Jump to content

భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఎనిమిదవ ప్రకరణము

కాలప్రభావము

పైన వివరించిన సంయోగములన్నియు కృతయుగములోని మానసపుత్రులవలె తత్క్షణమాత్రమున బుట్టునవికావు. వీనికి గాలము గావలసియున్నది. ఎట్లన గిరాకి హెచ్చినదే వెలలు జాగులేక హెచ్చవు. ఈ గిరాకి హెచ్చుటకతన గొన్నిసరకులు వేగిరమున సెలవగుటచే నమ్మువారికి మర్మము తెలిసి వెలలు పైకి దెత్తురు. వస్తువులు స్నిగ్ధములైనను నట్లే గిరాకియొక్క పోడిమి హెచ్చుటకు కాలము పట్టును.

ఒక్క కాలముపట్టుటయకాదు. ఈ కాలము తుదముట్టులోన నితరములైన మాఱుపాటలేవైనను సంభవించి గిరాకిని ధరలను గ్రొత్తత్రోవల నీడ్చుకొనిపోయినను బోవచ్చును. భారత అర్థశాస్త్రమున నిరూపింపబడిన యావన్న్యాయంబులకును కాలంబు బాధాకరంబు, ఎట్లన:-

1. హేతువునుండి కార్యము జనించుటకు కొంచెమో ఘనమో కాలమావశ్యకము

2. ఈ కాలము పూర్తిగ నబ్బులోన నితర హేతువు లుద్భవిల్లి సమ్మేళనముజెంది ఫలసంకరము సంభవింపజేయును. సంఘములోని సమస్తప్రవర్తనలును అనేక హేతువుల కుద్భవించిన సంకరంబులనుట ప్రధానతరమైన తత్త్వము:- జాతిభేదములంగూర్చి విచారింతము. వీనికి నాధారకారణమెయ్యది? పౌరాణికులలెక్క యెల్లి శెట్టిలెక్కకు దోడుపోయినది. అన్నిప్రశ్నలకు నొకయుత్తరమే! ఏమి? బ్రహ్మ సృష్టియని, సంఘశాస్త్రజ్ఞుల మతమింత సులభముగాదు. వృత్తిభేదములు, అరాజకము, యానదారిద్ర్యము, విద్యాగంధవిహీనత, రాజులయు బూజారులయు గ్రౌర్యములు, నిరుత్సాహత, అభ్యాసము వలన గలుగు మందిమగుణము, ఇత్యాదులనేకములు పిఱిగిని జాతి బంధముల నేర్పఱచినవని యాధునికుల యభిప్రాయము. మిశ్రత యేమాత్రమునులేక శుద్ధముగనుండు కారణకార్యంబులు సంఘ సంప్రదాయములలో మృగ్యంబులు.

కాలమాహాత్మ్యము విశదీకరించు నంశంబు లెవ్వియనిన:-

1. గుఱ్ఱములు గుఱ్ఱపుబండ్లును మునుపటికన్న నిపుడు వెల పొడుగుగానున్నను గిరాకి తగ్గినదా? మనన్యాయం బబాధితంబై యున్న తగ్గియుండును. వీనివెల హెచ్చుసరికి చెన్నపురిలో ధన సంపదయు విలసిల్లినందున గిరాకి లాఘవంబులేదు. కావున హేతువు సిద్ధినొందుటకు వలసిన కాలములోన నైశ్వర్యాభివృద్ధియు నైనయెడల కార్యంబు కలుగదు. ఇదియొక వ్యతిరేక కారణము.

2. దేశములో రాజశాసన సిద్ధములై పరగునాణెములును దక్కినవస్తువులబోలె రాశికొలది మూల్యభేదముం గాంచును. ఉదా. రూపాయలు పదియేండ్లక్రిందట మిక్కిలియు వ్రాలినవిగా నుండినందున సవరనువెల 18 రూపాయలకన్న నెక్కువకు బోయెను. ఇపుడు రూపాయలరాశి తగ్గినందున వానివిలువ మఱల హెచ్చినది. సవరనుల 15 రూపాయలకు గొనవచ్చుననుటయ దీనికి దార్కాణ. ఈ విషయముయొక్క యతిదేశ మేమనగా:-

వస్తువుల మూల్యము ఘనతరమగు నవసరంబున, నాణెముల మూల్యము సన్నబడునేని, ధనము ఎక్కువ పట్టినను ఇచ్చుటలో నష్టములేదు. అట్లయిన గిరాకి తఱుగనేరదు.

