Jump to content

భారతీయ నాగరికతా విస్తరణము/ఆదర్శములు

వికీసోర్స్ నుండి

భారతీయ నాగరికతా విస్తరణము.

1. ఆదర్శములు.

అతి ప్రాచీనకాలమునుండియు భారతదేశము నేటివలెనే యితర జాతులతోడను, దేశములతోడను, సంపర్కమేమియు లేక నేకాంత జీవితమును గడుపుచుండెనను నభిప్రాయము మన దేశీయులలో బలముగ నాటుకొనియున్నది. ఉత్తరమున హిమాలయములు నితరదిశల సముద్రము నీదేశమును బాహ్యసంపర్కమునుండి మూసివేయ, ప్రాచీన భారతీయులు వర్ణవిభేదములను గల్పించుకొని, పూర్వాచార పరాయణులై, కూపస్థ మండూకములవలె గాలక్షేపము చేయుచుండిరను నభిప్రాయము పూర్వచరిత్ర పఠనమువలన గలుగుచున్నది. కాని యిటీవల పరిశోధన లీయభిప్రాయము వాస్తవము కాదనియు, సత్యదూరమనియు నిరూపించుచున్నవి. ప్రాచీనార్యులకును నేటిక్రైస్తవ జాతులకును నడుమ నీదేశముపై దండెత్తివచ్చిన ప్రతి జాతికిని తమ స్వాతంత్ర్యమును గోల్పోవుచు, వారికి జోహారొనర్చుచు, కొంచె మవకాశము దొరికినపుడు కొలదికాలము తలయెత్తుచు, మొత్తముమీద భారతీయులు శతాబ్దములకాల మస్వతంత్ర జీవితమున కలవడిరను పూర్వాభిప్రాయము సరియైనదికాదు. అటులే భారతీయ నాగరికత భారతదేశపు సరిహద్దులను దాటలేదనియు, నేటి ఇంగ్లండు, ఫ్రాన్సు మున్నగు పాశ్చాత్యదేశీయులవలె భారతీయుల ప్రతిభ తమ దేశము నెన్నడును దాటిపోలేదనియు, నెంచుటయు ప్రమాదకరమే. ఇటీవల ఆశియాఖండమునందలి వివిధ భాగములలో గనుగొనబడిన చారి త్రక సామగ్రి భారతదేశచరిత్రమున కొక నూతనోత్తేజమును, శక్తిని గల్గించుచున్నది. దానినుండి ప్రాచీన భారతీయు లాశియా యూరోపు ఖండముల లోని విశేష భాగములపై నాధ్యాత్మిక దిగ్విజయ మొనర్చిరనియు, నేటి యింగ్లండు దేశమువలెనే భారతదేశము గూడ నొకప్పుడొక సువిశాల సామ్రాజ్యమున కధినేతయై, నాటి ప్రపంచమున కంతటికిని గూడ నాదర్శ భూమియై యొప్పుచుండె ననియు దెలియనగు చున్నది. తమదేశములను, తమ కుటుంబములను, విడిచి సుదూరదేశములకేగి యచటి కష్టనిష్టురముల కోర్చి యేకదీక్షతో క్రైస్తవమతప్రచార మొనర్చు పాదిరీలవలెనే యొకప్పుడు భారతీయులు వర్ణ వయో భేదములు లేక, సముద్రయానము నందలి ప్రమాదములను లెక్కచేయక, కేవలమును విశ్వమానవ కళ్యాణమునే కాంక్షించి, సుదూర దేశములకేగి భారతీయ విజ్ఞానమును వెదజల్లిరి. అంతవరకు నజ్ఞానాంధకారమున మునిగి యుండి యాథ్యాత్మిక ప్రవృత్తిలేక ననాగరికులుగ నుండిన జాతులవా రెందరో నాటి భారతీయ పండితుల యొక్కయు, బౌద్ధభిక్షువుల యొక్కయు, కవిగాయక శిల్ప్యాధికళారాధకుల యొక్కయు, స్వార్దరహితమగు సేవచే ప్రబుద్దులై స్వదేశీయసామగ్రిని భారత దేశాదర్శములను సమ్మేళనముచేసి విలక్షణమగు నాగరికతను నిర్మించుకొనిరి. అంతియగాక సాహస వంతులును, స్వాతంత్ర్యాభిలాషులునగు భారతవీరులెందరో మత రాజకీయాదివిప్లవము లొదవినప్పుడెల్ల మాతృదేశమును వీడి జావా, సుమత్రా, ఇండోచైనా, బర్మామున్నగుదూర దేశములకేగి, స్వభాహుబలముచే నచటివారిని జయించి, చక్కనిరాజ్యములను స్థాపించి, వానియందు తమతమ మాతృదేశములందలి నాగరికతను నెలకొల్పి పెంపొందించిరి. ప్రాచీన గ్రీసుదేశమునుండి యెందరో వలసపోయి, యీవిధముననే పెక్కు చిన్నచిన్న రాజ్యములను నెలకొల్పి గ్రీసుదేశనాగరికతను విస్తరింపజేసిరి. ఇటీవలికాలమున ఇంగ్లండు, ఫ్రాన్సు మున్నగుదేశములనుండియు ననేకు లపుడే నూతనముగ గనుగొనబడిన అమెరికా ఖండమున వలసరాష్ట్రములను నిర్మించిరి. కాని గ్రీసు ఇంగ్లండుదేశములవలె భారతదేశ మీవలస రాష్ట్రములతో తగవులాడి, దౌర్జన్యమునుజూపి, తుదకు వానిని గోల్పలేదు. అయ్యవి బయలువెడలిన నాటినుండి క్రీ. శ. 13 వ శతాబ్దప్రాంతామున అరబ్బులు, మున్నగు నితరజాతులవారికి వశమగు వరకునుగూడ నీవలసరాజ్యములతో, నత్యుత్తమమగు మైత్రినిపాటించి, యాదర్శప్రాయమై, భారతదేశ ముత్తమ మాతవలె నలరారుచుండెను. ఈదూరదేశములన్నిటియందునుగూడ భారతీయ నాగరికతాచిహ్నము లనేకములు నేటికిని గాంచనగుచున్నవి. నేటికిని కొన్నికొన్ని జాతులయొక్కయు, దేశములయొక్కయు సాంఘికజీవితమునందును, నాగరికతయందును భారతదేశ సంబంధము స్పష్టముగ గంపించుచున్నది.

