భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఎనిమిదవ ప్రకరణము

ఆర్థిక మాత్సర్యముచే బుట్టు ననర్థములు

స్పర్థావిషయమైన చింతల నుపన్యసించుచో నందుచే మేలులేగావు కీళ్ళును బొరయునని వాదించితిమ. ప్రకృతమీ నికృష్టంబుల నింకను విస్తరముగ విశదీకరింతము.

క్రయ్య క్రేయ్యములు తులదూచినట్లు సరిపోయిన కష్టనష్టము లెన్నండును గలుగవు. క్రేయమనగా నమ్మకమునకువచ్చు వస్తుసముదాయము. క్రయ్య మనగా నర్థులు గొననుద్యమించిన వస్తు సముదాయము. అనగా నొకవెల ప్రకారము, అను సమయము రెండింట గూఢమని యెఱుంగునది. అర్థులకుం జాలకపోయినవారికి కష్టము. అమ్ము వారలయొద్ద విక్రయమునకుబోక శేషించి రాసులు నిలిచెనేని వీరికి నష్టము. కొందఱు శాస్త్రజ్ఞులు, ఇవి రెండును తూనిక వేసినట్లు సమత్వమందుట సర్వపక్షములకును శ్రేయస్కరంబని యెంచినవారై ఈ సమత్వంబు నొడగూర్చు విధంబులెవ్వియని రోయదొడంగిరి. వారియభిప్రాయములను గొన్నింటనిట జర్చింతము.

తమకు వలయు పదార్థములం దామే సేకరించు కాలములోను, అనుమతి నొందికాని యుత్పత్తికి ప్రారంభింపని కాలములోను గ్రయ విక్రయరాసుల సమత్వము సహజముగ సిద్ధించుననుట స్ఫుటము. ఆధునిక సమయమున జనుల యాదరణ నిరీక్షించి ఉత్పాదకులు వస్తు రచనకుం దొడంగుటంబట్టియు గ్రయ విక్రయ చక్రములు దృష్టికి మించిన వైశాల్యవంతము లగుటజేసియు నీసమత్వమసిద్ధము, అట్లగుట వీనికి దుల్యభావం బాపాదించు స్థితిగతు లున్నవా, లేవా, యనుట విచార్యము.

1. మూల్యములు ధరలు. ఇవి సమత కనుకూలించునని యను వారి మతప్రకారము:అడ్డులేని స్పర్ధయుండెనేని, వాంఛాపూర్తికి జాలినంత వస్తువు లుత్పత్తికావేని - అనగా గిరాకికన్న సరఫరా తక్కువయైన - వస్తువుల వెలలు హెచ్చును. వ్యవహారులకు లాభ మధికమౌను. కావున స్పర్ధచే నితరులాక్రియకుం బూనుదురు. వస్తురాశి యధికమగును. వెలలు వ్రాలును. మఱియు నమిత రాసులు సిద్ధములై యున్న వెలలు తఱుగును. నష్టము వచ్చును. స్పర్ధయు స్వాతంత్ర్య సంచారము నున్నయెడల కొందఱీ పనులమాని, ఇతర కార్యములకుం జొత్తురు. రాసులు తఱిగి వెలలు ఎగయును. చూడుడు! వెలలు ఒక మితమునకు మించినను దగ్గినను స్పర్ధచేనైన చలనముచే మఱల నామితమునకువచ్చి నిలుచునవిగానున్నవి. ఈమితమెయ్యది? ఎద్దాన నిర్మితము? అనుట యెఱింగితిమేని క్రయ్య క్రేయముల సమత్వసిద్ధికి గారణం బెద్దియనుట యేర్పడును.

లాభ మమితమౌట, నష్టమువచ్చుట, ఇవి యార్థిక చలనములకుం బ్రేరేపకములు సరి, దీనియర్థమేమి? లాభ మెప్పుడమితమౌను? వస్తురచనకుబట్టు వ్యయమునకు మించిన వెలలున్న నమితలాభము. దీనికి దగ్గిన వెలలున్న నష్టము. కావున నార్థిక తంత్రమను తులకు నట్టనడుమ హెచ్చు తగ్గుల సూచించునదిగా నుండుకీలు, ఉత్పన్న వ్యయము. ఇద్దానితో విక్రయకులు విధించు నవియు క్రయకు లంగీకరించునవియునైన వెలలు ఏకీభవించునేని కష్టనష్టములులేని సమత్వ మలవడును. ఇంతేకాదు. అని యేకీభవింపవేని చలనములు సహజ స్పర్ధచేబుట్టి సంయోగముం గలిగింపజూచును. ఉత్పత్తి వ్యయము రాజు. దాయకులధర పెద్దభార్య. గ్రాహకులధర చిన్నభార్య. ఈ మువ్వురికిని బ్రణయ కలహములు గలిగినప్పు డార్చి తీర్చి ముచ్చటగాగూర్చు విదూషకుడు సహజ స్పర్ధ.

కావున నార్థిక సమత్వము, ఏకాలమందైన సంపూర్ణ సిద్ధికి రాకపోయినను నామార్గముగా క్రయవిక్రయ స్థితులం ద్రిప్పుటకు మాత్సర్యము చోదకము. ఈ మతమునకుం బ్రత్యాఖ్యానము:-

స్పర్ధచే సహజముగ సమత్వము కుదుర్పబడుటకు నేరవేర్ప బడవలసిన సమయములెవ్వి?

1. గిర్రకి హెచ్చిన నాక్షణమే సరఫరా హెచ్చుట.

2. గిరాకి తగ్గిన నాక్షణమే సరఫరా తగ్గుట.

