భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - నాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాల్గవ ప్రకరణము

మూల్యలక్షణము

సార్థవస్తువులలోని గుణములు రెండు. 1. నేరుగగొదవలందీర్చి తృప్తి యొనర్చుట. దీనికే ప్రయోజనము, ఉపయోగము ఇత్యాదులు నామములు. 2. మఱి ఇతరులయొద్దనుండు వస్తువులగొనుట కనుకూలించుట. దీనికే మూల్యము అని పేరు. అమూల్యములైన పదార్థంబు లనగా విలువకు మీఱినవని యర్థము. అనగా వానిని నిలుచుటకు దగిన యితర పదార్థములు లేవనుట. మూల్యమునకు బర్యాయపదంబు విలువ.

విలువకును వెలకునుగల సామ్యము

విలువకును వెలకును భేదంబు గలదు. ప్రతిదేశములోను సర్కారువారి యధికారముచే నప్పులుదీర్చుట మొదలగు నొడంబడికల నెరవేర్చుటకై యుపకరణములుగ నిర్ణయింపబడిన నాణెములున్నవిగదా ! అట్టి నాణెములచే బదార్థములలోనుండు మూల్య పరిమాణమును నిర్ణయించుట వెలయనబడును. దీనికే ధర, క్రయము, ఖరీదు మొదలగు నామాంతరములు. మూల్యమును వెలయును భిన్నములనుటకు నిదర్శన మేమన్నను :- ఒక కాపువాడు తన యావును సంతకుంగొనిపోయి యమ్మి యెద్దును గొనిరావలయునని సంకల్పించికొన్నవాడను కొందము. ఈ కార్యము రెండువిధముల నెరవేర్చికొననగును. ఆవును విక్రయించి రూపాయలగొని యారూపాయిల నెద్దును గొనుటలో నుపయోగించుట యొకటి, అట్లుగాక యెద్దునకు మాఱావును గొనదలచిన వాడెవడైన జిక్కెనేని రూప్యంబుల సహాయ్యములేకయ వీరు దమ తమ వస్తువుల మార్చుకొని సిద్ధార్ధులై గృహమునకు బోవచ్చును. కావున ద్రవ్యమూలముగగాక నేరుగ వస్తువుల మార్చుకొనుట రెండవది. ఎట్లైననుసరే మూల్యములేనిది పరివర్తనము జరుగదు. అనగా తనవస్తువును బదులిచ్చి తనకెందునకు నుపయోగమునకురాని వస్తువుగొన నెవడునుకోరడు. కావున వినిమయమునకు (మార్చుకొనుటకు) విలువ యధారభూతమనుట స్ఫుటము. ధర యంత ముఖ్యముగాదు. నాగరికత లేనిదేశములో నేటికిని నాణెములులేవు. మనదేశములోను నడవిమనుష్యులు రూపాయిల మాధ్యస్థ్యములేని పరివర్తనము జరుపు కొనుచున్నారేకాని నాణెము లనగానేమో యెఱుగరు. వారు బజారునకు తేనె, మైనము మున్నగునవితెచ్చి నేయి, నూనె, ఉప్పు, మిరపకాయలు ఇత్యాదులకై బదులిచ్చి మార్చుకొని యడవులకు బోవుట యందఱెఱిగిన విషయమేకదా ! కావున మూల్యమునకును క్రయవిక్రయముల నెక్కువ సరళముగ జరుపుకొనుటకు సాధనములగు నాణెములద్వారా నిర్ణయింపబడిన మూల్యపరిమాణమగు ధరకును, మిగుల వ్యత్యాసము గలదనుట స్పష్టము.

ఇవిరెండు నిట్లు భిన్నములైనను నొండొంటితో సంబంధించినవే కాని సంబంధము లేనివిగావు. మూల్య మధికమగుకొలది వెల హెచ్చుటయు, తక్కువ యగుకొలది తఱుగుటయు ననుభవ వేద్యములేకదా !

మూల్యము ఏకవస్తు గర్బితముగాదు

ఉపయుక్తత సర్వార్థములకును సాధారణమైన ధర్మంబు. అర్థముల నొండొంటితోబోల్చి యభిలాషకొలది నొండొంటితో గొలుచుటచేత మూల్య మింతయున్నదని యేర్పడును. లోకమున నొకేవస్తువు మాత్రముండినచో నది యెంత ప్రయోజనకారియైనను నద్దానియొక్క తారతమ్య నిర్ధారణకు బరపదార్థంబు లేమింజేసి దానికి మూల్యము సున్న. మూల్యమనగా 'ఇంతమాత్రము నాకు ప్రియము' అను నిర్ధారణ 'ఇంతమాత్రము' అను నిర్ణయము ఇంకొకవస్తువుతో బోల్చి తులదూచినంగాని తేలదు. ఈ 'యింత' నే ఇతర వస్తువులచేగాక రాజస్ర్థాపిత రూప్యములతో గొలిచిన వెలలు సిద్ధించును. కావున విలువ నిశ్చయింపవలయునన్నను, వెల నిశ్చయింపవలయునన్నను, ఈ క్రియ తారతమ్య నిరూపణము నాశ్రయించి యుండునదగాన, ననేకవస్తువులుండినంగాని సాధ్యంబుగాదు.

ప్రయోజన తత్త్వనిర్ణయమున కేకవస్తువైనం జాలును. ఎట్లన, దానియుద్దేశము మనుష్యస్వభావములకు (అనగా వాంఛలకు) దద్భావసంతుష్టి కరములగు పదార్థములకునుండు బాంధవ్యము ప్రకటించుట కాబట్టి లోకమున ననితరమైన వస్తువొకటిమాత్రమున్నను, దానిచే మనకుగలుగుతృప్తి 'వాంఛ లనంతములుగావు' అను న్యాయమును వివరించునప్పుడు ఉదాహృతమైనరీతి ననుసరించుననుటను వ్యక్తపఱుచుట సులభము. వస్తువుయొక్క రాశి యల్పమైన దాని యందలి యాదరణ మధికముగ నుండుననియు, ననుభవింప ననుభవింప నూతనముగ వినియోగమునకు వచ్చుభాగములవలని సుఖము హ్రస్వమగుచు వచ్చుననియు, నిత్యాది ప్రయోజనస్థితింగూర్చిన న్యాయములన్నియు నాయేకవస్తువునే యాధారముగగొని నిరూపింపవచ్చును. ప్రయోజనమునకును, మూల్యమునకును నిదియొకభేదము, అద్వితీయములకు నుపయుక్తత యుండబోలుగాని విలువ యసంభవము.

మూల్యము - ప్రయోజనము - రాశి వీనియందలి యన్యోన్య క్రమములు

సార్థవస్తువులలో ప్రయోజనము, మూల్యము ననుగుణద్వయ మున్నదంటిమి. ఈ గుణములకుంగల పరస్పరతయొక్క వివరమెట్లు ?

సామాన్యముగా జూడ బోయిన :-

1. ప్రయోజన మెక్కువయైన మూల్యము నాధిక్యముం బొరయును. ఉదా. బంగారునందు జనులకు ననురాగము మిక్కుటము. ఇనుమునం దంతగాఢముగాదు. కావున నినుమునకన్న బంగారము విలువయందు మిన్న. కొనుటలో నెక్కువమొత్తము నిత్తుము. అమ్ముటలో నెక్కువ పుచ్చుకొందుము. 2. ప్రయోజనము రాశిననుసరించి యుండును. అనగా నంత్య భాగముయొక్క ప్రయోజన మనుట. లోకమున నినుము రీతిని బంగారము సర్వసాధారణముగాదు. అనగా రాశి లఘువు కావున ముఖ్యత గురువు. ఇక వినుమన్ననో దీని కెల్లభంగుల విరుద్ధము. రాశి ఘనము. ప్రాధాన్యము చుల్కన.

