమైన గతుల నడుచుటకు నవసరము గలవారుగాన దమవస్తువులు గిరాకి విశేషించి యెదుగకున్నను దఱచు కుందు నొందుటయులేదు. కావున విస్తార వ్యాపారసముద్రముపొంగి తమ్ము గొట్టికొని పోవుననుభయము సకారణముగాదని గ్రహింపవలయును.

సవిస్తరత యన్నివృత్తులయందును సమవర్తి కాదనుటయు దెలిసియున్నది. వృత్తుల గుణంబులకును విన్యాస సౌలభ్యమునకు నుండు ప్రవృత్తి యెట్టిదనిన:వ్యవసాయము. విస్తారకృషికి నియ్యది యనువైనదిగాదు. పొలములు చిన్నవిగానున్న మంచిదియా పెద్దవిగానున్న మంచిదియా యనుట యికముందు చర్చింపబడును.

సవిస్తరత యీరీతి ననేకభంగులం బ్రవర్తిల్లునదియైనను దానికిని నెల్లల విధించు నడ్డంకిపాటులున్నవి. అవి యెవ్వియన:-

సవిస్తరతను మితమునొనర్చు హేతువులు

1. యజమానులయొక్క కార్యనిర్వహణశక్తి. మనుష్యు లప్రమేయ జ్ఞానశక్తి సంపన్నులు గారు. తమశక్తి యుక్తులకుమించిన భారము దమపై మోపుకొందురయేని పనులకును దలలకును జేటు నిక్కువము. మఱియు వయసుముదురుకొలది నన్నివిజృంభణంబులు నడగుట సహజము. కావున వ్యాప్తియందలి యుత్సాహమును భగ్నమౌను. ఒకవేళ దన్నెదిర్చిన వారినెల్ల నడంగద్రొక్కినాడుబో, "ఇంకెవ్వరు సములు లేరుగా" యని పరిశ్రాంతుడౌటయు మనుష్య ప్రకృతియ.

తానెంత చతురుడైనను తనవెనుకటివాడును నంత చతురుండగుననుట సందేహాస్పదము. ఆస్థికింబలె శక్తికిని సంతతివారి నొడయలుగజేయు రహస్యమింకను ప్రకాశమునకురాలేదు. వీనికన్నింటికన్న ముఖ్యమును, ఆర్థికమర్మముల నంటునది యునైన కారణంబింకొండుగలదు. అదెయ్యదియనిన:-

ఉత్పత్తిచక్రము వినిమయచక్రముతో సంధించునది. అనగా వర్తకముతోజేరి యుత్పాదనక్రియ యున్న దనుట. ఇది పూర్వమే వివరింపబడిన విషయము. ఈ సంబంధముగాక యీ రెంటికిని విరుద్ధ భావ మొకటియున్నది. అదియేదనిన:-

వర్తకము గిరాకికి విధేయము. గిరాకి యనగా వస్తువుల యందలి మమత. ఇది త్వరలో బూర్తికి వచ్చునదియైన నమిత రాసుల సిద్ధపఱచుట నిష్ప్రయోజనము. కావున వాంఛ లెందు స్థిరంబులైయుండు నెం దస్థిరములై యుండుననుట విచార్యము. చూడుడు? బోజనపదార్థములు మొదలగు నావశ్యక పదార్థముల మీద నొకమితమువఱకు నభిలాష యెన్నటికింజెడదు. ఏవియున్నను లేకున్నను ధాన్యములు, ఇండ్లుగట్టు కొనుటకు సాధనములైన నేలలు, కొయ్యలు, మన్ను, సున్నము, కొంచెముఇనుము, సాధారణ వస్తువులకు వలయు ప్రత్తి, ఇవి యుండియే తీరవలయును. ఇక నీవస్తువుల లక్షణ మేమనగా నివి పరికర్షణ కళలకుం జేరినవి. అనగా వీనియందు సవిస్తారోత్పత్తి. హీనవృద్ధి ప్రకృతి గుణంబులు వీనిచే బాధితము. మఱియు ఘనతరములు నఖండవ్యాప్తములునైన క్రియలు సాధారణముగ నలంకారకళలైన విరచిత వ్యాపారములయం దుపగతములు. ఇట్టివస్తువులయందలి వాంఛ బహుచంచలము. సముద్రములోని తరంగములకరణి లేచుచు వ్రాలుచు నుండును. దృష్టాంతము. చీరలు తప్పక యందఱు ధరింతురుగాని బనారసుచీరలే కట్టితీరవలయునను విధి ఎవ్వరికినిలేదు. తళుకుం జీరల యెడ నేడపరిమితమైన యాశయుండవచ్చును. ఇంక గొన్నినాళ్ళకిది తరహాగాదని యేమహారాణియైన స్వప్నము గనెనేని, ఆమె పల్కినపల్కులే వేద వాక్యములుగ భావించు నంగనాచు లందఱు కాశీచీరలు వలదని, ఇంకొకదానిపై తిక్కంగొందురు. ఆభరణములపాటు నీరీతిదే. నేడు తరహాయని యనిపించు కొనునది రేపు వరహాకైన బోవనిదగును.