3. ఉత్పత్తి జేయువారు క్షణమాత్రములో దమసాధనములైన యంత్రములు మొదలైన వానితో గూడ వృత్యంతరము జెందునంత చరత్వము గల్గియుండుట.

అనుభవములో నీసమయములన్నియు నమానుషములు, అసాధ్యములు, అసంభవములు, సద్య:కాల పరివర్తనము నాధారముగా గొని వాదించువారు ఋషీశ్వరుల కాలములో హిందూదేశములో నవతరించియుండి యా వాసన నింకను వదల కున్నారేమో! ఏలన నాకాలములో సంకల్పమాత్రమున, ముఖ్యముగా సంతానకృషిలో, జయమునొందుటయందు మనఋషు లఖండప్రభావులై, సద్యోగర్భమను పేర బది నెలలుపట్టు కార్యము నిమిషమాత్రములో నెరవేర్చి, యుల్లాసముతో బిల్లల నీనించుచు, పామరధర్మమగు మమతనంతయు విడిచి, యేమాయెనని వెనుకకు దిరిగియైనంజూడక, తమదారిని బోవు చుండిరనుట మహాసత్యముగదా! ఈకలియుగములో సత్య:కాల కార్య సిద్ధులును నాఋషులతో నంతర్ధానమైనట్టున్నది! మనము కాలపాశ బద్ధులము. భార్య భయపడినను ప్రొయ్యి భయపడి పనిచేయునా? కాలంబు గడవనిది ప్రయోజనములు పక్వదశకురావు.

1. యంత్రముల నొకపనినుండి యింకొకపనికి ద్రిప్పుట తలచిన మాత్రమున నయ్యెడి పనిగాదు.

2. పంట లమితము లయ్యెననుకొనుడు! స్పర్ధ యెంతయుండి మనసును గలచిననేమి? భూమిలో నిక్షిప్తములైయుండు నెరువు మొదలగు రూపాంతములంజెందిన మూలార్థములను లేవదీసి వేఱు కార్యంబులలో వినియోగించుటెట్లు?

3. క్రయ విక్రయ స్థితులచే వృత్తులకు క్షయ వృద్ధులుండుట నిజమే. అయినను వీనిచేనయ్యెడి మాఱుపాటులు సంఘమునకు క్షేమం దెచ్చునవియా యనుట వివాదాంశము. ఉదా. లాభమున్నదని పుంఖాను పుంఖములుగ జనులు వకీళ్ళగు చున్నారు. దీనిచే దేశమునకు మేలా? దృఢంబుగ మేలేయనుట తెంపుగాని యింపుగాదు. సరఫరా గిరాకియు సదృశములైనంజాలునా? ఇవి సంఘాభి వృద్ధికి యుక్తములైన తెఱంగుల వర్తిల్లుచున్నవా యనుచింత యుండవలదా? గ్రాహకులున్నవారని కల్లంగళ్లు ప్రబలుట శుభకరమా? క్రయ్య క్రేయమ్ములు సంయుక్తతంగాంచు జాడగలవిగానున్నవనుట యొప్పుకొనవలసినదేకాని, వెలల మాత్రముచే వఱలు సంయోగము సంఘమునకు మంచిదనుట మసిలేనిమాటగాదు.

కావుననే సమష్టివాదులు అనిరుద్ధస్పర్ధ వృద్ధికిం విఘాతంబని వాదించి సంఘచోదిత పధంబుల వృత్తుల నలవరించుట మేలనుట. ఉత్పాదనక్రియల నెల్లరు విచ్చలవిడి బ్రవేశించుటచే గొన్ని యుత్పాతములు పుట్టును. ఎట్లన, అమితోత్పత్తి గలిగినేని ఆ ఉత్పత్తి మఱల మితికివచ్చులోన వెలలువ్రాలవలయు. అనేకులు దానిని వదలి వేఱువృత్తులకు నెగిరిపోవలయు. ఇట్లు పున:పరిమితి సాక్షాత్కరించులోన దివాలెత్తి నెత్తిన గుడ్డవేసికొని పోవువారెందరు? అలమట నొందువారెందరు? పశ్చిమఖండములలో వర్తకము, ఉత్పత్తి, ఇవి క్రమములేనివిగ నుండుటచేత నప్పుడప్పుడు గొప్ప క్షోభలు పుట్టును.

ఆర్థిక క్షోభలు

ఆర్థిక క్షోభలు రెండువిధములు. అధికోత్పత్తిచే గలుగునవి. అల్పోత్పత్తిచే గలుగునవియని.

అధికోత్పత్తి క్షోభ

అధికోత్పత్తికి గారణము లేవనగా:-

1. విస్తార వ్యాపారశాలలు. మహాఘనములైన యంత్రముల నూరకయుంచిన జెడి పోవును. కాన వెలలు దిగుట కారంభించినను నిలుపక యుత్పత్తిజేతురు. ఇందుచే ధర లింకను బతితము లగును.

2. ఒకవృత్తిలో ననేకములైన గంభీరశాలలున్న నొండొంటిం గడచి విక్రయముల నాక్రమించు కొనునాసతో ప్రతిశాలయందును సాధ్యమైనంత రాసుల సిద్ధపఱతురు. అట్లగుట మొత్తముమీద గిరాకికన్న సరఫరా యెక్కువయై యందఱకు నష్టముగల్గించు.