3. అయిన నొక సంశయము. ఏమి ? నిజము చూడబోయిన నినుమునకన్న బంగారము ప్రయోజనకారియా ? కాదు. లోకమున బంగారము మాయమైన జీవితము కష్టముగాదు. కాని యినుము లేకున్న బ్రదుకు పాడగును. కాబట్టి బంగారమునకన్న నినుము శ్రేష్ఠము. అట్లయిన మూల్యమునందును నేల ప్రౌఢతరముగాదు ? ప్రయోజనముంబట్టి మూల్యముండుట నిజమేని ఇనుమునకన్న బంగారునకు వెల తక్కువ యుండవలదా ? ఇంతేకాదు. గాలికిలేని ప్రయోజన మేసామగ్రికి గలదు ? అయినను గాలియొక్క మూల్యము సున్న. కొనువారులేరు. సంతలకని సంచుల నింపువారులేరు ఇందు ప్రయోజనముండియు విలువ వెలయదయ్యె.

ఈ విశేషముల కేమిసమాధానము ! వినుండు :-

ప్రయోజన మనునది సందిగ్థపదము. దానికర్థము లనేకములు. ఎవ్వియన రాశికిని వాంఛకును గలసామ్యము నీ పటము సూచించెడు జూడుడు.

రాశి యెక్కువయగుకొలది నూతన (లేక. అంత్య) భాగములచే నబ్బు సుఖము క్రమముగ దక్కువ వడియెడు కావున రాశి తఱుచగుడు నద్దాని యంత్యభాగమువలని గుణము కుఱుచవడును.

రాశి యత్యల్పమైనపుడు గలుగు మహోద్దండ సుఖము ఆద్యుపయుక్తి.

రాశింబట్టి, యా రాశిలోన నంత్యభాగమై, తత్పూర్వభాగములకన్న దక్కువయగు సుఖము నిచ్చునదియైన దానివలని ప్రయోజనము అంత్యోపయుక్తి.

ప్రతిభాగముయొక్కయు సుఖమును జమచేర్చుటచే, వస్తువుయొక్క రాశి సమస్తముచే నీబడిన సుఖ మేర్పడియెడు. దీనిపేరు సమాసోపయుక్తి.

మూల్యము ప్రయోజనముచే నిశ్చితమనగా నంత్యప్రయోజనముచే ననిమాత్రమర్థము. గాలి యమితరాశిగాన నంత్య ప్రయోజనము దానికిలేదు. సమష్టిప్రయోజనమున్నది. కావుననే దానియందు మనకెంతయో గౌరవ ముండుట. ఈ గారవము డబ్బునిచ్చి పుచ్చు కొందమను బుద్ధిని గలుగజేయునదికామి యెల్లరకు దెల్లంబ.

పూర్ణోపయుక్తి యున్నంజాలదు. అర్థపదవి నందుటకు నంత్యోపయుక్తి ప్రధానము. ఈ సిద్ధాంతము నింకను విపులముగ వ్రాసి ప్రస్ఫుటం బొనరించెదము.

మూల్యవిషయమైన విస్తారవ్యాఖ్యానము

ఫలసిద్ధినొసంగి కాంక్షలబూరించు గుణంబు ప్రయోజనము నాబడు. కాంక్షితవస్తుసిద్ధియే ఫలసిద్ధి. ఈప్సితరాశి యధికమౌకొలది వాంఛయొక్క తీవ్రతముం దఱుగుచు వచ్చును కోరికకొలది గడింపబడినచో నాశనిండి యంతమొందును. ఆశ యరటి చెట్టువంటిది. ఫలమునకు గారణభూతమయ్యు ఫలాభివృద్ధితోడ క్షయముం దాల్చును. దీనిని నీటిసామ్యముచే మున్నే సూచించితిమి. సూచన లతో విరమించిన జాలదు. కాన నింకను విచార్యము. మరల నీపటమున గమనింపుడు.

త్రాగను ద్రాగను సుఖము - అనగా ప్రయోజనము కొఱత వడుటయు, కొంతవడికి బ్రయోజనము పూర్ణమై యదృశ్యమగుటయు, మఱియు బలాత్కారముగ నాస్వాదింపబూనిన కష్ట మావిర్భవించి రాశితోడ గ్రమగతి విజృంభించుటయు నిచట స్పష్టములు. అది యట్లుండె. ప్రకృతము ప్రయోజన నూన్యతమాత్రము యోచింపుడు.

తిలిగ్రుక్కచే గలిగిన ప్రయోజనమునకు ఆదిప్రయోజనము, ఆద్యుపయుక్తి ఇత్యాదులు నామములు.

ఏదైనరాశియందు అంత్యభాగముచే గలిగిన యుపయోగమునకు అంత్యప్రయోజనాదులు పేళ్ళు.

ఇక నంతరాశిని గడించినందుననో యనుభవించినందుననో కలుగు మొత్తపు సుఖము సమాసోపయుక్తినాబడు

పైపటములో అ = ఆద్యుపయుక్తి, ఆ = 5 గ్రుక్కలప్పటి యంత్యోపయుక్తి 1, 5, అ, ఆ లచే జుట్టబడిన న్యాసము సమాసోపయుక్తి. ఒకవేళ మూడు గ్రుక్కలకే చేతనున్న చెంబు నెవరైన లాగికొనిరేని అప్పటి యంత్యోపయుక్తి. ఇ. అట్లే వివిధరాసులకు నవి యెఱుంగునది. ప్రకృతము చర్చింపదగినప్రశ్న:- అయిదుగ్రుక్కలు నిండా రెబో, ఐదవగ్రుక్కయొక్క ప్రయోజనము 'ఆ' అనగా ఐదుగ్రుక్కలు గలిగిన రాశియొక్క యంత్యప్రయోజన మనుట. ఇది కడపటి గ్రుక్కయొక్క లాభముందెల్పునా ? మఱి తత్పూర్వపు గ్రుక్కలయు నుపయుక్తతం దెలుపునా ?

ఈ సందియమేల కలుగవలె నందురో చూడుడు. నీళ్ళను అమ్ముట కొకడు పీపాయి పూరించి తెచ్చినాడనుకొందము. ఆనీళ్ళను మన నిదర్శనములోని నాలుకయెండినవాడు వెలకు గొనువాడైన నమ్మువాడు తొలిగ్రుక్కకొకవెల, మఱుదానికి నింతవెల, అని యిట్లు క్రమముగ కృష్ణపక్షక్రయముల విధించబోవునా ? పోడు. కారణమేమి ? ఒకగ్రుక్కకుమించిన రాశిలేకుండిన నతడొక్క రూపాయనైన నొసగి దానింబొంద నుద్యుక్తుండగును. ఏల ? దాహ తాపము నిర్భరముకావున. ఒక్కపీపాయి నీరున్నదిగావున నిపుడట్టి క్షామకాలపు ధరల నాతడేలయిచ్చును ? ఇయ్యడు. చెంబునకు నరణాయిమ్మన్నను బేరమునకు సన్నద్ధుడైన గావచ్చును. ఇట్లు నీరములు తక్కువవెలకు లభించునను దానివలని ప్రయోజనముయొక్క గతులు మాఱునా ? ఏలమాఱవలె ? రూపాయనిచ్చిననేమి ? అరణా యిచ్చిననేమి ? తొలిగ్రుక్కచేగలుగు సుఖము పిపాసా తీవ్రతంబట్టి యుండు గావున నది క్రయములమేరకు భిన్నవృత్తి దాల్పజాలదు. అట్లే తదితరములైన గ్రుక్కలయు సుఖము ధరల ననుగమించి యుండదు. ధరలును (క్రిందజూపబోవు విధమునదప్ప) సుఖముల క్షయవృద్ధుల ననుగమింపవు.

చూడుడు. వెలల విషయములోని విపరీతము ! రాశి కొలది వెలలును మాఱును. కొంచెమేపండిన వెల లెక్కుటయు, పంటలు సమృద్ధములైన వెలలు వ్రాలుటయు దెలిసిన సంగతులే. దీనిని ఫటము వ్రాసిచూపిన బాగుగదా !