3. ఒకవస్తువు ప్రియమాయెనని దానివెలల నెగబెట్ట నుత్పాదకు లుద్యుక్తులై యున్నతఱిని ఆ ప్రయోజనమును సమకూర్చు వేఱొకవస్తువు కనిపెట్టబడెనేని వెలలు హెచ్చించుట బుద్ధిలేనిపని. ఏలన, జనులీ నూతనవస్తువునె వరింతురు. 4. అలంకారవస్తువుల నొకవిశేషము. సర్వసామాన్యముగా నందఱు దొడుగునదియాయెనేని యది గొప్పగానున్నను నట్లెన్నబడదు. అసాధారణత మన్ననకు జన్మహేతువు. ఉదా. సొగసు జుక్కల చీరను యజమానురాలు ధరించి కులుకుచుండుటజూచి యిరుగు పొరుగింటి భాగ్యశాలినులు ఆతీరు చీరలె దాల్చిరేని "ఇది సామాన్యమాయెను. ఇందులో గుణములేదు" అని మొదటియమ్మ చింతించును. ఆ చీర యింకను వ్యాప్తికివచ్చి పనికత్తెలచేత సయితము ధరింపబడునదియైన దాని గౌరవము తుట్రాగా నశించును గొప్పయిండ్ల యాడంగులు దానిని దూరముగ బాఱవైతురు. సొగసుల గతి యెన్నడు నింతే. మిక్కిలి వ్యాప్తమయిన దళుకుమాసినవగును. కావున గిరాకి హెచ్చుచుబోయి తటాలున మాయజెందును.

5. ఆవశ్యకములసైతము రాశితగ్గినదే వెలహెచ్చుట యప్రకృతము. ఎట్లన, అమ్మకమునకువచ్చు వస్త్రములు కొఱతవడినచో వెలహెచ్చుననుట దెలిసి యనేకులు ప్రాతబట్టలను త్వరలో విసర్జింపకయు, వివాహాదుల సెలవు మట్టుసేసియు మితముగగొందురు. గిరాకి మితమగును. వెలలు పూర్ణవృద్ధికిరావు. కొంతకాలమైనపిదప ప్రాతపేలిక లెందునకుం బనికిరానివై నూతన పరిధానము లందీయుట యనివార్య కార్యమైన వెల లింకను విరివిగాంచు.

ఆర్థికన్యాయముల స్వభావము

ఈ యుపాధులున్నందున గిరాకి, ధరలు, రాశి. వీనికింగల పరస్పరసామ్యము రద్దుచేయబడియెనని యనుకొనబోయెదరు. వేడివేడినీళ్ళలో చల్లనీళ్ళుపోసిన శీతోష్ణములు మిశ్రములై దానికిని దీనికిని మధ్యగతియైన వెచ్చనగానేర్పడును. వేడియు చావలేదు. శీతమును జావలేదు. రెండును మిళితములై ఫలమైన గోర్వెచ్చన యందంతర్భావము సెందినవి. అట్లే సర్వన్యాయములును వాని బాధించు నితరన్యాయములును. ఇవి యితరేతరచ్ఛేదనక్రియకు పూను నవిగావు. మఱి కలసిమెలసి రూపుమాఱి తజ్జనితఫలంబున గుప్తంబులై యుండును. అనేక కారణములచే నొకకార్య మేర్పడియె ననుటకు నిజమైన యర్థమేమనగా, ప్రతికారణముయొక్కయు ఫలములు మిళితములైనవియనియు, ఈ మిశ్రఫలము ఏకఫలమట్లు తోచుననియు ననుట. కాలముచే నితరన్యాయంబులును, ఇతరన్యాయములచే కాలసంజనిత విభేదంబులును మాఱ్పులజెంది సమాగతంబులగును. ఇయ్యది యెట్లున్నదనగా గంగాయమునల సాంగత్యమట్లు. యమునవచ్చి పైబడకయున్న గంగ యింకను దక్షిణముగ బాఱియుండునేమో. గంగ యమున కడ్డముగాకున్న నది నేరు తూర్పుగ బోయి యుండును. వీనియొరయికచే రెంటికిని సామాన్యమగు నూతనమార్గ మొకటి యేర్పడినది. కావున రెండింటి ప్రతాపములు నేకీభవించి యింకొక జాడచెందినవనుట యొప్పు. ఇట్లే ఏడును రెండుతోగుణించిన బదునాల్గగును. ఈ పదునాల్గు ఏడుచేతవచ్చినదిగాదు. రెండుచేత వచ్చినదియుగాదు. వాని సంగతిచే వచ్చినది. నూతనసృష్టమైన పదునాల్గులో ఏడును రెండును బొత్తిగా నశింపక రూపభేదములందాల్చి ప్రవర్తించెడిని. ఆర్థిక న్యాయ సంయోగ తత్త్వం బివ్విధంబని యెఱుంగునది.