3. ప్రకృతమున బ్రతిరాజ్యమువారును బరమండలములనుండి వస్తువుల ననర్గళముగ దిగుమతి జేయనిచ్చిన దమదేశములోని వ్యాపారులకు నష్టమువచ్చునను శంకచే నధికముగ శుల్కములవిధించి సులభముగ బరపదార్థముల రానియ్యరు. ఎగుమతులకు బ్రోతాహముం జూపుటయు దిగుమతుల నాపుటయు నింగ్లాండుదక్క తక్కిన రాజ్యములం దన్నింటను మిక్కిలి శ్రద్ధతో నుద్ధరింపబడు పద్ధతిగా నున్నది. ఇందుచేత నుత్పత్తిచేసిన వస్తువులకు నిరర్గళ వినిమయ మలభ్యము. కావున నమ్ముడుపోక నిలిచి వ్యాపారులకు నష్టము దెచ్చును.

"అయిన నొక్కటి. ఏమి? అధికోత్పత్తియను ప్రళయ మొకటి యున్నదా? వస్తువులు చాలక కోట్లకొలది జనులు తమ వాంఛల దీర్చుకొనలేక పరితపించుచుండగా నాదరమునకు మీఱిన రాసులున్నవనుట యాశ్చర్యముగాదా! చెప్పువారికి మితి లేకున్నను వినువారికి మతిలేదా? ధాన్యములు, వస్త్రములు, బండ్లు, మిద్దెలు, మేడలు, పట్టుదుకూలములు, ఆభరణములును నొక్కహిందూదేశములో నుండు వారికి నాశదీఱునట్లియ్యవలయునన్న భూలోకములోని యుత్పత్తి యంతయు మూటగట్టితెచ్చి పంచినను "ఇంతేనా, కాలువాసికఱవైన దీఱలేదే" యని యందురే? ఇక నమితవస్తుసృష్టికిం జాలిన బ్రహ్మలున్నారా? వారికెన్నితలలు? ఎన్నిచేతులు?" అని యడుగ వచ్చును. వీరికేమని ప్రత్యుత్తరమిత్తుము? ఆశ లమేయములుగ నుండుట నిజమే. వస్తువుల నుచితముగ దానముంజేసిన హిందూ దేశీయుల సమారాధనకే చాలక పోవును? కాని యట్లిచ్చిన వ్యవహారుల కేమిలాభము? వారివ్యయమైన వారికి దొరకునా? కావున గిరాకి యనగా రిత్తయాశగాదు. బదులు వస్తువులో ధనమునో ఇచ్చితీసికొనుశక్తి వాంఛలబట్టిచూచిన ముల్లోకముల సంపదలును జాలనవియే! క్రయశక్తింబట్టిచూచిన నత్యుత్పత్తి యప్పుడప్పుడు ప్రత్యక్షమౌ నుత్పాతమే.

అత్యుత్పత్తివలని యపాయములు

1. యజమానులకు నష్టమో నాశమోవచ్చుట. 2. దానిచేత గళాశాలలు మూయబడి శ్రమకరులకు స్థానభ్రంశము, ఉపవాసవ్రతము గుదురుట.

అల్పోత్పత్తిచేగలుగు నపాయంబులు

1. ఇవి మనకుం బ్రాతబంధువులు. క్షామములను గుఱించి హిందువుల కుపన్యసించుట యధిక ప్రసంగము. ఒక్కకాఱువానదప్పిన జనులెట్లు మలమలమాడిపోదురో చెప్పదీఱునా? అల్పోత్పత్తి యొక యెడ గలిగినచో నది కారణంబుగ నధికోత్పత్తి బాధలన్నియు నింకొక యెడం జెందుటయుగలదు. ఈవింత యెట్లందురో, చూడుడు! మనదేశమున ననావృష్టి యేతెంచెనేని ధాన్యములవెలలు హెచ్చును. ప్రజలు తమ సర్వస్వమునంతయు బొట్టల నింపుకొనుట కుపయోగింతురు. దానంజేసి బట్టలకయ్యెడి వ్యయము క్షయంబునొందును. అనగా బట్టలకు గిరాకి తగ్గుననుట. అందుచే నింగ్లాండులోని ఎగుమతి వర్తకులకు వస్తువులు సెలవుగాక నష్టమువచ్చును. అనగా వస్త్ర వ్యాపారమున నత్యుత్పత్తి - సమర్థమైన జనాదరమునకన్న మించిన రాసులుండుట - జనించినట్లు.

2. కొందఱు తెలివితక్కువవారు, అర్థనిమిత్తమైన వైరంబుచే బరదేశస్తుల ధనమంతయు గొల్లగొట్టుకొని తమ దేశములో రాసులువోసికొన్న నెంతమేలని భ్రమింతురు. తాము వ్యాపారముల జరుపు రాజ్యములు పాడిండ్లబోలెనైన పిమ్మట వర్తకము జఱుగుటెట్లు? మనమెల్లరు ఘోరమైన దారిద్ర్యముం జెందితిమేని, ఇంగ్లాండువారు మనయెడల దాని వర్తనముం జూపనౌనెకాని పరివర్తనముజేయుట పొసంగునా? కావున నర్థిప్రత్యర్థు లిరువురును బచ్చగా నుండకపోయిన నిరువురును నెండుదురు. అర్ధవిషయమైన వైరము లేదనుటగాదు దీనికర్థము - అయ్యది మితిమీఱిన లయకారణంబగుననుట.

