భారత అర్థశాస్త్రము/అంకితము
అంకితము
ఆత్మగతము
క. అస్మత్ప్రియసఖి-
సస్మేర ముఖేందు బింబ సమ్యగ్తేజో
భస్మిత శోకాంధ తమస,
విస్మయ గుణధామ, మనసు వెడలునె యెపుడున్ ?
సీ. తనకీర్తి భూనభోంతరముల విరసించి
చిఱునవ్వులై తన్నె చేరికొలువ
దన భావనాప్రభల్ ఘనవీధిగర్జించి
కలికిచూడ్కులమెఱుంగులుగ బర్వ
దన మనోహరతచంద్రజ్యోత్ప్నలకుబోక
నడకలసొగసులో నడగియాడ
దన మార్దవము చిగుళ్ళను బువ్వులనుద్రోచి
పలుకులతీపిలో గలసిమెలయ
నాత్మదేహమ్మునకు దేహమాత్మ కమరి
నట్లు, సుగుణము లతవార మందినట్లు
భాసురాకార సుందరవర్తనముల
గనుల మనసును జొక్కించు కాంత దలతు.
గీ. నిండు హృదయంబుతో మహోద్దండ వృత్తి
గాంక్ష వేసిన యది పండు గాక పోయె ;
గాల మాశను ద్రుంచె : నింకం ద్వరసు ని
రాశ కాలంబు ద్రుంచిన, నదియ సుఖము.
గీ. కనులు మూయునంత గలలును, గలలలో
భవ దుదార మూర్తివచ్చి నిలుచు ;
గనులు దీర్ఘ నిద్ర గప్పంగ బడిన ని
న్ననవరతము జూడ నౌనె చెపుమ.
శా. పోయెన్ గాలము; ప్రాయమున్ గడిచె; నింపుం బెంపులున్ ద్రుంగె; మి
థ్యాయత్నంబులెకాని మన్మనమునం దత్యంతమౌ మక్కువన్
బాయంజాలక నిల్పియున్న తమ సాఫల్యత్వముం జెందలే,
దాయుర్వృద్ధి యికేల నాకు జనరాదావేగ నాప్రాణమా.
శా. బావా : నిన్నుదలంచి సంతతమునే సంతాపముం జెంది, మ
త్ప్రాణంబైన నొసంగి నీకు శుభముల్ భద్రంబువేకూర్చి, నా
నా నవ్యోరు విలాస సంచయములన్ రాగంబునందేల్ప నెం
తో నాకుండెను; కాలసంఘటన మయ్యో:యిట్టు లాయెంగదే.
చ. ఇకనొక జన్మమందయిన నీశ్వరు సత్కృపచే భవద్గులు
ప్రకటసమాన భాసుర శుభంబు బదంబును జెందుదమ్మ: నీ
యకుటిలవృత్తికిం దగిన యార్యులు మిత్రులు బంధులౌదు, రీ
సకలముమెచ్చ శాశ్వత యశస్సు ధరింతు వటంచు గోరెదన్.
క. మృదుమధుర పదఫలాస్పద
సదారుణ నవసుమ వాక్ప్రశస్తను, దర శా
రద చంద్రికా సమాన వి
శద దరహా సామలార్యచరిత మఱతునే.
గీ. నేత్ర మర విప్ప జేయు స్వమిత్రుసహజ
చేష్టితమునకు గోపంబు సిగ్గు వగపు
బెరయ, సౌరభోచ్చ్వాసంబు నరుణముఖము
మంచు కన్నీళ్ళునై తలవంచి నిలుచు
కమల మొకటియ నీదు ముగ్ధతకుసాటి.
గీ. మెఱుగుదీగెల సరిగెల మెఱయుమొగిలు
చీర యొడలుగప్పగ గురుల్ జీరువార
ఘననినాదముల్ కంకణ క్వాణములుగ
నలరియాకాశలక్ష్మి నీళ్ళాడుఋతువ
నీవివిధ విలాసంబుల నెఱపనేర్చు.
సీ. కల్లోలమాలికా కరములవీచుచు
నెలుగెత్తి పిలిచెదు జమధినుండి
నిండారనెఱపిన పండువెన్నెలడాగి
నవ్వుదునాతోడ నభమునుండి
గుసగుసల్ వోవుదు కోర్కిమై సురభి శీ
తలమంద మారుతావళులనుండి
తేనెల దావుల జానగుబువుల హి
మాశ్రులుర్లగ జూచె దవనినుండి
ఛటఛటారవరాజి ప్రస్ఫుటముగాగ
ననుచితము సేయ గోపింతు వగ్నినుండి
సకలభూత మయాకార సారమహిమ
నీవు లేకయు నాకు నున్నావెపుడును.