భారత అర్థశాస్త్రము/రెండవ భాగము - తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము

స్పర్ధను రద్దుపఱచు తంత్రములు

మాత్సర్యము నిరోధింపజేయు వ్యవహారముల పద్ధతులు

ఆర్థిక మాత్సర్యముచే బెక్కువిధాల ముప్పులు మూడుననుట యేర్పడియె, వానిలో ముఖ్యములైన వానిని మఱల మీకు జ్ఞప్తికి దెత్తుము:-

1. ఉత్పత్తికిబట్టు వ్యయము హెచ్చుట.

2. ఉత్పత్తి క్రమముగా జఱుగక యొకప్పుడు లోపమును మఱియొకప్పు డమితసమగ్రత్వముం జెందుట.

3. ఇందుచే వెలలు నిలుకడలేక యుయ్యెలలూగుట.

4. నష్ట వచ్చినప్పుడు కర్మశాలలు మూయబడుటచే శిల్పులకు జీవన మనిత్యమగుట.

5. తుదకు క్షోభలుగలిగి యార్థికచక్రముం గలంగజేయుట, ఇత్యాదులు.

కీడులకుం బాత్రములుగాని వ్యవహారముల నిర్మింపవలయునని యిప్పు డిరువది ముప్పది సంవత్సరములుగా ననేక ప్రయత్నములు జఱుగుచున్నవి. వానియందు గణ్యంబులైనవి యెవ్వియనిన:_

వ్యవహార సమాజములు ధర్మసంధి జేసికొనుట

[ట్రస్టులు నాబడు ధర్మసంధులు]

ఇవి మొట్టమొదలు ప్రబలత్వమునకు వచ్చినది యమెరికాలో, 1882 వ సంవత్సరమున వ్యవహార విశ్వకర్మమ్న్యగు రాకిపెల్లరు మార్గ దర్శియాయెను. అదిమొదలు వీని విజృంభణము, అంతము నడ్డునులేక ప్రసరించుచున్నది. వర్తమానమున నివి యమోఘ విక్రమములై యుంటబట్టి విపులమ్ముగ జర్చింపవలయు. సంధియనగా జనులొక్కటిగాగూడి చేయు సాధారణ వ్యవహార సమాజముగాదు. దానికన్న ఘనమైనది. ఇట్లేర్పడిన కంపెనీలే సంధిజేసికొనుట. అనేక మూలధనాఢ్యులు కూడినది వ్యాపారసంఘం. ఇట్టి సంఘము లనేకములుగూడిన నది సంధిసంఘము. సంధియు సంశ్లేష విధానములలో నొక్కటి.

సంధిసంఘము లేర్పడుటకు గారణములు

1. వర్తమానమున నశేషధనరాసులతో జేయబడు విస్తార వ్యవహారము లఖండముగ వ్యాపించి యున్నవి. ఇయ్యవి యొండొంటి మీద వైరమత్తి కాలుద్రవ్వుటచే నమిత స్పర్ధవలనగలుగు నాపదల కన్నింటికిం బాత్రములగును. కొంతకాల మీరీతి జలముతో బోట్లాడి యన్నిసంఘములవారును నొచ్చి నశించినవారై యికముందు పొందికతో బనిచేయుదమని సంధిక్రియ కల్పించుకొందఱు.

2. విస్తార వ్యాపారములవలని లాభములన్నియు నింకను సవిస్తరముగ వ్యాపారములంజేసిన మిక్కిలిగ బడయవచ్చుగాన నీసంధులకు నివియు హేతుభూతంబులు.

నిదర్శనము. చక్కెరజేయు మహాశాలలు, అమెరికాలో గొన్నియేండ్లక్రిందట ముప్పది నలువది యుండినవి. ఇవి యొకదానికన్న నొకటి మిన్నగ నుండవలయునను చొఱవతో బనిచేసినందున గలిగిన ఫలము లెవ్వియనిన:- 1. కొన్నిసమయమ్ముల నుత్పత్తి యమితమై వెలలు డీలువడుటచేత నందఱకు నష్టమువచ్చుట. 2. కొన్నిశాలలు దివాలెత్తుట. 3. అందుచేత భీతిగొని యుత్పత్తి కొఱతవడ జేసినందున సరకు చాలక పోవుటచే వెలలు మిక్కుటములగుట. ఇట్లనేకవిధమ్ముల వ్యాపారులకు స్థితిగతులు చంచలములైనవి. తఱువాత నీసంఘములయొక్క చోదకులందఱు నొకటిగా గుమిగూడి మాట్లాడుకొని చక్కెర వ్యాపారముయొక్క యానాటి చందముంజూచి దానికి దగినట్లు స్పర్ధలేక తమలోదాము పనిని బంచుకొని చేయుద మని యొడంబడిక జేసికొనిరి. ఇట్లు కొన్నినాళ్ళు జరుగగా నిది యెంతయుమేలని యేర్పడి నందున నీయొడంబడిక నింకను దృఢమ్ముగ జేయ నూల్కొని యిట్లాచరించిరి. 1. ప్రత్యేక సంఘములలోని భాగస్థులందఱును దమభాగముల నాపనికై నియమింపబడిన ధర్మకర్తల యధీనముచేయుట. 2. దానికిమాఱుగా నాధర్మకర్తల వద్దనుండి తమహక్కులను దెలియ బఱచు పత్రముల బడయుట. 3. ఇట్లు ప్రతిసంఘముయొక్కయు వారసుదార్లుగా నేర్పడిన ధర్మకర్త లాలోచనసభగానేర్పడి యీ సంధికార్యము నిర్వహించుకొఱకు జోదకుల నియమించి వారికి సర్వాధికారము నిచ్చుట. 4. ఈసమయములన్నియు శాశ్వత సమయములని యెల్లరును సమ్మతించుట. ధర్మసంధులనబడు నిర్మాణముల ముఖ్యములైన విధులియ్యవి.

చూడుడు! పేరునకు బ్రత్యేక సంఘము లింకను నుండుటచేత వానికిని గౌరవము లాఘవము నొందలేదు. అయినను వానికి స్వాతంత్ర్య మస్తమితము. అధికారమంతయు గొందఱ చేతిలోనికి వచ్చినది. కావున వ్యాపారము పూర్వమునకన్న విస్తరించిన యేక కళగాజేయుట సుసాధ్యము.

ధర్మసంఘచోదకుల ప్రవర్తన

1. స్పర్ధచేత హెచ్చుతగ్గులుగా బనిచేయు నాళ్ళలో గొన్నిశాలలు మూయబడియుండుట, కొన్నింట దినమంతయు బనిజేయుటకుగాక యర్ధదినమో ముక్కాలుదినమో పనిచేయుట, సమధిక వ్యాపార సమయములలో రేయింబవళ్ళుం బనిసేయుట. ఇట్లు కార్యము తాఱు మాఱుగ నుండెను. ఈ స్పర్ధ యంతర్థానమైనతోడనే పిశాచి పట్టిన వడువున నాడుటమాని కార్యము నేకగతిం జరిగింప ననువైనందున నాముప్పది నలువదిశాలల ఉత్పత్తినంతయు పదిపదునైదింట నిరంతర శ్రమతో దయారుచేయుట సులభమాయె. అందుచేత జోదకులు సగముశాలల విక్రయించివేసి తక్కుంగల వానితోనే మునుపటికన్న నెక్కువగ సరకుల నుత్పత్తికిం దెచ్చిరి. అమితస్పర్ధ దుర్వ్యయకారిణియనుట కింతకన్న మించిన తార్కాణమేమికావలయు? వైరము ముదిరిన దినములలో నలువది యంత్రములు నిలిచి నిలిచి చేయుపనిని, ఇరువది యంత్రములలో నిలుకడలేక సాగించిన దీఱగలదు. కావున నిందుచే గలుగుమేలు లెయ్యవియనిన, కాలము వ్యర్థముగాకుండుట, ఉత్పత్తిని దక్కువ వ్యయముతో సాధించుట యనునవి.

2. విక్రయమునకువచ్చు సరకుల మొత్తములో ముక్కాలు పాలు తమకుం జేరినదిగాన వెలలు విధించుటలో వీరుపెట్టినిది భిక్షము. చక్కెర యావశ్యకంబగువస్తువు. సాధారణముగ భోజనాదుల యందఱును దానిని వినియోగింతురు. కావున వెల కొంతహెచ్చినను గిరాకి మిక్కిలి తగ్గదు. అట్లగుట వెలలు హెచ్చించిరి. అనగా బ్రజాపీడనమను వ్రతముం దాల్చిరనుట.

3. చక్కెర వ్యాపారమున ననిరోధ ప్రభుత్వముం గైకొన్నవారగుట వెలలను స్థిరత వహింప జేయను సమర్థులైరి వెలలును నిలుకడగాంచె. అయిన నొక్కటి. ఎప్పుడు చలనము గలిగినను బైకెక్కుటయేగాని క్రిందికిదిగుట లేమిచే వినియోజకుల బ్రతుకుపాటు మేలిమి జెందదాయె.

4. ఇక నాసంధి సంఘములకు నంగభూతులైన వారికెల్లరకును లాభములు మెండయ్యెననుట వేఱుగ జెప్పవలయునా?

5. చక్కెర వ్యాపారముం జిల్లర చిల్లరగాజేసి జీవించువారలకు నీధర్మసంధి యమధర్మరాజు వంటి దాయెను. కెరోసిన్ నూనె వ్యాపారమున నెట్లో యిక్కడను నట్లే, శరణని వచ్చినవారి నాదరించి కాపాడుటయు, నాదారిని నేబోగూడదాయని స్వతంత్రతగోరి యస్వాధీనులైనవారి బాధించుటయునను క్షాత్రముందాల్చి నిర్వైరముగాబాలింప నుద్యోగించిరి. 6. బయటిదేశములనుండి చక్కెర యనర్గళముగా దిగుమతి యయ్యెనేని వెలలు తగ్గునను భయముచే నట్టి సరకులమీద గొప్ప సుంకముల విధించుటకును, విధించిన వాని దీసివేయక వుంచుటకునునై రాజ్యాంగమువారికింగూడ గోట్లకొలది లంచము లియ్య సన్నద్ధులైరి. ప్రభువులు, మంత్రులును, నైచ్యమునకు లోబడనివారైనను దక్కువ యుద్యోగస్థు లందఱుజెడిన న్యాయమైన దొరతనము నడచుటెట్లు?

ఈ సంధిసంఘమ్ముల వృత్తంబులేమనవచ్చు? 'ధనమూల మిదం జగ' త్తను న్యాయమును సార్థకము చేయంబొడమిన యవతారములో యనునట్లు బేహారులు స్వలాభంబుమాత్రమాసించి ధర్మాధర్మముల గమనింపక దుశ్చర్యలకుం బూనిరి. చూడుడు! ఏకేశ్వరత్వము నిర్భయతం బుట్టించును, నిర్భయత దుర్మార్గావలంబ నమునకు నెత్తిన కారణముగదా!

