Jump to content

భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఐదవ ప్రకరణము

వాంఛలకును యత్నములకునునుండు సంబంధములు

వాంఛలా ప్రయత్నములా యాద్యములు?

ఈ ప్రశ్నకు సరియైన యుత్తరము దుర్లభము. ఇవిరెండు నొకదాని నొకటి యాని యుండుననుట యుక్తము. ఎట్లన, ఏప్రయాసయులేక యూరక మూలగూలబడియుండుట కెవనిచేతనుగాదు. ఇట్టి నిశ్చలతత్త్వము నిర్భరతత్త్వము. బాధనివారించుకొఱకు లేచి యించుక పరిశ్రమించితిమేని తద్ద్వారా పరిశ్రమాభిలాష హృదయముననాటును. కావున వాంఛలచే యత్నములును, యత్నములచే వాంఛలును ఉద్ధురములవుట సత్యము.

వాంఛాస్ఫూర్తియు కార్యోత్సాహమును పరస్పరాశ్రయములైనను మొత్తముమీద కార్యారంభమునందే యెక్కువ దృష్టి యుంచవలయును. ఊరక యాశల బెట్టుకొనుచు ఉద్యోగమనునది యావంతయులేక మనదేశములోని విద్యావిధు లున్నట్టులున్న ఫలమేమి? సాహసమునకు బ్రేరేపకములుగాని యడియాసలు గలిగి యుంట మగతనముగాదు. మఱి గొడ్డుదనము.

నిష్కర్మత్వము కాముకత్వమునకు నుద్రేక కారణము! ఈవింత యెట్లందురో వినుడు. సాహసవంతుడు సాధ్యములను మాత్రము కాంక్షించును. తన శక్తికిమించిన వానింగూర్చి యువ్విళ్ళూరుట నీచ బుద్ధియని విరమించును. ఏదేవుడైన దయ్యమైన తానే దయారసముమై మేలుచేయవచ్చిన "మీభిక్షాప్రసాదము నాకువలదు. అర్హతకొలది లభించిన జాలును. మీప్రభావము మీదాసుల నెత్తిపై వేయుడు" అని యభిమానమున నెదురాడి కష్టమునకుం దగిన ఫలమబ్బిన నదియే శ్రీ వైకుంఠమని ధృతిమై దాల్మిదాల్చును. ఒక్కపనియు జేయజాలక నిరర్థకులుగ నుండువారే "సర్వార్థసిద్ధులు ఏదేవుడైనవచ్చి వర్షించిపోవునా" యని గ్రుక్కిళ్ళు మ్రింగుచు నుండువారు. వీరియాశలకు ఎల్ల లేర్పఱుప బ్రహ్మవిష్ణువుల వలన గాదు. ప్రళయకాలరుద్రు డొకవేళ దలద్రుంచి పర్యాప్తి గలిగింప జాలునేమో! కష్టించినవానికి గూలినిచ్చి సమ్మద మొనగూర్పనగు గాని బిచ్చగానికి సంతుష్టియొనర్ప గుబేరునిచేనైనగాదు. దండుగ పోతులట్లు ఇతరులకు బనిచెప్పువా రెవరైనగలరా? వీరభటులు వీరులుమెచ్చునట్లు రణరంగమున బోరనేర్తురుగాని, యింటిలో గూర్చుండి యొరులతో ధైర్యముగ మాటాడజాలని వారైనను వార్తాపత్రికలలో "వానికి ధైర్యముచాలదు, వీనికి ధైర్యముచాలదు" అని లేఖనులతో శౌర్యము జూపించుచు గాలక్షేపముసేయు పిఱికి పందల మెప్పింప జాలుదురా! కావున నకర్మక మహాత్ముల గాలియైన సోకిన సర్వము నెండిపోవును. కర్మశూరుల సహవాసమే నిశ్శ్రేయసమునకు హేతువు.

రాశి - మమత - తృప్తి

వస్తువులరాశి యధికమైన వానియందలి మమత యధాక్రమంబుగ బెరుగక విలోమవృద్ధిని మాత్రము గాంచును. బండము సమగతిమై విస్తరించిన దనుకొందము. వెన్వెంట మమతయు విస్తరించును గాని యంతవేగముగగాక మందగతిమై వ్యాపించును. అనగా మమత హీనవృద్ధికి విధేయమైనదని భావము[1]

పైపటమున రాశిపరిమాణము 1, 2, 3, 4, 5 అంకములు గల రేఖాభాగములచేతను మమతయొక్క యుద్రేకము అనగా వాంఛ అ, ఆ, ఇ, ఈ మున్నగు నూర్థ్వరేఖలచేతను మమతయొక్క పరిమాణము క, గ, చ, జ, ట యనంబరగు రేఖావృత రూపములచేతను దృప్తి డ, త, ద, ప, బ యను రేఖావృత రూపములచేతను సూచితములు.