ఒకింతపండిన కాలమునకన్న నెక్కువయింతల కాలములో వెలలు తక్కువయననేమి ? నూతనముగ బండిన భాగమునకుమాత్రము తగ్గుననియా ? కాదు. ఇంకెట్లు ?

100 పుట్లనాడు పుట్టికి వెల 10 రూపాయ లుండునను కొందము. 500 పుట్లనాడు పుట్టికి వెల 8 రూపాయలుండును. ఇపుడు తొలి 100 పుట్లకును 8 రూపాయలే కాని వెల యెక్కువ యుండబోదు. అనగా విలువ, వెల వీనివిషయములో నొకభాగమునకు నేపరిమాణము ఖరీదు సమకూరునో తదితర భాగములకు నదేపరిమాణము సమకూరుగాని, వివిధరీతుల పరిమాణము అనగా రాశిలోని భాగములకు నుండవు. కావుననే రాశియొక్క మొత్తపువెల సూచించునపుడు, తక్కువవెలగల భాగముయొక్క వెలయే తక్కిన వానియు వెలయనియు, ఈ ఖరీదును భాగముయొక్క సంఖ్యతో గుణించిన మొత్తపువెల ఘటిల్లుననియు శాస్త్రసిద్ధాంతము.

3. ఇంతలవేళలో మొత్తపుఖరీదు 1, 3. అ, ఆ. లచే నావృతమైన మండలము. అనగా భాగములు మూడింటికి ప్రతియొక్కటికి వెల 6, అట్లే. 5 ఇంతలవేళలో ప్రతిభాగమునకు వెల 2. మొత్తపు విలువ 1. 5. ఇ. ఈ. లచే వేష్టితమైన చక్రము. ప్రయోజనమునకు విలువకునుండు వ్యత్యాసము తేటపడవలె నన్న నీరెండుపటములను గమనించి చూచినంజాలు. వెలలనో:- రాశింబట్టి యన్నిభాగములకును వెలయొక్కటే. ప్రయోజనములనో:- ప్రతిభాగమునకు నొక్కొక్క పరిమాణము. ఆదినెక్కువ; తుదిదక్కువ.

అయిన నంత్యభాగమూల్యమే ప్రతిభాగముయొక్కయు మూల్యమైన విధంబున నంత్యోపయుక్తినిం బ్రతిభాగోపయుక్తిగ నేల గణింపరాదు ? రాశితోడ మూల్యము తగ్గునుగదా ! అట్లే ప్రయోజనమును తగ్గునదియ. ఈ మాత్రము సమన్వయము గలవానికి సంపూర్ణ సమన్వయ మేలపొందింపనీరు ? ఇది యనేకులనుబట్టి బాధించు బ్రహ్మరాక్షసివంటి ప్రశ్న.

కారణములు:- 1. మూల్యము వస్తువులను గొనుట యమ్ముట వీనిలోదేలు తారతమ్యము. 500 పుట్లుండిన కాలములో వెలలు 4 కి వచ్చెబో. 100 పుట్లేయుండిన వెల 6 రూపాయలుగ నుండు ననుట యిపుడును (అనగా 500 పుట్ల కాలమునను) నిజమేయైనను 100 పుట్లను 6 రూపాయలుగను, తక్కిన 400 ను 4 రూపాయల రీతిగనమ్మ నెవడు గాంక్షింపడు ? కాంక్షించినను నాకాంక్ష విఫలమే. ఎట్లన:- అట్టి పిచ్చివాదముల కెవడైన గడంగిన 'మాకు 4 నకువచ్చు 400 లోనుండు పుట్లనేయమ్ముడు. వెలపొడుగైన 100 టిని మీయింటనే నిలుపుకొనుడు' అని తీయువారు హేళనము సేతురు. కాబట్టి భాగములు భిన్నప్రయోజనములుగ నున్ననేమి ? తక్కువ ప్రయోజనముగలిగి, వెల సరసమగు నంత్యభాగము గొన్ననేమి ? ఎక్కువ ప్రయోజనము గలదియని వ్యాఖ్యానార్థమెన్నబడిన ప్రథమభాగము గొన్ననేమి ? భాగములగుణము సమానమైన సుఖము సమానమే. కావున గొనువాడు రాశింబట్టి యేర్పడిన యధమపక్ష క్రయమునకన్న నధికమేనాడు నియ్యడు. సుఖమెక్కువగనున్నను, అట్టిభాగమే తక్కువవెలకు లభించునేని ఎక్కువవెలయేలయిచ్చును ? అట్లైనచో ప్రతిభాగమునకును వెవ్వేఱుమూల్యము లున్నవని యేలయంటిరి ? అయ్యో రామా ! మేమట్లనలేదు. మామాటయొకటి. మీయర్థము వేఱొకటి ! కానిండు ! ఈ సంశయమున నివారింప నొంకొకవ్యాఖ్యానము చేసెదము.

ఈ క్రింది దృష్టాంతమును విమర్శింపుడు:-

100 పుట్ల కాలములో వెల పుట్టికి 6 రూపాయలు
200 పుట్ల కాలములో వెల పుట్టికి 5 1/2 రూపాయలు
300 పుట్ల కాలములో వెల పుట్టికి 5 రూపాయలు
400 పుట్ల కాలములో వెల పుట్టికి 4 1/2 రూపాయలు
500 పుట్ల కాలములో వెల పుట్టికి 4 రూపాయలు

ఇట్లు వెలలు మాఱుట స్వాభావికమేకదా ! కాబట్టి మూల్య సిద్ధాంత మూహించు పద్ధతి యెట్టిదనగా:-

300 పుట్ల కాలములోను 100 పుట్లేయున్న దానికి వెల 6 రూపాయలవంతున యుండుననుట నిశ్చయము. కావున 300 పుట్లుత్పత్తియైన యవసరమందును 100, 200 టికిని, 6, 5 1/2 లకును క్రమముగాగల సామ్యములు నశించినవిగావు. అవి బయట బ్రత్యక్షముగ నిల్వకున్నను ఈ యధిక రాశి కాలమందును లీనమైయున్న న్యాయములు. కావున వానిని వదలగూడదు. మఱి 300 పుట్ల కాలములో ప్రతియొక్క పుట్టికిని సాక్షాత్తుగ సిద్దించుధర 5. దీనిని వదలరాదు. ఇక నీరెంటిని గలిపినట్లు చూపుట యెట్లనగా:-

అనగా రాశితోడ మూల్యమును మాఱునదియని ప్రచురించుటకై, యప్పటి 300 పుట్లరాశి వివిధ పరిమాణములుగల రాసుల కూడికచే నేర్పడినదిగా భావించి, యంత్యరాశి మూల్యముచే ప్రతిభాగము యొక్కయు మూల్యము నేర్పడియె నంటిమేని, పైని వాక్రుచ్చిన రెండున్యాయములయు నన్వయమును నిత్యతను రక్షించిన వారమగుదుము. "రాశితో మూల్యము మాఱును. ఏదైన నొక రాశింగణించి చూచితిమేని దానిచే నేర్పడిన మూల్య మద్దాని ప్రతిభాగముం జెందును" ఈ రెండు న్యాయంబులును పరస్పర విరుద్ధములుగావు.

2. ఈ రీతినె ప్రయోజనముంగూర్చియు వ్యాఖ్యనేలచేయరు ? చూడుడు. రాశింబట్టి ప్రయోజనముండును. ఈ గుణమున నిది విలువకు దోబుట్టువు. అదిప్రయోజనముకన్న నంత్య ప్రయోజనము తక్కువ. రాశియెక్కువయైన విలువయు క్షీణించుననుటతో దుల్యము. ఇక నంత్యప్రయోజనమే ప్రతిభాగ ప్రయోజనమని మూల్యోపయుక్తులకు దెగని బాంధవ్యమేలకల్పింపరాదు ? దీనికి సమాధానము:

ప్రయోజనము భావము. విలువ వస్తువులను ఏమాత్రమిచ్చి మార్చుకొందమను నిర్ణయము.