అట్లుండుటచేత విస్తారముగ రచించుటకు జాలినయవి స్థిరమైన యాదరణకుం బాత్రములు గావు అందుచేత సవిస్తరత మితముం జెందవలసినదవును. మఱి వేనియందు నాదరణము మొత్తముమీద ననశ్వరమో యవి ప్రకృతిబద్ధంబులై యమిత విస్తారోత్పత్తికి నర్హములుగావు. అమితాసక్తియు నమితో త్పాదకశక్తియు రెండును సమంబుగ నావేశించిన వస్తువులు మృగ్యములు. ఇంతేకాదు. దూరదేశస్థులు ఇక్కడివారినుండి కొనవలయునన్న దామే నేరుగ వచ్చుచు బోవుచు నుండవలయునేని, నాఇక్కట్టుచేత వర్తక మపహృత విన్యాసమౌను. అలంకార వస్తువులు కంటితో జూడనిది తీయుటకుగాదు. వర్తకుల వర్ణనలనమ్మి ప్రత్యక్ష పరీక్షసేయక భూషణములను, పట్టువస్త్రము లను, పలురకముల సుందరములైన తల గుడ్డలను నెవరైన గొందురా? కావున విరచితములకు నరచితములకుంబలె పణ్యసౌలభ్యములేదు.

పణ్యసౌలభ్యమనగా ననాయాసముగ దూరస్థులకైన నమ్ముడువోవు గుణము.

పణ్యసౌలభ్యమునకు నిదానములైన స్వభావము లెవ్వియనిన;

1. ఏకగుణము గలిగియుండుట. ఉదా. బియ్యము, రాగులు, పెసలు, గోధుమలు, ప్రత్తి, కడ్డీయినుము ఇత్యాదులు. వీనిలో రకములు బొత్తిగాలేవనుటకాదు. మఱియేమన, విరచితముల యందుంబలె నసంఖ్యాకములైన విధములులేవు. బయటియూరువారు సైతము వచ్చిచూడకయే గుణముల నించుమించుగ నిర్ణయింపజాలినంత యమిశ్రము లైయుండునవి. బట్టలయంగడివాడు ప్రత్తిబస్తానుండియు దుండ్ల గత్తిరించి పంపినగాని చూడకయే యుత్తరువులం బంపలేము. అపుడును శంక నిర్మూలమగుట యరుదు ఏలన చిన్నతునకగానుండునది రమణీయమైనను మన దేహచ్ఛాయకది సరిపోవునా పోవదా? చొక్కాయగా గుట్టించిన సమష్టిలో నింత బాగుగానుండునా? యను సందియము గొందుము. చొక్కాయిచేయించి తొడుగుకొన్నపుడు స్నేహితులామోదించి చప్పట్లు గొట్టినంగాని మనసులోని తహతహ తీరదు. ధాన్యాద్యరచితములయెడ కలవరమింత దట్టముగనుండుట యసాధారణము.

ప్రకృతి సిద్ధములైన వస్తువులలో మనుష్యసిద్ధములైన వానియందుబలె నానావిధములు లేకునికికి గారణమేమనగా, మనకన్న ప్రకృతి చిత్తము స్తిమితము! మనలో నిమిషమునకు నొకరుచి, రుచికి రెండరుచులుగా నుండును. కావున మనుష్యకల్పితము లమితభంగులు గలయవి. ప్రకృతి కల్పితములు మితభంగులు. కల్పనాశక్తి యెట్లో రుచులునునట్లే. సహజములైన బుభుక్షాదివాంచలు సామాన్యములు విస్పష్టస్వభావములు. నాగరకత, విద్య, భావనాశక్తి, చిత్తచాంచల్యం వీనిచే బ్రేరేపింపబడు వాంఛ లమేయములు. వీని స్వరూపముం బూర్ణముగా నెఱుంగ నేరికిని నలవిగాదు.