1882 వ సంవత్సరమున రాకిపెల్లరు కిరోసిన్ వ్యాపారముల యందు దనచేయిక్రిందైన సంధినొండు గల్పించి యీ సంశ్లేషపద్ధతికి ద్రోవసూపెను. తరువాత శర్కరా వ్యాపార సంధియట్టులు సంధిసంఘము లనేకము లావిర్భవించెను. అందుముఖ్యములు:- మాంసము, ఉక్కు, ఇనుము, విస్కీ యను నొకవిధమైన మత్తునిచ్చెడు ద్రవము వీనికిం జేరినవి. ఇట్టు లింకను ననేక వస్తువుల వ్యాపారమంతయు నీడుతోడులేక యనివార్యము గానేలు ధర్మసంధుల పాలయ్యెను. ఈసంధుల చర్యలన్నియు సజాతీయములౌటచే బ్రజకేగాదు రాజ్యాంగమువారికిని నీసును రోసమునుబట్టి ఇవి ఇతరములను బంధించి నట్లు వీనిని బంధింపవలయునని శాసన పాశమ్ముల నల్లనారంభించిరి. ఈ శాసనము లెవ్వియన:-

రాజ్యాంగమువారు ధర్మసంధుల బంధింపజూచుట

1. ధర్మకర్తలపరముగా భాగస్థులు తమ హక్కుల నిచ్చుటయను బూటకము చెల్లదనుట. దీనికి సంధులుచేసిన ప్రతిక్రియ:- ధర్మకర్తల నేర్పఱచిన దేలయనగా బ్రత్యేకశాలలు పేరైన లేకపోవునే యను మెత్తదనము చేత. మఱియు గొన్నిశాలలవారింబిలిచి మీసంఘము రద్దుచేయుడని యాదేశించినవారు "మీకన్న మేమేమిట దక్కువ" యని తిరుగబడుదు రేమోయను శంకయు నొక కారణము. అయినను నొక్కతూరి సంధులు సృష్టికివచ్చి దానివలని తీపులను భాగస్థులు చవిజూచిన పిమ్మట నట్టి వ్యర్థములైన యభిమానముల నావశ్యకములు గావున "మాకు ధర్మకర్తలు విశ్వాస సత్రములు నివియేవియు నిప్పడు పనికిరావు. రాజ్యాంగమువారు కావలయునన్న నెత్తికొనిపోయి మ్రింగివేయనిండు? మాకేమి తక్కువ? మేము ప్రత్యేకసంఘముల సంధియను బిరుదమువదలి యేకసంఘము గా నేర్పడుదుము. ఇష్టమువచ్చిన జనులందఱు నేకీభవించి భాగము లేర్పఱచుకొని వ్యాపారముం జేయుటలో నేతప్పును లేదుగదా?'

ఇట్లీ శాసనమును మోఘంబుగాజేయ సంఘములు సంధిచేసికొనియుంటమాని యైక్యముంజెంద మొదలిడిన బ్రజకు "గోరుచుట్టుపై రోకలిపోటు" అన్నటులాయె.

2. ధర్మసంధుల నడుపువారు తమకింత యెక్కువ లాభము వచ్చుచున్నదని ప్రజ లెఱింగిరేని, ఈర్ష్యచే వైరమెత్తి నూతనసంఘముల నిర్మింతురనుశంకచే దమలాభమును గుప్తముజేయ నొక యుపాయముం బన్నిరి. అది యేదనగా, చూడుడు! ఏబదియేండ్లప్పు డొకానొకడు టెంకాయతోట నొండు కొనియెనను కొందము. దాని యప్పటివెల 1000 రూపాయలు. అనగా నిచ్చితీసినవెల. కొన్ని ఋతువులకు దానియందలిఫలము 100 రూపాయలు చేయునదియాయె. అప్పుడు బ్యాంకీలో నిక్షేపించినవారికి లభించువడ్డీ 100కి 5 రూపాయలు. అట్టితరుణమున తోటయొక్కవెల యెంతయని ప్రశ్న ఉత్తరము:బ్యాంకీలో 5 రూపాయలు వడ్డీరావలయునన్న నిక్షేపింపవలసిన మూలధనము 100 రూపాయలు.

కావున 1 రూపాయ వడ్డీరావలయునన్న నిక్షేపింపవలసిన మూలధనము 20 రూపాయలు.

కావున 100 రూపాయలు వడ్డీరావలయునన్న నిక్షేపింపవలసిన మూలధనము 2000 రూపాయలు.

అట్లుండుటచే నేడాదికి 100 రూపాయలిచ్చు తోటయొక్క వెల 2000 రూపాయలకన్న దక్కువ యగునా? సాధారణముగగాదు.

మఱియు 40 సంవత్సరములు గడచినవనుకొందము. దేశములో మూలధనము మిక్కిలిగా గూడినందున వడ్డీ 100 కి 4 రూపాయలుగా దిగెననియు, తోటలో ఫలితము జనసంఖ్య వృద్ధియగుటచే గిరాకితోడ వెలయు హెచ్చినదై 150 రూపాయలకు వచ్చె ననియు ననుకొందము. ఇప్పుడు తోటయొక్క వెలయేమి?

బ్యాంకిలో 4 రూపాయలు వడ్డీరావలయునన్న మూలధనము 100 రూపాయలు.

1 రూపాయ వడ్డీరావలయునన్న మూలధనము 25 రూపాయలు.

150 రూపాయలు వడ్డీరావలయునన్న మూలధనము 3750 రరూపాయలు.

తోటయందు లీనమైయుండు విలువయొక్క పరిమాణ మయ్యై కాలముల ఫలితము, వడ్డీ, వీని ననుసరించి యుండునదిగాని యచలంబుగాదు.

తోటయెట్లో వ్యవహారసంఘములలోని భాగములును విలువ విషయమున నట్లే. తొలుత మద్రాసు బ్యాంకీ కంపెనీగా నేర్పడినపుడు భాగమునకు 500 రూపాయలుగా వేసికొనికూడిరి. ఇపుడా బ్యాంకీభాగముల ధరలు 1500 రూపాయలకు మించియున్నవి. కారణ మేమియనగా:సామాన్యమైన నిక్షేపములకు బ్యాంకీలలో దొరకువడ్డీ 100 కి 4 రూపాయలు. మద్రాసు బ్యాంకీ భాగస్థులకు నేటేట సరాసరికి నిచ్చులాభముయొక్కపాలు 100 కి 12 రూపాయలు.

కావున రాబడింబట్టిచూచిన స్థాపకులు 500 రూపాయలిచ్చి కొన్నవియైనను భాగములు 1500 రూపాయలకు బోవునవిగానున్నవి.

ఈ యుపాఖ్యానముయొక్క యాదేశమేమనిన

ట్రస్టులయొక్క కార్యచోదకులు మర్మములన్నియుం దెలిసిన వారగుట లాభము మఱుగుజేయ బైన్యాయము నూదిన యధర్మ తంత్రం బొండాచరింతురు. ఎట్లన:-

ఒక ట్రస్టులో 10,000 భాగస్థులనియు, భాగమునకు నాదిమ క్రయము 1000 రూపాయలన్నియు, సాధారణమగువడ్డీ 100 కి 4 రూపాయలనియు, వచ్చిన లాభము 100 కి 24 అనియు నను కొందము. ఈ సంగతి బహిరంగమైనచో బోటీసేయుటకునై ప్రతిసంఘము బయలువెడలక మానదు. కావున రహస్య రక్షణము సేయుటెట్లు?

ప్రతిభాగస్థునియొక్కయు భాగము 1000 రూపాయలేకాదు 6000 రూపాయలాయెనని ప్రచురించిరేని లాభము 100 కి 4 వంతున వచ్చినదివలె గన్పట్టును. అవునుగాని యిది యనువైన క్రియగాదు. ఎట్లన సామాజికుల సంఖ్య పెద్దది. 10000. వీరికెల్లరకు నిష్కారణముగ భాగములవిలువ ఇంత యయ్యెనని తెల్పిన నమితలాభము వచ్చినందున నిట్లు చేసిరనువార్త యెల్లెడల వ్యాపింపకపోదు. "పెదవిదాటిన చదలుదాటు" నను సామెతయుండలేదా? పదివేలమందికి దెలిసిన పిమ్మట నది యెట్టిరహస్యము? అయిన నొక్కటి. ఈ రీతిం జేసిన వ్యాపారస్థితి ప్రకాశమునకువచ్చుట తప్పనిదైనను లాభమున గ్రమభాగము భాగస్థులకందఱకును జేరును. కొందఱు చోదకులకు నిర్మాతలకు నియ్యదిగూడ గడుపు నుబ్బజేయునది. 2. అమితలాభము వచ్చుననుట వ్యక్తంబయ్యెనేని చోదకు లూరీతి జింతించుట సహజము. "భాగస్థులీ వ్యాపారము ఫలాఢ్యమౌటకునై యేమిసేసిరి? ఎన్నియో యేండ్లప్పుడు గొంత మూలధన మొసంగిరికాని వారివలననైన యితర ప్రయోజనము లెయ్యవి? రేయనక పవలనక మంత్రాలోచనజేసి కార్యంబుల దగుతెఱంగుల నడపి లాభసిద్ధిని స్ఫుటము చేసినవారము మనముగదా! ఇపుడీలాభములో సమమైన పాలిచ్చుటయేల? వారికి న్యాయముగ నియ్యవలసిన దేమి? సాధారణమగు వడ్డీకి దక్కువగాని యాదాయము. పోనీ! నూటికి 4 వంతుగాకున్న నైదువంతున నిత్తము. చివరకు 6 ఐనను హానిలేదు" అని తలపోసి 100 కి 24 ప్రకారము వచ్చుబడి వుండుటం జేసి యప్పటి సాధారణమగు వడ్డీయొక్క క్రమముబట్టి మూలధనము మతింపువేతురు. అనగా ఆరుతో గుణింతురన్న మాట. మూలధనము యొక్క పరిమాణమెంతయగును? 60,000,000 రూపాయలు. తొలుత నిక్షేపించిన మూలధనం 10,000,000 అది పోగా శేషించిన 50,000,000 రూపాయల నెట్లు నాచుకొందమని కుయుక్తులం గావింతురు. అందొక యుక్తియేదన:-

1. వ్యాపారము మిక్కిలియు విస్తరించుచున్నది. ప్రారంభమున వేసిన మూలధనము చాలదు. ఎక్కువ వేయవలయునని యేమియు దెలియని భాగస్థులకుజెప్పి 30 వేలు క్రొత్తభాగముల నేర్పఱుప వారితో ననుమతిగొని "వీనిని రొక్కమునకు విక్రయింపక" కార్యసాధానమున బుద్ధిబలముంజూపి "సహాయులైన వారికి జీతములకు బదులుగ భాగములనిత్తు" మనిచెప్పి తామును దమమిత్రులును లోలోన నీనూతనభాగముల దమలో బంచుకొనుట.

1. 10,000 భాగములకు సామాన్యమైనలాభము 40,000 కు సామాన్యమౌటచేత నీకపటము తెలియనివారలకు నీవ్యాపారమున లాభమట్టె యెక్కువలేదని తోచును. 2. భాగస్థులు వంచనకు లోనయినవారగుదురు. లాభమునం దధికభాగము చోదకులకును వారి యంతరంగ మిత్రులకును జేరునుగాని సాంఘికుల కెల్లరకును సమప్రయోజనకారిగాదు.

ఈ క్రియకు భాగములను నీళ్ళువోసి కలుపుట, యని కొందఱు పేరిడిరి. బోలుభాగముల సృష్టించుట యనియుం జెప్పవచ్చును. ద్రవ్య రూపమైన భాగములు స్థాపకులచే దొలుత గూర్పబడిన 10,000 మాత్రమే! తక్కిన 30,000 లును రొక్కమాధారముగా గలిగినవి గావు. మఱి నోటిమాటలచే దీఱినవి. వారు సహాయముచేసిరి, వీరు సహాయముచేసిరి యను మిషచే వారివద్దనుండి ధనము దీసికొనకయే యియ్యబడినవి. ఇది యాద్యంతము శుద్ధవంచనము. విషప్రాయము!