భారతదేశముయొక్క యీయాధ్యాత్మిక దిగ్విజయమునకును, తత్పలితముయొక్క శాశ్వతత్వమునకునుగూడ ముఖ్యకారణములు ప్రాచీన భారతీయుల యాదర్శములే. క్రీ. పూ. 1500-500 నడుమ ప్రాచీన సామ్రాజ్యము లనేకములు ప్రబలినవి. వానికన్నిటికినిగూడ విదేశీయ నాగరీకతలతో ప్రత్యర్థిత్వము సంభవించినది. ఫినోషియనులు తాముజయించిన జాతుల యార్థికసంపదనెల్ల చూరగొని వారి ననాథులను జేసివేసిరి. అటుపై అస్సిరియనులు పశుబలముచే నెన్నియోతెగలను రూపుమాపి తమ సామ్రాజ్యమును స్థాపించిరి. ఈజిప్షనులును, రోమనులు నీమార్గమునే యవలంబించి ఖడ్గముతో తమనాగరికత నితరజాతులవారిలో వ్యాపింపజేసిరి. గ్రీసుదేశీయులుగూడ తాము జయించినజాతుల నాగరికతను నశింపజేసి వారందరును తమనాగరికతనే యవలంబి చుంట్లొనర్చిరి. ఇదేకాలమున భారతదేశమునందు ప్రాచీనార్యుల కితరజాతులతో సంబంధమేర్పడెను. కాని యీసందర్భమునం దార్యులు ప్రత్యర్దిజాతులను నిర్మూలింపజేయుటగాని, వారి నాగరికతను పూర్తిగ ద్వంసముజేయుటగాని, చేయక వారియెడ సామరస్యము నుపయోగించి, వారి నాగరికతయందలి యుత్తమాంశములనుగైకొని, తన్మూలమున దమసభ్యతనుగూడ మార్పుజేసికొని, క్రమక్రమముగ పైజాతులవారినెల్ల వశపరచుకొనిరి. ఈయార్యానార్య నాగరికతా సమ్మిశ్రవణమువలన నీరెండుజాతులవారికిని లక్ష్యైక్యతయు, దన్మూలమున శాంతియు సమకూడినవి. దానినుండి జాతినిర్మూలనముగాక జాత్యుద్దరణిమే ప్రాచీనభారతీయుల మొదటి యాదర్శమని స్పష్టమగుచున్నది.

