Jump to content

భారత అర్థశాస్త్రము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

ఈ గ్రంథములోని విశేషములు మూడు.

మొదటిది:-

ఈ శాస్త్రమంతయు హిందూదేశమునకుం జేరిన విషయములతో నెక్కువ సంబంధము గలిగియుంట. ప్రకృతము మన విద్యాశాలలలో వాడబడు నర్థశాస్త్ర పుస్తకము లనేకములు విదేశవర్తమానములనే సూచించునవిగా నుండబట్టి మనవారికి ఐరోపా అమెరికా మొదలగు దేశములంగూర్చి తెలిసినంత తమ దేశముంగూర్చి తెలియకుండుట యెంతయు జింతనీయము మాత్రమేకాదు ఉత్పాతకరమును. ఎట్లన పాశ్చాత్త్యులసీమలలో మేలని ప్రసిద్ధికెక్కిన న్యాయములు రాజ్యతంత్రములు ఇత్యాదులు మనకును బనికివచ్చునని విచారణచేయక యభ్రమబొందుదురుగాన ---

            "................................తెలిసియు
             దెలియని నరుఁదెల్ప బ్రహ్మదేవుని వశమే"

అన్నట్లు ఈ స్వల్పజ్ఞానులకు గర్వ మెంతయని చెప్పవచ్చును ? పోనిండు ! ఒక గర్వముమాత్రముతో బోయిన మనకేమి కొదవ ? వీరు వలదన్నను రాజకార్యములలో మంత్రాలోచన నిచ్చువారై దేశమునకు గీడు దేరేని అదియే మహాభాగ్యంబు ! చూడుడు. నిమ్మపండువంటి దేహచ్ఛాయగల యొక స్త్రీ తన కనుగుణమైన రంగుగల యొక వలువ ధరించి యెంతయు రమణీయముగ గాన్పించిన నది కారణముగ నేరేడుపండును ధిక్కరించు మైఛాయగలవనితయు నట్టి చీరయే తనకును గావలయునని మూర్ఖతకుం జొచ్చి దాని ధరించిన నది యాకారమునకు మేలమా ? వికారమునకు మూలమా ? యోజింపుడు. నిజమైన సాదృశ్యము లేదేని సమప్రవర్తన తగవుగాదు. కావున :రెండవది:-

పాశ్చాత్త్యులకు మనకునుగల తారతమ్యము విశదీకరించుట యనివార్యకృత్యమాయెను. మఱియు శాస్త్రము యూరోపియనులే కృషిచేసిన దగుటను, అందలి న్యాయములు ముఖ్యముగా వారికే చెల్లునవిగను మనయందు నిర్భాధములుగాకయు నుంటబట్టియు, వ్యతిరేకముల నిర్ణయించుట మొదలగు శాస్త్రక్రియల నెరవేర్చుటకు సయితము ఈద్వివిధ నాగరికతలం బోల్చి చూచుట యవశ్యకార్యము.

మాడవది:-

మనస్సు, సంఘము, తత్త్వము, మతము, అర్థము, చరిత్రము, ధర్మము, నీతి, రాజ్యపాలనము, వీనిని విచారించు శాస్త్రము లన్నియు నొండొంటితో బెనగొని యుండునవిగాని భిన్నంబులుగావు. మఱి మనుష్యమహాశాస్త్రమునకు నంగప్రాయములు, అంగములకు ప్రత్యేక జీవనముండునా ? కన్ను, ముక్కు, మొగమును దేహముతో గూడి యున్నంగాని స్వస్వానుగుణగుణ కృత్యంబులతోడ సమన్వయింప జాలవు. దేహపరిశీలన మేమాత్రము జేయక నేత్రస్వభావమును గనుగొనవలయునన్న నసాధ్యముగాదా ? ఇక దేహపరిశీలన మన్ననేమి ? సర్వాంగ సముదయ పరిశీలనమేకదా ! కావున నేదైన నొక యంగము యొక్క తత్త్వము నిరూపింపజూచినను, దానికి తదిత రాంగములతో గల సంబంధముల గమనించినంగాని కాదు. ఈ యుపమానముచే పరిస్ఫుటమైన సంగతి యేదనగా ;_

అర్థశాస్త్రము అంగమువంటిదగుట సంఘమానసాది శాస్త్రములతో గలసినట్లు వివరించినంగాని దాని లక్షణములు సంపూర్ణ స్పష్టంబులు గావు.