సర్కారువారు దీనికేరీతి బ్రతివిధానము చేయవచ్చును? చెప్పుడు? వ్యాపారముయొక్క గుట్టు తెలిసి యుండినంగాని లాభముయొక్క పెంపుఎంత, కృత్రిమభాగములెన్ని, నిక్కములెన్ని? యని నిర్ణయించుట యసాధ్యము. మఱియు నుత్పత్తి కింత వ్యయము పట్టును, సాధారణలాభము, వడ్డీ, ఈమాత్రము అని తెలియనిది ధరల మితము మీఱి దారుణమున హెచ్చించుచున్నారా, లేదా? యని నిర్ధారణ సేయుటకుంగాదు. ఇట్లీ ట్రస్టుల యంతరంగలనన్నియు బహిరంగములం జేసినగాని దేశము నకును, బ్రజకును, వాని భాగస్థులకును క్షేమ మనిత్యము. పెనుబాముల చందముననుండు నీట్రస్టుల కోఱలు పెఱికివేయవలయునను బ్రతిజ్ఞతో జేయబడియుండు శాసనముల ముఖ్యాంశములెవ్వియన:-

1. గవర్నమెంటుచే నియమింపబడిన సంప్రతులకు ట్రస్టుల యజమానులు తమ లెక్కలన్నియు నొక్కింతయైన దాపక చూపవలయు. మఱుగుజేసిన జుల్మానాలు మొదలగు శిక్షలు దప్పవు.

2. ట్రస్టులచే నుద్ధరింపబడి వ్యాప్తికివచ్చువెలలు, అమితఘోరములని యేర్పడినచో గవర్నమెంటువారు ప్రత్యక్షముగ నైనను, తమచే నీకార్యమును విచారించుటకై నియుక్తులైన యుద్యోగస్థుల మూలముననైనను, ఆ వెలల దగ్గింపవచ్చును.

3. వ్యాపారము వర్తకము వీని నిరోధించుటకై యేర్పఱుపబడిన పద్ధతులును నిబంధనలును న్యాయ స్థానములవారు రద్దుచేయవచ్చును. ఈరీతినే కృత్రిమధరల స్థాపించుటకై నియమింపబడిన సంఘములు, ఒడంబడికలు, మొదలగునవి శాసన విరుద్ధములు.

4. గవర్నమెంటువారు ఆ యా ట్రస్టులయు సంఘములయు స్థితిగతులను జర్యలను నారసి తమకు యుక్తమనితోచిన నాయుదంతములనంతయు బ్రజలకు బ్రకటన రూపమున జాటి చెప్పవచ్చును.

ఇట్లనేకములైన కఠినశాసనముల విధించినందున బ్రకృతము సంధిసంఘములు బలమఱియున్నవి. రాకిపెల్లరుగారు ప్రతిష్ఠించిన కిరోసిన్‌నూనె సంఘమును 1911 వ సంవత్సరమున గవర్నమెంటువారు శాసన విరుద్ధములైన దుర్మంత్రంబులజేసినట్లు నిరూపించి రద్దు చేయించిరి. కొన్నినెలలక్రిందట నాసంధిక్రియ యంతమునకువచ్చి ప్రత్యేక శాలలు పునరుద్భూతములైనవి.అయినను లోలోపల నేమి కుట్రలు జరుగుచున్నవో యెఱుగ నెవరితరము? నాటకములోని వేషధారులవలె నాసంఘమే నామాకార భేదముందాల్చి మఱియు నవతారమెత్తునేమో! ఒకసంవత్సరమైన గడచినంగాని యదినిజముగ జచ్చెనా, లేక యూపిరి బిగబట్టుకొని దొంగచావుతో నున్నదా యనుట విశదమగుట దుర్ఘటము.

సంధిసంఘముల యాజమాన్యముం దాల్చినవారును కార్యదర్శులును భాగస్థులు మొదలగువారిని నింకను నొకవిధమ్మున దోచుటయుంగలదు. మర్మములన్నియుం దెలిసినవారుతాము. వీరు చెప్పినది నమ్మియుండవలసినవారు భాగస్థులు. అట్లగుట దమవ్యాపారమేదో కారణంబున జెడుచున్నదని వదంతిని గల్పించి యది నిజమనినమ్మి భీతిచే ననేకులు తమభాగముల నమ్ముటకురాగా దక్కువవెలకు వానినెల్ల దమ యంతరంగ మిత్రులద్వారా తామేకొనుటయు బిమ్మట గొన్నినాళ్ళకు వ్యాపారము గండము దప్పించుకొని మఱల నెదుగుచున్నదని వదంతిబుట్టించి భాగములకు వెలహెచ్చుగా మఱల నమ్ముటయు, నిట్లనేకవిధములైన యింద్రజాలము లంజేసి యన్యాయముగ విత్తంబుల నార్జింతురు.

స్వాతంత్ర్య మఖండముగనుండు నమెరికాలో వీని నడంగద్రొక్కజాలిన వైరిసంఘంబు లేల పొడసూపకున్న వియని యెంచితిరేని దానికి వ్యాఖ్యానం బియ్యది. చక్కెర వ్యాపారములో 3/4 వాసి యొక సంధిసంఘ ముత్పత్తి సేయజాలెనేని దానితో నెదిరించి మానము ప్రాణమును దక్కించుకొనవలయునన్న దానికి సరియైన విస్తారకార్యముగల సంఘం బొండు బయలువెడలినంగాని యపజయము తప్పదు. అట్లు సరియైన సంఘంబొండు వెల్వడెనేని, అదియు 3/4 వాసి సరకు నమ్మకమునకు దెచ్చును. అపుడు గిరాకికన్న 1/2 వంతు సరకు లెక్కువగ నుంటచేత వెలలు వ్రాలినను ఉత్పత్తియంతయు విక్రీతము గాదు. అందుచే రోషాహతాన్యోన్యులై రెండు సంఘములవారుం జెడుదురు. కావున నీసంధి సంఘమ్ము లతో వైరంబుగొనుట దుర్లభంబు. ఇయ్యవి శాసనమ్ములచే నేకేశ్వరత్వంబు వహించినవి గాకపోయినను ననితర సాధ్యంబులుగాన నేకేశ్వర తుల్యంబులే. ఇతరులు వీనిపై దండెత్తివచ్చుట ఆపబడని తంత్రం బైనను నాచరించుటకు నలవిగానిది.

ట్రస్టులచే గలుగజాలిన లాభంబు లెవ్వియనిన

1. గొప్ప గొప్ప సంఘములు సంశ్లేషించుటచే వ్యాపారం బతి విస్తృతంబగును. విస్తారమువలని ఫలంబులెల్ల బడయవచ్చుట.

2. అట్లగుట నిర్వైరంబుగ గార్యంబు జఱుపుట.

3. ఉత్పత్తి వినిమయము మొదలైనవానికి బెట్టెడు వ్యయము తగ్గునుగాన వెలలనుదగ్గించి యమ్మ సమర్థులౌట. ఇక గష్టంబు లెవ్వి యనిన: 1. తమ వ్యాపారము వైరుల నిర్జించి నిలిచినదే వెలలు హెచ్చించుట.

2. చోదకులు మొదలగు కార్యజ్ఞులు, ఇంద్రజాలములుచేసి ప్రజలను భాగస్థులను వంచించి వారి యైశ్వర్యము నపహరించుట.

3. చిల్లర వ్యాపారముల స్వాతంత్ర్యమును నేలకు దెచ్చుట.

4. రాజ్యాంగమువారినిసైతము లంచములిచ్చి తమకు వశవర్తులుగ నుండజేయజూచుట.

ట్రస్టుల దౌష్ట్యమును వారించుటకు జేయబడిన క్రియ లెవ్వియనిన

1. శాసన విరుద్ధములని యాదేశించుట. ఇది మంచి చికిత్స గాదు. ఎట్లన, అవి వేషాంతరముం దాల్చి మఱల బ్రత్యక్షమునకు వచ్చును. మఱియు వానియం దనేక గుణమ్ములుండుటచే బొత్తిగా నశింపజేయుటయు నీతిగాదు.

2. మొత్తముమీద జేయదగిన యుపాయములేవనగా, రాజ్యాంగమువారు వీనిని విచారించి పరీక్షించి క్రమము లేర్పఱచుటకు నిష్పక్షపాత్రులును యోగ్యులునైన యుద్యోగస్థుల నియమించుట మొదటిది. రెండవది, వీని స్థితిగతులనెల్లనారసి యప్పుడప్పుడావృత్తాంతముల నన్నిటిని బహిరంగపఱచుట.

ధర్మసంధి సంఘములంగూర్చి సమష్టివాదు లుపన్యసించు ప్రకారము

వర్తమానముననుండు నార్థిక నిర్మాణము లయించుననియు, లయమొందుటమేలనియు, వితర్కించు సమష్టివాదులు, ఈసంధి సంఘములు రాబోవు సంఘనాయకత్వమునకు సోపానములని యాడెదరు.

ఎట్లన:-

1. పణ్యచక్రమునంతయు నాక్రమించినవగుటచే నివి గిరాకి యొక్క స్థితినరసి యుక్తమైనంత ఉత్పత్తింజేయుంగాన నమితోత్పత్తి దోషంబు నివారితంబగును. 2. ఇట్లే యన్నివ్యాపారములును జేయబడెనేని యజమానులకు, శిల్పులకు, ప్రజలకును, లాభములు, వేతనములు, వెలలును, నిలుకడగాంచినవవును. హెచ్చుతగ్గులవలని బాధ లికముందుపుట్టవు.

3. స్పర్ధయే శరణమనియుండు నీకాలమునందును సంధి సంఘముల గొంతవఱకును రాజ్యాంగమువారే పరిపాలింప జూచుచున్నారు. ఇకముందు నన్ని యార్థికతంత్రములును రాజ్యాంగ కృత్యములై సమష్టినాయకత్వంబు పట్టభద్రం బౌననుటకు నిది మార్గమును శుభశకునమునై యున్నదనుటకు శంకయేల?

ఇంగ్లాండులో సంధిసంఘములు ప్రబలకుండుట

ఇంగ్లాండులో సంధిసంఘములింకను అమెరికా, జర్మనీ దేశములలోబలె నావిర్భవింపలేదు. ఇందులకు ముఖ్యమైన హేతువులు మూడు:-

1. దిగుమతులమీద స్వదేశవ్యాపార రక్షణార్థము శుల్కములు విధింపబడమి. ఇందుచే బరదేశ వస్తువులు ధారాళముగ దెప్పింపబడును.

2. ఇంగ్లాండులో నయ్యైవ్యాపారముల సంఘముల యజమానులు సంధియను నియమమున బద్ధులు గాకయున్నను వేళవచ్చినపుడు తమకు సామాన్యములైన విషయములంగూర్చి కలసిమాట్లాడు కొని యంగీకారభావముతో బనిజేతురు. ఇంతకన్న నెక్కువగ బద్ధులైయుండుటకు వారికిష్టములేదు. దీనికై ఏర్పడినయవి కారయితృ సంఘములునాబడు.

3. సత్సంప్రదాయము, సౌశీల్యము, గొప్పబుద్ధియుగలిగి వ్యాపారము జేయుటయందుబలె నపారార్జన మందు వీరికంతగా నాసక్తి యుండునట్లుగానము. లోభంబుమాత్రము మహావ్రతమని యిప్పటి వఱకును బూనరైరి. ఇకముందెట్లో!

