Jump to content

భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడవ ప్రకరణము

వాంఛలయొక్క అనగా గిరాకియొక్క హెచ్చుతగ్గుజాడలు

రాశివిక్షేపించిన వాంఛలు సంక్షేపించుటయు రాశిసంక్షేపించిన వాంఛలు విక్షేపించుటయు మొత్తముమీద ననుభవమునగానబడు లక్షణములెయైనను ఈ యారోహావరోహములు ద్రుతగమనములా, మందగమునములా యనుట యింకను విచారణీయము, మమత తటాలునవ్రాలునా? మెల్లమెల్లగ క్రిందికిదిగునా? ఉన్నట్లుండి విజృంభించునా? క్రమక్రమమున నెగయునా? ఈ ప్రశ్న లెంతయు దొడ్డవి. వీనినే యింకను స్పష్టమగుతీరున వేయనగును:-

రాశియెక్కువయగుడు అంత్యోపయుక్తత తక్కువయగును. అనగా నారాశినంతయు నమ్మవలయునన్న వెలల దగ్గించవలసి వచ్చును. ఏలయన ఉపయుక్తతయొక్క తీవ్రము తగ్గెనేని మునుపటి వెలలకన్న దక్కువమాత్రమే కొనువారియ్య నొడంబడుదురు. వెలలు తగ్గించిరనుకొందము. ఏమాత్రము తగ్గింపవలయుననుట మొదటి ప్రశ్న. వెలలు తగ్గినచో రాశియొక్క సెలవు ఏమాత్రము హెచ్చుననుట రెండవప్రశ్న. అనగా ధరలకును విక్రేయరాసులకునుగల సామ్యమేమి యనుటయు యీ ప్రశ్నల యాంతర్యము.

దీనికి నుత్తరము:-

వస్తువుల గుణములంబట్టి వెలల చలనము అధికముగనో యల్పముగనోయుండును. అన్నివస్తువుల చాంచల్యము నేకక్రమముగ నుండదు. ఉదా. ఉప్పుయొక్క గుణములు రెండు. మొదటిది. అది ప్రాణాధార పదార్థముగాన నావశ్యకము. రెండవది. వాని నెక్కువ యుపయోగించిన నరుచి పుట్టునుగాన మమత పరిమితము. అట్లగుట ధరలెక్కువయైనను ఇతరవస్తువుల వ్రయము దగ్గించియైన నుప్పు కొనితీరవలయును. కావున వెల హెచ్చుటచే గిరాకి యంతగా దగ్గదు. ఇక ధరలు మిక్కిలిగా తగ్గించినచో క్రొత్త క్రొత్త యూరుగాయలు వేసికొందమని యెక్కువ సెలవులు గొన్నిపెట్టుకున్నను మొత్తము మీద వాడుకరీతికన్న నెక్కువగా బ్రోగుసేయబోరు. కావున గిరాకిరాశి తఱుచు హెచ్చుటయులేదు. కావున నుప్పునందలి యభిమతి పరబ్రహ్మాసక్తివలె నియమించు నిశ్చలతత్త్వమునకుం జేరినది. ఇందు చంచలత మిక్కిలి విస్తరించునది గాదు.

2. అలంకార యోగ్యములైన చీనిచీనాంబరాభరణాదులు, వీని లక్షణములురెండు. (అ) కొందఱికి నివియెంతయున్నను దనివి తీఱదు. (ఆ) జీవాధారములు కావుకావున దీసియే తీరవలయునని విధిలేదు.

ఈ లక్షణములవలని ఫలములు:- రాసులాతతములై ధరల గుదియించిన వీనియందలి యాదరము మిక్కిలి వ్యాపించును. గిరాకి హెచ్చి రాసులన్నియు నాక్రమించినను నాక్రమింపవచ్చును.

రాసులు క్షీణించి వెలలొకవేళ వికసించెనేని తీయవలసిన విధిలేదు గావున గిరాకి ముడుచుకొని పోవును. కావున నీవస్తువులయెడ జనులయపేక్ష రబ్బరు త్రాడువలె సాగునదియు ముడుగునదియు నైయుండును.

3. మఱికొన్ని వస్తువులు కొందఱికి నావశ్యకములుగను గొందఱికి ననిత్యభోగ్యములుగాను నుంటజేసి పక్షద్వయ ప్రకారము నిర్వికల్ప, సవికల్పాదరణయుతములై యుండును. ఉదా. నెయ్యి. పప్పు.

హతదారిద్రులైనవారికి నియ్యవి ప్రతిదినమును బుష్కలముగ నుండినగాని భోజనము హితముగాదు. వెలలేదిక్కుదిరిగిననుసరే. నిర్ణయప్రకారము కొనితీరుదురు. వీనివలన గిరాకి వ్యాకోచసంకోచంబుల పాలుగాదు. దారిద్ర్యహతులకో ఇవి విశేషపదార్థములు. పెండ్లి తాంబూల శాస్త్రమునాడుదప్ప దక్కినప్పుడు వీని యావశ్యకతలేదు. ఇవి లేకున్నను గలియో యంబలియో యారగించి కాలయాత్ర నడుప జాలుదురు. వెలలధికమైన వీనిని గ్రహింపవలయునను నుత్సాహము వ్రాలును. వెలలువ్రాలిన మీదికెగయును. కావున వెలలచే నీపదార్థములు వికల్పమునకుం బాత్రములు.