రాశి యొకవంతుగానున్న మమతయొక్క యుద్రేకము తీక్ష్ణముగానుండును; ఆ వంతువలన గలుగు తృప్తియు నధికముగనే యుండు (డ). ప్రారంభదశ యగుటంజేసి మమత పరిమాణము మాత్రముకొలది (క). రాశి ద్విగుణమైన మమతయొక్క ఉద్రేకము తగ్గును (ఆ). తృప్తియు క్షీణదశయందెయుండు (త). మమత పరిమాణము మాత్రము వృద్ధియగును (గ). అయిన నీవృద్ధి రెండితలు గాక కొంత కొఱవడును. అనగా మమత పరిమాణము హీనవృద్ధికి విధేయమైనదని భావము. ఇప్పగిదిని రాశిమానము హెచ్చుకొలది మమతయొక్క యుద్రేకంబును, దృప్తిపరిమాణంబును తగ్గుచు వచ్చెడిని. మమత పరిమాణము మాత్రము వృద్ధియగు చుండు. మమత యొక్క యుద్రేకంబును, తన్మూలంబుననగు తృప్తియు, మమత పరిమాణంబును పరస్పరాలంబనంబులు గావునను మమత పరిమాణము హీనవృద్ధికి విధేయంబగుటచేతను ఈవృద్ధి అనంతంబుగాదు. ఉద్రేకము పూర్తిగతగ్గి తృప్తికి ఆకరము స్వల్పమగునప్పటికి అనగా నీపటమునందు అయిదవ రాశిమానము చేరునప్పటికి మమత పరిమాణము స్థాయియగును. ఏలయన రాశి ఇంకను ఎక్కుడయ్యెనేని ఉద్రేకము లేమింజేసి బాధ ప్రారంభమై రానురాను అసహ్యంబగు. కావున మానవుడు తనకలవాటుపడిన రాశిమానముల నయిదింటిని కాపాడుకొని తన్మూలముననగు సుఖంబునే అనుభవింపందలంచుగాని రాశి నెక్కుడుచేసికొని కష్టము దెచ్చిపెట్టుకొనం జూడుడు. మమత పరిమాణము స్థాయిగ నుండుననుటకు గృహస్థాశ్రమంబ దృష్టాంతంబు. దాని ప్రశంస ముందుగలదు.

పైజెప్పిన విషయములబట్టి ప్రతివస్తువును అమితముగ సేకరింపబడిన బాధావహంబగుననుట సువ్యక్తము. ఇట్లగుట మన కెంతయుమేలు, ఎట్లన, వివిధ వస్తుపరాయణచిత్తులమై విచిత్రభంగుల సంచరించుటకీ న్యాయ మాధారభూతము. లేకున్న నేకార్థసంధాయకులమై జన్మమెల్ల గడుపువారమై యుందుము. ఏకార్థభావమునకన్న ననర్థము అభావ్యము.

ఉద్రేకముయొక్క యుడుకు తగ్గినను నద్దాని మొత్తపు పరిమాణము తగ్గినదని భావింపరాదు. ఇది గూఢార్థముగాన తేటవడ జేయుటకై యొకనిదర్శనము సూపెద. పెద్దబానలో నీళ్ళుపోసి పది పిడకల నిప్పువేసినను నీరు వెచ్చగామాత్ర ముండును. చిన్నచెంబులో నీరుపోసి రెండుపిడకల గాల్చితిమేనియు వ్రేలువెట్టిన చుఱుక్కనునంత వేడిమి యానీళ్ళంజెందును. మొదటిదానిలో నుష్ణముయొక్కరాశి యెక్కువ. ఎట్లన పదిపిడకల యగ్నియందు లయమైయుండుగాన. తీక్ష్ణత తక్కువ, ఎట్లు? వెచ్చనీరుగావున. రెండవదానిలో రెండు పిడకల యగ్గియేకాన నుష్ణరాశి కొంచియము. రాశి కొంచెమైనను దైక్ష్ణ్యమధికము. ఎట్లన పతివ్రతవలె నంటరానిదగుట.

ఆ రీతినే మమతయొక్క యుద్రేకము లాఘవముచెందినను దానిమొత్తము గురుపరంబగుచు వచ్చుననుట నిర్థారితము.