అన్యోన్యతా (కో ఆపరేషన్) పద్ధతులు

వర్తమానమున నార్థికవిచారములంబట్టిచూచిన దేశమ్ములోని జనులు మూడు తెగలుగ నున్నవారు. కారయితలు, కార్మికులు, వినియోజకులు, అనగా కొనువారు. ఇది గుణభేదముగాని మూర్తి భేదముగాదని ఎఱుంగునది. ఎట్లన, ప్రతిమనుజునందును నీవ్యాపారములన్నియు లీనమైయున్నవి. కారయితలును బాటుపడుదురు. వస్తువులగొని యనుభవింతురు. కార్మికులును దమపాటునకు దామేకర్తలు. వారును గూలిబడతుట భోగమునకేకాని పాతిబెట్టుటకుగాదు. వినియోజకులును పదార్ధములను సేకరింపగోరిన మాఱుపదార్థముల నిచ్చియో శ్రమించియో గడించుట యగత్యము అట్లగుట వారును ఉత్పాదకులే. కావున నేమియుదినక కష్టపడువారుగాని, కష్టపడక తినువారు గాని, యున్నారని భ్రమజెందబోకుడు!

ఇమ్మూడుజాతులకునుండు పరస్పరమైత్రి యెట్టిదనిన

1. కారయితలు, కార్మికులు నుత్పాదకులు. ఉత్పత్తికి వినియోగమాధారము. వినియోగమునకు నుత్పత్తి యాధారము.

2. కారయితలు కార్మికులును గలిసినంగాని యుత్పత్తి గొన సాగనేరదు.

ఇక వీరికుండు శత్రుత్వము

1. ఉత్పాదకులు వెలలుహెచ్చిన మేలందురు. వినియోజకులు తగ్గిన మేలందురు.

2. ఉత్పాదింపబడిన ఫలము బంచుకొనునెడ యజమానులకును గర్మకరులకును ద్వేషముపుట్టుట సహజము. కర్మకరులు సంబళ మెక్కువగా గావలయునందురు. నాయకులు తగ్గింపజూతురు.

కావున నాయక సేవకులకును, ఉత్పాదక వినియోజకులకును, గొన్నివిషయములలో పరస్పర భేదములున్న వనుట స్పష్టము. ఇదియు నొకవిధమైన మాత్సర్యమ. దీనిని నిరోధించు పద్ధతులు కొన్నిగలవు. అందు గొన్ని యుత్పత్తికాండమునకును గొన్ని విభజనకాండమునకును జేరినవి. ముఖ్యాంశముల మాత్రమిట సూచింతము.

నిక్కమైన యన్యోన్యతా పద్ధతియొక్క ముఖ్యలక్షణము లెవ్వియన

1. యజమానులును లాభనష్టములకు బాత్రులునైన భాగస్థులలో నందఱో కొందఱో యా యావేశనముననే పనికి గుదురుట.

2. భాగములుగలవారు గాకపోయినను శ్రమకరులుగూడ కూలి గాక లాభములో నొకపాలు వడయు వారుగను, ఆవేశనము నడుపు నాలోచన సభయందు జేరినవారుగను నుండుట.

ఈ లక్షణమ్ములు చక్కగ బట్టువడియేనేని సామాన్యమైన వ్యవహారసమాజములయందలి దోషములు వాయును ఎట్లనిన:-

1. శ్రమకరులకును యజమానులకును గాఢమైన సంయోగము సిద్ధము. కావున వీరిలో వీరికి వైరస్యము సంభవించుటయు, కర్మోపహారము మొదలగు నాపదలు పుట్టుటయు దొలంగును.

2. ఆవేశన తంత్రంబున భాగస్థులు తూగుబోతులుగానుండక యజమానత్వము సార్థకముంజేతురు. యజమానులలో ననేకులు శ్రమకరులును నగుటంజేసి చోదనశక్తి యలవడినవారై కార్యంబుల స్వబుద్ధితోనేర్చి తీర్పజాలుదురు.

3. సామాన్య సమాజములలో నావేశనముండుచోటు ఒకటి. ఇక భాగస్థులన్నలో దిక్కుదిక్కు లనుండియు రావచ్చును. ఇంగ్లాండులో బ్రబలములైన కంపెనీలలో ఇండియా మొదలైన తూర్పు రాజ్యములవారును భాగములుగొనుట సర్వసాధారణమైన క్రియగా నున్నది. నిర్మాతలయొక్కయు చోదకులయొక్కయు నాణెమును పరువునుజూచి యా వ్యవహారముల స్వరూపమునైన నేమాత్రము నెఱుంగనివారుసైతము మూలధనము నిక్షేపించుట మిక్కిలియు వ్యాప్తమైనవాడుక. ఈ విశ్వాసము మొత్తముమీద నుచితమైనది. వ్యవహార సమాజములయొక్క యఖండమైన వృద్ధియే యిందులకు దార్కాణము. నమ్మిక బేహారముల కన్న మోసపు వ్యాపారములు ఘనతగాంచునా? వానిలో నెవరైన దమసొత్తులను బ్రయోగింతురా? మొత్తముమీద సమాజములు విశ్వాసయోగ్యములయ్యును, భాగస్థులెక్కడనో యేమూలనో యుండు వారు గావున చోదకులు సర్వ స్వాతంత్ర్యమునువహించి యడుగువారు లేరుగదా యను ధైర్యముచే నిశ్శంకముగ సామాజకులను బ్రజలను వంచించి యర్థముల దోచుకొనుటయు లేకపోలేదు. అన్యోన్యతా పద్ధతియందిట్టి యకృత్యముల కవకాశము తక్కువ. ఏలన, భాగస్థులు కార్యవిచారణాది కార్యముల సమర్థులగుటంబట్టి.

4. అన్యోన్యతా పద్ధతియందు మఱియు నొకగుణముగలదు. కొంతకుగొంత పరిచయముగలవారుచేరి చేసినంగాని యీ పద్ధతి బాగునకురాదు. అట్లగుట నమితములైన మూలధనముల సేకరించుట దుర్లభము. సామాన్య సమాజములలో లోకస్థులెల్లరును భాగముల గొనవచ్చును. దాన బాధలేదు. కోఆపరేషన్ సమాజములలో నిది పొసగదు కావున వ్యవహారములు సాధారణ సంఘ సాధితముల యంత విస్తారముం జెందవు. చుట్టుప్రక్కల స్థలములవారుదక్క నితరులుచేరిన నన్యోన్యత నశించును. కావున నిట్టివ్యాపారములు మితవ్యాప్తికములు. మితములైననను నిఖరమైన వాడుకకాండ్ర సమూహము నవలంబించి యుండునవిగాన స్థిరతరములు.

5. శ్రమకరులును కొంతమట్టునకు యజమానులతో దుల్యులుగ గణింపబడుదురు. కానవారు శ్రద్ధతో బనులం గావింతురు. మేస్త్రీలు మొదలగు విచారణకర్తల నియమింప గారణములేనందున సెలవు మిగులును.

సిద్ధాంత మిట్టిదయ్యును ననుభవమున కోఆపరేషన్ సంఘముల యందును లోపము లనేకములు గన్పట్టెడిని: 1. శ్రమకరులకు యజమానత్వమిచ్చుట "కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి పట్టము గట్టినట్టు" లగును. గొప్పబుద్ధియు దీర్ఘాలోచనయు లేనివారు గావున తగిన కార్యచోదకుని నియమింప జాలరు. మంచివానిని సమ్మతించి ప్రతిష్ఠించిరిబో! తఱుచు వానిపై గన్నుంచి "ఇట్లుచేయవలయు నట్లు చేయవలయు" నని తామే యాదేశింపదొడంగి కార్యంబుం దిన్నగజఱుగనీరు. మఱియు చోదకుడు తమయందలి తప్పులంజూపి శిక్షించెనేని "మనచే నియమితుడైనవాడే మనల దండించువాడాయెనే! రాగల వత్సరమున వేఱొకనికి ప్రభుత్వ మిత్త" మని దురహంకారముం గొనుటయు నరుదుగాదు. దండనీతి ప్రవర్తింపదేని యరాజకం సాక్షాత్కరించును.

2. ఈకాలమున బుద్ధిబలము మిక్కిలి ముఖ్యమైన వ్యవహార సాధనమనియు నమూల్యమనియు మున్నే తెలిపితిమిగాదె! లక్షలకొలది సంబళములొసగి కళాకోవిదుల దమ తమ పక్షమువారిగా జేయ సమాజముల వారు స్పర్ధింతురు. అన్యోన్యతా సంఘములలో శ్రమకరుల కింకను జ్ఞానశక్తియొక్క విలువ తెలియనట్లున్నది. చోదక పదవికి నెత్తబడినవానికి జీతము లెక్కువగనిచ్చుట యింకను వారలలో నాచారమునకురాలేదు. సంబళము సరిగ పనియు జబ్బే. అత్యంత సమర్థులు వేఱెడలకుబోదురు. మొత్తముమీద కోఆపరేషన్ సమాజములలోని కార్యవిచారణకర్తలు ప్రధమగణ్యులుగారు. మిక్కిలి నిపుణుల నాకర్షింప జాలినంత వేతనములనిచ్చుబుద్ధి వానికున్నంగాని యవి ముందునకురావు. "మనము చెమటగారునట్లు దినమంతయు గష్టించుచున్నాము. మన యజమాను డేమిచేయును? ఒకమూలలో పిళ్ళారిమాదిరి గూర్చొని కాగితములద్రిప్పుచు చుట్టగాల్చుచుండుటయేకదా యతనిపని? ఇందులకా యతనికి నెక్కువ జీతమిచ్చుట? యని శ్రమకరులు వాపోవుదురు కాబోలు? పాపము విద్యాగంధము లేనివారు! మనశ్శ్రమయొక్క స్వభావము జ్ఞానాంధులకెట్లు గోచరించును? 3. చిల్లర వ్యాపారములలో జయము దాల్చునదియై వానియందు వ్యాప్తికి గాలక్రమేణ వచ్చుచున్న దనుట నిజమేయైనను మహా వ్యవహారముల నీపద్ధతికి జొరవ ఇంకనులేదు. అయినను నీపద్ధతి నిస్సంశయముగ గౌరవింపదగినదే. ఎట్లన:-

1. ఆర్థిక మండలమునందలి సమస్త వైషమ్యములకు నియ్యది విఱుగడ.

2. విద్యాభివృద్ధులు మించుకొలది దీనియందలి దోషంబులు పర్యవసానమునొంది గుణంబులుమాత్రము నిలుచును. ఈమార్గ మింకను నారంభదశలోనున్నది. బాల్యచాపల్యము త్వరలో వీడును. నిండు జవ్వనము వచ్చుతఱికి నియ్యది నిష్కల్మష తేజోవిరాజితంబై లోకంబుం బావనంబుజేయును.