ఏవెలయిచ్చిననుసరే ప్రథమమున వాడబడు భాగము తొలుకాఱు వానరీతి వాంఛాసంరంభమునార్చి యెక్కువ సుఖమునిచ్చును. ఒక్కతూరి సుఖముజెంది, యనంతరము గొంతకాలమునకువచ్చిన తక్కువ సుఖమునకన్న దొల్తటి సుఖమెక్కువకాదని మందలింప దగునా ? సుఖమేమో యారగింప బడినది. జీర్ణమునైనది. పిమ్మట నొకవేళ నమితసేవచే గష్టమువచ్చినను ఆ తొలిసుఖ మెట్లు కొఱత వడును ? కావున ప్రతిభాగమును భిన్నప్రయోజనములనుటయ స్వభావ సమ్మతము.

ఇక విలువవిషయమై యట్లుగాదు. వినియోగించులోనన్న భాగ భాగముగ మెక్కుదుము. కొనుటలో నీతీరువేఱు. ఆకాలము నందుండు రాశినంతయు గణించి, దానిచే నేవెల తటస్థించుననుట విచారించి యావెలకు దీయుదుము. కాన భాగభాగమునకు నొక్కొక వెలయునుకొనము. తినుట మొదలగు వినియోగ క్రియలయందును కార్యాంతమునగాని సుఖంబు స్ఫురించకున్న మీవాద మొప్పుకోవలసినదే. కార్యారంభమునుండి - ఒక్క యారంభమునుండియా ? దూరమునుండి వాసనలు గుప్పించుసరికే - సుఖము ప్రసన్నమగుట మీరెఱిగినదేకదా ! విలువయందిట్లా ? కాదు. రాశియేర్పడిన తదనంతరము విలువ యేర్పడును. భుజించి ముగించిన పిమ్మట నేమి సుఖమున్నది ? కడుపు బరువొకటేకాక ! కాబట్టి మూల్యము, వస్తువు యొక్కరాశి కుదిరిన పిమ్మట దాని పరిమాణము ననుసరించి ప్రతి భాగమునకును గుదురు వస్త్వంతరతారతమ్యము. అట్లగుట నెల్ల భాగములకును రాశికొలది నేకరూపమూల్యముండును. ప్రయోజన మన్ననో నానావిధ పరిమాణములు గలది.

3. మూల్యమునకుం బ్రయోజనమునకును నిరంతర సంయోగముం గలిగింప ననుభవవిదితంబులైన మఱికొన్ని వర్తమానములును బాధాకరంబులు.

ఎట్లన:- గాలి యుపయోగకరమందురా ? అనగా ? నిస్సంశయముగ నుపయోగకరమేయని యొప్పితీరవలయును. బంగారు, వెండి వీనికన్న నిదిప్రధానము. ప్రాణాధారపదార్థము. అవునుగాని గాలియొక్క వెలయెంత ? సామాన్యముగ సున్న. అనగా నంత్యమూల్యము పూజ్యమనుట. కావున నంత్యప్రయోజనమును పూజ్యమే. అంత్య మూల్యము పూజ్యముగాన ప్రతిభాగముయొక్క మూల్యమును బూజ్యమే. కావున గాలి మూల్యము శూన్యమనుట సర్వసమ్మతము.

ఇక ప్రయోజనముంగూర్చి యిదే వ్యాఖ్యజేసి చూడుడు ! ఎంత యాభాసముగానుండునో ! అంత్యప్రయోజనము సున్న. కావున ప్రతిభాగముయొక్కయు ప్రయోజనము సున్న. గాలి యెందునకుం బనికిరాని వస్తువు ! ఇదెంత బాగుగ నున్నది ! ఇపుడే యిది బంగారమునకన్న గొప్పయని యంటిరి. ఇంతలోనె యది నిష్ప్రయోజనంబని యనెదరె ! ఈ పరస్పర విరుద్ధ పూర్వపక్షము లెట్లునిలుచును ? కావున గాలింగూర్చి చెప్పదగిన దేమనగా చూడుడు !

గాలి మిక్కిలి కొంచెముగానున్న దానియొక్క ప్రయోజన మింతింతయని చెప్పనగునా ? కావున దాని కాద్యుపయుక్తి యవ్యయము. అవాఙ్మానసగోచరము. రాశి యెక్కువ యగుటచే దాని యంత్య ప్రయోజనము తఱుగుచువచ్చెను. రాశి యపారమును గోరికకును దలంపునకు మీరినదగుట దాని యంత్యప్రయోజనము సున్నతో సమము. కావుననే దానియందు మనకు నాదరము. ప్రబంధకవులకు వనితామణుల నడుములవలె శూన్యము. అంత్యప్రయోజనము లేకున్నను సమస్తోపయుక్తి లేదనగాదు. మీదిపటముం జూడుడు. అంత్యోపయుక్తి యెఱుకకు రానియంత సూక్ష్మము. అనగా నేమియు లేదనుటకు మర్యాదమాట ! ఇక బూర్ణోపయుక్తియో మేరలేర్పఱుపరానియంత విస్తృతము కాబట్టి సమష్టి సమేయమైన గౌరవమున్నను విలువలేదు. అగస్త్యుడు సముద్రమును అరచేతిలో జేర్చినట్లు వాయువునంతయు నెవడైన మొత్తముగా సేకరించి మూటగట్టి మూలగూర్చున్నచో నది ప్రాణాధారముగాన వాడడిగినంత యిచ్చికొన ద్వరపడుదుము. స్వచ్ఛందముగ వలసినంత దొరకును గాన దానికి నంత్యప్రయోజనమును విలువయు మృగ్యములయ్యె. రాశికి మించిన కోరికలున్న నారాశియొక్క యంత్యభాగమునకుం బ్రయోజనము సిద్ధము. కోరికకు మించిన రాసులున్న నంత్యభాగములతో నెవరికేమిపని ? అవి ఱిత్తలు.

అంత్యోపయుక్తియే లేనియెడల మూల్యముండదు. అనగా గోరికకుమించిన రాసులున్న వానిని బదులు సరుకులిచ్చికొన నెవ్వడును గోరడు. అంత్యోపయుక్తియున్న మూల్యము తప్పదు. అనగా రాశికిమించిన కోరికలుంటచే వా రాసియెడ జనుల కాదరమున్నదనియు, దానంజేసి సరుకుల మాఱొసంగియైన దానింబడయ జూతురనియు ననుట.

చూచితిరా ! ప్రయోజనమునకును మూల్యమునకును ఇంత సేపునకు నిర్ధారణకువచ్చిన సామ్యము !

ఆద్యోపయుక్తికి, సమష్ట్యుపయుక్తికి, మూల్యమునకును సంబంధములేదు. ఉదా. గాలికి ద్వివిధోప యుక్తులుదట్టము. మూల్యమునహి.

అంత్యోపయుక్తియు మూల్యమును నిత్యసంయుక్తములు. మూల్య మంత్యోపయుక్తిచే నిర్ధారితము. ఉదా. రాశి ననుసరించి యంత్యోపయుక్తి యుండును ఆ తక్కువ యుపయోగముగల భాగమునకేమి వెలయో యదియే ప్రతిభాగమున నావేశించిన మూల్యము. పీపాయినీరు అమ్మకమునకుండిన తొలిచెంబు మిక్కిలి యుపయోగకరము. కడపటిది యధమము, అయ్యును ఈ యధమరాశికి నేమిత్తురో యంతకన్న నెక్కువ తత్పూర్వరాసుల కిచ్చుట గానేరదు. రాశి ననుసరించి యేర్పడిన కనీసము ప్రయోజనమున కేమి యిత్తుమో యదియే రాశియొక్కయు ప్రతిభాగముయొక్కయు విలువ, 500 పుట్లకాలములో 100 పుట్లనాటికన్న వడ్ల యంత్యప్రయోజనము తక్కువ. ఈ తక్కువంబట్టి యేర్పడిన నయమైన వెలయే ప్రతి పుట్టియొక్కయువెల.