ప్రాప్తికి ననురాగమునకునుగల మైత్రిని వెల్లడిసేయ ననుభవ గోచరములైన (ఇవి నాస్వానుభవ గోచరములు గావు) దృష్టాంతముల రెండు నుడివెదను.

బుద్ధిదెలిసినపిమ్మట వివాహమాడు నాచారముగల రాజ్యములలోను, శృంగారకావ్యములలోను నాయకా నాయకు లన్యోన్య సమాగమంబుగోరి "మన:ప్రభ వానల బాధ్యమానులై" యుందురుగదా! ఇది తొల్తటి వేడిమి. ఏవిఘ్నములునులేక పెండిలియయ్యె ననుకొనుడు. సేసబ్రాలుపడుసరికే 'ఇంకేమి చేతజిక్కెగదా' యను నిర్భయముచే గొందఱికి పొంగుఆర నారంభించుటయు గల దట! ఏది యెట్లున్నను దొలినెలలోనుండునంత తహతహ పిమ్మట సాధారణముగ బ్రతిమాలుకొన్నను హృదయగమ్యముగాదు. ప్రారంభమున 'తలచుకొన్న దాళలేనురా' యని రేయింబవలు జావళ్లు జపించువారు సైతము ఆరునెలలు నిండులోన చల్లబడి యుపేక్ష సేయుదురు. నాలుగైదు సంవత్సరము లైనయెడల 'త్యజసంసార మసార' మ్మని వైరాగ్యపు స్తోత్రపాఠముల కారంభింతురు.

మోహముయొక్క తాప ముపశమించినను మోహము నిర్మూలమాయెనని లోకజ్ఞులెవరు దలంపరు. ప్రాయశ: మన ప్రబంధ కవులట్లెంతురేమో! వారికి నిఘంటువులలోగల పరిచయము లోకమున లేదుగావున వారిమాట మనకేల? ఆదిని నిర్భరత దీప్తిమంతమైన వలపు కాలక్రమముగ మేదురంబైన స్నేహభావమై పరిణమిల్లుననుట మనకవులకుదప్ప దక్కిన యెల్లవారికిని సువ్యక్తమైనస్థితి. నిజము చూడబోయిన కామోద్రేకమునకన్న నియ్యది బాలాఢ్యము. స్థిరతరమును. అనురాగముయొక్క వేడిమి యుపశమించినను పరస్పర బాంధవము విస్ఫారమగుననుటకు సందియమేల? అనురాగపురాశి మొత్తముమీద నెక్కువయగుననుటకు దార్కాణము వలయునా? చూడుడు. పెండ్లియైన క్రొత్తలో భార్య చనిపోయెనేని పురుషుడు గోడు గోడున నేడ్చును. నెత్తి మోదుకొనుచు "అయ్యో! పాపము! పసిప్రాయము ఏమిసుఖముల గాంచెను?" అని యాయక విషయమై పశ్చాత్తాపముతో తనకు వియోగము ప్రాప్తించెగదా యను తాపంబుతోను శోకానల దందహ్యమాన మానసుండైనను స్నేహబంధము లల్పము లౌటచే కొలదికాలమునకే యంతయు మఱచి ద్వితీయ వివాహోన్ముఖుండగును. మఱియు ప్రాచీనాచార పరాయణుడైనచో దివసవారములైన దీఱకమునుపే "యీ తిధికి బంధువులందఱు వత్తురు. ఇదే మంచిసమయ" మని దేనిపైననో యొక యెనిమిదేడుల పిల్లపై గన్నువేసి రెండవపెండ్లికి త్వరలో ముహూర్తము నిశ్చయించుమని మధ్యవర్తుల కాళ్ళు గట్టిగా బట్టుకొని యెట్లోయొకరీతి వివాహము జేసికొనును. అనురాగరాశి యంత సాంద్రము గాదనుట యిందుచే విశదము.

పదిపండ్రెండేండ్లు సంసారము చేసినపిమ్మట భార్య గతించిన యెడల నెట్టిక్రూరాత్ముడైననుసరే దిక్కులు దెలియనివా డవును. వెక్కివెక్కి యేడ్వకున్ననేమి? మనస్సులోనె రగిలి కుమిలి యూరక యుండు శోకముకన్న దుస్సహతరమొండుగలదా? "అయ్యో! యెంతమంచిది! ఈయింట లక్ష్మీదేవిగ నుండెను. అందఱిని అరసి పోషించుచుండెనే! ఇక బిడ్డలగతియేమి, నాగతియేమి?" యనుచు నొకరూపము మాత్రముగాక గుణగణమ్ములను దలచి తాపము పశ్చాత్తాపమును రెండును దన్నెచెంద పరిపరివిధముల బ్రలాపించుట జూచివున్నాముగదా! అనురాగము ప్రగాఢమాయెననుట కిదియేసాక్షి.