3. పరోపకారంబు సహజముగ లీనమైన హృదయముగలవారికి నీపద్ధతి పరమాశ్రయంబు. ఈకాలమున స్వలాభాపేక్షయను తాపమ్మున నెల్లరు దహింపబడియెదరు. బొమ్మలు మొదలైనవానిని తండ్రి యింటికి దెచ్చినతోడనే "నాకేయిండు, నావేయివి, నీవికావు, దూరముగాబో" యని కాట్లాడుచు నాట్లాట మఱచు పసిపిల్లల మాడ్కి లోకము వారు సంపదల విషయమై మూఢవైరంబుందాల్చి యొక్క యెదుటివారి సుఖమునేగాక తమసుఖమును సైతము నశింప జేయుట చూడగా మనుష్యపదవి నుండువారికిని నిట్టి వెఱ్ఱియెత్తునా యని యాశ్చర్యమును దు:ఖమును గలుగకమానవు! మనుష్యులు జ్ఞాన సంపన్నులై రేని ఈ వెఱ్ఱి తనంతట వదలును. అపు డన్యోన్యతా పద్ధతుల నెల్లరు సహజకాములై యవలబింతురు. ఇకముందు గృతయుగమును గనిపించి పోషించుమాత ఈ పద్ధతియేయని త్రికరణ శుద్ధిగ నమ్మువారు కొందఱున్నారు. వీరికి నిదియే నీతిధర్మము, మతము సర్వమును! 4. భావిని దీనింజెందబోవు మహాభ్యుదయమునకు సూచనమో యనునట్లు కొన్ని వ్యవహారముల నిప్పటికే యన్యోన్యత ప్రబలమై వచ్చుచున్నది. ఈ వ్యవహారముల చారిత్రము శీఘ్రముననే వివరించెదము.

మీద జెప్పిన విషయములన్నియు సర్వ సంపూర్ణమైన పరస్పరతా వర్గముయొక్క ధర్మములు. ఇట్టి వర్గములు తఱుచు గానరావు. కాని, యీ ముఖ్యాంశములయందు గొన్నింటిమాత్రము స్వీకరించిన యసమగ్రపద్ధతు లనేకములు గలవు. అపరిపూర్ణములైన యన్యోన్యతా విధానములలో ముఖ్యము లెయ్యవియనిన;

1. లాభభాగము:- కర్మశాలాధిపతులు తమశిల్పులకు వేతనము లిచ్చుటగాక వచ్చిన లాభమునం దొకానొకవంతు పంచిపెట్టుట. ఇంతేకాని సేవకమండలి నెట్టి యధికారమును స్వామ్యమును మృగ్యములు.

ఈరీతివలని ఫలంబులు:- కారయిత కర్మకరు లిరువురును లాభాధిక్యమందాసక్తి గలవారగుదురు గావున వారలలో గలహము లంతగాబుట్టవు. శిల్పులును మనసుంచి కష్టింతురు. మఱియు నిట్టి శాలలో స్థానము లలవడిన మేలుగదాయని నిపుణులైన పనివారు వచ్చి చేరుదురుగాన కార్యములు నిండుఫలము నొసంగును.

2. నష్టభాగము:- కొన్నియావేశనములలో శిల్పులకు లాభం నందొక భాగమిచ్చి నష్టమువచ్చెనేని వారును నొకవంతు భరించు నట్టుచేతురు. ఇయ్యది పనివారికి సమ్మతమైన తెఱంగుగాదు. తమకు యజమానత్వము లేమింజేసియు, నష్టము కొన్నిసమయముల నకస్మాత్తుగ దటస్థించు కారణమ్ముల వలననేగాక యజమానుల బుద్ధిహీనతవలనను వచ్చుట ప్రసిద్ధముగావునను శ్రమకరులు నష్టమునకుం బాత్రులౌట కొడంజడమి సహజము. అట్లు నష్టమును భరింపవలయునయేని కార్యమును భరించుటలో తమకు హక్కునియ్యవలయునని వారివాదము. నష్టభాగ మనుష్ఠానములోనున్న శిల్పశాలలో కాలక్రమేణ శిల్పులకు యాజమాన్యమున బ్రవేశముగల్గు సరణి యున్నదనుట స్పష్టము.

3. సంభూయసముత్థానములు:- అనగా నల్పమూల్యములైన చిల్లరభాగముల నేర్పఱచుకొని శ్రమకరు లనేకు లేకీభవించి స్థాపించెడు కంపెనీలు కొన్నిగలవు. అయిన నిందొక్కవిశేషము. కార్యకర్తలుగా నియమింపబడినవారికిని దమకును మనస్తాపములుగలిగి సంఘము శిధిలమగునోయను శంకచే దానియందు భాగస్థులుగానుండు శిల్పులు అందు పనికి గుదరక యితరశాలలలో బ్రవేశించి కూలిసంపా దించి కొందురు. శిల్పులొకేశాలలో నొక విధముగజూచిన సేవకులుగను వేఱొక విధముగజూచిన యజ మానులుగనునుండిన కార్యము పొందికగా జఱుగుట కష్టసాధ్యమని పూర్వమేవివరించితిమి. ఈ యిక్కట్టులు లేకుండుటకై యొకశాలలో భాగములుగొని యింకొక శాలలో నౌకరులుగా శిల్పులు చేరుటయు గలదు. యజమానత్వముండుచోట దాసత్వము, దాసత్వముండుచోట యజమానత్వమును లేనిపద్ధతియిది.

శ్రమకరులు మూలధనం వినియోగించి భాగస్థులై యొడయలై యుండుదురను నొక విషయమునందప్ప తక్కిన విచారములనెల్ల నీ సంఘములు సామాన్యములైన కంపెనీల కరణి నుండునవి. నిర్మాణముం బట్టిచూచిన వీనికి భేద మిసుమంతయుం గానము.

4. కొన్నిసంఘములలో శ్రమకరులు మూలధనము నిక్షేపించి భాగములు గొనువారు కాకపోయినను గార్యతంత్రంబుల యజమాను లట్లు తామును నాలోచనజెప్పి తమ సమ్మతి వెల్లడిపఱచు హక్కు గలవారుగానున్నారు. ఇట్టి సంఘములలో నాయకులకు సేవకులకు నెడతెగని సంయోగము సిద్ధము. మఱియు శక్తికొలది బదవుల నందవచ్చుగాన నెల్లరు మహోత్సాహమున దమతమ పనుల నెరవేర్తురు. గొప్ప వ్యవహారముల నడుపుటకు నాధారములు రెండు. మూలధనము, బుద్ధిబలము. ఈ కాలమున బీదలు సైతము కుశలతయు, యోగ్యతయు గలవారుగానున్న మూలధనము సేకరించుట దుర్ఘటము గాదు. ఎట్లన, అనేకులుగలసి తమకు గలిగినది కొంచెమో యధికమో వేసికొనిన "ఓల్‌డ్‌హేమ్" అను నింగ్లాండులోని యొకానొక పట్టణమునందలి శిల్పులమాడ్కి తామే ఘనమైన శాలల బ్రతిష్ఠింప జాలుదురు. బ్యాంకీలు, నిధులు మొదలగు ధనాగారములలో నెంతో రొక్కము వ్యర్థముగాబడి కుళ్ళుచున్నదిగాన తగిన వ్యావహారికులు వచ్చిరేని నయమైనవడ్డీతో ఋణమిచ్చుటకు నెందఱో కాచుకొనియున్నారు. మఱియు, తాను బీదవాడుగావున తనకెవ్వరు నప్పునియ్యరనుశంకగొనిన నది సహజమేకాని, యనేకులు బీదలైన కర్మకరులు సంఘములుగానేర్పడి సమూహముగ "మేమెల్లరము నుత్తరవాదులము" అని నమ్మికజెప్పి యర్థించిన నట్టిసంఘములకు మితవృద్ధిగోరి ధనమునొసంగ నెవరును వెన్కదీయరు. ఇండియా దేశములో 'కో ఆపరేటివ్ క్రెడిట్‌' సంఘములు (అనగా బరస్పర ముత్తరవాదులుగా నుండవలయునను నియమముతో ననేకులు గలసి ఋణప్రసాధనమునకై యేర్పఱ చిన సంఘములు) సంఖ్యలో నానాటికిం బెఱుగుచున్నవి. కారణమేమి? కలసి యర్థించిరేని మోసము నకు నవకాశము తక్కువ, దివాలెత్తుదురను భయముతక్కువ, కావున వడ్డీ తక్కువ. ఇచ్చుసొమ్ము ఎక్క్కువ. కావున నన్యోన్యతమై సమాజములుగ నేర్పడిన బీదలు సయితము కావలసినంత మూల ధనము లేపగలరు. విశ్వాసము, విమర్శ, ఉత్సాహము మొదలైన యుత్తమ వ్యవహార సంప్ర దాయము లఖండముగనుండు ఇంగ్లాండు మొదలగు పశ్చిమదేశములలో మూలధనమను పంటకు క్షామములేదు. మఱియెన్నడునురాదు. మూలధనము గడించుట దుస్తరము గాదు. కావున శ్రకరులకుండు ముఖ్యమైన లోపము పరిపణమనుట తప్పు. మఱి వారిని దలయెత్తనీయక హీనస్థితిలో నుంచునట్టి ప్రమాదమెయ్యది యన, జ్ఞానశూన్యత. ఇప్పటి కాలములో వ్యవహారములు విస్తారము నొందినంగాని సమగ్రఫలంబులుగావు. విస్తార వ్యవహార సంఘటనకు దత్సంబంధములైన యన్నివిషయములయొక్కయు జక్రముల యొక్కయు నుదంతములనెఱింగి యాలోచనతో వర్తించుట ఆవశ్యకము. ఇది సర్వజ్ఞులకేకాని లాతివారలకుం జెల్లదు. శిల్పు లెన్నియో విధంబుల నారితేఱినవారైనను విద్యావధానంబుల బరిశ్రమ లేనివారగుటం జేసి వలసినంత ధీశక్తిబడయుట వారికి సులభంబుగాదు.

అయినను నీకాలమున బశ్చిమ రాజ్యములలోని జనులెల్లరు చదువను వ్రాయను నేర్చినవారగుట చేతను, పుంఖానుపుంఖములుగ వార్తాపత్రికలుండుటచేతను, ఈకొఱంతయు గొంతకుగొంత వారింప బడుచున్నది.

పరస్పర సముదాయముల చరిత్రము

ఈ క్రింద బేర్కొనబడిన దేశములయందలి ముఖ్యాంశములు మాత్రము గొన్నింటి నిట బొందుపఱచు చున్నామని తెలియునది.

1. ఇంగ్లాండులో:-

ఈ సముదాయములు రెండు జాతులు, వినియోజకములు, ఉత్పాదకములు. అనగా వినియోగము, ఉత్పత్తి వీనిని సరసముగ నడపించుటకై వినియోజకులు, ఉత్పాదకులునుగలసి కట్టిన పరస్పర సహాయ సంఘములనుట.

వినియోజకాన్యోన్య సంఘములు

నిర్మాణోద్దేశము:- భోజ్యములు, పానీయములు మొదలగు వస్తువులను జిల్లరగాగొనిన వెల యెక్కువ యియ్యవలసి వచ్చుననుట స్పష్టము. వానిని మొత్తపువెలకుగొన్న నచ్చివచ్చును. మొత్తపు ఖరీదులకు గొనవలయునన్న గొనుమొత్తము గంభీరముగ నుండ వలయు. ఒక్కపలము చక్కెరను మొత్తపువెల ప్రకార మెవ్వడు నమ్మడు. ఒక్క మణుగుగొంటిమేని వర్తకులు ధరలదగ్గించియిత్తురు.

చూడుడు! అట్లగుటంజేసి కూలివారు మొదలగు బీదలు మొత్తపు ధరలకు గొప్ప మొత్తముల గొనవలయునన్న నుపాయ మెట్లు? వారు సంఘములుగాజేరి కొనుటయే . అట్లుకాకొని వస్తువుల విభాగించుకొనిరేని వ్యయము మిగిల్చినవా రగుదురు. ఇదియే వినియోజక సమాజముయొక్క ముఖ్యఫలమును దాత్పర్యమును.