3. మూలధనం బమితమగుట. ఇందుచే వడ్డీతగ్గును. నయముగ ధనము చేతబడియెడు గదాయను కుతూహలముచే ననేకులు నూతన విధములైన యుద్యమములం బ్రవేశింతురు. ఎన్నియో వెఱ్ఱివెఱ్ఱి ప్రయత్నములు ప్రబలును. ఇందనేకములు శిధిలములౌట స్వభావ గమ్యంబుగావున మూలధనము వినియోగించినవారు కొంతవడికి వీతోత్సాహులై నమ్మకము ధృతియు దఱుగుటచేత నన్నికళలకుం బ్రళయమువచ్చెనో యను మాడ్కి తమ ధనము రాబట్టుకొన దండోపతండములుగ మంచివ్యాపారములు సెబ్బఱవ్యాపారములును భేదములేక మూర్ఖమగుపట్టుతో నప్పుదీసికొన్నవారినెల్ల దక్షణమే బదులిచ్చి వేయుడని బాధింతురు మూలధనము యంత్రాదులయందు లీనమై యుంటజేసి వ్యాపారులు తలచి నప్పుడు వానిని ధనముగా మార్పనేరరు. లాభము వచ్చుచుండిన దానిలోనుండి మిగిలింపబడిన ద్రవ్యముతో ఋణములదీర్చుట వారి సంప్రదాయము. ధనము వారియెడ నిక్షేపించియున్న వారందఱును, ఉన్నట్టుండి ఇపుడే మాది మాముందు దెచ్చిపెట్టుడని పిఱికి పట్టుబట్టిపలికిన వారేమి చేయ గలరు? దివాలెత్తగలరు. ఇట్లు మూలధన మధికవృద్ధి గాంచుటచే ధనసౌలభ్యమువలన జేయబడు పిచ్చివ్యవహారములవలన దుదకు నాణె మపాయస్థితికిరాగా గలుగు మహాక్షోభ మొక గండము వంటిది. ఇంగ్లాండులో నిట్టిగండములు గతశతాబ్దమున నాలుగైదుపుట్టి దేశమును స్రుక్కజేసినవి.

4. మూలధనము మిక్కిలి కొఱతవడుట దీనిచే వ్యవహారులు చాలినంత ధనము గొనుటకు గష్టమౌను గాన వడ్డి యెక్కువగ నియ్యవలసినవారై యారాట మందుదురు.

5. రాష్ట్రములోని రూప్యములు మొదలగు నాణెములు, అత్యమితములైన వెలలు హెచ్చును. దీనిచే ననేకులు ముఖ్యముగా నికరమైన యాదాయముగలవారు మిక్కిలి శ్రమపడుదురు. నాణెములు లోపమునకు వచ్చినయెడల వెలలు తగ్గునుగాన విక్రయించి జీవించు వ్యవహారులకు నష్టము తప్పదు నాణెముల రాసులయందలి న్యూనాధి కతలచే నగు నుత్పాతముల విస్తరముగ వినిమయకాండంబున వివరింతుము.

6. మూలార్థ మమితముగా స్థిరములైన యంత్రములు, ఇనుప దారులు మొదలగు వానియం దుపయుక్తంబైనచో గొన్ని సమయములలో క్షోభములు పుట్టుటయు గలదు. ఎట్లన, పూర్వము వివరించినఫక్కిని స్థిరతకొలది వానినుండి యాదాయము వెలువడుట యాలస్యమగును. ఉదా. ఇంగ్లాండులో దొలుత నినుపదారులు వేయునపుడు, అనేకులవి లాభకరంబులనుట సుప్రసిద్ధము గావున దమ ధనమును రైల్వేకంపెనీలలో నిక్షేపించిరి. లాభము సిద్ధమైనను నెంత త్వరలో నౌననుట యోచింపరైరి. వీరికి వృద్ధిభాగములు త్వరలో రానందున దాలిమి వదలినవారై కంపెనీలలో దాముకొన్న భాగముల విక్రయింతమని యందఱు బయలుదేఱినందున నాభాగములకు మంచివెలలురాక నష్టముంజెందిరి. మొత్తముమీద నుత్పత్తి, మూలధనము, నాణెములు ఇవి మితిజెందక యధికముగ పెఱిగినను విఱిగినను నార్థికమండల మల్లల నాడిపోవుట నిజము. కావున సమత్వసిద్ధి పడయదగిన పరమార్థము.

కొన్ని క్షోభల చరిత్రము

ఇంగ్లాండులో బూర్వము సుమారు పదియేండ్లకొకపర్యాయం క్షోభలు గలుగుచుండెను. వీనిలో గణ నీయములైనవి 1825, 1837, 1847, 1857, 1866 ఈ సంవత్సరములం బుట్టినవి. పదియేండ్ల కొకతూరి యశుభములు గలుగవలయునని యెవడైన ఋషి శాపంబిడి యుండునని భ్రమింపబోకుడు! ఇపుడు 40 ఏడులుగా నెక్కువ జాగ్రత్తతో వ్యాపారములు నడుచుచుండుటంబట్టియు, క్షోభలయొక్క హేతువులు విశదము లైనందునను నయ్యవి యుపసంహరింపబడి యున్నవి. ఇట్లనుటచే నిక నెన్నడు నవి రావనుటగాదు. సకృత్తుగ జరుగుననుట.