రచితములు రెండు తెఱంగులు. అల్పరచితములు, విశేషరచితములు. స్వల్ప రచితములు:- కడ్డీయినుము, కడ్డీబంగారు, కత్తులు, నాగేళ్ళు, పాఱలు, గడ్డపాఱలు ఇత్యాదులు.

విశేషరచితములు - కాశీచీరలు, సుందరముగ జెక్కబడిన కొయ్యలు, చిత్రములు, ప్రతిమలు, ఆభరణములు మొదలైన యలంకార సామగ్రులు.

ఈరెండువిధములలో స్వల్పరచితములకు పణ్యసౌలభ్యమెక్కువ. వీనియందు విస్తార కర్మశాలలకు మంచి యాశ్రయము గలదుగాన నవి ప్రబలములయి చిల్లర యంగళ్ళ జీకాకుపఱచుచున్నవి. విశేషరచిత ములు మెప్పూనూనియుండునవిగావున విస్తారోత్పత్తికి నివి ఎత్తినవిగావు.

కావున మనసిద్ధాంత మియ్యది. అధికవృద్ధి న్యాయాకారములైన వృత్తులలో స్వల్పరచనాకళలందప్ప దక్కుంగల కళలలో విస్తారోత్పత్తికి నెడమున్నదిగాని తత్సదృశ్య విక్రయమునకు నెడము లేనందున నుత్పత్తి యపారంబు గానేరదు. స్వల్ప రచనాకళలయందు గంభీరములైనశాలలు, అల్పశాలలకు మృత్యునిభమ్ములు. హీన వృద్ధికింజేరిన పరికర్షణ కళలయందు క్రయవిక్రయము లనాయాసముగ నడువబోలినను విస్తారోత్పత్తి సులభసాధ్యంబుగాదు.

మేలియంత్రముల సాయముచే వృద్ధిగాంచు మళిగెల జీవిత మనిత్యము. ఇంకను నుత్కృష్టములైన యంత్రముల నితరులు నిర్మింప జాలిరేని వానికి ప్రాణము లల్లలనాడును. ఇదియు విస్తరతకు భంగకరము.

విస్తారశాలల ప్రభవిల్లు వృత్తులు

1. రచనాకళలు. స్పష్టము.

2. విక్రయస్థానములు. పెద్దయంగళ్ళలో బలుదినుసులును బ్రతిదినుసులోను నానా విధములైన రకములు నుండునుగాన నయ్యవి స్వయంవర రంగములు, రసికజన సమాదరణీయంబులు, గమ్యంబులు.

3. సంచయములుగా వస్తువులంగొని యమ్మకమునకు నుంతురు గాన దీయుసెలవు తక్కువపడును.

4. మొత్తముగ సరకులదెచ్చుటయు గొనుటయు గలదు కాన యానవేతనములు నచ్చివచ్చును.

5. ఉత్పాదన శాలలయందుబలె పణ్యశాలలయందును విస్తార వ్యాపారులు లఘు కార్యంబులకెల్ల సేవకుల నియోగించి తాము గురుకృత్యంబులైన మంత్రాలోచనాదులం జేయ నవకాశముం గల్పించు కొందురు. చిల్లర షాపులలో నిన్నిపనుల జేయవలసినవాడు యజమానుడొక్కడే.

చిన్నయంగళ్ళ వారియం దభిగతములైన భవ్యంబు లెవ్వి యనిన:-

1. స్వయంవిచారణ. స్పష్టము.

2. వినియోజకుల కనతిదూరమ్ముననుండుట. పెద్దయంగళ్ళను వీధివీధికిని బెట్టుటకుగాదు. చిన్నయంగళ్ళు వెదజల్లినట్లుండవచ్చును.

3. వాడుకకాండ్రతోడి పరిచయము. వారిమనసు పొందెఱింగి నడచియు వస్తువుల సమకూర్చియు దమతో నియత క్రయకులం జేయుట. 4. అరువుగానమ్ముట. అరువనగా నాణ్యముబట్టి ఋణముగా నిచ్చుట. గుర్తెఱుంగని మనుష్యుల నడవడి తెలియదుగాన విశ్వాసయోగ్యత నిర్ణయించుట యసాధ్యము. మఱియు రొక్కము నప్పుడే ముందు పెట్టవలసినదిలేదన్న నెక్కువ విక్రయములు వెలయగలవు.