1844 వ సంవత్సరమున 'రాక్‌డేల్‌' అను పట్టణములో 28 మంది శిల్పులు కూటముగనేర్పడి భోజ్యముల మొత్తముగగొని యంగడి వెలలకే తమలో దమకు నయ్యవి విలిచి, సెలవులుపోగా మిగిలిన లాభమును అప్పుడప్పుడు పంచుకొన నారంభించిరి. వీరిచర్య యీ సంఘములసిద్ధికి బీజమువంటి దనుటలో నతిశయోక్తి యేమాత్రమునులేదు. మహానదుల జన్మస్థానములు అల్పప్రవాహములుగ నుండురీతిని పరస్పరతాపద్ధతియు నీచిన్నియుద్యమమున నుద్భవించిన దాయె! మార్గదర్శకులైన యీ సమాజములవారు లాభములో నొకపాలు దుకాణములోని సేవకులకును మఱియొకపాలు తమవారికి జదువు సాములు చక్కగా నేర్పుటకునై యెత్తిపెట్టి మిగిలిన భాగము మాత్రము తాము స్వీకరించునట్లు సమయంబొనర్చి యన్యోన్యతను నిలిపిరి.

తదనంతర మిట్టిసమాజము లనేకములు వెలువడినవిగాని, స్వలాభాపేక్షచే సాంఘికులు కొన్నియెడల శ్రమకరులకు భాగము లేర్పఱుపక యావత్తును తామే సంగ్రహింపం దొడంగిరి. ఇవి సామాన్యములైన భాగస్థులుకలసి చేయు వ్యాపారములవంటివి. సామాజకులు భాగస్థులవంటివారు. వచ్చినలాభము దామే స్వీకరింతురు. సామాజకులే వాడుకకాండ్రుగదాయని యందురేమో? అయిననేమి? కంపెనీలలో భాగస్థులు వస్తువులు గొన్న వద్దనువారు గలరా? అట్లగుటంజేసి యిది నిజమైన తారతమ్యముగాదు. పరస్పర సమాజములలో మొత్తపులాభమును సామాజకులకు బంచియిచ్చుటయేగాక ప్రతి సామాజకుడును తమయంగడిలో గొను సరకుల వెలల పరిమాణమును ననుసరించి వానికి తఱుగుడు నిత్తురు. అనగా 100 రూపాయల వస్తువులు గొన్నవారికి 10 రూపాయలు, ఇట్లు నియమముల ననుసరించి త్రోపుడుచేయుట. ఇట్టి సహాయములచే సామాజికులు తమయొద్దనే తీయునట్లుచేయ జూచుటయుంగలదు. ఈ త్రోపుడు తమ సమాజమునకుంజేరని వాడుకకాండ్ర కియ్యరు.

ఈ యంగళ్ళకే యింగ్లీషులో 'కో ఆపరేటివ్ స్టోర్స్‌' అని పేరు. ఇవి విక్రయశాలలుగాన - అనగా వస్తువులను వాడుకకాండ్రకు బంచియిచ్చునవియనుట - వీనిని స్థాపించు సమాజములకు విభజన సమాజములనియుం బేరుగలదు. ఈశాలలువలన కర్మకరులకు గలుగు ఫలములు:-

1. కూడబెట్టిన ధనమును వడ్డీవచ్చునట్లు నిక్షేపించుట కివి యనుకూలములు.

2. వస్తువులగొనుట మొదలైన విధముల వచ్చులాభము చిల్లరచిల్లరగావచ్చిన నప్పుడప్పుడే సెలవైపోవును. అట్లుగాక సంవత్సరమున కొకటి రెండు తడవలుగ మొత్తముగా జేతికినందిన నీలాభమును వ్యర్థముగాజేయక లాభకరములైన యుద్యమములలో మూలధనముగ బ్రయోగింతురు.

ఈ రెండు గుణమ్ములుండిన మాత్రముననే వీని నన్యోన్య సమాజములని చెప్పశక్యముగాదు. పరస్పరత నిక్కంబగుటకు నాధారములు రెండు. సేవకులకు లాభములో పాలిచ్చుట, లేక భాగస్థులు గాకున్నను యజమాన మండలిలో జేర్చుకొనుటయును, వాడుకకాండ్రకు అనగా వినియోజకులకు దాము గొను వస్తువులయొక్క ధరల పరిమాణముంబట్టి తఱుగుడు మొదలగు విధముల లాభ మొన గూర్చుట యును. ఈ లక్షణములులేకున్న శ్రమకరులకు బీదలకు నెంత యుపకారముం జేయునవియయ్యును అవి నిజమైన యన్యోన్యతా వర్గములుగావు. మఱి కృత్రిమములు. సామాన్యములైన కంపెనీల వంటివి. అనగా ధనసంపాదనముందప్ప నింకేయర్థమును బాటింపనివి.

విక్రయములకై స్థాపింపబడిన వినియోజక (లేక విభజన) పరస్పర సమూహములుగాక ఉత్పత్తి - అనగా వస్తురచనాదికళ - నెఱవేర్చుటకై యా క్రమము నవలంబించిన యుత్పాదక పరస్పర సమాజములుం గలవు. ఇవి విక్రయశాలలట్లు ఘనతరములుగావని యీ సంఘముల గుణదోషముల జర్చించు నవసరంబున సూచించితిమి. ఇందులకు చరిత్రాంశములును సాక్ష్యము నిచ్చుచున్నవి ఎట్లన;

ఇంగ్లాండులో 1890 సంవత్సరాంతముననున్న పరస్పర వర్గముల వివరం

- సంఖ్య సామాజికుల సంఖ్య మూలధనము (సవరనులు)
విభజన సమాజములు 1418 10,26,912 10,607,432
ఉత్పాదక సమాజములు 119 27,214 597,933
ఇతరములు 16 62,929 10,56,587

వీనియొక్క వృద్ధివేగముందెలుపు నంశములు

సంవత్సరం సమాజముల సంఖ్య సమాజికుల సంఖ్య మూలార్థము (సవరనులు)
1866 915 174,993 1,046,310
1876 1165 507,857 5,304,019
1886 1296 835,200 9,297,506
1890 1554 1,117,085 12,261,952

పనివాండ్రచే నిండిన యీ సమాజములు మిక్కిలి తక్కువ వడ్డీకి 2,800,000 సవరనులను బ్యాంకీలు మొదలగు ఋణదాయి వర్గములనుండి వ్యాపారార్ధ మప్పుబడచినవి. ఇదిచూడంగా నికముందు మూలధనము లవారు కూలికి శ్రమకరులను నిలుపుకొనుటపోయి శ్రమకరులు వడ్డీయనుకూలినిచ్చి మూలార్ధములంగొని ప్రభువుల పదవిం జెందుదురేమోయని తోచెడిని! ఉత్పాదక పరస్పరవర్గములు బీడువడియున్నవనుట స్పష్టము. దీనికి హేతువులెయ్యవి? అరయుదము.

సేవకులును లాభములో బాలుగొనియుండుట యీ పద్ధతియొక్క యాధారలక్షణములలో నొకటిగదా! ఈ లక్షణ మింకను ముకుళితస్థితిలో నున్నదిగాన వికాసమునకు రామింజూడ చింతనీయము. 1889 వ సంవత్సరమున జరుపబడిన యీ సమాజములవారి సాంవత్సరికసభలో నుత్పాదక సంఘములు వృద్ధిజెందమికి గారణము లీక్రిందివని వారేయొప్పుకొనిరి. అవియెవ్వియన:-

1. ఈ సమాజములు చాల చిన్నవి. విస్తార వ్యాపారము వహింపజాలినవికావు.

2. మఱియొండొంటితో నివియు మిక్కిలి స్పర్థించుచున్నవి. బయటి కళాశాలలవలని వైరమే ప్రాణకంటకముగ నుండగా నిక దమలోదామే మత్సరముం జెందినగతియెట్లు?

3. వీనికెల్లను సంధిగల్పించి స్నేహభావమున వర్తించునట్లుచేయ గొందఱు ప్రయత్నించిరి గాని వారితలంపు కొనసాగలేదు. నిజమైన పరస్పరత యెంతోగొప్పగుణము.మాటలలో దాని వర్ణించువారు పెక్కురున్నారుగాని చేసి చూపువారిసంఖ్య యత్యల్పము.

ఇతరకారణములు మున్నే చర్చింపబడియె. ఈ యుత్పాదక సమాజములలో నిప్పటికిని జయప్రదములైన యెవ్వియన:-

1. లెస్టరు పట్టణములోని బూట్సు ఫ్యాక్టొరీ.

2. గోధుమలను బిండిచేయు ఫ్యాక్టొరీలు ఆరు. ఇవి యన్నిటికన్న బాగుగా నడుపబడుచున్నవి.

కో ఆపరేటివ్ వ్యవసాయము ఇంగ్లాండులో నింకను బ్రబలమునకు రాలేదు. కాని యైరోపాలోని యొకటి రెండు దేశములలో మంచి వృద్ధికి వచ్చియున్నది. 'ఓల్‌డ్ హేమ్‌' అను పట్టణములోని వస్త్రరచనాశాల లనేకములు శ్రమకరుల యధీనములై యున్నవి. అయిన నొక్కటి. ఏశాలలలో దమకు భాగములున్నవో యందు దాము పనిచేయక తదితరశాలలలో గూలికి నిలుతురు. మొత్తముమీద నివి సంభూయ సముత్థానములకుం (జాయింట్ స్టాక్ కంపెనీలకుం) జేరినవికాని పరస్పరతా పద్ధతిం దాల్చినవికావు.

ఇంగ్లాండుగాక తక్కిన పశ్చిమదేశములలోని కో ఆపరేటివ్ సంఘముల చరిత్రములు

ఇవి రెండువిషయములలో నింగ్లాండును మీఱియున్నవి. వేని యందన 1. వ్యవసాయమున. 2. ఋణసాహాయ్యార్థమైన నిధిజాలమున.

వ్యవసాయము:- కాపువారు ఇతరేతర సహాయార్థము సంఘములుగనేర్పడి కర్షణ యంత్రములు మొదలైనవానింగొని వంతుప్రకారము వానిని వాడుకొనుట, ఎరువు మొదలగు సామగ్రులను మొత్తముగాగొని పంచుకొనుట, ధాన్యమును బ్రోగుసేసి యందరును గలసి యేకవాక్యముగ వర్తకులతో బేరమాడుట, ఇత్యాది క్రియలచే దమ దారిద్ర్యము నివారించెదరు. మఱియు సంఘముగ నప్పుగోరిన తక్కువవడ్డీకి లభించుగాన సర్వవిధముల వ్యయము తగ్గునట్లును, ధాన్యము, వెన్న, జున్ను, వీనివెల హెచ్చునట్లునుజేసి మునుపటివలె గష్టనష్టములకుం బాత్రులుగాక యిప్పుడిప్పుడు ధనము మిగిల్చి కూడ బెట్టువారును అగుచుండుటజూడ నిట్టి వర్తనముల హిందూదేశీయు లభ్యసింప గలిగిరేని మనవారును ఇంచుమించుగా బచ్చగానుండక మానరనుట విశదము. డెన్‌మార్కు దేశములో వెన్నదీయు శాల లఖండములుగ నున్నందున నద్దాని యెగుమతి యేటేటకు నెక్కువ యగుచున్నది.