అయిన నొకకష్టము. ఒక్కశాస్త్రమునే సాధింపవలయునన్న నొకజన్మము చాలకయుండగా, ఎనిమిదితొమ్మిది శాస్త్రములం దారి తేరినగాని యాసముదాయమందలి యేశాస్త్రముయొక్కయు స్వరూపము గోచరింపదన్న, నంతటి తపశ్శక్తి యీ యల్పాయుష్కులగు కలికాలజనంబులకు సంపాదింప సాధ్యమా ? దీనికి సమాధానము:-

వైద్యులలో కంటివైద్యమునం బ్రగల్భులైనవా రున్నారు గారా ? వీరు దేహము నంతయు నెఱింగి తచ్చికిత్సయందుం గుశలులైయును నేత్రసంస్కారమునం దంత్యంత పరిశ్రమచేసి యందు నిరర్గళ సామర్థ్యులై పారంగతులోయనునట్లు కీర్తిం గడించినవారగుట నేత్రవైద్యులని బిరుదు వహించిరిగాని, నేత్రవైద్యు లన్నంతమాత్రమున నేత్రములందప్ప నింకెవ్వియు నెఱుంగని వారనుట కేవలము తప్పు. అట్లే మనుష్య మహాశాస్త్రములంగూర్చియు, కాలము, బుద్ధిబలము, అభ్యాసశక్తి, యివి మితములుగాన మనుష్యశాస్త్రసమితి యందెల్ల సమానమును, అసమానమునుఅగు పాండితిని సంపాదించుట యమానుష సాధ్యంబు. అయినను అన్నిటియందును ముఖ్యాంశములనైన గొంత వఱకు నెఱుంగమేని ఏభాగమునందును సిద్ధివడయుట దుస్తరము.

ఈ ముఖ్యాంశముల నైరోపాలోని విద్యార్థి బాహుళ్య మించు మించెఱింగియే యుండునుగాన వానిని ప్రతిగ్రంధమునందును జేర్ప నచ్చటివారి కనావశ్యకమును అసంభావ్యమును, మనలో నట్లు చేర్చ కునికి యుక్తముగాదని నాయభిప్రాయము. ఏలన, మనవారికి మనుజులయు, మనుజుల సంఘంబనబడు జాత్యాదులయు, లక్షణములు, గుణములు, చర్యలు, వీనింగూర్చిన శాస్త్రములు పరస్పర భిన్నములు గావనుట కలలోనైనప్రత్యక్షముగాని గుప్తవస్తువు. కావున నిచ్చట నీశాస్త్రముల యైక్యముంజూపు ప్రశంసలను లుప్తము చేయగాదు. మఱి చేయరాదును. ఎందులకన్న ఈ యజ్ఞాన మనేకానర్థములకు హేతువు. దేశభక్తి లేక మూఢభక్తియుండుట, వర్ణాది దురాచారములు, మొదలైన కాలసర్పములం బోలిన నపకార హేతువులకు బుట్టవంటిది. మతములు, ధర్మములు, దేవదత్తములనుట ఈ దేశములో దట్టముగ నిండియుండు మ్రోత ! అవన్నియు నుదరదత్తములే యనుట నివేదింపదగిన యాధునిక సిద్ధాంతములలో నొకటి. అట్లగుట నియ్యది యనర్థశాస్త్రంబుగా, గొందఱికిం దోచుగాబోలు.

నేను చారిత్రము, తత్త్వశాస్త్రము, ఈరెంటియందు గొంతకు గొంత శిక్షనంది యున్నాడను. చారిత్రమునకు సంబంధించినవి :- దేశచరిత్రములు, రాజ్యాంగ నిర్మాణము, రాజనీతి, అర్థశాస్త్రము ఇత్యాదులు. తత్త్వమునకుం జేరినయవి :- తర్కము (లాజిక్), నీతి, మనశ్శాస్త్రము, సంఘశాస్త్రము, సదసద్విచారము ఇత్యాదులు. వీనియందెక్కువ నాకు దెలియదు. కాని సామాన్యములైన ముఖ్యాంశముల నిసుమంతనేర్చితి. కావుననే ప్రకృతము మనుష్య సంబంధి శాస్త్రముల యన్యోన్యత సూచనగా దెలుప నుద్యమించి యుండుట. ఆ యుద్యమము కొనసాగెనో లేదో నిర్ణయించు భారము మీయది. ఆమూలాగ్రంబుగ వ్యాఖ్యానంబొనరింప జాలితినను నహంభావము గొన్నవాడగానని నా విన్నపము. సంఘ మనశ్శాస్త్రాది తత్త్వంబుల వాసన యేమాత్రమును లేనివాడు చరిత్ర శాస్త్రములను సయితము చక్కగా గ్రహింపజాలదనుట నిక్కువము.