1825 వ సంవత్సరపు మహాక్షోభ

ఇంగ్లాండులో ధనము లమితములైనందునను, దాచి ప్రోగుచేయువాడుకలేక ప్రయోగోత్సాహము గలవారగుటను విశేషించి వ్యాపారములకుంబూనిరి. ధనము నిధులలో నమితరాసులుగా నిక్షేపింప బడియుండుటచేత బ్యాంకీలవారు తఱుచు విచారణచేయకయే నూతనోద్యమములం జేయనెంచి యాసించినవారికి ఋణము లఖండముగ నీయసాగినందున గొన్నివస్తువులకు గిరాకిలేకున్నను వచ్చునను నుత్సాహముతో ననేకవిధములైన క్రొత్తమార్గముల ధనము నుపయోగింప వ్యవహారులు ప్రారంభించిరి. ప్రత్యక్షమైన గిరాకికిగాక యనాగతమైనదానిని నమ్మిచేయుటలో లాభమునకు దుల్యమైన యుపాయమున్నదనుట యిదివఱకే మీరెఱిగిన విషయము. ఇట్లు పడసిన ధనంబును గనుల యందును, విదేశవర్తకులకు నప్పులిచ్చుట యందును వినియోగించిరి, 1824 వ సంవత్సర ప్రారంభంబున నపరి మితోత్సాహంబునంజేసి 103 లక్షల సవరనులు మూలధనముగాగల 7 వర్తకసమాజములు సృష్టికి వచ్చినవి! ప్రజలు లాభాపేక్షచే 'నేముందు నేముంద' ని ధనమును వర్షముగా గురిపించిరి. కంపెనీల భాగములవెలలు పెఱిగినవి పెఱిగినవే! ఒక్కనెలలోన 100 సవరనులు గానుండిన భాగములు 150 సవరనుల కెక్కినవి!! ఇట్టి ధీరవ్యాపార మెన్నాళ్ళు నిలువగలదు? ఉన్నట్టుండి తమసాహసమే తమకు భయముగలిగింపగా నందఱు నిక వెలలు వ్రాలునేమో యను భీతిచే గొన్నభాగముల విక్రయించుటకు గుంపులుగట్టి వచ్చి నందున, సహజముగనే క్రిందికిదిగుట కుపక్రమించిన వెలలింకను శీఘ్రముగ గ్రిందు వడినందున, నసంఖ్యప్రజకు సేగివాటిల్లి దారిద్ర్యదేవత చుట్టుముట్టెను. 19 వ శతాబ్దము లోని యితర క్షోభల చరిత్రములు వినిమయ కాండాంతర్గతంబులని భావించునది.

క్షోభల సామాన్యలక్షణములు

మూలధనము విశేషించి యెదిగినదగుట, అందుచే ఋణ వ్యాపారములు పెఱుగుట, ధనము సుగమమగుటంజేసి దుర్గమ స్థలంబులసైతము వ్యవహారచక్రముతిరుగుట. అనగా నిశ్చయములేని కళలు వృద్ధివడయుట, దానిచే నాణెమునశించుట, రొక్కముగా నిప్పుడే తమయప్పుల నియ్యవలసిన దని యుత్తమర్ణులు ప్రతిజ్ఞతో బైనబడుట, దానంజేసి సరకులను వ్యవహార సంఘములలోని భాగములను వచ్చినవెలల కమ్ముదమని యందఱు నేకకాలమున సన్నద్ధులౌట, వెల లధోగతిం జెందుట, నష్టమువచ్చి ప్రజలు వ్యవహారులును వానితోన నరకప్రాప్తి ననుభవించుట. క్షోభలయొక్క యంశముల యను క్రమమిట్టిది. మఱియు గ్రిందబడి గాయములు గొన్నవారైనపిదప నమ్మకములేని వారగుట, ఋణములు సుకరముగ నియ్యమి వడ్డి హెచ్చుట, అందుచే జాగ్రత్తతో భద్రములని యేర్పడిన క్రియలమాత్ర మనుష్ఠించుట, తత్కారణమ్మున లాభములు తఱుచగుట; మఱియు, ఇట్లు లబ్ధలాభులైనయెడల ద్రవ్యము మిగులంబడుట, కూడుట, ద్రవ్యాభివృద్ధిచే మఱల బొగరుచెట్టు చిగుర్చుట, అత్యుద్దండకర్మల విఱ్ఱవీగి యారంభించుట. మఱల బూర్వోదిత ప్రకారము త్రుళ్ళి క్రిందబడుట.

ఈ రీతి నార్థికచక్రము హీనోచ్ఛస్థానక్రమం బవలంబించి యుండుననుట గణింపవలసిన విషయము.

అయినను నీగతి మునుపటియట్టులు నిరర్గళ సంచారముగలది గాదు. నిరోధన తంత్రంబునందు, ఆధునికులు దక్షులై యుండుటచే క్షోభ లల్పములగుచున్నవి.

ఖండాఖండ క్షోభలు

క్షోభలు రెండు విధములు - 1. అఖండక్షోభలు. సర్వవృత్తుల యందును వ్యాపించునవి. 2. ఖండక్షోభలు కొన్నింటియందుమాత్రం వ్యాపించునవి.

1. మూలధనముయొక్క స్థితులచే బుట్టునవి సర్వవ్యాపకములు. ఎట్లన, వ్యవహారు లెల్లరు ప్రజలచే నిక్షిప్తంబులైన ధనంబులతో గార్యముల నడుపువారు మూలధన మన్ని ప్రారంభములకును సామాన్యకారణము. దీనిచేనగు క్షోభలన్నింటికి నంటును.

2. అధికోత్పత్తిచే నగునవి ఖండక్షోభలు. ఎట్లన, అధికోత్పత్తిచే నగు క్షోభము లఖండములు గావనుట.

బేహారమననేమి? వస్తువులకు బదులు వస్తువులనిచ్చి మార్చుకొనుట. ఒక్క వస్తువు నందుమాత్ర ముత్పత్తి యధికమైన దానికి మూల్యము తగ్గుటయో వెలకుంబోక మూల యింటనుంటయో సిద్ధము. ఎందులకందురో, దానిం గొనువారలయందును నుత్పత్తి యధికముగా లేదుగాన వారు దానినంతయు దక్కువవెలకిచ్చినంగాని కొన సమర్థులు గారు. హిందూదేశము దరిద్రస్థితిలో నుండుటంబట్టికదా వస్తువు లున్నను మనము గొననేరక మిడుకుచుండుట గలిగెనని యంటిమి. దారిద్రమనగానేమి? మనయొద్ద ద్రవ్యములు లేవనుట. అనగా మనలో నుత్పత్తి మిక్కిలియు జీర్ణమైయున్న దనుట! మనకును విశేషించిన యుత్పత్తియున్న నైరోపావారుపంపునదియెల్ల గ్రహింప వచ్చును. మనయందుబలె ప్రత్యర్థులయందును వస్తురాసు లఖండములైన మన సరకులను వారుం గొననేర్తురు.