కో ఆపరేటివ్ బ్యాంకీలు కృషీవల సంఘములకు నెంతయు దోడై సాహుకారుల చేతులలోజిక్కి కాపువారు నలగకుండునట్టు లుద్ధరించుచున్నవి. తన నాణెముబట్టియే యప్పుదీయవలయునన్న నెక్కువ వడ్డీకి సమ్మతించినంగాని కాదు. సంఘ ముత్తరవాదిగానున్న తక్కువ వడ్డీకి నెవరైన నిత్తురు. కావున బలహీనులును పొత్తుచేత ధనాఢ్యులవలె సత్తువగలవారగుట సర్వజనవేద్యముగాని, యట్టి పొత్తునుగలిగి కలసిమెలసి యుండు గుణమ్ము లింకను ననుభవమునకు బాగుగవచ్చినట్లు గానము. ఇతర దేశములలోనికన్న హిందూ దేశమున సులభఋణము ప్రధానము కారణమేమనియందురేమో వినుండు! వాన లప్పుడప్పుడు రాకపోవుటచేత కిస్తీ చెల్లించుటకును, పండుగలు, వివాహములు, చావులు, పుట్టుకలు ఇత్యాది సంస్కారములు వలదన్నను దమంత వచ్చిపడుటచేత బలాత్కార దానధర్మోత్సవాది క్రియలకు నరణముం బెట్టుటకును ద్రవ్య మమేయముగ గావలసి యుండుటయేకాక, యా సమయమునకే తప్పక లభించినంగాని మానహాని సిద్ధము. కావున కాపులు తరుణమువేచి నిలిచి నిదానముగ బేరమాడ లేరు. వృద్ధ్యాజీవులైన సాహుకార్లు ఇదే మనకు సమయమని 100 కి నెలకు రెండుమూడుగ వడ్డీవిధించి, నేలల కుదువ వ్రాసికొని రైతుల నెల్లవిధముల గొల్లగొట్టి, పాపపరిహారార్థము గుళ్ళుగట్టించి ధర్మాత్ములని ప్రసిద్ధి వడయుట మనకందఱకును దెలిసిన సంగతియ కదా! నాకుంజూడ దేవస్థానముల గట్టించుట భక్తిచేతగాదు, మఱి కృతజ్ఞతమై. ఎట్లనిన, దేవతలకు దృప్తిచేయుటకైకాదె కాపువారు సంస్కారముల నిర్వర్తింపబూని తమకు వికారముందెచ్చికొనుటయు, సాహుకార్లకు సర్వస్వము ధారవోయుటయు? కావున దేవతలు అన్యాయవృద్ధికి స్థానములును, రైతులకు అష్టదిగ్బంధనములునై, యుండుటచేత ఋణజీవులకు పరమాశ్రయులు, నిత్యసేవ్యులు. పరలోకమున మోక్షమిత్తురో యియ్యరోకాని, సాహుకార్ల ఇహలోక మోక్షమునకు వారు కల్పవృక్షములు. ఈ వృక్షముల నెండనెట్టినం గాని కాపువారికి సుఖజీవన మసంభనము. ఈ విషయము వినిమయకాండ సంబంధి గావున నింతటితో నిప్పటికి వదలవలయు. మనదేశములో కో ఆపరేటివ్ ఋణసంఘములు ప్రకృతము బహుత్వరితగతి వ్యాపించుచున్నవి. వీనింగూర్చిన వివరము లికముందు దెలుపబడును.

కో ఆపరేటివ్ వ్యవసాయము మొదలైన యుత్పత్తి కార్యములు నిర్విఘ్నములుగ నెరవేఱవలయునన్న కో ఆపరేటివ్ విక్రయశాలలతో సంధిగలిగియుంట మంచిది. అట్లయిన సరకు లమ్ముడువోవు మార్గము సిద్ధము. ఇంగ్లాండులో పరస్పర వర్గములచే బాలితములైన భూముల విస్తీర్ణత సుమారు 2000 ఎకరములు. ఇవి ధాన్యములు, పండ్లు, పశుసంతానములు, వెన్న, పాలు, జున్ను ఇత్యాది వస్తువుల ప్రాప్తికి నాధారములు. మఱియు నీవర్గములు విభజన వర్గములతో సాంగత్యము గలిగి యుండుటంబట్టి యీ పదార్ధములు విక్రయశాలలవారిద్వారా యా సంఘములకుం జేరిన శ్రమకరులు మొదలగు వారలకు ననాయాసముగ నమ్ముడువోవును. విభజన వర్గములవారే తమకు సరకు లడ్డులేక లభించుచుండవలయునను కోరికచే భూముల గొని పంటబెట్టుటయు, వస్తురచనకై ఫ్యాక్టొరీల స్థాపించుటయుం గలదు. ఇందుచే వ్యక్తమగునీతియేదన, సజాతీయములైన వినియమ శాలలతో గలిసియుండినంగాని పరస్పరతా పద్ధతిమై ప్రారంభింపబడిన యుత్పత్తికార్యము కొంతవఱకు జయశీల మైనను తప్పక నిండుజయమొందునను నిశ్చయములేనిదగును. నిర్వికల్పసిద్ధికి కో ఆపరేటివ్ అంగళ్ళతోడి సంయోగము ప్రధానము.

కో ఆపరేటివ్ ఉత్పత్తిశాలలు

(ఇంగ్లాండులోనివి)

ఇంగ్లాండులో వస్తువుల రచించుకార్యమున బ్రవేశించియుండు పరస్పర సంఘములసంఖ్య సుమారు 120. ఇందు సేవకులకు లాభము నను కార్యవిచారణమునను వంతునొసగి పరిపూర్ణ పరస్పరతగల యవి సుమారు 75 మాత్రమే. తక్కినయవి లాభమును భాగస్థులకును వాడుకకాండ్రకును బంచిచ్చి, సేవకులకు కూలితప్ప మఱేమియు నీయని యపక్వపద్ధతి నవలంభించిన వ్యావహారికసమాజములు. ఈసమాజముల జేరినవారిలో ముక్కాలు మువ్వీసముమంది శ్రమకరు లయ్యును వారును దమసేవకుల దక్కువగాజూచుచు, తాము తమ యజమానులనుండి పడయగోరిన హక్కులను దమకు నధీనులైనవారికి నియ్యక యుండుటంజూడగా, మనుష్యులయొక్క సహజకాఠిన్యము గోచరింపకపోదు. అయిన నొక్కటి. ఇప్పుడు పది పండ్రెండేడులుగా స్థాపనకువచ్చు సమాజములలో కూలివారికిని లాభభాగాదు లేర్పడి యుండుటవలన భావిని పరస్పరత సర్వవ్యాపినియై యుండునేమో యను కుతూహలము గలిగెడును. సమగ్రమైన యన్యోన్యతంబూనిన సంఘములలోని శ్రమకరులసంఖ్య ప్రకృతము సుమారు 6000. ఈ సంఘములవలని మేలులలో ముఖ్యము లెయ్యవియన:- 1. శ్రమకరుల యభివృద్ధి. 2. కర్తలకును గర్మకరులకును గలహములు లేకపోవుట. 3. శ్రమకరులకు విద్యజెప్పించుట, పించెనులిచ్చుట మొదలైన యుదారక్రియలకునై ద్రవ్యసంచయముల ప్రోగుచేసి వినియోగించుట ఇత్యాదులు.

కో ఆపరేషన్‌వలన జనసంఘమునకుగల్గు శ్రేయస్సులు

1899 వ సంవత్సరములో నింగ్లాండులోని కో ఆపరేటివ్ సంఘములచే విద్యావిషయముగా జేయబడిన ఖర్చు సుమారు 24,000 సవరనులు. అనగా 3,60,000 రూపాయనుట! పాఠశాలల స్థాపించుట, పండితులచే బ్రసంగములు సేయించుట, పుస్తకభాండాగారములం బ్రతిష్ఠించుట ఇత్యాది సాధనములచే జనసామాన్యముయొక్క హృదయమునకు నుల్లాసము నుత్సాహముందెత్తురు. మఱియు బుద్ధికశలత గలవారయ్యు దారిద్ర్యమువలన ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాశాలలలో జదువనేరని బాలురకు సహాయముగా సంవత్సరమునకు రు. 3000 ఆదాయముగల విద్యార్థివేతనకోశముల రెంటిని స్థాపించియున్నారు. తమవా రప్పుడప్పుడు వేడుకగా ప్రొద్దుపుచ్చుటకై వినోదసభల జేయించెదరు. వీనివలన దేశములోని జనులలో పరస్పర గౌరవము మైత్రియు వృద్ధియగుచున్నవి. అపరిపూర్ణములైన వర్గములు, ఇంచుమించు సామాన్యసంఘములవలె నున్నవి యంటిమి గాదె? ఇవియు గొన్నివిధము లంజూచిన నట్టికంపెనీలకన్న నెంతోమేలైనవి. ఎట్లనిన:- 1. కంపెనీలలో భాగముల ననుసరించి యధికారముండెడిని. అందఱుగలసి యాలోచనకు గూర్చున్నపుడు ఒక్కభాగముగల వాడీయగల సమ్మతియొక్కటియ. పది భాగములు గలవానియవి పది. అసమగ్ర పరస్పరవర్గములసైతము భాగస్థు లందఱు సములు. 10 రూపాయలు మూలధనమువేసినవాని కెంత సొంతమున్నదో యంతేగాని 100 రూపాయల యాసామికి నంతకన్న నెక్కువ సొంతముండదు. 2. కంపెనీలలో మూలధనముయొక్క - అనగా భాగములయొక్క - పరిమాణము నియతమైయుండును. లక్ష రూపాయల మూలధనముగల కంపెనీ యిదియని సర్కారులో రిజిస్టరయ్యెనేని అంతకన్న నెక్కువ భాగముల నేర్పఱుపవలయునన్న గవర్నమెంటువారి యంగీకారము బడసినంగానికాదు. మఱియు భాగములు నియతములై యుండుట వలన కొందఱు ధనాఢ్యులా యుద్యమము లాభకరమని యెఱింగిరేని పాళ్ళంతయు దామేకొని యితరులకు సందియ్యరు. ఇక నిర్మాణమన్ననో యదియు బలాఢ్యులకు కార్యమునెల్ల గైవసము చేయునదియ. సాధారణములైన సంభూయ సముత్థానములన్నియు గొందఱు గొప్పవారిచే బరిపాలిత ములు. భాగస్థ బాహుళ్యమునకు నంతగా నధికారములేదు. అసంస్కృతములైన యన్యోన్యసమాజముల యు మార్గములువేఱు. భాగములిన్నియని నియతములుగానందున నెందరైన వానిలో జేరుటకు నాటంకములేదు. అధికారము సమాజ బాహుళ్యముం జెందియున్నదిగాని యొకరిరువురియం దస్థిరమై నిలుచునదిగాదు. మఱియు నిన్నింటికన్న నెక్కువభాగము లొకచేతిలోనికి రాగూడదని నియమముండుటచేత గొందఱు ధనికులు వానినెల్ల నాక్రమించుకొనుట యసాధ్యము. అనేక వర్గములలో నీ మితము 3000 రూపాయల విలువగల భాగము. ఇంతకన్న నెక్కువగ నెవ్వడును మూలధనము వేయగూడదు. 3. కంపెనీలలో లాభమును భాగముల ప్రకారము పంచియిత్తురు. ఇందుచే నెక్కువ భాగములు గలవారు ఆదాయములో నెక్కువపాలు మ్రింగి శేషించిన యుచ్ఛిష్టము నితరులకుం బెట్టుదురు. ఈ వర్గముల నట్లుగాదు. వాడుకకాండ్రకు వారుగొను సరకులకొలది తొలుత లాభములో నొకవంతు పంచియిచ్చి, మిగిలినదానిని మాత్రము మూలధనమునకు జెందునంశమని నివేదింతురు. వాడుకకాండ్రకు నీ లాభములజేర్చు విధములురెందు. 1. తఱుగుడునిచ్చుట. 2. ఇంకను ముఖ్యమైనరీతి యేదనగా 100 రూపాయల సరకుల గొన్నవారికి నీమాత్రమని సంవత్సరాంతముననిచ్చుట. అనగా బ్రతివాడును గొనుసరకు మూల్యము లెక్కవెట్టి తదనుక్రమముగ లాభభాగముల విధించుట. వినియోగము ననుసరించి సరకుల గొందురు. ఎక్కువ లాభము గ్రహింపగోరి వినియోగ కార్యమును - అనగా తినుట, కట్టుట యిత్యాదుల - నే లోభియు నెక్కువ సేయడు. మొత్తముమీద పుంజీదార్లకు నీ వర్గములో ప్రధానత్వము మిక్కిలి తక్కువ.