ఏదైన నొకభాగము నెఱుంగంగోరిన నయ్యది వేనియందు జేరియున్నదో వానిని గూర్చియు విచారణ శుద్ధముగ జేయకుండుటకు గాదు. అయినను అన్నింటియందును సంపూర్ణజ్ఞానము వడయజూచుట పిచ్చితలంపు గావున శాస్త్రములు స్వభావమున భిన్నములు గాక యున్నను భిన్నములనిభావించి కొన్నిటిలో సాధారణమైన జ్ఞానమును, మనకు నభిరుచిగల యొక్కటి రెంటి నగాధమైన ప్రజ్ఞయు గడింప నెత్నించుట కర్తవ్యము. శాస్త్రములు ప్రత్యేకములు చేయబడుటకు మనుష్యుల యల్పకాల జీవిత్వమును, బలహీనతయును గారణములు. సర్వశక్తి సమేతులమైయున్న మనమందఱము సర్వజ్ఞులైన భగవంతుల మైయేయుందుము. అప్పుడు సామాన్యజ్ఞానము, సర్వజ్ఞానము అను భేదమే లేకపోవును. కాబట్టి మనుష్య శాస్త్రములు మనసౌలభ్యమునకై స్వరూపమున ప్రత్యేకితములుగాని స్వభావముచే ప్రత్యేకితములు గావనుట గ్రాహ్యంబు. వస్తుభేదములేదు. మూర్తిభేదమును మాత్రము కల్పించుకొంటిమి.

ఈ యైక్యమును శక్తికొలది బ్రకటించియున్నాను. సమగ్రముగ బ్రకటింపలేదనుట నేనెయెఱుంగుదు. ఈ చిల్లర బల్లర బేరము మాకెందున కందురేమో ! ఏమో ఈ విషయములో నిదివఱకు బ్రవేశము లేనివారికది కొంతమాత్రమైన నబ్బెనేని, ఇకముందు వ్రాయు శాస్త్రకారులు దీని నాధారముగాగొని రెండువిధముల మనకు మేలుసేతురను నాస గొనియున్నాడ. ఏమన ఒకటి ఈశాస్త్రములయొక్క సమన్వయము నిఖిల నిదర్శన వ్యాఖ్యానములతోజూపి అప్రతిహతముగ బ్రకటించుట. రెండవది ఎట్లును సామాన్యాంశముల గొంతవఱకును మన చదువరు లెఱిగియున్నారని యీ విషయము పొంతబోక ఐరోపాలోని సిద్ధాంతులట్లు తమతమ ప్రత్యేకశాస్త్రముల యందే శ్రద్ధగొని సమగ్రకృషిచేయుట. మద్విరచితంబగు నీశాస్త్రంబు మనకు నూతనముగాన తదితర శాస్త్రంబులతోడి పొత్తుగలపకున్న నర్థము తేటతెల్లంబుగాదు. ఇయ్యది యిమ్మహాతత్త్వ మండలిలో బాలబోధవంటిదిగాని ప్రౌడగ్రంధంబుగాదు.

ఈ శాస్త్రమును సంఘాదిశాస్త్ర సంబంధిగా విమర్శించుటలో మార్గదర్శకులును గురుప్రాయులు నైనవారు "జాన్ స్టూవర్టు మిల్లు" అను కీర్తిశేషులైన మహనీయ విద్వాంసులు. ఇంత చాలును. ఇక నేను జదివిన గ్రంథముల తత్కర్తల నామముల నన్నింటినిట పొందింప నేల ? అవియొక యర్ధముగాని యుపనిషత్తులుగా మనవారి చెవులలో శబ్దించుగదా ! అందును నీగ్రంథము ముఖ్యముగా నింగ్లీషురానివారి కొఱకు వ్రాయబడినది. నోటికి నందని చెవికి దాకని పేరులం బ్రయోగించి వారిని భయపఱచుటకు నాకిష్టములేదు. ఇంగ్లీషు తెలియనివారికిని లఘువుగ గ్రాహ్యమగునట్లు నాచే నైనంతచేసితి. ఇంకను దుర్గమములగు ప్రదేశములున్న నికముందు తరుణమబ్బెనేని వానిని చదరముసేయుటకు విధేయుడనై యున్నాడను.