చూడుడు! గిరాకియన్న వ్యర్థమైన యాశగాదు. సమర్థమైన యాశయని యంటిమి. సమర్థత యనగా నర్థముతోగూడిన శక్తి గలిగినదనుట.

కావున సర్వవస్తువులు నేకకాలంబున నేకగుణంబుగ వృద్ధిం గాంచిన నధికోత్పత్తిదోషంబు వొరయదు. ఇచ్చువారితో సమముగ గొనువారును సమర్థులౌటబట్టియు వాంఛ లమేయములుగ నుంటం జేసియు వానికి అమ్మకము నీళ్ళుద్రావినట్లు సులభంబగును. ఉదా. 1. ఇంగ్లాండులో వస్త్రములు, మన దేశములో ధాన్యాదులును సరిసమముగ నధికములైన వారికి వస్త్రములేల వెలపోవు? మనకు ధాన్యాదికము లేల యెగుమతి గాకపోవు?

2. మూల్యసిద్ధాంతముచే నియ్యది యింకను స్ఫుటంబవును. ఒకదేశమున పశువులు గుఱ్ఱములునే యున్నవనుకొందము. పశువులు 200, గుఱ్ఱములు 100 వెల యొక గుఱ్ఱమునకు రెండావులు. రెండును నేక కాలమున ద్విగుణితములయ్యెబో. పశువులు 400, గుఱ్ఱములు 200. వీనియందలి యాదరణము రాశి యెక్కువయైనందున తగ్గును. రాసులు సమానవృద్ధిం గాంచినందున నాదరము, ఏకక్రమముగ దఱుగును. అందుచే మూల్యమునందు విభేదముపుట్టదు. అనగా నిప్పుడును నొక గుఱ్ఱమునకు రెండావులు విలువ. సమానవృద్ధి లేదనుకొందము. ఆవులు నన్నూరై గుఱ్ఱము లేబదికి వచ్చెబో. పశుపాలురకు నావులయందలి రాగము తగ్గును. గుఱ్ఱముల యందలి రాగము హెచ్చును. అశ్వపాల కులకును దురగముల యందలి రాగము హెచ్చును. ఆవులయందలి రాగము తగ్గును. అనగా గుఱ్ఱముల మూల్యము వృద్ధిని, ఆవుల మూల్యము క్షయమునుం గాంచుననుట. నాలుగావులియ్యనిది గుఱ్ఱము లలభ్యములౌను. ఇట్టిచో బశుపాలుర కధికోత్పత్తిదోషము గలిగినను గలుగవచ్చును.

కావున నధికోత్పత్తి యనగా నధికఖండోత్పత్తియని యర్థము. ఇందమితభావము కొన్ని సమయములం దటస్థించుటగలదు. అఖండముగ నన్నిపదార్థములును వృద్ధికివచ్చిన నమితత్వదోష మేనాడుం గల్గదు.

అట్లౌట నధికోత్పత్తివలని క్షోభముయొక్క లక్షణము లేవియన;

ఒకటో, కొన్నియో వృత్తులయందు పంట లమేయములౌట. దానిచే వానియొక్క విలువ తఱుగుట. అందుచే నావ్యాపారముల యందలి వారికి నష్టము గష్టము గలుగుట. ఇట్లు కొన్నింటిమాత్రం చెందునది గావుననే దీనికి ఖండక్షోభయనిపేరు. అయిన నొక్కటి. బొంబాయిలో బ్రధానవ్యాపారము ప్రత్తి. ఇందు నమితోత్పాదనముచే క్షోభ గలిగినయెడల నాయుత్పాత మావృత్తిలో ననర్థ మాపాదించుననుట స్పష్టము. మఱియు ప్రత్తివృత్తి పాడు పడిన దానినుండి రెండు భయంకర రూపములు వెల్వడును. 1. సాహుకారులు బీదలౌటచే వారు మిగిల్చిన ధనమంతయు మునిగిపోవును. అందుచే బ్యాంకీలలోని నిక్షిప్తముల రాశి తగ్గును. అనగా సర్వవ్యవహారముల కాధారమైన మూలధనము కొఱతవడును. 2. ముఖ్యమైన వ్యాపారం లెవ్విముగిసినను తదితర వ్యాపారములలో సైతము నమ్మకము నాణెములు నుఱ్ఱూతలూగును. అప్పుడప్పుడు చులకనగా దొరకవు. ఈ రెండు కారణముల చేత ఖండక్షోభలు ప్రధానవృత్తులం జెఱిచెనేని యకండక్షోభలును నవతారమెత్తజూచును. మూలధనము, అరువు, వీనిని శిధిలములం జేయునంత బలవంతములైనంగాని ఖండక్షోభలు నేరుగా మహాదారుణములైన యఖండక్షోభలుగావు.

కొన్నిసమయములందు వస్తువులన్నియు నభివృద్ధిం జెందుచుండినను సర్వోత్పత్తులు నమితములైనవో యను భ్రమను గలిగించునట్టి వికారములు పొడసూపుటయుంగలదు. " ఇపుడే యెల్ల పదార్థములును విస్తరించిన నమితత్వదోషమురాదని యంటిరి. ఇంతలోనె విరుద్ధ రామాయణము జేయుచున్నారే?" అని యందురేమో? చిత్తగింపుడు.