అంత్యోపయుక్తిచే మూల్యము నిర్ణీతమగునని యంటిమి. బర్మా మొదలగు దేశములనుండి బియ్య మమితముగ దిగుమతియై వెలలగుదియించెనేని మనకాపులు మంచివెలలులేవని పంటల దగ్గింతురు. యంత్రములచే దయారుచేయబడు నీలిప్రసిద్ధికి వచ్చినదే. నెల్లూరు మొదలగు ప్రాంతములవారు నీలిపంటల జాలించి యుండుట తెలియదా ? అనగా నిప్పటి ధరల ప్రకారము పూర్వమున్న నీలి రాశిలో గొన్ని భాగములకు బ్రయోజనము భగ్నమాయెననుట. (అనగా నారాశికి నంత్యప్రయోజనము సడలెననుట) కావున రాశి తగ్గింపబడియె. మరల నేదేనొక కారణముచే బంటనీలికి గిరాకి హెచ్చెనేని నాయాదరాధిక్యముతో నంత్యప్రయోజనమును వికసించును. వెంటనే విలువవిలసిల్లిన బంటలిప్పటివలె ముకుళితస్థితిలో నుండవు. అంత్యోపయుక్తియు మూల్యమును రెండు శరీరములం జెందిన యేకాత్మయట్టివి.

రాశిచే నంత్యోపయుక్తియు మూల్యమును నిర్ధారితములు. మఱి యంత్యోపయుక్తి మూల్యములచే రాశినిర్ధారితము. ఉదా. నీలికిని అంత్యోపయుక్తి (అనగా మూల్యము) హెచ్చిన నెక్కువ రాసులు పండింపబడును. కావున రాశియు మూల్యమును పరస్పర విదానములు.

గాలి మొదలగు నవ్యయరాశివస్తువులకు సామాన్యముగ విలువ లేకున్నను దేశాదివిశేషములంజేసి విలువ యేర్పడుటయుంగలదు. ఉదా. 1. ముత్తెపుచిప్పలకొఱకు సముద్రములో కెంతయో లోతునకు దిగినవారికి గొట్టములగుండ గాలి గొట్టుదురు. దీనికై యిన్ని ఘనపుటడుగుల గాలి కింతయని ధరల విధింతురు. 2. ఊపిరియాడని మహాపట్టణములలో మంచిగాలి పాఱునిండ్లకు బాడుగ కొంచె మధికము. ఇది గాలికొఱ కియ్యబడిన వెలయేకదా !

మూల్యము వినిమయసంబంధి. అనగా వస్తువుల బేరసారములలో మార్చుకొనుటయందు దీనికింత, దానికీమాత్రము అని యేర్పడు విలువ. వ్యవహారపరివర్తనము లేనిదైనచో ప్రయోజనములుండుగాని మూల్యములు నిర్మూలములగును. కావునగదా యనేకవస్తువులున్నం గాని విలువకును వినిమయమునకును నెడము దొరకదంటిమి. ఇట్లు ఇచ్చి పుచ్చుకొనుటలో ప్రత్యక్షమగు 'ఇంత - మాత్ర' మను పదములచే సూచింపబడిన భావమును వెల్లడిపఱుచుటకై వస్తువులు భాగ భాగముగానుండు రాసులం బోలినవని యూహింపవలసెగాని, నిజము చూడబోయిన గాలిమొదలగునవి యఖండములైన యేకసముదాయములే. అవి యిసుకవలె బొడిపొడిగా లేదనుట స్పష్టమే ఒకవేళ గుప్పలుగా బోయిదగిన వడ్లు రాగులు మొదలగువాని రాసులుండ లేదా యని యందురో ! ఉన్నవిగాని యొకమాఱు వానిని రాశిగా జేర్చిన పిమ్మట 'ఇది మొదటికుప్ప; ఇది రెండవకుప్ప' యని నిరూపింపనౌనా ? నిరూపించితిమిపో వానివల్ల నేమిగుణము ? రాశి ననుసరించి యన్ని పాళ్ళకుగలుగు విలువయొక్కటియే. అట్లగుట ప్రథమద్వితీయాది నిర్థారణ నిరర్థకచేష్ట. కాబట్టి పదార్థము లప్పటప్పటికి నేకసముదాయములుగాని భిన్నభిన్న భాగములుగావు. రాగులమండీలో నొకానొకనాడు 100 పుట్లు వచ్చిచేరినవనుకొనుడు. ఇవన్నియు నొకేయంగడిలో దిగవు 10 యంగళ్లున్న నొక్కొక్కటి 10 పుట్లుగొని యమ్మకమునకు నుంచునేమో. ఇట్లు 100 పుట్లును పదిపదిగా విభాగింపబడి 10 చోట్ల జేరినను, ఆ మండీలో నేర్పడినవెల యీ వెవ్వేఱుపదుల ననుసరించియుండదు. మఱి యా మొత్తపు 100 పుట్లనుండి ప్రభవిల్లిన వెలయే యన్నిభాగముల నావేశించును. చూచితిరా, యయ్యైకాలముల నయ్యైపణ్య చక్రంబుల వస్తువులు నిజము చూడబోయిన జిగిబిగి గలిగిన యేక సముదాయమే యనుట యనుభవదృష్టము.

భాగభాగములుగా నున్నవనుట వ్యాఖ్యానార్థము చేయబడిన యూహ. ఏవ్యాఖ్యానము లందురో. ఈ రెండు న్యాయములం బ్రదర్శించుటకై :- 1. రాశితోడ విలువయు సామాన్యముగ మాఱును. రాశి యీమాత్రమైన వెల యింత, ద్విగుణితమైన నింత, ఇత్యాది సాదృశ్యములు శాశ్వతములు. 2. మఱి యయ్యైకాలముల నయ్యై పణ్యచక్రములందు రాశిసమస్తముచే నిర్ణయమునకుదేబడు వెలయే ప్రతిభాగముయొక్కయు వెల. మఱి యీ కాలములోను పూర్వము చెప్పబడిన సాదృశ్యము లదృశ్యాకారముతోనున్నవి. ఈ న్యాయ ద్వితయము సిద్ధాంతము చేయుటకునై హేతుభూతములుగ ననూకూలించునవిగాన భాగభాగములుగ గణించుట యుక్తము.

మఱియు మూల్యశూన్యంబు ప్రయోజనశూన్యంబని కొందఱు భ్రమింతురు. ప్రయోజనము, విలువయు సమగ్ర సమత్వము దాల్చినచో, రత్నములు, బంగారు మొదలగునవి ప్రబల ప్రియములు గాన, నవి వాయ్వాదులకన్న నెక్కువ ప్రయోజనము కలవి యన వలసివచ్చును ! ఇది హాస్యవాదమేకాక కువాదమును. దీనిని ఖండించు విధమెట్లు ? విలువకు ప్రయోజనమునకు సంబంధమేలేదనియందమా ? ఇది ప్రకృతి విరుద్ధము. ప్రయోజన మున్నంగాని వస్తువుల నెవరు గొనరు. వీధి దుమ్మునెవరైన వెలనిచ్చి తీయుదురా ? కాబట్టి ప్రయోజనమునకు మూల్యమునకు నేదోసంబంధమున్నది. మన వ్యాఖ్యాన మేమందురో. విలువ రాశిననుసరించి యుద్భవించు నంత్య ప్రయోజనముతో సమన్వితము. అంత్యప్రయోజన మనగా నంత్యభాగ ప్రయోజనము. 'అంత్యభాగ' మని యనవలసి వచ్చినందున వస్తు భాగభాగములుగ నున్నదని వితర్కింపవలసె. ఉపయోగము నానామూర్తులం దాల్చినయది యను నిర్ధారణయొక్క సాహాయ్యము లేనిది గాలికి బంగారమునకును జరుగు నీతర్కయుద్ధములో గాలికి జయము రానేరదు. ఈ జయమెట్లు చేకూర్పబడె ననగా :- గాలికి నంత్యోపయుక్తిలేదు. ఇయ్యది బంగారమునందు ఘనము. అయినను బంగారమునకుండు సమష్ట్యుపయుక్తిని వాయుమండల సమష్ట్యుపయుక్తికిని సామ్యము దోమకు నేనుగునకునుండు వాసియట్టిది. కానీ ! వస్తువులం భాగములున్నవనియు, ఈ భాగములు ప్రథమ ద్వితీయాదులనియు, అంత్యభాగమనునది యొకటియున్నదనియు, ఈ భాగములయొక్క యుపయుక్తతా గుణము క్రమమైన క్షయముం దాల్చినదనియు :- ఇన్నిసిద్ధాంతములను దెచ్చిన దెందునకు ? గాలిమాట నిలుపుటకేనా ! వినుండు. గాలిమాటయనునది మనమాటగాదా ? అనగా నవరత్నములకంటెను గాలిప్రధానమనుట యనుభవముగాదా ? ఈ యనుభవమును సహేతుకముం జేయుటకు. మఱియు, భాగభాగములనుండి ప్రభవించు సుఖము న్యూనతగలది యనుట ప్రత్యక్షానుభవ గోచరముగాదా ! నీటిసామ్యముచే నియ్యది సుబోదము సేయబడియెగదా ! కావున నీసిద్ధాంతము లన్నియు గాలి మాటలుగావు ! గేలిమాటలుగావు ! మఱి సత్యములు. ప్రత్యక్ష జ్ఞానమున లీనములైయుండు గూఢతత్త్వములు.