ఈ పుస్తకములోని పటములు గణితశాస్త్రానుసారముగ దీర్ప బడినవికావు. శాస్త్రసమ్మతములు సామాన్యజన వేద్యములు గాకుండునను శంకంజేసియు, నాయొక్క రచితములు అశాస్త్రీయములైనను విషయవైశద్యమునకు ననుకూలములని నాకుం దోచినందునను, వాని నిట బొందింప నుత్సహింతినేకాని, సాహసము సర్వవిధముల మంచిదనికాదు.

ఈ కృతిని రచింపవలయునను ఉద్దేశమాత్ర మున్నకాలములో మనుస్మృతి, కామందకి, చాణక్యార్ధశాస్త్రము, విజ్ఞానేశ్వరీయము మున్నగు గ్రంథముల జదివితిగాని వానివలన నాకుగలిగిన లాభ మత్యల్పము. అయినను భాషావైదశ్యమును పరిభాషాసూచక సందర్భములును లభించకపోలేదు గాన వానికై వినియోగింపబడిన శ్రమ మొత్తముమీద సార్థకమే.

మన ధర్మశాస్త్రములలో ధర్మ మెంత సున్నయో యర్థశాస్త్రములలో నర్థతత్త్వ విచారణ యంత సున్నయనిన పాపమెవరికిని రాబోదు ! అయిన నర్థతత్త్వ విచారణ లేకున్నను, పూర్వకాలమున హిందూదేశమున ప్రబలియుండిన వర్తకములు, శిల్పములు, వ్యావహారిక శాసనములు, రాజులు ప్రజలనోరుగొట్టి ద్రవ్యముల దోచుకొను పద్ధతులు, వీనిం గూర్చిన యుపన్యాసము లెన్నియోకలవు. గాన నవి మనవారు తప్పక చదువదగినవి. ఇకముందు ప్రచురింపబడు సంపుటములలో నీసంగతు లనేకములు వొందింతునని తోచెడిని. ఈ గ్రంథ మెన్ని సంపుటములలో నెన్నడు ముగియనున్నదో యీశ్వరునికే యెఱుక ! విషయ మెన్నివిధముల బెఱుగునో యన్నివిధముల దుదదాకు వఱకును విచారమును బోనిచ్చుట నామతము. కావున నేనెంత వ్రాయుదునో యేమివ్రాయుదునో ముందుగా దెల్పుమన్న మూగవేసము దాల్పవలసినదే. ఇట్లగుట మీయొక్క క్షమాపణ మిక్కిలి విథేయతమై నాశించువాడ. వేడువాడ. నమ్మి నిరీక్షించువాడ.

ఈ గ్రంథరచనకు నన్నుం బ్రేరేపించుతయకాదు నిర్బంధముం గూడ జేసినవారగుట విజ్ఞానచంద్రికామండలీ కార్యనిర్వాహకులు నాకు నెంతయు మాననీయులు.

         ఉ. శ్రీమ దనంత కృష్ణులు, విశేషగుణాఢ్యులు, సంస్కృతాంధ్ర భా
            షామహనీయ విద్యల విశారద భావులు నాకు దోడు గా
            బ్రేమయు గారవంబుమెయి పెక్కువిధంబుల నిల్చి సేయ నే
            నోమితి గాక లేని యెడ నోర్వగ నేర్తునె కార్య భారమున్.

విజ్ఞానచంద్రికా మండలివారి ప్రోత్సాహముచే నీ గ్రంధము జననమంది దీర్ఘాయురారోగ్యములం గోరి ఆంధ్రమహాజనుల కరుణ సుధారసదృష్టి నాశ్రయించుచున్నది.

ఇట్లు
విధేయుడు,
కట్టమంచి - రామలింగారెడ్డి.

శ్రీ మహారాజుగారి కాలేజి. మైసూరు.

1913 వ సం. జనవరి