క్షోభలయొక్క యొకలక్షణము - వెలల వ్రాలుట

వెలలు వ్రాలువిధములు రెండు. 1. ఏదైన నొక వస్తువు యొక్క రాశి యధికమైన దాని వెలలు తగ్గును. స్పష్టము. 2. రాష్ట్రములోని నాణెములు - అనగా శాసనస్థాపిత రూప్యాదులు - మిక్కిలియు లోపించిన నప్పుడొక వస్తువుయొక్కయేకాదు, అన్ని వస్తువుల వెలలును తగ్గును. మనపెద్దలు "మేము గచ్చకాయ లాడుచుండిన పురాతనదినములలో నొక రూపాయకు పుట్టివడ్లు దొరకుచుండెను. ఇప్పటివలె మాచిన్ననాటి దినములలో వెలలు ప్రియములుగలేవు" అని వర్తమానకాలముమీద నేరముమోపుట వినియున్నాముగామా? అప్పుడు వెలలంత తక్కువగ నుండుటకు గారణమేమనగా రూపాయలు కొద్దిగనుండుటయే అపురూపముగ గనబడెనేని రూపాయలను వరహాలగ జూతురు. ఈ న్యాయముయొక్క యాదేశ మేమనగా:- వ్యవహారులు విశేషించి యన్ని వస్తువులను వృద్ధికిదెచ్చిరిపో, అవి యమ్ముడుపోవులోపల నేకారణముచేనైన రూపాయలసంఖ్య మిక్కిలిగా తగ్గెనేని వెలలుం దగ్గును. అందుచే నాదాయము క్షయించును. అడాయము చయించినను దమకు ఋణమిచ్చినవారికిని నుపకరణ సామగ్రి నమ్మినవారికిని మునుపటి నిబంధనల ప్రకారము బదులిచ్చి తీఱవలయుగాన నట్లుసేయ శక్తులుగాక సంతసింతురు. ఉత్పత్తి ప్రారంభంబున ధరలు హెచ్చుగను నుత్పత్తి ముగియునప్పుడు తక్కువగనునున్న నష్టము సిద్ధము. అట్టితరుణములో నేక కాలమ్మున సర్వవస్తువులు నమితములై నట్లు వ్యవహారులకు దోచుగాని దీనిచే వస్తువులగొని వినియోగించువారికి మేలుగాని కీడులేదు. సరకులు నయములైన వినిశ్చితమైన యాదాయముగల గవర్నమెం టుద్యోగస్థులు మొదలగువారికి నఱచేతికి వైకుంఠ మబ్బినట్లు.

రూప్యములు మొదలగు నాణెములు తఱుచుగ నధికములైన వెలలు హెచ్చును ఇందుచే నుత్పాద కులకు వర్తకులకు సంతోషమే యైనను నిర్ణీతమైన వచ్చుబడిగల యుద్యోగస్థులు మొదలగువారు వస్తువులు ప్రియములౌటచేత నెక్కువ వ్యయమునకు బాత్రులౌదురు.

నాణెముల స్థితిగతులచేనగు సుఖదు:ఖ విచారణలును వినిమయ కాండాంతర్గతంబులు.

ఏకకాలమ్మున నేకక్రమమ్ముగ వస్తువులయు రూప్యములయు సంఖ్యలు విశాలము లయ్యెనేని యమితోత్పత్తిదోషం బుద్భవిల్ల దనుట యదార్థమేయైనను, పూర్వమే చెప్పినట్లు సద్య:కాల జన్యస్థిత్యంతరములు వ్యవహారలోకమ్మున మృగ్యములు. ఉత్పత్తి యథారీతిని నన్నిపదార్థంబుల యందును విస్తృతంబగుట స్వభావాతీతముకావున నార్థికగండముల మొదలంట దెగవేయవలయుననుట కొలదికి మీఱిన యోచన.

క్షోభలు వ్యక్తిస్థితిచే సంభవించునవియను వాదప్రకారము

సమష్టివాదులు తమమతమైన సంఘనాయకత్వమును స్థాపించుటకై యీ క్షోభల నూనియున్న యాధారంబొకటి చూపెదరు. ఎట్లన, నుత్పత్తి యమితమగుటకు హేతువు ప్రజల దారిద్ర్యముచే నైన గిరాకియొక్కశక్తి శూన్యత. ప్రజలనగా నెవ్వరు? ముఖ్యముగా శ్రమకరులు. జనసంఖ్యలో ముక్కాలు మువ్వీసమునకన్న నెక్కువగ నెల్లదేశంబుల వీరున్నారు. వీరికి సమర్థతయున్న నగస్త్యునిబోలె నుత్పత్తి సాగర మెంతపొంగినను నొక్కగ్రుక్కగా బీల్చివైతురు. కావున వీరియొక్క పేదతనమే తమితోత్పత్తికి నిజమైన కారణము. మఱి యీ దారిద్ర్యమునకు బుట్టుభూమి యెయ్యది? ఆధునికార్థిక స్థితులు. ఎట్లన, ప్రతి యజమానుడును దనతన యాస్తియని కూడబెట్టుట, ఇచ్చవచ్చిన వ్యాపారముల కుంబూనుట, సొత్తుగలవారగుటచే బేరసారమ్ముల బలవంతులై యుండుట, బీదలు కుక్షి బాధ కోర్వజాలక యల్పవేతనముల నాశ్రయింపవలయువారగుట. ఇందుచేత గూలి తక్కువ యగుటయు యజమానులకు లాభమెక్కువయగుటయు విశదము. కావున ప్రజలు కోరిక లెన్నియో కలవారయ్యు వానిం దీర్చికొన పోడిమిలేనివారై యున్నారు. తాము కష్టపడి కల్పించిన ప్రయోజనములన్నియు దమ్మే చెందినయెడల దామును నాఢ్యులై యుందు రనుట కేమిసందియము? అయినను నీమాత్సర్యకాలములో "చెట్టుపెట్టి పెంచినవాడొకడు. దానిఫలము ననుభవించువాడొకడు" ననురీతిని బాటుపడి ప్రయోజనములం బుట్టించువారు కర్మకరులు, దానిని దన్నికొనిపోవువారు యజమానులు. కాకులనుగొట్టి గ్రద్దలకు వేసిన విధంబున నీస్పర్ధయనునది బీదల నదుమును. మహారాజులం బొదలజేయును. అట్లుగాక యార్జనముకొలది నర్థంబు లలవడునేని శిల్పులాఢ్యులౌదురు. మూలధనముయొక్క వృద్ధి నాశించి గణనకు వచ్చువా రల్పులౌదురు. కావున వర్తమానస్థితిని లయింపజేసి యన్ని వ్యాపారములు సంఘపరిపాలితములుగ జేయుట కర్తవ్యము. అట్లైన నీదుండగము లతో గండములు నడంగును.