ఆర్థికన్యాయంబు లమోఘంబులని కొందఱనిరి. రామబాణము వలె దప్పక గురిదాకుననవి కావనుమాటనిజమే. ఎట్లన, వ్యతిరేక న్యాయములచే నిరుద్ధములు గావచ్చును. రాశితగ్గినను కొన్ని సమయముల వెలలును దగ్గవచ్చును. ఇట్లవక్రవిక్రమములు గాకపోయినను ఱిత్తవోవునవి యని భావించుట తప్పు. ఏలయన, తమకు నడ్డమువచ్చు వానికి దామును అడ్డముగానుండు గావున నీవిరోధము పరస్పర కార్యము. నూతనముగ నేర్పడు మార్గమున నిరుదిక్కుల న్యాయములయుం బ్రభావములు లీనమైయుండు. "ఈ న్యాయ మీరీతి వర్తించును. ఈ హేతువున కీఫలము సిద్ధము" అను వచనమందెల్ల రెండుసమయములు. ఎవ్వియన, "ఈ స్థితిగతు లీరీతినే నిర్వికారముగ జరుగుచున్న" వని యొకటి; "వికల్పం బాపాదించు కారణములు తుదముట్టుదాక బుట్టకయున్న" వనుట రెండు.

సర్వకార్య కారణములును బరస్పర సమ్మేళనముగలిగి మిశ్రమైయున్నను విషయము సుబోధమగుటకై వానిని వేఱుపఱచి చూపుట సర్వసమ్మతము. లోకములో నేసంకరమునులేక ప్రవర్తించు న్యాయములు కారణములు ఫలములునులేవు. అయినను నీచిక్కును విడదీసి పోగుపోగుగాబెట్టకున్న తుద మొదలేర్పడక పోవునుగాన నట్లు చేయుట కర్తవ్యము. పుస్తకములలో నివి విడదీయబడియుండుటచే సాక్షాత్తుగ ప్రపంచ ప్రచారములయందును విడబడియున్నవని యెంచబోకుడు; లోకమం దన్నిన్యాయములును పెద్దముడిగా జేరియున్నవి. ఆముడి యింతగట్టియని చెప్పనలవిగాదు. వ్యవహారముల నట్లున్నను విద్యావైశద్యార్థము చిక్కులేక ప్రక్కప్రక్కన నుండువానింబోలె వానిం గణింతుము.

ఇందుచే నొకగొప్ప జాగ్రత స్ఫురించెడు. ఏమన పుస్తకములో నున్నంత విశదముగ నంశములు లోకములో నుండవు గాన లౌకిక జ్ఞానమునకు బుస్తకపారాయణముకన్న ననుభవము ముఖ్యము. భారత అర్థశాస్త్రపండితు లందఱును వ్యాపారపారీణులౌదురనుట గేలిమాట. పారాయణమునకు ప్రవర్తమునకును జాల వ్యత్యాస మున్నదనుట వేదాంతులు బలసియుండుచోట్లలో విస్పష్టమేకదా ! కావుననే గ్రంధాదినే యియ్యడి యుపదేశ శాస్త్రంబుగాదని విన్నవించితి. అట్లైన నిది వ్యర్థశాస్త్రము గదాయని సంకోచింతురేమో, యదియును దగని యభిప్రాయము. ఇది మోడు తెఱంగుల నుపయోగకరము.

1. శాస్త్రము ఇతరచింతలు లాభములు నాసింపకయె సేవింపదగినది. జ్ఞానికి జ్ఞానమే బహుమానము. ఆచరణ కౌశల్యము లేకున్న వానికేమితక్కువ? తనతన యుద్దేశముల నెరవేర్చుటయే కృతకృత్యత. ఆర్థికన్యాయంబుల ప్రచురపఱుచుచు నీయర్థశాస్త్రంబును గృతకృత్యమే. మీరందఱును గుబేరలోకమునకు బోవ సోపానము లేర్పఱుచుట దీని యుద్యమముగాదు.

2. శాస్త్రన్యాయములు నేరుగ ఫలవ్రసాదకములు గాకపోయినను, వ్యాపారదక్షు లయ్యవి యెఱింగి యుచితగతి నుపయోగమునకుం దెచ్చువారైరేని వారి కఖండలాభావహంబు లగును. కన్నుమూసికొని పోవువారికన్న దెఱచికొని పోవువారు శ్రేష్ఠులనుట పరమ రహస్యమా?

3. వ్యవహారము లియ్యైతెఱంగుల బోవుననుట ఖండితముగ జెప్పజాలము. అయినను శాస్త్రజ్ఞానముచే నవిపోవు జాడలను సూచనగా దెలిసికోజాలుదుము. ఇది యల్పమైన సిద్ధిగాదు.

మఱియు సంఘములయొక్క ధర్మములు సంగములు మొదలైనవానిని నిర్మించి పరిణమింపజేసిన హేతువులలో నార్థికస్థితిగతులు ప్రథమగణ్యములుగావున నీశాస్త్రము పఠించుటచే సంఘోత్కృష్టతా సమయములు గొంతకు గొంతయైన గోచరము లగును. ఇయ్యది సంఘశాస్త్రంబు గాదుకాని దానితో బరమ మైత్రింజెంది యభేద్య సంయోగము గలది. మనుష్యసంఘములను బరిశీలించుటకన్న మేలైన విద్య లెవ్వియును లేవు.