4. అపేక్షయొక్క విన్యాససన్యాసములు వస్తువులనేగాక ధరలసైత మాశ్రయించెడు. ఎట్లన, వెలలు విపరీతముగ బెరిగిన మీద నించుకతఱిగినను సపేక్షకులసంఖ్య యెదుగబోదు. ఉదా. నెయ్యి మణువు 10 రూపాయలమ్ముచునుండి 9 1/2 రూపాయలకుదిగినను గొనువార లెక్కువగ రాబోరు.

మఱియు నేయి సేరు అరణాకు నమ్మునట్టి కృతయుగము వచ్చెననుకొందము. వెల యత్యంత స్వల్పముగాన నాబాలగోపాల మెల్లరును వలసినంతకొని కుండల నండాల నింపియుంతురు. అరణా నుండి కాలణాకు దిగినను నింతకన్న నెక్కువ గొందురనుట సందేహాస్పదము.

కావున ధరలు అమితవృద్ధి క్షయస్థితులం జెందెనేని అల్ప వికారముచే నన్వేషణోత్సాహము మార్పు మిక్కిలిగ జెందదు.

5. పదార్థములు త్వరలో క్షీణించునవియు ననావశ్యకములు నయ్యెనేని వాని ధరలు తామరపాకులోని నీరుబలె నిలుకడలేని చలనము వహించును.

ఉదా. చేపలు; ఇవి యొకటి రెందు దినములకన్న నెక్కువగ నుంచుటకు గాదనుట ముక్కులుండు వారికెల్లరకు దెల్లంబ; మిత కాలమ్మున నమ్మవలయుట యావశ్యకము. అసాధారణభోగ్యములకుం జేరినది గావున 'రాజుమెచ్చినది రంభ' యను సామెత ప్రకారము జనులచిత్తవృత్తిని క్రయమును ననుసరించి యాదరమేర్పడును. కావున నమ్మువారియొక్కయు, గొనువారియొక్కయు, నుభయపక్షములవారి యొక్కయు నుద్దేశము లుయ్యెలవలె నూగుచుండును. సిద్ధించు స్థితియొక్క వివరి మేమనగా:--ప్రొద్ధునమొదలు గొప్పగనుండును. అంతయు సెలవాయెనాసతి. లేకున్న నీడతోడల్ వెలలుల్ గుఱుచలగును. మధ్యాహ్నమునకు రాసులు ముగియవేసి, నీడపెరిగినను వెల లింకను దఱుగును. తుట్టాతుదకు నెరువునవేయబడుటయుం గలదు.

6. ఏకప్రయోజకము మీదియాదరమునకన్న బహు ప్రయోజాధారములైన వస్తువులమీల్ది యాదరము నిమ్నోన్నతభావము లకుం బాత్రమైయుండు. ఎట్లన, చెన్నపురిలో కొళాయిగుండ మ్యునిసిపాలిటీవారు నీరు సరఫరా చెసెదరు. అనంగా నుచితముగాగారు పన్నులవిధించి, బీదలు, సామాన్యజనులు గృహకృత్యములకు వలయునంత మాత్రము గ్రహింతురు. గొప్పగొప్ప బంగళాలలో వసించు వారలు గృహకృత్యములకేకాక తోటపనులకును వలయునంత గ్రహింతురు. ఇంతేకాదు. దూదియంత్రములు, వస్తురచనాయంత్రశాలలలో నెంతయో నీరుకావలసియున్నది. ఈ శాలలవారును వెల యిచ్ల్చి కైకొందురు. ఈమూడువిధముల ప్రయోజనములలో:---

గృహకృత్యములలో శుబ్రజలంబు లవశ్యకంబులగుటయు, నీప్రయోజనమున నొకపరిమితికి మించికాని తగ్గికాని లభించిన మేలు లేకపోవుయు, గారణములుగ నీరు నికరమైన గిరాకి కలదిగానున్నది.

తదితరములలో నీటిపన్ను అత్యధిగమైన బావులు త్రవ్వుకొందరు తగ్గిన నెక్కువగ వినియోగింతురు. మనుజు డింతకైన నెక్కువనీరు త్రాగండని నిత్ణయమున్నదిగాని చెట్లకింతకన్న నెక్కువగ, బోయరాదను నిర్ణయము లేదుగదా! జలము యధేష్టముగ నెక్కువ సెలవు లేక దొరికిన బంగళాచుట్టును బచ్చికవేసి పోషింపవలయుననువారేమి, బంగళాకే దినదినమును అభ్యంగస్నానము జేయించి చల్లగా ఉదక మండలము చేయవలయు ననువారేమి? ఇట్లనేక విధముల బోగమునకువచ్చు రాశి యధికమగును. కావున నీప్రయోజనములలో జనులకు నీటియెడ విక్షేపసంక్షేపంబుల కాశ్రయంబైన యభిమతం బున్నదనుట నిశ్చయంబు.

కావున మొత్తముమీద బహుప్రయోజనానుకూలములైన వస్తువులు క్రిందుమీదులుగల గిరాకికిం బదిలమైన స్థానములు. ఏలన గిరాకి యొకదిక్కున పెఱుగుట విఱుగుట లేక స్థిరతగాంచినను తక్కినదిక్కుల ముందు వెన్కల బోవునదిగా నుండవచ్చును. ఏక కాలంబుననే యన్నిఫలంబుల యెడలను నిర్వికల్ప జడత్వంబును వహించుననుట సంభావింపబోలిన యూహయైనను సామాన్యముగ సంభవించునదిగాదు.