సంగీత విద్వాంసులరీతిని మనము నారోహావరోహములం జేసితిమి. తలనుండి తోకవఱకు మొదలు తడవిచూచితిమి. ఇప్పుడు తోకనుండి తలవఱకుం బరీక్షించితిమి. ఆమూలాగ్ర పరనమన్న నిట్టిదే యుండునేమో ! ముందునకేగుదము.

ఆద్యుపయుక్తి యనగా, వస్తురాశి యత్యల్పమై గిరాకి యత్యధికమైన కాలమున దానియందు మనకుండు నాదరము గాలికి నాద్యుపయుక్తి నిర్ణయించుట కష్టము. అది మిగుల గొంచెమైన మనప్రాణములే యుండవు. ఇంక నాదరమునకు నాధారమెద్ది ? కావున దానియొక్క ఘనత భావనాశక్తిచే నూహ్యంబు అంతోపయుక్తి హెచ్చుటయన గిరాకిహెచ్చుటయనుట. అనగా మనకు దానియందలి యాదరము వృద్ధిగాంచినందున దాని యంత్యభాగముయొక్కయు ప్రయోజనము విస్తారము గాంచెననుట. అంత్యప్రయోజనము విస్తరించు విధంబులు రెండు.

1. గిరాకి - (అనగా మనకు వస్తువునందలి యభిరుచి) నిలుకడగ నుండగా వస్తువుయొక్క రాశి తగ్గెనేని :

ఇట రెండవపటమున మూడవ గిఱ్ఱయే యంత్యప్రయోజనము సూచించును. ఉదా. పంటలు చెడెనేని ధాన్యపు వెల హెచ్చుట.

2. రాశి యట్లేయుండి గిరాకి హెచ్చుటచేత అనగా నాదరము వృద్ధియగుటచేత.

ఉదా. పెండ్లికాలములను చైత్రవైశాఖ మాసములలోను బట్టల ధరలు హెచ్చుట.

వాంఛాపూర్తికి ననుగుణమగురాశి యెక్కువ కానుగాను. గిరాకి యట్టులేయున్న, దాని యంత్యప్రయోజనమును, విలువయు క్షీణతనొందవచ్చును. రాశి శుక్ల పక్షము నవలంబించిన మూల్యము కృష్ణపక్షములో జేరును. కోరికకుమీఱిన రాసులున్న విలువ యస్తమితమగును. అంత్యోపయుక్తితో గూడిన పదార్థములకెల్ల సమస్తోపయుక్తియున్నను సమస్తోపయుక్తితో గూడిన వానికెల్ల నంత్యోపయుక్తి యున్నదను నిశ్చయములేదు.

ప్రతిబేరమునందును - అనగా వినిమయ క్రియాసమయమున - నాలుగు విధముల యంత్యప్రయోజనముల సరిపోల్చి చూచుట సిద్ధము. ఉదా. ఆవునకుమాఱు ఎద్దును గొన నుద్యమముండెనేని:అమ్మువానియోచన :- నాకిన్ని యెద్దులున్నవి. ఈయొక యెద్దుచే నీరాశింబట్టి నాకుండు ప్రయోజనమేమి ? 2. నాయావుల సంఖ్యయింత. కావున నీఆవుంగొనుటచే లభించు ప్రయోజనాధిక్యం బెంత ?

కొనువానియోచన :- నాకిన్ని యావులున్నవి. ఆ రాశింబట్టి ఈ యావుచే గలుగు ప్రకర్ష మెంత ? 2. నాయెద్దుల సంఖ్య యీమాత్రము. ఈ క్రొత్తయెద్దు లభించునేని యేమాత్రము ప్రయోజనాధిక్య మలవడును ?

వినిమయ మెప్పుడు జరుగుననగా, ప్రతివానికినిఇచ్చు వస్తువునకైన గొనువస్తు వొక్కింత యంత్యప్రయోజనము నధికముగా గలదియైన లేనిచో బేరసారములేల ? చేతనుండు దానికన్న నెక్కువ ప్రయోజనకారిగాకున్న నితరవస్తువుతో నేమిపని ? కావున వినిమయములలో నుభయకక్షులును ప్రయోజనాధిక్యముంబడసి కృతార్థులౌదురు. ఉభయులు లబ్ధలాభులౌట యనిత్యమేని వర్తకములు వ్యాపించియుండునా ?

అంత్యోపయుక్తిలేని పదార్థములకై ఎవ్వడును దాటుపడడు. అంత్యోపయుక్తిలేనివనగా మితమునకు మించిన రాసులున్నవియనియు నద్దానంజేసి వానియందు మమతలేదనియు భావము. ఇష్టములేనిచో నెవడైన శ్రమ పుచ్చుకొనునా ? మఱియు నిచ్ఛాపూర్తికి వలయు బండములుండగా వానినెక్కువ చేయుట కెట్టిమూడుడు నుద్యమింపడు. కావున వాంఛలకును శ్రమమునకును బరస్పర సంబంధము గలదు. దీని విధంబు స్పష్టముగ దెలియజేయుదము.

వాంఛలకు యత్నములకునుండు పరస్పరత

1. అమానుషశక్తిచేగాని సాధింపరాని యుద్యోగముల నెట్టివాడు నాసింపడు. హనుమంతునివలె గొండలు మోయగలిగినంత బలము రావలయునని పిచ్చివాడుతప్ప దదితరు డెవడైన సాము జేయబూనునా ? నక్షత్రలోకములో నిల్లుగట్టికొని వసింప నెవడపేక్షించును ? కావున మన కసాధ్యములని స్పష్టముగ దెలిసిన వానియందు సాపేక్షుల మెన్నటికినిగాము. సాధ్యములని నమ్మినవాని యందే నరుండు తఱుచు కాముకుం డగును.

2. మఱియు శ్రమ దు:ఖభాజనంబు. వస్తువులు స్వభావముగ సుఖము నొసగునవి. వస్తాధిక్యము సమకూర సమకూర సుఖము హీనత జెందును. ఈ న్యాయమును బటములో సూచించిన దెల్లమగును.

రాశి యెక్కువయగుకొలది వాంఛాసుఖంబులు తక్కువలగును. తుద కపరిమితమగుడు కష్టమేయగును. కష్ట మారంభించిన వెనుక నిది సుఖమువలె దగ్గుటలేదు. మఱి సదా, కారణమైన వస్తువు వృద్ధియగునట్లెల్ల, నిదియు నెక్కువయగుచు వచ్చును. ఈ విషయమే మునుపు నీటి సామ్యముచే బోధించితిమి. (1 వ పటము చూడుడు. తొలిగ్రుక్క మహదానందదాయి. త్రాగను ద్రాగను అభిరుచి లాఘవంబు నొందును కొంతవడికి సుఖముగాని కష్టముగాని లేని మధ్యస్థితి ప్రాప్తించును. ఇంకను మతిలేక త్రాగినచో గష్ట మారంభించును. బలాత్కారముగ విడువక నోట నీటింబోసిన నాహింస చెప్పనలవిగాదు.