అక్కడక్కడ వెదజల్లినట్లుండు నీసంఘములు, కలయిక గలిగి యున్నంగాని తమకు బ్రదుకు బలము కష్టములని యొండొంటితో సంధినెఱపి, దేశీయమైన యొక్కటే మహాసంఘముగా నేర్పడునట్లున్నవి. ప్రతిసమాజములవారును, ఏటేట జఱుగు దేశీయ పరస్పరవర్గ మహాసభకు ప్రతినిధులను బంపుదురు. ఈ మహాసభలో నన్యోన్యతా విషయమైన యఖిల విషయములును చర్చింపబడుటయే కాక అయ్యై సంఘములవారిచే బరిశీలితములైన నూతన సంగతులును అఖిలవేద్యములుగ జేయబడును. ఇవియన్నియు నేకకుటుంబ మునకు జేరినవానివలె నుండవలయుననుట వారి ముఖ్యోద్యమము. కావున నుత్పత్తి ప్రముఖ సర్వార్థిక క్రియామర్మములన్నియు నొండొరులకు ధారాళముగదెలిపి యవిభక్తముగ నుంచికొందరు. ఉత్పత్తిశాలలు విక్రయశాలలును పొత్తుగలిగి యుండుచోట్ల వానికి వచ్చులాభము, అట్లు పొత్తులేక స్పర్ధ మైబనిచేసినవానికి రాదుగాన, నాసంఘములకుంజేరిన యుత్పాదకులకును వర్తకులకును గాఢమైన కూటమి పట్టువడియున్నది. మఱియు నత్యంత విస్తారవ్యాపారోపేతములైన వినిమయశాలలు, సరకుల ఖండితములుగ దమకు దక్కుటకై వ్యవసాయము, వస్తురచన ఇత్యాద్యుత్పత్తి ప్రయత్నముల దామే ప్రారంభించుటయుం జూచియున్నారము. సహవర్గములతో సంధివలదని ప్రత్యేకముగ నిలిచిన సంఘము లనేకములు బీడువడినయవి. దీనింబట్టి చూడగా బరస్పరతా ధర్మమున వర్గసంయోగమను ధర్మము లీనమై యున్నదని తోపకపోవునా? అట్లగుట దేశమెల్ల, మైత్రితో జేయబడు వ్యాపారమున బారీణమైనం గాని యన్యోన్యతాపద్ధతి సంపూర్ణత వహింపదు. కావుననేకదా సంఘ సంస్కారములుగోరు మహాత్ములు, ఈ పద్ధతియే సర్వదోషపరిహారిణియనియు సర్వసుఖప్రదాయినియనియు ఘోషించుచుండుట. ఇంక నే యార్ధిక పద్ధతియందును దీనియందుబలె క్లేశములకోర్చి పరోపకారబుద్ధితో బాటుపడువారు, అంత తఱుచుగ లేరు. అనేకుల కిదియే యొకమతము! యావజ్జీవము దీనిని వ్యాప్తికి దెచ్చుటలోగడపి యదియే మహానందమని యుండువారిసంఖ్య యనల్పము!

స్పర్ధను నిరోధింపజూచుట యననేమి?

ఒకవిధమున జూడబోయిన స్పర్ధను నిగ్రహించుట యప్రకృతమైన యత్నము. ఎట్లన, స్పర్ధను నిగ్రహించుటకు నా స్పర్ధతో స్పర్ధించుట యావశ్యకముగదా? అట్లగుట స్పర్ధ యేరీతిని నిర్మూలమగును? "స్పర్ధ నిత్యము. సర్వవికారముల నంతర్యామియైన తత్త్వము" అనుటయు సత్యమ. చూడుడు! ట్రస్టులనబడు మహాసంధులు స్పర్ధకు నాటంకము లంటిమి. అనగా దమ్ము నిరాకరించి ప్రవర్తిల్లజూచు వైరుల స్పర్ధకుననుట గూఢము. తమచేతనే ప్రయోగింపబడు స్పర్ధకు తాము అడ్డులు ఒడ్డులు కామి తెల్లంబు. ఈట్రస్టులకన్న నెక్కువ మాత్సర్యముతో బనిసేయు వ్యవహారములు న్నె? మఱియు హిందూదేశములోన నస్పర్ధ తంత్రములు వాలాయముగ నాచారములో నున్నవంటిమి. ఇవిమాత్రము స్పర్ధించుటలేదా? తత్పూర్వపుస్థితుల నంతమొందించనిది వీనికట్టి ప్రాశస్తము వచ్చి యుండదు. మఱి యీకాలమున వీనిపై వైరమెత్తివచ్చు నవనాగరక ప్రచారముల నిరాకరించి యెదిరించి నిలువనిది వానికి నింకను ఉనికి యుండదు. ఇంతేకాదు. ప్రాచీనాచార పద్ధతుల నంగీకరించువారి యందును వానియందు ద్రికరణశుద్ధిగ నమ్మువారికి గౌరవము నాయకత్వము సేకూర్పబడవేని యా యాచారములకు భంగము తప్పదు. అట్లగుట సంఘమున యజమాన్యపదవి నందుటకై స్పర్ధయున్న దనియు, నందు భక్తికొలది జయము కలుగుననియు నేర్పడియె, నిర్మాత్సర్యులమను మనవారును నెత్తనిపులులు. అనుసరించిన నాశీర్వాదము, లేనిచో బహిష్కారము ఇత్యాది యుపాయములు లేనివారుగారు.

కావున స్పర్ధ మొదలంట నశించునని ఆశించుట యుక్తంగాదు. ప్రాణములు వోయినగాని యది మనల వదలదు. ఏలన, అయ్యది యార్థిక తంత్రములలో నొక్కటిగాదు, మఱి సర్వతంత్రములయందును జీవరూపమై యిమిడియుండు మహాశక్తి.

ఏ యార్థికస్థితియందుగాని మూడు విధములైన స్పర్ధలు శాశ్వతములు

1. తనకుం బూర్వమైన స్థితిని స్థానభ్రష్టముం జేయుట.

2. తన్ను నాక్రమింపజూచు ఇతరస్థితుల నిరోధింప జూచుట.

3. తనకుంజేరిన పాత్రములలో దనభావమునకు నెంతయు సరిపోయినవారిని తదితరులకన్న నెక్కువ ఫలముల ప్రసాదించి యుద్ధరించుట. మనశరీరమునందును నీవీఠోద్యోగములు విరామములేక పఱుగుచున్నవి. ఎట్లందురో? కలరా, మహామారి, చలిజ్వరము వీనిని కలిగించు పురుగులు మనదేహములో జొరబడ వేచియున్నవి. వానికి జోటియ్యక దేహశక్తి యడ్డపడెడును. అనగా సాధ్యమైనంత దనుక. మఱి జ్వరము వచ్చెబో, దానిని రూపుమాప సహజముగ శరీరముద్యోగించును. ఇంకను అమితభోజనము, అమితినిద్ర ఇత్యాది నిజస్వభావ విరుద్ధక్రియలకు నేయంగములైనబూనిన వానికి మాంద్యం, నొప్పి, వాపు మొదలగు శిక్షల విధించును.

స్పర్ధ ప్రాణులకు సహజము. ఈస్థూలప్రపంచముయొక్క ప్రధానగుణంబులలో నొకటి.

కావున స్పర్ధను నిరోధించు పద్ధతులనగా, నిప్పుడు దాదాపు నూఱేండ్లుగా బశ్చిమసీమలలో వ్యాపించిన స్పర్ధను అనుటగాని, సర్వవిధములైన స్పర్ధలను అనుటకాదు. అన్యోన్య పద్ధతులంగూర్చి యోచింపుడు. ఇవి ప్రాచుర్యమునకు రావలయునన్న తదితర పద్ధతుల బడగొట్టవలయు. మఱియు నీ యన్యోన్యతా భావముగలవారికిని మేలు చేసినను తక్కిన వారిని చేరనియ్యక తఱుమజూచును. కాబట్టి పరమ శాంతి పీనుగులకుగాని ప్రాణులకు బట్టువడుట యస్వాభావికము. అంత చల్లదనము రావలయునన్న నూపిరి పోవలసినదే.

మాత్సర్యము నిరోధించుట యనగా నొకవిధమైన మాత్సర్యమును నొంకొకవిధమైన మాత్సర్యము నవలంబించుటచేత ననియర్థము. అట్లయిన నన్యోన్యతాది పద్ధతులు విదళింపజూచు నిప్పటి స్పర్ధయొక్క లక్షణము లెవ్వియనిన:-

1. ప్రతివాడును దనలాభముమాత్రమాశించి యితరులెల్ల రులతోను వైరంబుదాల్చి యుపక్రమించుట. 2. ప్రతి వ్యవహార చక్రములోనునుండు శాలలన్నియు 'నేముందు మేముంద' ని ద్వేషబుద్ధి నొండొంటి గడవబూని, యప్పుడప్పు డన్నియు బల్లములో బడుట.

అన్యోన్యతాపద్ధతియొక్క ముఖ్యగుణంబులన్ననో

1. ధనలాభమాత్ర మాశింపగూడదనుట. ధనమునకంటె క్షేమముమేలు.

2. వ్యవహారాదుల సంఘక్షేమపరమైన దృష్టితో నడపవలయు ననుట.

3. చిల్లర స్పర్ధలు తగవు. గొప్ప గొప్ప కూటములుగా నేర్పడుట యుక్తము.

కాబట్టి యార్థిక రంగమున నీ రెండువిధములైన స్పర్ధలు ప్రతిఘటించి యున్నవి. ఇక ట్రస్టులును నీ రెండింటిని మ్రింగి ఇంకొక విధమైన శక్తిచే (అనగా విశ్వరూపముదాల్చి యందఱిని భయకంపితులంజేసి) నేకచక్రముగ వ్యాపారప్రపంచము పాలింప బ్రయత్నించెడును. శిల్పులు నూరకుండునట్లు కానము. ఘనములైన కర్మకర సంఘముల సంఘటించి యజమానుల నోడించి తామే యవక్రముగ నన్నింటిని తల్లక్రిందుగ జేయుదమని వారును వున్నారు, కావున స్పర్ధలు నిరోధింప బడుచున్నవని సామాన్యముగ నందఱు పలుకునట్లు పలుకుటకన్నను, వివిధస్పర్ధ లొండొంటిందాకి పెనంగుచున్నవనుట యింకను నొప్పు.


భారత అర్థశాస్త్రము సర్వము సమాప్తము.