మఱియు నొక్క విచారము. క్షోభ లనివార్యములా నివార్యములా? నివారించుటకుంజాలిన హేతువు లెయ్యవి? ఈ హేతువులు సంపూర్ణ సుఖదంబులా? లేక ముల్లుదీసి కొఱ్ఱడచునట్టివియా? పెఱుగుటలో విఱుగుటయను నుపద్రవం బుపగతంబు. విఱుగుటకు వీలులేని యుపాయము వెదకంబోయిన బెఱుగుటయే కూడదన వలసివచ్చును. ఇది సమంజసమైన తంత్రమా ? మఱియు క్షోభలు విశేషించి కలుగు దేశము లెవ్వియనిన, ఇంగ్లాండు, అమెరికా, ఇవియే ప్రపంచమున నత్యంత జేజోవంతములై యున్నవి. నికృష్టములై యుండు తూర్పు రాజ్యంబుల నప్పునప్పులేని జీవనముండిన నదియే యొక యతిశయము. మనలో క్షోభలు లేవనుట యొప్పుకోవలసిన మాటయే. తిండికిలే దనుట దానికన్న స్ఫుటమైన వాక్యము.

కారణంబేమియనగా, తెగువలేనిచో జయమసాధ్యము. తెగువతో నుద్దండవిహారమునకుం దొడంగిన గొందఱోటమిదెచ్చికొన్నను గొందఱయిన గట్టెక్కెదరు. ఈ ప్రకరణమున గిరాకి సరఫరా వీనికి సమత్వము గుదిరిన కష్టనష్టములు లేకయుండునని యంటిమి. ఇదియు నాక్షేపములేని మతముగాదు. ఎట్లన, గిరాకి సరఫరాలు సరిపోవుటెట్లు? రెంటిని స్తిమితము గా జేసియుంచినగదా? గిరాకి యనగా వస్తువుల యందలి వాంఛచే గలిగిన యన్వేషణ క్రియ. ఇక సరఫరా యనునది కళాప్రావీణ్యముచే నిర్ధారితము. ఈ రెంటిని స్తిమితములం జేయుట యన్ననేమి? హిందూదేశమ్మునంబలె నాచార పాశంబులచేత గోరికలను వృత్తులను బంధించి చెఱనుంచుటయగాదె! అందుచే గలుగు క్షయము క్షోభలకన్న మహాదైన్యకారియని వేఱుగ జెప్పవలయునా? సాహసవ్యాపారలక్షణము లెఱింగియేయున్నారు. అనుమతిమీద జేయబడుటయేగాక, ఇక ముందైన గిరాకి రాకపోవునాయను కుతూహములచే జేయబడు నది సాహస వ్యాపారము. మఱియు బ్రకృత మొక వస్తువునెడ గాంక్షలులేకున్నను వాని సృష్టింపసైతము చూతురు. ఇట్టి వ్యాపారముల నప్పుడప్పుడు పరాజయ ప్రాప్తియగుట నిశ్చయమ. సాహసములేక గ్రామములయందలి శిల్పులబలె నిశ్చితమైన పంపు వడసికాని పదార్థముల సేకరించరేని నష్టముండదేమోకాని లాభము వృద్ధియు నంతకుమున్నే యుండవు. నాకుంజూడ సర్వసమత్వము సర్వానర్ధకరమని తోచుచున్నది. క్షోభలు పెఱుగు ప్రాయమునవచ్చు జ్వరములవంటివి. వానికి హేతువు పెఱుగుటయే. అవి లేకయే పెఱిగిన నింకను మంచిదేకాని యట్లగుట స్వభావహితంబు గాదుకాబోలు!

పైని చర్చింపబడిన క్షోభలు యధార్థక్షోభలు. అనగా వర్తకులును గృష్యాది కళాప్రారంభులును దెంపు మిక్కుటమగుటచే మన:పూర్తిగ వ్యవహారములు మంచివనినమ్మి వానిలో బ్రవేశించుటచే దామును తమకు ఋణమిచ్చినవారును నిరువురుంజెడుట. మంచి యోగ్యత లేని వ్యాపారులు దొంగదివాలెత్తి తమకు నప్పిచ్చినవారిని ముంచి తాము సుఖించుట గలదు. ఇట్టి కృత్రిమతంత్రములు నక్క జిత్తులు, తఱుచుగ బ్రబలెనేని రాజ్యమున నమ్మకము చెడును. ఆర్థికస్థితులు వెలయజాలవు.