ఈ విషయమునే బోధించు నొక కథగలదు. వేసవికాలమున నొక బాటసారి యొక యెడారిలో బ్రయాణము జేయుచుండెను. పాప మెండవేడిమిచే నెంతయుదపించి దాహాతురుడై యాపాంథుడు చుట్టుప్రక్కల నీ రెచ్చోటను గానక "యెచటనైన నింత త్రావనీరు చిక్కునా దేవుడా?" యని చింతించుచు బ్రయాణము సేయుచుండ గొంతకాలమున కతనివంటి మార్గస్థుడొక డెదురయ్యె. వానింజూచి యితడు నోరెండిపోవ "అయ్యా! ఇట్లే వచ్చితివికదా! త్రోవలో నెక్కడైన నీరున్నదా?" అని యడిగెను. అందున కతడు "సుమారిచటికి బరువుదూరమున నొక బావియున్నది. అందు మొదటి భాగముననుండు నీరు ద్రావిన నమృతతుల్యముగ నుండును. రెండవభాగమున కొంచె ముప్పగా నుండును. మూడవచోట నింకను క్షారము. నాల్గవయెడ నీరు నోటబోయ సాధ్యముగాదు" అని చెప్పి తనత్రోవబట్టి వెడలిపోయెను. అదివిని యిత డిదేమి యింద్రజాలమా యని చింతించుచు నతి వేగమున ముందుపయనముజేయ నాపాంధుడు చెప్పినట్లే బావియొకటి కనులార గానవచ్చెను. ఆ పధికు డాబావిలో నొకయెడదిగి కరువుదీర నీరు ద్రావ నవి యట్లే యతిమధురములుగ నుండె. దాహముదీఱిన పిదప నతనిమాట పరీక్షింపనెంచి యింకొకచో ద్రావిన నవి యంతమధురములుగ నుండలేదు. మూడవదిక్కున ద్రావబోయి మునుపటికన్న మిగుల నుప్పగనుంటచే యెట్లెట్లో కష్టపడి త్రాగెను. నాల్గవచోట నీరు నోటబోసికొని నాలుకయంతయు జీలిపోవునట్లైన "నాతడు చెప్పినదే నిజము. ఇందేమియో యక్షిణి యున్న" దని తలచి త్రాగలేక యుమిసి తనత్రోవను బోయెనట! ఇందుగల యక్షిణిని మా చదువరు లిదివఱకే గ్రహించి యుందురు. శ్రమ బాధాకరంబు. శ్రమ హెచ్చుపర్యంతము బాధయు బ్రబలించును. సుఖంబుబోలె క్షయవృద్ధుల కిది పాత్రంబుగాదు. ఇందులకు నిదర్శనమగు పటము.

కావున నేదేని పనికి బూనుకొంటిమేని కాలక్రమేణ శ్రమచే గల్గు క్లేశంబుహెచ్చి యా యుద్యమమునందలి యుత్సాహము నంత మొందించును

3. 'కష్టేఫలీ' యను వాక్యప్రకారంబుగ యత్న మెక్కువ యగుకొలది ఫలమును అధికముగ లభించును ఇక బురుష ప్రయత్నము ప్రయాసమునులేకయే ఫలము లబ్బునేని యెల్లరు నన్నివస్తువులును కావలయునని కోరుదువు. తలచిన మాత్రాన వలచినది సమకూరునేని ఆశలకు నంతముండదు. గురువుల నాశ్రయించుట క్లేశముల కోర్చుట అవధానబుద్ధితో వల్లించుట యను నిరోధమును లేనివాడు సర్వప్రజలును పండితోత్తములుగా నుండుదమని కాంక్షింపరా! అట్లేల కాంక్షింపరన, నిన్ని యిడుములం బడవలయుగదా యను భీతిచేతనే. చూడుడు. ఆశల బంధించుటకు వేదాంతమునకైన నీశ్రమయే ప్రబలపాశము.

4. కార్యారంభమున ఫలంబు స్వల్పంబుగ నుండుగాన దానియందు మనకు బ్రీతి యధికముగ నుండును. అందుచే బ్రయాసయు ప్రయాసగ దోపదు. అనురక్తి లేనివానికి గొంచెపాటి ప్రయాసమును ఘనముగ దోచును. కామాతుఠునకు గష్టంబులు గష్టంబులుగ గానబడవు. వాడెట్టిగోడలనైనను దుముకుటకు వెనుదీయడు. ఏకార్యమందైన నాసక్తిగొంటిమేని దానివలన గలుగు దేహమన:పీడనంబులు బుద్ధికిందట్టవు. ఆకలిచే నాకులుడైన వానికి గోడ దుమికి తోటలో బ్రవేశించి చెట్టెక్కి పండ్లుగోయుట యశ్రమమైన కృత్యముగా గనుపించును. ఈ కార్యమునే సంతర్పణచే దృప్తుడైన వెనుక వానిం జేయుమన్న "అయ్యో! ఇట్టికార్యము నాచేత నవునా?" యని యూరకుండును. ఆవశ్యకము అసాధ్యముగాదు. అనావశ్యకమని తోచిన యెడల సులభసాధ్యంబును అసాధ్యమగును.

5. వాంఛయు దత్పరిపూరణార్ధమైన యత్నమును శమించుటకు మూడుకారణములుగలవు. ఇవిమూడును ఏకకాలమున బ్రవర్తిల్లుటయేకాక పరస్పర నిర్ధారితములు నయియున్నవి. ఈ కారణము లెవ్వియన:- ప్రయత్నము జేయజేయ బాధతోబాటు ఫలమును అతిశయించుటచే ననురాగము క్షీణతకువచ్చి తుదకు బొత్తుగ నశించిపోవుట. అనురాగము హీనమౌకొలది కష్టము తక్కువగానున్నను ఎక్కువగాదోచి తుదకు సహింపరానిదగుట. బాధ యెక్కువ యగుటచే ఫలముమీది మమత కృశించుటయు ననునవి పరస్పర నిర్ధారితములంటిమి అనగా వాంఛచే శ్రమయు శ్రమచే వాంఛయు నిర్ణీతములనుట. ఈ విషయమునే నిదర్శనపూర్వకంబుగ దెల్లం బొనర్తము. కోడికి గ్రుడ్డును, గ్రుడ్డునకు గోడియు ఆధారభూతములనుట సర్వవేద్యము. వాంఛ హెచ్చిన శ్రమ తగ్గినట్లుండును. శ్రమ హెచ్చిన వాంఛకృశించును. వాంఛ యెంతయెక్కుడుగనుండునో యంత యెక్కువ శ్రమచేయ నుద్యుక్తుల మగుదుము. ఐనను ఎట్టి శ్రమచేతను సాధింపరాని వస్తువులం దాశగొనుట యసంభవము. అందరాని పండ్ల కఱ్ఱులుసాచుట నరునకు నైజగుణంబుగాదు. ఒక్క శ్రమ యెక్కువైననే యాశ తగ్గుననగా దానితోడ ఫలంబును అతిశయించిన నాశ యింకను ద్వరలో నంతమొందకుండునా! ఆశ తోడ పూనికయు నస్తమించును. దీనినివిశదీకరించు పటంబు.

పటమున 1, 2, 3 అను భాగములు ఒక్కొక్కటి యొక్కొక గంటసేపు పనిని సూచించు ననుకొందము. రెండుగంటలు పనిచేసిన ఫలము రెండింతలగును. మూడు గంటలకు మూడింతలు. ఇట్లె అన్ని భాగములకును అని గ్రహించునది. రెండును సమముగ వృద్ధి జెందుగాన యధాక్రమాన్వయము గలవని యెఱుగునది.