5. హిందూదేశములో జాతిమతాదిభేదము లల్పశాలల కనుకూలములు. ఎట్లన, ప్రతితెగవారును ముఖ్యముగా భోజనపదార్థన్వేషణమ్మున సజాతీయులచే తడవుదురు గాన విక్రయములు కుఱుచ వడును. అందుచే నంగళ్ళు ప్రబలవిశాలములౌట యరుదు.

పశ్చిమదేశములో బ్రకృతము మళిగెలు విస్తరించుటకు సహాయకరములైన యాధారములు గొన్ని ప్రసిద్ధికి వచ్చుచున్నవి.

అవి యెవ్వియనిన:-

1. రొక్కపు వ్యాపారములు తఱచుగ నాచారములౌట.

2. ధనికులు తామే పణ్యవీధుల గౌరవహానియని తిరుగరు. మళిగెల యజమానులును వచ్చినవారికి దాసులట్లు మెలంగుట మర్యాదకు భంగకరమని యాశ్రయింపరు.

3. యానసౌకర్యముంటబట్టి దూరముననుండు షాపులును సమీపస్థములయట్లే యుండును.

4. పూర్వమట్లుగాక ప్రతివాడును దనకు జెలువములని తోచిన వానిన కొననెంచును. ప్రాచీనా చారముల ప్రకారము మనసుండినను లేకపోయినను దీయుదమనువారులేరు.

5. మఱియు నిప్పుడిప్పుడు రంగుల పొటగ్రాపులను (ఛాయా ప్రతిబింబములను) నెత్తుక్రియ పక్వమునకు వచ్చుచుండుటచేత దమ వస్తువుల యాకారము వెలయించు సరకుల జాపితాలను దయారుచేసి వాడుకకాండ్రకుం బంపుదురు. కావున దూరస్థులును వస్తువే సాక్షాత్కరించినట్లుండు నాచిత్రములంజూచి వరియింపగలరు. ఈ న్యాయముచే విశేష రచితములైన యాభరణాదులకు మునుపు లేనియంత విక్రయ సౌలభ్యము గలుగుచున్నది. ఇందుచే విశేష రచితములకు సయిత ముత్పత్తి వినిమయమ్ములయందు శాలావిస్తరత సుసాధ్యమ. మఱియు గ్రామములు సీమలు పరీక్షార్థమై తిరుగు రాజ్యాంగోద్యోగస్థులు జాపితాలం బ్రకటింపనేరని యాసాములతో బేరసారములు జఱుప జాలరు. జాపితాలున్న, వానింజూచి వలయు ద్రవ్యంబులకై ముదలనిడుట చులకన యైనపని.*[2]

చిన్న యంగళ్ళవారికి శరణ్యములైన వృత్తులేవనగా:-

1. మరామత్తుపనులు. ఇవి స్వభావముచేతనే చిల్లర చిల్లరగా దటస్థించు లోపములు.

2. త్వరలో జెడిపోవువస్తువుల వ్యాపారములు. ఉదా. పచ్చి చేపలు. వీనిని మూకలుగా బ్రోగుచేసిన ముక్కునకు జేటేగాని లాభము మృగ్యము.

యానవృత్తులు:- ఇందు విస్తారవ్యాపారులకు నానాట బ్రవేశ మధికమయ్యెడిని. ఉదా. ట్రాంబండ్లు, ధూమశకటములు, ఇత్యాదులు గొప్ప గొప్ప సంఘములకుమాత్రము సాధ్యములు. జట్కాబండ్లలో గూడ కంపెనీ లేర్పడు చున్నవి. వీనియందు వైరములేని వ్యవహారము ముందునకు వచ్చుచున్నందున బ్రజల క్షేమము భద్రపఱచుటకై రాజ్యాంగము వారు చూచుకోవలసినదని యనేక శాస్త్రజ్ఞుల యభి ప్రాయము.

  1. * ఈ విషయమైన చట్టమొండు, ఇటీవల శాసింపబడినది.
  2. * చిత్తరువులకుంజేరిన వస్తువుల సృష్టికి చేతిపని యావశ్యక ముగావున, వీనియందు విస్తారోత్పత్తి విక్రయములకు తరుణములేదు. రంగుల పొటగ్రాపులకన్న హస్తరచిత చిత్రపటములు సామగ్రుల యాకారముల బ్రకటించుటకు సుకరములు. వీనిని రంగులతో ముద్రించుట సులభము.