పూర్వభారతీయుల యాద్యాత్మిక ప్రవృత్తిగూడ విశ్వాత్మకముగనే యుండినది. ఉపనిషత్తులు సంసారచక్రమున పరిభ్రమించు మానవకోటి కంతటికినిగూడ మోక్షమార్గము నుపదేశించుచున్నవి. అదే విధమున బౌద్దతత్వముగూడ సర్వమానవ కల్యాణము చేకూరు మార్గముల నెన్నిటినో యుపదేశించినది. ఈవిదమున ప్రాచీనభారతదేశము అహింస, తృష్ణారాహిత్యత, సాహార్దతయను సూత్రముల నుపపాదించి ప్రతివ్యక్తికిని శాశ్వతసుఖము నొనగూర్పదగియుండెను. దానినుండి ప్రాచీనభారతీయులు సర్వసంతరణమును మరియొక యాదర్శముగ నుంచుకొనిరని స్పష్టమగుచున్నది.

క్రీ. పూ. 5-3 శతాబ్దములలో విశ్వసామ్రాజ్య నిర్మాణకాంక్షచే రాజన్యులెందరో దుష్కృత్యముల ననేకముల జేసియుండిరి. స్వార్దపరులై కేవల పశుబలముతో పర్షియనులు నటుపిమ్మట యవనవీరుడగు నలెగ్జాండరును సువిశాలములగు సామ్రాజ్యములను నిర్మింప యత్నించి, నాటి మనుష్యకోటి నెన్నియోవిధముల పీడించిరి. కాని మానవ రుధిరార్దృములగు యుద్ధభూములలో హృదయదారకమగు నిర్వేదము నణంచి భారతభూమి యిదేసమయమున మరియొకసారి శాంతిసందేశము సుద్ఘోషించెను. కళింగ సంగరరంగమున "దర్మమను మహాస్త్రముచే మానవ హృదయములను జయించుటయే నిజమైన విజయము" అను సవిమర్శకమగు ప్రబోదమునంది యశ:కాయుడగు నశోకచక్రవర్తి "సర్వేమనుష్యామే ప్రజా:" అని యుద్ఘోపించి, జాతిమత వివక్షతలను పాటింపక మానవసంఘ మంతటికిని ధర్మోపదేశ మొనర్చెను. ఈచక్రవర్తి మహాసందేశము సిరియా, ఈజిప్టు, సైరినీ, మాసిడోనియా, ఎపిరస్, సింహళము, స్వర్ణభూమి మున్నగు దూరదేశములందు సహితము ప్రతిధ్వనించెను. అహింస, ప్రేమ యను మరి రెండాదర్శములను యీచక్రవర్తి సమకాలిక ప్రపంచమున కొసంగెను.