ఆద్యనురాగము తీక్ష్ణతమము. ప్రాప్తిదట్టముగ నయినచో జల్లార జల్లార నింక విసుగుగా మాఱునేమో యనుస్థితి సమకూరును. అది అంత్యానురాగము. శమమునకు సమానము. వస్తువుయొక్క పరిమాణము ననుసరించి వాంఛయొక్క తీవ్రతయుండును. వస్తురాశితోన హీనవృద్ధి న్యాయానుగతమై యతిశయిల్లుచు నారాశియందుండు ప్రీతి సమష్ట్యనురాగము. ఈ సమష్ట్యనురాగము తలపుకొలది లభియించు గాలి మొదలగు వస్తువులయందంతట నుండునదియైనను ప్రాతభార్యయందలి కూరిమి యట్లు సాధారణముగ స్ఫురణమునకు రాదు. ఎప్పుడు వచ్చుననగా నావస్తువు అరుదైన. వస్తువు లేనియప్పుడెంతమనము తపింతుమో యా తాపమే యా వస్తువుయొక్క ఆద్యుపయుక్తతా పరిమాణము.

వాంఛలెట్లో యట్లే ప్రయోజనమును నని గ్రహించునది. ఇదియు నాద్యంత్యపూర్ణంబులని ముత్తెఱంగు.

హీనవృద్ధి న్యాయంబు వాంఛలయందు నుపగతంబ యనుటకు నమోఘ ప్రమాణంబొండుగలదు. అయ్యది మానస శాస్త్రమునకుం జేరినదైనను ఈ తత్త్వంబునకునెల్ల దీపమువంటిదగుట మీముందఱ నివేదింపదగినది.

భావములకెల్ల దీక్ష్ణతయను గుణంబొండు గలదుగదా! కోపము, గర్వము, కామము, మొదలగునవెల్ల హెచ్చుతగ్గులుగలిగి వర్తిల్లుననుట సుప్రసిద్ధము. ఉదా. కోపము ప్రారంభించి యల్పముగ నున్నను మొగముజేవురించును. కన్నులెఱ్ఱవారును, ఉఱిమిచూతుము. ఇంకను నెక్కిన బెదవు లదరసాగును. మఱియు నుద్ధురమాయెనేని శరీరమంతయు నదరును. మాట లనాయాసమునరావు. పండ్లు కొఱుకుదుము. వెండియు గోపముచ్ఛ్రిత మయ్యెనో కొందఱు నోరనురుగులు గ్రమ్మ నిశ్చేష్టితులై క్రిందబడుదురు! ప్రతి మానుష భావము నీరీతి వివిధ ప్రకాశములతో వెలుగును. వీనినే నిమ్నోన్నత దశలందురు.

కోపతాపములెట్లో యింద్రియ జ్ఞానమునట్లే. ఇంద్రియములనగా త్వక్చక్షురాది విజ్ఞానేంద్రియములు. శాస్త్రజ్ఞు లింద్రియముల యొక్క గ్రహణశక్తిని జక్కగా బరిశీలించియున్నారు. ఈ పరిశోధనలో నొక ధర్మ మన్నిటికిని సామాన్యమని స్ఫుటమైనది. అది యేదనగా:-

ఒక్క దీపము వెట్టిన నొకింత వెలుతురు దోచును. ఈవెలుతురును ద్విగుణముగ జేయవలయునన్న రెండు దీపములు చాలవు. రెంటికన్న నెక్కువ గావలసివచ్చును. అదెందులకని యడుగుట యసంగత ప్రశ్న. ప్రతి మనుష్యుని యనుభవమున నివి యిట్లుండును గాన నివెల్ల స్వాభావిక లక్షణములు. సత్తులు మనచే నిర్మింపబడినవి కావు. మనమొప్పకున్న విడిచి వెళ్ళునవిగావు. కావున నీచింత విడిచి మఱికొన్ని యుదాహరణముల జూపెదను. కన్నులెట్లో చెవులునట్లే. తంతిని మీటుడు. శబ్దము స్ఫురించును. తంతిని రెండింతలు బలముగా మీటుడు. ధ్వనియొక్క స్ఫురణ హెచ్చునుగాని రెండింతలు హెచ్చదు. జిహ్వయునట్లే. ఒక్క మిరెపకాయ వేసిన నెంతకారము దోచునో యంతకు రెండింతలు కారము గావలయునన్న రెండింతలు కన్న నెక్కువ మిరెపకాయలు పట్టును. అనగా సుమారు మూడు నాల్గు కాయలు, త్వక్కునునట్లే. ఒకపుల్లతో గొంచెముగ నొకని చేయి నదిమితిమేని వానికి చివచివగానుండును. రెండింతలు బలముగా నదిమిన చివచివ రెండింతలు చొరవ దాల్చదు. బహుశ: ఒకటిన్నర యింతలే. శీతము, ఉష్ణము, రంగులపసందు మొదలైన యింద్రియ గోచరములన్నియు నిట్లే. వేడిమి, మిరపకాయ, దీపము ఇత్యాదులు ప్రేరేపకములు. అవి కారణములుగ మనసునపుట్టు స్ఫురణభావము. భావప్రేరేపకములకుండు సామ్యము మమతకు రాశికిగల సామ్యము బోలినది. పటము చూడుడు!