ఒక గంటప్రొద్దు కష్టించిన పిమ్మట నొకింత ఫలమబ్బును. అప్పటికి బాధ యంతగ దోపదు. ఏలయన ఫలమునందలి ప్రయోజనబుద్ధి (అనగా సుఖము) అధికముగా నుండును.

కాలక్రమేణ వస్తువు జాస్తి కానుగాను దాని యంత్య ప్రయోజనము తఱుగుచు వచ్చును. బాధ యెక్కువయగును. ఈ విషయముననే బాధ యెక్కువ యౌననియు నాకారణమున వస్తువునం దాసక్తి తగ్గుననియు జెప్పవచ్చును. అనగా విరక్తియే ఆసక్తి వదలుటకు గారణమనియు ప్రయాసమువలని వేదనయు విరక్తిని బుట్టించు కారణములలో నొకటి యనియు దెలియ దగినది.

నాలుగుగంట లగుసరికి సుఖదు:ఖములు సమానములౌను. ఇంక నెక్కువకాలము పాటుపడియెనేని మితమునకు మీఱినంత సిద్ధి సమకూరుగాన అభిరుచి కొద్దియౌను, శ్రమ (క్లేశము) యుక్తప్రయోజనము లభించునను నాసలేమి దుర్భరమగును. కావున నాల్గు గంటలకన్న నిట్టిస్థితిలో నెఱుకగలవాడు పనిజేయడు.

మూల్యము అంత్యప్రయోజనముతో సంబంధించినది. అంత్యప్రయోజనము ఫలరాశి ననుగమించి యుండును. రాశి వాంఛా శ్రమలచే నిర్ణయింపబడును. వాంఛాశ్రమములును అన్యోన్య సంబంధము కలవిగా నున్నవి. కావున మూల్యము, రాశి, ఉపయుక్తి, క్రమ, యను నీనాల్గును పరస్పరాధారములనియు, నన్యోన్య నిర్ణీతములనియు నెఱుగునది. అర్థంబును త్రాటియందుండు పిరులు ఈనాలుగు.

రాశి ననుసరించి మూల్యమేర్పడుననుట స్పష్టమేయయినను మూల్యముచే రాశి నిర్ణయింపబడునని పైన సూచనగ దెలిపితిరి గదా! ఇదియెట్లు? అని ప్రశ్నింతురేమో. వినుండు. వెల యధిక మయినచో నెక్కువగ నుత్పత్తి చేయుటకు కర్మకరులు కడంగుదురు గాదె! రూపాయకు నాలుగు పుట్లు అమ్ముకాలములో నూఱుపుట్లు పండించువాడు రూపాయకు రెండుపుట్లు వెలయగునని ముందుగా దెలిసికొన్నవాడైన నింకను ఎక్కువ పుట్లు ప్రోగుచేసి యధిక లాభము వడయ బ్రయత్నింపడా? కావున రాశియు మూల్యమును అన్యోన్య నిర్ణీతములనుట స్ఫుటంబు.

రాశి, ప్రయోజనము, మూల్యము, శ్రమ ఇవి పరస్పరాశ్రయములు

రాశి, మూల్యము, ప్రయోజనము, శ్రమ అను నీనాల్గును భిన్నములైనను ఒండొంటితో నేకీభవించినవై పరస్పర కార్యకారణ భావమును వహించి యుండుననుట యీ శాస్త్రంబున నాద్యమైన న్యాయ్యంబు.

ఒక్కనిదర్శనముంజూపి యీ విషయ మింతటితో నిప్పటికి జాలింతము. ఆకలిచే నొచ్చినవాడొకడు ఫలములగోసి తినుట కారంభింపుడు తొలుత నాస్వాదించిన ఫలంబులు బహురుచ్యములును సుఖదంబులును అగుటజేసి ఆ సంతోషములో చెట్టెక్కి కోయుటచే నగు శ్రమను బొత్తిగ మఱచిన వాడగును. కొంతవడికి ఆకలి బాధ తగ్గుడు ఇంత మీదికెక్కితినె కాలుజాఱిపడిన నేమిగతి? కోయ గోయ రెట్టలు నొప్పియెత్తుచున్నవి; అని తలపోసి 'ఈ సుఖమున కీకష్టము సరియైన మాఱుబేరమా' యని చింతించును. మఱి కొంతవడికి గ్రుక్కుమిక్కనకయుండునట్లు గొంతువఱకు దిన్నవా డయ్యెనేని 'ఈపండ్లంత రుచిగాలేవు. ఏబుద్ధిచే దినుచుంటినోగాని నిజముగ జూడబోయిన ఱోతగానున్నవి. మఱి చేతులో యెత్తుటకు సాధ్యములుగావు. కావున నింక నీ యప్రయోజనమగు యత్నము జాలించెదను' యని తలచి చెట్టుదిగి వృక్షాధిదేవత కొక నమస్కారమైన వయక తనత్రోవ బోవును. ఇందును బ్రయోజనము, రాశి, శ్రమ, మూల్యము వీనికింగల పరస్పరావలంబనము విశదీకరింప బడియె.

అర్థశాస్త్రములోని ముఖ్యభాగములు

వస్తువులను బోల్చిచూచి తారతమ్య నిర్ధారణమొనరించి వానిని మార్చుకొనుటకు మూల్య మెత్తినసాధనము. వస్తువులే లేకున్న మార్పాటు జరుగుటెట్లు? కావున ఉత్పత్తి వినిమయమునకు నాద్యంబు. మఱియు గొనువారులేకున్న తమకుం గావలసినదానికన్న నెక్కువను గడించువారు నుండరు. ఇంతేకాదు. ఉప్పు, చింతపండు, మిరియాలు, వస్త్రములు, ధాన్యములు, ఎద్దులు, బండ్లు, సమస్తమును దామే సేకరించుకొనవలసివచ్చును. ఇది యసంభవము గాన ఉత్పత్తికి వినిమయ మాద్యంబనియుం జెప్పదగును. కావున నివి యన్యోన్యాశ్రయ ములు. ఇక వస్తువుల నుపయోగించుటకే గాని యట్లేదాచి గుడిలో దేవరంబోలె పూజించుటకై సంపాదించు వాడెవడునులేడు. విత్తములు వాంఛాపూర్తికొఱకు, అనగా వినియోగమునకు. విత్తములు లేనిది వినియోగము మృగ్యము. వినియోగములేనిది విత్తములును బడయబడవు. కనుక నివియు బరస్పరావలంబములే.

కర్మలు సాఫల్యమునొందుట కనేకుల సాహాయ్య మావశ్యకము. కర్తయైనవానికి గూలివాండ్రు మొదలగువారు కూడినంగాని ప్రయోజనము సిద్ధింపదు. వచ్చిన లాభము వీరిలో బంచుకొన వలయును. దీనికే 'విభజన' మనిపేరు. ఇది వినిమయములో జేరినది గాని వేరుగాదు. వినిమయమనగా అమ్మకము. పనిచేయువారును చేయించువారును దమతమ శక్తులను వేతనములకు మార్చుకొను చున్నారని భావించినచో విభజనము వినిమయము క్రిందికి వచ్చును. అయిన నిది మిక్కిలి ముఖ్యముగాన ప్రత్యేకభాగముగా బరిగణింపబడుచున్నది.

అర్థశాస్త్రములో ముఖ్యభాగము లేవనగా :- ఉత్పత్తి, విభజనము, వినిమయము, వినియోగము. ఇవిగాక రాజులు పన్నులు విధించు క్రమము, తద్ర్వయము ఇత్యాది విషయములం జర్చించు భాగంబొండుగలదు. దీనినే 'రాష్ట్రీయార్థశాస్త్రం' బని కొందఱందురు. ప్రాచీన నీతిశాస్త్రంబులందెల్ల నిదియే ముఖ్యాంశము.

పై విషయములన్నియు అర్థశాస్త్రమున బ్రధానవిషయములును దుర్బోధములును గాన నింతవిపులముగ జర్చింపవలసి వచ్చినది. ఈ భాగము బాగుగ నభ్యసించినంగాని ఈ శాస్త్రమున బ్రవేశము కలుగుట దుర్లభము.