క్రీ. పూ. 5 వ శతాబ్దినుండి క్రీస్తుశకారంభము వరకునుగల కాలమునాటి భారతదేశచరిత్రము మరియొక ముఖ్యాంశమును దెలుపుచున్నది. మొదట పర్షియనులును పిమ్మట యవనులు నీదేశపు పశ్చిమోత్తరప్రాంతమును వశపరచుకొనిరి. ఆకాలమునం దాయాజాతుల వారట స్థిరపడి స్థానికులతో గలసిపోయిరి. పిమ్మట శక, పహ్లవ, యూఏచి జాతులవా రీదేశముపై దండెత్తివచ్చి యిట స్థిరపడి రాజ్యములనుగూడ నిర్మించిరి. కాని యనతికాలమునకే వారు తమ విదేశీయవ్యక్తిత్వమును గోల్పోయి' పరిపూర్ణముగ భారతీయులై, భారతీయాచార వ్యవహారములను పరిగ్రహించి, హిందూబౌద్దమతముల నవలంబించి, భారతీయులలో గలసిపోయిరి. "దీనినుండి సర్వజన సమాదరణము పూర్వభారతీయుల మరియొక యాదర్శమని తెలియుచున్నది.

ఈవిధమున సర్వజాత్యుద్దరణము, సర్వసంతరణము, అహింస, ప్రేమ, ధర్మసంస్థాపనము, సర్వజన సమాదరణమునను నుత్తమాదర్శములమూలమున ప్రాచీనభారతీయులు నాటి ప్రాచ్యపాశ్చాత్యప్రపంచములపై నాధ్యాత్మిక దిగ్విజయమొనర్చి విశ్వమానవకల్యాణమును చేకూర్చిరి. మధ్య యుగమునాటి పాశ్చాత్యదేశమునందలి సాహసవంతులవలెనే నాటి భారతీయ పండితులును, యువకులును, దేశాంతర విజయములను సంపాదించుటకై యువ్విళ్ళూరుచుండిరి. ఒక్కటియమ్ము సహస్రస్థలముల ప్రతిబింబించుచు నాటి భారతభూమి సువిశాలమగు నాధ్యాత్మిక సామ్రాజ్యమునకధినేతయై యొప్పుచుండెను. ఈభారతీయ నాగరికతా విస్తరణముయొక్క యారంభకాలమునుగూడ నొకవిధమున నిర్ణయింపవచ్చును. కెపడోషియా యను దేశమున "బోగజ్‌కోయి" యనుచోట నొకశాసనము గనుగొనబడినది. ఇది క్రీ. పూ. 14 వ శతాబ్దినాటిదని పండితులు నిశ్చయించి యున్నారు. "హిట్టైట్" "మిట్టాని" యను రెండుజాతులవారు నిరంతరమును తమలోజరుగుచుండిన సమరములను మాని, సంధియొనర్చుకొని, దానికి బ్రమాణముగ వేదములలో పేర్కొనబడిన ఇంద్ర, వరుణ, మిత్రాది ప్రాచీనార్యదేవతలను పేర్కొనిన ట్లాశాసనమునుండి తెలియుచున్నది. ఈసంధి చిరస్థాయిగనుండుటకై యీజాతుల రాజవంశములకు వైవాహికసంబంధ మేర్పరుపబడెను. మరియు నప్పుడువివాహితులైన నూతనదంపతుల కభ్యుదయ మొసంగుటకై నా సత్యులను వైదికదేవతలు ప్రార్థింపబడిరి. క్రీ. శ. 13 వ శతాబ్దినాటికి పెక్కుస్థలముల నుపద్రవములు సంభవించి, భారతీయ నాగరికత యంతరించెనవి. యింతకిబూర్వము చెప్పియుంటిమి. కాన నీనాగరికతా విస్తరణము క్రీ. పూ. 14 వ శతాబ్దినుండి క్రీ. శ. 13 వ శతాబ్దివరకును జరిగెనని స్పష్టమగుచున్నది.