ఈ సామ్యము తుదవఱకును సరిపోవును. ఎట్లన వెలుతురు మిరెపకాయ ఇత్యాది ప్రేరేపకముల నమితములంజేసిన యా యింద్రియములకు నొప్పి కలుగుననుట మూఢులకైనను దెలిసిన సంగతి. ఒక్కతూరి బాధ ప్రారంభించిన నుద్దీపకకారణము లెంతమట్టునకు వ్యాపించునో యంతవఱకు యథాక్రమముగనేకాక యధిక క్రమముగను బాధ వ్యాపించును. ఇవి యన్నియుం బ్రత్యక్ష సిద్ధములగు సిద్ధాంతములు.

సుఖభావములు హీనవృద్ధి జెందునవి. అది సుఖమునకన్న నంత్యసుఖము హ్రస్వము. భావస్ఫురణ మవరోహించుచు వచ్చినను నుత్తేజకములు పరిమితికి మీఱకున్నంత వఱకును మొత్తపు సుఖమారోహించును. కారణముతో సరిసరిగా నెదుగకున్నను దప్పక యెదుగును. అమితరాశిగా ప్రేరేపకమున్న భావముయొక్క స్వభావమే మాఱును. సుఖముపోయి దు:ఖమాదేశమగును.

చూచితిరా! వృద్ధినివహము గంగానదియుంబోలె మూడు త్రోవల బోవునదియు ముల్లోకముల వ్యాపించునదియునై యున్నది. భూమిని, యంత్రాది కళలయందును మాత్రమేకాదు. మనుజుల యాత్మలందును వాని కనివార్యసంచారము గలదు. వస్తువులు రాశికొలది సరిసమమైన తృప్తినియ్యమికి నిప్పుడు సూపిన యాత్మతత్త్వమే ప్రధానకారణము.

ఇంతదూరము చెప్పితిమిగాన నీతత్త్వముయొక్క జనన వృత్తాంతమునుంజెప్పి మీచింతవాపుట విధిగాబోలు. వ్యాఖ్యానమును సులభవేద్యమే. నిదురనుండి లేచినతోడన కన్నులువిప్పి చిన్న దీపము జూడబోయినను మిఱుమిట్లు కలుగును. కారణమేమి? దృష్టి నరములు విశ్రాంతి జెందినవిగాన రెండునాళ్ళు పనిసేయకయున్న గుఱ్ఱముబలె మిగుల జుఱుకుగా నుండును. అప్పుడు కొంచెముజ్యోతి సోకినను ఆ నరములు విశేషముగ జలించును. వెలుతురునకు వాడుకపడుకొలది నవి యలసట నొందుటయేకాక కాయగాచినట్లు గడుసు వాఱును. అప్పుడు మునుపటివలె నంటియునంటని వెలుతురు దెబ్బ దవిలిన జాలదు. ప్రేరేపకముయొక్క తీవ్రతను అధికగతిని దీపింపజేసినంగాని ప్రకాశంబు స్ఫురితంబుగాదు. ఈ చర్చ యింత మాత్రము చాలును. ఆమూలాగ్రముగ నెఱుగంగోరిన మనశాస్త్రమును బఠింపుడు!

వస్తు సంపాదనము తృప్తికి ప్రేరేపకము తృప్తిభావము. కావున తృప్తి యార్జితరాసులతో సమానవిన్యాసము వడయనేరదు.

  1. హీనవృద్ధి లక్షణము 10 వ ప్రకరణమున దెలుపబడియున్నది. ఈ సందర్బమున దానిం జదువుటయు మంచిది.